30, జనవరి 2022, ఆదివారం

టైమ్స్ స్క్వేర్‌లో మా టీమ్ స్క్వేర్ - 2 - స్వేచ్ఛామూర్తి పాదపీఠం; పణం పెట్టని ఆపణం

 కిందటి మాటు కబుర్లు : టైమ్స్ స్క్వేర్లో మా టీమ్ స్క్వేర్ - 1 - ఇక్కడి నుంచి అక్కడి దాకా...


    ఆకాశంలో లెక్కపెట్టలేని చుక్కలుంటాయి. 

    చిన్నప్పట్నుంచి ఆకాశం చూస్తూ  పెరిగిన అందరికీ అది తెలుసు.  

    నిజంగా చెప్పుకోవాల్సి వస్తే - అదేమీ చెప్పుకోదగ్గ విశేషమూ కాదు. అదే మొట్టమొదటి వాక్యంగా రాసేంత ప్రత్యేకమైన విషయమూ కాదు. 

    కానీ - న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్‌లో విద్యుద్దీపాల మిలమిలలు ఎంత మిరుమిట్లు కొలుపుతున్నాయంటే మనిషి కంటికి మింటనున్న చుక్కలు కూడా ఆననంత. అసలు సిటీ లైట్స్ వల్ల నక్షత్రాలు నల్లపూసలైపోయి చాలా కాలమైంది. 

    ముందుముందు కాలంలో పిల్లలకి నక్షత్రాలు ఎలా వుంటాయో చూపించాలంటే కాకులు దూరని కాఱడవులకి, చీమలు దూరని చిట్టడవులకి వెళ్లి చూపించాల్సి వస్తుందేమో! 

    ఆ లైట్ల వెలుగుల్లో ఆగకుండా వస్తున్న అడ్వర్టైజ్‌మెంట్లు చూస్తూ  అలిసిపోయిన కళ్ళు వాటంతటవే ఎప్పుడు వాలాయో తెలీలేదు. 

*******
*******

నవంబర్ 24 - బుధవారం: 

చందురుణ్ణి అటకెక్కించి - చుక్కల దులపరించి 
అలుముకున్న చీకటిని చుట్టచుట్టి చేతికిచ్చి 
పోపొమ్మని రాత్రిని తరిమికొట్టి  
ఏ సీమకు పడమటనో కుంకి కునకబోతున్న సూరీణ్ణి 
'ఇదిగో ఇక్కడ నీ తూరుపు! ఇటొచ్చి పొద్దుపొడువు'మని లాక్కొచ్చిందో ఏమో - వగలమారి పగటి-పొలఁతి .... 
అలిగి గీఱెక్కిన సూరీడు 
ఎఱ్ఱెఱ్ఱగ మారి 
చుఱుచుఱ్ఱున తాకి 
కనురెప్పల మీద కలల ఊయలలూగుతున్న నిద్దురని తరిమితరిమి కొట్టాడు. 


    అబ్బా! దీన్నే సింపుల్‌గా మామూలు మాటల్లో "తెల్లారింది, నిద్ర లేచాను" అని చెప్పొచ్చు. కానీ సెలవు పూటైనా కాసింత కలాపోసన చేద్దారని ఏదో ఆ వంకరటింకర-వాక్యాల కైత అనుకుంటూ లేచాను. 

    అప్పటికే బద్రి, బుజ్జిజింక స్నానాలు చేసేసి - concierge lounge కి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి నాకు ఓ కప్పు కాఫీ పట్టుకొచ్చారు. 

    అంతకు ముందు రోజు రాత్రి తన అపార్టుమెంటుకి తిరిగి వెళ్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్ళడానికి పొద్దున్నే తొమ్మిదింటికల్లా తయారుగా వుండమని చెప్పాడు కదా సుహాస్! అది గుర్తుకొచ్చి నేను కూడా గబగబా తయారయిపోయా - మొలకలు తినేసి కలకలమంటూ - గలగల మాటలనేసుకుంటూ. 

    ముగ్గురం కలిసి తొమ్మిదింటికల్లా హోటల్ లాబీకి వెళ్తుండగానే సుహాస్ హోటల్ లోపలికి వస్తూ కనిపించాడు. వస్తూనే చెప్పాడు కొంచెం దూరం వెళ్ళి బాటరీ పార్క్ దగ్గర స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళే క్రూజ్ బోట్ ఎక్కాలి అని చెప్పాడు.  బాగా నడవాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. 

