కిందటి 19 చెప్పిన కబుర్లు
ACC లో డిగ్రీ అయిపోయింది - మూడు ఏళ్లు - ఆరు వినోదాలుగా.
ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా రాశాము - అపర్ణా, నేను.
వేసవి సెలవులు - ఎప్పట్లాగే - ఈసారి ఒకటే తేడా - ఇంతకూ ముందు రెండేళ్ల సెలవులకి అంత ఆలోచన ఉండేది కాదు - ఇంకా డిగ్రీ అవ్వలేదు కాబట్టి .
మరిప్పుడు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది - తర్వాతేం చేయాలో నిర్ణయించుకోవాలి.
ఫిజిక్స్ మీద నాకున్న ఇష్టంతో - అదీ కాక ఇంటినుంచి ఎక్కువ దూరం వెళ్లక్కర్లేదని - ముందసలు నాగార్జున యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ ప్యూర్ ఫిజిక్స్ చేద్దామనుకున్నాను.
అప్పుడప్పుడే MCA - అప్పటికే వున్న MBA కి - సమాంతరంగా పాపులర్ అవుతోంది.
కంప్యూటర్ కోర్సు - కొత్త కోర్సు - పైగా ఎక్కడా కోచింగ్ ఇన్సిస్ట్యూట్ల చూపు పడని కోర్సు - బలవంతంగా కూర్చోబెట్టి చదివించేవారుండరు - నేను సొంతంగా ప్రిపేర్ అవొచ్చు - ఇంకంతే - నాకు తెగ నచ్చేసింది.
కాలేజ్ అయిపోయినా అపర్ణ, నేను దాదాపు రోజూ ఒక్కసారైనా కలుసుకునేవాళ్లం - తను మాఇంటికి రావడమో, నేను వాళ్ల ఇంటికి వెళ్లడమో - ఎలా అయినా సరే - రోజుకొకసారైనా చూడాల్సిందే.
ఇద్దరమూ కలిసి రోజూ Indian Express లో Peanuts కార్టూన్ చదివి, Cross-Word ప్రయత్నించి - రేడియోలో పొద్దున్న వివిధభారతిలో జనరంజనో - మధ్యాహ్నం భూలే-బిస్రే గీతో - వస్తుంటే వింటూ - కాలేజ్లో రాసుకున్న రన్నింగ్ నోట్స్ అలవాటు పోకుండా ఉండాలనే ధ్యేయంతో - అందితే పుస్తకాల మీద, అందకపోతే అప్పటికి చేతికి దొరికిన చిత్తుకాయితం మీదైనా సరే - రాసుకున్న తెలుగు, హిందీ పాటలు - ఎవరు ఏం రాసుకున్నామో ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటూ - అప్పటికి ఇంకా టైం మిగిలి వుంటే అప్పుడు యూనియవర్సిటీ నోటిఫికేషన్లు చూసేవాళ్లం.
ఒకరోజు పేపర్లో తిరుపతి-వెంకటేశ్వర & పద్మావతి యూనివర్సిటీలు - కలిసి పెడ్తున్న MCA ఎంట్రెన్స్ నోటిఫికేషన్ కనిపించింది.
రెండోరోజే వెళ్లి బ్యాంకులో DD తీసుకుని అప్లికేషన్ పోస్ట్ చేశాము ఇద్దరం.
MCA ఎంట్రెన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటే - ఒకరోజు శంకర్ విలాస్ దగ్గర అనుకోకుండా కలిసిన - డిగ్రీ సీనియర్స్ పద్మజ, ఆషా చెప్పారు - అది సెంట్రల్ యూనివర్సిటీ కండక్ట్ చేసే pattern లో ఉంటుంది - GRE Exam కి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు సహాయ పడతాయని.
అప్పుడు వెంటనే అరండల్ పేట లోని నవోదయాకి వెళ్లి Barron's GRE పుస్తకం తెచ్చుకున్నాను.
ఈలోగా పప్పి, కుట్టిల పరీక్షలు కూడా అయిపోయాయి.
ముగ్గురం కలిసి - సినిమాలు, సైకిళ్ల మీద షికార్లు.
ఇంతలో విజయవాడకి దగ్గర్లో వున్న కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ (KLEC) లో మెకానికల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందని హైద్రాబాదునుంచి చిన్నపాపపిన్నివాళ్ల శ్రీను గుంటూరు వచ్చాడు.
