గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 7 - బీటీలో గట్టెక్కిన ఎస్సెసెల్సీ
ఒకే వరసలో కబుర్లు చెప్పేయకుండా - కొంచెం ముందుకీ వెనక్కీ వెళ్తూ అప్పుడోటీ అప్పుడోటీ జరిగినవి చెప్తాను - మా అమ్మ( మీ నాన్నమ్మ) కాశీమజిలీకథలు చెప్తూ మధ్యలో పిట్టకథలు చెప్పేది కదా - అలాగన్నమాట!
(ఈ ఉపోద్ఘాతానికి కారణమేంటంటే కొన్ని చెణుకులు మర్చిపోయానూ - అవిప్పుడు చెప్తానూ అని అర్థం.)
అరటికాయ బజ్జీ న-ఖాదనం:
చిన్నప్పుడు మా వీధిలో అనిపిండి సన్యాసిరావు మాష్టారని ఒకాయనుండేవారు.
మనిల్లు - పక్కనే చిన్నరాజుగారి ఖాళీ స్థలం - దాని పక్కిల్లు అనిపిండి వారిది.
సన్యాసిరావు మాష్టారని - ఎలిమెంటరీ స్కూల్ ఆయన. కొంచెం అమాయకత్వంతో కూడిన టీచర్ ఆయన. చాలా మంచాయన పాపం!
చిన్నరాజుగారి పేరు నరసింహరాజుగారు. సత్తికొండకి, సూరికి తాతగారు ఆయన.
ఆయన ఇంటి ఎదుగుండా స్థలంలో అరటితోట వేసుకున్నారాయన. ఆ తోటకి ముందు పక్క దడి కట్టేసి ఉండేది.
ఒకసారి ఆ తోట మంచి కాపొచ్చింది - బోల్డు గెలలూ అవీ వేసి - మంచి అరటికాయలు బాగా వచ్చాయి.
ఓ రోజు సాయంత్రం - సత్తికొండ, సూరి, నేను వీధిలో అరుగు మీద కూర్చున్నాము. సన్యాసిరావు మాష్టారు కూడా వచ్చి మా పక్కనే కూర్చున్నారు.
రాజుగారి తోటలో అరటికాయలు చూస్తూనే నాకు అరటికాయ బజ్జీలు తినాలనిపించింది.
అనిపించిందే తడవు - నేను సత్తికొండతో - " ఒరే! అరటికాయ బజ్జీలు తినాలని వుంది. మన చిన్నరాజుగారి తోటలో అరటికాయలు బావున్నాయి. అరటికాయలు లోపలున్నాయి - మరి అవి కోసి తెచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే నూనె అదీ నేను పట్టుకొస్తాను. బజ్జీలు వేసుకు తింటే బావుంటుంది కదా" - అన్నాను.
అది వింటూనే సన్యాసిరావు మాష్టారు కూడా - "అవున్రా! - బావుంటుంది - అరటికాయ బజ్జీలు తిందాం - సరదాగా వేడి వేడిగా" - అన్నారు.
"సరదాగా తిందాం అంటే ఎవరన్నా వెళ్ళి వాటిని కోసుకు రావాలి కదా - మేమెళ్ళ లేము - మీరెళ్ళండి - అరటి కాయలు తీసుకురావడం ఒంతు మీది - నూనె, సెనగపిండి తీసుకురావడం ఒంతు మాది" అన్నాన్నేను.
సన్యాసిరావు మాష్టారి ఇంటి దగ్గర ఒక చిన్న సిమ్మెంటు కుర్చీలా కట్టారొకటి.
ఆ కుర్చీ దాటితే తోటలోకి వెళ్ళిపోవచ్చు. దూకెళ్ళాలి.
నేనలా అరటికాయలు మీరు తెండి అన్నానో లేదో ఆయన - "సరే! నేనెళ్ళి పట్టుకొస్తాను ఆగరా" అనే చెప్పి - ఆ సిమ్మెంటుకుర్చీ దూకి అరటితోటలో దిగారు.
అది సాయంత్రం మునిమాపువేళ. ఆరూ ఆరున్నర అవుతోంది - చిరుచీకటి పడుతోంది.
