కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 47 - హాయి హాయిగా మురిసేనే...
గుంటూరు స్టేషన్లో ట్రెయిన్ దిగగానే ఎప్పట్లాగే - నాన్న, నాన్నతో పాటు పప్పీ, కుట్టీ, ప్రశాంతి, వీళ్ళతో పాటు తంబి మామయ్య కొడుకు వాసు - బిలబిల్లాడుతూ వచ్చేశారు. దిగిన నన్నూ, దింపుకున్న నా సామానునీ తీసుకుని హడావిడిగా మాట్లాడుతూ గలగల్లాడుతూ కారెక్కేశాము అందరమూ.
ఇంటికెళ్ళగానే అమ్మ ఎఱ్ఱనీళ్ళు దిష్టి తీసి పారబోసింది. అప్పటికే లక్ష్మిదొడ్డ ప్రశాంతితో పాటు నేను రావడానికి రెండ్రోజుల ముందే వచ్చేసి వుంది. ఇల్లంతా కడుగుళ్ళూ, సామాను జరుపుళ్ళూ వగైరాలతో పీకి-వెయ్యని పందిరిలా వుంది.
లక్ష్మి దొడ్డ కలిపిచ్చిన పాలు తాగి, నాకిష్టమైన గోధుమరవ్వ ఉప్మా తిని, పప్పీ-కుట్టీలతో బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. అమ్మ, దొడ్డ ఏవేవో లిస్టులు రాసుకుంటూ - ఎవర్ని పిలవాలి, పెళ్ళిబట్టలు ఎక్కడ కొనాలి, ఎన్ని కొనాలి, సరుకులు ఏం తెప్పించాలి - ఇలాంటివేవో మాట్లాడుకుంటూ ఊపిరి సలపనంత హడావిడిగా వున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం అందరం భోంచేసి - మధ్యగదిలో తరగడాలేసుకుని పడుక్కుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ నా పెళ్ళిచీరలు కొనడానికి రాజమండ్రి వెళ్దామనుకుంటున్నామని, నన్ను కూడా వాళ్ళతో తీసుకెళ్దామనుకుంటున్నామని చెప్పింది.
అది వినగానే "నేను రాలేనమ్మా! ఆ షాపింగ్ అదీ నాకు బోర్. నేనింట్లోనే వుంటాను. నువ్వేం కొన్నా నాకు బానే ఉంటుంది " అనగానే అమ్మ కళ్ళలో ఓ మెరుపులాంటి మురిపెంపు నవ్వు - ఎప్పట్లాగే నేను తను కొనబోయే ఏదైనా సరే కాదనకుండా కట్టుకుంటానని చెప్పానని.
నా పెళ్ళి మాత్రం నాకిష్టమైనట్లు అయితే చాలు - నాకింకేమీ పట్టవు అని అమ్మకి నేనప్పుడు నోరు తెరిచి చెప్పకపోయినా, నా పెళ్ళిబట్టలు కొనడం దగ్గర్నుంచి, నా పెళ్ళికి నా ఫ్రెండ్స్ ఎవర్ని పిలవాలీ అనే దాకా కూడా నేను అంతగా పట్టించుకోలేదు, అమ్మతో వాదించలేదు. అమ్మ ఎవర్ని పిలవాలనుకుంటే అంటే వాళ్ళనే పిలవమని చెప్పాను. అప్పటికి రెండున్నర ఏళ్ళుగా నా మాట చెల్లించుకోవడానికి ఆవిణ్ణి విసిగించింది చాలు అనిపించింది నాకు. ఇప్పటికైనా ఆవిడ చెప్పే మాట విందామని అనిపించింది.
నేను గుంటూరు వచ్సిన మరుసటిరోజు ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు వచ్చాడు. వస్తూ బోల్డంత గోరింటాకు తెచ్చాడు. వెన్న కూడా తెచ్చాడు. పెళ్ళికి ఇంకా దాదాపు పదిరోజుల టైం ఉంది, అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులే అనుకుని నా కుడి చేతికి, పాదాలకి గోరింటాకు పెట్టుకున్నాను.
అమ్మ చాలా రోజుల తర్వాత నాతో మళ్ళీ సరదాగా మాట్లాడుతోంది. చాలా సంబరంగా, హుషారుగా వుంది.
