29, జూన్ 2020, సోమవారం

వూ-రీ డైరీ - 1 - ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!


ఇంతకు ముందు డైరీ విశేషాలు: వూ-రీ డైరీ - ప్రమాణశ్రీకారం



"మిస్టర్ వూ" అనబడు సుబ్బారావు డైరీ నుంచి ఒక రోజు పేజీ:



హేవిటో! నాకంతా కలలా వుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడంలో ఇంత ఆనందముందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ఏడాదంతా కోడు రాసి, బగ్గు లేరి కష్ట పడితే ఆఫీసు వాడిచ్చే Meets expectations - Exceeds sometimes రేటింగూ ఓ రేటింగేనా?

అదసలు ...  ఎప్పటికప్పుడు మా సుందరి బొటనవేలెత్తి, కనుబొమలు లేపి ఇచ్చే 'బా చేశావోయ్, బావా!" అనేలాంటి expression ముందు ఏపాటిది?

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంతకు ముందులా కాదు - ఇల్లంతా నా అధీనంలోకి వచ్చేసింది.

మా పిల్లలిద్దరూ కూడా ఏమన్నా ప్లేటో, గ్లాసో కావాలంటే "డేడీ!" అంటూ నన్నే పిలుస్తున్నారు. సింకులో గిన్నె పడడం ఆలస్యం ... తక్షణం తోమడం తథ్యం అన్నదే నా మంత్రం.

అసలు నేను మొదటి గిన్నె తోమినప్పుడు మా సుందరి గోముగా చూసిన చూపు వెలుగులలో నేను తోమిన గిన్నె తళతళలే వెలవెలలాడాయి. అదే మొదటిసారి మా సుందరి నన్నలాంటి చూపు చూడడం.

అప్పుడే నేను పడిపోయా - తోము-ప్రేమలో.

ఇహ అందులోంచి బయటికి రాలేకపోతున్నాను. ఆ చూపులోని గోము అలాగే ఉండాలని సింకులో గిన్నెలు ఎన్నున్నా లెక్కచెయ్యకుండా, ఎన్నున్నాయో అని లెక్కెయ్యకుండా మళ్ళీ మళ్ళీ తోముతూనే ఉన్నా... ఉంటా కూడా!

Raising the bar in dishwashing!

"మిసెస్ రీ" అని పిలిస్తేనే పలికే సుందరి డైరీ నుంచి అదే రోజు పేజీ: 



అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కానీ నాకు నచ్చిన ఓ మాట " పండు పంచివ్వరాదు".

నాక్కావాల్సినట్టు అనుకున్న ఇంకో మాట "పని పంచకుండా ఉంచరాదు".  అసలే మనది మేడె-మోక్రసీ. అందుకే  మా బావ "వూ" కి కూడా పని పంచా.

మొదట్లో ఓ చెంచా కడగడానికే ఇబ్బంది పడిపోయేవాడు. మా అత్తయ్య బొత్తిగా ఏ పనీ నేర్పలేదు మా బావకి. అలా అయితే ఎలా? ఆడుతూ, పాడుతూ పనిపాటలు చేసుకోవాల్సింది మేమే కదా!

నిజం చెప్పకపోవడమేం! మొదట్లో నాకు మా వూ బావ చేత చెప్పీచెప్పకుండా, అడిగీ అడగకుండా ఎలా పని చేయించాలో తెలిసేది కాదు.

ఈలోగా ఓ రోజు మా పక్కింటి క్యాథీ వాళ్ళ కుక్కపిల్లకి బంతి విసిరితే పరుగెత్తుకుంటూ వెళ్ళి తీసుకు రావడం నేర్పుతోంది. ఆవిడ బంతి విసరడం, ఆ కుక్కపిల్ల గెంతుకుంటూ వెళ్ళి ఆ బంతిని పట్టుకురావడం. చూడగా చూడగా ఆ శిక్ష(ణ?) కిటుకు తెలిసిపోయింది నాకు.

అలా ఒక చిన్న గరిటె సింకులో వేసి, తోమమని గోముగా చూసి, అది తోమగానే ఇంకో గంటకి ఓ చిన్న పాల గ్లాసో, కాఫీ కప్పో సింకు లోకి తోసి - తోమిన ప్రతిసారీ బొటన వేలెత్తి, బోల్డు పొగిడి, అలాఅలా ఒక అంతం లేని for(ever) loop లా మొదలు పెట్టి, ఇప్పటికి కదా ... బుట్టెడు గిన్నెలు కడగడం, ఇంటెడు బట్టలు ఉతకడం దాకా తీసుకు రాగలిగాను!

అన్నట్టు ఈ నెల మా ఫేసుబుక్కు వాలు పైన సవాల్ ఏంటీ అంటే...ఎవరి ఇంటాయన తోమిన గిన్నెలు ఎక్కువ తళతళలాడుతున్నాయీ అని.

మా శ్రీవారు వూ-గారి పుణ్యమా అని అది నేనే నెగ్గా...

ముద్దుముద్దుగా చెప్పి ... ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

కడుగుల్, తోముడు, దులుపుల్, సినిమా వీక్షణంబులున్
వినుట యందనురక్తి, ఎఫ్బీ ఇన్స్టా, వాట్సాప్ సారథ్యముల్
నోరూరించెడి పాకశాస్త్ర విదితం, బేబీల సిట్టింగులున్
ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

19, జూన్ 2020, శుక్రవారం

త్వామనురజామి - 48 - నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 47 - హాయి హాయిగా మురిసేనే...

గుంటూరు స్టేషన్లో ట్రెయిన్ దిగగానే ఎప్పట్లాగే - నాన్న, నాన్నతో పాటు పప్పీ, కుట్టీ, ప్రశాంతి, వీళ్ళతో పాటు తంబి మామయ్య కొడుకు వాసు - బిలబిల్లాడుతూ వచ్చేశారు. దిగిన నన్నూ, దింపుకున్న నా సామానునీ తీసుకుని హడావిడిగా మాట్లాడుతూ  గలగల్లాడుతూ కారెక్కేశాము అందరమూ.

ఇంటికెళ్ళగానే అమ్మ ఎఱ్ఱనీళ్ళు దిష్టి తీసి పారబోసింది. అప్పటికే లక్ష్మిదొడ్డ ప్రశాంతితో పాటు నేను రావడానికి రెండ్రోజుల ముందే వచ్చేసి వుంది. ఇల్లంతా కడుగుళ్ళూ, సామాను జరుపుళ్ళూ వగైరాలతో పీకి-వెయ్యని పందిరిలా వుంది.

లక్ష్మి దొడ్డ కలిపిచ్చిన పాలు తాగి, నాకిష్టమైన గోధుమరవ్వ ఉప్మా తిని, పప్పీ-కుట్టీలతో బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. అమ్మ, దొడ్డ ఏవేవో లిస్టులు రాసుకుంటూ - ఎవర్ని పిలవాలి, పెళ్ళిబట్టలు ఎక్కడ కొనాలి, ఎన్ని కొనాలి, సరుకులు ఏం తెప్పించాలి - ఇలాంటివేవో మాట్లాడుకుంటూ ఊపిరి సలపనంత హడావిడిగా వున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం అందరం భోంచేసి - మధ్యగదిలో తరగడాలేసుకుని పడుక్కుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ నా పెళ్ళిచీరలు కొనడానికి రాజమండ్రి వెళ్దామనుకుంటున్నామని, నన్ను కూడా వాళ్ళతో తీసుకెళ్దామనుకుంటున్నామని చెప్పింది.

అది వినగానే "నేను రాలేనమ్మా! ఆ షాపింగ్ అదీ నాకు బోర్. నేనింట్లోనే వుంటాను. నువ్వేం కొన్నా నాకు బానే ఉంటుంది " అనగానే అమ్మ కళ్ళలో ఓ మెరుపులాంటి మురిపెంపు నవ్వు - ఎప్పట్లాగే నేను తను కొనబోయే ఏదైనా సరే కాదనకుండా కట్టుకుంటానని చెప్పానని.

నా పెళ్ళి మాత్రం నాకిష్టమైనట్లు అయితే చాలు - నాకింకేమీ పట్టవు అని అమ్మకి నేనప్పుడు నోరు తెరిచి చెప్పకపోయినా, నా పెళ్ళిబట్టలు కొనడం దగ్గర్నుంచి, నా పెళ్ళికి నా  ఫ్రెండ్స్ ఎవర్ని పిలవాలీ అనే దాకా కూడా నేను అంతగా పట్టించుకోలేదు, అమ్మతో వాదించలేదు. అమ్మ ఎవర్ని పిలవాలనుకుంటే అంటే వాళ్ళనే పిలవమని చెప్పాను. అప్పటికి రెండున్నర ఏళ్ళుగా నా మాట చెల్లించుకోవడానికి ఆవిణ్ణి విసిగించింది చాలు అనిపించింది నాకు. ఇప్పటికైనా ఆవిడ చెప్పే మాట విందామని అనిపించింది.

నేను గుంటూరు వచ్సిన మరుసటిరోజు ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు వచ్చాడు. వస్తూ బోల్డంత గోరింటాకు తెచ్చాడు. వెన్న కూడా తెచ్చాడు. పెళ్ళికి ఇంకా దాదాపు పదిరోజుల టైం ఉంది, అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులే అనుకుని నా కుడి చేతికి, పాదాలకి గోరింటాకు పెట్టుకున్నాను.

అమ్మ చాలా రోజుల తర్వాత నాతో మళ్ళీ సరదాగా మాట్లాడుతోంది. చాలా సంబరంగా, హుషారుగా వుంది.

నేనోరోజు పొద్దున్నే అటూఇటూ తిరుగుతూ - ఎప్పుడూ ఏదో ఒకటి పాడుకోవడం అలవాటు కదా - రేడియోలో అంతకుముందే వినున్నానేమో - రాజమకుటం సినిమా పాట "ఏడనున్నాడో ఎక్కడున్నాడో ... నా చుక్కలరేడు" అని పాడుతుంటే అప్పుడే లోపల్నుంచి ఎందుకో బయటకొచ్చిన అమ్మ "ఇంకెక్కడుంటాడు? బ్రాడీపేట 2/11 లో వున్నాడు" అంది నవ్వతూ. నాకప్పుడు బోల్డంత సిగ్గు, దాంతో పాటే ఇంకా బోల్డంత ఆనందం, దాంతోపాటు ఇంకాఇంకా బోల్డంత ఆశ్చర్యం - ఒక్కసారి పెళ్ళి చేసేద్దాం అనుకున్న తర్వాత అమ్మ నాతో ఎప్పట్లాగే సరదాగా మాట్లాడుతోందని.

అనుకున్నట్టుగానే అమ్మ, ప్రభావతి దొడ్డ వాళ్ళ సాయితో కలిసి నా పెళ్ళిచీరలు రాజమండ్రి బొమ్మన రాజ్‌కుమార్ షాపులో కొనుక్కొచ్చింది. బుట్టలోకి బంగారం రంగుకి గులాబీ అంచు చీర, పెళ్ళయ్యాక సత్యనారాయణ వ్రతానికి వంగపండు రంగుకి ముదురు నీలం అంచు చీర, ఇంకా ముదురాకుపచ్చకి గులాబీ రంగు అంచు చీర - మొత్తం మూడు పట్టుచీరలు, ఇంకా చాలా ప్రింటెడ్ సిల్కులు, షిఫాన్లు, కాటన్లు పట్టుకొచ్చింది. పెళ్ళైన పదహార్రోజుల వరకు పాతచీర కట్టకూడదు అని చెప్పింది.

చీరల సందడి సద్దుమణిగింది. ఇప్పుడింక వెండి పట్టీలు, చెవులకి రెండో కుట్టు కుట్టించడానికి చిన్నచిన్న ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు రెండు - కాడతో చెవులు కుట్టడానికి ఉన్నవి - కొందామని శంకర్ విలాస్ దగ్గరున్న కిషోర్ జ్యుయలర్స్‌కి వెళ్ళాము నేను, అమ్మ, లక్ష్మి దొడ్డ.

మేము వెళ్ళినప్పుడే అక్కడికి మా శ్యామసుందరి మేడం వచ్చారు. ఆవిడ BH లో మాకు కెమిస్ట్రీ లెక్చరర్. ఆవిడే నా కెమిస్ట్రీ రికార్డు మీద నా పేరు లలితా టి ఎస్ వడ్లమాని అని రాసుకుంటే "పేరు ఇలా కూడా రాసుకుంటారా?" అని నవ్వారు.

నాకు, అపర్ణకి BH లోచదివేటప్పుడు అందరి కన్నా శ్యామసుందరి మేడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడావిణ్ణి దాదాపు ఆరేళ్ళ తర్వాత చూశాను. ఆవిడకి నా పెళ్ళి అని తెలిసి బోల్డు సంతోషించారు. ఆవిడ ఏదో నెక్లెస్ కొనడానికి వచ్చారు. నేను వద్దంటున్నా వినకుండా ఆవిడ కొన్నదాన్ని ఓ సారి నా మెళ్ళో పెట్టి "నీ మెడకి ఇదెంత బావుందో!" అని చూసుకుని తెగ మురిసిపోయారు. అదే ఆవిణ్ణి చూడడం. మళ్ళీ ఇంకెప్పుడూ కలవలేకపోయాను.

సరే! చెవులు కుట్టించుకోవడానికి ఎఱ్ఱముక్కుపుడక కాడలు తెచ్చుకున్నాను కదా! ఐదో లైనులో ఎవరో కంసాలాయన వున్నారు, ఆయన ఇంటికి వెళ్తే చెవులు కుడతారు అని చెప్పారు అమ్మాజీ ఆంటీ. ఓ రోజు మధ్యాహ్నం మూడింటికి అమ్మ, లక్ష్మి దొడ్డ, పప్పీ, కుట్టీ, ప్రశాంతి, నేను, అమ్మాజీ ఆంటీ - ఏడుగురం కలిసి నా రెండు చెవులు కుట్టించుకోవడానికి వెళ్ళాము.

ఆ కంసాలాయన భలే మంచాయన. నొప్పి వస్తుందేమో అని భయపడుతూ చెవిని అందించడానికి ఆలస్యం చేస్తున్న నాతో ఎంతో ఓర్పుగా కబుర్లు చెప్తూ చెప్తూ, ఒడుపుగా ఒక చెవిలో బంగారం కాడ నాకు తెలీకుండా కసుక్కుమని దించేశారు. అబ్బా! ఎంత నొప్పొచ్చిందో!

ఆ దింపిన కాడని చెవి వెనక పక్క పొడుగ్గా ఉన్న బంగారం కాడను చుట్టి, రెండో చెవి కుడదామని ఆయన నా చెవి పట్టుకున్నారో లేదో నేను నోరంతా తెరిచి "ఆఁ ఆఁ ఆఁ" అని గా...ఠిగా ఏడవడం మొదలుపెట్టాను. ఆయన ఒక్క నిముషం నా ఏడుపుకి బిత్తరపోయి "ఇంత మాత్రానికే అలా ఎవరన్నా ఏడుస్తారా? ఆయ్!" అని గద్దిస్తూ రెండో చెవి కూడా కుట్టేశారు. నా ఏడుపు విని నాతో ఉన్న అమ్మావాళ్లు కూడా ఒక క్షణం బిత్తరపోయారు.

రెండు చెవులకి ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు కుట్టేశాక - ఇంటికి వచ్చేస్తూ ఉంటే పప్పీ, కుట్టి, ప్రశాంతి అయితే ఒకటే నవ్వు. కుట్టెమ్మ "అదేంటే లల్లెమ్మా... అలా ఏడ్చావు? నయం ... ఆ కంసాలాయన ఇంటికి చుట్టూ గోడ, పెద్ద చెక్క గేటు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేవాళ్ళు, ఏం జరిగిపోతోందా అని, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకుంటూ విరగ్గొట్టేసుకునేవాళ్ళు." అంటూ ఇంటికి వెళ్తున్నంతసేపూ నా భుజం మీద చెయ్యేసి ఊపేస్తూ లాక్కెళ్ళిపోతూ.

ఆ రోజుకి నాకు చెవులు రెండూ చాలా నొప్పి చేశాయి.

ఆ రోజు రాత్రి అమ్మ పడుక్కునేముందు కుంకుమ, వెల్లుల్లి వేసి కాచిన గోరువెచ్చటి నూనె నా రెండు చెవులకి ఆ బంగారం కాడలు కుట్టినచోట రాసింది.

మా ఇంటి మధ్యగదిలో లక్ష్మి దొడ్డ, ప్రశాంతి, నేను, పప్పి, కుట్టి ఓ జంబుఖానా, దాని మీద బొంతలు వేసుకుని పక్కపక్కనే వరసగా పడుక్కున్నాం. మార్చ్ నెల మొదటి వారం అయినా ఇంకా చిరు చలిగా అనిపిస్తూ ఉండడంతో రాత్రి పూట అందరం మా మా చిన్నరగ్గులు కప్పుకుని పడుక్కున్నాం.

ఒక రాత్రి వేళ నా కుడిచెయ్యి చూపుడు వేలు దగ్గర ఏదో మెత్తగా కదిలినట్టయ్యి, దాంతో పాటే వేలు కూడా కొంచెం చురుక్-చురుక్కుమనడంతో మెలకువ వచ్చింది నాకు. ఏంటా నొప్పిగా ఉంది అనుకుని లేచి, అక్కడే లైట్ వేస్తే నా పక్కనే పడుకున్న వాళ్ళందరూ లేస్తారని మండుతున్న వేలుని ఊదుకుంటూ, నెమ్మదిగా నిద్రకళ్ళ తోనే లేచి వెళ్ళి వంటిట్లో లైట్ వేశాను.

ఇంతలో నా వెనకాలే లేచొచ్చిన పప్పీ నా వేలు కేసి చూసి "లల్లీ! నీ వేల్లోంచి రక్తం వస్తోంది." అంది.

