3, డిసెంబర్ 2016, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 4 - ప్రసాదు మావయ్య-చెల్లాయత్త

ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము - అన్నది తెలుగు వ్యాకరణంలో ద్వంద్వ సమాసానికి వున్న నిర్వచనమైతే మా అమ్మ పుట్టింటి ద్వంద్వ సమాసం : ప్రసాదు మావయ్య-చెల్లాయత్త.

తన తర్వాత పుట్టిన ఐదుగురు చెల్లెళ్లకు పుట్టిన ఆడపిల్లలకు-మగపిల్లలకూ, ఆ పిల్లల్లకు పెళ్లిళ్ళై ఇంటికి వచ్చిన అల్లుళ్లకు-కోడళ్లకు, ఆ ఆడపిల్లల-అల్లుళ్ల-పిల్లలకు, ఆ మగపిల్లల-కోడళ్ల-పిల్లలకు, వారి వారి పిల్లలకూ, ఇంకా అదే వరసైన ఇంకెందరో పిల్లలకూ-వారి పిల్లలకూ - ఇలా వరసా-వయసూ తో సంబంధం లేకుండా అందరికీ మా  ప్రసాదు మావయ్య-చెల్లాయత్త  "ప్రసాదు మావయ్య-చెల్లాయత్తే"!

రాజమండ్రి నించి శివకోడు ఎప్పుడు వెళ్లినా - నాన్న హనుమంతరావుని రాజోల్లో కారు ఆపమని చెప్పి - క్రీం బిస్కెట్ పాకెట్లు,పాపిన్సు కొనేవారు -వెళ్లగానే ఎదురొస్తాడు ప్రసాద్ - వాడికిష్టం ఇవీ - అని.

మనిషెంత నిరాడంబరమో మనసంత నిర్మలం - ప్రసాదు మావయ్యకి.

లుంగీ-పొట్టి చేతుల చొక్కా , నోట్లో చుట్ట, చుట్టకి చివర "ఫిల్టర్" లా వాడే బాల్ పెన్ను క్యాపు, ఇంకొన్ని చుట్టలు-కొంచెం పొగాకు వుండే ఖాళీ కాంప్లాన్ డబ్బా - ఇవే మా ప్రసాదు మావయ్య accessories -

పొద్దున్న పది కాకుండానే భోజనం - సాయంత్రం ఆరున్నరకు రాత్రి భోజనం -
మధ్యలో చుట్ట కాల్చాలన్నా - ఎన్నింటికి కాల్చాలి - అది ఎంత పొడుగు కాలాలీ దానికీ ఒక టైం టేబుల్ -
మూడు పూటలా ఇన్ని అడుగులు - ఇంత  దూరం నడవాలీ - అని లెక్కలేసుకుని ఇంట్లోనే పెరట్లో చప్టా మీద ఒక వృత్తంలో తిరుగుతూ  చేసే నడక-వ్యాయామం -


ఇల్లు కదిలి బస్సెక్కి వూరు దాటినప్పుడు వేసుకునే ప్యాంటు-షర్టూ తప్ప తన ఇంట్లో తానే వున్నా, తన ఇంటికి ఎవరైనా వచ్చినా, తానెవరింటికైనా వెళ్లినా - అదే ఆహార్యం - అదే ఆహారం.

మధ్యాహ్నం తీరిక వేళల్లో కూర్చుని తనకై తాను తయారు చేసుకునే రెయిన్-గాజ్ లూ , బారోమీటర్లూ
తను ఎంతో అపురూపంగా అట్టలు వేసుకుని దాచుకునే అట్లాసులూ - రైల్వే టైం-టేబుళ్లూ
స్విచ్చుబోర్డుల మీద గుర్తుగా (లైటు-1, ఫ్యాన్-2, ట్యూబులైటు-3) అంటూ తాను వేసుకునే నెంబర్లు
ఎప్పుడయినా నీకేం కావాలీ ప్రసాద్ మావయ్యా  అంటే తనడిగే గ్లోబూ
కాలక్షేపానికి తనాడుకునే సుడోకు
ఏడుపదులు నిండిన ఈ వయసులో కూడా తనెక్కి తొక్కే సైకిలు
పెరట్లో నూతి దగ్గర తను నీళ్లు తోడి పోస్తే అక్కణ్ణుంచి ఇంట్లో వున్న డేగిసాలు, బాల్చీలు నిండేలా ఫైపులు పెట్టి తనే ఏర్పాటు చేసుకున్న water-supply-system
-వేసవి సెలవులకి ఎప్పుడు శివకోడు వెళ్లినా రోజు రోజూ ఒక సైన్స్ ప్రయోగమో - సరదా పాఠమో నాకు.

