4, అక్టోబర్ 2020, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 7 - అణువూ అణువున వెలసిన దేవా!



వెలిగే సూర్యుడు 
ఊపిరి నింపే గాలి
మోసే భూమి 
దప్పిక తీర్చే నీరు
ఆకలి కొదగే - గింజా, ఆకూ, కాయా, పండూ 
అడక్కుండా వరమిచ్చే దేవుళ్ళు   

మౌనాన్ని కలిపే మాట
మదిని వెలిగించే నవ్వు
కన్నీటిని తుడిచే స్నేహం
ఆర్తికి అందే ఆసరా 
మనసై కలిసే - తోడూ, నీడా, నేస్తం, బంధం 
వెతుక్కుంటే వెన్నంటి నిలిచే దేవుళ్ళు 

ఉనికి అందని దేవుడు... 
ఉన్నాడంటే ఉన్నాడు 
లేడన్న చోటా ఉన్నాడు 
అణువణువున ఉన్నాడు 
అడుగడుగున ఉన్నాడు 

మనికి నింపిన దేవుడు... 
మంచి తలచి, మంచి చేసి
మనసు నవ్విన ప్రతి పూటా
మన తోనే ఉన్నాడు 
మన లోనే ఉన్నాడు 

******************
******************

ఏనాటి పాట అది?!
ఎప్పట్నుంచి వింటున్న పాట అది?!
ఎన్ని సార్లు విన్నా ఎప్పటికప్పుడు కొంగొత్తగా వినిపించే  పాట అది?!

వెన్నపూస పూసినట్లు 
వెండి తీగ మోగినట్లు 
వెన్నెల మించు అద్దినట్లు 
వెల కట్టలేని గళం లోంచి జాలువారిన పాట అది!

నేనింతగా చెప్తున్న పాట - మానవుడు-దానవుడు సినిమాలోది. సినారె రచనకి స్వరకల్పన చేసినది అశ్వత్థామ. 

పాటలో తెర మీద ప్రముఖంగా కనిపించేవారు - అమ్మ తొడిగిన చొక్కా-లాగు వేసుకుని, అమ్మ చేత తల దువ్వించుకుని బడికెళ్ళే బుద్ధిమంతుడైన బాలుడిలా కనపడుతూ, పాట పాడుతున్న  శోభన్ బాబుకి ఒక పక్కగా కృష్ణకుమారి, ముక్కామల, ఇంకో పక్కన శారద. 

ఆ పాట అణువణువునా ప్రాణం పోసి జీవం నింపింది మాత్రం ఎస్పీబీ గాత్రం. 

పాటలో ఉన్న మూడు చరణాలనీ మూడు రకాలుగా - ఆ చరణంలో ఉన్న భాషకి, భాషకి జతపడిన అనుభూతికి తగినట్టు భావస్ఫోరకంగా పాడిన విధానం అద్భుతం. ఆ పాడిన తీరు చెవుల్లో పోసిన అమృతం. 

పాట మొదటి చరణంలో  సాక్షాత్కరించే అమృతగుణోపేతులైన అమరజీవులు - ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు, నిరాకారస్వరూపుడు అల్లా, ఏడుకొండల ఱేడు వేంకటేశ్వరుడు. 

ఈ చరణంలో ఆబాలగోపాల-ప్రియ-బాలు-స్వరం... శాంతరస-భరితం

పాట రెండో చరణంలో సజీవమూర్తులుగా గోచరించే ధన్యచరితులైన త్యాగమూర్తులు - మహాత్మా గాంధీ, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ,  రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని సుభాష్ చంద్ర బోస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు, భాషాప్రయుక్తరాష్టంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని నిరాహారదీక్షాబద్ధుడై సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. వీళ్ళే కాకుండా గోడకి తగిలించిన చిత్రపటాల్లో భారత రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ కూడా కనిపిస్తారు. 

ఈ చరణంలో ఆవేశ-భరిత-బాలసుబ్రహ్మణ్య-గళం... వీరరస-పూరితం

పాట మూడో చరణంలో  కనిపించే జీవనదాతలూ, సేవామూర్తులైన వైద్యనారాయణుల గురించి నా కంతగా తెలియదు. ఎవరికైనా తెలుసునేమో అడిగి వారి పేర్లు రాసుకోవాలి ఎప్పటికైనా.  

ఈ చరణంలో దయా-పూరిత-ఎస్పీ బాలసుబ్రహ్మణ్య-గానం ... కరుణరస-ప్లావితం. 