అప్పటిదాకా ఏదో మంటగా ఉంది, ఎందుకబ్బా అనుకుంటున్న నేను రక్తం అన్న మాట వినగానే మళ్ళీ గా...ఠిగా గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాను. వెంటనే మా పక్కనే పడుకున్న లక్ష్మి దొడ్డ, ఆ చివర బెడ్‌రూంలో పడుకున్న అమ్మా-నాన్నా "ఏమైంది, ఏమైంది? అర్థరాత్రి పూట ఈ ఏడుపేంటి?" అనుకుంటూ కంగారుగా లేచి వచ్చారు.

నా వేలు చూస్తే - దానిమీద ఉడత వీపు మీద ఉండే మూడు చారల్లా - ఎవరో కొరికినట్టు మూడు గీతలు, వాటిలోంచి కారుతున్న రక్తం కనిపించింది. అది చూడగానే లక్ష్మిదొడ్డ "చుంచో, ఎలకో కొరికినట్టుంది" అంది.

అది విని అసలే ఆరున్నొక్కరాగం పాడుతున్న నేను ఇంకొంచెం శృతి పెంచాను.

నాన్నకి ఓ పక్కన విసుగొస్తున్నా - కాబోయే పెళ్ళికూతుర్ని విసుక్కోకూడదనుకున్నారేమో మరి - తమాయించుకుని - "ఏదీ నన్ను చూడనీ" - అని నా వేలు పట్టుకుని చూసి "ఏదో కొంచెమే కొరికింది. రేప్పొద్దున్నే మన కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళొద్దామో సారి" అన్నారు.

ఇంతలో అమ్మ "చెవికి వెల్లుల్లి నూనె రాశాను కదా! ఆ వాసనకి వచ్చుంటుంది ఎలక. నయం.. చెవి కొరికెయ్యలేదు." అంటూనే నాన్న కేసి తిరిగి "రేపోసారి ఆ వెంకటేశ్వర్లని ఇంటికి రమ్మనండి. వంటింట్లో అటక మీద బోల్డు ఎలకలున్నట్టున్నాయి. వాటిని శుభ్రం చేస్తాడు" అంది.

ఈలోగా నా చెయ్యి కడుక్కుని వచ్చాను. లక్ష్మిదొడ్డ దానికి ఓ చిన్నగుడ్డముక్కతో కట్టు కట్టింది. అప్పటికే తెల్లవారుఝామున నాలుగయ్యింది. నాన్న మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకుండిపోయారు. అమ్మ లక్ష్మి దొడ్డ పక్కనే వాలింది - ఇంకో గంటలో ఎలాగూ లేద్దామని.

నాకింక ఎలక భయంతో నిద్రపట్టట్లేదు. నేను, పప్పి, కుట్టి, మాతోపాటు ప్రశాంతి - మేం నలుగురం బయటికెళ్ళి కుర్చీల్లో కూర్చుని ఆరంభమే తప్ప అంతమే లేని కబుర్లు, కలకలలూ మొదలెట్టేశాం.

నాన్న పొద్దున్నే నిద్ర లేస్తూనే నాకు గుర్తు చేశారు డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలని. ఎనిమిదిన్నరకల్లా తయారయి ఎజ్డి మీద ఎక్కించుకుని నాన్న నన్ను బ్రాడీపేట రెండో లైనులో వున్న డాక్టర్ కామేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడే క్లినిక్ తాళాలు తీస్తున్నారు డాక్టర్ గారు. నన్ను ఎలుక కరిచిందని చెప్పగానే ఎప్పట్లాగే తెల్లగా, చల్లగా నవ్వేసి "అబ్బే! నీకేమీ కాదు" అని ఓ TT ఇంజక్షన్ చేసేసి నన్నింటికి పంపేశారు డాక్టర్ గారు.

ఆ రోజు నాన్న ఆఫీసుకి వెళ్లిన తర్వాత పొద్దున్న పదీ-పదిన్నర టైంలో ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు, తనతో పాటు ఇంకో ఇద్దర్ని మా ఇంటికి పంపించారు. వచ్చిన ముగ్గురూ వస్తూనే వంటింట్లో అటక ఎక్కి ఓ గంట సేపు వెతికి వెతికి ఉన్న ఎలుకల నన్నింటినీ పట్టి, ఓ గోనె సంచిలో వేసుకుని, వెంకటేశ్వర్లుతో పాటొచ్చిన వాళ్ళిద్దరూ  పట్టుకెళ్ళిపోయారు.

వాళ్ళటు వెళ్ళగానే కుట్టి "లల్లెమ్మా! నీ పెళ్ళి కాదు గానీ మనింట్లో ఎలుకల పెళ్ళైపోయింది." అని నాతో అంటూనే, అప్పుడే అటక దిగుతున్న వెంకటేశ్వర్లుతో " మొత్తానికి, వెంకటేశ్వర్లు! మా అటక పీకి పందిరేశావ్!" అనగానే వెంకటేశ్వర్లు "చిన్నపాపగారు తమాషాగా మాట్లాడతారు" అనుకుంటూ మళ్ళీ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో పెళ్ళికి వినాయకుణ్ణి పెట్టటం, వెళ్ళగలిగిన చోటికి పెళ్ళిపిలుపులకి వెళ్ళడం, వెళ్ళలేని దూరంలో ఉన్నవాళ్ళకి శుభలేఖలు పోస్ట్ చెయ్యటం, ఫోన్లు చెయ్యటం, పెళ్ళికి వచ్చేవాళ్ళకి పెట్టడానికి బట్టలు, పెళ్ళికి ఏం సామానులు కొనాలో లిస్టులు రాసుకోవడం, ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్లు తెచ్చి పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఇంట్లోంచి బయటికి, బయటి నుంచి ఇంట్లోకి - ఇంట్లో ఉన్న పెద్దా-చిన్నా అందరూ హడావిడిగా తిరగడం...అబ్బ! పెళ్ళంటే ఎంత సందడి కదా! ఎంత బావుందో అనిపించేలా ఉంది.

హైద్రబాదు నుంచి వచ్చే దొడ్డలు, పిన్నులు, వైజాగ్ నుంచి వచ్చే లలితత్తయ్య, అనాతవరం నుంచి అప్ప-దొడ్డ - అందరూ పెళ్ళికూతుర్ని చేసే ముందు రోజు బయల్దేరి వస్తున్నారని తెల్సింది. అందులోనూ మార్చ్ మధ్యలో పెళ్ళి కదా... స్కూళ్ళు, పరీక్షల హడావిడి వల్ల పిల్లలు ఎవ్వరూ రాకపోవచ్చు అనుకుంటున్నారు అమ్మా-నాన్న.

ఈలోగా అమ్మ నాకు పెళ్ళి కోసం చేయిస్తున్న గొలుసు, బుట్టలు, ఇంకా ఏవేవో వస్తువులు పట్టుకుని విష్ణువర్ధనరావుగారు ఇంటికి వచ్చారో సాయంత్రం. ఆయన రాగానే అమ్మ నా ఎడం చేతి చూపుడు వేలు కొలత తీసుకుని ఒక పగడపు ఉంగరం, ఒక కళ్యాణపుటుంగరం కూడా చేయించమని చెప్పింది. ఓ నాలుగు రోజుల్లో చేసిస్తానని చెప్పి వెళ్లిపోయారు ఆయన.

అమ్మ నాకోసం తెచ్చిన చీరలకి బ్లౌజులు కుట్టిద్దామని నన్ను బ్రాడీపేట 5/21 లో ఉండే రాణి అనే ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు ఎప్పుడూ స్కర్ల్టు, వాటి మీద కాలర్ ఉండే ఫుల్ స్లీవ్స్ షర్ట్లు అలవాటు. అందుకే నా చీరల మీద బ్లౌజులు కూడా ఎప్పట్లాగే మెడ కనిపించకుండా హై-నెక్ కుట్టమని గొడవచేశాను.

వెంటనే ఆ రాణిగారు "పెళ్ళి చీరల మీద ఏం బావుంటాయో నాకు తెలుసు. ఈ సారి నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వింక మాట్లాడబోకమ్మాయ్" అని నన్ను విసుక్కుంది.

పక్కనుంచి అమ్మ కూడా "ఈసారి ఆవిడ చెప్పినట్టు విను" అంటోంది. అసలే అమ్మని విసిగించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టనుకుని వున్నాను కదా! ఇహ మరి మాట్లాడలేదు. నాకెలాగూ తెలుసు - రాణిగారు బాగా కుడతారని.

నేనేమీ మాట్లాడకపోవడం చూసి - ఇక మా అమ్మ, రాణి కలిసి ఆ తర్వాత ఓ గంటసేపు - ఇది పొడుగు చెయ్యి, అది పొట్టి చెయ్యి, దీనికి రౌండ్ నెక్కు, దానికి వీ-నెక్కు అంటూ - నా చీరల మీదకి బ్లౌజులన్నిటినీ వాళ్ళిష్టమొచ్చినట్టు - కుట్టెయ్యమని ఈవిడ ఆవిడకి బట్టలు, కుట్టేస్తానని ఈవిడకి ఆవిడ మాటలు - ఇచ్చిపుచ్చుకున్నారు.

అక్కణ్ణించి ఇంటికి వస్తుంటే అమ్మ చెప్పింది - మా ఇంటి మధ్య గదిలో నాలుగు పక్కలా పూలగుత్తుల్లాంటివి వేసి, వాటి మీద ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో పెయింట్ చేస్తే బావుంటుంది, పెళ్ళికూతుర్ని చేసేది అక్కడే కదా బాగా కనిపిస్తుంది అని.

నాకెలాగూ ముగ్గులెయ్యడం సరదా. పైగా ఇంకెవరు వేసినా నాకంతగా నచ్చేది కాదు. అందుకే ఆ పూలగుత్తులు, వాటికి రంగులూ నేనే వేస్తానని చెప్పాను. చెప్పినట్లే వేశాను.

మళ్ళీ మా అమ్మకి బోల్డు ఆనందం. ఆవిడ నాకు వెయ్యమని చెప్పకుండానే పువ్వులూ, రంగులూ చేసేశానని. నేనడిగిన ఒక్కటీ నాకు దొరికిందన్న ఆనందంలో నేనావిడ ఏదడిగినా చేసేస్తున్నానని నాకు మాత్రమే తెలుసు.

ఆ పక్క రోజే ఫాల్గుణ పౌర్ణమి. చిన్నప్పట్నుంచి హోలీ చేసుకోవడం అలవాటు లేదు కానీ ఆ రోజున రంగురంగుల పట్టు పరికిణీలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఈసారి కూడా ఏదో కొత్తచీర ఎఱ్ఱటి పూలది కట్టుకుని, ఇంటి ముందున్న చిన్న ఖాళీలో నేను పెంచుకుంటున్న తులశమ్మ ముందు పద్మాల ముగ్గు వేశాను. ఆ రోజు సాయంత్రం తెల్లగా కాసిన వెన్నెల్లో పసుపుపచ్చ, కెంపు వెన్నెల్లో విరబూసిన చంద్రకాంత పూలు కోసుకుని దండ కట్టుకున్నాను.

ఆ ఫాల్గుణ పౌర్ణమి రోజు మొదటిసారిగా దిగులుగా అనిపించింది.

జరగబోయేది నా పెళ్ళి. నే కోరుకున్నట్టుగానే నా కిష్టమైన అబ్బాయితోనే. అది కూడా మా అమ్మానాన్నలు ఒప్పుకుని నా ఇష్టాన్ని మన్నిస్తూ చేస్తున్నదే!

అయినా ఇంకో మూడు రోజుల్లో అమ్మనీ, నాన్ననీ, పప్పీని. కుట్టీని, ఈ ఇంటినీ, తులశమ్మనీ, ఆ తులశమ్మ ముందు ముగ్గు వేసే మురిపాన్నీ, ఆ ముగ్గులో రాలే విరిసిన చంద్రకాంతల్నీ ఒదిలి వెళ్తాననే బెంగ.


ఆ రోజు రాత్రి అందరం భోజనాలు చేసిన తర్వాత - ఎప్పటి మా అలవాటు ప్రకారం ఇంటి ముందున్న కుర్చీల్లో కూర్చుని పప్పి, కుట్టీలతో కలిసి ఛాయాగీత్ వింటున్నాను. చలో దిల్‌దార్ చలో ...చాంద్ కే పార్ చలో...అని రఫీ రాగాలు తీస్తుంటే , హమ్ హై తైయార్ చలో అని లతా మంగేష్కర్ ఆనందంగా పాడేస్తోంది. అదేంటో ఎప్పుడు ఛాయాగీత్ పెట్టినా వారానికి నాలుగు రోజులు ఆ పాట తప్పకుండా వచ్చేది.

ఆ పాట వింటుంటే కుట్టి అందుకుని "లల్లి తైయార్ చలో" అని పాడుతూ నాకేసి చూసి "ఇంకో మూడు రోజులే లల్లెమ్మా! నిన్నిహ పద పద పమ్మక్కా అని పంపించేసి నేను, పప్పి హాయిగా ఉంటాం. కదే పప్పీ!" అని పప్పితో అని - మళ్ళీ నాకేసి తిరిగి - " అప్పుడు నీ స్టాంపులు, బొమ్మలు అన్నీ నావే!" అని నవ్వింది. పప్పి కూడా సవ్వడి లేని నవ్వు ముత్యాలు రాల్చింది. 

నేను వెంటనే లేచి వంటింట్లో గిన్నెలేవో సర్దుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వంటింట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు.

"అమ్మా!" అని వంటింటి తలుపు దగ్గర ఆగి మెల్లిగా పిలిచాను.

అమ్మ గ్యాస్ గట్టు తుడుస్తూ "వచ్చావా? అదుగో ఆ వాటర్ ఫిల్టర్ మీద గ్లాసులో పాలు పోసిపెట్టాను. తాగు." అంది తల తిప్పకుండానే.

ఒకడుగు ముందుకేసి ఆ గ్లాసు తీసుకుని రెండు అరచేతుల మధ్యా ఆ గ్లాసునలముకుని  ఉన్న వెచ్చదనాన్ని పట్టుకుని, పాలు ఓ గుక్క తాగి "అమ్మా! నేనిన్ని రోజులు హాస్టల్లోనూ, ప్రాజెక్టు కోసమని బెంగుళూర్లోనూ ఉన్నాను. అసలు ఇంట్లోనే ఉన్నట్టు లేదు. అందుకే నా పెళ్ళయ్యాక ఓ మూణ్ణెల్లు మనింట్లోనే నీ దగ్గరే ఉంటానూ... సరేనా?!" అని నెమ్మదిగా అడిగాను. ఎందుకో తెలీని దుఃఖమొస్తోంది. ముక్కు పీలుస్తున్నాను.

అమ్మ తల తిప్పి చూసి నవ్వబోయి, నన్ను చూసి ఏమనుకుందో ఏమో, దగ్గరగా వచ్చి "నీకిష్టమైనట్టుగానే అన్నీ చేస్తున్నాంగా. ఆ తర్వాత చూద్దాంలే... " అని ఆగి ... మళ్ళీ ఏదో ఆలోచించుకున్నట్టు "నీక్కావల్సినన్ని రోజులు మనింట్లో ఉందువుగానిలే. వెళ్ళు - ముందు ఆ పాలు తాగేసి ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుక్కో. " అని చెప్పింది.

ఇంతలో - ఎప్పట్నుంచి మా మాటలు వింటోందో - కుట్టి నా పక్కనే వచ్చి నించుని ఓ చేత్తో నా షిప్లీ బొమ్మని పట్టుకుని "చంటిపిల్లలా అమ్మని వదిలి వెళ్ళనని ఏడుస్తావేంటే, లల్లీ ? ఇదిగో ---దీన్ని కూడా పట్టుకుపోవే బాబూ! దీన్ని పట్టుకుని జుజుజుజుజూ అని ఎంచగ్గా పాడుకోవచ్చు నువ్వు." అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అంటుంటే నాకు అంత దుఃఖం లోనూ బోల్డు నవ్వొచ్చేసింది.

కానీ ఆ రోజు రాత్రి కలత నిదురే! ఆ నిద్రలో అంతూదరీ, అర్థంపర్థం లేని ఆలోచనలే!

నాకు ఆ క్షణంలో నిజంగా ముందుముందు ఇలా జరగబోతోంది అన్న అంచనా కానీ, ఇలా జరగాలీ అన్న అనుకోవడాలు కానీ లేనేలేవు.

కానీ ఇప్పుడున్నట్లు ఇక ముందు ఉండదూ, ఉండబోదు అన్న ఒక ఎఱుక.

అది నచ్చుతోంది. అది నచ్చట్లేదు కూడా.

అమ్మనొదిలి, నాన్ననొదిలి
పారాడి, పెరిగి, తిరుగాడిన వీడునొదిలి
నేర్చిన ముగ్గుల తీర్చిన వాకిలొదిలి 
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి

చెల్లి నొదిలి, చెలిమి నొదిలి
సరదాల పాడుతున్న పాట నాపి 
నవ్వులాటల చెలగాటలాపి
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి 

తెలియరాని దిగులు తోటి 
అలివిమాలిన బెంగ తోటి 
అయినవారి అబ్బరాల హద్దు దాటి 
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి


నా ఆలోచనల్లో నేనుంటూ - ఓ కొసరు పాటేదో పాడుకుంటూ నేనిక్కడ... ఆ కొసరు పాటకి అసలు పాటేదో పట్టుకుంటూ మీరు కూడా ఇక్కడే!

లల్లీ అని పిలిచే - ఆ పిలుపులు జ్ఞాపకమే!
ఓ తల్లీ అని అరిచే - ఆ అరుపులు జ్ఞాపకమే!
అన్ని పిలుపుల్లో - దాగి వున్న ఆ ప్రేమలు జ్ఞాపకమే! 
నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!
నాకే చిక్కినట్టి - పువ్వులన్ని జ్ఞాపకం!




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



15, జూన్ 2020, సోమవారం

గీతం...సంగీతం...సతతహరితం - 4 - కమాల్ కా కమాల్ - సునో తో... దివానా దిల్ కెహ్‌తా హై!

ఒకే తీగ పువ్వులం... 
 నువ్వూ నేనూ కలిసి...  
మాటల మూటలు విప్పుకున్న... ఆ పూట 
నవ్వుల మువ్వలేరుకున్న... ఆ పూట
జంటగా కలిసి విన్నాము... ఆ పాట 

ఆ పూటకి... 
ఈ దాపుల ఆ పాట ఉంది... 

