19, మార్చి 2018, సోమవారం

త్వామనురజామి - 23 - నీకై వచ్చితినోయీ...ఎండల్లో తిప్పితినోయీ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 22 - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి

ఎప్పట్లాగా ఈసారి సైడ్ బెర్త్ దొరకలేదు.

వున్న ఆరు సీట్లలో నేను, నాతోపాటు శ్రీలత కాక ఆ అబ్బాయిది కూడా ఒక సీటు.

లోపలికి వచ్చిన నన్ను చూసి చిన్నగా తన మార్కు నవ్వు నవ్వుతూ - "హలో" - అన్నాడా అబ్బాయి.

నా పక్కనే వున్న శ్రీలత కొంచెం ఆశ్చర్యంగా చూడబోయి -అంతలోనే ఏం జరిగి వుంటుందో దాదాపుగా అర్థమైపోయి - మళ్ళీ నేనెక్కడ ఉడుక్కుని లల్లి-శోక-పిల్ల అవతారం ఎత్తుతానో అని పసిగట్టేసి -అసలు అంతకు ముందు ప్రయాణంలో జరిగినదేదీ గుర్తు లేనట్లు - తనూ ఫ్రెండ్లీ గా నవ్వుతూ ఆ అబ్బాయిని పలకరించారు.

కాసేపు సెలవుల్లో ఏం చేశామో ఆ కబుర్లూ, కాలేజ్ కబుర్లు అవీ చెప్పుకుని - పదింటికల్లా ఎవరి బెర్తుల్లో వాళ్ళు చేరిపోయి పడుకుండి పోయాము.

తెల్లవారుఝామున రేణిగుంటకి ఇవతల ట్రెయిన్ ఎందుకో చాలాసేపు ఆగిపోయింది. అక్కణ్ణించి బయల్దేరిన తర్వాత కూడా - నాలుగు చక్రాల దూరం కదలడం, ఆగిపోవడం.

బయటికి చూస్తున్న నాకు వర్షం పడి అక్కడక్కడా మడుగులు కట్టిన నీళ్ళు కనిపించాయి.

నేను అవి చూస్తూ - "శ్రీలతా! ఈ ట్రెయిన్ పూర్వజన్మలో పడవేమో! నీళ్ళు కనిపించిన ప్రతి చోటా ఆగిపోతోంది" - అనగానే ఆ అబ్బాయి నా మాటలు విని - ఓ కనుబొమ్మ మాత్రం పైకి లేపి - నవ్వుతో కళ్ళను వెలిగించుకోవడం కనిపించింది.

మొత్తానికి ఆగీ, కదిలీ అసలు టైముకి గంట ఆలస్యంగా వూరు, హాస్టల్ గూడు చేరాం.

హాస్టల్లో అమ్మాయిలు ఊరెళ్ళొచ్చిన ఆనందంలో - పండక్కి కొనుక్కున్న కొత్త బట్టల్లో సీతాకోకచిలుకలకి రెక్క-విడిచిన చుట్టాల్లా వున్నారు.

పండక్కి ఇంటికి వెళ్ళేముందు నా జూనియర్స్ శుభ, రజని, అరుణలతో స్నేహం SPIC-MACAY ప్లానింగ్ దాటి ఈవెనింగ్ వాక్ దాకా పెరిగింది.

సెలవుల తర్వాత మొదటిసారి నన్ను డైనింగ్ హాల్లో చూడగానే ముగ్గురూ నా దగ్గరికి వచ్చారు - "హాయ్ లల్లీ! హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు?" అంటూ.

వాళ్ళని చూడగానే నా ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక ట్రెయిన్ ఎపిసోడ్ మొత్తం చెప్పాను.

వాళ్ళు ముగ్గురూ కూడా నా కన్నా ఎక్సైట్‌ అయ్యారు - నేను చెప్పింది విని.  అంతటితో ఆగక - మాకూ చూపించు ఆ అబ్బాయిని - అని అడిగారు.

వాళ్ళడిగారని కాదు కానీ నాకూ మళ్ళీ ఆ అబ్బాయిని ఒకసారి కలవాలనిపించింది.

అప్పటికి ఇంటి నుంచి వచ్చి రెండు రోజులే అయింది.

