28, మే 2016, శనివారం

ఏడు కిటికీల క్యూపొల చూపించిన అందాలు - ఎ బ్యూటిఫుల్ ప్లానెట్


ప్రతీ సారి శలవులు మొదలవగానే - ఏదైనా సినిమా చూద్దామా నలుగురం కలిసి అనగానే మా ఇంట్లో ఒక చిన్న అభిప్రాయ సేకరణ, దాని వెంటనే ఎన్నికల పోలింగ్ లాంటి హడావిడి మొదలవుతుంది - ఇంట్లోనా, థియేటర్ లోనా - కార్టూన్ మూవీయా, మనుషులుండేదా - ఇండినా, ఇంకోటా - ఇలా రకరకాల తలపోతలు, వడపోతలు అయాక ఎప్పుడూ గెలిచేది పిల్లలే అని తెలిసినా అదో వాదించి-ఇష్టంగా-ఓడిపోయే-సినిమా-సరదా :)


పిల్లలిద్దరూ కలిసి ముందే చెప్పేస్తారు - తెలుగు సినిమా అయితే రానే రామని - 2011 లో కృష్ణ వంశీ సినిమా - మొగుడు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది వాళ్లకి. అప్పట్నుంచీ ఏ తెలుగు సినిమాకైనా కొలమానం అదే వాళ్లకి.


ఒకానొక శనివారం (మే 20) అలాంటి ఒక ఏక (పక్ష) అభిప్రాయానికి వచ్చి సెయింట్ లూయిస్ సైన్స్ సెంటర్ Omni Max థియేటర్ లో భూమిని - భూమికి అవతల నుంచి ఎలా వుంటుందో కెమెరా కన్నుతో చూసి వచ్చాము - ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ సినిమాలో. 


ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ - 16 దేశాలు కలిసి భూమికి దాదాపు 270 మైళ్ళ దూరంలో ఏర్పరుచుకున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) - అబ్జర్వేటరీ డెక్ అయిన క్యూపొల నుంచి ఏస్ట్రోనాట్స్ తీసిన ఒక డాక్యుమెంటరీ సినిమా. 


(ISS లోని 16 దేశాలు: కెనడా, జపాన్, రష్యా, అమెరికా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్. )


ఈ సినిమాలో చూసిన వింతలూ విశేషాలు + అవి చూస్తూ నాకొచ్చిన ఆలోచనలు:



సినిమా మొదట్లో ఓ ముగ్గురు ఏస్ట్రోనాట్స్ ISS కి వస్తారు ట్రైనింగ్ కి. వాళ్ళు రాగానే ISS లో అప్పటికే వున్న ఏస్ట్రోనాట్స్ లో కనిపించిన సంబరం భలే బావుంది - భూమికి అంత  దూరంగా వున్నప్పుడు అప్పటివరకూ వున్న ముగ్గురో నలుగురో కాక కొత్త వాళ్ళు వస్తే నిజంగా ఎంత బావుంటుందో వాళ్ళ కళ్ళల్లో, నవ్వుల్లో తెలుస్తుంది. 


ఇంక కొత్తగా వెళ్ళిన టీం అయితే ఆ క్యూపొలలో కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్రుతతో అన్ని గదులూ చూసుకుంటూ, వచ్చేశామన్నఆనందంతో పిల్లలు గంతులు వేసినట్లు - ఆ zero gravity atmosphere లో పల్టీలు కొడుతూ వుంటారు. వాళ్ళు అక్కడినుంచి గుంపులుగా వున్న చిన్న చిన్న మబ్బుల కిందనుంచి కనిపించే భూమిని మెరిసే కళ్ళతో చూసి మురిసిపోతుంటారు.



గంభీరమయిన గొంతుతో మేఘుడు తధిగిణ-తోం అంటుంటే వానలో తడుస్తున్న మెరుపు తీగలు నాట్యం చేస్తూ వుంటే భూమి మీద నుంచి చూసే నాకే ఇంత బావుంటే - మేఘాలకావల నుండి మబ్బుల మేలిముసుగులో కనిపించే ఆ విద్యుల్లతలు ఇంకెంత ద్భుతంగా వుంటాయో - వాళ్ళు  చూస్తూ, చూసిన దాన్ని కెమెరా కన్నుతో చూపించిన - ఆ NASA ఏస్ట్రోనాట్స్ కి వాన చినుకులన్ని వందనాలు - అభివందనాలు చెప్పేయానిపించింది.


మురిపించే దీపావళి తారాజువ్వల వెలుగులాంటి మెరుపులే కాక  సముద్రంలో కేంద్రీకృతమయ్యే పెద్ద పెద్ద తుఫానులు, హరికేన్లు ఎలా ఉంటాయో కూడా చూడగలం ఈ సినిమాలో.


వాటన్నిటినీ చూస్తూ ఇంతకీ క్యూపొలలో జీవితం ఎలా వుంటుందా అని చూడబోతే - ఉరుములతో మెరుపులతో ఉత్సాహంగా కురిసే వానని తమ కింద వున్న మేఘాలలో వుంచుకుని కూడా క్యూపొలలో నీళ్లు ఎంత పొదుపుగా వాడతారో! 


ఒక ఏస్ట్రోనాట్ - ఒక నాలుగు చుక్కలు షాంపూ తలమీద వేసుకుని, ఒక నీళ్ళ ప్యాకెట్ లోంచి ఇంకొన్ని చుక్కలు తలమీద చల్లుకుని, వెంటనే ఒక తడి నాప్కిన్ తో తల తుడిచేసుకుంటారు.  అంతకు ముందే భూమిమీద కాలిఫోర్నియాలో నీళ్ళు లేక భూమి ఎంత ఎర్రగా అయిపోతోందో చూపించినప్పుడు, ఇండియా లో జీవనది అయిన మన దేవ(తా)నది గంగలో నీళ్ళు తరిగిపోతున్నాయని చెప్పినప్పుడు - నేను కాకపోయినా నీళ్ళు దొరక్క ముందు ముందు తరాలు పడబోయే ఇబ్బందులు ఊహించుకుని చాలా దిగులుగా అనిపించింది. 


నీటి సంగతి అలా వుంటే మరి భోజనం మాటో ?! ఇంట్లో ఎన్ని వున్నా, రకరకాలు వండుకుని తింటున్నా ఎప్పుడయినా కొత్త రుచులు కావాలనిపించడం, అనుకున్నదే తడవుగా వెళ్లి ఏ హోటల్ లోనో తినాలనుకున్నదేదో తిని రావడం - పెద్ద చెప్పుకునే విషయం కాదు - నిజమే - కానీ అది నేనున్నది క్యూపొల కానంత సేపేక్యూపొలలో వుంటే ఏ మూడు నెలలకో, ఆరు నెలలకో ప్రైవేటు కార్గో స్పేస్ షటిల్ తెచ్చే తాజా పళ్ళు, ఆహారం అమృతాన్ని మరిపిస్తాయి మరి!


