7, జులై 2018, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 11 - మద్యే మద్యే.. వ్యాపారాంతే ... ఉ(ద్వే)ద్యోగపర్వనాంది

 గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 10 - చదువయ్యింది - మనువయ్యింది!

1968 సెప్టెంబర్లో మర్కంటైల్ లా పరీక్ష వైజాగ్‌లో రాశాను . రాసింతర్వాత - నేనూ మాఆవిడ వెళ్ళాం కదా వైజాగు! సరదాగా చుట్టుపక్కల అంతా తిరిగేసి తిరిగి అనాతవరం వచ్చేశాం. వచ్చేసింతర్వాత నేను వ్యవసాయంలో పడిపోయాను. మాకున్న భూమి, తర్వాత మాకు పదిహేను పశువులు ఉండేవి - రెండు జతల దున్నపోతులు, ఓ జత ఎడ్లు, ఆవులు, ఒక గేదె - ఇవన్నీ కలిపి ఓ పదిహేను వుండేవన్నమాట. ఇంక ఆ పొలమూ, వ్యవసాయమూ, పశువులూ - ఇద్దరు పాలేళ్ళుండేవాళ్లు. ఓ పాలేరేమో ఇంటి దగ్గర పనీ, వ్యవసాయమూ చూసేవాడు. ఇంకో పాలేరు పశువుల దగ్గర పని చూసేవాడు.

1969 జనవరి నుంచి నేను అనాతవరంలో ఉండిపోయి పూర్తిగా వ్యవసాయంలో మునిగిపోయాను. ఈలోగా మా ఆవిడ గర్భవతి. జులై నెలలో ఏడో నెల - రాజోలునుంచి మా తోడల్లుడు సాంబశివరావుగారు, మా వదినగారు  ప్రభావతి వచ్చారు మా ఆవిణ్ణి పురిటికి పుట్టింటికి తీసుకెళ్లడానికి. వాళ్లతోపాటు నేను కూడా టాక్సీ ఒకటి బుక్ చేసుకుని ఆవిణ్ణి శివకోడులో దించేసి వచ్చాను.

మా తాతగారు మా అమ్మగారికి రాజోల్లో రెండెకరాల భూమి, ఇందుపల్లి భట్లపాలెం దగ్గర ఒక ఎకరం కొబ్బరితోట ఇచ్చారు. వాటి శిస్తు వసూళ్ళకి, వ్యవసాయం పనులకి వెళ్తుండేవాణ్ణి. అలా రొటీన్ నడుస్తోంది వ్యవహారం. సెప్టెంబర్లో మా ఆవిడకి కానుపై ఆడపిల్ల పుట్టింది. మా నాన్నగారేమో రాజశ్యామల పూజ చేసేవారు - అమ్మవారి పూజ. మా సోదరి ఒకరు రాజశ్యామల అనే పేరు గలామె చనిపోయింది. అప్పుడే అనుకున్నాం మేము - మా చిన్నక్కగారి పేరు లలిత, మా వదినగారి పేరు లలిత.  అందుకని మా అమ్మాయికి పుట్టినప్పుడే లలితా త్రిపుర సుందరి అని పేరు పెడదామని అనుకున్నాం.

అమ్మాయి పుట్టింది - వ్యవసాయం, వ్యవహారం బానే నడుస్తోంది.

కాకపొతే నవంబర్ నెల - ప్రతివాళ్ళూ కూడా పుట్టినరోజులూ, పెళ్లిరోజులూ గుర్తు పెట్టుకుంటారు. అలాగే నేను నవంబర్ నెల 1969 ఏడో తారీఖు గుర్తు పెట్టుకున్నాను. అది నాకు మరపురానిరోజన్నమాట. ఆ రోజేమయిందంటే - అనాతవరంలో మా ఎదురుగుండా రామరాజుగారని ఉండేవారు. ఆయన కొడుకు బుల్లిరాముడని నాకన్నా పదేళ్లు పెద్దవాడు. ఆ బుల్లిరాముడు, సత్తికొండ తమ్ముడు బోసు అని చెప్పేసి ఉండేవాడు.  రమణమ్మగారి సత్తిగాడని వాడొకడు -ఇలా బాచి మొత్తం ఉండేవాళ్ళమన్నమాట.

ఈ నవంబర్ ఏడో తారీఖు - అప్పట్లో ఇంకా టెక్నాలజీ అంత పెరగలేదు - గాలివాన వస్తోందని సూచనలు చేసేవారు కానీ ఫలానా టైముకి వస్తుందని ముందుగా చెప్పగలిగేవారు కాదు.

ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల దాకా బానే వుంది. చగ్గా ఎండా కాసింది.  కొద్దిగా గాలేస్తోంది.

తొమ్మిది గంటలకి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైపోయి గాలివాన మొదలయింది. విపరీతమైన గాలి. రామరాజుగారి అరుగు మీద కూర్చున్నాం మేము నలుగురం. విపరీతమైన గాలి వీస్తూ కొబ్బరిచెట్లు పడిపోతున్నాయి. "ఏంటి ఇంత గాలి వేస్తోంది, చెట్లు పడిపోతున్నాయ్, సైక్లోనేమో ఇది" అనుకున్నాం. ఒక అరగంట గడిచేటప్పటికి కొబ్బరిచెట్లు, తాటిచెట్లు టపటపా పడిపోతున్నాయ్. "అమ్మో ఇదేదో పెద్ద గాలివానే!" అనుకుని బుల్లిరాముడు (పదేళ్లు పెద్దైనా ఒరే ఒరే అనుకునేవాళ్లం) "ఒరే - పొలాల్లో మన పశువులు ఉండిపోయినయ్. పాకల్లో వున్నాయి.  ఈ గాలికి ఆ పాకలు కూలిపోతే అవన్నీ చచ్చిపోతాయి. అంచేత మనం వెళ్లి మాగ్జిమమ్ ఎవరి పొలాల్లో ఉన్నవైనా సరే పశువులని ముందిప్పెయ్యాలి అక్కడినుంచి" అంజెప్పేసంటే అప్పుడు - కాశీ తువ్వాళ్లు అనేవాళ్ళం ఎర్ర తువ్వాళ్లు - ఆ బండార్లంక తువ్వాళ్లు కట్టుకుని మేం నలుగురం - బుల్లిరాముడు, నేను, బోసు, రమణమ్మగారి సత్తిగాడు - తలకో కర్రా పట్టుకుని బయల్దేరాం.

ఈలోగా మా వీధిలో పిల్లలు - చిన్నచిన్న పిల్లలు భయపడిపోతున్నారు. వీళ్ళందర్నీనేమో మా ఇంటికి తీసికెళ్ళిపోయాం. మా ఇంట్లో మా అమ్మగారేమో వాళ్లందరినీ కూర్చోబెట్టి కథలూ, కబుర్లూ చెప్తూ తలుపులు వేసేసింది. మా వదినగారేమో వాళ్లకి భోజనాలు అవీ ఏర్పాటు చేస్తున్నారు.