నేనోరోజు పొద్దున్నే అటూఇటూ తిరుగుతూ - ఎప్పుడూ ఏదో ఒకటి పాడుకోవడం అలవాటు కదా - రేడియోలో అంతకుముందే వినున్నానేమో - రాజమకుటం సినిమా పాట "ఏడనున్నాడో ఎక్కడున్నాడో ... నా చుక్కలరేడు" అని పాడుతుంటే అప్పుడే లోపల్నుంచి ఎందుకో బయటకొచ్చిన అమ్మ "ఇంకెక్కడుంటాడు? బ్రాడీపేట 2/11 లో వున్నాడు" అంది నవ్వతూ. నాకప్పుడు బోల్డంత సిగ్గు, దాంతో పాటే ఇంకా బోల్డంత ఆనందం, దాంతోపాటు ఇంకాఇంకా బోల్డంత ఆశ్చర్యం - ఒక్కసారి పెళ్ళి చేసేద్దాం అనుకున్న తర్వాత అమ్మ నాతో ఎప్పట్లాగే సరదాగా మాట్లాడుతోందని.
అనుకున్నట్టుగానే అమ్మ, ప్రభావతి దొడ్డ వాళ్ళ సాయితో కలిసి నా పెళ్ళిచీరలు రాజమండ్రి బొమ్మన రాజ్‌కుమార్ షాపులో కొనుక్కొచ్చింది. బుట్టలోకి బంగారం రంగుకి గులాబీ అంచు చీర, పెళ్ళయ్యాక సత్యనారాయణ వ్రతానికి వంగపండు రంగుకి ముదురు నీలం అంచు చీర, ఇంకా ముదురాకుపచ్చకి గులాబీ రంగు అంచు చీర - మొత్తం మూడు పట్టుచీరలు, ఇంకా చాలా ప్రింటెడ్ సిల్కులు, షిఫాన్లు, కాటన్లు పట్టుకొచ్చింది. పెళ్ళైన పదహార్రోజుల వరకు పాతచీర కట్టకూడదు అని చెప్పింది.
చీరల సందడి సద్దుమణిగింది. ఇప్పుడింక వెండి పట్టీలు, చెవులకి రెండో కుట్టు కుట్టించడానికి చిన్నచిన్న ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు రెండు - కాడతో చెవులు కుట్టడానికి ఉన్నవి - కొందామని శంకర్ విలాస్ దగ్గరున్న కిషోర్ జ్యుయలర్స్‌కి వెళ్ళాము నేను, అమ్మ, లక్ష్మి దొడ్డ.
మేము వెళ్ళినప్పుడే అక్కడికి మా శ్యామసుందరి మేడం వచ్చారు. ఆవిడ BH లో మాకు కెమిస్ట్రీ లెక్చరర్. ఆవిడే నా కెమిస్ట్రీ రికార్డు మీద నా పేరు లలితా టి ఎస్ వడ్లమాని అని రాసుకుంటే "పేరు ఇలా కూడా రాసుకుంటారా?" అని నవ్వారు.
నాకు, అపర్ణకి BH లోచదివేటప్పుడు అందరి కన్నా శ్యామసుందరి మేడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడావిణ్ణి దాదాపు ఆరేళ్ళ తర్వాత చూశాను. ఆవిడకి నా పెళ్ళి అని తెలిసి బోల్డు సంతోషించారు. ఆవిడ ఏదో నెక్లెస్ కొనడానికి వచ్చారు. నేను వద్దంటున్నా వినకుండా ఆవిడ కొన్నదాన్ని ఓ సారి నా మెళ్ళో పెట్టి "నీ మెడకి ఇదెంత బావుందో!" అని చూసుకుని తెగ మురిసిపోయారు. అదే ఆవిణ్ణి చూడడం. మళ్ళీ ఇంకెప్పుడూ కలవలేకపోయాను.
సరే! చెవులు కుట్టించుకోవడానికి ఎఱ్ఱముక్కుపుడక కాడలు తెచ్చుకున్నాను కదా! ఐదో లైనులో ఎవరో కంసాలాయన వున్నారు, ఆయన ఇంటికి వెళ్తే చెవులు కుడతారు అని చెప్పారు అమ్మాజీ ఆంటీ. ఓ రోజు మధ్యాహ్నం మూడింటికి అమ్మ, లక్ష్మి దొడ్డ, పప్పీ, కుట్టీ, ప్రశాంతి, నేను, అమ్మాజీ ఆంటీ - ఏడుగురం కలిసి నా రెండు చెవులు కుట్టించుకోవడానికి వెళ్ళాము.
