12, నవంబర్ 2016, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 3 - నాన్న


సీ|| శ్రీమనోహర! సురార్చిత సింధుగంభీర
భక్తవత్సల కోటిభానుతేజ
కంజనేత్ర  హిరణ్యకశ్యపాంతక శూర
సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ
క్షీరసాగరశాయి కృష్ణవర్ణ
పక్షివాహన నీలభ్రమరకుంతలజాల
పల్లవారుణపాదపద్మయుగళ

తే||  చారుశ్రీచందనాగరుచర్చితాంగ
కుందకుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర 

ఇదే కదా నాన్నా - మీరు నాకు జోలపాటగా పాడింది - మొన్న మొన్నటిదాకా బాలు, సాయిలకి వినిపించింది? 

నా బుజ్జిజింకలకి నిద్ర పుచ్చేవేళ లాలిపాటగా పాడినా, ఇప్పటికీ నాలో నేను పాడుకుంటున్నా,  మృదు మేఘధ్వని లాంటి మీ గొంతులో విన్నఆ నృసింహ శతక పద్యాలు ఎక్కడ విన్నా ఇది మా నాన్న పాట అని మురిసిపోతుంటాను. 

దాదాపు వారానికి నాలుగు రోజులు మీతో మాట్లాడుతూ ఉంటానా - అయినా ఇంకా ఏదో మీతో చెప్పాల్సిన  కబురేదో మిగిలివుందేమో అనిపిస్తూ వుంటుంది. 

ఆగండి - కొంచెం - గుర్తు తెచ్చుకోనీండి నన్ను - మీరూ మీ హడావిడీ! - చెప్పాలనుకుంటున్నదేదో చెప్పేయ్ - ఇంకెందుకాలశ్యం - అంటూ నన్నలా కంగారు పెట్టకండి. 

అమ్మ చెప్తూ ఉంటుంది - మీకసలు గోదావరి దాటి రావడం ఇష్టం ఉండేది కాదట కదా - గోదావరి దాటివెళ్తే గడ్డి తినాలి అనేవారట కదా!  మీ మెడికల్ షాపులో వచ్చినదంతా లాభమే అనుకుని అసలు, లాభం అప్పుడే పుట్టిన నా బేబీ పౌడర్లకి, గౌన్లకి - ఖర్చుపెట్టేస్తే మరి ఎలా? మిమ్మల్ని ఆ గోదావరి దాటించింది - నేనేనేమో అనిపిస్తుందిప్పుడు నాకు!


మీకు గుర్తుందా - మనం గణపవరంలో కరణంగారి మేడ  మీద ఒక్క గదిలో వున్నప్పుడు - తెల్లవారు ఝామునే నాలుగింటికి ఏడుస్తూ లేచేదాన్ని. పాపం - అమ్మ - పుట్టినదాదిగా కొబ్బరి చెట్లు, గోదావరి గట్లు, అన్నావదినల, అక్కాచెల్లెళ్ల మధ్య అబ్బరంగా పెరిగొచ్చింది కదా - ఆ గుంటూరు జిల్లాలో ఆ పల్లెటూళ్లో - ఊరి చివరికి వెళ్లి తెచ్చుకుంటేనే కానీ మంచి నీళ్లు దొరకని చోట - అలవాటులేని  పనితో అవస్థ పడుతోందని - ఆవిడని లేపకుండా మీరు లేచి - ఆ నాలుగింటికి అన్నం కలిపి నాకు తినిపించేవారు. 

మీకు ఖాళీ వున్నప్పుడు, సెలవు రోజుల్లో సరదాగా ఆడించేవారు - నాతో ఆడేవారు. ఒకసారి నా ఐదేళ్ళప్పుడు ఆ ఆట శృతి మించి నేను మీతో ఏదో అరువు-దెబ్బలాడి మీరు తెచ్చిన బిస్కెట్ పేకెట్ విసిరేసి - ఈ గౌను కూడా తీసేస్కో - అని అరుస్తూ వుంటే నా వీపు మీద పడ్డ మీ ఐదు వేళ్ల ఎర్రటి అరచెయ్యి ముద్ర - అది అదే మొదలు, అది అదే ఆఖరు - నాకు గుర్తుండి. ఇంకెప్పుడూ అలా చేయకూడదనుకుని మీకు మీరే ఒట్టు పెట్టుకున్నట్టుగా - నేను మీకెంత కోపం తెప్పించే పనులు చేసినా నన్ను పల్లెత్తు మాట అనలేదు ఈ రోజు దాకా!

అవును నాన్నా! మీకు జ్ఞాపకం ఉందా - ఒకసారి మనింటికి మీ ఆఫీసు వాళ్లు ఎవరో మీకోసం వచ్చారు. మీరారోజు ఇంట్లో లేరు. వాళ్లు - చిన్నపిల్లని కదా - నాతో ఒక రెండు పాటలేవో పాడించుకుని (ఆ పాటలు ఇప్పటికీ గుర్తే నాకు - ఒకటి రంగుల రాట్నంలోని -నడిరేయి ఏ ఝాములో స్వామి నిను చేర దిగివచ్చునో, ఇంకోటి భక్త తుకారాం లో - ఘనాఘన సుందరా), నన్నెందుకడిగారో తెలీదు - మీ నాన్నేం చేస్తాడు కంపెనీ లో - అంటే - నాకు నోటికొచ్చిన ఒకే ఒక మాట - అకౌంటెంట్ - అని చెప్తే - వాళ్ళు గట్టిగా నవ్వి - "అదేం కాదు - గుమస్తా "- అని అనేసి వెళ్లిపోయారు. ఆరోజు సాయంత్రం మీకు ఎప్పటిలాగే మీకు చెప్పే నా ఆరోజు-కబుర్లలో మీకది చెప్తే దానికే మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా నాతో సరదా కబుర్లు చెప్తూ ఆడేసుకున్నారు. 

అలాగే ఇంకోసారి - ఆఫీసులో అందరూ వనభోజనాలు plan చేసుకుని - ఒక పెద్ద van మాట్లాడుకుని - పొద్దున్నే నాలుగింటికి లేచి మనమందరం తయారయ్యాక - వచ్చి - బాబీ! అందరం van లో సరిపోము. మీరు రావొద్దు - అని చెప్తే చిన్నపిల్లలం నేను, కుట్టి యేడ్చినది నాకు గుర్తుంది కానీ మీరెప్పుడూ ఏమీ అనలేదు, ఆ తర్వాతెప్పుడూ అది తలుచుకుని మీరు బాధ పడ్డట్టు నాకు గుర్తు కూడా లేదు. అది మీకున్న వరం - నాన్నా! మీరెప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ల మాటలని గుర్తు పెట్టుకోరు. 

ఆ తర్వాత ఏడాదికి ఆరు నెలలు మిమ్మల్ని చూడడానికే వుండేది కాదు - బొంబాయని,  మైసూరు సీజన్ అని వెళ్లి పోతూ వుండేవారు. ఈలోగా జంగారెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ అన్నారు. పెద్దాడ రామచంద్రరావుగారి ఇంటికి ఎదురుగుండా ఉండే తాతగారి ఇంట్లో అద్దెకుండే వాళ్లం. రామచంద్రరావుగారి భార్య సరోజినీదేవిగారు, వాళ్ల అబ్బాయిలు - నవీన్, సుధీర్ - మనకి బోల్డన్ని సీతాఫలాలు ఇచ్చేవారు - వాళ్ల తోటలోవి.

జంగారెడ్డిగూడెంలో వున్నప్పుడు పొద్దున్న మేము లేవకుండా ఆఫీసుకి వెళ్లే మీరు రాత్రి మేము పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. నెలకొకసారి తప్పకుండా మమ్మల్ని జీప్ లో ద్వారకాతిరుమలలో వేంకటేశ్వరస్వామి గుడికో, జీలకర్రగూడెంలో వున్న శిధిలమైన కోటలో, ఎర్రకాలవ పక్కన మద్ది ఆంజనేయస్వామినో - చూపించడానికి తీసుకెళ్లేవారు. అలా జీప్ డ్రైవ్ చేస్తున్న మిమ్మల్ని చూసి నాన్నమ్మ ఎంత మురిసిపోయేవారో కదా :) ప్రతీ దసరాకి మీ ఆఫీసులో కార్లు, జీపులు, లారీలు - అన్నిటికీ ఆయుధ పూజ చేయించేవారు మీరు. 

అవును కదూ - జంగారెడ్డిగూడెం వచ్చేటప్పటికే మిమ్మల్ని ఇంతకు ముందు తక్కువచేసిన అందర్నీ దాటివచ్చి ఉద్యోగంలో చాలా మెట్లెక్కేసి వున్నారు - కానీ ఎప్పుడూ కూడా మళ్లీ వెనక్కి చూసుకున్నది లేదు. అప్పటిదాకా నడక మాత్రమే తెలిసిన మీరు నడిచింది లేదు.

తర్వాత మీకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. జగన్నాథపురంలో - గరిమెళ్ల సుబ్బారావు గారి ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడే కదా - స్వప్న థియేటర్ లో - ఏమో పిల్లలకి బాగుండదేమో అని - అమ్మ, మీరు మాత్రం వెళ్లి - శంకరాభరణం చూసి వచ్చి- అయ్యో! ఇంత మంచి సినిమా పిల్లలకు చూపించాల్సిందే అని - అదే రోజు సాయంత్రం మమ్మల్ని తీసుకుని వెళ్లి మళ్లీ మాతో చూశారు. అప్పట్నుంచీ ప్రతి కె. విశ్వనాధ్ సినిమా అందరం కలిసి చూడడం మన family tradition లా మారింది. 

కాకినాడ అయితే ఇంటికి దగ్గరగా ఉంటాము - పిల్లలకి చదువులకి బావుంటుంది అని - అమ్మ, మీరు అనుకునేంతలో - మీకు టంగుటూరు ట్రాన్స్ఫర్. 

ఎక్కడి గోదావరి జిల్లా - ఎక్కడ ప్రకాశం జిల్లా! కానీ ఎలాంటి బెంగా లేకుండా - అమ్మ చెప్పినట్టు "జై-పరమేశ్వరా" అనుకున్నట్టు - టంగుటూరు చేరాము - ముందు కొన్ని రోజులు కొండలరావు గారి ఇంట్లో వుండి , తర్వాత స్కూలుకి దగ్గరగా వుండాలని కొణికి వెంకట శేషయ్య గారి ఇంటికి మారాము. 

టంగుటూరులో వున్న నాలుగేళ్లు - ఆ ఊళ్లో తీసుకెళ్లడానికి పార్క్ కానీ , మాకు వేరే వ్యాపకం కానీ లేవని - ప్రతీ వారం మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లేవారు - పరీక్షల రోజుల్లో కూడా మానకుండా. 

 అసలు నేను పరీక్షలకి ఎప్పుడయినా భయపడుతుంటే - "క్లాస్ లో పాఠం విన్నావు కదా - నీకు బాగానే గుర్తుంటుందిలే - పద - అలా సినిమాకి వెళ్లొస్తే మైండ్ ఫ్రెష్ గా అయ్యి పరీక్ష బా రాస్తావు" అని సినిమాకు తీసుకెళ్లేవారు. నా తెలివితేటల మీద నాకన్నా మీకు నమ్మకం ఎక్కువ. 

 టంగుటూరులో వున్న నాలుగేళ్లలో ఒంగోలు, సింగరాయకొండ, పాలేరు దగ్గర వనభోజనాలు - మీతో సరదా ప్రయాణాలు. సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నెలకొక్కసారైనా తీసుకెళ్లేవారు. వెళ్లినప్పుడల్లా హుండీలో డబ్బులు వెయ్యొద్దు - పూజారిగారు తెచ్చే పళ్లెంలో వేయమనేవారు మీరు. అలా ఎందుకు నాన్నా అనడిగితే హుండీలో వేస్తే ధర్మకర్తలకి వెళ్తాయి, పళ్లెంలో వేస్తే ఆ పేద బ్రాహ్మణులకి కొంచెమన్నా సహాయం చేసినట్టవుతుంది చెప్పేవారు. అది నేనిప్పటికీ అనుసరిస్తూనే వున్నాను. 

టంగుటూరు తర్వాత మీ బదిలీ - మన మజిలీ గుంటూరు. మీరు అంతగా ట్రావెల్ చేసేవారు కాదు. ప్రతీ రోజు సాయంత్రం మాతోపాటు కూర్చుని పాలు-చేలు తో మొదలుపెట్టి తొమ్మిదిన్నరకి వచ్చే ఇంగ్లీష్ న్యూస్ దాకా టీవీ చూస్తూ కబుర్లు చెప్తూ ఉండేవారు. మా ముగ్గురిని - అతివాది, మితవాది, తీవ్రవాది - అని మీరే ముద్దుగా వర్గీకరించేసి - సినిమాలు, రాజకీయాలు మాతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. మీకు గుర్తుందో లేదో - ఒకసారి మన ఇంటిపక్క లాయరంకుల్ ఎలా మాట్లాడతారు అని కుట్టి ఇమిటేట్ చేసి చూపిస్తూ ఉంటే - పెద్దవాళ్ల గురించి అలా హేళనగా మాట్లాడకూడదు, పక్కింటి వారి విషయాలు చిన్నపిల్లలు మీరు పట్టించుకోకూడదు - అని కొంచెం గట్టిగానే చెప్పారు. అది నేను మీ దగ్గర నేర్చుకున్న ఇంకో మంచిపాఠం. 

ఏసీ కాలేజ్ లో డిగ్రీ కాగానే తిరుపతి హాస్టల్లో చదువు. ఆ టైం లో నేను తీసుకున్న ప్రతి  నిర్ణయాన్ని - మీరే నా స్నేహితులేమో అన్నట్లు విని - వాటి వల్ల మీరు ఎంత బాధ, టెన్షన్ పడ్డా - అవేమీ నాకు తెలియనీయకుండా -  నన్నూ, నాతో పాటు నామీద నాకు నమ్మకాన్ని పెంచుతూ - నా పిల్లల్ని నేను పెంచితే ఇలాగే పెంచాలి అనిపించేలా - ఎప్పటికప్పుడు నాకు వెన్నుదన్నుగా నిల్చిన మీకు - ఇదిగో ఇప్పటికి ఇలా చెప్పగలుగుతున్నాను. నాకిప్పటికీ గుర్తు - ఆడపిల్లవి నేను చెప్పినట్టు వినాల్సిందే అని అరిస్తే భయపడతాననో - లేకపోతే - నాతో మాట్లాడకుండా మౌనంగా వుండి సాధిస్తే మాట వింటాననో - ఇలా మామూలుగా పెద్దవాళ్లు వాళ్ల పిల్లలు తమ మాట వినేలా చేయాలంటే ఏం చేస్తారో అలాంటివేవీ లేకుండా - మీరు, అమ్మ - నా నిర్ణయాలన్నింటినీ సపోర్ట్ చేశారు కాబట్టే - నేనీరోజు ఇంత కాన్ఫిడెంట్ గా వున్నాను. 

ఇవన్నీ ఒక ఎత్తు - మూడు పదులు నిండకుండానే - అసలే దానికి లెక్కలంటే ఇష్టం లేదు కదా - నూరేళ్లని లెక్క తప్పేసేసుకుని - అదెళ్లిపోతే - దానాయుష్షు కూడా నాకే ఇచ్చి వెళ్లింది - అని దాని పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా వుండాలి - అని - మీ ఆహారపు అలవాట్లు ఎంత మార్చుకున్నారో నాకు తెలుసు. దాదాపు పదహారేళ్లుగా "పొద్దున్న ప్రకృతి - రాత్రి వికృతి" అనుకుంటూ ఆరోగ్యం-నా భోగ్యం అన్నట్లుండడం మీకే చెల్లింది సుమా !

ఒక్క మాట నాన్నా! ఇప్పుడు కాదు కానీ - కొంచెం  చిన్నప్పుడు - మీరు-అమ్మ మీ పిల్లలమయిన మాకోసమైనా కొంచెం స్వార్థంగా వుంటే - బాగుండును అనుకున్న రోజులు వున్నాయి కానీ - అది మీకు నప్పదు అని నాకెప్పుడూ తెలుసు. అందుకే ఎప్పటిలాగే - అందరి గురించి ఆలోచిస్తూ - మీరు మీదైన పద్ధతిలో మీకు నచ్చిన విధంగా తీసుకునే నిర్ణయం ఏదయినా నాకు సమ్మతమే!  

అయిన వారి దగ్గర, కావాలనుకున్నచోట - దూషణ భూషణ అంగీకార తిరస్కారాలని ఒకేలా తీసుకోవడం మిమ్మల్నే చూసి నేర్చుకున్నాను. మనం చేసేది అందరికీ నచ్చాలని లేదు - అందరూ మనకి నచ్చినవే చేయాలనుకోకూడదు - అలాగని ఎవ్వరినీ వదులుకోకూడదు -  ఇదీ నేను మీ దగ్గర నేర్చుకున్న గొప్ప జీవిత పాఠం.

మామూలుగా మన ఇండియాలో -  నాన్నా! - ఎవరినైనా విమర్శించాలంటే పదిమంది మందిలో వున్నా ఆలోచించకుండా మాటనేస్తారు - అదే పదిమందిలో మంచి మాట చెప్పాలంటే మనసొప్పదు - మొహమాటపడతారు. కానీ నేనలా మొహమాటపడి - ఇలా రాయలేకపోతే - మీరు నా చేత దిద్దించిన అక్షరాలకు, నాకు చెప్పించిన చదువుకి సార్ధకత ఉండదేమో అనిపించింది.

ఎన్నో విషయాల్లో నా గురువు మీరు - నేను పడిపోతే మీరొచ్చి లేపకుండా - అలాగే "పడ్డ చోటు నిన్ను పడేసింది - హన్నా - కొట్టేద్దామా" అని ఇంకెవరిమీదో తప్పు నెట్టేయడం నాకు నేర్పకుండా - నా అంతట నేను లేవడం ఎలాగో నేర్పారు. ఇంతకన్నా గొప్ప పాఠం ఎవరు నేర్పుతారు కదా?!

నిన్న పొద్దున్న మీతో నా ఫన్-భాషణ గుర్తు చేస్తే ఇంకొక్కసారి నవ్వుకుంటారని... 

ట్రింగ్ ... ట్రింగ్ ... 
"ఆ... చెప్పు లల్లీ !"

"హలో నాన్నా - బావున్నారా?"

"ఓ  - బ్రహ్మాండం గా వున్నాను. ఆఫీసులొ వున్నానిప్పుడు"

"ఇప్పుడాఫీసేంటి నాన్నా - రాత్రి ఎనిమిదవుతుంటే?"

