మాట మనుషుల్ని కలిపితే
పాట మనసుల్ని కదుపుతుంది
ఒక్కో పాట కళ్ళు మూసుకుని వినాలనిపిస్తుంది
ఇంకో పాట కాళ్లు కదిపి నిలవనీయనంటుంది
విరజాజుల సువాసన ఓ పాట గాలై మోసుకోస్తే
సిరిమువ్వలసందడి ఇంకో పాట గజ్జై మోగిస్తుంది.
పుట్టినప్పటినుంచి పాట వింటూ - పాట తోడుగా - పాడిందే పాటగా - పాడుతూ పెరిగాను.
నచ్చిన పాట - అదున్నట్టూ కాక - నే విన్నట్టూ కాక - నాకొచ్చినట్టు పాడుకోవడం - నాకిష్టం - నా ఇష్టం.
నే మెలకువగా వున్నంతసేపూ - నా పాట పొలకువ వుండాల్సిందే .
నేను వినే పాటల్లో రకరకాలుంటాయి -
నేను కావాలని వినే - తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం - భాషలవి.
నేను కావాలనుకోకపోయినా - వినిపించే - కొరియన్ భాషవీ ఉంటాయి - అన్నగాడు ఇంటి పట్టున వుండే సెలవు రోజుల్లో.
అందులో కొన్ని -
>>>వినగానే నేర్చేసుకోవాలి అనిపించేవి.
>>>వింటుంటే ఇదెక్కడో విన్నానే అనిపించేవి.
>>>విన్నాక రాసేసుకుని దాచేసుకోవాలనిపించేవి.
>>>వింటూనే - "అసలు పాట ఇదా - మొన్నే కదా మన తెలుగు సినిమాలో విన్నాం - ఇన్స్పిరేషనో ఏమోలే" అని ముచ్చటపడిపోయేవి; అసలు పాటని-కొసరు పాటని పక్కపక్కనే విని - అయినవారితో పంచుకుని మురిసిపోయేవి - కవల (కాపీ?) రాగాలనబడేవన్నమాట.
>>>వినేసి - గబగబా నేర్చేసుకుని - చులాగ్గా పాడేయగల్గే - కూనిరాగాలు కొన్ని.
>>>ఇది నన్ను వినకపోతే బావుండును - అని అనుకుంటూనే - తప్పించుకోలేక - నా పాల బడి - పాట్లు పడలేక - పాటే పాటుపడి దాక్కోవాలనుకునే - ఖూనిరాగాలు ఇంకెన్నో.
ఇన్నిరకాల పాటల్లోనూ - నాకు కవల-పాటలంటే భలే సరదా.
కవల-పాటలంటే ఇంచుమించుగానో, అచ్చుగుద్దినట్టుగానో ఒకేలా వినిపించేవి.
అసలీ కవల-పాటలు పలు రకాలు.
ఒకే సినిమాలో - ఒకే భాషలో -
>నవ్వు రకం, ఏడుపు రకం (దసరా బుల్లోడు)
>ఆడ పాట, మగ పాట (భాగ్యరేఖ)
>చిన్నప్పుడు, పెద్దప్పుడు (దేవదాసు)
ఒకే సినిమాలో (డబ్బింగో, రీమేకో) - పలు భాషల్లో -
>(సువర్ణసుందరి - తెలుగు, హిందీల్లో; ఆహ్ - హిందీ, ప్రేమలేఖలు - తెలుగు )
>(పూజ-తెలుగు, ఎరడు కణసు - కన్నడ)
వేరే వేరే సినిమాల్లో -
>పాత సినిమా పాట మెల్లిగా సాగుతూ , కొత్త సినిమా పాట గబగబా పరిగెడుతూ (బుల్లెమ్మ-బుల్లోడు, వాన)
>పాత సినిమాలో తండ్రి హీరోగా, కొత్త సినిమాలో కొడుకు హీరోగా (ఘరానా మొగుడు, మగధీర)
>ఒకే సంగీత దర్శకుడు ఒక ట్యూనునే రెండు వేరే వేరే పాటలకి వాడుతూ - (ఇళయరాజా - అన్వేషణ, అభినందన); (కీరవాణి - అక్టోబర్ 2, ఛత్రపతి)
>ఇలాగే కాక వేరే భాషలోంచి దిగుమతి అయి తెలుగాస్తి అయిన పాటలు - సినిమాల మధ్య ఏ పోలికా లేకుండా కొన్ని - అసలు సినిమాలతోనే సంబంధం లేకుండా ఇంకొన్ని.
అసలు ఒక్క పద్యంలో చెప్పాలంటే - మాటలతో ఆడుకునే వెలదినే కానీ ఆటవెలదులు రాయలేను కాబట్టి - ఇదిగో గిద్యంలో చెప్పేశా -
ఆపాట ఈపాట ఒక్కరాగమునుండు
పాడి జూడ మాటల జాడ వేఱు
పాటలందు కవల పాటలు వేరమ్మా
వీనులవిందే మళ్లిమళ్లి వినవె భామ!