ఆ కంసాలాయన భలే మంచాయన. నొప్పి వస్తుందేమో అని భయపడుతూ చెవిని అందించడానికి ఆలస్యం చేస్తున్న నాతో ఎంతో ఓర్పుగా కబుర్లు చెప్తూ చెప్తూ, ఒడుపుగా ఒక చెవిలో బంగారం కాడ నాకు తెలీకుండా కసుక్కుమని దించేశారు. అబ్బా! ఎంత నొప్పొచ్చిందో!
ఆ దింపిన కాడని చెవి వెనక పక్క పొడుగ్గా ఉన్న బంగారం కాడను చుట్టి, రెండో చెవి కుడదామని ఆయన నా చెవి పట్టుకున్నారో లేదో నేను నోరంతా తెరిచి "ఆఁ ఆఁ ఆఁ" అని గా...ఠిగా ఏడవడం మొదలుపెట్టాను. ఆయన ఒక్క నిముషం నా ఏడుపుకి బిత్తరపోయి "ఇంత మాత్రానికే అలా ఎవరన్నా ఏడుస్తారా? ఆయ్!" అని గద్దిస్తూ రెండో చెవి కూడా కుట్టేశారు. నా ఏడుపు విని నాతో ఉన్న అమ్మావాళ్లు కూడా ఒక క్షణం బిత్తరపోయారు.
రెండు చెవులకి ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు కుట్టేశాక - ఇంటికి వచ్చేస్తూ ఉంటే పప్పీ, కుట్టి, ప్రశాంతి అయితే ఒకటే నవ్వు. కుట్టెమ్మ "అదేంటే లల్లెమ్మా... అలా ఏడ్చావు? నయం ... ఆ కంసాలాయన ఇంటికి చుట్టూ గోడ, పెద్ద చెక్క గేటు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేవాళ్ళు, ఏం జరిగిపోతోందా అని, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకుంటూ విరగ్గొట్టేసుకునేవాళ్ళు." అంటూ ఇంటికి వెళ్తున్నంతసేపూ నా భుజం మీద చెయ్యేసి ఊపేస్తూ లాక్కెళ్ళిపోతూ.
ఆ రోజుకి నాకు చెవులు రెండూ చాలా నొప్పి చేశాయి.
ఆ రోజు రాత్రి అమ్మ పడుక్కునేముందు కుంకుమ, వెల్లుల్లి వేసి కాచిన గోరువెచ్చటి నూనె నా రెండు చెవులకి ఆ బంగారం కాడలు కుట్టినచోట రాసింది.
మా ఇంటి మధ్యగదిలో లక్ష్మి దొడ్డ, ప్రశాంతి, నేను, పప్పి, కుట్టి ఓ జంబుఖానా, దాని మీద బొంతలు వేసుకుని పక్కపక్కనే వరసగా పడుక్కున్నాం. మార్చ్ నెల మొదటి వారం అయినా ఇంకా చిరు చలిగా అనిపిస్తూ ఉండడంతో రాత్రి పూట అందరం మా మా చిన్నరగ్గులు కప్పుకుని పడుక్కున్నాం.
ఒక రాత్రి వేళ నా కుడిచెయ్యి చూపుడు వేలు దగ్గర ఏదో మెత్తగా కదిలినట్టయ్యి, దాంతో పాటే వేలు కూడా కొంచెం చురుక్-చురుక్కుమనడంతో మెలకువ వచ్చింది నాకు. ఏంటా నొప్పిగా ఉంది అనుకుని లేచి, అక్కడే లైట్ వేస్తే నా పక్కనే పడుకున్న వాళ్ళందరూ లేస్తారని మండుతున్న వేలుని ఊదుకుంటూ, నెమ్మదిగా నిద్రకళ్ళ తోనే లేచి వెళ్ళి వంటిట్లో లైట్ వేశాను.
ఇంతలో నా వెనకాలే లేచొచ్చిన పప్పీ నా వేలు కేసి చూసి "లల్లీ! నీ వేల్లోంచి రక్తం వస్తోంది." అంది.
అప్పటిదాకా ఏదో మంటగా ఉంది, ఎందుకబ్బా అనుకుంటున్న నేను రక్తం అన్న మాట వినగానే మళ్ళీ గా...ఠిగా గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాను. వెంటనే మా పక్కనే పడుకున్న లక్ష్మి దొడ్డ, ఆ చివర బెడ్‌రూంలో పడుకున్న అమ్మా-నాన్నా "ఏమైంది, ఏమైంది? అర్థరాత్రి పూట ఈ ఏడుపేంటి?" అనుకుంటూ కంగారుగా లేచి వచ్చారు.
