25, నవంబర్ 2011, శుక్రవారం

నీ వల్లే….నీ వల్లే…

నవంబర్ "విహంగ"లో నావ్యాసం ఇక్కడ చదవండి.


నీ వల్లే....నీ వల్లే...

ఎంత బాగుంటుంది కదా...జగమంత "మొహమాట" కుటుంబమైతే...
ఎంత బాగుంటుంది కదా...నే చెప్పిందే వేదమంటే వినేవారుంటే   
ఎంత బాగుంటుంది కదా...మన తప్పులన్నీ మోసే పాపాల భైరవులుంటే...
ఎంత బాగుంటుంది కదా...ఏం పొరపాటు జరిగినా నీ వల్లే అంటే ఒప్పుకునేవారుంటే...


హ్మ్! హ్మ్! నిజమే ఎంత బాగుంటుందో .... జీవితం మనం అనుకున్న దారిలో కాక మనకి ఏ విధాత వ్రాసినట్టో మలుపుల్లో వెళ్తున్నప్పుడు, అందుతున్నది అనుకున్న ఫలం అందనప్పుడు, చేయవలసినది చేయక జాతకాన్నో, తాయెత్తునో, అమ్మవారి కుంకుమనో, స్వామివారి విభూదినోనమ్ముకుంటే ఆ నమ్మకం వమ్ము అయినప్పుడు  - ఒక్క మాటలో చెప్పాలంటే అనుకోకుండా పొరపాటు జరిగిన ప్రతిసారీ - చూపుడు వేలు చాచి, ముక్కుకి సూటిగా పెట్టి " నీ వల్లే" అంటే మనసులో క్రుంగినా పైకి నవ్వుతూ భరించేవారుంటే....

*అనగనగా ఒక ఉమ్మడి కుటుంబం గురించి కలలు కంటూ, ఎంత తొందరగా "బాబూ! వినరా...అన్నాదమ్ముల కథ ఒకటీ"  అని పాడేద్దామా అనుకునే అన్నగారు. ఆ అన్నగారు తను ఒక పెద్ద సిటీ లో సెటిల్ కాగానే తన తమ్ముడికి కూడా ఇంకో వుద్యోగం చూసి తన ఇంట్లోనే ఉండమన్నారు. కొన్నాళ్ళు సిటీ వచ్చాననే ఉత్సాహంలో తమ్ములుంగారికి బాగానే గడిచింది- అనాయాచితంగా వచ్చిన ఉద్యోగం, పబ్బులు, ఫ్రెండ్స్, పార్టీలు, వీకెండ్ రిసార్టులు. కొన్ని నెలల తర్వాత చూసుకుంటే అబ్బాయిగారికి రాబడి కన్నా "పోబడి" ఎక్కువ అయింది. దానితో ఆ తమ్ముడు అది తన తప్పే అని ఒప్పుకోక  అన్నగారి మాట విని అనవసరంగా సిటీ వచ్చానని అనుకోవడం మొదలుపెట్టాడు. ఇంకంతే అవకాశం దొరికినప్పుడల్లా " చూడన్నయ్యా! ఇదంతా నీవల్లే జరిగింది. నువ్వే రమ్మనకపోతే హాయిగా మన ఊళ్లోనే ఏదో బిజినెస్ చేసుకునేవాడిని" అనడం మొదలు పెట్టాడు తమ్ముడు. ఇంత దూరం తీసుకువచ్చి తప్పు చేశానేమో అని బాధ పాడడం అన్నగారి వంతు అయింది.


**"నీ వల్లే" అని వల్లె వేయించే ఇంకో కథ. అందమైన అమ్మాయి. చక్కగా చదువుకుంది. ఇంట్లో గారాబు పట్టిగా అన్నిట్లో తన మాట నెగ్గించుకుంది. అమ్మా, నాన్న ఆరాటపడి ఒక కుదురైన అబ్బాయితో పెళ్లి జరిపించారు. అమ్మాయికి కూడా అబ్బాయి అందం, ఆరు అంకెల జీతం, అత్తా-ఆడపడుచు ఆరడి లేని వేరింటి కాపురం అన్నీగొప్పగా నచ్చేశాయి. అలా ఆరు నెలలు గడిచాయి. ఆడుతూ, పాడుతూ సాగుతున్న కొత్త కాపురం పాతబడింది. ముచ్చటగా వేసుకున్న వంతుల సంసారం ఒక తంటాలా అనిపించసాగింది. అమ్మాయి చిరాకులు, అబ్బాయి పరాకులు మొదలయ్యాయి. అమ్మాయి కాపురం ఎలా వుందో చూద్దామని అమ్మా-నాన్న వచ్చారు. అల్లుడితో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న అమ్మాయితో అమ్మ ఇలా అంది - "తల్లీ! కొంచెం నెమ్మది నేర్చుకోమ్మా! అల్లుడుగారిని అలా విసుక్కుంటే రేపు ఇంకో విషయంలో తనతో నువ్వు మాట పడాల్సివస్తుంది. సంసారం అన్న తర్వాత మంచీ-చెడూ రెండూ వుంటాయి. సర్దుకుపోవాలి"- అని. అంతే యువరాణీ గారి లాంటి అమ్మాయికి కోపం వచ్చేసింది. వచ్చేసి - ఇలా " ఊరుకోమ్మా! అంతా నీ వల్లే జరిగింది. నేనెంత అనుకున్నానో - మాస్టర్స్ అయిపోగానే పీ హెచ్ డి చేద్దామని. నువ్వే పెళ్ళో, పెళ్ళో అని గోలపెట్టి ...ఇదిగో...ఇలా ఈ జైల్లో నన్ను పడేశావు" గాఠిగా అనేసింది. అమ్మకి అమ్మాయి మాట పోటుకి  కళ్ళలో తిరిగిన నీళ్ళకి ఉల్లిపాయవైపు తిరిగి "నా కళ్ళ నీళ్ళు నీ వల్లే" అనాల్సివచ్చింది.

***ఇదిగిదిగో ...ఈ బుడతడి "నీ వల్లే" ఉపాఖ్యానం విందామా? బుజ్జిబాబు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బొజ్జ నిండా నూడిల్స్ పెట్టి అమ్మ చెప్పింది కదా- బుజ్జి బాబూ ! హోం వర్క్ గబగబా చేసేసుకో. డాడీ రాగానే ఎగ్జిబిషన్ కి వెళ్దాం- అని. మరి మన బుజ్జిబాబు తొందరగా చేసేస్కోవాలా- అల చేయలేదు. తొందర తొందరగా ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాననే ఉత్సాహం లో కొన్ని లెక్కలు చేయడం మర్చిపోయాడు. అమ్మకదేమీ తెలియదు కదా పాపం---చెప్పినట్టే అన్నీ చేసేశాడనుకుని తయారు చేసి ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళింది. ఎగ్జిబిషన్ లో బుజ్జిబాబు రైడ్స్ ఎక్కాడు, పిజ్జా తిన్నాడు, పెప్సి త్రాగాడు, బోల్డు బొమ్మలు కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చాక  ఆమ్ తిని - ఎగ్జిబిషన్ ని కలల్లో మళ్ళీ చూస్తూ హాయిగా బజ్జున్నాడు. ప్రొద్దున్నే లేవగానే బుజ్జిబాబు కి నిన్న చేయని హోం వర్క్ లెక్కలు గుర్తుకొచ్చాయి. ఇంకంతే స్కూల్ కి వెళ్లనని ఏడుస్తూ కూర్చున్నాడు. అదేంట్రా నిన్న హోం వర్క్ పూర్తి చేసేశానని చెప్పావుగా - అని అడిగిన అమ్మతో - "నువ్వే చెప్పావు ఎగ్జిబిషన్ కి వెళ్దామని. లేకపోతే నేను హోం వర్క్ మిస్ అయేవాడిని  కాదు. ఇదంతా నీవల్లే ...ఊఊ...ఊఊ..." అని ఏడ్చేశాడు. పాపం! ఆ అమ్మ మాత్రం ఏం చేస్తుంది - తన పాపడి నిందతో "పాపాల భైరవి" అయింది.

