14, జనవరి 2017, శనివారం

(సమ్)(సన్)క్రాంతి కబుర్లు

పొద్దు పొద్దున్నే (సమ్)(సన్)క్రాంతి కబుర్లు

"ఇవాళ సంక్రాంతా?"
"కాదు - భోగి - ఇండియా లో అయిపోయింది కూడా - రేపు సంక్రాంతి"
"ఊఁ "
"..."


అసలే సెయింట్ లూయిస్ లో ఇవాళ Winter Ice Storm alerts వున్నాయి.

Fox News లో వాతావరణ మాంత్రికుడు Dave Murray మహా ఉత్సాహంగా -
అదేదో ఆయనే బూజుకఱ్ఱ పట్టుకుని మబ్బులని మావూరి వైపుకి మళ్లించేస్తున్నట్టు -
అవొచ్చి ఆయన చెప్పిన చోటే కురిసేట్టు -
వర్షం వస్తుందని ఊరందరికీ చెప్పి ఆయన తన సొంత నర్సరీలో గప్-చుప్ గా నీళ్లు పెట్టుకుంటున్న విషయం మాకు తెలియనట్టు -
-----ఇలా రకరకాలుగా ఏంటేంటో మనసులో అనేసుకుంటూ రంగురంగుల మ్యాపులు చూపించేస్తూ - "ఇదిగో! ఇంకేముంది! మీ నెత్తిమీదే ఐసు గడ్డలు పడి మీరు గడ్డకట్టుకుపోతారు, జాగ్రత్త్త!!" - అని పదే పదే - ముందుకీ వెనక్కీ కదులుతూ - పడీ పడీ చెప్తున్నాడు.

ఆరో తరగతి చదివే బుజ్జిజింకకి  బడి లేదు -
నిన్నటి గురువారపు సాయంత్రమే - బడినుంచి అమ్మానాన్నలకి చెరో e-mail
ఇద్దరి ఫోన్లకి చెరో SMS
ఇంటి ఫోన్ కి ఒక voice mail  -
"మీ పిల్లాణ్ని బడికి పంపించాలని హడావిడి పడి లేవకుండా ఇంకో అరగంట ఎక్కువ  పడుకోండొహో"
- అని వరమిచ్చేసిన స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్

శీతాకాలపు సెలవులకి ఇంట్లో వున్న అన్నకి ఎలాగూ బడి లేదు - పదహేడు దాకా.

ఇద్దరూ రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఎప్పుడు పడుకున్నారో ఇంకా లేవలేదు.

అమ్మా, నాన్న లేచారు -  ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవేమో గానీ - ఇంటినుంచి పని చేసేటప్పుడు - ఒక సాకెట్ లో రెండు లాప్టాప్ ప్లగ్గులు ఇమడక తప్పదు. వాటితో పాటు నాలుగు చెవుల్లో ఇయర్ ప్లగ్గులూ కావాలి ఎవరి - కాన్ఫరెన్స్ కాళ్లు - వాళ్లు ఏ interference - లేకుండా వినడానికి.

ఉద్యోగానికి - సహజ కవచ కుండలాల్లాంటి - ఆ ప్లగ్గులూ, ఇయర్ ప్లగ్గులూ ధరింపజేసి, ధరించి - కార్యోన్ముఖులయ్యేముందు బదరీకి వచ్చిన సందేహం (సన్-దేహం? సమ్-దేహం?) -

" సంక్రాంతి - అంటే అర్థం ఏంటి?"

"అంటే సూర్యుడు మకరరాశిలో సంక్రమణం చేస్తున్నాడని అంటే ప్రవేశిస్తున్నాడని"

"అది సన్-క్రాంతా? సమ్-క్రాంతా?"

"ఎందుకు అది మీకు?"

"అదే - అది సన్-క్రమణమా? సమ్-క్రమణమా?"

"ఏదో ఒకటి - మొత్తానికి  'సం' అది"

"అదే - సన్నా - సమ్మా"

బయటికి చూస్తే ఆకాశం పేద్ద మసకేసిన గాజుముక్కలా - అప్పుడే రాలుతున్న (కురుస్తున్న) ఐసు తుంపర కిటికీల మీద చిన్న చిన్న గాజు తునకలుగా  రాలుతున్న శబ్దం.

మా వూరు తొడిగె 'మబ్బు'రపు అంబరం
హిమమద్దె దానికి మంచు సరిగంచు

దారి పొడుగునా సిటీ అధికారులు చల్లుతున్న మంచు కరిగించే - మంచునరిగించే ఉప్పుపోతలు.

డ్రైవ్-వే లో వున్న ఎర్రటి కారుకున్న నల్లటి చక్రం  మీద అందంగా పేరుకున్న మంచుర-కత్తుల జాలు - చూడడానికి బావున్నా - ముందున్న చలి-పండగని తలుచుకుని బెంగ-తలపోతలు. 



పవర్ పోతుందేమో -
వంట కాదేమో -
చలేస్తుందేమో -
డిష్-వాషర్ గబగబా వేయాలేమో -
కొవ్వొత్తులు తీసిపెట్టుకోవాలేమో -
పవర్ పోతే ఆఫీస్ లో ఇవాళ బోల్డన్ని కాన్ఫరెన్స్ కాల్స్ వున్నాయి  miss అవుతానేమో -
ఇన్ని బెంగల మధ్య - ఈ సన్నా - సమ్మా  ప్రశ్నలు.

"ఏమో బాబూ - నేనంత ఆలోచించలేదు - వదిలేయండి"

అలా వదిలేస్తే మజా ఏంటి కదా! కొనసాగింది వేరు-కారణ-విశ్లేషణ (root cause analysis) - వేరు మాటే లేకుండా ...

"అసలు సంక్రాతి, సంక్రమణం - word ఆరిజిన్ ఏంటా అని"

"ఏదో ఒకటి - మకర రాశిలో సంక్రమణమనే నాకు తెలుసు - అందుకే సంక్రాతి"

"అయితే - Happy మకర సంక్రాతి  - అనే చెప్పాలి కదా - ఎందుకంటే ఇంకో పదకొండు సంక్రమణాలు వుంటాయి కదా - to be specific ?!"

"అబ్బా! ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు మీరు?  నేనెవరికీ చెప్పలేదు బాబూ - పుట్టినప్పట్నుంచీ చెప్పామా ఏంటి  - Happy భోగి, Happy సంక్రాంతి, Happy కనుమ అని - ఇప్పుడు మాత్రం ఎందుకు? మీరేంటి - ఇప్పట్నించీ ప్రతి నెలా ప్రతి రాశి సంక్రమణానికి కూడా చెప్తారా ఏంటి?"

"నేనూ చెప్పట్లేదులే..."

వంటింటి - స్టవ్ ఆఫ్ కి, ఆఫీస్ లాప్టాప్ - లాగిన్ కి మధ్య పరుగు - ice storm పెరిగి పెద్దదయ్యేలోగా అన్ని పనులూ చక్కబెట్టేయాలని.

"మరైతే - ఇప్పటికి వదిలేయండి బాబూ - సన్నో, సమ్మో"

మీసాల చాటునుంచి నవ్వు - నా ఉడుకుమోత్తనం చూసి - "వూరికే అడిగాలే - ఏదో - ఉబుసుపోక కబుర్లు" అని సన్నగా అంటూ.

ఈలోగా తొమ్మిదవ్వడంతో - మా ఇద్దరి - కబుర్లు కట్టు - ఆఫీస్ కాల్ మొదలుపెట్టు...


భూమికావల మీవి భోగిమంటలు 
అవనికీవల మావి చలి-కీలలు 
మకర సంక్రమణం అక్కడ పండగ 
మంచు ఆక్రమణం ఇక్కడ మెండుగ 
కనుమ గారెల ఘుమఘుమలు మీవి 
హిమపు ధారల రిం ఝిమ్ మాది 
sun-దో;  some-other-దో - ఎల్లెడలా క్రాంతి
ఎలాగైతేనేం - మనందరి సంక్రాంతి




7, జనవరి 2017, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 5 - అమ్మ



అమ్మాయి

అనగనగా ఓ అమ్మాయి
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్లు
ఆటలు - పాటలు
పెద్ద కళ్లు - రెండుజళ్లు
పలుకు తక్కువ - చదువు మక్కువ

వాళ్ల నాన్నగారు చెప్పేవారట - ఇలాగే బాగా చదువుకుంటే డాక్టర్ చదివిస్తానని.  
చెప్పిన నాన్నగారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు - పైనుంచెవరో పనిగట్టుకుని పిలిచినట్లు.
పెద్దన్న మీద పడ్డ కుటుంబ భారం - పల్లకీ మోత కన్నా కుదుపు తక్కువైన బ్రాహ్మణ వ్యవసాయం. 

ఈలోగా మనువాడమని  వచ్చిన మేనబావ -
చదువాపద్దు - పిల్ల బాగా చదువుతోందని - ఇంటికి వచ్చి మరీ చెప్పారట మాష్టార్లు -
మేనబావ వింటేగా - పిల్లపేరు మల్లెమొగ్గ - నా పేర్ జమిందార్ - పిల్లనిస్తారా - పెళ్లి చేస్తారా - అని ఒకటే మాట-ఒకటే పాట.

పెళ్లయ్యింది - అంటే - ఏంటో తెలిసీ తెలియని - పదిహేనేళ్లు - వచ్చీరాని వయసులో.
అప్పుడే అనేసుకుందేమో - తాను పూర్తి చేయలేని చదువు - తనకిష్టమయిన చదువు అందిపుచ్చుకునే పాపాయిలు కావాలని.

అమ్మాయిలకమ్మ

అమ్మాయి అమ్మ అయ్యింది - వరసగా  - ముగ్గురమ్మాయిలకి.
ఎవరైనా - ముగ్గురూ అమ్మాయిలేనా అనబోతే - దుర్గా, లక్ష్మీ, సరస్వతులు పుట్టారమ్మా మా ఇంటా - అంటూ (మేన)అత్తగారి సమర్ధింపు కోడలికి.

ఆ ముగ్గురమ్మాయిల్లో పెద్ద పిల్ల - పెంకి, మొండి - పాటలే తప్ప మాట్లాడదు - రాగం అంటారని అదేదో పాటనుకుందో ఏమో - ఆ అంటే ఆరున్నొక్కరాగం , ఊ అంటేనూ  అదే రాగం. 
ఎవర్నీ ఆక్షేపించని నాన్నమ్మే ఇచ్చేశారు బిరుదు - చండిక - అని.

తన తర్వాత - ఒకరు తర్వాత ఒకరుగా - పుట్టిన ఇద్దరు చెల్లెళ్లు - చిట్టి చెల్లి, కుట్టి చెల్లి  - పుట్టినవేళ ఆసుపత్రిలో అమ్మ దగ్గరే వుంటానని గొడవ చేసేది అమ్మాయీ-చండిక.
కళ్లు తెరవని పసిపాపకి ఏమీ తెలియదు - కళ్లు నలుపుకుని మరీ ఏడ్చే ఈ ఎడపాపని మాత్రం ఏడిపించకూడదు అని అమ్మ చండికనే తన పక్కలో పడుకోబెట్టుకునేది.

చండికకి  బడికివెళ్లే వయసొచ్చినా అమ్మే లోకం.

అలా అని ఎంతకాలం బడికి వెళ్లకుండా ఉండడం?
అమ్మ బళ్లో వేసేసింది పిల్లని.

బడికి వెళ్లనని రోజూ ఏడుపు
రోజుకిద్దరు - చెరో రెక్కా పట్టి - రోడ్డు మీద ఊయలూగిస్తూ - బడికి మోసేసేవారు.

బడి ముందునించే అమ్మ వెళ్లాలి - వూరు చివర శివాలయం చెరువు దగ్గరున్న మంచినీళ్ల బావికి.
అమ్మాయి అడిగింది -మల్లయ్య మాష్టార్ని - వెక్కుతూ - "అమ్మ నీళ్లకి వెళ్లే వేళ నేను ఆ రోడ్డు పక్కగా వున్న కిటికీ ఎక్కి కూర్చోనా - అలా అయినా మా అమ్మని కాసేపయినా చూడొచ్చుకదా" - అని.

"అమ్మో - ఈ లల్లమ్మో - ఏం పిల్లమ్మో - పాపం పోన్లేమ్మో" - అనుకున్నారో  ఏమో - మల్లయ్య పంతులుగారు - ఓ చీపురు పుల్లిచ్చి కిటికీ ఎక్కించేవారు - అమ్మ ఆ దారిన వచ్చేవేళ.

ఇంక అప్పట్నుంచీ - అమ్మ ఆ దారిన వచ్చి కనబడే దాకా "అమ్మా చూడాలీ - నిన్నూ నాన్నని చూడాలీ" అంటూ కాసేపు, "చూడాలని వుంది అమ్మా - చూడాలని వుంది - పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి" అంటూ ఇంకాసేపు బడి మొత్తాన్ని తాత్కాలిక దుఃఖసాగరంలో ఓలలాడించేది.

పాటలంటే ఇష్టమని అమ్మాయికి అమ్మ దేశభక్తి గీతాలు నేర్పేది - జయ జయ భారత జాతీయానందోత్సవ శుభసమయం - ప్రియతమ భారత జనయిత్రీ చిరదాస్య విమోచన నవోదయం - అంటూ.

ప్రతి ఆగస్టు పదిహేనుకి తెల్ల పరికిణీ, జాకెట్టు - ఆప్కో జరీ అంచువేసి కుట్టించేది. బడి మొత్తంలో అమ్మ కుట్టించిన తెల్ల బట్టల్లో మెరిసిపోయే అమ్మాయిని - ఆ పిల్లని గారం చేయొద్దండీ అని చెప్పినా వినకుండా - రామశేషు మాష్టారు స్వాతంత్ర్య దినోత్సవ ఊరేగింపులో ఎత్తుకుని తిప్పేవారు.

ఇంక బడికి సెలవులిస్తే  - అమ్మాయికి అమ్మతోనే ఆటలు - అవీ తానే కనిపెట్టినవి .

ఆ ఆటలెలాంటివంటే ...

గాజుముక్కలాట
- బడికి వెళ్లే దారిలో, ఆడుకునే వీధిలో - ఎక్కడ పగిలిన చేతిగాజు ముక్క దొరికితే అక్కణ్ణుంచి అది తెచ్చి ఖాళీ బోర్నవిటా డబ్బాలో దాచేది - అమ్మాయి.

బడి లేని మధ్యాహ్నాలలో అమ్మ వంట అయిపోయి పిల్లలకి ఆమ్ పెట్టేసి "హమ్మయ్య" అనుకునేవేళ గాజుముక్కల (డ)బ్భాండం చేతబట్టి చిన్ -మోహినీ అవతారమై అమ్మాయి ప్రత్యక్షం

ఇంక అమ్మకి అలసట తీరే మార్గమేది ? అయినా సరే విసుక్కోకుండా - ఓపిగ్గా కూర్చుని - గాజుముక్కల గుట్టలోంచి అమ్మాయికి కనపడకుండా చేతికి చేయడ్డుపెట్టుకుని - ఓ గాజుముక్క తీసి - అదే రంగో అమ్మాయిని కనుక్కోమనేది. ఒకవేళ అమ్మాయి అదే రంగు గాజుముక్క చూపిస్తే అమ్మాయికి ఆ రెండు ముక్కలు, లేకపోతే అమ్మకి రెండు గాజుముక్కలు. ఇలా ఆ గుట్టలోంచి బోల్డన్ని గాజుముక్కలు ఎవరికొస్తే వాళ్లు గెలిచినట్టన్నమాట.