నా వేలు చూస్తే - దానిమీద ఉడత వీపు మీద ఉండే మూడు చారల్లా - ఎవరో కొరికినట్టు మూడు గీతలు, వాటిలోంచి కారుతున్న రక్తం కనిపించింది. అది చూడగానే లక్ష్మిదొడ్డ "చుంచో, ఎలకో కొరికినట్టుంది" అంది.
అది విని అసలే ఆరున్నొక్కరాగం పాడుతున్న నేను ఇంకొంచెం శృతి పెంచాను.
నాన్నకి ఓ పక్కన విసుగొస్తున్నా - కాబోయే పెళ్ళికూతుర్ని విసుక్కోకూడదనుకున్నారేమో మరి - తమాయించుకుని - "ఏదీ నన్ను చూడనీ" - అని నా వేలు పట్టుకుని చూసి "ఏదో కొంచెమే కొరికింది. రేప్పొద్దున్నే మన కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళొద్దామో సారి" అన్నారు.
ఇంతలో అమ్మ "చెవికి వెల్లుల్లి నూనె రాశాను కదా! ఆ వాసనకి వచ్చుంటుంది ఎలక. నయం.. చెవి కొరికెయ్యలేదు." అంటూనే నాన్న కేసి తిరిగి "రేపోసారి ఆ వెంకటేశ్వర్లని ఇంటికి రమ్మనండి. వంటింట్లో అటక మీద బోల్డు ఎలకలున్నట్టున్నాయి. వాటిని శుభ్రం చేస్తాడు" అంది.
ఈలోగా నా చెయ్యి కడుక్కుని వచ్చాను. లక్ష్మిదొడ్డ దానికి ఓ చిన్నగుడ్డముక్కతో కట్టు కట్టింది. అప్పటికే తెల్లవారుఝామున నాలుగయ్యింది. నాన్న మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకుండిపోయారు. అమ్మ లక్ష్మి దొడ్డ పక్కనే వాలింది - ఇంకో గంటలో ఎలాగూ లేద్దామని.
నాకింక ఎలక భయంతో నిద్రపట్టట్లేదు. నేను, పప్పి, కుట్టి, మాతోపాటు ప్రశాంతి - మేం నలుగురం బయటికెళ్ళి కుర్చీల్లో కూర్చుని ఆరంభమే తప్ప అంతమే లేని కబుర్లు, కలకలలూ మొదలెట్టేశాం.
నాన్న పొద్దున్నే నిద్ర లేస్తూనే నాకు గుర్తు చేశారు డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలని. ఎనిమిదిన్నరకల్లా తయారయి ఎజ్డి మీద ఎక్కించుకుని నాన్న నన్ను బ్రాడీపేట రెండో లైనులో వున్న డాక్టర్ కామేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడే క్లినిక్ తాళాలు తీస్తున్నారు డాక్టర్ గారు. నన్ను ఎలుక కరిచిందని చెప్పగానే ఎప్పట్లాగే తెల్లగా, చల్లగా నవ్వేసి "అబ్బే! నీకేమీ కాదు" అని ఓ TT ఇంజక్షన్ చేసేసి నన్నింటికి పంపేశారు డాక్టర్ గారు.
ఆ రోజు నాన్న ఆఫీసుకి వెళ్లిన తర్వాత పొద్దున్న పదీ-పదిన్నర టైంలో ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు, తనతో పాటు ఇంకో ఇద్దర్ని మా ఇంటికి పంపించారు. వచ్చిన ముగ్గురూ వస్తూనే వంటింట్లో అటక ఎక్కి ఓ గంట సేపు వెతికి వెతికి ఉన్న ఎలుకల నన్నింటినీ పట్టి, ఓ గోనె సంచిలో వేసుకుని, వెంకటేశ్వర్లుతో పాటొచ్చిన వాళ్ళిద్దరూ పట్టుకెళ్ళిపోయారు.
వాళ్ళటు వెళ్ళగానే కుట్టి "లల్లెమ్మా! నీ పెళ్ళి కాదు గానీ మనింట్లో ఎలుకల పెళ్ళైపోయింది." అని నాతో అంటూనే, అప్పుడే అటక దిగుతున్న వెంకటేశ్వర్లుతో " మొత్తానికి, వెంకటేశ్వర్లు! మా అటక పీకి పందిరేశావ్!" అనగానే వెంకటేశ్వర్లు "చిన్నపాపగారు తమాషాగా మాట్లాడతారు" అనుకుంటూ మళ్ళీ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
ఇంట్లో పెళ్ళికి వినాయకుణ్ణి పెట్టటం, వెళ్ళగలిగిన చోటికి పెళ్ళిపిలుపులకి వెళ్ళడం, వెళ్ళలేని దూరంలో ఉన్నవాళ్ళకి శుభలేఖలు పోస్ట్ చెయ్యటం, ఫోన్లు చెయ్యటం, పెళ్ళికి వచ్చేవాళ్ళకి పెట్టడానికి బట్టలు, పెళ్ళికి ఏం సామానులు కొనాలో లిస్టులు రాసుకోవడం, ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్లు తెచ్చి పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఇంట్లోంచి బయటికి, బయటి నుంచి ఇంట్లోకి - ఇంట్లో ఉన్న పెద్దా-చిన్నా అందరూ హడావిడిగా తిరగడం...అబ్బ! పెళ్ళంటే ఎంత సందడి కదా! ఎంత బావుందో అనిపించేలా ఉంది.