"ఇంక్రిమెంట్లు ఇచ్చారు - ఏదో చిన్న పార్టీ"

"ఓ - బావుంది బావుంది"

"నీకో విషయం చెప్పాలాగు మరి ! ఇప్పుడు మోడీ-హడావిడి కదా దేశమంతా ?! నాకు ఫోన్లు వస్తున్నాయి - కామేశ్వరరావు గారు - కోట్లు కొన్ని మేనేజ్ చేయాలండీ- 10% ఇస్తాము ఏదయినా మార్గం చూపించండి అని. వాళ్లకి చెప్తున్నాను - 10 కాదు 50 ఇస్తానంటే మీ కోట్లని మేనేజ్ చెయ్యొచ్చు. నేను మనుషులని తెస్తాను, నా రిస్క్ మీద అకౌంట్లు ఓపెన్ చేయిస్తాను - తలకు రెండు లక్షల చొప్పున మీ డబ్బంతా వాళ్ళ పేర్న  బ్యాంకులో వేయిస్తాను- వారం తర్వాత ఒక లక్ష మీకు - ఒక లక్ష వాళ్లకి. మీ పేరు చెప్పుకుని కుటుంబాలు బతుకుతాయి." అని చెప్పాను"

"మీరేంటి - సలహాలరావు మీ కొత్త అవతారమా ? మీకెందుకొచ్చిన గొడవ నాన్నా?"

"బావుంది - ఇప్పుడిస్తే ఆ పేదవాళ్లు - పాపం - నూరేళ్లు జీవించమని దీవిస్తారు - లేకపోతే - ఆ నోట్లన్నీ చలిమంట వేసుకోవాలి అంతే!"

"సరే లెండి! మీరింక తొందరగా ఇంటికి వెళ్లండి - ఎవరైనా వున్నారా - మీరే డ్రైవింగా?"

"నేనే! నాకేం భయం - పోలీసు ఎందుకయినా ఆపినా - నాజేబులో ఐదువందల రూపాయల నోట్లు వున్నాయి - ఇస్తాను  - వద్దు, వందివ్వండి - అంటాడు - లేదంటాను - వదిలేస్తాడు" అంటూ నవ్వు 

"బానే వుంది మీ సరదా - జాగ్రత్త మరి"

"ఇంకోటి విను - జేబులో 70 వేలు వేసుకొచ్చాను - పొద్దుటినించీ బాకీలు తీరుద్దామని. ఎవరికి 500 నోటు ఇచ్చినా - ఇప్పుడొద్దు సార్ - మార్చిలో ఇవ్వండి పర్వాలేదు అని పారిపోతున్నారు. హహహ!"

నవ్వులతో ముగిసిన మన ఫోన్ కాల్ తల్చుకుని ఇప్పటికీ నవ్వుకుంటున్నాను - ఆ నవ్వుతోనే, నవ్వుతూనే - కొన్ని నవ్వులతో నింపి పంపుతున్నాను -  మీ పుట్టినరోజు కానుకగా - ఈ బ్లాగ్ పోస్ట్! చదివేసుకోండి మరి!




9, నవంబర్ 2016, బుధవారం

చిదానందరూపః శివోహం శివోహం (నిర్వాణ షట్కమ్)

నాకు వున్న ఒక ఇష్టమయిన వ్యాపకమో, కాలక్షేపమో -పేరేదైనా కానీ - ఏంటంటే -నాకిప్పటివరకూ నోటికి రాని అష్టకాలూ, స్తోత్రాలూ నేర్చుకోవడం. వాటిని నాకు తెలిసిన కొంచెం సంస్కృత భాషాపరిజ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.

అలా - రెండేళ్ల క్రితం- అనుకోకుండా ఈ శివ నిర్వాణ షట్కమ్ విన్నాను -( యూట్యూబ్ లింక్ ఇక్కడ ). షట్కమ్ అంటే ఆరు చరణాలు వున్న స్తోత్రం. దీనికి ఆత్మషట్కమ్ అనే పేరు కూడా వుంది.

నిర్వాణం అంటే నాకు అర్థమయినది ఏంటంటే "నేను" అనే ఉనికికి అంతిమంగా దొరికే స్వేచ్ఛ. అటు తర్వాత ఆ ఉనికి కోల్పోయాక ఏమీ ఉండని "నేను" ని వర్ణించేదే ఈ నిర్వాణ షట్కమ్.

 ఈ నిర్వాణ షట్కానికి చాలా పాఠాంతరాలు వున్నాయి - నాకు నచ్చినది మాత్రం ఈ క్రిందది. ప్రతీ చరణం కిందా వున్నది - తెలుగులో నాకు తోచిన అర్థం.



                                                                              1
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నేను మనస్సు కాదు - నేను బుద్ధి కాదు - నేను జ్ఞానం కాదు - నేను అహంకారం కాదు
నేను - చెవి, నాలుక, ముక్కు, కన్ను - ఇందులో ఏ ఇంద్రియమూ కాదు
నేను - ఆకాశం, భూమి, అగ్ని, వాయవు - ఏదీ కాదు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                 2
న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుః న వా పంచకోశః
న వాక్పాణిపాదం న చోపస్థపాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
 
 


నేను - ప్రాణానికి ఉనికి కాదు - ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన మొదలైన పంచ వాయువులు కాదు
నేను - రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర - మొదలైన సప్తధాతువులు కాదు; నేను - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశాలు కాదు
నేను - మాట, చేయి, పాదం, విసర్జకావయవాలు - ఏదీ కాదు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                  3
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - ద్వేషం, అనురాగం, లోభం, మోహం - ఏదీ లేదు
నాకు - మదం (గర్వం), అసూయ - లేవు
నాకు - ధర్మార్థ కామ మోక్షాలు - ఏవీ లేవు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                4
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం - ఏవీ లేవు
నాకు - మంత్రం, పుణ్యతీర్థం, వేదం, యజ్ఞం - ఏవీ లేవు - దేనికీ నేను బద్ధుడిని కాదు
నాకు అనుభవం లేదు - నేను అనుభవించబడునది కాదు - నేను అనుభవించువాడను కాదు
నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి


                                                                               5
న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - మరణమంటే భయం లేదు - జాతి భేదం లేదు
నాకు - తండ్రి లేడు - తల్లి లేదు - జన్మ లేదు
నేను - బంధువులు కాను - స్నేహితుడిని కాను - గురువును కాను - శిష్యుడిని కాను
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                               6
అహం నిర్వికల్పో నిరాకార రూపః
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం
సదామే సమత్వం న ముక్తిర్న బంధః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - మార్పు లేదు - ఆకారం లేదు
నేను - అన్ని ప్రదేశాలలో - అన్ని ఇంద్రియాలలో - వ్యాపించి వున్నాను
నాకు - అన్నిటా సమదృష్టి ; నాకు - బంధము లేదు - నాకు విముక్తి లేదు
నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి


5, నవంబర్ 2016, శనివారం

నా సంగీత పరస్థానం - పల్లవి

(ఈ పోస్ట్ శీర్షిక పరస్థానమే
 ప్రస్థానం కాదు ...
 ఇదింకా పల్లవి మాత్రమే
శీర్షిక  వెనక అర్థానర్థాలు, నానార్ధాలు, విపరీతార్థాలు
ఇప్పటికి అనిపించినా - గందరగోళం...
అనుపల్లవి, చరణం తర్వాత
అగును తేటతెల్లం)

నేను పుట్టిన ఏడాదిన్నర - రెండేళ్లకి పాడడం మొదలు పెట్టానని చిన్నప్పట్నుంచీ నన్ను పెంచినవారూ, భరించినవారూ- అందరూ చెప్తూ వుంటారు.

అప్పటెప్పటి నా పాటేదో అంతగా గుర్తు వుంది మా ఇంట్లో అందరికీ అంటే అది ఎంత గాఢమైన-బాధాకర-పాటానుభవమో అనిపిస్తూ ఉంటుంది నాకు :)

"ఎవలి కోసం  - ఎవలికోసం " తో  మొదలుపెట్టి "గాంధి పుట్టిన దేశమా ఇది -నెగ్రు కోరిన సంఘమా" అని "దేవకి  వంట - వసుదేవు వెంట" అంటూ మెలకువగా వున్న ప్రతి నిముషం-గంట పాడుతూనే వుండే "పాడు" దాన్నిట నేను.

అలా పాడుకుంటూ, పాడుకుంటూ - బడికి వెళ్లేంత దాన్ని అయ్యానా  - మా అమ్మా-నాన్న నన్ను గణపవరం తీసుకెళ్లి అక్కడ బడిలో చేర్పించి - నా పాటల పాట్ల నుంచి తాత్కాలిక విముక్తి పొందారు.

ఇంతలో ఒక రోజు తుఫానొచ్చింది. బోల్డంత మబ్బు పట్టి - అంత కన్నా బోల్డంత వాన పడింది.

పొద్దున్నే లేచి నల్లని మబ్బుల ముసురు చూడగానే నెమలికైనా అంత ఆనందంగా అనిపిస్తుందో లేదో తెలీదు కానీ - నాకు మాత్రం బోల్డంత సంతోషం - బడి లోపల వాన కురిసి సెలవు వస్తుందని.

మా బడిలో మాస్టర్లు కురిపించింది సర్వకాల-వాత్సల్యపూరిత విద్యావర్షమైతె - మా బడి తరఫునుంచి దొరికేది వానాకాల -సెలవుల వర్షం.

తానెప్పుడైనా వెళ్లిందో లేదో ఆ నల్లమబ్బు - ఇక్కడ బడి వుంది కదా - చూసొద్దామని వచ్చి - మా బడి జరిగే పెంకుటింటి కప్పుకున్న చిన్న చిన్న చిల్లుల్లోంచి తొంగిచూసి - ఆ సంబరంలో కరిగి కురిసేదేమో - భలే భలే తడిపేసేది. ఇంకంతే మాకో సెలవు వచ్చేసేది.

బడి లేదు - మరి నాకు తోచదు కదా!

గణపవరం కరణం గారు - అనుమంచి లక్ష్మీనారాయణ గారి ఇంట్లో - మేడ పైన అద్దెకి వున్న మా ఏకాంకణ సౌధంలో - మా అమ్మ వెనకాలే  తిరుగుతూ ఆవిణ్ణి ప్రశాంతంగా పనిచేసుకోనీకుండా కబుర్లేవో చెప్తూ, పాటలు పాడుతూనే  వున్నాను.

ఇంతలో బయట పెద్దగా గాలి - ఆకాశం మరీ నల్లగా అయిపోయింది. అప్పటికే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కడుగుదామని అమ్మ బయట తూము దగ్గర పెట్టిన కంచాలు, గిన్నెలు - అదేదో విఠలాచార్య సినిమాలో - నడచి వెళ్లే గిన్నెల్లా - మా మేడ మెట్ల మీంచి దొర్లుకుంటూ కిందకి వెళ్లిపోవడం మొదలు పెట్టాయి.  వాటి వెనకాలే నేనూ, నా వెనకాలే గునగునా నడుచుకుంటూ కుట్టి - మెట్ల మీద నుంచి దిగుతూ వుంటే - అమ్మ కూడా మా వెనకాలే దిగి - అందరం కలిసి - కింద పెద్ద వాటాలో వున్న కరణం గారి ఇంట్లోకి వెళ్లాము.

అప్పటికే చీకటిగా అయిపోయింది - బయట ఎలెక్ట్రిక్ వైర్లు తెగిపోయి కరెంట్ పోయింది. కరణం గారి భార్య - సార్థక నామధేయులు అయిన - అన్నపూర్ణమ్మగారు మా ముగ్గుర్నీ చూడగానే - "రండి పాపగారూ - ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాము - మిమ్మల్ని పిల్లల్ని తీసుకుని కిందకి రమ్మని చెప్పమని మా చంద్రుడిని పంపిద్దామని అనుకుంటున్నాను - మీరే వచ్చి మంచి పని చేశారు. బాబీ గారు ఆఫీసు నుంచి రాగానే పైకి వెళ్లకుండా ఇటే  రమ్మని చెబుదాంలెండి" అంటూ మాక్కూడా సాయంత్ర్రానికి ఆ చీకట్లోనే వంట ఏర్పాట్లు మొదలు పెట్టారు. అమ్మ కూడా ఆవిడకి సాయం చేస్తోంది.

అప్పటికే కరణం గారి పిల్లలు అందరూ హాలులో ఒక పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుని దానిచుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. ఆ రాత్రికి  భోజనాలు చేసి - అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో తెలీలేదు.

పొద్దున్న లేచి చూస్తే ఇంటి ముందు వున్న బాదం చెట్టు కింద బోల్డన్ని బాదం కాయలు - వాటిని చూడగానే - నేనూ, కుట్టి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లాము - ఏరుకుని తెచ్చుకుందామని. అలా ఒకటి రెండు సార్లు వెళ్లామో లేదో మూడోసారి జారి  పడి  బట్టలు తడిపేసుకున్నాము.

మమ్మల్ని ఎలాగైనా కుదురుగా కూర్చోబెట్టాలని అనుకుని - కరణంగారి రెండో అమ్మాయి రాజ్యం - "లల్లీ! నీకు పాటలు ఇష్టం కదా - దా పాటలు పాడుకుందాం" అని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అన్న పాట నేర్పింది. ఇంకంతే - ఆ తర్వాత - తుఫాను వర్షం కారణంగా వాళ్లింట్లోనే మేముండాల్సి వచ్చిన మూడు రోజులూ - పాటల సందడే.

అప్పుడు నేర్చుకున్నదే ఇంకో పాట ఈ దేశం మా దేశం - భారత దేశం మా దేశం - కాకపొతే ఆ పాట ఇప్పుడు గుర్తూ లేదు - మళ్లీ ఎక్కడా దొరకనే లేదు.

సరే - అలా మొదలైన నా పాటల ప్రయాణం - తరవాత  గణపవరం మహిళామండలిలో తులశమ్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒకానొక వార్షికోత్సవంలో నేను అక్కడ వున్న మా అమ్మ, ఇంకా పెద్ద వాళ్ళతో పోటీ పడి - వేయి వేణువులు మ్రోగేవేళ - అంటూ మొదలుపెట్టి పాడిన - నను పాలింపగా నడచీ వచ్చితివా - అన్న పాటకు మొదటి బహుమతి రావడంతో ఒక చిన్న సైజు (literally & figuratively) celebrity నయిపోయాను.

ఇంక -  శ్రావణమాసం పేరంటాలు, సంక్రాంతి భోగి పళ్లు, బొమ్మల కొలువులు -ఒకటేమిటి - ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు , ఎవరు అడిగితే వాళ్లకి - అడగని వాళ్లది "పుణ్యం" అన్నట్లు పాడి పాడి - దినదిన-పాటానర్థం  అవుతున్న నన్ను చూసి - ఈ శిక్ష నుంచి ఎలాగూ విడుదల వుండదు - కనీసం శిక్షణ ఇప్పిస్తే ఏమన్నా నా "పాడు"ట "బాగు" పడుతుందేమో - ఆయనకి కలిగే హృదయావేదన తొలగకపోయినా కొంచెమయినా తగ్గుతుందన్న ఆశతో - సంగీత ప్రియులయిన కరణం గారు - ఒక సంగీతం మాష్టార్ని నాకు, కుట్టికి, సెలవులకి వచ్సిన వాళ్ల మనవరాలు మృణాళినికి - సంగీతం నేర్పించడానికి మాట్లాడారు.

మా అమ్మ మంచి రోజు చూసి - స్వయం పాకం, ఒక పంచెల చాపు, తాంబూలం - సంగీతం మాష్టారికి మా చేత ఇప్పించి - సంగీతం పాఠాలు మొదలు పెట్టించింది. సంగీతం మాష్టారు - ఆయన హార్మణీ పెట్టె పట్టుకుని మహా ఉత్సాహంగా వచ్చారు.

మొదటి రోజు సా-పా-సా పాడించి మొదటి సరళీస్వరం నేర్పేదాకా మా పక్కనే మురిపెంగా చూస్తూ కూర్చున్న ఆవిడ - రెండో రోజు నుంచీ ముందు కటకటాల్లో చాప వేసి - మమ్మల్నిద్దరినీ మాష్టారి ముందు కూర్చోపెట్టి - లోపలి వెళ్లి పోయి తలుపు వేసేసుకునేది - ఎంతయినా నాకు అమ్మ కదా - నా తెలివితేటలే వచ్చాయి ఆవిడకి :)) మా పాఠం అయ్యేవరకూ తలుపు తీసేది కాదు.

అలా ఒక పదిహేను రోజులు జరిగాయి.

 స్వర స్థానాలు కాదు కదా - మా స్థానాల గురించి కూడా పట్టించుకోకుండా - కుదురు లేకుండా - మాకెదురు లేదన్నట్టు ఆడుతూ పాడుతున్న - మా సోదరీ ద్వయాన్ని చూసి మా మాష్టారికి సహనం కొండెక్కింది.

అమ్మని ఒక రోజు పిలిచి - "అమ్మా! మీ పిల్లలు లక్షణంగా పాడుతున్నారు - ఇంక శృతిబాక్సు కొనాల్సిందే" అన్నారు.

 (ఏంటీ! ఇంతోటి - ఐదో సరళీ స్వరానికే - అని పైకి అనకపోయినా - మా అమ్మ ఆశ్చర్యం)

మా అమ్మ కేసి చూడకుండా ఎటో చూస్తూ - "మీరు శృతిబాక్సు కొన్నాక కబురు పెట్టండి - అప్పుడొచ్చి కొత్త పాఠం చెప్తాను" అనేసి మా సంగీతం మాష్టారు వెళ్లడం వెళ్లడం - ఇంకా మళ్లీ మా ఇంటి వైపు రాలేదు.

మా అమ్మ కరణం గారి చేత చెప్పించినా కూడా  రాలేదాయన.

సర్లే - ఆయన కొనమన్న శృతితిబాక్సు కొందామని వాకబు చేస్తే అది ఆ రోజుల్లో మద్రాసులోనే దొరుకుతుందని తెలిసింది.

అప్పటికి అర్థమయింది మా అమ్మకి - అది మా సంగీతం మాష్టారు - ఆయన హార్మణీ పెట్టె విరక్కుండా - మా పాట సాగకుండా - ఉండడానికి వేసిన "దాటు" స్వరం అది అని.

అలా మా సంగీత పాఠాలకి ఆదిలోనే హంసపాదు - ఎక్కడ హంసధ్వని హింసధ్వని అవుతుందో అని ఆ వాతాపి గణపతే అనుకుని ఆపినట్టు.

<ఇక్కడితో లలిత-సంగీతం అయిపోలేదు -  అనుపల్లవి, చరణం  - త్వరలోనే వినిపి(చదివి)స్తాను>


28, అక్టోబర్ 2016, శుక్రవారం

మలిగి వెలిగిన దీపం

"వడ్లమాని సోమేశ్వర రావూ, ఆగవయ్యా! అడుగులో అడుగు వేసుకుంటూ ఎందాకా ఆ నడకా?!"

"ఎవరదీ?! నన్నెరిగిన వాడవా, ఎరగని వాడవా?"

"ఆది నుంచి వున్నవాడినీ, అనాది అయిన వాడినీ - నిన్నెరిగిన వాడనే!"

"నన్నెరిగిన వాడవా? అయితే అదేం పిలుపు - నన్ను నాని అంటారని తెలీదా?"

"తెలుసనుకో!  ఏదో తమ్ముడికి తండ్రి తర్వాత తండ్రిలా నిలిచినవాడివి, కొడుకులకి తండ్రివి , మనవల తాతవీ - అని అలా పిలిచాననుకో."

