19, నవంబర్ 2019, మంగళవారం

త్వామనురజామి - 41 - నీవీ నావీ కలలే... ఒకటే రంగులే...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 40 - పాటిక్కడ... మాటక్కడ...

స్థలమా...నాకిష్టమైన బెంగుళూరు.
కాలమా... ఇంకా ఇష్టమైన చలికాలం.
చలనమా... కొత్తగా అలవాటు చేసుకున్న బీటీఎస్సు ప్రయాణాలు.

ప్రాజెక్ట్ అంటే అలాంటిలాంటి ప్రాజెక్టా?! తారాజువ్వల్ని గుర్తుకు తెచ్చే ట్రాజెక్టరీ లెక్కల ఫ్లైట్ సిములేటర్.

ప్రాజెక్ట్ గైడ్ ఏమో - Ctrl+Alt+Del అంటే అన్ని - అంటే అంకెలారా - ఐదు మీటలని లెక్కేసి - అవి నొక్కడానికి కాలివేళ్ళు అప్పు తెచ్చుకుందామా అనాలోచించానని చెప్పి నవ్విస్తూనే, నేను సరిగ్గా వెయ్యని algorithm స్టెప్పుల్ని నవ్వుతూ, నొప్పించకుండా సరి చేసే కృష్ణన్ గారు.

భలేగా నడుస్తున్నాయి ... లేదు లేదు... పరిగెడుతున్నాయి రోజులు.

ఎప్పట్లాగే, ఎక్కడిలాగే  - ఒకానొక రోజు - నూనె రాసి, ఊలు దారంతో పయిక్కట్టుకున్న ఒంటిజడా, రంగురంగుల గాంధీటెక్స్ వారి లంగా-ఓణీ తరహా నూలు చీర ముస్తాబుతో ఆఫీసుకి నే తయారు.

అసలే ముసురు పట్టి మబ్బు మూసిన ఆకాశం.

మెరుపు మెరవక, ఉరుము ఉరమక ఉన్నట్టుండి జలజల రాలే చినుకుల సందడి తప్ప ఇంకే రకమైన ఉలుకూ, పలుకూ లేనట్లు కురిసే బెంగుళూరు వర్షం.

బస్సులో వెళ్తున్నంత సేపూ కురుస్తూ వున్నా, నేను ఎన్నేయల్ దగ్గర దిగే సమయానికి నన్ను తడవనీయకూడదన్నట్లు ఆగిపోయింది.

లేత బూడిద రంగు పూసుకుని drab గా అనిపిస్తున్న ఆ పొద్దుటి పూట ఆట్టే చిరాకు అనిపించకుండా, నన్ను cheerful spirits లో ఉంచింది మాత్రం నేను కట్టుకున్న గాంధీటెక్స్ చీరే!

ఆ చీర వెనకాల ఒక పెద్ద కథే వుంది.

గుంటూరు నుంచి బెంగుళూరుకి వచ్చే ముందు అమ్మ కొన్ని చీరలు కొంది - మరీ కుచ్చుల స్కర్టులు, చుంగిణీ స్కర్టులు వేసుకుని కాలేజ్‌లో - స్టూడెంట్ల కేంపస్‌లో తిరిగినట్లు ఈ ఎన్నేయల్లో - సైంటిస్టుల కేంపస్‌లో తిరిగితే బావుండదని, చీర కట్టుకుంటే పరిగెత్తకుండా కుదురుగా ఉంటానని బోల్డు చీరలు కొని సర్దింది.

అందులో నాకు నచ్చినవి కొన్ని. ఇంకొన్ని నాకు నచ్చకపోయినా "నీకెప్పుడు ఏం నచ్చుతాయో తెలీదు పట్టికెళ్ళు" అంటూ అమ్మ నా చేత బలవంతంగా నచ్చించినవి కొన్ని.