కప్పులో కాఫీ తాగడం అతి మామూలు విషయం కదా - అందులో అంతగా సంతోషించి సంబరపడాల్సింది ఏముంది ? కదా?! కానీ స్పేస్ లో కాఫీ తాగాలంటే ఒక ప్యాకెట్ లోంచి పీలుస్తూ  తాగాలి. లేకపోతే ఏ ఆకర్షణ శక్తీ (భూమ్యాకర్షణ / గురుత్వాకర్షణ) లేని ఆ క్యూపొలలో వేడి వేడి కాఫీ తేలుతూ మీద పడిపోతుంది మరి! మరలాంటప్పుడు ఏడాదిగా ISS లో వుంటూ  మొట్ట మొదటి సారిగా ఒక జీరో-G కప్ లో కాఫీ తాగితే ఎంత బావుంటుంది - అంటే అలా తాగుతున్న ఏస్ట్రోనాట్ ఆనందం చూడాల్సిందే


తినడం తాగడమే కాకుండా భూమ్యాకర్షణ కి దూరంగా వుండడం వల్ల శరీరంలో ఎముకలకి వచ్చే సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఏస్ట్రోనాట్స్ క్యూపొలలో ట్రెడ్ మిల్ మీద చేసే జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన వ్యాయామాలు, ఇంకా ఒకరికొకరు చేసుకునే జుట్టు-కత్తిరింపులు, అవసరమయినప్పుడు చేసే టాయిలెట్ రిపైర్లు, ప్లంబింగ్ అన్నీ చూపిస్తారు ఈ సినిమాలో


స్పేస్ వాక్ చేయడం అంటే --- ఒక ఎర్ర తువ్వాలు వీపుకి కట్టుకుని మన సూపర్ మాన్ పాడే -

మబ్బుల్లో చంద్రమ్మా - చంద్రమ్మ చంద్రమ్మ చంద్రమ్మా

... పాట  కాదండోయ్ ... అసలా స్పేస్ సూట్ వేసుకోవడం ఒక ఎత్తయితే తరవాత తీయడానికి - ఒక  మనిషి వేసుకున్న వాళ్ళ మీదకి ఎక్కి కాలితో బలంగా తోస్తూ వుంటే - చాలా సేపు అటు కదిలీ, ఇటు కదిలీ ఎప్పుడు వదులుతుందిరా బాబూ అనిపించేంత ఇదిగా ఒంటిని పట్టేసుకుని వుంటుంది. తీరా స్పేస్ వాక్ కని బయటికి వెళ్తే అదేమీ వెన్నెలలో విహారం కాదు - క్యూపొల బయట చాలా వైర్లు, రేకులు వేళ్ళాడుతూ వుంటాయి. అంతే కాక సూర్యుడి నుంచి వచ్చే వేడి 250 F డిగ్రీలు వుంటుంది. ఏ రేకో తగిలి పొరపాటున స్పేస్ సూట్ ఏ మాత్రం చిరిగినా అక్కడికక్కడే ప్రాణం పోతుంది :( ఇన్ని కష్టాలకోరుస్తూ, ఇంటికి - ఇంటివారికి దూరంగా ఉంటూ, మానవ కల్యాణానికి పనికి వచ్చే ప్రయోగాలు చేస్తూ వుండే ఆ ఏస్ట్రోనాట్సే కనిపించే దేవుళ్ళేమో అనిపించింది


పగలు క్యూపొలలోంచి చూస్తే మన భూమి నీరున్నంత వరకూ అంటే మూడింట రెండు వంతులు నీలంగా, మిగిలిన భాగం లో కొంత ఆకుపచ్చగా, కొంత గోధుమ రంగులో కనిపిస్తుంది. అదే భూమి రాత్రి  వేళల చూస్తే -

जब तारें ज़मीन पर जलते हैं... 
आकाश ज़मीन हो जाता है... 


అన్నట్లు - నక్షత్రాలన్నీక్యూపొల నుంచి చిత్రీకరిస్తున్న ఏస్ట్రోనాట్ కెమెరా దృష్టి లో పడాలనుకుంటున్నాయేమో - అందుకే ఒకరితో ఒకరు నువ్వు జరుగు - నువ్వు జరుగు అనుకుంటూ ఫోటోకి పోజివ్వడానికి భూమి మీద గుంపులుగా నించున్నట్టు అనిపించింది


ఆ రాత్రి పూట నక్షత్ర కాంతిని మించే వెలుగులతో కనిపిస్తున్న భూమి మీద విద్యుద్దీప మాలికలను చూస్తే అందులో కొన్ని మా ఇంటివి కూడా వుంటాయనుకోవడం భలేగా అనిపించింది.  ఆ దీపకాంతులని వివరిస్తూ చూపించిన ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ - మరిచిపోదామనుకున్నా మరపుకు రాని చేదు జ్ఞాపకంలా తోచింది


ఆ పక్కనే ధగ ధగమని బంగారు కాంతులతో వెలుగుతూ దక్షిణ కొరియా - పక్కనే మిణుకు మిణుకు మంటూ అతి తక్కువ దీపాలతో నిట్టూరుస్తున్న ఉత్తర కొరియా - చూడగానే 

ఇరుగింటిలోన ఖేదం - పొరుగింటిలో ప్రమోదం 

- అన్న ఘంటసాల వారి పాట గుర్తుకురాక మానదు


చివర్లో - మసక వెలుతురులో - అటు తిరిగి క్యూపొలకి వున్న ఏడు కిటికీల్లోంచి బయటికి చూస్తూ -  బాగ్ పైపర్ వాయిస్తూ - నించుని వున్నఏస్ట్రోనాట్ ని చేయి పట్టుకుని - సినిమా అయిపోగానే మనతో తీసుకొచ్చేసి వాళ్ళింట్లో దింపగలిగితే ఎంత బావుంటుంది కదా అనిపించింది


భూమికి దూరంలో వున్న ఆ వ్యోమగాములు చెప్పినట్టు - మేము వచ్చిన దేశాలు వేరే అయినా మాలో భేదాలు లేవు - అని భూమి మీద వున్న అందరూ అనగలిగిన రోజు మన భూమి చూపుకి అందంగానే కాదు తలపుకీ  ఆనందంగా అనిపిస్తుంది.





