7, ఏప్రిల్ 2017, శుక్రవారం

నా సంగీత పరస్థానం - చరణం

చరణం వినే ముందు పల్లవి, అనుపల్లవి వినాలి కదా మరి!

నా సంగీత పరస్థానం - పల్లవి
నా సంగీత పరస్థానం - అనుపల్లవి

 ఒంగోలు నుంచి వచ్చే సంగీతంమాస్టారు శ్రీనివాసరావుగారి దగ్గర సంగీత పాఠాలు మొదలయాయి - కుట్టీకి, నాకు. మాతోపాటు బ్రహ్మయ్యగారి పద్మజ, భారతి కూడా నేర్చుకునేవారు.

శ్రీనివాసరావుగారు కొంచెం మొహమాటంగా వుండేవారు - అందరం ఆడపిల్లలం - మాకన్నా ఓ పదిహేనేళ్లు  పెద్దవారైనా నన్ను, కుట్టీని కూడా 'మీరు' అనే సంబోధించేవారు. ప్రతిరోజూ కనీసం గంటసేపన్నా సాధన చేస్తే కానీ సంగీతంలో ప్రావీణ్యత సాధించలేమని చెప్పేవారు.

అసలే - అప్పటికి తెలుగులో నానార్ధాలు నేర్చుకుంటున్న రోజులేమో - మాస్టారన్న సాధించటానికి  - మాకర్థమయిన ఇంకో సాధించటం కూడా కలిపి మా అమ్మని, చుట్టుపక్కలవాళ్లని - రోజూ ఓ గంట మా సంగీతసాధనతో సాధించి - చివర్లో - మరది మేము పాట ఆపేసిన ముదమో , లేకపోతే గ్యాపిస్తే మళ్లీ మొదలుపెడతామన్న బెదురో - మా ఇంటినానుకుని పక్కింట్లో వుండే  - సోడాలమ్ముకునే సత్యం భార్య సుజాత - గబగబా తెచ్చిచ్చే నిమ్మకాయ సోడాలు కూడా సాధించేవాళ్ళం.

ఆవిధంగా త్రివిధ-సాధనతో మా సంగీత సాధన ఏడు స్వరాలు - ఆరున్నొక్కరాగాలుగా - ఎదురులేకుండా - ఎవరూ మా ఎదుట బడ సాహసించకుండా - మా ఇంటిచుట్టుపక్కల - సాయంత్రం ఐదున్నరనుంచి ఆరున్నర దాకా - నిర్బంధకర్ఫ్యూతో నిరాటంకంగా సాగిపోయేది.

మా పాటకి కాపలాగా - రోజూ మధ్యాహ్నం,  రాత్రి పళ్లెం కొట్టి మరీ పిలిచి మేం పెట్టే అన్నం తినే కృతజ్ఞతతో - చెవులు కాళ్లతో కప్పుకుని మరీ సాగిలపడి పాట వినే -  మా జాగిలం 'రాము' - మేము పాట ఆపగానే - ఉలిక్కిపడి లేచి చెవులు రెండూ దులుపుకుని - శాలువా కప్పుకుని అస్తమిస్తున్న సూర్యుడివైపు నడిచివెళ్లే హీరోలా - అదేదో ట్రాన్స్‌లో ఉన్నట్లు తిరిగేది - ప్రతీ సాయంత్రం పూట.

ఇంక సంగీతం క్లాసులో - స్వరం ఎన్నో కాలంలో పాడుతున్నా - ఏకకాలంలో నాకు నోరో , చెయ్యో - ఏదో ఒకటే పని చేసేది. స్వరమూ, తాళమూ చాలా స్వతంత్ర ప్రతిపత్తితో సాగేవి. కుట్టీకి రెండూ బాగానే కుదిరేవి.