"నా గురించిఅన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావే - ఇంతకీ ఎవరు  నువ్వు - చూపసలే ఎందుకో ఇవాళ సరిగా ఆనట్లేదు"

"నీ గురించి నాకు తెలియకపోవడమేం ? నీ తమ్ముడి కూతురుందే  - అదే సొట్ట పూసలా బోల్డన్ని కబుర్లు చెప్తుందీ- లల్లీ - ఆ పిల్లే ... అయినా నాకు తెలీకడుగుతాను -  పై మెట్టు ఎక్కి గడపలోకి వచ్చే వేళ "అప్పా! బావున్నారా" అని పలకరించి - పసుపూ- కుంకుమ ఒడి నింపుకెడుతూ కాళ్లకి దండం పెట్టి వీడి వెళ్లే వేళ "వెళ్లొస్తానప్పా" అని చెప్పి-  "మళ్లీ చూడడమెప్పుడూ" అని నువ్వడిగితే - "ఎప్పుడో ఇలాగే, అప్పా!" అని కళ్ళు తుడుచుకుంటూ గడప దాటేదే - ఆ పిల్ల - నీతో ఆ మూడు ముక్కలు తప్ప ఇంకో మాట మాటాడిందీ? ఇప్పుడు చూస్తే ఊరూ-వాడా ఏకం చేసేలాంటి కబుర్లు చెప్తూవుంటుంది"

"మరీ బాగుంది - అది మా ఇంటి ఆడపిల్ల - మాటాడని మల్లెమొగ్గ"

"మరిప్పుడా కబుర్లేంటంటావ్ ?"

"ఆడపిల్లకి తండ్రి పోలిక వస్తే అదృష్టం - మా బాబీ చెప్పడూ - అదీ చెప్తుంది మరి - నా దగ్గరంటావా - దానికి  మాటలవసరం లేదు - మనసుతో చెప్పేది - వాళ్ల నాన్నా అంతే "

"బానే వుంది నీ సమర్ధింపు - అయినా ఏ మాటకామాట చెప్పుకోవాలిలే - నీ గురించి బానే చెప్పింది కబుర్లు - ఇటీవల నీకు నలతగా ఉందని తెలిశాక "అయ్యో  - చిన్నప్పట్నుంచీ అప్ప గురించి మనసులో అనుకోవడమే కానీ ఎప్పుడూ ఎదుటపడి -   చెప్పలేకపోయాను" అని బెంగ పడి నీకోసమే మొదలెట్టిందట నేర్పించిరి (చదివించని) గురువులు అంటూ కబుర్ల వరస. అది అలాగే కొనసాగిస్తుందట. పైగా - గాంధీ-నెహ్రూల గురించి ఎవరైనా రాస్తారు - మన ఇళ్లల్లో వుండే ఎవరూ ఎరగని మన మనుష్యుల మంచితనం గురించి మనమే కదా రాసుకోవాలి అని - అంటుంది కూడా "

"అవునవును - నేనూ చదివాను - మనవరాలు లలిత ప్రింటౌట్ తెస్తే - బారాసింది - నా గురించి నాకే చెప్పింది. అవునూ మా ఇంటి పిల్ల గురించి ఇన్నిమాట్లాడుతున్నావు - ఎవరసలు నువ్వు? "

"అది చెప్తా కానీ - మళ్లీ మరుస్తానేమో ఈ మాట నీ చెవిన వెయ్యనీ - తనది పెద్దలిచ్చగించని పెళ్లి అయినా వాళ్ల నాన్నకి అండగా -నీ చేత్తో మంగళసూత్రం, వెండి చుట్లు, మధుపర్కాలు కొని - పెళ్లిపందిరికి నువ్వూ-నీకొడుకులూ నాలుగు స్తంభాల్లా నించుని  తన పెళ్లి జరిపించారని ఇప్పటికీ తలచి-తలచి మురుస్తూ ఉంటుంది - ఈ ఒక్క మాట నీకెప్పుడూ చెప్పలేదని ఇప్పుడనుకుంటోంది."

"సర్లే - మాఇంటి ఆడపిల్ల - మా దివాణపు హోదాకి తగ్గట్టు వెళ్లాలి - వెళ్లింది - మా ఇంటి విషయాలింక ఆపి - ఇంతకీ నువ్వెవరో చెప్పు"

"ఆశ్వీయుజ మాసం  - బహుళ ఏకాదశి - బుధవారం - సమయం - మధ్యాహ్నం 2:15 - అప్పుడు మొదలయింది నీ ప్రయాణం నాతో"

"నువ్వెవరంటే - తిథివారనక్షత్రాలు చెప్తావేంటి? నువ్వేమన్నా"సీతారామాభ్యాంనమః" అంటూ ఇంటికొచ్చే యాయవారపు బ్రాహ్మణుడివా? నీ గొంతు గుర్తు ఆనవాలు పట్టలేకపోతున్నానే?!"

"ఆ... ఆ... నేనాయన్ని కాదు - బహుదూరపు బాటసారిని - ఏదో నా బాటలో కలిశావు - మాట కలిపితే మార్గాయాసం లేకుండా దాటిపోతావని - అంతే! "

"బానే వుంది వరస - ఎవరో చెప్తావా - నన్నాట్టే విసిగించకుండా నీ దారిన నువ్వెళ్తావా?"

"బావుందయ్యా, నానీ! - నీ విసుగు - సరే విను - నేను నీకు బాగా తెలిసిన వాడినే - దేవుడంటారు నన్ను - అసలెప్పుడైనా తలిచావా నన్ను?"

"ఎందుకూ తలవడం - నా సంగతి నేను చూసుకోలేనూ? అండగా తమ్ముడు, నా పిల్లలు ఉండనే వున్నారు"

"తెలుసులేవయ్యా - ఒక తల్లి కడుపున పుట్టిన రామలక్ష్మణులు - నువ్వూ నీ తమ్ముడూ - మనసుతో మాట్లాడుకుంటారు - ఇవన్నీ చెప్పావులే. ఎంత వాళ్ళందరూ వున్నా నేను నేనే కదా?"

"రాముడితో పోల్చావూ - అసలు నీతో ఒక సంగతి తేల్చుకోవాలి  - నువ్వేమో రాముడిగా పధ్నాలుగేళ్లు, నీ వాళ్లు - ఆ పాండవులకేమో - పోనీలే - బావమరిది - బతుకగోరేవాడు  అన్చెప్పి - ఓ రెండేళ్లు తగ్గించి పన్నెండేళ్లు - మరి నేనేనా కాని వాడినని యాభై ఏళ్లకు పైగా వనవాసం చేయించావు - ఆ అనాతవరంలో ? "

"భలే వుందయ్యా నీ నింద ! వనవాసమన్నావు కానీ ఏ ఒక్క రోజన్నా ఇలా కాదు-ఇంకోలా కావాలని అడిగావా - కనీసం అనుకున్నావా ? ఉన్నచోటే కైలాసం అనుకున్నావు - పైగా "జమీలు పోయినా దార్లు" మిగిలాయనుకుని తృప్తి పడ్డ జమీందారు బిడ్డవి- నన్నిప్పుడిలా దబాయిస్తావూ?"

" సర్సర్లే - అవన్నీ ఎందుకు గానీ - ఇప్పుడీ ప్రయాణమేంటి నాతో?"

"ఇది నీ ప్రయాణమే - అవునూ ఆ గొంతులో  రాచపుండొచ్చి నొప్పొచ్చినా నన్ను తలవలేదేమయ్యా - అది రాకుండా ఆపలేదని నామీద  కోపం రాలేదూ?"

"సరిపోయింది. అదేం నొప్పో - పిల్లలు జ్వరం వచ్చిందన్నారు - మందు రాస్తే తగ్గిపోతుందన్నారు - దానికి నువ్వేంచేస్తావు? ఇంతకీ అది రాచపుండా? బావుందయ్యా - నేనున్నది రాచపొరుగు, వచ్చింది రాచపుండు - బాగా కుదిరింది వరస"

"ఇదిగో - ఇలా అనేసుకుని ప్రతీ దానికీ సరిపెట్టేసుకుంటే నీతో నాకు కలహమేముంది - వినోదమేముంది? అసలు నువ్వు ఊరివారితో  మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు - నేనేదో సుప్రభాతాలు-పవళింపు సేవల హడావిడిలో వినలేదేమో అనుకుంటే - మీ ఊరి చిన్నవాడు - అదే రాంబాబు మాష్టారు గారి రమేష్  - అతనిదీ అదే మాట"

"అదెప్పుడు నీకు చెప్పాడు - నువ్వెక్కడ విన్నావు?"

"సర్వాంతర్యామిని - నాకు తెలీనివి ఉండవని నీకు తెల్సనుకుంటాను. నీకు ఈ ఫోన్లూ-వాట్సాప్పులూ అలవాటు లేవు కదూ - అలవాటు అనేకన్నా - అక్కర్లేదు కదూ - అదిగో - అక్కడ - మీ వూరబ్బాయి - సతీష్ నడిపే - అనాతవరం గ్రూపులో రమేషేమన్నాడో - విను చదువుతాను

Very rare combination -highly educated, reserved, great humanity and values in one person in our village Never asked anyone to respect him, but none of us behaved badly when he is around. - రమేష్ ఓరుగంటి

"విన్నాను - సంతోషం "

"నువ్వేంటి - పిల్లల్నసలు ఏమనవా? అలా అయితే భయం-భక్తీ లేకుండా తయారవరూ?"

"పిల్లల్ని భయపెడితే భక్తి రాదు - ప్రేమిస్తే ప్రేమొస్తుంది తిరిగి"

"అర్థమయింది - ఇదిగో ఆ రమేష్ తమ్ముడు - ప్రసాద్ - నీగురించి ఏమన్నాడో విను:

నాకు తెలిసిన నాని గారు

నాని గారు గురుంచి కొన్ని నాకు తెలిసిన అనుభూతులు
ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గెర క్రికెట్ ఆడినప్పుడుకాని, వాళ్ళ ఇంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లు చూస్తున్నపుడు, అప్పుడప్పుడు కుర్రాళ్లతో దూరదర్శన్ లో ఆదివారం సినిమాలు చూస్తున్నప్పుడు  నాని గారిని దగ్గెర నుండి చూసి అయన గురుంచి కొన్ని మీతో

నాని గారు మౌన ముని అంటే ఎక్కువ మాట్లాడరు కానీ అయన కి తెలియని ప్రపంచ విషయాలు ఏమి ఉండవు .అలాగే వాళ్ళఇంట్లో TV లు చూస్తున్నపుడు ఏ సచినో 6 కొట్టినా లేదా ఏ రవి శాస్త్రీ 6 లు ఇచ్చినా, అప్పుడు టీవీ చూస్తూ వచ్చే కుర్రాళ్ల గొంతులో ఆనందాన్ని లేదా అక్రాందాన్ని కూడా ఆయన సరిగా అర్ధం చేసుకుని ఏమి అనేవారు కాదు.ఇప్పటికి గుర్తు చిత్రలహరి లో మెగాస్టార్ ఆపద్భాందవుడు పాటని నాని గారి ఇంట్లో నేను అయన సోఫా మీద కూర్చుని చూడటం. 
కొందరికి నలుగురు తో ఉంటె  నాలెడ్జి వస్తుంది కొందరికి ప్రపంచమంతా తిరుగుతే వస్తుంది
నాని గారికి ఆ ప్రపంచ నాలెడ్జి ని తన నాలుగు రకాల న్యూస్ పేపర్స్ తో బంధించి ఇంటికి వచ్చిన ఆ నలుగురి కి ఆ నాలెడ్జిని షేర్ చేస్తూ  ఎప్పటికప్పుడు నేను కూడా Up to  Date అని చెప్పడం.  - ప్రసాద్ ఓరుగంటి


"....."

"నేను చదివేది నీకు నచ్చిందని నీ చిరునవ్వే చెప్తోంది - మీ ఊరి బిడ్డ - హనుమానూ అదేమాట - విను ఇది కూడా...

ప్రసాద్ నానీ గారి గురించి చక్కగా చెప్పావ్ ! నిజం గా  పుస్తకాలు చదవడం అక్కడే అలవాటు  అయ్యింది. నాకు తెలిసి మన ఊళ్ళో  కుర్రాళ్ళ అల్లరి ని ఆయన చిరునవ్వు తో చూసేవారు ఎవ్వరిన ఆయన ఏరోజు విసుక్కోలేదు.
తెల్లటి గ్లాస్కో పంచె లో ఎప్పుడూ పెదవి పై చిరుదరహసము ఉండే నానీ గారు లేరు అంటే మనసుకు చాలా బాధగా ఉంది. - హనుమాన్


 "....."

"ఇదిగో - బాండ్ అంటారు - అదే కుమార్ - నువ్విచ్చిన వాచీ కూడా చూపించాడు అందరికీ - నాని గారి  నుండి బహుమతిగా పొందినది - అంటూ...



"అవునూ - నీకు వారం క్రితం జ్వరం వచ్చి కళ్లు తెరిచాకైనా నన్ను తలుస్తావనుకుంటే నీకొడుకుని పిలిచి "ఆ బ్రాహ్మడికి ఓ కుంచెడు బియ్యం - పదిహేను రూపాయలు ఇచ్చి పంపించు - కూరలు కొనుక్కుంటాడు" - అని చెప్తావా? ఇంతకీ అక్కడ ఏ బ్రాహ్మడూ లేడు. నీ కలలో కూడా అడిగేవారు - వాళ్లకి - కళ్ళు తెరవగానే నువ్వు ఇవ్వమని పురమాయించడాలు - బాగు - బహు బాగు - ఇంక నీకు నన్ను తలుచుకోవడానికి సమయమేది?"

"ఇంతకీ నిన్ను తలుచుకుని నువ్వొస్తే నీకేం చెప్పాలి - అన్నీ వున్న నేను నిన్నేమని అడగాలి"

"కనీసం నొప్పి తగ్గించమని వేడొచ్చుకదా - అలా నీలో నువ్వే బాధ పడకపోతే?"

"సరి - ఇప్పటి నొప్పి సరే - ఇంతకు ముందెప్పుడూ నాకు నొప్పి రాలేదా- శరీరానికి కానీ - మనసుకి కానీ - మరప్పుడేమయ్యావు?"

"నాకు లోకమంతా సవాలక్ష మొక్కులు - మొక్కుబళ్లు, విన్నపాలు-సన్మానాలు - తీరిక లేకపోయింది"

"మరి అప్పుడు తీరిక లేని నువ్వు ఇప్పుడు మాత్రం పిలిస్తే వస్తావా - నా సాయమేదో నేనే పట్టుకున్నాను - అయినా నిన్ను పిలవలేదు కానీ - నిన్నేమీ కాదనుకోలేదే - అన్నిరకాలుగా నీ పట్ల నా ధర్మం నిర్వర్తించాను"

"అదీ - అదే మరి - నువ్వు అన్ని రకాలుగా నీ ధర్మం నిర్వర్తించి నన్ను మాత్రం ఏ సాయానికి పిలవలేదనే కదా - నా బాధ! సాయం వద్దు - నిన్నో మొన్నో మెలకువలో వున్నప్పుడు ఒక్కసారైనా మోక్షమిమ్మన్నావా?"

"ఎవరన్నా వింటే నవ్వుతారు - అదీ ఓ బాధే - చెప్తా విను - మోక్షం కోరడమూ ఓ కోరికే - నిన్నడగాలి -  అడిగితే ఇస్తావో - కాదంటావో. ఇస్తే సరే - కాదంటే మళ్లీ నువ్వెందుకు నాకివ్వాలో కారణాలు చెప్పి నిన్నొప్పించాలా? అలా చెప్పినా నువ్వు ఒప్పుకుంటావని ఏముంది?ఎందుకా లేనిపోని వాదన అని వూరుకున్నాను. అయినా చివరివరకూ ఇవ్వగలిగినంత ఇవ్వడంలో వున్న ఆనందం - పుచ్చుకోవడంలో వుండదులే"

"భేషైన మాట చెప్పావు ! ఇదిగో ఇప్పుడే చూశాను  - పేపర్లో వార్త. ఇందాకట్నుంచీ ఈ ఆకాశవీధిలో - కళ్లు మిరుమిట్లుగొల్పే ఈ నక్షత్ర కాంతిలో -  నీ చూపానట్లేదంటే ఏంటా అనుకున్నాను - కారణం తెల్సింది - వచ్చేటప్పుడు ఇచ్చే వచ్చావూ - మాటల్లో పడి నేను గమనించనే లేదు సుమీ  ... చదువుతాను విను ...






"83 ఏట దాకా కళ్ళజోడెరగను - అవి ఇంకొకరికి చూపానజేస్తే అంతకన్నా ఇంకేం కావాలి?"

"బానే వుంది సంబడం - ఓ మాట మాట్లాడవు - పుస్తకాలు తప్ప ఇంకే కాలక్షేపం లేదు - కళ్లు కూడా దానమిచ్చేస్తే నీకు కాలక్షేపమెలా?"

"చేసేవన్నీ చేసేసి ఏమీ ఎరగనట్టు నన్ను దబాయిస్తావేంటి? కథలు-కబుర్లు చెప్పే మా అమ్మని తీసుకెళ్ళావ్. నా ఇంటి మాలక్ష్మి-లలితనక్కడ చేర్చావ్. మోహనరాగం ఎంత బాగా పాడేదనీ?! - అదే మా కుట్టి - అందరికన్నా చిన్నదని కూడా చూడకుండా  పట్టుకెళ్లి అక్కడ చేర్చావు కదా - వాళ్లందరూ వుండగా నా కాలక్షేపానికి లోటేంటి?"

"సమయానికి బాగా గుర్తుచేశావ్ - మీ ఇంటి ఇంకో పిల్ల పప్పి ఏమందో విను -

అప్పకు నమస్సుమాంజలి అర్పిస్తూ - వారి అత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
అప్ప , దొడ్డ చక్కగ ఈ రెందు ఏళ్లు మిస్ అయిన కబుర్లు చెప్పుకుంటు వుండి వుంటారు. నేత్ర దానం సింప్లీ సుపర్బ్. I'm proud to be one of the Vadlamani family members!


గెలిచావయ్యా- నాని!! - ఉన్నన్నాళ్లూ  చప్పుడు చేయక - ఉనికి మాత్రమే తెలిసేలా - చుట్టూ వున్నవారికి  దీపంలా వెలుగు పంచి - ఇప్పుడు మలుగుతూ ఇంకో కంటికి వెలుగునివ్వబోతున్నావు - మీ వాళ్లన్నట్టు అమరజీవివే - ఈమాట దేవుణ్ణి నేను మాత్రమే కాదు - నిన్నెరిగిన వారందరూ అంటున్న మాట"






23, అక్టోబర్ 2016, ఆదివారం

తల్లీ! ఇటు చూపు నీ ముద్దుమోము...(నాన్నమ్మ పాట - నా నోట)




ఎత్తుకోలు ......


"నాన్నమ్మ పాట మళ్లీ రికార్డు చేశాను - ఇది వినండీ..."


మొదటి రెండు లైన్లు వినీ వినకుండానే  -
"ఇప్పుడు బావుంది, బంగారం-నిన్న రాత్రి పాడినప్పుడు అచ్చు మీ నాన్నమ్మకి నాన్నమ్మ గొంతులా వుంది."


"అబ్బా - పాట వినండి ముందు"


ఇంకో రెండంటే రెండే లైన్లు విని -
"చాలా బావుంది - ఇంతకీ ఆఫీసులో ఆ burndown report ..."


"పాట విన్న తర్వాతే ఇంకే మాటలయినా ..."


(నాలుగు నిముషాల నిర్బంధ శ్రవణం ....)