19, మే 2016, గురువారం

త్వామనురజామి-1 - ఎవరేమన్నను - అపర్ణ తోడు రాకున్నను ఒంటరిగానే పో....



ముందుమాట ఇక్కడ 

      "అమ్మా! కాలేజ్‌కి వెళ్తున్నాను" గట్టిగా పిలిచి అమ్మకి చెప్పాను నా  పుస్తకాలు, లంచ్ బాక్స్ బాగ్లో సర్దుకుంటూ. 

    బీఎస్సీలో చేరినప్పట్నుంచీ నేనూ, అపర్ణ ప్రతి గురువారం కాలేజ్‌కి తెల్లరంగు చుడీదార్లు వేసుకుని వెళ్దామని అనుకున్నాం. 

    ఇవాళ గురువారం. 

    మా గురువారపుడుపుల-పంచాంగం ప్రకారం తెల్ల చుడిదార్లు వేసుకుని 'రాణులు వెడలె' అన్నట్టు కాలేజ్ కి వెళ్దామని అనుకున్నామా- కానీ ఎక్కడ?! - Girls propose, Gods dispose! హ్మ్! 

    ఇవాళ  కాలేజ్‌కి రానని అపర్ణ నిన్నే చెప్పేసింది. అపర్ణా వాళ్ళ  రత్నాంటీ జర్మనీ లో వుంటారు. ఆవిడిప్పుడు బెంగళూరు IISc కి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చారట.  ఆ రత్నాంటీ ఇవాళ గుంటూరుకి వస్తున్నారని అపర్ణ కాలేజ్‌కి రానని చెప్పింది. 

    మరి నాకు తప్పదు కదా! అందుకే ఒక్కదాన్నేబయల్దేరాను - కొంచెం భయం, భయంగానే.  భయమెందుకంటే - నేను వెళ్ళబోయేది  - మా మేథ్స్ లెక్చరర్ కోటేశ్వరరావుగారు అన్నట్లు వందేళ్ళ కాలేజీ - నేననుకునేట్లు నన్ను వణికించే కాలేజ్

    మళ్ళీ అమ్మకి వినబడిందో లేదో అని ఇంకొంచెం గట్టిగా అరిచేశాను - "అమ్మా! వెళ్తున్నాను. బై", అని.

    "ఎన్ని సార్లు చెప్పాలి, లల్లీ! వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తాను - అనాలని" అంటూ వంటింట్లోంచి చేతులు చీర కొంగుకి తుడుచుకుంటూ వచ్చింది అమ్మ.

    "సరే తల్లీ, సరే! వెళ్ళొస్తాను" అని హడావిడిగా చెప్పులు వేసుకుని చున్నీ సర్దుకుంటూ పరుగు తీశాను బయటికి. 

    నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్‌లో  బీఎస్సీ చేరింది ఈ సంవత్సరమే. నాన్న ఏ. సి.  కాలేజ్‌లో  ఫిజిక్స్ బాగా చెప్తారని + నాకు ఫిజిక్స్ ఇష్టమని ఇక్కడ చేర్పించారు. 

    చేర్పించే ముందే చెప్పారు- "లల్లీ! నువ్వు పెద్దదానివి అవుతున్నావు. ఇంకా యూనివర్సిటీకి వెళ్లి పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలనీ అనుకుంటున్నావు. ప్రపంచంలో బ్రతకాలంటే చదువులో తెలివితేటలు ఒక్కటే సరిపోవు. లౌక్యం కూడా నేర్చుకోవాలి. అందుకు నీ కాలేజ్‌లో  ఏ సమస్య వచ్చినా నువ్వే పరిష్కరించుకోవడం అలవాటు చేసుకో. చిన్నపిల్ల లాగా ఇంట్లో చేసినట్టు నిన్ను అక్కడ అందరూ గారం చేయాలని అనుకోకు." అని.

    విమెన్స్ కాలేజ్ లో చేరిన మిగిలిన అమ్మాయిలు అందరూ తెగ భయపెట్టేశారు - ఏ. సి. కాలేజ్‌లో  గొడవలు ఎక్కువగా జరుగుతాయని. అక్కడ అబ్బాయిలు  అమ్మాయిలని బాగా ఏడిపిస్తారని - చెప్పి. 

    అదీ! అదండీ - ఈరోజు నా  భయానికి కారణం - కాలేజ్‌కి ఒంటరిగా వెళ్ళడానికి.

*****************************************************************

    "నాన్న ఎప్పుడూ ఇంతే! కాలేజ్ లో ఏ గొడవ అయినా నన్నే సాల్వ్ చేసుకోమంటారు. అక్కడేమో అందరూ ఇంత పెద్దగా రౌడీల్లా వుంటారు. ఎంత భయమేస్తుందో ఆయనకెలా అర్థమవుతుంది? అసలే ఇవాళ అపర్ణ కూడా రావట్లేదు. వాళ్ళ ఆంటీ బెంగళూరు నుంచి వచ్చారసలే. ఇవాళ్టి దాకా ఎప్పుడూ ఒక్కదాన్ని వెళ్ళలేదు. ఎలా వుంటుందో ఏంటో !! "  - నాలో నేనే గొణుక్కుంటూ, సణుక్కుంటూ సెంటర్ లో రిక్షా స్టాండ్ దగ్గర ఆగాను.  

    రోజూ అలవాటుగా ఎక్కే రిక్షా బండబ్బాయి - కోటేశు తను కూర్చున్న సీట్లోంచి లేచి తన తలపాగాలా కట్టుకున్న తువాలు తీసి రిక్షా సీటు తుడిచి - "ఎక్కండి పాపగారూ!"  - అన్నాడు.

    నేను రిక్షా ఎక్కి కూర్చోగానే కోటేశు అలవాటుగా బ్రాడీపేట రెండోలైను లోకి తిప్పబోయాడు - అపర్ణ వాళ్ళ ఇల్లుండేది అటే మరి. 

    నేనది చూసి- "ఆ...! ఆ...! కోటేశూ ! అటు వెళ్ళక్కర్లేదు ఇవాళ. కాలేజ్‌కి పోనీయ్", అన్నాను.

    "అదేంటమ్మా! ఆ రెండోలైను పాపగారు రారా ఇవాళ కాలేజీకి ?",  అనడిగాడు.