మేము నలుగురం బయల్దేరి పొలాల మీదా పడి ఎన్ని పొలాలు తిరగగలమో అన్ని మాకు ఓపిక ఉన్నంతవరకూ తిరిగి ఒక గంటన్నరలో ప్రతీ పశువునీ కూడా పలుపులు ఊడదీసేసి చేలల్లోకి వదిలేశాం. ఎందుకంటే చేలల్లో చెట్లు ఉండవు. వరిచేలు కోతకొచ్చి వున్నాయి -ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో పంటొస్తుంది - అయినా సరే పశువులు బతకటం ముఖ్యమని చెప్పి చేలల్లోకి వదిలేశాం. పదిన్నరకల్లా మేము ఊళ్లోకి వచ్చేశాం. వచ్చేసి మళ్ళీ అరుగు మీద కూర్చుని ఆలా చూస్తూ ఉంటే పదకొండింటికి గాలివాన తగ్గిపోయింది. గాలీ గీలీ అన్నీబంద్

గాలివాన ఆగిపోయింది కదా అని  "పోయి చూసి వద్దాంరా ఏమయిందో ఏంటో" అని మళ్ళీ పొలాల కేసి వెళ్ళాం. వెళ్లి చూస్తే - అసలు అన్ని పాకలూ పడిపోయినయ్, కొబ్బరిచెట్లు కూలిపోయినయ్, తాడిచెట్లు పడిపోయినయ్ - పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్ళతో సహా పడిపోయి - కోనసీమ మొత్తం రుద్రభూమి అయిపోయింది.

అవన్నీ చూసి - పోన్లే పశువులు బ్రతికాయి - అనుకుని ఇంటికొచ్చేసి మళ్ళీ మీద కూర్చున్నాము

ఇంతలో 'అంబా!' అని అరుపు. ఎక్కణ్ణించా అని చూస్తే మా పక్కనే చిన్నరాజుగారని చెప్పేసి ఉండేవారు. ఆయన ఇంటి వెనకాల పాక ఉండేది. ఇంట్లోని వాళ్ళందరూ గాలివానకి భయపడి తలుపులు బిడాయించుకుని కూర్చున్నారు. ఆ పాకలోంచి అరుపులు వినబడుతున్నాయేంట్రా అని పరిగెట్టుకెళ్తే ఆ పాక కూలిపోయుంది. ఒక దూలం ఆ ఆవు వెనకాల రెండు కాళ్ళమీద పడిపోయింది. ఆ రెండు కాళ్ళూ విరిగిపోయాయి పాపం! వెళ్లి మేము ఆ దూలం తీసేసి ఆ ఆవుని బయటికి లాగి ఒక నులక మంచం తీసికెళ్ళి దానిమీద ఆవుని పడుకోబెట్టి తీసుకొచ్చి - చిన్నరాజుగారి ఇంట్లో లోపల పడుకోబెట్టి బయటికొచ్చాం. మాకప్పడు ఆ ఇంట్లో ముసలావిడ కాఫీ కాచిచ్చింది.

అలా వచ్చి పన్నెండింటికల్లా కాస్త భోజనాలు అవీ చేసి -కాసేపు పడుకుందాంలేరా - పొద్దున్నించీ తిరిగాం అని చెప్పేసి - ఒకగంట పడుక్కుని - ఒంటిగంటకి లేచొచ్చి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. మళ్ళీ రెండుగంటలకి గాలివాన మొదలయింది. అలా రెండోసారి మొదలయి - అంతా  ఉప్పుగాలి - భయంకరమైన ఉప్పుగాలి. అప్పటికే పడకుండా మిగిలిన చెట్లేమైన ఉంటే వాటి మొవ్వులన్నీ నల్లగా మాడిపోయి మొత్తం సర్వనాశనమైపోయింది కోనసీమ. ఎటూ వెళ్లడానికీ దారుల్లేవు. రోడ్లన్నీ చెట్లు చేమలూ పడిపోయివున్నాయి. అలా రెండుగంటల నుంచి నాలుగుగంటల దాకా గాలివాన. నాలుగయింది. వాన తగ్గింది. మేమిళ్లకెళ్లి స్నానాలూ అవీ చేసొచ్చాము.

మా బుల్లిరాముడికి డ్రింకు అలవాటు. XXX రమ్ము తాగేవాడు - రోజుకో క్వార్టరు. వాడేం చేశాడంటే - "ఒరేయ్! పొద్దున్నించీ చాలా కష్టపడిపోయాం. నాకిప్పుడో క్వార్టరు మందు కావాలి. తీసుకురండి వెళ్లి" - అన్నాడు. "ఎక్కడికెళ్తాంరా అసలు? అమలాపురం మొత్తం నేలమట్టమైపోయింది. రేకులు గీకులు అన్నీ లేచిపోయి షాపులన్నీ పడిపోయాయి. పోవడానికి దారుల్లేవ్. నడిచిపోవాలన్నా దారంతా చెట్లు. ఎనిమిది కిలోమీటర్లు నడిచెళ్ళి నడిచి రావాలి. అక్కడికెళ్ళింతర్వాత ఉంటుందో లేదో తెలీదు - ఇప్పుడెక్కడికి పోతాంరా బాబూ! - అసలెక్కడికీ కదిలే పరిస్థితే లేదు" అని చెప్పేశాం. వాడింట్లోనే డ్రింక్ చేసేవాడు. వాడికి ఒక రేడియోగది ఒకటుండేది. దానికో అటకొకటుండేది. వీడు డ్రింక్ చేసి సీసాలన్నీ అటక మీదికి విసిరేసేవాడు. ఒక్కోసారి ఎక్కువై కొంచెం మిగులుండగానే సీసా పైకి విసిరేసేవాడు. అప్పుడు వాడేం చేశాడంటే - "ఒరేయ్! అటకెక్కండ్రా ఎవరైనా? అటకెక్కితే దాంట్లో ఏదో కొద్దిగా దొరికితే తియ్యండ్రా" అని గొడవ గొడవ చేశాడు.  సరే అని బోసుని, సత్తిగాణ్ణి అటకెక్కించాం. పైన ఒక పెద్ద గుట్టుంది - సీసాలది. వాళ్లిద్దరూ ఆ సీసాల్లో మిగిలున్న రమ్ముని ఒక సీసాలో పోస్తే ఒక అరసీసాడు దొరికింది. బుల్లిరాముడు తాగేదేమో క్వార్టరే. వాడేం చేశాడంటే వాళ్లు ఆ మందు పట్టుకుని కిందకి దిగాక - వాడు వాడి క్వార్టరు తాగి - "ఒరేయ్! ఇంకో క్వార్టరుంది - సరదాగా మీరు తలకో పెగ్గు వేసుకోండి ముగ్గురూను" - అన్నాడు. మొట్టమొదటిసారిగా నా జీవితంలో మందు తాగింది 1969 నవంబరు ఏడవ తారీఖు. వాడు చెప్పినట్టే ముగ్గురం ఒక్కో పెగ్గు తాగాం. ఆ ఒక పెగ్గుకే మాకసలు ఎదురుగా ఏమున్నాయో కనపడలేదు. కొత్త కదా! ఎదురుగా వున్న క్యాలెండర్లో అంకెలు కనపడలేదు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం రాత్రి. మరసటి రోజు పొద్దున్న లేచి చూస్తే చుట్టూ అంతా  గాలివాన భీభత్సం.

అవన్నీ శుభ్రం చేసి బాగు చేయించుకుంటూ మొత్తానికి వ్యవసాయం ఎలాగోలా దారికి తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ వ్యవసాయప్పనుల్లో పడ్డాను. ఎంత చేసినా - కొబ్బరితోటలు పడిపోయాయి. ఆదాయం చాలావరకూ తగ్గిపోయింది. ఇంక మిగిలిందల్లా వరి - ధాన్యప్పంట. ఇంక దానిమీదే బతకాలి.  అప్పటికే కటక్ నుంచి - మా అన్నగారు, పిల్లలు వచ్చేశారు, నేనూ అక్కడే వున్నాను. ఈ పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి చేయాలి - చేసి అదనపు ఆదాయం రావాలి - అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది. మా అమ్మగారేమో నన్ను ఉద్యోగానికి వెళ్ళమని. ఆవిడ కజిన్స్ ఉద్యోగాల్లో ఉండేవారు - వాళ్ళు బ్యాంకుల్లో మేనేజర్లుగా పని చేస్తూ వుండేవాళ్ళు. ఒకాయన - ఆయన్ని మేము బాబు అని పిలిచేవాళ్ళం  - వడ్లమాని ఉమామహేశ్వరరావు అని గుంటూర్లో ఆడిటర్‌గా చేస్తూ ఉండేవారు. అలాగే కఱ్ఱా దక్షిణామూర్తిగారని మా అమ్మగారి మేనమామ మెడ్రాసులో ఆడిటరు.

