సినీకవి కొసరాజుగారు అల్లిన ఒక పాటలో చరణం:
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్
అంతరాన ఉన్న అయినవారు ఎంత దూరాన ఉన్నా - ఆ దూరం మనసుకి భారం కాకుండా సాయపడేవి ఫోన్లు.
రోజూ ఇండియాకి - ఇంటికి ఫోన్ చేస్తాను - అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి.
అలా రోజువారీ పలకరింపుల ఫోన్ పిలుపులు కాకుండా, కొంచెం తీరిగ్గా ఓ అరగంట టైం దొరికి - మా ఇద్దరికీ కుదిరి - నాన్న, నేను మాట్లాడుకున్నప్పుడల్లా - పాపయత్తయ్య ప్రసక్తి వస్తూనే ఉంటుంది.
అలా వచ్చిన ప్రతీసారీ నాన్న "ఎంత జ్ఞాపక శక్తో ఆవిడకి! తొంభై ఏళ్ళ వయసులో కూడా పోతన భాగవతంలో ఘట్టాలన్నీ పద్యాలుగా పాడేస్తూ ఉంటుంది." అని వాళ్ళక్కగార్ని గురించి చాలా ముచ్చటగా తలుచుకుంటూ వుంటారు నాన్న.
పాపాయత్తయ్య మా నాన్నకి పెద్దక్కగారు.
తొంభయ్యవ పడి సమీపిస్తున్నా కూడా ఈ రోజుకీ ఆవిణ్ణి చూడడానికి నేను హైదరాబాదు వెళ్తే - ఆవిడ చేత్తో నాకేదైనా కాఫీయో, పళ్లరసమో కలిపిస్తారు. ఆ తర్వాత - హుషారుగా ఎన్నో పాటలు, పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు పాడి వినిపిస్తారు. పలికే మాటతో పాటు ఒలికే నవ్వు చేర్చి గలగలా మాట్లాడే మా పాపయత్తయ్యతో ఉంటే గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.
నాకెప్పుడూ ఒకటనిపిస్తూ ఉంటుంది. మనకంటూ మనల్ని ఇష్టపడేవారు ఎంత మంది మనతో ఉంటున్నా మనిషిగా ఎవరికి వారు ఒంటరే. ఎవరి సంతోషం వారిదే. ఎవరి బాధ వారిదే. ఎవరి నొప్పి వారిదే. ఎవరి అనుభవం వారిదే. ఎవరి అనుభూతి వారిదే. మహా అయితే మనవాళ్ళు అనుకునేవాళ్ళు మనం నవ్వితే నవ్వుతారు. మనం ఏడిస్తే మనతో పాటు ఆ దుఃఖాన్ని పంచుకోగలుగుతారు. అంత వరకే! కానీ మన నొప్పి - అది శరీరానికైనా, మనసుకైనా - అది ఎవరిది వారికే!
అలాంటప్పుడు ఎవరికైనా అలవాటవాల్సిన దృక్పథం ...
నిన్నటిలో మంచిని తలుచుకుని నవ్వుకోగలగడం -
ఈ రోజుకి హాయిగా ఉన్నామని తృప్తి పడడం -
రేపటికి బావుంటామని ఆశించడం.
ఇవన్నీ నాకు మా పాపాయత్తయ్యతో మాట్లాడినప్పుడల్లా ఆవిడలో కనిపిస్తాయి.
పాపాయత్తయ్యకి చదువు మీద ఉన్న ఇష్టం నాకెంతో అబ్బురంగా అనిపిస్తుంది. ఆ కాలంలో ఐదో తరగతి తర్వాత బడికి వెళ్ళి చదువుకునే వీలు లేకపోయినా ఇంట్లోనే ఉంటూ రామాయణ, భారత, భాగవతాలతో పాటు మా లలితత్తయ్యతో కలిసి హిందీ కూడా నేర్చుకున్నారు. వాళ్లిద్దరూ పెళ్ళిళ్లయ్యి అత్తవారిళ్ళకి వెళ్ళాక హిందీలో ఉత్తరాలు రాసుకునేవారట.
