29, జులై 2017, శనివారం

ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే ( తానా జ్ఞాపిక నుంచి నా జ్ఞాపకం)


 బోలువో, బోల్డువో - బోల్డన్ని కబుర్లు రాస్తున్నానామరి!
అందులోనూ అంకెలతో పాటు అక్షరాలతోనూ, మాటలతోనూ నా ఆటల-పాటల సరదా ఉండనే ఉందా?!

అదీ - అద్గదీ ... అదే మరి  - చేర్చింది నన్ను తానా చోటికి - తానాలోని సాహిత్యకమిటీకి.

తానా జ్ఞాపికకి ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు  అన్న శీర్షికన వ్యాసమో, కథో, కవితో రాస్తే బావుంటుందని హితులు, స్నేహితులు, సన్నిహితులు అన్న మాట పట్టుకుని తానా-వారి శీర్షికని నా మాటల్లో ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే అనేసుకునితెలుగుమాట మీద నాకున్న ఇష్టాన్ని ఆ మాటా - ఈ మాటాగా - మాటలు పేర్చి-  కొన్ని మాటల్లో రాసి పంపించాను.



నన్నచ్చెరువున ముంచెత్తుతూ అదచ్చయ్యింది - అచ్చు పత్రికన నిచ్చలుగా నిలిచింది.

ఆ కబురు - ఈ కబురు అంటూ ప్రతీ వారం చెప్పడానికో కబురు ఎలాగూ ఉంటోంది కదా అని  ఓ పక్కన పెట్టగా - మరుగున వున్న ఈ జ్ఞాపిక-కబురు ఈ రోజుకి బ్లాక్కెక్కించాలనిపించింది.

రెండు చోట్ల మాత్రం అచ్చులో మార్పు కనిపించింది. అదీ... ఈ పేరాలో :



అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.


"ఆ-ఈ-ఏలు త్రికములనబడును" అన్న త్రికసంధి సూత్రాన్ని తలుచుకుంటూ ఆదో-ఈదో-ఏదో అన్న నా పన్-ధోరణి ఎడిటింగ్‌లో ఆటకట్టి ఆదో-ఇదో-ఏదో గా పండిపోయింది.

నా మోమాటం లేని హకారాన్ని హల్లు-అప్పు తెచ్చుకుని మోహమాటంగా  అచ్చు- తప్పయ్యింది.

ఏదేమైనా నా-మాట అచ్చులో తానా-మాటయ్యింది. ఈ రోజుకి నా బ్లాగుకి పోస్టయ్యింది. 



ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే



ఓ న మః
శి వా యః
సి ద్ధం న మః

- అని నాలుగు పక్కలా పసుపు గౌర్లు పెట్టిన నల్లటి కొత్త పలక మీద తిన్నగా, పొడుగ్గా, బల్-నున్నగా వున్న పాలబలపం పట్టిన నా చేయి పట్టి రామశేషు మేష్టారు రాయించగానే నాలోని పసితనం ఆ అక్షరాల పసిడితనపు భ్రాంతిలో పడిపోయింది.

అప్పటివరకు ఆటపాటలే ఆరుకాలాలుగా సాగిన నాకు ఈ కొత్త అక్షరాలు దిద్దే ఆట బహు బాగా నచ్చింది. పొద్దున్న బళ్లోకి వెళ్లగానే మల్లయ్య మేష్టారు, రామయ్య పంతులుగారు, కోటేశ్వర్రావు మేష్టారు, రామశేషు మేష్టారు అన్ని తరగతుల పిల్లలనీ రెండు వరసల్లో నిలబెట్టి చేయించిన ప్రార్థన -

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

అని ఆ చదువులతల్లి పద్యంతో మొదలు. 

ఆ తర్వాత రోజూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడాల్సిందే. ఇవి రెండూ అయిన తర్వాతే పాఠాలు. 

పొద్దున్న పలకమీద మేష్టారు రాసిచ్చిన అఆలు నున్నగా జుట్టు దువ్వుకుని ముస్తాబైన కళకళలాడే అందమైన సన్నటి మెరుపు తీగల్లాంటి ఆడపిల్లల్లా కనిపించేవి. 

వాటిని దీక్షగా దిద్దీ, దిద్దీ - మధ్యాహ్నానికి శ్రద్ధగా పెంచి పెద్ద చేసేశాను - అని మురిసిపోయే సమయానికి అవి ఆటపాటల్లో, అరువు దెబ్బలాటల్లో జుట్టు చెదిరి, కాటుక కంటి హద్దులు దాటి బుగ్గల దాకా పాకిన గడుగ్గాయి అమ్మాయిల్లా తయారయేవి. 