మరుసటి రోజు గురువారం. మధ్యాహ్నం క్లాసులు లేవు. ఒకే ఒక్క క్లాస్ - రెండింటికి వుంది - సత్యం సర్ OB క్లాస్. బుధవారం రాత్రి డైనింగ్ హాల్లో కలిసినప్పుడు శుభ, రజని, అరుణలకి చెప్పాను - "మీకు కుదిరితే రేపు తీసుకెళ్తాను SVU - SBM (School of Business Management) కి - ఆ అబ్బాయిని చూపించడానికి" అని.

వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సరే అంటే సరే అనుకుని  - నాతోనూ అదే అనేశారు.

గురువారం పొద్దున్న పదకొండున్నరకి రాఘవేంద్ర సర్ క్లాసులోంచి ఓ అరగంట ముందు పర్మిషన్ అడిగి బయటికి వచ్చేశాను. ఆ రోజు శుభా వాళ్ళకి క్లాసుల్లేవు - అందుకని హాస్టల్ దగ్గరే వెయిట్ చేస్తామని చెప్పారని నేను కూడా మా కళ్యాణి బ్లాక్ దగ్గర కెళ్ళి కింద నుంచే పిలిస్తే ముగ్గురూ గబగబా వాళ్ళ రూంలోంచి దిగి కిందకొచ్చారు.

వారెవా ! ముగ్గురూ తీన్ దేవియా అన్నట్లు తయారైవచ్చారు.

శుభా రామస్వామి సిల్క్ చుడిదార్, కళ్ళకి ఐ-లైనర్, లైట్‌గా లిప్‌గ్లాస్ - తళతళలాడే కళ్ళతో కళకళలాడిపోతోంది.

అరుణ మంచి మల్టీ-కలర్డ్ ఘాగ్రాలో మెరిసిపోతోంది.

రజని లక్నోకుర్తాలో సింపుల్ ఎండ్ ఎలిగెంట్‌గా తళుక్కుమంటోంది.

నేనేమో అమ్మ పండక్కి కుట్టించిన మిలిటరీ గ్రీన్ కలర్ చుడీదార్లో, నూనె రాసి బిగించి వేసి ఊలు తాడుతో పైకి కట్టిన ఒంటి జడతో తిలతిలలాడుతున్నాను :))

నలుగురం నడుచుకుంటూ మా హాస్టల్ చిన్న గేటు, ముందున్న పాలిటెక్నిక్ హాస్టల్ పెద్దగేటు దాటి రైల్వే బ్రిడ్జ్ కిందున్న సన్న దార్లో నడుచుకుంటూ వెళ్ళి, మెయిన్ రోడ్ దాటి SBM చేరాం.

MBA-Finance సెకండ్ సెమిస్టర్ క్లాస్ ఎక్కడా అని అడిగితే ఎవరో ఫస్ట్‌ఫ్లోర్‌లో అని చెప్పారు. 

వెంటనే అదే ఫ్లో లో గబగబా మెట్లెక్కి ఫస్ట్‌ఫ్లోర్‌లో క్లాస్‌రూం దగ్గరికి వెళ్ళి - తలుపు దగ్గర ఆగాను.

లోపల క్లాస్ జరుగుతోంది.

పాఠం చెప్తున్న ప్రొఫెసర్ - తలుపు దగ్గర వచ్చి నిలుచున్న నన్ను చూసి ఆయన చెప్తున్నదేదో ఆపి "Yes !" అన్నారు.

వెంటనే నేను "I want to talk to Badari" అన్నాను.

అంతే! ఆయనింకేం మాట్లాడలేదు. క్లాస్ అంతా పిన్-డ్రాప్-సైలెన్స్.

నెమ్మదిగా అబ్బాయి లేచి బయటికి వచ్చాడు.

తనూ, మేం నలుగురం అమ్మాయిలూ మెట్లు దిగేవరకూ ఆ క్లాస్‌లో మళ్ళీ అలికిడి మొదలయినట్లు గుర్తు లేదు.

కిందకి రాగానే అడిగాను అబ్బాయిని - "భీమాస్‌లో లంచ్‌కివెళ్దామా?" -అని.

తొణకని చిరునవ్వే సమాధానం.

