10, అక్టోబర్ 2021, ఆదివారం

సున్నాలెయ్ ...బోల్డు సున్నాలెయ్!

    కన్యాశుల్కంలో గురువు-గిరీశం శిష్యుడు-వెంకటేశాన్ని "క్రియేషన్ అనగానేమిటి? అనడిగిన స్టైల్లో - ఎవర్నైనా అదాటున ఆపి "సున్నాలు ఎన్ని రకాలు?" అనడిగితే ఏమని చెప్తారు?

    ప్రశ్న చిన్నదే... 

    ప్రశ్న పరిధి మాత్రం అడిగిన సందర్భాన్ని బట్టి రకరకాల సమాధానాలు వచ్చేటంత పెద్దది. 
    
    ఉదాహరణకి కొత్తగా ఇంటికి రంగులేయించుకున్న వాళ్ళని అడిగామనుకోండి - వాళ్ళు "ఇంటికి వేసే వెల్ల సున్నాలు ఓ రకం" అని చెప్తారు. 

    అప్పుడే ఏ ప్యారడైజ్ బిర్యానీనో, ఏ శరవణ భవన్ ఇడ్లీ-దోశ కాంబోనో తిని - ఆ పక్కనే వున్న దేశీబజార్లో కిళ్ళీ కట్టించుకున్న భుక్తాయాస-వరులని అడిగామనుకోండి - వాళ్ళు "ఆకు-వక్కలకి తోడుగా నోరు పండించే, మరీ ఎక్కువైతే నోరు పొక్కించే తమలపాకుల సున్నం ఇంకో రకం" అని చెప్తారు. 

    అదే లెక్కలెక్కువ చేసేసి, లెక్కప్రకారం లెక్కల్లోనే బతికే వాళ్ళని అడిగామనుకోండి "ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకె బరువు పెంచేసే నిండుసున్నాలూ వున్నాయి. అలాగే అనుకోకుండా పరీక్షల్లో వచ్చేసి అమాంతం పరువు దించేసే దశాంకపు గుండుసున్నాలూ వున్నాయి" అని చెప్పేస్తారు. 

    ఇహ తెలుగు భాషని అబ్బురంగా చదువుకునే తెలుగులని అడిగితే "అ పక్కన మొదలెట్టి క నుంచి ఱ వరకు - అం, కం, ఱం అంటూ - అక్షరాల పక్కన పెట్టే అనుస్వారపు నిండుసున్నాలు మరింకో రకం" అని చెప్తారు. 

  అసలూ ... శంకరాభరణం శంకరశాస్త్రిగారు అరుగు మీద కూర్చుని హార్మణీ వాయిస్తున్న దాసుకి ఏం చెప్పారో జ్ఞాపకం వుందా? "ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది, శృతి వుంది, స్వరం వుంది"  అని కదా! 

    దాన్ని నా సున్నాలకి అన్వయిస్తే  "ఒక్కొక్క 'సున్నాలు' అనే పదానికి ఒక్కో నిర్దిష్టమైన అర్థం వుంది, భావం వుంది, జ్ఞాపకం వుంది" గా మారుతుంది. 

    కద... కదా! 


*******
*******

    
    చిన్నప్పుడు - అంటే ఇంకా హెడ్డు పైకి రానప్పుడు (literally & figuratively ) "సున్నా ఉభయాక్షరం" అని చదివినప్పుడు తెలుగులోనూ, లెక్కల్లోనూ వస్తుంది కాబట్టి అలా అంటారనుకునేదాన్ని. 

    తెలుగులోనూ, లెక్కల్లోనూ సున్నా వస్తుంది అంటే నేను రాసిన పరీక్షల్లో మార్కుల రూపంలో కాదండీ... కాదు... 

    "అ పక్కన సున్నా పెడితే అం" అని తెలుగులో చదువుతాం; "ఒకటి పక్కన సున్నా పెడితే పది" అని లెక్కల్లో నేర్చుకుంటాం - కదా! అందుకే సున్నాని "ఉభయాక్షరం" అంటారు అనుకునేదాన్ని. 

    తర్వాత్తర్వాత కొంచెం పెద్ద తరగతుల్లో తెలుగు వ్యాకరణం చదువుకున్నప్పుడు నాకర్థమైన విషయాలు ఏంటంటే...  

    "అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః" అని చదువుకున్న అచ్చుల్లో చివరగా వచ్చే "అం అః -

లు" రెండూ అచ్చంగా అచ్చులే కాదని. 

    ఆ రెండిటినీ అచ్చుల్లో కలిపేశారు కానీ అవి అచ్చులకీ, హల్లులకీ  - చెందిన, చెందని, చెందీచెందని - ఉభయాక్షరాలని. 

    అంతే కాకుండా అవి రెండూ కూడా ఉభయాక్షరాలు అనబడే "అరసున్న, నిండుసున్న, విసర్గ" అన్న మూడక్షరాల గుంపు లోవని తెలిసింది. 

    ప్రస్తుతానికి అరసున్న, విసర్గ జోలికి వెళ్ళను కానీ చూపులకి గుండ్రంగా, అందంగా కనిపించి - పలుకులకి నిండుగా, చందంగా వినిపించే నిండుసున్న గురించి ఇన్నేళ్ళకి నే నేర్చుకున్న విశేషాన్ని గురించిన బోల్డన్ని కబుర్లు చెప్పేసుకుంటా. 


*******
*******




*******
*******


    అసలు "నిండుసున్న" అన్నమాట వింటే నాకు మొట్టమొదటగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? గుండ్రంగా వుండి, కనిపించినంత మేరా పండువెన్నెల పంచి పెట్టేసే నిండుచందమామ. 

    ఆ వెంటనే, వెనువెంటనే గురొచ్చేది "సున్నాలెయ్" పాట. 

    కాసేపు నా సున్నా-కబుర్లు పక్కనెట్టి ఈ "సున్నాలెయ్" పాట కబుర్లు చెప్తా. It takes all sorts to make a blog అన్నది నా-నుడి కాబట్టి. అంతే కాకుండా variety is the spice of blog కూడా కాబట్టి. 

    అందుకే ఇవాళ్టి కబుర్లు రకరకాల సున్నాల గురించి - కలగాపులగంగా. 

    మొదటగా "సున్నాలెయ్" పాట గురించి. 

    అనగనగా ఓ పాత హిందీ సినిమా. దాని పేరేమో "గోరా ఔర్ కాలా". 

    ఇందులో ఒక తెల్లరాజేంద్రకుమారు, ఇంకో నల్లరాజేంద్రకుమారు వుంటారు. 

    అందులో ఓ రాజేంద్రకుమారుకి రాజకుమారిగా ఉట్టుట్టినే నవ్వేసే హేమ్మాల్ని వుంటుంది. 

   ఇంకా అందులో ఓ పాటుంటుంది. 

    ఆ పాటనేమో పచ్చచొక్కా వేసుకున్న తెల్లరాజేంద్రకుమారూ. మిలమిల మెరిసే ఎఱ్ఱటి గౌనేసుకున్న హేమ్మాల్నీ - గడ్డిలో చెట్లకి వేళ్ళాడుతున్న తీగలు పట్టుకునీ, పడకుండా వుండడానికి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నడిచేస్తూ పాడేసుకుంటుంటారు. ఆ పక్కనే కత్తి చేత్తో పట్టుకుని తిరుగుతూ నల్లరాజేంద్రకుమారు కూడా కనిపిస్తాడండోయ్ - కొంచెం జాగ్రత్తగా చూస్తే. 

    ఆ పాటే "ధీరే ధీరే బోల్ .... కోయీ సున్ న లే...సున్ న లే - కోయీ సున్ న లే". 

    కానీ ఆ పాట ఎప్పుడు పాడుకున్నా "ధీరే ధీరే బోల్ ....కోయీ సున్నాలెయ్... సున్నాలెయ్...కోయీ సున్నాలెయ్" అనే నే పాడుకుంటా!

    అలా పాడుకున్నప్పుడల్లా - ఒక్కోసారి - "ఎదురింటికి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ పరమానందయ్యగారి శిష్యులని గుర్తుతెచ్చుకుంటా. 

    ఇంకొక్కోసారి "చేయని లెక్కలకి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ అప్పుడెప్పుడో డిగ్రీ ఫస్టియర్లో ఔటాఫ్-సిలబస్ పేపర్ రాయలేక డ్రాప్ చేస్తే నాకు లెక్కల్లో వచ్చిన మొట్టమొదటి-చిట్టచివరి గుండుసున్నా జ్ఞాపకంగా పాడుకుంటా. 

  

*******
*******

    ఇహ ఇప్పుడు కాస్సేపు తమలపాకుల సున్నం గురించి ఓ రెండు ముక్కలు. 

    ఇంతింత గుల్కన్ వేసేసి కట్టే మిఠాయి కిళ్ళీల్లో సున్నం సున్నా గానే అనిపిస్తుంది నాకు. 

    అదే చిన్నప్పుడు అట్లతద్ది రోజునాడు నాన్న తెచ్చినప్పుడో,  శ్రావణమాసం పేరంటాల్లో అమ్మకిచ్చిన తాంబూలాల్లో వచ్చినప్పుడో తమలపాకులు వేసుకునేవాళ్ళం చూడండి ... అప్పుడు ఇంట్లో ఒక లేతగులాబీ రంగు డబ్బాలో మంచి సువాసన వస్తుండే సున్నం వుండేది. దాన్ని కొనేటప్పుడు అమ్మ "సెంటెడ్ సున్నం" అని అడిగి మరీ కొనేది. నీటిచుక్క తగిలి వెన్నలా మారేది ఆ సున్నం. అది తాంబూలంలో ఎంత బావుండేదో! 

    వెన్నలాంటి సున్నం అంటే గుర్తుకొచ్చింది ఇంకో విషయం. 

     చిన్నప్పటి పాఠాల్లోనో, చిట్కాల్లోనో ఎక్కడ చదివానో సరిగ్గా గుర్తు లేదు కానీ  "కొబ్బరినూనెలో కలిపిన సున్నాన్ని నవనీతం అంటారని, దాన్ని దెబ్బలకి రాసుకుంటే తొందరగా తగ్గిపోతాయని" చదివిన జ్ఞాపకం సున్నాన్ని ఉన్నతంగా చూపిస్తూ - సున్నం ఎంతో సున్నితంగా అనిపిస్తుంది. 

    
*******
*******

    సున్నా గురించి ఏదో విన్నా - సున్నా గురించి ఎంతో నేర్చుకున్నా... అనుకున్నా. 

    నేననుకున్నదేదో మీతో చెబ్దామనుకున్నా. 

    చెబ్దామనుకున్నదేదో మర్చిపోయి "నా చిన్నప్పటి సున్నాలు" అంటూ సినిమాల్లోలా ఫ్లాష్-బ్యాక్ సున్నాలు చుట్టుకుంటున్నా.     

    ఇలాగే సున్నాల మీద పన్నాల కొద్దీ పన్నాలు వల్లించడం ఆపి ఇహ అసలు సున్నాల విషయానికొచ్చేస్తున్నా. 