బొమ్మొస్తుందా - రాదా ?
బడి పుస్తకం ఒకటి  తెచ్చి అమ్మ - అమ్మాయి పక్క-పక్కన కూర్చుని ఒకరు "బొమ్మొస్తుందా-రాదా?" అనడిగితే రెండోవారు వస్తుందనో-రాదనో చెప్పాక కాయితం తిప్పితే బొమ్ముంటే వస్తుందని చెప్పినవారు గెలిచినట్లు, లేకపోతే అడిగినవారికి పాయింటు.

ఇలాంటి వింత-వింత ఆటలు ఆడుతూనే అమ్మ ఎన్నో కబుర్లు చెప్పేది అమ్మాయికి - అన్నిట్లోనూ చదువు ముఖ్యాంశం - విద్యా దదాతి వినయం - స్పర్థయా వర్ధతే విద్యా -  విద్వాన్ సర్వత్ర పూజ్యతే - చదువుకునే టైంలో చదువుకోవాలి -  గడిచిపోయిన కాలం వెనక్కి రాదు.

అమ్మాయికో అలవాటు  - రెండు నెల్లకో క్లాసు పుస్తకం - తెలుగు వాచకమో - సైన్స్ టెక్స్టో  పడేసుకోవడం - అమ్మకొచ్చి పుస్తకం పోయిందని చెప్పడం.

అమ్మ అస్సలేమీ అనకుండా - "అయ్యో! అవునా! ఆంజనేయులు కొట్టుకెళ్లి కొత్తది తెచ్చుకో" అనడం.
అమ్మాయి వెళ్లి ఆంజనేయులు కొట్లో పుస్తకం కొనుక్కుని - దాంతో పాటు శనగపప్పు-బెల్లం ప్రసాదం చేతిలో పడితేనే కదిలి ఇంటికి వచ్చేది.

ఆంజనేయులు పెట్టడం మర్చిపోతే ఇంకేమైనా వుందీ - కొట్టు కట్టేదాకా అక్కడే నిలబడివుండేది అమ్మాయి - అందుకే పుస్తకంతో పాటే ప్రసాదం ప్రసాదించేవాడు.

అసలు రహస్యమేమిటంటే అమ్మాయికి ఫెళఫెళలాడే కొత్త పుస్తకాల ఘుమఘుమలాడే వాసన ఇష్టం - అందుకని ఏడాదికి రెండో మూడో తెలుగు వాచకాలు కొనుక్కునేది. అమ్మకి అసలు సంగతి తెల్సినా - అమ్మాయి ముచ్చటపడుతోందని మురిసేది - ముద్దుకైనా విసుక్కునేది కాదు.

ఈలోగా అమ్మాయి ఐదో తరగతికి వచ్చింది - అమ్మాయికన్నా ముందు అమ్మ హడావిడి పడి ఆధునిక మూల్యాంకన దర్శిని తెప్పించింది - విజయవాడలో వున్న అక్క-బావగార్లకి చెప్పి.  సోవియెట్ భూమి - చింపి - వేసిన అట్టతో వచ్చిన ఆ పుస్తకం అమ్మాయికి సర్వకాల-హస్త-భూషణం.

అమ్మ అమ్మాయికి పుస్తకాల మీద ప్రేమ పెరిగేలా - చందమామలు, బొమ్మరిల్లులు, అమర్ చిత్ర కథలు - ఇలా ఎన్నో పుస్తకాలు కొనేది. తాను చదివే యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి(ఆరెకపూడి) నవలలు, విశ్వనాథ వారి వేయిపడగలు, రంగనాయకమ్మ విషవృక్షం - ఇదీ అదీ అని లేదు - అర్థం అవుతుందా లేదా అని లేదు - కాయితమైతే అక్షరముంటే - తెలుగైనా, ఇంగ్లీషయినా - ఆఖరికి అప్పటికి ఇంకా  అంతగా అర్థం కాని హిందీ అయినా - అమ్మాయి చదువుతానంటే చాలు పుస్తకం కొనిచ్చేసేది అమ్మ.

పెరుగుతున్న అమ్మాయితో పాటు చెప్పీ చెప్పకుండా అమ్మ చెప్పే పాఠాలు కూడా పెరుగుతున్నాయి - అసలంటూ అందం ఉండాలి కానీ తెచ్చిపెట్టుకోకూడదు - చెప్పి పెట్టిన బుద్ధి, దెప్పి పెట్టిన మెతుకు ఒంటబట్టవు - ఒక వేలు అవతలివారికేసి చూపిస్తే మూడువేళ్లు మనకేసే చూపిస్తాయి  - Face is the index of the mind - A sound mind in the sound body - తిండి కలిగితేనే కండ కలదోయ్ - నక్క ఒకచోట ఊళలు పెట్టి ఇంకోచోట సంగీతం పాడదు - పెద్దవాళ్లు చెప్పినట్టు చెయ్యాలి, చేసినట్టు కాదు - ఇలా ఎన్నెన్నో చిన్నా పెద్దా పాఠాలు - ఇవే కాక సందర్భానికి తగినట్లు సుమతీ, కుమారీ - శతక పద్యాలు.

చిన్న తరగతులలో అమ్మాయికి అర్థం కాని లెక్కలు అమ్మే చెప్పాలి - మరి నాన్నైతే ఒక్కసారి చెప్పగానే అర్థం కాకపొతే - ఆయ్ హన్నా ! - అంటారు కదా - అందుకని.

అమ్మాయికి  పరీక్షలొస్తే ఇంటిల్లిపాదికీ పరీక్షా-కాలమే - పరీక్ష బా రాస్తే పర్వాలేదు - రాయకపోతే ఇంకంతే - ఇల్లంతా (అ)శోకవనమే. దానికితోడు పరీక్షల ముందు అసలు ఖానా మానేసి "నఖా"ని అయిపోయేది అమ్మాయి. అమ్మ అప్పుడు పక్కన కూర్చుని "హనుమంతుడిలాగా నీ బలం నీకు తెలియదు - నువ్వు బాగా రాయగలవు" అని చెప్తే అప్పుడు "హమ్మయ్య" అని కనులారా నిదరోయేది.

ఇంక పరీక్ష రాసి ఇంటికి రాగానే - పరీక్ష పేపరు అమ్మ చేతికిచ్చి ప్రతీ ప్రశ్నకీ సమాధానం పరీక్షలో ఎలా రాసిందో అమ్మకి అప్పచెప్పాల్సిందే - ఒకటో తరగతి నుంచీ డిగ్రీ ఫిజిక్స్ థీరీల  దాకా ఇదే తీరు - అమ్మకి ఎంత అర్థమవుతుందీ అనేకన్నా అమ్మకి చెప్పాలి అన్నదే ముఖ్యం.

అమ్మాయి ఏడో తరగతిలోకి రాగానే - (అప్పటినుంచి వరసగా దాదాపు పదేళ్లపాటు) అమ్మ ఇచ్చిన అందమైన బహుమతి - ప్రతీ నెల ఒక Competition Success Review (CSR), ఒక Reader's Digest (RD).  ఉన్న ఊరిలో ఆ రెండు పుస్తకాలు చదివేది ఆ వయసులో అమ్మాయి ఒక్కతే. CSR నిండా పజిళ్ల లాంటి mental aptitude టెస్టులు, RD నిండా అప్పటివరకూ పరిచయం లేని భూమికి అవతలివైపు వున్న ప్రపంచం.

ముగ్గురక్క చెల్లెళ్లలో పెద్దదైనా ముగ్గురిలో చిన్నగా కనిపించే అమ్మాయిని ఎవరైనా హేళన చేయబోతే - మా పిల్ల ఇంకో గుప్పెడుంటే బ్యూటీ కాంటెస్ట్ కివెళ్లగలిగేది - అని అమ్మాయి మనసుకి వెలితి అనిపించకుండా వెనకేసుకొచ్చేది అమ్మ.

ముగ్గురాడపిల్లలని - పెళ్లై ఎవరిళ్లకి వాళ్లెళ్లిపోతే అక్కడెలాగూ చేసుకోవాలి - నేనెలా పెళ్లయ్యాకే వంట నేర్చుకున్నానో మీరూ అలాగే నేర్చుకుందురు గాని - అని వంటింటి ఛాయలకి రాకుండా అబ్బురంగా అమ్మాయిలకి నచ్చింది వండి పెట్టి పెంచింది.

ముగ్గురమ్మాయిల తల్లి - అబ్బాయిల ముచ్చటెలా తీర్చుకుందంటే - చదువంటే ఇష్టమున్న తమ్ముడి, చెల్లెలి పిల్లల చదువులకి ఒంటిమీద బంగారాన్ని వారి చేతిలో పుస్తకాలుగా మార్చి మురిసిపోయేంతగా. ఆ మురిపెం చూసే  పక్కింటి సరస్వతాంటీ అమ్మని - జగన్మాతా - అని పిలిచేవారు.

పొద్దున్న లేచిన అమ్మకి -  రాత్రి ఏ పదింటికో పక్క చేరబోయేవేళ - అనుకునో, అనుకోకుండానో తలుపు తట్టి వచ్చిన చుట్టాలకి - అప్పటికప్పుడు ఎర్రగా వేయించిన బంగాళాదుంపలు, వేడి వేడి చారు - పెట్టి వచ్చినవారి కడుపు నింపందే నిద్ర పట్టేది కాదేమో - అప్పటికే నిద్రపోయి వంటింట హడావిడికి నిద్ర లేచిన అమ్మాయిలకి కనిపించేది - చేతి గరిటతో అన్నపూర్ణ - అలుపెరుగనిది అమ్మ.

అమ్మకి ధైర్యమూ ఎక్కువే - నాన్నYezdi చీకటిలో కనపడని గుంటలో పడిపోయి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరారని ఎవరో వచ్చి చెప్తే - జాగ్రత్తగా వుండండని అమ్మాయిలకి చెప్పి - చెప్పులేసుకుని ఏ కంగారూ కనిపించనీయకుండా ఆ రాత్రిలో నాన్న దగ్గరికెళ్లింది - అది తలచుకున్న అమ్మాయికి ఇప్పటికీ ఆశ్చర్యమే - అసలంత చడీ-చప్పుడు లేకుండా అమ్మ అలా ఎలా వెళ్లగలిగిందీ - అని.

అమ్మాయి పెద్దయ్యింది - అప్పటిదాకా ఆడింది ఆట - పాడింది పాట - చదువుకి దూరం వెళ్లాల్సొచ్చింది - మొదటిసారి అమ్మని, ఇంటిని వదిలి. చదువుతో పాటు మనువుకనువైన మనసునీ అందుకుంది. అమ్మకీ, నాన్నకీ ఒక్క నిముషం ఇది నిజం కాదేమో అనిపించింది. ముందుగా అమ్మకే అర్థం అయ్యింది - అమ్మాయి పట్టు పట్టింది ఇక విడవదని. నాన్నకి నచ్చచెప్పింది - అమ్మాయి పెళ్లి ముచ్చట తీర్చింది.

అమ్మాయి పెళ్లయ్యాక - అమ్మంటే ఎంత ఇష్టం వున్నా - మరి అత్తవారింటికి వెళ్లాలి కదా! అలా వెళ్లినప్పుడు మరి కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త మాటలు - అంతా కొత్తగా వుంటుంది కదా ! అలాంటి కొత్త కొత్త గా అనిపించే తొలినాళ్లలో సరదాగా అన్న మాటొకదానికి  అమ్మాయి నొచ్చుకుంది - నొచ్చుకుని అమ్మకి చెప్పుకుంది.

అమ్మాయి చెప్పింది అమ్మ వింది - విని అంది - "ఒక అమ్మ కడుపున పుట్టిన మీ ముగ్గురే ఒకలా లేరు - అలాంటిది మీ అత్తవారింట్లో మనింట్లో ఉన్నట్లు ఎలా ఉంటుంది?  ఆడపడుచు అంటే ఆదుకునే నేస్తం లాంటిది - మరిది అంటే లక్ష్మణస్వామి  - ఆ ఇంటి కబురు మంచిదైతే పంచుకో - కానిదైతే తెలివిగా మంచిగా మలుచుకో - చదువుకున్నావు - వృధా పోనీయకు - ఆలోచించు - ఒదిగి ఉండడం ఓడిపోవడం కాదు - అదే గెలిపిస్తుంది నిన్ను".

అమ్మ చెప్పిన మాట చద్దిమూట అయింది అమ్మాయికి - తిరుగులేని ప్రేమాస్త్రమయ్యింది.
 
అమ్మలగన్నఅమ్మమ్మ

ముగ్గురమ్మాయిలకి పెళ్లిళ్లు అయ్యాయి - అమ్మలయ్యారు - అమ్మని అమ్మమ్మని చేశారు.
ఎదిగిన మనవళ్ల-అమ్మమ్మ అయిన అమ్మకిప్పుడు ఆటవిడుపు.

అమ్మాయి >>>  అమ్మాయిలకమ్మ >>>  అమ్మలగన్నఅమ్మమ్మ ~ వెరసి మా అమ్మ - పేరిందేవి.

అమ్మాయి చదువుకోసం, ముగ్గురాడపిల్లల పెళ్లిళ్ల కోసం, తను చదివించాలనుకున్న- తన పుట్టింటి పేరు నిలుపుతారనుకున్న తన మేనల్లుళ్ల కోసం, తను సహాయం చేయాలనుకుంటున్న ఎవరికోసమైనా - నాన్నకి కష్టమవుతుందని తెలిసినా - ఒప్పించడానికి అమ్మ చేసే ప్రయత్నాలు చూసినప్పుడల్లా అమ్మాయి అనుకునేది - అనుకుని నవ్వుతూ నాన్నతో అనేది - "నాన్నా! మా అమ్మ అన్నపూర్ణ, జగన్మాతే కాదు - సర్వమంగళ కూడా" - అని.

మ్రింగెడి వాఁడు విభుండని
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంళసూత్రంబు నెంత మది నమ్మినదో?



31, డిసెంబర్ 2016, శనివారం

కొత్త ఏడాదికై శుభకామనలు

అరె - అయిపోయింది అప్పుడే 2016 !
ఎప్పట్లాగే నాకు నేనే అడుగుకుంటూ - బుజ్జి జింకలనీ అడిగేశా - "మీ new year resolution ఏంటి ఈసారి?" - అని.
వాళ్లు జింకలసలే - నాకు చిక్కుతారా? -సమాధానం ఎప్పట్లాగే ఇచ్చారు - ప్రశ్నల రూపంలో -
"అంటే ఏంటి ? - అనొకరు -
"అదెందుకు?" - అని ఇంకొకరు
"నాకదే తెలిస్తే ఈ అడగడం-అడిగించుకోవడం ఎందుకు - హన్నా!"  - అనేసి -  "హమ్మయ్య! ఈసారి కూడా ఎప్పటిలాగే  - నా  కొత్త new year resolution - ఏ new year resolution చేసుకోకపోవడం" - అనేసుకున్నాను/ము.

