కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 50 - ఒకరికొకరం మేలి-సగం!
దాదాపు నాలుగేళ్ళుగా రాగపూరిత రాగమై మోగుతున్న "త్వామనురజామి" ఇక్కడితో ఆగి - సరాగమవుతోంది.
ఇది ఎప్పుడో మొదలయి జరిగిపోయిన - ఇప్పటికీ జరుగుతున్న కథ.
ఇంతకు ముందు ఎవరో అన్నట్టు ముగింపు ముందే తెలిసినా - నా వైపు నుంచి అసలేం జరిగిందో నేను చెప్తే తప్ప ఎవరికీ తెలియని నా కథ ఇది.
నే చెప్పిన నా కథే వెనక నుంచి చెప్పుకొచ్చినట్లు ఉంటే, అసలు నా కథ చెప్పాలని నాకెందుకు అనిపించిందో చెప్పాలంటే ఈ కథ మొదలెట్టిన నాలుగేళ్ళకు ఇంకో ఆరేళ్ళు వెనక్కెళ్ళాలి.
ఓ పదేళ్ళ క్రితం శ్రావణమాసం.
ఏడాదికి ఒకసారి నాకు నచ్చిన, మనసుకు దగ్గరగా వచ్చిన నలుగురినీ ఇంటికి పిలిచి కబుర్లాడుకోవడానికి వరలక్ష్మీవ్రతం నాకో అనువైన, అందమైన నెపం.
ప్రతీ ఏడాది లాగే ఆ శుక్రవారం కూడా ఓ పదిహేను కుటుంబాలని భోజనానికి పిలిచాను.
ఆ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు కొత్త పెళ్ళికూతుళ్ళు - వాళ్ళిద్దరూ కూడా నేను చేసే టీమ్ లోనే పని చేస్తుండేవాళ్ళు. అందులో ఒకరు సిమ్లా-చిన్నది సరితా శర్మ, ఇంకొకరు జమేకా-సుందరి వేనెట్ బర్క్ .
వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి - కబుర్లతో ఇల్లంతా గలగలలాడుతున్న సమయంలో - కొత్త పెళ్ళికూతుళ్ళు సరితని, వేనెట్టుని - మిగిలిన మేమందరం వాళ్ళ పెళ్ళి విశేషాలు అడుగుతూ, వాళ్ళిద్దరినీ సరదాగా ఆట పట్టిస్తూ - వేళాకోళాలాడుతుండగా - ఉక్రోషం వచ్చిన వేనెట్ హఠాత్తుగా నా కేసి తిరిగి "నన్నూ, సరితనీ అడగడం కాదు. ముందు నీ పెళ్ళి సంగతి చెప్పు. Gentleman బదరీని ఎలా వేధించి పెళ్ళి చేసుకున్నావో నాకు తెలీదనుకున్నావా?" అని దబాయిస్తూ - అటు పక్కగా కూర్చున్న సరిత కేసి చూస్తూ కన్ను గీటింది.
దాంతో సరిత కూడా "ఏదో పెద్ద కథే ఉందన్నమాట! చెప్పాల్సిందే!" అని నా రెండు చేతులూ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తనకీ, వేనెట్కీ మధ్యనున్న కుర్చీలో కూర్చోపెట్టేసింది.
ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పాల్సిందే అన్నట్టు, వాళ్ళు అప్పటిదాకా చెప్పుకుంటున్న కబుర్లు కూడా ఆపేసి నాకేసి చూస్తూ ఉన్నారు.
నాకసలే - "శ్రీరామ" దగ్గర మొదలుపెట్టి "చిత్తగించవలెను" అన్న దాకా - కథలు వినిపిస్తూ కబుర్ల లోకి గెంతుతూ, కబుర్లు చెప్తూ కథల్లోకి దూకుతూ - అడిగినవారిది పుణ్యం అన్నట్టు - చెప్పినది చెప్పకుండా - బోల్డన్ని కబుర్లు చెప్పడం చాలా ప్రియమైన విషయం.
మరీ ఇంతమంది చుట్టుముట్టేసి, నా చేయి పట్టి కట్టేసి "చెప్పూ, చెప్పఁవూ? చెబుదూ?" అని మొహమాటపెట్టేస్తే, ఆ మాటల-మోహం నుంచి విడిపించుకుని ఊరికే ఉండడం నా వశమా? నా కబుర్ల-మేఘం కురిపించే ముచ్చట్ల-వాన నుంచి తప్పించుకుని ఉరికి పారిపోవడం ఇక అడిగినవారి తరమా?
చెప్పడం మొదలెట్టేశా.