ముందు రోజు రాసిచ్చిన నాలుగక్షరాలు గబగబా నేర్చేసుకుంటే మరుసటి రోజు ఇంకొన్ని కొత్తక్షరాలు పోగేసుకోవచ్చని - అలా కూడబెట్టుకున్న అక్షరాలతో కూడబలుక్కుని కనిపించిన కాయితమల్లా చదివేస్తూ ఉంటే కళ్ల ముందు రోజుకో కొత్త బంగారు లోకపు కిటికీ తెరుచుకుంటూ ఉంటుందని తెలిసిపోయింది. 

ఇంకేముంది - పరుగాపక చదువుబండి సాగింది. 

అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు .... ఆ ... అక్కడ - ఆ గుణింతాల మలుపు దగ్గర బండి కొత్తదారి పట్టింది. 

క-కార అ-కారముల క  - క-కార ఆ-కారముల కా 
క-కార ఇ-కారముల కి  - క-కార ఈ-కారముల కీ 
క-కార ఉకారముల కు  - క-కార ఊకారముల కూ ...  అని గుణింతపు రాగాలు పాడుకుంటూ చిందులేసింది. 

అలా - అక్షరాలా - అక్షరాల మాలల్లుతూ మాటలూ, మాటల మూట గట్టి వాక్యాలు - చదవడం, రాయడం వచ్చేసింది - అలా రావడం నచ్చేసింది. 
తరగతులు త్వరితగతిన దాటుతుంటే జీవభాష వ్యాకరణం - జన జీవన వ్యవహారం ఒకేలా అనిపించేవి. 
అదెలా అంటే -  
మాటల మధ్య సంబంధాలు సంధులని 
మాటలు చేసే సావాసాలు సమాసాలని 
మాటలు చేసుకునే సోకులు అలంకారాలని 
మాటలు కట్టుకునే గుంపులు గణాలని 
మాటలు పేర్చి (పద్య)మాలలు కూర్చొచ్చని
ఆ మాటకొస్తే మాటకి, మనిషికీ బహు దగ్గర సంబంధముందనీ 
మాట కలిపిన మనసు కలుస్తుందని 
మాట నేర్పులేని మనిషికి  మనసు-చేర్పువుండదని 
మాటల గురించి ఇన్ని మంచి మాటలు తెలిశాక 
మాట-మనిషి అరమరికలు లేని అమరిక అని  ఎరుకయింది.
ఆ ఎరుకతోనే మాట తూలక ఒబ్బిడిగా వాడితే మాట మరింత ఎన్నికగా మన్ని మన్ననిస్తుందని తెలిసింది.

సరి సరి - ఈ మాటల-మాటలతో ఏమారి నా దారి దారి-మళ్లిపోయినట్లుంది.

ఎక్కడ ఆగాను - గుణింతాల దగ్గర కదూ ?! అనగా-అనగా తెలుగు-చదువు అతిశయ రాగపు బాట పట్టింది. హై స్కూల్ చదువులో విభక్తులు, ప్రత్యయాలు నేర్చి సంధులతో సంధి కుదిరింది. సంధులు నేర్వడం లెక్కలు కూడడం ఒకేలా అనిపించేది - రెంటి మీదా మక్కువ మిక్కిలిగా పెరిగింది.

అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.

తెలుగు బాటలో తొలితొలి దారుల మలుపులు దాటి - సాగే కొద్దీ ఒక్కొక్క మెట్టునెక్కుతుంటే  - కనుల చూపుకాననివీ  మినుకు-చూపులకానేవి అయిన మిణుకు లోకాల మజిలీలెన్నో. 

ఆ మజిలీలలోనే మొట్టమొదటిసారిగా అందిపుచ్చుకున్నవి  అందమైన ముగ్గులా అనిపించే దేవులపల్లి వారి అక్షరాలలో వరమోయి అనిపించిన నేటిరేయి కవితలు, మనపక్షం కాకపోతేనేమి కురిసేద్దామా అని వెన్నెలలే పరవశించే కృష్ణపక్షపు పాటలు. లోకానికి బాధ పంచిన ఆయన భాష ఆ బాధలో సౌఖ్యాన్నే చూపింది.

అలా సొంతమైంది  - క్షరము కాని అక్షరాల సాయంతో నింపుకున్న చదువుల అక్షయ తూణీరం. అమ్మ చెప్పిన 'విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అన్న లోకోక్తి పట్టుకుని - జీవితపు సహచరునితో కలిసి - కోటివిద్యల్లో చెరో విద్యా ఎన్నుకుని తెలుగు దేశపు ఎల్లలు దాటి ప్రవాసమొచ్చాము. తెలుగు పాటలకు జిలుగులద్దిన మన-సు-కవి ఆత్రేయ గారన్నట్టు దూరమైన కొలది అనురాగం పెరుగుతుంది కదా!  ఏ పని మీదో బయటికి వెళ్లినప్పుడు తెలుగు మాట వినగానే అమ్మ-ఆవకాయ-ఇల్లు ఇత్యాదిగా అ-ఆ-లు జ్ఞప్తికొచ్చి మనసునీ-నోరునీ ఒక్కలా ఊరించేవి.

