31, మార్చి 2019, ఆదివారం

ఆ ఊసే తలచక మరచుటే మంచిదని!

ఎప్పుడో జనవరిలో పోస్ట్ చేయాల్సిన కబురిది.
అనుభవం, ఆలోచన బదరివి.
అక్షరం, అనువాదం (బ్లాగ్ మాటల్లోకి) మాత్రం - తన ఇంటిసిరిని 😇 - నావి! 
విషయం పాతదైనా ఆలోచనల్లో అది తెచ్చిన వెలుగు మాత్రం కొత్తదే.
ఒక పాఠంలా రాసుకో తగినదే!
తర్వాతి తరానికి నేర్పుకో తగినదే!

*************


వేరే వూళ్ళో చేయాల్సిన ఉద్యోగ రీత్యా వున్న ఊరు వదిలి ప్రతి వారం ప్రయాణం చేసి, ఫ్లైటు దిగి హోటల్ చేరీ చేరగానే ఫోన్ చేసి ఇంటిసిరికి నే చెప్పే మాట ... 

"ఈసారి వచ్చిన హోటల్ రూమ్ బావుందోయ్!"

నేనేం చెప్పినా ఓపిగ్గా వింటుంది. కానీ,  ఇంటి పట్టున గువ్వపిట్టలా వుండే తనకి నిజంగా తెలుస్తుందా హోటల్ రూమ్ బావుండడానికీ, బాలేక పోవడానికీ తేడా?

ఏ కుంగిపోయిన పరుపో వస్తే నిద్ర పట్టక దొర్లీదొర్లీ, లేచిందగ్గర్నుంచీ మళ్లీ ఎప్పుడెప్పుడు పని మానేద్దామా, పడుకుందామా అని ఆరడి చేసే కనురెప్పలకి కనిపించని దారాలు కట్టి తెరిచి ఉంచడం ఎంత కష్టమో అర్థమయేలా చెప్పడం వీలయ్యే పని కాదు.

ఆఁ ! తనకి అర్థం కాకపోయినా పర్వాలేదు లెద్దూ. నేనొక్కణ్ణీ కష్టపడితే చాలదూ?! నవ్వులో తన తోడుండాలి కానీ నొప్పి తనకి తెలియనే కూడదు. ఆ ఇంటి అబ్బరాల ఆడపిల్ల తన వారినందరినీ వీడి నా ఇంటి దీపమైంది. అది చాలు.

అవునూ... తను పుట్టింటిని వదిలొచ్చింది సరే... మరి నేనూ మా అమ్మకి దూరంగానే వున్నాను కదా! నాకూ పుట్టింటి బెంగ ఉండాలి, ఉండడం న్యాయమే కూడా. ఇలా ఆలోచించ కూడదేమోలే! ఎంతైనా కనుల నీరు దొరలనీయలేని మగదొర పుటక పుట్టాను కదా మరి. సరి సరి! ప్రస్తుతానికి ఈ దారి మళ్లే తలపునాపి పరుపు వైపుకి మళ్లించెద గాక!

ఎంత బావుందీ గది?!
ఎంత పదిలమీ గది !
పరుపుమీద చక్కగా
పవ్వళించి ఉండగా... అని పాడుకుంటూ పడుకుంటానా పూటకి.

రాత్రి అలారం పెట్టుకుంటాను అంకెలారా ఐదింటికి. లేచి పళ్ళు తోమి, షవర్ కింద షివరై , తొరతొరగా తయారై - ఇంకా తొరగా ఆఫీసు కెళ్ళిపోయి పురుష లక్షణంతో రెండో పురుషార్థం సాధిద్దామని. కానీ పొద్దున్నే శ్రావ్యంగా మోగే అలారాన్ని దాని పని దాన్ని సవ్యంగా చేయనీయకుండా స్వయంగా నా చేతుల్తో మూడు సార్లు snooజిస్తా. ఐదున్నరకి లేస్తా. నా పనులన్నీ కానిచ్చి ఆఫీసుకి బయల్దేరేటప్పటికి నా గదంతా కిష్కింధాపుర వాసుల విడిదిలా తయారవుతుంది.

ఇక సాయంత్రం ఏ తండూరీ ఫ్లేమ్స్ లోనో, దోశ ఎక్స్‌ప్రెస్ లోనో  'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అనేసుకుని హోటల్ గదికి చేరతాను. నా గది అప్పటికి ముందు తెలిసెనూ ప్రభూ... నీవు వచ్చు ఈ నిదుర క్షణమిదే అన్నట్లు ఎక్కడి దుప్పట్లు అక్కడ టక్కు చేయబడి, అంత లావు కంఫర్టర్లు కూడా ఒద్దికగా ఒత్తిగిలి ఉండి కుదురుగా ముస్తాబై ఉంటుంది.

