22, ఆగస్టు 2021, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 25 - కవలపాటలు - సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!

 ఓ నాడు - ఓ పాట  
ఇలలో... 
చలచల్లటి చినుకులా   
చెక్కిలి మీద సనసన్నగ జారి  
తడిపెళ్ళింది
మూసిన కనుల చాటున 
కలల రంగుల నేసింది   
ఆ చలువ - కొలవలేని చలిమి!
అది తా వలచిందే!

ఓ నాటి - ఆ పాట 
కలలో ... 
వెచవెచ్చని ఊపిరిగా 
కనురెప్పల మీద అలనల్లన తాకి 
తడిమెళ్ళింది 
మోసిన కలల మాటున 
కనుల వెలుగు పూసింది 
ఆ వేడిమి - విడువలేని పోడిమి!
ఇది కావలసిందే!

*******
*******

        ఒక్కోసారి - విన్నపాటునే - విన్న పాటొకటి 
        విడవబోవని రాగమై చుట్టుకుంటుంది. 
        ఆ రాగమే - ఇంకెప్పుడో ఇంకో పాటగా వినబడి 
        వెదకబోవని తీగగా సాగి పట్టుకుంటుంది 
    
        ఇహ అప్పట్నుంచి - 
        ఈ పాట కదిలితే ఆ పాటా - మెదులుతూనే వుంటుంది
        ఆ పాట మెదిలితే ఈ పాటా - కదులుతూనే వుంటుంది
        ఒకదానితో కలిసి మరొకటి - మెదులుతూనే వుంటుంది
        ఒకదాని తర్వాత ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
        ఒకటి మొదలిడి సాగిన పూట మరొకటి - మెదులుతూనే వుంటుంది
        ఒకటి ముగిసి ఆగిన చోట ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
        ఈ పాట - మెదులుతూనే వుంటుంది 
        ఆ పాట - కదులుతూనే వుంటుంది 

*******
*******

    చిన్నప్పుడు ఆ పాట మొట్టమొదటిసారిగా విన్నది - మాటలు పలక మీద రాసుకుని చూసుకుంటూ, కనబడ్డ కాయితాల మీదున్న మాటల్ని కూడబలుక్కుని చదువుకుంటున్న రోజుల్లో. 

    విన్నప్పుడు పాట లోని మాటలు అర్థమయేంత భాష తెలీదు కానీ పాటని మెచ్చడానికి భాష అవసరమనిపించని వయసు కాబట్టి - వినీ వినగానే పాట నచ్చేసింది. ఇహప్పట్నుంచీ రేడియోలో ఆ పాట ఎప్పుడు వినిపించినా - నచ్చిన చుట్టమేదో చెవుల ముంగిటి లోకి వచ్చినట్టనిపించేది. 

    చాలా ఏళ్ళ తర్వాత - ఐదవ తరగతి పూర్తయ్యి - ఆ వేసవి సెలవుల్లో హైద్రాబాదు ప్రభావతి దొడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు - అక్కడ బ్లాక్&వైట్ డయనోరా టీవీలో అసలుకి రంగురంగుల సినిమా అయుండీ నలుపు-తెలుపుల్లో కనిపించిన హిందీ సినిమా "రజనీగంధా" చూశాను. అప్పటికి హిందీ అక్షరాల స్థాయి లోనే వున్న నాకు ఆ సినిమాలో అర్థమయింది ఒకటే - రజనీగంధా అంటే - నాకు తెలిసిన - మంచి వాసనొచ్చే - తెలతెల్లని లిల్లీ పూలని! 

    అన్నట్టు లిల్లీ పూల గురించి ఇంకో ఇష్టమైన జ్ఞాపకం. కాకినాడలో మేము అద్దెకున్న సుబ్బారావు మాస్టారి ఇంటి ముందు నాయకర్ గారి మేడ వుండేది. ఆ ఇంట్లో పిల్లలు సపనా, సుమన, శ్రీనివాసులు నాకు స్నేహితులు. వేసవి సెలవుల మధ్యాహ్నాలు వాళ్ళింట్లోనో పాడుకుంటూనో , సాయంత్రాలు మా ఇంటి డాబా మీద ఆడుకుంటూనో మహ జోరుగా సాగిపోయేవి. ఆ నాయకర్ల ఇంట్లో చిన్నచిన్న కూజాల్లో మంచినీళ్ళలో లిల్లీపూలు వేసేవారు. మధ్యాహ్నపుటెండపూట ఆటపాటల్లో అలుపు తీరడానికి ఆగి - ఓ గుక్క ఆ లిల్లీపూల నీళ్ళు తాగుతుంటే - గొంతు లోకి చలచల్లగా జారిన ఒక పరిమళభరితమైన రుచి ఇప్పటికీ నాకు గుర్తే! 

    లిల్లీ పూల కబుర్లు ఇల్లిక్కడ ఆపి  - మళ్ళీ వెనక్కి మళ్ళి ఆ హిందీ సినిమా దగ్గరకెళ్తే ...రజనీగంధా సినిమా చూస్తూ వుండగా, వుండగా - ఓ టాక్సీలో హీరోయిన్ను, ఇంకొకతను ఎక్కి వెళ్తుండగా  - ఓ పాట మొదలవుతుంది. వాళ్ళు టాక్సీలో వెళ్తున్నంత సేపూ ఆ పాట వస్తూనే వుంటుంది. ఆ పాట గురించిన రెండు తమాషా జ్ఞాపకాలు ఏంటంటే... 

    ఒకటి - ఆ పాట అచ్చు నాకు అంతకు ముందు నచ్చిన తెలుగు పాటలా ఉండడం. 

    రెండో తమాషా విషయమేంటంటే... అదే మొదటి సారేమో నేను హైద్రాబాదు లాంటి పెద్ద సిటీకి వెళ్ళడం - అక్కడ టీవీలో సినిమా - అందులోనూ హిందీ సినిమా చూడడం. 

    ఆ పాట చూసింతర్వాత నేనేమనుకున్నానంటే - హైద్రాబాదు లాంటి ఊళ్ళలో మనం ఏదన్నా టాక్సీ ఎక్కితే అలా ఎక్కడో బ్యాక్-గ్రౌండులో మ్యూజిక్కూ, దాంతోపాటే హిందీ పాటలొస్తాయని. 

    అది సినిమాలో పాట అని నాకు తట్టనేలేదు. కాకపోతే అప్పుడు ఆటోలు, రిక్షాలు తప్ప టాక్సీ ఎక్కలేదు కాబట్టి - అలా నా వెనకాలే పాట పరిగెడితే వినే అవకాశం రాలేదని బోల్డు దిగులుగా అనిపించింది కూడా. 

    ఇప్పటికీ ఆ రజనీగంధా సినిమా పాట చూస్తే ఆ చిన్ననాటి అమాయకపు తలపు గురుతుకొచ్చి మురిపిస్తుంటుంది. 

 *******
*******
    
    ముందుగా మొదట విన్న పాట - తెలుగు పాట - "చైర్మన్ చలమయ్య " సినిమా లోది. ఆ పాట "నయనాలు కలిసె తొలిసారి...". సినిమాలో ఆ పాటకి ఆంధ్రా-దిలీప్ కుమార్ అని పేరెన్నిక గన్న చలం, రివాల్వర్ రాణిగా గన్నులు పేల్చిన విజయలలిత - వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా పాటలకి ఆటపట్టైన మైసూర్ బృందావన్ గార్డెన్సులో పరుగులు పెడుతూ ఆడుకున్నారని, పాడుకున్నారని మొన్ననే యూట్యూబ్ చెప్పింది. 

    ఈ పాట వివరాలు వెతుకుతుంటే దొరికిన వివరాల్లో - నాకు - మెరుపుల్లా బోల్డు తమాషాలు కనిపించాయి. 

    అందులో మొట్టమొదటిది - ముఖ్యమైనది ఏంటంటే - తెలుగులో ఆరుద్ర రాసిన పాటకి సంగీతం కట్టినవారు సలిల్ చౌధరి. 

    ఆయన ఇదే వరసలో ఒక హిందీ పాట (ముఖేష్), ముగ్గురు పాడిన రెండు బెంగాలీ పాటలు (పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ విడివిడిగా పాడిన ఒక పాట,  విడిగా గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో పాట), వీటన్నితో పాటు ఇద్దరు (బాలు, సుశీల) పాడిన ఒక తెలుగు పాట  - వెరసి నాలుగు పాటలకి ఒకే ట్యూన్ వాడారు. 

    పై లెక్క గజిబిజిగా వుంది కదా?! అదే నా ఈ బ్లాగు శీర్షికకి మూలం, ఆధారం - వెరసి మూలాధారం. దాని లెక్క తేలుస్తా - కొంచెం ఓపిక పట్టండి మరి!

    ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు పాట గురించి ఓ పుంజీడు కబుర్లు. తెలుగు పాటలో మొదటి చరణంలో బృందావన్ గార్డెన్స్ కనిపిస్తే, రెండో చరణంలో కృష్ణరాజసాగర్ డామ్ దగ్గర పాలవెల్లువలా పొంగుతున్న కావేరీ నదీమతల్లి చిందులేస్తూ కనిపిస్తుంది. 

    ఇక పాటలో కనిపించే చెట్లూ, పూలూ, దూది మబ్బులూ, నీటి తుంపర్లూ, డామ్ పక్కనున్న మెట్లూ, హీరో-హీరోయిన్నుల క్లోజప్పులో పెట్టిన తళుకుబెళుకుల కెమెరా-ఫిల్టర్లూ - ఇవన్నీ కూడా ఒక పెద్ద visual bonus!

    ఈ పాటలో పల్లవిలో మొదటి వాక్యం పాడినప్పుడు - ఎస్పీ బాలు, సుశీల - ఇద్దరూ కూడా ఆ ఎత్తుగడలో - బెంగాలీ సంగీత దర్శకుడు సలిల్ చౌధరి ఎలా పాడి చూపించారో - అచ్చు అల్లాగే తెలుగుని పట్టిపట్టి పాడారేమో అనిపిస్తుంది నాకు. అయినా అది కూడా పాటకి ఒక అందాన్నిచ్చింది. పాట మధ్యలో వినిపించే "లలల్లాల్లా, అహహా, ఎహెహే" లాంటి హమ్మింగులు కూడా కొత్తగా వినిపిస్తాయి. 

    బాలబాలుడు "తలపే తరంగాలూరి..." అనంటే, గానకోయిల్సుశీలమ్మ "తలపే తరంగాలూరే..."అని పాడుతుంది. 

    నేను చూసి మురిసిన ఆ వింతలూ, విశేషాలూ మీరూ కని, విని ఆనందించేయండి మరి!

"నయనాలు కలిసె తొలిసారి" పాటకి యూట్యూబ్ లింక్Chairman Chalamayya Movie || Nayanaalu Kalise Video Song || Chalam, Vijaya Lalitha || Shalimarcinema - YouTube




నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి... 
పులకించె మేను ప్రతిసారి!

నా లోనా - నీ పేరే - పాడేనూ ... రాగాలూ
నా లోనా - .నీ రూపే  - చేసేనూ... చిత్రాలూ 
మదిలో - ఏదో - పదే పదే - ధ్వనించే!
మమతల తోటలలోనా 
తొలి వలపుల పూవులు పూచే!

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి... 
పులకించె మేను ప్రతిసారి!

నీలాలా - మేఘాలా - నీవేమో...  ఎగిరేవూ 
దూరానా - తీరానా - .నీవేమో...  నిలచేవూ
కలలే - ఇదే - ఇలా ఇలా - నిజమాయే!
పరువము బంధం వేసే
మన ప్రణయము బాసలు చేసే! 

నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!



 *******
*******

    ఇక ఇప్పుడు తెలుగు పాటకి కవల పాటైన హిందీ పాట గురించి - ఓ నాలుగు కబుర్లు. 

    హిందీ సినిమా "రజనీగంధా" లో  "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటని రాసినవారు యోగేష్ గౌర్. 

    సంగీతం సలిల్ చౌధరి. 

    పడిశపు-గొంతుతో పాడినట్టున్నా - ముఖేష్ పాడిన ఈ పసిడి పాట soothing గా అనిపిస్తుంది. 

    పాటలో కనిపించేవారు - నీలంచీర కట్టుకున్న విద్యా సిన్హా, గడ్డంజుట్టు-సిగరెట్టు-సహిత-దినేష్ ఠాకుర్, మధ్యలో ఓ రెండు నిముషాలు మెరుపులా మెరిసే అన్‌మోల్-అమోల్ పాలేకర్. వీళ్ళే కాకుండా పాట మొదలైన దగ్గర్నుంచి కనిపించే పచ్చకప్పు-నల్లటాక్సీ. 

    ఈ పాటలో నాకు నచ్చేవి ఓ మోస్తరు జాబితానే వుంది. 

    విద్యాసిన్హా కట్టుకున్న ప్రకాశవంతమైన తెల్లపూల నీలం రంగు చీర, అల్లుకున్న జడ, పెట్టుకున్న నల్లద్దాల కళ్ళజోడు బావుంటాయి. 

    దినేష్ ఠాకుర్ తొడుక్కున్న నీలం ముగ్గుల తెల్లచొక్కా కూడా బావుంటుంది విద్యాసిన్హా చీరకి మాచింగ్‌లా. 

    టాక్సీ కిటికీల్లోంచి  కనిపించే ఆ నాటి బొంబాయి నగరపు డబుల్-డెకర్ బస్సులు, ఒకదానిమీద ఒకటిగా పేర్చినట్టున్న అపార్టుమెంట్లు, నెత్తి మీద మూటలు మోస్తూ హడావిడిగా పరిగెడుతున్న టాక్సీలు, మనుషులు - ఇదింకో visual bonus!

     "రాహోం మే ..." అన్న చోట సాగుతున్న దారిని చూడమన్నట్టుగా కారు కిటికీ అద్దం మీద కనిపించే విద్యా సిన్హా చూపుడు వేలు ఆవిడ అనుకోకుండా పెట్టిందో, దర్శకుడు బసు ఛటర్జీ చెప్తే కావాలని పెట్టిందో కానీ - ఆ చేతి భంగిమ నాకు చూడడానికి బావుంటుంది. 

    "జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే" అన్న వాక్యం దగ్గర గాలికి ఎగిరెగిరి పడుతున్న చీరకొంగు పాటకి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. భలే!

    "జానూ న -జానూ న" అన్న దగ్గర తెల్లచీరలో - ఎఱ్ఱ రిబ్బన్లతో రెండు జళ్ళ-సీతలా కనిపించే బొద్దు-విద్య ముద్దుగా వుంటుంది. అక్కడే గడ్డం లేని దినేష్ ఠాకుర్ కూడా మబ్బు కమ్మని చంద్రుళ్ళా మెరుస్తాడు ఓ క్షణం పాటు. 

    మరి - ఈ పాటని కూడా చూస్తూ వినేయండి!

     "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటకి యూట్యూబ్ లింక్Kaii Baar Yun Bhi Dekha Hai - Rajnigandha Song - Vidya Sinha - Amol Palekar - Mukesh - Sad Song - YouTube






కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

రాహోం మే - రాహోం మే
జీవన్ కీ - రాహోం మే
జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే
కౌన్ సా ఫూల్ చురాకే - రఖ్ లూ మన్ మే సజాకే!