ఒకే పాటలో ఇన్ని రకాల భావాలు పలికించి - పాటను చిరంజీవిని చేసిన ధన్యజీవి మా సుబ్బయ్య. 

రోజుకోసారైనా - 
ఈ పాట వింటుంటాను. 
ఆ గొంతులోని మాధుర్యానికి తబ్బిబ్బవుతుంటాను. 
పాటని చూస్తూ - ఆ చిత్రపటాల్లో కనిపించే మహనీయులని మరొక్కసారి తలుచుకుంటుంటాను. 
వాళ్ళు చేసిన త్యాగాలకి జోహార్లనుకుంటుంటాను.  

నాకు అందిన హాయిని అందరికీ పంచుకోవాలని - నాకు ఇష్టమైన పాటని ఇక్కడ ... ఇలా... 
 






అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పులు మింగీ... నిజమును తెలిపీ
చల్లని మమతల సుధలను చిలికి... 
అమరజీవులై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ... 
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించ రావా!
అమృత గుణం మాకందించ రావా!
 
అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృభూమి మొఱ పెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించీ
స్వాతంత్య్ర ఫలమును సాధించీ
ధన్యచరితులై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ...
ధన్యచరితులై వెలిగిన మూర్తుల
త్యాగనిరతి మాకందించ రావా!
త్యాగనిరతి మాకందించ రావా!

అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగా గుండెను పొదిగీ
కొనవూపిరులకు ఊపిరులూదీ...
జీవనదాతలై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ...
జీవనదాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా!
సేవాగుణం మాకందించ రావా!

అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా! 

******************
******************

తరలిపోయిన మేటి-తరాలకి, మరలిరాని హాయి-తనాలకి జేజేలు చెప్పుకుంటూ... 


~ పాటల భైరవి  

 

6 కామెంట్‌లు:

  1. హాయితనం..

    ఈ పాట గొప్పతనం ఇంతబాగా చెప్పడమే హయితనం!!

    ఎక్కడికీ..పోలేదు..
    అలా షికారు కి వెళ్లి వచ్చేసింది.

    రిప్లయితొలగించండి
  2. అద్భుతం అండి.

    గత పదిరోజులుగా ఎంతో కష్టం, వెలితి.
    జీవితంలో ఎప్పుడూ దేవుడ్ని ప్రశ్నించలేదు.
    ఏది చేసినా మంచికే అనుకున్నాను.
    స్వార్ధపరుడు కాబట్టే నా మణిని తీసుకుపోయాడు.

    😢😭😠

    రిప్లయితొలగించండి
  3. మంచి పాట గురించిన మంచి పోస్ట్. చదవగానే వెళ్లి ఆ పాట వినాలి అనిపిస్తుంది.
    ఆలోచిస్తే అప్పటి సినిమాలలో కొన్ని మంచి prayer songs వచ్చాయి... భక్తి గీతాలు కాకుండా, ప్రార్థన గీతాలు అని చెప్పచ్చు... "హే మాలిక్ తెరే బందె హమ్", "హమ్ కో మన్ కి శక్తి దేన" లాంటివి. ఇలాంటి పాట most recent గా ఏ సినిమా లో చూసామా అని ఇప్పుడు వెతకాలి!
    Thanks for your blog Lalita, which is provoking so many thoughts!

    రిప్లయితొలగించండి
  4. అసలు నీ ఇన్ట్రడక్షన్ లైన్లే ఓ మంచి పాట ఐపోతుంది.
    శోభన్ బాబు డిస్క్రిప్షన్ అల్టిమేట్... :-)
    ఎంత మంచి సాహిత్యం, ట్యూన్ ఇంకా గానం కదా.
    ఇలాంటి పాటలు వినడానికే అద్భుతంగా ఉంటాయి నాకు.

    రిప్లయితొలగించండి
  5. ఉనికి అందని దేవుడు...
    ఉన్నాడంటే ఉన్నాడు
    లేడన్న చోటా ఉన్నాడు
    అణువణువున ఉన్నాడు
    అడుగడుగున ఉన్నాడు

    మనికి నింపిన దేవుడు...
    మంచి తలచి, మంచి చేసి
    మనసు నవ్విన ప్రతి పూటా
    మన తోనే ఉన్నాడు
    మన లోనే ఉన్నాడు

    Akshara lakshalu

    రిప్లయితొలగించండి
  6. నాతో పాటు పాటని.నచ్చుకుని, ఆ పాట గురించిన నా రాతల్ని మెచ్చుకున్న మీ అందరికీ పేరుపేరునా బోల్డన్ని ధన్యవాదాలు !!!

    రిప్లయితొలగించండి