మా అమ్మేమో "ఒరేయ్! వెళ్ళరా అక్కడికి - వాళ్ళేదో ఉద్యోగం ఇస్తారు - ఉద్యోగం చేసుకో" అని పాపం! - బతిమాలింది ఆవిడ నన్ను.

అయినా కూడా "పాతబియ్యం అన్నం తింటూ ఇక్కడ బతుకుతున్నాం వ్యవసాయం చేసుకుంటూ. ఒకడితో పన్లేదు. ఒకడికి తలొంచాల్సిన పన్లేదు. ఎక్కడికో వెళ్ళి వాడికి చేతులు కట్టుకోవడమేంటి? చూద్దాంలే - నేను వెళ్ళను" అని చెప్పేసి నేను వెళ్ళలేదు.

ఈలోపులో నా ఫ్రెండు నాయనరాజుగారి సూరి వున్నాడు కదా! వాడూ నేనూ చిన్నప్పణ్ణుంచి క్లాస్‌మేట్స్. వాడు బాలాజీ మెడికల్ స్టోర్స్ అని ఒక మెడికల్ షాప్ పెట్టాడు. అది 1969లోనే పెట్టాడు. ఈ గాలివానకి అది కూడా రేకులు గీకులు అన్నీ లేచిపోయినయ్. వాడు కొంత నష్టంలో వున్నాడు. వాడు నన్ను పిలిచి "ఒరేయ్! నువ్వు కూడా ఏమన్నా పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయి. ఇందులో సరదాగా ఇద్దరం కలిసి చేసుకుందాం" అనేటప్పటికి సరే అన్జెప్పి నేనేం చేసానంటే "సరే - నేనూ కలుస్తానులేరా. ముందు డబ్బులు చూసుకోవాలి కదా" అన్నాను. ఈ సూరిగాడికి, సత్తికొండకి తాతే నరసింహరాజుగారు. ఆయన వడ్డీకిచ్చేవాడు. చాలా ధర్మవడ్డీ - అర్థ రూపాయి వడ్డీయో, ముప్పావలా వడ్డీయో ఉండేది. "మా తాతనడుగు - నీకిస్తాడు" అని సూరే నాకు చెప్పాడు.

సరే వెళ్లి అడిగి చూద్దామా అని చెప్పి 69 అక్టోబర్ దసరాల్లో విజయదశమినాడు నేను కూడా మెడికల్ షాపులో చేరాను. చేరింతర్వాత చిన్నరాజుగారి దగ్గరికి వెళ్ళాను. నరసింహరాజుగారినే చిన్నరాజుగారనేవాళ్ళం.

ఆయన దగ్గరికెళ్లి "అయ్యా! నాకు ఓ పదివేలు కావాలి" అనడిగాను.

ఆయనప్పుడు "నీకెందుకయ్యా మా వాళ్ళతోటి? హాయిగా వెళ్లి ఉద్యోగం చేసుకోక" అని పాపం మంచి సలహానే ఇచ్చారు.

అయినా కూడా నేను విన్లేదు. "లేదండి! ఊరొదిలి పెట్టి నేనెక్కడికి పోతాను? వ్యవసాయం అదీ వుంది" అన్నాను.

"వ్యవసాయం మీ అన్నయ్య చూస్తున్నాడు కదా!"

" మా అన్నయ్యగారు టైంలీ వెళ్తారండి. పొలాల్లో వాళ్లేమో రాత్రిళ్ళు పొలంలో కొబ్బరికాయలు అవీ తీసేసుకుంటున్నారు. రాత్రీ పగలూ నేను కాపలా ఉండి చూసుకోకపోతే కష్టం. అంచేత దయచేసి ఒక పదివేలు మీరు సర్దగలిగితే నేను వ్యాపారంలో చేరతాను" అన్నాను.

ఆయన సరే అని ఎనిమిది వేలు ఇచ్చారు. ఆ ఎనిమిది వేలూ - సత్తికొండ వాళ్ళది అయినవిల్లి. సత్తికొండ ద్వారా అయినవిల్లి నుంచో నాలుగువేలు - మొత్తం పన్నెండు వేలు తీసికెళ్ళి మెడికల్ షాపులో పెట్టాను. విజయదశమి నాడు నేను, సూరి పూజ చేసి పుస్తకాలు ప్రారంభించాం.

బాలాజీ మెడికల్ స్టోర్స్  - బాగానే వుంది. ఆదాయం వస్తోంది. మా అన్నగారు వ్యవసాయం చేయిస్తున్నారు. మా వ్యవసాయానికో గుమాస్తాగారు - చిట్టిబాబుగారు. అంతా బాగానే నడుస్తోంది. మా భూమిలో కమర్షియల్‌గా వేరే పంటలు ఏమైనా వేద్దామంటే మా అన్నగారు ఒప్పుకునేవారు కాదు. సరే ఆయన పద్ధతిలోనే జరగనీయ్ - ఎలాగూ మెడికల్ షాపులో ఆదాయం బానే వుంది కదా అనుకునేవాణ్ణి.

సరిగ్గా సంవత్సరం - మెడికల్ షాపులో మంచి లాభాలు వచ్చేవి. ఎందుకంటే చుట్టుపక్కల చాలా గ్రామాలకి ఇదే మెడికల్ షాపు. ఒక స్టెతస్కోపు, బీపీ మీటరు కొన్నాను. మందుల కోసమని వచ్చేవాళ్ళకి బీపీలు అవీ చూసి నేనే మాత్రలిచ్చేసేవాణ్ణి. మంచి లాభాలే వచ్చేవి. కాకాపోతే అమ్మిందంతా లాభం కింద లెక్కేశాను. అందులో పెట్టిన పెట్టుబడి గురించి మర్చిపోయాను. సూరిగాడు కూడా నన్ను చూసి వాడు షాపులో వున్నప్పుడు అమ్మిందంతా వాడు పట్టుకుపోయేవాడు. నేనుండి అమ్మినప్పుడు నేను పట్టుకుపోయేవాణ్ణి. పట్టుకెళ్లి ఖర్చు పెట్టేసుకునేవాళ్ళం.