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

జానూ న  - జానూ న
ఉల్‌ఝన్ యే - జానూ న
సుల్‌ఝావూ కైసే - కుఛ్ - సమఝ్ న పావూ
కిస్‌కో మీత్ బనావూ - కిస్‌కీ ప్రీత్ భులావూ

కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై

అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై

*******
*******


    ఏ పాట రాసే ముందైనా ఆ పాట గురించి సరైన వివరాలు రాద్దామని గూగుల్ చేస్తుంటాను. ఈసారి ఈ హిందీ-తెలుగు కవల పాటల గురించి రాస్తూ సలిల్ చౌధరి గురించి తెలుసుకుందామని వెతికితే ఈ రెండు పాటలకి తోడు ఇంకో మూడు బెంగాలీ పాటలు వున్నాయని తెలిసింది. 

    అవి కూడా యూట్యూబులో వెతికి పట్టుకున్నా. 

    ఒకటి - పింటూ భట్టాచార్య పాడిన బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Chalte Chalte Pintu Bhattacharya - YouTube




రెండోది - లతా మంగేష్కర్ పాడిన అదే బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Cholte Cholte Theme Gechhi | Abaak Rater Tara | Lata Mangeshkar | Lyrical - YouTube



    మూడోది గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో బెంగాలీ పాట "కొతొబార్ చొండో బొద్‌లాబే...": Kotobar Chhondo Bodlabey - YouTube    




*******
*******



    ఇప్పుడు ఈ పాటల గురించిన నాదైన పొడుపుకథ నేనే విప్పుతా!

"సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!"

    అంత కన్నా ముందు ఇంకొక్క చిన్నమాట. 

    "సలిల్ చౌధరి" లో సలిల్ అన్న పేరు ఎంత సలలితంగా అనిపిస్తుందో నాకు. సలిల్ అంటే నీరు కదా! ఆ పేరూ అంతే చల్లగా ధ్వనిస్తుంది. 

    ఈ పాటల్లో నాకు తట్టిన కొన్ని అంకెలు, లెక్కలు, లాజిక్కులు కూడా చెప్పేస్తా!

    6 - 5 - 4 - 3 - 2 - 1.... 

    హిందీ, బెంగాలీ భాషల్లో విడివిడిగా ఏకగళగీతంగా, తెలుగులో కలివిడిగా యుగళగీతంగా పాడిన వారు ఆరుగురు (6) - ముఖేష్, పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్, గౌతమ్ దాస్‌గుప్తా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల. 

    ఇందులో అబ్బాయిలు నలుగురు (6), (2) . 

    పైన చెప్పుకున్నవి మొత్తం ఐదు పాటలు (5) - ఒక తెలుగు (1), ఒక హిందీ(1), మూడు బెంగాలీ(3). 

    కానీ సరిగ్గా చూస్తే అవి నాలుగే (4) - ఎందుకంటే బెంగాలీ పాటలు లెక్కకి మూడైనా - అందులో ఒక పాట రెండు సార్లు లెక్కకొచ్చింది. "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి" పాటని పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ ఇద్దరూ విడివిడిగా పాడారు. ఇంకో పాట గౌతమ్ దాస్‌గుప్తాది. అలా బెంగాలీ పాటలు రెండయ్యాయి. (2). 

    అన్నిటికీ ఒక్కరే సంగీత దర్శకులు - సలిల్ చౌధరి (1). 

    నేను మొదట అనుకున్నది హిందీ-తెలుగు కవల పాటలే (2). కానీ తీరా చూస్తే ఐదు (5) పాటలున్నాయేమో అనిపించే నాలుగు (4) పాటలు మాత్రమే! 

    అందుకే అనుకున్నా "సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!" అని. 

    
*******
*******

    అవండీ ఇవాళ్టి పాటల కబుర్లూ, పాటల మాటున పొడుపు కథలూ, ఆ పొడుపు కథల విడుపు కబుర్లూ... 

~ పాటల భైరవి 

16, ఆగస్టు 2021, సోమవారం

లెట్స్ గో లెగో - 2 - ఫ్రీ నింజా కబుర్లు

ఇంతకు ముందు చెప్పిన కబుర్లు: లెట్స్ గో లెగో - 1 - తాజా తాజ్‌ కబుర్లు


మోగే పాటలు 
పెదవుల మూగే పాటలు 
పజిళ్ళ గళ్ళు
పుస్తకాల పుటలు 
నా రోజువారి కాలక్షేపాలు 

    వీటన్నిటితో పాటు ఇంకొక్క ఇష్టమైన వ్యసనం, వ్యాపకం - లెగో బిల్డింగ్. 

*******
*******

    అదెలా మొదలయ్యిందంటే... 

    చిన్నప్పుడెప్పుడో వేసవి సెలవుల్లో హైద్రాబాదు వెళ్ళినప్పుడు - ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు - అక్కడ చూశాను - రంగురంగుల ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్, వాటితో చేసిన రకరకాల కట్టడాలు. 

    అప్పుడు చూసిన ఆ ఎరుపు, పసుపు, నీలం రంగులు కళ్ళలో కలలుగా కనిపిస్తూనే వుండేవి చాలా ఏళ్ళ పాటు. 

    ఆ తర్వాత - పెరిగి పెద్దై, చదువువై, ప్రేమై, పెళ్లై, తల్లై, వలసై - ఇన్నైన తర్వాత - అమెరికా వచ్చాము. 

    వచ్చాక అవసరం కొద్దీ ఓ కారు కొనుక్కున్నాము. కారంటూ కొన్నాక అది నడవడానికి గ్యాస్ కావాలి కదా! గ్యాస్ అంటే కారు టైర్లలో కొట్టే గాలి కాదు - కారు ట్యాంకులో పోసే గాసోలిన్ అనబడే పెట్రోలుకి ముద్దుపేరు. 

*******
*******

    అబ్బబ్బా! లెగోలు అంటుంది... రంగుల కలలు అంటుంది. అంతవరకు బాగానే వుంది. ఇంకా ఏవో ఊరించే రంగుల కబుర్లో, బొమ్మల కబుర్లో చెప్తుందనుకుంటే కారు-గ్యాసు అంటూ గాలికబుర్లేవో చెప్తోంది అని మాచెడ్డ చిరాకొచ్చేస్తోంది కదా! 

    బాగానే వుంది!

    అనగనగా...  అని మొదలెట్టేసి సరాసరి కథలోకెళ్ళిపోతే బోల్డన్ని కబుర్లెలా వస్తాయి మరీ?

    సరే! కార్లో గ్యాస్ కోసమని గ్యాస్-స్టేషన్‌కి వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళినపుడు ఒకసారి తినడానికి ఏవో చిప్స్ కొనుక్కుందామని గ్యాస్-స్టేషన్‌ లోపలికి వెళ్ళాం - మేం ముగ్గురం - నేను, నాతో పాటు నా చేయి పట్టుకున్న బుజ్జిగాడు, మా ఇద్దరితో పాటు మాక్కావాల్సినవి కొనిపెట్టడానికి బద్రి. 

    లోపలికి వెళ్ళీవెళ్ళగానే  - నాకూ, బుజ్జిగాడికి - అక్కడ రంగురంగుల ప్లాస్టిక్ సంచీలో వున్న మినీ-లెగో బ్లాక్స్ కనిపించాయి. అవి ఒక చిన్న మోటార్ బైక్ చేయడానికి సరిపోయేటన్ని. ఆ సంచీ మీద వేసిన బొమ్మలో బుల్లి హెల్మెట్ పెట్టుకున్న ఒక చిన్న లెగో-మాన్ కూడా ఉన్నాడు. వాడికో సూట్కేస్ కూడా ఉంది. 

    అది చూసీ చూడగానే వెలిగిన మా కళ్ళ మెరుపులకి చుట్టుపక్కలున్న అందరికీ కొన్ని సెకన్ల పాటు ఖచ్చితంగా కళ్ళు మిరుమిట్లు గొలిపి వుంటాయి. కాకపోతే మా మెరుపులూ, వెలుగులూ బద్రికి బాగానే అలవాటు కాబట్టి - మా చూపులెటున్నాయో ఇట్టే కనిపెట్టేసి ఆ లెగో-బ్లాక్సుని మాకు కొనిపెట్టేశారు. 

    అప్పట్నుంచీ ఇంకెప్పుడు ఆ గ్యాస్-స్టేషన్‌కి వెళ్ళినా ఒక మినీ-లెగో సెట్ తెచ్చుకునేవాళ్ళం. నెమ్మది నెమ్మదిగా మా లెగో-కలెక్షన్ పెరిగింది. 

    ఆ రోజుల్లో ToysRUs అని ఒక పెద్ద బొమ్మల అంగడి ఉండేది. నెలలో ఒకసారన్నా అక్కడికి వెళ్ళి బోల్డంత సేపు బొమ్మలన్నీ చూసి బుజ్జిగాడికో బొమ్మో, బోర్డుగేమో కొనుక్కుని వస్తూ ఉండేవాళ్ళం.

    ఓసారి వెళ్ళినప్పుడు అక్కడ ఐదొందల లెగో బ్లాక్స్  వున్న ఒక ఎఱ్ఱడబ్బా కనిపించింది. ఈసారి మళ్ళీ మా కళ్ళు మెరిశాయి - ఆ మెరుపులకి షాపులో ఉన్న లైట్లన్నీ ఓ సారి ఆరి-వెలిగాయి. మా చేతుల్లోకి ఆ లెగో బ్లాకుల ఎఱ్ఱడబ్బా వచ్చి వాలింది. 

    అదిగో... అక్కడ...  అలా... మొదలు లెగోలతో నా సావాసం. 

*******
*******

    ఆ తర్వాత కొన్నాళ్ళకి అన్నజింకకి తోడుగా బుజ్జిజింక కూడా పుట్టేశాడు. ఓ ఏడాదిన్నరలో బుడిబుడి అడుగులతో అన్నజింక వెనకాలే బుజ్జిజింక కూడా వీధికి అటుగా వున్న అన్న ఫ్రెండు జాష్ ఇంటికి వెళ్తుండేవాడు. 

    ఓ రోజు జాష్ వాళ్ళింటికి వెళ్ళొచ్చినపుడు - అక్కడ వాళ్ళింట్లో చూసిన లెగో కలెక్షన్ గురించి పిల్లలు చెప్పింది విన్నాక లెగో-బిల్డింగ్ ఒక మంచి హాబీ అవుతుందని అనిపించింది. 

    బుజ్జిజింకకి మూడేళ్ళప్పుడు అందరం ఇండియా వెళ్ళాం. అప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో వాడి కోసం మొట్టమొదటి లెగో  - ఒక బుల్లి ఫైర్-ట్రక్ కొన్నాను. 

    ఇక అప్పట్నుంచి ఇంట్లో ఎవరి పుట్టిన రోజైనా, ఏ పండగొచ్చినా బుజ్జిజింకకి ఒక లెగో కొనాల్సిందే. వాడి పుట్టినరోజుకి తప్పకుండా ఒక పెద్ద లెగోసెట్ కొనేవాళ్ళం. 

    ఏదైనా కొత్త లెగో సెట్ కొన్నప్పుడు బుజ్జిజింక దాన్ని build చేస్తున్నప్పుడు - నేను వాడి పక్కనే కూర్చుని - pieces అందిస్తూ వుండేదాన్ని. 

    అసలు మా లెగో కలెక్షన్ ఎలా పెరిగి పెద్దదయిందో - దానికి సుస్మిత, వేనెట్ చేర్చిన సెట్ల కబుర్లు, కొన్ని సెట్ల కోసం లెగో వాళ్ళని నేను చేసిన  ఎమోషనల్ బ్లాక్‌మెయిళ్ళ కబుర్లు - ఇలాంటివెన్నో  - ఇంకోసారి చెప్తాను. 

    అవన్నీ చెప్తూ వుంటే ఇప్పుడు చెబ్దామనుకున్న కబుర్లు బోల్డుబోల్డయిపోతాయి మరి!


*******
*******

    2008 నుంచి 2017 వరకు మా లెగోత్సాహం అప్రతిహతంగా సాగింది. 

    అప్పటికి బుజ్జిజింక ఏడవ తరగతి లోకి వచ్చాక - అంతటి బుజ్జిగాడూ తను పెద్దైపోయాననుకున్నాడో ఏమో బుల్లిబుల్లి లెగోలు వాడి కంటికి ఆనడం మానేశాయ్. వాటిని కొనమని అడగడం మానేశాడు. 

    వాడైతే అడగట్లేదు కానీ నాకు అప్పుడే లెగోల మీద ఇష్టం ఇంకా పెరగడం మొదలైంది. 

    మరప్పుడు కొత్త లెగోలు కొనాలంటే ఎలా? 

    ఇంటికి వచ్చే Lego Catalog లో నాకు నచ్చిన సెట్స్‌ని బుజ్జిజింకకి చూపించి "ఇది కొందాంరా!" అనడిగితే ఓ సారి దాని కేసి చూసి "నో' అనేసి వెళ్ళిపోయేవాడు. 

    నన్నేమో ఆ రంగురంగుల బొమ్మలు ఊరిస్తూ వుండేవి. ఇలాక్కాదని చెప్పి 2018లో నా పుట్టినరోజుకి లెగో సెట్ కావాలని ఇంట్లో అందరికీ చెప్పేశా. 

    అప్పుడు మా వెస్ట్ కౌంటీ మాల్‌లో వున్న లెగో స్టోరుకి వెళ్ళి ఒక రెండు లెగో సెట్లు కొనుక్కున్నాను - ఒకటి నూట ఏభై పెట్టి (బీచ్ హౌస్), ఇంకొకటి (Parisian Restaurant set) మూడొందల ఏభై పెట్టి. 

    ఆ రోజు ఉన్న ఆఫర్ ఏంటంటే వంద డాలర్ల  పైన కొంటే ఒక చిన్న లెగోసెట్ ఉచితంగా ఇస్తారు. నేను కొన్నవాటి బిల్లు నాలుగొందల ఏభై అయింది కదా - అందుకని నాకు ఆ ఫ్రీ సెట్ ఇచ్చారు. దాంతో పాటు ఒక కొత్త కేటలాగ్ కూడా ఇచ్చారు. 

    ఇంటికి రాగానే - నాకెంతో నచ్చిన పారిస్ హోటల్ సెట్టుని చేయడం మొదలుపెట్టాను. అందులో వున్నవి 2,469 లెగో పీసెస్. అదంతా ఒక్క రోజులో ఎలాగూ చేసెయ్యాలని నాకేమీ తొందర లేదు. 

    చిన్నప్పుడు అమ్మ పెట్టిన తాయిలాన్ని కొంచెం కొంచెం కొరుక్కుంటూ బోల్డంత సేపు తిన్నట్టు - నా కొత్త లెగోని కూడా ఒక్కో రోజుకి ఒక్కో లెవెల్ మాత్రం కడుతూ - ఆ కట్టడాన్ని కట్టడాన్ని తెగ enjoy చేస్తూ ఉన్నాను. 

    ఇంతలో షాపులో ఉచితంగా ఇచ్చిన కేటలాగ్ తెరిచి చూస్తున్న నాకు - అందులో - ఆ మరుసటి రోజు నుంచి వంద డాలర్లకి లెగోస్ కొన్నవాళ్ళకి ఒక బుజ్జి ఆకుపచ్చ నింజా mini-figure ఉచితంగా ఇస్తారని రాసి ఉంది. 