ఇప్పటికి - ఈ రోజుకి, ఈ క్షణానికి - వున్నట్లు వుండి-
పుస్తకాలు చదువుకుంటూ
కబుర్లు చెప్పుకుంటూ, రాసుకుంటూ
వచ్చిన పని చేసుకుంటూ
నవ్వొచ్చిన చోట నవ్వుకుంటూ
ఏడుపొస్తే వెనకుండమని తోసుకుంటూ
మెచ్చిన వంట వండుతూ
నచ్చినట్లు వండిన చోట తింటూ
వచ్చిన భాషలు చాలవన్నట్లు ఏదో ఒక కొత్త భాష అంతో-ఇంతో నేర్చుకుంటూ
చదివిన చదువు పిల్లలతో మళ్లీ చదువుకుంటూ
చదవని చదువు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ
అనుభవాన్ని పెంచుకుంటూ
ఆనందాన్ని పంచుకుంటూ
- వుండదలిచితే, వుండగలిగితే
ఇంకో ఏడాదైనా - ఇంకే ఏడాదైనా
పాతదైతే వీడిపోనీయి
కొత్తదైతే అందుకోవోయి


----ఇలా అనేసుకుని - గత కొన్ని ఏళ్లుగా క్రమం తప్పకుండా రాస్తూ -  అక్కడక్కడ ఒకటి రెండేళ్లు - కుదరకపోయినా, కుదుర్చుకోలేకపోయినా- పర్వాలేదనేసుకుని - మళ్లీ ఈ ఏడాదికి రాసేశాను ఒక new year Terzanelle.

Terzanelle అంటే ఒక ఇంగ్లీష్ poetic form  - మన తెలుగులో వుండే ఉత్పలమాల, చంపకమాల మొదలైన పద్య (వృత్త ) రీతుల్లాగా.

అప్పుడెప్పుడో అపర్ణ పరిచయం చేసింది Terzanelle ని - ఇంకా చాలా poetic forms ఉన్నాయని చెప్పింది.

నాకు మాత్రం గోదావరి అలలలాగా సాగే Terzanelle మాత్రం తెగ నచ్చేసింది - ఎందుకంటే ముందున్న triplet లోని రెండో లైను తర్వాత వచ్చే triplet లో ఆఖరి లైనుగా రావాలి.

అలాగే మొట్ట మొదటి triplet లోని (ఒకటి, మూడు) లైన్లు చివరి నాలుగు లైన్ల పద్యం లో (రెండు, నాలుగు) లైన్లు కావాలి.

ఏ triplet కి ఆ triplet అర్థం సరిగ్గా సరిపోవాలి - ఆ లైన్లు ఎక్కడ వున్నా.

Terzanelle రాయడం ఒక బుల్లి పజిల్ నింపడంలా వుంటుంది. అంతకు మించిన కారణం ఏమీ అక్కర్లేకపోయింది నాకు  Terzanelleని ఇష్టపడకుండా వుండలేకపోవడానికి.

ఇదిగో - కింద వుంది నా కొత్త 2017 Terzanelle - ఒక రంగుల ఫోటో తో పాటు, రంగురంగుల పద్య పాదాలతో (to identify the repeated lines)







Here is the New Book of Life
Old leaves have turned over
Let’s have a new beginning

Many smiles were stored
Tucking away sorrows for now
Old leaves have turned over

I need to experience everything
Though I favor merriment
Tucking away sorrows for now
 
Fears and tears stay on
All emotions are duly respected
Though I favor merriment

Misery is the best teacher
Grooming us to rejoice in the here and now
All emotions are duly respected

New Year has arrived
Here is the New Book of Life
Grooming us to rejoice in the here and now
 Let’s have a new beginning





30, డిసెంబర్ 2016, శుక్రవారం

ఇండియాలో ... అమెరికాలో ...

మళ్లీ సెలవులొచ్చాయి ఈసారి
ఇంటిల్లిపాదికీ కలిసొచ్చేలా - ఒకేసారి
కబుర్లతో పెరిగిన కాలక్షేపాలు
హాస్యాలలో దొరికిన నవ్వుల నిక్షేపాలు
ఇష్టపడిన కష్టాలు - కష్టపెట్టిన ఇష్టాలు
అవేంటంటే - మేం చూసిన సినిమాలు
సూర్యుణ్ణి దాగుడుమూతలాటలో కళ్లు మూసి 
ముసురుకున్న మంచు మబ్బులు 
చలి చలి మధ్యాహ్నాలలో సోఫాల్లో
ముడుచుకున్న బుజ్జిజింకలు
Wimpy kid డైరీలు చదువుతూ
మురుసుకున్న పిల్లల బుగ్గలు
నేల మీదికి దిగిన నక్షత్రాలు
ఊరంతా కట్టిన తారా-తోరణాలు
పాత ఏడాదితో  నెమరేసుకుంటున్న కలవరింపులు
కొత్త ఏడాదికై  వల్లె వేసుకుంటున్న పలకరింపులు

మరి ఇంటా - బయటా
ఇంత సందడీ - హడావిడీ
మెండుగా - పండగలా -
వున్నప్పుడు బోల్డన్ని కబుర్లొస్తాయి  కదా!

అలాంటి కబుర్ల వేళ బదరి విసిరిన హాస్య గుళికల (ఉదా: తోమాలి - తోటమాలి; బీదవాళ్ల health care) ఒడిసిపట్టి - వాటికి ఇంకొన్ని జోడించి - సాగదీసి పుట్టించిన - సరదా పట్టిక - ఈ  ఇండియాలో ... అమెరికాలో ...


ఇండియాలో ... 
ఇంటి పేరు ముందు, అసలు పేరు తర్వాత 
అమెరికాలో ...
అసలు పేరు ముందు, ఇంటి పేరు తర్వాత

ఇండియాలో ... 
అడగకపోయినా సలహాలు ఇవ్వడానికి ఆలోచించరు
అమెరికాలో ... 
అడిగితేనే ఆలోచించి సలహా ఇస్తారు

ఇండియాలో ... 
ఆముష్మిక లోకపు మోక్షాలకై  ప్రవచనాలు 
అమెరికాలో ... 
ఐహిక ప్రపంచపు సుఖాలకై ప్రయోగాలు


ఇండియాలో... 
బ్యాంక్ కి వెళ్తే మన డబ్బులు వాళ్ల దగ్గరుంచుకుని కూడా మనల్ని కష్టమర్ లా చూస్తారు
అమెరికాలో... 
బ్యాంక్ కి వెళ్తే మన డబ్బులు వాళ్ల దగ్గర దాచుకున్న కస్టమర్ లా చూస్తారు


ఇండియాలో... 
పెళ్లికి బోల్డుమందిని పిలుస్తారు - దగ్గరగా వచ్చి తమ సంపద, వైభవం చూస్తారని
అమెరికాలో... 
పెళ్లికి కొంతమంది దగ్గరవారినే పిలుస్తారు - ఎక్కువమంది వస్తే తమ సంపద తగ్గుతుందని
  
ఇండియాలో... 
పెళ్లికి బహుమతులు ఏమొస్తాయో ఊహించలేరు (పది కుక్కర్లు, పదహారు గడియారాలు, ఇరవై టేబుల్ లాంపులతో ఎంచక్కా ఓ చిన్న ఫర్నిచర్ షాప్ పెట్టుకోవచ్చు)
అమెరికాలో... 
పెళ్లికి బహుమతులు ఊహకొదలరు (gift registry వుంటుంది)
  
ఇండియాలో 
రంగు తక్కువగా వున్నవారు తెల్లబడడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్లాలనుకుంటారు
అమెరికాలో 
తెల్లగా వున్నవారు తెల్లరంగు తగ్గడానికి టానింగ్ సెంటర్ కి వెళ్లాలనుకుంటారు

ఇండియాలో ... 
పదేళ్లుగా తెలిసినవారైనా కావాలనుకుంటే పలకరించుకుండా - చూసీ చూడనట్టు పక్కనుంచి తప్పుకు వెళ్లగలరు
అమెరికాలో ...
పదేళ్లుగా "హాయ్" చెప్తున్న వారి పేరు తెలీకుండా వుండడానికి కూడా అవకాశం వుంది

ఇండియాలో ... 
కారుంటే మామూలు పోలీసు అయుండడు (ఏ సీనియర్ అధికారో అయితే తప్ప)
అమెరికాలో ... 
మామూలు పోలీసులకి కార్లుంటాయి

ఇండియాలో ... 
ఎంత సాధించినా మెచ్చుకోవడానికి కొంచెమైనా ఆలోచిస్తారు
అమెరికాలో ...
సాధించినది కొంతైనా ఆలోచించకుండా ఎంతో పొగిడేస్తారు


ఇండియాలో ... 
భార్య  అంటే స్త్రీ, భర్త అంటే పురుషుడు
అమెరికాలో ...
భార్య - భర్త :: { స్త్రీ - పురుషుడు;  స్త్రీ - స్త్రీ ;  పురుషుడు - పురుషుడు}

ఇండియాలో ...
బయట తిరిగి ఇంటికి రాగానే ముందు కాళ్లు కడుక్కుంటారు
అమెరికాలో ...
బయట తిరిగి ఇంటికి రాగానే ముందు చేతులు కడుక్కుంటారు

ఇండియాలో ... 
మామూలు మనుష్యులు హోటల్లో  దోసెలు, ఇడ్లీలు తింటారు 
అమెరికాలో ...
మామూలు మనుష్యులు Mc Donalds లో బర్గర్లు తింటారు

ఇండియాలో ... 
డబ్బులున్నవారు Mc Donalds లో బర్గర్లు తింటారు 
అమెరికాలో ...
డబ్బులున్నవారు  Indian Cuisine Restaurant లో  దోసెలు, ఇడ్లీలు తింటారు

ఇండియాలో ...
డబ్బుల్లేక మితాహారం తీసుకున్నవారు సన్నగా వుంటారు
అమెరికాలో ...
డబ్బుల్లేక (అ)మితాహారం (Mc D burgers) తీసుకున్నవారు లావుగా వుంటారు

ఇండియాలో ... 
తిన్నది అరిగేదాకా నడవక తప్పదు ఒక్కోసారి (ఆటోలు, రిక్షాలు దొరక్క)
అమెరికాలో ...
తిన్నదరగడానికి నడవక తప్పదు చాలాసార్లు


ఇండియాలో ... 
బీదవాళ్లకి వాడుకోవడానికి హెల్త్ కేర్ ఉండదు
అమెరికాలో... 
హెల్త్ కేర్ వాడుకున్నవాళ్లు బీదవాళ్లవుతారు

ఇండియాలో ...
పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకున్నమగవారు ఇలా వుండడానికి అవకాశం వుంది - ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య
అమెరికాలో ... 
పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకున్నమగవారు ఇలా మాత్రమే వుండడానికి అవకాశం వుంది - ఇంట తోమాలి - బయట తోటమాలి 


ఇండియాలో... 
దెబ్బ తగిలితే వేడి కాపడాలు
అమెరికాలో... 
దెబ్బ తగిలితే చల్ల-తాపడాలు (ice pack)

ఇండియాలో... 
On-site పనిచేయడానికి ఉత్సాహం
అమెరికాలో... 
పనిని off-shore లో చేయించడానికి ప్రోత్సాహం

ఇండియాలో... 
నా అనుకునే ఆత్మీయులు
అమెరికాలో... 
నమ్మి ఆత్మీయత పంచినవారు 

ఇండియాలో... 
సంక్రమించిన విలువైన వారసత్వం
అమెరికాలో... 
సంప్రాప్తించిన పదిలమైన పౌరసత్వం

ఇందులో రాసినవి -
రాసేటప్పటికి ఆనిపించినవి -
రాసే ముందురోజు కళ్లకి కనిపించినవీ - తప్ప -
తెగ ఆలోచించి వాలూ - వరసా వుండేలా రాసినవి కావు.

ఒక విషయం నుంచి ఇంకోదానికి గెంతుతూ
చిన్నప్పుడెప్పుడో ఆడిన కోతి-కొమ్మచ్చి ఆనవాలుతో
రాసుకున్న ఇంకో(తి)-రకం-కొమ్మచ్చి ఇది.




23, డిసెంబర్ 2016, శుక్రవారం

నా సంగీత పరస్థానం - అనుపల్లవి


 ఇంతకీ పల్లవి వినే వచ్చారా మీరు?  నా సంగీత పరస్థానం - పల్లవి
 
ఆపళంగా మాసంగీతం మాష్టారు మా ఇంటి దరిదాపులకి రాకుండా సుఖసంతోషాలతో జీవించదొడగారు.

సరే! ఆయన మానేసినా నాకు తప్పదు కదా - అసలే నాది పాడే నోరు, ఆడే కాలు -నా "సాధన" కొనసాగించాను.

అడవిరాముడు లోంచి - మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా ... అన్న అరుపుతో మొదలు పెట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు - అంటూ ఎస్పీబాలసుబ్రమణ్యం పాటతో కొనసాగించి - నాన్న పాడే - భలే మంచి రోజు పసందైన రోజు - వగైరా ఘంటసాల పాటలు నేర్చేసుకుని - అమ్మ పాడే - జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లీ - లాంటి భక్తి పాటలతో ఆగక - ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం - లాంటి సుశీల పాడిన క్రైస్తవ భక్తి గీతాలు - ఎంత హాయి ఎంత హాయి ఈనాడు మందహాస వదనముతో పలుకరించినాడు - అంటూ అనిల్ కుమార్ గారు కంజీర వాయిస్తూ పాడే ఘంటసాల గారు పాడిన సత్యసాయి భజనలు - ఒకటని కాదు అన్ని రకాల తెలుగు పాటలు - ఆడా-మగా గొంతులు తేడా చూడకుండా పాడేసేదాన్ని.

అది కూడా ఎవరైనా అడిగితేనే కాదు - ఎవరూ అడగకపోయినా - సాయంత్రం హోంవర్క్ అయిపోగానే కరణం గారి ఇంటి గేటుకి అటూ ఇటూ వుండే పిట్టగోడ మీద కూర్చుని పాడుకుంటూ ఉండేదాన్ని.

రోడ్డు మీద అటూ ఇటూ వెళ్తూ కనిపించే రాధాయో, చివుకుల రమణో, గొట్టిముక్కల సరోజినీనో పలకరించినా ఒక్క క్షణం వాళ్లకి సమాధానమిచ్చి మళ్లీ ఎక్కడైతే నా పాట ఆగిందో అక్కడ మొదలుపెట్టి పాడేసుకుంటూ ఉండేదాన్ని.

స్కూల్లో కూడా ఆగస్టు పదిహేను - స్వాతంత్ర్య దినోత్సవానికి, జనవరి 26 - రిపబ్లిక్ డేకి - మా మాస్టార్లకి నేనే పాటల స్టారు.

అవి కాక - దొంగా-పోలీసో, నేలా-బండానో ఆడుకుంటూ అన్ని ఇళ్లూ తిరిగేవేళ - నన్ను లోపలి పిలిచి - "లల్లీ - దా - ఓ పాట పాడు" - అని నాచేత తత్కాల-కచ్చేరీలు చేయించుకుని మురిసిపోయే అన్నపూర్ణమ్మ గారు, రాధాయ్ వాళ్లమ్మ గారైన సువర్చల గారు లాంటి - పక్కింటి అత్తయ్యగార్లు వుండనే వున్నారు.

ఇలా నా సంగీత ప్రభ దివ్యంగా వెలుగుతున్న రోజుల్లోనే ఒకసారి నాన్న కోసం ఎవరో ముగ్గురు నాన్నతో ఆఫీస్ లో పనిచేసేవాళ్లు ఇంటికి వచ్చారు. నాన్న అప్పుడు ఏదో పని మీద బయటికి వెళ్లారు.

