ఉపోద్ఘాతం:
2010 లో జరిగిన విషయం. నాన్నకి ఒంట్లో నలతగా ఉందని తెలిసి కొంచెం బెంగగా వున్న నన్ను, నాతో పాటు బుజ్జిజింకని అప్పటికప్పుడు టికెట్లు కొని, ఇండియా ఫ్లైట్ ఎక్కించారు బదరి.
నాన్నని సర్ప్రైజ్ చేద్దామని మేము బయలుదేరినట్లు బాలాజీకి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు బదరి - బాలాజీకి కూడా నేను ఇండియా వస్తున్నానని ఎవరికీ చెప్పొద్దని చెప్పారు.
హైద్రాబాదులో తెల్లవారుఝామున నన్ను రిసీవ్ చేసుకున్నబాలాజీ నన్నూ, బుజ్జిజింకనీ ఆ రోజు పొద్దున్న పదింటికి రాజమండ్రి ఫ్లైట్ ఎక్కించే ముందు నాన్నకి ఫోన్ చేశారు.
"అంకుల్! బదరి అమెరికా నుంచి మీకోసం ఏదో పంపించాడు. మీరోసారి పదకొండు గంటల ప్రాంతంలోరాజమండ్రి ఏర్పోర్ట్కి వెళ్ళాలండి"
"బదరి నాకేంటో పంపించడమేంటి? నిన్ననే కదా నాతో మాట్లాడాడు - నాకేం చెప్పలేదే !?" - నాన్న గొంతులో కంగారు.
బాలాజీ వెంటనే నాకేసి తిరిగి "అంకుల్ ఇప్పుడే రికవర్ అవుతున్నారు - ఆయన్ని టెన్షన్ పెట్టొద్దు ఇంక - చెప్పేస్తాను" అని, ఫోన్లో నాన్నతో "లలిత, కిరణ్ వచ్చారంకుల్! వాళ్ళిద్దరూ టెనో క్లాక్ ఫ్లైట్‌లో రాజమండ్రి వస్తున్నారు. రిసీవ్ చేసుకోండి" అని చెప్పేశారు.
నేనలా రాజమండ్రి వెళ్ళినప్పుడు నాన్నని చూద్దామని లలితత్తయ్య కూడా వచ్చారు వైజాగ్ నుంచి. హైద్రాబాదు నుంచి లక్ష్మిదొడ్డ, తంబి మామయ్య కూడా వచ్చారు. ఓ రెండు వారాల పాటు వాళ్లందరితో గడిపే అపురూప అవకాశం నాకది.
ఒక రోజు మధ్యాహ్నం పుస్తకాలు తిరగేస్తున్న నాకు స్వాతి లోనో, నవ్య లోనో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'సత్యభామ' సీరియల్ కనిపిస్తే చదివాను. నాకంతగా నచ్చలేదు.
అదే సంగతి "ఏం చదువుతున్నావ్ లల్లీ?" అనడిన లలితత్తయ్యకి చెప్తూ ఆ పుస్తకం పక్కన పెట్టేశాను.
అప్పుడే లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'ద్రౌపది' నవల గురించి నాకు చెప్తూ ఆ మాటల్లోనే "లల్లీ! నేను భారతం, భాగవతం పూర్తిగా చదివాను. రెండిట్లో పోతన భాగవతం మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటావ్?" అన్నారు అత్తయ్యనాకు టెస్ట్ పెడుతున్నట్లు.
దానికి సమాధానం చెప్పడానికి నేను ఆట్టే ఆలోచించలేదు. "అత్తయ్యా! భారతం రాసిన కవిత్రయం రాజరాజనరేంద్రుడు అడిగితే రాశారు. పోతన రామభద్రుడు చెప్తే రాశాడు - అదీ తేడా!" అన్న నా సమాధానం లలితత్తయ్యకి నచ్చేసినట్లే అనిపించింది.