హైద్రబాదు నుంచి వచ్చే దొడ్డలు, పిన్నులు, వైజాగ్ నుంచి వచ్చే లలితత్తయ్య, అనాతవరం నుంచి అప్ప-దొడ్డ - అందరూ పెళ్ళికూతుర్ని చేసే ముందు రోజు బయల్దేరి వస్తున్నారని తెల్సింది. అందులోనూ మార్చ్ మధ్యలో పెళ్ళి కదా... స్కూళ్ళు, పరీక్షల హడావిడి వల్ల పిల్లలు ఎవ్వరూ రాకపోవచ్చు అనుకుంటున్నారు అమ్మా-నాన్న.
ఈలోగా అమ్మ నాకు పెళ్ళి కోసం చేయిస్తున్న గొలుసు, బుట్టలు, ఇంకా ఏవేవో వస్తువులు పట్టుకుని విష్ణువర్ధనరావుగారు ఇంటికి వచ్చారో సాయంత్రం. ఆయన రాగానే అమ్మ నా ఎడం చేతి చూపుడు వేలు కొలత తీసుకుని ఒక పగడపు ఉంగరం, ఒక కళ్యాణపుటుంగరం కూడా చేయించమని చెప్పింది. ఓ నాలుగు రోజుల్లో చేసిస్తానని చెప్పి వెళ్లిపోయారు ఆయన.
అమ్మ నాకోసం తెచ్చిన చీరలకి బ్లౌజులు కుట్టిద్దామని నన్ను బ్రాడీపేట 5/21 లో ఉండే రాణి అనే ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు ఎప్పుడూ స్కర్ల్టు, వాటి మీద కాలర్ ఉండే ఫుల్ స్లీవ్స్ షర్ట్లు అలవాటు. అందుకే నా చీరల మీద బ్లౌజులు కూడా ఎప్పట్లాగే మెడ కనిపించకుండా హై-నెక్ కుట్టమని గొడవచేశాను.
వెంటనే ఆ రాణిగారు "పెళ్ళి చీరల మీద ఏం బావుంటాయో నాకు తెలుసు. ఈ సారి నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వింక మాట్లాడబోకమ్మాయ్" అని నన్ను విసుక్కుంది.
పక్కనుంచి అమ్మ కూడా "ఈసారి ఆవిడ చెప్పినట్టు విను" అంటోంది. అసలే అమ్మని విసిగించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టనుకుని వున్నాను కదా! ఇహ మరి మాట్లాడలేదు. నాకెలాగూ తెలుసు - రాణిగారు బాగా కుడతారని.
నేనేమీ మాట్లాడకపోవడం చూసి - ఇక మా అమ్మ, రాణి కలిసి ఆ తర్వాత ఓ గంటసేపు - ఇది పొడుగు చెయ్యి, అది పొట్టి చెయ్యి, దీనికి రౌండ్ నెక్కు, దానికి వీ-నెక్కు అంటూ - నా చీరల మీదకి బ్లౌజులన్నిటినీ వాళ్ళిష్టమొచ్చినట్టు - కుట్టెయ్యమని ఈవిడ ఆవిడకి బట్టలు, కుట్టేస్తానని ఈవిడకి ఆవిడ మాటలు - ఇచ్చిపుచ్చుకున్నారు.
అక్కణ్ణించి ఇంటికి వస్తుంటే అమ్మ చెప్పింది - మా ఇంటి మధ్య గదిలో నాలుగు పక్కలా పూలగుత్తుల్లాంటివి వేసి, వాటి మీద ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో పెయింట్ చేస్తే బావుంటుంది, పెళ్ళికూతుర్ని చేసేది అక్కడే కదా బాగా కనిపిస్తుంది అని.