మరి ఇంటికి వచ్చిన అతిథులని మన యధాశక్తి అలరించాలి కదా - అందుకని మా మేడ మీదనే వాళ్లకోసం ఎంపిక చేసిన పాటలతో కచ్చేరి - ఘనా ఘన సుందరా, నడిరేయి ఏ ఝాములో - అనుకుంటూ.

అసలే నాన్న ఆఫీసు వాళ్లు - అలాంటిలాంటి పాటలు పాడితే - "ఎబ్బే"అంటారు కదా - అందుకని భక్తిరసంలో ముంచి తేల్చాను. రెండు పాటలు పాడాను - ఇంక నా గొంతు పాడగా పాడగా రాగ మతిశయిల్లుతోంది - కొత్త కొత్త గమకాలు, సంగతులతో మూడు నిముషాల పాటని ఐదు నిముషాలు పాడేశాను.

మధ్యలో దగ్గొచ్చి మంచి నీళ్లు తాగుతున్న సమయంలో - నేను పాట ఆపినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెళ్తూ వెళ్తూ - ఒకళ్లొక పావలా, ఇంకొకరు ఒక ఇత్తడి పదిపైసలు, ఇంకొకాయన ఇంకో పావలా "పిప్పర్మెంట్లు కొనుక్కోమ్మా" అంటూ నా చేతిలో పెట్టి వెళ్లారు. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే నేను పాటలు "చదివిన" విశేషాలు - వాటికొచ్చిన చదివింపుల గురించి చెప్తే - నాన్న మెత్తగా కోప్పడి (గట్టిగా కోప్పడితే మళ్లీ ఏ ఏడుపు పాటో పాడేసి ఆయన్ని శోకరసంలో ముంచేస్తానని ముందు జాగ్రత్త) - అలా డబ్బులు తీసుకోకూడదు ఎవరిచ్చినా అన్చెప్పి అవి తీసేసుకున్నారు - మర్నాడు ఆఫీసుకి వెళ్లినప్పుడు తిరిగి ఇచ్చేశారు.

అలా మొదలయిన నా పాటల యాత్ర మా నాన్న బదిలీలతో ఒక ఊరి నుంచి ఇంకొక వూరికి మజిలీ మారుస్తూ వచ్చింది.

జంగారెడ్డిగూడెంలో మేమున్న ఇంటికి ఒక పావు మైలు దూరంలో ఒక లైబ్రరీ వుండేది. అమ్మ కోసం రెండు రోజులకొకసారి వెళ్లి - యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి, కకుభ, R. సంధ్యాదేవి - ఇలా రకరకాల రచయిత్రు/తల నవలలు తెచ్చేదాన్ని. ఆ లైబ్రరీలో ఒకసారి పాటల పోటీలు పెట్టారు. ఆ పోటీల్లో - జయ జయ శ్రీ వేంకటేశ - జయజయ ఓం శ్రిత జన పోష - అంటూ నేను పాడిన వెంకటేశ్వర కళ్యాణం పాటకి మొదటి బహుమతి వచ్చింది. అది తెచ్చుకోవడానికి మొదటి సారిగా స్టేజ్ మీదకి వెళ్లి ఒక మెడల్ తెచ్చుకున్నాను - నాన్న, మూర్తి మావయ్య గారు (నాన్న కొలీగ్) మురిసి చూస్తుంటే.

ఆ ప్రైజ్ రాగానే  మళ్లీ మా అమ్మకి ఇంకెవరన్నా సంగీతం మాష్టారు దొరికితే బావుండును అని అనిపించి తెలిసిన వాళ్లందరికీ చెప్పి వుంచింది. కానీ ఆ ఏడాది సంగీతం మాష్టార్లందరికీ రాజపూజ్యం - ఎక్కువ,అవమానం - తక్కువ అని అన్ని పంచాంగాల్లో రాసి వుండడం వల్ల ఆవిడ ప్రయత్నాలు ఫలించలేదు.

ఈలోగా అప్పటికింకా లక్ష్మి దొడ్డ దగ్గర విజయవాడలో వున్న పప్పి సెలవులకి వస్తూ - స్వామి అయ్యప్ప సినిమాలోంచి - చేతులెత్తి చెంత నిలిచి - పాట నేర్చుకొచ్చింది. లేచి నించుని సినిమాలో అమ్మాయి ఎలా అయ్యప్ప ముందు దండం పెట్టి పాడుతుందో అలాగే పాడాలని చెప్పి - నాకూ ఆ పాట నేర్పింది. పైగా ఆ పాటలో రెండో చరణం దానికి నేను అక్కని కాబట్టి పాడనే పాడకూడదు - పాపమొస్తుంది అని కూడా చెప్పింది.

అసలు పప్పి వస్తోందంటే నాకు, కుట్టికి బోల్డంత ఉత్సాహంగా ఉండేది. అది వచ్చీ రాగానే బాబ్డ్ హెయిర్ తో వచ్చే దాని జుట్టులాగే మాదీ భుజాలు దాటకుండా కట్ చేయించుకుని "బుద్ధిమంతుల" మయ్యేవాళ్లం. పప్పిని చుట్టుపక్కల అందరి ఇళ్లకీ తీసుకెళ్లి - ఇది మా పప్పీనే , కానీ మా దొడ్డ దగ్గర వుంటుంది - అని అడగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ - మా ఇంటికబురు ఇంటింటా చెప్తుండేవాళ్లం.

అప్పుడే ఓ మధ్యాహ్నం కూర్చుని అందరూ మాట్లాడుకునేవేళ పక్కింటి లక్ష్మి అత్తయ్యగారు - ఈసారి పప్పి పాట విందాం - అనగానే అది లేచి దండం పెట్టి - "నేనూ, లల్లీ కలిసి పాడతాం" అని చెప్పి - చేతులెత్తి చెంత నిలిచి - అని మొదలు పెట్టింది. నేనూ దండం పెట్టి నించుని మొదటి చరణం దానితో కలిపి పాడి - అది కాగానే ఆల్రెడీ పప్పి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేనాపేశాను.

అమ్మ, అత్తయ్యగార్లు నేనెందుకాపేశానో అని ఏదో అడగబోతూ ఉండగా - పప్పి- నన్నూ, కుట్టీని చాలా భావగర్భితంగా చూస్తూ - దానికి అక్కనైన నేను పాడకూడని రెండో చరణం -

అక్క వుంది చెల్లెలుంది ఆడిపాడగా 
ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందునా 
నడువలేని నాన్న నిన్ను చూడవచ్చినా 
అతడు తోడు వచ్చి పొందు సుమా నీదు దీవెనా 

- అని పాడేసింది. ఆ పాట వింటూ మా అమ్మ తెగ మొహమాట పడిపోయింది. 

నా పాటల పయనంలో అలా అప్పుడప్పుడు పప్పీ తోడు - ఈలోగా మాటలొచ్చిన కుట్టీ కూడా తయారయింది - నాతో పాటకి. 

ఇంతలో శంకరాభరణం రిలీజ్ అయ్యింది. ఓంకార నాదాను సంధానమౌ గానమే తో మొదలుపెట్టి సారిగరీ గపదాపా అంటూ మధ్యలో బ్రోచేవారెవరురా అన్న దాసు డైలాగులతో సహా దొరకునా ఇటువంటి సేవ అన్న ఆఖరి పాట దాకా కేసెట్ లో వున్న పాటలన్నీ నేర్చేసుకున్నాను. 

శంకరాభరణం పాటలతో పాటు కొత్తగా నేర్చుకున్న విద్య ఏంటంటే నేను పాడేటప్పుడు ఎవరైనా మాట్లాడితే పాట  ఆపేయడం - శంకర శాస్త్రి గారి అడుగుజాడల్లో. 

ఒకసారి కజిన్స్ అందరం కలిసి సరదాగా పాటలు పాడుకునేవేళ - నేను - సామజ వర గమనా - పాట కొంచెం ఎక్కువ సంగతులతో పాడుతుంటే - ఎవరో "ఆ పాట అంత సాగదేమో సినిమాలో"  అన్నారని - పాట ఆపేసి - అంతటితో ఆగక ఏడుస్తున్న నాకు - అమృతవర్షిణి - అన్న బిరుదు ప్రదానం చేశాడు మా శ్రీనన్న.

అలా కొన్నాళ్లు - పాపం - ఇప్పట్లా టీవీ సీరియళ్లు లేని ఆ కాలంలో - ఏమీ తోచని మధ్యాహ్నాలు గడపడం కోసం - నా పాట వినడానికి సిద్ధపడి - మళ్లీ మాట్లాడితే నేనెక్కడ పాట ఆపేసి ఏడుస్తానో అని - చీమలని కూడా చిటుక్కుమనకుండా నోటి మీద వేళ్లేసుకుని పాకమని చెప్పేంత నిర్బంధ కర్ఫ్యూ విధించేసి - నా పాట విన్న అనాతవరం, టంగుటూరు - గ్రామాల ప్రజలకి ఏమిచ్చినా నా పాటల ఋణం తీరదు. 

శంకరాభరణం పాటలు మోసుకుని టంగుటూరు చేరాను. వారానికి ఒక్కరోజైనా ఎవరో ఒక టీచర్ నాచేత క్లాసులో పాటలు పాడించేవారు. పాడేది నేనున్న క్లాసు రూములోనే అయినా స్కూల్ మొత్తం వినిపించేది నా పాట. పక్క క్లాసులో పిల్లలు కూడా వచ్చి మా క్లాసు తలుపు దగ్గర నించుని నా పాటలు వినేవారు. 

టంగుటూరులోఇంత పొడుగ్గా వుండే (పేరు మాత్రమే, నేను కాదు) - లలితా త్రిపుర సుందరి - అనే నా పేరు, నా పాటలు, నా భాష - అన్నీ నేనేదో వేరే లోకపు మనిషిని అన్నట్టు చూసేవారు. ఇక్కడికి వచ్చిన ఏడాదికి  ఒంగోలు నుంచి సంగీతం నేర్పిస్తానని శ్రీనివాసరావు గారనే ఒక సంగీతం మాష్టారు వచ్చారు. 

మా అమ్మ నన్ను, కుట్టిని విజయ దశమి రోజున బ్రహ్మయ్య గారి మేడ మీద శ్రీనివాసరావు గారు మొదలుపెట్టిన సంగీతం క్లాసులో చేర్పించింది. 

రోజు విడిచి రోజు క్లాసు - 
మధ్యలో ఇంటి-కప్పు ఎగిరిపోయేలా ప్రాక్టీసు-
మధ్య-మధ్యలో గేదె మీద  చేసిన సంగీత ప్రయోగాలు [మా సంగీతం-గేదె గురించి ఇక్కడ క్లిక్ చేసి చదవండి మరి :) ]
-  సంగీత యాత్ర "సాగడం" మొదలయింది.



<ఇక్కడితో లలిత-సంగీతం అయిపోలేదు -  ఇంకా చరణం వుంది  - త్వరలోనే వినిపి(చదివి)స్తాను>

19, డిసెంబర్ 2016, సోమవారం

త్వామనురజామి - 8 - పరీక్షా కాలం

కిందటి 19 చెప్పిన కబుర్లు 

ACC లో డిగ్రీ అయిపోయింది - మూడు ఏళ్లు - ఆరు వినోదాలుగా.

ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా రాశాము - అపర్ణా, నేను.

వేసవి సెలవులు - ఎప్పట్లాగే - ఈసారి ఒకటే తేడా - ఇంతకూ ముందు రెండేళ్ల సెలవులకి అంత ఆలోచన ఉండేది కాదు - ఇంకా డిగ్రీ అవ్వలేదు కాబట్టి .

మరిప్పుడు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది - తర్వాతేం చేయాలో నిర్ణయించుకోవాలి.

ఫిజిక్స్ మీద నాకున్న ఇష్టంతో - అదీ కాక ఇంటినుంచి ఎక్కువ దూరం వెళ్లక్కర్లేదని - ముందసలు నాగార్జున యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ ప్యూర్ ఫిజిక్స్ చేద్దామనుకున్నాను.

అప్పుడప్పుడే MCA - అప్పటికే వున్న MBA కి - సమాంతరంగా పాపులర్ అవుతోంది.

కంప్యూటర్ కోర్సు - కొత్త కోర్సు - పైగా ఎక్కడా కోచింగ్ ఇన్సిస్ట్యూట్ల చూపు పడని కోర్సు - బలవంతంగా కూర్చోబెట్టి చదివించేవారుండరు - నేను సొంతంగా ప్రిపేర్ అవొచ్చు - ఇంకంతే - నాకు తెగ నచ్చేసింది.

కాలేజ్ అయిపోయినా అపర్ణ, నేను దాదాపు రోజూ ఒక్కసారైనా కలుసుకునేవాళ్లం - తను మాఇంటికి రావడమో, నేను వాళ్ల ఇంటికి వెళ్లడమో - ఎలా అయినా సరే - రోజుకొకసారైనా చూడాల్సిందే.

ఇద్దరమూ కలిసి రోజూ Indian Express లో Peanuts కార్టూన్ చదివి, Cross-Word ప్రయత్నించి - రేడియోలో పొద్దున్న వివిధభారతిలో  జనరంజనో - మధ్యాహ్నం  భూలే-బిస్రే గీతో - వస్తుంటే వింటూ - కాలేజ్లో రాసుకున్న రన్నింగ్ నోట్స్ అలవాటు పోకుండా ఉండాలనే ధ్యేయంతో - అందితే పుస్తకాల మీద, అందకపోతే అప్పటికి చేతికి దొరికిన చిత్తుకాయితం మీదైనా సరే - రాసుకున్న తెలుగు, హిందీ పాటలు - ఎవరు ఏం రాసుకున్నామో ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటూ - అప్పటికి ఇంకా టైం మిగిలి వుంటే అప్పుడు యూనియవర్సిటీ నోటిఫికేషన్లు చూసేవాళ్లం.

ఒకరోజు పేపర్లో తిరుపతి-వెంకటేశ్వర & పద్మావతి యూనివర్సిటీలు - కలిసి పెడ్తున్న MCA ఎంట్రెన్స్ నోటిఫికేషన్ కనిపించింది.

రెండోరోజే వెళ్లి బ్యాంకులో DD తీసుకుని అప్లికేషన్ పోస్ట్ చేశాము ఇద్దరం.

MCA ఎంట్రెన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటే - ఒకరోజు శంకర్ విలాస్ దగ్గర అనుకోకుండా కలిసిన - డిగ్రీ సీనియర్స్ పద్మజ, ఆషా చెప్పారు - అది సెంట్రల్ యూనివర్సిటీ కండక్ట్ చేసే pattern లో ఉంటుంది - GRE Exam కి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు సహాయ పడతాయని.

అప్పుడు వెంటనే అరండల్ పేట లోని నవోదయాకి వెళ్లి Barron's GRE పుస్తకం తెచ్చుకున్నాను.

ఈలోగా పప్పి, కుట్టిల పరీక్షలు కూడా అయిపోయాయి.

ముగ్గురం కలిసి - సినిమాలు, సైకిళ్ల మీద షికార్లు.

ఇంతలో విజయవాడకి దగ్గర్లో వున్న కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ (KLEC) లో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందని హైద్రాబాదునుంచి చిన్నపాపపిన్నివాళ్ల శ్రీను గుంటూరు వచ్చాడు.