అప్పుడు తీరిగ్గా ఆ-తల్పశాయినై , దక్షిణ హస్తమున సెల్ఫోను ధరించి నా ఇంటిసిరికి ఫోన్ చేస్తాను. అప్పుడు వస్తుందీ పరుపుల ప్రసక్తి. దాని వెంటనే ఆ పరుపుల నంత చక్కగా సర్దే రూం సర్వీస్ చేసే ఆడవారి గురించిన ప్రశంసా, పునరుక్తీ!

ఆలోచిస్తే నిజంగా ఎంత కష్టం కదా! ఒక్కో పరుపు లావొక్కింతయు లేదు అనడానికి వీల్లేకుండా ఇంతై, ఇంతింతై అన్నట్లుంటుంది. అనకొండకి కజిన్లా ఉంటుంది. దాన్నెత్తి పట్టి  ఫిట్టెడ్ షీటని, మామూలు షీటని, ఇలా రెండు రకాల దుప్పట్లని ఆ పరుపు కింద అట్టేపెట్టి, ఆ పై ఇంకో బరువుకే బరువు - బెబ్బరువు - లాంటి కంఫర్టర్ వేసి శయ్య దీర్చడం అంత తేలికేం కాదు. ఈ హోటల్లో నా గదిలాంటి గదులెన్నో!

రూం సర్వీస్ చేసే ఆడవారి గురించి చెప్పాలంటే వాళ్లలో ఎక్కువ శాతం మెక్సికన్లు. గంటకి ఏడో, ఎనిమిదో డాలర్లకి మించి సంపాదించ లేని వాళ్లు. పిల్లల్ని బళ్ళో వదిలొచ్చిన అమ్మలు, తల్లుల్ని పిల్లల్లా సాకే అమ్మాయిలు, అమ్మల గన్న అమ్మలు, అమ్మ చాటు అమ్మాయిలు - వీళ్ళలో ఎవరో ఒకరు. కలలూరే కళ్ళు, కలలాగిన కళ్ళు, కన్నీళ్లాగని కళ్ళు, కన్నీళ్ళెండిన కళ్ళు - వీటిలో ఏవో ఒకటైన రకపు కళ్ళున్నవాళ్లు.

వాళ్లెవరో నాక్కనిపించరు. కానీ ఆ  అదృశ్యహస్తాల సహాయాన్ని వూరికే అందుకోవడం న్యాయంగా అనిపించదు నాకు. అందుకే రోజూ గది విడిచి ఆఫీసుకి వెళ్లే ముందు ఓ కాయితం మీద "థాంక్ యూ" అని రాసి, దాని మీద కొన్ని డాలరు నోట్లు పెట్టి వస్తాను. అలా చేయటం కోసమే ఒక డాలరు నోట్లు బొత్తిగా తెచ్చుకుంటాను. సాయంత్రం భోజనం ముగించి రూంకి వచ్చేవేళకి పొద్దున్న నేను కాయితం నోటు, డాలరు నోట్లు పెట్టిన చోట "థాంక్స్ ఫర్ ద టిప్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ స్టే హియర్" అన్న బదులు-నోటు చూడగానే ఏదో సాధించిన చిన్న ఆనందం. నేను పెట్టే రెండు డాలర్ల టిప్పుతో దాంతో వాళ్ళ జీవితాలు మారకపోవచ్చు కానీ వాళ్ళ జీవితసేతువుకి ఓ రెండు గులకరాళ్లు పేర్చిన తృప్తి నాకు మిగులుతుంది.

ఇప్పటికి ఎనిమిదేళ్లుగా ఇదే వాడుక అయింది.

కిందటి వారం ఇంటికెళ్లి Carry-on తెరిచి చూస్తే నా బ్రష్షు, పేస్టు, షేవింగ్ కిట్టు పెట్టుకునే లెదర్ పౌచ్ కనిపించలేదు. పొరపాట్న బాక్‌పాక్‌లో ఏమన్నా పెట్టానా అని తెగ వెతికాను. ఉహూ! అందులో కూడా లేదు. అందులోనే ఉండిపోయి, పోయి, ఇప్పుడు లేకుండా పోయిన ఓరల్బీ(Oral-B), దంతకాంతి గురించి నాకేం బెంగ లేదు కానీ "కొనేదేదో మంచిది కొనుక్కోండి" అని నా చేత నా ఇంటిసిరి కొనిపించిన నూటడెబ్బై డాలర్ల షేవింగ్ కిట్టుని తలుచుకుని తెగ దిగులుపడ్డా. కొనక కొనక కొన్న ఖరీదైన క్షుర-కత్తి మరి.

సరే! పోయిందేదో పోయింది. ఇప్పుడు వగచేం లాభం. వచ్చే వారం ఎలాగూ అదే హోటల్‌కి వెళ్తాను కదా. రిసెప్షన్‌లో అడుగుదాం అనుకున్నాను. వారాంతం అంతా నా కలలూ, కలవరింపులూ నా పోయిన క్షౌర-కిట్టు గురించే.

