దీనికి ముందు కబుర్లు చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి 2.0 - 1 - హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే..
అప్పటి దాకా - నేనెలా ఉండేదాన్నంటే -
మేడ మెట్లు ఎక్కాలంటే ఒక్క పరుగున ఎక్కుతూ - దిగేటప్పుడు రెండేసి మెట్లు దూకుతూ దిగుతూ - ఎక్కడికైనా వెళ్ళాలంటే నడకకి ఎక్కువా, పరుగుకి తక్కువగా వడివడిగా అడుగులు పడుతూ - మాటల కన్నా పాటలు ఎక్కువ పాడుతూ, మాట్లాడే మాటల్లో ఎక్కువగా వినపడుతుండే వాడీ, మాటలకి తోడుగా నవ్వులు గలగలలాడి - హడావిడి పడిపోతూ ఉండేదాన్ని.
కానీ కొత్తగా మెడలో చేరిన పచ్చని పసుపుతాడు, దానికి తోడు మిలమిల్లాడుతున్న నల్లపూసల దౌరు, కాలివేళ్ళకి చేరిన వెండి చుట్లూ - అప్పటి వరకూ నేనెరుగని ఒక నెమ్మదిని నాకు నేర్పాయి.
దానికి తోడు పెళ్లయ్యాక పదహార్రోజుల పండగ దాకా రోజుకో కొత్తచీర కట్టుకోవాలని అమ్మ బోల్డన్ని చీరలు కొంది. అప్పుడే చీర అంటే ఇష్టం మొదలైంది. అంత ఇష్టంగా కట్టుకున్న చీర నా అడుగులకి అందంగా అడ్డం పడుతూ నా నడకకి కూడా నెమ్మది నేర్పింది.
అత్తవారింట్లో కొత్త వాతావరణం. అందరూ కలుపుగోలుగా మాట్లాడుతున్నా నాకే ఏదో తెలీని బెరుకు.
అప్పటివరకూ నేనెంత మాట్లాడినా - ఇంట్లో అయితే పప్పీ, కుట్టీలతో - ఫ్రెండుగా అపర్ణ ఒక్కదానితో మాత్రమే.
నా ప్రపంచం అంతా కూడా యూనివర్సిటీ కేంపసూ, క్లాసులూ, పుస్తకాలు, పాటలూ, సినిమాలూ, రికామీగా తిరిగిన షికార్లు.
పెళ్ళితో ఒక్కసారిగా అన్నీ మారిపోయినట్లనిపించింది.
అత్తవారింట్లో కొత్తపెళ్ళికూతుర్ని చూడడానికి వచ్చే బంధువులు, ఇరుగు-పొరుగువాళ్ళు, బద్రి స్నేహితులు. వుక్కిరిబిక్కిరిగా అనిపించేది.
ఉన్నట్టుండి ఒక్కసారిగా
ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా
నాకే తెలియని నేనుగా,
అంతకు ముందెప్పుడూ నేనెఱుగని నన్నుగా -
నాకు నేనే కొత్తగా
అనిపిస్తున్నాను,
కనిపిస్తున్నాను.
*** *** ***
*** *** ***
పెళ్ళి అయిన రెండోరోజు మా ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయిద్దామనుకుంటే - మా ఇంట్లో ఆనవాయితీ లేదని అత్తయ్య అంటే అదేదో మేమే చేస్తామని అమ్మా-నాన్న అన్నారు.
ఆ రోజు పొద్దున్నే అత్తయ్య పెట్టిన వంగపండు రంగు సరిగ చీర, దాని మీదకి అమ్మ కుట్టించిన జరీదారాల బ్లౌజూ వేసుకుని బద్రి చేయి పట్టుకుని అమ్మా వాళ్ళింటి ముందు కారు దిగగానే - అప్పటికి ఒక్క రాత్రి దూరంగా ఉన్నందుకే అది "మా ఇల్లు" నుంచి "అమ్మా వాళ్ళిల్లు" అయిపోయిందని ఒక్కసారిగా గుర్తొచ్చి - ఏదో చెప్పలేని దిగులేసి - ఆపుకోలేనంతగా బోల్డు ఏడుపొచ్చేసింది. షంషాద్ బేగం పాట పెదవులమీదకొచ్చి ఇంకొంచెం ఏడిపించింది.
యాద్ మైకే కీ - దిల్ సే - భులాయే చలీ,
హాఁ ... భులాయే చలీ...
ప్రీత్ సాజన్ కీ - మన్ మే బసాయే చలీ
హాఁ ... బసాయే చలీ...