తనక్కూడా సెలవులని బాబు కూడా వచ్చాడు - వరంగల్ నుంచి.

మధ్యాహ్నం భోజనాలయ్యాక అమ్మ - పాపం - ఒక్క అరగంట నడుం వాల్చేది.

నేను, పప్పి, కుట్టి, శ్రీను, బాబు - బయట కేన్ కుర్చీల్లో కూర్చుని కబుర్లు, జోకులు, పాటలు - సందడిగా వుండేది.

బాబు ఇంజనీరింగ్ కాలేజ్ విశేషాలే కాక తనకి టీ పెట్టడం ఎంత బాగా వచ్చేసిందో బోల్డంత గొప్పగా వర్ణించి చెప్పాడొకసారి.

మేం ముగ్గురం - "అమ్మో ! భలే బాబూ - నిజంగా ? టీ పెట్టడం వచ్చేసిందా? మాకింకా పాలు కాచడమే సరిగా రాదు - మాకన్నా నువ్వు చాలా నయం - అమ్మకి చెప్పకు బాబూ - మళ్లీ మమ్మల్ని నిన్ను చూసి నేర్చుకోమమని తిడుతుంది" - అంటూ తెగ మెచ్చేసుకున్నాం. 

ఒక రోజు ఇలాగే కబుర్లు చెప్తూనే బాబు తనూ కాసేపు పడుకుందామని లోపలికి వెళ్లాడు.

సరిగ్గా మధ్యాహ్నం మూడున్నర అవగానే శ్రీనుని పిలిచి - కుట్టి సైకిల్ వాడికిచ్చి అరండల్ పేట లో వున్న Modern ఫుడ్స్ కో , బ్లూ స్టార్ బేకరీకో వెళ్లి - సమోసాలు తెమ్మని పంపించాం.

శ్రీను ఇంటికి వచ్చేలోగా మేం ముగ్గురం పడుక్కున్న బాబుని లేపి - "బాబూ! నువ్వు టీ బాగా పెడతానని చెప్పావు కదా - ప్లీజ్ ఒక్కసారి టీ చేయవా?" - అంటే - తనని లేపేశామని అస్సలు విసుక్కోకుండా తన  టీ-పాక-కళ ప్రదర్శించే అవకాశం తనకిచ్చిన మాకు టీ కాచి పోసి - నేను సైతం వీళ్ల అల్లరికి ఒక్కసారి దొరికిపోయాను - అని తనూ ఓ కప్పు తాగాడు.

ఈలోగా గుంటూరు ఎండల్లో సైకిల్ తొక్కించి సమోసాలు తెప్పించుకున్న మామీద పళ్లు - లోలోపలే కొరుక్కుంటూ - (మళ్లీ వాడికి కోపం వచ్చిందని పైకి కనిపిస్తే వాడిమీదే జోకులు వేసేసి వాణ్ణి ఇంకా ఏడిపిస్తామని) -
మొహమంతా ఎర్రగా అయిపోయి ఇంటికి వచ్చిన శ్రీనుకి కూడా బాబు కలిపిన టీ-కప్పొకటి వుంచాం  - బాబు చేశాడని చెప్తే శ్రీను కొంచెం సంతోష పడ్డట్టు కనిపించాడు - వాడొక్కడే మా మధ్యాహ్నపు-టీ-సమోసాకలికి శ్రమదానం చేయలేదని.

ఈలోగా ఒక కునుకయ్యి లేచొచ్చిన మా అమ్మకి వంటిల్లంతా ఒక చిన్నసైజు కురుక్షేత్రం లా కనిపించిందేమో - మా ముగ్గురిని విసుక్కోవడం మొదలు పెట్టింది - గ్యాస్ గట్టు అంతా టీ  పొంగించేశామని.

అన్యాయంగా అన్నెం-పున్నెం ఎరగని మామీద అభాండం వేస్తోందని - బోల్డంత ఉక్రోషం వచ్చి - "బాబు ఒలకపోస్తే  మమ్మల్నంటావేంటమ్మా" - అనడగ్గానేఅమ్మకి అర్థం అయిపోయింది - మేము బాబు చేత టీ పెట్టించామని.

వెంటనే - "ముగ్గురాడపిల్లలుండి మగపిల్లాడు వాడి చేత టీ పెట్టిస్తారా ? హవ్వ! ఇంకేమైనా వుందా-రేపు నన్నంటారు అందరూ ........." అని ఏదో-ఏదేదో తిట్టేయడం మొదలుపెట్టింది.

ఆ చుక్కలు (.....) దాటిన తర్వాత మా అమ్మ ఏమనేదో ఈరోజుకీ నాకు తెలీదు - ఎందుకంటే అప్పటికే మేం ముగ్గురం మా మేడ-గోడల మీదకి వెళ్ళిపొయ్యేవాళ్లం - మా సాయంకాలపు సమావేశాలకి.  

ఆ ప్రకారంగా యథాశక్తి  బాబుని, శ్రీనుని విసిగిస్తూ - మా అమ్మ సాయం చేయడానికి వంతులు వేసుకుంటూ - అంటే నిజంగా ఆవిడకి సాయం చేయడానికి కాదు - ఏ సాయం ఎవరు చేయాలని - "నువ్విది చేస్తేనే, నేనది చేస్తాను"-టైపన్నమాట! - మా వేసవిని వట్టివేళ్లు కట్టిన కిటికీల, తలుపులు మధ్య పనసతొనలు, మావిడిపళ్లు  తింటూ గడిపేస్తున్నాము.

MCA ఎంట్రెన్స్ కి ప్రిపరేషన్ సరదాగా వుంది నాకు -Mental Ability, Aptitude, Math Problems - ఇవి అన్నీ రొటీన్ గా కాకుండా పజిళ్లు సాల్వ్ చేస్తున్నట్టుండి - నాకు భలే హుషారుగా వుండేది.

మే లోనో ఎప్పుడో ఎంట్రెన్స్ కి హాల్-టికెట్ వచ్చింది - వచ్చి తిరుపతిలో టెస్ట్ రాయమని. సెంటర్ - పద్మావతి యూనివర్సిటీ.

అపర్ణ వాళ్ల నాన్నగారు - రఘునాథ్ అంకుల్, అపర్ణ, నేను - బయల్దేరి తిరుపతికి వెళ్లాము - ట్రైన్ లో. ఆ రాత్రి ట్రైన్ ప్రయాణంలో - అపర్ణ, నేను మాకొచ్చిన సైడ్ బెర్త్ లో కింద కూర్చుని - కిటికీలోంచి కనిపిస్తున్న చందమామని చూస్తూ బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాము - రెండో రోజు రాయబోయే పరీక్ష గురించి ఒక్క మాట కూడా దొర్లకుండా మహా జాగ్రత్త పడుతూ.

ఆ రోజు పొద్దున్నే రైల్వే రిటైరింగ్ రూంలో మా లగేజ్ పెట్టుకుని - ఎంట్రెన్స్ పరీక్ష రాయడానికి శ్రీనివాసమంగాపురం అవెన్యూ లో వున్న పద్మావతి యూనివర్సిటీకి వెళ్లాము - అపర్ణ, నేను - మాతో పాటు అంకుల్.

పరీక్ష రాసేముందు చుట్టూ చూస్తే గుంటూరు నుంచి నేనూ,  అపర్ణే కాక ఇంకా ఇంటర్ మాతో చదివి - డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ లో చదివిన - మల్లిక, నిరుపమ - కూడా వున్నారు. వాళ్లని పలకరించి ఈలోగా టైం అయ్యిందని మా హాల్-టికెట్ నంబర్ల ప్రకారం వెళ్లి సీట్లలో కూర్చున్నాము. నా ముందు, వెనకా కూర్చుని వున్న అమ్మాయిలని పలకరించాను - అరుణ, అపర్ణ - అని వాళ్లిద్దరూ హైద్రాబాదు నుంచి వచ్చారు - MCA ఎంట్రెన్స్ రాయడానికి.

ఎంట్రన్స్ బాగా రాశాను - ముందే చెప్పినట్లు - నాకా పజిళ్లలా వున్న ప్రశ్నలు నచ్చేశాయి.

పరీక్ష అయిపోయి పన్నెండింటికి బయటికి రాగానే - సాయంత్రం ట్రైన్ కి వెళ్లేలోగా చాలా టైం వుందని - భీమాస్ లో భోజనం కాగానే అంకుల్ మమ్మల్ని ఏదో తెలుగు సినిమాకి తీసుకెళ్లారు.

సినిమా అయిపోగానే సాయంత్రం బయల్దేరి గుంటూరు వచ్చేశాం. పరీక్ష రాశామని మరిచి కూడా పోయాం.

ఒక పదిహేను రోజుల్లో టెలిగ్రాం వచ్చింది - SV యూనివర్సిటీ నుంచి - నాకు 9వ రాంక్ వచ్చింది - ఇంటర్వ్యూకి రమ్మని.

బోల్డంత ఆనందం - మొట్ట మొదటి సారి నా అంతట నేను చదువుకుని రాసిన పరీక్షలో అంత మంచి రాంక్ వచ్చిందని.

ప్రతి క్లాసులో పరీక్ష ఫలితాలు రాగానే స్వీట్స్ తెప్పించి మేము అద్దెకున్న ఇంటి కాంపౌండ్లో మిగిలిన వాటాల్లో వున్న  అందరికీ మాచేత ఇప్పించడం మా నాన్నకున్న ఓ ముచ్చటైన అలవాటు.

ఈసారీ అలాగే ఆఫీస్ లో పనిచేసే వెంకటేశ్వర్లుని పంపించి తొక్కుడు లడ్డు తెప్పించి నాచేత అందరికీ ఇప్పించారు.

ఇంక అందరూ -  ప్రత్యేకంగా వాళ్లు వున్న ఇంటి వాటాలని బట్టి మధ్యాంటీ-చివరాంటీ అని మేం పిలిచే ఉషాంటీ (లక్ష్మణ్ వాళ్ల అమ్మగారు) - అరుణాంటీ - తెగ సంబర పడిపోయారు - లల్లీకి మంచి రాంక్ వచ్చింది అని.

ఆ సంబరంలోనే ఉషాంటీ నాకొక వెండి బాల్ పెన్ను కొనిచ్చారు. అరుణాంటీ నాకిష్టమని వంగ-దోసకాయ పచ్చడి అప్పటికప్పుడు చేసి తెచ్చారు. అదేదో నేనప్పుడే చదువుకోవడానికి తిరుపతి వెళ్లిపోతున్నట్లు మాట్లాడి - వాళ్ల మాటలకి వాళ్లే అప్పట్నుంచే బెంగ పెట్టేసుకోవడం మొదలు పెట్టారు.

నాకింక కాళ్లు భూమిమీదే వున్నా వాటికి స్ప్రింగులేవో మొలిచినట్లు అనిపించింది.

ఇంటర్వ్యూకి నేను, నాన్న బయల్దేరి వెళ్లాము - తిరుపతికి. పొద్దున్న తొమ్మిదింటికి ఇంటర్వ్యూ జరుగుతుంది అన్న SVU లో ఇంజినీరింగ్ కాలేజ్ బిల్డింగ్ కి వెళ్లాము.

 మధ్యాహ్నం పన్నెండయినా నా పేరు పిలవలేదు - నాకన్నా ఎక్కువ రాంక్ వచ్చిన వాళ్లు కూడా వాళ్ల పేర్లు పిలిచారని వెళ్లి ఫీజు కట్టేసి వెళ్లారు.

నాన్నకప్పుడు ఏదో పొరపాటు జరిగిందని అనిపించింది. ఆఫీస్ రూంలోకి వెళ్లి నాకొచ్చిన రాంక్-కార్డు చూపించారు.  అది చూసిన ఇంటర్వ్యూ చేసే వాళ్లు చెప్పారు - అది పద్మావతి యూనివర్సిటీకి సంబంధించినది - SVUది కాదు అని. రాసింది కామన్ ఎంట్రెన్స్, రాంక్ కార్డు వచ్చింది SVU నుంచి అయితే - పద్మావతి కి వెళ్లమంటారేంటి అనడిగారు నాన్న.

ఎన్ని సార్లడిగినా వాళ్ళు చెప్పే సమాధానం అంత  తృప్తిగా అనిపించలేదు - ఎక్కడో పొరపాటు జరిగింది అని తెలుసు - కానీ ఎవర్ని అడగాలో అర్థం కాలేదు - పాపం - నాన్న నేను బాగా disappoint  అయ్యాను - ఏడుపు అతి కష్టం మీద ఆపుకుంటున్నాను అని చూసి - "పోతే పోయిందిలే లల్లీ - ఇంకా ఆంధ్రా యూనివర్సిటీ టెస్టొకటి వుంది కదా - మన మునసబు గారి కిరణ్ అక్కడే చదువుతున్నాడు - చాలా బావుంటుందట - ఎంచక్కా లలితత్తయ్య దగ్గరుండి చదువుకోవచ్చు -  వైజాగ్ వూరు కూడా బావుంటుంది - సముద్రమూ అది - సెలవులొస్తే బీచుకెళ్లొచ్చు " అంటూ కబుర్లు చెప్తుంటే - సాయంత్రం వరకూ SVU లోనే వుంది మళ్లీ  ట్రైన్ లో గుంటూరుకి వచ్చేశాం.

ఇంటికి రాగానే విషయం తెలిసిన అందరూ నేనెక్కడ బాధ పడతానో అని అసలా విషయమే గుర్తులేనట్టు - అసలు చదువు విషయమే రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు - ఇంట్లో వాళ్లు , పక్కింటి ఆంటీలు అందరూ.

ఎవరెంత నాకేవేవో కబుర్లు చెప్పి మరిపించాలని చూసినా నాక్కొంచెం దిగులుగానే ఉండేది - అంత బాగా రాసిన ఎంట్రెన్స్ లో సీట్ రాలేదని.

పప్పి,కుట్టీలతో కూడా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు - ఒక్కదాన్నే వెళ్లి మేడ మీద కూర్చునేదాన్ని.

ఒక రోజు సాయంత్రం సంగీతం క్లాస్ అయిపోగానే పప్పి, కుట్టి మేడ మీదకి వస్తున్నట్లు - మెట్లమీద నుంచి వాళ్ల మాటలు వినిపించాయి.

"ఏంటే పప్పీ - ఏది ఈ లల్లీ?" - కుట్టీ ప్రశ్న.

"పైన వుందేమో మళ్లీ ఆ దిల్ కో టుకడే  టుకడే కర్కే - ముస్కురాకే చల్ దియే - జాతే జాతే యే తో బతాజా హం జియేంగే కిస్కేలియే అని పాడుకుంటూ" - పాట పాడుతూ పప్పి సమాధానం .

"ఇవాళ దీన్సంగతేంటో తేల్చెయ్యాల్సిందే - ఆ ఏడుపు మొహం చూడలేకపోతున్నాం బాబోయ్" అంటూ వచ్చింది కుట్టి పైకి.

నేను వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా  రోడ్డు మీద వచ్చే పోయే సైకిళ్లు, రిక్షాలు చూస్తున్నాను - అదేదో నాకు చాలా ఇంటెరెస్టింగ్ విషయం అన్నట్లు.