    ఆ బుజ్జి నింజా గాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ! నాకెలాగైనా వాణ్ణి ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. కానీ ఆ నింజాని ఏమైనా లెగో సెట్ కొంటే ఫ్రీగా ఇస్తారు కానీ విడిగా కొంటామంటే అస్సలు అమ్మనే అమ్మరు. 

    మరప్పుడేం చెయ్యాలి?

*******
*******

    ఇంట్లో నేనూ, బుజ్జిజింకే వున్నాం. వాడప్పుడే స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకంటూ ఉన్నాడు. 

    నేను నెమ్మదిగా వాడి పక్కన కూర్చుని "నాన్నగాడూ! ఇంకెంత సేపు పడుతుంది నీ హోంవర్క్ పూర్తవడానికి?" అనడిగాను. 

    వాడు తలెత్తకుండానే పెన్సిలుతో టిక్కూ-టిక్కూ లెక్కలు చేస్తూ "ఇంకో పది నిముషాలు అంతే!" అన్నాడు. 

    "అయితే మనిద్దరం ఐదున్నరకి బయల్దేరి లెగో స్టోరుకెళ్దామా?" అని నెమ్మదిగా అడిగాను. 

    అది వినగానే వాడు చేస్తున్న లెక్కలు ఆపేసి "మళ్ళీ లెగో స్టోరుకా... నేన్రాను" అనేశాడు. 

    "అలాక్కాదురా... నేను రెండు లెగోలు తెచ్చుకున్నాను కదా - అందులో ఒకటి నచ్చలేదు. అది తిరిగి ఇచ్చేస్తాను. నచ్చనిది ఎందుక్కదా ఉంచుకోవడం?" సాధ్యమైనంత అమ్మా-యకంగా అడిగా. 

    అది వింటూనే వాడు "తెచ్చినది నచ్చలేదా? నింజా ఎక్కువ నచ్చాడా?" అనడిగాడు. 

    అమ్మదొంగా ! అయితే నేను లెగో కేటలాగ్ పదేపదే తెరిచి ఆ నింజా కేసి చూడడం వాడు చూశాడన్నమాట. 
 
    ఇంకెందుకు అబద్ధం చెప్పడం! అందుకే చెప్పేశా "అవును! నాకు ఆ నింజా నచ్చాడు. నాక్కావాలి. తెచ్చుకుందాం వస్తావా?"

    "అమ్మా! అంత చిన్న మినీ-ఫిగర్ కోసం మళ్ళీ ఆ లెగో-స్టోరు కెళ్ళాలా ఇవాళ? వీకెండులో నాన్నగారు వచ్చాక వెళ్ళు" అనేశాడు. 

    "అప్పటి వరకు ఆగితే అయిపోతాయి కూడా - అసలే until supplies last అన్నాడు లెగో వాడు. ఇవాళ వెళ్ళకపోతే నింజా బొమ్మ నాకు దొరకదురా" నా గొంతులో వినీవినిపించని వెక్కు. 

    "Ugh" అని చిన్నగా అరిచి - రాస్తున్న పెన్సిల్ని చప్పుడు చేస్తూ కింద పడేసి "పదమ్మా! ఇప్పుడే వెళ్దాం. కానీ ఇప్పుడే చెప్తున్నాను. లెగో స్టోరులో మాత్రం నువ్వెవరో, నేనెవరో. నేను నీ పక్కన ఉండనే ఉండను. దూరంగా నించుంటాను" అన్నాడు. 

    "నువ్వెక్కడైనా నించో పర్లేదు. నేను ఈ బీచ్ హౌస్ సెట్ తిరిగిచ్చేసి ఇంకో సెట్ కొంటాను. దాంతో పాటు నింజాని ఫ్రీగా తెచ్చుకుంటాను" అని వాడి అమ్మనని అందరికీ హింట్లిచ్చి embarass చేయనని భరోసా ఇచ్చేశా. 

    సరిగ్గా ఐదంటే ఐదు నిముషాల్లో ఇద్దరం కార్లో ఉన్నాం. ఆ తర్వాతి ముప్పయ్యో నిముషంలో లెగో స్టోరులో వున్నాం. 

    స్టోర్ లోకి వెళ్తూనే బుజ్జిజింక నాకు దూరంగా జరిగి అక్కడున్న లెగో సెట్లు కొనడానికి చూస్తున్నట్లు స్టోరు అంతా తిరుగుతూ ఉన్నాడు. 

    నేనేమో ఒక చేత్తో అంతకు ముందు కొన్న Beach house సెట్ , బిల్ పట్టుకుని, ఇంకో చేత్తో ఇవాళ కొందామనుకున్న లెగో ఆర్కిటెక్చర్ సెట్ ఒకటి తీసుకుని కౌంటర్ దగ్గరకి వెళ్ళి నించున్నాను. 

    కౌంటర్లో ఉన్నబ్బాయి "నేను మీకు ఏం సహాయం చేయగలవాడనూ?" అని ఎంతో మర్యాదగా అడిగాడు. 

    నేను వెంటనే నా చేతిలో ఉన్న బీచ్ హౌస్ లెగో సెట్టుని కౌంటర్ మీద పెట్టి, "ఇది రెండ్రోజుల క్రితమే ఇక్కడ కొన్నాను. ఇప్పుడు తిరిగిచ్చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ఆర్చిటెక్చర్ సెట్ కొందామనుకుంటున్నాను" అని చెప్పి ఆగిపోవచ్చు కదా - నేనూ, నా ఆత్రం కాకపోతే! అక్కడితో ఆగక గబగబా "ఈ ఆర్కిటెక్చర్ సెట్టుతో పాటు ఆ గ్రీన్ నింజా ఇస్తారు కదా! ఇది ఇస్తారని తెలీక నేను ఇంతకు ముందు రెండు లెగో సెట్లు కొనుక్కెళ్ళాను. లేకపోతే ఒకటే కొనుండేదాన్ని" అని వాడు అడగనివి, నేను అనకూడదు అనుకున్నవీ అన్నీ అనేశా!

    అలా అంటూనే - ఒక కంట -  ఓరకంట బుజ్జిజింక ఎక్కడున్నాడా అని చూస్తుంటే - దూరంగా నించుని వాడు - నేను మాట్లాడుతున్నదంతా వింటూ నోరు తెరిచి ఏదో అనబోయి - వెంటనే తల తిప్పేసుకుని - తల అడ్డంగా ఊపుకుంటూ అటు తిరిగి మళ్ళీ లెగో సెట్లు చూసుకుంటూ ఉండిపోయాడు.  

    ఇంతలో నా లె-ఘోషని ఆసాంతం విన్న లెగో షాపబ్బాయి - నా చేతిలో ఉన్న పాత బిల్లు తీసుకుని చూసి "ఇందులో రెండు సెట్లు కొన్నట్టు ఉంది. వాటితో పాటు ఓ ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. ఈ బిల్లులో ఉన్నవన్నీ తీసుకొస్తేనే ఈ సెట్టు తిరిగి తీసుకుంటాను" అన్నాడు. 

    నాకు కంగారొచ్చేసింది. 

    "అదేంటి! ఇంతకు ముందు కొన్న వాటిల్లో బాగా ఖరీదైనది - 350 డాలర్లది - నేను ఉంచుకున్నాను కదా. మీ షాపులో ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఆ ఫ్రీ గిఫ్ట్ నాదే. ఇప్పుడు తిరిగిస్తున్నది కొనకపోయినా నాకు ఆ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అందులోనూ నేను ఇప్పటికే నా హోటల్ సెట్ కట్టడం మొదలెట్టేశాను. ఇప్పుడది తేవాలంటే ఎలా కుదురుతుంది? అందుకని ఈ బీచ్ హౌస్ సెట్ తీసేసుకోండి. ఇదిగో - ఈ కొత్త అర్చిటెక్చర్ సెట్ బీచ్ హౌస్ సెట్ కన్నా ఎక్కువ ఖరీదే! ఇది కొంటున్నాను. నాకు నా గ్రీన్  నింజా కూడా ఇవ్వండి ఇవాళ్టి ఆఫర్ ప్రకారం" అంటూ బో... ల్డంత మాట్లాడేశా. 

    నేను చెప్పిన కూడికలూ, తీసివేతలూ, లెక్కలూ, లాజిక్కులూ అస్సలర్థం కాక ఆ కౌంటర్లో వాడికి టెన్షన్. 

    నేనింత చెప్పినా వాడు నాకు నచ్చిన ఆకుపచ్చ నింజాని ఇస్తాడో ఇవ్వడో అని నాకు టెన్షన్. 

    మేమిద్దరం మాట్లాడుకుంటున్నది వింటూ వాణ్ణి నేనెక్కడ మాటసాయానికి పిలుస్తానో అని బుజ్జిజింకకి టెన్షన్.

    కొన్ని క్షణాలు లెగో స్టోరులో - గాలి కూడా ఆడడానికి టెన్షన్ పడిపోయిందంటే నమ్మండి. 

    ఆ కొన్ని క్షణాలు - కౌంటర్లో వాడు తన చేతిలో ఉన్న బిల్లు కేసి, నేను ఆ పక్కనే ఉన్న గ్రీన్ నింజా కేసి, బుజ్జిగాడు సీలింగ్ కేసి చూసుకుంటూ ఉండిపోయాం. 

    ఆ టెన్-టెన్షన్ క్షణాల తర్వాత ముందుగా కోలుకున్నది, తేరుకున్నది లెగో స్టోర్ కౌంటర్ వాడే. 

    తల కొంచెం వంచి అడ్డంగా తిప్పుకుంటూ "Oh whatever! " అని గొణుక్కుంటూ నేను తీసుకెళ్లిన లెగో సెట్టు తిరిగి తీసుకుని, నేను కొన్న కొత్త అర్చిటెక్చర్ సెట్టుకి కొత్త బిల్లు వేసి - రెండు బిల్లులూ అడ్జస్ట్ చేసి - వాడి ఆస్తి ఏదో నాకు రాసిచ్చేస్తున్నంత బాధగా నా చేతిలో నింజాని పెట్టి - ఇంకసలు నాకేసి చూడకుండా అటెటో చూస్తూ నించున్నాడు. 

    నేను నా ఆకుపచ్చ నింజాని భద్రంగా పట్టుకుని మహదానందకందళితముఖారవిందనై  బయటికి నడిచాను. 

    ఓ రెండు అడుగులు వెనగ్గా బయల్దేరిన బుజ్జిజింక ఓ రెండు నిముషాల తర్వాత నన్నందుకుని నా పక్కగా నడుస్తూ "అమ్మా! మనింట్లో నువ్వే ఓ పెద్ద child! నువ్వు ఒక చిన్న లెగో కోసం ఎంత గొడవ చేశావో!" అని "ప్చ్! ప్చ్1 అనుకుంటూ కారెక్కాడు. 

    అప్పుడు తెచ్చుకున్న నింజాని ఇప్పుడు చేసిన లెగో బోన్సాయ్ కింద నించోబెట్టా... 





31, జులై 2021, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 24 - పల్టీ కొట్టిన కారు; పట్టి నేర్చుకున్న ఆకు...

 కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 23 - గోల్డెన్ రోజులు అలా మొదలు...


    కిందటి మాటు -  గోల్డెన్ లో చేరిన తర్వాత నాకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఒక పది గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చారు అని చెప్పాను కదా!  

    అవీ - సింగరాయకొండ, చింతలపూడి, కామయ్యపాలెం, ఉప్పలపాడు, టంగుటూరులో రెండు పాయింట్లు, నాయుడుపాలెం,  త్రోవగుంట దగ్గరున్న మార్లగుంటపాలెం, మేదరమెట్ల - ఆ తర్వాత -  చీరాల దగ్గర వేటపాలెం అని కూడా చెప్పాను. 

    చీరాల దగ్గర వేటపాలెంలో  కోటేశ్వరరావుగారు అని కమిషనర్ గారు ఉండేవారు. పెద్దాయన - అప్పటికి అరవై ఏళ్ళుంటాయ్.  

    ఆయన్ని ICVC కోటేశ్వరరావు గారు  అనేవారు. ఆయన్ది గుంటూరు. ICVC అంటే ఇండియన్ కంట్రీ అండ్ వర్జీనియా టొబాకో కంపెనీ. దాని ఓనరు ఆయన. ఆయన గ్రేడింగ్ కమిషన్ చేసేవాడు. ఆయనకి వేటపాలెంలోఓ పెద్ద గ్రేడింగ్ హాలుంది . ఆయన అక్కడుండేవాడన్నమాట. కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. మసక మసగ్గా ఉండేవి. పాపం కఱ్ఱ పట్టుకు నడుస్తుండేవాడు. నేనంటే చాలా అభిమానం ఆయనకి. 

    ఇంక వారం మొత్తంలో నా దినచర్య ఏంటంటే - ప్రతి రోజూ టంగుటూరు చుట్టుపక్కలున్న సింగరాయకొండ మొదలుకొని టంగుటూరు ఏరియాలో  ఉన్న గ్రేడింగ్ పాయింట్లన్నీ కూడా ఒక రెండు రోజులు వరసగా  తిరగాలి. 

    అప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేసేవాణ్ణి. భోజనం కాంగానే మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసేవాణ్ణి. 

    మా ఆఫీసేమో ఒంగోల్లో ఉండేది. 

     ఒక రెండ్రోజుల తర్వాత ఏంటంటే నాయుడుపాలెం చూసుకుని - మార్లగుంటపాలెం చూసుకుని -  మేదరమెట్ల చూసుకుని - వేటపాలెం వెళ్ళాలి. 

    వేటపాలెం అంటే టంగుటూరుకి కొంచెం దూరమది  - చీరాల దగ్గర కదా!

    ఆ వేటపాలెం వెళ్ళినప్పుడు గ్రేడింగ్ పాయింట్ చూసుకుని ఆ రాత్రికి నైట్ హాల్ట్ అక్కడ ఉండిపోయేవాణ్ణి. ఎందుకంటే చీరాల సముద్రపొడ్డున ICVC కోటేశ్వరరావుగారికి ఓ గెస్టుహౌసు ఉండేది. 

    మేమిద్దరం ఆ గెస్టుహౌసులో ఉండేవాళ్ళం. ఓ వంట మనిషుండేవాడు. చక్కగా అతను వండింది భోంచేసి రాత్రి అక్కడే పడుక్కుని మరుసటిరోజు పొద్దున్నే బయల్దేరి - మళ్ళీ వేటపాలెం చూసుకుని - తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మేదరమెట్ల అవీ చూసుకుని - ఒంగోలు ఆఫీసుకొచ్చేవాణ్ణి. ఒంగోల్లోనే హోటల్లో భోంచేసేసి ఒంగోలు ఆఫీసులో సాయంత్రం వరకు ఉండి టంగుటూరు వెళ్ళేవాణ్ణి. నా రెగ్యులర్ ప్రోగ్రాం ఇది. 

    ఇవన్నీ తిరగడానికి  నాకు ఇచ్చిన అంబాసడర్ కారుకి డ్రైవర్ - హనుమంతరావు అని చెప్పేసి ఓ నలభై ఐదేళ్ళ అతను. 