అవన్నీ చూసి "ప్రసాదు మామయ్యా - నువ్వు మెట్రిక్కు తర్వాత ఆపేయకుండా చదివుంటే పెద్ద సైంటిస్టువి అయ్యేవాడివి" అనే దాన్ని - ఇప్పటికీ అంటూ వుంటాను.

ముందొక మాటా -వెనకొక మాటా అనడం తెలియనితనం 
ఎవరినీ హేళనగా మాట్లాడడం కలలో కూడా చేయని సరళత 
ప్రతిదానికీ తనకు తానే ఆలోచించుకునే తర్కం
ఎవరేమన్నా వాద-ప్రతివాదాలు చేయని స్వభావం 
చెల్లెళ్ల - తమ్ముళ్ల పట్ల ఇంటికి పెద్దగా నిర్వర్తించిన భాద్యత
చుట్టూ వున్న పదిమందిలో మనం ఒకరుగా ఉండాలి తప్పితే - ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఉండకూడదని తనెప్పుడూ చెప్పే మాట
మావయ్య అంటే - माँ -भय्या అని తను చెప్పే తమాషా కబుర్లు
అరుగుమీద కూర్చుని తన బాల్య స్నేహితులైనఎదురింటి సత్తెంకాపు గారికొండయ్య-బాబ్జీలతో పంచుకునే లోకజ్ఞానపు విశేషాలు
- వెరసి మా ప్రసాద్ మావయ్య

శివకోడు పాత ఇంటిలో మండువా చుట్టూ వుండే స్తంభాల్లో ఒకదానిమీదో , చేతిలో వున్న అగ్గిపెట్టె మీదో, కూర్చున్న పడక్కుర్చీ చేతిమీదో - తన పాటకి వాయిద్యంగా ఊతమిచ్చే ఏదయినా సరే - దానిమీద దరువేస్తూ - మధ్య మధ్యలో - టుం టుం టుం - అని నోటితో కూడా మ్యూజిక్ వాయిస్తూ - నా మది నిన్ను పిలిచింది గానమై - వేణు గానమై - అంటూ తెలుగులో రఫీ పాడిన పాటో  - తూ ప్యార్ కా సాగర్ హై తేరి ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ - అని ఏ బల్ రాజ్ సహానీ-మన్నాడే  హిందీ పాటో  - అచ్చు మహమ్మద్ రఫీ లాగే పాడుతూ అలరించే మా ఇంటి మహమ్మద్ రఫీ.

అన్నట్లు పుట్టు-వ్యవసాయదారుడయిన మా ప్రసాదు మావయ్యఒక మూడు నెలలు ఉద్యోగం కూడా చేశాడు - మేము టంగుటూరులో వున్నప్పుడు - ఆ పక్కనే వున్న ఒక పల్లెటూరు - చిరుకూరుపాడులో. అప్పుడు నాక్కూడా వేసవి సెలవులవడంతో ఒక నెల నేనూ ప్రసాదు మావయ్య-చెల్లాయత్తతో ఆ వూళ్లో వున్నాను. 

 
ఓం నమశ్శివాయ .... 
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ ....
ఓం నమశ్శివాయ .... 

ఫోన్ చేయగానే మూడుసార్లిలా శివపంచాక్షరి తాను చెప్తూ నాతో చెప్పిస్తూ - అదయ్యాకే కుశలప్రశ్నలూ, ఇంకేమయినా విశేషాలూ - మా ప్రసాద్ మావయ్యతో.

 ఇంక మా చెల్లాయత్త - 
గల గలా మాటలు - కిలకిలా నవ్వులు
పెద్దవాళ్లలో పెద్ద - చిన్నవాళ్లలో చిన్న
కొంతే వున్నా ఇంతేనా అనుకోకుండా
అదే ఎంతో అనుకునేంత తృప్తి 

మా అత్త చేసే  - వంకాయ కారం పెట్టిన కూర, అరటికాయ సాంబారు, కొబ్బరికాయ తియ్యపచ్చడి, దూట పెరుగుపచ్చడి - ఖండాంతరాల్లో వున్నా - అత్తని తలుచుకోగానే - ఆ రుచులన్నీ నాలుక మీద ఆడతాయి. 