విన్న తర్వాత - మొదటి సందేహం -
 " ఇంతకీ ఇదేం చేస్తావు?"


"నా బ్లాగ్ లో నాన్నమ్మ  పాట రాసి పెట్టాను - దానికింద పోస్ట్ చేస్తాను"


"అదేంటి? నిన్నేగా ఒక పోస్ట్ రాశావు - మళ్లీనా?"
(ఎప్పుడో రాసినాఇంకా నిన్నే చదివినట్లుంది మరి)


"అది నిన్న కాదు - 19కి - త్వామనురజామి అది"


"19 అంటే ఇంకా వారం కాలేదు కదా! ఇది వచ్చేవారం పోస్ట్ చెయ్యొచ్చు కదా?"


"ఇది ఎప్పట్నుంచో ఒక space-filler లా వుంచుకున్నాను"


"Space ఏదీ?"


"19 కి రాసేది లెక్క లేదు - ఈ వారం నా space నాకుంది"


"అయితే - ఇంకాలశ్యం ఎందుకు ?  వదిలేయ్ !"


(అంటే - పాడి బ్లాగ్ మీదికి వదిలేయ్ - వినిపించుకున్నవాళ్ళకి వినిపించుకున్నంత మహదేవా! - అని అర్థం).


అయినా ఇలాంటి వాటికి నేను ఆగుతానేంటి? నోటికి అరచెయ్యి అడ్డుపెట్టి, చెవుల్లో ear-plugs పెట్టి - నా పాటనాపలేరు ఎవరూ...


మా నాన్నమ్మ పాట - నా నోట !




పున్నమ చంద్రుని బోలు నీనెమ్ముఖము
పొందుగా ముద్దు పెట్టుకొందు
నీ ముఖమే నా కన్నుల విందు
సర్వచింతలకెల్లా అది మందు
సంతసము నాకు ఎల్ల పసందు
సకల సౌఖ్యములెల్ల నేకందు
నీ నగుమోము జూడ నా సంతోషమేమందు
ఇటు చూపు నీ ముద్దు మోము...

కలువరేకుల బోలు కనులు చూచితే చాలు
కడుపు నిండును కన్నతల్లీ
నా మొలక నవ్వుల చిలక తల్లీ
నా ఆటపాటల పాలవెల్లి
నా మురిపెంపు ముద్దులతల్లీ
ఇటు చూడు నా చిన్న తల్లీ
తల్లీ నిను జూడ జాబిల్లి సిగ్గుపడుతున్నాడు
ఇటు చూపు నీ ముద్దుమోము...

విరులను మురిపించు కురుల అందము జూడ
కనుల పండుగ చిట్టిబొమ్మా
విండ్లబోలు నీ కనుబొమ్మలమ్మా
బాలచంద్రుడు నీ నుదురు సుమ్మా
ఇంద్రనీలములే నీ అల్కలమ్మా
పండువెన్నెలే నీ నవ్వులమ్మా
నా చిన్నిపాపాయీ నా భాగ్యరాశివమ్మా
ఇటు చూపు నీ ముద్దుమోము...

నిద్దంపు చెక్కిళ్ళు అద్దంబులను మించు
ముద్దెట్టుకొన కందునౌరా!
అమృతంపు నిలయంబే  నీ నోరు
తిల పుష్పమే నీ ముక్కు తీరు
మర్రిపండే నీ గడ్డంపు తీరు
చిలక పల్కులే నీ పల్కు దౌరు
తల్లీ శ్రీకారములు బోలు తల్లీ నీ చిరుచెవులు
ఇటు చూపు నీ ముద్దుమోము....

చెరుకు కోలలబోలు చేతులివ్వుము తల్లీ
ఎత్తుకు ముద్దాడుతాను
పగడంపు నీ చిట్టి వేళ్ళు
మంచిముత్యాలే నీ ముద్దు  గోళ్ళు
పద్మపత్రములే తల్లీ నీ కాళ్ళు
తాబేళ్ళను మించు మోకాళ్ళు
తల్లీ! పదియారు వన్నెల బంగారమే ఒళ్ళు
ఇటు చూపు నీ ముద్దుమోము....


 ఈడు వారిలో నినుబోలువారిని
నేనెందును గానలేదమ్మా
నీ సుందరమేమందునమ్మా
లావణ్య తిలకవు గదటమ్మా
నా నోముల పంటవు గదటమ్మా
నా పెన్నిధానము నీవే సుమ్మా
తల్లీ! నిన్ను జూడక నేను నిముషము మనజాల
ఇటు చూపు నీ ముద్దు మోము...

ఖర్జూరముల కన్నా కండ చక్కెర కన్నా
కడు తీపి నీ ముద్దు నాకు
పనసతొనల కన్నా తీపి నాకు
ఇక్షు రసము కన్నా తీపి నాకు
జుంటి తేనె కన్నా తీపి నాకు
తల్లీ! మధురంబులను మించు మధురంబు నీవమ్మా
ఇటు చూపు నీ ముద్దుమోము...

రాజరాజేశ్వరి రమణి మహాలక్ష్మి
వాణీ పద్మజు రాణి బ్రోచి
నిను వర్థిల్ల జేసేదరమ్మా
ఇచ్చు విద్యాబుద్ధులు  శారదాంబ
కూర్చు శుభముల నల శ్యామలాంబ
వీరమాతను చేయు కాళికాంబ
మెరిపించు నిన్ను జగతి జగదాంబా
తల్లీ! లలితా పరమేశ్వరి ఆయురారోగ్యములనిచ్చు
ఇటు చూపు నీ ముద్దుమోము...

తల్లీ! ఇటు చూపు నీ ముద్దుమోము...


19, అక్టోబర్ 2016, బుధవారం

త్వామనురజామి - 6 - కుందేలూ-త్యాగమయి

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ 

ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయాను  - B.Sc ఫస్ట్ ఇయర్ లోనే ACC Centenary సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ సందర్భంగా చాలా బుక్ స్టాల్స్ పెట్టారు.  స్టాంప్ ఎగ్జిబిషన్ జరిగింది. . దాదాపు నా ఆరవ తరగతి నుంచీ చేస్తున్న నా స్టాంప్ కలెక్షన్ ఒక డీసెంట్ కలెక్షన్ గా మారింది డిగ్రీ లోనే. నాన్న ఇచ్సిన పాకెట్ మనీ, దండాల పండక్కి (సంక్రాంతి)  నాన్నమ్మ ఇచ్చిన డబ్బులతో బోల్డన్ని స్టాంప్స్ కొనుక్కున్నాను.

ఇక సెకండ్ ఇయర్ మొదలయ్యాక - ఈసారి అమ్మతో చెప్పించుకోకుండానే నా అంతట నేను అపర్ణ తో కలిసి ముందు రాఘవేంద్ర రావు (BRR) గారి దగ్గరికి వెళ్లాను - ఒక రోజు సాయంత్రం - ఫిజిక్స్ ట్యూషన్ బ్యాచ్ ఎప్పటినుంచో తెలుసుకుని సీట్ రిజర్వ్ చేసుకుందామని.

మేమెళ్లే టైంకి ఆయన వేరే బ్యాచ్ క్లాస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.

మమ్మల్ని చూడగానే బయటికి వచ్చి - మేము "గుడ్ ఈవెనింగ్ సర్" అనగానే - "ఏంటీ ఇలా వచ్చారు?" -  అనడిగారు.

నాకెందుకో కొంచెం మొహమాటంగా అనిపించి చిన్నగా నవ్వి సైలెంట్ గా వుండిపోయాను.

అపర్ణ "సర్! సెకండ్ ఇయర్ బ్యాచ్ ఎప్పటినుంచండి?" అనడిగింది

"మండే నుంచి స్టార్ట్ !" అని తనతో అంటూ నాకేసి తిరిగి - "అవునూ - నీకు ట్యూషన్ అంటే ఇంట్రెస్ట్ లేదు కదా - నువ్వెందుకు వచ్చావు? " అని నేను సమాధానం చెప్పేలోపే " జూనియర్ ఇంటర్ లో ఎన్నాళ్ళొచ్చావ్?" అనడిగారు.

"వన్ మంతండీ " నా సమాధానం

"సీనియర్ ఇంటర్లో ?" -

"2 వీక్స్ అండీ"

"డిగ్రీ ఫస్ట్ ఇయర్- అసలే లేదు. నువ్వు జూనియర్ ఇంటర్ లో మానేసినప్పుడే చెప్పేయాల్సింది ఇంక రావద్దని. సీనియర్ ఇంటర్ లో మీ అమ్మగారు వచ్చి అడిగారని సరే అన్నాను. నిన్ను తీసుకోకపోతే ఇంకో ఇంట్రెస్ట్  వున్న స్టూడెంట్ చేరతాడు. ..." అంటూ ఎందుకో నా  మొహం కేసి చూసి ఏమనుకున్నారో -  "సరే ! ఇద్దరూ వచ్చేవారం నుంచీ రండి " అన్నారో లేదో - ఇంకా అక్కడే వుంటే మళ్లీ ఆయన మనసు మార్చుకుంటారేమో అని భయమేసి "Thank You Sir!" -  అనేసి గబగబా బయటకొచ్చేశాం - నేను, అపర్ణ.


ఫిజిక్స్ తప్ప ఇంకో భాష రాని BRR గారి చేత ఇంకో భాష మాట్లాడించిన ఘనత నాదేనేమో :)

అక్కడి నుంచి భవభూతి శర్మ గారి దగ్గరికి వెళ్లాము - కెమిస్ట్రీకి - ఆయన దగ్గరికి నేను వెళ్లడం అదే మొదటిసారి. అందుకని BRR గారి దగ్గర లాంటి ఎపిసోడ్ జరగలేదు.

ఇంకా చివరిగా - మాథ్స్ - కోటేశ్వరరావు గారింటికి వెళ్లాము.

అప్పటికే చాలా మందిఅబ్బాయిలు, అమ్మాయిలు సర్ చుట్టూ నించుని వాళ్ల వాళ్ల బ్యాచ్ టైమింగ్స్ గురించి నోట్ చేసుకుంటున్నారు. వాళ్లందరితో మాట్లాడడం అయ్యి వాళ్లని పంపించేశాక మా వైపు వచ్చారు కోటేశ్వరరావుగారు.
నేను, అపర్ణనే కాక మాతోపాటు రమణకుమారి (RK), ఆషా కూడా వున్నారు.

నేను ఇక్కడకూడా కొంచెం వెనక్కి నించున్నాను. అపర్ణ, రమణకుమారి, ఆషా - ఆల్రెడీ ఇంతకు ముందు ఏడాది కూడా ఆయన దగ్గరికే మాథ్స్ ట్యూషన్ కి వెళ్లి వుండడంతో ఆయన వెంటనే టైమింగ్స్ చెప్పడం, వాళ్లు సరే అనడం జరిగిపోయింది. సర్ "ఇంక రండమ్మా సోమవారం నుంచి - మొదలు పెట్టేద్దాం" అని ఇంటి లోపలికి వెళ్లబోతూ ఆగి నాకేసి తిరిగి "నిన్ను చేర్చుకోలేనమ్మా" అని ఒక్క మాట మాత్రం అనేసి నా మొహం లోకి చూశారు.

నాకింక బోల్డంత ఏడుపు వచ్చేసింది - ఎప్పుడూ లేనిది బోనస్ గా రాబోతున్న సెప్టెంబర్ మాథ్స్ మార్క్స్ కార్డు కళ్ల ముందు కనిపించింది. కళ్లలో నీళ్లు ఎవరికీ కనిపించకూడదని తల "సరే" నన్నట్లు అటూ ఇటూ తిప్పి అపర్ణ పిలుస్తున్నా వినిపించుకోకుండా దాదాపు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాను.

అప్పుడే పప్పి, కుట్టి నాగార్జున సంగీత కళాశాలకి వీణ, సంగీతం క్లాసులకి వెళ్దామని బయల్దేరి చెరో సైకిలూ పట్టుకుని గేట్ దగ్గర నించుని అమ్మతో ఎదో మాట్లాడుతున్నారు.

నన్ను చూడగానే "అపర్ణ ఏదీ ? ఇద్దరూ కలిసివెళ్లారుగా - జంటకవుల్లా" అనడిగింది అమ్మ.

"జంటకవులా - జంటకపులా?" అని దాని ధోరణిలో ఏదో ఇంకా అనబోతూ నా కళ్ళలోంచి అప్పటికే కారిపోతున్న నీళ్లు చూసి "అమ్మా! దీనికి ఆకలి వేస్తున్నట్టు వుంది - గబగబా ఏమన్నా పెట్టు" అంటుంటే నేనుక్రోషంగా "నువ్వింక నీ క్లాసుకి వెళ్లు - నన్నొదిలి" అని ఆ గేట్ దగ్గరే నించుని కళ్లు తుడుచుకుంటూ వున్నాను. "సర్లే  నా సంగీతం క్లాస్ అయి రాగానే నీ పని  చెప్తాను" అనుకుంటూ పప్పితో కలిసి వెళ్ళిపోయింది కుట్టి.

ఇంతలో నా వెనకాలే వస్తున్న అపర్ణ, RK, ఆషా వచ్చేశారు. వస్తూనే చెప్పారు " నువ్వొచ్చేశావు పిలుస్తున్నా వినకుండా. సర్ చెప్పారు నిన్ను కూడా ట్యూషన్ కి రమ్మని" అని.

అప్పటికి మా అమ్మకి అర్థం అయ్యింది సంగతి ఏంటో.

"ఆ మాత్రం దానికే ఏడుస్తారా లల్లీ?" అని నాతో అంటూ  "మీరన్నా మా లల్లీకి చెప్పండమ్మా - అలా ఏడవకూడదని. నీళ్లకుండ నెత్తిమీద ఉంటుంది లలితా పరమేశ్వరికి" అనగానే రమణకుమారి పెద్ద ఆరిందాలా "ఆంటీ! మీ లలితకి పెళ్లి చేస్తే మీరు ఇల్లరికం తెచ్చుకుంటే బెటర్" అంది.

అదివినగానే మా అమ్మకేం బెంగొచ్చిందో నా కంటి నీళ్లు ఆవిడ కళ్లలో ముత్యాలై మెరిసాయి.

మా కుట్టి అన్నట్టు అలా - literally - ఏడ్చి సాధించాను - అస్సలు నేనెప్పటికీ వెళ్ళకూడదు అనుకున్న ట్యూషన్స్ లో సీట్లు.

ఇంక కాలేజ్ లో కూడా రోజులు కూడా గబగబా దొర్లిపోతుండేవి - ఫిజిక్స్ మెయిన్ అవడంతో వారానికి మూడు రోజులు ల్యాబ్ వుండేది.

ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీ లో కాలూపుతూ నా "సుహానా సఫర్" పాటని మెచ్చుకున్న హనుమంతరావు గారు (KHR) - ఫిజిక్స్ లో Sound టీచ్ చేసేవారు.

ఒకరోజు ల్యాబ్ లో Sonometer ఎక్స్పరిమెంట్ - నేనూ, అపర్ణా మహా ఉత్సాహంగా ట్యూనింగ్ ఫోర్క్ తో ఆడుకుంటూ, పేపర్ రైడర్ వైబ్రేషన్స్ కి కింద పడుతూ వుంటే - ఆడుతూ పాడుతూ తొందరగా ముగించేశాం.

దగ్గర్లోనే మా ఇద్దరి పుట్టినరోజులూ వుండడంతో - ఒకరికొకరం గిఫ్ట్స్ ఎం కొనుక్కోవాలో తెగ డిస్కషన్ నడుస్తోంది మా ఇద్దరి మధ్య.

మేమిద్దరం న్యూ ఇయర్ కి, పుట్టినరోజులకి, మా ఫ్రెండ్స్-డేకి  (ఆగస్ట్ 8 - మేమిద్దరం ఫ్రెండ్స్ అయిన రోజు - ప్రతీ ఏడాది ఇష్టంగా జరుపుకుంటాము.) ఇద్దరం గిఫ్ట్స్ కొంటాము ఒకరికొకరం - కానీ... ముందే ఏం కావాలో తెలుసుకొని అదే కొంటామన్నమాట.

అదిగో ---అలాంటి కబుర్లలో మేముండగా KHR గారువచ్చి పక్కనే నించుని కాసేపు మా మాటలు విని -
"Did you finish your calculations?" - అనడిగారు.

నేను - "We will do at home, Sir" - అని బదులివ్వగానే

అచ్చ తెలుగులో  - "ఇంటికి వెళ్లి చేస్తావా? ఏంటీ? డాబా ఎక్కి అల్లరేగా? Complete them now!" - అన్నారు.

పక్కనుంచి గోళీసోడా కొట్టిన  శబ్దం వినిపించి  - తిరిగి చూస్తే పక్కనే Bernoulli, పానకాలస్వామి KHR ని ఏదో డౌట్ అడగడానికి వచ్చి -  ఆయన నన్ను అన్న మాటలు విని నవ్వాపుకుంటూ కనిపించారు.

కొంచెం కోపంగానే కాళ్ల చెప్పులు టప-టపలాడిస్తూ Clark's Tables పుస్తకం, ల్యాబ్ రీడింగ్స్ తీసుకుని అపర్ణతో పాటు ఒక పక్కగా నించుని calculations చేయడం మొదలుపెట్టాను. 

(Bernoulli, పానకాలస్వామిల అసలు పేర్లు నాకసలు గుర్తు లేవు -మా క్లాస్ లో మొదటిసారిపరిచయం అయినప్పటి context ని బట్టి వాళ్లకి అలా బారసాల అయిపోయింది -
 Bernoulli - ఎప్పుడు చూసినా బోర్డు మీద Bernoulli's equations రాసేస్తూ ఉండేవాడు
పానకాలస్వామి - మంగళగిరి నుంచి వచ్చేవాడు )

KHR గారు Bernoulli, పానకాలస్వామిలను చూసి ఏంటన్నట్టు కళ్లెగరేశారు.
"సార్! ఆ Sonometer దారం లో లూప్స్ రావట్లేదండీ!'
"ఏం - ఎందుకలా ?"
"ఏమోనండీ - వెయిట్ కూడా బానే పెట్టాం"
"వెయిట్ బానే పెట్టారా? అంటే ఎంతా ?"
"ఆరండీ"
"అంటే మూడు కేజీలు - అసలు నువ్వు కూర్చోలేకబోయావు?"
ఇప్పుడు మేము కిలకిలా - వాళ్లు వలవలా :))

సెకండ్ ఇయర్ లో మాథ్స్ రాశాను - సెప్టెంబర్ లో. ఆ పేపర్ సెట్ చేసిన వాళ్లెవరో గానీ చాలా సమదృష్టి గలవాళ్లు - హన్నా! ఈజీ గా ఇచ్చేస్తే మార్చ్ లో రాసిన వాళ్లకి అన్యాయం చేసినట్టవ్వదూ ?! - అన్నట్లు దాదాపుగా అదేమోడల్ లో ఈసారి కూడా అవుట్ ఆఫ్ సిలబస్సే. కానీ ఈసారి రాసేశాను.

పరీక్షల హడావిడి అవుతూనే నాన్న చెప్పారు - KITS లో ఇంజినీరింగ్ చదువుతున్న బాబు నాలుగు రోజులు సెలవులు దొరికాయని వరంగల్ నుంచి వస్తున్నట్టు.

