ముందటి కబుర్లు ఇక్కడ క్లిక్ చేసి చదవండి : ఆ గాలి... ఆ నేల....ఆ ఊరు...(దేశీ మజిలీ కబుర్లు) - 1 - వీడు వీడాం!
గాలి రెక్కలమీద
నీటి అలలపై ఎగిరి
ఆ నేల చేరేలోగా
ఈవల ఓ చిరుమజిలీ - బర్క్లీ.
అక్కడ గడిపిన కాలం - నాలుగు రోజుల, రెండర-రోజులు.
ఆ సమయంలో జరిగిన విశేషాలు ఏంటంటే...
మే 12 పొద్దున్నే బర్క్లీలో వున్న చిన్న ఉడిపి హోటల్లో ఇడ్లీ-ఖాదనం.
తొమ్మిదిన్నరకి కాలిఫోర్నియా మెమోరియల్ స్టేడియంలో జరిగిన UC Berkeley 150వ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొన్న 5,000 మంది పిల్లలు - చుట్టూ కూర్చుని చూసిన 20,000 మంది పిల్లల తాలూకు కుటుంబాలు, స్నేహితులు - ఆ లెక్కలోనే చేరిన అన్నజింక, మేం ముగ్గురం.
స్టేజ్ మీంచే ఇచ్చేశాం అన్న డిగ్రీలు - అది వినగానే టోపీలెగరేసిన పిల్లలు.
టోపీలెగరేసిన తర్వాత సుహాస్ వాడి ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోయాడు. మేం ముగ్గురం కూడా నడుచుకుంటూ వెళ్లి క్యాంపస్‌కి దగ్గరలోనే భోంచేసేసి మా విడిదికి వచ్చేశాం.
సాయంత్రం మళ్ళీ బర్క్లీకి వెళ్లి అన్నజింకని, వాడి ఫ్రెండ్ కెవిన్ని తీసుకుని ఓ అరగంట డ్రైవ్ చేసుకుంటూ శరవణ భవన్‌కి వెళ్ళాం అందరం. క్రితం ఏడాది ఏప్రిల్‌లో వాడి పుట్టిన రోజుకి బర్క్లీకి వచ్చినప్పుడే సుహాస్ చెప్పాడు - ఎప్పుడైనా ఒకసారి కెవిన్ని ఇక్కడికి తీసుకొద్దామని. కెవిన్ ఇడ్లీలు, పొంగల్, దోసెలు అన్నీ ooh! - aah! అనుకుంటూ మంచిగా తిన్నాడు. వాడికి అవి నచ్చినందుకు మురిసి - మేము ఆర్డర్ చేసుకున్న పదార్థాలు కూడా వాడికి కొసరి కొసరి రుచి చూపిస్తూ - కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేసి వాళ్ళిద్దరినీ బర్క్లీలో వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర దింపేసి వచ్చేశాం. అప్పుడే చెప్పాడు సుహాస్ మళ్ళీ 15 సాయంత్రం దాకా ఇంక మా దగ్గరికి రానని - ఫ్రెండ్స్ దగ్గరే ఉంటానని. సరే! పాపం! మళ్ళీ అందరూ తలా ఒక చోటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి కలుస్తారో - అని మా కాలేజ్ చివరి రోజులు తలుచుకుంటూ - బుజ్జిజింకతో కలిసి మా రూంకి వచ్చేశాం.