నేను గుంటూరులో డిగ్రీ చదివేటప్పుడు రిక్షాలో కాలేజ్‌కి వెళ్తూ తన మొహం కూడా చూడకుండా, తనెవరో కూడా తెలీనప్పుడు బదరిని కసురుకోవడం, ఆ తర్వాత తిరుపతిలో MCA చేరినప్పుడు అక్కడే MBA చదవడానికొచ్చిన బదరి నన్ను చూడడం, నాకు మూగ అబ్బాయిగా పరిచయం కావడం - ఆ పరిచయం పెళ్ళి దాకా పెరగడం - ఒక అరగంట పైగా ఆపకుండా నేను చెప్తూనే ఉన్నాను.
నా ముందున్న పేరంటాళ్ళు కంటి-రెప్ప వెయ్యకుండా నన్ను చూస్తూ, మధ్యలో ప్రశ్న లేస్తే నేను నా కథ లోంచి ఇంకే కబుర్లలోకో జారిపోతానని - అస్సలు నోరు విప్పి మాట్లాడకుండా - నేను చెప్పిన కథంతా విన్నారు.
అంతా విన్న తర్వాత సరిత "లలితా! ఇంత unique ప్రేమకథ నేనింతకు ముందెప్పుడూ వినలేదు, ఏ సినిమాల్లోనూ చూడలేదు. ఇది మీరు కథగా రాయాల్సిందే!" అని తెగ సంబరపడింది.
వేనెట్ కూడా "ఇది కథగా రాసి - నిన్నింత భరిస్తున్న బదరికి కానుకగా ఇవ్వు" అని మేలమాడింది.
అప్పుడు అనుకున్నా "కదా! నా కథ నేనే ఎందుకు రాసుకోకూడదూ?!" అని.
మరి కథ రాయాలంటే దానికో పేరు పెట్టాలి కదా! ఆ పేరు కూడా ఇప్పటివరకు ఎవరూ వినని పేరై ఉండాలి. నా కథలో నేను చెప్పబోయే నా ప్రేమ నాకెంత ప్రత్యేకమో, ఆ ప్రేమకథకి నేను పెట్టుకోబోయే పేరూ అంత ప్రత్యేకంగానూ ఉండాలి.
ఇలా అనుకుని ఎంతెంతో ఆలోచించుకున్నా - ఎన్నెన్నో పేర్లు అనుకున్నా. దానికే ఓ నాలుగు రోజులు పట్టింది. అప్పటికి నాకు తట్టిన పేర్లలో ఏ ఒక్కటీ కూడా నాకు నచ్చలేదు.
అప్పుడు google చేసి చూశా - I love you కి సంస్కృతంలో సమానార్థ వాక్యం ఏంటీ అని. అలా వచ్చిన వాటిల్లో "त्वामनुरजामि (tvāmanurajāmi)" నాకు చాలా నచ్చింది.
వెంటనే "త్వామనురజామి" పేరుతో ఒక private blog మొదలుపెట్టి - ఓ మూడు episodes రాసి - ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురు ఆప్తులతో పంచుకున్నా - అపర్ణ, లక్ష్మి, సుస్మిత. అది ఎప్పుడో 2012 లో జరిగిన సంగతి.
ఆ మొదటి మూడు ఎపిసోడ్ల తర్వాత ఇంకేం రాయాలో, ఎలా రాయాలో తెలీక - ఆ కథ సాగక - అక్కడే ఆగిపోయింది. అప్పుడు సుస్మిత అననే అన్నారు "ఇలా రాస్తే మీ కథ మీ షష్టిపూర్తికి కూడా పూర్తి కాదు" అని.
అప్పటికే "బోల్డన్ని కబుర్లు" కూడా మొదలు పెట్టాను. కానీ అది కూడా అంతంత మాత్రం గానే సాగుతోంది.
2016 మార్చ్ నెలలో - బదరి ఇచ్చిన సలహా ప్రకారం ఎప్పుడైతే వారం, వారం బ్లాగ్ రాద్దామని అనుకున్నానో - అప్పుడే - త్వామనురజామి బ్లాగ్ పోస్టులని ప్రతీ నెల 19 వ తారీఖుకి రాద్దామని అనుకున్నా.
పంథొమ్మిదే ఎందుకూ అంటే అది నన్ను బదరి కలిసిన మొదటి రోజు - డిసెంబర్ 19.
అలా మొదలయింది ... నా "త్వామనురజామి" - 2016 May నెలలో.
ముందు మా ఇద్దరి ప్రేమకథగా మాత్రమే చెబ్దామనుకుని మొదలు పెట్టిన కథ - రాస్తూ రాస్తూ ఉండగా - జీవితం మీద మాకున్న ప్రేమకథగా మారి - మాతో పాటు మాకు కావల్సిన, మాతో కలిసొచ్చిన వాళ్ళందరి మీదా మాకున్న ప్రేమ కథగా సాగింది.