తనక్కూడా సెలవులని బాబు కూడా వచ్చాడు - వరంగల్ నుంచి.
మధ్యాహ్నం భోజనాలయ్యాక అమ్మ - పాపం - ఒక్క అరగంట నడుం వాల్చేది.
నేను, పప్పి, కుట్టి, శ్రీను, బాబు - బయట కేన్ కుర్చీల్లో కూర్చుని కబుర్లు, జోకులు, పాటలు - సందడిగా వుండేది.
బాబు ఇంజనీరింగ్ కాలేజ్ విశేషాలే కాక తనకి టీ పెట్టడం ఎంత బాగా వచ్చేసిందో బోల్డంత గొప్పగా వర్ణించి చెప్పాడొకసారి.
మేం ముగ్గురం - "అమ్మో ! భలే బాబూ - నిజంగా ? టీ పెట్టడం వచ్చేసిందా? మాకింకా పాలు కాచడమే సరిగా రాదు - మాకన్నా నువ్వు చాలా నయం - అమ్మకి చెప్పకు బాబూ - మళ్లీ మమ్మల్ని నిన్ను చూసి నేర్చుకోమమని తిడుతుంది" - అంటూ తెగ మెచ్చేసుకున్నాం.
ఒక రోజు ఇలాగే కబుర్లు చెప్తూనే బాబు తనూ కాసేపు పడుకుందామని లోపలికి వెళ్లాడు.
సరిగ్గా మధ్యాహ్నం మూడున్నర అవగానే శ్రీనుని పిలిచి - కుట్టి సైకిల్ వాడికిచ్చి అరండల్ పేట లో వున్న Modern ఫుడ్స్ కో , బ్లూ స్టార్ బేకరీకో వెళ్లి - సమోసాలు తెమ్మని పంపించాం.
శ్రీను ఇంటికి వచ్చేలోగా మేం ముగ్గురం పడుక్కున్న బాబుని లేపి - "బాబూ! నువ్వు టీ బాగా పెడతానని చెప్పావు కదా - ప్లీజ్ ఒక్కసారి టీ చేయవా?" - అంటే - తనని లేపేశామని అస్సలు విసుక్కోకుండా తన టీ-పాక-కళ ప్రదర్శించే అవకాశం తనకిచ్చిన మాకు టీ కాచి పోసి - నేను సైతం వీళ్ల అల్లరికి ఒక్కసారి దొరికిపోయాను - అని తనూ ఓ కప్పు తాగాడు.
ఈలోగా గుంటూరు ఎండల్లో సైకిల్ తొక్కించి సమోసాలు తెప్పించుకున్న మామీద పళ్లు - లోలోపలే కొరుక్కుంటూ - (మళ్లీ వాడికి కోపం వచ్చిందని పైకి కనిపిస్తే వాడిమీదే జోకులు వేసేసి వాణ్ణి ఇంకా ఏడిపిస్తామని) -
మొహమంతా ఎర్రగా అయిపోయి ఇంటికి వచ్చిన శ్రీనుకి కూడా బాబు కలిపిన టీ-కప్పొకటి వుంచాం - బాబు చేశాడని చెప్తే శ్రీను కొంచెం సంతోష పడ్డట్టు కనిపించాడు - వాడొక్కడే మా మధ్యాహ్నపు-టీ-సమోసాకలికి శ్రమదానం చేయలేదని.
ఈలోగా ఒక కునుకయ్యి లేచొచ్చిన మా అమ్మకి వంటిల్లంతా ఒక చిన్నసైజు కురుక్షేత్రం లా కనిపించిందేమో - మా ముగ్గురిని విసుక్కోవడం మొదలు పెట్టింది - గ్యాస్ గట్టు అంతా టీ పొంగించేశామని.
అన్యాయంగా అన్నెం-పున్నెం ఎరగని మామీద అభాండం వేస్తోందని - బోల్డంత ఉక్రోషం వచ్చి - "బాబు ఒలకపోస్తే మమ్మల్నంటావేంటమ్మా" - అనడగ్గానేఅమ్మకి అర్థం అయిపోయింది - మేము బాబు చేత టీ పెట్టించామని.
వెంటనే - "ముగ్గురాడపిల్లలుండి మగపిల్లాడు వాడి చేత టీ పెట్టిస్తారా ? హవ్వ! ఇంకేమైనా వుందా-రేపు నన్నంటారు అందరూ ........." అని ఏదో-ఏదేదో తిట్టేయడం మొదలుపెట్టింది.
