4, సెప్టెంబర్ 2016, ఆదివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 1 - నాన్నమ్మ


పిల్లలకి తొలిగురువు అమ్మ.
తర్వాత ఒడిలో కూర్చోబెట్టుకుని  చేయి పట్టి పలక మీద

              ఓ నమః
               శివాయః
              సిద్ధం నమః

- అని  అక్షరాభ్యాసం చేయించిన  రామశేషు మాస్టారితో మొదలుకొని  చదువు పూర్తయేదాకా ఇంకెందరో చదివించిన గురువులు.


ఈ అసలు గురువులే కాక - నా చేత ఏ పుస్తకాలూ చదివించకుండా, పరీక్షలు పెట్టకుండా -  జీవితాన్ని అందంగా దిద్దుకోవడానికి, అవసరమైన చోట నెగ్గడానికి - కావాల్సిన చదువుని నేర్పించీ నేర్పించనట్లు నేర్పించిన నేర్పరులయిన గురువులెందరో . అలాంటి కొందరు గురువులూ  - వాళ్లనుంచి నేను నేర్చిన పాఠాల కబుర్లే - ఈ చదివించని గురువులు series.

అందులో ప్రథమ తాంబూలం -  ఆది పూజితుడయిన పార్వతీ తనయుని గురించి -

అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేసి ప్రార్ధింతుమదిన్ !!


- అన్న అచ్చ తెలుగు పద్యం నాకు నేర్పిన మా నాన్నమ్మకే.


నాన్నమ్మ 

"కమలములు వికసించే
కమలాప్తుడుదయించే
లోకసుందరి బాలా మేలుకో
కమల మొదలయిన అమర కాంతలెల్లా
నిను గొల్వ వచ్చిరి మేలుకో
తెల్లవార వచ్చెనూ ..."

అన్న మేలుకొలుపుతో నాన్నమ్మ దినచర్య మొదలు.


మడి కట్టుకుని పదింటికల్లా - వంకాయ కారం పెట్టి కూర, కొబ్బరి కాయ తియ్య పచ్చడి, కందిపప్పు పోపుతో రుబ్బి పెరట్లో కాసిన అరటికాయ, పొలం నుంచి వచ్చిన ఆనపకాయ వేసి సాంబారు - దాదాపు రోజూ ఇలా ఒక కూర, పచ్చడి, పులుసో -సాంబారో - అంత వంటా పూర్తి చేసి - ఇంట్లో అప్ప, నాన్న, పిల్లలం మేమందరం భోంచేసే దాకా - ఆ మడిచీర తోనే  కటకటాల్లో (గ్రిల్ వేసి వుండే మా ఉయ్యాల బల్ల గదిని కటకటాలు అనే పిలుస్తాము - ఇప్పటికీ ) ఉయ్యాల బల్ల పక్కనే స్తంభం దగ్గర కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు.

చిన్నతనంలో ఒక్కోసారి అసలు నాన్నమ్మ ఏం చేస్తారో చూద్దాం అని ఆకతాయితనంగా ఆవిడని ముట్టుకుంటే వెంటనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి చేదతో నీళ్లు తోడుకొని తలారా చన్నీళ్లతో స్నానం చేసి వచ్చి ఇంకో మడిచీర కట్టుకునే వారు తప్ప - చిన్న పిల్లనైన నన్ను ఒక్కసారి కూడా - విసుక్కున్న గుర్తు లేదు. అసలు ఆవిడకి కథలు, వినసొంపుగా సందర్భోచితంగా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క మాట కూడా అనవసరమయినది - మాటవరసకయినా, కాలక్షేపానికయినా - మాట్లాడడం అలవాటు ఉండేది కాదు.

మా అందరి భోజనాలయ్యాక ఇద్దరు కోడళ్లతో (లలిత దొడ్డ, అమ్మ) కలిసి భోంచేసేసి మళ్లీ ఉయ్యాల బల్ల దగ్గర కూర్చునేవారు - భారతమో, భాగవతమో పట్టుకుని.


అప్పటికి ఒంటిగంట అయి ఉండేదేమో - ఒక్కొక్కరుగా నాన్నమ్మ స్నేహబృందం - పప్పు అమ్మమ్మగారు నర్సమ్మామ్మ, కాముడు తోచ్చి, సీతమ్మామ్మ, లచ్చిందేవి మామ్మ, కామమ్మ గారు - ఇలా అందరూ వాళ్ల వాళ్ల భోజనాలు ముగించుకుని వచ్చేసేవారు. నాన్నమ్మ చదివే భారతం, భాగవతం వినడానికి. మళ్లీ కాఫీల వేళకి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయేవారు.