ఒకసారి స్వరానికి ముందే వేళ్లు కదిపేసి తాళం మేనేజ్ చేసేస్తున్న నాతో విసిగి - మా సంగీతం మాస్టారు -కుడిచేయి ఎత్తి నాకు బాగా కనిపించేలా ఒక్కో వేలు విడివిడిగా కదుపుతూ - చేతిని కొంచెం ఝాడించి ముందుకీ వెనక్కీ గాల్లో ఊపుతూ  -అలంకారాల్లో ఒకటైన ఝంపెతాళం ఎలా వేయాలో చూపిస్తూ ఉంటే - అప్పటిదాకా తదేకజ్ఞానంతో మనసులో 'దెబ్బ - ఉసి' అనుకుంటూ చేతిని అటుతిప్పీ, ఇటుతిప్పీ అంకతాడనం చేస్తున్న నేను - హఠాత్తుగా అదాపి - 'ఓహో - గాల్లో వేస్తే తాళం బాగా వస్తుంది కాబోలు' ననుకొన్నదాన్నై - యథాశక్తి నా చేయెత్తి - మాస్టారి చేతిననుసరించి, ఆయనవేసే తాళాన్నానుకరించబోయేసరికి - అసంకల్పితప్రతీకారచర్యగా - మాస్టారి కుడి చెయ్యి గాల్లోనే ఆగిపోవడం, ఎడం చెయ్యి నుదుటికాదేశమవడం - మాష్టారేమో 'చేతులలా ఊపవాకండి - తాళం ఎప్పుడూ వేసేలాగే వెయ్యండి' అనడం జరిగాయి.

తర్వాత నుంచీ కొంచెం శ్రధ్ధ పెట్టి స్వరానికీ - తాళానికి సమన్వయం వుండేలా చూసుకునేదాన్ని - మాస్టారి కష్టాలు గట్టెక్కాయి.

ఈలోగా నాన్నకి గుంటూరు ట్రాన్స్‌ఫర్.

బండ్లమూడి హనుమాయమ్మ( BH) జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ గ్రూపు - ప్రాక్టికల్స్. దాంతో పాటు సంగీతం క్లాసులంటే అలిసిపోతానని అమ్మ అంతగా ఆసక్తి చూపించలేదు నా సంగీతపు-కొన'సాగిం'పుపై.

కుట్టి, పప్పి - నాగార్జున సంగీత కళాశాలలో - సంగీతం, వీణ తరగతుల్లో చేరారు.

నేనింక అనిబద్ధ పాటకి' నయ్యానన్నమాట (అర్థం నిఘంటువులో కూడా వుండదు - కావాల్సినవారు నన్ను నేరుగా- వేరుగా సంప్రదించగలరు).

కాలేజ్ లో చేరిన ఒక వారం-పది రోజులవరకూ ఒకరినొకరు చూసుకున్నా నవ్వులకే పరిమితమయిన - అపర్ణతో నా పరిచయం - పాటతోనే స్నేహంగా మారింది.

ఆగస్టు ఎనిమిదో తారీఖున ఇంగ్లీష్ బోధించే యశోధర మేడం సెలవు పెట్టారని ఒక రింగ్ తీసుకుని కాలేజ్ వెనకాల వున్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి - అనుకోకుండా కలిసి వెళ్లిన మేమిద్దరం - మాటలు కలుపుకున్న మొదటి పది నిముషాల్లోనే మా ఇద్దరి పుట్టినరోజులు ఒకే నెలలో మూడు రోజుల తేడాతో అని తెలుసుకుని ఒకళ్లమీద ఒకళ్లు అభిమానం పెంచేసుకున్నాం.

పదిహేనో నిముషంలో నా నోట విన్న పదిమాటల్లో ఎనిమిది మాటలు పాటల గురించి విని - ఒక పాట పాడమన్న అపర్ణ కోసం నేను పాడిన - 'స్నేహబంధము ఎంత మధురము' పాట - లోలా  రెండు శరీరాలలో ఒకే ఆత్మ కలిగివుండేవాళ్లమయాం.

ఇలా ఉండగా BH లో ఒకసారి ఏవో పాటల పోటీలు జరిగాయి. అపర్ణా, నేనూ పేర్లిచ్చాము. రెండో అంతస్తులో విశాలంగా వుండే ఒక చిన్న సైజు ఆడిటోరియంలో మైకులు అవీ పెట్టి పాటలు పాడించారు.