అలా బలవంతపు-నచ్చుదలలో వచ్చిందే ఈ గాంధీటెక్స్ చీర. దానికి నేను పెట్టిన పేరు పులివేషం చీర. అసలు చీరంటే ఎలా ఉండాలి? ఏదో రంగురంగుల పూలపూల డిజైనో ఉండి, కిందా పైనా ఓ అంచు, దానికి సరిపోయే పమిట చెంగు ఉంటే - చూడ్డానికి ఆ చీర నదురుగా, దాన్ని కట్టుకున్న నేను కుదురుగా ఉండేవాళ్ళం. 

కానీ ఈ పులివేషం చీర అలా కాదే! చీరంతా పసుపుపచ్చ రంగు మీద చిన్నచిన్న పూలు, కుచ్చిళ్ళ దగ్గర గులాబీ, ఆకాశ నీలం, నలుపు రంగుల్లో పెద్దపెద్ద నిలువు చారలు, ముదురునీలం రంగు మీద ఏదో అల్లిబిల్లి ఆకుపచ్చ రంగు అమీబా డిజైన్లున్న పమిటచెంగు. దాని మీద కేమో అంతే పెద్దపెద్ద అడ్డ చారలున్న బ్లౌజ్. అసలు ఒక దానికోటి సంబంధం లేకుండా ఓ అరడజను మంది నేతవాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు నేసినట్లు భలే హడావిడిగా ఉందా చీర.

ఏదో పోస్టర్లో విజయశాంతి కట్టుకుంటే అందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పసుపురంగు చూసి, అది నచ్చి కొనేసి, ఎక్కడో హాస్టల్లో వున్న నాకు ఫోనులో చెప్పేటప్పడు మాత్రం కుచ్చిళ్ళలో వున్న గులాబీ రంగు గురించి మాత్రం "అశ్వత్థామ హతః..." అన్నట్లు చెప్పిఅసత్యదోషం లేకుండా తప్పించేసుకుని నేను తిరుపతి నుంచి గుంటూరు వచ్చేటప్పటికి దానికి ఫాలూ, నాకు బ్లౌజూ అన్నీ కుట్టించేసి బెంగుళూరు తీసుకెళ్ళే పెట్టెలో గప్-చుప్‌గా సర్దేసింది మదీయ మాత పేరిందేవి.  ఇదిగో... ఈ రోజు వరకూ అది ఎక్కడో పెట్టె అడుగున వుంది.

ముందు రోజు రాత్రి కౌంట్ అఫ్ మాంట్ క్రిస్టో చదువుతూ పడుకోవడం ఆలస్యం అయింది - పొద్దున్నే లేవడమూ ఆలస్యం అయింది. దాంతో నా హడావిడికి తగ్గట్టు ఆ హడావిడిలో చేతికి అందిన ఈ హడావిడి చీరని కట్టుకోవడం ఇంకో పెద్ద హడావిడి. అందులోనూ గంజి పెట్టిన చీర. కుచ్చిళ్ళు  పెట్టుకోవడానికి అవస్థ పడుతున్న నన్ను చూసి - పాపం! సాయం చేద్దాం - అనొచ్చిన శ్యామల -  కుచ్చిళ్ళలో వున్న నిలువు చారలు సరిగ్గా సగానికి మడత పడేలా పట్టుకోవాలి కుచ్చిళ్ళు - అంటున్న నన్ను చూసి - అమ్మో! నీతో కష్టం లల్లీ! - అంటూనే పాపం సాయం పట్టేసింది.

మొత్తానికి తయారయి ఆఫీసుకి బయల్దేరాను. మారతహళ్ళి వెళ్ళే 333 బస్సెక్కి  ఎన్నేయల్ ఎదురుగుండా దిగి -  రోడ్డు దాటి ఎన్నేయల్ గేటుకి ఇవతల వున్న చిన్నచిన్న నీటి గుంటల్లో కాళ్ళు పడకూడదని ఎత్తెత్తి వేస్తూ, దాదాపుగా తొక్కుడుబిళ్ళ ఆడుతున్నట్లు గెంతుకుంటూ గేటు దగ్గరకి వచ్చాను. అలా కాకుండా మామూలుగా నడవొచ్చు.