ఆ ఖర్చు కూడా ఎలా అంటే -ఆ షాపు ఓపెన్ చేశాక మా లెవెల్ ఎలా పెరిపోయిందంటే - మా కంటి ముందు ఒక అంబాసిడర్ కారు, ఒక గుఱ్ఱబ్బండి, ఒక రిక్షా. ఆ రిక్షా ఏంటంటే వాడు నా సెక్యూరిటీ వాడు. భీముడని ఆరడుగులు ఉండేవాడు. కారెందుకంటే రాజమండ్రి సినిమాకెళ్లడానికి. గుఱ్ఱబ్బండి అమలాపురం సినిమా కెళ్లడానికి. బ్రాకెట్టు ఆడేవాణ్ణి. ఆ బ్రాకెట్టు ఆడినప్పుడు ఓపెనింగ్ ఇక్కడ ఆడి క్లోజింగ్ అమలాపురం వెళ్ళేవాణ్ణి. ఫస్ట్ షో సినిమాకెళ్లి క్లోజింగ్ ఆడేస్తే సెకండ్ షో అయేటప్పటికి రిజల్ట్ వచ్చేది. ఓ గుఱ్ఱబ్బండి - ఆ గుఱ్ఱబ్బండిలో సత్తికొండ వీళ్ళందరూ కూడా నాతో పాటు సినిమా కొచ్చేవారు. వెనకాల రిక్షా ఫాలో అయ్యేది నాకు. ఆ రకంగా మెయిన్‌టెయిన్ చేసి పన్నెండు నెలల్లో షాప్ మూతబడిపోయింది. నాకు పన్నెండువేలు నష్టం వచ్చేసింది. ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆ నష్టానికి స్పందించలేదు. పైగా కోరి తెచ్చుకున్న నష్టం - నువ్వే తీర్చుకో అని చెప్పారు.

నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. వూళ్ళో వాళ్ళు కూడా - "ఇంక వీడు వున్న ఆస్తి కూడా అమ్మేసి ఏ తిరపతో వెళ్లి అడుక్కుతింటాడు" - అన్న స్థాయిలో మాట్లాడారు. అంత వరకూ వూళ్ళో నన్ను కామెంట్ చేసినవాళ్లు లేరు.

ఆ రోజుల్లో మా ఊళ్ళో యాచనకి వచ్చేవాడు ఒకతను - ఒక స్వామిలా ఉండేవాడు గడ్డం అదీ పెంచుకుని. ఆయనతో పాటు ఆయన కూతురు కూడా వచ్చేది. వాళ్ళో పాట పాడేవారు: "కాపాడు కాపాడు బెజవాడ ఓ కనకదుర్గా...ఓ విజయవాడ వీరమాతా" - అంటూ. ఇదే కాకుండా "గీతార్థ సారము వినుమూ ..." అని ఇలా పాడుతూ వుండేవారన్నమాట. అతను కర్రసాము బాగా చేస్తాడని తెలిసింది. నేను అతన్ని పొలం పిలిపించుకుని అతని దగ్గర కర్రసాము నేర్చుకున్నాను. అసలు ఆ ప్రాక్టీసు రోజూ రెండు మూడు గంటలు చేసేవాణ్ణి. (తర్వాత ఆరెస్సెస్ లో చేరినప్పుడు వాళ్లు నా కర్రసాము అదీ చూసి తెగ ఆశ్చర్యపోయేవారు).  అసలెందుకు కర్రసాము నేర్చుకున్నానూ అంటే వూళ్ళో - "వీడి మెడికల్ షాపు అయిపోయింది " అని అన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికి. అంత వరకు నన్నన్నవాళ్ళే లేరు మరి.  అలా కర్రసాము బాగా నేర్చుకుని, ఒకరోజు దుడ్డుకర్ర  వేసుకుని ఊళ్లోకి వెళ్లి - "ఎవరైనా సరే నా గురించి గాని, మా దివాణం గురించి గాని నోరెత్తితే నాలుకలు తెగ్గోసి బుర్ర బద్దలు కొట్టేస్తాను" అని వీధుల్లో తిరిగాను. దాంతోటి అసలు నేను వీధుల్లోంచి వెళ్తుంటే ఆడా, మగా అందరూ తలుపులు వేసేసుకునేవారు. 

ఇంకా ఊళ్ళో వుండాలని అనిపించక - అలా అని ఇంకేం చెయ్యాలో తోచక - పొలమెళ్ళిపోయాను. ఇంక పొలంలోనే మకాం. అక్కడే ఉండేవాణ్ణి. ఓ మడతమంచం వేసుకుని అక్కడే పడుకునేవాణ్ణి. వెంకటరెడ్డి అంచెప్పేసి ఓ పాలేరు ఉండేవాడు. వాడి చేత యానాం నుంచి డ్రింక్ తెప్పించుకుని - అక్కడ బొండాలు తీయించుకుని - ఆ బొండంలో డ్రింక్ కలుపుకుని తాగేవాణ్ణి. అలాగే పొలంలో ఉండిపోయేవాణ్ణి. (ఎప్పుడో ఎనభైల్లో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాల్రావు - అయ్యగారికో బొండం - అంటాడు కదా - అది నా దగ్గర్నుంచే - లేక నాలాంటి వాళ్ళ దగ్గర్నుంచే వచ్చింది).

మెడికల్ షాప్ బావున్నప్పుడు ఒకసారి గుంటూరు వెళ్ళాను. మా పెద్దొదినగారు లక్ష్మీదేవి, మా తోడల్లుడు ఐసోల సుబ్బారావుగారు అక్కడుండేవారు. వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు - అప్పుడు మెడికల్ షాపు మంచి స్పీడు మీదుంది. మా అమ్మకి కజినే కదా - నాకు మేనమామ అవుతాడు - వడ్లమాని ఉమామహేశ్వరరావుగారు (బాబు) - ఆయన్ని కూడా చూద్దామని ఆయన దగ్గరికెళ్ళా.

వెళ్తే ఆయన "ఏరా ! ఏం చేస్తున్నావురా?" అనడిగాడు.

"ఏం లేదు - ఏదో మెడికల్ షాప్ చూసుకుంటున్నాను" అన్నాను. 

"ఎందుకొచ్చిన బిజినెస్సు - ఇక్కడేదో టొబాకో కంపెనీలో ఉద్యోగం వేయిస్తాను వచ్చి చేసుకోకూడదా?" అన్నాడు.

"ఏమిస్తారు?" అన్నా.

"ఏమిస్తారంటే ముందు చేరినప్పుడు ఓ వందో, నూటేభయ్యో ఇస్తారు. నీ పెర్ఫార్మెన్సు బావుంటే తర్వాత పెంచుతారు" అన్నాడు.

"సరే...బాబూ ! ఓ పనిచెయ్యి. నాకక్కడ మెడికల్ షాపులో సేల్స్ చాలా ఎక్కువగా వున్నాయ్. నేనొక్కణ్ణీ మేనేజ్ చేయలేకపోతున్నాను. ఓ నలుగురు కుర్రాళ్ళని పంపించు. ఆ నూటేభై ఒక్కొక్కడికీ చొప్పున ఆరొందలు నేనిస్తాను" అని చెప్పాను.

అంత పొగరుగా సమాధానం చెప్పి వచ్చేశాను.

అలా వచ్చినవాణ్ణిమెడికల్ షాపులో నష్టం వచ్చి పొలంలో కూర్చుని తాగుతూ ఉంటే బాబు అమలాపురం వచ్చాడు. ఆయన పింతండ్రి వడ్లమాని గోపాలకృష్ణయ్య గారని ఆయన అమలాపురంలో ఉండేవాడు. బాబు అమలాపురం వచ్చినప్పుడు తప్పకుండా మా అమ్మగారిని కలవాలి. "బుల్లెక్కయ్యా" అని చెప్పి ఈవిడ దగ్గరికొస్తాడు. అలా మా అమ్మగారి దగ్గర కొస్తే ఆవిడేం చేసిందంటే - కళ్లనీళ్లు పెట్టుకుని "ఒరేయ్ తమ్ముడూ! వాడు చెడి పోయాడు తాగుడుకు అలవాటు పడిపోయాడు. ఆ పొలం నించి రావట్లేదు. కారియర్ ఇక్కడి నుంచే పంపిస్తున్నాం భోజనానికి. అక్కడే పడుంటున్నాడు వాడు. నువ్వెళ్ళి మాటాడి వాణ్ణి తీసికెళ్ళి ఏదో దార్లో పెట్టరా" అని చెప్పి పాపం ఆవిడ బతిమాలిందట.