****అల్లదిగో ....ఒకానొక స్నేహిత్ కుమార్ గారికి ఆయన మిత్రులొకరు ఫోన్ చేస్తున్నారు - ఆ సంభాషణ విందామా? అలా ఒకరి మాటలు వినడం తప్పే అయినా - ఏం చేస్తాం - మొబైల్ రోజులు. వద్దన్నా చెవిలో పడతాయి. 

-హలో! అరె రాం! ఎలా వున్నావు? ఎప్పుడు వచ్చావు ఇండియా?
----ఏం బాగో ఏమోలే! వచ్చి వారం అయింది.
-అదేంట్రా  రామ్ - మరి రాగానే కాల్ చేయాల్సింది కదా. నేనొచ్చి కలిసేవాణ్ణి. సరే గాని ఏంటి ఇంత సడెన్ గా వచ్చావు? అంతా బాగానే ఉంది కదా?
----ఏం చెప్పమంటావు స్నేహిత్? లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మా మామగారు చెప్పినట్లు బెంగళూరు లో సైట్ కొంటే పోయేది. నువ్వు బాగా ప్లాన్ చేసి కొంటావు కదా అని నీతో పాటు హైదరాబాదు లో కొన్నాను. ఇప్పుడది అమ్మ బోతే ఎవరూ కొనడానికి ముందుకి రావట్లేదు. ఇదంతా నిన్ను నమ్మడం వల్లే.
ఇంకేమంటాడు ఆ "స్నేహితు"డు ?

ఒక విషయం అండీ బాబూ...ఎవరినైనా "నీ వల్లే" అని అనేముందు కొంచెం ఆలోచించాలి అండీ. ఎందుకంటే ఎవరైనా మనం సలహా అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం తో మనం సమాధాన పడితేనే ఆ సలహా పాటిస్తాము. అంతే కానీ చెప్పారు కదా అని మన ఆలోచన లేకుండా చేసేయం- కదూ?!!. ఒక్కసారి పైన ఇచ్చిన కథలకి అనుబంధమైన ఈ పిట్ట కథలని కూడా చదివేయండి.

*అన్నయ్య తనని సిటీ కి రమ్మనగానే తమ్ముడు ఇలా అనుకున్నాడు - "నాకేమో బిజినెస్ చేయాలని ఉంది. అన్నయ్యేమో సిటీ కి రమ్మంటున్నాడు. పోన్లే ఒకసారి వెళ్లి వద్దాము. ఎలాగూ జాబ్ తనే చూసేశాడు. లెట్ మీ ఎంజాయ్!. అంతగా నచ్చకపోతే వెనక్కి వచ్చేద్దాం". ఇలా అనుకున్న తమ్ముడు అన్నకి తన బిజినెస్ ఐడియా గురించి ఏమీ చెప్పకుండా ఉద్యోగ పర్వం లో దెబ్బ తగిలేటప్పటికి అన్నగారి వల్లే తను బిజినెస్ చేయలేకపోయాడని అనేశాడు.

**ఇంక మన యువరాణి....పెళ్లనగానే అబ్బాయి అందం, ఎత్తు, ఆస్తి, హోదా చూసి- తన ఫ్రెండ్స్ అందరిలో ఎక్కువగా, గొప్పగా ఉంటానని ఊహించుకుని - మాట మాత్రం గానైనా తన పీ హెచ్ డి ఆలోచన అమ్మకైనా చెప్పక పెళ్లి చేసుకుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోయేటప్పటికి అమ్మ ని నిందించింది. పెళ్లయేవరకూ ఈ అమ్మాయి ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగిందండోయ్- అంత అమ్మ కూచేం కాదు!

***మన బుజ్జిబాబు- చిన్నవాడనుకోండి- అయినా వాడికి తెలిసిపోయింది తన తప్పుకి అమ్మే కారణమని ఎలా ఒప్పించాలో. జీవితంలో తన చేతికి మట్టి అంటకుండా పైన చెప్పిన తమ్ముడి గారిలాగే అవతలి వాళ్ళ మీద తప్పు నెట్టేసి తను ఒప్పై నెగ్గిపోగలడు.

****చివరాఖరికి మన రాం-రాం గారు. మామగారు బెంగళూరులో కొనమన్నారు. కానీ హైదరాబాద్ హై-టెక్ సిటీ గా ఎదుగుతోంది (ఇది ప్రస్తుత గొడవలు లేని కాలం నాటి మాట). స్నేహిత్ ఊరికే అల్లా-టప్పాగా ఇన్వెస్ట్ చేయడు - అని ఆలోచించి, చించీ స్నేహిత్ ని సలహా అడిగి అతను  కొన్న సైట్ ప్రక్కనే తనూ కొన్నాడు. అది ఈరోజు రేటు తగ్గితే అది స్నేహిత్ తప్పా?

అసలు ఒక సంగతి చెప్పనాండీ?! ఒక మనిషి ఎవరికైనా వారి జీవితం లో అడుగడుగునా తానై నిలిచి, తాను ఇచ్చిన ప్రతి సలహాని తు.చ. తప్పకుండా వారు పాటిస్తే - నిజమే - వారి జీవితం లో తప్పొప్పులకి, మంచి చెడ్డలకి ఆ మనిషే భాద్యుడు. కానీ ప్రతీ విషయంలోనూ సలహా అడిగినా, తనకి నచ్చిన వాటినే పాటిస్తూ, నచ్చని వాటిని వదిలేస్తూ , ఏదైనా పొరపాటు దొర్లినపుడు వెనక్కి తిరిగి  "నీ వల్లే" అంటే ఎంత సబబు? పాలు త్రాగే పసిపాప అయినా తనకి కడుపు నిండగానే ఎంత బలవంతం చేసినా తల తిప్పి వద్దని తన భాషలో చెప్పేస్తుంది. అంతే కానీ కడుపు నిండాక కూడా అమ్మ పడుతోంది కదా అని ఎక్కువ పాలు త్రాగేసి, కడుపు నొప్పి తెచ్చుకుని "నీ వల్లే" అని ఏడవదు కదా.  అంటే అంత చిన్న వయసులోనే తనకి ఏది కావాలో, ఏది వద్దో ఆలోచించుకునే శక్తి ఉంటుందనే కదా. అలాంటప్పుడు ఎదిగిన మనం మాత్రం ఆ పాటి భాద్యత తీసుకోలేమా - మనం చేసే పనులకి, నిర్ణయాలకి ?

~లలితా TS

9, నవంబర్ 2011, బుధవారం

నా "నీకో-పాఖ్యానం"



 మేము బెంగళూరులో ఉండేటప్పుడు 
నేను నీకో సోప్ వాడేదాన్ని- ఎందుకంటే నాకు తిరుపతి హాస్టల్ నీళ్ళకి ఏదో స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాంతో పరుచూరి రాజారామ్ అనే స్కిన్ స్పెషలిస్ట్ (ఈయన గుంటూరు లో వుండేవారు - కథలు కూడా వ్రాసేవారు) మెడికేటెడ్  సోప్ అయిన "నీకో" వాడమని చెప్పారు. 