పాపాయత్తయ్య తన ముగ్గురు కొడుకులతో పాటు కూతురైన జయాంటీని కూడా ఆ రోజుల్లోనే బీఈడీ చదివించి టీచరుగా ఉద్యోగం కూడా చేసే అవకాశం కల్పించారు. నాకు తెలిసి నా ముందు తరంలో మా ఇంట్లో మా జయాంటీయే మొట్టమొదటి ఉద్యోగస్థురాలు. నాకది ఎంతో గొప్ప విషయంలా అనిపిస్తుంది. (జయాంటీ వరసకి నాకు వదినైనా చిన్నప్పట్నుంచీ జయాంటీ అని పిలవడమే అలవాటు.)
నాగ్గుర్తుండి ఆవిడకి నచ్చని విషయాల గురించి పాపాయత్తయ్య మాట్లాడిన సందర్భమేదీ లేదు.
ఇప్పటికీ పాపాయత్తయ్య గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని తమాషా విషయాలు తలుచుకుని - ఆవిడకి గుర్తు చేసి మరీ - నవ్వుకుంటాం.
చిన్నప్పుడు ఏ పండక్కో, పెళ్ళికో అనాతవరం వెళ్ళినప్పుడు సాధారణంగా ఏదో ఒక పూట కరెంటు పోయేది. అప్పుడు పిల్లలందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా కబుర్లన్నీ కాసేపటికి తేళ్ళూ, జెర్రులూ, పాముల మీదకి మళ్ళేవి.
వెంటనే ఆ పక్కనే ఉండి మా మాటలు వింటున్న మా పాపాయత్తయ్య "వాటి పేరనకండి ... ఇంట్లోకి వచ్చేస్తాయి" అనేవారు.
ఆవిడ దేని గురించి అంటున్నారో మాకు అర్థమయినా మేము కావాలని "వేటి పేరనద్దత్తయ్యా?" అనడిగేవాళ్ళం.
అప్పటికీ ఆవిడ నోటితో అవేంటో చెప్పకుండా "అదే... ఆ పాకేదాని పేరు అనకండి" అనేసేవారు. మా ఆకతాయి పిల్లమూకతో కలిపి భళ్ళుమని నవ్వేసేవారు.
మా పాపాయత్తయ్యకి చీర నలక్కూడదు. చేతికి పెట్టుకునే వాచీకి గోల్డ్ కలర్ చెయిన్ మాత్రమే ఉండాలి.
కట్టే ప్రతీ చీరా రోలింగ్ చేయించుకుంటారు. నేను ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా "చూశావా లల్లీ! మీ నాన్నేం చేశాడో ? నాకు రోలింగ్ పాపాయి అని పేరు పెట్టాడు" అని గలగలా నవ్వుతారు.
కిందటి వారం ఫోన్ చేసినప్పుడు "రోలింగ్ చీరలు బందయిపోయాయి ఇప్పుడు లాక్-డౌన్ కదా!" అని మళ్ళీ నవ్వారు.
మా పాపాయత్తయ్య ఛలోక్తులకి అసలు తడుముకోరు. మొన్నామధ్య నేను ఆవిడకి ఫోన్ చేసినప్పుడు బదరి తాను కూడా ఒకసారి అత్తయ్యతో మాట్లాడతానన్నారని ఫోన్ బదరికి ఇచ్చాను.
"హలో పాపాయత్తయ్యా! బావున్నారాండీ ?" అంటూ ఇటు నుంచి బదరి పలకరింపు.
మా ఇంట్లో పెద్దవాళ్లందరినీ - ఒక్క మా అమ్మ-నాన్నని తప్పించి - మిగిలిన వాళ్ళందర్నీ నేనెలా పిలుస్తానో బదరి కూడా అలాగే పిలుస్తారు. అందుకే మా పాపాయత్తయ్యని తను కూడా "పాపాయత్తయ్య!" అనే పిలుస్తారు.
"బ్రహ్మాండంగా ఉన్నాను నాయనా!" అటు నుంచి అత్తయ్య సమాధానం.
"మరి సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్నారా?" ఇండియాలో ఎవ్వరికి ఫోన్ చేసినా ఎండలో నడవమని చెప్పే బదరి వాడుకగా అడిగే కుశలప్రశ్న ఇది.
అది వినగానే అత్తయ్య "నేను గబగబా నడవలేను నాయనా... ఇంట్లోనే అడుగులు వేస్తూ వుంటాను" అని చెప్తున్నారు.