    

*******
*******

        "అ పక్కన సున్నా పెడితే అం" అన్నంతవరకు బాగానే వుంది కానీ హల్లుల పక్కన సున్నా పెట్టినప్పుడు ఆ పదాలని పలికేటప్పుడు నాకు వ్యాకరణమూలాలు అంతగా తెలియకపోయినా ఒక్కో పదంలో సున్నాని ఒక్కోలా పలుకుతున్నానని నాకు తెలిసేది. 

    అదెలా అంటే... ముందో రెండు మాటలు తీసుకుంటాను. అందులో ఒకటి "అందరం". ఇంకోటి "అంబరం".  ఈ మాటలు పలికేటప్పుడు "అందరం" అనే మాటని "అన్+దరం" అనీ, "అంబరం" అనే మాటని "అమ్+బరం" అని పలుకుతున్నానని నాకే అనిపిస్తూ  వుండేది. 

    కానీ కొన్ని "సున్నా"తో కూడిన అక్షరాలున్న మాటలు పలికేటప్పుడు ఆ శబ్దం  "న్", కాదు, "మ్" కూడా కాదు అనిపించేది. 

    అవెలాంటి మాటలంటే "కంకణం, గంగ, కంచర" లాంటివి.  క పక్కన సున్నా పెట్టి పలికితే అది కచ్చితంగా కన్నో, కమ్మో ("కన్" ఓ, "కమ్" ఓ) కాదనిపించేది. 

    అసలే నాకో సందేహం - క పక్కన సున్నా పెడితే కన్నా, కమ్మా అని. దానికి సాయం బద్రికి వచ్చిన ఇంకో సందేహం "సంక్రాంతి" లో "సం" - అది సన్నా (సన్) లేక  సమ్మా (సమ్) అని. 

    అప్పుడే రాసుకున్నా (సమ్)(సన్)క్రాంతి కబుర్లు  అని ఓ బ్లాగ్. 
    
    అప్పటి ఆ సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికింది. ఈ మధ్యనే "సంస్కృతభారతి" వారి రెండు సంవత్సరాల "సంభాషణతః శాస్త్రపర్యంతం" అనే ఓ సంస్కృత దూరవిద్యా తరగతుల్లో విద్యార్ధినిగా చేరాను. 

    ఆ course లో భాగంగా వున్న నోట్సులో (టిప్పణి) చదివినప్పుడు తెలిసింది అనునాసికాక్షరాలు తమతమ వర్గాక్షరాల పక్కన అనుస్వారాలుగా మారతాయి అని.  

    అదెలా అంటే... 

    సంస్కృతంలో లాగే తెలుగులో ఐదు ప్రత్యేకమైన అక్షరాలు ఉన్నాయి. 

    అవి "ఙ; ఞ; ణ; న, మ".  

    ఈ ఐదు అక్షరాలని ముక్కుతో అంటే నాసికతో పలుకుతాం కాబట్టి వీటిని "అనునాసికాక్షరాలు" అంటారు. 

    ఈ ఐదు అనునాసికాలుకూడా  హల్లుల్లో "క నుంచి "మ" వరకు వుండే వర్గాక్షరాల్లో వున్న ఐదు వర్గాల్లో వుండే చివరి అక్షరాలు. 

    అదెలాగో ఈ కింద చెప్తాను.  

    క వర్గం: క ఖ గ ఘ 
    చ వర్గం: చ ఛ జ ఝ 
    ట వర్గం: ట ఠ డ ఢ ణ 
    త వర్గం: త థ ద ధ  
    ప వర్గం: ప ఫ బ భ

    ఇప్పుడు ఈ అనునాసికాలు సున్నాలు ఎలా అవుతాయంటే ఒక పదంలో సున్నా పక్కన వెంటనే వచ్చే అక్షరాన్ని బట్టి ఆ సున్నా శబ్దం నిర్ణయించబడుతుంది. 

    అ పక్కన సున్నా పెడితే "అం" అంటాము. కానీ ఆ సున్నా పక్కన వచ్చే అక్షరాన్ని బట్టి ఆ "అం" కి  వచ్చే శబ్దం నిర్ణయించబడుతుంది. 

    అంకణం=అ+ఙ+కణం (క ఖ గ ఘ ఙ)
    అంచనా=అ+ఞ+నా (చ ఛ జ ఝ ఞ)
    అండము=అ+ణ్+ము (ట ఠ డ ఢ ణ)
    అందము=అ+న్+ము (త థ ద ధ )
    అంబరం=అ+మ్+రం (ప ఫ బ భ మ)

    కాకపోతే ప్రస్తుతం మనం మాట్లాడే తెలుగు వ్యావహారికంలో ఙ, ఞ, ణ్ శబ్దాలు వచ్చే అనుస్వార (నిండుసున్నా) శబ్దం సాధారణంగా "న్" గా వినిపిస్తుంది. 

*******
*******

    ఇక్కడ ఇంకో విషయం. 

    మా అమ్మ పేరు పేరిందేవి. నాకు ఆ పేరు చాలా ఇష్టం - మా అమ్మ పేరు కాబట్టి. 

    అంతే కాకుండా ఆ ఇష్టానికి ఇంకో కారణం చిన్నప్పుడు చదువుకున్న పల్నాటి యుద్ధపు కథల్లో నాయకురాలు నాగమ్మకే ఎదురునిలిచి తిట్టెయ్యగలిగిన పేరిందేవి (అలరాజు భార్య)  కూడా. 

    సరే! ఇంతకీ ఇక్కడ మా అమ్మ పేరు గురించి ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ తన పేరు ఇంగ్లీషులో రాసేటప్పుడు "PERIMDEVI" అని రాస్తుంది. కానీ నాకు అది "PERINDEVI" అయితే బాగుండునేమో అనిపించేది. అలా ఎందుకు అనిపించేదో మాత్రం నాకు అర్థం అయ్యేది కాదు.      

    కానీ ఇప్పుడు ఈ అనుస్వార సూత్రం తెలిశాక నాకు మా అమ్మ పేరు "PERINDEVI" అని రాయాలనిపించడం నాకు తెలియకుండానే తెలుగుని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాననిపించి భలే సంతోషంగా అనిపించింది. 

    పేరిందేవి = పేరి+న్+దేవి (త థ ద ధ )

    హమ్మయ్య! నాకిప్పుడు ఇక సంక్రాంతి గురించి ఏ సన్దేహమూ లేదు - అది కచ్చితంగా "స+ఙ+క్రా+న్ +తి".     


*******
*******


    నాకు ఈ బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు మరొక్కసారి గట్టిగా అనిపించినదేమిటంటే చెప్పాలనుకోవాలే గానీ - శూన్యం లోంచి కూడా కబుర్లు పుట్టించొచ్చని. 


*******
*******

    చివరాఖరిగా సున్నా గురించి నాదో మాట... 

    సున్నా... 
అది గుండుగున్నా -
మరి నిండుగున్నా -
ఎన్నదగినదన్నా!
పేరెన్నికగలదన్నా!
సున్నా కెన్నో వన్నెలన్నా... 
సున్నాని సన్నననుకోవలదన్నా... 
సున్నా ఎంతో మిన్నన్నా!
సున్నాకి పోటీ లేదన్నా!
సున్నాకి సాటి సున్నాయేనన్నా!

*******
*******




26, సెప్టెంబర్ 2021, ఆదివారం

"లవ్‌స్టోరి" చూశినామబ్బా!

    పాతపాత ఇంగిలీషోళ్ళు అప్పుడెప్పుడో అనేశారు కదా... There's many a slip 'twixt the cup and the lip అని!

    అంటే తాగే కప్పుకీ, అది తాకే లిప్పుకీ మధ్య బోల్డు స్లిప్పులుండొచ్చనీ... కప్పులోంచి తాగబోయినదేదో లిప్పుకి తాకకుండానే స్లిప్పయి పోవచ్చుననీ కదా - దానర్థం!

    దాన్ని నేనిట్ఠా రాసుకుంటా:  There's many a slip 'twixt the సినిమా-రావడం and దాన్ని-నేను-చూడడం. 

    అనగా... సినిమా వచ్చినా నేను దాన్ని చూడడం అనేది ఎలాంటి స్లిప్పులూ లేకుండా జరగాలంటే ఎన్ని కుదరాలో!

    నేనెప్పుడో రాసి పెట్టుకున్నా కదా... సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్! - అని. 

    తినే గింజల మీదా, నమిలే బ్రెడ్డుముక్కల మీదా, ఇంకా చెల్లని నూకల మీదా నా పేరు రాసి ఉన్నట్టే - తీసే సినిమాల సీను, సీను మీదా నా పేరు రాసి వుంటేనే - ఆయ్! అప్పుడేనండి - ఆ సినిమా టిక్కెట్టు ముక్క నా పేర్న కొయ్యబడేది. 

    ఆయ్! అది నిజమండి! నేనేదన్నా సినిమా చూసి రాగానే నాకల్లాగే అనిపిస్తుందండి.
అదెలాగో చెప్తా వినండి. 

*******
*******

    ఈ సినిమాలు తీసేవాళ్ళున్నారు కదా! ఓ సిన్మా  తీస్తున్నారనుకోండి! అదేమన్నా వంటింట్లో వండే వంట లాగా చడీ-చప్పుడూ లేకుండా చేసేస్తారనుకుంటున్నారా?

    సినిమా తీయడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి - సినిమా తీస్తున్నామని చెప్తుంటారు. 
చెప్తూనే సినిమా తీస్తుంటారు. 

    తీస్తున్నప్పుడే  - తీస్తున్న సినిమాలోని పాటలు, అక్కడక్కడి మాటలు - టీవీల్లో, యూట్యూబు వీడియోల్లో - చూడబోయే సినిమాని రుచి చూపించడానికో, అరుచిగా ఉన్నా అలవాటు చేసి చూపించెయ్యడానికో వేస్తుంటారు. 

    అలా చేస్తూ చేస్తూ ఉండగానే సినిమా తీయడం పూర్తి చేస్తారు.  

    ఇక ఆ సినిమా ఎక్కడ వస్తుందీ అనుకుంటే - అక్కడ థియేటర్లోనా, ఇక్కడ ఓటీటీలోనా అని ఊరిస్తారు. 

    మొత్తానికి ఎక్కడోక్కడ సినిమా వేసేస్తారు.  

*******
*******

    అప్పుడు - ఆ సినిమా నేను చూడాలీ అంటే ఏమేం కావాలీ? ఏమేం కుదరాలీ ? ఇప్పుడు చూద్దాం! 

    సినిమా నేనెప్పుడూ ఒంటరిగా చూడను.  నాతో పాటు బద్రి ఉంటేనే చూస్తాను. లేకపోతే అందులో మజానే వుండదు. సినిమా చూడడం కంటే చూసింతర్వాత దాన్ని గురించి మేం మాట్లాడుకునే మాటలు నాకు బోల్డు ఇష్టం. 