అదే రాగం దవ్వుల!
నిన్నే నేను తలచి... 
మాటల సవ్వడి తరచి తరచి .. ఈ పూట 
నవ్వులు పువ్వులలో వెతికి వెతికి... ఈ పూట 
నేనొంటినై  వింటున్నాను... అదే పాట 

ఈ పూటకి... 
ఆ దవ్వుల నువ్వున్నావన్న మాట ఉంది...

ఆ పూటకీ... ఈ పూటకీ... 
పాట విన్న గురుతుంది 
విన్న పాటలో - నీ గురుతుంది 
సన్న నవ్వులా - నీ గురుతుంది 
తియ్య నొవ్వులా - నీ గురుతుంది

ఆ పూటకి... 
ఈ దాపుల ఆ పాట ఉంది... 
ఈ పూటకి... 
ఆ దవ్వుల నువ్వున్నావన్న మాట ఉంది...

******* ******* *******
******* ******* *******


ఆ నేల నొదిలి మబ్బులతో "నువ్వా-నేనా" అని పందెమేసుకుని ఈవలకి వలసొచ్చేసిన రోజుల ముందు మాటలివి. అప్పుడు విన్న పాటలవి.
నెమరుకి మాత్రమే మిగిలిన మాటలవి.

చిన్నప్పటి కథల పుస్తకాల్లో, ఆ తర్వాత హెడ్డు పైకొచ్చినప్పటి నవలల్లో suspense భరించలేక - అది సుఖాంతమని తెలిసినా సరే! - చదివే ప్రతి పుస్తకాన్నీ - ముందు వెనక పేజీతో మొదలెట్టి, వెనక్కి వెనక్కి - కింద నుంచి పైకి ఓ నాలుగు పేజీలు చదివి - ఆ తర్వాత మాత్రమే మొదటి పేజీకి వచ్చే నేను - ఒక్క పాటల విషయంలో మాత్రం రేడియోని ఇష్టపడతాను.

వింటూ-వింటూ ఉన్న పాట తర్వాత ఏ పాట వస్తుందో తెలియకుండా ఊరిస్తూ వివిధభారతి - జనరంజని వారు పాటలు వేస్తూ ఉంటే,  ముందొచ్చే మ్యూజిక్ బట్టి ఏ పాట వస్తుందో నేనూహిస్తూ మురిసిపోయేదాన్ని.

 ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో మొట్టమొదటగా మా ఇంటికి "ప్లే బటన్ నొక్కా - పాడవే, పాటలభైరవీ!" అనగానే పాడేసే పాటలపెట్టొకటి పట్టుకొచ్చారు నాన్న. దాంతో పాటే ఓ అరడజనుకి ఒకటి ఎక్కువగా కేసెట్లు - లవకుశ పాటలూ, పద్యాలూ - బాలకృష్ణప్రసాద్ పాడిన అన్నమాచార్య కీర్తనల దేశికవితాగానం - అప్పుచేసి పప్పుకూడు సినిమా - తెనాలి రామకృష్ణ సినిమా - నర్తనశాల సినిమా - కిశోర్ కుమార్ హిందీ పాటలు - ఇంగ్లీష్ పాటల Boney-M పాటలు - కూడా తెచ్చారు.

ఇంకేముంది ... కోతికి దొరికిన కొబ్బరికాయే అయింది మా చేతికి చిక్కిన ఆ టూ-ఇన్-వన్.

అది మొదలు... లేరు కుశలవుల సాటి అంటూ మొదలెట్టి, జగడపు చనవుల జాజర అని అన్నమాచార్యని స్మరించి, కాశీకి పోయాను రామాహరీ అంటూ రేలంగితో రాగాలు తీసి, మేక తోకకు మేక...  అని వికటకవితో నవ్వుకుని, ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా ... అని ఠీవిగా పాడే ఎన్టీఆరార్జునుడితో గొంతు కలిపి, క్యా యహీ ప్యార్ హై? అని పాడే నిషా-కళ్ళ సంజయ్ దత్తునూ అదే ప్రశ్న అడిగేసి, La La Rasputin... Lover of the Russsian Queen అని hum చేస్తూ, దాంతో పాటే Brown girl in the ring - Tra la la la la - అని గెంతులేస్తూ - ఏ పాటనీ వదలకుండా అన్నిటినీ పాటుపడి పాడుతూ, పాడుతున్నామని మేమనుకున్నా "ఏంటీ...ఇది నేనేనా" అని మేము పాడుతున్న పాటే  వాపోయేలా పాడుచేస్తూ - దొర్లుతున్న మువ్వల్లా గలగల్లాడుతున్న రోజులవి.

అప్పట్నుంచి ఆ టేప్-రికార్డర్‌లో ఎన్ని పాటలు విన్నామో లెక్కలేదు. అప్పుడే హిందీ-పాప్ పాటల రుచి కూడా తెలిసింది. రూనా లైలా, ఉషా ఉతుప్, నాజియా హసన్ లతో మొదలుపెట్టి హసన్ జహంగీర్ హవా-హవా పాటకు ఊగి , ఆలీషా మడోన్నా పాటల తూగుతూ ఉండగా విద్యార్థి దశ దాటి, అర్థాంగి స్టేటస్ వచ్చింది.

అప్పుడింక ...
టూ-ఇన్-వన్ పోయి, టీవీ వచ్చె ఢాం - ఢాం - ఢాం !
కేసేట్టు పాటలు పోయి, MTV డాన్సులు వచ్చె ఢాం - ఢాం - ఢాం !

అప్పుడు... ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి, చదువు చేతబట్టి కొలువు వెతుక్కుంటూ వలస రావాల్సి వచ్చిన రోజుల్లో... ఇంకొన్ని రోజుల్లోఊరు విడచి, వాడ విడచి దూరదేశమేగబోయే తరుణంలో కొన్నాళ్ళు కాకినాడలో అమ్మా వాళ్ళ దగ్గర ఉన్నాను. అప్పుడు విన్నాను ఈ మాల్ కా గానా... కమాల్ ఖాన్ కా గానా ... కమాల్ ఖాన్ కా కమాల్ కా గానా! 

కాకపోతే - అంతటి కమాల్ కా గానా కూడా కాలప్రవాహంలో జ్ఞాపకాల వెనకాల column లోకి జారిపోయింది. ఎప్పట్నుంచో ఆ గానా ననననానా నానాన నానాన... గానే నాలుక మీద నానుతోంది కానీ అసలు పాట గుర్తు రాదే! కిందటి వారం ఈ పాటని ఎలా అయినా పట్టాల్సిందే అని కూర్చుని 90's Hindi pop songs అని వెతకడం మొదలుపెట్టి యూట్యూబ్లో ఓ ముప్పై వీడియోలు చూశాక దొరికింది పాట. 

అప్పట్లో ఈ పాట వినీ వినగానే నచ్చేసిన పాటల్లో ఒకటి. అలాంటివి చాలానే వున్నాయి. ఇది కూడా ఆ చాలా నచ్చిన పాటల్లో చోటుచ్చుకున్న పాట. పాటంతా మామూలుగానే వినిపిస్తున్నా అక్కడక్కడా అరబిక్ పాటల్లా ఒణుకులూ, వయ్యారాలూ ఉంటాయి.

అందులోనూ మొదటిసారి ఈ పాట టీవీలో చూసినప్పుడు - గోదాట్లో వెళ్ళే గూడుపడవంత పొడుగున్న ఓ నల్ల కార్లోంచి ఎఱ్ఱ గౌను వేసుకుని, ఎఱ్ఱని స్కార్ఫు కట్టుకుని, ఎఱ్ఱెఱ్ఱని గ్లవ్సు తొడుక్కుని ఓ అమ్మాయి దిగి, కమాల్ ఖాన్ ఆడుతూ పాడిన పాట వినేసి, ఓ నవ్వు నవ్వేసి, సీవెండి పెట్టెలు మోస్తున్న కుఱ్ఱాళ్లతో కలిసి హెలికాఫ్టర్ ఎక్కేసి - చెక్కేయడం - తమాషాగా అనిపించింది. అప్పటిదాకా సినిమా కథ మధ్యలో వచ్చే పాటలు తప్ప, ఇలా పాటలోనే ఒక చిన్నపాటి కథ చెప్పే పాటలెప్పుడూ వినలేదు - చూడలేదేమో నేను... ఆ కొత్త concept నచ్చింది.

ఇంకా చెప్పాలంటే సునో తో ... దివానా దిల్ కెహ్‌తా హై అంటూ తెలిసీ-తెలియకుండా ఉండే ఒక చిన్న tremolo తో కమాల్ ఖాన్ పాడిన ఈ పాట వింటుంటే నాకు ఎస్పీబీ పాడిన అల్లిబిల్లి అమ్మాయి - అందచందాలున్నాయి (రాజాధిరాజు సినిమా) పాటలో నాజుకులు దాచేసినా... నే దోచగా రానా?? నా... అన్న లైను గుర్తొస్తుంది ఎప్పుడూ. అందుకే కమాల్ ఖాన్ పాడిన ఈ పాట నాకు అంతగా నచ్చేసింది.

మరి అంతగా నచ్చిన పాటని అలా వదిలేస్తే ఎలా?
అందుకే... పట్టుకొచ్చి నా బ్లాగున అట్టేపెట్టుకుందామనుకున్నా...
అట్టే, అనుకున్నట్టే ఈ పట్టున రాసిపెట్టుకున్నా...
యూట్యూబెక్కిన పాటని - చిక్కించుకుని చూపెట్టుకున్నా...




నననననానా నానా నానానా నానా నానాన

సునో తో ... దివానా దిల్ కెహ్‌తా హై ... హమ్ సే మిల్ జానా... 

సునో తో ... దివానా దిల్ కెహ్‌తా హై ... హమ్ సే మిల్ జానా... 
కభీ-న-కభీ తో ... తూ భీ మిల్‌కే ... హమ్ సే ఖిల్ జానా... 
నాజుక్ యే దిల్ హై మేరా - ఆషిక్ యే దిల్ హై తేరా... 
సునో తో ... దివానా దిల్ కెహ్‌తా హై ... హమ్ సే మిల్ జానా... 
కభీ-న-కభీ తో ... తూ భీ మిల్‌కే ... హమ్ సే ఖిల్ జానా...

బడీ హీ ముష్కిల్ సే మిల్తే హై, యార్! హమ్ జైసే యార్ సున్‌ లే... 
బడీ హీ ముష్కిల్ సే మిల్తే హై, యార్! హమ్ జైసే యార్ సున్‌ లే... 
మేరే దిల్ మే హై ప్యార్ హీ ప్యార్ - ప్యార్ కే ఫూల్, యార్! చున్‌ లే...
బడీ హీ ముష్కిల్ సే మిల్తే హై, యార్! హమ్ జైసే యార్ సున్‌ లే... 
మేరే దిల్ మే హై ప్యార్ హీ ప్యార్ - ప్యార్ కే ఫూల్, యార్! చున్‌ లే...

దిల్ మే జో ఛుపా హై - జుబాన్ పే వో లే ఆనా... 
కభీ-న-కభీ తో ... తూ భీ మిల్‌కే ... హమ్ సే ఖిల్ జానా...

ప్యార్ కీ మంజిల్ మిల్ జాయేగీ, యార్! బాహోం మే ఆ మేరీ... 
ప్యార్ కీ మంజిల్ మిల్ జాయేగీ, యార్! బాహోం మే ఆ మేరీ...
ఖడా హూ కబ్‌సే మై దిల్ లేకే, యార్! రాహోం మే ఆ మేరీ... 
ప్యార్ కీ మంజిల్ మిల్ జాయేగీ, యార్! బాహోం మే ఆ మేరీ...
ఖడా హూ కబ్‌సే మై దిల్ లేకే, యార్! రాహోం మే ఆ మేరీ...

అబ్ తో, మేరీ జాన్! దిల్ మేరా లే-లే నజరానా...
కభీ-న-కభీ తో ... తూ భీ మిల్‌కే ... హమ్ సే ఖిల్ జానా...

నాజుక్ యే దిల్ హై మేరా - ఆషిక్ యే దిల్ హై తేరా...
సునో తో ... దివానా దిల్ కెహ్‌తా హై ... హమ్ సే మిల్ జానా... 
కభీ-న-కభీ తో ... తూ భీ మిల్‌కే ... హమ్ సే ఖిల్ జానా... 
ననన నానానా నాననా నానాన... 
 కభీ-న-కభీ... నాననా నానాన... 
 సునో తో - దివానా... నాననా నానాన... 
 ననన నానానా నాననా నానాన...

******* ******* *******
******* ******* *******

 ఈ పాట విన్న ఆ తొలి రోజులు - మరలి రాని అపురూప క్షణాలు - వాటిని పాటలోనే వెతుక్కుంటూ... 

~ పాటల భైరవి.


7, జూన్ 2020, ఆదివారం

ఓ వాన కురిసిన పొద్దుట...యక్షప్రశ్నలూ, ఐక్యూ measuర్లూ..

శుక్రవారపు పొద్దుట మా ఊళ్ళో వాన కురిసింది... ఒక పావుగంటకెక్కువ, అరగంటకి తక్కువగా కురిసి వెలిసింది.




పొద్దుటా, సాయంత్రం ఒకరినొకరం "పద పద" మని తొందరపెట్టుకుని -
ఒకరికొకరు "సరి సరి" అని చెప్పుకుని  -
గబగబా నడకలలో అడుగులు కలుపుకుని  -
గుసగుసలాడుతూ వీచు గాలికి సాటిగా - మేమూ గలగలలాడుతూ -
వస్తూ పోతూ గుబురుగా పెరిగిన చెట్లని ఏది బావుందో మెచ్చుకుంటూ -
నచ్చిన చెట్లనీ, విచ్చిన పూవులనీ పలకరిస్తూ -
దారిలో కంచెలు దాటి రాలేని ఉక్రోషంతో - కోపంతో కొన్ని, పలకరింపుగా ఇంకొన్ని - మబ్బుల్లా ఉరుముతున్న కుక్కతల్లుల్నీ-పిల్లల్నీచూసి "రాలేవులే...నువ్వు రాలేవులే..." అని నవ్వుతూ కవ్వించుకుంటూ -
అప్పుడే తన పొద్దుటి నడకకి బయల్దేరుతూ - మా కాలి అలికిడి విని తన డిప్పలోకి ముడుచుకుంటున్న బుజ్జి తాబేటి పిల్లని ఆట్టే బెదిరించకుండా రోడ్డుకావలి పక్కకి మళ్ళుతూ -
అందిన పువ్వో, కాయో తినబోతూ మా ఉనికికి బెదిరి చెవులు ముడుచుకుని పరిగెట్టే కుందేళ్ళని, చెలగాటాలాడుతూ చెట్లెక్కి దిగే ఉడతల్నీ చూసుకుంటూ -
చల్లటి వేళ మెల్లగా కబుర్లాడుకుంటూ - ఉసురుసురనే ఎండ వేళ కబుర్లతో విసుర్లాడుకుంటూ -
రెండుపూటలా చెరి రెండు మైళ్ళూ నడుచుకుని రావడం, పోవడం - మాకలవాటు.

ఇంట్లోంచి బయటికొచ్చి నడక మొదలెట్టబోతూ ఓ సారి పైకి చూసి నల్లటి వానమబ్బులు కనిపిస్తే ఓ గొడుగు చేతబట్టుకెళ్ళడం కూడా అలవాటే.

అలా పట్టుకున్న గొడుగుతో పాటు ఓ తాళం, రాయీ కూడా తెచ్చుకోలేదేంటి అని ఒకరినొకరం నవ్వుతాలకి నవ్వులాడుకోవడమూ అలవాటే. (గొడుగూ, తాళం, రాయి కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే "ఓం నువ్వు నాకు నచ్చావ్ నమః" అనేసుకుని ఆ సినిమా చూసెయ్యాల్సిందే!)

ఇన్ని అలవాట్లున్నాయా?
మరి నిన్నటి రోజున ఇంటి బయటికి రాగానే మింటిలో నల్లటి మబ్బు ఏరు ఒకటి కనిపించింది కదా?!
మరి వెంటనే ఇంటిలోకి ఉరికి గొడుగొహటి చేతబట్టి నడక మొదలెట్టాలా?

కురిసేదాకా కురుస్తుందని అనుకోలేదు కాబట్టి - మా వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు శ్రీరామనవమి పందిరిలా కనిపిస్తున్న నల్లమబ్బు నీటిపందిరినీ, దాని నీడలో తమ పచ్చటి రంగుని నలుగుగా పులుముకుని తలంటుకోవడానికి సిద్ధమవుతున్నట్లున్న చెట్టు-ౘానల్నీ చూస్తూ - మైమరచిపోయి, మా గొడుగు మాటే మరిచిపోయి - పొద్దుటి నడకకి బయలుదేరాం.

నడక అంటే కాళ్ళు నడుస్తాయి. కాళ్ళతో పాటు చేతులూ ముందుకూ వెనక్కూ ఊగుతూ వాటి కాలక్షేపమేదో అవి చేస్తాయి. కానీ ఎప్పుడూ ఆడుతూ వుండే నోరు మాత్రం ఊరికే ఉంటుందా? దాని సంబరమేదో అదీ తీర్చుకోవాలిగా!

అప్పుడు మొదలు - మొదలూ-తుదీ లేని మాటా-మంతీ.
అదే ఈనాటి సరదా-సంగతి.

"బావా! ఆ మబ్బు చూడండి! ఎంత బావుందో?వాన కురిసేముందు ఆ నల్లమబ్బు నీడలో చెట్లు చూడడం నాకు భలే ఇష్టం! ఆ ఆకుపచ్చరంగు వాన పడడానికి ముందే కడిగేసుకుని ముస్తాబు అయినట్లుంటాయి చెట్లు."

"అవునవును... అన్నట్టు చూశావా ... ఆ మబ్బు ఎంత పెద్దదో... ఆ చివర్నించి  ఈ చివరిదాకా వుంది."