మే 13 ఆదివారం. పొద్దున్నే బదరి, నేను నడుచుకుంటూ వెళ్లి పక్కనే వున్న బర్గర్ కింగ్‌లో నాకిష్టమైన హ్యాష్-బ్రౌన్స్ తినేసి వచ్చాం. నాకైతే బయటికి ఎక్కడికీ వెళ్లాలని లేదు - చాలా కాలం తర్వాత ఉద్యోగం నుంచి దొరికిన ఆటవిడుపు. విశ్రాంతి తీసుకోవాలని వుంది. అందులోనూ సెయింట్ లూయిస్ దాటితే తగ్గుతుందన్న నా స్ప్రింగ్ అలెర్జీ తగ్గనే లేదు. అలాగే వుంది - కళ్లలో ఇసక వేసినట్లు దురద, మంటలు. కానీ పాపం- బుజ్జిజింకకి బోర్ కొడుతుంది కదా - అందుకని దగ్గర్లోనే వున్న Mystery Spot చూద్దామని వెళ్ళాం మధ్యాహ్నం భోంచేసి రెండింటికల్లా. తీరా అక్కడికి వెళ్ళాక తర్వాతి టూర్ సాయంత్రం ఏడింటి దాకా లేదని చెప్పారు. అంతసేపు అక్కడ కూర్చోలేక అక్కడి నుంచి తిరిగొస్తూ దార్లో ఓరుగంటి వారి ఇంట ఆగాం.
అక్కడే అమెరికా సందర్శనానికి వచ్చిన ఓరుగంటి రమేష్ వాళ్ళ అమ్మగారు, నాన్నగార్లని కలిశాం.రమేష్ వాళ్ళ నాన్నగారు - రాంబాబు మాష్టరుగారు - ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి పురస్కార గ్రహీత. ఆయన మా నాన్నకి బాల్యమిత్రులు కూడా. నేను, బదరి ఆయనని చూడడం, మాట్లాడడం అదే మొదటిసారి. చాలా ఆత్మీయంగా పలకరించి ఆదరంగా మాట్లాడారు. చివరిలో వచ్చేముందు నాతో అన్నారు - బదరి academically చాలా తెలివైనవాడు - అని. అది నా మేలు-సగానికి ఒక మంచి మాష్టారి నుంచి దొరికిన బహు మంచి ప్రశంస.
మాటల సందర్భంలో రమేష్ తమ్ముడు ప్రసాద్ అక్కడికి దగ్గరగా వున్న థియేటర్లో 'మహానటి' సినిమా ఉందని చెప్పారు. అది విన్న వెంటనే నా వైపు చూసిన బదరీకి నా కళ్ళ-మంటల వెనకాల మెరుపులు మెరిసినట్లనిపించిందో ఏమో వెంటనే ఫోన్ లోంచే మూడు టికెట్లు బుక్ చేశారు. అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో అ! చూసి అడలిపోయి ఇంక ఈ ఏడాదికి ఇదే ఆఖరి సినిమా అనుకున్న తర్వాత రంగస్థలం వచ్చినా అందరూ అద్భుతంగా వుంది అన్నా - "అబ్బే ! మేం చూడం గాక చూడం" అంటూ మా ఒట్టుని గట్టిగా పట్టుకుని అట్టేపెట్టేసుకున్న మేము - "ఈ ఒక్కసారికే , సరేనా!" అని ఒకరికొకరం చెప్పుకుని ఇప్పుడా ఒట్టుని తీసి గట్టు మీద పెట్టి ఆరున్నరాటకి "మహానటి" చూసేద్దామని భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయాం.
మహానటి ఒక మంచి ప్రయత్నం. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడో చదివిన పల్లవి అనే ఆవిడ రాసిన "మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి" అన్న పుస్తకమే గుర్తుకొచ్చింది. దానికి ముందు మాట రాస్తూ రావూరి భరద్వాజగారు - "చెప్పింది బావుంది. చెప్పవలసింది ఇంకా ఉంది! ..... కొందరు వ్యక్తులను గురించి, కొన్ని కొన్ని అంశాలను గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకొనవలసింది మిగిలి పోతూనే ఉంటుంది. తెలిసిన అన్ని అంశాలను గురించి చెప్పలేం. తప్పనిసరిగా చెప్పవలసివస్తే ఆయా అంశాలలోని తీవ్రతను, విషాదాన్ని బాగా తగ్గించి, బాగా బాగా తగ్గించి చూచాయగా మాత్రమే చెప్పవలసి వస్తుంది!" - అంటూ రాసిన వాక్యాలు మహానటి సినిమాకి సరిగ్గా సరిపోతాయి.