నాన్నమ్మ పుస్తక పఠనంలో పిల్లలతో పోటీ పడేవారు. అప్ప (అంటే మా పెదనాన్నగారు) - ప్రతీ రోజు ఉదయం, ఈనాడు, హిందూ లాంటి పేపర్లతో పాటు -  ప్రతీ వారం ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర పత్రిక లాంటి వార పత్రికలూ - యువ, స్వాతి లాంటి మాసపత్రికలూ -  తెలుగు-ఇంగ్లీష్ చందమామలు - ఇలా బోల్డన్ని పుస్తకాలు తెప్పించేవారు. (ఇప్పటికీ ప్రస్తుతం మార్కెట్టులో దొరికే దిన, వార, మాస పత్రికలన్నీ తెప్పిస్తున్నారు కూడా.)


ప్రతీ వారం వారపత్రికలు వచ్చే టైంకి - నేను కనక అప్పటికి ఏ సెలవులో వుండి అనాతవరంలో వుంటే - నాన్నమ్మ, నాన్న, శ్రీను (మా అన్న), నేను - పుస్తకాల కోసం పోటీ పడేవాళ్లం. సాధారణంగా నాన్నో, శ్రీనో గెలిచేవారు. ఎందుకంటే వాళ్లిద్దరూ పేపర్ అబ్బాయి వచ్చే వేళకి వీధి అరుగు మీద నించుని వుండి పుస్తకాలు తీసేసుకుని ఒక బొత్తిలా పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి చదివాకే నాకు, నాన్నమ్మకీ ఇచ్చేవాళ్లు. నాన్నమ్మ ఆ పుస్తకాల్లో పార్థు లాంటి సీరియల్సూ, పురాణం సీత - ఇల్లాలి ముచ్చట్లు, మాలతీ చందూర్ - పాత కెరటాలు - ఇలాంటివన్నీ కూడా చాలా ఆసక్తితో చదివేవారు.

ఇంక సాయంత్రం దీపాలు వెలిగించే వేళకి నాన్నమ్మ వీధి అరుగు మీద కూర్చునే వారు. అప్పుడింక ఇంట్లో పిల్లలతో పాటు  అనాతవరం - రెండో వీధి, వెనక వీధి, మూల వీధి - పిల్లలందరూ వచ్చేసేవారు - నాన్నమ్మ చెప్పే కథలు వినడం కోసం.


అప్పుడు నాన్నమ్మ - రామాయణం, భారతం, భాగవతంతో మొదలుపెట్టి  - కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అనే యుగంధర మంత్రాంగ కథలు - ఒక కథలోంచి ఇంకో కథ లోకి వెళ్ళిపోతూ మళ్లీ రాత్రి భోజనాల వేళ అయ్యేదాకా కథలూ, పొడుపు కథలూ, కబుర్లూ ఎన్నో చెప్పేవారు.


నాన్నమ్మ తను చెప్పిన నల-దమయంతి కథ విని తెలుగు పరీక్ష పాస్ అయిన అబ్బాయి గురించి చెప్పుకుని మురిసిపోయేవారు.


నాన్నమ్మ చెప్పిన కథల్లో నాకొక మంచి పాఠం నేర్పిన కథ: పాము - బుస్ కథ. అదిక్కడ చదవచ్చు: http://boldannikaburlu.blogspot.com/2011/03/blog-post_29.html.


ఎవరితోనూ కలహించకుండా - అలా అని ఎవరికీ లోకువ కాకుండా నేను నేనుగానే గానే ఉంటూ అందరిలో 'మనం' గా కలిసి తిరగడమెలాగో నాకు నేర్పిందీ కథ. నేనే కాదు - మా నాన్నమ్మ కథలని తలుచుకునే మా అందరికీ ఇష్టం ఈ కథ. మా పిల్లలకీ పదే పదే చెప్పుకున్న కథ ఇది.


ఇంక రాత్రి పడుకునే ముందు శుక్లాంబరధరం తో మొదలుపెట్టి శ్రీ రామ రామేతి అంటూ - బోల్డన్ని శ్లోకాలు, ఏక శ్లోకీ - రామాయణ, భారత, భాగవతాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు మా పిల్లలందరికి చెప్తూ పాడించేవారు.