అప్పుడే రాజమండ్రి నుంచి వస్తూ బమ్మెర పోతన రచించిన శ్రీ మద్భాగవతం రెండు వాల్యూములు తెచ్చుకున్నాను. అప్పట్నుంచీ వారానికి ఒకసారైనా కొన్ని పద్యాలు చదువుతూ చిన్నప్పుడు నా చేత భాగవత పద్యాలు వల్లె వేయించిన నాన్నమ్మని, రామ్ బాబయ్యని తలుచుకుంటూ వుంటాను.
ఎప్పటికైనా నాకు నచ్చిన భాగవత పద్యాల గురించి నాకు తోచిన నోట్స్ రాసుకోవాలని వున్నా ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తూ ఉండేదాన్ని.
ఈ సంవత్సరం అక్టోబర్‌లో మా వూళ్ళో తెలుగుభాషాభిమానులూ, పుస్తకిష్టులూ అయిన అమృతరెడ్డిగారు ఫోన్ చేసి "TAS - Telugu Association of St. Louis వారి దీపావళి జ్ఞాపిక (souvenir)లో ప్రచురించడానికి వ్యాసాలు కావాలి, మీరేమైనా రాసివ్వండి లలితా!" అనడగ్గానే నాకు ముందుగా గుర్తొచ్చింది భాగవతం గురించి నేను రాసుకొందామనుకున్న నోట్స్.
వెంటనే ఆయనకి తప్పకుండా రాస్తానని చెప్పి పంపించిన నా భాగవత వ్యాసంలో "శ్రీరామ చంద్రుడిలా అని కాకుండా శ్రీరామచంద్రుడిలా అని ఆ extra space తీసేసి సరిదిద్దగలరా లలితా కొంచెం?" అంటూ కనీకనిపించకుండా వున్న పలుకురాళ్లలాంటి తప్పులని సరిచేసిన అమృతరెడ్డిగారికి, నా ఈ వ్యాసాన్ని TAS Souvenir కోసం టైప్ చేసినప్పుడు వచ్చిన తప్పులని ఓపిగ్గా దిద్దిన TAS President ఆలూరి జితేందర్ గారికి బోల్డన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ... పోతన భాగవతం మీద నా మొట్టమొదటి వ్యాసం - ఇదిగో ఇక్కడే...
రంగా లాలీ... పండరి రంగా లాలీ
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ
తల్లికి విశ్వరూపము చూపిన నల్లవాడా
చల్లని నీ కృప చల్లర మాపై గొల్లపిల్లవాడా !
రంగా లాలీ... పండరి రంగా లాలీ
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ
తరతరాలుగా తెలుగింటి అమ్మలు పొత్తిళ్ళలో పాపని కృష్ణుడే అనుకుని పాడుకున్న లాలి పాట ఇది.
ఒక తమాషా అయిన విషయం ఏంటంటే తెలుగునాట పెళ్ళైన ప్రతి అమ్మాయి తన భర్త శ్రీరామచంద్రుడిలా వుండాలనుకుంటుంది. తన కడుపున పుట్టిన కొడుకుని మాత్రం జుట్టు కట్టి, నెమలి పింఛం పెట్టి, ముత్యాల హారాలు వేసి, చిన్న పట్టుపంచె కట్టి చిన్నికృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంది. ఏతావాతా చివరికి తేలేదేంటంటే రాముడిలా ఉండాలనుకునే ఆ అమ్మాయి భర్త కూడా ఓ అమ్మకి కృష్ణుడి లాంటి కొడుకే!
ఇంతకీ అమ్మలందరూ తమ పిల్లలు కృష్ణుడిలా వుండాలని ఎందుకనుకుంటారో?... ఎందుకంటే వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో ఎప్పుడో ఒకప్పుడు కృష్ణలీలల్ని కథలుగా చెప్పే వుంటారు. నిజమైతే బావుణ్ణు అనిపించే ఆ కథల్లో కృష్ణుడేం చేసినా ముద్దుగా ఉంటుంది. ఉట్లు తెంపినా, వెన్న దొంగిలించినా, ఆ అల్లరికి, ఆగడానికి గోపెమ్మలకి కోపం వచ్చినా, కృష్ణుడి ముద్దుమోము చూడగానే ఆ కోపాన్ని మించిన మురిపెం కలుగుతూనే ఉంటుంది.