    వాడలా అంటుండగా నాకు కిందటి రోజు మేమెక్కిన ఊబర్ డ్రైవర్ సీజర్ చెప్పింది గొర్తొచ్చింది. అతనేమన్నాడంటే "మీరు కాలిఫోర్నియాలో కానీ, ఫ్లోరిడాలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు కావాలి, కానీ న్యూయార్క్ మాత్రం వాకింగ్ సిటీ. ఎక్కడికైనా నడిచి వెళ్తేనే మజా" అని. 

    అది గుర్తు చేసుకుంటూ - చలికి హుహుహు అని వణుక్కుంటూ - ముందో సబ్‌వే ట్రెయిన్ ఓ చోట ఎక్కి - ఓ ఇరవై నిముషాల్లో ఇంకో చోట దిగి - అక్కణ్ణించి చకచకా నడుచుకుంటూ వెళ్లి - క్రూజ్ బోట్ ఎక్కడానికి సెక్యూరిటీ చెక్ కోసం ఓ పది నిముషాలు క్యూలో నించుని - అదయ్యాక ఇంకో పదిహేన్నిమిషాలు అదే క్యూలో కంటిన్యూ అయ్యి మొత్తానికి క్రూజ్ బోట్ ఎక్కాము - మేమిద్దరం, మా ఇద్దరు - వెరసి మా టీమ్ స్క్వేర్. 

    బాగా చలిగా ఉందని నలుగురం బోట్ లోపలికి వెళ్లి కూర్చున్నాము. ఓ అరగంటలో క్రూజ్ బోట్ లిబర్టీ ఐలెండ్ దగ్గర ఆగింది. నలుగురం దిగి గబగబా నీలాకాశం కింద లేతాకుపచ్చ రంగులో మెరిసిపోతున్న లేడీ లిబర్టీని చూడడానికి వెళ్ళాము. 

    సుహాస్ టికెట్లు  బుక్ చేసినప్పుడు లేడీ లిబర్టీ పాదపీఠం (pedestal) దాకా వెళ్లేలా తీసుకున్నాడు. కాసేపు విగ్రహం చుట్టూ నడిచి తిరిగి ఓ నాలుగు ఫోటోలు తీసుకుని - ఆ తర్వాత pedestal దాకా ఎక్కి అక్కణ్ణించి లిబర్టీ ఐలాండ్ చుట్టూ ఆవరించి ఉన్న - ఒడ్డు కనిపించని లోతైన సముద్రపు నీళ్లు -  వాటిని దాటి ఒకదానినొకటి ఒరుసుకుంటూ నించుని ఉన్న ఎత్తైన భవనాలు చూసి కిందకి దిగి వచ్చాము. 

    అన్నట్టు  - ఇక్కడో సంగతి చెప్పాలి! న్యూ యార్క్ వెళ్ళడానికి ముందే నేనొకటి అనేసుకున్నా. సాధ్యమైనంతవరకు కెమెరా కన్ను కన్నా మామూలు కన్నే వాడాలని, కనిపించినవన్నీ కాసులు పోసి కావాలనుకోకూడదని. అనగా... ఫోటోలు ఎక్కువ తీయాకూడదనిన్నీ, జ్ఞాపకాలు తప్ప జ్ఞాపికలు మోసుకు రాకూడదనిన్నీ. 

    అందుకే - లేడీ లిబర్టీతో నలుగురం కలిసి ఒకటి - స్వేచ్ఛామూర్తి ఎదురుగా ఇద్దరిద్దరంగా నించుని ఓ రెండు - మేమెవ్వరమూ లేకుండా ఆ మెరుస్తున్న తామ్రమూర్తి మాత్రమే ఉండేలా ఒకటి - మొత్తం నాలుగంటే నాలుగు ఫోటోలు మాత్రం తీసుకున్నాం. 

    అందులో నాకు బాగా నచ్చిన ఫోటో ఇదిగో ఇక్కడ... నాకు నచ్చి రాసుకున్న నాలుగు మాటలతో... 





ఇల్లు వదిలి - ఊరు దాటి  
నీటిదారుల - వేసట పైనాల 
దీలుపడిన వలసరీ!

ఉన్నది చేజారిందని 
ఊరించినది అందలేదని 
ఉసురు తప్ప ఏమీ లేదని 
ఉనికికి అర్థమే లేదని 
ఉసూరుమనకు 

గాలిదీపం వెలిగించి 
వెలుగు చూపుతున్నా... 

వేలవేల కలలు పేనుకో 
నీలినీలి నింగి - నీకు గొడుగొహో !
వేనవేల ఆసలు ఊనుకో 
కలలలోగిలి ఈ నేల - నీకు నాకమహో!