ఏ రెండు-మూడేళ్లకో వీలు కుదిరి సెలవు చిక్కి కన్నవారిని-మునుపున్న వూరుని చూడడానికి వెళ్లినప్పుడు వస్తూ వస్తూ మూటకట్టుకొచ్చిన కమ్మని కథలుండే-కమ్మలుగల-పుస్తకపు-తాయిలాలెన్నో.

ఈమధ్యే - నలుగురం చేరి కబుర్లాడుకునే వేళ - "ఎండాకాలంలో వడదెబ్బ తగిలిందెవరికో" - అన్న మా మాటలు విని - మా మాటల మేత నందిపుచ్చుకుని తామూ తెలుగు-పులుగులమై ఎగరాలని చూస్తున్న మా వంశవృక్షపు చిగురులు "Was she hit by a వడ? అని అడగ్గానే - ఫక్కుమనే నవ్వుతో బాటు "ఫర్వాలేదు - తినిపిస్తున్న తెలుగు-చిగురాకు వగరు - వగరు అంటూ తింటున్నా తీపిరాగమే పలికిస్తోంది - ఇలాగైతే మన తెలుగుకి ఢోకా లేదు - ఎల్లెడలా వెలిగేస్తుంది" అన్న నమ్మిక కుదిరింది.

ఉపసంహారం: 

తెలుగు - మన తెలుగు
మాటల వెలిగే - మనదైన వెలుగు
వీనుల విందు - పాటల పసందు
తెలుగు పలుకు అనండి -  మీరు వినండి
ఎవరైనా అనగా వింటుంటుండండి
ఇంకెవరో వినగా మీరంటుంటుండండి
తెలుగు అంటుంటే మనం వింటుంటే - ఎంత బావుంటుందో !
ఇలాగే అంటూ వింటూ వుంటే మన తెలుగు ఎంతకాలమైనా ఇలా వుంటూనే వుంటుంది
ఇలలో ఎప్పటికీ నిలిచి వుంటుంది - ఎల్లలు దాటి వెలుగుతుంది - ఎల్లెడలా వెలిగిస్తుంది.



20 కామెంట్‌లు:

  1. తెలుగుభాష మీద మీకున్న మమకారాన్ని బాగా వర్ణించారు.

    ఏం పాపం, తానా ఎడిటర్లు "ఆదో" ని కూడా "అదో" అని దిద్దలేదే?

    మీరన్న "మోమాటం" అలాగే వేస్తే బాగుండదని "మొహమాట" పడి మధ్యలో "మో" పక్కన "హ" ఇరికించినట్లున్నారు ఎడిటర్లు (కానీ "మో" ని మాత్రం "మొ" అని మార్చకుండా వదిలేసి!). నిజానికి "మొహ" ని "మోహ" అని వ్రాసే "మోహం" చాలా ఎక్కువయిపోయిందిలెండి. తెలుగు బ్లాగ్ లోకంలోనూ, మీడియాలోనూ కూడా ఆ పంటికింద రాయి తరచు తగులుతూనే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు: మోహమాటమైన నా మోమాటం గురించి మొహమాటం లేకుండా మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు :)

      తొలగించండి
  2. మీ ఈ వ్యాసం ఇంకో రెండు,మూడుసార్లైనా చదవాలని ఫిక్స్ అయ్యాను. అంత బావుంది. మధురం-మధురస్య-మధురేభ్యః
    ఆలోపు ఓ మూడు కామెంట్లు - ౧)ఎవరైనా తల్చుకుంటే తల్చుకోబడిన వాళ్లకి వస్తుందంటారుకదా. గతవారంలో ఆత్రేయగారు_/\_ స్వర్గంలో ఎట్ లీస్ట్ రెండుసార్లు దగ్గి,నన్నెవరో తలచుకుంటున్నారు అనుకుని వుంటారు :-). కలువకి చంద్రుడు పాటని మీరు,నేనూ ఒకసారే వాడడంతో :-)
    ౨)//ఆదో-ఈదో-ఏదో //నేనా?తానా(నా)?అని మీరనక/నుకోకపోయినా తానావారికి అర్ధమయినంతే ప్రింటయిందనమాట.
    ౩)//అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో)// 👌x10000, _/\_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVR గారు: నా తానా-వ్యాసం మీకు నచ్చిందనడం నాకు భలే నచ్చింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. మీరు అల్లిన అక్షరాల అలంకారాలు భలే ఉన్నాయి. అంతలోనే ఈపోలిక ఈతరం ఆడపిల్లలకి అర్థమవుతుందా అనిపించింది. ముందర అ, ఆలు చక్కగా దువ్వుకొన్న తలలైతే, బాగా అరగదీసినవి కాస్తా రేగిన తలలా? వాహ్!! మీరు వ్యాకరణం గురించి వ్రాసిన అభిప్రాయం పెద్దయిన తర్వాతదా, చిన్నప్పటిదా? అలాచెప్తే తెలుగు నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సుకత చూపుతారేమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామిగారు: వ్యాకరణం గురించిన నా అభిప్రాయం అప్పటిదేనండి - ఇప్పటికి మాటల్లో రాయడం కుదిరింది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. >>>కొత్త పలక మీద తిన్నగా, పొడుగ్గా, బల్-నున్నగా వున్న పాలబలపం పట్టిన నా చేయి పట్టి రామశేషు మేష్టారు రాయించగానే నాలోని పసితనం ఆ అక్షరాల పసిడితనపు భ్రాంతిలో పడిపోయింది....>>>>