    అతనే ఓనరు-కం-డ్రైవర్ కూడా ఆ కారుకి. బండి చాలా నిదానంగా తోలేవాడు, బా తోలేవాడు. అతనిది ఒంగోలు. 

    సాధారణంగా  నేను కార్లో పడుకోను.  హనుమంతరావు ఎలాగూ నిదానంగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడని గమనించి - అతని డ్రైవింగులో కొంచెం నిద్రపోవడం అలవాటు చేసుకున్నాను. ఒక పాయింటు నుంచి  ఇంకో పాయింటుకి వెళ్లే మధ్యలో ఓ కునుకు తీస్తుండేవాణ్ణి.  

    ఓ రోజు ఏమైందంటే - హనుమంతరావు కొడుకుకి పుట్టినరోజు ఫంక్షన్ ఏదో ఉందని చెప్పి -  తనింట్లో ఉండి - వేరే  డ్రైవర్నెవర్నో పంపించాడు. వాడి పేరు రామకృష్ణ అన్నట్టు గుర్తు. ఆ రామకృష్ణ కుఱ్ఱాడు. 

    నేను  బండెక్కిన తర్వాత ఊరికే కొంచెం సేపు పాటు వాణ్ణి అబ్సర్వ్ చేశాను. బానే తోలుతున్నాడు. టంగుటూరు చూసుకున్న తర్వాత ఉప్పలపాడు వెళ్ళాం. 

    ఉప్పలపాడు నుంచి కామయ్య పాలెం వెళ్తున్నప్పుడు దార్లో వచ్చేవన్నీ చిన్న చిన్న గ్రామాలు. చిన్న పిల్లలు రోడ్డు మీదే ఆడుకుంటుంటారు.  

    కామయ్యపాలెం దగ్గర  ఓ పిల్ల పరిగెత్తుకుంటూ కారు కడ్డమొచ్చేసింది. అదృష్టం ఏంటంటే రామకృష్ణ సడన్ బ్రేక్ కొట్టాడు. కార్ ఆగింది. పిల్ల పక్కకెళ్ళిపోయింది. 

    అప్పుడు  "ఒరే! ఓ రెండు విషయాలు చెప్తాను గుర్తు పెట్టుకో. ఒకటి - పల్లెటూళ్ళో జాగ్రత్తగా తోలుతూ ఉండు బండి. రెండోది ఎక్కడైనా శిశువులు, పశువులు కనబడ్డప్పుడు బండి బాగా స్లో చేయడం నేర్చుకో. వాళ్ళెటు మూవ్ అవుతారో తెలీదు." అని వాడికి బుద్ధులు చెప్పాను. 

    ఇలా చెప్పింతర్వాత ... సరే! ఆ రోజలా అయిపోయింది. మరుసటి రోజు కూడా వాడే డ్రైవరు. ఆ రోజు నేను వేటపాలెం వెళ్ళాలి. 

    పొద్దున్న టంగుటూరులో ఏదో పనుంటే గ్రేడింగ్ పాయింట్లో అది చూసుకుని, భోంచేసి వెడదాములే అనుకుని పన్నెండు గంటలకి ఇంటికొచ్చి భోంచేసేసి ఓ అరగంట రెస్ట్ తీసుకుని బయల్దేరాను. డ్రైవర్ని కూడా భోంచేసేయ్యమన్నాను. వాడూ తినేశాడు.

    టంగుటూరు-ఒంగోలు మధ్య దూరం ఇరవై కిలోమీటర్లుంటుంది. రామకృష్ణ కార్ టేప్ రికార్డర్లో  శోభారాజు పాటలు అన్నమాచార్య కీర్తనలు పెట్టాడు. అవి వింటూ  - భుక్తాయాసంతో ఉన్నానేమో - నేను ఓ కునుకు తీశాను. 

    ఒంగోలు బైపాస్ దగ్గరకొచ్చేటప్పటికి "సార్! మనం ఊళ్ళోంచి వెళదామా? బైపాస్ మీంచి వెళదామా " అనడిగాడు వాడే! 

    "ఊళ్ళో పనేం లేదు. బైపాసులో పోనీయ్" అన్నా. 

    చెప్పి మళ్ళీ అలా కళ్ళు మూసుకున్నాను. 

    అలా కళ్ళు మూసుకున్నానో లేదో -  ఒక పది నిముషాల్లోనే - ఎంతా అంటే - ఒక రెండో, మూడో కిలోమీటర్లు వెళ్ళుంటామంతే! 

    వాడికీ తూగొ చ్చినట్టుంది. ఆ మగతలో రోడ్డుకి ఎడమ పక్కనున్న మైలురాయిని కొట్టేశాడు. ఆ కొట్టడం-కొట్టడం - ఆ  దెబ్బకి  నిద్రమత్తు వదిలి - హఠాత్తుగా వాడేం చేశాడంటే కుడిపక్కకి కట్ చేశాడు. 

    మిట్టమధ్యాహ్నపుటెండవేళ  - ఒకటిన్నరో, రెండో అయుంటుంది టైము. 

    రోడ్డు ఖాళీగా ఉంది లంచ్ టైం కాబట్టి. 

    లేకపోతే అయిపోయేవాళ్ళమే ఏ లారీలో ఏవో వెళ్తుంటే. 

    హఠాత్తుగా అలా కట్ చేసేటప్పటికి ఏమైందంటే మేమున్న కారు మూడు పల్టీలు కొట్టి - కుడిపక్క మార్జిన్ లోకి వెళ్ళిపోయి - స్టాండ్ అయింది. 

    పచ్చడి-పచ్చడి అయిపోయింది కారు. 

    డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయి. లోపలుండిపోయాం మేము. మొత్తానికి కారు స్టాండ్ అయి - ఆగిపోయింది. 

    కారు ఆగీ ఆగగానే - ముందు అర్జంటుగా డోర్ లాక్ తీసుకుని ఇద్దరం దిగాం. 

    నాకు ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనపళ్ళా. 

    రామకృష్ణకి కాలి బొటనవేలు దగ్గర తెగింది బాగానూ. ఆ తెగిన చోట రక్తం వస్తోంది. 

    సరే! కారు దిగాం. ఇద్దరికీ నోట మాట రావట్లేదు - నించున్నాము అక్కడ. 

    ఎఱ్ఱటి ఎండ. 

    ఈ లోపులో - అదే రోడ్డులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వాళ్ళ ఆఫీస్ అక్కడుంది. వాళ్ళు చూశారు ఈ ఆక్సిడెంట్. 

    వాళ్ళందరూ పాపం గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేశారు. ఆ  మధ్యలో ఓ కాంపాండు వాల్ పిట్టగోడ ఉంటుందన్నమాట. 

    నన్ను తీసుకెళ్ళి ఆ గోడ మీద కూర్చోబెట్టి "ఏమిటి సార్! ఏమైనా దెబ్బలు తగిలాయా?" అనడిగారు. 

     "ఏమీ లేదు. నాకేమీ కాలేదు" అన్నాను. 

    పాపం వాళ్ళు గమ్మున వెళ్ళి కాఫీ పట్టుకొచ్చారు నాకు. సరే! అలా కూర్చున్నాను. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 

    ఈలోగా ఈ డ్రైవర్ ఏం చేశాడంటే "సార్! మా ఓనర్ని పిలుచుకొస్తాను నేను. మీరు కారు దగ్గరే ఉండండి" అని వెళ్ళి పరారైపోయాడు.  

    వెళ్ళిన వీడెంత సేపటికీ రాడు. ఆ కారు దగ్గరే అలాగే కూర్చున్నాను నేను.

    చాలా సేపు కూర్చుని కూర్చుని ఇహ విసుగెత్తి లేచి రోడ్డుమీదకొచ్చాను. 

    రోడ్డుమీదకొచ్చేటప్పటికి లక్కీగా నా ఇమీడియట్ బాసు చింతల వీరయ్యగారు - ఆయన టంగుటూరు వెళ్తూ - ఆయనా నిద్రపోతున్నాడు ఆయన కార్లో. 

    ఆయన డ్రైవర్ పేరు కూడా వీరయ్యే. ఆ వీరయ్య నన్ను చూశాడు. 

    చూసి ఆయన్ని లేపి "సార్! కామేశ్వరరావు గారిక్కడ రోడ్డు మీదున్నారు. కారేదో ఆక్సిడెంట్ అయినట్టుంది." అనగానే "ఆపాపు బండి" అని కార్ ఆపి - నన్నా కారులో ఎక్కించుకుని టంగుటూరు తీసుకెళ్ళాడాయన. 

    "ఏమైంది కామేశ్వరరావుగారూ?" అని వీరయ్య గారడిగితే  "ఇలా జరిగిందండి - డ్రైవరు ఓనర్ కోసం వెళ్తానన్నాడు, ఎప్పటికీ రాలేదు. మరెటు పారిపోయాడో ఏంటో " అనగానే "దెబ్బలేమన్నా తగిలాయా" అనడిగాడు వీరయ్యగారు.   

    "దెబ్బలేమీ తగల్లేదు. నాకు బానే వుంది"  అని చెప్పి వెళ్ళి - మళ్ళీ ఆయనతో పాటు టంగుటూరు ఏరియాలో ఆ గ్రేడింగ్ పాయింట్లు తిరిగేశాను. సాయంత్రం ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడాయన. 

    వెళ్తున్నప్పుడు "ఒక నాల్రోజుల పాటు రెస్ట్ తీసుకో. నువ్వు ఆఫీసుకి రావద్దు. నేనిక్కడ ఒంగోల్లో ఉండి చూసుకుంటానులే.!" అంజెప్పేసి అన్నాడాయన. సరే అని ఉండిపోయాను ఇంటి దగ్గర. 

    కాకపోతే ఏవిటంటే తర్వాతి రోజు నుంచి ఎవరైనా వచ్చి పలకరిస్తే నాకు మాటొచ్చేది కాదు. ఏడుపొచ్చేసేసేది. 

    "ఎంత పెద్ద ప్రమాదం తప్పింది కదా! అసలేంటిది? పిల్లలేమో చిన్నపిల్లలు. ఆవిడకేమో అసలు ఇల్లు తప్పితే ఓ బ్యాంకు వ్యవహారం, డబ్బు వ్యవహారాలు ఏమీ తెలీదు. నాకసలు ఏమైనా అయుంటే వీళ్ళ పరిస్థితి ఏంటసలు?"  ఇదే ఆలోచన నాకు. 

    దాంతోటి నాకు ఎవరైనా కనపడితే దుఃఖం వచ్చేసేది. 

    అదృష్టవశాత్తూ నా పక్కన రామ్మోహన్ అంచెప్పేసి సుబ్బన్న గారి కజిన్ కొడుకు ఉండేవాడు. అతను 1978లో మైసూర్లో చేరాడు మా ML కంపెనీలో. 

    నేను ML నుంచి బయటికొచ్చి గోల్డెన్‌లో చేరిన తర్వాత టంగుటూరులో అతన్ని నా స్థానంలో మేనేజరుగా తీసుకొచ్చారు. 

    అతను కూడా మా పక్కనే ఉండేవాడు. మా పక్కనున్న ఇంట్లో సుజాత-సత్యం  అని చెప్పేసి దంపతులిద్దరు షోడాలమ్ముతూ ఉండేవారు. ఆ పక్కన విజయ్ అని చెప్పి పోస్టుమాన్ ఇల్లు ఉండేది. ఆ  రెండిళ్ళవతలున్న ఇంట్లో రామ్మోహన్ అద్దెకుండేవాడు. 

    అలాగే మా ఇంటి పక్క వాటాలో పామూరి సుబ్బారావు అని సుబ్బన్నగారి మేనమామ కొడుకు - వాడు కూడా నా ఫ్రెండే. వాడు సింగరాయకొండలో మా గ్రేడింగ్ హాలుకి ఇన్-ఛార్జ్ . వాడు, వాడి భార్య లలిత గారని చెప్పేసి వీళ్ళు కూడా టంగుటూరు లోనే ఉండేవాళ్ళు. 

    పాపం! వాళ్ళే నాకు సపోర్టుగా ఉండి, 'ఏం భయపడక'ని చెప్పేసి - ఈ రామ్మోహను, సుబ్బారావు నన్ను కాస్త అటు చీరాల-వేటపాలెం సముద్రపుటొడ్డుకి, తర్వాతేమో కందుకూరు మేనేజర్ వెంకట్రావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సినిమాలేవో చూడడం - ఇలా ఏదో ఊళ్ళు తిప్పుతూ నన్ను లైన్లో పెట్టారు వీళ్ళు. 

    అప్పుడే  మా శంకర నారాయణగారు "చాలా పెద్ద ఆక్సిడెంట్ తప్పి చచ్చి బతికాడు వీడు. వీడికి వందేళ్ళ ఆయుష్షు" అనేవాడాయన. 

    ఆయన, మా సుబ్బన్నగారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ నాల్రోజులు. 

    తరవాత నేను మళ్ళీ రొటీన్లో పడిపోయాను. 

    మామూలుగా గ్రేడింగ్ పాయింట్లు తిరుగుతూ చూసుకుంటూ 82, 83 డిసెంబర్ దాకా అలా చేస్తూనే వున్నాను. ఇంక అక్కడ కొత్త విశేషాలు ఏమీ లేవు. 

    కాకపోతే మా సుబ్బన్నగారు చెప్పేవాడు "ఒరే! నువ్వు వచ్చేటప్పుడలా కార్లో గుప్పెడాకులు వేసుకుని నీకు తోచినట్టుగా గ్రేడ్ చేసుకుని ఏరుకో. నా కార్ ఎదురైనప్పుడు నాకు చూపెట్టు - ఏవన్నా తప్పులుంటే చెప్తాన"ని చెప్పేసి అలా ఆయన నాకు లీఫ్ నేర్పాడు. 

    ఒక విధంగా టొబాకో లీఫులో నేను మాస్టరైపోయాను. అసలు పొగాకులో లో-గ్రేడ్ తప్ప ఏమీ తెలియనివాణ్ణి ఇహ అసలు గ్రేళ్ళూ కూడా కంటితో చూడగానే చెప్పేసేవాణ్ణి - అది ఏ గ్రేడ్ అని చెప్పేసి. 

    ఆ రకంగా సుబ్బన్న గారి దగ్గర ట్రైనింగ్ అయి దాంట్లో మంచి ప్రావీణ్యత సంపాదించాను. 

     ఇహిక్కణ్ణించి ఏం జరిగిందో ఇంకోమాటు చెప్తాను.


<వచ్చేమాటు తరువాయి కథ>


19, జులై 2021, సోమవారం

గీతం...సంగీతం...సతతహరితం - 13 - కుఛ్ దిల్ నే కహా?! - మది ఏమి పలికిందో?

 
అనుకున్న మాటలన్ని
పెదవి చాటునాగిపోయి 
చెప్పలేని ఊసులాయె  
ఊసులన్ని ఊహలూరె 
చెప్పబోతె పలుకు చాలదాయె 

అనలేని మాటలేవో 
ఎదల మాటు దాగి పోయి  
చెప్పరాని ఊహలూరె 
ఊహలన్ని ఊసులాయె 
చెప్పలేక పలుకు మూగబోయె 

*******
*******

    మాట, నవ్వు - మనిషికే దక్కిన వరాలు. 

    మన్ననగా వాడుకుంటే మనిషికి మనిషిని దగ్గర చేసేవి ఆ రెండే. 
    మేర మీరితే మనసులు విరిచి దూరం పెంచేవీ ఆ రెండే. 