అప్పుడు బాబు పొలం వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే నేను బొండం తాగుతున్నాను. 

"ఊఁ ! ఏంట్రా ఎలా వున్నావ్?" కోనసీమ యాసలో అంటూ వచ్చాడు.

"బానే వున్నాను బాబూ! ఏంటి సంగతి? ఇలా వచ్చారు?" అన్నా.

" ఆ ..ఏం లేద్రా అమ్మను చూద్దామని వచ్చాను. ఓసారి పొలం చూద్దామని వచ్చాను నువ్వేం జేస్తున్నావో అని. ఏంటీ వ్యవహారం? " అన్నాడు.

"బొండం ఏమన్నా తాగుతావా?" అన్నాను.

"బొండంలో బావుంటుందేంట్రా?' అన్నాడు.

అంటే "టేస్ట్ చేసి చూడండి" అని చెప్పి "ఒరే వెంకట్రెడ్డి! ఈ బాబుకి ఓ రెండు బొండాలు అది కలిపీయ్" అన్నా.

లేతబొండాలు తీసి మందు కలిపి ఇచ్చి , అందులో వున్న లేతమీగడ కూడా తీసి తినడానికి ఇచ్చాడు.

ఆ లేతబొండం తాగి, తిని  బాబు "చాలా బావుందిరా ఇది - నీ ఎక్స్పెరిమెంట్స్  చాలా బావుంటాయి - ఇంతకీ నీ పరిస్థితేంటి? ఏదో నష్టమొచ్చిందంట?" అన్నాడు.

"వచ్చింది. " అన్నాను.

"మరిప్పుడేంటి? ఇప్పటికైనా ఉద్యోగానికి వస్తావా" అనడిగాడు.

"బాబూ! ఉద్యోగం కనక ఇస్తే వంద రూపాయిలిస్తే వచ్చి చేరిపోతాను. ఇంకిక్కడ ఈ ఊళ్ళో  వుండన్నేను." అన్నాను.

అప్పటికే మణి - నా బావమరిది - మద్దిలక్ష్మయ్యగారి కంపెనీలో చేరిపోయాడు - 1970లోనే - బాబు ద్వారానే. 

"సరే ఐతే - నేను గుంటూరు వెళ్ళిపోతున్నాను. మణి సంక్రాంతి పండక్కి వస్తాడు ఇక్కడికి. వాడొచ్చినప్పుడు వాడితో పాటు నువ్వు కూడా బయలుదేరొచ్చేయ్ గుంటూరు. వచ్చేస్తే నిన్నా కంపెనీలో జాయిన్ చేస్తాను - ఆయనెంతిస్తాడు అనేది తర్వాత సంగతి. నీ పెర్ఫార్మెన్సు చూసి పెంచుతాళ్లే" అన్నాడు బాబు.

"నువ్వు వంద రూపాయిలిస్తే వచ్చేస్తా" అని చెప్పాను.

సరే - బాబు గుంటూరు వెళ్ళిపోయాడు. జనవరిలో మణి వచ్చాడు.

వచ్చి "ఒరే ! బాబు చెప్పాడు - మరి నువ్వొస్తున్నావా గుంటూరు?" అంటే "వస్తాన్నేను" అని పండగై పోయింతర్వాత కనుమ నాడు బయల్దేరి ఇద్దరం గుంటూరు వెళ్లిపోయాం. వెళ్ళిపోయి జనవరి 16, 1972 న - (నా బ్యాడ్ పీరియడ్ అంతా 70, 71 లో జరిగింది) - గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్ళాం.

మణి గణపవరంలో కరణం గారింట్లో ఒక గదిలో అద్దెకుండేవాడు. వాడి గదిలో వుండి మరుసటి రోజు పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాం.

ఆ ఆఫీసులో ఏంటంటే మద్ది లక్ష్మయ్యగారు మేనేజింగ్ డైరెక్టరు - ఓనర్ ఆయన. మల్లవరపు సుబ్బన్నగారని ఫ్యాక్టరీ మేనేజర్ ఉండేవారు. కనపర్తి సీతారామయ్యగారని లీఫ్ మేనేజర్ - టొబాకో కొనుగోళ్లు అవన్నీ ఆయన చూసేవారు. ప్రొడక్షన్ మేనేజర్ ఒకాయన ఉండేవాడు - గ్రేడింగులు అవీ చూడ్డానికి - L. M. తనేజా అని. ఆయన యూపీ నుంచి వచ్చాడు. జెనరల్ మేనేజర్ హెచ్చార్ రామచంద్ర - బెంగుళూరతను.

మణితో కలిసి ఆఫీసుకి వెళ్ళింతరువాత వాడేం చేశాడంటే "ఒరే! నువ్వెళ్ళి సుబ్బన్న గారిని కలువు. ఆయనే మెయిన్ ఇక్కడ. ఆయన్ని కలిస్తే నీకేం ఉద్యోగం ఇస్తాడో చెప్తాడు వెళ్ళు " అని చెప్పాడు.

సరే - వెళ్లి ఆ సుబ్బన్న గార్ని కలిశా

నేనా రోజుల్లో కొంచెం ఫేషనుగా ఉండేవాణ్ణి. పొద్దున్న వేసిన డ్రెస్సు మళ్ళీ మధ్యాహ్నం వేసేవాణ్ణి కాదు. రకరకాల రంగులు - పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ - ఇలా రకరకాల రంగుల షర్టులు. ఈ రకంగా కొంచెం తిక్కతిక్కగానే ఉండేవాణ్ణి - అందులోనూ పొగరుగా.

సుబ్బన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి నాకేసి చూసి "ఎవరు నాయనా నువ్వు?" అన్నారు.

"నేను ఇలా కోనసీమ నుంచి వచ్చానండి - ఏదన్నా ఉద్యోగం ఇస్తారేమో నని వచ్చాను." అన్నాను.

అప్పటికీ టొబాకో సీజన్ మొదలయింది. టెంపొరరీగా స్టాఫుని తీసుకుంటున్నారు. కానీ ఆయనకి నన్ను చూడగానే ఏమనిపించిందో... "ఉద్యోగాలా?  ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవు నాయనా. అయామ్ సారీ. ఇప్పుడేమీ ఇవ్వలేము" అన్నారు.

"సరే సార్" అనేసి బయటికొచ్చేశాను.

బయటికొచ్చేసి బయట కారిడార్లో వున్న పేము కుర్చీలో కూర్చున్నాను. 

ఈలోపులో మణి గాడొచ్చాడు. "ఏరా ఏమయిందిరా?" అన్నాడు.

"ఏమవడమేంటి? ఆయన ఏమీ లేవంటున్నాడు - ఇంత దూరం పట్టుకొచ్చారు నన్ను" అన్నాను.

"సరే - మనం సాయంత్రం గుంటూరు వెళ్దాం. బాబుని కలుద్దాం. బాబు చెప్తాడ్లే - రేపు మళ్ళీ వద్దాంలే" అన్నాడు మణి.

"వద్దులేరా! వాళ్ళు లేదని అన్నప్పుడు ఆయన్ని పట్టుకు బతిమాలేదేంటి నేను? కాకపొతే ఒకసారి మీ బాసు లక్ష్మయ్యగార్ని కలిసి వెడతాన్నేను - ఆయన్నొకసారి చూసెళ్తాను" అన్నాను.

"సరే...నీ ఖర్మ ఐతే! ఇక్కడే లంచ్ అయ్యేదాకా కూర్చో - నేను వెళ్తాను" అని వాడెళ్ళిపోయాడు.