నాకెలాగూ ముగ్గులెయ్యడం సరదా. పైగా ఇంకెవరు వేసినా నాకంతగా నచ్చేది కాదు. అందుకే ఆ పూలగుత్తులు, వాటికి రంగులూ నేనే వేస్తానని చెప్పాను. చెప్పినట్లే వేశాను.
మళ్ళీ మా అమ్మకి బోల్డు ఆనందం. ఆవిడ నాకు వెయ్యమని చెప్పకుండానే పువ్వులూ, రంగులూ చేసేశానని. నేనడిగిన ఒక్కటీ నాకు దొరికిందన్న ఆనందంలో నేనావిడ ఏదడిగినా చేసేస్తున్నానని నాకు మాత్రమే తెలుసు.
ఆ పక్క రోజే ఫాల్గుణ పౌర్ణమి. చిన్నప్పట్నుంచి హోలీ చేసుకోవడం అలవాటు లేదు కానీ ఆ రోజున రంగురంగుల పట్టు పరికిణీలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఈసారి కూడా ఏదో కొత్తచీర ఎఱ్ఱటి పూలది కట్టుకుని, ఇంటి ముందున్న చిన్న ఖాళీలో నేను పెంచుకుంటున్న తులశమ్మ ముందు పద్మాల ముగ్గు వేశాను. ఆ రోజు సాయంత్రం తెల్లగా కాసిన వెన్నెల్లో పసుపుపచ్చ, కెంపు వెన్నెల్లో విరబూసిన చంద్రకాంత పూలు కోసుకుని దండ కట్టుకున్నాను.
ఆ ఫాల్గుణ పౌర్ణమి రోజు మొదటిసారిగా దిగులుగా అనిపించింది.
జరగబోయేది నా పెళ్ళి. నే కోరుకున్నట్టుగానే నా కిష్టమైన అబ్బాయితోనే. అది కూడా మా అమ్మానాన్నలు ఒప్పుకుని నా ఇష్టాన్ని మన్నిస్తూ చేస్తున్నదే!
అయినా ఇంకో మూడు రోజుల్లో అమ్మనీ, నాన్ననీ, పప్పీని. కుట్టీని, ఈ ఇంటినీ, తులశమ్మనీ, ఆ తులశమ్మ ముందు ముగ్గు వేసే మురిపాన్నీ, ఆ ముగ్గులో రాలే విరిసిన చంద్రకాంతల్నీ ఒదిలి వెళ్తాననే బెంగ.
ఆ రోజు రాత్రి అందరం భోజనాలు చేసిన తర్వాత - ఎప్పటి మా అలవాటు ప్రకారం ఇంటి ముందున్న కుర్చీల్లో కూర్చుని పప్పి, కుట్టీలతో కలిసి ఛాయాగీత్ వింటున్నాను. చలో దిల్‌దార్ చలో ...చాంద్ కే పార్ చలో...అని రఫీ రాగాలు తీస్తుంటే , హమ్ హై తైయార్ చలో అని లతా మంగేష్కర్ ఆనందంగా పాడేస్తోంది. అదేంటో ఎప్పుడు ఛాయాగీత్ పెట్టినా వారానికి నాలుగు రోజులు ఆ పాట తప్పకుండా వచ్చేది.
ఆ పాట వింటుంటే కుట్టి అందుకుని "లల్లి తైయార్ చలో" అని పాడుతూ నాకేసి చూసి "ఇంకో మూడు రోజులే లల్లెమ్మా! నిన్నిహ పద పద పమ్మక్కా అని పంపించేసి నేను, పప్పి హాయిగా ఉంటాం. కదే పప్పీ!" అని పప్పితో అని - మళ్ళీ నాకేసి తిరిగి - " అప్పుడు నీ స్టాంపులు, బొమ్మలు అన్నీ నావే!" అని నవ్వింది. పప్పి కూడా సవ్వడి లేని నవ్వు ముత్యాలు రాల్చింది.
నేను వెంటనే లేచి వంటింట్లో గిన్నెలేవో సర్దుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వంటింట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు.
"అమ్మా!" అని వంటింటి తలుపు దగ్గర ఆగి మెల్లిగా పిలిచాను.
అమ్మ గ్యాస్ గట్టు తుడుస్తూ "వచ్చావా? అదుగో ఆ వాటర్ ఫిల్టర్ మీద గ్లాసులో పాలు పోసిపెట్టాను. తాగు." అంది తల తిప్పకుండానే.