నా MCA వైవా, ప్రాజెక్ట్ సబ్మిషన్ కాగానే  పెళ్ళయింది. అప్పుడు నాకు (అప్పటికి, ఇప్పటికీ కూడా) ఇష్టమైన బెంగళూరుగె  హోగిదివి ;)

పెళ్ళయిన తర్వాత మొదటి సారిగా బదరి, నేను ఇంట్లోకి కావలసినవి కొందామని ఒక పే...ద్ద లిస్టు వ్రాసుకుని ఇంటి దగ్గర విద్యాపీఠ్ సర్కిల్ లో వున్న ఫాన్సీ / మెడికల్ షాప్ కి వెళ్ళాము. 
అక్కడ లిస్టు లో వున్నవి అన్నీ తీసుకున్న తర్వాత బదరి అడిగారు ఇంకేమైనా కావాలా అని. 
నాకు వెంటనే నా స్పెషల్ సోప్ లిస్టు లో వ్రాయడం మరిచిపోయానని  గుర్తు వచ్చింది. వెంటనే నేను హడావిడిగా "నీకో!" అన్నాను. 
బదరి అది వినగానే "నాకు సరే, నీకేం కావాలో చెప్పు" అన్నారు. నేను మళ్ళీ "నీకో!" అన్నాను. 
పాపం! బదరి మళ్ళీ సాధ్యమయినంత ప్రశాంతంగా " బుజ్జాయి! నీకు కావలసినది ఏంటో చెప్పు, నా సంగతి తర్వాత " అన్నారు. 
మళ్ళీ నేను అదే "నీకో!" పాటే పాడాను.
పాపం షాప్ అతను మా ఇద్దరికేసి టెన్నిస్ మాచ్ చూస్తున్నట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళవేపు తిరుగుతూ చూస్తూ అలిసిపోయి తల పట్టుకుని ఈ బేరం తెగేది కాదన్నట్టు చూస్తూ నించున్నాడు. 
అంతే ప్రశాంత-బదరి కాస్తా అశాంత-బదరి అయిపోయి "బుజ్జాయి! నీకేం కావాలో చెప్పు- సరేనా?" అన్నారు- ఖోపం గా!
నేనూ ఇంకా ఖోపంగా "నీకో అని చెప్పానా? నాకు "నీకో" సోప్ కావాలి అన్నాను....
అంతే ఆ షాప్ అతను ఇంకాసేపు వుంటే నేను ఇంకేం తంటా తెస్తానో అని భయపడి పోయి గబగబా సోప్ ఒక బాగ్ లో వేసి, బిల్ బదరి చేతిలో పెట్టేశాడు.
నేను ఏమీ ఎరగనట్టు, అసలేమీ జరగనట్టు నా నీకో సోప్ వున్న బాగ్ ఊపుకుంటూ, బదరికి జరిగిన దాన్ని గుర్తు చేసుకుని ఇంకేదో అనే ఛాన్స్ ఇవ్వకుండా రకరకాల కబుర్లతో కన్ఫ్యూస్ చేసేస్తూ గెంతుకుంటూ తనతో పాటు ఇంటికి వచ్చేశాను.
అదండీ నా "నీకో-పాఖ్యానం" :)

మరిన్ని కబుర్లతో మళ్ళీ మళ్ళీ ఇలాగే విసిగిస్తానని హామీ ఇస్తూ... ;)

కిరణ్ - బుజ్జి కోతి- టార్గెట్ ట్రిప్ కథ


(ఈ కథ కిరణ్ కి పదిహేను నెలల వయసు నుంచి వాడికి మూడేళ్ళు వచ్చేదాకా ప్రతీ వారం రోజు విడిచి రోజు చెప్పినది. ఇందులో వాడే హీరో :). టార్గెట్ ఆ రోజుల్లో కిరణ్ కి ఇష్టమైన స్టోర్. ఇంకా వాడికి ఎల్లో కార్ ఇష్టం, వాక్యూం క్లీనర్ ఇష్టం. కిరణ్ ఆమ్ తినాలంటే అమ్మ ఇల్లు వాక్యూం చేస్తే సరి - అది చూస్తూ గబగబా తినేసేవాడు - మన ఇల్లు వాక్యూం చేస్తున్నామా, వేరే వాళ్ళ ఇల్లా అనే పట్టింపు లేదు :) ఫ్రెండ్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా కిరణ్ ఆమ్-టైం కి నాకొక వాక్యూం క్లీనర్ ఇచ్చేసేవాళ్ళు :)   కిరణ్ ఇందులో బుజ్జికోతికి చేసినవన్నీ వాళ్ళ అమ్మని (అమ్మకోతిని కాదండోయ్) చూసి నేర్చుకున్నవి  :)) )


అనగనగా బాల్ల్విన్ అనే ఊళ్ళో అమ్మ, నాన్నగారు, అన్న, కిరణ్ వుంటారు. 
ఒక రోజు అన్న స్కూల్ కి, నాన్నగారు ఆఫీసు కి వెళ్ళారు. అమ్మ ఆం వండుతోంది. 
కిరణ్ గరాజ్ లో బాల్ తో ఆడుకుంటూ వున్నాడు.
పక్క ఇంట్లో అమ్మకోతి, ఒక బుజ్జికోతి వున్నాయి.
అమ్మకోతి గరాజ్ లో ఆడుకుంటున్న కిరణ్ దగ్గరికి వచ్చి " కిరణ్! కిరణ్! మా బుజ్జికోతికి బోర్ కొట్టి ఏడుస్తోంది. ఒకసారి నువ్వు టార్గెట్ కి టాటా తీసుకెళ్తావా, ప్లీజ్?" అని అడిగింది.

మరి ఏదైనా చేయాలంటే ముందు కిరణ్  అమ్మకి చెప్పాలి కదా! 
అందుకని  కిరణ్ "వుండు. మా అమ్మ ని అడిగి వస్తాను" అని అమ్మకోతికి చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు.
అమ్మ కిరణ్ ని చూసి "ఏంటి కిరణ్ నాన్నా? ఏం కావాలి" అని అడిగింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతిని టాటా తీసుకెళ్ళాలి అని చెప్పాడు.
అమ్మ అప్పుడు "సరే కిరణ్ నాన్నా! నీ ఎల్లో కార్ లో జాగ్రత్తగా వెళ్లి రా" అని చెప్పింది.
కిరణ్ అప్పుడు ఎల్లో కార్ కీస్, తన కళ్ళకి గ్లాసెస్, వాలెట్  తీసుకుని గరాజ్ లోకి వచ్చాడు.

బుజ్జికోతిని వాళ్ళ అమ్మకోతి ఎల్లో కార్ లో బేబీ సీట్ లో కూర్చోబెట్టింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతికి సీట్ బెల్ట్ పెట్టి, ఎల్లో కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసి, గరాజ్ వేసేసి, కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని  "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా మాంచెస్టర్ రోడ్ మీద వుంటుందే.....ఆ టార్గెట్ కి వెళ్ళాడు.
అక్కడ దిగగానే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి, సీట్ బెల్ట్ తీసి బుజ్జికోతిని టార్గెట్ షాపింగ్ కార్ట్ లో ఎక్కించి,  మరి బెల్ట్ పెట్టకపోతే బుజ్జికోతి కార్ట్ లోంచి జారిపడిపోతుంది కదా అందుకని  - బుజ్జికోతికి   ఆ కార్ట్ కి వున్న బెల్ట్ పెట్టి , టార్గెట్ లోకి తీసుకుని వెళ్ళాడు. 
చెప్పడం మర్చిపోయాను - టార్గెట్ లోకి వెళ్లబోయేముందు కిరణ్ గ్లాస్సెస్ తీసేశాడు - లేకపోతే అన్నీ డార్క్, డార్క్ గా కనిపిస్తాయి కదా - అందుకని.

టార్గెట్ లోకి వెళ్ళగానే బుజ్జికోతి చాకొలేట్ కావాలీ..ఈ..ఈ.. అని ఏడ్చింది. 
కిరణ్ అప్పుడు "హుష్, బుజ్జుకోతీ! అలా గట్టిగా ఏడవకూడదు." అని బుజ్జికోతి చెవిలో నె...మ్మదిగా చెప్పి ఒక చాకొలేట్ తీసి బుజ్జికోతికి పట్టుకోమని ఇచ్చాడు - మరి మనం బిల్ పే  చేసేవరకూ తినకూడదు కదా.
కిరణ్ టార్గెట్ లో ఒక రెడ్ లాన్ మోవర్ కిరణ్ కి, ఒక బ్లాక్  లాన్ మోవర్ బుజ్జికోతికి కొన్నాడు. 
మళ్ళీ ఒక ఎల్లో వాక్యూం క్లీనర్ కూడా కొన్నాడు. ఎందుకంటే కిరణ్ కి  లాన్ మోవర్, వాక్యూం క్లీనర్ ఇష్టం కదా అందుకని. 
అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకున్నాడు.
ఇంతలో బుజ్జికోతి మళ్ళీ ఊఊ...ఊఊ... అని ఏడవడం మొదలుపెట్టింది - దానికి ఒక ఎల్లో కార్ బొమ్మ కావాలని. 
మళ్ళీ కిరణ్ ఏం చేస్తాడు పాపం! బుజ్జికోతి చెవిలో  "బుజ్జికోతీ! అలా ఏడవకూడదు" అని చెప్పి ఒక ఎల్లో కార్ బొమ్మ బుజ్జికోతికి ఇచ్చి పట్టుకోమన్నాడు.