    ఓటీటీలో అయితే పెట్టిన మొదటి పది నిముషాల్లో బోర్ కొట్టకుండా ఉంటే చాలు. చూసేస్తాం. ఆ తర్వాత నచ్చితే ఆ రోజే పూర్తిగా చూసేస్తాం. నచ్చకపోతే రోజుకో అరగంట చొప్పున కుదిరినప్పుడు చూస్తాం. అలాంటప్పుడు అప్పటప్పటి కాలక్షేపం తప్ప ముందు జరిగిన కథ గురించి ఆట్టే పట్టించుకోం.  

    అదే సినిమా థియేటర్లో వచ్చిందనుకోండి! మరప్పుడు - ఏమేం కావాలీ? ఏమేం కుదరాలీ ?

    ముందుగా ఆ సినిమా మా ఊళ్ళో వున్న థియేటర్లోకి వచ్చుండాలి. 

    అలా వచ్చిందని నాకు తెలిసుండాలి. 

    ఆ సినిమా వీకెండులో చూసే వీలుండాలి. 

    సినిమా  మొదలయ్యే టైము - రాత్రి ఎనిమిది తర్వాత అయుండాలి. 

    ఆన్లైన్లో టిక్కెట్లు వెతికితే పై రెండు వరుసల్లో ఒకదానిలో - మరీ మూలకి కాకుండా ఓ రెండు సీట్లు ఉండాలి. 

    వీటన్నింటికన్నా ముందు సినిమా తీసిన దర్శకుడో, హీరోనో, హీరోయిన్నో - ఎవరో ఒకరు నాకు నచ్చాలి. 

    ఇన్ని కుదరాలంటే - నేను ముందే అన్నట్టు - సినిమా సీనుసీను మీద నేను చూడాలని రాసుండాల్సిందే!

    నిన్నటికి నిన్న ఇల్లాంటివన్నీ కుదిరి -  సినీ-మా-కాలం కలిసొచ్చి ఓ సినిమా థియేటర్లో చూశాం. 

    ఆ సినిమా కబుర్లే ఇవాళ్టి బోల్డన్ని కబుర్లు. 


*******
*******





    సినిమా పేరు - లవ్‌స్టోరి. దర్శకుడు శేఖర్ కమ్ముల. 

    ఈ సినిమా శేఖర్ కమ్ముల చెప్పాలనుకున్న sensitive విషయాలన్నీ - ఒకేసారి చెప్పెయ్యాలన్నట్టు  రాసుకుని చెప్పిన కథ. 

    సినిమాలో చూపించిన కొన్ని విషయాలు అంత సమకాలీనంగా అనిపించకపోయినా (పటేల్ ముందు చెప్పులు విడిచి నడవాలి లాంటివి) నేను వాటిని అంతగా పట్టించుకోలేదు. 

    అలాంటివి ఇంకా కొన్ని ప్రదేశాల్లో జరుగుతున్నాయేమో! అవి దర్శకుడు చూశాడేమో - అనుకుని అతను చెప్పిన కథని చెప్పినట్లు విన్నా! 

    కొత్త సినిమా వస్తే అది ఏ మాత్రం బావున్నా "భలే వుంది" అనుకుని చూసేసే నాకు ఈ సినిమా నచ్చిందబ్బా!


*******
*******

    సినిమా మొదటి రెండు తెరల్లోనే - ఓ రెండు పంటికింద రాళ్ళు. కంటిలో నలుసులు. 

    అవేంటంటే ప్రేమని నిర్వచిస్తూ రాసిన ఓ నాలుగు వాక్యాల్లో "కంచె" బదులు "కంచ", "యుద్ధం" బదులు "యుద్దం" లాంటి తెలుగుమాటలు, వాటితో పాటు సరిగా లేని వాక్యనిర్మాణం.

    సినిమాలో మాటలు-పాటలు-ఆటలు, రంగులూ-హంగులతో పాటు ఆ ముందు రాసి చూపించే మాటల్లో కూడా శ్రద్ధ వుంటే బావుండునేమో అనిపించింది. 

    ఎందుకంటే ముందుముందు తరాలు ప్రామాణికంగా తీసుకోబోయేది సినిమాలే. ఈరోజుకీరోజు సినిమాలో ఫేవరేట్ హీరోనో, హీరోయినో చెప్పిందే వేదం - చేసిందే ఆమోదం. 

    అందుకే సినిమాల్లో ఏ మాత్రం మంచి చెప్పే అవకాశం వున్నా దాన్ని వాడుకుంటే బావుండుననిపిస్తుంది. 

    సినిమా తెర మీద రాసిన భాష గురించిన ఘోషా-కంఠశోషా వదిలేస్తే - "లవ్‌స్టోరి" సినిమా నాకు నచ్చింది. 

    నాగచైతన్య చేసిన జుంబా-డాన్స్ బావుంది. 

    సాయిపల్లవి తన బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడు అది కలా-నిజమా అనుకుంటున్నట్టు, అంతలోనే అది నిజమే అని తనలో తనే నవ్వీనవ్వకుండా నవ్వుకోవడం బావుంది. 

    ఆశ, ఆశయం, ఆవేశం, ఆక్రోశం, ఇష్టం, ప్రేమ, పట్టుదల, నిస్సహాయత, తెగింపు - ఇలా అన్ని రకాల భావాలనూ, భావావేశాలనూ ఎక్కడా వంక పెట్టలేనట్టు నటించగలడు నాగచైతన్య అనిపించాడు ఈ సినిమాలో. 

    సాయిపల్లవి నాకు చాలా ఇష్టమైన dancer. ఇప్పట్లో తెలుగు సినిమాలో ఈ అమ్మాయిని మించిన నర్తకిని చూడబోము. Technicality ని మించిన grace వుంది తనలో. తెర మీద సాయిపల్లవి వుంటే మెరుపుతీగ మెలికలు తిరిగినట్టే! దానికి తోడు ఆడపిల్లకి అందాన్నిచ్చే - కనీకనిపించని సిగ్గు, దాంతో పాటే నవ్వితే వెలిగే కళ్ళు సాయిపల్లవికి సహజాభరణాలు. 

    ఈ సినిమాలో నాగచైతన్యకి అమ్మగా నటించింది - ఒకప్పటి బాపు బొమ్మ ఈశ్వరీ రావు (రాంబంటు సినిమా హీరోయిన్). నిజానికి ఈ సినిమాలో తను అసలు నటించినట్లే లేదు. ఒక తల్లిగా తనకి అనిపించినట్టు మసలినట్టనిపించింది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. 

    సాయిపల్లవికి తల్లిగా చేసిన దేవయానిని చూసిన వెంటనే ఓ పట్టాన పేరు గుర్తు రాలేదు. చూడగా చూడగా - అప్పుడెప్పుడో అరవడబ్బింగ్-అజిత్ సినిమా "ప్రేమలేఖ" లో రైలెక్కి దిగిన అమ్మాయి కదా - అని గుర్తొచ్చింది. 

    సినిమాలో అందరూ బాగా నటించారు - వాళ్ళ పాత్ర నిడివితో సంబంధం లేకుండా. 

    అన్నిటికన్నా నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే - రాజీవ్ కనకాలని  ఈ సినిమాలో కనిపించిన ఐదు నిముషాలకి చంపేయకుండా సినిమా చివరిదాకా ఉంచడం. "అతడు" సినిమాలో తెర మీద కనిపించిన రెండంటే రెండు నిముషాల్లో తుపాకీతో కాల్చేస్తారు. అప్పట్నుంచి నేను చూసిన ఏ సినిమా లోనూ రాజీవ్ కనకాలని సినిమా చివరి దాకా చూసిన గుర్తు లేదు. ఈ "లవ్‌స్టోరి" సినిమాలో ఇతన్ని చూస్తే - కనిపించిన ప్రతీసారీ "ఇదేం మనిషిరా!" అనిపిస్తుంది. కొట్టెయ్యాలన్నంత కోపం వస్తుంటుంది. అంటే విలన్‌గా రాజీవ్ అద్భుతంగా చేసినట్టేగా!

    ఈ సినిమా మొత్తంలో - నచ్చిన ఇంకొన్ని విషయాలు:

        హీరోయిన్ని, హీరోయిన్ వాళ్ళమ్మని బుఱ్ఱ లేనట్టు చూపించకుండా
 - ఆలోచించగలిగి నిర్ణయాలు తీసుకోగలిగే నిజజీవితపు ఆడవాళ్లలా చూపించడం.
 
        హాస్యపాత్రధారులని  హీరో చేత కొట్టించకపోవడం. 

        వయసులో పెద్దవాళ్లయిన హాస్యపాత్రధారులని హీరో చేత "ఏంట్రా, ఒరే" అనిపించకపోవడం. 

    సినిమాలో ఉన్న ఇళ్ళన్నీ బాపు-కుటీరాల్లా, కళాఖండాల్లా కాకుండా ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టు పరిసరాలని సహజంగా ఉంచడం.  

    ఈ సినిమాలో ముఖ్యంగా నచ్చినది - ఆడపిల్లలకి సంబంధించిన చాలా సున్నితమైన విషయాలని ఏ మాత్రం అసభ్యత లేకుండా - చెప్పాల్సిన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎంతో clean గా చూపించడం శేఖర్ కమ్ములకే చెల్లింది. దర్శకులకి కూడా నక్షత్రాలు ఇవ్వగలిగితే శేఖర్ కమ్ముల మాత్రం "శుభ్ర-నక్షత్రం" (Clean Star) అబ్బా! 

    ఇక పాటలు - అక్కడ సినిమాలో వినడానికి బానే ఉన్నాయి కానీ ఇప్పుడేమీ పాడుకునేంతగా గుర్తు లేవు. 

    గుర్తున్న రెండు పాటల్లో - ఒకటి - "నీ చిత్రం చూసి -  నా చిత్తం చెదిరి - నే చిత్తరువైతిరయ్యో!... ఇంచు  యించు లోన పొంచి వున్నఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో!" పాటలో మాటలు బావున్నాయి. "ఇంచు యించు (inch) బదులు ఇంకేమైనా అచ్చతెలుగు మాట పడి వుంటే ఇంకా బావుండేది. 

   ఇంకో పాట  "సారంగదరియా" మాత్రం సినిమాలో చూడడానికి బానే ఉంది కానీ - కానీ ఏంటో తేలిపోయినట్టనిపించింది. ఏదో missing! పాటలో హార్ట్ లేదబ్బా!

    
    చివరాఖరిగా ఈ సినిమాలో నాగచైతన్య గురించిన నా మాట "జీరోకెళ్ళి ఒచ్చినాడు సర్ ... శానా కష్టపడినాడు సర్!"

సైన్మా జూడాలె ... నచ్చితే జెప్పాలె !
ఇగో జెప్తున్నా... "లవ్‌స్టోరి" చూశినామబ్బా!  


~ సినీ-మా-లక్ష్మి 

13, సెప్టెంబర్ 2021, సోమవారం

పూజ వేసి, పూజ చేసుకున్నా...

    అనగనగా ఒక ఊళ్ళో - రెండు అరుగులు, మూడు నల్లబల్లలు, నలుగురు మాష్టార్లు, ఐదు తరగతులూ వున్న ఒక బడి. 