ఐదుగురం కలిసి భీమాస్‌కి వెళ్ళాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాం. శుభ, రజని, అరుణలకి కూడా అబ్బాయి నవ్వు, మాటలు తెగ నచ్చేశాయి. 

భోజనం కాగానే నా ముగ్గురు జూనియర్స్ శిల్పంలో గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవాలి అంటూ అటెళ్ళిపోయారు.

నేనూ, అబ్బాయీ కలిసి టౌన్‌బస్ ఎక్కాము.

జనవరి ఎండ. వెచ్చగా వుంది.

తిరుపతి కొండగాలి చల్లగా వుంది.

మొట్టమొదటిసారి మాటలురాని అబ్బాయిగా చూసినప్పుడే వెంటబడి వెళ్దామా అనిపించిన నాకు - పక్కనే కూర్చుని నవ్వుతూ నా మాటలు వింటున్న అబ్బాయితో - ఎందుకు చెప్పాలనిపించిందో ఇప్పటికీ తెలీదు కానీ - అసలలా చెప్పడం ఎంత సాహసమో అప్పుడు తట్టలేదు కానీ - హఠాత్తుగా - తగిన సందర్భమే లేకుండా తనకేసి తిరిగి అనుకోకుండా నేననేసిన మాట "You know one thing ?! We will make a nice pair!"

తను మాత్రం అదే చిరునవ్వు - "అవునా?" అంటూ. అంతే!

ఆ మాటకి ముందూ - ఆ మాటకి తర్వాతా - మిగిలిన మాటలన్నీ మామూలువే.

ఓ అరగంటలో మేమిద్దరం రెడ్ బిల్డింగ్స్ స్టాప్ దగ్గర బస్ దిగాము.

దిగుతూనే అడిగాను - "నాకు ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఒక్కదాన్నీ వెళ్ళడం నాకు భయం. మా ఓల్డ్ హాస్టల్ గేట్ దాకా వస్తారా?" అని.

"సరే పద" అని మెత్తగా అంటూ మళ్ళీ అదే చిరునవ్వు.

తనొస్తానని చెప్పగానే "హమ్మయ్య" అనేసి పక్కనే నడుస్తూ "You know one thing ? మా సీనియర్ గుత్తి పద్మజ ఇటు వచ్చేటప్పుడు ఎప్పుడూ తన బ్యాగ్లో ఒక చిన్న నైఫ్ పెట్టుకుని వస్తుంది - self-defense కోసం - తెలుసా?" అని బోల్డు గొప్పగా చెప్పాను.

మళ్ళీ ఓ కనుబొమ్మ పైకి లేపి అదే మూకీ-రియాక్షన్ నా టాకీ-ఏక్షన్‌కి. నాకింత కన్నా ఇంకేం కావాలి - బోల్డు మాట్లాడుదామనే నాకు మాట్లాడుకున్నంత :)

నన్ను మా హాస్టల్ గేట్ దగ్గర వదిలేసి అబ్బాయి వెనక్కి వెళ్ళిపోయాడు.

-----------------------------------------------------------------------------------------------------------

తర్వాత వారం ఒక రోజు చేతిలో ఓ పదిహేను, ఇరవై SPIC-MACAY కార్డులు పట్టుకుని ఒక్కదాన్నీ SBM కి వెళ్ళాను. అబ్బాయి ఫ్రెండ్స్ బోల్డు మంది వుంటారు కదా! మేము ఫిబ్రవరిలో హోస్ట్ చేయబోతున్న స్మితారాజన్ మోహినీ-ఆట్టం ప్రోగ్రాంకి వాళ్ళందరినీ మెంబర్స్‌గా చేర్చడానికి ఇదొక మంచి అవకాశం. అలాగే కల్చరల్ సెక్రెటరీగా నేను అంత మందిని చేర్పిస్తే నాకే గొప్ప కదా!

ఇలా తెగ ఆలోచించేసి ఓ పెద్ద స్కీమే వేసి వెళ్ళానా - నేననుకున్నట్టే అబ్బాయి క్లాస్స్మేట్స్ (శ్రీనివాస్, గిరిరాజ్, ఫ్రెడరిక్, సాయి ప్రసాద్, సాయి సురేష్, చిరుభాయ్ అని పేరెన్నిక గన్న మోహన్, రామన్, రాజశేఖర్ రెడ్డి), సీనియర్స్ (రాజశేఖర్, చక్రపాణి, ట్రిచీ మోహన్) - ఇంకా చాలా మంది తలో పదిహేను రూపాయిలిచ్చి SPIC-MACAY కార్డులు తీసుకెళ్ళారు.