"ఆ... నిజమే! భలే! ఏదో సముద్రపుటల ఫోటో తీయించుకోవడానికి పోజిస్తూ ఆగిపోయినట్లుంది."

"కదా! వాటిని స్కై రివర్స్ అనో ఏదో అంటారనుకుంటా. అంటే నీళ్ళు ఒక్క చోట మబ్బుల్లో నిండినట్టు అయిపోయి జోరున వాన కురుస్తుంది."

"భలే!" అన్నానే కానీ తను Sky Rivers అని చెప్పిన మాటని నేను "Sky Reverse" అన్నట్టు విని - ఇప్పటికిప్పుడు ఆకాశం reverse అయితే మనం భూమికి పైనుంటామా, తలకిందులుగా వెళ్తామా అని అటు శాస్త్ర్రానికి పొసగని, ఇటు తర్కానికి నిలవని ఆలోచనలు ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టాను.

ఈలోగా తన మాటలు సాగుతూనే వున్నాయి - తనకలవాటైన వివిధ-స్కీంలో - ఒక్కదానికొకటి పొంతన లేని రకరకాల పుంతలు తొక్కుతూ.

"ఇవాళ మా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళేం చెప్పారంటే పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని వాడొకడు కొత్తగా Cloud Architect గా చేరానని కోతలేవో కోశాడట. నేను వెంటనే 'అయితే వాడో మబ్బుగాడన్న మాట!' అనగానే వాళ్ళెంత నవ్వారో తెలుసా?"

అది వినగానే నాకూ నవ్వొచ్చింది.

భుజమ్మీద తట్టి "భలే spontaneity మీలో. నాకు బాగా నచ్చుతుంది" అన్నా.

ఆ మాత్రానికే నవ్వు విరిసి కళ్ళు మెరిశాయి తనకి.

అడుగులు ముందుకు పడుతున్నాయి - కళ్ళు మాత్రం ఆకాశం మీంచి తిరగనంటున్నాయి.

ఆ పొడుగాటి నల్లమబ్బు చిక్కనై ఇంకా ఇంకా కమ్ముకొస్తోంది.

"చూశావా! అంతటి నల్లమబ్బుని చూసి కూడా గొడుగు తెచ్చుకోకుండా వచ్చేశాం. ఇప్పుడు వానొస్తే ఏం చేస్తాం?"

"మబ్బేసినంత మాత్రాన కురిసేస్తుందనేం లేదు."

"అయ్యో...ఇప్పుడు గుర్తొచ్చింది. నేను sun room తలుపులు కూడా వెయ్యలేదు. వాన కురిసి అంతా తడిసిపోతుందేమో?!"

"అబ్బా! ఇప్పుడు మీకున్నవి రెండు ఆప్షన్లు - ఒకటి ఇంటికి వెళ్ళిపోయి sun room తలుపులు వెయ్యడం, రెండు దాని గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నామో, చూస్తున్నామో దాన్ని enjoy చెయ్యడం. ఇల్లు కొన్న పదిహేనేళ్లనుంచి ఎన్నో సార్లు తడిసింది మన sun room. ఇప్పుడూ తడుస్తుంది. ఇక నడవండి బాబూ!"

ఇంటి ప్రసక్తి రాగానే నా మేలి-సగం ఆలోచన ఎటూ తడవబోతున్న సన్ రూమ్ నుంచి ఎప్పటికీ తడారని వంటింటి సింకు దాకా కొనసాగింది.

"అన్నట్టు బుజ్జాయ్! మొన్న మా కొలీగ్ గిరితో మాట్లాడేటప్పుడు తనతో ' ఇల్లంతా నా అధీనంలోకి వచ్చేసింది. మా పిల్లలిద్దరూ కూడా ఏమన్నా ప్లేటో, గ్లాసో కావాలంటే "నాన్నగారూ !" అంటూ నన్నే పిలుస్తున్నారు.'  అని చెప్పగానే తను గట్టిగా నవ్వి 'మీరు భలేవారు సార్!' అన్నాడు తెలుసా? ఏ మాటకామాట చెప్పుకోవాలోయ్ - మన సింకు రోజురోజుకీ అక్షయపాత్రలా తయారవవుతోంది. ఎన్ని కడిగినా ఇంకోటి ఉంటూనే ఉంటుంది."

వస్తున్న నవ్వునాపుకునే ప్రయత్నమేదీ చెయ్యకుండా - పెదవుల చేరిన నవ్వుని ఇంకా చెవులదాకా సాగించుకుంటూ - వింటూ నడుస్తున్నాను.

ఇంతలో తనన్నట్లే వాన మొదలయింది.
నడక నేరుస్తున్న పాపాయి తపతపలాడే అడుగుల్లా అక్కడోటీ, అప్పుడోటీ అన్నట్టుగా చినుకులు.

తల మీద - ఎగురుతున్న జుట్టు మీద
చెవి మీద - చెంప మీద
కనురెప్ప మీద - పెదవొంపు మీద
చేతి మీద - కదులుతున్న కాలు మీద
--నెమ్మది నెమ్మదిగా అక్కడో చినుకు, ఇక్కడో చినుకు అన్నట్టు చిందులాడుతున్నాయి.

ఆకాశంలో ఉరుముల సందడి మొదలయింది.
మా నడకలో వేగం పెరిగింది.

చినుకు జోరు పెరిగింది.

"ఇది ఆగే వర్షం కాదు" పెరుగుతున్న చినుకుల జడిని చూస్తూ తను ప్రకాశంగా.

"ఇది నిలిచే వాన కాదు" వడివడిగా నడుస్తూ నేను సావకాశంగా.

ఈలోగా మాకిద్దరికీ ఇష్టమైన ఓ గుబురు చెట్టుకిందకి వచ్చాము.

ప్రతి చెట్టు కిందకీ వెళ్ళగానే - తలెత్తి మెలికలముగ్గులా కనిపించే ఆ కొమ్మల మధ్యనుంచి వెలిగే ఆకాశం చూస్తూ - మురిసిపోవడం నాకున్న ఇంకో నడక-లవాటు.

ఇప్పుడూ అలాగే "ఎంత బావుంటుంది కదా - కింద నుంచి చెట్టు కొమ్మల మధ్యలోంచి చూస్తుంటే" - అంటున్నానో లేదో, తను వెంటనే అందుకుని కళ్ళు పెద్దవి చేసి మెరుస్తుండగా "అదే...  నేనెప్పుడూ చెప్తూ ఉంటానే - అదేదో  theory చెట్ల design కి సంబంధించి ... నాకు పేరు గుర్తు రావట్లేదు - అదేంటో గుర్తుందా నీకు?" అని మహా ఉత్సాహంగా మొదలుపెట్టారు.

నాకు చూచాయగా అదేదో Fractal Theory అని గుర్తుంది కానీ ఇప్పుడు దాన్ని గుర్తు చేసి - చిందు చినుకు రవళిని వింటూ ప్రశాంతంగా సాగుతున్న నడకని సైన్స్ పాఠాలు చెప్పుకోవాలని, వినాలని నాకే కోశానా ఇష్టం లేదు.

"నాకేం గుర్తు లేదు బాబూ! ఇంకేమన్నా మాట్లాడండి. అదుగో... ఆ ఇంటి దగ్గర బంతిపూలు భలే వున్నాయి కదా! మనింటి ముందు ఎప్పుడు పూస్తాయో ఇల్లాంటివి! ఈసారి మనం జింకల్లేని చోట ఇల్లు కొనుక్కుందాం."

తనో నిముషం మాట్లాడకుండా ఆగి "నీకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం తక్కువ కదా ఎలాగైనా?" అని విచారించారు.

"ఇప్పటికిప్పుడు బావుంది. నాకు ఈ నిముషం తప్ప దీనికి ముందూవెనకా విషయాలూ, విశేషాలూ అక్కర్లేదు. My ignorance is my bliss. నావరకు నాకు నేను చేసే పనికి పనికొచ్చే జ్ఞానం చాలు. అన్నీ తెలిసేసుకొని ఏం చెయ్యాలిప్పుడు? " వింటున్నారో లేదో పట్టించుకోకుండా చుట్టూ కురుస్తున్న చినుకుల్లా నా నోట్లోంచి మాటలు రాలుతూనే వున్నాయి.

ఇంతలో వాన పెద్దదయ్యింది. రోజూ వెళ్ళే దూరానికి ఇంకో పావువంతు మాత్రమే మిగిలింది.

కానీ తను జేబులో ఉన్న ఫోన్ గురించి "అయ్యో! తడిసిపోతుందేమో!" అనుకుంటున్నారు.

ఇంక ముందుకి వెళ్ళాలనిపించలేదు ఇద్దరికీ. ఇద్దరం వెనక్కి తిరిగి గబగబా ఇంటి దారి పట్టాం.

"పోనీ... బుజ్జిగాణ్ణి కార్ తెమ్మందామా? తడవకుండా వెళ్లిపోవచ్చు!" పక్కనుంచి చిన్నగా అడిగారు తను.

"ఒక్కపూటకి వర్షంలో తడిస్తే ఏమైపోతుంది. వాణ్ణి పొద్దున్నే disturb చెయ్యడమెందుకు?" అంటూనే అడుగులు వేస్తున్నాను.

నేనలా అంటుండగానే దూరంగా కనిపిస్తున్న Nature Trail దగ్గర ఎవరో కార్ తీసుకొచ్చి వాళ్ళవాళ్ళని ఎక్కించుకుంటున్నారు.

నీటిదారాలు దారులు కట్టాయి మబ్బు నుంచి నేలకి.

కళ్ళు కనపడనీయకుండా కురుస్తున్న వర్షాన్ని చూస్తే - BH లో చదివే రోజుల్లో - "వానా వానా వందనం..." అంటూ బ్యాండ్‌మేళం వాళ్ళు చిరంజీవి పాటను వాయిస్తుంటే - కళ్ళూ, మొహం కనపడకుండా - మల్లెపూదండలు కట్టుకుని గుఱ్ఱమెక్కిన ఊరేగిన పెళ్ళికొడుకు - మా BH లో అటెండరుగా పనిచేసే - బికారి గుర్తొచ్చాడు.

మరీ జోరుగా కురుస్తోంది కదా అని ఇద్దరం గబగబా నడిచి వెళ్ళి - మళ్ళీ మాకిష్టమైన చెట్టు కిందే  నించున్నాం.

"భలే! చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే... చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరిగెడుతుంటే..." అని పాడుతూ ఉన్నానో లేదో... "ఆ... అది చెప్పలేని హాయే కానీ... ఇలా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్టు కిందకి వెళ్ళాలంటే ఆలోచించాల్సిందే!" అని ఠక్కున తన నించి హెచ్చరిక.

"అవునవును...పిడుగులు పడతాయని కదా!?" అంతకన్నా ఠక్కున ఆగి ఆలోచనయ్యింది నా పాట.

ఆకలేసి ఆగం చేస్తున్న బుజ్జిగాడిలా వర్షం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు.

ఎప్పుడాగుతుందో తెలియని వాన - ఆగేదాకా - ఆక్కడే ఆగడం ఎందుకని ఇద్దరం కలిసి మళ్ళీ బయల్దేరాం.

ఇంతలో అప్పుడే వాకింగ్ మొదలుపెట్టిన ఒకాయన - మాకెదుర్రాగానే "Enjoying the rain?" అని పలకరించి, ఆయన చిలకరించిన చిరునవ్వుల్ని చినుకులతో అందిపుచ్చుకుని ముందుకు సాగాం.

నాలుగడుగులు వేశామో లేదో - ఇంతకు ముందు - Nature Trail దగ్గర చూసిన కారు మా పక్కనే ఆగింది. లోపల్నుంచి ఓ చొక్కా లేని పెద్దాయన మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యనా అని అడిగితే "వద్దూ, We are fine, Thanks" అని చెప్పి మా దారిన మేము వానదారుల నడిచాం.

"అవును బంగారం! నీకు ఈ వానలో డాన్స్ చెయ్యాలనిపించదా?"

"వానలో డాన్సా ... బానే ఉంది... తడవడమే అంతగా ఇష్టం లేదు నాకు. చిన్నప్పుడు ఇంటికెదురుగా వున్న గోదాట్లో స్నానానికే తెల్లవారుఝామున చీకటిలో వెళ్ళి, ఆ చీకట్లోనే ఇంటికి తిరిగి వచ్చేసేవాళ్ళం - వెలుగులో తడిబట్టలతో ఎవరికీ కనబడడం ఇష్టం లేక."

"మరి సినిమాల్లో ఎందుకలా చూపిస్తారో కదా! మన చిన్నప్పట్నుంచీ ఏదో చిన్నపిల్లలు వానొస్తే ఆడుకోవడం చూశాం కానీ రోడ్డు మీద ఏ అమ్మాయీ వర్షంలో చిందులేయ్యడం చూడం. కదా!"

"ఏమో... బాగా కట్టుదిట్టాల్లో పెంచితే ఆ అదుపుకి ధిక్కారంగా అలా తడిసినట్టు సింబాలిక్‌గా చూపిస్తారేమో?

"అవున్లే... అందులో commercial elements కూడా ఉంటాయి. అలాగే దీపావళికి ఓ అమ్మాయికి తెల్ల డ్రెస్సు వేసి పిల్లలతో గెంతుతున్నట్టు ఎందుకు చూపిస్తారో?"

"నాకు తెలీదు బాబూ... ఆ సినిమా తీసిన డైరెక్టర్‌కి ఫోన్ చేసి కనుక్కోండి."


ఇద్దరం బాగా తడిసిపొయ్యాం. వాన కొంచెం తగ్గింది.

కురిసిన వాన రోడ్డుకి ఒక పక్కగా చిన్న ఏరులా పారుతూ అక్కడక్కడా వున్న sewer లలోకి జారుతోంది.

"వాన రోడ్ల మీంచి భలే జారుతోంది కదా!" నేనా నీళ్ళలో నడుస్తూ మురుస్తున్నాను నేను.

"అవును... అదే వాళ్ళ డిజైన్ గొప్పదనం. పైనే ఇలా ఉంటే కింద sewer system కూడా అంతే వాలుగా కట్టే ఉంటారు - ఈ నీళ్ళన్నీ చేరే చోటికి effortless గా చేరేలా. అదెలా డిజైన్ చేసుంటారో ఎప్పుడైనా ఆలోచించావా?" మళ్ళీ ఓ inquistive enquiry.

నేనేం మాట్లాడలేదు.
నేనసలే ఒక్క మాట మీద నిలబడే మనిషిని.
అప్పటికే ఆ ఒక్కమాట నిలకడగా ఎన్నిసార్లు చెప్పున్నానో "తెలీదండి" అని.
మరిప్పుడు మాత్రం మాట మారుస్తానేంటి?
నేను చెప్పాలనుకుని చెప్పినా, చెప్పకూడదనుకుని చెప్పకుండా imply చేసినా అదే మాట. 

నేనేం సమాధానం ఇవ్వకపోవడం చూసి "నువ్వు యక్షుణ్ణి పెళ్ళి చేసుకున్నావ్. ఏం చేస్తాం?!" అని ఓ మాటా, దాంతో పాటు ఓ నవ్వూ నాకేసి విసిరారు తను.

అవి అందుకుని అలాగే ముందుకి సాగా - నీళ్ళని కాళ్ళతో చిందుతూ, చిమ్ముతూ...

ఓ రెండడుగులు వెయ్యగానే "వర్షంలో తడిసి ఒళ్ళు అంతా ఎంత refreshing గా ఉందో కదా?" అని ఇంకో ప్రశ్న కాని ప్రశ్న.

"ఊఁ ..." అని నేనేదో అనబోతుంటే "ఇదేమీ ఇంకో జోక్ కాదు. నిజంగానే అంటున్నా. మబ్బుల్లోంచి సరాసరి మన మీదకి ఇంత స్వచ్ఛమైన నీళ్ళు  - ఇందులో ఎన్ని మినరల్స్ ఉంటాయో! అందులో మనం తడిస్తే ఎంత బావుందో కదా!"

పాపం! నేనే ఊరికే తను మాట్లాడే ప్రతిమాటకీ ఏదో సైన్సూ, సోషలూ ముడిపెడ్తారు అనుకుంటాను కానీ తనకి మాత్రం వానంటే నాకుండేలాంటి ఇష్టం ఉండకూడదా ఏంటి? తను నిజంగానే అంటున్నారు అనుకోబోతూ ఉన్నాను - అంతలోనే పక్కనుంచి "నా IQ బాగా పెరిగుంటుంది ఈ వానకి" అన్నారు తను చటుక్కున.

"అదేంటీ? మీ IQ ఎలా పెరుగుతుంది?" ఒక్క నిముషం రోడ్డు మీదే ఆగి అడిగా.

"అదే మరి .... ఇంత మంచి మినరల్ వాటర్ నా తల మీద మబ్బుల్లోంచి డైరెక్టుగా పడితే నా IQ పెరగదేంటి మరి?!" మళ్ళీ యక్షుడు ఆవహించేశాడు.

"మరే ..." అనేదో అనబోతున్నా.

అంతలోనే "నా పన్నెండేళ్ళ వయసు నుంచి eye-టెస్టులు తప్ప మా అమ్మ నాకెప్పుడూ IQ test చేయించలేదేంటో?" యక్షావతారం కొనసాగింపు.

"అంటే ఉన్నవాటికి టెస్ట్ చేస్తారు కానీ... " నేనింకా పూర్తి చెయ్యనేలేదు.

"అవున్లే... ఉండి పనిచెయ్యని వాటికి టెస్టులు కావాలి కానీ అసలు లేని దానికి టెస్టులెందుకని మా అమ్మ మానేసుంటుంది. ఎలా అయినా మా అమ్మకి అన్నీ బాగా తెలుసు."

"అదే మరి... అత్తయ్యకి IQ ఎక్కువ - అందుకే ."

"బా చెప్పావు." అంటూ కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు సున్నాలా చుట్టి బావుందన్నట్టు చూపించారు.

నేనేదో మురిసేలోగా "ఇలా ఎవరైనా చూపిస్తే బావుందనే కాదు - అది నీ IQ measure కూడా... "

"హహ్హహ్హా... కదా! ఆ చేతిముద్రకి ఈ కొత్త definition బావుంది."