"పప్పెమ్మా - BH లో ఈ సంవత్సరం నీ ఇంటర్ ఎలా అయ్యిందే?" - నీకంత మేమక్కర్లేకపోతే మేము మాట్లాడుకోలేమా అన్న హింట్ ఇస్తూ కుట్టి అడిగింది పప్పీని.

"ఎలా అవ్వడమేంటి?! - మా గాయత్రి మేడం ఓ నాలుగో - ఐదో సార్లు నాకు చప్పట్లు కొట్టించింది"

"అబ్బా - ఐదు సార్లే? ఏం చేశావేంటి?"

"ఏడాది మొత్తంలో అన్ని సార్లు మాత్రమే ఆవిడ చెప్పే ఇంగ్లీష్ నాన్-డిటెయిల్ క్లాసుకి వెళ్లాను. అందులోనూ ఒకసారి అటెండెన్స్ వేస్తూ నా పేరు పిలవగానే  అప్పటివరకూ రాణి తో మాట్లాడుతున్న నేను "ప్రెజెంటెహె" అన్నాను. అందుకే ఆవిడ క్లాసులోకి రాగానే నేను కనిపిస్తే క్లాసులోవున్న అందరి చేతా చప్పట్లు కొట్టిస్తుంది - ఇవాళ అరుణ క్లాసుకొచ్చింది - అని"

వాళ్ల మాటలు విని నాకు నవ్వొస్తోంది కానీ వాళ్లకి కనబడకూడదని ఇంకా సీరియస్ గా రోడ్డుకేసి ఒంగి చూడడం  మొదలుపెట్టాను.

ఈలోగా కుట్టి నా మొహం దానిచేత్తో దానికేసి తిప్పుకుని "మేమిక్కడ మాట్లాడుతుంటే ఆ రోడ్డుకేసి చూడ్డమేంటసలు? రూప వస్తానంది రేపు శ్రీ-420 కి వెళ్దామా - విజయలక్ష్మి లో వచ్చింది" అనడిగింది.

నాకింక కళ్లలో నీళ్లొచ్చేశాయి - నోట్లోంచి మాట రావట్లేదు - తల అడ్డం గా తిప్పాను రానన్నట్లు.

"ఎహె - ఏడుపాపవే బాబూ - అసలో సంగతి చెప్పు - నీగ్గుర్తుందా - ఈ పప్పెమ్మ ఎకనమిక్స్ ఎగ్జామ్ రోజు ఏం జరిగిందో?"

అది నాకు ఏం గుర్తు చేయడానికి ట్రై చేస్తోందో అర్థం కాగానే - కళ్ల నీళ్లతో పాటు భళ్లుమని నవ్వు కూడా వచ్చింది.

ఆరోజు పప్పీ సీనియర్ ఇంటర్ ఫైనల్స్ లో ఎకనమిక్స్ పేపర్. పరీక్ష తొమ్మిదింటికి.

పప్పి పొద్దున్నే లేచి కొంచెమేదో రివైజ్ చేసి - ఎనిమిదింటికి రెడీ అయ్యింది.

ఎనిమిదింపావు నుంచి ఏంటో వెతకడం మొదలు పెట్టింది.

ముందు అంతగా పట్టించుకోలేదు - కానీ ఎప్పటికీ ఆ వెతకడం ఆపకపోతుండేసరికి -అమ్మకీ, నాకూ డౌట్ వచ్చింది.

"పప్పీ - ఏంటి వెతుకుతున్నావు? - పరీక్షకి టైమవుతుంటే ఓ పక్క" - మాతృమూర్తి ఆందోళనా పూరిత స్వరం.

"నా హాల్-టికెట్" - నెమ్మదిగా నిమ్మకు నీరెత్తినట్టున్న పుత్రిక సమాధానం.

అంతే - ఆ తర్వాత అరగంటలో - పప్పి - మాఇద్దరి హడావుడిని ఒక తమాషాలా చూస్తుంటే - మా అమ్మ, నేను - ఇంట్లో వున్న ప్రతీ పుస్తకం, పేపరు - అలమార్లు, బట్టల బీరువాలు -వంటింట్లో స్టీలు డబ్బాల కిందా, మీదా,  లోపలా - కొంచెం సేపయ్యేటప్పటికీ - అసలేం వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో - మాకు మేమే  మర్చిపోయేంతగా ఇల్లు పీకి పేపర్ల-పందిరేసేసాం.

మేమంత వెతుకుతున్నా - పప్పికసలు కొంచెం కూడా పరీక్షకి లేట్ అవుతోందని తొందర కానీ - హాల్-టికెట్ దొరక్కపోతే అసలు పరీక్షే రాయలేననే టెన్షన్ కానీ - ఏమీ లేవు. పైగా "వుందిగా సెప్టెంబర్ మార్చి పైనా - వాయిదా పద్ధతుంది దేనికైనా" అంటూ పాటలు.

మా అమ్మకేమో కోపం - నాకేమో ఎప్పట్లాగే రాబోతున్న ఏడుపు...  

పక్కనే మమ్మల్ని విసుక్కుంటూ కుట్టి - పప్పికి లేని హడావిడి మేమిద్దరం అనవసరంగా పడిపోతున్నామని.

ఈలోగా పప్పికి దాని బ్యాగ్ లోనే పుస్తకాల అడుగున నలిగి-నలిగి వున్న హాల్-టికెట్ దొరికింది - ఇంతలో దాని ఫ్రెండ్ రాణి వచ్చిందని -అసలేమీ జరగనట్టు - ఆ కాయితాల గుట్టల్లోఅమ్మనీ, నన్నూ వదిలేసి - పరీక్షకి వెళ్లిపోయింది.

అదే ఇప్పుడు కుట్టి గుర్తు చేస్తోంది.

నా మొహంలో నవ్వు చూడగానే - "అబ్బా! ఇప్పటికి ఆపావా ఏడుపు - పప్పెమ్మని చూసి నేర్చుకో - బాగు పడతావ్" అంటూ నా చెయ్యి పట్టుకుని కిందకి లాక్కుపోయింది. మా వెనకాలే ముసిముసిగా నవ్వుకుంటూ పప్పి.

నాకూ అనిపించింది - పోతే పోనీ - ఇంకా బోల్డు యూనివర్సిటీలు - పరీక్షలూ వున్నాయి - మళ్లీ ట్రై చెయ్యొచ్చు కదా - అని.

అలా నా పరీక్షా-కాలం మొదలయింది.

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


18, డిసెంబర్ 2016, ఆదివారం

మొదటి మంచు పూత...



 రజత రజనును 
తోసిరాజను 
తొలి హిమపు రజను 

 పుడమికి పూసిరెవరో
మాసిపోవని
పిండారబోసినట్లాయెను 

ముదము పంచెనెదకు 
మొదటిదాయిన
మంచు పూత ఈలాగు







గణితమంటే మా వూరికీ 
గజ గజ వణుకేమో 
గణనకెక్కె వణుకు గణన 
(Temperatures  in Centigrade)





16, డిసెంబర్ 2016, శుక్రవారం

మాటల పాటల తోట - ఈ రేడియో తోట (Radio Garden)

బ్లాగ్ తర్వాత నాకున్న ఒకే ఒక social-netoworking opportunity - Whatsapp.

పేరుకి ఒక నాలుగు Whatsapp సమూహాల్లో -  నూకల సతీష్ నడిపే మన ఊరు అనాతవరం అనే గ్రూపు, అమ్ములు-లలిత నడిపే వడ్లమానీస్ గ్రూపు, నేనే సృష్టించిన శివకోడు కజిన్స్, టంగుటూర్ ఫ్రెండ్స్ అనే రెండు గ్రూపులు  - మొదలైన వాటిల్లో వున్నా-  ఆ గ్రూపుల సంభాషణల్లో నేను కలిపించుకుని మాట్లాడడానికి, ఏమైనా పంచుకోవడానికి అంత పెద్ద విశేషాలు నా దగ్గర రోజూ ఏమీ ఉండవు.

అదీ కాక రోజూ అక్కడ పోస్ట్ చేసే మెసేజెస్ చూడడానికి కూడా కుదరదు.

అలా అని ఆ గ్రూపుల్లోంచి బయటికి రావాలని కూడా అనిపించదు .

నా మటుక్కి నాకు - ఏధైనా పెళ్ళో, పార్టీయో జరుగుతూ వుంటే  ఓ పక్కన కూర్చుని - అక్కడ హడావిడిగా అటూ ఇటూ తిరిగే వాళ్లని చూస్తూ - వాళ్ల మాటలని వినడం ఎంత బావుంటుందో  - వారానికి ఒక్కసారైనా - కుదిరినప్పుడు Whatsapp చూడడమూ అంతే బావుంటుంది.

ఫోటోలు, వీడియోలు, తమాషా కబుర్లు, జోకులు, వూళ్లో జరిగే పండగల విశేషాలు - ఇలా ఎంతో కాలక్షేపం నాకు - వారానికి ఒక అరగంటో-గంటో.

ప్రతీ శుక్రవారం పొద్దున్నేWhatsapp సంభాషణలు చూస్తాను - ఒక పది నిముషాలు.

ఇవాళా అలాగే చూస్తున్న నాకు  -  మా అనాతవరం గ్రూపులో - శారద, మా టంగుటూర్ ఫ్రెండ్స్ గ్రూపులో చిన్ననాటి స్నేహితుడు - విక్రమ్ పోస్ట్ చేసిన ఒక చిన్న మెసేజ్  కనిపించింది.

"Radio Garden 
Explore live radio by rotating the globe 
http://radio.garden/live/warsaw/star883/ 
This is incredible - అంటూ.

ముందు అంతగా పట్టించుకోలేదు.

కానీ అసలే పాటలు అందులోనూ రేడియో లో వచ్చేవి - నాకెందుకో ఎప్పుడూ తర్వాత ఏం పాట వస్తుందో తెలియకుండా రేడియో లో వినే వివిధభారతి - జనరంజని లాంటి కార్యక్రమాలంటే ఇష్టం - CDలూ, కేసెట్లకన్నా.  

అందుకే - ఇదేదో రేడియో అని వుంది - అదేంటో చూద్దామని వెనక్కి వెళ్లి URL మీద click చేశాను.

అంతే ! నా ఫోన్ స్క్రీన్ మీద ఒక నీలపు తెర ---ఇలా....






అక్కడ చెప్పినట్టుగానే వేలితో press చేశాను - ముందుగా ఏడు కిటికీల క్యూపొల నుంచి చూస్తే కనిపించేలా పచ్చగా, నీలంగా, తెల్లగా - రంగురంగుల అందమైన  భూమి ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షం - ఇలా ....



ఆ తర్వాత ఇలా ... ఏదో ఇంగ్లీష్ పాట మొదలయింది - Star 88.3 అనే FM స్టేషన్ నుంచి.



ఎడమ పక్కనున్న కిందగా వున్న ప్లస్సు, మైనస్సు  (+, - ) గుర్తుల్లో మైనస్సు మీద వేలుని పెట్టి ఆ భూమిని కొంచెం zoom-out చేస్తూ, చేస్తూ - తిప్పుతూ మొత్తానికి ఇండియా లో హైదరాబాదు Teluguone Radio FM స్టేషన్ పట్టుకున్నాను.

ఒక మాట - ఆ కుడిపక్క కింద ఆకుపచ్చ రంగులో కనిపించే FM స్టేషన్ - active station. దానిని bookmark చేసుకుంటే : http://radio.garden/live/hyderabad/teluguone/ - అని direct URL సేవ్ చేసుకోవచ్చు.




అబ్బా - ఎన్ని రోజులకి బో... ల్డన్ని తెలుగు పాటలు, ఇం.... కా.... బో... ల్డన్ని తెలుగు మాటలు విన్నానో - అనుకోకుండా ఎవరో మల్లాది వారి టాక్-షోకి  - వైరాగ్యం, వేదాంతం, విరక్తి - అనే విషయం మీద ఏదో సందేహం అడగడానికి కాల్ చేసిన ప్రముఖ రచయిత్రి  బలభద్రపాత్రుని రమణి గారి గొంతు విన్నాను - ఇంకా బే-ఏరియా సత్యలత గారు నడిపే బృందావనం కార్యక్రమం విన్నాను.

నాకైతే చాలా నచ్చేసింది ఈ రేడియో గార్డెన్ - ఎందుకంటే -
  1. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో, ఎన్ని భాషల్లో FM స్టేషన్లు వున్నాయో అన్నీ వినొచ్చు.   
  2. ఏ కొత్త App installation అవసరం లేదు 
  3. Browser - based 
  4. కాసేపు గ్లోబు తిప్పుకుంటూ - ఆడుకుంటూ - వేరే వేరే భాషల్లో పాటలు-మాటలు వినచ్చు 
  5. ముఖ్యంగా మన తెలుగు పాటల ట్యూన్లకి ఏ పర-భాషా పాట "ఇన్స్పిరేషనో" ఎంచక్కా తెలుసుకుని కొలంబస్సులా మురిసిపోవచ్చు. 
ఈ రేడియో గార్డెన్ గురించిన వివరాలు ఇక్కడ ఇంకా బోల్డు వున్నాయి: http://www.transnationalradio.org/node/79 

ఈ  మాటల పాటల తోట గురించి చెప్పిన శారద, విక్రమ్ లకి బోల్డన్ని Thank You లు !!!


ఈరోజుకి నాదైన ఒక చిన్న  కబురు:

ఇవాళ - బుజ్జిజింక - పాపం - బాగా చలిగా వుందేమో - స్కూల్ నుంచి రావడమే ముక్కు పీల్చుకుంటూ, తలనొప్పని వచ్చాడు ఇంటికి.

రాగానే వెచ్చగా స్నానం చేసి సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు.

లేవగానే -ఇంకా తగ్గని వాడి తలనొప్పికి మందు వేసి, తలకి నూనె రాసి - ఏవో కబుర్లు చెప్తూ - గిన్నెలు డిష్-వాషర్ లో పెడుతూ - ఇల్లు-ఇల్లాలు సినిమాలోంచి - వినరా సూరమ్మ కూతురు మొగుడా - అని గట్టిగా పాడుకుంటూ - రాజబాబు వెర్షనూ, రమాప్రభ వెర్షనూ - రెండూ నేనే అయి - నాలో నేనే నవ్వుకుంటూ ఉంటే - వెనకాలే నించుని నాకేసే చూస్తున్న బుజ్జిజింక ఉన్నట్టుండి - అమ్మా! When you do something that is not that fun, you make it fun by making strange sounds - I wish I could do that అన్నాడు.

That statement made this mom's day!



10, డిసెంబర్ 2016, శనివారం

గజిబిజి-జిగిబిగి

ఏమీ తోచట్లేదు - తోచీ తోచనమ్మ - తనకి తానే - తనతో తనే -  చే(వే)సుకున్న భేటీ ఇది.

ఇదెలాంటిదంటే - చిన్నప్పుడు జ్వరం వచ్చిందని బడి మానేసిన రోజు - అందరూ బడికెళ్లిపోతే - తోచక ఒక్కదాన్నే రెండు పక్కలా నేనే అయి కేరమ్ బోర్డు ఆడుకున్నట్లు.

"హలో - నిన్నుఇంటర్వ్యూ చేయాలని వచ్చాను"

"అలాక్కానీయ్ మరి"


"నీ  పేరేంటి?"

"అది తెలీకుండా నేనెవరినని ఇంటర్వ్యూ చేద్దామని?"