    అదసలెలా మొదలవుతుందంటే... తిరుగులేని చూనమా-మంత్రంతో.  
    తెలుగు నేర్వడానికి ఓనమాలెలాగో - చెలిమి చెయ్యడానికి చూనమాలు అలాగన్నమాట!. 

    పెదవి కదపక ముందే కన్ను కన్ను కలిస్తే చూపు నిలుస్తుంది. 
    పెదవులాని మొలిచిన చిరునవ్వు నిలవరిస్తుంది. 
    పెదవి దాటిన మాటతో పరిచయం నిలకడౌతుంది. 

    ఇంత జరిగిన తర్వాత ఆ మొదటి మాట దగ్గరే ఆగిపోంగా?!
    మాట మీద మాట వేసుకుంటూ - ఊసులాడుకుంటాం. 
    ఉబుసుపోక మాటల్లో ఒకరి మనసొకరికి తెలుస్తుంది. 
    ఎరిగిన మనసుతో పెరిగిన పరిచయం నెయ్యంగా మారుతుంది. 
    మనసెరిగి మసలడం అలవోకగా అలవడుతుంది. 

    అక్కడితో ఆగిపోతే కథేముంది?
    చనువు పెరుగుతుంది. 
    తెలిసిన మనసు అలుసవుతుంది. 
    పలుకుతున్న మాట పలచనవుతుంది. 
    ఇద్దరుగా వున్నప్పుడు మేలమాడిన మాట - నలుగురిలో పడ్డప్పుడు నవ్వులాటవుతుంది. 

    ఏదో ఆదమరచిన ఆవేశపు వేళలో అదుపు తప్పిన మాట పెదవి మీరుతుంది. 
    
    అంతే! అప్పటివరకు అర్థవంతంగా వున్న మాట - మాట మీద మాటై - మాట మీరి ఎద మీద పోటై - ప్రతి పదార్థం అనేకార్థాల అపార్థమై మిగులుతుంది. చెలిమితీగ వాడుతుంది. 

    అసలెందుకు మాట్లాడేమా అన్న తీరని బాధ మొదలవుతుంది. 

    మాటలతో ఒకరినొకరు గుచ్చుకుని నొచ్చుకున్న గడిచిన క్షణాలన్నీ - తిప్పగలిగిన గడియారం ముళ్ళలా మళ్ళొక్కసారి వెనుతిరిగి - అది నాటికీ, నేటికీ, ఏనాటికీ గడవని కాలమైతే  ఎంత బావుండుననిపిస్తుంది. 

    అనిపించింది, అనుకున్నది - అనుకున్నట్టుగానే జరిగితే  - ఇంక అనుకునేదేముంది? అలా జరగనే జరగదు. 
    
    జారిన మాట ఆరని గాయమై, మాయని జ్ఞాపకమై అట్టే నిలబడిపోతుంది. తదుపరి మాటల తూనికకి ఊనికౌతుంది. నేరవకనే నేర్చుకున్న మరపురాని పాఠమౌతుంది. నేర్చిన పాఠం నిశ్చలమై నిచ్చలౌతుంది. 
    
    *******
    *******

    ఒంటికి నొప్పి కలిగితే మందుంటుంది. 

    మనసుకి నొప్పి కలిగితే మంచి మాట మందల్లే పని చేస్తుంది. కానీ అనుకున్న అన్ని వేళలా మనసైన మాట అందుబాటులో వుండదు. 

    మరప్పుడెలా? 

    మాటైతే దొరకదు కానీ మాయ చేసి మనసుకి మలాము పూసే హాయిపాట ఒకటి ఎప్పుడూ 'నీకు నేను తోడున్నా' నంటూ గుర్తుకొస్తుంది. 

    అలాటిదే ఒకానొక పాట - తనకు తానే సాటైన పాట - ఒకనాటి మేటి పాట. 

    ఆ పాట కథా-కమామీషూ ఏంటంటే... 

    పాట: కుఛ్ దిల్ నే కహా...?!
    సినిమా పేరు: అనుపమ 
    పాట తీసినవారు: హృషీకేశ్ ముఖర్జీ 
    పాట రాసినవారు: కైఫీ అజ్మీ 
    పాట చేసినవారు: హేమంత్ కుమార్ 
    పాట పాడినవారు: గానకోకిల - లతా మంగేష్కర్ 
    పాట పాడుతున్నట్టు నటించినవారు: షర్మిలా ఠాగూర్ 
    పాట వింటున్నట్టు కనిపించినవారు: ధర్మేంద్ర 
    పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=uc8RBLMFLgI

   *******
   *******


    ఇహిప్పుడు ఈ పాటకి పని చేసిన వారి గురించి కొన్ని చమక్కులు - తళుక్కులు. 

    'అనుపమ' సినిమాని హృషీకేశ్ ముఖర్జీ ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్‌కి అంకితమిచ్చారు. 

    బిమల్ రాయ్ తీసిన 'మధుమతి' సినిమా లోని పాట 'సుహానా సఫర్' పాటని చాలా రోజులు పాడిందే పాటగా పాడా!

    పాట రాసిన కైఫీ అజ్మీ ఇద్దరు పిల్లలూ మనకి బాగా తెలిసిన వాళ్ళే! ఒకరు బాపు సినిమాల కెమెరా మాంత్రికుడు బాబా అజ్మీ అయితే ఇంకొకరు హిందీ సినిమా నటి షబానా అజ్మీ. అన్నట్టు ఒకప్పటి హిందీ సీరియల్ నటి తన్వి అజ్మీ బాబా ఆజ్మీకి భార్య. 

    ఇక పోతే పేరు లోనే ఠాగూర్ వంశనామం చేర్చుకున్న షర్మిలా ఠాగూర్ అచ్చంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చుట్టమే!

    చివరాఖరుగా నే చెప్పబోతున్న ధర్మేంద్ర అందరికీ తెలిసినట్టే డ్రీం గర్ల్ హేమమాలినికి నిజజీవితకథానాయకుడు. అంతకు ముందే సన్నీ దేవల్, బాబీ దేవల్ అనబడు ఇద్దరబ్బాయిల తండ్రి కూడా. 

    
 *******
  *******

    పాట ఆనుపానులు తెలిశాయి కదా! 

    మరిప్పుడు ఈ పాటలో నాకు నచ్చిన విశేషాలు. 

    మొదటగా - పాట మొదలవుతుండగా కనిపించిన చెట్లు. 

    వరసగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా నించున్న ఆ చెట్లేమిటో గానీ నలుపు-తెలుపుల తెర మీద కూడా ఎంత రాజసంగా కనిపిస్తాయో!

    ఆ చెట్లని చూస్తూ మురుస్తుండగా - ఆ చెట్ల మీదుగా తేలి వస్తున్న గాలిపాటలా తీగ సాగే  లతామంగేష్కర్ గొంతు ఎంత నచ్చుతుందంటే - ఆ పాటని దోసిటిలో పట్టి అట్టే పెట్టేసుకోవాలన్నంతగా. 

    ఈ పాటలో మంద్రస్థాయిలో వినిపించీ వినిపించనట్టుండే లతాజీ గాత్రం అద్భుతంగా వినిపిస్తుంది. విచ్చీవిచ్చని మొగ్గేదో తనలో తాను గుసగుసలాడుకున్నట్టుంటుంది. మోయలేని తీపిహాయినేదో మనసుకి పూసిపోతున్నట్టుంటుంది. 

    ఈ పాటకి హేమంత్ కుమార్ కూర్చిన సంగీతానికి హేమంత మాసపు మంచుతెరల సున్నితపు చాలు ఏదో పొసగినట్టనిపిస్తుంది. 

    అన్నిటికన్నా ఎక్కువగా నాకు ఈ పాటలో నచ్చినది ఏమిటీ అంటే - విరిసీ విరియని మొగ్గలా అనిపించి, ముక్కుపచ్చలారని అచ్చరలా కనిపించే షర్మిలా ఠాగూర్. 

    పాట సాగిన ఆసాంతం గాలికి అల్లలాడే తెల్లగులాబీ తీగ లాగా సున్నితంగా కదులుతూ కనిపిస్తుంది ఆవిడ. పెదవుల మీద కనీకనిపించని చిరునవ్వు, చెంపలలో దాచలేని చిఱుసిగ్గు, లతాజీ పాడిన పాటకి తగినట్టు అలవోకగా కదిలిన పలుచని పెదవులు - ఓహ్! ఎంత సుకుమారమో! అది నటనేనా లేక ఆవిడకి సహజమైన ప్రవర్తనా అని అనిపిస్తుంది. 

    కట్టుకున్న పూల పూల చీర - దానికి తగినట్టు మెడ చుట్టూ, బుట్టచేతుల అంచులకి కుట్టిన పూలపూల అంచు రవికతో - షర్మిల పూబాలలా కనిపిస్తుంది ఈ పాటలో. 

    ఈ పాటలో నాకనిపించిన, కనిపించిన ఒక ప్రత్యేకత - షర్మిలా ఠాగూర్ కనిపించిన ప్రతి ఫ్రేము - ఒక అందమైన ఛాయాచిత్రంలా అనిపిస్తుంది. 

    యూట్యూబులో పాట మాత్రమే వున్న వీడియో ఉన్నా - పాటకి ముందు కనిపించే చెట్లూ, పాటకి చివర్లో ధర్మేంద్ర చెప్పే డైలాగులు నాకిష్టం - అందుకని ఈ వీడియో అప్పు తెచ్చుకున్నా! 

    కైఫీ అజ్మీ తన కలాన్ని ఆకుల కొనల నుండి జారే చల్లని పాలమంచులో ముంచీ,  పూల రెక్కల అంచులకి తాకించీ పాటని రాశారేమో ! అందుకే ఆ సౌకుమార్యం మహ సౌఖ్యంగా అమరింది ఈ  పాటలో. 

    లేకపోతే కనురెప్పల చల్లని పానుపుపై  - కలల వేలుపులు పవళించేనన్న ఊహ ఉట్టుట్టినే అందిపోదు కదా! 

    అర్థం చదివినప్పుడు కొంచెం melancholic గా అనిపించినా - పాటలో రాసిన పదాల అందమూ, పాట పాడిన వారి గళమాధుర్యమూ, షర్మిలా ఠాగూర్ graceful beauty ఆ విషాదాన్ని మదికి అంటనీయవు. 

    నాకు ఈ పాట ఎంతగా నచ్చిందంటే - ప్రతి పదార్థం రాసుకుని మీ అందరితో పంచుకునేంతగా! 
    

    



కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

లేతా హై దిల్ అంగ్‌డాయియా - నా ఎదకేమో ఆగామి చింతా!
ఇస్ దిల్ కో  సమ్‌ఝాయే కోఈ - ఈ మదికెవరైన చెప్పండి సుంత! 

అర్‌మాన్ న ఆంఖే ఖోల్ దే - నాలో కోరిక కనుతెరవనీక!
రుస్‌వా న హో జాయే కోఈ - ఎవరికో పెనునింద పడనీక!

పల్‌కోం కీ ఠండీ సేజ్ పర్ - కనురెప్పల చల్లని పానుపుపై
సప్‌నోం కీ పరియా సోతీ హై - కలల వేలుపులు పవళించే! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

దిల్ కీ తసల్లీ కే లియే - మది ఊరడింపు కోసమే... 
ఝూఠీ చమక్,  ఝూఠా నిఖార్! - ఈ కపటపు తళుకు, కపటపు మిణుకు!

జీవన్ తో సూనా హీ రహా - జీవితమిది శూన్యమనిపించునిలా...   
సబ్ సమ్‌ఝే ఆయీ హై బహార్! - ఆమని వచ్చెనని ఎవరేమనినా!

కలీయోం సే - కోఈ పూఛ్‌తా ? - ముకుళమునెవరైన అడిగిరా?
హస్‌తీ హై వో - యా రోతీ హై?! - అది నగవేమో, మరి వగపేమో?! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!


 *******
  *******

తెలిసినదే అయినా నాకు నేను మళ్ళీమళ్ళీ నేర్పుకునే పాఠం 

అనలేని మాట
అనకపోతే - 
అది అవసరమైన అదుపు 

అనదగ్గ మాట
అనకపోతే - 
అది అనవసరపు పొదుపు 

~ పాటల భైరవి 


10, జులై 2021, శనివారం

చెట్ల పైన పాటలు - చెట్ల కింది మాటలు

    జ్యేష్ఠ మాసం. గ్రీష్మ ఋతువు. 

    పేరుకి ఎండాకాలం. ఎండలు మెండుగా కాయాల్సిన కాలం 

    మా ఊళ్ళో కాలమేదైనా అప్పుడప్పుడు అనుకోని చుట్టంలా - ఉండుండి ఉలుకూ-పలుకూ లేని నిలకడ నీటిచాలుగా వాన పడుతూనే ఉంటుంది. 

    అసలు మా ఊరి కాలాకాలాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - "ఇప్పుడున్న వాతావరణం నీకు నచ్చకపోతే రేపటి వరకు ఆగి అప్పుడు చెప్పు"  అన్నట్టుంటుంది. (If you don't like the weather in St. Louis now, just wait until tomorrow అన్నట్టు). 

    మా ఊళ్ళో ఎండాకాలం - మహా అంటే - ఏడాదిలో ఓ మూడున్నర నెలలు సూర్యుడు ఎఱ్ఱగా కనిపించి వెచ్చగా అనిపించే కాలం. 

    అడపా దడపా ఒకట్రెండు రోజులు మాత్రం నీరెండగా మొదలయి -  గీరెండగా మారి ఉస్సురుస్సురేలా చేస్తుంది. 

*******
*******

    దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఒకప్పటి చీకటి రాత్రుల నాటి నానుడి అయితే ఎండుండగానే నడక చుట్టబెట్టుకు రావాలి అనేది వేసవి రోజుల నా నుడి. 

    అందుకే ఎండ కాసిన ఆ కాసిని రోజులూ - ఒక రోజు పొద్దుటి పూట, ఇంకో రోజు సాయంకాలపు పొద్దు, ఒక్కో రోజు ఆ పొద్దూ, ఈ పొద్దూ కూడా నడుస్తాము - బద్రి, నేను. 

    ఆ నడకలో - ఒక్కోసారి పైకో, ఎక్కువసార్లు నోట్లోనో  "నేల పైన కాళ్ళు లేవు... నింగి వైపు చూపు లేదు" అని ఆత్రేయది అబద్ధపు పాటొహటి పాడుకుంటుంటాను. 

    అది అబద్ధపు పాట ఎందుకయిందీ అంటే - నడుస్తున్న నా కాళ్ళు నేల పైనే ఉంటాయి. 

    దారికి అటూ ఇటూ ఉన్న తలొంచని చెట్లని తలెత్తి చూసుకుంటూ నడిచే నా చూపులు నింగి వైపే ఉంటాయి. 

    తడబడక వడివడిగా పడు అడుగులలో వెనక్కి జరుగుతూ దారి ఉరుకుతూ ఉంటుంది.  

    బాటకి అటూ-ఇటూ వేర్లు దించుకు తలొంచక నించొను తరువుల వైపు చూపు చుఱుకుతూ ఉంటుంది. 

    అసలా చెట్లు ఎంత బావుంటాయనీ!?