చెల్లాయత్త అంటే -   తాగే కొద్దీ వూరే గంగాబొండపునీరులా ఎంత తలచుకున్నా తరగని  ఎన్నెన్ని జ్ఞాపకాలో -

వేసవి సెలవులకి వెళ్లిన మాతో పోటీ పడి ఇంటి వెనకాల పెరట్లో వున్ననేరేడు చెట్టు కింద ఏరుకొచ్చిన నేరేడు పళ్లు - వాటి పంపకాల్లో మాతో సమానంగా సరదా-దెబ్బలాటలు -

మా కోసం ఇంట్లో ముగ్గేసిన ఈత పళ్లు, తంపటేసిన తేగలు, కొబ్బరిపూలు, బుర్రగుంజులు, తాటిముంజెలు-

సాయంకాలాల్లో కొన్న మల్లెమొగ్గలు కనకాంబరాలు, దవనం వేసి మాలలు కట్టాక - "నాది మీ అందరి కన్నా పెద్ద జడ - పెద్ద దండ నాకే" - అని మమ్మల్ని ఉడికించి మోకాళ్ల దాకా వున్న జడలో పూలు పెట్టుకుని - మా పిల్లలందర్నీ రాజోలు గోదారి గట్టుకి తీసుకెళ్లి చీకటి పడేదాకా అక్కడ చెప్పుకున్న కబుర్లు -

గోరింటాకు దూసి -రుబ్బి మాచేతులకి పెట్టి - మా పండిన చేతులకి కడిగిన వెంటనే కొబ్బరినూనె రాసి  - ఆ ఎరుపు మెరుపుని నింపుకున్న కళ్లు -


మా అందరి పెళ్లిళ్లలో మామిడి తోరణం కట్టి, విఘ్నేశ్వరుడిని పెట్టి, రోటికి పసుపుకొమ్ము కట్టి పసుపు దంచడం  దగ్గర్నుంచీ - పెళ్లికూతురి అలంకరణ, జడ కుట్టడం, పారాణి పెట్టడం, అప్పగింతల్లో మా అమ్మతో సమానంగా కంటనీరు పెట్టడం -

తొలిచూలు - పుట్టింట గాజులు పెట్టించినప్పుడు పక్కనే వుండి - గాజులతనికి ఏ రంగు గాజు తర్వాత ఏ రంగు వేస్తే  బాగుంటుందో  - మణికట్టు నించి మోచేతి దాకా సైజుల వారీగా రంగురంగుల గాజులు ఎంపిక చేసి-ఓటు గాజు  లేకుండా చూసి వేయించడం-

మాకు పిల్లలు పుట్టినప్పుడు - పదకొండు రోజులు హాస్పిటల్లో వుండి ఇంటికి వచ్చిన తల్లీ-పిల్లలకు ఇంటికి రాగానే ఎర్ర నీళ్లు దిష్టి తీయడం, మా పిల్లల బొడ్డు-తాయెత్తులు చేయించడం, పెళ్లినాటి మధుపర్కం ఉయ్యాలగా వేసి ఊపడం, చాదు బొట్టు చేయడం, ఆముదం-కర్పూరం వేసి  కాటుక పట్టడం -

ఆ తర్వాత ఎప్పుడు నేను పుట్టింటికి ఆడపడుచులా వెళ్లినా అమ్మ నాకోసం కొన్న చీరలన్నిటినీ పదిసార్లు మడత విప్పీ-వేసి చూస్తూ అన్నిటికీ పసుపు-గౌర్లు పెట్టి ఆ చీరల్లో నేనెంత బావుంటానో - మా అమ్మతో చెప్పి - అమ్మ తర్వాత అమ్మలా మురిసిపోవడం -

మా చెల్లాయత్త గురించి మాటల్లో చెప్పడం ఒక రకంగా ఆవిడకి మామీదున్న అభిమానాన్ని పలుచన చేయడమే అవుతుంది.