    "లేదు కోటేశూ! వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇవాళ నేనొక్కదాన్నే!", కొంచెం బెంగగానే చెప్పాను

    కోటేశు  "సరేనమ్మా" అని బిజీగా వున్న బ్రాడీపేట నాలుగోలైనులో ఎదురుగా వచ్చే కార్లని, రిక్షాలని, మీదకొచ్చేస్తున్నట్టుగా అనిపించే సిటీ బస్సులని జాగ్రత్తగా తప్పించుకుంటూ రిక్షా తొక్కుతున్నాడు- శంకర్ విలాస్ వైపుగా. శంకర్ విలాస్ దగ్గర కుడి వైపు తిరిగి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కిదిగితే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ వస్తుంది.

    కాలేజ్‌కి ఒక్కదాన్నే వెళ్ళాలి అనే బెంగలో వున్ననేను రోజూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంబరంగా ఎదురుచూసే బొమ్మల షాపు Prisma Curio ని కూడా మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను రిక్షాలో. 

    ఇంతలో రిక్షా పక్కనుంచి వెళ్తున్న అబ్బాయిలలోంచి   - "ఎవర్రా అనిల్ ఈ అమ్మాయి? నేనెప్పుడూ మన గుంటూర్లో చూడలేదే? భలే వుంది", - అన్న మాటలు వినిపించాయి. 

    వెంటనే రిక్షాగూడుకి వున్న వెనకాలవైపు ప్లాస్టిక్ కర్టెన్ లాంటిది కొంచెం పక్కకి తీసి, "ముందు నీ మొహం అద్దంలో చూసుకో!" - అని అరిచాను.  

    ఇంతకీ ఆ అన్నదెవరో తెలీదు - ఎలా ఉంటారో తెలీదు - కానీ ఏదో మాటకు మాట అనాలనే ఉక్రోషంలో, తొందరలో అలా అనేశాను. 

    హఠాత్తుగా ప్రపంచం ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయిందేమో అనేలా రిక్షా వెనకాల మాటలు ఆగిపోయాయి.

    అంతే - ఒక్కసారిగా ఏదో ధైర్యం వచ్చేసింది. 

    "నాకేంటి భయం, ఒక్కదాన్నీ కాలేజ్‌కి  వెళ్ళడానికి. ఇదిగో ఎవరైనా నాజోలికి వస్తే ఇలాగే - కరిచేస్తుందా - అన్నట్టు అరిచేస్తా! దెబ్బకి పారిపోతారు",  అనేసుకున్నాక బోల్డంత హాయిగా అనిపించేసింది.

    ఇంకో పావుగంటలో కోటేశు రిక్షా ఏసీ కాలేజ్ ముందు ఆగింది - రిక్షా దిగి కాలేజ్ గేట్ దాటి మెయిన్ బిల్డింగ్ వైపు నడిచాను బిక్కు, బిక్కు మంటూ...మనసులో ఇలా పాడుకుంటూ .... 

    दुश्मन न करे  - दोस्त ने वो  काम किया है 
    कालेज को आज वो क़्यों డుమ్మ किया है ?!

 సగం అసలు పాట - సగం నా కొసరు పాటగా ... 

<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి - 2 - హమే డర్ హై ...హం ఖో న జాయే కహీ... >>

15, మే 2016, ఆదివారం

అనగనగా... మా ఇంట్లో ఒక రోజు..

మా ఊళ్ళో ఒకరు యోగాసనాలు బాగా వచ్చి, వారికి వచ్చిన విద్యని అందరికీ పంచుదామనే మంచి ఉద్దేశ్యంతో  స్థానిక గ్రంథాలయం లో యోగా తరగతులు నడుపుతూ వుంటారు.

(నాకిప్పటికీ సందేహం - అసలు యోగా ఎలా చేయగలరు అందరూ అని - నాకొక్క నిముషం కుదురుగా ఒక దానిమీద మనసు నిలిపి మాట్లాడకుండా ధ్యానం చేద్దామని ప్రయత్నిస్తే - ఉహో... నా వల్ల కాదు. ఆ ఒక్క నిముషంలోనే వద్దన్నా ఏవో గుర్తుకొచ్చేస్తూ వుంటాయి. సరే - నాకింకా యోగా చేసే టైం రాలేదు అనుకుంటూ వుంటాను. నుదురు పెద్దదయితే కుదురెక్కువ అంటారు కానీ నాకవి inversely proportional అనిపిస్తాయి - నన్ను నేను తలచుకుని.)

బదరీకి తన కాలేజ్ రోజుల జ్ఞాపకాలలో ఇష్టంగా తలుచుకునేవాటిల్లో సూర్యనమస్కారాలు, యోగాసనాలు కూడా వుంటాయి. దగ్గరలోనే యోగా నేర్పే వారున్నారని ఉత్సాహంగా ఓ శనివారం పొద్దున్నే లేచి, తయారయి లైబ్రరీకి వెళ్ళారు-ఓ గంటలో తిరిగి కూడా వచ్చారు. అదేమంత విశేషం కాదు. కానీ తర్వాత భోంచేస్తూ చెప్పారు - అదేంటో కింద :)

బదరీ మాటల్లో: (మాటలన్నీ తనవే - రాత ...కాదు కాదు...  టైపింగ్  + అక్కడక్కడా బ్రాకెట్స్ లో చిన్న చిన్న వివరణలు మాత్రమే నావి -  :) )

ఇవాళ లైబ్రరీలో యోగా క్లాస్ కి వెళ్లాను కదా, బుజ్జాయ్! చాలా మంది మనవాళ్ళు (అంటే భారతీయులు), అమెరికన్లు, ఆఫ్రికన్-అమెరికన్లు వున్నారు. వాళ్ళందరినీ చూస్తే భలే ఆనందంగా అనిపించింది - మన తెలుగు వారు నేర్పే ఒక క్లాసుకి అంత  మంది వచ్చారని. వెళ్లి కూర్చున్నాను. 


యోగా నేర్పే ఆయన చెప్పారు - ఈ రోజు ఇంట్రడక్టరీ సెషన్ అని. అలా చెప్తూ యోగా-యోగాసనాల విశిష్టతా గురించి మాట్లాడుతూ ధ్యానం మనిషికి ఎంతో మంచి చేస్తుందని చెప్తూ ఇలా అన్నారాయన - ధ్యానం మనిషి కోరికలు తగ్గించుకుని ధ్యాన మార్గాన మోక్షం పొందడానికి సహాయం చేస్తుందీ అని. 

వెంటనే నేనడిగాను "కోరికలు తగ్గించుకోవడం వరకూ బావుంది - కానీ మోక్షం కావాలని అనుకోవడం కూడా ఒక కోరికే కదండీ - అది మాత్రం ఎందుకు కావాలనుకోవడం - దొరికిందే మనకు చాలనుకోవాలి కదా అది మోక్షమయినా ఇంకోటయినా - కోరికలే వుండకూడదనుకుంటే?", అని. నేనలా అడగడం ఎవరికీ నచ్చినట్లు లేదు. ఇంకెందుకులే అని కాసేపు మాట్లాడకుండా ఆయన చెప్పేది విని వచ్చేశాను.