ఎప్పట్లాగే ఆదివారం పొద్దున్నే బయల్దేరి ఆకాశ మార్గాన నా ఉద్యోగవాడ చేరాను. హోటల్ రూంలో సామాను పెట్టేసుకుని రిసెప్షన్ దగ్గరున్న అమ్మాయిని పలకరించి కనిపించకుండా పోయిన నా తోలుసంచీ గురించి వివరించి మీకెవరైనా "ఇదిగో దొరికింద"ని అందజేశారా? అని విచారిస్తూ విచారించాను.

"అయ్యో అలాగా! పోయిందా? రూం సర్వీసుని అడిగి చూస్తాను. రేపు మళ్ళీ రండి" అని హామీ ఇచ్చింది.

రమ్మన్న ఆ రేపటిరోజు మళ్ళీ వెళ్ళాను.

"సారీ సర్! మీ సంచీ లేదు కానీ మీ నష్టానికి బదులుగా మా హోటల్ వారిచ్చే బ్రష్షు-పేస్టూ తీసుకోండి. వాటితో మీ పళ్ళు తోంకోండి" అని నన్ను తిప్పి పంపించేసింది.

రూం లోకి వచ్చానే కానీ బోల్డంత ఖోపంగా వుంది. నేను తప్పకుండా నా బట్టలు సర్దుకునేటప్పుడు గది లోనే మంచం మీదనే మర్చిపోయి వుంటాను. తప్పకుండా రూమ్ సర్వీస్ వాళ్లకి కనిపించే ఉంటుంది. అదేమన్నా చిన్నదా, చితకదా! ఎవరో నా గది శుభ్రం చేసినవాళ్ళే తీసుకుని వుంటారు.

"అసలాగు! మళ్ళీ ఒకసారి ఆ హోటలమ్మాయిని అడిగొద్దాం - ఆ రోజు నేను గది ఖాళీ చేశాక ఎవరొచ్చి శుభ్రం చేశారో?!"  అనుకుని గది బయటకొచ్చి తాళం వేసి రిసెప్షన్ దగ్గరికి నడిచాను.

ఆ సమయానికి ఆ అమ్మాయి వేరే ఎవరితోనో మాట్లాడుతోంది. ఓ ఐదు నిముషాలు అక్కడే నించున్నాను. నా మనసులో ఏదో తెలీని ఉక్రోషం.

"నేను రోజూ రెండు డాలర్లు ఇస్తానే - ఏడాది పొడుగునా దాదాపు ఏభై వారాల పాటు ప్రతి వారం నాలుగు రోజులు - ముక్కూ మొహం తెలియని రూమ్ సర్వీస్ వాళ్లకి. ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా నా షేవింగ్ కిట్టు దొరికితే గప్‌చుప్‌గా దాచేసుకుంటారా? అసలు ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా?" - ఇలా ఆలోచిస్తూ నించున్నాను.

ఇంతలోనే ఎవరో తట్టి లేపినట్లు ఇంకో ఆలోచన "అరె! ఇప్పుడు నేనిలా ఎంక్వయిరీ చేస్తే - పాపం! హోటల్ వాళ్ళు నా గది శుభ్రం చేసిన వాళ్లెవరో కనుక్కుని ఆవిడ ఉద్యోగం తీసేస్తే? అసలే వాళ్లకిచ్చే జీతాలు తక్కువ. వున్న ఉద్యోగం పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతైనా సమయం పట్టొచ్చు. అసలు ఎవరు తీశారో, అసలేం జరిగిందో తెలీకుండా ఎవర్నైనా నిందించడం తప్పు కదా! ఎవరో ఒకరు చేసిన చిన్న పొరపాటుకి మొత్తం రూమ్ సర్వీస్ వాళ్లందరికీ చెడ్డపేరు వస్తుంది నేను ఇలా పట్టిపట్టి అడగడం వల్ల. ఒద్దు. అలా జరక్కూడదు." అంటూ.

ఈలోగా ఆ రిసెప్షన్ లోని అమ్మాయి నాకేసి తిరిగి "నేను మీకెలా సహాయం చేయగలనండి?" అనడిగింది.

"మీ హోటల్లో నా గది వుండే ఫ్లోర్లో రూమ్ సర్వీస్ చేసే ఆడవారి వివరాలు ఇవ్వగలరా?" అన్నాన్నేను.

ఆశ్చర్యం ఆ అమ్మాయి కళ్లల్లో.  "ఎందుకో తెలుసుకోవచ్చా?" అని అడిగింది.

"ఇంకో రెండు వారాల్లో కొత్త సంవత్సరం వస్తోంది కదా - వాళ్లకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్, మిఠాయిలు కొందామని" అంటూ నా సమాధానం.