పాడి జూడ మాటల జాడ వేఱు
పాటలందు కవల పాటలు వేరమ్మా
వీనులవిందే మళ్లిమళ్లి వినవె భామ!
కవల-పాటలంటే ఏంటో చెప్పేశాను మరి - నాకు తెలిసిన కొన్నిపాటల-జతల్ని - నాలాగే పాటలంటే ఇష్టమున్న హితులతో, స్నేహితులతో, సన్నిహితులతో - ఈమెయిళ్లలో, వాట్సాప్పుల్లో, ఫోనుల్లో - టైపు చేసి, చెప్పి - ఆట్టే ఆయాసపడకుండా - నా బ్లాగులో పోస్ట్ చేసేస్తే - ఒక్క పోస్టుకి పలు రీడ్లు - అనేసుకోవచ్చని - సునాయాసపడిపోతున్నాను.
ఆ వరసలో ముందుగా నాకిష్టమైన భావకవి - అందమైన ముగ్గు-గుమ్మల్లా వుండే తెలుగు అక్షరాలమీద నాకు మరింత మక్కువ కలిగేలా చేసిన దేవులపల్లి వారి పాటలు - వేణువుని వెన్నలో ముంచి తీశారా అనిపించేలా వినిపించే పెండ్యాల వారి సంగీతంలో - అపర-జయంతుడు ఎన్టీఆర్, ఆయనకి తెరీడూ-జోడూ అయిన జమున అభినయించిన ఈ రెండు పాటలూ - (ఒకే సినిమాలో - ఒకే భాషలో - ఆడ పాట, మగ పాట) కి - అద్భుతమైన ఉదాహరణలు.
ఆ వరసలో ముందుగా నాకిష్టమైన భావకవి - అందమైన ముగ్గు-గుమ్మల్లా వుండే తెలుగు అక్షరాలమీద నాకు మరింత మక్కువ కలిగేలా చేసిన దేవులపల్లి వారి పాటలు - వేణువుని వెన్నలో ముంచి తీశారా అనిపించేలా వినిపించే పెండ్యాల వారి సంగీతంలో - అపర-జయంతుడు ఎన్టీఆర్, ఆయనకి తెరీడూ-జోడూ అయిన జమున అభినయించిన ఈ రెండు పాటలూ - (ఒకే సినిమాలో - ఒకే భాషలో - ఆడ పాట, మగ పాట) కి - అద్భుతమైన ఉదాహరణలు.
మొదటి పాటలో - తెలతెలవారుతున్న సమయంలో చలచల్లని గాలి వీస్తుంటే - ఒక ఒద్దికైన అందమైన అమ్మాయి ఏడుకొండలవాడిని స్మరిస్తూ - పాటపాడుతూ - పూజకై పూలు కోస్తుంటే - ఆ పాటకి మెలకువ వచ్చిన అబ్బాయి వచ్చి- ఆ అమ్మాయిని ముచ్చటగా చూడడం - నిజంగా చూడముచ్చటే ... (వీడియో కోసమైతే కింద చూడొచ్చు - కానీ పాట మంచిగా వినాలంటే : https://www.youtube.com/watch?v=ThPHJ8mYp-o)
తేనె నింపుకున్న గొంతుతో పి. సుశీల పాట - వనలక్ష్మిలా జమున ఆడిన ఆట...
ఊఁ ... .... ....
నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో - ఏ పూల పూజింతునో
ఊఁ ... .... ....
శ్రీ పారిజాత సుమాలెన్నొ పూచే - ఈ పేదరాలి మనస్సెంతో వేచే
శ్రీ పారిజాత సుమాలెన్నొ పూచే - ఈ పేదరాలి మనస్సెంతో వేచే
నీ పాదసేవ మహాభాగ్యమీవా నాపై నీ దయజూపవా నా స్వామి
నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో - ఏ పూల పూజింతునో
దూరాన నైనా కనే భాగ్యమీవా - నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడు కొండల పైన వీడైన స్వామి - నాపై నీ దయజూపవా నా స్వామి
నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో - ఏ పూల పూజింతునో
ఆ అమ్మాయిని అనుసరిస్తూ - ఆమె పాటని అనుకరిస్తూ - తమాషా చేస్తూ - అతనుడి లాంటి అతను పాడిన పాట వినాలంటే - కిందనున్న వీడియో చూడాలి మరి.
వెన్నపూస తిని నున్ననైందా అనిపించే ఏ. ఎం. రాజా స్వరం - కనుబొమల కదలికలోనే చిలిపిదనం, వలపుధనం కురిపిస్తూ ఎంటీవోడి అభినయం...
నీవుండేదా కొండపై - నాస్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో - ఏ పూల పూజింతునో ...