ఒకడుగు ముందుకేసి ఆ గ్లాసు తీసుకుని రెండు అరచేతుల మధ్యా ఆ గ్లాసునలముకుని ఉన్న వెచ్చదనాన్ని పట్టుకుని, పాలు ఓ గుక్క తాగి "అమ్మా! నేనిన్ని రోజులు హాస్టల్లోనూ, ప్రాజెక్టు కోసమని బెంగుళూర్లోనూ ఉన్నాను. అసలు ఇంట్లోనే ఉన్నట్టు లేదు. అందుకే నా పెళ్ళయ్యాక ఓ మూణ్ణెల్లు మనింట్లోనే నీ దగ్గరే ఉంటానూ... సరేనా?!" అని నెమ్మదిగా అడిగాను. ఎందుకో తెలీని దుఃఖమొస్తోంది. ముక్కు పీలుస్తున్నాను.
అమ్మ తల తిప్పి చూసి నవ్వబోయి, నన్ను చూసి ఏమనుకుందో ఏమో, దగ్గరగా వచ్చి "నీకిష్టమైనట్టుగానే అన్నీ చేస్తున్నాంగా. ఆ తర్వాత చూద్దాంలే... " అని ఆగి ... మళ్ళీ ఏదో ఆలోచించుకున్నట్టు "నీక్కావల్సినన్ని రోజులు మనింట్లో ఉందువుగానిలే. వెళ్ళు - ముందు ఆ పాలు తాగేసి ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుక్కో. " అని చెప్పింది.
ఇంతలో - ఎప్పట్నుంచి మా మాటలు వింటోందో - కుట్టి నా పక్కనే వచ్చి నించుని ఓ చేత్తో నా షిప్లీ బొమ్మని పట్టుకుని "చంటిపిల్లలా అమ్మని వదిలి వెళ్ళనని ఏడుస్తావేంటే, లల్లీ ? ఇదిగో ---దీన్ని కూడా పట్టుకుపోవే బాబూ! దీన్ని పట్టుకుని జుజుజుజుజూ అని ఎంచగ్గా పాడుకోవచ్చు నువ్వు." అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అంటుంటే నాకు అంత దుఃఖం లోనూ బోల్డు నవ్వొచ్చేసింది.
కానీ ఆ రోజు రాత్రి కలత నిదురే! ఆ నిద్రలో అంతూదరీ, అర్థంపర్థం లేని ఆలోచనలే!
నాకు ఆ క్షణంలో నిజంగా ముందుముందు ఇలా జరగబోతోంది అన్న అంచనా కానీ, ఇలా జరగాలీ అన్న అనుకోవడాలు కానీ లేనేలేవు.
కానీ ఇప్పుడున్నట్లు ఇక ముందు ఉండదూ, ఉండబోదు అన్న ఒక ఎఱుక.
అది నచ్చుతోంది. అది నచ్చట్లేదు కూడా.
నా ఆలోచనల్లో నేనుంటూ - ఓ కొసరు పాటేదో పాడుకుంటూ నేనిక్కడ... ఆ కొసరు పాటకి అసలు పాటేదో పట్టుకుంటూ మీరు కూడా ఇక్కడే!

అమ్మనొదిలి, నాన్ననొదిలి
పారాడి, పెరిగి, తిరుగాడిన వీడునొదిలి
నేర్చిన ముగ్గుల తీర్చిన వాకిలొదిలి
ఈడ పుట్టిన ఆడపిల్లని
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి
చెల్లి నొదిలి, చెలిమి నొదిలి
సరదాల పాడుతున్న పాట నాపి
నవ్వులాటల చెలగాటలాపి
ఈడ పుట్టిన ఆడపిల్లని
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి
తెలియరాని దిగులు తోటి
అలివిమాలిన బెంగ తోటి
అయినవారి అబ్బరాల హద్దు దాటి
ఈడ పుట్టిన ఆడపిల్లని
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి
నా ఆలోచనల్లో నేనుంటూ - ఓ కొసరు పాటేదో పాడుకుంటూ నేనిక్కడ... ఆ కొసరు పాటకి అసలు పాటేదో పట్టుకుంటూ మీరు కూడా ఇక్కడే!
లల్లీ అని పిలిచే - ఆ పిలుపులు జ్ఞాపకమే!
ఓ తల్లీ అని అరిచే - ఆ అరుపులు జ్ఞాపకమే!
అన్ని పిలుపుల్లో - దాగి వున్న ఆ ప్రేమలు జ్ఞాపకమే!
నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!
నాకే చిక్కినట్టి - పువ్వులన్ని జ్ఞాపకం!
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
So nice post, particularly about wedding sarees.Moms really know what suits for her daughter.