నాకెందుకో ఈ మధ్య ఇలాంటి మాటలు వింటే చాలా చిరాగ్గా ఉంటోంది. ఏ టీవీ చానెల్ పెట్టినా, ఏ పేపర్ చదివినా - ఇలా చేయాలి - అలా చేయకూడదు అంటూ ప్రతి ఒక్కరూ ఇంకొకరికి ఉపదేశాలు చేసేవారే. మళ్ళీ తమ దగ్గరికి వచ్చేసరికి ఎవరి వేదం వారిదే!


పండగ వస్తోందంటే చాలు  - ఒక తెలుగు క్యాలెండర్ లో ఒక రోజు, ఇంకో క్యాలెండర్ చూస్తే ముందుదో, వెనకదో ఇంకో రోజు. పండగ వచ్చేది ప్రతి ఏడాది అదే నెల, అదే తిథి అయితే పంచాంగాల్లో ఇన్ని తేడాలెందుకు? 

నీకన్నా నాకు బాగా తెలుసు - నా మాటే విను అనే వాదాలెందుకు?

ఈ ప్రపంచమంతా మాయ, మిధ్య- కోరికలు వుండకూడదు అంటూనే 'శతమానం భవతి' ఆశీస్సులు!

అసలు నువ్వే ఆలోచించు. నేను బాగా చదువుకున్నాను - నాకు చాలా తెలుసు అనుకునే ఏ మనిషికైనా నిజంగా - అన్నీ సరే - తనకు తెలుసు అనుకునే కొన్నిటి గురించయినా పూర్తిగా తెలిసుంటుందా?


ఒక మనిషి నిండు నూరేళ్ళు బ్రతికి, అందులో ప్రతీ సంవత్సరం ఓ 50 క్రొత్త మంది తనకి పరిచయమవుతారు అనుకుందాము. 

ఎవరైనా సరే - తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, మామలు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, తనతో పని చేసే వాళ్ళు, ఇరుగు-పొరుగు వాళ్ళు ... ఎవరైనా సరే – కాని, వాళ్ళు అందరూ 'తన వాళ్ళు' అనుకునే వాళ్ళు అయి వుండి - తన గురించి ఎంతో కొంత తెలిసి ఒక రెండు నిముషాలన్నా పలకరింపు దాటి మాట్లాడుకోగలిగే వాళ్ళు అయివుండాలి. 

అంటే జీవిత కాలంలో 'తన' అనుకునేవాళ్లు మొత్తం ఐదు వేల మంది వుంటారు. 

(సంవత్సరానికి 50 మంది అనేది బదరి అనుకున్న చాలా optimistic number. నా ప్రస్తుత వయసు X 50 మంది పేర్లు రాయగలనేమో ప్రయత్నించి చూడాలి - ఇదొక తమాషా ఎక్సర్సైజ్ - ప్రస్తుతానికి నా ఈ వారాంతానికి).

అలాగే, ప్రతీ సంవత్సరం ఓ 5 సరి కొత్త ప్రదేశాలు చూశాడు అనుకుంటే, జీవిత కాలంలో చూసేవి 500 ప్రదేశాలు.

మరి ఈ ప్రపంచంలో ప్రస్తుతమున్న జనాభా 800 కోట్లు. చూడతగిన ప్రదేశాలు కొన్ని లక్షలు!

నిజంగా లెక్కల్లో మాట్లాడుకుంటే ఎంతో తెలుసనుకునే మనకి ఎంత తక్కువ తెలుసో కదా!

ఎంత ఎత్తుకైనా ఎగిరే ఓ పక్షి ఏమేం చూడగలదో, మబ్బుల్లో తిరుగుతూ ఎంత సంతోషిస్తుందో తెలియదు. 

నీళ్ళలో ఈదే ఓ చేప ఎంత ఆనందం గా వుంటుందో తెలియదు. వాతావరణ మార్పులను బట్టి ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రానికి వేల మైళ్ళు ఈదుకుంటూ ఎలా వెళ్ళగలుగుతుందో తెలియదు. 

ఎక్కడికీ తిరగకుండా ఒకేచోట వుండే ఓ చెట్టు అనుభవాలు ఎలా ఉంటాయో తెలియదు. తను బ్రతికి వుండే పదులు, వందల ఏళ్లలో తన చుట్టూ జరిగే మార్పులు చూస్తూ, తన మీద వాలే పక్షితో, పాకే ప్రతి ప్రాణితో కబుర్లు చెప్తూ, గాలికి ఊగుతూ, వర్షాలకి తడుస్తూ, ఎండలకి ఎండిపోతూ, చలికి ముడుచుకుపోతూ అది అనుభవించే జీవితమేమిటో తెలియదు. 

సీతాకోకచిలుక (మోనార్క్ బటర్  ఫ్లై) లాంటి ఒక చిన్న ప్రాణికి కొన్ని వేల మైళ్ళు, సముద్రాల మీదుగా ప్రయాణించి ఇంకో ప్రదేశానికి ప్రతీ సంవత్సరం వెళ్లి రాగలిగే శక్తి ఏమిటో తెలియదు. 

కంటికి కనపడని ఇంకా ఎన్నో జీవాలు ఎలా ఉంటాయో తెలియదు. 


సైన్సూ-శాస్త్రాలు, సంగీతాలు-సాహిత్యాలూ, వింతలూ-విశేషాలూ పక్కన పెట్టు - అవతలి మనిషి ఎంత దగ్గర వారైనా, తెలియని వారైనా వారికి మన మాటల చేత కానీ, చేతల వల్ల  కానీ - ఆనందం సరే - కనీసం ఇబ్బంది కలిగించకుండా ఉండగలుగుతున్నామో లేదో  - తెలుసా - అనిపిస్తూ వుంటుంది.  


ఇవన్నీ తెలియకపోయినా ఈ ప్రపంచంలో మనిషి జన్మే మహోన్నతమైనది. మంచిది, ఆనందం! 


ఓ అడవిలో పుట్టి, వేరే ప్రపంచం ఉందనే స్పృహే లేకుండా అడవిలోనే పెరిగి, అడవిలోనే చనిపోయే మనిషి జన్మ కూడా అనాగరికంగా less equally మహోన్నతమే. నాగరికం అయితే ఇంకా మంచిది - more equally మహోన్నతం! 