నేనక్కడ కూర్చున్నప్పుడు అక్కడున్న ఆఫీస్ బోయ్స్ నన్నెవ్వరో కస్టమర్ అనుకున్నారు. అందులో ఒకడు  - మోదిన్ అని గణపవరం వాడిది - వాడొచ్చేసి "సార్! తీసుకోండి" అని టీ ఇచ్చాడు నాకు.

వాణ్ణి కదిపా "ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తావ్?" అంటూ.

"నేను మోదిన్ నండి. నేనిక్కడ ఆఫీస్ బోయ్" అన్నాడు.

"నేనొకసారి లక్ష్మయ్య గార్ని కలవాలి" అన్నాను.

"సరేనండి - చీటీ ఒకటి రాసివ్వండి" అన్నాడు.

"ఎవ్వరూ లేకుండా కలవాలి - ఆయనొక్కరే వున్నప్పుడు" అన్నాను.

"సరే ఇస్తాను సార్! చీటీ రాసివ్వండి" అన్నాడు.

నా పేర్రాసిన చీటీ తీసుకెళ్లి వాడు లోపల ఇచ్చాడు. ఆయన బిజీగా వుంటారు కదా - ఎప్పుడు పిలుస్తారో ఏమో అని అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాను.

ఒక పది నిముషాలు, పావుగంటలో లక్ష్మయ్యగారు నన్ను పిలిచారు.

మోదిన్ వచ్చి "సార్! అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు" అని చెప్పాడు.

లోపలికి వెళ్ళాను. ఎవ్వరూ లేరు - ఆయనొక్కరే వున్నారు.

"కూర్చోండి. ఎవరు మీరు? " అన్నారు.

"నా పేరు కామేశ్వరరావండి. వడ్లమాని వాళ్ళం. అనాతవరం నుంచి వచ్చాను. మీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చాన్నేను." అన్నాను.

"ఆ... నువ్వు దత్తు బావవా నువ్వు?" అనడిగారు.

మా మణిని ఆఫీసులో, గణపవరంలో అందరూ దత్తుగారని పిలిచేవారు - వాడి పేరు సుబ్రహ్మణ్యదత్తు మరి.

"అవునండి." అన్నాను.

"మా ఆడిటరు ఉమామహేశ్వరరావుగారు ఇంతకు ముందోసారి చెప్పాడు నాకు నీ గురించి. అప్పుడు దత్తొక్కడే వచ్చాడు నువ్వు రాలేదు. సరే! కూర్చో కూర్చో" అని బెల్లు కొడితే ఆఫీస్ బోయ్ వచ్చాడు.

సెంట్రల్ ఎక్సైజు ఒకటి ఉండేది టొబాకో మీద. చాలా ఇంపార్టెంటు డిపార్టుమెంట్ అది. టొబాకోలో కొనుగోలు మొదటిది - తర్వాత ఎక్సైజు చాలా చాలా ముఖ్యమయినది. అదొక ఆర్టు అన్నమాట. అటువంటి ఎక్సైజులో కృష్ణస్వామిగారని ఉండేవారు - హెడ్డు. ఆయన చదివింది ఎస్సెసెల్సీ - కానీ ఎక్సైజులో విపరీతమైన నాలెడ్జ్. ఆ కృష్ణస్వామిగారిని పిలవమన్నారు లక్ష్మయ్యగారు.

కృష్ణస్వామిగారు వచ్చారు. ఆయనకి ఏభై ఏళ్ళుంటాయి. తెల్లటి జుట్టుతో వున్నారు ఆయన. 

ఆయన రాగానే "చూడు కృష్ణస్వామీ! ఈ కుర్రాణ్ణి నీ దగ్గర పెట్టుకుని కాస్త ఎక్సైజు అదీ ట్రెయినింగు బాగా ఇయ్యి." అంటూ లక్ష్మయ్యగారు నన్ను ఆయనకి అప్పజెప్పారు.

"సరే సార్!" అని చెప్పి ఆయన వెళ్లిపోయారు. నేను ఆయన వెనకాలే ఆయన రూంలోకి వెళ్ళాను.

ఆయన రూంలో ఆయన కుర్చీ, టేబుల్. పక్కనే ఇంకో కుర్చీ , టేబుల్ వున్నాయి. ఇంకో పక్కనేమో సంకా బాబూరావు అని ఒకతను, ఇంకో పక్కన నాగేశ్వరరావు అని - లక్ష్మయ్యగారికి బాగా కావాల్సిన వాడతను - ఆఫీస్ బోయ్ నుంచి ప్రమోట్ అయి క్లర్కుగా వచ్చాడతను - వీళ్ళు ముగ్గురూ కూర్చుని వున్నారు.

నేను కూడా వెళ్లి కూర్చున్నాను.

"ఏం నాయనా! ఎక్కణ్ణించి వచ్చావు?" అడిగారు కృష్ణస్వామిగారు.

"నాది కోనసీమండి" అని చెప్పాను.

"ఏంటి అక్కణ్ణించి ఇక్కడికి వచ్చావ్?" అనింకో ప్రశ్న.

"ఏదో సార్!  గాలివానలు అవీ వచ్చి మొత్తం వ్యవసాయాలు అవీ పోయినయ్. బయటికొచ్చి బతుకుదామని వచ్చాను" అని సమాధానమిచ్చాను.

"ఏం చదివావు?"

"బీకాం పాసయ్యానండి. కామర్స్ గ్రాడ్యుయేట్‌ని"

"సరే ఐతే ...ఓ పన్చెయ్ నాన్నా - నువ్వు మన కంపెనీ పేరు రాయి" అని ఒక కాయితం ఇచ్చారు.

'మద్ది లక్ష్మయ్య అండ్ కంపెనీ, టొబాకో ప్యాకర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్, గణపవరం' - అని రాసిచ్చాను. 

అది చూసి "ఊఁ - బానే రాశావే! బానే వుంది. ఇంకో పన్చెయ్యాలి నువ్వు" అంటూ ఒక ఠావు తెల్లకాయితం తీసుకుని - దానికో మార్జిన్ గీసి - తర్వాత నాలుగు నిలువుగీతలు గీశారాయన.

గీసి ఆ పేపర్ నాకిచ్చి "ఒకట్నుంచి వంద వరకు అంకెలెయ్యి నువ్వు" అన్నారు.

నాకు కళ్ళెఱ్ఱబడిపోయినయ్. ఒక గ్రాడ్యుయేట్‌ని పట్టుకుని -  ఒకట్నుంచి వంద వరకు అంకెలెయ్యమంటారా? అసలు ఏంటీ ఉద్యోగమేంటి? ఈ ఇంటర్వ్యూ ఏంటి - అర్థం కాలేదు.

మిగతా వాళ్ళందరూ - బాబూరావు, నాగేశ్వరరావు, ఇంకెవరో ఇద్దరు ఉన్నారక్కడ - వీళ్ళందరూ - "ఏంటి ఆయన అలాగడిగాడు ? వీడేమో కళ్ళెఱ్ఱజేసేస్తున్నాడు - అసలేమవుతుందని" చెప్పేసి ప్రతివాళ్ళూ సస్పెన్సులో వున్నారు.

స్వస్తి. మిగతాది తర్వాజ్జెప్తాను.