- అంటూ మొదలుపెట్టి అబ్బాయి పాడుతుంటే - ఒక చిన్నపాప చేయి పట్టుకుని స్నానం చేయించడానికి వెళ్తోందో ఏమో - భుజమ్మీద తువ్వాలుతో - హఠాత్తుగా ఆగి - సిగ్గు పడుతూ కళ్లు మాత్రం ఎత్తి అతని కేసి చూడబోయిన అమ్మాయి - నాకైతే - రాబోయే తుమ్మునాపుకున్నట్టనిపించింది.
నీ సిగ్గే సింగారమే ... నీ సొగసే బంగారమే ...
నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చెనే - ఓ వనలక్ష్మి - మనసిచ్చి దిగివచ్చెనే
ఉఁహూహూ ...
ఓ ... ... ...
నీ నవ్వు పూలు అవే మాకు చాలు - నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాల - మరే పూజలేల - మాపై నీ దయజూపవా ఓ నా చెలీ
నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే
ఓ ... ... ...
మా తోటపూచే వసంతమ్ము నీవే - మా బాట చూసే ప్రభాతమ్ము నీవే
మాలోనకొలువైన మహాలక్ష్మి నీవే - మాపై నీ దయజూపవా ఓ నా చెలీ
అక్కా... ... (అబ్బాయి పాటకి మైమరచిన అమ్మాయి ఉలికిపడేలా - అమ్మాయి చేత జడ వేయించుకుంటున్న చిన్నపాప పిలుపు)
నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చెనే - ఓ వనలక్ష్మి - మనసిచ్చి దిగివచ్చెనే
ఊ ఉ ఊఁ ...
బావున్నాయి కదూ ఈ కవలపాటలు?!
ఇలాంటివే ఇంకొన్ని పాటలతో - మరెన్నో కబుర్లతో
నెలలో ఒక వారంలో - ఒక పాటల పోస్టుతో
మీతో నా పాటల సరదా పంచుకోవాలనుకునే
~ పాటలభైరవి
Hi super golden hits వినిపించావు లల్లి
రిప్లయితొలగించండిపాతపాటల పోస్ట్ అందంగా అల్లిన అక్షరమాలా బాగుంది
రిప్లయితొలగించండిలలిత గారూ....అద్భుతమైన.. పాటలు చూపించారు...మీ కలెక్షన్స్ అన్ని చాల బాగుంటాయి.... అందులో ఈపాటలు ....ఆహా..శనివారం .....ఉపవాసం సంగతే గుర్తు లేదు..నాకు చాల పాటలు పిచ్చి.....కానీ మీ అంత బాగా ...చెప్పలేను అనుకోండి.....
రిప్లయితొలగించండిHi lalli superb golden hits వినిపించావు. ఆ పాటలు ఇదివరుకు ఎప్పుడో విన్నా నువ్వు రాసిన ఆ కవితా ధోరణిలో చదవి ఆ పాటలు వింటే మనసుకు ఎంతో ఆనందము గా ఉంది.
రిప్లయితొలగించండిమీ blogs గురించి ఎలా wait చేస్తానంటే చిన్నప్పుడు మీ house లో (anv ) లో చందమామ చదవి again next book ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి నట్టు.
Simply superb. Iam one of the lover of your blogs (బోలుడన్ని కబుర్లు).
శ్యామల: నా బ్లాగ్ మీద మీ అభిమానానికి బో...ల్డన్ని థాంక్స్!
రిప్లయితొలగించండిపద్మార్పితగారు: నా బ్లాగ్ చదివి మెచ్చినందుకు చాలా థాంక్స్!
గాయత్రి: నీ కమెంట్ తో కొన్ని క్షణాలు భూమికి రెండు అంగుళాల పైన తేలి నడిచాను :))
Very nice blog concept, right down to the signature 😃 Looking forward to the future paatha paatala posts...
రిప్లయితొలగించండిThanks, Aparne! Signature courtesy: Badari ;) Just a note: this series is not only limited to oldies, but any-time-goldies. Stay tuned.
తొలగించండిNTR/AM Raja version ఒకటి ఉన్నదని నాకు ఇప్పటిదాక తెలియదు. ఇన్ని రోజులు ఈ పాటను ఎలా miss అయ్యానా అని ఆలోచిస్తున్నాను. మనకు తెలియని ప్రపంచం చాల వుందని మరో సారి రుజువయ్యింది.
రిప్లయితొలగించండితరువాయి భాగం లో ఇంకా మంచి కవలలను పరిచయం చెయ్యండి.
తప్పకుండా, గిరిరాజ్! ఈ పాటల పోస్టులు మీకు నచ్చుతాయని నాకు తెలుసు. Stay tuned!
తొలగించండిChala bagundi mee varnana 👍👌
రిప్లయితొలగించండిThank You!
తొలగించండి