చిమ్మ చీకటి... చుక్క మిణుకు.
కిటికీకి అవతల - అప్పుడప్పుడూ దూది మబ్బు దుప్పటి కప్పుకుంటూ, అప్పుడే పక్కకి తప్పుకుంటూ - తప్పించుకున్న మబ్బులు పూర్తిగా కప్పేయకుండా ఎంత సేపుంటాడో తెలీకుండా - దోబూచులాడుతున్న వెండి జాబిలి.
పక్కనే దేశీ-రేడియోలో వినీ వినిపించకుండా - "ఓ బచ్‌పన్ కే దిన్! రులా న దేనా" అని అంటూ లతామంగేష్కరూ, "ఆజ్ హసే, కల్ రులా న దేనా " అని షంషాద్ బేగమూ పాడుకుంటున్న పాట వింటూ బెంగ పడిపోతున్నాను అప్పుడే - ప్రతి రోజూ లాగే!
పగటి వెలుగులో హడావిడి పడిపోతూ తెగ ఆరాట పడే నా మైండ్ మెల్లగా అలముకునే చీకటితో చల్లబడుతుంది.
చిక్కబడుతున్న చీకటి పూట చెప్పుకునే కబుర్లు నాకు బోల్డంత ఇష్టం.
నిశ్శబ్దపు రాత్రిని చెదరగొట్టకూడదన్నట్టు తమకు తామే తగ్గి నెమ్మదిగా మోగే గొంతుల మాటలు నాకు మరీ ఇష్టం.
పసుప్పచ్చ దీపపు వెలుగులో సోఫాలో ఓ మూలకి ఒదిగి - ముడుచుకుని - నేను దాన్ని కప్పుకుని మూటనయ్యానో, అది నన్ను చుట్టి మూట కట్టిందో - చెప్పలేనంతగా నేనూ, నన్ను చుట్టుముట్టిన బొంతా కలిసి, చలితో దెబ్బలాడేసి, చెల్లాచెదురయ్యేలా తరిమికొట్టేసి - పుస్తకం పట్టుకున్న చెయ్యి ఒక్కటి మాత్రం బయటపెట్టి, కదలకుండా - చదువుకునే పుస్తకంతో - చెప్పే కబుర్లు నాకు మరీ మరీ ఇష్టం.
నాగ్గుర్తుండి ఈ మధ్యకాలంలో - చిన్నప్పటి జ్ఞాపకాలతో ఇష్టంగా కొనుక్కున్న Anne of Green Gables సిరీస్, Little House on the Prairie సిరీస్ తప్ప - ఒక్క పుస్తకం కూడా పట్టుమని పది పేజీలు కుదురుగా చదివింది గుర్తులేదు.
కానీ ఈ వారం మొదట్లో సోమవారం రోజు ఇండియా నుంచి అమ్మ పంపించిన ఉసిరావకాయతో పాటు వచ్చిన ఒక పసుప్పచ్చటి పుస్తకం - వచ్చినప్పటినుంచీ ఊరిస్తూనే ఉంది. దానికి తోడు - ఆ పుస్తకం చుట్టూ చుట్టిన కవరూ, దాని మీద ఊరి మట్టిలో మొలిచి, చిగురించిన పచ్చనాకు లాంటి ఆకుపచ్చ అచ్చరాలలో రాసి ఉన్న నాన్న పేరు, ఇంటి అడ్రెస్స్ చూస్తూ "భలే! ఎంత అందంగా ప్రింటు చేశారో అడ్రెస్ కూడా" అని మురిపోతున్న నాతో "అదీ... అతను చేత్తో రాసినట్టున్నాడు" అని అంటూనే ఎంతో అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని - అప్పుడే చదవడం మొదలెట్టేశారు బద్రీ.
అటు వెళ్లి ఓ రెండు పేజీలు చదవడం... వంటింట్లో ఏదో పాడుకుంటూ నా పనేదో చేసుకుంటున్న నన్ను కదిలించి "బుజ్జాయ్! ప్రతీ పేజ్ ఒక gem!" అనడం.
మళ్ళీ ఇంకో గంటకో, గంటన్నరకో ఇంకో రెండో, మూడో పేజీలు చదవడం... బుద్ధిగా ఏ ఆఫీసు డాక్యుమెంటో చెక్కుతున్న నా చెవి దగ్గరకొచ్చి జేసుదాస్ కేసెట్లు పట్టుకుపోయిన టేస్టున్న దొంగ గురించి చెప్పడం.