నాన్నమ్మ చెప్తూ వుండగా పిల్లలందరం ఆవిడతో పాటు చదివే -


                రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
                శయనేయః స్మరే నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి

- శ్లోకంతో మారోజు పూర్తయేది.

మా నాన్నమ్మ పాడే "కలువ రేకుల బోలు కనులు చూచితే చాలు..." అన్న పాట విని  కలకల నవ్వుతూ పెరిగిన పిల్లలమే మేమందరం. ఆ పాట  కోసమే ఇంకో పోస్ట్ రాయాలి నేను.

పిల్లలకి కానీ, పెద్దలకి కాన్నీ ఏ రోజూ ఇలా వుండాలి, ఇది చేయకూడదు అని ఉచిత సలహాలు ఇవ్వడం, అవసరం లేని చోట మాట్లాడడం, మాట్లాడే మాటల్లో పొల్లు మాట రానీయడం అసలు చేసేవారు కాదు నాన్నమ్మ.

ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కరమయిన సన్నివేశం ఎదురైతే అలాంటప్పుడు కూడా  ఏదో మంచి విషయానికి దాన్ని ముడి వేసి అందరినీ తేలికపరిచేవారు.

శివకోడులో - మా ప్రసాద్ మామయ్య పెద్దలనాటి ఇల్లు పడిపోతే - అదే స్థానంలో ఇల్లు కట్టి - గృహప్రవేశం చేసుకునేటప్పుడు - మా చెల్లాయత్త పాలు పొంగించి ప్రసాదం కోసం బియ్యప్పరవాణ్ణం చేసి పెడితే - రాత్రి ముహూర్తమేమో - ఆ చీకటి వేళ కుక్క వచ్చి ఆ గిన్నెని ముట్టుకుంది. ఒక్క క్షణం అందరికీ 'అయ్యో' అనిపించింది. అంతే - నాన్నమ్మ వెంటనే - 'కాలభైరవుడు తిన్నాడమ్మా ప్రసాదం, చెల్లాయి! మంచిదే !' అని సర్ది చెప్పినప్పుడు చిన్నబోబోయిన మా చెల్లాయత్త మొహంలోని నవ్వు ఆ రాత్రిని వెలిగించింది.

అదీ మా నాన్నమ్మ దగ్గర -సోదాహరణంగా - మనసుకి హాయి కలిగించే మాట మనిషికి ఎంత అందమయిన అలంకారమో - ఎప్పటికీ మర్చిపోకుండా నేనేర్చిన భర్తృహరి శ్లోక పాఠం  -

            'కేయూరా న విభూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
             న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
             వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
             క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం'

నాన్నమ్మ - ఆవిడ జీవిత కాలంలో - అసలు వాడని ఒక పదం - 'లాకేత్వం - దాక్కొమ్ము' ('ల' కు ఏత్వం , 'ద' కు కొమ్ము). మా నాన్న ఆయన చిన్నప్పుడు - అసలెలాగైనా ఆవిడతో ఆ మాట అనిపించాలని - కావాలని - నాన్నమ్మ ఫలహారం కోసం రొట్టెలో, ఉప్పుపిండో చేసిన రోజు - అమ్మా ! భోజనం పెడ్తావా - అని నాన్న అడిగితే - 'ఫలహారం చేశాను - తిను' అనేవారట. నాన్న - ఇంకోసారి, మరోసారి -  అలా ఎన్నిసార్లు అడిగినా అసలు విసుక్కోకుండా ఏది చేశారో చెప్పేవారట గాని పొరపాటున కూడా వండని దాని గురించి  'లేదు' అని చెప్పేవారు కాదట. మాతో మాట్లాడేటప్పుడు కూడా 'లేదు' అనే మాట వాడకుండా 'లాకేత్వం - దాక్కొమ్ము' ఇవ్వకూడదు అనేవారు.

ఇప్పటికీ పిల్లలు ఏమయినా అడిగినప్పుడు అది ఇంట్లో లేకపోతే 'తెచ్చుకోవాలి నాన్నా!' అని చెప్పడం తప్ప 'లేదు' అని చెప్పాలంటే నాన్నమ్మ పక్కనే వుండి 'ఆ.. ఆ...' అని ఆపుతున్నట్టే వుంటుంది.