ఆ కథల్లోని కృష్ణుడికి భయమంటే తెలియదు. కోపం రాదు, విసుగు లేదు. సాధించలేని విషయం లేదు. సొంతం కాని విజయం లేదు. ఎలాంటి సందర్భంలో నైనా కృష్ణుడిదే పై చేయి. అన్నిటా కృష్ణుడికే అగ్రతాంబూలం. ఎన్నడూ కృష్ణుడు స్వేచ్ఛావిహారి. కృష్ణుడి జీవితంలో దుఃఖానికి తావు లేదు. అన్నిటా, అంతటా సుఖమే, శుభమే. అంత మధురమైన కృష్ణలీలల గురించి విన్నవారికి మధురాధిపతే అఖిలం మధురం అనిపించక మానదు. అందుకే కన్నకొడుకు మీద మమకారం వున్న తల్లి తన కొడుకు కృష్ణుడిలానే అందరి కన్నా మిన్నగా ఉంటూ, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాలని కోరుకుంటుందేమో!
అంతటి మధురమైన కృష్ణలీలల్ని అచ్చతెలుగులో ఎంతో హృద్యంగా, హృదయంగమంగా కృష్ణుడి వేణుగానానికి దీటైన శబ్దాలంకార భూషితమై, బాలకృష్ణుడి సిరిమువ్వ గజ్జెల లయకి సరితూగు నడక గల పద్యాల్లో ఎవరైనా రచించగలిగితే, అది మనం చదవగలిగితే ఎంత బావుంటుందో కదా! అలా రచింపబడిన గ్రంథమే భాగవతం. ద్వాదశ స్కంధ పద్య మాణిక్య భూషితమైన శ్రీ మదాంధ్ర భాగవతాన్ని రచించిన వారు బమ్మెర పోతన. ఆ రచన ఎలా జరిగిందో పోతన పద్యంలోనే చదువుకుంటే బావుంటుంది.
పలికెడిది భాగవత మఁట
పలికించెడివాడు రామభద్రుం డఁట నేఁ
బలికిన భవహర మగునఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగ నేలా?
తాను పలికినది భాగవతమట. దానిని పలికించింది సాక్షాత్తూ శ్రీరామ చంద్రుడట. అది పలికితే భవబంధాలు తొలుగుతాయట. అందుకనే ఇంత గొప్పదైన భాగవతం తప్ప ఇంకోటి పలకనని అంటూ పోతన భాగవత రచన సాగించారు.
తాను రాయబోయే కృష్ణలీలల లోని చిలిపిదనాన్ని తనకెవరన్నా ఆపాదించి ఆక్షేపణ చేయకుండా మర్యాదా పురుషోత్తముడైన రాముణ్ణి ఊతగా తెచ్చుకున్న పోతన ఎంత చమత్కారి అనిపిస్తూ ఉంటుంది నాకు భాగవతం చదువుతూ ఉంటే!
తెలుగు వారి ఆస్తిక-ఆస్తి అనదగ్గ గ్రంథాలు ముఖ్యంగా మూడు. అవి రామాయణ, మహాభారత, భాగవతాలు.
రామాయణంలో దంపతులైన సీతారాముల వియోగం నిర్వేదం కలిగిస్తుంది. మహాభారతం లోని దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య వైరం, ఆపైన జరిగిన కురుక్షేత్ర యుద్ధం మనసుని వ్యాకుల పరుస్తాయి.
అదే భాగవతం లోని ముఖ్యపాత్రధారి కృష్ణుడు ఎలాంటివాడంటే ... పోతన పదాల్లోనే చదువుకుంటే విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు - అంటే సర్వవ్యాపి, ప్రకాశించువాడు, ఎల్లప్పుడూ జయమే పొందువాడు, సహనశీలి అయినవాడు కృష్ణుడు. కృష్ణుడంటే ఆనందం. కృష్ణుడంటే నమ్మకం. కృష్ణుడంటే భరోసా. పిలిస్తే పలుకుతాడు. కృష్ణుడంటే సాక్షాత్తూ విష్ణువు అంశ.