అప్పుడే చిన్నరాజుగారు బయటికొచ్చి పడక్కుర్చీ వేసుక్కూర్చున్నారు.
సన్యాసిరావు మాష్టారిని తోటలోకి వెళ్ళనిచ్చి - ఆయనో నాలుగు కాయలు కోసింతర్వాత - "ఏమండోయ్! చిన్నరాజుగారు! మీ తోటలో ఎవరో దొంగ దిగి అరటికాయలు కోసుకు పోతున్నాడు - దొంగ! దొంగ!"- అని అరిచాను.
ఆయన వెంటనే లేచి - "ఎవడాడు?! తోట్లో ఎవుడ్రా వాడు - అర్టికాయలు కోసేవాడు?" - అంటూ కర్రట్టుకుని ఒచ్చారు.
ఈ లోపులో సన్యాసిరావు మాష్టారు - చిన్నరాజుగారి కేకలకు భయపడి - ఆ తోటలోంచి కుర్చీ మీదుగా ఇంటిలోపలికి దూకేసి - "అమ్మ వెధవల్లారా! నన్నాటాడించేసి తోటలో దింపి నన్ను దొంగంటారా? నన్ను పట్టుకుంటే కొట్టేసేవాడిప్పుడాయన" - అని గోలగోల చేశారు.
ఆ రోజలా ...
అరటికాయ బజ్జీ ఖాదనం
మేమెప్పుడూ కాదనం అనుకున్నాం
కానీ అయింది మాత్రం
అరటికాయ బజ్జీ న-ఖాదనం!
కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం
శ్రావణమాసంలో శ్రావణీకులు వచ్చేవారు మనింటికి - ఉర్లాం బ్రాహ్మలు అనేవాళ్ళం వాళ్ళని - ఒక శ్రావణ-భాద్రపద మాసాల్లోనే వస్తారు.
వాళ్ళు కృష్ణా జిల్లా - తెనాలి అటువైపు నుంచి వచ్చేవారు. మనవేపు నుంచీ వచ్చేవారు కానీ - ఎక్కువగా అటువైపు నుంచి వచ్చేవారు.
వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే - మన ఇంట్లో వండిన వంట వాళ్ళు తినరు.
వాళ్ళకి స్వయంపాకం ఇచ్చేసి ఓ పొయ్యా అదీ చూపెడితే - మనింట్లోనే ఒండేసుకుని ఆ రాత్రి అక్కడ పడుకుని మరసటి రోజు పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు.
ఒక రోజు సాయంత్రం మనింటికి దాదాపు ఓ పది మందొచ్చారు. ఏవో పన్నాలు అవీ చెప్పారు. మా నాన్నగారు వాళ్ళకి ఏదో సంభావన ఇచ్చారు.
ఆ తర్వాత వాళ్ళు - "అమ్మా! మేం రాత్రికి ఇక్కడే భోంచేస్తాం" అన్నారు మా అమ్మతో.
మన ఇంటి వెనకాల సందులో ఓ రెండు పొయ్యిలుండేవి.
మామూలు పొయ్యొకటి, పెడా పొయ్యొకటి - మట్టితో చేసినవి ఉండేవి.
అక్కడో రుబ్బుగుంటుండేది.
వాళ్ళక్కావాల్సిన సరుకులు అన్నీ ఇచ్చి మా అమ్మగారు - "సరే! మీరు ఒండుకు తిని అరుగుమీద పడుకోండి" - అని చెప్తే వాళ్ళు వంట ఒండుకున్నారు - తిన్నారు.
మన నట్టింట్లోనే - ఈ పదిమంది ఆకులు గట్రా వేసుకుని కూర్చుని ప్రశాంతంగా భోజనాలు అవీ కానిచ్చారు.
భోజనాలు అయిపోగానే వచ్చి అరుగుమీద వేసుంచిన ౘాపల మీద అంగోస్త్రాలు పరుచుకుని పడుకున్నారు.
ఈలోపు నేనేం చేశానంటే - మా వదినగారు వయొలిన్ వాయించేవారు - ఆ వయొలినేమో వీధిగదిలో అలమారులో పెట్టేవారు.