ఇప్పటికీ మా నాన్నమ్మని ఎరిగున్న ఎవరయినా  - ఎలాంటి పరిస్థితిలోనూ నవ్వుతూ - సందర్భోచితమయిన మయిన కబుర్లు, పాటలు, పద్యాలు, కథలతో - చుట్టూ వున్న అందరినీ అలరించిన మా నాన్నమ్మని - కథల మామ్మగారు, బుల్లెమ్మ గారు - అని ఎంతో ఇష్టంగా తలుచుకుంటుంటారు.


మూడు దశాబ్దాల క్రితం - నాన్నమ్మ వెళ్ళిపోయినా - ఆవిడ ఎప్పుడూ గుర్తు చేసుకునే -

                      కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
                      వారేరీ? సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
                     బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
                     యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

అన్న భాగవత పద్యంతో సహా  - ఎప్పటికీ మరిచిపోలేని ఎన్నో జీవిత పాఠాలు -  నాకు, నాతో పాటు ఆవిడకి ఆత్మీయులు అన్న వారందరికీ ఇప్పటికీ నిన్నో మొన్నో విన్నట్లుగా గుర్తు వున్నాయి.


39 కామెంట్‌లు:

  1. అందరూ అమ్మమ్మ అంటారు,మీరు నన్నమ్మ అంటున్నారే :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసుని చల్లబరచే వెన్నెలలాంటి ఆప్యాయత మా అమ్మమ్మదైతే, హృదయాన్ని వెలిగించిన జ్ఞానామృతం పంచినవారు మా నాన్నమ్మ - ఇద్దరి ఆదరణా దొరకడం నేను చేసుకున్న అదృష్టం. ఈ మాట పంచుకునే అవకాశం కలిగించిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :)

      తొలగించండి
  2. నాన్నమ్మ గారి విషయాలు బావున్నాయి అప్పా ఇంటికి నేను పుస్తకాల కోసం ప్రతీ సోమవారం హాజరైవాడిని ఉదయం 11 భోజనాలు టైము పుస్తకాలు దొరికేవి ఆంధ్రజ్యోతి పత్రిక జ్యొతిచిత్ర మొత్తమూ 1230 వరకు లలిత అత్తయ్య గారు ఇచిన కాఫీ త్రాగుతూ చదివేసి వెళ్ళేవాడిని ఒకోసారి ఆదివారం వెళ్ళితే అప్పా ఆయన చదువు తున్నా సరే నాకు ఇచేవారు .ఆరోజులు నేను మర్చిపోలేను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా అప్ప కొన్న పుస్తకాలలో చదువు-పాలు, మా లలిత దొడ్డ ఇచ్చిన కాఫీ-పాలు పంచుకుని నాకు తమ్ముడివయ్యావు, హనుమాన్ :)

      తొలగించండి
  3. మీరు శర్మగారి బ్లాగ్లో కామెంట్స్ పెట్టటం చూడటమే కానీ. మీ సొంత పోస్ట్లు చూడలేదు. ఈ ఒక్క పోస్టులో గురువులు, పెద్దలు, సద్భాషణలు స్మరించటం అద్భుతం. చక్కటి మీకృషిని కొనసాగించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ పోస్ట్ చదివి మెచ్చి, ఆ మాట నాకు చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు. స్మరించి ఈ పోస్ట్ రాయడమే నేను చేయగలిగింది - అసలు గొప్పదనమంతా ప్రాతఃస్మరణీయులయిన మా పెద్దవారిదే.

      తొలగించండి
  4. వ్యాఖ్యలను ఉంచటం‌ మానుకున్నా, ఈ‌ టపాను ప్రశంసించకుండా ఉండలేక వ్రాస్తున్నాను. మంచిటపా ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఈ వ్యాఖ్యకి చాలా సంతోషంగా అనిపించిందండీ. ధన్యవాదాలు!

      తొలగించండి
  5. Lalitha boldannikaburulu chala bagunnayi. Andulo Anathavaram gurinchi, mee Nannammagari gurinchi rasavu. Chala bagundi. Maa Ammammani gurthu chesavu. Chala santhosham . Chinnatanam anta gurthu pettukovadam Chala great.