విష్ణువు ప్రహ్లాదుడిని దుష్టుడైన తండ్రి పెట్టే బాధల నుంచి రక్షిస్తాడు. మొసలి కోరల్లో చిక్కుకున్న గజేంద్రుడిని కాపాడుతాడు. వామనుడై దానమడిగి బలి చక్రవర్తిని పాతాళానికి సాగనంపుతాడు. కృష్ణావతారంలో వేలితో కొండనెత్తి గోపాలకులకు కొండంత అండై నిలుస్తాడు. సత్యభామా సమేతుడై నరకాసురుని వధించి ఇంటింట దీపావళి జరిపిస్తాడు. అలాంటి కృష్ణుడి కథలు మధురాతి మధురంగా కాక ఇంక వేరేలా ఎలా ఉంటాయి? అంతటి మధురమైన కథల సముదాయమైన భాగవతాన్ని పన్నెండు స్కంధాలలో తీయనైన తేట తెలుగులో పోతన మనకందించారు.
అది కూడా ఎలా?
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్
నీచులైన రాజులకి అంకితమిచ్చి అగ్రహారాలు, వాహనాలు, డబ్బులు, వస్తువులు తీసుకొని, వాటిని ఈ లోకంలో అనుభవించి, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే సమ్మెట పోట్లు తినడం ఇష్టం లేక బమ్మర పోతరాజు అనే నేను ప్రపంచ శ్రేయస్సు కోరి అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను అని చెప్తూ భాగవత రచనకి పూనుకున్నారు.
అంతటి ప్రశస్తమైన భాగవతం లోని కొన్ని పద్యాలు ఇక్కడ తలుచుకుందాం.
మొదటగా ... బళ్ళోకి పంపిస్తూ చదువుకునే పిల్లలకి సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ దండం పెట్టుకోమని చెప్తూ ఎంతో మంది తల్లులు నెమరేయించిన పద్యం...
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ!
ధవళవస్త్రధారిణి అయిన సరస్వతీ దేవిని పోతన తన ఊహలో పోల్చడానికి ఎంత మంచి ఉపమానాలు వాడాడో ! శరత్కాల మేఘాలు, చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, మల్లెపూల దండలు, మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మొల్లలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగ - ఇవన్నీ కూడా తెల్లని తెలుపురంగులో భాసిస్తూవుంటాయట. సరస్వతీ దేవికి ఉపమానాలట. అట్టి చల్లని తల్లి కటాక్షం ఎప్పుడు కలుగుతుందా అని పోతన అడుగుతున్నారు.
భాగవతంలో వున్న పద్యాల్లో 'ఇది బావుంది' అని ఎంచి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని పద్యాలూ కూడా ఒక దానిని మించి ఇంకొకటి అన్నట్లు ఎంతో బావుంటాయి అర్థ-శబ్ద-అలంకారాలతో.
మధురమైన కృష్ణలీలా కథామృతాన్ని గురించి ప్రహ్లాదుడి చేత పోతన పలికించిన పద్యం:
మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?
ఎంత అద్భుతమైన భావం! నారాయణ మంత్రం భజించే ప్రహ్లాదుడిని హరినామం మానమని అన్న తండ్రి హిరణ్యకశ్యపుడి మాటలు విని తన గురువైన చండామార్కుడితో ప్రహ్లాదుడు "ఓ గురూత్తమా! మందార పూలలోని తేనె తీయదనాన్ని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల కేసి పోతుందా? స్వచ్చమైన ఆకాశగంగలో విహరించే రాజహంస వాగుల దగ్గరకు వెళ్ళదు కదా? పాటలు పాడే కోయిల తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తింటుంది కానీ కొండ మల్లెల వైపు పోతుందా? నిండు పున్నమి పండువెన్నెలలో విహరించే చకోర పక్షి మంచు తెరల వైపునకు వెళ్తుందా? అలాగే విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. హరిపాదాల మీద నిమగ్నమై వున్న నా మనసు ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు." అన్న సందర్భం లోనిది పైన ఉదాహరించిన సీసపద్యం.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే భాగవతంలోని ఏ ఒక్క పద్యాన్నీ వదలాలనిపించదు. అలా అని మొత్తం భాగవతాన్ని ఇక్కడ రాసుకోవడం కుదరదు. అందుకని శబ్దాలంకార పూరితమైన పద్యాలు కొన్నిటిని మాత్రం ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
(గజేంద్ర మోక్షం నుంచి మూడు పద్యాలు)
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
(నరకాసుర వధ నుంచి రెండు పద్యాలు)
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "
నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!