ఆరోజు - కరుణశ్రీ-జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రచించగా ఘంటసాల వారు పాడిన - పుష్పవిలాపం - నేను పాడాను అనేకన్నా సంలాపం చేశాను అంటేనే బావుంటుంది.

నా పుష్ప వి(సం)లాపం విన్న ఆ పాటలపోటీ నిర్వాహకుల గద్గదస్వరభరిత-ఏకగ్రీవ-విలాపం ఏంటంటే - 'ఈసారి ఎక్కడైనా పాడినప్పుడు కొంచెం మాడ్యులేషన్ చూసుకుని పాడమ్మా' - అని.

ఆ తర్వాత ఇంక ఎప్పుడూ సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నించడానికి కూడా అవకాశం రాలేదు - చదువయ్యి, పెళ్లయ్యి, బుజ్జిజింక పుట్టి - వాడికి నాలుగేళ్లొచ్చేదాకా.

బుజ్జిజింకకి నాలుగేళ్ల వయసులో - కాకినాడ వలసపాకలలో వున్న రోజుల్లో - ఒక నెల రోజులు భానుగుడి దగ్గర ఎవరో ఒకావిడ దగ్గర మొదటి రెండు సరళీస్వరాలు - వాడికి నేర్పించినట్టు గుర్తు.

తర్వాత వలసపాకల వదిలి వలస రావడం - వచ్చిన మొదటి ఏడులో తెలుగుసంఘంలో చేరడం - అక్కడ బుజ్జిజింక పాడిన 'నాయనమ్మ - నాయనమ్మ - మాయని ప్రేమే నీదమ్మా' అనే ఎస్. జానకి పాడిన 'పచ్చని పల్లెటూరు' ప్రైవేట్ ఆల్బం పాట విని అందరూ బావుందనడంతో - వాడికీ సంగీతం నేర్పిద్దామా అని సంగీతం నేర్పేవారెవరైనా వున్నారా అని వాకబు చేస్తే  విద్యా ఆనంద్ అనే ఒక అద్భుతమైన టాలెంటెడ్ టీచర్ దొరకడం జరిగింది.

ఒకానొక విజయదశమి రోజు - బుజ్జిజింక (అన్న)ని - తీసుకుని విద్య ఇంటికి వెళ్లాం.

సా... పా ... సా ... అని ఆ రోజు మొదలుపెట్టిన సంగీతం ఆరేళ్ల పాటు నేర్చుకున్నాడు. మరీ సరళీ స్వరాలనుంచి ఎందుకులే అని దాటు-స్వరాల దగ్గర నేనూ వాడితో పాటు విద్య దగ్గర సంగీతం నేర్చోవడానికి చేరాను.

అలా ప్రతి శనివారం 45 నిముషాలు - ఎండనక, వాననక, మంచనక - డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి దాదాపు ఒక 300 వారాల పాటు - ఒక పది కృతుల దాకా  నేర్చుకున్నాక - రెండు ఇబ్బందులొచ్చాయి.

అన్నకి - కోయిలస్వరం అక్షరాలా 'గండు'కోయిల పరమయింది; అమ్మకి నెలలు నిండి పాడడానికి స్వరం నిండుకుంది.

రెండో బుజ్జిజింక పుట్టే హడావిడిలో అన్నగాడిని - 'గొంతు మారితే పర్వాలేదమ్మా - ప్రాక్టీస్ చేస్తే బానే వచ్చేస్తుంది' - అని సముదాయించే ఓపిక, తీరిక లేక ఇద్దరం సంగీతం మానేశాం.


అలా - సరసిజనాభ సోదరి - దగ్గర ఆపిన సంగీతాన్ని విద్య దగ్గర పరస్థానం పెట్టి వచ్చాను -  అన్నీ కుదిరినప్పుడు, ఎన్నో కుదురుకున్నప్పుడు - మళ్లీ సంగీతయాత్ర కొనసాగిద్దామనే ఆశతో.