యాద్ కర్‌కే - యే ఘర్ - రోయీ ఆంఖే...
మగర్ ముస్కురానా పడా ...
అక్కడే ఉన్న జయాంటీ (మా పాపాయత్తయ్యగారమ్మయి) నా కళ్ళలో నీళ్ళు చూసి - చటుక్కున నన్ను దగ్గరగా తీసుకుని - లోపలికి తీసుకెళ్ళి నా చేత గోరువెచ్చటి పాలు తాగించారు. అప్పుడు జయాంటీ చేతుల మధ్య నన్ను సోకిన వెచ్చదనం, నా పెదవుల తాకిన గోరువెచ్చటి పాల కమ్మదనం ఇప్పటికీ ఒక నులివెౘ్చని జ్ఞాపకం.
*** *** ***
*** *** ***
ఆ తర్వాత పదిరోజుల్లో - బద్రి, నేను కబుర్లు చెప్పుకుంటూ - గుంటూరు రోడ్ల మీద వెళ్తూవెళ్తూ - వాల్-పోస్టర్లు చూసి అప్పటికప్పుడు అనుకుని లోపలికి వెళ్లి చూసిన సినిమాలు - ఎప్పటివో పాతాతిపాతవి - బద్రికి ఇష్టమైన సావిత్రి act చేసిందని "మాతృదేవత", పాటలు బావుంటాయని "శ్రీకృష్ణార్జున యుద్ధం".
ఇవి కాక - పుట్టింటివాళ్ళూ, మెట్టింటివాళ్ళూ - అందరం కలిసి వెళ్లిన మొదటి సినిమా "రాజేంద్రుడు-గజేంద్రుడు" - ఫస్ట్-షో చూసి ఇంటికి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ ఫాల్గుణమాస-కృష్ణపక్షపు రాత్రి పూట నాకు గుంటూరు రోడ్లు ఎంత కొత్తగా కనిపించాయో! నేనెప్పుడూ అంతకుముందు అక్కడ నడవనట్లే. నాలాగే అవీ కొత్తగా పుట్టినట్టే.
*** *** ***
*** *** ***
ఇంకా పెళ్ళయ్యాక పదహార్రోజుల పండగ లోగా కలిసిన కొత్తమనుషులు - వీళ్ళందరూ బద్రి స్నేహితులు - పద్మజాతిలక్ అనే అమ్మాయి, అనీస్-అస్మా-ఇద్రిస్, ఆనంద్, మదన్, సీకే అని పిలవబడే చెన్నకేశవరెడ్డి, "అమ్మో! ఈ అమ్మాయినా నువ్వు చేసుకుంది" అనాశ్చర్యపోయిన మా ఏసీ కాలేజ్ సీనియర్ రవితేజ.
వీళ్ళే కాకుండా చక్రవర్తి అంకుల్ అని బద్రి ఎప్పుడూ చెప్పే చక్రవర్తి గారు అంటే ఎవరో కాదు చిన్నప్పుడేప్పుడో నాకు ఒకటో తరగతిలో ప్రైవేటు చెప్పిన టీచరుగారి తమ్ముడుగారు.
(ఈవిడ దగ్గరికే రాను-రానంటున్న నన్ను ఇద్దరు కలిసి రోడ్డంతా ఉయాలూపుతున్నట్టు చెరో రెక్కా పట్టి మోసుకెళ్ళేవారు. నేను ఆవిడ ఇంటి గుమ్మం మీద కూర్చుని ఏడుస్తుంటే మా అమ్మకి నాన్నమ్మ - మా శివకోడు-మామ్మ వచ్చి ఆవిడకి పరవాణ్ణం లంచమిచ్చి నన్నెంచగ్గా ఇంటికి తీసుకేళ్ళిపోయిందో రోజు. ఇంకొకప్పుడైతే అవన్నీ ఆ టీచరుగారికి గుర్తు చేసి తెగ నవ్వేసుకుని ఉండేదాన్నేమో. కానీ అదేం వింతో మాటలే మర్చిపోయినట్టుండిపోయాను. నిజంగానే నేను చాలా మారిపోయినట్టున్నాను హఠాత్తుగా... ఆరిందాలా... )
అన్నట్టు వీళ్ళందరితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. బద్రీ, నేనూ ఓ రోజు నాకు కొత్తచెప్పులు కొందామని వెళ్ళి, వస్తూవస్తూ గీతా-కేఫ్‌లో భోంచేద్దామని వెళ్ళి - కూర్చున్నామో లేదో ఒకతను వచ్చి మా ఎదురుగుండా కూర్చుని - భోజనంతో పాటు బోల్డన్ని కబుర్లు కూడా తినిపించాడు. అతని పేరు విజయభాస్కరరెడ్డి అని తప్ప బద్రికి ఇంకేమీ తెలీదని తర్వాత తెలిసింది.