మరసటి రోజు - మళ్ళీ వచ్చి - "పులక్ బిశ్వాస్ గీసిన చెట్టు, చెట్టుకి తేడా ఉంటుందట" - అనీ మెరిసే కళ్ళతో చెప్తూ - మరునిముషంలోనే "నీకు తెలుసా? మహానంది అడవుల్లో చెట్లకి ఉండే ఆకుల పచ్చరంగూ, పాపికొండల్లో చెట్ల ఆకుల రంగూ వేరు వేరుగా ఉంటాయీ" అంటూ - చేతిలో పట్టుకున్న పసుపుపచ్చ పుస్తకాన్ని పదేపదే మునివేళ్ళతో ముట్టుకుంటూ, మురుసుకుంటూ ఉన్న బద్రిని చూసి - చెప్పొద్దూ - కొంచెం కన్నా ఎక్కువగానే కుళ్ళుకున్నా.
మధ్యమధ్యలో నేనూ వెళ్ళి పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పబోయాను. కానీ అలా చదవడానికి మనసొప్పలేదు. తిప్పబోయిన పేజీలని కుదురుగా బజ్జోపెట్టి మళ్ళీ నా పని లోకో, పాట లోకో వెళ్లిపోయేదాన్ని. అలా వెళ్ళిన ప్రతీసారీ నా రెండు చేతులనీ నా కళ్ళకెదురుగుండా పెట్టుకుని చూసుకునేదాన్ని - ఆ వేళ్ళ చివరల ఏమైనా చిత్రకారుడి రాతల రంగురంగులు ఏమన్నా అంటుకున్నాయేమో అని.
సోమవారం నుంచి గురువారం దాకా ఇదే తంతు.
ఇహ ఇలాక్కాదని గురువారం రాత్రి భోజనాలు అయ్యాక అయ్యగారు-అబ్బాయిలు ఎవరి గదుల్లో వాళ్ళు కుదురుకున్నాక - మర్నాడు శుక్రవారం ఆఫీస్ ఉందన్న స్పృహ ఎంతున్నా కూడా - ఆ స్పృహని "ఎహె! అవతలికెళ్ళు" అని కసిరేసుకుని -
మళ్ళీ నేను,
నా వాలుపు సోఫా పొంత,
నే మీద వేసుకున్న బొంత,
నా చేత రేఖాయాత్ర ప్రచురణ
దాని గుండా మొదలయిన నా పఠనా యాత్ర.
ఎన్నో ఏళ్ళ తర్వాత - చదవడం మొదలెట్టి - - అక్కడక్కడా ఉన్న పుస్తకాల కబుర్లు, సినిమాల కబుర్లు తప్పించి - మిగిలిన పుస్తకమంతా - మా అమ్మ అన్నట్టు "శ్రీరామ" నుండి "చిత్తగించవలెను" దాకా - ఆపకుండా రెండున్నర గంటలు చదివిన మొట్టమొదటి పుస్తకం "అనగనగా ఒక చిత్రకారుడు".
అలా ఎందుకు చేశానూ అంటే... నిజానికి నేను ఆ పుస్తకం చదవలేదు.
ఆ పుస్తకంలో పేజీ పేజీ నాతో కబుర్లాడింది.
రాత్రి పూట - పక్కన పడుకున్న బుల్లి బుజ్జాయి లేవకూడదనుకుంటూ - అలా అని మాట్లాడుకోకుండా ఉండలేక గొంతు తగ్గించుకుని మెత్తగా మాట్లాడుకుంటామే - అచ్చు అలానే మాట్లాడింది ఈ పుస్తకం కూడా.
అంత మాట్లాడుకున్న తర్వాత - ఆ పసుప్పచ్చ రంగు పుస్తకంతో అంత దోస్తీ కుదిరాక - "భలే వుంది, అదేదో చదివినట్లుంది" - అని ఓ రెండు పొడి మాటలనేసి ఆనక అలమార అరల్లో అలంకరించేసుకుని - "అన్వరూ! ఆల్ డన్!" - అనేయాలనిపించలేదు.