మహానటి నుంచి కొన్ని కంట్లో నలుసులు, చెవిలో జోరీగలు:
సావిత్రి, జెమినీ గణేశన్ చాముండేశ్వరి ఆలయంలో పెళ్లి చేసుకుని ఆ దేవీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు హీరో కాలి బూట్లు, హీరోయిన్ కాలికున్న చెప్పులు - అవి మరి నిజంగా ఉన్నాయో, లేకపోతే మరి అవి కళ్ళ-మంటల వల్ల సగమే తెరుచుకుని చూస్తున్న నా కన్ను చెదరడం వల్ల ఉన్నట్లు కనిపించాయో - ఏదేమైనా కానీ ఏది కరెక్టో రుజువు చేసుకోవడానికి ఇంకోసారి ఆ సినిమా చూసే ఓపిక లేదు.
సినిమాలో సావిత్రి నటించిన తమిళ సినిమాలలో డైలాగులు తమిళంలోనే వినిపించిన దర్శకులు - మిస్సమ్మ తమిళ్ వెర్షన్ జెమినీ గణేశన్, సావిత్రి చేశారని చెప్తూ "రావోయి చందమామా" అన్న తెలుగు పాట వినిపించారు - మళ్ళీ సినిమా చివర్లో తమిళ పాటే వేసినట్లున్నారు.
సినిమాలో చిన్నపాత్ర అయినా సమంత చేసింది - చాలా గొప్ప విషయం. కానీ ఆ జర్నలిస్ట్ పాత్ర కాకుండా షాలినీ పాండే చేసిన సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర అయితే చేసేదా?!
ఇంతకీ ఈ సినిమా గురించి సినిమాని తీసిన దర్శకులు, నిర్మాతలు సావిత్రి జీవితం గురించి చేసిన రీసెర్చ్ ఏంటబ్బా?! అంతా అక్కడా ఇక్కడా విన్నదేగా! పల్లవిగారి పుస్తకంలో వున్నదేగా!
ఇడ్లీకి ముక్కూ- చెవులూ పెట్టినట్లుండే జెమినీ గణేశన్‌ని దుల్కర్ సల్మాన్ లాంటి అబ్బాయిలా చూపించడానికి మనసెలా ఒప్పిందబ్బా?!
అసలు నేను సావిత్రి సినిమాలు కొన్నే చూడగల(గలిగా)ను - కన్యాశుల్కం, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు, మిస్సమ్మ, మాయాబజార్. ఆ సినిమాల్లో మాత్రమే ఆవిడ ఏక్షన్, దానికి తగినట్లు మిగిలిన వాళ్ళ రియాక్షన్ నచ్చుతుంది నాకు.
ఒకసారి ఇలాగే "ఆడవే జలకమ్ములాడవే" అన్న పాట నచ్చిందని అది "విచిత్ర కుటుంబం" అనే సినిమాలోది అని తెలిసి చూద్దామని మొదలుపెట్టి ఒక పది పన్నెండు నిముషాల తర్వాత ఎన్టీఆర్ సావిత్రిని సెకనుకొకసారి "ఏంటే, ఏమే" అనడం వినడం నావల్ల కాక - అందులోనూ ఆవిడ మీదమీదకెళ్తూ అన్న ఒక డైలాగు - "ఏంటే నువ్వనేది? ఒట్టి మట్టి బుర్ర. అందుకే ఒళ్ళు పెరిగి బుర్ర చిన్నదైపోతోంది - భూతంలా" - అది విన్న వెంటనే ఆపేశాను. ఆ సినిమా డైరెక్ట్ చేసిన K.S. ప్రకాశరావుని తెగ తిట్టుకున్నాను.