నవ్వులవాన కురిసింది
నవ్వుల జల్లులు తాకి మా నట్టిల్లు మురిసింది
చినుకుల వాన వెలిసింది
చినుకుల వెల్లువ ఆగి మింట వానవిల్లు విరిసింది





4, జూన్ 2020, గురువారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 8 - పాపాయత్తయ్య


సినీకవి కొసరాజుగారు అల్లిన ఒక పాటలో చరణం:

ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా 
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్

అంతరాన ఉన్న అయినవారు ఎంత దూరాన ఉన్నా - ఆ దూరం మనసుకి భారం కాకుండా సాయపడేవి ఫోన్లు.

రోజూ ఇండియాకి - ఇంటికి ఫోన్ చేస్తాను - అటు పుట్టినింటికి, ఇటు మెట్టినింటికి.

అలా రోజువారీ పలకరింపుల ఫోన్ పిలుపులు కాకుండా, కొంచెం తీరిగ్గా  ఓ అరగంట టైం దొరికి -  మా ఇద్దరికీ కుదిరి - నాన్న, నేను మాట్లాడుకున్నప్పుడల్లా - పాపయత్తయ్య ప్రసక్తి వస్తూనే ఉంటుంది.

అలా వచ్చిన ప్రతీసారీ నాన్న "ఎంత జ్ఞాపక శక్తో ఆవిడకి! తొంభై ఏళ్ళ వయసులో కూడా పోతన భాగవతంలో ఘట్టాలన్నీ పద్యాలుగా పాడేస్తూ ఉంటుంది." అని వాళ్ళక్కగార్ని గురించి చాలా ముచ్చటగా తలుచుకుంటూ వుంటారు నాన్న.

పాపాయత్తయ్య మా నాన్నకి పెద్దక్కగారు.

తొంభయ్యవ పడి సమీపిస్తున్నా కూడా ఈ రోజుకీ ఆవిణ్ణి చూడడానికి నేను హైదరాబాదు వెళ్తే - ఆవిడ చేత్తో నాకేదైనా కాఫీయో, పళ్లరసమో కలిపిస్తారు. ఆ తర్వాత - హుషారుగా ఎన్నో పాటలు, పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు పాడి వినిపిస్తారు. పలికే మాటతో పాటు ఒలికే నవ్వు చేర్చి గలగలా మాట్లాడే మా పాపయత్తయ్యతో ఉంటే గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.

నాకెప్పుడూ ఒకటనిపిస్తూ ఉంటుంది. మనకంటూ మనల్ని ఇష్టపడేవారు ఎంత మంది మనతో ఉంటున్నా మనిషిగా ఎవరికి వారు ఒంటరే. ఎవరి సంతోషం వారిదే. ఎవరి బాధ వారిదే. ఎవరి నొప్పి వారిదే. ఎవరి అనుభవం వారిదే. ఎవరి అనుభూతి వారిదే. మహా అయితే మనవాళ్ళు అనుకునేవాళ్ళు మనం నవ్వితే నవ్వుతారు. మనం ఏడిస్తే మనతో పాటు ఆ దుఃఖాన్ని పంచుకోగలుగుతారు. అంత వరకే! కానీ మన నొప్పి - అది శరీరానికైనా, మనసుకైనా - అది ఎవరిది వారికే!

అలాంటప్పుడు ఎవరికైనా అలవాటవాల్సిన దృక్పథం ...

నిన్నటిలో మంచిని తలుచుకుని నవ్వుకోగలగడం -
ఈ రోజుకి హాయిగా ఉన్నామని తృప్తి పడడం -
రేపటికి బావుంటామని ఆశించడం.

ఇవన్నీ నాకు మా పాపాయత్తయ్యతో మాట్లాడినప్పుడల్లా ఆవిడలో కనిపిస్తాయి.

పాపాయత్తయ్యకి చదువు మీద ఉన్న ఇష్టం నాకెంతో అబ్బురంగా అనిపిస్తుంది. ఆ కాలంలో ఐదో తరగతి తర్వాత బడికి వెళ్ళి చదువుకునే వీలు లేకపోయినా ఇంట్లోనే ఉంటూ రామాయణ, భారత, భాగవతాలతో పాటు మా లలితత్తయ్యతో కలిసి హిందీ కూడా నేర్చుకున్నారు. వాళ్లిద్దరూ పెళ్ళిళ్లయ్యి అత్తవారిళ్ళకి వెళ్ళాక హిందీలో ఉత్తరాలు రాసుకునేవారట.

పాపాయత్తయ్య తన ముగ్గురు కొడుకులతో పాటు కూతురైన జయాంటీని కూడా ఆ రోజుల్లోనే బీఈడీ చదివించి టీచరుగా ఉద్యోగం కూడా చేసే అవకాశం కల్పించారు. నాకు తెలిసి నా ముందు తరంలో మా ఇంట్లో మా జయాంటీయే మొట్టమొదటి ఉద్యోగస్థురాలు. నాకది ఎంతో గొప్ప విషయంలా అనిపిస్తుంది. (జయాంటీ వరసకి నాకు వదినైనా చిన్నప్పట్నుంచీ జయాంటీ అని పిలవడమే అలవాటు.)

నాగ్గుర్తుండి ఆవిడకి నచ్చని విషయాల గురించి పాపాయత్తయ్య మాట్లాడిన సందర్భమేదీ లేదు.

ఇప్పటికీ పాపాయత్తయ్య గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని తమాషా విషయాలు తలుచుకుని - ఆవిడకి గుర్తు చేసి మరీ - నవ్వుకుంటాం.

చిన్నప్పుడు ఏ పండక్కో, పెళ్ళికో అనాతవరం వెళ్ళినప్పుడు సాధారణంగా ఏదో ఒక పూట కరెంటు పోయేది. అప్పుడు పిల్లలందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా కబుర్లన్నీ కాసేపటికి తేళ్ళూ, జెర్రులూ, పాముల మీదకి మళ్ళేవి.

వెంటనే ఆ పక్కనే ఉండి మా మాటలు వింటున్న మా పాపాయత్తయ్య "వాటి పేరనకండి ... ఇంట్లోకి వచ్చేస్తాయి" అనేవారు.

ఆవిడ దేని గురించి అంటున్నారో మాకు అర్థమయినా మేము కావాలని "వేటి పేరనద్దత్తయ్యా?" అనడిగేవాళ్ళం.

అప్పటికీ ఆవిడ నోటితో అవేంటో చెప్పకుండా "అదే... ఆ పాకేదాని పేరు అనకండి" అనేసేవారు. మా ఆకతాయి పిల్లమూకతో కలిపి భళ్ళుమని నవ్వేసేవారు.

మా పాపాయత్తయ్యకి చీర నలక్కూడదు. చేతికి పెట్టుకునే వాచీకి గోల్డ్ కలర్ చెయిన్ మాత్రమే ఉండాలి.

కట్టే ప్రతీ చీరా రోలింగ్ చేయించుకుంటారు. నేను ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా "చూశావా లల్లీ! మీ నాన్నేం చేశాడో ? నాకు రోలింగ్ పాపాయి అని పేరు పెట్టాడు" అని గలగలా నవ్వుతారు.

కిందటి వారం ఫోన్ చేసినప్పుడు "రోలింగ్ చీరలు బందయిపోయాయి ఇప్పుడు లాక్-డౌన్ కదా!" అని మళ్ళీ నవ్వారు.

మా పాపాయత్తయ్య ఛలోక్తులకి అసలు తడుముకోరు. మొన్నామధ్య నేను ఆవిడకి ఫోన్ చేసినప్పుడు బదరి తాను కూడా ఒకసారి అత్తయ్యతో మాట్లాడతానన్నారని ఫోన్ బదరికి ఇచ్చాను.

"హలో పాపాయత్తయ్యా! బావున్నారాండీ ?" అంటూ ఇటు నుంచి బదరి పలకరింపు.

మా ఇంట్లో పెద్దవాళ్లందరినీ - ఒక్క మా అమ్మ-నాన్నని తప్పించి - మిగిలిన వాళ్ళందర్నీ నేనెలా పిలుస్తానో బదరి కూడా అలాగే పిలుస్తారు.  అందుకే మా పాపాయత్తయ్యని తను కూడా "పాపాయత్తయ్య!" అనే పిలుస్తారు.

"బ్రహ్మాండంగా ఉన్నాను నాయనా!" అటు నుంచి అత్తయ్య సమాధానం.

"మరి సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్నారా?" ఇండియాలో ఎవ్వరికి ఫోన్ చేసినా ఎండలో నడవమని చెప్పే బదరి వాడుకగా అడిగే కుశలప్రశ్న ఇది.

అది వినగానే అత్తయ్య "నేను గబగబా నడవలేను నాయనా... ఇంట్లోనే అడుగులు వేస్తూ వుంటాను" అని చెప్తున్నారు.

అది వింటూనే "అయ్యో! అలా అయితే ఎలాగండి? ఈసారి మీకో వాకింగ్ స్టిక్ తెస్తాను. కిందటి సారి అంకుల్‌కి కూడా కొనిచ్చాను ఒకటి. చిన్న లాఠీలాగా మడిచేసుకోవచ్చు. చాలా బావుంటుంది" - చేతికఱ్ఱ అమ్మేవాళ్ళు కూడా అంతగా వర్ణించరేమో అన్నంత బాగా సదరు చేతికఱ్ఱ గుణగణాలని చెప్పుకొస్తున్నారు బదరి.

అది వింటూనే "హహ్హహ్హ! మా ఇంటిపేరు కఱ్ఱావారు. నాకు ఇంకో కఱ్ఱ అవసరం లేదు నాయనా" అని గలగలా నవ్వారు మా అత్తయ్య కఱ్ఱా పాపాయిగారు.

ఇప్పటికీ అది తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు నా మేలి-సగం. 

ఇప్పుడంటే కొంచెం ఓపిక తగ్గి రాయడం మానేశారు కానీ - పాపాయత్తయ్య ఒక డైరీ పెట్టుకుని తనకి వచ్చిన ఆలోచనలు, మంచి మంచి నీతివాక్యాలు, సినిమా పేర్లు ఉపయోగించి రామాయణం, సమస్యా పూరణాలు, చిన్నచిన్న కథలు - ఇలా ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవారు. ఆవిడ రాసుకునే డైరీయే కాకుండా అందులో కొన్ని - నేను అడిగానని - నాకు వేరే డైరీలో రాసి ఇచ్చారు కూడా. నేను బ్లాగ్ రాస్తానని తెలిసినప్పుడు "నువ్వూ, నేనూ ఒక్కలాగే" అని మురిసిపోయారు.

ఎత్తులంటే ఇష్టపడని మా పాపాయత్తయ్య బోల్డు అంతస్తులు ఉండే అపార్టుమెంటులంటే అస్సలిష్టపడరు. అందుకే ఆవిడ మనవరాలు, నా చిన్నప్పట్నుంచి నేస్తమైన మధుమతి "అమ్మమ్మకి పంచభూతాలూ కనిపిస్తూ ఉండాలి" అంటూ ఉంటుంది.



ఆవిడకి రాముడు ఆరాధ్య దైవం. సుందరకాండ శ్లోకాలు చదివితే మంచి జరుగుతుందని ఓ ఏడు శ్లోకాలు అచ్చు వేయించి, లామినేట్ చేయించి - చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు వెతుక్కునే యువతీ యువకులు, పిల్లలకి పెళ్ళి చేయాలనుకునే పెద్దలు, ఏదో జరగాలని ఆశించే వారు - ఇలా ఎంత మందికో పంచిపెట్టారు, ఇంకా పంచుతూనే వున్నారు. 






 
మొన్నటికి మొన్న నేను అడిగానని ఆవిడ ఎప్పుడూ పాడుకునే మేలుకొలుపులు పాట పాడి నాకు పంపించారు. అందులో కొంత భాగం మాత్రం ఈ కింద రాసి పెట్టుకున్నాను ప్రస్తుతానికి.

పాట పాడిన పాపాయత్తయ్యకి, రికార్డ్ చేసి పంపించిన బుజ్జికి, దాన్ని యూట్యూబ్లో ఉంచిన బదరికి బోల్డన్ని థాంక్స్!







కేశవా! అని నిన్ను వాసిగా భక్తులు వర్ణింపుచున్నారు...  మేలుకో... 
వాసవ వందిత... వసుదేవ నందన... వైకుంఠపురవాస... మేలుకో...
తెల్లవార వచ్చెను!

మేలుకో శ్రీకంఠ...  మేలుకో శశిధర...  మేలుకో వృషవాహ...  మేలుకో...
మేలుకో జగదాంబ మేలుకో లలితాంబ మేలుకో భ్రమరాంబ మేలుకో...
తెల్లవార వచ్చెను!

నాగేంద్ర హారాయ... నాగలింగవాస...  నగజ ప్రాణేశ్వర... మేలుకో... 
ఆగమసన్నుత... అఖిల లోకాధీశ... భక్తార్తి విఛ్చేదన... మేలుకో... 
తెల్లవార వచ్చెను!

భూజనుల కోర్కెలు - మోజుగా నొసగేటి - రాజరాజేశ్వరి...  మేలుకో
రాజీవముగ - నూరు రాజ సఖులు - నిన్ను పూజింప వచ్చిరి... మేలుకో
తెల్లవార వచ్చెను!

కుదురు పాపశయన... కొక్కొరోయని  కోళ్ళు కుయ్యంగ జొచ్చెను... మేలుకో
మధువైరి మొదలైన - మహనీయ సురులెల్ల - నీ మది గోరి వచ్చిరి...  మేలుకో
తెల్లవార వచ్చెను!

కమలములు వికసించే - కమలాప్తుడుదయించే - హిమగిరి నందన... మేలుకో
కమలా మొదలైన - అమరకాంతలెల్ల - నిను గొల్వ వచ్చిరి ... మేలుకో
తెల్లవార వచ్చెను!

తెల్లవార వచ్చే - తెలుపారే దిశలెల్ల - పల్లజడల స్వామి...  మేలుకో
ముల్లోకములకెల్లా - మూలకారణమైన - మృత్యుంజయ ప్రభూ...  మేలుకో
తెల్లవార వచ్చెను!

కాకాది నీరాజ ఘనరావములు చెలగ - కాళీ పరంజ్యోతి... మేలుకో
ప్రకట నిడమర్తి కామాక్షిని బ్రోచే - లోకసుందరి బాల... మేలుకో
తెల్లవార వచ్చెను!

********


పేర్చుకున్న జ్ఞాపకాలు - పెంచుకున్న ఇష్టాలు - చేసుకున్న ఆలోచనలు - అన్నీ తనకు తగ్గట్టుగా - తనదైన జీవితాన్ని తన పద్ధతిలో, తను అనుకున్న విధంగా జీవించగలగడం మా పాపాయత్తయ్య సాధించిన అపురూప జీవితానుభవం.

ఆవిడ మేనకోడలుగా చిన్నప్పట్నుంచీ ఆవిణ్ణి చూస్తూ అందులోంచి కొంతైనా దక్కించుకోగలగడం నాకు చిక్కిన అదృష్టం.

24, మే 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 20 - తీయతీయని తేనెల మాటలకి... చష్మ్-ఏ-బద్దూర్!



అదె కన్నీరాయె  
నొచ్చిన కంట - పాట అదె...  కన్నీరాయె 

అదె పన్నీరాయె
నవ్విన చోట - పాట అదె ... పన్నీరాయె

పాట అదె కన్నీరాయె  - పాట అదె పన్నీరాయె
***

అదె పల్లవించె 
పలికిన గొంతులో - పాట అదె ...  పల్లవించె  

అదె పలకరించె
పిలిచిన గుండెతో - పాట అదె ... పలకరించె

పాట అదె పల్లవించె - పాట అదె పలకరించె 
***

అదె సోకిపోయె
విన్న చెవుల - పాట అదె ... సోకిపోయె  

అదె  తాకిపోయె
ఉన్నపాటున ఎదను - పాట అదె ... తాకిపోయె 

పాట అదె సోకిపోయె - పాట అదె తాకిపోయె
***

అదె వీడిపోయె 
పెదవి దాటి - పాట అదె ...  వీడిపోయె  

అదె ఉండిపోయె 
ఎదల మాటు - పాట అదె ... ఉండిపోయె 

పాట అదె వీడిపోయె - పాట అదె ఉండిపోయె
***

అదె మేలుకొలిపె 
ఆదమరిచిన పూట - పాట అదె...  మేలుకొలిపె 

అదె జోల పలికె 
అలసి సొలసిన వేళ - పాట అదె...  జోల పలికె

పాట అదె మేలుకొలిపె - పాట అదె జోల పలికె 
***

*********************
*********************


నా కిష్టమైన పాటొకటి .
చిన్నప్పుడు పాపగా - అమ్మ నాకు పాడగా విని నేర్చుకున్నది.
బడిలో చదువునేటప్పుడు  నాకు నేనుగా పాడుకున్నది.

ఆ తర్వాత నేనమ్మనయ్యాక నా పాపడికి జోలగా పాడుకున్నది.

ఈ పాట వినడం, నేర్చుకోవడం, పాడుకోవడం, పాడడం - ఇన్ని కార్యక్రమాలతో చుట్టూ ఉన్న వాళ్ళను నా పాటలతో పాట్లు పెడుతున్న సమయం లోనే నాకంత ఇష్టమైన తీయతీయని తెలుగు పాటకు ఓ హిందీ-కవల వుందని ఎప్పుడో డిగ్రీ చదివే రోజుల్లోనే తెలిసింది. అప్పట్నుంచి ఆ కవల-పాట పని కూడా పట్టేస్తూ ఉండేదాన్ని.

ఇన్ని రోజులకి ఆ రెండిట్నీ నా బ్లాగుకెక్కించే వీలు కుదిరింది.

మొట్టమొదటగా అసలు సిసలైన హిందీ పాట గురించి.
పాటేమో ...తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే... చష్మ్-ఏ-బద్దూర్ ...

సినిమా "ససురాల్". ఇదేమో మన తెలుగు సినిమా "ఇల్లరికం" కి హిందీ కవల.
తెలుగులో ఏఎన్నార్ హీరో.