(ఈ కొసరు-పాటకి అసలు పాటేదో కనిపెట్టేసుకుని పాడేసుకోండి మరి!)
మా మేటి చెలిమి ... ఒక కథ...
కథ కాదు ... నిజము మా కల...
మనసులోని - మాటలన్నీ...
చెప్పకుంటే - మరి ఎలా?!
ఇంతకీ కథ దేని గురించి?
నా గురించి...
తెలిసీ తెలియని అమాయకపు రోజుల గురించి.
అన్నీ తెలుసుననుకునే నా ఆరిందాతనం గురించి.
అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాల్సిందే అన్న నా పంతం గురించి.
ఇవన్నీ మా త్రమే కాదు - వీటన్నిటితో పాటు...
నా మాట మన్నించిన మా అమ్మా-నాన్నల గురించి.
నన్నిష్టపడ్డ బదరికి వెన్నుదన్నుగా నించున్న మా అత్తగారి గురించి
నాతో ఆడిపాడిన నా చెల్లెళ్ళ గురించి.
నన్నభిమానించే నా మరిదీ, ఆడపడుచుల గురించి
"మా లల్లెమ్మ" అని నన్ను తలుచుకునే అయినవాళ్ళ ఆపేక్ష గురించి.
నా కాలేజ్ స్నేహితుల అభిమానం గురించి.
నా ప్రియనేస్తం అపర్ణ గురించి.
అందరి కన్నా ముఖ్యంగా బదరిని నాకు పరిచయం చేసిన తన సీనియర్ రాజశేఖర్ గురించి.
వీళ్ళలో ఏ ఒక్కరి గురించి చెప్పకపోయినా నా "త్వామనురజామి" పల్లవి మాత్రమే పాడేసి ఆపేసిన ఓ అసంపూర్ణ గీతమే!
నా కథలో ఎన్ని మంచి జ్ఞాపకాలు!
ఏ జ్ఞాపకమైనా ఎవరి ప్రమేయమూ లేకుండా నాకై నాకే పుట్టెయ్యదుగా!
ఆ జ్ఞాపకాలు అంత అందంగా నాకందించిన ప్రతి ఒక్కరూ ఆయా జ్ఞాపకానికి సంబంధించిన కథకు - కథానాయికలూ, కథానాయకులూ.
వాళ్ళందరికీ - వాళ్ళందరితో పాటు, నేను చెప్పిన నా కథని చదువుతూ - ప్రతీ నెల 19వ తారీఖుకి నేను బ్లాగ్ పోస్ట్ చేయడం ఆలస్యం అయితే "లలిత గారూ! ఇవాళ 19, మర్చిపోయారా?" అని గుర్తు చేసిన ఎంతో మంది బ్లాగ్-మిత్రులకి నా కృతజ్ఞతాభివందనాలు!
ఇక్కడితో - నా జీవితానికి నేను చెప్పుకునే "త్వామనురజామి" - ఇక్కడే ఒక పాటగా మోగుతూ ఉంటుంది.
ఈ మన-సు-ఆత్రేయ రాసిన పాట నాకు ఇష్టాన్ని పంచిన ప్రతీ ఒక్కరి కోసం... పేరుపేరునా పాడుకున్నా ... పాడుకుంటున్నా... పాడుకుంటూనే ఉంటా...
ఈ లేత హృదయాన్ని కదిలించినావు...
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే...
నేను పాడేది నీ పాటలే...
అని ఎవరు అన్నది?
అది ఎవరు విన్నది?
నీ చిగురు చెవులకే గురుతు వున్నది...
https://youtu.be/_AM9sdMyozg
రిప్లయితొలగించండినేను నా పోస్ట్ చివర్లో రాసింది నాకిష్టమైన "కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది" అన్న పాటలో చరణమేనండి, నీహారికా! పాట పట్టుకొచ్చి నాకిచ్చినందుకు మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండిhttps://youtu.be/kT0RFez2dNA
రిప్లయితొలగించండిభలే! నా కొసరు పాటకి అసలు పాట ("ఆనాటి చెలిమి ఒక కల!") పట్టిన మీకు చప్పట్లు, నీహారికా!
తొలగించండిసుస్మిత అంటే కొత్తావకాయ బ్లాగర్ కదా ?
రిప్లయితొలగించండిఈ కధలో హీరో హీరోయిన్ లు మీ అమ్మా నాన్నలే...ఈ కధ పుస్తకంగా వేస్తే వాళ్ళకోసం తప్పకుండా కొంటాను.