<వచ్చేనెల తరువాయి కథ - ఒక రకంగా ఇది నాకు బ్యాడ్ పీరియడ్. వ్యవసాయంలో, వ్యాపారంలో నష్టపోయి - ఊళ్ళోవాళ్ళతో మాటలనిపించుకుని ఊరికి దూరంగా పొలంలో ఉంటూ - ఏ దిక్కూ తోచకుండా వున్న కాలమది. దీని తర్వాత ఉద్యోగంలో చేరాను కదా - ఇంకిప్పటి నుంచి ఉద్యోగ పర్వం - మెట్టు మీద మెట్టెక్కుతూ ఉద్యోగ విజయాలు - మహా ఉద్వేగ పర్వం >

15 కామెంట్‌లు:

  1. వామ్మో!ఏం మెమరీ పవర్ సార్!
    తారీఖులూ తరీఖాలూ,పేర్లూ,పోలికలూ అన్నీ గుర్తుంచుకున్నారే!కొంపతీసి అప్పట్లోనే నేను ఎట్టాగూ గొప్పోణ్ణవుతాను గదా,భయ్యోగ్రఫీ రాయాలి అంజెప్పేసి అనుకున్నారా యేంటి?
    మీలాంటోళ్ళతో పెట్టుకుంటే మటాషే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిబాబుగారు: మా నాన్నగారు మీ వ్యాఖ్య చూసి తెగ మురిసిపోయారు. మీకు బోల్డన్ని ధన్యవాదాలు అని చెప్పమన్నారు.

      తొలగించండి
  2. కళ్ళకు కట్టినట్లు రాస్తున్నావు Lalli suspense లో పెట్టేసావు

    రిప్లయితొలగించండి

  3. చాలా బావుందండి

    సినిమా తీస్తున్నారా ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు: బావుందని మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  4. ఈ 69నాటి తుఫాను నాకూ ఎప్పటికీ మంచి గుర్తే. అప్పుడు అమలాపురంలో చదువుకుంటూ సచిదానందరావుగారి ఇంట్లో నేనూ నా స్నేహితుడు గుడిమెళ్ళ పాండురంగారావుతో కలిసి అద్దెకుండే వాళ్ళము. ఇంటి ఎదురుగా నిలబడితే ఎడమవైపు గోపాల్ బిస్కట్ కంపెనీ వైపు వాటాలో అన్నమాట.


    తుఫాన్ తగ్గాక కూడా ఇంటికి కొత్తపేట వెళ్ళటానికి బస్సులు కాని ఇతరప్రయాణ సాధనాలు కాని లేని పరిస్థితి. హోటల్ భోజనాలు పడక స్వయంగా వండుకొని తినేవాడిని. కాబట్టి ఇబ్బంది పడలేదు కాని చాలామందికి చాలా ఇబ్బంది ఐంది. ఆవలి ప్రక్క వాటాలో అయ్యపరాజుగారని ఒక టీచరు - మాకు తెలిసినవాడే -అదెకుండే వారు. పుణ్యానికైనా మమ్మల్ని పిలిచి ఆ రోజుల్లో ఒకపూట తిండిపెట్టలేదు సరికదా ఎలా ఉన్నార్రా అని ఎకసెక్కాలు చేసాడాయన. కొందరి బుధ్ధి అంతేనని తెలుసు కాబట్టి మేం పెద్దగా ఏమీ అనుకోలేదు.

    దీపావళీ నాడింక ఉండబట్టలేక కాలినడకనే ఇంటికి వెళ్ళిపోయాను. దారి అంతా పడిపోయిన వృక్షాల మీదనుండి ఎక్కిదిగుతూ. ఇవరి నాలుగైదు కిలోమీటర్లు మాత్రం ఎవరో పుణ్యాత్ముడు తన సైకిల్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. సూర్యోదయం సమయంలో బయలుదేరిన వాడిని మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకున్నాను.

    దీపావళీ తరువాత కార్తీకపౌర్ణమినాడు కాబోలు మొదటిసారిగా కొత్తపేట - అమలాపురం మధ్యన బస్సులు తిరిగాయి. అప్పట్లో కొత్తపేటలో మాకు ఆత్మీయ కుటుంబం కందుకూరి భాస్కరంగారు ఉండే వారు. ఆయన మానాన్నగారికి క్లాస్మేటు వారబ్బాయి నా క్లాస్మేటు. వారింట్లో ప్రతి కార్తీకపౌర్ణమికి లక్షపత్రిపూజ ఘనంగా చేసేవారు. ఆనాటి సమారాధనలో ఎవరో ఈరోజున బస్సులు నడవటం మొదలు పెట్టాయి అని అని అన్నారు.

    ఏమిటో. మీ ఈ కథనం చదివాక ఇదంతా వ్రాయాలని నాకు అనిపించింది. అధికప్రసంగం చేసినట్లున్నాను. అప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటే ఇవన్ని తన్నుకు వచ్చేస్తున్నాయి అక్షరాల్లోనికి.

    రిప్లయితొలగించండి
  5. (తుఫాను ఈ బ్లాగ్-పోస్ట్ లో ఒక చిన్న భాగమే అయినప్పటికీ తుఫాను గురించి శ్యామలరావు గారు తన అనుభవాన్ని వివరించారు కాబట్టి నా వంతుగా నేనూ నా జ్ఞాపకాలను పంచుకుందామని ఈ వ్యాఖ్య ఇక్కడే వ్రాస్తున్నాను👇).

    1969 తుఫాను నాకూ బాగా గుర్తేనండి శ్యామలరావు గారూ (“మంచి” గుర్తా కాదా చెప్పలేను). ఆ సంవత్సరంలో నవంబర్ కంటే ముందు మే నెలలో ఒకసారి తుఫాను వచ్చింది. మా డిగ్రీ ఆఖరి సంవత్సరపు ప్రాక్టికల్స్ పరీక్షల సమయానికి కొట్టింది. అయినా యూనివర్శిటీ వారు పరీక్షలు జరిపారు. థియరీ పేపర్ల తరవాత సెలవలకు ఇంటికి వచ్చున్నాను. తుఫాను సూచనలు మొదలవగానే .. వెళ్ళిపోయి ఆఊళ్ళోనే వెయిట్ చేస్తే మంచిది అన్న మా తండ్రిగారి అనుభవభరిత సలహాననుసరించి 🙏 .. రెండు మూడు రోజుల ముందే రైల్లో బయలుదేరి మా కాలేజ్ ఉన్న దూరపు ఊరికి జేరుకుని మా పెత్తల్లి గారింట్లో దిగాను (హాస్టల్ మూసేసారు కాబట్టి). ఆ తరువాత మర్నాటికే రైళ్ళ రాకపోకలు కూడా ఆగిపోయాయి.

    తుఫాను మూలాన కాలేజ్ ఊళ్ళో సిటీబస్సులు తిరగడం లేదు. ఊరి మధ్యనున్న మా పెత్తల్లి గారింటి నుండి కాలేజ్ వరకు ... ఐదారు కిలోమీటర్లు ... పరీక్ష నాడు ఉదయం కాలినడకన వెళ్ళాను. సన్నగా వాన, గాలి. గొడుగు పట్టుకునే బయలుదేరాను కానీ పదడుగులు వెయ్యగానే గాలి బలంగా వచ్చి గొడుగు ఊచలతో సహా వెనక్కి తిరిగిపోయింది. దాన్ని కష్టపడి మడిచి చేత్తో పట్టుకుని నడక కొనసాగించాను. రికార్డ్ పుస్తకం తడిసిపోకుండా నానా అవస్ధ (అప్పటికింకా ప్లాస్టిక్ కేరీబేగ్ లు ప్రవేశించలేదు). కాలేజ్ ఆవరణంతా నీళ్ళు, ఆ నీళ్ళల్లోనుండి వరండాల మీదకి ఎగబాకాలని ప్రయత్నిస్తున్న పాములు (వాటి బాధ వాటిది, పాపం 😳).