నేను సరదాగా ఆ వయొలిన్ - తీసి తీగలు బిగించి - దాన్ని కుయ్-కుయ్ అని అటూ ఇటూ ఆడిస్తున్నాను.
ఆడిస్తుంటే - ఈ బ్రాహ్మల్లో ఒకాయన - "ఏం నాయనా! నువ్వు వయొలిన్ కూడా వాయిస్తావా?" - అనడిగాడు నన్ను.
"అబ్బే - నేం దీని మీద చాలా సాధన చేస్తున్నానండి. ఏ పాట కావాలంటే అది వాయిస్తాను - సంగీతం కూడా నేర్చేసుకుంటున్నాను నేను" - అని చెప్పాను.
"ఐతే నాయనా! ఒక్కసారి ఒచ్చి - ఏదీ - రెండుమూడు కీర్తన్లు వాయించు" - అన్నారు.
"అయ్యో - అంతకన్నానా - తప్పకుండానండి" - అని నేననగానే - భుక్తాయాసంతో ౘాపల మీద వాలిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారు.
నేను కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో - శుభ్రంగా మఠం వేసుకుని కూర్చుని - ఈ వయొలిన్ దగ్గర పెట్టుకుని - ముందేమో శృతి చేస్తున్నట్టుగా కుయ్-కుయ్ -కుయ్ మనిపించి - అటుతిప్పి ఇటుతిప్పి పదినిముషాలు ఆటాడాను అల్లాగా - ఇల్లాగా తిప్పుతూ. .
పదినిముషాలయ్యాక - "ఏం నాయనా ఎంతసేపు శృతేనా? వాయించేదేమన్నా ఉందా?" - అన్నాడొకాయన.
"అబ్బెబ్బే - ఇదిగో వాయిస్తున్నాను - ఆగండి" - అంజెప్పేసి ఆ వయొలిన్ కమాను పట్టుకుని ఆపకుండా "కుయ్-కుయ్-కుయ్" అని వాయించేస్తున్నాను.
వెంటనే వాళ్ళు - నా వాయులీన-వాదనా-బాధ భరించలేక - చెవులు మూసేసుకుని - "బాబూ! వద్దులేమ్మా! నీ సంగీతం వద్దు, వయొలిన్నూ వద్దు. నువ్వది లోపల పెట్టేయమ్మా - మాకూ నిద్రొస్తోంది - పడుకుంటున్నాము" - అని బ్రతిమలాడి నాచేత వాదన ఆపించి అలసి-సొలసి పడుకుండిపోయారు.
అద్దీ - అత్యుత్సాహం కొద్దీ ...
నువ్వెంత వాయించినా వద్దనం అన్నవారి చేతే
వద్దు-బాబోయ్! నీకు వందనం అనిపించిన
నే వినిపించిన కుయ్‌కుయ్ వాయులీన-వాదనం!
<వచ్చేనెల తరువాయి కథ>
very good telugu content and very good blog
రిప్లయితొలగించండిLatest Telugu News
Thank You. I will check your news site.
తొలగించండి"ఉల్లామ్"... 'ఉర్లామ్' అనుకుంటా... ఒకసారి చూడండి.
రిప్లయితొలగించండిసరి చేశానండి. తప్పు దిద్దినందుకు ధన్యవాదాలు.
తొలగించండిLalli మీ నాన్నగారు బాల్య స్మృతులు చాలా బావున్నాయి కళ్ళకి కట్టినట్టు ఉన్నా యి అందులో మన ఊరు కదా ఫలానా వాళ్ల ఇంట్లో అని చెపుతుంటే చాలా interesting గా ఉన్నాయి waiting for next episode and మీ నాన్నగారు మీకు తన చిన్ననాటి సంగతులు చెప్పడం and మీరు ఇలా రాయడం 👌👌👌 and very hat's off Lalli so nice 👌💐💐💐
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్, శ్యామల!
తొలగించండిభలే
రిప్లయితొలగించండిధన్యవాదాలండి :)
తొలగించండిAnthavaram ni mee blog lo malli malli chustunnanu.... thank you for sharing with me...
రిప్లయితొలగించండిThanks, Sarada!
తొలగించండి