మా పెళ్ళైన రెండు వారాల్లో దుర్ముఖినామ ఉగాది పండగ వచ్చింది. ఆ రోజు నేనే వంట చేస్తానంటే అత్తయ్య బోల్డు సంబర పడ్డారు. మొట్టమొదటిసారిగా మా అత్తవారింట్లో నేను చేసిన వంట - కేరట్-కొబ్బరి కూర, మావిడికాయ పులిహోర. బాగానే చేశాను. అంతే ... ఆ ఒక్కరోజే.
ఇంతలో ఉగాది వెళ్ళిన మూడ్రోజులకి పదహార్రోజుల పండగ వచ్చేసింది. ఆ ముందురోజే బద్రి, నేను మా అత్తవారింటి నుంచి అమ్మా వాళ్ళింటికి వెళ్ళాము.
ఆ రోజు పొద్దున్నే అమ్మ "రండి, బద్రీ! కొత్తల్లుడికి అత్తగారు తలంటాలి" అంటూ కుంకుడుకాయలరసంతో బద్రికి తలంటు పోసింది అమ్మ.
నేను కూడా తయారయి - మేమిద్దరం కొత్తబట్టలు కట్టుకున్న తర్వాత - నా మెడలో పసుపుతాళ్ళకి విడివిడిగా ఉన్న మంగళసూత్రాలని బంగారం గొలుసులో - పొరలుగా పేని పసుపు రాసిన దారాలతో - అమ్మ గుచ్చి ఇస్తే - "నేనైతే గట్టిగా వేస్తాను - ఇలా ఇయ్యి" అని అడిగి మరీ తీసుకుని ముడివేసిచ్చారు నాన్న. బద్రి నా మెడలో కట్టిన మంగళసూత్రాలు అమ్మ-నాన్న కలిసి ఇంకొంచేం గట్టిగా ఇంకొన్ని ముళ్ళేసి - నా మెళ్ళో మళ్ళీ బద్రి చేత వేయించారు. పదహార్రోజులపండగ వేడుకగా ముగిసింది.
ఆ తర్వాతి రోజే బయల్దేరి బద్రి బెంగుళూరు వెళ్ళారు. వెళ్తూ నాకు చెప్పిన మాట "నేను బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకునేదాకా నువ్వొక రెండు మూడు నెలలు అమ్మ, తమ్ముడు, చెల్లెలు వాళ్ళ దగ్గరే ఉండాలి" అని.
అప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటి తెలుసా ...?
పెళ్ళికి ముందు ఫాల్గుణ పౌర్ణమి రోజు అమ్మతో నేనన్న మాటలు...ఇంతకు ముందు రాసినవే - మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా...
ఆ ఫాల్గుణ పౌర్ణమి రోజు మొదటిసారిగా దిగులుగా అనిపించింది.
జరగబోయేది నా పెళ్ళి. నే కోరుకున్నట్టుగానే నా కిష్టమైన అబ్బాయితోనే. అది కూడా మా అమ్మానాన్నలు ఒప్పుకుని నా ఇష్టాన్ని మన్నిస్తూ చేస్తున్నదే!
అయినా ఇంకో మూడు రోజుల్లో అమ్మనీ, నాన్ననీ, పప్పీని. కుట్టీని, ఈ ఇంటినీ, తులశమ్మనీ, ఆ తులశమ్మ ముందు ముగ్గు వేసే మురిపాన్నీ, ఆ ముగ్గులో రాలే విరిసిన చంద్రకాంతల్నీ ఒదిలి వెళ్తాననే బెంగ.
ఆ రోజు రాత్రి అందరం భోజనాలు చేసిన తర్వాత - ఎప్పటి మా అలవాటు ప్రకారం ఇంటి ముందున్న కుర్చీల్లో కూర్చుని పప్పి, కుట్టీలతో కలిసి ఛాయాగీత్ వింటున్నాను. చలో దిల్‌దార్ చలో ...చాంద్ కే పార్ చలో...అని రఫీ రాగాలు తీస్తుంటే , హమ్ హై తైయార్ చలో అని లతా మంగేష్కర్ ఆనందంగా పాడేస్తోంది. అదేంటో ఎప్పుడు ఛాయాగీత్ పెట్టినా వారానికి నాలుగు రోజులు ఆ పాట తప్పకుండా వచ్చేది.