కానీ గోదారుల మఱగిన ప్రాణం కదా...
మరచిన ఆ go-దారుల్ని ఈ చిన్నీటి దారుల్లో
తలుచుకుంటూ కాసేపు చిందులేశా.

అక్కణ్ణించి మహా బుద్ధిగా నడుచుకుంటూ మా ALD బిల్డింగ్ దాకా వెళ్ళిపోయాను.  అదే సమయానికి ఎదురుగా వస్తూ కనిపించారు ఇద్దరు సైంటిస్ట్-Bలు. నేను వాళ్ళనంతగా పట్టించుకోలేదు కానీ నాకు తెలీంది ఏంటంటే వాళ్ళు అప్పటిదాకా వర్షం నీళ్ళలో ఆడుకుంటూ వస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నించున్నారని. అప్పటిదాకా ఎన్నేయల్లో ఎంతో మంది అందమైన అమ్మాయిల్ని చూసి ఉంటారేమో కానీ నా తరహా చిందమ్మాయిల్ని చూసుండరు. అదీ వాళ్ళ హాచ్చెర్యం!

ఇంతకు ముందు చెప్పానే... అప్పుడప్పుడు వచ్చే గ్రాడ్యుయేట్ ట్రెయినీ సుజాత అనే అమ్మాయి కూడా పరిచయం అయిందని! తనొచ్చింది ఆ రోజు. తనే కాకుండా MCA లో అకౌంటెన్సీ చెప్పిన రాజశేఖర్ (RS) సర్ కూడా వచ్చారు లంచ్ టైంలో.

మా RS సర్ అప్పుడు బెంగుళూరులో ఏదో బిజినెస్ చేస్తూ ఉండేవారు. నాకూ, సునీతకి అది అగరుబత్తీల వ్యాపారమేమో అని అనిపిస్తూ ఉండేది. ఆ అనుకోలుకి ఇదీ అని కారణమేమీ లేదు. అలా అనుకుంటే మాకు నవ్వొచ్చేది. నవ్వుకోవడానికి అలా అనుకునేవాళ్ళం. అంతే!

సరే! నేను, సుజాత, సునీత, RS సర్ నలుగురం కలిసి ఎన్నేయల్ కాంటీన్లో భోంచేశాం.

అప్పుడు సుజాత అనూప్. జె అనే సైంటిస్ట్-బి ని కలవాలి అంటూ నన్ను తనతో తోడు రమ్మంది. సరే నని సుజాతతో వెళ్తే ఇంతకీ తను కలవబోయిన అనూప్ ఎవరో కాదు ఆ రోజు పొద్దున్నే నాకెదురొచ్చి, హాచ్చెర్య పోయిన ఇద్దరిలో ఒకతను. అతని పక్కనే వున్న ద్వారకానాథ్ అనే ఇంకో సైంటిస్ట్ ఆ ఇద్దరిలో రెండో అతను.


అతనూ, ద్వారకానాథ్ కలిసి నాకు చెప్పిందేంటంటే - నేను ఎన్నేయల్లో చేరిన దగ్గర్నుంచీ నేనెవరా, ఏ డిపార్టుమెంటా అని ఆశ్చర్యపోతున్నామనీ, వాళ్ళ సైంటిస్ట్-బి లోకమంతా నన్ను kid అని పిలుచుకుంటారని చెప్పారు. నాకది వినగానే కొంచెం వింతగా అనిపించింది కానీ అంతగా పట్టించుకోకుండా "ఓ... అలాగా...భలే!" అనేసి సుజాతతో మా ALD కి వచ్చేశాను.

ఈలోగా ఏమైందంటే ఓ రోజు ఇంటికెళ్ళగానే... తలుపుకి ఎదురుగుండా వున్న కేన్ సోఫాలో శ్రీను కూర్చుని వున్నాడు. మామూలుగా నేనింటి కొచ్చే సమయానికి తను ఆఫీస్ నుంచి వచ్చేసి డ్రెస్ మార్చుకుని ఉంటాడు. ఇవాళ మాత్రం ఇంకా BHEL వాళ్ళ గ్రే కలర్ యూనిఫామ్ లోనే వున్నాడు. కొంచెం సీరియస్‌గా వున్నాడు.