    ఇందులో పప్పీ, కుట్టీ గురించి చిన్న తనంలో జరిగినవి అంతా చాలా బాగా రాసావు. శివకోడులో ప్రసాద్ మావయ్య , చెల్లాయి అత్త కొత్త ఇంటిలో జరిగింది అంతా చాలాబాగా గుర్తు పెట్టు కుని బాగా రాసావు. మా అక్క నీ గురించి నీ మంచితనం గురించి చెబుతుంది. నిజమేకదా. అంతా చదువుతూవుంటే చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి అత్తా! మీరు నా బ్లాగ్ చదివి మెచ్చుకున్నారు. చాలా సంతోషం - ఆత్మీయుల మధ్య హాయిగా గడిచిన బాల్యం పెంచినదే నా మంచి :)

      తొలగించండి
  6. Lalitagaruu mee nannama garu chinnappudu kadhalu cheppevaru ,, chalabaga ardhamu ayyetattu gaa .... కీలుగుఱ్ఱం కథ మొదటి సారి అవిడదగ్గరే విన్నాను నేను....

    Gayatri

    రిప్లయితొలగించండి
  7. Lalli - mi nanamma kaburlu chaduvutunte ma nanamma gurtochindi ma abbayamma kuda ilage maku chala kadhalu cheppedi.alanti vallaki yeppatiki marchipolemu.they inspired us very much

    Lalitha Vadlamani

    రిప్లయితొలగించండి
  8. Super blog lalli malli nannammani makuchusinattuga undi-Lakshmi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటినుంచో అనుకుంటే ఇలా కుదిరింది. ఆవిడ గురించి ఎన్నెన్ని జ్ఞాపకాలో - ఒకే పోస్ట్ లో పట్టనన్ని విశేషాలు. తప్పలేదు - కొన్నిటితోనే సరిపెట్టాల్సి వచ్చింది.

      తొలగించండి
  9. చిన్న నాటి సంగతులు గుర్తుకు వస్తున్నాయి. చిన్ననాటి బల్లెంబాంబలూ, సూరెమ్మతలూ, బామ్మలూ, అమ్మమ్మలూ మన జీవితాలని ప్రభావితం చేశారు. అందుకే ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా, ఖండాంతరాల్లో ఉన్నా, దశాబ్దాలు గడిచినా గుర్తుకు వస్తూ ఉంటారు.చక్కటి పోస్ట్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుల్లెంబాంబలూ అని ఉండాలి.

      తొలగించండి
    2. అవునండి - బడికి వెళ్లకపోయినా ఇంట్లోనే ఎంతో చదువుకున్నవారు, మేధావులయినవారు, "విద్యా దదాతి వినయం" అన్న దానికి ఉదాహరణగా నిలిచినవారు - ఎందరో అమ్మమ్మలు, నాన్నమ్మలు, మామ్మలు - ప్రాతఃస్మరణీయులు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి


  10. లాకేత్వమ్మూ దాక్కొ
    మ్మూ! కేక గదా జిలేబి ముద్దుగ నాన్న
    మ్మా కాలపు కథలనగన్
    మాకూ బామ్మ గురుతొచ్చె మధురపు రోజుల్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మీ నాన్నమ్మ గారి కబుర్లు బాగున్నాయండి."లాకేత్వమ్మూ దాక్కొమ్మూ!" ఈ మాట మరీ బాగుంది :)

    రిప్లయితొలగించండి
  12. 'చదువు' కు సంస్కారానికి, 'విద్య' కు 'బుద్ధుల' కు సంబంధం లేదన్న విషయాన్ని మీ నాన్నమ్మ గారు రుజువు చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి వారిని చూడగలగడం కష్టమే. చదువుతుంటే నాకూ మా అమ్మమ్మ గుర్తుకు వచ్చింది :)
    చాలా చాలా బాగా రాశావు.
    Eagerly waiting for the next post in the series.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ రోజుల్లో చదువు "కొన్నామని" అనుకునేవాళ్ల కన్నా మా నాన్నమ్మ మంచి చదువే చదువుకున్నారు :) థాక్స్ - ఎప్పటిలాగే నీ ప్రోత్సాహానికి. ఇది కూడా నెలకొకటిగా రాద్దామని. Stay Tuned!

      తొలగించండి
  13. Chala bagundi mee ee post.. Mee intlo chadivina chadamama, bala mitra, swathi pustakalu, maa maamma venakala tirigina rojulu, tatagaru cheppina ramayana, bharata lu, maa kakka( nanna attiah) nerpina pdyalu kathalu, mee intlo pustakala tho patu lalita attaiha garu ichhe malle poolu.. Anni gurtukochahyi... Inka idi chsdivina taruvata maa pilla lu mamma( nannama) or ammama lani miss avvutunnare anipistondi.... Alochiste amma la kante vallatho maamma or ammama la unte baguntundemo anipistondi... Vallu cheppevi oppiga vintu... Malli vallaki opoiga cheppi nerpinchadaniki... Thank you for the post... Waiting for next one

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శారదా! నాతో పాటుగా మీరందరూ కూడా ఇలా నాన్నమ్మనీ, లలిత దొడ్డనీ, మా ఇంటినీ గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుంది.