నేనేమో - నేను అబ్బాయి ఫ్రెండునేమో అనేసుకుని మెంబర్స్ అయ్యారు అనుకున్నాను. కానీ వాళ్ళ స్కీం ఏంటంటే SPIC-MACAY కార్డుని మా క్యాంపస్‌లోకి రావడానికి తిరుగులేని ఎంట్రీ కార్డుగా వాడుకోవడమని నాకప్పుడు తట్టనే లేదు.

మొత్తానికి మా SPIC-MACAY ప్రోగ్రాం సూపర్-హిట్టు!

ఇంతలో మార్చ్ వచ్చింది - థర్డ్ సెమిస్టర్ పరీక్షలు. బుద్ధిగా రాసేశాను.

పరీక్షల తర్వాత కొత్తగా అయిన ఒక అలవాటు - అబ్బాయితో మా హాస్టల్ నుంచి నడుచుకుంటూ అలిపిరి దాకా వెళ్ళి రావడం - రెండు గంటల ఈవెనింగ్ వాక్ ఎండలో. దారంతా బోల్డంత కబుర్లు - అమ్మ, నాన్న, పప్పి, కుట్టి - ఇంకా శ్రీనన్న, బాబు, ప్రశాంతి - మేము చెప్పుకునే కబుర్లు, పాటలు, సరదాలు - మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టే ఉండేదాన్ని.

అందులో నేను చదివే పుస్తకాల గురించి కూడా బోల్డు కబుర్లు. అప్పుడే నా దగ్గర తిలక్ రాసిన "అమృతం కురిసిన రాత్రి" పుస్తకం ఉందని తెలిసి అడిగి చదివిస్తానని తీసుకుని వెళ్ళారు.

అలాగే తను కూడా - వాళ్ళమ్మగారు, తమ్ముడు, చెల్లెలు గురించి బోల్డంత ఇష్టంగా చెప్తూ - వాళ్ళు నలుగురూ ఫ్రెండ్స్‌లా ఎలా కబుర్లు చెప్పుకుంటారో, కలిసి పుస్తకాలు చదివి ఎలా వాదించుకుంటూ వుంటారో -  ఇంకా తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అనిల్, ప్రభాకర్, మదన్, జార్,  తను డిగ్రీ చదివిన APRDC  ఫ్రెండ్స్ సీకే, సాయి, బాలాజీ - ఇలా అందర్నీ ఎంతో ఇష్టంగా మాటల్లోనే - నేను వాళ్ళని చూడకపోయినా - నాకు వాళ్ళందరూ ఎప్పటినుంచో తెలుసేమో అనిపించేలా భలే చక్కగా పరిచయం చేశారు. 

ఇంతలో ఏప్రిల్ వచ్చింది. తన సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా అయిపోయాయి.

తన ఆఖరి పరీక్ష అయిన రోజు అలిపిరి వైపుగా నడుస్తున్నప్పుడు చెప్పారు - "వచ్చే వారం మద్రాసు వెళ్తున్నాను - ప్రాజెక్ట్ వర్క్ కోసం" అని.

అప్పుడే మాటల్లో చెప్పారు "మా ఇంట్లో మేము నలుగురం తప్ప మాకింక చుట్టాలు ఎవరూ లేరు. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో అందరూ సమ్మర్ హాలిడేస్ వస్తే తాతగారి ఊరు, అమ్మమ్మగారి వూరు అంటూ ఊళ్ళకి వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి రాగానే వాళ్ళ అత్తయ్య కూతురో, మామయ్య కూతురో - మరదలుతో ఆడుకున్నాం అని చెప్పేవాళ్ళు. ఆ మరదలు "బావ" అని పిలుస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడల్లా నాక్కుడా అలా ఒక మరదలు వుంటే బాగుండును అనిపించేది" - అంటూ.