ఆ పాట వింటుంటే కుట్టి అందుకుని "లల్లి తైయార్ చలో" అని పాడుతూ నాకేసి చూసి "ఇంకో మూడు రోజులే లల్లెమ్మా! నిన్నిహ పద పద పమ్మక్కా అని పంపించేసి నేను, పప్పి హాయిగా ఉంటాం. కదే పప్పీ!" అని పప్పితో అని - మళ్ళీ నాకేసి తిరిగి - " అప్పుడు నీ స్టాంపులు, బొమ్మలు అన్నీ నావే!" అని నవ్వింది. పప్పి కూడా సవ్వడి లేని నవ్వు ముత్యాలు రాల్చింది.
నేను వెంటనే లేచి వంటింట్లో గిన్నెలేవో సర్దుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వంటింట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు.
"అమ్మా!" అని వంటింటి తలుపు దగ్గర ఆగి మెల్లిగా పిలిచాను.
అమ్మ గ్యాస్ గట్టు తుడుస్తూ "వచ్చావా? అదుగో ఆ వాటర్ ఫిల్టర్ మీద గ్లాసులో పాలు పోసిపెట్టాను. తాగు." అంది తల తిప్పకుండానే.
ఒకడుగు ముందుకేసి ఆ గ్లాసు తీసుకుని రెండు అరచేతుల మధ్యా ఆ గ్లాసునలముకుని ఉన్న వెచ్చదనాన్ని పట్టుకుని, పాలు ఓ గుక్క తాగి "అమ్మా! నేనిన్ని రోజులు హాస్టల్లోనూ, ప్రాజెక్టు కోసమని బెంగుళూర్లోనూ ఉన్నాను. అసలు ఇంట్లోనే ఉన్నట్టు లేదు. అందుకే నా పెళ్ళయ్యాక ఓ మూణ్ణెల్లు మనింట్లోనే నీ దగ్గరే ఉంటానూ... సరేనా?!" అని నెమ్మదిగా అడిగాను. ఎందుకో తెలీని దుఃఖమొస్తోంది. ముక్కు పీలుస్తున్నాను.
అమ్మ తల తిప్పి చూసి నవ్వబోయి, నన్ను చూసి ఏమనుకుందో ఏమో, దగ్గరగా వచ్చి "నీకిష్టమైనట్టుగానే అన్నీ చేస్తున్నాంగా. ఆ తర్వాత చూద్దాంలే... " అని ఆగి ... మళ్ళీ ఏదో ఆలోచించుకున్నట్టు "నీక్కావల్సినన్ని రోజులు మనింట్లో ఉందువుగానిలే. వెళ్ళు - ముందు ఆ పాలు తాగేసి ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుక్కో. " అని చెప్పింది.
ఇంతలో - ఎప్పట్నుంచి మా మాటలు వింటోందో - కుట్టి నా పక్కనే వచ్చి నించుని ఓ చేత్తో నా షిప్లీ బొమ్మని పట్టుకుని "చంటిపిల్లలా అమ్మని వదిలి వెళ్ళనని ఏడుస్తావేంటే, లల్లీ ? ఇదిగో ---దీన్ని కూడా పట్టుకుపోవే బాబూ! దీన్ని పట్టుకుని 'జుజుజుజుజూ 'అని ఎంచగ్గా పాడుకోవచ్చు నువ్వు." అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అంటుంటే నాకు అంత దుఃఖం లోనూ బోల్డు నవ్వొచ్చేసింది.
బద్రి చెప్పినట్టే ఆ తర్వాతి రెండు నెలలూ నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను - మధ్యలో ఒక నాలుగు రోజులు తప్ప.
బ్రాడీపేట నాలుగో లైను, పద్ధెనిమిదో అడ్డరోడ్డులో ఉన్న అమ్మా వాళ్ళింటికి, రెండోలైను పదకొండో అడ్డరోడ్డులో ఉన్న మా అత్తగారి ఇల్లు - జస్ట్ రెండు లైన్ల ఏడు అడ్డరోడ్ల దూరం మాత్రమే అనిపించినా దూరం దూరమే కదా!
*** *** ***
*** *** ***
నేనా దూరం కొలుచుకుంటూ ఇక్కడుంటాను.
నన్నేడిపించిన షంషాద్ బేగం పాటొకటి పైనుంది కదా... ? దాని మొదలూ-తుదీ మీరేమన్నా పట్టగలరేమో పాడి చూడండి...
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>