"ఎంత మంచివారు మీరు! ఈ హాలిడే సీజన్ లో మీరిచ్చే ఈ బహుమతితో  అది అందుకునే వారి కళ్ళలో దీపాలు వెలిగించబోతున్న మీకు మా హోటల్ స్టాఫ్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు." అన్న ఆ హోటలమ్మాయి మాటలకి మురుస్తూ వెనక్కి తిరిగిన నాకు రాబోతున్న కొత్త ఏడాది నాకనిపించిందేంటంటే...

అనుకోనిది జరిగితే 
తెలిసీ తెలియక అనరాదెవ్వరినీ 
అందరిలో తప్పెవరిదో ఒకరిదే ఐతే
ఒక గాటన కట్టరాదందరినీ  
జరిగిన తప్పు ఊపిరి తీయునంతటిది కాకపోతే 
ఆ ఊసే తలచక మరచుటే మంచిదని!

*************

కొసాకూ నవ్విద్దామని ఓ కొసమెరుపు:

ప్రతిరోజు పొద్దున్నే ఆఫీసు కెళ్లే ముందు హోటల్ రూం టేబుల్ మీద డాలర్లు, దాంతో పాటు "Thank You for your service ...~B " అంటూ ఓ థాంక్యూ నోటు పెట్టడం బదరి(B) హోటలానవాయితీ. 

దానికి బదులుగా "Thank You, Mr. B. I hope you're enjoying your stay here...CY" అంటూ సాయంత్రానికో నోట్ కనిపించేది తనకి. 

"ఓహో! ఎవరో CY అనే ఆవిడ రూమ్ సర్వీస్ చేస్తోంది కాబోలు. భలేనే! షిఫ్టులు మారినా నా రూంకి మాత్రం ఎప్పుడూ ఆవిడే వస్తున్నట్లుంది" అని బదరి అనుకోలు, అనుకుంటూ ఆశ్చర్యంతో తలమునకలు. 

ఇదంతా రెండేళ్ల క్రితం సంగతి. 

ఆ తర్వాత ఉద్యోగమూ మారింది, ఊరూ మారింది, ఉండే హోటళ్ళూ మారుతూనే వున్నాయి. 

ఈ మధ్య హఠాత్తుగా మళ్ళీ "CY" నుంచి థాంక్యూ నోట్లు అందాయి. 

"అరె! ఇక్కడ ఇంకో CY నా?" అని హాచ్చెర్యపోయేలోగా బదరికి తట్టింది ఏంటంటే తనున్నది Court Yard అనిన్నీ, దాన్ని పొడి అక్షరాల్లో CY అనుకోవచ్చనిన్నీ, అంటారనిన్నీ! రెండేళ్ల క్రితం CY కూడా ఈ తరహాలోనిదేననిన్నీ!


8 కామెంట్‌లు:

  1. CY puzzle అలా ఛేదించారన్నమాట బదరి గారు. బాగుంది పోస్ట్ లలిత గారు.

    రిప్లయితొలగించండి
  2. బదరిగారు ఎలాగోలా కోల్పోయినవస్తువుని సంపాదించారేమో అని చివరి దాకా ఒకటే ఉత్కంఠ. చివరికి దొరకలేదని నిరాశపడ్డాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోవడము, పోయినది దొరకకపోవడం ఇదే మొదటిసారి ఇక్కడ. చాలా రోజుల తర్వాత మీ కమెంట్ చూస్తున్నాను, అన్యగామిగారు! నా బ్లాగ్ చదువుతున్నందుకు బోల్డన్ని ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఇండియన్ టూత్-పేస్ట్ పోతే కనిపెట్టడం తేలికే లలితగారు. స్టాఫ్ అందరి నవ్వుల్నీ పరిశీలించమనండి. ఎవరు ఎక్కువ సేపు, పళ్ళు కనిపించడానికే నవ్వుతున్నారో వాళ్ళే తీసుకున్నట్టు. (టూత్-పేస్ట్ అడ్వర్తైజ్మెంట్లు చూసి చూసి మైండిలా తయరైంది :-) )
    జోక్స్ ఎపార్ట్, హోటెల్ స్టాఫ్ పట్ల బదరిగారి కన్సర్న్, దానికి మీ మాటలు కదిలించాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోయినది టూత్‌పేస్టే అయితే అస్సలు రిసెప్షన్ డెస్క్ దాకా వెళ్ళే ఆలోచనే వుండేది కాదు, YVR గారు :) ఏమైనా, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి
  4. చాలా బాగుంది, లల్లీ. మీ కబుర్లు వింటూ ఇంకో కొత్త పాఠం నేర్చుకున్నాము, గుర్తు చేసుకున్నాము.

    రిప్లయితొలగించండి