(గోపికా వస్త్రాపహరణం నుంచి ఒక పద్యం)
మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా!
చివరిగా వామనావతారంలో బలి మహారాజు వామనుని మూడడుగుల దానమివ్వబోతుండగా వద్దని వారించిన శుక్రాచార్యునితో బలి చెప్పిన మాటల (ఈ కింది పద్యంలో) ద్వారా ఈ లోకంలో కీర్తి మాత్రమే శాశ్వతం అని చెప్తారు పోతన.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
ఓ భృగుపుత్రా! శుక్రాచార్యా! ఇంతకు మునుపు ఎందరో రాజులు ఉన్నారు . రాజ్యాలు ఉన్నాయి . వాళ్ళు తమ ఔన్నత్యాన్ని చూసి గర్వించిన వారే! కాని వారెవరు తాము సంపాదించిందేదీ మూటగట్టుకొని పోలేదు కదా! కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదే! శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారికి లేదనకుండా దానాలు చేశారు. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా!
ఎన్ని మంచి పద్యాలో భాగవతంలో! వాటిలో కొన్నింటినైనా ఇలా మళ్ళీ స్మరించుకోవడం ఎంతో బాగుంది.
అన్ని వందల పద్యాల భాగవతాన్ని సంక్షిప్తంగా ఒక శ్లోకంలో పాడుకునే వీలుంది. అదే ఈ క్రిందనున్న ఏక శ్లోకీ భాగవతం !
ఆదౌ దేవకి దేవి గర్భ జననం గోపీగృహే వర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాం పాలనం
ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం
స్వస్తి!

ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!

భాగవతంలో దశమ
స్కంధం అంతా శ్రీకృష్ణ లీలల గురించే. అందులో ఒక భాగంగా రుక్మిణీ కళ్యాణ విశేషాలు
తెలిపే పద్యాలు కూడా వుంటాయి. మునుపటి రోజుల్లో కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం
పద్యాలు చదివిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్మేవారు.

చాలా మంచి పోస్ట్ లలిత గారు. ఎప్పటికైనా రామాయణ, మహాభారత, భాగవతాలు చదివి తీరాలి అనుకున్నాను కానీ ఇంతవరకు వీలవలేదు. ఇకపై చదవడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండితప్పకుండా చదవండి, పవన్‌గారు! మీ కమెంట్‌కి థాంక్స్!
తొలగించండివ్యాసం బాగుందండీ. తెలుగువారి మనస్సులకు భాగవతపద్యాలు అమృతపు ఊటల వంటివి.
రిప్లయితొలగించండికం. రాముని కృష్ణుని దలచిన
కామన లన్నియును మాని కడుశాంతములై
శ్రీమన్నారాయణపద
తామరసద్వయము నందు తగులు మనంబుల్
శ్యామలీయంగారు! ఇంకోసారి నూటికి ఎనభై మార్కులు నా తెలుగుకి - మీ మెచ్చుకోలుతో. అందమైన మీ కందానికి ధన్యవాదాలు!
తొలగించండి" ఒక తమాషా అయిన విషయం ఏంటంటే తెలుగునాట పెళ్ళైన ప్రతి అమ్మాయి తన భర్త శ్రీరామచంద్రుడిలా వుండాలనుకుంటుంది. తన కడుపున పుట్టిన కొడుకుని మాత్రం జుట్టు కట్టి, నెమలి పింఛం పెట్టి, ముత్యాల హారాలు వేసి, చిన్న పట్టుపంచె కట్టి చిన్నికృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంది. ఏతావాతా చివరికి తేలేదేంటంటే రాముడిలా ఉండాలనుకునే ఆ అమ్మాయి భర్త కూడా ఓ అమ్మకి కృష్ణుడి లాంటి కొడుకే! "
రిప్లయితొలగించండిఇదిక్రొత్త ఆలోచన. మీరన్నట్టు భాగవతం నిండా ఎన్ని ఆణిముత్యాలో! ఒక్క వ్యాసంలో చెప్పటం కుదరక పోయినా బహు చక్కటి ప్రయత్నం చేశారు. ఈ వ్యాసంతో మీరు మరెన్నో మెట్లు ఒకేసారి ఎక్కేసారు.