అలా కావలసినవి అన్నీ తీసుకుని కౌంటర్ దగ్గర అమ్మాయికి వాలెట్ లోంచి డెబిట్ కార్డు తీసి బిల్ పే  చేసేసి, కిరణ్  మళ్ళీ రెడ్ లాన్ మోవర్, బ్లాక్  లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకుని, చాకొలేట్ ఓపెన్ చేసి బుజ్జికోతికి ఇచ్చి, మళ్ళీ ఎల్లో కార్ దగ్గరికి వచ్చాడు. 

వచ్చి ఎల్లో కార్ ట్రంక్ తెరిచి రెడ్ లాన్ మోవర్, బ్లాక్  లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ ట్రంక్ లో పెట్టుకుని ట్రంక్ క్లోస్ చేసేశాడు. 
బుజ్జికోతిని కార్ సీట్ లో కూర్చోబెట్టి , మళ్ళీ బెల్ట్ పెట్టి, కిరణ్ కూడా కార్ లో ఎక్కి గ్లాస్సెస్ పెట్టుకుని "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా ఇంటికి వచ్చేశాడు. 

ఇంటికి వచ్చి బుజ్జికోతిని, బ్లాక్  లాన్ మోవర్ ని, ఎల్లో కార్ బొమ్మ ని అమ్మకోతి దగ్గర దింపేసి రెడ్ లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్ ని తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చేసి, ఇచ్చేసి,  పప్పు-ఆమ్, పెరుగు-ఆమ్ తినేసి హా....యిగా బజ్జున్నాడు. 

8, నవంబర్ 2011, మంగళవారం

ముద్రా స్వాతంత్ర్యం - మన జన్మ హక్కు


అక్టోబర్ విహంగలో నా వ్యాసం ఇక్కడ చదవండి.


చాలా రోజుల తర్వాత ఆఫీసు లో ఇండియన్ అసోసియేషన్ పుణ్యమా అని  పిక్నిక్ లో భారతీయులం అందరం కలిశాం. ఒక్కొక్కళ్ళూ రావడం ప్రతీ వారినీ పేరు పేరునా పలకరించుకోవడం- హాయ్, హౌ ఆర్ యు?, బావున్నారా? కైసే హైన్ ఆప్ లోగ్? చెన్నాగిదీరేనురీ? నల్లా ఇరుకిన్గిలా?- ఇలా రకరకాల భాషలలో పలకరింపులతో భిన్నత్వం లో ఏకత్వానికి అతి చక్కటి వేదికలా అనిపించింది మా పిక్నిక్ జరిగిన పార్క్.

మగవాళ్ళ ప్రాజెక్ట్ పలకరింపులు, ఆడవాళ్ళ నగల పరికింపులు, భోజన ప్రియుల వంటకాల ఊరింపు కబుర్లు, పిల్లల ఆటపాటలు - వీటన్నిటితో మంచి సందడిగా వుంది. అందరూ ముందుగానే మాట్లాడుకుని "పాట్ లక్" ప్లాన్ చేసుకున్నాము. అందులో భాగంగా చోలే, నాన్లు, వాంగి బాత్, పులిహోర, ఫ్రైడ్ రైస్, బ్రౌన్ రైస్ తో బిర్యాని, పాకిస్తానీ చికెన్ కర్రీ, నూడుల్స్, ఒక మాంగో స్వీట్, పిల్లలకి పిజ్జా, శీతల పానీయాలు, మంచి నీటి బాటిల్స్ - ఓహ్! ఒక మినీ మాయాబజార్ ఘటోత్కచుని పెళ్లి విందు సీన్ ని మరిపించింది - పా ర్క్ లో ముందుగానే బుక్ చేసుకున్న పెవిలియన్ లోని టేబుల్. మగవారు, ఆడవారు, పిల్లలు - ఎవరికి వారు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి ఎవరికి తగ్గ కబుర్లు, కాలక్షేపాలు, మరియు ఆట-పాటల్లో బిజీ  అయిపోయారు. 

మగవారి సంభాషణలు - అమెరికా ఆర్ధిక పరిస్థితి, పడిపోతున్న ఇళ్ళ రేట్లు తో మొదలుపెట్టి ఎవరు ఎక్కడ సంభాషణ ఏ దారి పట్టిస్తే అటు ప్రక్కగా నడిచింది. ఎవరూ కూడా - అదేంటి నేను మొదలు పెట్టిన టాపిక్ నుంచి మీరలా ఎలా ప్రక్కకి వెళ్తారు - అనుకోకుండా సరదాగా ఒక గొలుసు కథలా సంభాషణ నడిపించేశారు. అది చివరికి ఎంత వరకూ వెళ్లిందంటే ఆ పార్క్ లో ఎదురుగా వున్న ఒక బిల్డింగ్ లో అసలు ఎంత ఇనుము, చెక్క వాడారు? అది కట్టడానికి ఎంత అయి వుంటుంది - అని ఎవరికి తట్టిన రీతిలో అంచనాలు కూడా వేసేశారు.

ఆడవారు చూస్తే- చేసే ఉద్యోగాల్లో సాధక బాధకాలు, పిల్లల చదువులు, టీనేజ్ పిల్లల మారుతున్న ప్రవర్తనలు, కొత్తగా కాలేజ్ కి వెళ్ళిన పిల్లల తల్లుల బెంగలు - ఇలా రకరకాలుగా ఎప్పటినుంచో చూడలేకపోయిన చుట్టానితో పంచుకుంటున్నట్టు గల గలా మాట్లడేసుకుంటున్నారు. 

పిల్లలు తమ వెంట తెచ్చుకున్న బాల్స్ తో ఆడుకుంటున్నారు. కొందరు  రోలరు స్కేట్స్, బైసికిల్స్ మీద పార్క్ అంతా తిరుగుతున్నారు. ఇంకొందరు అక్కడ వున్న ఉయ్యాలలు ఎక్కి ఊగుతున్నారు. 