"పాయింటే  - సరే అదొదిలేయ్ - ఇంతకీ  నువ్వేం చేస్తుంటావు?"

"మూడు పూట్లా భోజనం"

"అది కాక - ఉద్యోగం లాంటిదేమన్నా ...?"

"ఆ ... లేకేం - కోటి విద్యల్లో ఒకటి"

"తర్వాత?"

"తర్వాతంటే?"

"అదే - భోజనమయ్యాక, ఉద్యోగం నుంచి విడుపు దొరికాక ?"

"నిద్దరోతా"

"మరి ఖాళీ సమయాల్లో ?"

"ఏ ఖాళీ? ఎలాంటి ఖాళీ?"

"అందులో రకాలున్నాయా?"

"మరుండవా?"

"ఒకట్రెండు రకాలేవో చెప్పు- మచ్చుకి... "

"తిన్నాక కంచం ఖాళీ  - లేచాక మంచం ఖాళీ "

"అబ్బే అది కాదు - నీ  పనంతా అయ్యాక వుండే ఖాళీగా వుండే సమయంలో ఏం చేస్తావు ?"

"ఏమయినా చేస్తే అది ఖాళీ ఎలా అవుతుంది?"

"అది కాదు బాబోయ్ - హాబీలు గట్రా ఏమన్నా ఉన్నాయా అని"

"నాకసలే బో.... ల్డన్ని హాబీలున్నాయి కానీ ఈ గట్రా అంటే ఏంటి?"

"మన తెలుగు ఎట్సెట్రా అనుకో - ఇంక ఎదురడక్క గబగబా నీ హాబీలేంటో చెప్పు"

"సరే... విను  .... నా హాబీలు ఇవీ :

కబుర్లు చెప్పుట - వింటే ఎవరికైనా - ఎవరూ లేకపోతే నాతో నేనే 
పాటలు పాడుట - వినడానికి ఎవరున్నా - ఎవరూ లేకపోతే నాకై నేనే 
సినిమాలు చూచుట -  వద్దని war చేసే మా వారికి చూపెట్టుట
జంతికలు నవులుట - నవలలు చదువుట 
నూజీళ్లు చప్పరించుట - పజిళ్లగళ్లు నింపుట 
ముగ్గులు వేయుట - రగ్గులు నేయుట-చూచుట 
ఫ్రెండ్షిప్పుచేయుట - వర్షిప్పు చేసిన చూచుట 
పెడర్థాలని న-స్మరించుట - గూడార్థాలని పరిష్కరించుట 
ఏదో చెయ్యాలనుకొనుట - ఆ ఏదో కాక ఇంకేదో చేయుట"

"బావుంది - బావుంది - అన్నీ అర్థమయ్యాయి - ఒక్ఖ గూడార్థం తప్ప"

"అర్థమయితే అది గూఢమెందుకవుతుంది? అది ఎలా మొదలెట్టాలో తెలీకే కదా - ఈ ఉపోద్ఘాతమంతా!"

"ఇదీ అర్థం కాలేదు"

"మరేం లేదు ! ఒక నెలో , నెలన్నర క్రితమో - అపర్ణతో అన్నానా?! - cryptoquip ఎలా చేయాలో చెప్తానని - ఈరోజు దాకా పడనేలేదు - ఇవాళ ఎలాగైనా అది పూర్తి చేద్దామని"

"బడాయి కాకపోతే - ఆ ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్పొచ్చుగా?"

"అదే నీతో లడాయి నాకు - పట్టుమని ఒక పావుగంట నిలకడగా మాట్లాడడానికి దొరకదు - ఇంక  cryptoquip కి టైమెక్కడ ?"

"సరే - మొదలెట్టు - నేనూ వింటాను"

"కింద ఒక రెండు ఉదాహరణలు ఇస్తున్నాను చూడు - మరి "

(1) 



(2)



"ఏమీ అర్థం కాలేదు - వీట్నేం చెయ్యాలి?"

"చూస్తూ కూర్చోవాలి - అవి నీకూ నాకూ కాదు. అసలీ cryptoquip ని ఎలా పరిష్కరించాలో నేను చూపించాక నీకు చేతైతే - అప్పుడు చెప్పాలి"

"సరే - ముందు చెప్పు మరి"

"కొంచెం ఇంగ్లీషు ఎక్కువ దొర్లుతుంది మరి"

"దొరలనీకు దొరలభాష 
 తెలుగులో బ్లాగూ - నువ్వు తెలుగులో బ్లాగూ 
తెలుగులోనే రాసుకోవా
తెలుగుదీ బ్లాగు - మన తెలుగుదీ బ్లాగు - 
ఇది దేనికి పేరడీ చెప్పుకో చూద్దాం!"

"నీ పేరడీలింక ఆపి ఒక అరగంట నా పద-గారడీ చూడు. అసలు cryptoquip అంటే ఏంటంటే ఒక పెద్ద వాక్యాన్ని ఒక రహస్య సంకేతంలా రాసి దానికొక అక్షరం మాత్రం సూచన (హింట్) గా ఇస్తారన్నమాట.

అంటే ఇలా :

JV  VCEEI  DHBVABPHB  SGBTHI  SGR  OHBTHR  JE  G  PJZJKGBI  PHRJQGZ  CEJK,  VAZNO  QACZR'TH  QGZZHR  SJP  QABDOPGE  NABPGE.

                                                          CLUE: E = N




ముందుగా అసలు ఏమేమి గమనించాలో చూద్దాం.
  1. అది ఎలాంటి వాక్యమో చూడాలి - simple vs. complex, statement vs. question etc.,
  2. విరామ చిహ్నాలు (punctuation marks)  ఎక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూడాలి.
  3. Apostrophe వుందా, వుంటే ఎక్కడ వుంది? 
  4. ఏకాక్షర పదాలు వున్నాయా (అంటే I , A  లాంటివి)?
  5. తరచుగా వాడే రెండక్షరాల పదాలు వున్నాయా? - వుంటే అవి వీటిలో ఒకటి అయి వుండొచ్చు - AN, AS, BE, DO, GO, HE, IN, IS, ME, NO, OF, ON, SO, TO.
  6. తరచుగా వాడే మూడక్షరాల  పదాలు వున్నాయా? - వుంటే అవి వీటిలో ఒకటి అయి వుండొచ్చు-THE, AND etc.,
  7. ఒకే అక్షరం రెండు సార్లు వచ్చే పదాలు వున్నాయా? 
  8. ఒక మాట:  ఈ Cryptoquip ఉదాహరణలన్నీ American English మీద ఆధారపడి వున్నాయి. అందుకని ఇలాంటి తేడాలు గుర్తుంచుకోవాలి: colour = color ; neighbour = neighbor ; speciality = specialty etc.,
ఇలాంటి కొన్ని ప్రాథమిక వాక్య / పద నిర్మాణ సూత్రాల ఆధారంగా ఇచ్చిన సంకేత వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

కింద బొమ్మలోని ఉదాహరణ వాక్యాన్ని వివరించడానికి వీలుగా ప్రతీ పదానికి కింద అంకెలు వేస్తున్నాను - చూడు - ఈ వాక్యంలో  మొత్తం 17 పదాలు వున్నాయి.





ఇచ్చిన ఆధారాన్ని బట్టి ఆ సంకేత వాక్యంలో E వున్న చోటల్లా N రాసుకోవాలి.
తర్వాత జాగ్రత్తగా చూడు - 13వ పదంలో రెండక్షరాల apostrpophe contraction వుంది.
ఇంగ్లీషులో రెండక్షరాల apostrophe కంట్రాక్షన్లు రెండే వున్నాయి:

అందులో ఒకటి -  ' RE = ARE
ఇంకొకటి  - ' VE = HAVE 

ఈ రూలు ప్రకారం : QACZR' TH లో H తప్పనిసరిగా E అయివుండాలి. 
ఇప్పుడు మన దగ్గర రెండు క్లూలు వున్నాయి:  
1. E = N 
2. H = E

కింద బొమ్మలో అదే రాసుకున్నాం.



ఈ ఉదాహరణ వాక్యం ఒక complex sentence - ఎందుకంటే ఇది 11 వ పదం (CEJK ) తర్వాత ఒక కామా (,) తో విడగొట్టబడిన రెండు భాగాలున్న ఒక పెద్ద వాక్యం.

వాక్యంలో మొదటి పదంలో రెండు అక్షరాలున్నాయి (JV ).
అది AS కావొచ్చు - లేదా IF అయ్యుండొచ్చు.
నేను ప్రస్తుతానికి అది IF అనుకుంటున్నాను.
(గమనిక: Cryptoquip మొదటిసారిగా పరిష్కరిస్తున్నప్పుడు పెన్సిల్ వాడితే అనుకున్నది తప్పు అయితే దిద్దుకునే అవకాశం ఉంటుంది.)

దీనితో మనకి ఇంకో రెండు అక్షరాలు దొరికాయి - ఇంతకు ముందు తెలిసిన రెండక్షరాలతో కలిపి మొత్తం నాలుగు అక్షరాలు తెలిసిపోయాయి. .

     3.  J  = I 
     4.  V = F

ఇవి కూడా రాసేసుకున్నాం.

ఇప్పుడు వాక్యంలోని రెండో పదం చూస్తే : VCEEI = F -NN - (V =F ; E = N అని మనకు తెలుసు కాబట్టి ). 
తెలిసిన అక్షరాలని బట్టి మిగిలిన ఖాళీలని FUNNY అని పూరించడం తేలిక - కదా!?
దీంతో ఇంకో రెండక్షరాలు వచ్చేశాయ్. 
5.  C  = U 
6.   I  = Y  
అవీ రాసేసుకుందాం - మరి కింది బొమ్మలోలా !



ఇంకిప్పుడేం దొరుకుతాయో చూద్దామా ?!
ఈ వాక్యంలో ఒక ఏకాక్షరి వుంది - 8 వ పదం - G.
అది I కాదు - ఎందుకంటే J = I  కాబట్టి.
ఇంక వున్న ఇంకో ఏకాక్షరి A.
ఇంకో అక్షరం కూడా దొరికిపోయింది.

7.  G  = A 

గబగబా G వున్న చోటల్లా A రాసేద్దాం మరి. 


ఇప్పుడు 11వ పదం కేసి ఒకసారి చూడు - CEJK = UNI -
అది UNIT ఏమో అనిపించట్లేదూ ?
ఇంకెందుకాలస్యం  - K వున్న చోటల్లా T  పెట్టేద్దాం.

(తాగే టీ గుర్తుకొచ్చిందా - మరి వెళ్లి ఓ కప్పు తెచ్చుకో - నీకొకటీ - నాక్కూడా ఒకటీ - ఈ వాక్యంలో ఎన్ని కావాలంటే అన్నిటికీ ఒక్కోటీ - 9 కోటీ, 11 కోటీ ).

8.  K  = T 



ఆగిపోకలాగ - ఆగే దేఖో !

13 వ మాట : QACZR ' TH  =  - - U - - ' - E
 నాకెందుకో ఈ వాక్య-వాలకం చూస్తుంటే 13 వ మాట COULD ' VE లేక WOULD ' VE అనిపిస్తోంది.
మొదటిది సందేహా-క్షరం కాబట్టి OULD ' V రాసేయనా?

QACZR ' TH = - OULD ' VE 

9.   A = O
10.  Z = L
11.  R = D
12. T = V 

ఇప్పుడు చూద్దాం - అమ్మో - ఒక్క పద-అక్కరకి  ఎన్ని అక్కరాలు దొరికిపోయాయో!


1. E = N 
2. H = E  
3.  J  = I  
4.  V = F  
5.  C  = U 
6.   I  = Y  
7.  G  = A 
8.  K  = T 
9.   A = O
10.  Z = L
11.  R = D
12. T = V 
8 వ మాట జాగ్రత్తగా చూడు - MILITARY లా వుంది కదూ !
PJZJKGBI = - ILITA -Y




అద్దీ !
13.  P  = M 
14.  B  =  R

తీసికెళ్లి పెట్టేశా - కింది బొమ్మలో !

బావుంది కదూ - ఒక్కొక్క అక్షరం మనకలా చిక్కిపోతుంటే - చిక్కుముడి వీడుతుంటే !
అందుకే మరి - నాకీ cryptoquip అంటే ఎప్పటికీ చిక్కిపోని ఇష్టం.




ఇప్పుడు 10 వ మాట (PHRJQGZ = MEDI -AL) - MEDICAL కాక ఇంకేమవుతుందంట?

15.  Q  = C  - అనేసుకున్నాం.

4 వ మాట SGBTHI = -ARVEY - సర్వే కి కుదరదు కదా - అందుకని ఓ ఇంగ్లీషాయన పేరు HARVEY అయివుండనోపునేమో ?




16. S  = H - హార్వేగారి పుణ్యమా అని !

3 వ మాట పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది నీకు?
అది పెద్ద PERFORMER అనిపించట్లేదూ?



అయితే ఇంకేం - రాసుకో మరి!

17.  D = P - కింది బొమ్మలో.

మిలిటరీ అంటున్నారు - 16 వ మాట CORPSMAN అవునేమో కదా !


అవును మరి - అప్పుడు O ఏమంటుంది మరి? - "ఓయస్"  అంటానంటుంది.

18.  O  = S

ఇంక 12 వ మాట FOLKS అనకపోతే  మన cryptoquip ఫోక్స్ ఒప్పుకోరు - చూసుకో మరి!


ఎన్ను ఎన్నిక ఇంక K-నే!
19.  N  = K  

హమ్మయ్య! 


JV  VCEEI  DHBVABPHB  SGBTHI  SGR  OHBTHR  JE  G  PJZJKGBI  PHRJQGZ  CEJK,  VAZNO  QACZR 'TH  QGZZHR  SJP  QABDOPGE  NABPGE.

                                                          CLUE: E = N 
IF  FUNNY  PERFORMER  HARVEY  HAD SERVED  IN  A  MILITARY  MEDICAL  UNIT,  FOLKS  COULD 'VE  CALLED  HIM  CORPSMAN  KORMAN.
1. E = N 
2. H = E  
3.  J  = I  
4.  V = F  
5.  C  = U 
6.   I  = Y  
7.  G  = A 
8.  K  = T 
9.   A = O
10.  Z = L
11.  R = D
12. T = V 
13.  P  = M 
14.  B  =  R 
15.  Q  = C
16. S  = H 
17.  D = P 
18.  O  = S  
19.  N  = K   



ఇంతకీ విషయమేంటంటే - HARVEY KORMAN అనే ఒక హాస్యనటుడు ఉండేవారట - ఆయన సైన్యంలో వైద్యబృందంలో పని చేస్తే ఆయన్ని CORPSMAN KORMAN అనేవారు కదా - అనే ఒక గూడార్థమిచ్చే వాక్యమిది.

అలాంటి చరిత్ర హింట్లు కూడా చాలా సహాయపడతాయి - కాకపోతే నాకు ముందు తెలీదనుకో - పూర్తిగా అన్ని అక్షరాలూ తెలిశాక కుతూహలంతో గూగిలిస్తే తెలిసిందది.

ఇంతకీ నచ్చిందా - cryptoquip?"

"నచ్చింది కానీ - అరగంట అని ఆరు-అరగంటలు కూర్చోపెట్టావు -  ఇంతకీ నా పేరడీ పాట ఏంటో చెప్పలేదు నువ్వు"

"అబ్బా ! ముందు పైన ఇచ్చిన రెండు ఉదాహరణల చిక్కుముడి నువ్వు విప్పు - నీ పేరడీ గుట్టు రట్టు చేస్తాను"

"అంతేనా?"