అందుకే నాతో మాట్లాడిన పుస్తకం కబుర్లని "అనగనగా ఒక అన్వరుడు ఏమన్నాడంటే ..." అని మొదలెట్టి మీకు కథలు కథలుగా చెబ్దామనీ...
తల ఓ పక్కకి కొద్దిగా ఒంచి - కుడి అరచేతిలో కుడి చెంపని ఆన్చుకుని నే చెప్పబోయే కబుర్ల కథలు వింటారనీ...
మొదలెట్టేస్తున్నా.... మొదలెట్టేస్తున్నా....
అన్నట్టూ... ముందే చెప్పేస్తున్నా - నాకు నచ్చిన - ఎన్ఠీఆరు, వాణిశ్రీ, కృష్ణ, ఎస్పీబీ, రఫీ, కిషోర్కుమారు, లతామంగేష్కరు, ముళ్ళపూడి బుడుగు - లాంటి ఎన్నో నిత్య ప్రియవచనాల్లో అన్వరుడు ఇంకో ప్రియవచనం - అంతే! గార్లూ, బూర్లూ కావాలంటే వండుకుని తిందాం గానీ పేర్ల చివర అతికించలేదని నన్నాట్టే సాధించకండి.
రెడీ... వన్ ... టూ... త్రీ.... గో!
అపురూపం
ఎవరికైనా "డూ యువర్ బెస్ట్" అని అతి మామూలుగా చెప్పేస్తాం - కానీ - ఎన్ని పనులు, ఎవరు, ఎంత బెస్టుగా చేస్తున్నామో - అంతా ఒట్టి టేకెన్ ఫర్ గ్రాంటెడేగా!
రోజూ మామూలుగా చెప్పే "థేంక్స్" అనే మాటని కృతజ్ఞతని నింపుకుని అంటే, ఆ మాట విన్న మనిషిని ప్రేమ కూడా తాకాలట. ఇది అపురూపానికే అపురూపమనిపించే అపురూపమైన ఆలోచన. చదువుతుండగానే "ఇద్దీ! ఇలాంటి మాటలే అనండర్రా, వినండర్రా!" అని గాఠిగా చెప్పెయ్యాలనిపించింది.
అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు - స్థిరంగా పని చేస్తున్న చేతులు, తడబడకుండా నడుస్తున్న కాళ్ళు, అన్నాన్ని గుటక వేయగలిగిన గొంతు దాకా తీసుకెళ్లగలిగే నాలుక - వీటన్నిటినీ మహా-taken-for-granted గా తీసేసుకుంటాం గానీ - అవి granted-to-us-for-using-consciously అన్నది - నొక్కి వక్కాణించి చెప్తున్నట్టున్న ఈ అపురూపం చదువుతుంటే నాకు శశికపూర్ గుర్తుకొచ్చాడు.
కపూర్ల ఇంటి కడగొట్టు పిల్లడు, రాజ్ కపూర్, షమ్మీ కపూర్ల బుల్లి తమ్ముడు ఎంత చలాకీగా ఉండేవాడో స్క్రీన్ మీద! నవ్వితే మొహమంతా మతాబాల వెలుగే. పాటకి ఆడడం మొదలు పెడితే - ఒంట్లో చేతులూ, కాళ్ళూ దేనికవే వేటికి కావాల్సిన దిక్కులో అవి స్ప్రింగుల్లా ఆడుతూ ఉండేవి.
అలాంటి శశికపూర్ చివర్లో చక్రాల కుర్చీలో కూర్చుని చిన్నప్పుడు తను నటించిన సినిమాలు చూసుకుని "అది నేనేనా ? ఈ చక్రాల కుర్చేలో కూర్చున్న ఈ నేను, అక్కడ హుషారుగా గెంతుతున్న ఆ నేను ఒకరేనా?" అని ఎంతో బాధ పడేవాడట.
సరిగ్గా అలాంటి పరిస్థితినే అందరికీ గుర్తుచేస్తుంది అపురూపం.
చదివే ప్రతి దాంట్లో కవిత్వపు ఛాయలు వెతుక్కునే నాకు ఇందులో ఇంకో అపురూపమైన బోనస్ - "కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్" పాట ప్రసక్తి.
ఈ అపురూపం చదవడం అయ్యాక - నాకు అలవాటే అయినా - ప్రతిక్షణం అపురూపంగా గడపడం మీద ప్రీతి - ఇంకొంచెం పెరిగింది నాకు.
కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్
కిసీ కా దర్ద్ మిల్ సకే తో లే ఉధార్
కిసీ కే వాస్తే హో తేరే దిల్ మే ప్యార్
జీనా ఇసీ కా నామ్ హై
పాడుకుంటూ తర్వాతి పేజీ కబుర్లలోకి...
ప్రయాణం
ఇక్కడ ప్రయాణం ఒక ఊరిలో మొదలు పెట్టి - ఇంకో ఊరిలో మజిలీ చేసి - చివరికి ఏదో గమ్యం చేరి "హ్మ్!" అంటూ నిట్టూర్చే టైపు కాదు.
బొమ్మల కోసం ఒక చిత్రకారుడు - అనుక్షణం తన ఆలోచనే తన తోటి యాత్రికుడై - తన లోపలి ఆలోచనలని తరచి చూసుకుంటూ -తనతో తను చేసుకునే యాత్ర.
ఆ యాత్రలో తారసపడిన గడ్డి, చెట్టు, ఇళ్ళు, ఇంటి రేకులు, ఆ రేకుల మీదుగా వెలిగిపోయే సూర్యోదయాలు - ఇవే కాదు... ముంబాయి క్రాఫర్డ్ మార్కెట్లో - రహదారులే గృహాలుగా చేసుకుని తిరుగాడే వేలాది జనాలు - వీళ్ళందరూ కూడా ఈ చిత్రకారుడి చేతిలో జీవం పోసుకునే బొమ్మలే. ఆ అన్వరుడి ఆలోచనల్లో జీవించే బొమ్మల కథలే.
ఈ ప్రయాణంలో గీతకారుడు అన్వరుతో పాటు రాతకారుడు పూడూరి (?) రాజిరెడ్డి కలిసి చేసిన ప్రయాణపు విశేషం కూడా ఒకటి ఉందండోయ్ - అదే నాకు దక్కిన బోనస్ ఈ ప్రయాణం కబుర్లలో.
ప్చ్! ఇందులో పాటలేం లేవు. అయినా ఫర్లేదు...ముందు ముందు ఉండే ఉంటుంది మురిపించే పాటల పండగ!
తర్వాతి పేజీలోకి వెళ్ళిపోతున్నా - నాకు తోచిన పాట పాడుకుంటూ...
పక్షుల రెక్కలు ... అద్దెకు దొరికితే - ఒంటికి తొడిగి పైకె గురూ...
పక్షులకెన్నడూ ... పాస్‌పోర్ట్ లేదు - ఖండాలన్నీ దాటెళ్ళు!
సామాజిక స్మగ్లర్లు
పుల్లయ్య అనబడే రామసుబ్బయ్య, శీను, శేఖర్, మధు, నాగరాజు, సురేష్, రమేష్, మోహన్, కుమార్, చింతపండు, సుబ్బలక్మి -
వీళ్ళందరూ ఏమట్లు?
అన్వరుకి ఏమయేట్లు?
వీళ్ళందరూ సామాజిక స్మగ్లర్లు అయ్యిందెట్లు?
అది తెలవాలంటే మీరు మాత్రం అనగనగా ఒక చిత్రకారుడు పుస్తకంలో పదో పేజీ నుంచి పన్నెండో పేజీ దాకా చదవాల్సిందేనబ్బా!
ఆ రెండు, మూడు పేజీల్లోనే
చూడాలని ఉంది...
అమ్మా! చూడాలని ఉంది
నిన్ను - చూడాలని ఉంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
ఒకసారి మాత్రం నిన్ను చూస్తే చాలులే అమ్మా
అని అమ్మ కోసం ఆశగా వెతుక్కునే పసి-అన్వర్ కూడా పలకరిస్తాడు.
ప్రేమ ప్రకటన
ప్రేమప్రకటన పలు రకాలు...
ఆ రకాల రకరకాలు పలురకాలు.
ఆ పలురకాల బహుముఖాలు ఎలాంటివంటే...
"ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా ..." పాట వినీవినగానే నచ్చేసి - "1942 ఎ లవ్ స్టోరీ" సినిమా పాటల క్యాసెట్లు ఒకేసారి మూడు కొనడం ఒక రకం.