తిరుగాడుతూ, పాడే హీరో ఎవరంటే ట్రాజెడీకింగ్ అన్న ట్రాకూ, టాకూ వున్న రాజేంద్ర కుమార్. కానీ ఈ పాటలో నవ్వుతూ హుషారుగానే కనిపిస్తాడు.

పాట వింటూ పరుగాడే హీరోయిన్ను ముద్దుముద్దు మాటల బి. సరోజాదేవి. సల్వార్-కమీజ్ మీద నెక్కుకి జాలరు-నెక్లెస్సూ, నడుముకి సన్నటి వడ్డాణం పెట్టుకుని ముద్దుగానే వుంది.

పాట మనోరంజనంగా పాడినవారు రఫీ సాబ్.

పాటను జన-మన-రంజకంగా కట్టినవారు శంకర్-జైకిషన్ జంట.
పాట రాసినవారు - హస్రత్ జైపురి.

సందర్భాన్ని బట్టి చూస్తే ఈ పాట తెలుగు "ఇల్లరికం" లో ఎక్కడి దొంగలు అక్కడనే గప్-చుప్ అనే పాటేమో అనిపించింది నాకు.

ఈ పాటలో నాకు చాలా ఇష్టమైన లైను:
దేఖా న కరో తుమ్ ఆయినా - కహీ ఖుద్ కీ నజర్ న లగే...

ఈ వాక్యం రాస్తున్నంత సేపూ నాకొకటే అనిపించింది - తెలుగులో కూడా అచ్చు పక్కన అచ్చు పెట్టి రాద్దామా అని - ఆఇనా - అని. అది నాకే చదవడానికి బాగా అనిపించక ఆయినా అని రాశాను. 


అలాగే - ఈ వాక్యం వింటున్నంత సేపూ నాకు ఇంకో మంచి తెలుగు పాటలో లైన్లు గుర్తుకొచ్చాయి.

అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయసీ! 
అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి... 

ఆ తెలుగు పాట కూడా ఈ బి. సరోజాదేవి గురించే. అమరశిల్పి జక్కన్న సినిమాలో ఏఎన్నార్ (ఘంటసాల) పాడిన నిలువుమా నిలువుమా నీలవేణీ పాట అది.

హిందీ లోనూ, తెలుగు లోనూ బి. సరోజాదేవిని చూసి హీరోలిద్దరూ ఒకటే మాట - భాషేదయినా... అద్దమయినా, आइना అయినా - అదేదయినా నిన్ను చూసి నువ్వే అసూయ పడకు, దిష్టి పెట్టుకోకు - అంటూ.

భలే కదా!

మరి ఆ హిందీ పాట కంటూ, వింటూ, మీరూ అంటూ ... మురియుడి!





తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే... 
చష్మ్-ఏ-బద్దూర్ ...  
తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ... 
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
 
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...  

యూ న అకేలే ఫిరా కరో - సబ్‌కీ నజర్ సే డరా కరో 
యూ న అకేలే ఫిరా కరో - సబ్‌కీ నజర్ సే డరా కరో  
ఫూల్ సే జ్యాదా నాజుక్ హో తుమ్ - చాల్ సంభల్‌కర్ చలా కరో 
జుల్ఫోం కో గిరా లో గాలోం పర్ - మౌసమ్ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ... 


తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే - 
చష్మ్-ఏ-బద్దూర్ ...

ఏక్ ఝలక్ జో పాతా హై - రాహీ వహీ రుక్ జాతా హై 
ఏక్ ఝలక్ జో పాతా హై - రాహీ వహీ రుక్ జాతా హై 
దేఖ్‌కే తేరా రూప్ సలోనా - చాంద్ భీ సర్ కో ఝుకాతా హై 
దేఖా న కరో తుమ్ ఆయినా - కహీ ఖుద్ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...

తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...

దిల్ మే చుభే వో తీర్ హో తుమ్ -  చాహత్ కీ తక్‌దీర్ హో తుమ్
 దిల్ మే చుభే వో తీర్ హో తుమ్ -  చాహత్ కీ తక్‌దీర్  హో తుమ్ 
 కౌన్ న హోగా తుమ్ సే దీవానా - ప్యార్ భరీ  తస్‌వీర్ హో తుమ్
నిక్‌లా న కరో తుమ్ రాహోం పర్  - ఔరోం కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్...
 


తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో - కిసీ కీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...
ముఖ్‌డే కో ఛుపా లో ఆంచల్ మే - కహీ మేరీ నజర్ న లగే...
చష్మ్-ఏ-బద్దూర్ ...


*********************
 

ఇహ ఇప్పుడు తెలుగు పాట గురించి.

తెలుగు సినిమా పేరు ఖైదీ కన్నయ్య.
పాట రాసిన వారు జి. కృష్ణమూర్తి.
పాటకు తెలుగులో మ్యూజిక్ కొట్టినవారు రాజన్-నాగేంద్ర.
పాటకు తమాషాగా ఆడినవారు రాజసులోచన, ఎవరో ఒక చిన్నబాబు.

బుజ్జిబుజ్జి పాపలకి ఈ పాట పాడుతూ - అర్థం కూడా చెప్తే చాలా బావుంటుంది.

చదువెందుకు చదవాలో...
గొడవెందుకు చేయకూడదో...
బ్రతుకులో ఎలా గెలవాలో - చిన్నచిన్న మాటల్లో ఎంతో గొప్పగా రాసిన పాట  ఇది.

ఇప్పటికీ నాకు నేను చెప్పుకుంటూ పాడుకుంటుంటా.

ఈ పాటను కూడా - కంటూ, వింటూ, మీరూ అంటూ ... మరిమరి మురియుడి!



తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు... 
నమ్మవద్దు... 
తెలియని చీకటి తొలగించి - వెలుగిచ్చేది చదువే సుమా... 
మానవద్దు... 

దొంగల చేతికి దొరకనిది - దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది - దానము చేసిన తరగనిది
పదుగురిలోన పరువును పెంచి  - పేరు తెచ్చే పెన్నిధది

పాఠాలన్నీ చదివేస్తాను - ఫస్టుగ నేను పాసవుతా... 
శభాష్

తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు... 
నమ్మవద్దు...


అల్లరి చేయుట చెల్లనిది - ఎల్లపుడాడుట కూడనిది
అల్లరి చేయుట చెల్లనిది - ఎల్లపుడాడుట కూడనిది
ఏడువరాదు ఏమఱరాదు - ధీరునివలెనే నిలవాలి

బెదరను నేను అదరను నేను - ఏదెదురైనా ఎదిరిస్తా...  
శభాష్!

తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు... 
నమ్మవద్దు...

బ్రతుకను బాటను కడదాకా - నడచియె పోవలె ఒంటరిగా
బ్రతుకను బాటను కడదాకా - నడచియె పోవలె ఒంటరిగా
ఇడుములు రానీ పిడుగులు పడనీ - నీ అడుగులుతడబడునా?!

పిడుగులు పడినా జడవను నేను - వడివడిగా నే అడుగేస్తా...  
శభాష్!


తియతీయని తేనెల మాటలతో- తీస్తారు సుమా గోతులు... 
నమ్మవద్దు...

 *********************

పాడుకున్న పాటలు నెమరేసుకుంటూ ... 

అదె మేలుకొలిపె 
ఆదమరిచిన పూట - పాట అదె...  మేలుకొలిపె 

అదె జోల పలికె 
అలసి సొలసిన వేళ - పాట అదె...  జోల పలికె

పాట అదె మేలుకొలిపె - పాట అదె జోల పలికె 

... అనుకుంటూ... ఇక్కడే ఉంటా... 

~ పాటల భైరవి





19, మే 2020, మంగళవారం

త్వామనురజామి - 47 - హాయి హాయిగా మురిసేనే...


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 46 - ఎంత మంచి మాటదో .. ఎంత తీపి కబురదో..


నేనెప్పట్నుంచో చూద్దామని అనుకుంటున్నట్టుగా, అప్పుడెప్పుడో తిరుపతి రోజుల్లో నేనన్నది గుర్తు పెట్టుకుని - అదిప్పుడు మళ్ళీ వింటున్నట్టుగా గుర్తు చేసుకున్నట్టున్న బదరి నన్ను శనివారం అల్సూర్ తీసుకెళ్ళి, అక్కడో ఐస్క్రీం కొనిపెట్టి, లిడో థియేటర్లో కభీ-కభీ సినిమా చూపెట్టారు.

అంత మూడు గంటల సినిమాలోనూ  - మై పల్ దో పల్ కా షాయర్ హూఁ, కభీ కభీ మేరే దిల్ మే - అన్న రెండు పాటలు తప్ప నాకింకేమీ నచ్చలేదు.

పైగా సినిమాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి - "శశికపూరూ, శశికపూరూ... ఇంచగ్గా నువ్విలా నవ్వుతూనే ఉండాలంటే ఆ రాఖీని అమితాబ్బచ్చన్ దగ్గరికి పంపేయ్, లేపోతే సినిమా రెండో హాఫ్ మొత్తం ఏడుపుతో నింపేస్తుంది" అని చెప్పెయ్యాలనిపించింది. అలా చెయ్య వీలు లేక మూడుగంటల పాటు యశ్ చోప్రాని తిట్టుకుంటూ సినిమా చూసి, మళ్ళీ పొరపాటున కూడా కభీ భీ కభీ-కభీ చూస్తానని అననని అనేసుకున్నా.

ఇక ఆదివారం కబ్బన్ పార్కుకి వెళ్దామనుకున్నాం కదా... so, వెళ్ళాము బదరీ, నేను.

అప్పటికే బదరి ఫ్రెండ్స్ బాలాజీ, సాయి గిరిధర్, ప్రసాద్ రెడ్డి, రవి అక్కడికి వచ్చేసున్నారు.

అందరం కలిసి కబ్బన్ పార్క్ అంతా తిరిగాం. కొత్తిమీర, నిమ్మకాయ రసం రాసి నిప్పుల్లో కాల్చిన మొక్కజొన్నపొత్తులు కొనుక్కుని తిన్నాం.

కబ్బన్ పార్కులో వెదురుపొదలు, వాటి పక్కగా వుండే ఒక చిన్న బ్రిడ్జ్. అక్కడక్కడా వుండే కొండరాళ్ళు నాకు చాలా ఇష్టం. ఆ బ్రిడ్జెక్కి నించుని అందరం ఫోటోలు తీసుకున్నాం.

తెలుపు, నీలం, గులాబీ రంగుల్లో వున్న చీర కట్టుకుని, ఊలుదారంతో జడ చివరిదాకా అల్లుకుని - చుట్టుముడుతున్న చిరుచిరు చలికి బెదరనీకుండా కాపుగా చుట్టూ కాస్తున్న నులివెచ్చని ఎండలో - నాతో పాటే నడుస్తున్న బదరి, బాలాజీ, సాయి, ప్రసాద్, రవి చెప్పుకుంటున్న కబుర్లు వింటూ, కళ్ళు విప్పుకుని కబ్బన్ పార్కు పచ్చదనాన్ని చూస్తున్న నా చూపుల్లో అంబరం అందుకున్న సంబరం.

మరుండదేంటి మరీ?

గత రెండున్నరేళ్లుగా ఉండీ లేనట్టున్న బెంగ ఇప్పడు అసలు లేకుండా పోయింది నాన్న నుంచి వచ్చిన ఫోన్ కాల్ మూలంగా.

నాకైతే... బదరితో నా పెళ్ళి ఎప్పటికీ జరగదేమో అన్న భయం ఎప్పుడూ లేదు; ఎప్పుడు జరుగుతుందా అన్న ఆలోచన అస్సలే లేదు;  ఎప్పుడోకప్పుడు జరుగుతుంది అన్న భరోసా మాత్రం ఉండేది - ఇప్పుడు నాన్న చెప్పిన మాటతో ఆ భరోసా భద్రమయింది.

సరే! అలా మేమందరం కలిసి తిరుగుతూ - వెచవెచ్చటి ఎండలో తెలతెల్లటి విధాన్ సౌధ ముందు, ఎఱ్ఱెఱ్ఱని హైకోర్ట్ బిల్డింగ్ ముందు అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాం.

సాయంత్రం నాలుగింటికల్లా అక్కణ్ణించి ముందు నటికలప్ప సర్కిల్‌లో వున్న బాలాజీ గదికి వెళ్ళాము. అప్పడు బాలాజీ వాళ్ళమ్మగారు, వాళ్ళ తమ్ముడు బాబు వచ్చి వున్నారు. బాలాజీ వాళ్ళమ్మగారిని పలకరించి - అక్కణ్ణుంచి విద్యాపీఠ్ సర్కిల్‌లో సాయి వాళ్ళ రూంకి వెళ్లాం. అక్కడ సాయితో కలిసి బోల్డు ఫోటోలు తీసుకున్నాం. మొత్తానికి ఆ ఒక్క రోజులో బెంగుళూరులో నేను చూడాలనుకున్నవన్నీ చూసేశాను.

ఏడింటికల్లా బదరి నన్ను సాగి వాళ్ళింటి దగ్గర దింపేసి వెళ్తూ, ఆ వారంలో మెజెస్టిక్ బస్టాండుకి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వ్ చేసుకొద్దామని చెప్పారు.

ఈలోగా నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయింది. నా గైడ్ కృష్ణన్ గారు, NAL హెడ్ నరసింహస్వామి గారు నా ప్రాజెక్టుని attest చేస్తూ సంతకాలు చేశారు. ఇక NAL కి వెళ్ళక్కర్లేదు. నాకు ప్రాజెక్టులో హెల్ప్ చేసిన సునీతకి బోల్డన్ని థాంక్స్ చెప్పాను. ఆఖరి సారిగా NAL కాంటీన్లో నాకిష్టమైన దోశ తిని, అందరికీ bye చెప్పేసి వచ్చేశాను.

బదరి, నేను కలిసి బస్టాండుకి వెళ్ళాము. అక్కణ్ణించి MG రోడ్డుకి వెళ్ళి తన MBA ఫ్రెండ్స్ శ్రీనివాస్, సాయి సురేష్, గిరిరాజ్ వాళ్లందరితో కలిసి ఏదో ఒక సినిమా చూద్దామని ఆ రోజుకి ప్లాన్.

బస్టాండులో బదరి నన్ను ఒక బెంచ్ మీద కూర్చోమని చెప్పి తాను వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నించున్నారు. అప్పుడే నాకు మా SPMVV లో OS (Operating Systems) లాంటి సబ్జెక్టుని కూడా ఆడుతూ పాడుతూ టీచ్ చేసిన రాఘవేంద్ర సర్ కనిపించారు. నన్ను చూసి పలకరించారు.

ఆయనలా పలకరించగానే నేను "ఇక్కడ NAL లో ప్రాజెక్టు చేశాను, సర్! ఇంకో రెండు రోజుల్లో viva కోసం తిరుపతి వెళ్తున్నాము నేను, బదరి. అన్నట్టు నా పెళ్ళి కూడా కుదిరింది, సర్! - బదరి తోనే. తనని తిరుపతిలో నాతో పాటు మీరు చూసే వుంటారు.!" అని గబగబా చెప్పగానే భలే మొహమాటంగా నవ్వుతూ "కంగ్రాట్స్ అండీ!" అని చెప్పేసి తన బస్సుకి టైం అవుతోందని బదరి వచ్చేదాకా ఉండకుండానే వెళ్లిపోయారు.

ఈలోగా బదరి టికెట్స్ తీసుకుని వచ్చారు. తనకి మా రాఘవేంద్ర సర్ కనిపించారని చెప్పాను. మేమిద్దరం మా తిరుపతి రోజుల గురించి మాట్లాడుకుంటూ BTS బస్సెక్కి MG రోడ్డుకి వెళ్ళాం. అక్కణ్ణించి నడుచుకుంటూ బ్రిగేడ్ రోడ్డులో వున్న మోటా ఆర్కేడ్ దగ్గరకెళ్తే అక్కడ మా కోసం wait చేస్తూ కనిపించారు శ్రీనివాస్ వాళ్ళు.

మేమెళ్ళేటప్పటికే బాగా ఆలస్యం అయింది అందుకని ఎక్కువ దూరం వెళ్ళకుండా ఆ దగ్గర్లోనే వున్న "దిల్ ఆష్నా హై" చూద్దామనుకున్నాం. తీరా వెళ్ళాక ముగ్గురుతల్లుల flashback history - దివ్యభారతి ఎవరి కూతురో తేలాల్సిన mystery భరించలేక సగంలోనే బయటికి వచ్చేశాం బదరి, నేను.

నేను చూద్దామని వెళ్ళి, చూసి భరించలేక, పూర్తిగా చూడకుండా థియేటర్లోంచి వచ్చేసిన మొట్టమొదటి, చిట్టచివరి సినిమా "దిల్ ఆష్నా హై".

మా తిరుపతి ప్రయాణం ఆ రోజే. నేను సాగి వాళ్ళ ఇంట్లో నాకిచ్చిన గదిలో వున్న నా బట్టలు, పుస్తకాలు అన్నీ సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా వున్నాను. బదరి ఎనిమిదింటికల్లా సాగి వాళ్ళింటికి వచ్చారు. మా బస్సు రాత్రి పదిన్నరకి.

బదరి వచ్చే ముందే సాగి ఇంటికి ఎప్పుడూ వచ్చే తన ఫ్రెండ్స్, BHEL colleegues కామేష్, లక్ష్మీ నారాయణ (నాని) వచ్చి నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళారు.

బదరిని చూడగానే సాగి, ఇందిర నన్నెంత ఇష్టంగా చూస్తారో అంతే ఇష్టంతో బదరిని కూడా own చేసుకుని మాట్లాడారు. బదరి కూడా వాళ్ళిద్దరితో అంతే ఇష్టంగా మాట్లాడారు.

సాగి వాళ్ళింట్లో నాకెంతో ఇష్టమైన నా గదిని, గది కిటికీ బయట విరబూసిన నైట్‌క్వీన్ మొక్కనీ ఒకసారి చూసుకుని, సాగి-ఇందిరలకి bye చెప్పేసి బదరితో బయల్దేరాను తిరుపతి బస్సెక్కడానికి.