    ఆ బళ్ళో ఆ రోజు తెగ సందడిగా ఉంది. ఇంకో రెండ్రోజుల్లో భాద్రపద శుద్ధ చవితి - ౘలువజోతి ౘందమామ చవితిచంద్రుడై చిక్కిన రోజు - బుజ్జిపిల్లలకి ఇష్టుడైన బొజ్జదేవర పుట్టినరోజు మరి! అందుకే ఆ హడావిడి.   

    అంతకు ముందు రోజే రామశేషు మాష్టారు మమ్మల్నందరిని కొత్త నోటు పుస్తకాలు - మధ్యపేజీలో "పూజ" గీసుకుని రంగులేసుకుని తెచ్చుకోమన్నారు. 

    అప్పటికప్పుడు కొత్తవంటే ఎక్కణ్ణుంచి వస్తాయి? అందుకని అమ్మ ఇంట్లో ఉన్న ఒక దస్తా తెల్లపేపర్లని అట్టలేసే బ్రౌన్ పేపర్ మధ్యలో పెట్టి - అన్నిటినీ కలిపి - దబ్బనంతో నోటుపుస్తకంలా కుట్టిచ్చింది. 

    అందులో మధ్య పేజీలో నాలుగు పక్కలా చిన్న స్కేలుతో మార్జిన్లు గీసి - అందులో నాకు చేతైన కొండల డిజైన్ వేసి - నాన్న మైసూర్ నుంచి తెచ్చిన మైనం రంగులతో  ఆ కొండల డిజైనుకి ఎరుపు-ఆకుపచ్చ-పసుపు రంగులు వేశాను. 

*******
*******

    నాలాగే పుస్తకాలు కుట్టుకుని రంగురంగుల పూజలు గీసుకుని వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరెవరంటే... 

    మా మూడో క్లాసులో అందరికన్నా బాగా చదివే  గొట్టిముక్కల రంగరాజు, 
    అన్నతో సమానంగా పోటీ పడి చదివే రంగరాజు చెల్లెలు గొట్టిముక్కల సరోజిని,  
    మెయిన్ రోడ్డు కవతలున్న మిల్లు వాళ్ళమ్మాయి భవాని, 
    బాయమ్మగారి మనవడూ, సువర్చలా-బాబూరావు గార్లబ్బాయి - రాధాయ్, 
    బడి పక్కనే ఉన్న ఇంట్లోంచి ఒక చిందేస్తే బళ్ళోకొచ్చేసే చివుకుల రమణ, 
    రాజేశ్వరమ్మ గారి మనవరాలు రెండుపొడుగుజళ్ళ చైనం రమాదేవి, 
    రమాదేవి ఇంటి పక్కనే ఉండే రెండుపొట్టిజళ్ళ రాజేశ్వరి, 
    ఎంటీరామారావు కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో పుస్తకంలో పెట్టుకునే గాలి శీను, 
    నల్లతాడు-తాయెత్తు మెళ్ళో కట్టుకున్న కంసాలి శీను, 
    హైమవతమ్మగారి రమణ, కృష్ణ. 

    వీళ్ళందరితో పాటు - ఒంటి పోనీటెయిల్ వేసుకున్న నేను... 


*******
*******

    చుట్టూ నించున్న మా మూడో తరగతి పిల్లలందరి మధ్యనా - పేంటు రెండు కాళ్ళూ రెండేసి మడతలు పైకి మడుచుకుని - మఠం వేసుకుని కూర్చుని - మా అందరి నోటు పుస్తకాలూ బొత్తిగా పెట్టుకుని - ఒక పుస్తకం తర్వాత ఇంకో పుస్తకం అందుకుంటూ - అందుకున్న పుస్తకంలో మధ్య పేజీలో రంగురంగులుగా ఉన్న "పూజ" మధ్యలో నీలంరంగు ఇంకు, ఆకుపచ్చరంగు ఇంకూ మార్చి మార్చి వాడుతూ - ఒక ఓం, రెండు కంద పద్యాలు రాస్తూ - రాస్తున్న పద్యాలని తాను అంటూ, మాతో కూడా అనిపిస్తూ - చకచకా రాసేస్తూ - రాయడం పూర్తి చేసిన పుస్తకాన్ని - పేరుపేరునా పిలిచి - చుట్టూ నించున్న పిల్లలమందరికి అందిస్తూ - అక్కడ కూర్చున్నదెవరూ అంటే - మా రామశేషు మాష్టారు. 

    నా పుస్తకం అప్పటికే నా చేతిలో ఉంది. అందులో రాసిన రెండు పద్యాలూ - మొదటి రెండు సార్లూ - రెండేసి మాటలకొకసారి - కళ్ళు సగంసగం తెరిచి చూస్తూ చదివినా - ఆ పాటికి నాకు కంఠతా వచ్చేశాయి. 

    అంతకు ముందు రామశేషు మాష్టారు చెప్పిన తర్వాత పద్యాలు అంటూ ఉన్న నేను - ఇప్పుడు ఆయనతో పాటే అంటున్నా. నాతో పాటే రంగరాజు, సరోజినీ, భవానీ కూడా మాష్టారితో గొంతు కలిపారు.  


*******
*******

    నా చేతిలో ఉన్న పుస్తకం ఎంత బావుందో! నేను వేసిన "పూజ" మధ్యలో రామశేషు మాష్టారు శుక్లాంబరధరం శ్లోకమూ, రెండు తెలుగు పద్యాలూ రాసిచ్చారు. 

    ఆ రెండు పద్యాల్లో మొదటిది నాకు బోల్డు నచ్చేసింది. "అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్" అన్న మాటలు చదివినకొద్దీ చవులూరాయి, విన్నకొద్దీ చెవులూరాయి. 

    నేనెందుకలా అనుకున్నానో తెలీదు కానీ మొదటిసారి నాకుగా నేను చదువుకున్నప్పుడు  అటుకులకి, చిటిబెల్లానికీ మధ్యనున్న కొబ్బరి పలుకులని "పలుకులు" అని  కాకుండా "పటుకులు" అని చదువుకున్నాను. 

    ఆ తర్వాత రామశేషు మాష్టారు నేర్పించినప్పుడు సరిగ్గానే అన్నా - నాకు నేను చదువుకున్నప్పుడు మాత్రం "కొబ్బరి పటుకులు" అనే చదువుకునేదాన్ని. 

అటుకులు... కొబ్బరి పటుకులు ... చిటిబెల్లము ... 
అటుకులు ... పటుకులు ... చిటిబెల్లము ... 
టుకులు ... టుకులు ... టిబెల్లము ... 
టులు ... టులు ... టిలు ... 
టుకులు ... టుకులు ... టిబెల్లము ... 
అటుకులు ... పటుకులు ... చిటిబెల్లము ...
అటుకులు... కొబ్బరి పటుకులు ... చిటిబెల్లము ... 

    ఇలా ఎన్నిసార్లు చదువుకున్నానంటే కొబ్బరిపలుకులు నా పలుకుల్లో కొబ్బరిపటుకులు అయ్యేదాకా. 

*******
*******

    వినాయకచవితి రోజు పొద్దున్నే - ఒక స్టీలు ప్లేటులో బియ్యం పోసి, దానిమీద చిన్న అరిటాకుముక్క వేసి, ఒక పావలా నాచేతికిచ్చేది అమ్మ. 

    అవి జాగ్రత్తగా - గాలికి అరిటాకు ఎగిరిపోకుండా అదిమి పట్టుకుని - మేముండే మేడమీద ఇంటి మెట్లు దిగి - మా ఇంటికి రెండిళ్ళ అవతలున్న కంసాలి శీను ఇంటికెళితే - అప్పుడే నూనె రాసి అచ్చుపోసిన బంకమట్టితో చేసిన నిగనిగలాడుతూ మెరిసిపోయే వినాయకుణ్ణి నా చేతిలో వున్న స్టీలుప్లేటులో అరిటాకుముక్క మీద జాగ్రత్తగా పెడుతూ - కంసాలి శీను ఏమనేవాడో తెలుసా? 

    "లల్లీ! ఈ వినాయకుడి బొమ్మలు నేనే చేశా. నువ్విచ్చే డబ్బులన్నీ నావే తెలుసా?" అంటూ డబ్బులెయ్యడానికి చిల్లు పెట్టి డిబ్బీలా చేసుకున్న గులాబీరంగు పాండ్స్ పౌడర్ డబ్బా గలగల్లాడించేవాడు. 

    ఆ క్షణంలో కంసాలి శీను బోల్డంత గొప్పవాడైపోయినట్టనిపించేవాడు - వినాయకుడి బొమ్మలు చెయ్యడమే గొప్ప అనుకుంటే, ఆ బొమ్మలు అమ్మిన డబ్బులు కూడా తనవే అంటే...మరి గొప్ప కాక ఇంకేంటి? 


*******
*******

    ఈసారి సెప్టెంబర్ 10న వచ్చిన వినాయకచవితికి పూజ కోసమని ముందు రోజు రాత్రి అన్నీ సిద్ధం చేస్తున్నప్పుడు నేను నా మూడో తరగతి రోజుల్లోకి వెళ్ళిపోయా. 

    పైన చెప్పినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొచ్చాయి. దాంతో పాటే రంగురంగుల పూజ, పద్యాలు గుర్తుకొచ్చాయి. వెంటనే కిందటి నెల కొనుక్కున్న Essential Poetry Collection పుస్తకాలతో పాటు వచ్చిన ఒక journal ఉందని గుర్తుకొచ్చింది. 

    అంతే! చిన్నప్పుడు ఎలా వేశానో అచ్చు అలాగే "పూజ" వేసి, రంగులేసి, రామశేషు మాష్టారిని తలుచుకుని పద్యాలు రాసుకున్నాను. కాయితం చిన్నదై నే రాసిన కందాలు ఖండాలయ్యానుకోండి... కానీ నా చిన్నప్పటి గుర్తుతో పూజ వేసి, పూజ చేసుకున్నా!  



*******
*******



6, సెప్టెంబర్ 2021, సోమవారం

పోలాల అమావాస్య పూట - అప్పటికప్పుడు ఆశువుగా నాన్న పాట...

ఒక పాట ఎలా పుడుతుంది?
ఒకరు మాటలు పేరిస్తే ... 
ఇంకొకరు స్వరాలు కూరిస్తే ... 
వేరొకరు దరువేస్తే ... 
మరెవరో గొంతు సవరిస్తే ... 

ఇందరు సమకూడితేనే... 
కదా!

ఒక్కో పాట పుట్టాలంటే ఏం జరగాలి?
మనసు కదలాలి 
మాట మెదలాలి 
వరస కుదరాలి 
పదము పలకాలి 

ఇవన్నీ సమకూరితేనే... 
అవునా?!

*******
*******


    కానీ - పోలాల అమావాస్య పూట మా నాన్న పాడిన పాటకి ఇన్ని వివరాలు ఉన్నట్లు లేవు, అన్ని విశేషాలు అమరినట్లూ లేవు. అయినా ఆయన పాడిన పాట నాకు నచ్చేసింది. 