మహానటి చూసినప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ ఒకసారి మళ్ళీ తలుచుకున్నాం నేను, బదరి. అప్పుడే అనుకున్నాం - ఈ సినిమా ఒక డాక్యుమెంటరీలా వుంది - కానీ ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి వాటిని చూడకపోతే డబ్బులు రాకపోతే నిరుత్సాహపడి ఈ మాత్రం కూడా తీయరు. తినగ తినగ వేము తీపి - కనగ కనగ సినిమా వాసి అనేసుకుని మహానటికి మావంతు ప్రోత్సాహమిచ్చేశాం - ముందే చెప్పానుగా - ఈ ఒక్కసారికీ 2108లో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడబోమన్న ఒట్టు తీసి గట్టునెట్టి మరీ!
ఇంక మే 14న చేసిందేం లేదు - "అంజప్పర్" ఎక్కడుందో వెతుక్కుని వెళ్లి అక్కడభోజనం చేసి రావడం, హోటల్ రూంలో నేనూ, బుజ్జిజింకా కబుర్లు చెప్పుకోవడం తప్ప. ఆ రోజు హోటల్ పక్కనే AMC థియేటర్లో వున్న Avengers కి బుజ్జిజింక కోసం వెళ్దామనుకుంటే వాడేమో రేపు అన్న వచ్చాక అన్నతో కలిసి చూద్దాం అన్నాడు.
మే 15 న Hearst Greek Theatre లో జరిగిన College Of Engineering గ్రాడ్యుయేషన్ సెరమనీ - పేరుపేరునా పిలిచి స్టేజ్ మీద డిగ్రీలు ఇచ్చారు.
సాయంత్రానికి సుహాస్ వాడి రూమ్ ఖాళీ చేసి అక్కడున్న సామానంతా రెంటెడ్ స్టోరేజ్‌లో పెట్టుకుని, వాడు ఇండియాకి తెచ్చుకునే లగేజ్ తీసుకుని మాతో హోటల్‌కి వచ్చేశాడు. అప్పటికే చాలా అలిసిపోయి ఉన్నాడేమో తొందరగా పడుకుండి పోయాడు. వాడితో కలిసి సినిమా చూద్దామనుకున్న బుజ్జిజింక వాడి మీద చెయ్యేసి వాడూ పడుకున్నాడు.
మే 15 తో మా చిరుమజిలీ చివరిరోజుకొచ్చింది. మర్నాడు 16 న మా ప్రయాణం.
ఇప్పటికీ కబుర్లు సరి - ఆ కబుర్ల-కొనసాగింపు ఇంకోసారి.
ఆ హోటల్ కిటికీలోంచి నేను తీసుకున్న బే-బ్రిడ్జ్ ఫోటోలు:
ఒకటి పగటి వెలుగుది...
ఇంకోటి రాత్రి జిలుగుది...
<< మరిన్ని దేశీ మజిలీ కబుర్లు తరవాతి పోస్టులో >>
.
ఓహో రాంబాబూ, వర్ధనక్క అక్కడే ఉన్నారా? మా ఇంట్లో పెళ్ళికి పిలిస్తే ఊళ్ళో లేరని తెలిసింది. భలే.వర్ధనక్క మా చిన్నప్పట్నించీ ఇప్పటికీ అలాగే నందివర్ధనం పువ్వులా అలాగే ఉంటుంది.గమ్మున ఊరి కబుర్లు చెప్పండీ ఇక్కడ బుగ్గన వేలేసుకుని మరీ కూర్చున్నాం
రిప్లయితొలగించండిశ్రీనివాస్ గారూ! వర్ధని గారి గురించి మీరన్నమాట నూరువరహాలపూలమూట. మీరు నా కబుర్లు వినడానికి సిద్ధంగా వున్నందుకు బోల్డన్ని థాంక్సు!
తొలగించండిఅన్న జింక జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం విజయవంతంగా పూర్తయిందన్నమాట.
రిప్లయితొలగించండిమరెన్నో విజయాలు తను సాధించాలి.
మీ ఫ్లైట్ ఇండియా లో లాండింగ్ కోసం వెయిటింగ్ :-)
అవును లక్ష్మీ! నీ శుభకామనలకు థాంక్స్!
తొలగించండిఫ్లైట్ ప్రయాణం కూడా కొంచెం ఆసక్తికరంగానే సాగింది. చెప్తానుండు మరి!