ఆ చుక్కలు (.....) దాటిన తర్వాత మా అమ్మ ఏమనేదో ఈరోజుకీ నాకు తెలీదు - ఎందుకంటే అప్పటికే మేం ముగ్గురం మా మేడ-గోడల మీదకి వెళ్ళిపొయ్యేవాళ్లం - మా సాయంకాలపు సమావేశాలకి.
ఆ ప్రకారంగా యథాశక్తి బాబుని, శ్రీనుని విసిగిస్తూ - మా అమ్మ సాయం చేయడానికి వంతులు వేసుకుంటూ - అంటే నిజంగా ఆవిడకి సాయం చేయడానికి కాదు - ఏ సాయం ఎవరు చేయాలని - "నువ్విది చేస్తేనే, నేనది చేస్తాను"-టైపన్నమాట! - మా వేసవిని వట్టివేళ్లు కట్టిన కిటికీల, తలుపులు మధ్య పనసతొనలు, మావిడిపళ్లు తింటూ గడిపేస్తున్నాము.
MCA ఎంట్రెన్స్ కి ప్రిపరేషన్ సరదాగా వుంది నాకు -Mental Ability, Aptitude, Math Problems - ఇవి అన్నీ రొటీన్ గా కాకుండా పజిళ్లు సాల్వ్ చేస్తున్నట్టుండి - నాకు భలే హుషారుగా వుండేది.
మే లోనో ఎప్పుడో ఎంట్రెన్స్ కి హాల్-టికెట్ వచ్చింది - వచ్చి తిరుపతిలో టెస్ట్ రాయమని. సెంటర్ - పద్మావతి యూనివర్సిటీ.
అపర్ణ వాళ్ల నాన్నగారు - రఘునాథ్ అంకుల్, అపర్ణ, నేను - బయల్దేరి తిరుపతికి వెళ్లాము - ట్రైన్ లో. ఆ రాత్రి ట్రైన్ ప్రయాణంలో - అపర్ణ, నేను మాకొచ్చిన సైడ్ బెర్త్ లో కింద కూర్చుని - కిటికీలోంచి కనిపిస్తున్న చందమామని చూస్తూ బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నాము - రెండో రోజు రాయబోయే పరీక్ష గురించి ఒక్క మాట కూడా దొర్లకుండా మహా జాగ్రత్త పడుతూ.
ఆ రోజు పొద్దున్నే రైల్వే రిటైరింగ్ రూంలో మా లగేజ్ పెట్టుకుని - ఎంట్రెన్స్ పరీక్ష రాయడానికి శ్రీనివాసమంగాపురం అవెన్యూ లో వున్న పద్మావతి యూనివర్సిటీకి వెళ్లాము - అపర్ణ, నేను - మాతో పాటు అంకుల్.
పరీక్ష రాసేముందు చుట్టూ చూస్తే గుంటూరు నుంచి నేనూ, అపర్ణే కాక ఇంకా ఇంటర్ మాతో చదివి - డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ లో చదివిన - మల్లిక, నిరుపమ - కూడా వున్నారు. వాళ్లని పలకరించి ఈలోగా టైం అయ్యిందని మా హాల్-టికెట్ నంబర్ల ప్రకారం వెళ్లి సీట్లలో కూర్చున్నాము. నా ముందు, వెనకా కూర్చుని వున్న అమ్మాయిలని పలకరించాను - అరుణ, అపర్ణ - అని వాళ్లిద్దరూ హైద్రాబాదు నుంచి వచ్చారు - MCA ఎంట్రెన్స్ రాయడానికి.
ఎంట్రన్స్ బాగా రాశాను - ముందే చెప్పినట్లు - నాకా పజిళ్లలా వున్న ప్రశ్నలు నచ్చేశాయి.
పరీక్ష అయిపోయి పన్నెండింటికి బయటికి రాగానే - సాయంత్రం ట్రైన్ కి వెళ్లేలోగా చాలా టైం వుందని - భీమాస్ లో భోజనం కాగానే అంకుల్ మమ్మల్ని ఏదో తెలుగు సినిమాకి తీసుకెళ్లారు.
సినిమా అయిపోగానే సాయంత్రం బయల్దేరి గుంటూరు వచ్చేశాం. పరీక్ష రాశామని మరిచి కూడా పోయాం.