అంతెందుకు మనం విమానం ఎక్కినప్పుడు అది  పైకి వెళ్ళే కొద్దీ కింద మనుషులు, ఇళ్ళు, రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు అన్నీ చిన్నవిగా, చీమల్లాగా కనపడతాయి కదా - అప్పుడనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తేనే ఇలా వుంది - ఇంకా పైకి వెళ్లి ఏ స్పేస్ స్టేషన్ నుంచైనా చూడగలిగితే మనమీ ప్రపంచం లో ఎంత చీమల్లాంటి వాళ్ళమో అనిపించేస్తుందేమో !!!

  
చీమలంటే గుర్తొచ్చింది - Disney-Pixar వాళ్ళు తీసిన “A Bug’s Life” మూవీ గుర్తుందా?!  అందులో Flik వాళ్ళ ఊళ్ళో ఓ మామూలు చీమ కుర్రాడు. ఆ ఊళ్ళో జరిగే బోల్డన్ని సమస్యలకి సంఘటనలకి, సమాధానాలు పరిష్కారాలు వెతుక్కుంటూ వేరే ఊరు వెళ్లి, అక్కడ కలిసిన చీమలు కాని వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసి, వాళ్ళని ఎలాగోలా తన ఊరు తీసుకెళ్ళి అవన్నీ తీర్చేసి హీరో అయిపోతాడు.


ఆ “A Bug’s Life” లో  మొదటి సీన్ జాగ్రత్త గా చూస్తే - బోల్డన్ని పెద్ద పర్వతాలు, పెద్ద మైదానం, ఇంకా పెద్ద పెద్ద చెట్ల మీదనుంచి ఒక చెట్టు చుట్టూ వుండే పొదల మధ్యలో ఓ చిన్న చీమల పుట్టలోకి నెమ్మది గా వెళ్తుంది కెమెరా. అక్కడ బోల్డన్ని చీమలు వాటి ఆహారం సంపాదించే పని లో వుంటాయి. Flik కనిపిస్తాడు ఓ నిమిషంలో, మూవీ మొదలు!


నాకయితే మనమూ మనదనుకునే మనముండే ఈ ఇళ్ళు, ఊళ్ళు, దేశాలు కూడా మనకన్నా పెద్దవాళ్ళయిన, గొప్పవాళ్ళయిన ఏ super-humans కో ఆ సినిమా లో వుండే చీమల ప్రపంచంలాగే కనిపిస్తాయేమో అనిపిస్తుంది... 


 ----------------------------------------------------------------------

ఇలా మోక్షం నుంచి చీమల దాకా ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి అలా అలా అలవోకగా వెళ్తూ ఒక వారాంతపు మధ్యాహ్నం వెచ్చగా గడిచింది. 

ఉపసంహారం:

తర్వాత ఇంకో అరగంటకి చాలా రోజులయింది అని ప్రియ-నేస్తానికి  ఫోన్ చేశాను. 

"లలితా! నీతో చాలా మాట్లాడాలి - ముందు గుడ్ న్యూస్ చెప్తాలే"

"ఏంటది? తొందరగా చెప్పు మరీ!"

"ప్రిన్సీకి మంచి లా స్కూల్ లో సీట్ వచ్చింది - లోకల్ లోనే"

"వావ్! కంగ్రాట్స్ చెప్పు. ఆగాగు - ఇంగ్లీషులో కాదు కన్నడాలో చెప్పు"

"కన్నడా లోనా ...." అటునుంచి ఆలోచిస్తూ నేస్తం "కన్నడ సరే తెలుగు ఏమంటారో చెప్పు నువ్వు"

చటుక్కున 'అభినందన' అన్నమాట గుర్తుకొచ్చినా ఎందుకో చిన్నపిల్లకి అర్థం కష్టం గా వుంటుందేమో - ఇంకో తేలికయిన మాట వుంటే బావుండును అనిపించి "లేదులే! కరెక్ట్ మాట గుర్తు రావట్లేదు - కంగ్రాట్స్ అని చెప్పేయ్" అంటే-

"అదే లలితా! పిల్లలు ఏమన్నా మంచి పని చేస్తే ఆయుక్షీణం అని చెప్పి పొగడడం అస్సలు అలవాటు లేదు మన society లో. అందుకే congratulations కి సరైన మాటలు ఎక్కువ లేవు మన భాషల్లో. ఎవరైనా బాగా చదివారు - పైకొచ్చారు అంటే చటుక్కున - వాళ్లకి అలా రాసి పెట్టి వుంది - అందుకే అలా బాగుపడ్డారు అంటారు కానీ - ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో గుర్తించరు - ఒప్పుకోరు! ప్రతీదీ కర్మ సిద్ధాంతానికి ముడిపెట్టటం లో మన తర్వాతే ఎవరైనా!"






8, మే 2016, ఆదివారం

బుజ్జిజింకలు తెచ్చే 365 అమ్మ-రోజులు

ఉత్తర అమెరికా అంతటా సందడీ - హడావిడీ. 
అంగడులన్నీ అమ్మలకిచ్చే బహుమతుల కోసం నింపుకున్న సరంజామా - సామగ్రీ 
అమ్మల రోజు వస్తోంది కదా - ఈ రోజు !!!
ప్రతీ ఏడాది మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారు అమెరికాలో.

మా పక్కనే వుండే టాడ్ ఇల్లు, ఎదురుగా వుండే రేండీ ఇల్లు - ఇరువైపుల - అంటే - భార్యా భర్తల ఇద్దరి తల్లిదండ్రుల రాకతో, తాత - అమ్మమ్మ / నాన్నమ్మలను చూసిన సంతోషంలో గంతులు వేసే పిల్లల సంబరంతో - బోల్డంత సందడి సందడి గా వుంటాయి. 

వీధిలో మిగిలిన ఇళ్ళ ముందు కూడా ఎప్పుడూ ఉండేవి కాక ఇంకో రెండో మూడో కార్లు ఎక్కువ పార్క్ చేసి వుంటాయి. 

స్వధర్మే నిధనం శ్రేయః - పరధర్మో భయావహః  - అన్నది నమ్మికో, ఇష్టం లేని వాటిని తప్పించుకోవడానికి వాడుకునే నెపమో - ఎప్పుడూ అలవాటు లేని, కాలేని మదర్స్ డే జరుపుకోలేదు. 

ఆఫీసు లో మెలిస్సా ప్రశ్న - లలితా! ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు మదర్స్ డే అని. 

ఇద్దరు అబ్బాయిల అమ్మనైన నేను - మేలో ఈ ఒక్కరోజేమేటి - ఏడాదిలో ప్రతి రోజూ సెలబ్రేట్ చేసుకుంటాను మదర్స్ డేని - అనేది నా ఉత్తరం. 

