29, జూన్ 2020, సోమవారం

వూ-రీ డైరీ - 1 - ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!


ఇంతకు ముందు డైరీ విశేషాలు: వూ-రీ డైరీ - ప్రమాణశ్రీకారం



"మిస్టర్ వూ" అనబడు సుబ్బారావు డైరీ నుంచి ఒక రోజు పేజీ:



హేవిటో! నాకంతా కలలా వుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడంలో ఇంత ఆనందముందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ఏడాదంతా కోడు రాసి, బగ్గు లేరి కష్ట పడితే ఆఫీసు వాడిచ్చే Meets expectations - Exceeds sometimes రేటింగూ ఓ రేటింగేనా?

అదసలు ...  ఎప్పటికప్పుడు మా సుందరి బొటనవేలెత్తి, కనుబొమలు లేపి ఇచ్చే 'బా చేశావోయ్, బావా!" అనేలాంటి expression ముందు ఏపాటిది?

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంతకు ముందులా కాదు - ఇల్లంతా నా అధీనంలోకి వచ్చేసింది.

మా పిల్లలిద్దరూ కూడా ఏమన్నా ప్లేటో, గ్లాసో కావాలంటే "డేడీ!" అంటూ నన్నే పిలుస్తున్నారు. సింకులో గిన్నె పడడం ఆలస్యం ... తక్షణం తోమడం తథ్యం అన్నదే నా మంత్రం.

అసలు నేను మొదటి గిన్నె తోమినప్పుడు మా సుందరి గోముగా చూసిన చూపు వెలుగులలో నేను తోమిన గిన్నె తళతళలే వెలవెలలాడాయి. అదే మొదటిసారి మా సుందరి నన్నలాంటి చూపు చూడడం.

అప్పుడే నేను పడిపోయా - తోము-ప్రేమలో.

ఇహ అందులోంచి బయటికి రాలేకపోతున్నాను. ఆ చూపులోని గోము అలాగే ఉండాలని సింకులో గిన్నెలు ఎన్నున్నా లెక్కచెయ్యకుండా, ఎన్నున్నాయో అని లెక్కెయ్యకుండా మళ్ళీ మళ్ళీ తోముతూనే ఉన్నా... ఉంటా కూడా!

Raising the bar in dishwashing!

"మిసెస్ రీ" అని పిలిస్తేనే పలికే సుందరి డైరీ నుంచి అదే రోజు పేజీ: 



అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కానీ నాకు నచ్చిన ఓ మాట " పండు పంచివ్వరాదు".

నాక్కావాల్సినట్టు అనుకున్న ఇంకో మాట "పని పంచకుండా ఉంచరాదు".  అసలే మనది మేడె-మోక్రసీ. అందుకే  మా బావ "వూ" కి కూడా పని పంచా.

మొదట్లో ఓ చెంచా కడగడానికే ఇబ్బంది పడిపోయేవాడు. మా అత్తయ్య బొత్తిగా ఏ పనీ నేర్పలేదు మా బావకి. అలా అయితే ఎలా? ఆడుతూ, పాడుతూ పనిపాటలు చేసుకోవాల్సింది మేమే కదా!

నిజం చెప్పకపోవడమేం! మొదట్లో నాకు మా వూ బావ చేత చెప్పీచెప్పకుండా, అడిగీ అడగకుండా ఎలా పని చేయించాలో తెలిసేది కాదు.

ఈలోగా ఓ రోజు మా పక్కింటి క్యాథీ వాళ్ళ కుక్కపిల్లకి బంతి విసిరితే పరుగెత్తుకుంటూ వెళ్ళి తీసుకు రావడం నేర్పుతోంది. ఆవిడ బంతి విసరడం, ఆ కుక్కపిల్ల గెంతుకుంటూ వెళ్ళి ఆ బంతిని పట్టుకురావడం. చూడగా చూడగా ఆ శిక్ష(ణ?) కిటుకు తెలిసిపోయింది నాకు.