      తొలగించండి
  14. బాగుంది, చాలా చాలా బాగుంది అనే మాటలు నిజానికి చాలా చిన్న పదాలు. పొగడడానికి మాటలు వెతుక్కోవాల్సిందే.- భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్! మీరు, ఇంకా పైన వ్యాఖ్యలు రాసిన పెద్దవారు - ఇలా మెచ్చుకుంటున్నారంటే అది నా రాతల గొప్పదనం కానే కాదు - అందులో మీకు కనిపించిన మా నాన్నమ్మ వ్యక్తిత్వం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  15. ఇప్పుడే చూస్తున్నానండీ మీ బ్లాగ్, భలే ఉంది. బ్లాగులకి మళ్ళీ కళ మోసుకొచ్చారు. "లాకేత్వం, దాక్కొమ్ము.." మా నాన్నగారూ తరచూ మాతో చెప్పే మాట. :)). నాకూ తొందరపడి అనబోతున్నప్పుడల్లా, మా నాన్నగారి గొంతు వినపడినట్టే ఉంటుంది. ఏమిటిలా..మా అర్థణా మీ ఇంట్లో, మీ కబుర్లన్నీ మా ఇంట్లో..! :) భలే అనిపించింది, చాలా సంతోషమైంది, ఎవరో దగ్గరి వ్యక్తులు తెలీకుండా బ్లాగు రాస్తునట్టు...తప్పకుండా రాస్తూండండి. థాంక్యూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంత మంచిమాట చెప్పారు!! మీ కమెంట్ చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పడానికి నాకు భాష చాలట్లేదు. నేను ఇంత క్రమం తప్పకుండా బ్లాగ్ రాయడానికి ఒక ప్రియనేస్తం (తను పైన కమెంట్ పెట్టిన శ్రీ ) ప్రోత్సాహం చాలా వుంది - మీ మెప్పులో తనకీ ఒక పాలు అందజేశాను. You made my day!

      తొలగించండి
    2. మానస గారిదే నా మాట కూడాను.. అప్పుడెప్పుడో రాయల కాలంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారన్నట్లు ఎనిమిది తొమ్మిదేళ్ళ క్రితం కూడలిలోనో మాలికలోనో నిలబడితే రత్నాల్లాంటి బ్లాగుపోస్టులు రాశులుగా కనపడేవి ఆనాటి కళని మీరు మీబ్లాగులో క్రమం తప్పక రాస్తున్న క్వాలిటీ పోస్టులతో మళ్ళీ తీస్కొచ్చారు. మిమ్మల్ని ఈ వైపు ప్రోత్సహించిన శ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

      ఇక ఈ పోస్ట్ ఎంత బాగుందో చెప్పడానికి నాకు మాటలు దొరకడం లేదండీ. అందుకే నాలుగు నెలలుగా మీ నాన్నమ్మ గారు గుర్తొచ్చినపుడల్లా మళ్ళీ మళ్ళీ వచ్చి చదువుకోవడం తప్ప ఏం మాట్లాడడం లేదు.

      తొలగించండి
    3. Anonymous garu! You made me speechless with these nice words! Thanks a lot!

      తొలగించండి
    4. మానస గారూ, ఈ అమ్మాయి మా ఊరి వారి మన'వరాలే'నండోయ్

      తొలగించండి
    5. శ్రీనివాస్‌గారు: మీ-మా-మన అనాత"వర"పు మన"వరా"లినే :)

      తొలగించండి
  16. Lalita - this straight-from-your-heart blog post has touched so many hearts, as evidenced by the warm comments this has received. Mine is one such. This has evoked so many memories, thoughts and feelings in me - and a longing for the great minds and simple times which seem to have gone forever now.
    On a separate note, loved the way you have written this. Beautiful thoughts get lucky when they get to wear lovely words :-) Keep up the good writing.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Aparne! As always your comment makes my post content sound more graceful. Thank You!

      Longing for the great minds and simple times would remain a longing as long as there are more of great times and simple minds. But Optimism is the blood group we share - so let's long for the great minds and simple times :)

      తొలగించండి