మా చెల్లాయత్త మా అమ్మకి అండా-దండా.

చెల్లాయత్త పెళ్లై మా అమ్మమ్మ ఇంటికి కోడలుగా వచ్చినప్పటినుంచీ దాదాపుగా ఒకే ఈడు వాళ్ళైన అమ్మా- చెల్లాయత్తా కలిసి-మెలిసి పెరిగారు.

ఈరోజుకీ - అరవై దాటిన వయసులో కూడా మనసులో బెంగగా అనిపించినప్పుడు మా అమ్మ శివకోడు వెళ్తుంది - వదినగారి దగ్గర మనసు తేలికవుతుందని.

మా అమ్మే కాదు - మా అమ్మమ్మ కడుపున పుట్టిన ఐదుగురు ఆడపడుచులూ ఈ రోజుకీ ఏడాదికి ఒకటికి రెండు సార్లు శివకోడు వెళ్తున్నారు - వెళ్లాలి  అనుకుంటున్నారు అంటే అది మాచెల్లాయత్త కలుపుగోలుతనమే.

మా ప్రసాదు మావయ్య - చెల్లాయత్త - ఎప్పుడో 1968లో పెళ్లయ్యాక ఇద్దరుగా మొదలు పెట్టి - ఇద్దరుగానే అన్ని భాద్యతలూ సాగించి - ఇప్పటికీ ఇద్దరుగానే వున్నారు - ఇష్టపడి కట్టుకున్న తమ బొమ్మరింటిలో.

వాళ్లిద్దరికీ  - వాళ్లే మడులు కట్టి - ఇంటి వెనకాల వేసుకున్నమొల్ల, మల్లె, జాజి, మందార, బంతి, చామంతి, మరువం, దవనం, గోరింటాకు - ఆడ పిల్లలైతే - పెరట్లో పెంచుకున్న కొబ్బరి చెట్లు కాపు కాసి చేతికంది వచ్చే కొడుకులు. 

తనతో పుట్టిన కవల పిల్ల లక్ష్మి దొడ్డతో కలిపి
తన తర్వాత పుట్టిన ఏడుగురికి తండ్రి తర్వాత తండ్రై -
తమ్ముళ్లకి, ఇంటి ఆడపడుచులకి పెళ్లిళ్లు, పురుళ్లు-పుణ్యాలు  జరిపించిన -
మా ప్రసాదు మామయ్య చెల్లాయత్తతో  వున్న మా శివకోడు ఇల్లు  -
ఈ రోజుకీ మా దొడ్డలకి-పిన్నులకి, మా అమ్మకి
అమ్మ-లేని-పుట్టిల్లు కాదు -
అమ్మ-లేదనిపించని-పుట్టిల్లు. 



20 కామెంట్‌లు:

  1. Amma ledanipinchani putillu.... chala bagundi... pratee vaarantam... mee post kosam eduru chupulu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా థాంక్స్, శారదా! - వారం వారం చదువుతున్నందుకు.

      తొలగించండి
  2. లలిత నువ్వు ప్రసాద్ మావయ్య చెల్లాయి అత్త గురించి చాలా బాగా రాశావు. చిన్నతనంలో జరిగినవి అంతా గుర్తు పెట్టుకోవడం చాలా గొప్పతనం. నువ్వు అమ్మ తరువాత అమ్మ అన్న పదానికి తను అమ్మ అయినంతగా సంబరపడింది . ఆ మొహం లో సూర్య కాంతి కనపడింది.
    నీ గురించి అంతా చాలా చాలా గొప్పగా చెబుతూ చాలా సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి అత్తా! చెల్లాయత్త చేత ఈ పోస్ట్ చదివించినందుకు మీకు నేను బోల్డన్ని థాంక్స్ చెప్తున్నాను.