ఈరోజుకీ అన్నగాడు నాతో అంటాడు - 'ఏదైనా మొదలుపెడితే ఆపకూడదని చెప్పి నాచేత మనబడిలో తెలుగు నాలుగేళ్లు చదివించావు - ఈగిల్ స్కౌట్ నయ్యేదాకా వదల్లేదు - మరి సంగీతం దగ్గర ఎందుకమ్మా నన్ను పుష్ చేయలేదు? - చేసుంటే ఎంత బావుండేది కదా!' - అంటూ :(

సాంత్వన ఏంటంటే - మంచి సంగీతపు-చెవి వుంది వాడికి - భాషాభేదంలేకుండా అన్ని దేశాల సంగీతం వింటాడు - వినిపిస్తాడు.

ముక్తాయింపు:

బుజ్జిజింకలిద్దరికీ చెరో-ఏడో ఏటి దాకా పడుకునేటప్పుడు పాటలు పాడి నిద్రపుచ్చడం నాకు దొరికిన ఒక సంగీతావకాశం.

అలిసిపోయి వుంటారు - నిద్రొస్తూ ఉంటుంది - మరంతకన్నా నిర్బంధ-శ్రోతలెక్కడ దొరుకుతారు కదా!

బుజ్జిజింకలకి తోడు - వాళ్లకన్నా ముందు నుంచీ వింటూవున్న - నిర్బంధ-మహా-శ్రోత అనదగిన నాన్నగారు ఉండనే వున్నారు - అమ్మేం పాడినా చప్పట్లు కొట్టి 'నువ్వు పాటల-భైరవివే'  అనేసుకుని మురిసిపోవడానికి.

అంతే ... ఆ ప్రోత్సాహోత్సాహంతో ...

రామా-లాలీ తో మొదలుపెట్టి - రంగా-లాలీ తో కొనసాగించి -
ఆ రోజు మొదటగా గుర్తొచ్చిన పాట - ...
అది  లింగాష్టకం కావొచ్చు -  
కొండవీటి సింహంలోని ఈ మధుమాసంలో  కావొచ్చు -
కన్నడ కంఠీరవ పాడిన ఎందెందు నిన్నను మరెతు బదుకిరలారె అయుండొచ్చు
చిటపట చినుకులు పడుతూ వుంటే అవొచ్చు -
ఇవేవీ కాక ...
సుందరాంగా అందుకోరా అనే భూకైలాస్ లో రంభ-డాన్స్ పాట అయుండొచ్చు -
ముఖేష్ ఆజా సనమ్ మధుర చాందినీ మే హమ్ అన్న హమ్మూ కావొచ్చు -
లేకపోతే ...
Brown girl in the ring Tra-la-la-la-laa అనే బోనీయమ్మో (Boney M) అవొచ్చు.

 ఇదీ-అదీ అని లేక ఏదో ఒకటి - ఒకదాని వెనకొకటి ఒక అరగంట పాడేదాన్ని.

కొన్ని కొన్ని పాటలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నవి - అప్పుడు నా చెవులకి వినపడినట్టు నేర్చుకున్నవి - ఇంకా అదే ట్యూన్లో పాడుతున్నవి కూడా ఉండేవి - అంటే మాటలు మారి పోయి, రాగం ఏమారిపోయి వున్నవన్నమాట.

అవి వినీ వినీ - నా పాటకి చెవులు ట్యూన్ అయిపోయివున్న బుజ్జిజింకలు ఎప్పుడైనా యూట్యూబులోనో, ఇంకెక్కడో ఆ పాతపాట  దొరికి నేను వింటుంటే - వాళ్లు ఎక్కడో పక్కరూంలో వున్నా - పరిగెత్తుకుంటూ వచ్చి "అమ్మా! ఇలా ఉంటుందా ఈ పాట ?" అని ఆశ్చర్యంగా అడిగి  "Oh well! We like your version better - because we are used to it" అని నా భుజం తట్టి వెళ్ళిపోతారు.