ఒక పదిహేను రోజుల్లో టెలిగ్రాం వచ్చింది - SV యూనివర్సిటీ నుంచి - నాకు 9వ రాంక్ వచ్చింది - ఇంటర్వ్యూకి రమ్మని.
బోల్డంత ఆనందం - మొట్ట మొదటి సారి నా అంతట నేను చదువుకుని రాసిన పరీక్షలో అంత మంచి రాంక్ వచ్చిందని.
ప్రతి క్లాసులో పరీక్ష ఫలితాలు రాగానే స్వీట్స్ తెప్పించి మేము అద్దెకున్న ఇంటి కాంపౌండ్లో మిగిలిన వాటాల్లో వున్న అందరికీ మాచేత ఇప్పించడం మా నాన్నకున్న ఓ ముచ్చటైన అలవాటు.
ఈసారీ అలాగే ఆఫీస్ లో పనిచేసే వెంకటేశ్వర్లుని పంపించి తొక్కుడు లడ్డు తెప్పించి నాచేత అందరికీ ఇప్పించారు.
ఇంక అందరూ - ప్రత్యేకంగా వాళ్లు వున్న ఇంటి వాటాలని బట్టి మధ్యాంటీ-చివరాంటీ అని మేం పిలిచే ఉషాంటీ (లక్ష్మణ్ వాళ్ల అమ్మగారు) - అరుణాంటీ - తెగ సంబర పడిపోయారు - లల్లీకి మంచి రాంక్ వచ్చింది అని.
ఆ సంబరంలోనే ఉషాంటీ నాకొక వెండి బాల్ పెన్ను కొనిచ్చారు. అరుణాంటీ నాకిష్టమని వంగ-దోసకాయ పచ్చడి అప్పటికప్పుడు చేసి తెచ్చారు. అదేదో నేనప్పుడే చదువుకోవడానికి తిరుపతి వెళ్లిపోతున్నట్లు మాట్లాడి - వాళ్ల మాటలకి వాళ్లే అప్పట్నుంచే బెంగ పెట్టేసుకోవడం మొదలు పెట్టారు.
నాకింక కాళ్లు భూమిమీదే వున్నా వాటికి స్ప్రింగులేవో మొలిచినట్లు అనిపించింది.
ఇంటర్వ్యూకి నేను, నాన్న బయల్దేరి వెళ్లాము - తిరుపతికి. పొద్దున్న తొమ్మిదింటికి ఇంటర్వ్యూ జరుగుతుంది అన్న SVU లో ఇంజినీరింగ్ కాలేజ్ బిల్డింగ్ కి వెళ్లాము.
మధ్యాహ్నం పన్నెండయినా నా పేరు పిలవలేదు - నాకన్నా ఎక్కువ రాంక్ వచ్చిన వాళ్లు కూడా వాళ్ల పేర్లు పిలిచారని వెళ్లి ఫీజు కట్టేసి వెళ్లారు.
నాన్నకప్పుడు ఏదో పొరపాటు జరిగిందని అనిపించింది. ఆఫీస్ రూంలోకి వెళ్లి నాకొచ్చిన రాంక్-కార్డు చూపించారు. అది చూసిన ఇంటర్వ్యూ చేసే వాళ్లు చెప్పారు - అది పద్మావతి యూనివర్సిటీకి సంబంధించినది - SVUది కాదు అని. రాసింది కామన్ ఎంట్రెన్స్, రాంక్ కార్డు వచ్చింది SVU నుంచి అయితే - పద్మావతి కి వెళ్లమంటారేంటి అనడిగారు నాన్న.
ఎన్ని సార్లడిగినా వాళ్ళు చెప్పే సమాధానం అంత తృప్తిగా అనిపించలేదు - ఎక్కడో పొరపాటు జరిగింది అని తెలుసు - కానీ ఎవర్ని అడగాలో అర్థం కాలేదు - పాపం - నాన్న నేను బాగా disappoint అయ్యాను - ఏడుపు అతి కష్టం మీద ఆపుకుంటున్నాను అని చూసి - "పోతే పోయిందిలే లల్లీ - ఇంకా ఆంధ్రా యూనివర్సిటీ టెస్టొకటి వుంది కదా - మన మునసబు గారి కిరణ్ అక్కడే చదువుతున్నాడు - చాలా బావుంటుందట - ఎంచక్కా లలితత్తయ్య దగ్గరుండి చదువుకోవచ్చు - వైజాగ్ వూరు కూడా బావుంటుంది - సముద్రమూ అది - సెలవులొస్తే బీచుకెళ్లొచ్చు " అంటూ కబుర్లు చెప్తుంటే - సాయంత్రం వరకూ SVU లోనే వుంది మళ్లీ ట్రైన్ లో గుంటూరుకి వచ్చేశాం.