అది వింటూనే "అయ్యో! అలా అయితే ఎలాగండి? ఈసారి మీకో వాకింగ్ స్టిక్ తెస్తాను. కిందటి సారి అంకుల్‌కి కూడా కొనిచ్చాను ఒకటి. చిన్న లాఠీలాగా మడిచేసుకోవచ్చు. చాలా బావుంటుంది" - చేతికఱ్ఱ అమ్మేవాళ్ళు కూడా అంతగా వర్ణించరేమో అన్నంత బాగా సదరు చేతికఱ్ఱ గుణగణాలని చెప్పుకొస్తున్నారు బదరి.
అది వింటూనే "హహ్హహ్హ! మా ఇంటిపేరు కఱ్ఱావారు. నాకు ఇంకో కఱ్ఱ అవసరం లేదు నాయనా" అని గలగలా నవ్వారు మా అత్తయ్య కఱ్ఱా పాపాయిగారు.
ఇప్పటికీ అది తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు నా మేలి-సగం.
ఇప్పుడంటే కొంచెం ఓపిక తగ్గి రాయడం మానేశారు కానీ - పాపాయత్తయ్య ఒక డైరీ పెట్టుకుని తనకి వచ్చిన ఆలోచనలు, మంచి మంచి నీతివాక్యాలు, సినిమా పేర్లు ఉపయోగించి రామాయణం, సమస్యా పూరణాలు, చిన్నచిన్న కథలు - ఇలా ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవారు. ఆవిడ రాసుకునే డైరీయే కాకుండా అందులో కొన్ని - నేను అడిగానని - నాకు వేరే డైరీలో రాసి ఇచ్చారు కూడా. నేను బ్లాగ్ రాస్తానని తెలిసినప్పుడు "నువ్వూ, నేనూ ఒక్కలాగే" అని మురిసిపోయారు.
ఎత్తులంటే ఇష్టపడని మా పాపాయత్తయ్య బోల్డు అంతస్తులు ఉండే అపార్టుమెంటులంటే అస్సలిష్టపడరు. అందుకే ఆవిడ మనవరాలు, నా చిన్నప్పట్నుంచి నేస్తమైన మధుమతి "అమ్మమ్మకి పంచభూతాలూ కనిపిస్తూ ఉండాలి" అంటూ ఉంటుంది.
ఆవిడకి రాముడు ఆరాధ్య దైవం. సుందరకాండ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుందని ఓ ఏడు శ్లోకాలు అచ్చు వేయించి, లామినేట్ చేయించి - చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు వెతుక్కునే యువతీ యువకులు, పిల్లలకి పెళ్ళి చేయాలనుకునే పెద్దలు, ఏదో జరగాలని ఆశించే వారు - ఇలా ఎంత మందికో పంచిపెట్టారు, ఇంకా పంచుతూనే వున్నారు.
మొన్నటికి మొన్న నేను అడిగానని ఆవిడ ఎప్పుడూ పాడుకునే మేలుకొలుపులు పాట పాడి నాకు పంపించారు. అందులో కొంత భాగం మాత్రం ఈ కింద రాసి పెట్టుకున్నాను ప్రస్తుతానికి.
పాట పాడిన పాపాయత్తయ్యకి, రికార్డ్ చేసి పంపించిన బుజ్జికి, దాన్ని యూట్యూబ్‌లో ఉంచిన బదరికి బోల్డన్ని థాంక్స్!
కేశవా! అని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు... మేలుకో...
వాసవ వందిత... వసుదేవ నందన... వైకుంఠపురవాస... మేలుకో...
తెల్లవార వచ్చెను!
మేలుకో శ్రీకంఠ... మేలుకో శశిధర... మేలుకో వృషవాహ... మేలుకో...
మేలుకో జగదాంబ మేలుకో లలితాంబ మేలుకో భ్రమరాంబ మేలుకో...
తెల్లవార వచ్చెను!
నాగేంద్ర హారాయ... నాగలింగవాస... నగజ ప్రాణేశ్వర... మేలుకో...
ఆగమసన్నుత... అఖిల లోకాధీశ... భక్తార్తి విఛ్చేదన... మేలుకో...
తెల్లవార వచ్చెను!
భూజనుల కోర్కెలు - మోజుగా నొసగేటి - రాజరాజేశ్వరి... మేలుకో
రాజీవముగ - నూరు రాజ సఖులు - నిన్ను పూజింప వచ్చిరి... మేలుకో
తెల్లవార వచ్చెను!