మేమెక్కిన బస్ పలమనేరులో ఒక పదిహేను నిముషాలు మాత్రం ఆగింది. మేము పొద్దున్నే తిరుపతి చేరి, హోటల్లో fresh-up అయ్యాక వెంటనే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అదే రోజు సాయంత్రానికి నేనొక్కదాన్ని మాత్రం గుంటూరు వెళ్ళడానికి టికెట్ రిజర్వ్ చేసుకున్నాం. ద్వారక హోటల్లో మధ్యాహ్నం లంచ్ చేయగానే - నన్ను మా యూనివర్సిటీలో దింపేసి బదరి మళ్ళీ వెనక్కి బెంగుళూరు వెళ్ళిపోయారు - తను కూడా ఉద్యోగంలో చేరి పది రోజులు కూడా కాలేదు కదా! పైగా ఉద్యోగంలో చేరీ చేరకుండానే పెళ్ళి కోసమని ఇరవై రోజుల సెలవు కూడా అడిగేశారు కూడా. తనలా అడగ్గానే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ చొక్కలింగం గారు అడిగారట కూడా అన్ని రోజుల సెలవెందుకని.

వెంటనే బదరి "మా ఇంట్లో పెళ్ళయ్యాక పదహార్రోజుల పండగ అని చేస్తారు. అప్పటిదాకా నేనక్కడే ఉండాలి. మీరు సెలవివ్వనంటే చెప్పండి. నాకు కలకత్తాలో వేరే ఉద్యోగం సిద్ధంగా వుంది. అక్కడికెళ్ళి చేరిపోతాను" అనగానే చొక్కలింగం గారు నవ్వుకుని "సరే బాబూ! నీ పెళ్ళీ, పదహార్రోజుల పండగయ్యాకే రా. కానీ దానికి ముందూ, వెనకల్లో ఇప్పుడిప్పుడే ఇంకే సెలవూ నువ్వు నన్నడక్కు, నేన్నీకివ్వను!" అని చెప్పారట.

అదీ - బదరి అంత హడావిడిగా బెంగుళూర్ తిరిగి వెళ్ళడానికి కారణం.

ఆ రోజు నా viva మధ్యాహ్నం ఒంటిగంటకి  మా CC (Computer Centre లో). నర్మద, సాహితీ మేడం, సత్యం సర్, రాజశేఖర్ సర్ నా ప్రాజెక్ట్ presentation విన్నారు. మార్కులేశారు. మధ్యాహ్నం మూడింటికల్లా నేను బయటికి వచ్చేసి మా హాస్టల్ బిల్డింగ్ కల్యాణి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ అప్పటిదాకా మా క్లాస్‌మేటూ, ఇటీవలే కొత్తపెళ్ళికూతురూ అయిన అపర్ణ తన సహచరుడు హరితో కనిపించింది. వాళ్ళిద్దరినీ పలకరించి, అక్కడే కనిపించిన మిగిలిన క్లాస్‌మేట్స్‌ తోనూ ఓ ఐదు నిముషాలు మాట్లాడి అక్కణ్ణించి బయల్దేరి తిరుపతి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాను. అదే మొదటిసారేమో హాస్టల్ నుంచి నేనొక్కదాన్నే రిక్షాలో రైల్వే స్టేషన్‌కి వెళ్ళడం.

నా ట్రెయిన్ సాయంత్రం ఆరున్నరకి. నేను నాలుగున్నరకే వచ్చేశాను మరి. సరే అని వెళ్ళి లేడీస్ వెయిటింగ్ రూంలో కూర్చున్నాను. ఓ పది నిముషాల్లో ఇంకో అమ్మాయి వచ్చింది అక్కడికి. తనెవరంటే BH కాలేజ్‌లో నాతో ఇంటర్ చదివిన భారతి అనే అమ్మాయి. తనతో కొంచెంసేపు మాట్లాడాక ఎప్పుడన్నా ఉత్తరం రాయమని తన అడ్రస్ నా చేతిలో వున్న చిన్న డైరీలో రాసిచ్చింది. వింతేంటంటే నేను తెలుగులో మాట్లాడుతున్నా కూడా తను అడ్రెస్ హిందీలో రాసింది. అదేంటీ అనడిగితే నీకు తెలుగు రాదేమోననుకున్నా అంది. అలా అనేసి తన ట్రెయిన్ వచ్చే టైం అయిందని వెళ్ళిపోయింది. అనుకోకుండా కనిపించిన భారతి గుర్తుగా ఆ అడ్రెస్ దాచుకున్నా. కాకపోతే తనకెప్పుడూ ఉత్తరాలు రాయలేదు - తన పేరు భారతి అని తెలియడం తప్ప BH లో చదివే రోజుల్లో ఒక excursion కి కలిసి వెళ్లడం తప్ప తనతో ఎప్పుడూ మాట్లాడిన గుర్తు కూడా లేదు మరి. తన గురించి ఏమీ తెలియకుండా ఉత్తరం రాయాలంటే మొహమాటం వేసింది.




భారతి అలా వెళ్ళగానే మళ్ళీ నేనొక్కదాన్నే అయ్యాను ఆ వెయిటింగ్ రూంలో.

అప్పుడు ... సరిగ్గా అప్పుడే నాకు కొంచెం టైం దొరికింది - గత వారం రోజులుగా జరుగుతున్నవి తలచుకుని, జరుగుతున్నది కల కాదు నిజమే అని నాకు నేనే చెప్పుకోవడానికి.

ఇంత హఠాత్తుగా నాన్న మా పెళ్ళికి ముహూర్తం పెట్టించారంటే - దాని వెనక అయన తనకి తాను సర్ది చెప్పుకోవడానికి పడ్డ బాధ, ఏం చేస్తే, ఎలా చేస్తే బావుంటుందోనని అమ్మతో కలిసి చేసిన ఆలోచన ఎంత ఉన్నాయో, అంతకు మించి నా ఇష్టాన్ని కాదనలేని ఆపేక్ష కూడా ఉంది.

ప్రసాద్ పెళ్ళికి అనాతవరం వెళ్ళినప్పుడు అప్పతో, పాపయత్తయ్యతో, లలితత్తయ్యతో మాట్లాడి వుంటారు నాన్న.

అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు - నా ముందు పుట్టిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విన్నవాళ్ళే - నేను తప్ప.

నాకోసం మా నాన్న ఆ పెద్దవాళ్ళందరితో మాట్లాడి నాకిష్టమైన బదరితో పెళ్ళి చెయ్యబోతున్నారు.

ఆనాటి నడకలో కలిసిన అడుగులు
చెలిమికి దారి చూపాయి 
రేపటి రోజుకి కలగన్న ఏడడుగులు
బ్రతుకుకి బాట వేస్తాయి

ఇవన్నీ తలుచుకుంటూ అనుకున్నాను - ఇప్పటిదాకా ఇది కావాలీ అని ఎప్పుడూ అడగలేదు. అడగకుండానే అమ్మ, నాన్న అన్నీ ఇచ్చారు. ఇప్పుడు పెళ్ళి విషయంలో కూడా నా ఇష్టాన్నే మన్నిస్తున్నారు. ఇప్పటికీ, ఇంకెప్పటికీ కూడా ఇది నాకు అపురూపమైన బహుమతి - అని.

భలే! అన్నీ నా ఇష్టప్రకారంగా జరుగుతున్నా అలా జరగడాన్ని ఎలా enjoy చెయ్యాలో తోచనంత సంతోషం నాలో...

పాదం నిలవదు 
పదం ఆగదు 
కుదురులేని కాలమాయె 

నవ్వు ఆగదు 
నెమ్ముదుండదు 
నిలవనీని ఆగమాయె 

కల కమ్మె కంటిలోన 
కలవరమె తలపులోన 
కల వరమాయె నిజముగానె 
నా కల ఆ వరుడి పరమాయె - 
నిజముగానె - వరముగానె


నా ఆలోచనల్లో పడి ట్రెయిన్ ఎక్కడం మర్చిపోతే ఎలా! 

ఈ కింది పాట పాడుకుంటూ గుంటూరెళ్ళే రైలుబండెక్కుతూ నేను... 
ఆ పాటేదో పాడుకుంటూ, అసలు పాటని పట్టుకుంటూ ... ఇక్కడుంటూ మీరు...

కన్నుల లోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!

నిన్నటి కన్నా - నేడు హాయిగా...
ఈనాటి కన్నా - రేపు తీయగా...
నా మనసూ.... నా తలపూ ...
హాయి హాయిగా మురిసేనే...

కన్నులలోనే కలలు ఊరెనో...
నవ్వుల లోనే పూలు పూచెనో...
ఈ హాయి ఏమో ...ఓ లల్లీ!
ఈ హాయి ఏమో ... ఓ లల్లీ!




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



11, మే 2020, సోమవారం

బంగారు మనసుల వంగూరి సదస్సు - 2 - బ్లాగెడివి కబుర్లట...

అసలు ముందేమైందో చెప్పాలంటే: బంగారు మనసుల వంగూరి సదస్సు - 1 - ఎలా మొదలైందంటే... 

నవంబర్ 2, 2019 న వంగూరి సాహితీ సదస్సులో పేరెన్నిక గన్న హేమాహేమీల్లాంటి రచయితల ప్రసంగ పరంపరలో నాకూ మాట్లాడడానికి ఒక మంచి అవకాశం దొరికింది అని సంబరపడ్డంత సేపు పట్టలేదు. అంతలోనే అసలేం మాట్లాడాలీ అని ఓ బెంగ.

ఏదో ఒక రచయితనో, రచననో ఎంచుకుని దాని మీద నా అభిప్రాయం చెప్పాలంటే అసలు నేనెవరో తెలియని వారికి నా అభిరుచుల మీద, అభిప్రాయాల మీద ఏం ఆసక్తి ఉంటుంది కదా అనిపించింది. 

అసలు నాకు వంగూరి సాహితీ సదస్సుకి ఆహ్వానం వచ్చిందే నా బ్లాగులో నే రాసిన రాతల వల్ల. అందుకే నా బ్లాగ్ గురించే మాట్లాడదామనుకున్నాను. 
ఎలాగూ బోల్డన్ని కబుర్లు చెప్పడం అలవాటే కాబట్టి అవే కబుర్లు వేదిక మీద కూడా చెప్పా... బ్లాగెడివి కబుర్లట... అంటూ.

ఆ కబుర్లతో పాటే వేదిక మీద నేను మాట్లాడినప్పటి వీడియో కూడా ఉంది ఆ కిందనే.

ఇప్పటికి ఇవే విశేషాలు...

అసలు సదస్సు విశేషాలు ముత్యంగా మూడో పోస్టులో ఇంకోసారి.


బ్లాగెడివి కబుర్లట...

ఈ వంగూరి ఫౌండేషన్ వారి సాహితీ సదస్సు వేదికకి సంబంధించినంత వరకూ నా ఉనికి నా బ్లాగ్.
నన్నిక్కడిదాకా తీసుకొచ్చింది నా బ్లాగ్
నేనిప్పుడు చెప్పబోయేదీ ఆ నా బ్లాగ్ గురించే!
ఒక వేళ నేనింకేదైనా మాట్లాడబోయినా అది "ఆవు మీద వ్యాసం"లా అటు తిరిగి ఇటు తిరిగి నా బ్లాగ్ దగ్గరికే వచ్చి ఆగుతుంది.


నాకు తెలిసినవి రెండే ప్రపంచాలు: ఇంటిది, ఐటీ (IT)ది.
ఈ రెంటి మధ్యా ఇవి కాక ఇంకేదో ఆటవిడుపు కావాలనిపించింది.
అనిపించిందే తడవు బ్లాగ్ మొదలుపెట్టేశా...
అలా  మొదలుపెట్టింది మొదలు రాసింది రాయకుండా రాసేద్దామని అనుకున్నా.

నా బ్లాగోత్సాహం ఒట్టి ఆరంభ శూరత్వం కాకూడదని నా మేలిసగం బదరి నాతో "అనిపించింది అనిపించినట్లు రాసేస్తే ఓ రోజు రాస్తావు, రెండ్రోజులు రాస్తావు - అప్పుడింక రాయడానికేమీ మిగలదు. అలా కాకుండా అప్పటికప్పుడు హడావిడిగా అన్నీ  రాసేయకుండా అట్టేపెట్టుకు ఓ వరసలో వారానికోటి చొప్పున రాస్తే బోల్డన్ని కబుర్లొస్తాయీ... ఒకప్పటి వార్తాపత్రికల్లా రాయడానికి నీకూ, చదవడానికి నీ బ్లాగ్ చదివేవాళ్ళకీ ఓ ఎదురు చూపు ఉంటుంది" అనగానే నాకూ అదేదో బావుంది అనిపించి "వారం వారం రాయువారం" అనేసుకున్నా.

సరే! బ్లాగ్ మొదలుపెట్టేశా. అందులో ఏం రాయాలీ? ఆటవిడుపుగా రాయడం అంటే ఆడుతూపాడుతూ రాయాల్సిందే తప్ప academic గా రాస్తే అందులో సరదా ఉండదు.

 అందులోనూ  నా చుట్టూ వున్న ప్రపంచంలో జరిగే మామూలు సంఘటనలనీ, అప్పుడప్పుడూ జరిగే విశేషాల్నీ ఓ రెండు విభాగాల్లోకి నెట్టేసి వాటి గురించి ఆట్టే ఆలోచించకుండా ఉండడం నాకలవాటు. ఆ రెండు విభాగాలూ ఏంటంటే ఒకటి నా అదుపులో వుండి నేను ప్రయత్నిస్తే మారగలిగేవి. అంటే ఆ పూటకి వంట చేయాలా, వద్దా?, ఏం పాట పాడుకోవాలీ, ఏం సినిమా చూడాలీ - ఇలాంటివన్నమాట. రెండో రకం నా పరిధి దాటిన విషయాలు - అంటే నేనెంత మాట్లాడినా మాటలుగా మిగలడం తప్ప నేనే రకమైన మార్పూ తేలేనివి - ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు, అమెరికాలో తిట్టుకుంటూ మనదేశానికి మోసుకెళ్తున్న మెడికల్ ఇన్సూరెన్స్ పథకాలు, ఇండియాలో ఎక్కువవుతున్నాయని తిట్టుకుంటూ మనతో పాటు అమెరికా మోసుకొస్తున్న చదువుల రాంకుల బరువులు.

ఇలాటివన్నిటి గురించి రాయబోయినా, రాసినా అవేవో పనిగట్టుకు చెప్పే పాఠాల్లా ఉంటాయి కానీ పనిని మర్చిపోయేలా చేసే ఆటవిడుపులా వుండవు. అందుకని ఎప్పుడు బ్లాగ్ రాసినా అప్పటికప్పుడు తట్టిన విషయం గురించి రాయడమే తప్ప ఇది రాయాలీ అన్న పట్టికా, ప్రణాళికా ఏమీ లేవు నాకు. అలాంటప్పుడు రాయడానికి ఏముంటాయి? కబుర్లు తప్ప! అలా పుట్టింది నా "బోల్డన్ని కబుర్లు" బ్లాగ్.

అలా మొదలైన నా బ్లాగులో నేను రాసిన విషయాలు చాలా వున్నాయి. ముందుగా నాకు నచ్చిన చిన్నచిన్న సంఘటనలతో, నా చిన్నప్పటి విశేషాలతో రాయడం మొదలుపెట్టిన నేను ప్రతీవారం అవే రాయాలంటే చదివేవాళ్ళకి ఎలా వున్నా నా వరకు నాకే విసుగ్గా అనిపించి రాత కదిలేది కాదు.

అప్పుడు వారానికో అంశం మీద రాయాలి అనుకుని నాకు నచ్సిన పాటల కబుర్లు, సినిమాల కబుర్లు, బుజ్జిజింకల కబుర్లు అంటూ మా పిల్లల కబుర్లు, బారిష్టరు పార్వతీశం గారి వారసురాలి ననిపించే లాంటి ప్రవాసపు ప్రహసనాలు - ఇలా రకరకాల అంశాల మీద రాయడం మొదలుపెట్టాను. అన్నట్టు నాకు ఇంగ్లీషులో "క్రిప్టోక్విప్" అనే పజిల్ చాలా ఇష్టం. దాని గురించి రాసిన పోస్ట్ ఇంకా ఇష్టం.

ఇవే కాకుండా చిన్నప్పట్నుంచీ నాకు "ఇలా ఉండు" అని చెప్పకుండా వాళ్ళ ప్రవర్తనతో నాకెన్నో పాఠాలు నేర్పిన పెద్దలున్నారు. నోటి వెంట "లేదు" అన్న మాట రాకూడదు అని చెప్పడానికి ఆ "లేదు" అన్న మాటని కూడా ఉచ్చరించకుండా "లాకేత్వం, దాక్కొమ్ము రానీయకూడదు" అని నేర్పిన మా నాన్నమ్మ, నన్నసలు పల్లెత్తు మాట అనకుండా పెంచిన మా అమ్మా, నాన్నలు - వీళ్ళ గురించీ, ఆ గొప్పదనాల గురించి నేను తప్ప ఇంకెవరూ రాయలేరు.  అలాంటి వాళ్ళందరి గురించి "నేర్పించిరి గురువులు" అన్న శీర్షికన కొన్ని పోస్టులు రాశాను. ఇంకా రాస్తాను కూడా. ఎందుకంటే గాంధీలు, నెహ్రూల గురించి ఎవరైనా రాస్తారు. కానీ మా ఇంట్లో వుండే గొప్ప వ్యక్తిత్వాల గురించి నేనే రాసుకోవాలి కాబట్టి.

ఇవన్నీ కాక "త్వామనురజామి" శీర్షికన అప్పుడెప్పుడో మొదలయి ఇప్పటికీ కొనసాగుతున్న నా ప్రేమకథని రాస్తున్నాను. ప్రతినెలా 19 వ తారీఖుకి పోస్ట్ చేసే ఈ సిరీస్ చాలా మంది చదువుతారు.