ఇంటికి రాగానే విషయం తెలిసిన అందరూ నేనెక్కడ బాధ పడతానో అని అసలా విషయమే గుర్తులేనట్టు - అసలు చదువు విషయమే రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు - ఇంట్లో వాళ్లు , పక్కింటి ఆంటీలు అందరూ.
ఎవరెంత నాకేవేవో కబుర్లు చెప్పి మరిపించాలని చూసినా నాక్కొంచెం దిగులుగానే ఉండేది - అంత బాగా రాసిన ఎంట్రెన్స్ లో సీట్ రాలేదని.
పప్పి,కుట్టీలతో కూడా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు - ఒక్కదాన్నే వెళ్లి మేడ మీద కూర్చునేదాన్ని.
ఒక రోజు సాయంత్రం సంగీతం క్లాస్ అయిపోగానే పప్పి, కుట్టి మేడ మీదకి వస్తున్నట్లు - మెట్లమీద నుంచి వాళ్ల మాటలు వినిపించాయి.
"ఏంటే పప్పీ - ఏది ఈ లల్లీ?" - కుట్టీ ప్రశ్న.
"పైన వుందేమో మళ్లీ ఆ
దిల్ కో టుకడే టుకడే కర్కే - ముస్కురాకే చల్ దియే - జాతే జాతే యే తో బతాజా హం జియేంగే కిస్కేలియే అని పాడుకుంటూ" - పాట పాడుతూ పప్పి సమాధానం .
"ఇవాళ దీన్సంగతేంటో తేల్చెయ్యాల్సిందే - ఆ ఏడుపు మొహం చూడలేకపోతున్నాం బాబోయ్" అంటూ వచ్చింది కుట్టి పైకి.
నేను వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా రోడ్డు మీద వచ్చే పోయే సైకిళ్లు, రిక్షాలు చూస్తున్నాను - అదేదో నాకు చాలా ఇంటెరెస్టింగ్ విషయం అన్నట్లు.
"పప్పెమ్మా - BH లో ఈ సంవత్సరం నీ ఇంటర్ ఎలా అయ్యిందే?" - నీకంత మేమక్కర్లేకపోతే మేము మాట్లాడుకోలేమా అన్న హింట్ ఇస్తూ కుట్టి అడిగింది పప్పీని.
"ఎలా అవ్వడమేంటి?! - మా గాయత్రి మేడం ఓ నాలుగో - ఐదో సార్లు నాకు చప్పట్లు కొట్టించింది"
"అబ్బా - ఐదు సార్లే? ఏం చేశావేంటి?"
"ఏడాది మొత్తంలో అన్ని సార్లు మాత్రమే ఆవిడ చెప్పే ఇంగ్లీష్ నాన్-డిటెయిల్ క్లాసుకి వెళ్లాను. అందులోనూ ఒకసారి అటెండెన్స్ వేస్తూ నా పేరు పిలవగానే అప్పటివరకూ రాణి తో మాట్లాడుతున్న నేను "ప్రెజెంటెహె" అన్నాను. అందుకే ఆవిడ క్లాసులోకి రాగానే నేను కనిపిస్తే క్లాసులోవున్న అందరి చేతా చప్పట్లు కొట్టిస్తుంది - ఇవాళ అరుణ క్లాసుకొచ్చింది - అని"
వాళ్ల మాటలు విని నాకు నవ్వొస్తోంది కానీ వాళ్లకి కనబడకూడదని ఇంకా సీరియస్ గా రోడ్డుకేసి ఒంగి చూడడం మొదలుపెట్టాను.
ఈలోగా కుట్టి నా మొహం దానిచేత్తో దానికేసి తిప్పుకుని "మేమిక్కడ మాట్లాడుతుంటే ఆ రోడ్డుకేసి చూడ్డమేంటసలు? రూప వస్తానంది రేపు శ్రీ-420 కి వెళ్దామా - విజయలక్ష్మి లో వచ్చింది" అనడిగింది.
నాకింక కళ్లలో నీళ్లొచ్చేశాయి - నోట్లోంచి మాట రావట్లేదు - తల అడ్డం గా తిప్పాను రానన్నట్లు.