కుదురు పాపశయన... కొక్కొరోయని కోళ్ళు కుయ్యంగ జొచ్చెను... మేలుకో
మధువైరి మొదలైన - మహనీయ సురులెల్ల - నీ మది గోరి వచ్చిరి... మేలుకో
తెల్లవార వచ్చెను!
కమలములు వికసించే - కమలాప్తుడుదయించే - హిమగిరి నందన... మేలుకో
కమలా మొదలైన - అమరకాంతలెల్ల - నిను గొల్వ వచ్చిరి ... మేలుకో
తెల్లవార వచ్చెను!
తెల్లవార వచ్చే - తెలుపారే దిశలెల్ల - పల్లజడల స్వామి... మేలుకో
ముల్లోకములకెల్లా - మూలకారణమైన - మృత్యుంజయ ప్రభూ... మేలుకో
తెల్లవార వచ్చెను!
కాకాది నీరాజ ఘనరావములు చెలగ - కాళీ పరంజ్యోతి... మేలుకో
ప్రకట నిడమర్తి కామాక్షిని బ్రోచే - లోకసుందరి బాల... మేలుకో
తెల్లవార వచ్చెను!
********
పేర్చుకున్న జ్ఞాపకాలు - పెంచుకున్న ఇష్టాలు - చేసుకున్న ఆలోచనలు - అన్నీ తనకు తగ్గట్టుగా - తనదైన జీవితాన్ని తన పద్ధతిలో, తను అనుకున్న విధంగా జీవించగలగడం మా పాపాయత్తయ్య సాధించిన అపురూప జీవితానుభవం.
ఆవిడ మేనకోడలుగా చిన్నప్పట్నుంచీ ఆవిణ్ణి చూస్తూ అందులోంచి కొంతైనా దక్కించుకోగలగడం నాకు చిక్కిన అదృష్టం.

నాన్న ఉండే పుట్టిల్లు అంటే మేనత్తలకీ, మేనకోడళ్ళకీ, అమ్మాయిలందరికీ బోలెడంత ఇష్టం కదూ ? ఈ పోస్టంతా నాకు నచ్చేసింది.
రిప్లయితొలగించండి"నువ్వూ, నేనూ ఒక్కలాగే" !
మీరన్న ప్రతి మాటకీ నేననేది ఒకటే మాట...అవునవునండి ... నీహారికా! :)
తొలగించండిలల్లీ పాపాయత్త గురించి చాలా బాగా చెప్పావు . చదువుతుంటే అలా ఆగకుండా చదవాలనిపించింది . నీలాంటి మేనకోడలు ఉండండం ఆవిడ అదృష్టం . అది చదువుతుంటే చిన్నప్పుడు మా అమ్మ , పాపాయత్త అడుకునేవారు అని చెప్పినట్టు గుర్తు . అది అంత గుర్తు వచ్చింది. . ఎందుకు చెప్పానంటే అమ్మ కూడా ఇలాగే పాపయత్తలాగే చాలా పాటలు పాత పాటలు పాడుతుంది . పాపయత్త పాటలు నువ్వు బ్లాగులో పెట్టావు . మేమంతా విన్నాము . ఆవిడని చూసాను . ఎప్పుడో చిన్నప్పుడు చూసాను . మళ్ళీ ఇన్నిరోజులకు చూసి పాట విన్నాను. చాలా చాలా సంతోషం వేసింది . వినిపించినందుకు , చూపించినందుకు చాలా థాంక్స్ . మరి నీ లాంటి మేనకోడలు అదృష్టం కదా . సూపర్ . బాగుంది .
రిప్లయితొలగించండిలక్ష్మత్త
మీ మాటలకి చాలా సంతోషంగా అనిపించింది. థాంక్స్, లక్ష్మత్తా!
తొలగించండిపాపాయత్తయ్య పోలిక మీకు వచ్చింది. మేనత్తపోలిక మంచిదే కదా. ఆవిడ అభిరుచులన్ని, మీరు తీరుస్తున్నారు.మీ పాపాయత్తయ్యకి🙏🙏🙏 - సరోజ ఆంటీ.
రిప్లయితొలగించండిమీ మంచి మాటలకి బోల్డన్ని ధన్యవాదాలు, సరోజాంటీ!
తొలగించండి