ఆ క్రొత్త ఆలోచనకి మూలం మా ఇంటి రామకృష్ణులవారి ఉవాచ అండి… అదేంటంటే "ఏంటో ప్రతి అమ్మాయికి పెళ్ళి చేసుకోవడానికి రాముడి లాంటి అబ్బాయి కావాలి. కొడుకు మాత్రం కృష్ణుళ్ళా అల్లరి చెయ్యాలి - ప్చ్- ఇదెక్కడి న్యాయం?!"
తొలగించండిమీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, అన్యగామిగారు!
బహు చక్కగా రాసారు లలితగారు.
రిప్లయితొలగించండిఈరోజే మీ బ్లాగ్ చూడడం.....ఏకబిగిన కొన్ని టపాలు చదివాను. ఆద్భుత:
మంచి బ్లాగ్ చూశానన్న తృప్తి మదినిండా!
భారతిగారు! నా బ్లాగ్ చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు!
తొలగించండిచాలా నచ్చింది లలిత గారు ఈ పోస్ట్.మా పెద్దమ్మ భాగవత పద్యాలు చదివించిన అపురూపమైన రోజులు గుర్తు తెచ్చుకున్నాను.
రిప్లయితొలగించండిచిత్రగారు! నా బ్లాగ్ మీరు భాగవత పద్యాలు చదువుకున్న రోజులు గుర్తుకు తెచ్చిందన్న మాట! భలే!
తొలగించండిమీ బ్లాగ్ ని చాలా రోజుల తర్వాత చూసాను. భారతి గారన్నట్లు ఏకబిగిన కొన్ని టపాలు చదివాను. థాంక్స్ లలిత గారూ. ఇంకా చాలా చదవాలి. ఈ వ్యాసం అయితే అమృతతుల్యం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు, వనజగారు! నా బ్లాగ్ మీరు ఇప్పుడు చదివినందుకు, ఇంకా చదవాలి అనుకుంటున్నందుకు చాలా సంతోషం.
తొలగించండిలలితగారు, పోతనగారి భాగవతానికి మీ వ్యాఖ్యానంతో నిర్మల మందాకినీ వీచికలకు మందార మకరంద మాధుర్యం అబ్బినట్టైంది. 👌👌👌👌
రిప్లయితొలగించండిమీ ఈ అబ్జర్వేషన్ చాలా బావుంది -
//తెలుగునాట పెళ్ళైన ప్రతి అమ్మాయి తన భర్త శ్రీరామచంద్రుడిలా వుండాలనుకుంటుంది. తన కడుపున పుట్టిన కొడుకుని మాత్రం జుట్టు కట్టి, నెమలి పింఛం పెట్టి, ముత్యాల హారాలు వేసి, చిన్న పట్టుపంచె కట్టి చిన్నికృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంది.//
ఇందుకేనేమో తెలుగువాళ్ళలో రామకృష్ణ పేరున్నవాళ్ళు ఎక్కువ. అలాగే రామకృష్ణ పరమహంసలా ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించేవాళ్ళూ, తెనాలి రామకృష్ణుడిలా సాహిత్యసాగరాల లోతులు కొలిచేవాళ్ళూ కూడా ఎక్కువే 😊😊😊😊
తొలగించండిವೈವೀಯಾರ್ ಲೋ ಆರ್ ಅಂಟೇ ರಾಮಕೃಷ್ಣ ಯಾ :)
ಜಿಲೇಬಿ
అంత సింపుల్‌గా వుంటే బానే వుండేది జిలేబిగారు. పేరులో దేవుళ్ళు ఎక్కువైపోయి, స్కూల్ రిజిస్టర్లో చోటులేక వెయిటింగ్‌లిస్ట్‌లో వున్నారు. ప్రస్తుతానికి రాముడికి, శ్రీనివాసుడికి మాత్రం చోటు దొరికింది.😃
తొలగించండి“జిలేబి” గారి దాష్టికం ఎక్కువవుతోంది 😡. తన పేరు చెప్పరట గానీ తతిమ్మా అందరి వివరాలు, జీవితచరిత్రలు కూపీ లాగడానికి ప్రయత్నిస్తుంటారు.