నన్ను చూడగానే శ్యామల "హాయ్  లల్లీ!" అంటూ పలకరించింది రోజూ లానే.

అసలు అమ్మా-నాన్న నన్ను ఇక్కడ దిగబెట్టి వెళ్ళిందగ్గర్నుంచీ శ్రీను ఇదివరకటంత చనువుగా మాట్లాడట్లేదు. నేను కూడా - ఏమో  నేనెవరి మాటా వినట్లేదని శ్రీనుక్కూడా కోపం వచ్చిందేమో! - అనుకుని - ఆ కోపం నేనెలాగూ తీర్చలేను కదాని అంతగా పట్టించుకోలేదు. శ్యామల, నేనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.

నేను "హాయ్! శ్యామలా!" అంటూ నా రూం లోకి వెళ్ళబోతుంటే శ్రీను "ఇదిగో లల్లీ!" అంటూ నా చేతికి ఏదో అందించాడు.

అది ఓ టెలిగ్రామ్.

ఏంటా అని నేను చూడబోయేలోగా "ఇలా టెలిగ్రాములు పంపిస్తే ఎలా? మా ఇంటి ఓనర్ ఆవిడ చాలా కంగారు పడ్డారు." అన్నాడు శ్రీను.

అప్పటికీ నాకు అర్థం కాలేదు. కాకపోతే శ్రీనుకి నేనేమీ బదులివ్వలేదు.

నా రూమ్ లోకి వెళ్ళి టెలిగ్రామ్ తీసి చదివితే... అందులో రెండే లైన్లు... అన్నీ Capital letters...

TERE DUKH AB MERE MERE SUKH AB TERE
TERE MERE SAPNE AB EK RANG HAIN - BADARI

నా కళ్ళు మెరిశాయి. ఇన్నాళ్ళూ ఉలుకూ, పలుకూ లేనబ్బాయి నుంచి ఇలా గాలిలో కబురు వచ్చిందంటే దానర్థం...తొందర్లోనే తన గాలి నాకు సోకేంత దూరం లోకి రాబోతున్నాడని.

ఇదింకా నవంబర్.
అంటే కచ్చితంగా డిసెంబర్ 19కో , ఆ లోగానే తను బెంగుళూరు రావొచ్చేమో నన్న ఊహ...

ఊహ అదె 
ఊహ మీరిన ఊసు అదె 
ఊసు అదె 
ఊసు దాటిన ఊహ అదె

పెదవి అంచున పదే పదే
పాట అదె తొణికినదె అదే 
నడకల నిలవని పదముల 
నిలకడ లేక చిందులాడెనదె  

ఎగసిన ఎద ఆడిన తాళమదె
మైమరపు మది పాడిన రాగమదె
ఊరకుండనివ్వక ఉసురు బెట్టెనదె 
ఉల్లసపు పిల్లంగోవినూదెనదె 

ఊసు అదె
ఊసు దాటిన ఊహ అదె
ఊహ అదె
ఊహ మీరిన ఊసు అదె 

అంటూ... అనుకుంటూ... అప్పుడెప్పుడో అబ్బాయి ఇష్టంగా - అచ్చంగా నా కోసం వేయించి ఇచ్చిన ఓ బుల్లి కార్డు చూసుకుంటూ...  

 


 ఆ సంబరంలో తంతి-పాటని తెలుగులో పాడుకున్నా... అదే అసలు-పాట వరసలో... true translation లో -

నీవీ... నావీ... కలలే... 
ఇప్పుడు ఒకటే రంగులే... 
ఓ... ఈ దారులెక్కడికి తీసుకెళ్ళినా 
మనం... ఒక జంటలే... 


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

18 కామెంట్‌లు:

  1. Nice story చీరలు నువ్వు చెవుతుంటేనే మనసులో ఊహించుకున్నాను 👌👌👌👏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భలే! నా బ్లాగ్ చదువుతున్నందుకు థాంక్స్, శ్యామలా!