    అక్షరాభ్యాసం కూడా మీకు గుర్తు అందా ? నమ్మలేకపోతున్నాను.మీకు డైరీ వ్రాసే అలవాటు ఉందా ? శ్యామలీయం గారు ఊయల మీదనుండి దూకడం కూడా గుర్తు ఉంది అన్నారు. మీ ఇద్దరి మెమరీ పవర్ మీద రిసెర్చ్ చేయాలండీ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారికగారు: నేను డైరీ రాయనండి - కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మరచిపోలేనంతగా గుర్తున్నాయి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  5. లలితా! నీ బోల్డన్ని కబుర్లు , 'బోలు' వి మట్టుకు కానే కాదు సుమీ ...
    దె ఆర్ టోల్డ్ ఇన్ ఎ 'ఓల్డ్', 'బోల్డ్', 'గోల్డ్' బట్ నాట్ 'కోల్డ్' వే.
    తానాకంటూ తనగురించి తనకోసం తనకు తానే నీవు రాసుకున్న ప్రతీ మాటా ఓ మెరుపుతీగ!
    పన్ చేసినా, ఫన్ చేసినా, పంచ్ వేసినా ప్రతీ పదం మీద నీదైన రాలుగాయి ముద్ర ఇటులనే రాలుగాక!
    తానాకేమో గానీ నీ బ్లాగ్ కు మాత్రం ఇది చక్కని జ్ఞాపిక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత అనే తన రాతలు, రాగాలు - రాలుగాయితనాలు అంటావు - సరె! ఒప్పేసుకుంటాను - ఇలాగే కుదిరినంతకాలం రాలుగాయితనం మప్పుతాను ;)

      తొలగించండి
  6. సరసిజనాభు సోదరికి చారుతరాంధ్రము సంస్కృతాంగ్లముల్
    పరువిడి లైన్లు గట్టెడిని భాషల తోడుత గోళిలాడెడిన్
    అరుదిది యిట్టి బల్ ప్రతిభ లబ్బుట చూడము కోటి కొక్కరై
    వరలుట గల్గు శ్రీ లలితవారలు వారిలొ నొక్కరై చనన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావుగారు: నాకిది చాలా పెద్ద ప్రశంస. మీకు బోల్డన్ని ధన్యవాదాలు!

      తొలగించండి
    2. మీ మూడు చప్పట్లకి ముమ్మారు ధన్యవాదాలు, YVR గారు!

      తొలగించండి


  7. ఈ సరిసిజ, ఆభ సుందరి యే సుమ్మీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు! సరసిజనాభసోదరిని "వెలుగు"లోకి తెచ్చి "ఆభ"సుందరిని చేసిన మీ పన్-తనానికి వంద-నాలు :)

      తొలగించండి
    2. విజయశాంతిని నాభి సుందరి అని పిలిచేవారు.
      ఆభ సుందరి అంటే అర్ధం ఏమిటండీ ?

      తొలగించండి
    3. "ఆభ" అంటే నాకు తెలిసిన అర్థం "వెలుగు" అండి.

      తొలగించండి


  8. పరిణితి గాంచి పాటవము, భావము లెల్ల, జిలేబి, రమ్యమై
    వరముగ తెల్గు లోకమున వారిజ మా లలితమ్మ వచ్చెనౌ
    స్వరముల పాటలెల్లతను సాజముగా వినిపించెనమ్మరో !
    సరసిజ నాభ సోదరికి సాటి జయంతి జయంతి యే గదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు మీరే సాటి
      ఎవరికి వారే సాటి
      అల్లాగే - సరసిజనాభసోదరికి జయంతియే సాటి :)

      తొలగించండి