చాలా చాలా బాగుందండీ మీ ప్రేమ కధ 👏👏👏👏👏
అవునండి ఆవిడే!
తొలగించండిమీరు నా కథాహృదయాన్ని బాగా పట్టుకున్నారు, నీహారికా! మీరన్నట్టే నా కథకి నాయికా-నాయకులు మా అమ్మా-నాన్నలే!
నా ప్రేమకథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం! మీకు బోల్డన్ని థాంక్స్!
బుజ్జిమొలక ఒకటి చిట్టిమొక్కగా నిల్చుని, స్వతంత్రంగా ఆరిందాగా ధైర్యంగా ఎదుగుతూ, స్థిరమైన హాయైన ఫలవంతమైన చెట్టుగా అవడం చూసినట్టు ఉండింది ఈ సిరీస్ చదువుతూ ఉంటే.
రిప్లయితొలగించండివండర్ఫుల్!
బోల్డన్ని థాంక్సులు 🦋🍀💐🌈🍭🍭
ఈ సిరీస్ మొదటి నుంచి చివరి దాకా చదివారన్నమాట. అందుకు నేనే మీకు బోల్డన్ని థాంక్సులు చెప్పుకోవాలి.
తొలగించండిలలితా! మీ పెళ్ళయిన దాదాపు సంవత్సరం నుంచి నాకు నీతో పరిచయం, స్నేహం.
రిప్లయితొలగించండిఅప్పటికీ ఇప్పటికీ మీరు అస్సలేం మారలేదు... literally and figuratively.
What I liked the most in this series, is the way your family members (both immediate and extended) respected each other’s feelings & decisions and stood by one another no matter what . My respect for them has multiplied.
You have celebrated your love and immortalised it through this series.
మీ వివాహ రజతోత్సవ సందర్భంగా మీకు పంపిన శుభాకాంక్షలు ఇవి. ఇంతకన్నా బాగా మీ గురించి నేను రాయలేనని అవే మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను.
లలితా, బదరీ!
మీరెప్పుడూ
ఒకరి కోసం ఒకరు గా, ఒక్కరు గా,
ఆటల్లో, మాటల్లో, పాటల్లో,
ఆటవిడుపుల్లో, పట్టువిడుపుల్లో,
పొద్దుపొడుపుల్లో, పండువెన్నెల్లో,
చేయి చేయి కలిపి నడిచిన దారుల్లో,
చెప్పుకున్న ఊసుల్లో, చెప్పుకోని ఆశల్లో,
చేసుకున్న బాసల్లో, కలిసి కన్న కలల్లో,
ఒకరి ఆశ ఒకరు గా, ఒకరి శ్వాస ఒకరుగా,
ఒకరి నీడ ఒకరుగా, ఒకరి తోడు ఒకరుగా,
ఒక్కరుగా, ఎప్పటికీ ఒక్కటిగా, నవ్వుతూ, నవ్విస్తూ,
జీవితాన్ని గెలుస్తూ, మిమ్మల్ని గెలిపించుకుంటూ,
ఆనందం అసూయ చెందేలా, ఆనందోత్సాహాలతో,
ప్రతీ క్షణం పండుగలా, కన్నుల పండుగలా,
పండువెన్నెల్లా, నిండుగా, నిండు నూరేళ్ళూ
సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,
ఉండాలని మనసారా కోరుకుంటూ.....
లక్ష్మి, సాయి గిరిధర్
Lovely wish!!!
తొలగించండిReal life love stories need to be told ... In this world where folks are fast becoming disheartened, disillusioned and cynical and beginning to think that love is to be found only in fiction.. stories like this come as a reassurance that real life can be magical too!
రిప్లయితొలగించండిThanks for sharing your story, taking some of us down the memory lane, and all the readers through a beautiful journey.
Wishing you and your lovely family many more great moments! Love, A.
త్వామనురజామి
రిప్లయితొలగించండిపేరుకు తగ్గ ప్రణయ ప్రయాణం.జీవితాన్ని,అందుకు సంబంధించి వ్యక్తుల్ని ఎంతగా ప్రేమించకపోతే ఇంత గొప్పగా రాయగలుగుతారు. ప్రతి అక్షరంలోనూ ఆ మధురిమ తొణికిసలాడుతోంది.ఎక్కడా ఒక్క పాయింట్ కూడా వదలకుండా పూసగుచినట్టు, సన్నజాజి మాల అల్లినట్టుగా రాసి మాకందరికీ లైవ్ టెలికాస్ట్ ఇచ్చేసారు. శుభోజ్జయం కలగాలి