అప్పటికే - ఇంట్లో - గుంటూర్లో చదువుకోవడానికి వచ్చి - వినాయకచవితి పండగ కోసమని - మా ఇంటికి వచ్చిన నాన్న ఫ్రెండ్ కొడుకు కృష్ణంరాజు వున్నాడు.

హైద్రాబాదు నుంచి ప్రశాంతి, లక్ష్మి దొడ్డ వచ్చి వున్నారు. చిలకలూరిపేట నుంచి రవి వచ్చాడు. ఇల్లంతా సందడి సందడిగా వుంది.

ఆ రోజు సాయంత్రం బాబు వచ్చాడు. వస్తూనే ఎప్పట్లాగే బోల్డన్ని నవ్వులు తెచ్చాడు.రాత్రి అందరం భోంచేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే తన ఇంజనీరింగ్ కాలేజ్ రాగింగ్ విశేషాలు చెప్పాడు - ఇలా :

"మా సీనియర్లు ఒక డబ్బాలో చీటీలు తీసుకొచ్చి మా క్లాసులో వాళ్లని ఒక్కొక్కళ్లుగా వచ్చి చీటీ తీసుకుని అందులో ఏది వస్తే అది స్టేజ్ ఎక్కి చేయాలి అన్నారు.

నా ముందు ముగ్గురున్నారు - వాళ్లకి ఏదో పాట పాడాలి, జోకు చెప్పాలి ఇలాంటివేవో వచ్చాయి. ఇంతలో నా వంతు వచ్చింది - చీటీ తీసి చూస్తే "కుయిలీ గురించి మాట్లాడాలి" అని వుంది.

నాకేమో కుయిలీ అంటే అర్థం తెలీలేదు. స్టేజ్ ఎక్కబోతూ ఎందుకయినా మంచిదని మా సేనియర్నే అడిగాను - కుయిలీ అంటే ఏంటండీ - అని.

అతను సరదాగా నవ్వుతూ - నీ ఫేవరెట్ ఏక్టర్ - అన్నాడు.

ఓస్ - ఇంతేనా - అనేసుకుని స్టేజ్ ఎక్కి "నా ఫేవరెట్ ఏక్టర్ NTR ఎందుకంటే ..."- అని మొదలుపెట్టి  ఓపది నిముషాలు ఆపకుండాఎన్టీఆర్ డైలాగులు, పాటలు ఉదాహరణలుగా చెప్పేస్తూ మాట్లాడేశాను.

ఆ పది నిముషాలూ - హాల్ అంతా - పిన్ డ్రాప్ సైలెన్స్.

"ఆహా! నా స్పీచ్ కి మొదటిరోజే ఇంత ఇంప్రెస్స్ అయిపోయారేంటబ్బా?! - అని మురిసిపోతూ స్టేజ్ దిగివస్తుంటే - ఇందాక కుయిలీ అంటే- నీ ఫేవరెట్ ఏక్టర్ - అన్న సీనియర్ ఎదురొచ్చి - "అవునూ - ఇంతకీ మేమా రాగింగ్ చేస్తోంది నిన్ను - లేకపోతే నువ్వు మమ్మల్ని చేస్తున్నావా? నీకు కుయిలీ ఎవరో తెలీదా నిజంగానే?"  అనడిగాడు. 

తర్వాత తెలిసింది కుయిలీ అంటే సినిమాల్లో డాన్సులు చేసే ఏక్టర్ - అని"

బాబు చెప్పే కబుర్లు విని అందరూ ఒకటే నవ్వు.

తరవాతి రోజు సాయంత్రం పత్రి కొనుక్కు రావడానికి - నన్ను, బాబుని - శంకరవిలాస్ సెంటర్ కి వెళ్లి రమ్మంది  అమ్మ.

షాపుల వాళ్లు అడిగినంతా ఇచ్చిరాకుండా - జాగ్రత్తగా బేరమాడి - మంచి ఆకులు, పళ్ళు చూసి కొనుక్కురమ్మంది.

వెళ్లేముందే అడిగాను - "బాబూ! నీకు బేరమాడడం వచ్చా?" - అని.

"ఇదిగో అలాంటివన్నీ నాకు పెట్టకు  - నీతో వెళ్లమన్నారు - వస్తున్నాను - నేను వెనకాల నించుని నువ్వు మోయలేవు కాబట్టి సంచీయో, బుట్టో పట్టుకుంటాను- అంతే" అన్నాడు.

"సరే - ఈ బాబుకి అసలు బేరమాడడమంటే ఏంటో తెలిసి రావాలి ఈ దెబ్బతో" - అనుకున్నాను - నాలో నేనే నవ్వేసుకుంటూ.

వెళ్లేటప్పుడు నడుచుకుంటూ  వెళ్లాము.

ముందు తమలపాకుల అమ్మే ఒక ముసలావిడ దగ్గర ఆగి - "కట్ట ఎలా?" - అన్నాను - మా అమ్మ ఎలాబేరమాడడం చేస్తుందో గుర్తు తెచ్చుకుంటూ.

"కట్ట రూపాయిన్నర"

"రూపాయి ముప్పైఐదు పైసలకి ఇస్తారా?" -అంతకంటే తక్కువకి అడగాలంటే మొహమాటంగా అనిపించింది మరి.

"ఒకటీ-నలభైకి తీసుకో " - ఉదారంగా ఇస్తున్నట్టే అనిపించింది నాకు.

డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూస్తే - నవ్వుతూ అటెటో చూస్తూ బాబు.

"తెలుస్తోంది అబ్బాయికి నేనంటే ఏంటో" - అనుకున్నాను.

వర్సగా - రూపాయి నోట్లు చేత్తో పట్టుకుని - మూర మూడు రూపాయలు చెప్పిన పూలు రెండూ తొంభైకి, డజను ఐదు రూపాయలు చెప్పిన అరటి పళ్ళు నాలుగు డెబ్భై ఐదుకి, పది రూపాయలు చెప్పిన పత్రి తొమ్మిదిన్నరకి - చాలా తెలివిగా బేరమాడేసి - అవన్నీ మోసుకుని నడవలేం కాబట్టి రిక్షా ఎక్కుదాం అన్నాను.

బాబు నావెనకాలే కొన్నవన్నీ మోసుకుంటూ వచ్చాడు - రిక్షా అబ్బాయిని - బ్రాడీపేట 4/18 కి - అని  చెప్తే  - "పండక్కదమ్మా - రెండున్నర ఇవ్వండి " - అన్నాడు.

మళ్లీ మా అమ్మ చేసిన  బేర-బోధ గుర్తుకొచ్చి - "లేదు - రెండు రూపాయిలయితేనే వస్తాము" అన్నాను.

పక్కనుంచి బాబు నవ్వు -"రిక్షా తొక్కేది నువ్వు కాదు వస్తాము - కాదు - రిక్షా ఎక్కుతాము అనాలి " అంటూ.

నాక్కొంచేమేం - బాగానే కోపం వచ్చేసింది - బాబు మీద, బేరం కుదరని రిక్షా మీద.

"నేను నడిచెళ్లిపోతాను అయితే - నువ్వెక్కేసి రా రిక్షా" అని ముందుకి నడిచాను.

పాపం - ఆ రిక్షా  అతను - కొంచెం పెద్దవాడు - అలసిపోయి వున్నాడు - "పదండమ్మా - నాదీ లాస్ట్ బేరమే - ఈరోజుకి - మా ఇల్లు అటేపే" - అని ఎక్కించుకున్నాడు.

పత్రీ, పళ్లూ వున్న సంచీ తో పాటు బాబు సీట్లో కూర్చుంటే - నేను రిక్షా అతని సీట్ వెనకాల అడ్డంగా వేసిన చెక్క మీద కూర్చుని ఇంటికి వచ్చేశాం - దార్లో ఎక్కడా కూడా బాబుతో మాట్లాడనే లేదు నేను కోపంతో.

రిక్షాలో కూర్చుయి ఇంటికి వచ్చేంత  వరకూ ఆలోచిస్తూనే వున్నాను -  "పాపం - పండపూట కూడా ఆ రిక్షా అతను పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఎలాగైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి - కానీ బాబు చూస్తే ఏడిపిస్తాడు ఎలా ?!" - అని.

ఇంటి దగ్గర దిగగానే - బాబు దిగి పత్రీ, పళ్ళూ దింపే హడావిడిలో ఉండగా - తను చూడట్లేదనుకుని రిక్షా అబ్బాయికి ఐదు రూపాయలిచ్చి - "ఉంచుకో" -  అని చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్లిపోయాను.

ఇంట్లోకి వెళ్లామో లేదో - బాబు కుట్టిని పిలిచి "నీకో కథ చెప్తా రా"  అని - నాకు వినబడేలా -

" అనగనగా ఒక అడవిలో ఒక సింహం వుంది. అన్ని జంతువులనీ తినేస్తోందని జంతువులన్నీ సింహంతో రోజుకొక జంతువుని ఆహారంగా పంపించేలా ఒప్పదం కుదుర్చుకున్నాయి"

అని మొదలు పెట్టగానే - "అబ్బా  బాబూ - ఇది తెలిసిన కథేగా ! " అంది అది.

"నన్ను చెప్పనీ ! ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివిగలది కదా - మన లల్లీలా! -  అదేమో ఒక ప్లాన్ వేసి సింహం దగ్గరికి వెళ్లి - "సింహం ! సింహం!  - దారిలో ఒక నుయ్యిలో అచ్చు నీలాంటి సింహాన్ని చూశాను. దాన్నలాగే వదిలేస్తే నీకు పోటీ వస్తుంది. పద చంపేద్దుగాని" అంది.
సింహం కుందేలు మాట విని దాంతో పాటే ఆ నుయ్యి దగ్గరికి వెళ్లింది. నుయ్యిలో తన రిఫ్లెక్షన్ చూసుకుని ఇంకో సింహం అనుకుంది"

వింటున్న నాకు - బాబు ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు - మేమందరం చిన్నప్పట్నుంచీ విన్న ఆ కథని.

బాబు కథ చెప్తూనే వున్నాడు "అప్పుడేమో - ఆ సింహం - కుందేలు కేసి చూసి నేను నిన్ను తినేస్తానని తెలిసి కూడా నాకింత హెల్ప్ చేస్తున్నావంటే - నువ్వు  మామూలు కుందేలు కాదు. కుందేలూ-త్యాగమయివి - ఆ నూతిలో సింహాన్ని చంపాలి అంటే  బలం కావాలి కదా - నిన్ను తినేసి ఆ బలం తెచ్చేసుకుంటానేం! - అని కుందేల్ని తినేసి నూతి లోకి దూకేసింది"

కుట్టి, పప్పి - ఆ కథ విని తెగ నవ్వుతూ -"ఇంతకీ ఆ కుందేలు-త్యాగమయికి లల్లీకి ఏంటి పోలిక ?" అడిగితే

బాబు ఎదురు ప్రశ్న  "ఆకులూ, పూలూ, పళ్లూ - ఎంతో బేరమాడి 95 పైసలు ఆదా చేసి - రిక్షాకి అడిగిన దానికన్నా మూడు రూపాయలుఎక్కువ ఇస్తే - టోటల్ గా త్యాగమెంతా - అంటే  - ఆ పోలికంత  - అవునా-కాదా?"

"పోన్లే బాబూ - ఇది తేగలు ఎక్కువ తింటుంది - అందుకే రాను రానూ - త్యాగరాణి అయిపోతోంది" - పప్పి, కుట్టి యుగళ-వ్యాఖ్య!

వినాయక చవితి ఇంకా రానేలేదు - చవితి చంద్రుణ్ణి చూణ్ణే లేదు - ఎంత గోలాపనింద నామీద - హన్నా!

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



15, అక్టోబర్ 2016, శనివారం

బెందకాళూరుకి - బెంగతో ...

ప్రియ సంగాతి బెందకాళూరుకి,

ఇక్కడ నేను క్షేమం. నీవక్కడ కుశలమా?

ఎన్నేళ్లయింది నిన్ను వదిలి - నిన్ను నిన్నుగా చూసి? అప్పుడప్పుడు నిన్ను అటూ ఇటూ వస్తూ వెళ్తూ చూసినా - ఏదీ నీతో కూర్చుని పట్టుమని పది నిముషాలైనా కుదురుగా గడపడం కుదరలేదు కదా - అనేదే నా బెంగ :(

అసలెక్కడ మొదలయిందంటే నీతో నా స్నేహం - నీకు గుర్తుందా?  - నేను చిన్నప్పుడు మూడవ తరగతి చదివేటప్పుడు నాన్న టొబాకో సీజన్ కని  హస్సన్ వచ్చేవారు కదా? అలా వెళ్లి మళ్లీ గణపవరం తిరిగి వచ్చినప్పుడు ఎన్ని కబుర్లు తెచ్చేవారంటే - అవి ఎన్ని సార్లు చెప్పినా ఇంకా ఇంకా వినాలనిపించేది.

అదిగో ... అప్పుడే ... మొదటిసారిగా - పుడుతూనే నేర్చుకున్న అమ్మ పలుకు, చదువులో ఒంటబడుతున్న ఇంగ్లిష్ చెలువు - కాక కమ్మనైన కన్నడ కస్తూరి తావి తగిలింది - నాన్న - ఆయన నేర్చుకొచ్చి - ಒಂದು, ಎರಡು, ಮೂರು, ನಾಲುಕ್ಕು, ಐದು, ಆರು, ಏಳು, ಎಂಟು, ಒಂಬತ್ತು, ಹತ್ತು - అంటూ నేర్పిన అంకెలలో అంచెలంచెలుగా పెరుగుతూ.

అప్పుడే ఒక తమాషా విషయం కూడా చెప్పారు - ఒకసారి నాన్న, ఇంకా ఆఫీసులో బయ్యర్లు - అంతా కలిసి ఏమీ తోచట్లేదు, ఏదైనా సినిమా చూద్దామని - కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన మహావీర మయూర చూద్దామని హస్సన్ లో ఒక సినిమా హాలుకి వెళ్లారట.

ఇంతలో ఒకరికి బాత్రూముకి వెళ్లాల్సిన అవసరపడితే - నాన్న వారికి సహాయం చేయబోయి -  ಹೆಂಗಸರಿಗೆ ಮಾತ್ರ, ಗಂಡಸರಿಗೆ ಮಾತ್ರ - అని రాసివున్న టికెట్ కౌంటర్లని - ಮಾತ್ರ ని ఒక కొమ్ము ఎక్కువ వేసుకుని చదివి - ఎలా పొరపాటు పడ్డారో చెప్తుంటే - కళ్లు పెద్దవి చేసుకుని విని బుగ్గలు నెప్పెట్టేలా నవ్వుకునేవాళ్లం - మేం ముగ్గురం.

అప్పుడు - అలా - మొదలయిన నీ మీద ఇష్టం - ఇంటర్ లో అపర్ణ స్నేహంతో ఇంకా ఎక్కువయింది - మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు - ఆంటీ - ಆದಷ್ಟು ಬೇಗ ಬನ್ನಿ - అన్నప్పుడల్లా - ఎప్పటికైనా నీ దగ్గరికి ఒక్కసారైనా చూడడానికి రావాలనిపించేది. అదుగో - అప్పుడే నేను మొట్టమొదటి కన్నడ వాక్యం నేర్చుకుంది - ಮೂಗಲ್ಲಿ ಬೆಟ್ಟು ಇಡುಕೋ ಬಾರದು - అంటూ శిరీషకి చెప్పే ఆర్తి దగ్గర.

ఇంతలో నీ దగ్గర వుండే శ్రీనన్న నా డిగ్రీ సెకండ్ ఇయర్లో నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తానంటే బోల్డంత ఆనందంగా - నిజంగానే - గెంతుకుంటూ వచ్చాను. అదిగో ...అప్పుడే ... అలా జరిగింది నీతో మొదటి పరిచయం.

ఆ చలి చలి రోజులు, చినుకుల తడిసిన ఆకుపచ్చటి చెట్ల గొడుగులు, ఎండ వున్నా వెలుగు తప్ప వేడి లేని మధ్యాహ్నాలు - ఎంత నచ్చేశావంటే - ఒక్కసారికి కాదు వందేళ్లు నీతో గడపాలనిపించేలా.

ఇంతలో డిగ్రీ అయిపోయింది  - కొండల నడుమ చదువు మొదలయింది - అక్కడ అనుకోకుండా - నాకు దొరికిన బంగారుకొండకీ చెప్పేశాను - ఎలాగైనా నీ దగ్గరే ఉండాలి ఎప్పటికీ మేమిద్దరం అని.

ఆ తర్వాత  NAL లో  ప్రాజెక్ట్ - అవగానే కళ్యాణ వేడుక - మేమిద్దరం అయ్యాము నీకు చేరిక.

అక్కడక్కడా విన్న, నేర్చుకున్న ఒకటి, రెండు మాటలు తప్ప మరి కన్నడ రాదే? మరెలా? అప్పుడు నాకొక ఐడియా వచ్చింది - రోజూ రేడియోలో కన్నడ పాటలు పెట్టుకుని వినేదాన్ని. అలా అలా - ఫర్వాలేదు - అనిపించేలా నీ భాష నేర్చుకున్నాను.

నీకు గుర్తుండే వుంటుంది - మేమప్పుడు విద్యాపీఠ్ సర్కిల్ లో వుండేవాళ్లం - ముద్దమ్మ, మంజునాథ్ గార్ల ఇంట్లో.  నేను వాళ్ల ఇంటి ఆడపడుచునైనట్టు గారంగా చూసేవాళ్లు. ఆ ఇంటిపైన ఒంటి గదిలో వుండే ఇందిరమ్మ గారు నన్ను ಪುಟ್ಟು ಗೌರಿ అని ఎంతో అభిమానంతో పిలిచేవారు.

ముద్దమ్మ వాళ్ల షాప్ పేరు - ಯಶಸ್ವಿ ಆಟೋಮೊಬೈಲ್ಸ್ & ಹಾರ್ಡ್ ವೇರ್ - ని - ఆటో మొబైల్సో- హార్డో వేరో -అని చదువుకుని తెగ నవ్వుకునేవాళ్లం నేను, బదరి. అదే కాదు ప్రతి షాప్ పేరుని షాపో, స్టోరో అని అన్నిటికీ ఓ-కారమాపాదించే వాళ్లం.

ఆ ఇంటి వెనకాల వుండే హనుమక్క గుర్తుందా? ఆవిడకి ఇద్దరు అబ్బాయిలు - ఇద్దరూ ఆటో నడిపేవాళ్లు - ఆటో నడిపేవాళ్లకి అంతంత పెద్ద ఇళ్లు వుంటాయని నీ దగ్గరికి వచ్చాకే తెలిసింది. ఆ హనుమక్క అంటే ఆ వీధిలో అందరికీ భయం - వాళ్ల అబ్బాయిలు కొంచెం రౌడీయిజం చలాయిస్తారని - మరి అంత  గట్టిగా లేకపోతే అన్ని ఆటోలు మేనేజ్ చేయడం కష్టమేమో కదా?! అందరితో పాటే నేనూ భయపడి ఆవిడ ఎదురుగా వచ్చినా తలా వంచుకునో, కళ్ళు తిప్పుకునో - ఆవిడని చూడనట్టు గబగబా దాటిపోయేదాన్ని - నీకు తెలుసు కదా!