మొత్తానికి వాతావరణం చిరు చలిగా వున్నా అందరం కలిశాం అన్న ఉత్సాహం తో దాన్ని పట్టించుకోకుండా హడావిడిగా ఆనందంగా తిరిగేస్తున్నారు అందరూ. వాళ్ళందరినీ పలకరిస్తూ, ఫోటోలు తీస్తూ అటూ ఇటూ తిరుగుతూ వున్న నేను కొంచెం సేపు కూర్చుందామని ఒక టేబుల్ దగ్గర ఆగాను. ఇంతలో ప్రక్కనే టేబుల్ దగ్గర కూర్చున్న ఒకాయన అటు ప్రక్క పడ్డ బంతి కోసం వచ్చిన ఒక బాబుని చూసి - ఏంటి వినోద్! మీ నాన్న నీకు తిండి పెట్టట్లేదా? ఇంత సన్నగా వుంటే ఎలా? అని - తన ప్రక్కన కూర్చున్న ఆ పిల్లవాడి తండ్రితో - ఏంటయ్యాబాబూ! ఇదంతా ఆదా చేయడమే? కొంచెం మీవాడికి రోజూ మాంచి చికెన్, మట్టన్ అవీ పెట్టు. నీ ఆస్తేం తరిగిపోదులే - అని అదేదో పెద్ద జోక్ లా తనలో తనే నవ్వేసుకున్నాడు. పాపం! ఆ అబ్బాయి మొహమాటంగా నవ్వేసి బాల్ తీసుకుని వెళ్లి పోయాడు. ఆయన మటుక్కి ఆయన ఒక 30 సెకనుల మాట అనేసి ఊరుకున్నాడు- కాని అది ఆ అబ్బాయి మనసులో ముప్పై ఏళ్ళు అయినా మర్చిపోలేని గాయం చేస్తుందని గ్రహించలేక పోయాడు. అసలు ఆ మాటల తూటా వదిలిన ఆసామీ ఎలా ఉంటాడా అని కొంచెం నాకు సహజమైన కుతూహలంతో ప్రక్కకి తిరిగి చూశాను- ఐదున్నర అడుగులకి తక్కువ ఎత్తుతో, ఇంకా పెళ్లి కాకుండానే స్టేడియం ని మరిపిస్తున్న శిరోరత్నం తో భాసిస్తున్న అతనిని చూడగానే నాకు చటుక్కున అనిపించింది- ఇతను ఎందరిచేతో వ్యాఖ్యానించబడి ఉంటాడు. అందుకే అంత తేలిగ్గా అనేయగలిగాడు అని. చెప్పొద్దూ- కోపం బదులు జాలి వేసింది. ఒక్కోసారి ఇలా అనేవాళ్ళని చూస్తే పెద్దవారి మీద ఏదో కోపం వుండి వారిని అనలేక వారి పిల్లల మీద తీర్చుకుంటున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరి పిల్లలకి వారి కుటుంబంలో జన్యువులను బట్టి తల్లి, లేదా తండ్రి వైపు వారి ఆకార రూపాదులు వస్తాయి. ఒక పొట్టిగా ఉన్నవారి పిల్ల / పిల్లవాడిని పొట్టి అంటే వారికి వాళ్ళ  అమ్మ / నాన్న పోలిక వచ్చి వుంటే - ఆ మాట ఎవరిని ఉద్దేశించి అన్నట్టు?

మనకి ఎలాగైనా వాక్స్వాతంత్ర్యం ఎక్కువండీ - ఏదైనా చూడగానే ఆశువుగా మన అభిప్రాయాలు చెప్పేస్తాము. దానివల్ల అవతలివాళ్ళకి బాధ కలుగుతుందా లేదా అనేది మనకి అనవసరం. అసలే మనది చాలా ఫ్రాంక్ నేచరూ! 

మన ఇంట్లో ఎవరైనా రంగు తక్కువగా వున్నారనుకోండి - ఇంక వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్లకి ఏ రంగు దుస్తులు నప్పుతాయో, ఏవి నప్పవో ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే వుంటారు. ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్ళలో  కానీ, అన్నదమ్ములలో  గానీ ఒకరు ఛాయ తక్కువగా వుంటే చాలా తరచుగా వినిపించే మాట - ఇది నీకన్నా దానికి / వాడికి బావుంటుంది. నువ్వు వేరేది తీసుకో -  వినడానికి ఏముంది అంత బాధ పడాల్సింది ఇందులో , ఉన్నమాటే కదా. ఏమి చెప్పినా పిల్లల మంచి కోసమే కదా అనిపిస్తుంది. కానీ ఆ పిల్లల వైపునుంచి ఆలోచిస్తే ఒంటి రంగుతో సంబంధం లేకుండా ఆ పిల్ల / పిల్లవాడికి ఫలానా రంగు ఇష్టమైనా దాన్ని ఇష్టం గా ధరించే స్వేచ్ఛ వుండదు. ఎవరు ఏమనుకుంటారో అన్న బెరుకు వుంటుంది. అది పోను పోను ఆత్మన్యూనత కి దారి తీసి వాళ్ళు బాధపడినట్టే ఇంకొకరిని బాధ పెట్టె మనస్తత్వానికి దారి తీస్తుంది.

ఒక పాప తనకి చిన్నవి అయిపోయిన బట్టలు ఎవరికీ ఇవ్వడానికి ఒప్పుకునేది కాదు. ఒకవేళ తనకి తెలియకుండా ఇచ్చినా ఆ తర్వాత ఎప్పుడైనా వేరే పిల్లలు ఆ దుస్తులు వేసుకుని కనిపిస్తే ఏడ్చి గొడవ చేసేది. ఎందుకలా చేస్తోంది అని గమనించి చూస్తే అక్కడ జరుగుతోంది ఏంటంటే ఆ దుస్తులు వేరే పిల్లలకి ఇచ్చిన తర్వాత ఆ పాప తల్లి తనకి ఆ పిల్లలని చూపించి - చూశావా, పాపాయి! నీ డ్రెస్ ఆ పాప వేసుకుంటే ఎంత బావుందో? నీకేమో టైట్ అయిపోయింది. దానికి చక్కగా సరిపోయింది- అనేది. ఈ పాప కొంచెం బొద్దుగా వుంటుంది. కొన్న ప్రతీ డ్రెస్ రెండు నెలల్లో టైట్ అవుతూ వుండేది. ఇంట్లో సరదా చేస్తున్నాం అనుకునే  వరసయిన పెద్దవాళ్ళు తనని - ఏయ్ బొండాం! అని పిలిచేవారు. దానికి తోడు తన అమ్మే తన ముందు ఇంకొకళ్ళని మెచ్చుకోవడం ఆ పాప భరించలేకపోయేది. 

మా స్నేహితులొకరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేముందు తమ రాక గురించి తెలపడానికి ఫోన్ చేసి ఒక మాట అనేవారు - మీకు తెలుసు కదా లలితా... మా పిల్లలు కొంచెం మంకీ బ్రాండ్. అలా అని నవ్వేసేవారు. నిజం చెప్పాలంటే ఆ మాట వినగానే స్నేహితులని కలుస్తాము అనే ఆనందం కన్నా వారి పిల్లలని ఎలా సముదాయించాలి అనే ఆలోచనే ఎక్కువ వుండేది. తీరా చూస్తే ఆ పిల్లలు పాపం! అంత అల్లరి చేసేవారూ కాదు, ఏదో బాల్య సహజమైన పరుగులు పెట్టటం, ఆటలలో అరవటం తప్ప. అసలు అంత గొడవ చేసే పిల్లలు కాకపోయినా ముందుగా ఒక మాట అనేస్తే ఏం జరిగినా తమ మీదకి రాదనే ధోరణిలో పెద్దవారు అనే ఈ మాటలవల్ల అనవసరంగా వారిపిల్లలకి ఒక బ్రాండ్ (ముద్ర) పడిపోతుంది.

ఇలాంటి ముద్రలు ఎవరిమీద అన్నా  వేసేముందు తమని వారి స్థానం లో ఊహించుకోగలిగితే ఎవరూ ఎవరినీ చటుక్కున మాట అనేయలేరు. 

కొంచెం బొద్దుగా వుంటే - పొత్రం లా వున్నావు, తిండి తగ్గించు - అనకుండా ముద్దబంతి లా వున్నావు అనండి ఆ పాప మొహం లో విరిసే ఆనందం చూడండి. 
సన్నగా వుంటే - పుల్లలా వున్నావు చూడు - అనకుండా సన్నజాజి మొగ్గతో పోల్చండి - చిరునవ్వు వెన్నెల పరిమళాలు ఆస్వాదించండి.

ఒక వేళ మీరు మరీ ఫ్రాంక్ గా మాట్లాడే సత్య హరిశ్చంద్రులయితే - అందమైన అబద్ధం చెప్పకపోయినా ఫర్వాలేదు, కానీ కత్తిలా పొడిచే నిజం అనకుండా వుండండి చాలు - కొన్ని హృదయాల బాధ తప్పించిన పుణ్యం దక్కుతుంది.

ఈ దసరా రోజుల్లో అందరికీ సరదా పంచే మాటలు మాట్లాడి నవ్వుల పూవులు పూయించే ధన్య జీవులమవ్వాలని కోరుకుంటూ....