    "పాట భలే ఉంది, నాన్నా! మీరే కట్టారా?" అని నేనడిగితే ఫోనుకి అవతల నుండి గలగలలాడుతూ "కందమొక్క తెచ్చారు పొద్దున్నే పోలాలమావాస్య పూజ కోసమనీ - అంతే! పాట కట్టి పాడేశా!" నంటూ అహహ్హాలాడారు నాన్న. 

    పాటలో మాటలు అప్పటికప్పుడు అల్లుకుని - నీలం రంగు మూత పెట్టిన ప్లాస్టిక్ డబ్బా మీద దరువేసుకుని - మధ్యమధ్యలో మా అమ్మ నవ్వులని, కాలి మువ్వల సవ్వడిని కూడా కలుపుకుని - రెండు పాటల వరసలని వాడుకుని (ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మీ తల్లీ! అన్న పాట వరసలో మొదలుపెట్టి సీతారాముల కళ్యాణము చూతము రారండీ... అన్న పాట వరసని కూడా వాడేసుకుని) - పైగా చివర్లో - పాటని ఆపకుండా ఆశువుగా పాడేసుకున్నందుకు - మీకు మీరే  "శెభాష్!" అనేసుకోవడం - నాన్నా! మీ ఉత్సాహం భలే! భలే! బాగు... బాగు!

    ఇదిగో --- మీ పాట ఈ కింద రాసి పెట్టా... అంత కన్నా కింద యూట్యూబ్ లింక్ కూడా పెట్టా! కనండి... వినండి... కలకలమనండి! 



*******
*******

పోలమ్మ తల్లీ... రావమ్మా!
అమ్మా ... ఆ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న జననీ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!

కందమొక్కను - ఇంటికి తెచ్చి 
మొక్కకు చుట్టూ - ముగ్గులు పెట్టి 
కందమొక్కను - ఇంటికి తెచ్చి 
మొక్కకు చుట్టూ - ముగ్గులు పెట్టి 
పసుపు కొమ్ములు - చెట్టుకు గట్టి 
ఆ... ఆ... ఆ... ఆ... అఅఅఆ.... 
పసుపు కొమ్ములు - చెట్టుకు చుట్టి 
ప్రతిష్ఠ చేసి పూజించేము... 

పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న తల్లీ...  
పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న జననీ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!
అమ్మా ... ఆ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!


*******
*******


యూట్యూబ్ లింక్: Naanna Paata - YouTube




22, ఆగస్టు 2021, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 25 - కవలపాటలు - సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!

 ఓ నాడు - ఓ పాట  
ఇలలో... 
చలచల్లటి చినుకులా   
చెక్కిలి మీద సనసన్నగ జారి  
తడిపెళ్ళింది
మూసిన కనుల చాటున 
కలల రంగుల నేసింది   
ఆ చలువ - కొలవలేని చలిమి!
అది తా వలచిందే!

ఓ నాటి - ఆ పాట 
కలలో ... 
వెచవెచ్చని ఊపిరిగా 
కనురెప్పల మీద అలనల్లన తాకి 
తడిమెళ్ళింది 
మోసిన కలల మాటున 
కనుల వెలుగు పూసింది 
ఆ వేడిమి - విడువలేని పోడిమి!
ఇది కావలసిందే!

*******
*******

        ఒక్కోసారి - విన్నపాటునే - విన్న పాటొకటి 
        విడవబోవని రాగమై చుట్టుకుంటుంది. 
        ఆ రాగమే - ఇంకెప్పుడో ఇంకో పాటగా వినబడి 
        వెదకబోవని తీగగా సాగి పట్టుకుంటుంది 
    
        ఇహ అప్పట్నుంచి - 
        ఈ పాట కదిలితే ఆ పాటా - మెదులుతూనే వుంటుంది
        ఆ పాట మెదిలితే ఈ పాటా - కదులుతూనే వుంటుంది
        ఒకదానితో కలిసి మరొకటి - మెదులుతూనే వుంటుంది
        ఒకదాని తర్వాత ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
        ఒకటి మొదలిడి సాగిన పూట మరొకటి - మెదులుతూనే వుంటుంది
        ఒకటి ముగిసి ఆగిన చోట ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
        ఈ పాట - మెదులుతూనే వుంటుంది 
        ఆ పాట - కదులుతూనే వుంటుంది 

*******
*******

    చిన్నప్పుడు ఆ పాట మొట్టమొదటిసారిగా విన్నది - మాటలు పలక మీద రాసుకుని చూసుకుంటూ, కనబడ్డ కాయితాల మీదున్న మాటల్ని కూడబలుక్కుని చదువుకుంటున్న రోజుల్లో. 

    విన్నప్పుడు పాట లోని మాటలు అర్థమయేంత భాష తెలీదు కానీ పాటని మెచ్చడానికి భాష అవసరమనిపించని వయసు కాబట్టి - వినీ వినగానే పాట నచ్చేసింది. ఇహప్పట్నుంచీ రేడియోలో ఆ పాట ఎప్పుడు వినిపించినా - నచ్చిన చుట్టమేదో చెవుల ముంగిటి లోకి వచ్చినట్టనిపించేది. 

    చాలా ఏళ్ళ తర్వాత - ఐదవ తరగతి పూర్తయ్యి - ఆ వేసవి సెలవుల్లో హైద్రాబాదు ప్రభావతి దొడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు - అక్కడ బ్లాక్&వైట్ డయనోరా టీవీలో అసలుకి రంగురంగుల సినిమా అయుండీ నలుపు-తెలుపుల్లో కనిపించిన హిందీ సినిమా "రజనీగంధా" చూశాను. అప్పటికి హిందీ అక్షరాల స్థాయి లోనే వున్న నాకు ఆ సినిమాలో అర్థమయింది ఒకటే - రజనీగంధా అంటే - నాకు తెలిసిన - మంచి వాసనొచ్చే - తెలతెల్లని లిల్లీ పూలని! 

    అన్నట్టు లిల్లీ పూల గురించి ఇంకో ఇష్టమైన జ్ఞాపకం. కాకినాడలో మేము అద్దెకున్న సుబ్బారావు మాస్టారి ఇంటి ముందు నాయకర్ గారి మేడ వుండేది. ఆ ఇంట్లో పిల్లలు సపనా, సుమన, శ్రీనివాసులు నాకు స్నేహితులు. వేసవి సెలవుల మధ్యాహ్నాలు వాళ్ళింట్లోనో పాడుకుంటూనో , సాయంత్రాలు మా ఇంటి డాబా మీద ఆడుకుంటూనో మహ జోరుగా సాగిపోయేవి. ఆ నాయకర్ల ఇంట్లో చిన్నచిన్న కూజాల్లో మంచినీళ్ళలో లిల్లీపూలు వేసేవారు. మధ్యాహ్నపుటెండపూట ఆటపాటల్లో అలుపు తీరడానికి ఆగి - ఓ గుక్క ఆ లిల్లీపూల నీళ్ళు తాగుతుంటే - గొంతు లోకి చలచల్లగా జారిన ఒక పరిమళభరితమైన రుచి ఇప్పటికీ నాకు గుర్తే! 

    లిల్లీ పూల కబుర్లు ఇల్లిక్కడ ఆపి  - మళ్ళీ వెనక్కి మళ్ళి ఆ హిందీ సినిమా దగ్గరకెళ్తే ...రజనీగంధా సినిమా చూస్తూ వుండగా, వుండగా - ఓ టాక్సీలో హీరోయిన్ను, ఇంకొకతను ఎక్కి వెళ్తుండగా  - ఓ పాట మొదలవుతుంది. వాళ్ళు టాక్సీలో వెళ్తున్నంత సేపూ ఆ పాట వస్తూనే వుంటుంది. ఆ పాట గురించిన రెండు తమాషా జ్ఞాపకాలు ఏంటంటే... 

    ఒకటి - ఆ పాట అచ్చు నాకు అంతకు ముందు నచ్చిన తెలుగు పాటలా ఉండడం. 

    రెండో తమాషా విషయమేంటంటే... అదే మొదటి సారేమో నేను హైద్రాబాదు లాంటి పెద్ద సిటీకి వెళ్ళడం - అక్కడ టీవీలో సినిమా - అందులోనూ హిందీ సినిమా చూడడం. 

    ఆ పాట చూసింతర్వాత నేనేమనుకున్నానంటే - హైద్రాబాదు లాంటి ఊళ్ళలో మనం ఏదన్నా టాక్సీ ఎక్కితే అలా ఎక్కడో బ్యాక్-గ్రౌండులో మ్యూజిక్కూ, దాంతోపాటే హిందీ పాటలొస్తాయని. 

    అది సినిమాలో పాట అని నాకు తట్టనేలేదు. కాకపోతే అప్పుడు ఆటోలు, రిక్షాలు తప్ప టాక్సీ ఎక్కలేదు కాబట్టి - అలా నా వెనకాలే పాట పరిగెడితే వినే అవకాశం రాలేదని బోల్డు దిగులుగా అనిపించింది కూడా. 

    ఇప్పటికీ ఆ రజనీగంధా సినిమా పాట చూస్తే ఆ చిన్ననాటి అమాయకపు తలపు గురుతుకొచ్చి మురిపిస్తుంటుంది. 

 *******
*******
    
    ముందుగా మొదట విన్న పాట - తెలుగు పాట - "చైర్మన్ చలమయ్య " సినిమా లోది. ఆ పాట "నయనాలు కలిసె తొలిసారి...". సినిమాలో ఆ పాటకి ఆంధ్రా-దిలీప్ కుమార్ అని పేరెన్నిక గన్న చలం, రివాల్వర్ రాణిగా గన్నులు పేల్చిన విజయలలిత - వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా పాటలకి ఆటపట్టైన మైసూర్ బృందావన్ గార్డెన్సులో పరుగులు పెడుతూ ఆడుకున్నారని, పాడుకున్నారని మొన్ననే యూట్యూబ్ చెప్పింది. 

    ఈ పాట వివరాలు వెతుకుతుంటే దొరికిన వివరాల్లో - నాకు - మెరుపుల్లా బోల్డు తమాషాలు కనిపించాయి. 

    అందులో మొట్టమొదటిది - ముఖ్యమైనది ఏంటంటే - తెలుగులో ఆరుద్ర రాసిన పాటకి సంగీతం కట్టినవారు సలిల్ చౌధరి. 

    ఆయన ఇదే వరసలో ఒక హిందీ పాట (ముఖేష్), ముగ్గురు పాడిన రెండు బెంగాలీ పాటలు (పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ విడివిడిగా పాడిన ఒక పాట,  విడిగా గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో పాట), వీటన్నితో పాటు ఇద్దరు (బాలు, సుశీల) పాడిన ఒక తెలుగు పాట  - వెరసి నాలుగు పాటలకి ఒకే ట్యూన్ వాడారు. 

    పై లెక్క గజిబిజిగా వుంది కదా?! అదే నా ఈ బ్లాగు శీర్షికకి మూలం, ఆధారం - వెరసి మూలాధారం. దాని లెక్క తేలుస్తా - కొంచెం ఓపిక పట్టండి మరి!

    ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు పాట గురించి ఓ పుంజీడు కబుర్లు. తెలుగు పాటలో మొదటి చరణంలో బృందావన్ గార్డెన్స్ కనిపిస్తే, రెండో చరణంలో కృష్ణరాజసాగర్ డామ్ దగ్గర పాలవెల్లువలా పొంగుతున్న కావేరీ నదీమతల్లి చిందులేస్తూ కనిపిస్తుంది. 

    ఇక పాటలో కనిపించే చెట్లూ, పూలూ, దూది మబ్బులూ, నీటి తుంపర్లూ, డామ్ పక్కనున్న మెట్లూ, హీరో-హీరోయిన్నుల క్లోజప్పులో పెట్టిన తళుకుబెళుకుల కెమెరా-ఫిల్టర్లూ - ఇవన్నీ కూడా ఒక పెద్ద visual bonus!

    ఈ పాటలో పల్లవిలో మొదటి వాక్యం పాడినప్పుడు - ఎస్పీ బాలు, సుశీల - ఇద్దరూ కూడా ఆ ఎత్తుగడలో - బెంగాలీ సంగీత దర్శకుడు సలిల్ చౌధరి ఎలా పాడి చూపించారో - అచ్చు అల్లాగే తెలుగుని పట్టిపట్టి పాడారేమో అనిపిస్తుంది నాకు. అయినా అది కూడా పాటకి ఒక అందాన్నిచ్చింది. పాట మధ్యలో వినిపించే "లలల్లాల్లా, అహహా, ఎహెహే" లాంటి హమ్మింగులు కూడా కొత్తగా వినిపిస్తాయి. 

    బాలబాలుడు "తలపే తరంగాలూరి..." అనంటే, గానకోయిల్సుశీలమ్మ "తలపే తరంగాలూరే..."అని పాడుతుంది. 

    నేను చూసి మురిసిన ఆ వింతలూ, విశేషాలూ మీరూ కని, విని ఆనందించేయండి మరి!

"నయనాలు కలిసె తొలిసారి" పాటకి యూట్యూబ్ లింక్Chairman Chalamayya Movie || Nayanaalu Kalise Video Song || Chalam, Vijaya Lalitha || Shalimarcinema - YouTube




నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి... 
పులకించె మేను ప్రతిసారి!

నా లోనా - నీ పేరే - పాడేనూ ... రాగాలూ
నా లోనా - .నీ రూపే  - చేసేనూ... చిత్రాలూ 
మదిలో - ఏదో - పదే పదే - ధ్వనించే!
మమతల తోటలలోనా 
తొలి వలపుల పూవులు పూచే!

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి... 
పులకించె మేను ప్రతిసారి!

నీలాలా - మేఘాలా - నీవేమో...  ఎగిరేవూ 
దూరానా - తీరానా - .నీవేమో...  నిలచేవూ
కలలే - ఇదే - ఇలా ఇలా - నిజమాయే!
పరువము బంధం వేసే
మన ప్రణయము బాసలు చేసే! 

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!



 *******
*******

    ఇక ఇప్పుడు తెలుగు పాటకి కవల పాటైన హిందీ పాట గురించి - ఓ నాలుగు కబుర్లు. 

    హిందీ సినిమా "రజనీగంధా" లో  "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటని రాసినవారు యోగేష్ గౌర్. 

    సంగీతం సలిల్ చౌధరి. 

    పడిశపు-గొంతుతో పాడినట్టున్నా - ముఖేష్ పాడిన ఈ పసిడి పాట soothing గా అనిపిస్తుంది. 

    పాటలో కనిపించేవారు - నీలంచీర కట్టుకున్న విద్యా సిన్హా, గడ్డంజుట్టు-సిగరెట్టు-సహిత-దినేష్ ఠాకుర్, మధ్యలో ఓ రెండు నిముషాలు మెరుపులా మెరిసే అన్‌మోల్-అమోల్ పాలేకర్. వీళ్ళే కాకుండా పాట మొదలైన దగ్గర్నుంచి కనిపించే పచ్చకప్పు-నల్లటాక్సీ. 

    ఈ పాటలో నాకు నచ్చేవి ఓ మోస్తరు జాబితానే వుంది. 

    విద్యాసిన్హా కట్టుకున్న ప్రకాశవంతమైన తెల్లపూల నీలం రంగు చీర, అల్లుకున్న జడ, పెట్టుకున్న నల్లద్దాల కళ్ళజోడు బావుంటాయి. 

    దినేష్ ఠాకుర్ తొడుక్కున్న నీలం ముగ్గుల తెల్లచొక్కా కూడా బావుంటుంది విద్యాసిన్హా చీరకి మాచింగ్‌లా. 

    టాక్సీ కిటికీల్లోంచి  కనిపించే ఆ నాటి బొంబాయి నగరపు డబుల్-డెకర్ బస్సులు, ఒకదానిమీద ఒకటిగా పేర్చినట్టున్న అపార్టుమెంట్లు, నెత్తి మీద మూటలు మోస్తూ హడావిడిగా పరిగెడుతున్న టాక్సీలు, మనుషులు - ఇదింకో visual bonus!

     "రాహోం మే ..." అన్న చోట సాగుతున్న దారిని చూడమన్నట్టుగా కారు కిటికీ అద్దం మీద కనిపించే విద్యా సిన్హా చూపుడు వేలు ఆవిడ అనుకోకుండా పెట్టిందో, దర్శకుడు బసు ఛటర్జీ చెప్తే కావాలని పెట్టిందో కానీ - ఆ చేతి భంగిమ నాకు చూడడానికి బావుంటుంది. 

    "జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే" అన్న వాక్యం దగ్గర గాలికి ఎగిరెగిరి పడుతున్న చీరకొంగు పాటకి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. భలే!

    "జానూ న -జానూ న" అన్న దగ్గర తెల్లచీరలో - ఎఱ్ఱ రిబ్బన్లతో రెండు జళ్ళ-సీతలా కనిపించే బొద్దు-విద్య ముద్దుగా వుంటుంది. అక్కడే గడ్డం లేని దినేష్ ఠాకుర్ కూడా మబ్బు కమ్మని చంద్రుళ్ళా మెరుస్తాడు ఓ క్షణం పాటు. 

    మరి - ఈ పాటని కూడా చూస్తూ వినేయండి!

     "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటకి యూట్యూబ్ లింక్Kaii Baar Yun Bhi Dekha Hai - Rajnigandha Song - Vidya Sinha - Amol Palekar - Mukesh - Sad Song - YouTube






కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

రాహోం మే - రాహోం మే
జీవన్ కీ - రాహోం మే
జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే
కౌన్ సా ఫూల్ చురాకే - రఖ్ లూ మన్ మే సజాకే!

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

జానూ న  - జానూ న
ఉల్‌ఝన్ యే - జానూ న
సుల్‌ఝావూ కైసే - కుఛ్ - సమఝ్ న పావూ
కిస్‌కో మీత్ బనావూ - కిస్‌కీ ప్రీత్ భులావూ

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

*******
*******


    ఏ పాట రాసే ముందైనా ఆ పాట గురించి సరైన వివరాలు రాద్దామని గూగుల్ చేస్తుంటాను. ఈసారి ఈ హిందీ-తెలుగు కవల పాటల గురించి రాస్తూ సలిల్ చౌధరి గురించి తెలుసుకుందామని వెతికితే ఈ రెండు పాటలకి తోడు ఇంకో మూడు బెంగాలీ పాటలు వున్నాయని తెలిసింది. 

    అవి కూడా యూట్యూబులో వెతికి పట్టుకున్నా. 

    ఒకటి - పింటూ భట్టాచార్య పాడిన బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Chalte Chalte Pintu Bhattacharya - YouTube




రెండోది - లతా మంగేష్కర్ పాడిన అదే బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Cholte Cholte Theme Gechhi | Abaak Rater Tara | Lata Mangeshkar | Lyrical - YouTube



    మూడోది గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో బెంగాలీ పాట "కొతొబార్ చొండో బొద్‌లాబే...": Kotobar Chhondo Bodlabey - YouTube    




*******
*******



    ఇప్పుడు ఈ పాటల గురించిన నాదైన పొడుపుకథ నేనే విప్పుతా!

"సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!"

    అంత కన్నా ముందు ఇంకొక్క చిన్నమాట. 

    "సలిల్ చౌధరి" లో సలిల్ అన్న పేరు ఎంత సలలితంగా అనిపిస్తుందో నాకు. సలిల్ అంటే నీరు కదా! ఆ పేరూ అంతే చల్లగా ధ్వనిస్తుంది. 

    ఈ పాటల్లో నాకు తట్టిన కొన్ని అంకెలు, లెక్కలు, లాజిక్కులు కూడా చెప్పేస్తా!

    6 - 5 - 4 - 3 - 2 - 1.... 

    హిందీ, బెంగాలీ భాషల్లో విడివిడిగా ఏకగళగీతంగా, తెలుగులో కలివిడిగా యుగళగీతంగా పాడిన వారు ఆరుగురు (6) - ముఖేష్, పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్, గౌతమ్ దాస్‌గుప్తా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల. 

    ఇందులో అబ్బాయిలు నలుగురు (6), (2) . 

    పైన చెప్పుకున్నవి మొత్తం ఐదు పాటలు (5) - ఒక తెలుగు (1), ఒక హిందీ(1), మూడు బెంగాలీ(3). 

    కానీ సరిగ్గా చూస్తే అవి నాలుగే (4) - ఎందుకంటే బెంగాలీ పాటలు లెక్కకి మూడైనా - అందులో ఒక పాట రెండు సార్లు లెక్కకొచ్చింది. "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి" పాటని పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ ఇద్దరూ విడివిడిగా పాడారు. ఇంకో పాట గౌతమ్ దాస్‌గుప్తాది. అలా బెంగాలీ పాటలు రెండయ్యాయి. (2). 

    అన్నిటికీ ఒక్కరే సంగీత దర్శకులు - సలిల్ చౌధరి (1). 

    నేను మొదట అనుకున్నది హిందీ-తెలుగు కవల పాటలే (2). కానీ తీరా చూస్తే ఐదు (5) పాటలున్నాయేమో అనిపించే నాలుగు (4) పాటలు మాత్రమే! 

    అందుకే అనుకున్నా "సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!" అని. 

    
*******
*******

    అవండీ ఇవాళ్టి పాటల కబుర్లూ, పాటల మాటున పొడుపు కథలూ, ఆ పొడుపు కథల విడుపు కబుర్లూ... 

~ పాటల భైరవి 

16, ఆగస్టు 2021, సోమవారం

లెట్స్ గో లెగో - 2 - ఫ్రీ నింజా కబుర్లు

ఇంతకు ముందు చెప్పిన కబుర్లు: లెట్స్ గో లెగో - 1 - తాజా తాజ్‌ కబుర్లు


మోగే పాటలు 
పెదవుల మూగే పాటలు 
పజిళ్ళ గళ్ళు
పుస్తకాల పుటలు 
నా రోజువారి కాలక్షేపాలు 

    వీటన్నిటితో పాటు ఇంకొక్క ఇష్టమైన వ్యసనం, వ్యాపకం - లెగో బిల్డింగ్. 