*******
*******

    నాకు లేడీ లిబర్టీ బొమ్మ ఎక్కడ చూసినా ఆ విగ్రహం ధరించిన ఆ రాగి ఉడుపుల్లో పొరలుపొరలుగా కనిపించే మడతలు చాలా ఇష్టం.  ఆవిడ మొహం కొంచెం నవ్వుతున్నట్టు ఉంటే ఇంకెంత బావుండేదో అనుకుంటూ ఉండేదాన్ని. 

    కానీ లేడీ లిబర్టీ మ్యూజియంలో ఉన్న వలస వచ్చిన వారి కథలు చదివాక - పగలూ-రాత్రీ లేకుండా ఉన్నచోట ఉండలేక, విడుదల కోరుకుని అవకాశాల అమెరికా భూమికి ఓడల ఇరుకుగదుల్లో కూరుకుని - కుక్కుకుని వచ్చే శరణార్థులకి beacon light చూపిస్తూ  నించునే స్వేచ్ఛామూర్తి మొహంలో ఆ మాత్రం వ్యాకులత కనిపించేలా చెక్కడం చాలా గొప్ప ఆలోచన అనిపించింది. 

    లేడీ లిబర్టీ మ్యూజియం మాకు చాలా బాగా నచ్చింది. అక్కడే కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. 

    లేడీ లిబర్టీ - రాగి రేకులు తాపడం చేయబడ్డ - నిలువెత్తు తామ్రమూర్తి. ఆ ఆకుపచ్చ రంగు ఎలా వచ్చిందంటే విగ్రహం లోని రాగి చుట్టూ ఉన్న నీటి ఆవిరితో కలిసి oxidize అయ్యి రాగి లోహానికున్న సహజమైన ఎఱ్ఱరంగు కాస్తా ఆకుపచ్చగా మారింది. పూర్తి ప్రతిమ ఆకుపచ్చగా మారడానికి దాదాపు ముప్పై ఏళ్ళు పట్టిందట. 

    లేడీ లిబర్టీని ఊహించి శిల్పమూర్తిగా ప్రతిష్ట చేసిన  ఫ్రెంచ్ శిల్పి పేరు: F. A. బార్తోల్డి. 

    లేడీ లిబర్టీ ముఖకవళికలు బార్తోల్డి తల్లిగారిని పోలివుంటాయి. 

    ఆ మ్యూజియం లోనే అమెరికన్ కవయిత్రి ఎమ్మా లాజరస్ రాసిన The New Colossus (నవ మహామూర్తి ) అనే అద్భుతమైన కవిత కూడా చదివాను. 

    ఇంకా - ఏం చూశానంటే - ఒక బుజ్జి స్నూపీ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా చూశాను. కాకపోతే ఫోటో తీసుకోవాలని ఒకట్రెండు సార్లు అనిపించినా 'వద్దులే' అనుకుని తీసుకోలేదు. అలాంటి స్నూపీ బొమ్మ మాత్రం దొరికితే కొనుక్కుందామనుకున్నాను. కానీ దొరకలేదు. 

     మ్యూజియం చూశాక మళ్ళీ క్రూజ్ బోట్ ఎక్కి వెనక్కి వచ్చేశాం. ఈసారి క్రూజ్ బోట్ ఎల్లిస్ ఐలాండ్ దగ్గర ఓ ఐదు నిముషాలు ఆగింది. అక్కడ న్యూ యార్కుకి ఓడల్లో వలస వచ్చే వారి కోసం ఏర్పడిన  మొట్టమొదటి ఇమ్మిగ్రేషన్ సెంటర్, మ్యూజియం ఉంటాయట. కాకపోతే మేము దిగదల్చుకోలేదు. 

    మేము క్రూజ్ బోటులోబాటరీ పార్కుకి తిరిగి వచ్చేటప్పుడు బోట్ పై అంతస్తులో కూర్చున్నాము. అక్కడ పైకి గాలి వదిలే ఒక విండ్ పైపు దగ్గరకి ఒక సీ-గల్ పక్షి వచ్చింది. 

    ఆ పైపు లోంచి వచ్చే గాలి ఆ పక్షి రెక్కల్లో దూరేటప్పటికి ఆ పక్షి కొంచెం తూలింది. ఒక క్షణం దానికేం అర్థం కాలేదు. హడావిడిగా ఆ పైపుకి దూరంగా పారిపోయింది. 