తొలగించండిమొత్తానికి YVR గారి పేరులో రాముడు, శ్రీనివాసుడు ఉన్నారని తెలిసిపోయింది. నేనెప్పుడూ అడగలేదు గానీ బహుశః ఏ వెంకట రమణో అయ్యుంటుందనే అంచనాలో ఉన్నాను ఇన్నిరోజులూ 🙂.
“జిలేబి” గారూ ప్రతిగా మీ వివరాలు చెప్పవలసిన సమయం ఇక వచ్చింది. కమాన్ 👍.
గజేంద్రమోక్షం లోని “సిరికిం జెప్పడు ...” పద్యం నాకిష్టమైన వాటిల్లో ఒకటి లలిత గారూ. ఆపదలోనున్న భక్తుడిని రక్షించడానికి పరుగుపెట్టడం యొక్క వర్ణన పోతన గారి ఈ మనోహరమైన పద్యంలో..
తొలగించండిప్రస్తుత రోజుల్లో కూడా ఏదైనా పని మొదలుపెట్టడానికి ముందూవెనకా చూసుకోకుండా దూకేవాళ్ళని చూస్తే నాకు ఈ పద్యమే గుర్తొస్తుంది 🙂.
ఎంతో పెద్ద ప్రశంస! ధన్యవాదాలు, YVR గారు!
తొలగించండి@YVR
రిప్లయితొలగించండి// “.... తెలుగు వాళ్ళలో రామకృష్ణ పేరున్నవాళ్ళు ఎక్కువ. “ //
అవునండి. ఈ మధ్య తెలుగువారిన ఊపేసిన ఒక డైట్ ప్లాన్ పేరు కూడా “రామకృష్ణ డైట్” 😀😀.
సీరియస్లీ, ప్రతి తల్లి తన కొడుకును చిన్నికృష్ణుడిలా అలంకరించడానికి నాకు తోచిన కారణం .... కృష్ణుడు ఫ్యాషనబుల్ గా ఉంటాడు కదా ... అందమైన పట్టుబట్టలు, మెడలో పూలహారం, పైగా తలమీదొక పింఛం. కస్తూరీతిలకం లలాటఫలకే ...... 🙂
పోతన గారి పద్యాలలో మరొక ఆణిముత్యం 👇
రిప్లయితొలగించండిఉ.
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
విన్నకోట నరసింహారావుగారు ! ఆణిముత్యాల్లాంటి పద్యాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు!
తొలగించండిఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై
రిప్లయితొలగించండినంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్దియై
ఈ లెక్కలో ఎదిగిపోతున్నారు మీరు రోజు రోజుకీ
శ్రీనివాస్‌గారు! ఎంతో కాదండి, చాలా కొంతే! మంచి పద్యం గుర్తు చేశారు - ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిమధురాతిమధురంగా వ్రాశారు. మనస్సంతా మీ చిత్రపదబంధాలతో, పోతన గారి పద్యోదాహరణలతో నిండిపోయింది.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిసర్! నమస్కారమండి. నా బ్లాగ్ చదవడమే కాకుండా వ్యాఖ్య ఉంచిన మీకు వేవేల ధన్యవాదాలు.
తొలగించండిమీకు నా బ్లాగ్ లింక్ ఎవరు పంపించారో వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ అంత గొప్ప పండితులు నా బ్లాగ్ రాతల్ని మెచ్చుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. దానికి కారణం మాత్రం పోతన భాగవతమే అని నా నమ్మకం.