గత పదేళ్లుగా అదే తను అడుగుట - అదే  నేను చెప్పుట. 

సరే! నేను అనుకున్నా- అనుకోకపోయినా, జరుపుకున్నా- జరుపుకోకపోయినా, ప్రతీ ఏడాది తమ తమ అమ్మల కోసమని బుల్లి బుజ్జాయిలు బడిలో తమ చిట్టి చిట్టి చేతులతో చేసిన బొమ్మో, నాటిన మొక్కో, రాసిన కవితో తీసుకొచ్చి ఉరికే కాళ్ళతో వచ్చి అమ్మ చేతిలో పెట్టి అమ్మ మెప్పు కోసం మెరిసే కళ్ళతో, నవ్వే బుగ్గలతో అమ్మ మొహంలోకి ఆతృతగా చూస్తారు కదా - అందులో మా బుజ్జిజింక కూడా వుంటుంది. (నెలల పాపాయిలప్పట్నుంచీ అమ్మ, నాన్న ఎత్తుకుని కబుర్లు చెప్తుంటే జింక పిల్లల్లాగా కళ్ళు తిప్పుతూ ఊ ... కొట్టేవారని మా బుజ్జి బుజ్జాయిలని బుజ్జిజింకలని పిలవడం అలవాటు.)

అలాంటి ఒకానొక మదర్స్ డేకి - 
అమ్మ హోం వర్క్ కాగితాలు వెతుకుతుంటే దొరికింది 
బుజ్జిజింక తెచ్చిన అమ్మ - పొగడిక పత్రం
అందులో చదివిన మాట మాటకీ 
అమ్మకి కలిగిన ఉలికిపాటో - కలవరపాటో
ఇంకేదో - మరేదో - ఇదిగో ఇలా... 

"మున్నమ్మా! ఏంటమ్మా ఇది అమ్మ కోసం రాశావా" - ఆనందంగా, ఏం రాశాడో చూద్దామని  ఆతృతగా అమ్మ. 

"ఊ ...", నేస్తులతో ఆటలకి ఉరికే పరధ్యానంలో బుజ్జిజింక. 

"అప్పుడే రారులే - శ్యాము, అనీషు. గబగబా స్నాక్ తిని మనిద్దరం కలిసి చదువుదామా?" అమ్మ ఆత్రపు ప్రశ్న. 

"ఊ ... ఊ ... ", స్నాక్ నోట్లో వుంది కదా - అందుకే రెండు ఊ-లు - అంటే సరే అని. 

"అయితే - దా. నేను చదువుతాను, నువ్వు విను", సంబరంగా అమ్మ. 

"ఊ ... ఊ ... " - ఇంకో రెండు ఊ-లు. 

అమ్మ తెరిచింది కాగితం. ఒక పక్క  - గడ్డి పరకల్లాంటి జుట్టుతో వున్న అమ్మ,  పక్కనే బుజ్జిజింక వున్న బొమ్మకనిపించింది. 



బుంగమూతి పెట్టింది - పెన్సిల్ కి ఇష్టం లేనప్పుడు గీసినట్లున్న అమ్మతో-వున్న-బుజ్జిజింక బొమ్మ చూసి. 

"ఇదేంటమ్మా - అమ్మ జుట్టు ఇలా వుంది?" 


"ఊ ... ఊ ... ఉ ... ఉ... ఊ ... " - చిలిపి కన్నుల జాలువారిన నవ్వులతో వెలిగిన బుగ్గలతో "నేనే గీశా - బావుందా?", అనడం అది. 

ఆ వెలుగుకే ఎప్పటిలా కర్పూరమై కరిగి మురిసింది అమ్మ. 

"నువ్వు గీసిన నేను చాలా బావుంది." కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు సున్నాలా చుట్టి బుగ్గన చిటిక వేసి గలగలా నవ్వింది. 

కింద వున్నది బుజ్జిజింక ఎలా పాడుతుందో అలాగే పాడుతూ చదవడం మొదలు పెట్టింది అమ్మ.

మై మామ్ రాక్స్! షి ఈజ్ ఆసం
"ఆసం అన్నావా మున్నమ్మా! యూ ఆర్ మై ఆసం సన్" - పట్టరాని సంబరం అమ్మ గొంతులో

వెన్ షి స్లాప్స్ మి, ఇట్ మేక్స్ మి సో హాపీ
అమ్మ తల ఎత్తి అడిగింది - "ఇదేంటి నాన్నా - నేను కొడితే సంతోషమా ?"

అమ్మ మాటలో తేడా ఏదో తెలిసిందేమో బుజ్జిజింక కన్నార్పక చూపు కలిపింది.

మొదటి నిట్టూర్పుతో అమ్మ ముందుకు చదివింది - ఇంకొన్ని నిట్టూర్పులు ముందు ముందు ఇంకేం ఉంటాయో అని దాచుకుంటూ. 

ఐ లవ్ డూయింగ్ థింగ్స్ విత్ హర్, ఎస్పెషల్లీ టాకింగ్
మళ్ళీ అమ్మ మాటలో హుషారు ...

షి ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్
అమ్మకి అమృతం తాగినా కలగనంత తృప్తి... 
 

 షి రియల్లీ ఈజ్ ద బెస్ట్ 
 అమ్మకి  ఎలిజబెత్ రాణి కన్నా ఎత్తుగా కూర్చున్నట్టు అనిపించింది... 

ముందు పక్క చదవడం అయ్యింది కదా - కాగితం వెనక్కి తిప్పింది అమ్మ. 



"అయ్యో! ఇటు బొమ్మ లేదే! పోన్లే బుజ్జిజింకకి టైం సరిపోలేదా?!!" - సర్దేసుకుంది అమ్మ

మళ్ళీ బుజ్జిజింక పూరించిన ఖాళీల వెంట అమ్మ కళ్ళ పరుగులు...

 మై మామ్ ఆల్వేస్ సేస్ స్టాప్ ఇట్

 అర్రే! మళ్ళీ అమ్మ జోరు తగ్గింది...  - (రెండో నిట్టూర్పు)
 
మై మామ్ లుక్స్ ప్రెట్టీ వెన్ వి గో ఔట్
అయ్యో! ఇంట్లో బావుండనా ?! అంతేలే నాన్నా - ఇలా అనేస్తావా అమ్మను? -  (మూడో నిట్టూర్పు)

 బుజ్జి జింక కళ్ళలో తగ్గిన మెరుపు... అమ్మకేదో నచ్చట్లేదని... 