"ఎహె - ఏడుపాపవే బాబూ - అసలో సంగతి చెప్పు - నీగ్గుర్తుందా - ఈ పప్పెమ్మ ఎకనమిక్స్ ఎగ్జామ్ రోజు ఏం జరిగిందో?"
అది నాకు ఏం గుర్తు చేయడానికి ట్రై చేస్తోందో అర్థం కాగానే - కళ్ల నీళ్లతో పాటు భళ్లుమని నవ్వు కూడా వచ్చింది.
ఆరోజు పప్పీ సీనియర్ ఇంటర్ ఫైనల్స్ లో ఎకనమిక్స్ పేపర్. పరీక్ష తొమ్మిదింటికి.
పప్పి పొద్దున్నే లేచి కొంచెమేదో రివైజ్ చేసి - ఎనిమిదింటికి రెడీ అయ్యింది.
ఎనిమిదింపావు నుంచి ఏంటో వెతకడం మొదలు పెట్టింది.
ముందు అంతగా పట్టించుకోలేదు - కానీ ఎప్పటికీ ఆ వెతకడం ఆపకపోతుండేసరికి -అమ్మకీ, నాకూ డౌట్ వచ్చింది.
"పప్పీ - ఏంటి వెతుకుతున్నావు? - పరీక్షకి టైమవుతుంటే ఓ పక్క" - మాతృమూర్తి ఆందోళనా పూరిత స్వరం.
"నా హాల్-టికెట్" - నెమ్మదిగా నిమ్మకు నీరెత్తినట్టున్న పుత్రిక సమాధానం.
అంతే - ఆ తర్వాత అరగంటలో - పప్పి - మాఇద్దరి హడావుడిని ఒక తమాషాలా చూస్తుంటే - మా అమ్మ, నేను - ఇంట్లో వున్న ప్రతీ పుస్తకం, పేపరు - అలమార్లు, బట్టల బీరువాలు -వంటింట్లో స్టీలు డబ్బాల కిందా, మీదా, లోపలా - కొంచెం సేపయ్యేటప్పటికీ - అసలేం వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో - మాకు మేమే మర్చిపోయేంతగా ఇల్లు పీకి పేపర్ల-పందిరేసేసాం.
మేమంత వెతుకుతున్నా - పప్పికసలు కొంచెం కూడా పరీక్షకి లేట్ అవుతోందని తొందర కానీ - హాల్-టికెట్ దొరక్కపోతే అసలు పరీక్షే రాయలేననే టెన్షన్ కానీ - ఏమీ లేవు. పైగా "వుందిగా సెప్టెంబర్ మార్చి పైనా - వాయిదా పద్ధతుంది దేనికైనా" అంటూ పాటలు.
మా అమ్మకేమో కోపం - నాకేమో ఎప్పట్లాగే రాబోతున్న ఏడుపు...
పక్కనే మమ్మల్ని విసుక్కుంటూ కుట్టి - పప్పికి లేని హడావిడి మేమిద్దరం అనవసరంగా పడిపోతున్నామని.
ఈలోగా పప్పికి దాని బ్యాగ్ లోనే పుస్తకాల అడుగున నలిగి-నలిగి వున్న హాల్-టికెట్ దొరికింది - ఇంతలో దాని ఫ్రెండ్ రాణి వచ్చిందని -అసలేమీ జరగనట్టు - ఆ కాయితాల గుట్టల్లోఅమ్మనీ, నన్నూ వదిలేసి - పరీక్షకి వెళ్లిపోయింది.
అదే ఇప్పుడు కుట్టి గుర్తు చేస్తోంది.
నా మొహంలో నవ్వు చూడగానే - "అబ్బా! ఇప్పటికి ఆపావా ఏడుపు - పప్పెమ్మని చూసి నేర్చుకో - బాగు పడతావ్" అంటూ నా చెయ్యి పట్టుకుని కిందకి లాక్కుపోయింది. మా వెనకాలే ముసిముసిగా నవ్వుకుంటూ పప్పి.
నాకూ అనిపించింది - పోతే పోనీ - ఇంకా బోల్డు యూనివర్సిటీలు - పరీక్షలూ వున్నాయి - మళ్లీ ట్రై చెయ్యొచ్చు కదా - అని.
అలా నా పరీక్షా-కాలం మొదలయింది.
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>