ఒకసారి ఆషాఢమాసంలో - చిన్నప్పట్నుంచీ వస్తున్న అలవాటుగా - ఆదివారం పెట్టుకోవడానికి గోరింటాకు, తినడానికి  ములగాకు దొరకలేదని - నేను అదేదో నా బాధ - ప్రపంచ బాధ అన్న ధోరణిలో తెగ బాధపడిపోవడం ఎప్పుడు విందో గానీ ఆవిడ - ఒక శుక్రవారం సాయంత్రం పూట - దాదాపు ఆకంతా పూతతో సహా దూసేసిందా అనిపించేలా గోరింటాకు, కొమ్మలన్నీ విరుచుకొచ్చిందా అనుకునేలా ములగాకు - ఆపసోపాలు పడుతూ నేనున్న మేడమీదనున్న ఇంట్లోకి తెచ్చిచ్చి - ತೊಗೋ ನಿಂಗೆ ಇದೆಲ್ಲಾ - అన్న సమయాన ఆవిడ ప్రతీ ఏడాది పందిళ్లు వేయించి ఉత్సాహంతో జాతర జరిపించే ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ లాగే కనిపించింది అనుకో! అంతే - ఆ తర్వాత మరింకెప్పుడూ మాట్లాడలేదు కానీ - ఆ వీధిలో నేనటూ, ఇటూ తిరిగే టైంలో - ఆవిడ వాళ్లింటి గోడమీంచి నన్ను చూసేదని నాకు తెలుసని ఆవిడకు తెలుసనుకో :))

అదిగో - అప్పుడేగా -ఆ హనుమక్కజరిపించే అణ్ణమ్మ ఉత్సవంలోనే మొదటి సారి నీపేరు బెంగళూరు కాదు బెందకాళూరు అని తెలిసిన రోజు డిగ్రీలో Einstein's Theory of Relativity ప్రూఫ్ అర్థమయినప్పటంత సంబరమేసేసింది.

కొంచెం నువ్వలా అలవాటయ్యావో లేదో - నిన్నింకా తెలుసుకోవాలనిపించింది - అంతే కాకుండా చదువుకున్న చదువు మర్చిపోతానేమో అని బెంగేసి - పుస్తకాలు దులిపి - చేతికొచ్చిన పట్టా - చెట్టా పట్టి - సెయింట్ మార్క్స్ రోడ్ లోవున్న ఇన్ఫోటెక్ కంపెనీల చుట్టూ తిరిగేదాన్ని - నీకు జ్ఞాపకం వుంది కదూ!

అప్పుడే కదా -"మీకు ఎక్సపీరియన్స్ లేదు కదా ఉద్యోగం ఎలా ఇవ్వనూ?" -  అని ITC లో హెచ్చార్ మేనేజర్ సాగదీసి అడిగితే - "మీరుద్యోగం ఇవ్వనిదే ఎక్సపీరియన్స్ ఎక్కడినుంచి తేనూ?!" -  అని అంతకన్నా ఎక్కువగా రాగం తీసి - విసుక్కుని బయటికి వచ్చేశాను.

అదే ఊపులో NIIT లోకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ నన్నూ, నేను కట్టుకున్న కంజీవరం పట్టు-కట్టూ చూసి - బెదురుతూనే  ప్రశ్నలడిగిన తర్వాత - "మీ కారెక్కడ పార్క్ చేసి వచ్చారు" - అని ఆ ఇంటర్వ్యూ చేసినతను అడిగితే - "పక్కనే" - అని చెప్పేసి బయటికి వచ్చి తెగ నవ్వుకున్న నేను, నాతో పాటు ఆ చలి ఎండలో తళుక్కుమన్న నువ్వూ - నాకొక తీపి గుర్తే!

అయినా నాకు తెలీకడుగుతాను - నువ్వే చెప్పు - ఎంత చీరంటే ఇష్టమయితే మాత్రం - ఇంటర్వ్యూకి, ఇంటి-వ్యూకి - ఎక్కడికి పడితే అక్కడికి పట్టుచీర కట్టుకెళ్లిన నాలాంటివాళ్లని ఇంకెప్పుడైనా చూశావా?

ఆ ఇంటర్వ్యూ ప్రహసనాల్లోనే ఒకసారి సిటీ బ్యాంకు లో ఏవో సిస్టమ్స్ ఎనలిస్ట్ కి రిటెన్ టెస్ట్ పెడుతున్నారంటే వెళ్లి రాసి వచ్చి - ఆ రిజల్ట్ కోసం ఎదురు బయట నించుని చూస్తుంటేనే కదా - నా సీనియర్ మైథిలి కూడా కనిపించి ఆ పక్కనే రాజాజీ నగర్ లో ఉంటున్నానని చెప్తే - తనకి తెగ సంబరంగా బదరిని చూపించి - రాసిన పరీక్ష గురించి కూడా మర్చిపోయి - మా SPIC-MACAY కబుర్లు చెప్పేసుకున్నాము.

ఇంతలో పక్కనే ఎవరో తెలిసిన మొహంలా, తెలుగు వెలుగులా కనిపిస్తే - పలకరించి -
అతను " నేను  ఏసీ కాలేజ్ లో చదివాను మీరు తెలుసు, నేను మీకు సీనియర్ ని"  అనగానే -
శాపవశాన మర్చిపోయిన పూర్వజన్మ మళ్లీ జ్ఞప్తి కొచ్చినట్లు - "అవునాండీ ! మీరు మా సీనియరా ? భలే ! అవునూ - మీకు - మీ క్లాస్మేట్ శ్యామ్ సుందర్ తెలుసా?" - అనగానే ఏదో చెప్పబోయిన అతన్ని - సుమ్మనిరి - అన్నట్టు చేత్తో ఆపేసి -

"అదే - మీకు గుర్తు రాట్లేదూ?
శ్యామ్ సుందర్ -
ఘర్ కే అందర్
బడా సుందర్
ఘర్ కే బాహర్
బడా బందర్ -
అని పాడి నవ్వుకునేవాళ్లం -
అతనూ - అతనండీ - అతనే - మీకు గుర్తు లేడూ ??!"

- అని నేను తెగ ఉత్సాహంతో రెట్టించి అడిగేటప్పటికి -

అతను - చిన్న గొంతుతో "నేనేనండీ - ఆ శ్యామ్ సుందర్ ని " అనగానే
అది కూడా పట్టించుకోకుండా - "ఓహ్ ! అవునా - కాలేజ్ లో మిమ్మల్ని ఎప్పుడూ గుండు - టోపీ తో చూసినట్టు గుర్తు - ఇప్పుడందుకే గుర్తుపట్టలేకపోయాను - సారీ - ఏమనుకోకండి" - అని వచ్చేసిన నా తెలిసీ-తెలియని ఆకతాయితనాన్ని  చూసి - పెళ్లి అయినా పెద్దరికం రాలేదని నువ్వు అలిగి ఎర్రటి ఎండ కన్నుతో చూడడం నాకు గుర్తే సుమీ ;)

మరీ బావుంది - చదువయ్యి, యూనివర్సిటీ గేట్ దాటి - పట్టుమని ఆరునెలలు కూడా కాలేదు - అప్పుడే పెద్దవాళ్లయిపోతారేంటి - ఎంత పెళ్ళయితే మాత్రం - మరీను!

 అద్సరే - నాకు అల్సూర్ లోవున్న లిడో థియేటర్ ఎంతో ఇష్టం కదా. అక్కడే కదా - మొదటిసారి  కభీ-కభీ,  ఆఖరిసారి కహూనా ప్యార్ హై - చూసింది ! మొన్ననే ఆ లిడో పేరు వెనకాల వున్న  ఒక తమాషా కథ తెలిసింది - అపర్ణ వాళ్ల తాతగారు లింగణ్ణ గారు, వారి స్నేహితులు దొడ్డణ్ణ గారు కలిసి ఆ థియేటర్ లీజ్ కి తీసుకుని సినిమాలు వేసేవారట. వాళ్లిద్దరి పేర్లలో మొదటి అక్షరాలు తీసుకుని లిడో అని పేరు పెట్టారట - ఇది వాళ్ల అజ్జి చెప్పేవారట.

అవీ - విశేషాలు - ఇప్పటికింతే మరి.

చెప్పటం మర్చిపోయాను - మొన్నా మధ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు - MG రోడ్ చూస్తే చాలా దిగులుగా అనిపించింది - ఈ కొస నుంచి ఆ కొస దాకా - దీపాల వడ్డాణం పెట్టుకుని కళకళలాడుతూ వుండే తను - దుమ్ములో, ధూళిలో మునిగిపోయి - బిక్కుబిక్కుమంటూ వుంటే - నేను పక్కనుంచి వెళ్తూ కూడా అస్సలు గుర్తుపట్టలేదంటే నమ్ము!

అదే టైం లో విజయనగర్ చూస్తే - ప్రాణం లేచి వచ్చింది - తను నేను మొదట చూసినప్పటిలాగే లాగే - పచ్చగా విచ్చిన పూవులా వుంది - కళ్ల నిండా కలలా నింపుకుని వచ్చాను.

ఎప్పుడూ అక్కడే వుండే నీకు తెలీదని కాదు - కానీ కొంచెం జాగ్రత్త - నీ ఉనికే మారిపోయేలా వుంది. 

నీతో వున్న అన్ని రోజులూ హాయిగా గడిచిపోయాయి అనుకో - ఎంత హాయి అంటే మాటల్లో చెప్పలేను - పాట లో మాత్రం చెప్పగలను - ಇದೇ ನಾಡು ಇದೇ ಬಾಷೆ ನನ್ನದಾಗಿರಲಿ - ಎಲ್ಲೇ ಇರಲಿ ಹೇಗೇ ಇರಲಿ ಕನ್ನಡವೇ ನನ್ನ ಉಸಿರಲ್ಲಿ ... 

మొదటిసారిగా అడుగుపెట్టిన విజయనగర్ 
చదువు గట్టెక్కించిన మారతహళ్ళి 
వెన్నెల్లో చూసిన విధాన సౌధ 
ఎర్రగా మెరిసే హై కోర్ట్ 
సాంస్కృతిక కేంద్రం బెంగళూరు పాలస్ 
నడిచి తిరిగిన NR కాలనీ 
పువ్వులతో నవ్విన లాల్బాగ్ 
నందిని వున్న నటికలప్ప సర్కిల్  
మురిపించిన మెజెస్టిక్ 
మెరిసిపోయే మహాత్మా గాంధీ రోడ్ 
కాల్మోపనివ్వని చిక్ పేట, బళె పేట 
కన్ను తిప్పనివ్వని కమర్షియల్ స్ట్రీట్ 
కళా నైపుణ్యపు కావేరి 
కలల లోకపు బ్రిగేడ్స్ ... 
ఇంకా శివాజీ నగర్, KR మార్కెట్ 
ఒకటా రెండా - ఎన్నో - ఎన్నెన్నో గుర్తులు నీతో నాకు 
ఇప్పటికి నువ్వలా లేవు కానీ 
అప్పటి నీ జ్ఞాపకాల్లోనే - ఎప్పటికీ నేను 

అసలెప్పటికీ నిన్ను వదిలి వెళ్దాము అన్న ఆలోచనే వుండేది కాదు మాకు - కానీ  - సర్లే -ఇంత  దూరం వచ్చేశాక బెంగ పడద్దూ అని చెప్పి ఓదార్చడానికి - ఇంకా నీవంటూ జ్ఞాపకాలు మాతోనే వున్నాయి -  కాబట్టే బెంగళూరు వయ్యావు. 

ఇప్పటికీ ఎక్కడ కన్నడ మాట విన్నా కమ్మటి నీ తలపే...

అప్పటి రోజుల్ని అందంగా గుర్తు చేసే ఈ పాటతో నిన్నుతలుచుకుంటూ: భలే భలే చందద చెందుళ్ళి హెణ్ణు నీను - మించు కూడ నాచువ మించిన బళ్ళి నీను 





నీ మీద బెంగతో,
నిన్ను వదిలి వచ్చిన నేను


8, అక్టోబర్ 2016, శనివారం

ఓసినిమాకు ప్రేమతో...



మాటలు, పాటలు, జోకులు - ఈ మూడూ మామూలు మనుషులకీ,  సినిమా ప్రేక్షకులకీ కామన్. కానీ మామూలు మనుషుల్నుంచి  సినిమా ప్రేక్షకులని వేరు చేసేదే  సినిమా.


ఇదిగో ---- ఇలా అనుకునే ...


"శుక్రవారం కదా - సినిమా ఏమైనా చూద్దామా" -  అని బదరి అనగానే - నిన్న శుక్రవారం - గబగబా వంట చేసేసి, భోజనాలు కానిచ్చేసి - వాషర్లో బట్టలు వేసి - హడావిడిగా వచ్చి సోఫాలో కూర్చున్నాను.


పాపం! అప్పటికీ తను ఏ ఎయిర్ లిఫ్టో, మదారీనో చూద్దామని చెప్తూనే వున్నా - నిన్నటి నా నక్షత్రాలు బాలేవో ఏమో - వినకుండా -  ఏమయినా తెలుగు సినిమా చూద్దామా అని తెగ విసిగించేసరికి - మొత్తానికి ఒక తెలుగు సినిమా పెట్టారు.


పొగాకు పండించడం, సిగరెట్లు తయారు చేయడం నిషేధించగలిగితే  జనం మారతారు కానీ - కాలిస్తే ఇలా అవుతారు - అని చూపిస్తే చూడడం మానేస్తారు తప్ప కాల్చడం కాదు - అన్న చిన్న ప్రాథమిక సూత్రం తెలియని ఒక బాధ్యతా-పూజ్యయిన ప్రకటనతో సినిమా మొదలు.


మొహం పక్కకి తిప్పుకుని, టీవీ మ్యూట్ లో పెట్టి మొత్తానికి ఆ ప్రకటన పూర్తి కాగానే - సౌండ్ పెడితే హీరో గారి గొంతుతో ఒక ఇంకొక బాదాపూరిత ప్రకటన -




రోడ్డు మీద ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి 
మనం సక్రమంగా వెళ్తున్నాకూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి 
మీమీదే ఆశలు,  మీమీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురుచూస్తుంటారు 
మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలోనూ జరగకూడదని ఆశిస్తున్నాము




- అంటూ.


అది చదువుతూ, వింటూ సినిమా చూస్తున్న మేమిద్దరం అనుకున్నాము - "ఎవరింట్లో ఏమయిందబ్బా?" - అని.


"సర్లే - మనమసలే మన దేశానికి, ఊరికి దూరంగా వున్నాము - ఏదో జరిగి వుంటుంది - అన్నీ మనకి తెలియాలని రూలేం లేదు కదా" - అని సర్దేసుకుని మా సినీ-వీక్షణం కొనసాగించాము.


కానీ అది మాకు - మా IQ లెవెల్ కి పరీక్ష పెడుతూ కోడ్ భాషలో చెప్పిన సందేశం అని సినిమాలో కొంచెం ముందుకు వెళ్లాక ఇదిగో - ఇలా అర్థం అయింది :


ఈ సినిమా పెట్టుకుని చూసేటప్పుడు జాగ్రత్తలు వహించండి 
మనం ఏదో వినోదం ఉంటుందని అనుకున్నాకూడా ఎన్నో విపరీతాలు పొంచి ఉంటాయి 
మీ మానసిక ఆరోగ్యం మీదే ఆశలు,  మీమీదే ప్రాణాలు పెట్టుకున్న పిల్లలు మీ ఇంట్లో మీతోనే వున్నారు 
మా కుటుంబంలో చూసిన  సినిమా  ఏ కుటుంబంలోనూ చూడకూడదని ఆశిస్తున్నాము


అలా -  అది అర్థం చేసుకునే తికమకలో మేముండగానే - సినిమాలో / వెనక పనిచేసిన వాళ్ల పేర్లు చదవ(లే)కుండానే అయిపోయాయి.


ఇంతకు ముందు ఈ పోస్ట్ మొదట్లో నేను రాశానే - అలాంటి తేడాలు - "ఆకలి, @@@, నిద్ర; ఈ మూడూ మనుషులకీ, జంతువులకీ కామన్. కాని మనుషులనుంచి జంతువులని వేరు చేసేదే ఎమోషన్" అంటూ - ఇంకా ఏంటేంటో ఏవో మనసులో అనుకుంటూ (మాకు బాగా వినిపించేలా) - సీరియస్ గా నడుచుకుంటూ వస్తూ  -


పెరట్లో నూతి చప్టా మీద కడగడానికి పెట్టిన నేతి గిన్నె ఎత్తుకు పోబోతున్న కాకిని ఎగిరి తోలే హడావిడిలో -

దార్లో అడ్డు వచ్చే నీళ్ల గంగాళాలు, డేగిసాలూ - లాంటి వాటిమీద దూక్కుంటూ -  వెళ్లే వాడిలాగా హీరో -

రోడ్డు పక్కనున్న బెంచీల మీద కూర్చున్న బ్రిటిష్ వారిమీదుగా దూకి - వస్తూ వుంటాడు.


చూడగానే అనుకున్నాను - ఈ అబ్బాయి కిందటి సినిమా దాకా  బానే ఉండేవాడు - ఈ హీరోకి ఆ గడ్డం, హరిదాసు కొప్పు పెట్టిన వాడికి (అదే hair-stylist కి) ఈ సినిమా వరసగా పది షోలు చూపించినా పాపం లేదు - అని.


ఇంతలో - ఆ హీరో వచ్చేసి - రోడ్డు మీద వున్న ఓ నలుగురిని - గాలిలో కనిపించని నైలాను తాళ్లు పట్టుకుని ఊగుతూ - తన్నేసి కొట్టేసి కింద పడేస్తాడు. ఎందుకబ్బా ఈ హడావిడి అని నోరు తెరుచుకుని చూస్తున్న నాకు - ఒక పది నిముషాల తర్వాత అర్థం అయిందేంటంటే - ఇల్లిక్కడ మొదలయిన మన స్వచ్ఛ భారత్ ని అల్లక్కడ లండన్ దాకా మన తెలుగు సినిమా పట్టుకెళ్లి అంతర్జాతీయ ఖ్యాతి పాల్జేసిందనిన్నీ  - ఆ హీరో అంత హడావిడీ చేసింది - ఆ నలుగురిలో ఒకడు తాగేసిన కాఫీ కప్పు డస్ట్ బిన్ లో వేయబోయి కింద పడినందుకూ అని.


ఇంతకీ లండన్ లో ఇలా రోడ్ల మీద పడి కొట్టేసుకుంటూ ఉంటే పోలీసులు రారేమో - లేకపోతె - అదేదో పోలీసులు పొరపాటున కాలు కాదు కదా వేలు కూడా మోపని -  మా షికాగోలో వుండే దీవాన్ స్ట్రీట్ లాంటి వీధేమో అనుకుందామనుకుంటే - మనసొప్పలేదు కానీ - అలాగే సరి పెట్టేసుకున్నాను. ఎక్కువ ఆలోచిస్తే సినిమా చూడాలనిపించదు.


అసలే - మా ఇంట్లో ఒక సినిమా రూలు వుంది - మొదలు పెట్టరాదు, పెట్టి ఆపరాదు - అని.