అమ్మ-పాటా - మరోటా !!!

ఇంతటితో పరస్థానం పెట్టిన నా సంగీత ప్రస్థానపు విశేషాలు సమాప్తం.


16 కామెంట్‌లు:

  1. అమ్మాయ్!
    మొదటి నిర్బంధ శ్రోత ఓపికకి మెచ్చుకోవాలమ్మా :)

    రిప్లయితొలగించండి

  2. అద్భుతః !


    ఝంపెతాళము వేయగానటు జాగుచున్నది తూగెనే
    ముంపుజేయుచు యింటిచుట్టున ముచ్చటాడుచు పాడెనౌ
    అంబలమ్ముల బుజ్జిజింకకు యమ్మనిద్రన నేర్పెనౌ
    బింబమొక్కటి తానుగాంచె కభీకభీయ ఖయాలలన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యోస్మి!
      ఈసారి మాత్రం మీ పద్యానికి పేరడీ రాయలేను :)

      తొలగించండి
  3. చూస్తుంటే బాగానే ' సాధించి 'నట్లున్నారు 👍.
    పాడేవాళ్లు పాడేటప్పుడు తమ చెవి మూసుకునెందుకు పాడతారా అనుకునేవాడిని (ఈ మధ్య ఈ ధోరణి మరీ ఎక్కువైంది). వినేవాళ్లు కదా చెవులు మూసుకోవాలి అని కూడా అనుకునేవాడిని 😉. తరవాత తరవాత అనిపించింది ఆ గాయకులే తాము పాడేది తామే వినలేక అయ్యుండచ్చని 😀😀.
    (నేనేదో సరదాకి వ్రాసాను. అలా చెవి మూసుకొని పాడడం వెనక శాస్త్రీయ కారణాలేమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావుగారు: పాటలతో బానే సాధిస్తాలెండి :)

      తొలగించండి
  4. మీ 'రాము' HMVలోగోలోని టామీ,నిప్పర్ కి దూరపు చుట్టమేమో🤔.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVRగారు: అయుండొచ్చు. కాకపోతే ఒక్కజాతిలోనే పోలిక . HMV వారి నిప్పర్ కూర్చుని వింటూ వున్నట్లు వుంటుంది logo లో. మా రాము మాత్రం చెవులు కప్పుకునే పడుకునేది - a faithful - yet a sly dog:)

      తొలగించండి
  5. Mee patala prastanani telipe matala pravaham chala bagundi..... enni rojulu ayyindi konni matalu vini vaadi chadivi .... thank you annitini blogastam chesi Matho chadivistunnaduku

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా మాటలు నీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషం శారదా!

      తొలగించండి
  6. హహ భలే సరదాగా ఉన్నాయి మీ సంగీతం కబుర్లు. సాధన ఆపకండి మీ జూనియర్స్ పెళ్ళి నాటికి ఒక కచేరి చెయ్యొచ్చు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీధర్‌గారు: సాధనతోనే సాధించగలను నేను - అస్సలాపను :) మీ ప్రోత్సాహానికి థాంక్స్!

      తొలగించండి
  7. హ హ !! బావుంది లలితా. నేను ఇలాగే karaoke పెట్టి మరీ చాలా సాధిస్తుంటా :)

    రిప్లయితొలగించండి
  8. మీ పాటల సెలక్షన్ లో వెర్సటాలిటీకి నమస్సులు :-) కర్ణాటక సంగీతం నుండి మైఖేల్ జాక్సన్ వరకూ షఫుల్ చేసి నేను వినేసే వైనం చూసి మిత్రులు ఆశ్చర్యపోతుంటారు.. మీరు నన్ను మించి పోయారు.. మీ పోస్ట్ నా నేస్తాలకు చూపించాలి :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓహ్! పాటలతో నా ఆట గీత-కొమ్మచ్చి అండి :) నాతో నేనే అంత్యాక్షరి ఆడేసుకుంటాను.

      తొలగించండి