    కానీ ఇంకో క్షణం లోనే వెనక్కి పైపు దగ్గరికి వచ్చి గాలిని కవ్విస్తున్నట్టుగా అక్కడక్కడే ఎగరడం - గాలి తగిలి తూలగానే దూరంగా ఎగిరిపోవడం - మళ్ళీ తిరిగి రావడం - గాలితో సీ-గల్ చెలగాటం మాకు మాత్రం మంచి కాలక్షేపమయ్యింది.  

*******
*******

    క్రూజ్ బోట్ దిగుతూనే ఓ పదిహేను నిముషాలు నడిచి "ఆహార్" అనే restaurant కి వెళ్ళాం అనే కన్నా సుహాస్ చేత తీసుకెళ్ళబడ్డాం - న్యూ యార్క్ వాడికి కొట్టిన పిండి, నడిచిన నల్లేరు మరి. అక్కడికి వెళ్ళగానే కావాల్సినవి order చేసి అవి వచ్చేలోగా కబుర్లు  చెప్పుకుంటూ వున్నాం. 

    ఇంతలో "ఆహార్" కి ఓనరో, మేనేజరో ఒకతను వచ్చి నాతో "మేడం! వేడివేడిగా టీ తాగుతారా?" అని అడిగాడు. 

    చలిలో వచ్చామని కనిపెట్టి వేడివేడి టీ ఇస్తానంటున్నాడు - ఎంత మంచివాడో అని మురిసిపోయి అతనిచ్చిన మగ్గుడు టీ ఓ పది గుక్కల్లో ఖాళీ చేసేశా. 

    ఇక ఆ తర్వాత తిన్న భోజనం ఎంతో రుచిగా అనిపించింది. నిజానికి అంత బాగా లేదు. కానీ టీ తాగిన కృతజ్ఞత ఆ రుచి-రహితాన్ని కూడా మహాహితమనుకునేట్లు చేసింది. 

    అందరం భోంచేసేశాం. బిల్ వచ్చింది. ఆహారం తిన్నది నలుగురైతే "ఆహార్" వాళ్ళు ఆరుగురికి బిల్లు వేశారు. దాన్ని సరి చేయించుకోవడానికి ఓ అరగంట పట్టింది. 

    ఎప్పుడూ ప్లేట్లో పెట్టిన దాన్ని చెల్లు వెయ్యడమే తప్ప బిల్లు చూడడం అలవాటు లేని నేను అనుకోకుండా బిల్లు చూస్తే అందులో టీ  అని రాసి పక్కనే - దాని ధర - ఒక సెంటు తక్కువ ఆరు డాలర్లు అని కనిపించింది. 

    అది చూడగానే "న్యూ యార్క్‌లో ఏదీ ఉచితంగా దొరకదు" అన్న మా ఊబర్-సారథి సీజర్ చేసిన న్యూ యార్క్-గీతా బోధ గుర్తుకొచ్చి "అన్నన్నా! ఎంత మాట! మనకు టీలు ఫ్రీలు పోయరూ" అని ఝుమ్మనుకున్నా!

    అక్కడికి మధ్యాహ్న-ఆహార కార్యక్రమం సమాప్తం. 

    అక్కణ్ణించి - సబ్‌వే ఎక్కి దిగి, మెట్లు దిగి ఎక్కి, ఎలివేటర్ ఎక్కి దిగి - హోటల్ రూంకి చేరుకున్నాం. 


*******
*******


    ఇక ఆ రోజు సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళి ఈ వీధి నుంచి ఆ వీధి చివరి వరకు ఊరంత ఉండి - ఆకాశాన్ని తాకుతున్నట్టున్న బోల్డన్ని అంతస్తుల మేసీస్ (Macy's) స్టోర్‌లో అడుగు పెట్టి - అన్ని అంతస్తుల్లో అమ్మకానికి పెట్టినవన్నీ చూసి - కిందకి దిగి బయటికి వచ్చేశాం. అంత పెద్ద ఆపణం లోనూ పణం పెట్టి కొనుక్కోదగ్గవేవీ నాక్కనిపించలేదు. 

    సాయంత్రం బయటికి బయల్దేరే ముందే అనుకున్నాం - రాత్రి భోజనం శరవణ భవన్లో అని. అందుకని మేసీస్ లోంచి బయటికి రాగానే శరవణ భవన్  వైపు నడవడం మొదలు పెట్టాం. 