రిప్లయితొలగించండిThanks for reading my blog and taking time to comment, Swathi garu!
తొలగించండిఅక్క చాల బాగుంది నీ పెళ్లి వాతావరణం చదువుతుంటే మీ పెళ్లి చూసినట్టుగా ఉంది👌👌👌👌
రిప్లయితొలగించండినాకూ ఓ పక్కగా నించుని ఆ రోజులన్నీ మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించింది రాస్తున్నప్పుడు :)
తొలగించండిఎంత అందంగా పెళ్లి హడావుడి ... అందరూ కలిసి చేసుకొనే పెళ్లి పనులు , చీరలు , నగల కొనుగోలు , ముగ్గులు , రంగులు , చంద్రకాంతలు , ఇల్లు వదిలి వెళ్లాలనే దిగులు ... ఎంత బాగా చెప్పారు లలితా ! అన్నీ కళ్ళకి కట్టినట్లు చెప్పారు . Just love it
రిప్లయితొలగించండిచాలా థాంక్స్, ఇంద్రాణీ!
తొలగించండిఈ క్షణాలు ప్రతి ఆడపిల్ల జీవితం లో ఎదురయ్యే క్షణాలు.చాలా హృద్యం గా ,అందంగా, మనసుకు హత్తుకొనేలాగా, రాశావు లల్లీ!
రిప్లయితొలగించండిఅభినందనలు,అందుకో💐
సరోజ ఆంటీ
అవి మనసులో అలాగే హత్తుకుని ఉన్న జ్ఞాపకాలు, సరోజాంటీ! మీరు నా కథ చదువుతున్నందుకు థాంక్స్!
తొలగించండినవల చదివినట్లు ఉంది - మోహిని ఆంటీ
రిప్లయితొలగించండినా కథ ఓ నవలే, మోహిని ఆంటీ :)
తొలగించండిమీ పెళ్లి ప్రయాణం చాలా బాగుందండి...చదువుతుంటే అసలు బోర్ కొట్టడం లేదు...😊
రిప్లయితొలగించండిచదువుతున్నందుకు థాంక్సండి, మోహనా!
తొలగించండిచాలా బాగున్నాయి మీ పెళ్ళి కబుర్లు
రిప్లయితొలగించండిఏదో పెళ్ళిళ్ళు అప్పట్లో అయిపోయాయి గానీ, లేక పోతే ఇప్పుడు రెండు వేల చీరల మీదికి పది వేల రూపాయల మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టించడానికే అయిదారు లక్షలయ్యేవి. బతికి పోయారు పాపం అమ్మా, నాన్నా! అనిపిస్తుంది నాకు ఈ మధ్య బ్లౌజుల్ని చూస్తే
ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉజ్జోగాలు చేసినా, పెళ్ళయి అమ్మని, ఆ ఇంటినీ వొదిలేసి వెళ్లాలంటే.. పెళ్ళి చేసిన వాళ్ల మీద బోల్డంత ఉక్రోషం, కోపం..
ఐనా, చోద్యం కాక పోతే, మార్చి నెల మొదటి వారం లో, గుంటూర్లో, ఏదీ.. గుంటూర్లో చిరు చలా? కల్లో కూడా ఊహించలేను సుమండీ
మార్చ్‌లో గుంటూర్లో ఒకప్పుడు చిరుచలిని చూసిన రోజులున్నాయండి... మరీ రోజూ కాకపోయినా అక్కడక్కడా ఒకటో, అరో...
తొలగించండినా బ్లాగ్ చదివినందుకూ, చదివి కమెంట్ పెట్టినందుకు థాంక్సండి, సుజాతగారు!
భలే బావున్నాయ్ మీ పెళ్ళి కబుర్లు, అలా ఎన్ని గుర్తు పెట్టుకుంటారు చీరల రంగులతో సహా, అసలా వర్ణనలకే ఇచ్చెయ్యాలి అక్షరలక్షలు
రిప్లయితొలగించండిశ్రీనివాస్ గారు! మీ ఆత్మీయమైన ఈ వ్యాఖ్య అక్షరలక్షల పెట్టు. చాలా థాంక్స్!
తొలగించండిమీ పెళ్లిని మీ చేతి అక్షరాల్లో చూస్తున్నట్టే వుంది ... చదివినట్టు కాదు .
రిప్లయితొలగించండిఇంతకీ అసలు పాట "ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళా"?
అదే - ఆ పాటే, శారదా! అసలు పాట పట్టి పట్టుకొచ్చిన నీకు చప్పట్లు!!!
తొలగించండి