మై మామ్ లైక్స్ టు కుక్ నథింగ్ 

అరె! అమ్మ కంట్లో ఏంటది మెరిసింది - ముత్యమైతే కాదే - తెల్లగా లేదే - ఓహ్ - నీటి ముత్యమా! - (నాలుగో నిట్టూర్పు)

నవ్వబోతూ సాగబోయిన బుగ్గలు మొగ్గలల్లే ముడుచుకున్నాయి - బుజ్జాయికి.
  
మై మామ్ మేక్స్ మి లాఫ్ వెన్ షి మేక్స్ వియెర్డ్ ఫేసెస్
కంట మెరిసిన నీటి ముత్యం జారకుండా అమ్మ పూరించిన బుగ్గలు ఆపాయి... 
హమ్మయ్య! అమ్మ నవ్వింది - అనుకున్నాడు బుజ్జిజింక.

ఐ లవ్ మై మామ్ బికాజ్ షి ఈజ్ మై మామ్
అమ్మ సంతోషం శిఖరమే దాటింది - ఆనందం అంబరమే అయ్యింది 
నాలుగు నిట్టూర్పులూ మరచి నాలుగు దిక్కులా తనే అయినట్టు రెండు చేతులతో బుజ్జిజింకని పట్టేసుకుని ఎత్తేసుకుంది ... 

కానీ అమ్మకి ఏదో తెలియని ఉక్రోషం ... 
కన్నులు రెండూ నీటి ముత్యాల సరాలు పేర్చాయి ... 
బుజ్జిజింకకిప్పుడు తెలిసింది ఇంక - అమ్మకేదో ఆయ్ అయ్యిందని. 
కొంచెం కన్నా ఇంకొంచెం ఎక్కువే అర్థమయ్యింది - మందేదో తనే ఇవ్వాలని ... 

అమ్మ పక్క మెల్లగా చేరింది .... 

"అమ్మా ! మనిద్దరం ఒకటోసారి:రెండోసారి:నాలుగోసారి-ఆట  ఆడేటప్పుడు నేను మూడోసారి అనడిగితే ... చెప్పేది నేనా నువ్వా అని ... చెంప మీద కొడితే నేను నవ్వుతానే ... అందుకే వెన్ ఐ ప్లే దట్ గేమ్ విత్ యు, అండ్ వెన్ యు స్లాప్ మీ, ఇట్ మేక్స్ మీ హ్యాపీ" - మొదటి నిట్టూర్పు బుజ్జి బుగ్గ మీద ముద్దయ్యింది. 

"మరీ! నేను చాలా సార్లు అల్లరి చేస్తూ ఏడుస్తూ వుంటే - చాలా సేపు ఏమనకుండా ఊరుకుని - అప్పుడు స్టాప్ ఇట్ - అంటావు కదా! నేనేడవకపోతే నువ్వనవు కదా!! మరి నువ్వన్నప్పుడు అన్నావని రాయాలి కదా - అందుకే అలా ...." - రెండవ నిట్టూర్పు బుజ్జి కంటి మీద ముద్దు ముత్యమయింది. 

"నువ్వు ఇంట్లో కూడా బావుంటావు. కానీ మనం ఆంటీ వాళ్ళింటికో, పార్టీకో వెళ్తే మంచి షైనీ-షైనీ చీర కట్టుకుంటావు కదా - అది నాకిష్టం - అప్పుడెక్కువ బావుంటావని అలా రాశా" - మూడవ నిట్టూర్పు బుజ్జి అరచేతిలో ముద్దు ముద్ర వేసింది

"మరి యు కుక్ సో గుడ్ అండ్ యు ఆర్ ద బెస్ట్ కుక్ - కానీ మనం రెస్టొరాంట్ కి వెళ్తే నువ్వు మంచిగా చీర కట్టుకుని హాపీగా వస్తావు. అదే ఇంట్లో వంట చేస్తే యు లుక్ సో టయర్ద్ - నిజమే కదమ్మా !!! - నాల్గో నిట్టూర్పు అమ్మ పట్టరాని ప్రేమై బుజ్జి జింకని చుట్టేసింది. 

అమ్మ నవ్వు గోదావరిలా గలగలా - అమ్మ నవ్వు చూసి బుజ్జి జింక కిలకిలా!!!

అమ్మకి ఇప్పుడు మరింత నమ్మకం కుదిరింది - సంవత్సరానికి 365 అమ్మ-రోజులని ... అవి బుజ్జి జింకలు తెస్తాయని... 









3, మే 2016, మంగళవారం

త్వామనురజామి

ముందో చిన్న మాట... 

బాల్యపు చిటికెన వేలు విడిచిన రోజులు 
కళ్ళల్లో నక్షత్రాలు మెరిసిన రోజులు

అప్పుడప్పుడే కృష్ణ శాస్త్రి - గేయం లోని ఆకులో ఆకునై , పూవులో పూవునై - 
ఆకలా ... దాహమా...  , చింతలా...వంతలా !! - అని గొంతెత్తి పాడుతూ-
చెల్లెళ్ళతో, ప్రియ నేస్తం తో అల్లిబిల్లి అల్లరి ఆటలు ఆడుతూ -

శలవు వస్తే - జనరంజని తో మొదలు పెట్టిన రోజులు... 
మన్-చాహే-గీత్ తో అలరించిన బద్ధకపు మధ్యాహ్నాలు... 
ఛాయా-గీత్ తో అప్పుడే అయిపోయాయా అనిపించిన రాత్రులు ... 

ఇవాళంటే...  ఇప్పుడు నవ్విన నవ్వులే
రేపంటే ...సూర్యుడొచ్చి ఇచ్చే వెచ్చటి వెన్నెలే 

Anne of Green Gables నుంచి Jane Austen కి ఎదిగిన అభిరుచి 
లైఫ్ అంటే ఏంటో కాదు నువ్వూ-నేనూ పాడుకునే సుహానా సఫర్ అని నేస్తం తో చెప్పుకున్న కబుర్లు 

ఇంతలో... ఏమయిందో ఏమో ... 
మెరుపే మెరిసిందో 
మనసే మురిసిందో 
మిన్నే వంగిందో
కన్నే చెదిరిందో

ఓయ్  లైఫ్ ! 
ఎలుగెత్తి  చెప్పాలనిపించింది నీతో ... 
అందుకే చెప్పేశా ...

త్వామనురజామి!! 
త్వామనురజామి!! 
త్వామనురజామి!! 


<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి -1 - ఎవరేమన్నను - అపర్ణ తోడు రాకున్నను ఒంటరిగానే పో....>>