*******
*******

    అదెలా మొదలయ్యిందంటే... 

    చిన్నప్పుడెప్పుడో వేసవి సెలవుల్లో హైద్రాబాదు వెళ్ళినప్పుడు - ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు - అక్కడ చూశాను - రంగురంగుల ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్, వాటితో చేసిన రకరకాల కట్టడాలు. 

    అప్పుడు చూసిన ఆ ఎరుపు, పసుపు, నీలం రంగులు కళ్ళలో కలలుగా కనిపిస్తూనే వుండేవి చాలా ఏళ్ళ పాటు. 

    ఆ తర్వాత - పెరిగి పెద్దై, చదువువై, ప్రేమై, పెళ్లై, తల్లై, వలసై - ఇన్నైన తర్వాత - అమెరికా వచ్చాము. 

    వచ్చాక అవసరం కొద్దీ ఓ కారు కొనుక్కున్నాము. కారంటూ కొన్నాక అది నడవడానికి గ్యాస్ కావాలి కదా! గ్యాస్ అంటే కారు టైర్లలో కొట్టే గాలి కాదు - కారు ట్యాంకులో పోసే గాసోలిన్ అనబడే పెట్రోలుకి ముద్దుపేరు. 

*******
*******

    అబ్బబ్బా! లెగోలు అంటుంది... రంగుల కలలు అంటుంది. అంతవరకు బాగానే వుంది. ఇంకా ఏవో ఊరించే రంగుల కబుర్లో, బొమ్మల కబుర్లో చెప్తుందనుకుంటే కారు-గ్యాసు అంటూ గాలికబుర్లేవో చెప్తోంది అని మాచెడ్డ చిరాకొచ్చేస్తోంది కదా! 

    బాగానే వుంది!

    అనగనగా...  అని మొదలెట్టేసి సరాసరి కథలోకెళ్ళిపోతే బోల్డన్ని కబుర్లెలా వస్తాయి మరీ?

    సరే! కార్లో గ్యాస్ కోసమని గ్యాస్-స్టేషన్‌కి వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళినపుడు ఒకసారి తినడానికి ఏవో చిప్స్ కొనుక్కుందామని గ్యాస్-స్టేషన్‌ లోపలికి వెళ్ళాం - మేం ముగ్గురం - నేను, నాతో పాటు నా చేయి పట్టుకున్న బుజ్జిగాడు, మా ఇద్దరితో పాటు మాక్కావాల్సినవి కొనిపెట్టడానికి బద్రి. 

    లోపలికి వెళ్ళీవెళ్ళగానే  - నాకూ, బుజ్జిగాడికి - అక్కడ రంగురంగుల ప్లాస్టిక్ సంచీలో వున్న మినీ-లెగో బ్లాక్స్ కనిపించాయి. అవి ఒక చిన్న మోటార్ బైక్ చేయడానికి సరిపోయేటన్ని. ఆ సంచీ మీద వేసిన బొమ్మలో బుల్లి హెల్మెట్ పెట్టుకున్న ఒక చిన్న లెగో-మాన్ కూడా ఉన్నాడు. వాడికో సూట్కేస్ కూడా ఉంది. 

    అది చూసీ చూడగానే వెలిగిన మా కళ్ళ మెరుపులకి చుట్టుపక్కలున్న అందరికీ కొన్ని సెకన్ల పాటు ఖచ్చితంగా కళ్ళు మిరుమిట్లు గొలిపి వుంటాయి. కాకపోతే మా మెరుపులూ, వెలుగులూ బద్రికి బాగానే అలవాటు కాబట్టి - మా చూపులెటున్నాయో ఇట్టే కనిపెట్టేసి ఆ లెగో-బ్లాక్సుని మాకు కొనిపెట్టేశారు. 

    అప్పట్నుంచీ ఇంకెప్పుడు ఆ గ్యాస్-స్టేషన్‌కి వెళ్ళినా ఒక మినీ-లెగో సెట్ తెచ్చుకునేవాళ్ళం. నెమ్మది నెమ్మదిగా మా లెగో-కలెక్షన్ పెరిగింది. 

    ఆ రోజుల్లో ToysRUs అని ఒక పెద్ద బొమ్మల అంగడి ఉండేది. నెలలో ఒకసారన్నా అక్కడికి వెళ్ళి బోల్డంత సేపు బొమ్మలన్నీ చూసి బుజ్జిగాడికో బొమ్మో, బోర్డుగేమో కొనుక్కుని వస్తూ ఉండేవాళ్ళం.

    ఓసారి వెళ్ళినప్పుడు అక్కడ ఐదొందల లెగో బ్లాక్స్  వున్న ఒక ఎఱ్ఱడబ్బా కనిపించింది. ఈసారి మళ్ళీ మా కళ్ళు మెరిశాయి - ఆ మెరుపులకి షాపులో ఉన్న లైట్లన్నీ ఓ సారి ఆరి-వెలిగాయి. మా చేతుల్లోకి ఆ లెగో బ్లాకుల ఎఱ్ఱడబ్బా వచ్చి వాలింది. 

    అదిగో... అక్కడ...  అలా... మొదలు లెగోలతో నా సావాసం. 

*******
*******

    ఆ తర్వాత కొన్నాళ్ళకి అన్నజింకకి తోడుగా బుజ్జిజింక కూడా పుట్టేశాడు. ఓ ఏడాదిన్నరలో బుడిబుడి అడుగులతో అన్నజింక వెనకాలే బుజ్జిజింక కూడా వీధికి అటుగా వున్న అన్న ఫ్రెండు జాష్ ఇంటికి వెళ్తుండేవాడు. 

    ఓ రోజు జాష్ వాళ్ళింటికి వెళ్ళొచ్చినపుడు - అక్కడ వాళ్ళింట్లో చూసిన లెగో కలెక్షన్ గురించి పిల్లలు చెప్పింది విన్నాక లెగో-బిల్డింగ్ ఒక మంచి హాబీ అవుతుందని అనిపించింది. 

    బుజ్జిజింకకి మూడేళ్ళప్పుడు అందరం ఇండియా వెళ్ళాం. అప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో వాడి కోసం మొట్టమొదటి లెగో  - ఒక బుల్లి ఫైర్-ట్రక్ కొన్నాను. 

    ఇక అప్పట్నుంచి ఇంట్లో ఎవరి పుట్టిన రోజైనా, ఏ పండగొచ్చినా బుజ్జిజింకకి ఒక లెగో కొనాల్సిందే. వాడి పుట్టినరోజుకి తప్పకుండా ఒక పెద్ద లెగోసెట్ కొనేవాళ్ళం. 

    ఏదైనా కొత్త లెగో సెట్ కొన్నప్పుడు బుజ్జిజింక దాన్ని build చేస్తున్నప్పుడు - నేను వాడి పక్కనే కూర్చుని - pieces అందిస్తూ వుండేదాన్ని. 

    అసలు మా లెగో కలెక్షన్ ఎలా పెరిగి పెద్దదయిందో - దానికి సుస్మిత, వేనెట్ చేర్చిన సెట్ల కబుర్లు, కొన్ని సెట్ల కోసం లెగో వాళ్ళని నేను చేసిన  ఎమోషనల్ బ్లాక్‌మెయిళ్ళ కబుర్లు - ఇలాంటివెన్నో  - ఇంకోసారి చెప్తాను. 

    అవన్నీ చెప్తూ వుంటే ఇప్పుడు చెబ్దామనుకున్న కబుర్లు బోల్డుబోల్డయిపోతాయి మరి!


*******
*******

    2008 నుంచి 2017 వరకు మా లెగోత్సాహం అప్రతిహతంగా సాగింది. 

    అప్పటికి బుజ్జిజింక ఏడవ తరగతి లోకి వచ్చాక - అంతటి బుజ్జిగాడూ తను పెద్దైపోయాననుకున్నాడో ఏమో బుల్లిబుల్లి లెగోలు వాడి కంటికి ఆనడం మానేశాయ్. వాటిని కొనమని అడగడం మానేశాడు. 

    వాడైతే అడగట్లేదు కానీ నాకు అప్పుడే లెగోల మీద ఇష్టం ఇంకా పెరగడం మొదలైంది. 

    మరప్పుడు కొత్త లెగోలు కొనాలంటే ఎలా? 

    ఇంటికి వచ్చే Lego Catalog లో నాకు నచ్చిన సెట్స్‌ని బుజ్జిజింకకి చూపించి "ఇది కొందాంరా!" అనడిగితే ఓ సారి దాని కేసి చూసి "నో' అనేసి వెళ్ళిపోయేవాడు. 

    నన్నేమో ఆ రంగురంగుల బొమ్మలు ఊరిస్తూ వుండేవి. ఇలాక్కాదని చెప్పి 2018లో నా పుట్టినరోజుకి లెగో సెట్ కావాలని ఇంట్లో అందరికీ చెప్పేశా. 

    అప్పుడు మా వెస్ట్ కౌంటీ మాల్‌లో వున్న లెగో స్టోరుకి వెళ్ళి ఒక రెండు లెగో సెట్లు కొనుక్కున్నాను - ఒకటి నూట ఏభై పెట్టి (బీచ్ హౌస్), ఇంకొకటి (Parisian Restaurant set) మూడొందల ఏభై పెట్టి. 

    ఆ రోజు ఉన్న ఆఫర్ ఏంటంటే వంద డాలర్ల  పైన కొంటే ఒక చిన్న లెగోసెట్ ఉచితంగా ఇస్తారు. నేను కొన్నవాటి బిల్లు నాలుగొందల ఏభై అయింది కదా - అందుకని నాకు ఆ ఫ్రీ సెట్ ఇచ్చారు. దాంతో పాటు ఒక కొత్త కేటలాగ్ కూడా ఇచ్చారు. 

    ఇంటికి రాగానే - నాకెంతో నచ్చిన పారిస్ హోటల్ సెట్టుని చేయడం మొదలుపెట్టాను. అందులో వున్నవి 2,469 లెగో పీసెస్. అదంతా ఒక్క రోజులో ఎలాగూ చేసెయ్యాలని నాకేమీ తొందర లేదు. 

    చిన్నప్పుడు అమ్మ పెట్టిన తాయిలాన్ని కొంచెం కొంచెం కొరుక్కుంటూ బోల్డంత సేపు తిన్నట్టు - నా కొత్త లెగోని కూడా ఒక్కో రోజుకి ఒక్కో లెవెల్ మాత్రం కడుతూ - ఆ కట్టడాన్ని కట్టడాన్ని తెగ enjoy చేస్తూ ఉన్నాను. 

    ఇంతలో షాపులో ఉచితంగా ఇచ్చిన కేటలాగ్ తెరిచి చూస్తున్న నాకు - అందులో - ఆ మరుసటి రోజు నుంచి వంద డాలర్లకి లెగోస్ కొన్నవాళ్ళకి ఒక బుజ్జి ఆకుపచ్చ నింజా mini-figure ఉచితంగా ఇస్తారని రాసి ఉంది. 