      తొలగించండి
  2. ఆ డిసెంబర్ 19న ఏమైందో మాకు ఈ డిసెంబర్ 19న తెలుస్తుందన్న మాట. చెప్పటం మర్చిపోయా, W. Besil కోడ్ కనిపెట్టా. చాలా మంది కనిపెట్టే ఉంటారు ఈ పాటికి, కానీ మీకు చెప్పటం నాకు అదో తుత్తి :-))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డబ్ల్యూబెసిల్ అంటే ఏంటో మీకు తెల్సిపోయిందా, దీపగారూ! భలె, భలే! నా బ్లాగ్ నాకెప్పుడూ ప్రియమే, కానీ మీలా ఇష్టంగా చదివేవాళ్ళున్నారని తెలిసి ఇంకా ప్రియమైనదయింది.

      తొలగించండి
  3. అరవై రోజుల ఎదురు చూపుల తరువాత రాసిన పోస్ట్ కూడా ఇంత చిన్నగా రాస్తే ఎలా అండి లలిత గారు!!?
    ఏమైనా మీ పద ప్రయోగాలు నచ్చించడం, నచ్చుదల, చిందమ్మాయి, బాగున్నాయి.
    ANL లో అప్పటి మిమ్మల్ని మీరు వర్ణించిన తీరు చూస్తుంటే such a girly girl you are అని అనిపించింది.

    త్వామనురాజామి తరువాయి బాగానికై ఎదురుచూస్తూ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్నగా ఏం రాయలేదండి...నవంబర్‌కి తగినంతగా రాశాను :) నా త్వామనురజామి సిరీస్ చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్, నరేందర్ రెడ్డి గారు!

      తొలగించండి
  4. Sooo cute! Beautiful!!!

    అసలు...ఏంటా పరుగు?..పదాలూ..!!!
    ఎంత అదుపు...ఒక విషయం నుంచి ఇంకోదానికి మారడంలో...ఎంత బావుందో!

    ఒక పెద్ద కథలా ఉంటుంది ప్రతీ పోస్ట్. ఎన్నో విషయాలు...అన్నీ అద్భుతమైన narration తో.

    అన్నీ...చాలా అర్థవంతంగా కలిసి కనకాంబరాలు, మొగలిపువ్వులూ, Magnolias, Cauliflower అన్నీ కలిపి అతి అందంగా మాల అల్లినట్టు...


    పోస్ట్ అంతా ఒక ఎత్తు… ఆ కొన్ని మురిపించే కవితల్లాంటివి ఒక ఎత్తు…
    బోల్డన్ని థాంక్సులు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా కథలో నీక్కనపడ్డ కాలీఫ్లవర్‌ని కూడా కలిపేశావూ… నచ్చిందమ్మాయ్ నీ కమెంట్ :)

      తొలగించండి
  5. Very nice! When I read the title, I thought of the Dev Anand song - turns out, it was, in fact, the translation to that :-) Very well done :-) It's nostalgic to remember tele-phone, tele-gram - now obsolete modes of communication in the age of smart-phone and insta-gram. But luckily for us, they don't impact the "pathi" or telepathy :-) Keep writing!

    రిప్లయితొలగించండి
  6. లలిత గారు మీ బ్లాగ్లో గాంధి టెక్స్ చీర రంగులగురించి వర్ణన చూశాకా, చాగంటి తులసి గారి "రంగంటే ఇష్టం" లో ఆకుపచ్చ రంగు గురించి కామెంట్ గుర్తుకొచ్చింది.

    Sai Prabhakar Y

    రిప్లయితొలగించండి
  7. మళ్ళీ మళ్ళీ చదివేలా వుంది ఈ కథ కాని కథ. మధ్య మధ్యలో చదువుకుంటూ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ 😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్‌కి వున్న కొద్దిమంది రీడర్స్‌లో నీది కచ్చితంగా ఏ-గ్రేడ్. థాంక్స్ శారదా!

      తొలగించండి