అలా ఒక చిన్న గరిటె సింకులో వేసి, తోమమని గోముగా చూసి, అది తోమగానే ఇంకో గంటకి ఓ చిన్న పాల గ్లాసో, కాఫీ కప్పో సింకు లోకి తోసి - తోమిన ప్రతిసారీ బొటన వేలెత్తి, బోల్డు పొగిడి, అలాఅలా ఒక అంతం లేని for(ever) loop లా మొదలు పెట్టి, ఇప్పటికి కదా ... బుట్టెడు గిన్నెలు కడగడం, ఇంటెడు బట్టలు ఉతకడం దాకా తీసుకు రాగలిగాను!

అన్నట్టు ఈ నెల మా ఫేసుబుక్కు వాలు పైన సవాల్ ఏంటీ అంటే...ఎవరి ఇంటాయన తోమిన గిన్నెలు ఎక్కువ తళతళలాడుతున్నాయీ అని.

మా శ్రీవారు వూ-గారి పుణ్యమా అని అది నేనే నెగ్గా...

ముద్దుముద్దుగా చెప్పి ... ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

కడుగుల్, తోముడు, దులుపుల్, సినిమా వీక్షణంబులున్
వినుట యందనురక్తి, ఎఫ్బీ ఇన్స్టా, వాట్సాప్ సారథ్యముల్
నోరూరించెడి పాకశాస్త్ర విదితం, బేబీల సిట్టింగులున్
ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

10 కామెంట్‌లు:

  1. అర్రే,ఆ ఫేసుబుక్కు వాలు పైన సవాల్ మా ఆవిడ చూసినట్లు లేదు, లేదంటే నేనూ నెగ్గేవాడినే.

    సరదాగా బాగుంది పోస్ట్ లలిత గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భలే వారు మీరు, పవన్‌గారు! మీరు భలే sportive. మీ కమెంట్‌కి థాంక్స్!

      తొలగించండి
  2. హమ్మా.. వామ్మో.. అన్నన్నా..
    .. ఎన్నెన్ని కుట్రలు జరిగిపోతున్నాయి సగటు మగాడి మీద..

    మేము వీటిని ఖండఖండాలుగా ఖండిస్తున్నాము అద్యక్షా!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధ్యక్షులవారు కూడా సింకు దగ్గర తలమునకలుగా వున్నారట :)

      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, రవికిరణ్‌గారు.

      తొలగించండి
  3. తళతళలాడే గిన్నెలు - నా చేతిలో
    మిలమిలలాడే కన్నులు - నీ ప్రేమతో

    కన్నుల్లో నీ ప్రేమలే
    గిన్నెల్లో సిరివెన్నెలే


    తళతళ మెరిసిన గిన్నెలు చూడుము
    ఓ రీ .. నా సుందరీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు కట్టిన పాట మా రాలుగాయి రీ రాగాలుగా తీస్తోంది :)

      తొలగించండి
  4. కరోనా వెళ్ళిపోయిన తర్వాతైనా పురుషుల ఇంటి పని ఆగుతుందా అనే అనుమానం కలుగుతోంది నాకు.చిన్నప్పుడు కనిపించిన అమ్మాయి నల్లా ప్రేమించేసే రోజుల్లో పాడేవాడు మిత్రుడొకడు,
    "పురుషుల్ పడరాని పాట్లు గలవే అతివల కటాక్షమునకై" ............ మహా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంటిపని ఏ కాలమైనా ఇంతిపని మాత్రమే కాదేమోనండి. ఈ కాలానికి అది ఇంటిల్లిపాది-పని అవడం మంచి సూచనే. ఇది పదికాలాలపాటు ఇలాగే వుండాలి. మీ మిత్రులు రాసిన పద్య-పేరడీ అదురహా :) దానికో అదర-హాసం :))

      తొలగించండి
  5. "రారా...సరసకు రారా..."అని జ్యోతిక లెవెల్లో పిలవడం.. ఆ తరవాత "తోం..తోం తోం.....తోం తోం తోం.." అంటూ సింకు దగ్గర నిలబెట్టెయ్యడం! అమ్మో అమ్మో! ఏం తెలివితేటలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరేండి... ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని నేర్చుకోకపోతే ఇంకెప్పటికీ నేర్చుకోలేమని అందిన అవకాశాన్ని అందిపుచ్చేసుకుని ఆనందించేస్తున్నాం :)

      తొలగించండి