విజయ దశమి శుభాకాంక్షలతో....




మా మంచి దేవుళ్ళు


సెప్టెంబర్ విహంగలో నా వ్యాసం ఇక్కడ చదవండి.



ఈ సంవత్సరం మా వూళ్ళో వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది. శ్రావణ మాసం పేరంటాళ్ళు చక్కగా పట్టుచీరలు కట్టుకుని వివిదాభరణాలంకృతులై  శ్రావణ లక్ష్ముల్లా వచ్చి వాయనాలు తీసుకుని వెళ్ళారు. అదే సమయానికి చిరుజల్లులతో వర్షం పడి చిన్నప్పుడు అమ్మ వెనకాల పట్టు పరికిణీలు కట్టుకుని, పసుపు పూసిన పాదాలతో ఒక్కొక్క ఇంటికి పేరంటానికి వెళ్తూ చెల్లెళ్ళతో, స్నేహితురాళ్ళతో ఎవరి కాలి మువ్వల పట్టీలు ఎక్కువ శబ్దం చేస్తాయో చూద్దామని పోటీలు పడుతూ వర్షపు నీటి మడుగుల్న్ట్టి దాటుతూ పెట్టిన  పరుగులు జ్ఞాపకం వచ్చాయి. అందరమూ చిన్ననాటి సంగతులు గుర్తు తెచ్చుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. 

ఆ సంభాషణ సారాంశం ఏంటి అంటే - పేరంటం లో కలిసిన వాళ్ళు అందరూ దాదాపుగా పదేళ్ళ నుంచి వున్న ఊరిని వదిలిపెట్టి ఉత్తర అమెరికా ప్రవాసదీక్షలో ఉంటున్న వాళ్ళు :) . అందులో ఒక స్నేహితురాలు నాతో ఇలా అంది - మీరు అన్నీ చాలా చక్కగా చేశారు, లలితా ! ఎప్పుడూ నేనూ అనుకుంటూ వుంటాను గానీ ఎందుకో గానీ కుదరట్లేదు. ఇండియా కి ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ తిడుతూ వుంటారు - అలా మన పూజలు మానేయకూడదు, మంచిది కాదు అని. మనసులో చేయకపోతే ఎలా అని బెరుకుగానే వుంటుంది. కానీ ఏం చేస్తాను - పిల్ల్లల చదువులు, నా ఉద్యోగం, ఉరుకుల పరుగుల జీవితం - ఏదీ కుదరట్లేదు అని.

వెంటనే చెప్పాను  నేను తనకి - అబ్బే అలాంటివి మనసులో పెట్టుకోకండి. మనం మంచి మనసుతో ఒక నమస్కారం చేసినా చాలు. దేవుడు మనలా మనిషి కాదు, పట్టించుకోలేదని కక్ష సాధించడానికి. ఇదే విషయం మీద నేనొక వ్యాసం వ్రాశాను. చదవండి అని ఈ విహంగ పత్రిక లింక్ ఇచ్చాను. 

ఎవరి నమ్మకాలు వారికి వుండడం మంచిదే- కుదిరినప్పుడు ఇష్టపడి, కుదరనప్పుడు కష్టపడుతూ అయినా ఆ నమ్మకాలకి తగినట్టు ఆచరించడమూ మంచిదే. కానీ ఇంకొకరు అవే పద్ధతులు పాటించలేదని, అలా పాటించకపోవడం వల్ల ఏదో చెడు జరుగుతుందని భయపెట్టడం తగదు. అదెలా అంటే మాకు తెలిసిన ఒకరు ఒకానొక వ్రతం ఆచరించడానికి కావాల్సిన పద్ధతులు, మడి పాటించడానికి అశక్తులయి ఆ ఎప్పట్నుంచో చేస్తున్న ఆవ్రతం చేయడం మానుకున్నారు. తర్వాత ఆ ఇంటి యజమాని రోడ్డు ప్రమాదానికి గురి అయారు. అదృష్టవశాత్త్హూ తొందరగానే కోలుకున్నారు. మళ్ళ్లీ ఎప్పట్లాగే తమ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ కష్టంతో ఇంట్లో వారందరూ ఇంకొంచెం దగ్గర అయారు. ఒక రకంగా ఇంతకుముందు కన్నా ఇప్పుడు హాయిగా వున్నారు. ఏదో ఒక కష్టం తర్వాత ఒక సుఖం అని తమ మనసులకి సర్ది చెప్పుకున్నారు. ఇటీవల వారిని కలిసిన మిత్రులొకరు ఏడాది క్రితం జరిగి, అసలు వాళ్ళే దాదాపుగా మరచిపోతున్న ఆ ప్రమాదం గురించి తెలుసుకుని - అయ్యో! మీరు ఆ ఫలానా వ్రతం మానేశారు కాబట్టే ఇలా జరిగింది. ఏమైనా సరే మీరలా చేయడం మానేయకుండా వుండాల్సింది - అనేశారు. అంతే! పాపం - మర్చిపోయి కుదుట పడుతున్న ప్రాణాలకు ఒక్కసారి మళ్ళీ - నిజమే ..చేయకపోతే ఎంత నష్టమో - అన్న అనుమానం మొదలయింది. అది విన్న నాకు - అరెరే! ఆ భగవంతుడి పేరు చెప్పి ఎన్ని భయాలు కల్పిస్తారో కదా - అనిపించింది.

ఇక్కడ ఒకసారి మన ముందు తరాలవారు ఇలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నప్ప్పుడు - అంటే అనుకున్న విధంగా పూజలు, వ్రతాలు చేయలేనప్పుడు - ఎలా ఎవరినీ నొప్పించకుండా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తగిన ఉపాయంతో ఎలా అధిగమించేవారో  చెప్పాలి. పూర్వం కొన్ని కుటుంబాల్లో పెద్దవారు  సూర్య నమస్కారాలు చేసి, ఆదిత్య హృదయం చదివిన తర్వాతనే భోంచేసేవారు. అలాంటివారికి వర్షాకాలంలో మబ్బు పట్టి  సూర్యభగవానుడు కనిపించని రోజుల్లోఇబ్బందిగా వుండేది. వయసులో వున్నప్పుడు ఎలాగోలా భోజనం చేయకుండా ఉండగలిగినా వయసు మీరేకొద్దీ ఆకలికి ఉండలేక - సూర్యనారాయణ మూర్తీ! తండ్రీ! నేనింక ఈ వ్రతం చేయలేను గానీ- మన్నించు.మా ఇంట్లో పుట్టే పిల్లలకి నీవి మువ్వరుస పేర్లు పెట్టుకుంటాను - అని ఒక దండం పెట్టి వ్రతాన్ని ముగించేవారు. అందుకే కోనసీమలో చాలా ఇళ్ళల్లో - పెద సూర్యనారాయణ, చిన సూర్యనారాయణ , సూర్యనారాయణ మూర్తి, రవి, సూర్య కుమారి, సూర్య ప్రసాద్ - అని పేరులో "సూర్య" శబ్దం లేక అర్థం కలిసి వచ్చేలా పిల్లల పేర్లు వరసగా వుంటాయి. ఎంత మంచి పద్ధతి కదా - అనుకున్నది చేయలేనప్పుడు ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా అందులోంచి విరమించుకోవడం కూడా హుందాగా చేయగలగడం! 

ఇది చదివిన తర్వాత మీరే చెప్పండి - నా ఆలోచన సరి అయినదో, కాదో - ఒక ఇంట్లో అసహాయురాలైన కోడలు పాపకి పట్టడానికి పాలు ఎక్కువ పోయించుకోమంటే ఆ కోడలి కుటుంబంలో అటూ, ఇటూ ఏడు తరాల వాళ్ళని ఆడిపోసుకుని, నకార మంత్రం జపించిన ఒక అత్తగారు మరుసటి రోజు నాగుల చవితి అని పుట్టలో పోయడానికి అని ఎక్కువ పాలు పోయించుకుంటే ఆవిడని - ఆహ! ఎంత గొప్ప భక్తురాలు - అని ఆ నాగదేవుడైనా అనుకుంటాడా?