    అప్పటికి పొద్దున్నించీ నడిచిన ఎనిమిది మైళ్ళ నడకకి నా కాళ్లకున్న షూస్ కొంచెం tight గా అనిపించడం మొదలయి పాదాలు నొప్పి రావడం మొదలుపెట్టాయి. కానీ అప్పటికే ఆకలి వేస్తోంది. అందుకని కుయ్-కుయ్ మని కుంటుకుంటూనే శరవణ భవన్ దాకా నడిచాను. అక్కణ్ణించి హోటల్ రూంకి కూడా నడిచే వచ్చాము. 

    రాత్రి వెలుగుల్లో ధగధగలాడే నగలు పెట్టుకుని వగలు పోతున్నట్టుండే నగర-రాణిని చూస్తూ - ఆ వీధుల్లో  నడవడం నాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ముందు కాలు నొప్పి అన్న కష్టం చిన్నదయ్యింది. 

    శరవణ భవన్ నుంచి హోటల్ రూంకి మాతో పాటు వచ్చి ఓ పది నిముషాలుండి సుహాస్ వాడి అపార్టుమెంటుకి వెళ్ళిపోయాడు. 

    బద్రి స్నానం చేసి హాయిగా పడుక్కున్నారు. నేనేమో క్రితం రాత్రి చెయ్యకుండా మిగుల్చుకున్న సంస్కృత గృహకార్యం (homework) చేసేశాను. బుజ్జిజింక ఫోన్లో - స్పాటిఫైలో పాటలు విన్నాడు. 

    మరుసటి రోజు థాంక్స్-గివింగ్. ఎక్కడికీ వెళ్లే ప్లాన్ ఏమీ లేదు - మధ్యాహ్నం లంచ్ తర్వాత సుహాస్ అపార్టుమెంటుకి వెళ్లడం తప్ప. 

    అందుకే పాటలు వింటున్న బుజ్జిజింక పక్కనే కూర్చుని "Summer Lightining" చదవడం మొదలు పెట్టాను. 


*******
*******

    ఈ రోజుకి మెరుపులా కనిపించిన విశేషమేంటంటే మధ్యాహ్నం హోటల్ రూంకి తిరిగొస్తున్నప్పుడు టైమ్స్ స్క్వేర్‌ మీద మెరిసిన ఇళయరాజా బొమ్మ.  ఫోటో తీసేలోగా మాయమయ్యింది. మళ్లీ కనిపించనే లేదు. రేపు కనిపిస్తుందేమో చూడాలి.  


 <<తరువాతి కబుర్లు తొందర్లోనే...>

6 కామెంట్‌లు:

  1. Spellbound!

    why? not sure exactly. many mixed feelings. your trip details to me, are the ink and paper to convey many other wonderful and thoughtful things (?)(lack of better words as always).

    రిప్లయితొలగించండి
  2. 1. అంత పెద్ద ఆపణం లోనూ పణం పెట్టి కొనుక్కోదగ్గవేవీ...
    2. చెల్లు వెయ్యడమే తప్ప బిల్లు చూడడం
    3. కానీ లేడీ లిబర్టీ మ్యూజియంలో ఉన్న వలస వచ్చిన వారి కథలు చదివాక - పగలూ-రాత్రీ లేకుండా ఉన్నచోట ఉండలేక, విడుదల కోరుకుని అవకాశాల అమెరికా భూమికి ఓడల ఇరుకుగదుల్లో కూరుకుని - కుక్కుకుని వచ్చే శరణార్థులకి beacon light చూపిస్తూ నించునే స్వేచ్ఛామూర్తి మొహంలో ఆ మాత్రం వ్యాకులత కనిపించేలా చెక్కడం చాలా గొప్ప ఆలోచన అనిపించింది. ..and the poem above these lines!
    4. చందురుణ్ణి అటకెక్కించి - చుక్కల దులపరించి ...

    Thank you so much!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్‌లో నచ్చినవాటిని మెచ్చి చూపినందుకు బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  3. ఎప్పటి లాగే బాగుంది!
    స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మేము చూసినప్పుడు ఎందుకో నేను ఎదురు చూసినంత గొప్ప అనుభూతి కలగలేదు. ఆ మెయింటెనెన్స్ చూసి కొంత నిరుత్సాహం కలిగింది. ఏదో లోకల్ అట్రాక్షన్ లా ఉంది తప్పించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక స్థలంలా అనిపించలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్‌ని క్రమం తప్పకుండా చదువుతున్నందుకు చాలా థాంక్స్, దీపగారూ! నేను అంతగా expect చేయకుండా వెళ్లినందుకో ఏమో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నన్నంతగా నిరాశ పరచలేదు.

      తొలగించండి