కొన్ని నేలకి దాపుగా ఒదిగి  కుదురుగా
ఇంకొన్ని నింగికి ఏపుగా ఎదిగి  గుబురుగా 
అన్నీ పచ్చని ఆకులతో కళకళలాడుతూ 
అందులో కొన్ని విచ్చిన పూవులతో ఘుమఘుమలాడుతూ 
వచ్చిన పక్షిని కాదనవు. 
ఊపిన గాలిని వద్దనవు.  

*******
*******


    అంతే కాదు. 

    అప్పుడెప్పుడో మన దర్శకమణి దా. నా. రా. ఓ పాటలో చెప్పినట్టు చెట్లు బోల్డంత మంచివి. 

చెట్టుని నమ్మితే ఎంతుందో…
కొబ్బరి చెట్టుని నమ్మితే ఎంతుందో!
తాగేందుకు నీరిస్తుందీ…
తినడానికి కాయిస్తుందీ…
వుండేందుకు నీడిస్తుందీ… 

    పైన రాసిన ఆ పంచ-వాక్య-రత్నాలు మన దర్శకరత్న తీసిన "సంగీత" అన్న సినిమాలో  "ఎవరో నాతో అన్న మాట" అన్న పాటలో  మొదటి చరణం లోని కొన్ని లైన్లు. 

    కొన్ని మాత్రమే ఎందుకు రాశానిక్కడా అంటే ఆ పాటలో అన్ని లైన్లూ అనుకోవడానికి అంతగా బావుండవు కాబట్టి. 

    ఆ కొన్నీ కూడా ఎందుకు రాశానూ అంటే చెట్టు గురించి ఏవో కొన్ని మంచి మాటలున్నాయి కాబట్టి. 

    *******
    *******
   
      సరి సరి! చెట్ల గురించిన పాటలు కాసేపు ఆపి - ఆ చెట్ల కింద నడుస్తూ మాట్లాడుకునే మాటల గురించి చెప్పుకుందాం. 

    చెట్ల కింద నుంచి నడుస్తున్నపుడు బద్రి ఏమంటారంటే - "మనం చెట్ల కింద నుంచి నడిచేటప్పుడు అవి మన తల మీద ఒక కనిపించని message packet ఒకటి encrypt చేసి మరీ ఒకదాన్నుంచి మరొక దానికి పంపించుకుంటాయేమో! చెట్టు నుంచి చెట్టుకి కబుర్లు, వార్తలు మన ద్వారా అందించుకుంటాయేమో?" నని.

    మేము వెళ్ళే దారిలో కనిపించే ఎన్నో  చెట్లు అరవిచ్చిన పూవులు పొదిగిన ఆకుపచ్చల పచ్చడాలు కప్పుకున్నట్లు ఉంటాయి. 

    కానీ కొన్ని మాత్రం నొప్పి దాచుకుని పైకి నవ్వుతున్నట్టుంటాయి. 

    ఒక్కో చెట్టులో పచ్చని ఆకులు నిండిన రెమ్మల పక్కనే రేపో మాపో విరిగి పడిపోతాయా అనిపించే ఎండిన కొమ్మలూ ఉంటాయి. ఇంకొన్ని చెట్లని శిశిరమింకా వదిలి వెళ్ళక అంటిపెట్టుకున్నట్టే ఉంటుంది. 




    ఇంతకు ముందెప్పుడూ ఇలా లేదు కానీ - ఈ ఏడాది మాత్రం మా చుట్టుపక్కల వున్న ఎన్నో చెట్లు అంత బాగా ఉన్నట్లు లేవు. చూడడానికి పచ్చగానే ఉన్నట్టుంటాయి - కానీ పైనుంచి ఎండుకొమ్మలు వేసుకొస్తున్నాయి. ఎండిన కొమ్మలు విరిగి ముక్కలుముక్కలుగా నేలకొరిగిపోతున్నాయి. 

    ఈ మధ్య కురుస్తున్న వానల్లో చిన్నచిన్న గాలులకే పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడిపోతున్నాయి.     

    వాటిని చూస్తుంటే అప్పుడెప్పుడో బద్రి చెప్పిన పీటర్ వాలబెన్ (Peter Wohlleben) అనే ఆయన గుర్తొస్తాడు.  

    వాలబెన్ చెప్పిన ప్రకారం మనకి WWW (World-Wide Web) ఉన్నట్టే, అడవుల్లో ఉన్న చెట్లకి కూడా ఒక WWW (Wood-Wide Web) ఉంటుందట. 

    పీటర్ వాలబెన్ అంటే ఎవరంటే జర్మనీలో పుట్టిన ఒక చెట్టు-చుట్టం. 

    ఆయన చెప్పిన ప్రకారం అడవుల్లో ఉండే చెట్లు తమలో తము మాట్లాడుకుంటాయిట. 

    ఏ చెట్టుకి నీరు తగ్గినా, ఇంకే చెట్టుకి పురుగు పట్టినా - చుట్టు పక్కల ఉండే ఆరోగ్యవంతమైన చెట్లు వాటిని కనిపెట్టి, తమ వేళ్ళ ద్వారా మిగిలిన చెట్లతో మాట్లాడి ఎండిపోతున్న చెట్టుకి నీరు, ఈసురోమంటున్న తరువుకి పురుగు నెదిరించి బలం కలిగించే పోషకాలు అందిస్తాయట. 

     నాకు మా నడిచే దారిలో ఎండుకొమ్మలతో, వాడిన మొహాలతో ఉన్న చెట్లని చూస్తే ఆ wood-wide web ఏదో అడవుల్లోనే కాక పట్టణాల కాంక్రీటడవుల్లో కూడా పని చేస్తే బావుణ్ణేమో అనిపిస్తుంది.  

అప్పుడు... 
అకాలంలో 
ఆకురాలు సోకినట్టున్న మానులన్నీ 
ఆకుల-గనులవుతాయి; 
ఆమనుల వనులవుతాయి. 

*******
*******



4, జులై 2021, ఆదివారం

మళ్ళిమళ్ళీ - ఈ రోజు మరలి రాకుండనీ...

    జులై 3, 2021. 

    ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఇలాంటి రోజు మరెప్పటికీ రాకూడదనిపించే రోజు. 

    ఎప్పట్లాగే ఈ వారం కూడా బ్లాగ్ రాద్దామనుకుంటూ - ఏం రాద్దామా అని ఆలోచిస్తున్నాను. 

    చిన్నప్పుడు విన్న పాట కబుర్లు రాయనా, నిన్నెప్పుడో చూసిన సినిమా కబుర్లు రాయనా, ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్న చెట్టూచేమల కబుర్లు రాయనా అనుకుంటూ  ఉన్న నేను - అనుకున్న అవేవీ కాకుండా - అనుకోకుండా - అస్సలు అనుకోని విషయమేదో చెప్పబోతున్నాను. 

    జులై నెల - నాలుగో తారీఖు ఉత్తర అమెరికాకి స్వాతంత్య్ర దినోత్సవం. ఈసారి నాలుగో తేదీ ఆదివారం అవడం చేత, సోమవారం సెలవొచ్చింది. అంటే వరసగా శనాదిసోమవారాలు మూడ్రోజులూ సెలవులు.

    ఇవాళ్టికి ఇంట్లో ఉన్న నలుగురం కలిసి ఇల్లు కదిలి దాదాపు పదహారు నెలలు. 
 
    ఇటీవలే మా నలుగురికీ - నాలుగు రెళ్ళు ఎనిమిది - టీకా పొడుపులూ పూర్త య్యాయి. 

    అందుకే కొంచెం ధైర్యం చేసి - ఈ చుట్టుపక్కలే ఇరవై ఏళ్ళ నుంచీ ఉన్నా ఇప్పటిదాకా చూడడం కుదరని మిజోరి-మిసిసిపి నదుల సంగమం చూద్దామని మా పక్క రాష్ట్రమైన ఇల్లినాయి**లో ఉన్న హార్ట్‌ఫర్డ్ అనే ఊరికి వెళ్ళాం. 

    అక్కడున్న కాన్ఫ్లుయెన్స్ టవర్ (Confluence Tower) ఎక్కి అవతల పక్క వడివడిగా పరిగెడుతున్న కృష్ణవేణి పాయ లాంటి మిజోరి నదిని, ఇవతల పక్క నిలకడగా పారుతున్న కుదురు-గోదావరి లాంటి మిసిసిపిని - చూసి ఇంటికొచ్చేటప్పటికి సాయంత్రం నాలుగున్నర అయ్యింది. 

    (**Illinois లో "s-silent " - అది "ఇల్లినాయి" అని చదివినప్పుడల్లా నాలో నేనే అనుకునే నాదైన ఓ పన్ ఏంటంటే... 

    స్పెల్లింగ్  చూడబోతే I-L-L-I-N-O-I-S అంటూ 
    ఆసాంతం - ఎస్సాంతం
    తీరా పలకబోతే 
    ಇಲ್ಲಿ noise ಮಾಡ ಬಾರದು అనెవరో అన్నట్టు 
    ఇల్లినాయిస్‌లో ఎస్ voice లేనిదై  
    ఆసాంతం - ఎస్సుదే అంతం)


    నదీసంగమం చూసి నాలుగున్నరకల్లా ఇంటికొచ్చేశామని చెప్పాను కదా! 

    మళ్ళీ సాయంత్రం ఆరింటికల్లా బయల్దేరి "మనందరం కలిసి మాల్‌కి వెళ్ళి చాలా రోజులయింది" అనుకుంటూ మా ఇంటి దగ్గరే ఉన్న మాల్‌కి వెళ్ళాం. 

    బద్రి  పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేయగానే  "మాస్కు పెట్టుకోవాలి" అని ఒకరికొకరం గుర్తు చేసుకుంటూ కార్ దిగి మాల్ లోపలి నడిచాం. 

    ముందు బద్రి, పిల్లలు నడుస్తున్నారు. 

    నేను కొంచెం వెనగ్గా - సీలింగ్ మీద నక్షత్రాల్లా మెరుస్తున్నలైట్లూ, ఆ లైట్ల కాంతిలో ధగధగలాడుతున్న బట్టలూ, ఆ బట్టలు తొడిగిన గుండు-బొమ్మలూ అన్నిటినీ నెమ్మదిగా చూసుకుంటూ, ఆ పక్కనే అమర్చి ఉన్న నిలువుటద్దాల్లో నన్ను నేనే చూసుకుని కళ్ళెగరేసి పలకరించుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ - వెళ్తూ ఉన్నాను. 

    ఇంతలో ఒకమ్మాయి లోపల్నుంచి హడావిడిగా వస్తూ  "దేరీజే షూటింగ్ ఇన్ ద మాల్!" అని గట్టిగా చెప్పింది.  

    అది వినగానే ఒక్క నిముషం విన్నది నిజమేనా అన్న సందేహం. 

    చెవులు ఆ అమ్మాయి చెప్పేది వింటున్నా మెదడు దాన్ని సరిగ్గా రెజిస్టర్ చేసుకోలేదు. ఒకట్రెండు అడుగులు ముందుకే పడ్డాయి. 

    అంతలోనే మళ్ళీ ఆ అమ్మాయి ""దేరీజే షూటింగ్ ఇన్ ద మాల్!" అంది. అంటూ ముందుకి పరిగెత్తింది. 

    అంతే! ఒక్కసారిగా ముందుకి పడబోతున్న నా కుడి పాదాన్ని వెనక్కి తీసుకుని - వెనుతిరగబోయేలోగా - అప్పటికి నాముందు నడుస్తున్న బద్రి, పిల్లలిద్దరూ కూడా వెనక్కి తిరిగి  పరిగెడుతూ వచ్చారు. వాళ్ళతో పాటే నడుస్తున్న ఓ ఇరవై మంది కూడా మాతోనే పరిగెత్తుకుంటూ మాల్ బయటికి వెళ్ళే ద్వారం వైపు పరిగెట్టారు. 

    అందరి కన్నా ముందు నేనే ఎంట్రెన్స్ వైపున్న గాజుతలుపులవైపు పరిగెడుతున్నాను. 

    అలా పరిగెడుతున్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నది నేను వెనుతిరగబోయేముందు నా వెనకగా పరిగెత్తుకొస్తున్న నలుగురు టీనేజ్ అబ్బాయిల కళ్ళలో కనిపించిన భయం. 

    నా ఆలోచనలో నేను తెరవబోయేలోగా ఆ ఎంట్రెన్స్ దగ్గరున్న గాజుతలుపులు మూసుకుపోతే ఎలా అన్న భయం. 

    తీరా ఇంతా పరుగెత్తి మేమందరం బయటికి వెళ్ళగానే తుపాకీ పట్టుకున్నవాళ్ళు పార్కింగు లోకి వచ్చేస్తే ఎలా అన్న భయం. 

    ఒక నిముషం కన్నా తక్కువ వ్యవధిలో ఇన్ని రకాల భయాలు. 

    నేను గాజుతలుపుని తోసుకుని బయటికి రాగానే - అలాగే తెరిచి పట్టుకుని వున్నాను - నా తర్వాత లోపలి నుంచి వచ్చే వాళ్ళకి ఆ కొన్ని సెకన్ల సమయమైనా కలిసి వస్తుందని. నా తర్వాత వాళ్ళెవరో ఆ తలుపుని అందుకోగానే నేను పార్కింగులో ఉన్న కారు వైపు పరిగెత్తాను. 

    వెనకగా వస్తున్న బద్రి అక్కణ్ణించే కార్ అన్-లాక్ చేశారు కానీ - నేను కార్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే - వాళ్ళు ముగ్గురూ ఇంకా రావట్లేదు. 

    ఏంటా అని చూస్తే మాల్ తలుపులకి ఎదురుగుండా ఒకతను కార్ ఆపి "ఏంటీ? ఏం జరిగింది" అని అడుగుతుంటే బద్రి అతనికి "లోపల షూటింగ్ జరుగుతోంది. వెనక్కి వెళ్ళిపోండి" అని చెప్పగానే అతనెవరో పాపం చాలా కంగారు పడుతూ కార్ స్టార్ట్ చెయ్యడానికి రకరకాల బటన్లూ అవీ గాబరాగా నొక్కేస్తూ ఉంటే - బద్రి అతనికి భయపడకుండా వెళ్ళమని చెప్పి - ఆ తర్వాత వచ్చి మా కార్ స్టార్ట్ చేశారు. 

    నేను భయంతో ఆగకుండా పరిగెట్టుకొచ్చానేమో - కారు లోకి ఎక్కిన ఐదు నిముషాల వరకు ఆ బెదురు తగ్గలేదు. 

    మేం మాల్ లోంచి బయటికి వస్తూ ఉంటే - ఎంత మందో చిన్నపిల్లల్ని అడ్డదిడ్డంగా ఎత్తుకుని, కార్ సీట్లలో చంటి పిల్లల్ని మోసుకుంటూ - హడావిడి పడుతూ కార్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. 

    అంతలో మాకు ఎదురుగుండా రోడ్డు లోంచి పదకొండు పోలీస్ కార్లు మాల్ లోకి వెళ్ళాయి. 

    పైకి మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా - నాకు లోలోపల పట్టలేని దుఃఖం. 

    ఆ లోపలున్న వాళ్ళెవరో దుందుడుకు కోపంతో తుపాకీతో కాలిస్తే కాల్చారు - అది గురితప్పితే బావుణ్ణన్న పేరాశ. 

    అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగడానికి మనోబలం సరిపోని దుర్బలకాలం ఇది. 

తుపాకీ గుండు గురి - ఒకటే గుండెకి 
తప్పని గురికి చెదరినవి - ఇంకెన్ని గుండెలో 

మందు కూరిన గుండు తాకి ఒరిగిన గుండె ఒకటికి -
మనసు కూరిమి తాకిడుల విరిగినవి కనీసం ఇంకో రెండు... 
గోరుముద్దల బొజ్జ నింపిన అమ్మ గుండె 
చేయి పట్టి నడక నేర్పిన నాన్న గుండె 


కరిచిన కాలం వెనక్కి మళ్ళదని తెలుసు
దూసిన గుండు చేసిన గాయం మానదని తెలుసు
అయినా ... 
పదేపదే అనుకుంటే మాట మంత్రమవునేమోనని 
అదే అదే అనుకుంటూ ఉంటా- 
మళ్ళిమళ్ళీ - ఈ రోజు మరలి రాకుండనీ... 
మరెన్నడూ - ఈ రోజు మరలి రాకుండనీ... 


20, జూన్ 2021, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 12 - జీనా... ఇసీ కా నామ్ హై!

    నాకు నేను - గురుతుగా గుది గుచ్చుకుని - గమనంగా మననం చేసుకునే - మాటలు కొన్ని - ఈ పూటకి - ఇక్కడ పంచుకుంటున్నా... 

మనసుకి - బాసటగా - నమ్మకమవ్వు 
మనిషికి - ఆసరావై  - నిమ్మళమివ్వు 
అద్దిరా! అదీ జీవించడం!

చిరునవ్వు మొలకల కోసం - ఇవ్వగలిగినంత వదులుకో 
కడ లేని నొవ్వులు ఎదురైతే  - కొమ్ము కాసి అందుకో 
అద్దిరా! అదీ జీవించడం!

ఉండినంత ప్రేమ ఎడద నింపుకో 
అండదండవై ఎదను పెంచుకో 
అద్దిరా! అదీ జీవించడం!

అక్కరుంటే అదను పట్టి  - ఆశించక  ఆశ తీర్చు
ఉస్సురన్న ఊహకి - ఊపిరూది ఉసురు పెంచు
అద్దిరా!  అదీ జీవించడం!

లేనినాడు కూడా మనసు నిండ ఉండిపో 
తలచుకున్నవారి కన్నీట తళుకువై వెలిగిపో  
అద్దిరా! అదీ జీవించడం!

********
********


    పైనున్న నా రాతలకి ఊతమేమోననిపించేదీ, రాయాలన్న నా పూనికకి ఊనిక ఐనదీ - ఏనాటిదో పాత పాటొకటుంది. 

    ఆ పాట ఎన్నేళ్ళైనా వన్నె తరగని - పాత బంగారమంటిది.  

    ఆ పాట విన్న కొద్దీ వినాలనిపించేది.  

    ఆ పాట కన్న కొద్దీ కను-ముఱుపయ్యేది. 

    ముందుగా ఆ పాట ఆనుపానులేంటో చెప్తా... 

    అనగనగా అనాడీ అని ఓ నలుపుతెలుపుల హిందీ సినిమా. 

    అందులో ఉంది కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... అన్న ఈ పాట. 

    చిన్నచిన్న మాటలనే  గొప్ప పాటగా పేర్చిన హిందీ-ఉర్దూ కవి శైలేంద్ర

    ఆ పేర్చిన మాటల్ని అందమైన గీతమాలగా కూర్చింది శంకర్-జైకిషన్

    ఆ కూర్చిన గీతమాలని అందుకుని అలవోకగా తన గళం నుంచి జాలువార్చింది ముఖేష్

    ఆ పాట తనని చూసే రాశారేమోనన్నట్టు - ఆ పాట తనదే అన్నట్టు - అద్భుతంగా నటించి, పాటకి తగిన నటనమాడింది రాజ్ కపూర్


********
********


    పాట గురించిన కథ పూర్తయ్యింది కదా... 

    పాటలో నాకు కనిపించినవీ, నాకు నచ్చినవీ చెప్పేసి, చిరకాలంగా వెలుగుతున్న ఈ పాటని పదికాలాల పాటు నా రాతలో నిలుపుకోవాలన్నదే నేనీ పూటకి పడబోతున్న పాటు. 

    ఇక్కడి వరకు చదివారంటే - మరి నాతో పాటు మీరు కూడా ఈ పాటని విని, చూసి - ఆనందిస్తారని అనుకోవడం పొరబాటు కాదేమో?!


********
********

    చూడడానికి ఈ పాట ఎంత బావుంటుందో... ఇందులో ఎన్ని విశేషాలున్నాయో! 

    అవన్నీ వరసగా ఒకదాని తర్వాత ఒకటిగా - ఒక సరదా-పట్టికగా - రాసుకున్నాను. 
  
    నా ఇష్టాల పట్టిక: 

   దొరలా ముస్తాబు చేసుకున్న ఓ అబ్బాయి - ఇంటి గేటు ముందు వాగులా సాగుతున్న రహదారి మీదకి దూకిన - పరుగుతో మొదలవుతుంది ఈ పాట. 

    రోడ్డుకవతల హద్దుగా కనిపిస్తున్న పిట్టగోడ మీదుగా కనిపిస్తున్నది - అది అరేబియా సముద్రమేనేమో!

    ఆ పైన గాలిదారుల ఎగురుతున్న దారాల్లేని గాలిపటాల్లా పక్షులు. 

    తలకిందులుగా చూస్తున్న ఆకాశానికి వింజామరలు వీస్తున్నట్టున్న చెట్లు.
 
    ఊగుతున్న చెట్ల కొమ్మల పైన - పైపైన ఆకాశం మీద - దొంతరలుగా పరచుకున్న దూది మబ్బులు. 

    వాటిని తలెత్తి చూస్తూ - వాటన్నిటికీ పలకరింపుగా చెయ్యి ఊపుతూ, టోపీ సవరించుకుంటూ, పాదాలని ఉరికించుకుంటూ - ఆనందాన్ని భుజానున్న సంచీలో మోసుకెళ్తున్నట్టున రాజ్ కపూర్. 

    రోడ్డు మీద ముగ్గులేసిన చెట్ల నీడలు. 

    ఏ పొరుగునున్న పచ్చికబయలుకో మేతకని బయల్దేరి - బుద్ధిగా రెండు-మూడు వరుసల్లో తలలోంచుకుని నడుస్తున్న గొఱ్ఱెలు, వాటికి వెనకాల వాటిని వరస తప్పకుండా నడిపిస్తున్నట్టు అనుసరిస్తున్న ఓ నల్లమేక. 

    బ్యాండ్-బాజాతో కవాతు చేసుకుంటూ బడికి వెళ్తున్న ఆరుగురు స్కౌట్-బాయ్స్‌కి - పరుగు ఆపి -  రాజ్ కపూర్ చేసే సెల్యూట్. 

    రోడ్డు మీద మునికాళ్ళ మీద పెళ్ళినడక నడుస్తున్న ఆకుపచ్చ గొల్లభామ మీద వేయబోయిన బూటు తొడిగిన పాదాన్ని గాలి లోనే ఆపి, కొంచెంకొంచెంగా - అంచెలంచెలుగా కిందకి వంగి - ఓ ఆకు మీద ఆ ఆకుపురుగు నెక్కించి పక్కనున్న మొక్కల మీదుగా వదిలి పదిలించిన జీవకారుణ్యం. 

    ఆ పై మెలికలుగా అడుగులేస్తూ సాగిన పరుగు. 

    (అన్నట్టు ఈ మెలికల పరుగు దగ్గర మా ఇంటికి సంబంధించిన ఓ చిన్న జ్ఞాపకం - పిల్లల చిన్నప్పటిది. వాళ్ళు బళ్ళో నేర్చుకున్న Caterpillar walk - అంటే మెలికలుగా అడుగులేసుకుంటూ నడవడం అన్నమాట - అది నాకూ నేర్పారు. పిల్ల-Caterpillar కి తోడుగా అమ్మ-Caerpillar కూడా నడవాలి కాబట్టి. ఈ పాటలో రాజ్ కపూర్ మెలిక-కాళ్ళ పరుగు చూశాక మా Caterpillar-walk ఇంకోసారి గుర్తొచ్చి చిరు-నవ్వించింది.)

    పరుగులెడుతున్న రాజ్ కపూరుకి ఎదురొచ్చి గుండ్రంగా చేతులు పట్టుకు తిరిగిన ఇద్దరాడపిల్లల్లో ఒక పాప వేసుకున్న రెండు జళ్ళు, ఆ జళ్ళ చివరి రిబ్బను కుచ్చులు. 

    సైకిలు మీద ఎదురొచ్చిన ఇద్దరు ఈల-రాయుళ్ళు. 

    రోడ్డు పక్కన కూర్చుని జంగిడీలో వేయించిన వేరుశనగగుళ్ళో, వేరొకటో అమ్ముకుంటున్న అబ్బాయి తాలూకు నూనె రాసి దువ్విన నున్నటి తల. 

    ఆ నున్నటి తల తాలూకు అబ్బాయికి ఎదురుగుండా కూర్చుని - "నేను చెప్పే సత్యం వినూ!" అన్నట్టుగా రాజ్ కపూర్ చేతి వేలు ఊపుతూ - పాడిన నాలుగు లైన్లు 

మిటే జో - ప్యార్ కే లిఏ - వో జిందగీ (ప్రేమ కోసమేదైతే త్యాగమౌనో - అదీ జీవితం!)
జలే - బహార్ కే లిఏ - వో జిందగీ (ఆమని కోసమేదైతే తపించునో  - అదీ జీవితం!)
కిసీ కో హో న హో - హమే తో ఐత్‌బార్ (ఎవరికైనా ఉందో లేదో - నాకు మాత్రముంది నమ్మకం)
జీనా ... ఇసీ కా నామ్ హై! (జీవించడమంటే ఇదేననీ!)

    ఆ పాట వింటూ -  నవ్వుతో వెలిగిన మొహం. 

    ఆ నాలుగు వాక్యాలకీ - బహుమతిగా అన్నట్టు జంగిడీ- అబ్బాయి తీసిచ్చిన నాలుగైదు గింజలో, పళ్ళో - తీసుకుని - బదులుగా ఒక వందనం, నాలుగు చిందులతో అలరించిన రాజ్ కపూర్ నటన. 

    చేతికఱ్ఱ సాయంతో కనిపించని దారిని కనుగొంటూ నడుస్తున్న మనిషిని - ఒక సైకిలు గుద్దబోతే - చప్పున వెళ్ళి ఆ చేతికఱ్ఱ-మనిషిని ఇవతలికి లాగి భద్రంగా రోడ్డు దాటించి - తన చేతిలో ఉన్న నాలుగు గింజలూ అతనికిచ్చిన మంచితనం. 

    జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా (ప్రేమ అన్నది నా వల్లే ఇంకా జీవించి ఉంది) అనిపించిన జీవితం మీద ఇష్టం.  

    చివరిగా - రెండు చేతులతో జీవితాన్ని ఉన్నదున్నట్టుగా అందుకుని - అందిన దానిలో ఆనందాన్ని పొంది - ఆ ఆనందాన్ని ఎదురొచ్చిన అందరితో పంచుకుందామన్నట్టు - ఆ ఉదయపు నీరెండ దారుల్లో గెంతులేసుకుంటూ వెళ్తున్న - ఆనందవిహారిలా  - రాజ్ కపూర్ కనిపించే ఈ పాట చూసినప్పుడల్లా - నేను ప్రతీ ఫ్రేముని - అదే మొదటి సారన్నట్టుగా చూస్తాను. పాటలో ప్రతీ మాటనీ అదే మొదటిసారన్నట్టుగా వింటాను. 

    పాట విన్న ప్రతీసారీ - కొన్ని పదుల వేసవులు వెనక్కి మరలి - అక్కడెక్కడో వదిలొచ్చిన పసిదారుల్లో మసలి వస్తాను. పాటలో వినిపించే ఈలపాటని టీ-లపాటగా మార్చుకుని - టిట్టి టిట్టిడీ... టిట్టి టిట్టిడీ... టిట్టి టిట్టి టిట్టి టిట్టి టిట్టి టిట్టిడీ... అని నేనూ పాడుకుంటాను. 

    కొంచెం జలుబు-గొంతుతో ముఖేష్ పాడిన ఈ పాట - వినడానికి, కనడానికి - పైన చెప్పినవన్నీ కారణాలైనా - వీటన్నిటినీ మించిన ఇంకో కారణముంది. 

    అదేంటంటే... 

    పాటలో కనిపించే జంగిడీ-అబ్బాయి, కళ్ళు కనిపించని చేతికఱ్ఱ మనిషి - నాకెందుకో స్టూడియో మనుషులో, ఎక్స్‌ట్రా-ఆర్టిస్టులో అనిపించదు. 

    ఒకవేళ వాళ్ళు నిజజీవితపు మనుషులే అయి ఉన్నా, కాకపోయినా - ఒకవేళ చిన్నపాటి  ఎక్స్‌ట్రా-ఆర్టిస్టులే అయినా - ఆ పాటలో కొన్ని క్షణాల పాటైనా రాజ్ కపూరుతో దగ్గరగా గడిపినందుకు - ఆ కొన్ని క్షణాల గురించి తర్వాత ఎన్నేళ్ళపాటు ఆనందంగా తలచుకుని, చెప్పుకుని మురిసిపోయి ఉంటారో!  

    "నటనే అయినా - తనకి తెలియకుండానే అలాంటి ఆనందాన్ని వాళ్ళకి దక్కేట్లు చేసుంటాడేమో రాజ్ కపూర్!" అనిపించడం - ఈ పాట నాకు నచ్చడానికి - ఇంకో కారణం కాని కారణం. 

********
********


    తెలుపు-నలుపు రంగుల్లో అందమైన కదిలే చిత్రపటంలా ఉండే - ఈ పాట చూడాలనుకుంటే యూట్యూబ్ లింక్ ఇదిగో ఇక్కడ: https://www.youtube.com/watch?v=69pPYkGiEAQ



కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!

కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!

మానా - అప్‌నీ జేబ్ సే ఫకీర్ హై... 
ఫిర్ భీ యారో - దిల్ కే హమ్ అమీర్ హై!
మానా - అప్‌నీ జేబ్ సే ఫకీర్ హై... 
ఫిర్ భీ యారో - దిల్ కే హమ్ అమీర్ హై!
మిటే జో - ప్యార్ కే లిఏ - వో జిందగీ... 
జలే - బహార్ కే లిఏ - వో జిందగీ... 
కిసీ కో హో న హో - హమే తో ఐత్‌బార్!
జీనా ... ఇసీ కా నామ్ హై!

రిష్తా - దిల్ సే దిల్ కే - ఐత్‌బార్ కా... 
జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా!
రిష్తా - దిల్ సే దిల్ కే - ఐత్‌బార్ కా... 
జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా!
కే మర్ కే భీ - కిసీకో - యాద్ ఆయేంగే... 
కిసీ కే ఆసుఓం మే - ముస్కురాయేంగే... 
కహేగా - ఫూల్ హర్ కలీ సే - బార్ బార్!
జీనా ... ఇసీ కా నామ్ హై!

కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!


********
********

పాట ముచ్చట ముగించే ముందు - ఒకే ఒక్క చిన్న మాట... 

 అక్కరున్న చోట - అడగనవసరం లేకుండా 
అవసరం కనిపెట్టి - ఇచ్చినది ఎంతైనా 
ఇచ్చుటలో ఉన్న ముచ్చటేంటంటే 
ఇచ్చిన వారి మనసు విచ్చును 
ఇచ్చిన చోట నవ్వు విచ్చును 
"అద్దిరా! అదీ జీవించడం!" అనిపించును. 


~ పాటల భైరవి 



13, జూన్ 2021, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 23 - గోల్డెన్ రోజులు అలా మొదలు...

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 22 - ఎజ్దీ పోయి ఎలక వాహనమాయె - ఎస్కార్టుగా మారి అభిమానించె టంగుటూరే!

    1981 టొబాకో సీజన్ కూడా మామూలుగానే గడిచింది. 

    చిలకలూరిపేట హెడ్ ఆఫీసులో ఫ్యాక్టరీ - త్రెషింగ్ ప్లాంట్ కోఆర్డినేటర్ - భాస్కర్రావు గారని చెప్పేసి ఒకాయన ఉండేవాడు. '81 నవంబర్లో ఆయన రాజీనామా చేశాడు.  

    లక్ష్మయ్య గారి అబ్బాయి బాబు ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. భాస్కర్రావు గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి - చిలకలూరిపేటకి వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పారు. తీరా వెళ్ళాక ఇన్-ఛార్జ్ ఫ్యాక్టరీ కోఆర్డినేటర్‌గా నన్ను చూడమని చెప్పారు. 

    దాని కోసం టంగుటూరు నుంచి చిలకలూరిపేటకి వెళ్ళి - అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతీ సోమవారం పొద్దున్నే బయల్దేరి టంగుటూరు నుంచి చిలకలూరిపేటకి వెళ్ళేవాణ్ణి. 

    అప్పుడు చిలకలూరిపేట నరసరావుపేట జంక్షన్లో రెడ్డిగారిని చెప్పేసి ఒకాయన కృష్ణా లాడ్జ్ అని కొత్తగా కడుతున్నారు. అదింకా construction లో ఉంది. మొదటి రెండు అంతస్తులు పూర్తయ్యాయి. నాకు మొదటి అంతస్తులోనే ఒక మంచి రూమ్ ఇచ్చారు రెడ్డిగారు. 

    ఆ రూములో ఉంటూ - ప్రతిరోజూ తెల్లవారుఝామున అయిదున్నరకల్లా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాణ్ణి. 

    ఫ్యాక్టరీలో మొత్తం మూడు షిఫ్టులు. అందులో త్రెషింగ్ ప్లాంటువి రెండు షిఫ్టులు. దాంతో పొద్దున్న ఆరింటి నుంచి రాత్రి పదింటి వరకూ - రెండు త్రెషింగ్ షిఫ్టుల సమయమంతా అక్కడే ఉండేవాణ్ణి. రాత్రి పది దాటాక  రూముకి వచ్చేసి మళ్ళీ మర్నాడు పొద్దున్న వెళ్తుండేవాణ్ణి. . 

    ఆ రోజుల్లోనే మా ఫ్యాక్టరీకి గోల్డెన్ టొబాకో కంపెనీ ప్యాకింగుకి వచ్చింది. మా ఫ్యాక్టరీలోనే త్రెషింగ్ చేసి ప్యాకింగ్ చేసేవాళ్ళం. దాని జనరల్ మేనేజర్ ఖైతాన్ అని చెప్పేసి బొంబాయి ఆయన.

    ఆయన ఒకట్రెండుసార్లు మా ఫ్యాక్టరీకి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయన నన్ను పరిక్షిస్తున్నట్టుగా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. 

    "ఇందులో లీఫ్ పెర్సెంటేజ్ ఎంతొస్తుంది? లాస్ ఎంతొస్తుంది? స్టెమ్మింగ్ ఎంతొస్తుంది" -  ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉండేవాడు. వాటన్నిటికీ సరిగా సమాధానాలు చెప్తూనే ఆయన్ని ఆ యూనిట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రాక్టికల్‌గా వివరిస్తూ చెప్పేవాణ్ణి. అది విని ఆయన బానే సంతృప్తి చెందేవాడు. అలా మాట్లాడుతూనే నా వివరాలు అడిగేవాడు. ఆయన అలా అడిగినప్పుడు "నేను 72లో చేరాను ఇక్కడ. అప్పట్నుంచి ఇక్కడే వీళ్ళతోటే పని చేస్తున్నాను. " అని చెప్పాను. అక్కడికి అది అయిపోయింది. 

    సరే! డిసెంబర్ నెలకి గోల్డెన్ టొబాకో ప్యాకింగులు కూడా అయిపోయాయి. ఈలోగా నేను కూడా టంగుటూరు వచ్చేశాను. మళ్ళీ టంగుటూరులో నా బ్రాంచ్ మేనేజర్ పని నేను చేసుకుంటూ ఉండేవాణ్ణి. 

    ఇలా చేసుకుంటున్నపుడు "ఎంత కాలమిలా చేస్తాం? కృష్ణస్వామి గారితో అన్నట్టు నా ఐదంకెల జీతం చేరుకునేదెప్పటికి?" అన్న ఆలోచన నా బుఱ్ఱలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. 

    ఇంతలో గోల్డెన్ టొబాకో కంపెనీ వాళ్ళు స్టాఫుని తీసుకుంటున్నారని తెలిసింది. అందులో South కి గ్రేడింగ్ అదీ చూసుకోవడానికి ఒక మేనేజర్ కావాలని కూడా ఉంది. 

    South కొకళ్ళు, North కొకళ్ళు, Central లో ఒకళ్ళు - ఈ ముగ్గురి మీదా ఒక ప్రొడక్షన్ మేనేజర్ చింతం వీరయ్య గారని ఉండేవారు. 

    ఆ South position నాకు ఆఫర్ చేశారు. నాకేమో అప్పటికి లీఫ్ అంత బాగా తెలీదు. ఏదో గ్రేడింగ్ హాల్లోకి వెళ్ళి దబాయించుకొచ్చేవాణ్ణి కానీ. ఎందుకంటే గ్రేడింగ్ చేసే మేస్త్రులు ఆడవాళ్ళుండేవారు. వాళ్ళు మొదట్నుంచి పొగాకు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకున్నంత knowledgeఅవగాహన నాకుండదు. గమ్మున మనం పొరపాటు మాట్లాడితే మనకు తాటాకులు కట్టేస్తారు వాళ్ళు. 

    అంచేత అసలు నాకు లీఫ్ నాలెడ్జ్ లేదు - అలా లేనప్పుడు దీనికసలు వెళ్లడమా, మానడమా - అంజెప్పేసి ఆలోచిస్తుంటే అసలు ఏం చెయ్యాలో తోచక నాకు అయోమయమైపోయింది. 

    ఈ లోగా మా గురువుగారు సుబ్బన్న గారు ఓ రోజు చిలకలూరిపేట నుంచి బ్రాంచుకొచ్చాడు. ఆయనతో "సర్! ఇదీ పరిస్థితి. నాకేమో గోల్డెన్ లో ఆఫర్ తీసుకోవాలని ఉంది. నాకేమో లీఫ్ గురించి ఏమీ తెలీదు. ఏం చేయాలో తోచట్లేదు" అనగానే ఆయన "ఒరే! ఓ పంజెయ్. వెళ్ళు - గోల్డెన్ కెళ్ళు. నువ్వు సెలెక్ట్ ఐతే చేరిపో. తర్వాత ఏం చెయ్యాలో నేజెప్తాను. ముందా పని చెయ్" అని చెప్పేసి ఆయన నాకు భరోసా ఇచ్చాడు. దాంతో నేను ఇంకేమీ ఆలోచించకుండా గోల్డెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. 

    వెళ్ళాక ఖైతాన్ గారు చూశాడు. "ఏంటి ఇలా వచ్చావ్? నువ్వక్కడ ఫ్యాక్టరీలో చేస్తున్నావు కదా?!" అన్నాడు. 

    వెంటనే నేను "నేను ఫ్యాక్టరీలో కాదు. టంగుటూరు బ్రాంచులో చేస్తూ ఫ్యాక్టరీలో ఇన్-ఛార్జ్ గా వచ్చాను." అని అన్నాను. 

    "అయితే వెంటనే వచ్చి చేరతావా? నేను లక్ష్మయ్యకి చెప్పాలా?" అన్నాడాయన. 

    "చెప్పాలో వద్దో అది  మీ ఇష్టం" అంజెప్పేసి నేనంటే "సరే! రేప్పొద్దున్న రా. చెప్తాన్నేను" అన్నాడు. 

    మర్నాడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు రాత్రి నేను సుబ్బన్నగార్ని కలిశాను. ఆయనప్పుడు ఒంగోల్లో ఊర్వశి హోటల్లో ఉన్నాడు. 

    ఆయన్ని ఊర్వశి హోటల్ రూంలో కలిసి "సర్! వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. వాళ్ళు లీఫ్ గురించి అడిగితే ఏం జరుగుతుందో ఏంటో!" అన్నాను. 

    దానికి ఆయన వెంటనే "ఏం ఫర్లేదు. అక్కడ మనవాడొకడున్నాడు. శంకరనారాయణ గారని చెప్పేసి ఉంటాడక్కడ - గోల్డెన్ టొబాకో కంపెనీలో లీఫ్ మేనేజర్. నీకేం ఫర్వాలేదు వెళ్ళు" అన్నాడు. 

    అంతే కాకుండా సుబ్బన్నగారు లీఫ్ గురించి, ఎక్సపోర్ట్స్ గురించి కొన్ని విషయాలు నాకు ఆ రాత్రి చెప్పారు. 

    మరుసటి రోజు ఇంటర్వ్యూలో ఖైతాన్ గారు, శంకరనారాయణ గారు, ప్రొడక్షన్ మేనేజర్ చింతం వీరయ్యగారు, నరేంద్ర అని ఒక గుజరాతీ ఆయన - ఫైనాన్స్ మేనేజర్ - ఈ నలుగురూ కూర్చుని నన్ను ఇంటర్వ్యూ చేశారు. 

    అలా చేసినప్పుడు ఖైతాన్ గారు అడిగాడు. ఏమనంటే "సరే! మనం టొబాకో కొంటున్నాం. ఏ గ్రేడ్ మనకి పనికొస్తుంది? ఏ గ్రేళ్ళు గోల్డెన్ టొబాకోకి దేనికి పనికొస్తాయి?" అని. 

    "సర్! గోల్డెన్ టొబాకోకి గ్రేడ్ 3  అనేది ఒకటుంది. అది జపానుకెళ్తుంది. వచ్చిందాంట్లో గ్రేడ్ చేసినప్పుడు ఆ గ్రేడ్ 3 జపాన్ ఎక్సపోర్ట్స్. తర్వాత గ్రేడ్సులో గ్రేడ్ 4 అంజెప్పేసి ఉంటుంది. ఆ గ్రేడ్ 4 అనేది లండన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ రెండూ కాక కాంపోజిట్ గ్రేడ్స్ ఉన్నాయి. వాటిని 4సి అంటారు దాన్ని. ఈ గ్రేడు ఇంపీరియల్ టొబాకోకి పనికొస్తుంది ఇది." అన్నాను. 

    అలా అన్నాక "మరి ఆ తర్వాత కింద గ్రేడ్స్ అన్నీ కూడా ఆ బి-ఎక్సులూ, బ్రౌన్లూ అవన్నీ ఏమిటీ? " అన్నాడు ఖైతాన్ గారు. 

    "సర్! అవన్నీ మీ మ్యానుఫ్యాక్చరింగే సర్ అవి. మీరు బ్లెండ్ చేసుకుని మీ పనామా సిగరెట్లలో కలుపుకొందుకు ఆ కింద గ్రేళ్లన్నీ పనికొస్తాయి" అనేటప్పటికి ఫక్కున నవ్వాడాయన. నవ్వి "You're selected" అన్నాడు. 

    అలా గోల్డెన్ టొబాకోలో ప్రవేశించాను. అప్పుడు ఖైతాన్ గారు  చెప్పిందేంటంటే "గోల్డెన్ టొబాకోకి డైరెక్టుగా నిన్ను తీసుకోవట్లేదు. దీనికి సిస్టర్-కన్సర్న్ ఒకటుంది. TMT అని - అంటే తిరుపతి మ్యాచ్ టొబాకో కంపెనీ. అంటే వాళ్ళు అగ్గిపెట్టెలు కూడా తయారు చేస్తారు. దాంతో పాటే టొబాకో కూడా. దాంట్లో నువ్వు సౌత్లో గ్రేడింగ్స్ మొత్తం నువ్వు చూడాలి" అని. 

    "ఒకే సర్" అన్నాన్నేను.  

    అప్పుడు సౌత్లో నాకిచ్చిన గ్రేడింగ్ సెంటర్స్ ఏంటంటే టంగుటూరులో ఒక రెండు గ్రేడింగ్ పాయింట్లు - గూడూరు భూషయ్య గారిది ఒకటి, పత్తిపాటి సుబ్బరావు (ఎఱ్ఱబ్బాయి) దొకటి.  ఈ రెంటికీ కాంట్రాక్టర్ ఎవరంటే పైడి కిష్టయ్య. ఆ తర్వాత ఉప్పలపాడు, కామయ్య పాలెం, చింతలపూడి, మేదరమెట్ల, త్రోవగుంట దగ్గరున్న మర్లగుంట పాలెం, వేటపాలెం - ఈ మొత్తం పాయింట్స్ మీద నేను ఇన్-చార్జుని. ఆ రకంగా నాకు అపాయింటుమెంటు ఇచ్చారు. ప్రొడక్షన్ మేనేజర్ వీరయ్యగారు నాకు ఇమ్మీడియట్ బాస్. 

    నేను ఎమ్మెల్ కంపెనీలో ఉన్నప్పుడు గ్రేడింగ్ టేబుల్స్ దగ్గర నల్లపొగాకు అదీ ఏరి పక్కన పెడుతూ ఉండేవాణ్ణి కదా... దాన్ని బేస్ చేసుకుని ప్రతిచోటా కూడా తక్కువ రకం ఏదుందో - సెలైన్ టొబాకో, బ్లాక్ టొబాకో, గ్రీన్స్ - ఇటువంటివన్నీ పట్టుకునేవాణ్ణి. ఈ మేజర్ గ్రేడ్స్ వచ్చినప్పుడు అలాంటివాటిని పట్టుకుని దబాయించేసేవాణ్ణి. దీంతోటి ఏమైందంటే "అబ్బో! ఈయనేదో చాలా నాలెడ్జ్ ఉన్నవాడ"ని చెప్పేసి అందరూ భయపడిపోయేవారు. ఈ గ్రేడింగ్ సెంటర్స్ అన్నిట్లో కూడా నేను వెళ్తే గడగడలాడుతూ ఉండేవారు. ఆ రకంగా 82 దాకా మేనేజ్ చేశాను. 

    ఈలోగా నాకో ఆక్సిడెంట్ అయింది. అదెలా జరిగిందంటే... 

  

<వచ్చేమాటు తరువాయి కథ>