ఆ రూలు ప్రకారం సినిమా చూసే ఇద్దరిలో ఎవరు ఒక రెండు మూడు నిముషాలకైనా  సోఫాలోంచి కదిలి అవతలికి వెళ్లాల్సి వచ్చినా వాళ్ళు తిరిగి వచ్చేదాకా సినిమా తాత్కాలికంగా నిలిపివేస్తాం.


సినిమాలో - కల కంటూ ఉలిక్కి పడి లేస్తున్న హీరోయిన్ ని పరిచయం చేస్తున్న సీన్ మొదలయింది.


అప్పటిదాకా పక్క రూములో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న బుజ్జి జింకకి నిద్ర వస్తోందంటే బదరి లేచి వాడిని పడుకోబెట్టి దుప్పటి కప్పడానికి వెళ్లారు.


నేను గమనించలేదు కానీ - టీవీ రిమోట్ సోఫాలో ఈ చివర కూర్చున్న నా చేతి కందనంత దూరంలో పెట్టి వెళ్లారు.


అది ఒక పది నిముషాలయినా ఆ మైండ్-బ్లోయింగ్ IQ "testing" సినిమా నుంచి తప్పించుకోవడానికి తను వేసిన ఎత్తని నాకప్పటికింకా అర్ధమయ్యే స్థితిలో లేను నేను.


ఎందుకంటే కనురెప్పపాటులో - imaginary లంబ కోణాలు, సరళరేఖలూ గీసేస్తూ -  ఫిజిక్స్ లోంచి బయాలజీ లోకి - ఆక్కడినుంచి కెమిస్ట్రీ లోకి దూకేస్తూ - నా కళ్ళముందు నేను తప్పించుకున్న చిన్నప్పటి ట్యూషన్ లన్నీ గుర్తు చేసేస్తూ - మోకాలి మీద కొడితే మెదడు దెబ్బతినే లాజిక్కులు చెప్తూ సినిమా తెర అంతటా - దర్శకత్వ విశ్వరూపం.


ఈలోగా వాషర్ లోంచి తీసి  డ్రైయర్ లో వేసిన బట్టలు ఆరాయి అన్నట్టుగా కుయ్-కుయ్ అని డ్రైయర్ భాషలో తీయ్-తీయ్ అని సిగ్నల్ వచ్చింది.


"మీరేం సినిమా ఆపక్కర్లేదు" అని చెప్పి నేను వెళ్తూ ఉంటే - "హన్నా! నువ్వు అసలు మిస్సవ్వడానికి వీల్లేదంటే వీల్లేదు" అని పాజ్ చేసేశారు బదరి.


ఈ సినిమాలో విలన్ తెలివైనవాడు. హీరో అతి తెలివయినవాడు. ఆఖరికి ఏ తెలివీ వుండకూడని - వున్నా చూపించకూడని అపర-తెలుగు హీరోయిన్ కూడా తెలివయినదే . ఏదో వెంట్రుక ముక్క పట్టుకుని - ఆ వెంట్రుక తాలూకు DNA పరీక్ష ఎవరి బ్లడ్ శాంపుల్ తో జరిగిందో తెలుసుకోవడానికి జైలుకి వెళ్తుంది. అనుకోకుండా వాళ్లమ్మని కలుస్తుంది. కల నిజం చేసిన హీరోని ఆరాధనగా చూస్తుంది.


ఏమాటకామాట చెప్పుకోవాలి - ఆ యూరప్ జైలు గార్డులు తెలుగులో మాట్లాడుతూ ఉంటే నా తెలుగు-ప్రేమిక హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది - ఐరోపా సామ్రాజ్యపు పౌరుల నోట బడి - ఢోకా లేనిదాయె పో మన తెలుగు పలుకుబడి - అని .


ఇంతకీ అందరూ తెలివయిన వాళ్లే అయిన ఈ సినిమాలో - ఎవరి కారణంగా అయితే తనకు బాధ కలిగిందో వాళ్ళని ఏమీ అనలేకపోతే - తనకు అందుబాటులో వున్నవాళ్లమీద పడి కొట్టి కోపం తీర్చుకుంటూ వుంటాడు హీరో. అలా కొట్టేసి "సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో - జీరో ఎమోషన్స్ జీరో ఎనెమీస్ " అంటుంటాడు.


ఈ  నేచర్లో ఎక్కడో జరిగే ఒక ముమెంట్ ఇంకెక్కడో ముమెంట్ ని డిసైడ్ చేస్తుంది  - అన్నది అతని లాజిక్ - అదేంటో సీతాకోకచిలుకల రెప్పల అడుగున పుట్టే గాలికి అమెరికాలో తుఫానులు వస్తాయిట.


ప్రతి సినిమాలోనూ చక్కగా నోరారా మాట్లాడే ఆ మనవడ్-హీరో-ధాత్తుడు  - అలా పళ్లు బిగబట్టి మాట్లాడుతూ ఉంటే  - సగం సినిమా అర్థమే కాలేదు :( 


ఇంకందులో అతను చెప్పిన లాజిక్కులు - మేధ-మే-ట్రిక్కులు అర్థం చేసుకునే ఓపిక లేకపోయింది - అసలే వారాంతపు-బ్రెయిన్ ఆయె! చురుకుపాలు తక్కువ - కబుర్లపాలు ఎక్కువ కదా మరి!


మొత్తానికి సినిమా తెర మీద ఎగురుతున్న నీలి సీతాకోక చిలుకల సాక్షిగా సినిమా చూసేశాము - అనిపించేశాము - సతీపతులం - మేమిరువురం.


ఈ సినిమా లోని ఎమోషన్ కి నా రివర్సెమోషన్ - దర్శకులకి మాత్రమే!


సినిమా చూసేవాళ్లని మూడురకాలుగా చెప్తాను
[ఈ కింద వున్న నిర్వచనాలకి స్ఫూర్తి ఇదిగో ఇక్కడ: Youtube ] :))


1) చూసేసేవాడు   2) చూద్దామనుకుని - ఆలోచించి చూసే వాడు  3) చూడకుండానే చూసినట్టు చెప్పేవాడు


1) చూసేసేవాడు 


వేరే వాళ్లు తీసిన సినిమాలో కాకుండా - మీరు తీసిన సినిమాలోనే కథ వుందని తను అనుకోవాలని - మీరు అనుకుంటారు కాబట్టి మీ  సినిమా రిలీజ్ చేస్తారు.
వాడు  వేరే సినిమా చూస్తాడు
అయినా బుక్కయిపోతాడు.


2) చూద్దామనుకుని - ఆలోచించి చూసి వాళ్లు


మీరు తీసిన సినిమాలోనే కథ వుందని తను అనుకోవాలని -  వేరే వాళ్ల సినిమా తను చూడకూడదని మీరు అనుకుంటారని - తను అనుకుంటాడు కాబట్టి -
మీ సినిమా మానేసి వేరేవాళ్ల సినిమా చూద్దామనుకుంటాడు -
ఇలా ఆలోచించి చూసి మరీ బుక్కయిపోతాడు.


3) చూడకుండానే చూసినట్టు చెప్పేవాడు  - అంటే (ఒక్కోసారి-మా లాంటి) వాడు


మీరు తీసిన సినిమాలోనే కథ వుందని - మీరు అనుకుంటారని  - తను  అనుకోవాలని ... మీరు అనుకుంటున్నారని తను అనుకుంటున్నాడు కాబట్టి
అసలే సినిమాలూ చూడకుండా రివ్యూలు చదివేసి కథంతా తెలుసు అన్నట్టు మాట్లాడుతూ వుంటాడు -
మీరు బుక్కయిపోతారు


అసలు ఈ మధ్య సినిమాలు చూసీ చూడని తెలివైన సినిమా ప్రేక్షకుడు ఎలా చూస్తున్నాడో తెలుసా?!
సినిమాలు డబ్బులు పెట్టి థియేటర్లో చూడకుండా-
Pay-per-view లో కూడా చూడకుండా-
youtube లోనో-
సగం చూపెట్టి మళ్లీ  రెండు గంట తర్వాత మిగిలిన పార్టు డౌన్లోడ్ చేసుకో అనే సైట్ లోనో-చూస్తున్నాడు
అప్పుడు ఆ సగం చూసి మిగిలిన సగం చూడకుండా మానేస్తాడన్నమాట .
అలా - తెలివిగా -  పూర్తిగా బుక్కై పోకుండా తప్పించుకుంటున్నాడు. 


మీ సినిమాలు అలా ఫ్రీగా చూసేసి - సినిమా ఎలాతీసినా ప్రేక్షకుడు చూసేస్తాడు అనుకునే ధీమాకి ప్రతీక ఈ దర్శకుడు  - అనేసుకుని - వీకెండ్లో మీ సినిమా చూశానన్న విషయమే గుర్తులేనట్టు - సోమవారం పనిజీవనస్రవంతి లో కలిసిపోతాడు.




కొసమెరుపు:

అలా ఈ ఆశ్వీయుజ మాసపు శరన్నవరాత్రుల - శుక్రవారపు రాత్రి తెలుగు సినిమా చూసి - ఆ సినిమాతో ప్రభావితులమయ్యి - ఆ సినిమా చూసి కలిగిన ఎమోషన్ ని టీవీ పగలగొట్టో, వైర్లు తెంపేసో తీర్చుకోలేక - ఎదురెదురుగా సోఫాల్లో కూర్చుని - ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలోనుంచి ఇప్పటిదాకా - ఏవేవో అక్కర్లేనివన్నీ గుర్తు తెచ్చుకుని - తెల్లవారుఝామున రెండున్నర  దాకా - నువ్విలా చేశావు అని బదరి నన్నంటే - కాదు మీరే అర్థం చేసుకోలేదు నన్ను - అని నేనంటూ .... మా ఎమోషన్స్ ని జీరో చేసేసుకున్నాము 


సో ఇప్పుడు మా ఎమోషన్ జీరో - జీరో ఎమోషన్స్ జీరో సినిమాస్!





సారీ - నా బ్లాగ్ చదివేవాళ్ళూ! నేనిదంతా రాసింది మీ మీద కోపం తో కాదు ఆ సినిమా చూసిన ప్రేమతో.


ఓసినిమాకు ప్రేమతో...
ఓసినిమాకు ప్రేమతో...
ఓ ...ఓ ... ఓ ... ఓ ... 










1, అక్టోబర్ 2016, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 2 - అప్ప-దొడ్డ

అప్ప ...
తెల్ల గ్లాస్కో పంచె, తెల్లటి చేతుల బనీను
పెదవుల మీద ఎప్పుడూ చిన్న నవ్వు - కనీ కనిపించకుండా
మరి మాటో - మంచి ముత్యమే -
అరుదుగా మృదువుగా -  వినీ వినిపించకుండా

జీవితం తనకెంత ఇవ్వగలదో తెలిసి -
అంతకన్నా ఎక్కువ ఆశించక
అలా అని ఇంతేనా అని  నిర్వేదించక
అంత కన్నా ఎక్కువిమ్మని వేధించక
అంతటినీ నెమ్మదిగా ఆస్వాదిస్తూ 
ఎంతో తృప్తి గల జీవితం గడుపుతున్నారు - మా అప్ప.

ప్రాథమిక విద్య అనాతవరంలో - కాలేజ్ విశాఖపట్టణం - ఆంధ్రా యూనివర్సిటీ లో FL
తొలి చూపులోనే ఇష్టపడిన లలిత దొడ్డతో పెళ్లి విశాఖ లోనే
మొదటి  ఉద్యోగం విజయవాడ - విజయా మెడికల్ సిండికేట్
పిదప ఒరిస్సా - కటక్ కి - అదే కంపెనీ లో మేనేజర్ గా - బదిలీ 
ఇంతలో తాతగారు స్వర్గస్థులవడంతో అనాతవరం  చేరారు మళ్లీ

అలా కటక్ నుంచి వస్తూ అప్ప తెచ్చుకున్న వస్తువుల్లో ఆయనకి ఇష్టమయినది మర్ఫీ రేడియో

అనాతవరం చేరిన అప్ప -  తనకంటూ నిర్దిష్టమయిన దినచర్య పాటించేవారు - అది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు

ఇప్పటికీ 84 ఏళ్ల వయసులో కూడా కళ్ళజోడు పెట్టుకోకుండా భారతమో, భాగవతమో చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న అప్ప - వ్యవసాయం చేసే రోజుల్లో -
పొద్దున్న లేచి స్నానం-కాఫీ పానాదులు కాగానే తొమ్మిదింటికి పొలం వెళ్లేవారు
పన్నెండింటికి భోజనం - ఆ తర్వాత ఒక గంట నిద్ర
మూడున్నరకి కాఫీ - అయిదింటికి మళ్లీ పొలం వెళ్లేవారు
ఎనిమిదింటికి రాత్రి  భోజనం
అప్ప దినచర్యని బట్టి గడియారం గంటలు కొడుతోందా అనిపించేంతగా సమయం పాటించేవారు - పాటిస్తున్నారు.

నేను, పప్పీ, కుట్టీ - అమ్మ-నాన్నలతో కలిసి దాదాపు ప్రతి  సంక్రాంతికీ, వేసవికి అనాతవరం వెళ్లేవాళ్లం.
గుర్రబ్బండి దిగి ఇంటి మెట్లు ఎక్కుతూ వుండగానే ఎదురొచ్చే అప్ప - చిన్న నవ్వుతోనే పలకరించేవారు - "ప్రయాణం బాగా జరిగిందా" - అంటూ. ఆ పలకరింపుకే అప్ప మాతో మాట్లాడారు అని మురిసిపోయేవాళ్లం.

ఇంట్లోకి వెళ్ళీ వెళ్లడంతోనే ఎటు వైపు చూసినా ఊరిస్తూ బోల్డన్ని పుస్తకాలు  - అలమారుల్లో వుండేఅలెగ్జాండర్ డ్యూమాస్ - కౌంట్ ఆఫ్ ది మాంట్ క్రిస్టో లాంటి క్లాసిక్స్ నుంచి వారం వారం వచ్చే వారపత్రికలు, మాసపత్రికలు, తెలుగు-ఇంగ్లీష్ చందమామలు, హిందూ పేపర్, తెలుగు పేపర్లు - ఎటు చూసినా సరస్వతీ కటాక్షమే! నట్టింట తిరిగే లలిత దొడ్డ మహాలక్ష్మీ రూపమే. వేసవి సెలవులకి మేమే  కాక విశాఖనుంచి వచ్చే లలితత్తయ్య, స్వాతి - ఇల్లంతా పిల్లలతో మహా సందడిగా వుండేది.

మధ్యాహ్నం భోజనాలు కాగానే అందరం కలిసి ఉయ్యాల బల్ల మీద ఎక్కి పాడుతూ, కేరమ్ బోర్డు ఆడుతూ తెగ హడావిడి చేస్తూ వుండేవాళ్లం. మేమెంత గొడవచేసినా - ఎప్పుడూ అప్ప పిల్లలని విసుక్కోవడం కానీ, ఇలా ఉండొద్దు - అలా చేయొద్దు అని చెప్పడం కానీ - చేయడం గుర్తులేదు. ఆయన మధ్యాహ్నపు నిద్రకి గదిలోకి వెళ్లినా మా సందడి మాదే. పైగా పిల్లలు కాకపోతే అల్లరి ఎవరు చేస్తారు అని ఇంట్లో అందరూ మమ్మల్ని సమర్థించేవారే.

నెలకొకసారి అప్ప అమలాపురం వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చేవారు. రోజూ గ్లాస్కో పంచె లో చూసే అప్పని ఆరోజు పాంటూ-షర్టులో చూడడం కొత్తగా అనిపించేది.

ఇంక ఇంట్లో ప్రతి వస్తువూ A place for everything, everything in its place అన్నsaying మా అప్పే చెప్పారేమో అన్నట్టు వుండేది. ఇంటికి వచ్సినవారు ఎప్పుడయినా ఏదయినా మర్చిపోయి వెళ్తే ఆ వస్తువు మళ్లీ వారు ఇంకోసారి ఇంటికి వచ్సినపుడు వారికి భద్రంగా అందజేయబడేది. 

మా అప్ప చల్లటి వటవృక్షపు నీడ 
అలా అని పసి మొక్కలనెదగనీయని స్వార్ధపు ఛాయ కాదు 
తన వేళ్ల బలంతో పిల్లలకి వెన్నుదన్నుగా వుంటూ 
వారిని స్వేఛ్చగా ఎదగనిచ్చిన పెద్దతనపు జాడ 

ఈరోజుకీ - ప్రతి సంక్రాంతికి - ఎక్కడెక్కడ వున్న కొడుకులూ-కోడళ్లు, కూతురూ-అల్లుడు లతో పాటు - మనవలూ - నవరాళ్లూ - చదువుకుంటున్నవాళ్లు-ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు - అందరూ పండగకి తాతగారి ఇంటికి రావాల్సిందే - ఒక్క రోజుకైనా సరే. వారిని కళ్లారా చూసుకుని మౌనంగానే ఆనందించే మా అప్పని చూడాల్సిందే!

మా అప్పని తలచుకుని నేను రాసుకున్న ఒక Haiku -


Roots embrace the earth 
Branches spread high to the sky 
Growth happens quietly 


ఈ రోజుకి లలితా-వియోగపు గరళాన్ని కంఠాన నిలిపి  రోజులో ఎక్కువభాగం పుస్తక పఠనంలోనే గడుపుతున్నారు మా అప్ప - తపోముద్రలోని "సోమేశ్వరుడై"!

దొడ్డ... 
మహాలక్ష్మి లాంటి రూపు 
పొల్లు రానీయని పటికబెల్లపు పలుకు 
పేరుకి తగ్గట్టు లలిత కళలంటే మక్కువ 
తనవారిని చేర్చు అక్కున 

మా నాన్న మాటల్లో చెప్పాలంటే - 

" నేను మా అన్నగారికన్నా 12 ఏళ్లు చిన్న. మా వదిన గారు ఎక్కడికి వెళ్లినా చిన్నవాడినైన నన్ను తోడు తీసుకెళ్లేవారు - మా లక్ష్మణ స్వామి అని. 
నాకు బోటనీ రికార్డులో బొమ్మలు వేసి ఇచ్చేవారు.
ఒకసారి నా ఫ్రెండ్ వచ్చాడు - సిగరెట్టు కాల్చుకుందాం రా అని. మా వదిన గారు పక్కనే వున్నారు. ఆవిడకి అర్థం కాకూడదని తిరగేసే-భాషలో " గిసిటెర్రు చెత్తాను - దప" అన్నాడు.వెంటనే మా వదిన గారు "గవ్విటెప్పె సీతుకుని ళెవ్వండి" అన్నారు. 
అలా నాతో చాలా సరదాగా, అభిమానంగా వుండేవారు"

లలిత దొడ్డ తన నోట పొల్లు మాట రానిచ్చేవారు కాదు - మేమెవరమయినా పొరపాటున తప్పు మాట అన్నా "మంచి మాటలెన్నో వున్నాయి - ఆ మాట ఎందుకు? " అనేవారు. ఆఖరికి సినిమా పాటల్లో అయినా విషాద గీతాలు పాడనిచ్చేవారు కాదు. మా ప్రసాద్ ఎప్పుడయినా "గాలివానలో - వాన నీటిలో" పాట పాడబోతే వంటింట్లో ఎక్కడో వున్నా ఆవిడ కూడా గబగబా హాలులోకి  వచ్చి "ఇంకేదయినా మంచి పాట పాడు ప్రసాద్" అని చెప్పి ఆ పాట మాన్పించేసే వారు.  