అది వినగానే - నాకెందుకో తెలీదు కొంచెం బాధగా అనిపించింది. అందులోనూ నేను పుట్టినప్పటినుంచీ మామ్మ-నాన్నమ్మ-అమ్మమ్మ, మామయ్యలు-అత్తయ్యలు, దొడ్డలు-పెదనాన్నలు, పిన్నులు-బాబయ్యలు - వాళ్ళందరి పిల్లలూ మధ్య పెరిగానేమో - అస్సలు ఎవరూ లేకుండా అందులోనూ వేసవి సెలవులకి కూడా ఏ ఊరికే వెళ్లకుండా ఉండడం అసలెలా కుదురుతుందో నా ఊహకే అందలేదు.

ఇంకో ఆలోచనే లేకుండా "అయితే నేను పిలుస్తాను బావ అని" అనేశాను.

ఒక్క నిముషం రోడ్డు మీదే ఆగి - కొంచెం ఒత్తి పలుకుతూ "నువ్వెలా పిలుస్తావ్? ఆ పిలుపు నన్ను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి మాత్రమే సొంతం" - అని సీరియస్‌గానే చెప్పేశారు.

నాకు నిజ్జంగానే ఉక్రోషంగా అనిపించింది.

అలిపిరి దాకా వెళ్ళి తిరిగి వచ్చే వరకు కొంచెం తక్కువే మాట్లాడాను.

తను మా హాస్టల్ గేట్ దగ్గర ఆగి - "వచ్చే వారమే నా ప్రయాణం. మళ్ళీ మద్రాస్ నుంచి వచ్చాక కలుస్తాను" అనగానే 'కుదరదు వెళ్ళే ముందు రోజు కలిసి వెళ్ళాల్సిందే" అని గాఠిగా అన్నాను.

అప్పటికే మా హాస్టల్ వాచ్‌మన్ అటెటో చూస్తున్నా చెవులు మాత్రం సద్దు-తిరుగుడు-చెవ్వుల్లా మాకేసే తిరిగున్నాయని నాకు మాకు తెలుస్తూనే వుంది.

అందుకని తను నాతో ఎక్కువ వాదించకుండా "సరే" అన్నట్లు తలూపి "గుడ్‌నైట్ - ఇంక జాగ్రత్తగా లోపలికి వెళ్ళు" అని చెప్పి వాళ్ళ హాస్టల్‌కి వెళ్ళడానికి వెనక్కి తిరిగారు.

తనని మా హాస్టల్ గేట్ దగ్గర  నుంచి కొంచెం గట్టిగా అరిస్తే కానీ వినిపించనంత దూరం వెళ్ళనిచ్చి "బా...వా! గూ...డ్... నై ...ట్ " అని అరిచాను.

తను ఉలిక్కిపడి - ఒకసారి వెనక్కి తిరిగి - ఖోపంగా చూసేసి తలతిప్పుకుని వెళ్ళిపోయారు.

చెవిలో వేలు పెట్టుకుని అప్పటిదాకా మా మాటలు వింటూనే విననట్టు ఆపసోపాలు పడుతున్న వాచ్‌మన్ నా అరుపుకి ఒక అడుగు ఎగిరి పడి - దడుచుకుని - "థూ ..థూ"  - అని తన చెయ్యి వెనక్కి వంచి తన వీపు మీద తనే కొట్టుకుని, "ఏందమ్మా ! అంత గట్టిగా అరిచావ్ - ఇక్కడుండగా చెప్పలేకపోయావా ఆ గుడ్‌నైట్" - అంటూ విసుక్కున్నాడు.

నేను మాత్రం అదేం పట్టించుకోకుండా బోల్డంత హాప్పీగా గంతులేసుకుంటూ - రెండేసి మెట్లు ఎక్కుతూ నా 603-A కి చేరాను - పాడుకుంటూ :)

వ వ వ వద్దంటే ... చాలా ?!
నీకా పిలుపిష్టం లేదా?
నన్నొద్దన్నావంటే చిన్నవాడా !
నేనట్లానే పిలుస్తాను ఎల్లవేళా !  

(టైటిల్  ఏ పాట ? ఈ కొసరు ఇంకే పాట?)
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

20 కామెంట్‌లు:

  1. నేను మీ స్టోరీ మొత్తం చదవలేదు కానీ చివరి 3 ఎపిసోడ్స్ చదివాను... ఆ అబ్బాయి పేరు "బదరి" అని ఎప్పుడు చెప్తారా అని వెయిటింగ్....హమ్మయ్య... చెప్పేసారు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకూ "హమ్మయ్య" అనే అనిపించింది చెప్పేయగానే, మమతగారు! నా కథ చదువుతున్నందుకు థాంక్స్!