"ఇప్పటికింతే - ఈ గజిబిజి (Puzzle) లో జిగిబిగి  చూస్తూ గడిపేయ్ - అందాకా !"




3, డిసెంబర్ 2016, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 4 - ప్రసాదు మావయ్య-చెల్లాయత్త

ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము - అన్నది తెలుగు వ్యాకరణంలో ద్వంద్వ సమాసానికి వున్న నిర్వచనమైతే మా అమ్మ పుట్టింటి ద్వంద్వ సమాసం : ప్రసాదు మావయ్య-చెల్లాయత్త.

తన తర్వాత పుట్టిన ఐదుగురు చెల్లెళ్లకు పుట్టిన ఆడపిల్లలకు-మగపిల్లలకూ, ఆ పిల్లల్లకు పెళ్లిళ్ళై ఇంటికి వచ్చిన అల్లుళ్లకు-కోడళ్లకు, ఆ ఆడపిల్లల-అల్లుళ్ల-పిల్లలకు, ఆ మగపిల్లల-కోడళ్ల-పిల్లలకు, వారి వారి పిల్లలకూ, ఇంకా అదే వరసైన ఇంకెందరో పిల్లలకూ-వారి పిల్లలకూ - ఇలా వరసా-వయసూ తో సంబంధం లేకుండా అందరికీ మా  ప్రసాదు మావయ్య-చెల్లాయత్త  "ప్రసాదు మావయ్య-చెల్లాయత్తే"!

రాజమండ్రి నించి శివకోడు ఎప్పుడు వెళ్లినా - నాన్న హనుమంతరావుని రాజోల్లో కారు ఆపమని చెప్పి - క్రీం బిస్కెట్ పాకెట్లు,పాపిన్సు కొనేవారు -వెళ్లగానే ఎదురొస్తాడు ప్రసాద్ - వాడికిష్టం ఇవీ - అని.

మనిషెంత నిరాడంబరమో మనసంత నిర్మలం - ప్రసాదు మావయ్యకి.

లుంగీ-పొట్టి చేతుల చొక్కా , నోట్లో చుట్ట, చుట్టకి చివర "ఫిల్టర్" లా వాడే బాల్ పెన్ను క్యాపు, ఇంకొన్ని చుట్టలు-కొంచెం పొగాకు వుండే ఖాళీ కాంప్లాన్ డబ్బా - ఇవే మా ప్రసాదు మావయ్య accessories -

పొద్దున్న పది కాకుండానే భోజనం - సాయంత్రం ఆరున్నరకు రాత్రి భోజనం -
మధ్యలో చుట్ట కాల్చాలన్నా - ఎన్నింటికి కాల్చాలి - అది ఎంత పొడుగు కాలాలీ దానికీ ఒక టైం టేబుల్ -
మూడు పూటలా ఇన్ని అడుగులు - ఇంత  దూరం నడవాలీ - అని లెక్కలేసుకుని ఇంట్లోనే పెరట్లో చప్టా మీద ఒక వృత్తంలో తిరుగుతూ  చేసే నడక-వ్యాయామం -


ఇల్లు కదిలి బస్సెక్కి వూరు దాటినప్పుడు వేసుకునే ప్యాంటు-షర్టూ తప్ప తన ఇంట్లో తానే వున్నా, తన ఇంటికి ఎవరైనా వచ్చినా, తానెవరింటికైనా వెళ్లినా - అదే ఆహార్యం - అదే ఆహారం.

మధ్యాహ్నం తీరిక వేళల్లో కూర్చుని తనకై తాను తయారు చేసుకునే రెయిన్-గాజ్ లూ , బారోమీటర్లూ
తను ఎంతో అపురూపంగా అట్టలు వేసుకుని దాచుకునే అట్లాసులూ - రైల్వే టైం-టేబుళ్లూ
స్విచ్చుబోర్డుల మీద గుర్తుగా (లైటు-1, ఫ్యాన్-2, ట్యూబులైటు-3) అంటూ తాను వేసుకునే నెంబర్లు
ఎప్పుడయినా నీకేం కావాలీ ప్రసాద్ మావయ్యా  అంటే తనడిగే గ్లోబూ
కాలక్షేపానికి తనాడుకునే సుడోకు
ఏడుపదులు నిండిన ఈ వయసులో కూడా తనెక్కి తొక్కే సైకిలు
పెరట్లో నూతి దగ్గర తను నీళ్లు తోడి పోస్తే అక్కణ్ణుంచి ఇంట్లో వున్న డేగిసాలు, బాల్చీలు నిండేలా ఫైపులు పెట్టి తనే ఏర్పాటు చేసుకున్న water-supply-system
-వేసవి సెలవులకి ఎప్పుడు శివకోడు వెళ్లినా రోజు రోజూ ఒక సైన్స్ ప్రయోగమో - సరదా పాఠమో నాకు.

అవన్నీ చూసి "ప్రసాదు మామయ్యా - నువ్వు మెట్రిక్కు తర్వాత ఆపేయకుండా చదివుంటే పెద్ద సైంటిస్టువి అయ్యేవాడివి" అనే దాన్ని - ఇప్పటికీ అంటూ వుంటాను.

ముందొక మాటా -వెనకొక మాటా అనడం తెలియనితనం 
ఎవరినీ హేళనగా మాట్లాడడం కలలో కూడా చేయని సరళత 
ప్రతిదానికీ తనకు తానే ఆలోచించుకునే తర్కం
ఎవరేమన్నా వాద-ప్రతివాదాలు చేయని స్వభావం 
చెల్లెళ్ల - తమ్ముళ్ల పట్ల ఇంటికి పెద్దగా నిర్వర్తించిన భాద్యత
చుట్టూ వున్న పదిమందిలో మనం ఒకరుగా ఉండాలి తప్పితే - ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఉండకూడదని తనెప్పుడూ చెప్పే మాట
మావయ్య అంటే - माँ -भय्या అని తను చెప్పే తమాషా కబుర్లు
అరుగుమీద కూర్చుని తన బాల్య స్నేహితులైనఎదురింటి సత్తెంకాపు గారికొండయ్య-బాబ్జీలతో పంచుకునే లోకజ్ఞానపు విశేషాలు
- వెరసి మా ప్రసాద్ మావయ్య

శివకోడు పాత ఇంటిలో మండువా చుట్టూ వుండే స్తంభాల్లో ఒకదానిమీదో , చేతిలో వున్న అగ్గిపెట్టె మీదో, కూర్చున్న పడక్కుర్చీ చేతిమీదో - తన పాటకి వాయిద్యంగా ఊతమిచ్చే ఏదయినా సరే - దానిమీద దరువేస్తూ - మధ్య మధ్యలో - టుం టుం టుం - అని నోటితో కూడా మ్యూజిక్ వాయిస్తూ - నా మది నిన్ను పిలిచింది గానమై - వేణు గానమై - అంటూ తెలుగులో రఫీ పాడిన పాటో  - తూ ప్యార్ కా సాగర్ హై తేరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ - అని ఏ బల్ రాజ్ సహానీ-మన్నాడే  హిందీ పాటో  - అచ్చు మహమ్మద్ రఫీ లాగే పాడుతూ అలరించే మా ఇంటి మహమ్మద్ రఫీ.

అన్నట్లు పుట్టు-వ్యవసాయదారుడయిన మా ప్రసాదు మావయ్యఒక మూడు నెలలు ఉద్యోగం కూడా చేశాడు - మేము టంగుటూరులో వున్నప్పుడు - ఆ పక్కనే వున్న ఒక పల్లెటూరు - చిరుకూరుపాడులో. అప్పుడు నాక్కూడా వేసవి సెలవులవడంతో ఒక నెల నేనూ ప్రసాదు మావయ్య-చెల్లాయత్తతో ఆ వూళ్లో వున్నాను. 

 
ఓం నమశ్శివాయ .... 
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ .... 

ఫోన్ చేయగానే మూడుసార్లిలా శివపంచాక్షరి తాను చెప్తూ నాతో చెప్పిస్తూ - అదయ్యాకే కుశలప్రశ్నలూ, ఇంకేమయినా విశేషాలూ - మా ప్రసాద్ మావయ్యతో.

 ఇంక మా చెల్లాయత్త - 
గల గలా మాటలు - కిలకిలా నవ్వులు
పెద్దవాళ్లలో పెద్ద - చిన్నవాళ్లలో చిన్న
కొంతే వున్నా ఇంతేనా అనుకోకుండా
అదే ఎంతో అనుకునేంత తృప్తి 

మా అత్త చేసే  - వంకాయ కారం పెట్టిన కూర, అరటికాయ సాంబారు, కొబ్బరికాయ తియ్యపచ్చడి, దూట పెరుగుపచ్చడి - ఖండాంతరాల్లో వున్నా - అత్తని తలుచుకోగానే - ఆ రుచులన్నీ నాలుక మీద ఆడతాయి. 

చెల్లాయత్త అంటే -   తాగే కొద్దీ వూరే గంగాబొండపునీరులా ఎంత తలచుకున్నా తరగని  ఎన్నెన్ని జ్ఞాపకాలో -

వేసవి సెలవులకి వెళ్లిన మాతో పోటీ పడి ఇంటి వెనకాల పెరట్లో వున్ననేరేడు చెట్టు కింద ఏరుకొచ్చిన నేరేడు పళ్లు - వాటి పంపకాల్లో మాతో సమానంగా సరదా-దెబ్బలాటలు -

మా కోసం ఇంట్లో ముగ్గేసిన ఈత పళ్లు, తంపటేసిన తేగలు, కొబ్బరిపూలు, బుర్రగుంజులు, తాటిముంజెలు-

సాయంకాలాల్లో కొన్న మల్లెమొగ్గలు కనకాంబరాలు, దవనం వేసి మాలలు కట్టాక - "నాది మీ అందరి కన్నా పెద్ద జడ - పెద్ద దండ నాకే" - అని మమ్మల్ని ఉడికించి మోకాళ్ల దాకా వున్న జడలో పూలు పెట్టుకుని - మా పిల్లలందర్నీ రాజోలు గోదారి గట్టుకి తీసుకెళ్లి చీకటి పడేదాకా అక్కడ చెప్పుకున్న కబుర్లు -

గోరింటాకు దూసి -రుబ్బి మాచేతులకి పెట్టి - మా పండిన చేతులకి కడిగిన వెంటనే కొబ్బరినూనె రాసి  - ఆ ఎరుపు మెరుపుని నింపుకున్న కళ్లు -


మా అందరి పెళ్లిళ్లలో మామిడి తోరణం కట్టి, విఘ్నేశ్వరుడిని పెట్టి, రోటికి పసుపుకొమ్ము కట్టి పసుపు దంచడం  దగ్గర్నుంచీ - పెళ్లికూతురి అలంకరణ, జడ కుట్టడం, పారాణి పెట్టడం, అప్పగింతల్లో మా అమ్మతో సమానంగా కంటనీరు పెట్టడం -

తొలిచూలు - పుట్టింట గాజులు పెట్టించినప్పుడు పక్కనే వుండి - గాజులతనికి ఏ రంగు గాజు తర్వాత ఏ రంగు వేస్తే  బాగుంటుందో  - మణికట్టు నించి మోచేతి దాకా సైజుల వారీగా రంగురంగుల గాజులు ఎంపిక చేసి-ఓటు గాజు  లేకుండా చూసి వేయించడం-

మాకు పిల్లలు పుట్టినప్పుడు - పదకొండు రోజులు హాస్పిటల్లో వుండి ఇంటికి వచ్చిన తల్లీ-పిల్లలకు ఇంటికి రాగానే ఎర్ర నీళ్లు దిష్టి తీయడం, మా పిల్లల బొడ్డు-తాయెత్తులు చేయించడం, పెళ్లినాటి మధుపర్కం ఉయ్యాలగా వేసి ఊపడం, చాదు బొట్టు చేయడం, ఆముదం-కర్పూరం వేసి  కాటుక పట్టడం -

ఆ తర్వాత ఎప్పుడు నేను పుట్టింటికి ఆడపడుచులా వెళ్లినా అమ్మ నాకోసం కొన్న చీరలన్నిటినీ పదిసార్లు మడత విప్పీ-వేసి చూస్తూ అన్నిటికీ పసుపు-గౌర్లు పెట్టి ఆ చీరల్లో నేనెంత బావుంటానో - మా అమ్మతో చెప్పి - అమ్మ తర్వాత అమ్మలా మురిసిపోవడం -

మా చెల్లాయత్త గురించి మాటల్లో చెప్పడం ఒక రకంగా ఆవిడకి మామీదున్న అభిమానాన్ని పలుచన చేయడమే అవుతుంది.

మా చెల్లాయత్త మా అమ్మకి అండా-దండా.

చెల్లాయత్త పెళ్లై మా అమ్మమ్మ ఇంటికి కోడలుగా వచ్చినప్పటినుంచీ దాదాపుగా ఒకే ఈడు వాళ్ళైన అమ్మా- చెల్లాయత్తా కలిసి-మెలిసి పెరిగారు.

ఈరోజుకీ - అరవై దాటిన వయసులో కూడా మనసులో బెంగగా అనిపించినప్పుడు మా అమ్మ శివకోడు వెళ్తుంది - వదినగారి దగ్గర మనసు తేలికవుతుందని.

మా అమ్మే కాదు - మా అమ్మమ్మ కడుపున పుట్టిన ఐదుగురు ఆడపడుచులూ ఈ రోజుకీ ఏడాదికి ఒకటికి రెండు సార్లు శివకోడు వెళ్తున్నారు - వెళ్లాలి  అనుకుంటున్నారు అంటే అది మాచెల్లాయత్త కలుపుగోలుతనమే.

మా ప్రసాదు మావయ్య - చెల్లాయత్త - ఎప్పుడో 1968లో పెళ్లయ్యాక ఇద్దరుగా మొదలు పెట్టి - ఇద్దరుగానే అన్ని భాద్యతలూ సాగించి - ఇప్పటికీ ఇద్దరుగానే వున్నారు - ఇష్టపడి కట్టుకున్న తమ బొమ్మరింటిలో.

వాళ్లిద్దరికీ  - వాళ్లే మడులు కట్టి - ఇంటి వెనకాల వేసుకున్నమొల్ల, మల్లె, జాజి, మందార, బంతి, చామంతి, మరువం, దవనం, గోరింటాకు - ఆడ పిల్లలైతే - పెరట్లో పెంచుకున్న కొబ్బరి చెట్లు కాపు కాసి చేతికంది వచ్చే కొడుకులు. 

తనతో పుట్టిన కవల పిల్ల లక్ష్మి దొడ్డతో కలిపి
తన తర్వాత పుట్టిన ఏడుగురికి తండ్రి తర్వాత తండ్రై -
తమ్ముళ్లకి, ఇంటి ఆడపడుచులకి పెళ్లిళ్లు, పురుళ్లు-పుణ్యాలు  జరిపించిన -
మా ప్రసాదు మామయ్య చెల్లాయత్తతో  వున్న మా శివకోడు ఇల్లు  -
ఈ రోజుకీ మా దొడ్డలకి-పిన్నులకి, మా అమ్మకి
అమ్మ-లేని-పుట్టిల్లు కాదు -
అమ్మ-లేదనిపించని-పుట్టిల్లు.