నాకు తెలిసి మా చిన్నప్పుడు -
లలిత దొడ్డ వంటిల్లు-నట్టిల్లు దాటిరాని అసూర్యంపశ్య 
మడి చీరతోనే వంట - భోజనం
మధ్యాహ్నం నట్టింటి గడపమీద తలపెట్టుకుని తీసీ తీయని కునుకు 
తోడికోడలైన మా అమ్మతో - గల-గలా మాట్లాడుతూ 
హడావిడిగా తిరుగుతూ - అలుపన్నదే లేదేమో అనిపించే చైతన్య ఝరి 
తీరిక వేళల్లో తనకి మనసై జరిపే మోహన రాగపు వాయులీన కచేరి 

రెండేళ్ల క్రితం భాద్రపదంలో ఇహం ఇక చాలంటూ తరలి వెళ్లి పోయినా 
ఆవిడ రాసిన కవితలో ఆవిడే ఆశీర్వదించి వెళ్లారు 
ఎప్పటికీ  ఆనంద నిలయంలా వుండాలి  - మా దివాణం  అంటూ !






లలిత దొడ్డ రాసిన కవిత: ఆనందనిలయం

అది ఒక "బుల్లి-సూర్య" మందిరము 
సరస్వతీ నిలయము 
బాలలతో సందడివుండు 
పాటలతో రేడియో ఎల్లప్పుడు. 
రామ-లక్ష్మణులు నాని-బాబిలు 
అంతా శ్రీనివాసుని కృపాకటాక్షము 
సూర్యకాంతి ప్రకాశించు ఎల్లప్పుడు 
షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం
మాయిల వేలుపు.
మా యింటికొలువు మా వేలుపు
లలితకళానిలయంగా వుండాలని
మా కోరిక మృదుమధుర సంభాషణ
చతురలలిత
ప్రశాంతి నిలయం 
సాహిత్యసంగీతమందిరము 
దురాశకి తావులేని  ఆనందజీవితం 
లాలిత్యమైన మనసు
గంభీరమైన నాని-బాబిలు 
                                                                పేరెన్నిక గన్న దివాణం.





24, సెప్టెంబర్ 2016, శనివారం

కారే చోదకులు?! కార్లను నడపరే! - (అంతం కాదిది)

 ఆరంభం ఇక్కడ చదవండి : కారే చోదకులు?! కార్లను నడపరే! - (ఆరంభం)

సరే! డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది.
బస్సులో ఆఫీసుకి వెళ్లాలనుకున్న బదరి నిర్ణయం బావుంది 
ఇంటిముందు కట్టేసిన ఎర్రైరావతం లాంటి టొయోట కరోలా వుంది
జాబ్-మార్కెట్ డిప్ పుణ్యమాని ఇంకా రాని ఉద్యోగముంది
ఇంకేం కావాలి - నాలాంటి అత్యౌత్సాహిక చోదకులకి !?

ఇంతకీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన రోజెలాంటిదంటే...
ఎండాకాలపు మంట మండే రోజు
Kerry గుండె దడ దడలాడిన రోజు
చిన్నప్పుడు బడి రోజులలో కొంచెం ఇష్టమయిన రోజు
సెలవులయిపోయాయని మదికి మరి కొంచెం కష్టమయిన రోజు
అదే నాకెప్పటికీ గుర్తుండే జూన్ నెలలోని 13వ రోజు.

మరలాంటి రోజు లైసెన్స్ తెచ్చుకున్న చేయీ-కాలూ వూరికే వుండమంటే వుంటాయేంటి మరి?

పింకు టీ-చొక్కా, నీలి జీన్సు, పచ్చ కళ్లజోడు - ఎర్ర కారు - వ్వాటే కాంబినేషన్ ! బయల్దేరాను.

మేముంటున్న స్టీపుల్ చేజ్ అపార్టుమెంటు  పార్కింగ్ లాట్ లోంచి కారు రివర్స్ చేసి బయటికి వచ్చి ఎడమ పక్కకి మెక్ కెల్వీ రోడ్ లోకి తిరగగానే - అక్కడ గడ్డిలో కలుపు తీయడానికి వంగి వున్నజిమ్ము (Jim), పక్కనే ఆ తీసిన కలుపు వేయడానికి లాన్-వేస్ట్-బాగ్ పట్టుకుని నించుని వున్నజాకు (Jack) - ఒక్క సారిగా వాళ్లు చేసే పని ఆపి - ఎవరా అని కారుకేసి చూసి - స్టీరింగ్ పట్టిన నన్ను చూసి - ఉలికిపడినవారై - O man! Dangerous driver - అని చెరొక్క గెంతూ గెంతారు - నవ్వుతూ.

నేనంత కన్నా విలాసంగా నవ్వుతూ The grass is greener on the other side అంటారు ఈ వెర్రి వాళ్లు - అటే కాదు , ఇటూ పచ్చగానే వుందే  - అనుకుంటూ (అది నా పచ్చ కళ్లజోడు లోకానికి పూసిన హరిత వర్ణమని అప్పటికింకా అర్థం కాక) కారుని ముందుకి పోనిచ్చాను.

 మెక్ కెల్వీ రోడ్ పొద్దున్న పది గంటల తర్వాత కొంచెం ఖాళీగానే వుంటుంది. నెమ్మదిగా స్పీడ్ పెంచడం,  బ్రేక్ వెయ్యడం, తగ్గించడం - ఇలా మొత్తానికి కారుతో నేనూ, నాతో కారూ - కొంచెం కొంచెంగా అలవాటు పడుతూ సాగుతున్నాము.

ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది - బదరి పదే పదే గుర్తు చేసిన విషయం - బ్రేక్ వేసేముందు ఒకసారి rear-view mirror లో వెనకాల కార్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలని. అరెరె! ఇంత సేపూ ఆ రూలు మర్చిపోయానే అనుకుని - ప్రతి రెండు నిముషాలకి బ్రేక్ వేయడం, వేసే ముందు అద్దంలో చూడడం చేయడం మొదలుపెట్టాను. అలా చూస్తూ అనుకున్నాను - నేనింతకుముందు నడిచి వచ్చే రోజుల్లో ఈ రోడ్డు నల్లగా కనిపించేది , ఇవాళేంటబ్బా కొంచెం గోధుమ రంగులో వుందీ- అని - మళ్లీ - ఈ కారు అద్దంలోంచి చూడడం కదా అలాగే వుంటుందేమో - అని నాకు నేనే సర్ది చెప్పేసుకున్నాను.

ఇంతలో ఒకటి రెండు కార్లు - ఆ సింగిల్ లేన్ రోడ్ లో ఎదురుగా ఏ కార్లూ రాకుండా ఖాళీగా వుండడంతో - నా కారుని పాస్ చేసి వెళ్తుంటే - ఇవేంటబ్బా అసలు నా కారు మిర్రర్ లో కనిపించకుండా ఎక్కడినుంచి వస్తున్నాయి - అని మళ్లీ rear-view mirror కేసి చూస్తే అప్పుడు అర్థం అయ్యింది - అది కొంచెం పైకి తిరిగి వుందీ, అప్పటిదాకా గోధుమరంగులో వుంది అని నేను మురిసిపోయి చూస్తున్నది రోడ్డు కాదు - మా కారు సీలింగూ అని :))

మొత్తానికి ఇంటికి జాగ్రత్తగానే వచ్చేశాను కళ్లద్దాలూ - కారద్దాలూ సరిగ్గా సర్దుకుని.

అలా - ఆ మొదటి కారెడ్వెంచర్ తర్వాత ఓ వారం రోజులు కారెక్కడానికీ - కార్తొక్కడానికీ కొంచెం బెంగగానే అనిపించింది.

ఇంతలో బుజ్జిజింకకి సమ్మర్ స్కూల్ మొదలవుతుందని ఈ-మెయిల్ వచ్చింది. సమ్మర్ క్లాసెస్ కి స్కూల్ బస్ రాదు. అంత ఎండలో - పాపం - వాడిని ఏం నడిపిస్తాను కదా - ఇంత కారూ నేర్చుకుని?! ఎలాగైనా సరే సమ్మర్ స్కూల్ మొదలయేలోగా డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి అనుకున్నాను.

రెండో రోజు పొద్దున్నే లేచి - ఇంటి నుంచి పదడుగులు వేసి - అక్కడ వుండే సిగ్నల్ దగ్గరనుంచి ఇంకో పదిహేను అడుగులు వేస్తే - లేచి మరీ ఎదురొచ్చేట్లుండే - గ్రోసరీ స్టోర్ Schnucks కి కారులో బయల్దేరాను.

మామూలుగా రోజూ నేనూ, పప్పీ నడిచి వెళ్లేవాళ్లం Schnucks కి. (అప్పటికి పప్పీ ఇంకా ఇక్కడే వుంది - ఇద్దరం పక్క పక్క అపార్టుమెంట్లలో వుండేవాళ్లం). నడిచి వెళ్లేటప్పుడు అంతగా రూల్స్ ఏమీ వుండవు - ఎందుకంటే Pedestrian rules the road ;) కాబట్టి. ఇద్దరం కుడిపక్క రోడ్డులోంచి లోపలి వెళ్లి అదే రోడ్డులో బయటికి వచ్చేసేవాళ్లం.

ఇవాళ మరి కారు కదా - అందుకని నేను చేసిన  ధైర్యం అది చేయలేక పప్పీ రానంది - పైగా ఒక కార్లో రెండు కొప్పులు ఇమడవంది.

సరే! ఒక్కదాన్నేవెళ్లాను నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ. లోపలి వెళ్ళేటప్పుడు బానే వెళ్లాను. కొనాల్సినవి కొన్నాను - కొనక్కరలేనివీ కొన్నాను - అసలే అమెరికా ఆర్ధిక వ్యవస్థకి - నేను సైతం ఒక విచ్చు డాలర్ ఇచ్చివేశానూ - అని ఫీలయిపోవాలి కదా!

ఇంక బయటికి రావాలి. నడకకి అలవాటు పడ్డ కాళ్లు కదా - కారెక్కిన రూల్సు వేరే ఉంటాయి అని వాటికి తెలీదు కదా - నేను చెప్పాలి కదా - కానీ నేనేమో ఒక్కదాన్నీ షాపుకి వెళ్లి వస్తున్నానన్న సంతోషంలో ఎటు వెళ్తున్నానో చూసుకోవడంలేదు కదా!!!

ఇన్ని "కదా"లున్నప్పుడు ఏమవుతుంది మరి?! అదే అయింది - ఏ దారిలో అయితే లోపలికి వెళ్లానో అదే దారిలో బయటికి రాబోయాను. ఇంతలో ఎదురుగా ఇంకొక కారుని ఆపి టికెట్ రాస్తున్నాడు - దారి కాసి స్పీడుగా వచ్చే వారికి టిక్కెట్లు వడ్డించే అమెరికాపు (cop).

నా కన్నా ముందు నా కారుకి అర్థం అయినట్టుంది - ఏదో తప్పు చేశానని - టక్కున ఆగిపోయింది. ఆ కాపు-కాని-అమెరికాపు అక్కడ చేస్తున్న పనినాపి నా దగ్గరకొచ్చి - బంగారు తండ్రికి అప్పటికే అర్థం అయినట్టుంది నాది మొట్టమొదటి కార్నడుపుడు వ్యవహారమని -  "Ma'am! You need to go the other way" అని కుడిపక్కనున్న బయటికి వెళ్లే దారి చూపించాడు - మర్యాదగా.

నేను - బడిలో పొరపాటున వేరే క్లాసులోకి వెళ్లి ఉలిక్కిపడి -  వెనక్కి తిరిగే పిల్లాడి మొహం లాంటి మొహం పెట్టి తలూపి రివర్స్ చేయబోయాను. కంగారులో కొంచెం ఎక్కువ తిప్పేశానేమో - కారు వెనక్కి, ముందుకీ కాక - అడ్డం గా తిరిగింది. నేను స్టీరింగ్ తిప్పే కొద్దీ అది ఇంకా ఇంకా అడ్డంగా రోడ్డులో ఇరుక్కుపోతోందే కానీ వెనక్కి వెళ్లట్లేదు.

వెంటనే కారు దిగి వెళ్లి - ఆ పోలీస్ దగ్గరికే వెళ్లి - నా కారు రివర్స్ చేయడం రావట్లేదు, హెల్ప్ కావాలీ అనడిగాను. అప్పటికే ఎవెరికైతే టికెట్ ఇస్తున్నాడో ఆ కారతను నన్నూ - పోలీసునీ మార్చి మర్చి కొరకొరా చూస్తున్నాడు.

ఆ ... అలాంటివన్నీనేను పట్టించుకుంటానేంటి - అవతల నాకారు - పాపం - నా పాల బడ్డందుకు -రోడ్డుకి అడ్డంగా తిరిగి -  డ్రుం... డ్రుం...  అని -  ఘోషిస్తుంటే?!

పోలీస్ వచ్చాడు - మరి పదహారేళ్ల వయసునుంచీ కార్నడిపిన వాడు - ఆ మాత్రం చేయలేడేంటి?  చక్కగా నా కారుని వెనక్కి తిప్పి బయటికివెళ్లే రోడ్డులో ఆపి - మళ్లీ తనకోసం వెనక్కి జరుపుకున్న  డ్రైవింగ్ సీట్ నాకు తగ్గట్టు ముందుకి జరిపి - Now you can go! - అని సాదరంగా సాగనంపాడు.

సాయంత్రం - అదే విషయం చెప్తే - అసలు నీ లైసెన్స్ ఎందుకు కాన్సెల్ చేయలేదా అని నాకాశ్చర్యంగా వుంది - అని బో... ల్డంత ఆశ్చర్య పోయారు బదరి.

కానీ తనకి తెలియదు కదా - అది నాకు కారు నేర్పిన Kerry - తొలి - తోలి కాదు - తొలి he చేసిన పూజాఫలమూ అని  - అంత తొందరగా కాన్సెల్ కాదని.

సరే! అప్పటినుంచీ మరీ కాళ్లనే నమ్మకుండా కొంచెం కళ్లు కూడా వాడుతూ కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్ అన్న సముద్రాల వారిని మొదటిసారిగా (మనసులోనే చెంపలేసుకుని) వ్యతిరేకిస్తూ కుడి ఎడమయితే పొరపాటేనోయ్ - వూరుకోరోయ్ (వూరుకోరు+ఓయ్) అని - మనసులో అనుకుంటే మళ్లీ మర్చిపోతానేమోనని - పైకే పాడుకుంటూ - అప్రమత్తతతో కారు డ్రైవ్ చేయడం అలవాటు చేసుకున్నాను.

ఇంతలో బుజ్జిజింక సమ్మర్ స్కూల్ మొదలయింది. మొదటి రెండు మూడు రోజులూ కొంచెం ముందరే వెళ్లి స్కూల్ వెనకాల చదునుగా వుండే పార్కింగ్ లాట్ లో పార్క్ చేశాను. నాలుగో రోజు కొంచెం ఆలశ్యం అయ్యింది. ఎప్పుడూ పెట్టే చోట పార్కింగ్ దొరకలేదు. ఇంక ముందు పక్క పార్క్ చేయడం తప్పలేదు. సరే అని - ముందు పక్కకి వచ్చి పార్క్ చేస్తుంటే కొంచెం ఎక్కువ తొక్కానేమో నా కారు అలిగి ముందున్న గట్టెక్కి -  గట్టవతల లోయలా వున్న గడ్డిలోకి దిగింది. వెంటనే కారు ఆపి బుజ్జిజింకని కారు దిగిపొమ్మన్నాను - ఆ లోయలో ఏమన్నా పల్టీ కొడితే గిడితే వాడికి దెబ్బలు తగలకూడదని.

నేను మాత్రం - సముద్రంలో మునిగిపోతున్నా ఓడ వదలని కెప్టెన్ లా ఫీలయిపోతూ - కారుని ముందుకి పోనిచ్చి స్కూల్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి సవ్యంగా పార్క్ చేసి ఇవతలికి వచ్చాను. నేను ఆ ప్రదక్షిణ చేసే టైం లో ఆ గడ్డిలో నడిచి వస్తున్న బుజ్జిజింకని వాడి క్లాస్మేట్ ఒకడు "Is your mom crazy?" అనడగడం విని బో... ల్డంత నవ్వుకున్నాను :))

ఆ తర్వాత - కారూ, నేనూ - నా సరి నీవని , నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే - అని పాడుకుంటూ సాఫీగా సాగిపోతున్నాము. అపార్టుమెంట్ లో మొదటగా డ్రైవింగ్ నేర్చుకుంది నేనే. ఆ ఉత్సాహంలో - ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం తాజాగా వచ్చే కూరల కోసమని అంబికా స్టోర్ కి అనితనీ, పద్మనీ - ఇంకా ఎవరొస్తే వాళ్లని ఎక్కించుకుని ఒక చిన్న షటిల్ సర్వీస్ మెయింటెయిన్ చేసేదాన్ని.

మొత్తానికి నాకు సెయింట్ లూయిన్ లో లోకల్ రోడ్డులు దున్నడం వచ్చేసింది కానీ హైవే మీదకి వెళ్లడం బెరుగ్గానే వుంది. హైవే మీద మెర్జ్ అవడం ఇంకా భయమే.

అలాంటి ఒకానొక రోజు - బుజ్జిజింకని తీసుకుని St. Chalres Rock Road లో Circuit City కి ఏదో ఎలెక్ట్రానిక్స్ కొనడానికి వెళ్లాను - బదరికి కావాలంటే. కావలిసినవి తీసుకుని బయటికి వస్తూ కొంచెం కన్ఫ్యూజ్ అయి హైవే మీదకి వచ్చేశాను.

ఒక్క క్షణం ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.  ఏదయితే అదయింది - అంతగా అయితే ఎదో ఎగ్జిట్ వచ్చేవరకూ ఎంత దూరమయినా వెళ్ళిపోదామని ఒక పక్కా - అలా వెళ్తే షికాగో దాకా వెళ్ళిపోతానేమో అని భయం ఇంకో పక్కా - దాంతో ఎప్పుడూ ఏదో కబుర్లు చెప్తూ పాటలు పాడుతూ వుండే నేను సైలెంట్ గా డ్రైవ్ చేస్తుంటే - వెనక సీట్లోంచి - బుజ్జిజింక గొంతు బెంగగా - "అమ్మా! Are you crying?" అంటూ వినిపించింది.

 "ఛ!  అదేం లేదు నాన్నా! అదిగో నెక్స్ట్ ఎగ్జిట్ లో తిరిగిపోదాం" అంటూ వున్నానో లేదో 17 - Dorsett Road అని - మా ఇంటికి వెళ్లే దారే  కనిపించింది.

అంతే .... మళ్లీ పాట మొదలు -
మేఘాల పైన సాగాలి .... నువ్వు కదం తొక్కుతూ ఉరకాలి - నే బ్రేకు తొక్కుతూ ఆపాలి .. అహహా అహహా 

అలా మొదలయిన నా కారు చోదనం - ఎప్పటికప్పుడు ... అంతం కాదిది ఆరంభం !

ఇవాళ్టితో నా కారు కబుర్లు సమాప్తం! ఇంకోసారి ఎప్పుడైనా నాకే తెలియని నా దారుల కబుర్లు!