నోటితో సహస్రనామం చదువుతూ, అదే నోటితో ఇంకొకరి మనసు నొప్పిస్తే  ఆ నామ ఫలితం దక్కుతుందా?

అవసరం లేని  ఆర్భాటాలతో పూజలు చేసి, ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడానికి ఒక్క మెతుకు కూడా రాల్చని వారికి భగవతుడి కటాక్షం లభిస్తుందా?

ఇలా అంటున్నానని నేనేదో నాస్తికురాల్ని, దేవుడంటే భక్తి లేనిదాన్ని అనుకోకండి. మనకి తెలీకుండా మనం వెళ్ళాల్సిన దిశని నిర్దేశించే శక్తి ఒకటి వుందని నేను నమ్ముతాను. ఆ శక్తి కి వున్న అనేక రూప, నామాలని ఇష్టంగా దర్శించి, జపిస్తాను. కానీ ఎలాగూ కనిపించడు కదా అన్న ధైర్యంతో ఆ దేవుడి ప్రతినిధుల్లా ప్రతీ దానికి తమదైన భాష్యాలని చెప్పే వారిని చూసినప్పుడల్లా వాళ్ళ వల్ల ఇంకెంతమంది బాధ పడాలి కదా అనిపిస్తూ వుంటుంది.

ఒక మాట మాత్రం నిజమండీ -  దేవుడు చాలా మంచివాడు. 

పత్రం  పుష్పం  ఫలం  తోయం 
 యో  మే  భక్త్యా ప్రయచ్చతి 
 తదాహం   భక్త్యుపహృతం 
అశ్నామి  ప్రయతాత్మనః  

చిత్త శుద్ధి గల భక్తితో మనం సమర్పించే ఆకు, పువ్వు, పండు , నీరు - ఏదైనా ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడు.  

కుల, మతాలకి అతీతంగా రాముడైనా, అల్లా అయినా, జీసస్ అయినా  - ఏ పేరుతో పిలిచినా మన దేవుళ్ళందరూ ఎంతో మంచివాళ్ళు.  మంచితనం తప్ప భక్తులనుంచి ఏమీ ఆశించనివారు. 

26, ఆగస్టు 2011, శుక్రవారం

అద్య ధారా-సదాధారా -నిరాధారా

(చిన్నప్పుడు వేసవిలోశలవులకి అనాతవరం వెళ్ళినప్పుడు  మా ఇంటి అరుగుమీద నాన్నమ్మ ఒళ్ళో పడుకుని విన్న ఎన్నో కథల్లో ఇది ఒకటి. )


ఒకసారి భోజరాజుకి, కాళిదాసుకి ఏదో కావ్యచర్చల్లో భిన్నాభిప్రాయం వచ్చింది. అప్పుడు కాళిదాసు భోజ రాజాస్థానానికి దూరంగా వెళ్లి ఒక చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటూ వున్నాడు.     

కొంతమంది ఆకతాయిలు కాళిదాసు వద్దకి వెళ్లి - స్వామీ! ఏం చెప్పమంటారు. మీరిలా రాజాస్థానం లోంచి అడుగు బయట పెట్టారో లేదో భోజ రాజుగారు కాలం చేశారు అని.


అది వినగానే కాళిదాసు నోటినుంచి ఇలా ఒక శ్లోకం వెలువడింది:
అద్య  ధారా  నిరాధార  నిరాలంబా  సరస్వతీ
పండితః  ఖండితః  
సర్వే భోజ   రాజే దివం  గతే



(ఈరోజు ధారా నగరం నిరాధారమయింది. సరస్వతీ దేవికి ఆలంబన లేకుండా పోయింది. పండితులందరూ చెల్లాచెదురయారు.  ఇదంతా భోజరాజు దివంతుడవడం వల్లనే కదా!!!)


అదే సమయానికి రాజ్యసభలో మంత్రులతో కాళిదాసుతో తనకి వచ్చిన భేదాభిప్రాయాన్ని ఎలా పరిష్కరించాలా అని మంతనాలు జరుపుతున్న భోజరాజు సింహాసనం మీదనే ఒరిగిపోయాడు.


రాజుగారికి ఏమయిందో అర్థం కాక సభలో అందరూ దిగ్భ్రాంతులై చూస్తుండగా కాళిదాసుకి అబద్ధం చెప్పిన ఆకతాయిలు సభలోకి భయపడుతూ వచ్చి జరిగినది ఏమిటో చెప్పగానే మంత్రులందరూ వెళ్లి కాళిదాసుకి అసలు విషయం వివరించారు.


వెంటనే కాళిదాసు ఈ క్రింది శ్లోకం పలికాడు.
అద్య  ధారా  సదాధారా  సదాలంబా సరస్వతీ
పండితః  మండితః  సర్వే భోజ   రాజే   భువం  గతే 

(ఈ రోజు భోజరాజు భువికి వచ్చాడు. ఆయన రావడంతోనే ధారా నగరానికి ఆధారం దొరికినట్లయింది. సరస్వతీ దేవికి ఆలంబన దొరికింది. పండితులు ఆరింపబడ్డారు.)
వెంటనే సింహాసనం మీద తెలివి తప్పి పడి  వున్న భోజరాజు స్పృహ లోకి వచ్చాడు.
పుంభావ సరస్వతి అయిన  కాళిదాసు వాక్శుద్ధిని తెలిపే కథ ఇది.

25, ఆగస్టు 2011, గురువారం

దేవ దేవ మము ...

నాన్నమ్మ పాట


దేవ దేవ మము కాపాడుము 
నీ పాదములే గతి మురళీ మోహన ...


కనుపడరాదా కనులకు మాధవ
హరి నారాయణ గో..ఓ..ఓ..వింద...||దేవ దేవ మము||


అనుదినమును నీ నామామృతమే
పారాయణ జేసెద శ్రీ...ఈ..ఈ...కృష్ణ...||దేవ దేవ మము||

16, ఆగస్టు 2011, మంగళవారం

లివింగ్ రూం సిండ్రోం

మే నెల వనితా మాలికలో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మా ఇంటికి ఎవరు వచ్చినా మా బుజ్జి జింక (అంటే మా జింక కళ్ళ కిరణ్ అన్నమాట)ఎగురుకుంటూ ఇది మా అన్న మ్యూజిక్ రూంఇది మా అన్న బెడ్ రూంమా మాస్టర్ బెడ్రూం,మా బొమ్మల క్లోసెట్ అంటూ ఒక చిన్న టూర్ ఆఫ్ ది హౌస్ కార్యక్రమం జరిపిస్తాడుఅదృష్ట వశాత్తూ వీలైనంత వరకూ ప్రతీ వారం క్లీనింగ్ పేరుతో ఇల్లు పీకి పందిరేసే అలవాటు నాకునా ఇద్దరి బుడుగులకి వుంది కాబట్టి మా అతిథులకి మనస్తాపం కలిగించే దృశ్యాలు ఎక్కువ వుండవు మా ఇంట్లో :) )