ఇక్కడో విషయం చెప్పాలి. నేను రాసే ఒక్కో బ్లాగ్ సిరీస్‌కి ఒక్కో కీ-పేరు (కలం పేరులా) వాడుకుంటాను. పాటల గురించి రాసేటప్పుడు "పాటల భైరవి", సినిమాల గురించి రాసేటప్పుడు "సినీ-మా-లక్ష్మి" పేర్లతో రాస్తాను.

నా బ్లాగ్ రాసేటప్పుడు నేను వాడే భాష నేను మాట్లాడే భాష. నాకు మాటలతో ఆట్లాడడం, అప్పుడప్పుడు నా మాటలు నేనే కాయిన్ చేసుకోవడం ఇష్టం. అది చిన్నప్పట్నుంచీ వచ్చిన అలవాటు. ఇటీవల నేను కొత్తగా కాయిన్ చేసుకున్న మాట "బీన్ ఏజ్". బీనేజ్ అంటే ఏది విన్నా, ఏం చూసినా "been there once" అనిపించే ఏజ్. Teenage పిల్లలది, Beenage తల్లిది-తండ్రిది :)

నేనెంతో ఇష్టంగా రాసుకునే బ్లాగ్ నాకు ఎంతో ఇష్టాన్ని కూడా సంపాదించి పెట్టింది.

"భాగవతం" గురించి నేను రాసిన "ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!" అన్న పోస్టు చదివి భాగవతం మీద ఎంతో గొప్ప పుస్తకాలు రాసిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు ఉంచిన వ్యాఖ్య "మధురాతిమధురంగా వ్రాశారు. మనస్సంతా మీ చిత్రపదబంధాలతో, పోతన గారి పద్యోదాహరణలతో నిండిపోయింది.మీకు హృదయపూర్వక ధన్యవాదాలు" నాకెంతో సంతోషాన్నిచ్చిందో చెప్పలేను.

అలాగే నేను "ఈమాట" పత్రిక్కి నాకెంతో ఇష్టమైన పిల్లల పుస్తకాల రచయిత డాక్టర్ స్యూస్‌ని (డాక్టర జాయిస్) అనుకరిస్తూ రాసిన "ఒకటి నుంచి పదిల దాకా" అన్న పద్యాన్ని నా గొంతులోనే రికార్డ్ చేయించి దాన్ని "ఈమాట" లో ప్రచురించారు సంపాదకవర్గంలో ఒకరైన మాధవ్ మాచవరం గారు. ఆ పాటకి "ఈమాట"లో వచ్చిన స్పందన కూడా చాలా ప్రత్యేకమైనది.

 నా బ్లాగ్ వల్ల నాకు జరిగిన మేలు నాకు దొరికిన అపురూపమైన స్నేహం, అభిమానం, ఆత్మీయత. "మాలిక" అనే యాగ్రిగేటర్లో నా బ్లాగ్ చాలా మంది చదువుతారు. వాళ్ళందరూ దేశవిదేశాల్లో వున్న తెలుగువాళ్ళు. వాళ్లెవరో నాకు ముఖాముఖి తెలియదు. కొంతమందివి పేర్లు కూడా తెలీవు. కానీ నా రాతలు చదివి వాళ్ళు వుంచే ఆత్మీయమైన వ్యాఖ్యలు చదివినప్పుడు అంత మంది అభిమానాన్ని సంపాదించి పెట్టిన నా "బోల్డన్ని కబుర్లు" ఎంతో ప్రియంగా అనిపిస్తుంది.

ఇవన్నీ ఒక ఎత్తైతే నా బ్లాగ్  రాయడాన్ని ఒక మంచి వ్యాపకంగా, వ్యాసంగంగా మలుచుకోవడానికి ఎంతో సహకరించిన నా మేలి-సగం బదరి పట్టుబట్టి "బోల్డన్ని కబుర్లు" పుస్తకంగా వేయించారు. దాన్ని ప్రచురించిన వారు వలబోజు జ్యోతిగారు.

నా "బోల్డన్ని కబుర్లు" పుస్తకం బదరి నాకిచ్చిన ఒక మంచి బహుమతి. ఆ పుస్తకమే నన్ను వంగూరి వారికి పరిచయం చేసి వారు నిర్వహించే సాహితీ సదస్సు దాకా తీసుకొచ్చింది.

చివరిగా నా బ్లాగ్ గురించి నే రాసుకున్న ఓ సిన్మతీ గిద్యం...

బ్లాగెడివి కబుర్లట 
బ్లాగ్చదివెడువారు ఇష్టులట  నే 
బ్లాగిన బోల్డన్ని కబుర్లౌనట 
బ్లాగినది బ్లాగక బ్లాగెద నా బ్లాగులొ సిన్మతీ






నా కబుర్ల వీడియోని యూట్యూబ్‌లో ఉంచిన మధు చెరుకూరి గారికి బోల్డన్ని ధన్యవాదాలు!


4, మే 2020, సోమవారం

అదనమన్న లేఖ అందుకున్న వేళ...


సరిగ్గా పదకొండేళ్ళ క్రితం... ఇదే మే నెల్లో...ఓ రోజు

నేనూ, వేనెట్ ధీమాగా, ధిలాసాగా కూర్చున్నాం - కాఫీ షాపులో బార్ స్టూల్స్ మీద కాళ్ళూపుకుంటూ - ఎదురెదురుగా. మా ఇద్దరి మాటల్లో ఏదో తెలియని excitement. ఆ రోజే మొట్టమొదటిసారిగా Surplus letter అన్న మాట విన్నాం.

పొద్దున్న ఆఫీసుకి రావడంతోనే ఓ ఈ-మెయిల్. మూడింటికి ఏదో అత్యవసర, అనివార్యమైన మీటింగులో అందరూ చేరండి అంటూ.

గత వారం రోజులుగా ఏదో హడావిడి నడుస్తోందని తెలుసు. టీముల మధ్య ఏవో మార్పులూ, చేర్పులూ జరుగుతాయని గాలికబుర్లు.

అప్పుడెప్పుడో చదూకునేటప్పటి జ్ఞాపకమైన కూన్ట్జ్ ఓ డొనెల్ నిర్వచించిన ఇన్ఫార్మల్ గ్రేప్‌వైన్ అంటే ఏంటో ఈ రోజుకి అనుభవంలోకి వస్తున్న వైనం.

ఇద్దరం చెరో కాఫీ తెచ్చుకున్నాం - తను ఎప్పట్లాగే Hot Mocha with కోల్డ్ క్రీమీ ఫోమ్. నేను స్ట్రాంగ్ గా వుండే రెడ్-ఐ వెర్షనూ. మేము పనిచేసే టీములో ఎవరికీ కనిపించని అతి క్లిష్టమైన Design Issues ని పరిష్కరిస్తామని మాకో పేరు. అసలు మేము లేని టీముని మేమే ఊహించలేము. అసలు మేం చేసినంత quick analysis ఇంకెవ్వరూ చెయ్యలేరని ఓ చిన్న పిసరు పొగరు కూడా వుంది మా ఇద్దరికీ. ఆ పొగరు తాలూకు పొడిగింపే ఆ ధీమా, ఆ థిలాసా, ఆ కాళ్ళూపుడూ...

అందుకే ఆ ఈ-మెయిల్ చూసినా దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అందులోనూ ఆ మీటింగ్ మూడింటికి. ఆ లోగా కాఫీ తాగొద్దామని కాఫీ షాపుకొచ్చి ఎత్తు-కుర్చీల్లో కాళ్ళూపుకుంటూ కూర్చుని కబుర్లాడుకున్నాం. ఆ కబుర్లలో ముప్పావు వంతు నా కొత్త laptop గురించే.

అన్నట్టు చెప్పనేలేదు కదూ... అంతకు ముందు వారమే పాతిక్కిలోల రాయిలా వుండే నా పాత office laptop ని దాని మూడేళ్ళ lease-roll అయిపోయి వెనక్కి పంపేస్తే, దానికి బదులుగా మా ఆఫీస్ వాళ్ళు పల్చటి పూతరేకు లాంటి కొత్త లాప్టాప్ ఒకటి పంపించారు. అదొచ్చినప్పట్నుంచి వేనెట్‌తో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నా కొత్త లాప్టాపందచందాలు వర్ణించి వర్ణించి చెప్పానో లెక్కే లేదు. ఆ వేళా అవే కబుర్లు.

వేడివేడి కాఫీ-సిప్పులూ, కొన్ని లాప్టాప్-మెప్పులూ, ఇంకొన్ని సరదా-గాసిప్పులూ అయ్యాయి.

ఎప్పట్లాగే నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ ప్రపంచంలో వున్నది మేమే అనుకుంటున్నట్టూ, మా ప్రపంచంలో మేముంటూ,కబుర్లాడుకుంటూ - మేమిద్దరం ఎదురెదురుగా వున్న మా cubicles కి వచ్చేశాం.

Desktop గడియారం మూడో గంట చూపెట్టీ చూపెట్టకుండానే మా floor లో వున్న మా టీం వాళ్ళందరం టిక్కు-టిక్కుమని ఫోను మీటలు నొక్కి మీటింగులో join అయ్యాము.

చేరగానే తెలిసింది అది one-way-muted మీటింగ్ అని. అంటే నేను, వేనెట్, మాలాగే చేరిన మా టీమ్ అందరూ మీటింగులో మాట్లాడుతున్న మా ఏవీపీ (Asst. Vice President) మాటలు వినగలం కానీ మేమేమీ అనలేము, అడగలేము.

ఇంతకీ ఆ ఒక-పక్క-మూగ మీటింగ్ సారాంశం ఏంటీ అంటే "ఓ ఎంతో విలువైన ఉద్యోగుల్లారా! మీ విలువ ఇహ నుంచి అక్కర్లేనిదయింది. అందుకని అదనమైన మీ పదవి ఊడబోతోంది. ఎవరు అందందే ఉందురో, ఎవరెవరు అదనమై పోదురో అందరి ముందూ చెప్పలేం. ఇవాళ సాయంత్రం మీ మీ ఈ-మెయిళ్ళకి పంపించి తెలియజేస్తాం." అని చెప్పి ఓ పదిహేను నిముషాల్లో సమావేశాన్ని చుట్టేశారు.

అంతటి సమాచారం విన్నప్పటికీ అది మాక్కూడా వర్తిస్తుందన్న వర్తమాన-సత్యం అప్పటికీ బోధపడలేదు వేనెట్‌కీ, నాకూ. ఇంకా మా పదవులు పదిలమే అన్న ధీమాతోనే వున్నాము.

సరిగ్గా సాయంత్రం నాలుగయ్యేటప్పటికి "టింగు" మని శబ్దంతో ఓ పది పేజీల డాక్యుమెంటటాచ్మెంటుతో ఈ-మెయిల్ వచ్చింది.

అన్ని పేజీలు చదివినా అర్థమయింది మాత్రం - ఉన్న ఉద్యోగం వుండబోయేది ఇంకో మూణ్ణెల్లు, ఆ లోగా ఇంకో ఉద్యోగం internal గానే వెతుక్కోకలేకపోతే ఇక చెల్లు - అని.

అది చూడగానే కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో అంటూ సముద్రాల వారి పాట hum చేసుకుంటూ, ఒక్క గెంతులో నా cubicle బయటికి వెళ్ళేటప్పటికి, అటు నుంచి వేనెట్ కూడా అదే expression తో నా ఎదురు-cublicle లోంచి గెంతొచ్చి నా ఎదురుగా నించుంది.

"నాకేమో మెయిలొచ్చినది!... నీకూనూ వచ్చినట్లున్నది?!" అని ఒకరినొకరం పరామర్శించుకున్నాం.

మళ్ళీ వెంటనే "ఇంకో మూణ్ణెల్లు సమయముంది కదా... ఇంతోటి ఉద్యోగం ఇంకోటి వెతుక్కోలేకపోము" అని ఒకరికొకరం చెప్పుకున్నాం.

ఆ మరుసటి రోజు ఆఫీసుకి రాగానే వేరే వూళ్ళో వుండే - తానాడుండి, ఆణ్ణుంచి నన్నాడించే మా ఆడ బాస్ - జూలియా నుంచి ఫోను. ఏంటీ అంటే ఇవాళ మధ్యాహ్నం రెండింటికి నీకొచ్చిన ఈమెయిల్ చదివి వినిపిస్తానూ అని.

"అరె! నీకా శ్రమ ఎందుకు జూలియా? నేను చదివేసుకున్నా. అర్థమయిందిలే!" అన్నా.

నే పేజీ పేజీ లెక్క పెట్టి పదిపేజీలూ చదివానని చెప్పినా మా జూలియా వినక "నువ్వు చదువుకున్నది లెక్కలేదు. నేను చదివితే నువ్వు విన్నదే లెక్క - అది నా డ్యూటీ" అంది.

సరే! చేసేదేముంది ఇక! ఆ రోజు మధ్యాహ్నం lunch hour అయిపోగానే జూలియా ఫోన్ చేసి ఆ పదిపేజీల పత్రం చదవడం మొదలు పెట్టింది.

అప్పటికే దాన్ని నేను చదివేసి వున్నాను. పైగా లంచ్ చేసి వున్నాను. హెడ్-ఫోన్స్ లోంచి మంద్రంగా వినిపిస్తున్న జూలియా గొంతు వింటుంటే నిద్రొచ్చేస్తున్నట్టనిపించింది. కానీ మొత్తం విన్నాను.

దాదాపు పది-పదిహేను నిముషాలు అయ్యాక చదవడం ఆపి, జూలియా నన్ను "లలితా! నేను చదివింది విన్నావు కదా! ఏమన్నా అడగాలనుకుంటున్నావా?" అని అడిగింది.

"అంటే ...జూలియా! నువ్వు చెప్పింది అంతా బానే అర్థమయింది..కానీ...ఈ చివరి మూడు నెల్లూ ...  !" తర్వాత నేనబోయేది వింటే అనవసరంగా ఆ విషయం గుర్తు చేసినట్లవుతుంది ఆగాను.

"ఊఁ ... ఈ చివరి మూడు నెల్లూ ... ?!" నేనన్న చివరి మాటలంటూ తర్వాతేంటో చెప్పూ అన్నట్టు ఆగింది జూలియా ఫోను లైనుకి అవతల.

"మ్మ్ ..."

"నాకు తెలుసు లలితా! ఇది ఊహించని వార్తే! కానీ ఈ మూడు నెల్లూ నీకు వచ్చే జీతం, ఇప్పటికే ఇచ్చేసిన బోనస్ అన్నీ వస్తాయి. నేను ఇప్పటికే మిగిలిన టీముల డైరెక్టర్లకి నీ పేరు పంపించాను. తొందర్లోనే నీకింకో టీంలో వచ్చేస్తుంది." నన్ను ఓదారుస్తున్నట్టుగా, ధైర్యం చెప్తున్నట్లుగా హామీలిచ్చేస్తోంది జూలియా.


జూలియా అలా మెత్తగా మాట్లాడుతుంటే ఇంతకు ముందు చెప్పకుండా ఆగిపోయినది ఇప్పుడు చెప్పేయాలనిపించింది.

ఏ మాటకామాట చెప్పుకోవాలి - అంతకు ముందు వేరే టీంలో వున్న నన్ను జూలియా కావాలని పట్టుబట్టి తన టీంలోకి తీసుకుంది.  ప్రతిసారి ఏదైనా పెద్ద డిజైన్ సమస్యని పరిష్కరించినప్పుడు "You never cease to amaze me, Lalitha!" అని తెగ మెచ్చేసుకునేది కూడా!

అందుకే గబగబా "అది కాదు జూలియా... నాకు తెలుసు నేను నీ టీంలో ఉండబోయేది ఇంకో మూణ్ణెల్లే అని. నాకు కిందటి వారమే కొత్త లాప్టాప్ వచ్చింది. చాలా sleek గా వుంది. నాకు బోల్డు నచ్చింది. ఈ మూణ్ణెళ్ళూ అదే వాడుకుంటాను, కాదనకూ, please!" అనేశాను.

నేనలా అనగానే ఫోన్ లైన్ అవతల ఒక నిముషం నిశ్శబ్దం. ఒక నిట్టూర్పు.

నాకేమో అప్పటికీ అనుమానంగానే వుంది - నేనెలాగూ వెళ్ళిపోతాను, ఈ కొంచెం రోజులకి కొత్త లాప్టాప్ ఎందుకూ, టీంలో ఉండబోయే ఇంకెవరికైనా ఇచ్చేయ్ - అంటుందేమో అని. అందుకే అసలు నా కొత్త లాప్టాప్ గురించి మాటే ఎత్తకూడదనుకున్నాను. ఇపుడేమో తొందర పడి అడిగేశాను అని నన్ను నేనే తిట్టేసుకుంటున్నాను.

అప్పుడు నెమ్మదిగా జూలియా కూడబలుక్కుంటున్నట్టుగా అన్న మాటలు ఏంటంటే "ఇంతకీ నీ బాధంతా  నీకు నచ్సిన కొత్త లాప్టాప్ వాడుకోలేకపోతానేమోననా? నా 30 ఏళ్ళ career లో నీలాంటి వాళ్ళను ఎప్పుడూ చూడలేదు. You never cease to amaze me, Lalitha!"

అలా అందే కానీ పాపం ... మా జూలియా నా కొత్త లాప్టాప్ నన్ను వాడుకోనిచ్చింది. అదే లాప్టాప్‌తో నేనింకో కొత్త టీం-ప్రవేశం కూడా చేశాను.

జూలియాతో ఫోన్ కాల్ అయిపోయాక నేను భలే ఆనందంగా వేనెట్ దగ్గరకెళ్ళి జూలియా ఏముందో చెప్తే, తనొక్క నిముషం కూడా ఆలోచించకుండా "That's her polite way of saying 'You're incorrigible, Lalitha!'" అనేసింది.

అన్నట్టు అప్పుడే నేను నా మొట్టమొదటి Terzanelle రాశాను కూడా... Cross-Roads

ఆ మొట్టమొదటి surplus letter తో నే నేర్చుకున్న పాఠమే నా ఈ సిన్మతీ గిద్యం:

కొలువున ఉండిన నీదే లెక్క 
కొలువు ఊడెనా నీవొక అంకె
కొలువున్ననాడు మేనేజరమ్మ 
కొలువు వీడితే కొలుపులో బొమ్మ సిన్మతీ!