      తొలగించండి
  3. నాకు కూడా బెజవాడలో మా అత్తయ్య మామయ్యల తో గడిపిన వేసవి శలవలు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పటి మమతల మాధుర్యాలన్నీ కమ్మగా చక్కగా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటికీ ఆ మమతల మాధుర్యాలు ఏ మాత్రం తగ్గకుండా దక్కించుకోగలగడం నా అదృష్టం. మీ వ్యాఖ్యకి చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  4. Asalu the idea of this whole series itself is wonderful.... Andulo each post is a gem in its own right. Provoking thoughts and evoking memories is at the heart of all good writing.. and I enjoy this in each blog post of yours. Keep writing!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును అపర్ణే! నన్ను అంతగా ఇష్టపడే మా పెద్దలందరికీ వాళ్ల మీద నాకున్న గౌరవం, అభిమానం చూపించాలంటే ఇంత కన్నా మంచి అవకాశం వుండదు అనిపించింది. అందుకే ఈ series మొదలు పెట్టాను. వాళ్ల వాళ్ల పేర్లు నా బ్లాగ్ లో చూసుకుని మురిసిపోతుంటే నిజంగా - I feel that my blog has served a purpose.

      తొలగించండి
  5. కళ్ళకు కట్టినట్లు వర్ణించడం లో మీకు మీరే సాటి లలిత గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనసుకి నచ్చేట్లు మెచ్చుకోవడంలో మీకు మీరే సాటి పవన్ గారు :)

      తొలగించండి
  6. తమ తరం వాళ్ళే కాకుండా తర్వాత తరం వాళ్ళు కూడా ఇంత ఇష్టంగా వాళ్ళను తల్చుకుంటున్నారంటే వాళ్ళ మంచితనం అర్ధం అవుతోంది. బాహ్యాడంబరాలకే తప్ప మనసుకు గౌరవం లేని ఈ రోజులలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారంటే....
    అంత మంచి మనసుల మధ్య బాల్యం గడవడం నిజం గా నీ అదృష్టం లలితా!
    నిజం చెప్పాలంటే నీ మీద అసూయ గా కూడా ఉంది.
    వీలయితే వీళ్ళనందరనీ కనీసం కలవాలనుంది.
    'అమ్మ లేదనిపించని పుట్టిల్లు'....- ఈ వాక్యానికి మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈసారి ఇండియా వెళ్లినప్పుడు - వీలైతే రాజమండ్రి ప్లాన్ చెయ్యి - అమ్మతో చెప్తాను - అందరినీ ఒక చోటే కలవొచ్చు. నీ మంచిమాటలు చేరవేశా - చేరాల్సిన చోటికి :)

      తొలగించండి
  7. మీ బోల్డన్ని కబుర్లు చాలా బాగుంటున్నాయండీ.ప్రతీ పోస్ట్ చదివిన తరువాత మళ్లీ కొత్త పోస్ట్ ఎపుడు వ్రాస్తారో అని ఎదురు చూస్తూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిత్ర గారు: నా బ్లాగ్ చదువుతున్నందుకు, పోస్టుల కోసం ఎదురుచూస్తున్నందుకు - అది వచ్చి నాకు చెప్తున్నందుకు మీకు బోల్డన్ని ధన్యవాదాలు.

      తొలగించండి
  8. Hi లలిత నేను ఇప్పుడే చదివినాను ఇన్నాళ్లు నీది net not working so now working wifi so ఇప్పుడే చదివినాను మీ Prasad mama atta story super

    రిప్లయితొలగించండి
  9. మామయ్య అత్త ల గురించి చాల చక్కగా చెప్పావు ఇది నీ స్వగతం అయినా ఈ జెనరేషన్ కి ఇటువంటి బంధాల గురించి తెలియాలి బాబయ్య అయినా అంకుల్ అంటారు మావయ్య ని అయినా అంకుల్ అంటున్నారు.
    పిన్ని బాబాయ్ మేనత్త మేనమామ దొడ్డ పెదనాన్న అన్న చెల్లీ వదిన వీళ్ళ గురించి నువ్వు రాస్తుంటే ఆరోజులే ఎంత బావున్నాయి అన్పిస్తుంది థాంక్యూ అక్కా నాకూ మా మామయ్యలు అత్తయ్యలు వాళ్ల తో అనుబంధాల అనుభూతి గుర్తు చేసావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా మామయ్య-అత్తయ్యల పోస్ట్ నీకంత నచ్చినందుకు చాలా సంతోషం, హనుమాన్! ఎప్పట్లాగే నీ అభిమానపూర్వక వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  10. అమ్మ-లేని-పుట్టిల్లు కాదు -
    అమ్మ-లేదనిపించని-పుట్టిల్లు.
    అదృష్టవంతులు

    రిప్లయితొలగించండి