హెచ్‌ఎంవీ వాడు వేసిన జేసుదాసు పాటలవి - రెండు సెట్ల క్యాసెట్లని కొని - జేసుదాస్ పాటలు కాపీ చేసుకుని ఇస్తానన్న మనిషికి ఒక సెట్టు అరువిచ్చి - అది అరువు కాదు అచ్చంగా అట్టుకుపోవడం అని అర్థమయ్యాక - ఆ పట్టుకెళ్ళిపోయినవాణ్ణి మంచి టేస్టున్న దొంగ అని మెచ్చుకోవడం రెండో రకం.
కొడవటిగంటి, చలం, శేషేంద్రశర్మ, పెద్దిభొట్ల - వీళ్లందరి పుస్తకాలు, ఐదు సెట్ల సైగల్ పాటల క్యాసెట్లు కొనుక్కుని - వాటిని రెండు చేతులతో పట్టుకుని - ఊరిని వాటికి, ఊరికి వాటిని చూపిస్తూ - ఊరింపుగా, ఊరేగింపుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లడం మూడో రకం.
(ఈ మూడో రకం గురించి చదివీ చదవగానే నాకు చెప్పిందే చెప్పి "భలే! ఇలాంటి ఇష్టం - అంటే ఇష్టమైన పుస్తకాలు చేతిలో పట్టుకుని నడవాలనిపించేంత పుస్తకమోహం ఉంటుందని ఊహించలేం కదా!" అని బద్రి ఎంత మురిసిపోయారో! అది కూడా ఒక రకమైన ప్రేమ ప్రకటన రకమే మరి!)
తమిళ కథకులు పిచ్చమూర్తిగారు రాసిన "భగవదర్చన" కథకి పది రకాల గోపురాల స్కెచ్చులు వేయడం నాలుగో రకం.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి "మార్గదర్శి" కథలోని చేబోలు శంభుశాస్త్రి పేరుని తనకి ఇంకో కొడుకు ఉంటే వాడికి పెట్టాలనుకోవడం ఐదో రకం.
(శ్రీపాదవారి కథల్లో నాకు అత్యంత ఇష్టమైన "మార్గదర్శి" కథ గురించిన ప్రస్తావన అన్వర్రాతలో చూడగానే నేనూ మురిసిపోయి - ఒక్కసారి లేచెళ్ళి నా లైబ్రరీలో ఉన్న శ్రీపాద వారి రెండవ కథల సంపుటం తెరిచి "మార్గదర్శి" కథనో సారి దర్శించుకొని వచ్చి కూర్చుని ఇది రాస్తున్నాను. ఇదీ ఓ రకం ప్రేమప్రకటనే!)
ఆర్టిస్టు చంద్ర గారు చేయి అందించినా - మించిన గౌరవభావంతో - అందించిన చేయిని అందుకోకుండా - రెండు చేతులూ జోడించి దండం పెట్టడం ఆరో రకం.
బాపు గారి నుంచి ఫోన్ వస్తే మాట్లాడేటప్పుడు వేసుకున్న చెప్పులు విప్పేయడం ఏడో రకం.
భుక్తి పెట్టే విద్య బొమ్మలేయడం, రంగులేయడం. ఆ సరస్వతి కోసం వందల కొద్దీ పెన్నులు, పెన్సిళ్లు, రంగులు, కుంచెలు కొనడం ఎనిమిదో రకం.
ఇంకా బోల్డు రకాలు ఉండే ఉంటాయి - కానీ ఎన్ని రకాలని ఏముంది?! ప్రేమంటూ ఉంటే -అది ఎన్నో రకాలుగా ప్రకటితమవుతూనే ఉంటుంది. అది - ఇది, అది - అని లేని - ఎన్నెన్నో రకాలు!
అందుకే పాడుకుంటూ అంటున్నా ... అన్వర్! తేరా రాత బడా ప్యారా!
అలా పాడుకుంటూ 17 వ పేజీ లోకి...
ఐదో దిక్కున అతడు
ఇందులోని అతడు ప్రముఖ కార్టూనిస్ట్ టి. మోహన్ గారు.
రాసిన సందర్భం ఆయన స్వర్గస్థులైన రోజు సెప్టెంబర్ 21, 2017.
ఇక్కడ నాకు గుర్తుకొచ్చిన పాట ...