కాని అప్పుడప్పుడూ ఆఫీసులో మేజర్ రిలీజ్ టైం లోనోఇంకే కారణాలవల్లనో  ఒక్కోసారి ఎక్కడివి అక్కడే వదిలేసి చిన్న కిష్కింధని మరిపించేలా చేసి మా సృజనాత్మకతకి మేమే జై చెప్పుకుంటూచేతికికాలికి అడ్డు వచ్చిన వాటిని కంటికి ఆననీయకుండా (దీనికి నా ముద్దు పేరు - becoming selectively blind) – మా జీవ వ్యాపారాలుఅంటే వంటహోమ్వర్కులు-అన్నీ కానిచ్చేస్తూ ఉంటాముఅలాంటప్పుడు  హఠాత్తుగా మా శ్రీవారు బదరి మా ప్రశాంత జీవితాల్లో ఒక కలకలం వచ్చేలా ఒక అనూహ్య ప్రకటన చేస్తారు సాయంత్రం మనింటికి చంద్ర శేఖర్ వస్తున్నారు తెలుగు సినిమా డివిడిల కోసం అనిఅసంకల్పిత ప్రతీకార చర్యలా కళ్ళు ఇల్లంతటినీ ఒకసారి స్కాన్ చేస్తాయిఇంకేముంది గబగబా పోటీలు పడుతూ నేనూనా సుపుత్రులూ ప్లానింగ్ డెస్క్ మీద వున్న పుస్తకాలుకాగితాలు అన్నీ హడావిడిగా క్రింద నున్న సొరుగుల్లో తోసేస్త్తాం లివింగ్ రూం సోఫాల్లో వున్న ఆఫీసు లాప్ టాపులుహోమ్వర్క్ పేపర్లు,సగం మడతేసిన బట్టలు వగైరాలు పై ఫ్లోర్ కి రవాణా చేసేస్తాంఅలా యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లంతా సర్దేసి (క్రింద భాగమే సుమా!) డివిడిల సముదాయాన్ని సిద్ధంగా ఉంచుతాంమేము కూడా బొమ్మల కొలువులో అప్పుడే అమర్చిన బొమ్మల్లా కూర్చుంటాంరావాల్సినవారు వచ్చి కావలసినవి తీసుకువెళ్లగా మళ్ళీ మా పనుల్లో పడిపోతాంఅసలు తమాషా ఇక్కడే ప్రారంభం.పాపం వచ్చినాయన కాలికి తట్టుకుంటాయనోకంటికి బాధ కలిగిస్తాయనో అనేక దిక్కులకి రవాణా కాబడ్డ వస్తువులన్నీ ఎక్కడికి చేరాయో అక్కడే ఉండిపోతాయి (సెలెక్టివ్ మెమరీ :) ).ఆ తదుపరి వచ్చు దినాల్లో ఎవరికి ఏం కావాలన్నా అంజనం వేసి కనిపెట్టాల్సిందే :) ).అలాంటప్పుడే అనిపిస్తుంది ఇంకెపుడూ ఏదీ వాయిదా వేయకూడదు అనిదానితోపాటు ఇంకో ఆలోచన కూడా వస్తుంది అసలెందుకుఏ ఉద్దేశ్యంతో అంత పడుతూ లేస్తూ ఎవరో వస్తున్నారని లివింగ్ రూం మాత్రం శుభ్రం చేశాం అని.

అంటే ఎవరికైనా ఇల్లు   చూపించేటప్పుడు గానిమనని మనం పరిచయం చేసుకునేటప్పుడుగాని ఎందుకు మన మంచి” వైపునే చూపించడానికి ఇష్టపడతాంఅలా అని మన ఇంట్లో ప్రతీ గదిని,మన వ్యక్తిత్వంలో ప్రతీ కోణాన్ని ఎప్పుడూ ఎందుకు శుభ్రంగాస్వచ్ఛముగా ఉంచుకోం?

ఉదాహరణకి ఒక ఇంట్లో పిల్లాడి చదువు విషయమై హోరా-హోరీ గొడవ జరుగుతోంది అమ్మ,నాన్నఅబ్బాయిల మధ్యతండ్రి అంటాడు ఒరేఇలా చదివితే ఆఫీసుల్లో కాఫీ కప్పులు మోయడానికి కూడా పనికిరావుఆ సుబ్బారావు గారి అబ్బాయిని చూడు ఎప్పుడూ చదువుతూనే ఉంటాడువాడిని చూసి బుద్ధి తెచ్చుకోఅలా గాడిదలా తిరక్క అనిఆ తల్లి కూడా తమ పుత్రరత్నం బాగుపడాలనే మంచి ఉద్దేశ్యంతోనే తన వంతు అక్షింతలు కూడా వేస్తుందిఒక్కోసారి చదివిన చదువులకివ్యక్తిగత ప్రపంచంలో వాడే భాషకి ఏమీ సంబంధం వుండదు అనిపిస్తుందికొందరి పదాల వాడుక వింటుంటేఆరకంగా ఆ తలిదండ్రుల నుంచి తన వారసత్వపు పదసంపదని మననంతో వృద్ధిచేసుకుంటూ ఆ సుపుత్రుడుండగా ఇంటి కాలింగ్ బెల్ మ్రోగుతుందిఅంతే డైరెక్టర్ కట్ చెప్తే మారిపోయే సీనులా గబగబా ముఖాలకి నవ్వు రంగులద్దుకుని తలుపులు తీస్తారుచాల సభ్యతాయుతమైన ప్రవర్తనతోభాషతో అతిథిని అలరిస్తారుఅవే నవ్వులతో సాగనంపుతారుతలుపు మూయగానే మళ్ళీ ఇందాకటి అంకానికి తెర తీస్తారుమరి అంతకు ముందు వాడిన అచ్చ” తెలుగులోనే అతిథితో కూడా మాట్లాడవచ్సుగాఅమ్మోఅలా అయితే ఇంకేమైనా ఉందామన పరువు పోదూపోనీ ఆయనతో మాట్లాడినట్టే ఇంట్లో సమస్యలు కూడా సామరస్యంగాఅనునయంగా మాట్లాడి సాధించుకోరాదూబయటి వాళ్ళతో ఎలాగూ తప్పదు ఇంట్లో కూడా మనం మనలా ఉండకపోతే ఎలాచాలా విచిత్రమైనఒప్పుకోదగిన వాదనే ఇది :) 

ఇంకో కోణంలో చూస్తే కొందరుంటారుజీవితం అంటే సరైన అవగాహన వుండదుమనంమన సుఖం తప్ప ఇంకోటి పట్టదుఇతరుల కష్టసుఖాలకి తమ ప్రమేయం లేదు కాబట్టి పట్టించుకోవక్కర్లేదు అంటూ ఉంటుంటారుకానీ వీరికి అన్నివేళల్లోనూ తాము చేసే ప్రతీ పనిని ఎవరో గుర్తించాలనే కోరిక వుంటుందిదానితో గొప్పకోసం తమ ఇంటికి వచ్చేవారికి (ఈ వచ్చేవారికి అన్నీ వుంటాయిడబ్బూహోదా మరి అలాంటి వారికి చేస్తేనే కదా గుర్తింపు!)అవసరం అయిన దానికన్నా ఎక్కువ మర్యాదలు చేస్తారు మనసులో వారంటే నిజంగా ఇష్టం లేకపోయినాఆ వున్న కాసేపట్లో తమ గురించి అవతల వాళ్ళ మనస్సులో మంచి ఇంప్రెషన్ కలిగించడానికి తాపత్రయ పడతారువాళ్ళు వెళ్ళాక షరా మామూలే వారి మీద తమదైన చెడు ఉద్దేశ్యాన్ని బయటపెట్టడానికి ఆలోచించరువెనకాడరుదురదృష్ట వశాత్తూ ఇలాంటి ప్రవర్తనకే చాలా మంది అలవాటు పడ్డారు.

ఇదిగిదిగో ఇలా వుండేవుండాలనిపించే వైఖరికే నేను పెట్టుకున్న పేరు లివింగ్ రూం సిండ్రోం.ఎవరైనా వస్త్తున్నారంటే-సర్దబడే ఇల్లు చుడిదార్లోకోచీరలోకో మారే నైటీలు కొత్తగా ఇంగ్లీషు,కొంచెం సంస్కారం చేరే భాష ముక్కులు తుడవబడి ముద్దు చేయబడే పిల్లలు -సందర్భానుసార ముసుగేసుకున్న వ్యక్తిత్వాలు ఇవీ ఈ లివింగ్ రూం సిండ్రోం లక్షణాలలో కొన్నిదీనికి మందేమిటయ్యా అంటే ఎవరికి వారి మనస్సాక్షివిచక్షణపరిసరాల శుభ్రతే కాదు ఆలోచనకీమాటకీమనసుకీ శుభ్రత ఉండాలనే ఎరుక
.