    ఊరంతా కరెంట్ పోయింది. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ లో (బిఎస్సీ లో ఫిజిక్స్ అని నా భావం; ఓ నాయకుడు తను చదివానన్న “బికాం” లో “ఫిజిక్స్” కాదు 😀😀) కరెంట్ పోయిన రోజులయినప్పటికీ ఎక్స్-టర్నల్ ఎక్జామినర్ గారు .. కరెంట్ తో పనిచేసే సాధనంతో ఒక భాగాన్ని ఆరబెట్టవలసిన అవసరమున్న .. ఒక ప్రయోగాన్ని ఇవ్వడం, కరెంట్ లేదు గదా సర్ అని ఆ ప్రయోగం తగిలిన సదరు విద్యార్ధి (నా మిత్రుడే) అడిగితే కిటికీ దగ్గర నిలబడి గాలికి ఆరబెట్టుకోవోయ్ అని ఎక్జామినర్ గారు గదమాయించడం (తుఫాను గాలికి ఆరబెట్టుకోవాలా 🙁? ఆరవలసింది పోయి ఆ వానతుంపర్లు కూడా పడి ఆ భాగం యొక్క బరువు మరింత పెరిగి తప్పుడు రీడింగ్ రావడం, ఆహా ఓహో ఏమి ఆ ఎక్జామినర్ గారి లీల 🙁), ఫలితంగా ఆ విద్యార్థి ప్రాక్టికల్స్ పరీక్ష చంకనాకిపోవడం (పాస్ మార్కులు ఇచ్చాడు లెండి; కానీ అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ రేస్ లో ఉన్న విద్యార్థి) .... అన్నీ బాగా గుర్తున్నాయి. మీకులాగానే నాకూ చాలా జ్ఞాపకాలు తన్నుకొచ్చాయి. అందుకే .. నిడివి ఎక్కువయినా .. ఈ సోదంతా వ్రాసాను.

    అమలాపురంలో మీరు అద్దెకున్నామన్న వాటా గల ఇల్లు సచ్చిదానందరావు గారిది అన్నారు. అంటే అమలాపురం జడ్.పి. హయ్యర్ సెకండరీ స్కూల్ అప్పటి హెడ్మాస్టార్ .. మహానుభావుడు .. కె.సచ్చిదానందరావు గారిల్లాండీ? సుబ్బారాయుడి గుడికి దాదాపు ఎదురుగా ఉంటుంది. నేనంటే చాలా అభిమానం చూపించేవారు ఆయన 🙏.

    రిప్లయితొలగించండి
  6. విద్యార్థులం నేనూ మా స్నేహితుడు పాండురంగారావూ సచ్చిదానందరావుగారి యింట్లో (గోపాల్ బిస్కట్ కంపెనీని అనుకును ఉన్న) వాటాలో ఉండేవాళ్ళమని చెప్పాను గదా. సచ్చిదానందరావు గారు హడ్మాష్టరుగా రిటైరయ్యా రప్పటికే. వారిల్లు సుబ్బారాయుదు గుడికి దాదాపు ఎదురుగానే అనుకుంటాను. అంతకు ముందటేడు ఒక్కణ్ణీ సుబ్బారాయుడు గుడి వెనుకకు వచ్చే సందులో (వేంకటేశ్వరా టాకీసుకు ఒక ప్రక్కకు అనుకొని) ఉన్న ప్లీడరుగుమాస్తా శేషగిరిరావు గారింటిలో ఉండేవాణ్ణి. స్వయంపాకమూ అప్పుడే మొదలుపెట్టాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ మనిద్దరి అమలాపురం జ్ఞాపకాలతో నిండిపోతున్నట్లుంది ... మరొక్క సంగతి చెప్పి ముగించేస్తాను 👇.
      చిత్రం, మేము కూడా సుబ్బారాయుడి గుడికి వేంకటేశ్వరా టాకీసుకి మధ్యన ఉన్న సందులోనే ఉండేవారం. సాహుకారు సుబ్బారావు గారిల్లని పెద్ద ఇల్లు. మొత్తం ఇంట్లో మేమే ఉండేవారం. ఎదురింట్లో హైస్కూల్ మాస్టారొకరు ఉండేవారు .. పేరు భాస్కరరావు గారు అనుకుంటాను సరిగా గుర్తులేదు.
      అక్కడ మనిద్దరం తారసపడకపోవడానికి కారణం బహుశః మీరు నాకు జూనియర్ అయ్యుండాలి (మీరు చెప్పిన వివరాల్ని బట్టి చూస్తే). పైగా, హైస్కూల్ వరకే గానీ నా కాలేజ్ చదువు ఆ ఊరిలో కాదులెండి. 50 ఏళ్ళ తరువాత ఇలా బ్లాగుల్లో పరిచయమయ్యామన్నమాట, బాగుంది.

      తొలగించండి
    2. శ్యామలీయంగారు, విన్నకోట నరసింహారావుగారు: మీ అమలాపురం జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  7. ఏకబిగిన ఆపకుండా చదివించేశావు లలితా! మీ నాన్న గారు చెప్తుంటే వింటున్నట్టుగా ఉంది తప్ప చదువుతున్నట్టుగా లేదు.
    ఎప్పటి విషయాలు! అందర్నీ ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టకోవడం ఒకెత్తయితే, గడ్డుకాలంలో జరిగిన విషయాలను కూడా గుర్తుపెట్టుకుని ఎలాంటి inhibitions లేకుండా పంచుకోవడం చాలా నచ్చింది.
    చాలామటుకు వచ్చే autobiography or biography ల్లా ఇది ఒక designed and edited biography కాదు. An honest and straight from the heart rendering.
    అంతమంది సొంతఊరివారిని ఇంటిపేర్లతో సహా quote చేశాక, దీన్లో చెప్పిన విషయాలకు authenticity వెయ్యిరెట్లు పెరిగింది.
    పశువుల గురించి ఆలోచించి అంత గాలివానలో వెళ్ళడం, వీధిలోని పిల్లలను ఇంట్లో కూర్చోపెట్టుకుని కధలు చెప్తూ వాళ్ళ దృష్టి మళ్ళించడం చాలా చాలా నచ్చాయి.
    అంకుల్ కర్రసాము నేర్చుకోవడానికి చెప్పిన కారణం both highlight and hilarious.
    ఎన్ని varied facets to a person కదా అని అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది నాన్న కథ కదా, లక్ష్మీ! ఆయన చెప్తుంటే నేను ఆయన చెప్పినట్లే రాస్తున్నాను.

      తొలగించండి
  8. నాన్న గారి గురించి అప్పట్లో గాలివాటంగా విన్న వాటికి ఇప్పటికి సమాధానం దొరికింది లలితమ్మా. గుమ్మం ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు తలొంచుకుని వెళ్ళాలి లేకపోతే మన తలే బొప్పి కడితుంది అన్నది అనుభవం ద్వారా తెలిసాకే ఉద్యోగ విజయాలలో మహా ఉద్వేగ పర్వం అన్నమాట, శుభం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారు: ఇది మన ఊళ్ళో అందరికీ తెలిసిన కథే. నాన్న జీవిత ప్రయాణం, అందులోని విశెషాలు ఆయన కూతురిగా నాకు ప్రియం. అందుకే రాసుకుంటున్నాను. నాతో పాటు ఆ రోజుల్ని తలచుకుంటూ, తరచి చూసుకుంటూ మీరు పెట్టే వ్యాఖ్యలు నాకు ఆత్మీయంగా అనిపిస్తాయి. థాంక్సండి మరి ఆయ్!

      తొలగించండి