ఈ అనంత కాల గమనంలో
ఈ రవ్వంత జీవన పయనంలో
అందరు నీవారు - చివరకు మిగిలేదెవరూ లేరు
తర్వాతి పేజీ లోకి కదిలిపోతూ...
రంగు బలపం
చిన్నారి పొన్నారి బాలలను పుస్తకాల వైపుకి ఆకర్షించడానికి, అలరించడానికి బాలల కథల పుస్తకాలకు బొమ్మలూ, రంగులూ వేసిన మెత్తటి రంగుల బలపం లాంటి చిత్రకారుడు పులక్ బిశ్వాస్ కథ ఇది.
నాకు ఇది చదివే వరకు ఇండియాలో బొమ్మల పుస్తకాలు ఉంటాయని, వాటిల్లో పిల్లలని మురిపించి, మైమరపించే రంగురంగుల బొమ్మలుంటాయని అస్సలు తెలీదు. నేను కాల్విన్ గాడి దగ్గర్నుంచి లాగేసుకోవాలని చూసే హాబ్స్ పులి కన్నా అందమైన పులుల్ని పులక్ బిశ్వాస్ గారు గీసి రంగులతో నింపారని చదవగానే - వెంటనే గూగుల్లో వెతుక్కుని ఆయన వేసిన బొమ్మలు చూసి - మహా పులకితం మదీయ మానసం!
ఇది చదువుతూ పాడుకున్న పాట (నా మాటల్లో)...
రంగ్ బిరంగే ఫూల్ ఖిలే హై
కుఛ్ లోగ్ హీ ఫూలోం జైసే ...
ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా కొని తెచ్చుకుంటా ఆ రంగుల-బొమ్మల-ప్రపంచాలు.
తొలి ప్రేమలేఖ
వెన్నెల ఎందుకు కాస్తుంది?
పూలెందుకు పూస్తాయి?
కృష్ణశాస్త్రి కవిత్వమెందుకు రాస్తారు?
ముళ్ళపూడి వారి అప్పారావు అప్పులెందుకు చేస్తాడు?
ఎందుకు? ఎందుకు? ఎందుకు?
చిత్రకారుడు స్కెచ్చులు అందుకే వేస్తాడు.
ఆ స్కెచ్చులు వేసే స్కెచ్చుబుక్కే చిత్రకారుడి ప్రేమలేఖ.
ఆ స్కెచ్చు బుక్కులో ఉండేవి ఏంటంటే - కదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, వికారంగా మొహం పెట్టుకుని కవిత్వం పుస్తకం చదివే పాపం వాళ్ళు, ఫేస్‌బుక్‌లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్‌ల మధ్య తేడా, ....వీటన్నిటి స్కెచ్చులూ, అవి పోయే హెచ్చులూ.
అపుడెప్పుడో ఈమాటలో అనుకుంటా చూశా - అన్వర్గీతలు - ఒక పేజీ నిండా కిక్కిరిసినట్టుగా వేసిన బోల్డన్ని బొమ్మల స్కెచ్చులు. ఆ బొమ్మల మెరుపులకి కళ్ళు చెదిరాయి. ఆ మెరుపు-కళలు మళ్ళీ ఈ "తొలి ప్రేమలేఖ" చదువుతుంటే గుర్తొచ్చాయి.
ఇది చదువుతూ హమ్ చేసుకున్న పాట - బొమ్మలమ్మి సువర్ణసుందరి పాడుకున్న - బొమ్మాలమ్మా ... బొమ్మలూ...
*********
*********
ఒకటా, రెండా - ఏభై నాలుగు కబుర్ల కథలు. ఇప్పటికివి చాలు. వారానికి ఇన్నీ అని - రెండు వారాలకోసారి - పేజీ-మజిలీ-కబుర్లలా చెప్పుకుందామేం?!
అడగడం మర్చిపోయాను - హార్టిస్టుగారూ!
సాధారణంగా రాతొచ్చినవారికి గీత రాదు. గీతొచ్చిన వారికి రాత కుదరదు.
గీత-రాత సవ్యంగా-దివ్యంగా తెలిసిన సవ్యసాచి మీరు.
మీ పుస్తకంలో రాతలకి పైనో, కిందో కొన్ని గీతలు (స్కెచ్చులు) గీసుంటే ఇంకెంత బావుండేదోనండి!
ఈసారి పుస్తకం వేసే ముందు ఈ మాట గుర్తుంచుకోండేం!