    ఆ బుజ్జి నింజా గాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ! నాకెలాగైనా వాణ్ణి ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. కానీ ఆ నింజాని ఏమైనా లెగో సెట్ కొంటే ఫ్రీగా ఇస్తారు కానీ విడిగా కొంటామంటే అస్సలు అమ్మనే అమ్మరు. 

    మరప్పుడేం చెయ్యాలి?

*******
*******

    ఇంట్లో నేనూ, బుజ్జిజింకే వున్నాం. వాడప్పుడే స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకంటూ ఉన్నాడు. 

    నేను నెమ్మదిగా వాడి పక్కన కూర్చుని "నాన్నగాడూ! ఇంకెంత సేపు పడుతుంది నీ హోంవర్క్ పూర్తవడానికి?" అనడిగాను. 

    వాడు తలెత్తకుండానే పెన్సిలుతో టిక్కూ-టిక్కూ లెక్కలు చేస్తూ "ఇంకో పది నిముషాలు అంతే!" అన్నాడు. 

    "అయితే మనిద్దరం ఐదున్నరకి బయల్దేరి లెగో స్టోరుకెళ్దామా?" అని నెమ్మదిగా అడిగాను. 

    అది వినగానే వాడు చేస్తున్న లెక్కలు ఆపేసి "మళ్ళీ లెగో స్టోరుకా... నేన్రాను" అనేశాడు. 

    "అలాక్కాదురా... నేను రెండు లెగోలు తెచ్చుకున్నాను కదా - అందులో ఒకటి నచ్చలేదు. అది తిరిగి ఇచ్చేస్తాను. నచ్చనిది ఎందుక్కదా ఉంచుకోవడం?" సాధ్యమైనంత అమ్మా-యకంగా అడిగా. 

    అది వింటూనే వాడు "తెచ్చినది నచ్చలేదా? నింజా ఎక్కువ నచ్చాడా?" అనడిగాడు. 

    అమ్మదొంగా ! అయితే నేను లెగో కేటలాగ్ పదేపదే తెరిచి ఆ నింజా కేసి చూడడం వాడు చూశాడన్నమాట. 
 
    ఇంకెందుకు అబద్ధం చెప్పడం! అందుకే చెప్పేశా "అవును! నాకు ఆ నింజా నచ్చాడు. నాక్కావాలి. తెచ్చుకుందాం వస్తావా?"

    "అమ్మా! అంత చిన్న మినీ-ఫిగర్ కోసం మళ్ళీ ఆ లెగో-స్టోరు కెళ్ళాలా ఇవాళ? వీకెండులో నాన్నగారు వచ్చాక వెళ్ళు" అనేశాడు. 

    "అప్పటి వరకు ఆగితే అయిపోతాయి కూడా - అసలే until supplies last అన్నాడు లెగో వాడు. ఇవాళ వెళ్ళకపోతే నింజా బొమ్మ నాకు దొరకదురా" నా గొంతులో వినీవినిపించని వెక్కు. 

    "Ugh" అని చిన్నగా అరిచి - రాస్తున్న పెన్సిల్ని చప్పుడు చేస్తూ కింద పడేసి "పదమ్మా! ఇప్పుడే వెళ్దాం. కానీ ఇప్పుడే చెప్తున్నాను. లెగో స్టోరులో మాత్రం నువ్వెవరో, నేనెవరో. నేను నీ పక్కన ఉండనే ఉండను. దూరంగా నించుంటాను" అన్నాడు. 

    "నువ్వెక్కడైనా నించో పర్లేదు. నేను ఈ బీచ్ హౌస్ సెట్ తిరిగిచ్చేసి ఇంకో సెట్ కొంటాను. దాంతో పాటు నింజాని ఫ్రీగా తెచ్చుకుంటాను" అని వాడి అమ్మనని అందరికీ హింట్లిచ్చి embarass చేయనని భరోసా ఇచ్చేశా. 

    సరిగ్గా ఐదంటే ఐదు నిముషాల్లో ఇద్దరం కార్లో ఉన్నాం. ఆ తర్వాతి ముప్పయ్యో నిముషంలో లెగో స్టోరులో వున్నాం. 

    స్టోర్ లోకి వెళ్తూనే బుజ్జిజింక నాకు దూరంగా జరిగి అక్కడున్న లెగో సెట్లు కొనడానికి చూస్తున్నట్లు స్టోరు అంతా తిరుగుతూ ఉన్నాడు. 

    నేనేమో ఒక చేత్తో అంతకు ముందు కొన్న Beach house సెట్ , బిల్ పట్టుకుని, ఇంకో చేత్తో ఇవాళ కొందామనుకున్న లెగో ఆర్కిటెక్చర్ సెట్ ఒకటి తీసుకుని కౌంటర్ దగ్గరకి వెళ్ళి నించున్నాను. 

    కౌంటర్లో ఉన్నబ్బాయి "నేను మీకు ఏం సహాయం చేయగలవాడనూ?" అని ఎంతో మర్యాదగా అడిగాడు. 

    నేను వెంటనే నా చేతిలో ఉన్న బీచ్ హౌస్ లెగో సెట్టుని కౌంటర్ మీద పెట్టి, "ఇది రెండ్రోజుల క్రితమే ఇక్కడ కొన్నాను. ఇప్పుడు తిరిగిచ్చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ఆర్చిటెక్చర్ సెట్ కొందామనుకుంటున్నాను" అని చెప్పి ఆగిపోవచ్చు కదా - నేనూ, నా ఆత్రం కాకపోతే! అక్కడితో ఆగక గబగబా "ఈ ఆర్కిటెక్చర్ సెట్టుతో పాటు ఆ గ్రీన్ నింజా ఇస్తారు కదా! ఇది ఇస్తారని తెలీక నేను ఇంతకు ముందు రెండు లెగో సెట్లు కొనుక్కెళ్ళాను. లేకపోతే ఒకటే కొనుండేదాన్ని" అని వాడు అడగనివి, నేను అనకూడదు అనుకున్నవీ అన్నీ అనేశా!

    అలా అంటూనే - ఒక కంట -  ఓరకంట బుజ్జిజింక ఎక్కడున్నాడా అని చూస్తుంటే - దూరంగా నించుని వాడు - నేను మాట్లాడుతున్నదంతా వింటూ నోరు తెరిచి ఏదో అనబోయి - వెంటనే తల తిప్పేసుకుని - తల అడ్డంగా ఊపుకుంటూ అటు తిరిగి మళ్ళీ లెగో సెట్లు చూసుకుంటూ ఉండిపోయాడు.  

    ఇంతలో నా లె-ఘోషని ఆసాంతం విన్న లెగో షాపబ్బాయి - నా చేతిలో ఉన్న పాత బిల్లు తీసుకుని చూసి "ఇందులో రెండు సెట్లు కొన్నట్టు ఉంది. వాటితో పాటు ఓ ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. ఈ బిల్లులో ఉన్నవన్నీ తీసుకొస్తేనే ఈ సెట్టు తిరిగి తీసుకుంటాను" అన్నాడు. 

    నాకు కంగారొచ్చేసింది. 

    "అదేంటి! ఇంతకు ముందు కొన్న వాటిల్లో బాగా ఖరీదైనది - 350 డాలర్లది - నేను ఉంచుకున్నాను కదా. మీ షాపులో ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఆ ఫ్రీ గిఫ్ట్ నాదే. ఇప్పుడు తిరిగిస్తున్నది కొనకపోయినా నాకు ఆ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అందులోనూ నేను ఇప్పటికే నా హోటల్ సెట్ కట్టడం మొదలెట్టేశాను. ఇప్పుడది తేవాలంటే ఎలా కుదురుతుంది? అందుకని ఈ బీచ్ హౌస్ సెట్ తీసేసుకోండి. ఇదిగో - ఈ కొత్త అర్చిటెక్చర్ సెట్ బీచ్ హౌస్ సెట్ కన్నా ఎక్కువ ఖరీదే! ఇది కొంటున్నాను. నాకు నా గ్రీన్  నింజా కూడా ఇవ్వండి ఇవాళ్టి ఆఫర్ ప్రకారం" అంటూ బో... ల్డంత మాట్లాడేశా. 

    నేను చెప్పిన కూడికలూ, తీసివేతలూ, లెక్కలూ, లాజిక్కులూ అస్సలర్థం కాక ఆ కౌంటర్లో వాడికి టెన్షన్. 

    నేనింత చెప్పినా వాడు నాకు నచ్చిన ఆకుపచ్చ నింజాని ఇస్తాడో ఇవ్వడో అని నాకు టెన్షన్. 

    మేమిద్దరం మాట్లాడుకుంటున్నది వింటూ వాణ్ణి నేనెక్కడ మాటసాయానికి పిలుస్తానో అని బుజ్జిజింకకి టెన్షన్.

    కొన్ని క్షణాలు లెగో స్టోరులో - గాలి కూడా ఆడడానికి టెన్షన్ పడిపోయిందంటే నమ్మండి. 

    ఆ కొన్ని క్షణాలు - కౌంటర్లో వాడు తన చేతిలో ఉన్న బిల్లు కేసి, నేను ఆ పక్కనే ఉన్న గ్రీన్ నింజా కేసి, బుజ్జిగాడు సీలింగ్ కేసి చూసుకుంటూ ఉండిపోయాం. 

    ఆ టెన్-టెన్షన్ క్షణాల తర్వాత ముందుగా కోలుకున్నది, తేరుకున్నది లెగో స్టోర్ కౌంటర్ వాడే. 

    తల కొంచెం వంచి అడ్డంగా తిప్పుకుంటూ "Oh whatever! " అని గొణుక్కుంటూ నేను తీసుకెళ్లిన లెగో సెట్టు తిరిగి తీసుకుని, నేను కొన్న కొత్త అర్చిటెక్చర్ సెట్టుకి కొత్త బిల్లు వేసి - రెండు బిల్లులూ అడ్జస్ట్ చేసి - వాడి ఆస్తి ఏదో నాకు రాసిచ్చేస్తున్నంత బాధగా నా చేతిలో నింజాని పెట్టి - ఇంకసలు నాకేసి చూడకుండా అటెటో చూస్తూ నించున్నాడు. 

    నేను నా ఆకుపచ్చ నింజాని భద్రంగా పట్టుకుని మహదానందకందళితముఖారవిందనై  బయటికి నడిచాను. 

    ఓ రెండు అడుగులు వెనగ్గా బయల్దేరిన బుజ్జిజింక ఓ రెండు నిముషాల తర్వాత నన్నందుకుని నా పక్కగా నడుస్తూ "అమ్మా! మనింట్లో నువ్వే ఓ పెద్ద child! నువ్వు ఒక చిన్న లెగో కోసం ఎంత గొడవ చేశావో!" అని "ప్చ్! ప్చ్1 అనుకుంటూ కారెక్కాడు. 

    అప్పుడు తెచ్చుకున్న నింజాని ఇప్పుడు చేసిన లెగో బోన్సాయ్ కింద నించోబెట్టా...