      తొలగించండి
  2. "You know one thing ?! We will make a nice pair!"

    వాగుడు కాయల్ని భరించే వాళ్లు దొరకటం కష్టం... వాళ్లని వెతకటం ఇంకా కష్టం... మీరు ఇట్టే కనిపెట్టేసి టక్కున అనేశారే....మీ దగ్గర "బోల్డన్ని కబుర్లే" కాదు " బోల్డంత ధైర్యం" కూడా ఉందన్న మాట !
    (సరదాగా అంటున్నా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కావాలి అనిపిస్తే "సాధించైనా" సాధించే వరకు నిద్రపోని ధైర్యమైతే వుంది లెండి :) మీరంటున్న సరదా కమెంట్‌ని మహా-సరదాగా తీసుకుంటున్నా.

      తొలగించండి
  3. లలిత గారు,
    మీ బ్లాగ్ చాలా రోజులుగా చదువుతున్నా ఎప్పుడూ బద్దకంతో కామెంటు పెట్టలేదు. మీ కబుర్లు చాలా బాగుంటాయండి.
    Thank you for sharing with us.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్నేహగారు! నా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్ !

      తొలగించండి
  4. లల్లమ్మ గారికి బోలెడంత ధైర్యమండోయ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆయ్! మరేండి, చిత్రగారు! లల్లమ్మ అని పిలిచి చెల్లమ్మ అయిపోయారండి మీరు నాకు - బో...ల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  5. MCA చదూకోమని ట్రంకుపెట్టె, పచ్చళ్ళు చేసి పెట్టి పంపిస్తే, హన్నా ? అస్సలు బొత్తిగా భయంభక్తీ లేవండీ మీకు!! ఎంత అమాయకంగా ఫోజు పెట్టి, ఆయననే కాదు మమ్మల్నీ బోల్తా కొట్టించారు :) కథ చాలా బావుంది మొత్తానికి!! పోయిన వారం పోస్టు, ఈ పోస్టు చదివి కనెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరి గురించి ఏమీ తెలియని నాకే అనిపించింది ‘Nice pair ‘ అని. మరి ఆ రోజు అనిపించింది అంటే ఆశ్చర్యపడనవసరం లేదు.
    అన్నట్టు పాట కూడా భలే పెట్టారండీ హ హ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని అంటారు కదండీ - అందుకే ట్రంకుపెట్టె సర్దుకుని మరీ వెళ్ళానేమోనండి, చంద్రికా!

      తొలగించండి
  6. Waiting for this episode..... chala intresting rastunnaru.... very nice

    రిప్లయితొలగించండి
  7. లలితా! అసలు అలా ఎలా కొత్త పద ప్రయోగాలు అలవోకగా సృష్టించగలవు?
    ‘తిల తిల లాడి పోవడం’ ‘సౌండు -తిరుగుడు- చెవ్వులు’
    మా సాయి గారు కూడా కధ లో తళుక్కుమన్నారుగా :-)
    తెలిసిన విషయాలే ఐనా, ఇలా నువ్వు పెట్టే సస్పెన్స్ enjoy చేస్తూ next post కోసం ఎదురుచూస్తున్నాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాటలే కదా లక్ష్మీ -సృష్టించడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. అసలు అది సద్దు-తిరుగుడు-చెవ్వు అంటే ఇంకా apt గా వుండేదేమో :))

      తొలగించండి
    2. ఈ ‘సద్దు-తిరుగుడు-చెవ్వు’ ఇంకా బావుంది.
      మార్చెయ్యకూడదూ లలితా! Please!

      తొలగించండి
  8. ప్రతిసారి 19 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాము. కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కి లోటు లేకుండా మమ్మల్ని అలరిస్తున్నందుకు 🙏🙏

    రిప్లయితొలగించండి
  9. 1.నిన్నే వలచితినోయీ, కన్నుల్లో దాచితినోయి


    2. ము ము ము ముద్దంటే చేదా?

    రిప్లయితొలగించండి