24, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 3


మే  28, 2017 - ఆదివారం మధ్యాహ్నం - ఇంతకు ముందు జరిగిన ప్రసంగాల విశేషాలు ఇక్కడ చదువుకోవచ్చు: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2

బాబ్జీ గారి - పుస్తక ప్రచురణ - సాధక బాధకాలు:

నేటి సాహిత్యం - తీరుతెన్నులు ప్రసంగాలలో తదుపరి అంశంగా పుస్తక ప్రచురణలో సాధక బాధకాల గురించి మాట్లాడినవారు ప్రముఖ ప్రచురణ కర్త - బాబ్జీ గారు.

ఆయనకి కేటాయించిన ఐదారు నిముషాల్లో చాలా విషయాలు పంచుకున్నారు :

"చాలా చెప్పాలని రాసుకొచ్చినా సమయం తక్కువగా వుంది - క్లుప్తంగా చెప్తాను.  1970లలో నవలా సాహిత్యానికి, కాల్పనిక సాహిత్యానికి పెద్దపీట వేశారు - తెలుగు సాహిత్యంలో. 1990 దాకా నవలలు బాగా అమ్ముడయ్యాయి.

తొలిగా యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచనాదేవి, కోడూరి కౌసల్యాదేవి - తర్వాత యండమూరి, మల్లాది, కొమ్మనాపల్లి, సూర్యదేవర - నవలా సామ్రాజ్యానికి స్వర్ణయుగం.

రచయిత్రుల పుస్తకాలు బాగా అమ్ముడవుతూ ఉండడం వల్ల రచయితలు ఆడవాళ్ళ పేర్లు కలం పేర్లుగా పెట్టుకుని రాసుకునే రోజులవి.

వీధి వీధినా లెండింగ్ లైబ్రరీలు ఉండేవి. ఇంట్లో వుండే ఆడవాళ్లు పుస్తకాలు బాగా చదివే వాళ్ళు.

ప్రచురించిన పుస్తకాల్లో సగం లెండింగ్ లైబ్రరీలు కొనేవి. మిగిలినవి పుస్తకప్రియులు, ప్రభుత్వ గ్రంథాలయాలు కొనేవారు.

టీవీలు రావడం వల్ల దెబ్బతిన్న  ప్రచురణరంగాన్ని పరిరక్షించడానికి మొబైల్ లైబ్రరీ వ్యాన్లు నడుపుతున్నా, పుస్తక ప్రదర్శనలు జరుపుతున్నా పుస్తకాలు అంతగా అమ్ముడవట్లేదు.

ఎవరూ కొనక ప్రచురణరంగం కుదేలైనా అదే జీవనాధారం కాబట్టి పాపులర్ పుస్తకాలు ప్రచురించడం జరుగుతోంది.

Publishing is a matured art.

మంచి రచనను పుస్తకముగా మలచడానికి చాలా ప్రత్యేకమైన కృషి కావాలి.

సాహిత్య జ్ఞానం, సాంకేతిక జ్ఞానం, సృజనాత్మకత, ఓర్పు - ఇవన్నీ కావాలి.

తెలుగు పాఠకులకు పుస్తకాలు కొని చదివే అలవాటు లేదు.

ఒక నవల ప్రచురించడానికి DTP ఖర్చులు చాలా అవుతాయి. ప్రచురించిన నవల వెయ్యి కాపీలు అమ్ముడవడానికి రెండేళ్లు పడుతుంది. రూపాయికి తయారయిన పుస్తకాన్ని నాలుగు రూపాయలకి అమ్మాలి. దాంతో ఆర్ధిక పరమైన  కష్టాలు ఎక్కువగా ఉంటాయి.

ఒక పుస్తకం అమ్ముడవడానికి దోహద పడేవి - పాఠకుల అభిరుచి, డబ్బులు, ఎంపిక.

ప్రచురణ రంగంలోని ప్రధానమైన ఇబ్బందులు ఏంటంటే - చౌకరకం నకళ్లు దొరకడం.

ఒక పుస్తకం రివ్యూ చేశాక సరైన గ్రేడింగ్ సిస్టం లేకపోవడం.

తెలుగులో తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేయగలిగేవాళ్ళు, వాక్యాలని సరిచేయగలిగేవాళ్లు లేకపోవడం. అవి తెలిసిన పెద్దవాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం.

తెలుగు పుస్తక ప్రచురణ రంగం బాగుపడడానికి మీలాంటి ప్రవాసాంధ్రుల కృషి, సంకల్పం కావాలి. ఈ వేదిక పురిటిగడ్డ కావాలి-

అంటూ బాబ్జీగారు తన ప్రసంగాన్ని ముగించగానే అప్పటికే అనుకున్న దానికంటే సాహిత్య కార్యక్రమాలు ఆలస్యం కావడంతో తర్వాతి కార్యక్రమాన్ని మధ్యలో విరామం లేకుండా వెంటనే ప్రారంభించారు.

తానా సాహిత్య సమావేశాల్లో ఆఖరి అంశం - సాహిత్య పరిశోధన:



ఇందులో పాల్గొన్నవారు: సుందరవల్లి వింజమూరి, సుధా కలవగుంట, డాక్టర్ విజయశ్రీ కుప్పా, డాక్టర్ త్రివేణి - గార్లు. వక్తల పట్టికలో డాక్టర్. రాజేశ్వరిగారి పేరు వుంది కానీ నాకు ఆవిణ్ణి వేదికమీద చూసిన జ్ఞాపకం లేదు.

వీళ్ళకి ఒక్కొకళ్ళకి ఐదు నిముషాల కన్నా ఎక్కువ సమయం దొరకలేదు.

వీరి ప్రసంగాలు జరిగే సమయంలోనే  - నేను తర్వాతి రోజు మా ఇంటికి రాబోతున్న అపురూప అతిథుల  హోటల్ అడ్రసులు అవీ కనుక్కుంటూ - వాళ్ళ వీలు ప్రకారం వాళ్ళని మా ఇంటికి తీసుకుని రావడానికి ఏ సమయంలో బదరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో - ఇలాంటివన్నీ మాట్లాడుతూ సాహిత్య పరిశోధనా ప్రసంగాలు అంత శ్రద్ధగా వినలేకపోయాను :( - అది తలుచుకుంటే ఇప్పటికీ - అయ్యో- అనిపిస్తుంది.

షికాగో నుంచి వచ్చిన శ్యామ్ గారు తన ఫోన్‌లో ఈ ఆఖరి ప్రసంగాలు రికార్డ్ చేయడం చూశాను - ఎప్పటికైనా ఆయనకి వీలు కుదిరి పంచుకోగలిగితే నేను మిస్ అయిన ఆ భాగం తర్వాత పోస్ట్ చేద్దామనుకుంటున్నాను.

ఇప్పటికి - వీలైనంత వరకూ నేను విన్న ప్రసంగ భాగాలు ఇవి:

ముందుగా సుందరవల్లి వింజమూరిగారు తమ నేటి సాహిత్యంలో స్త్రీ పాత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తర్వాత సుధా కలవగుంట గారు - తాము గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం ఇండియా వెళ్లి అక్కడ వున్న ఎంతోమంది నృత్య కళాకారులని కలుసుకుంటూ పది సంవత్సరాలు పరిశోధన చేసి రెండు డాక్టరేట్లు సంపాదించిన - తమ అభిమాన విషయమైన - యక్షగానం గురించి మాట్లాడారు.

సుధా కలవగుంట గారిని తానా-సాహిత్య సమావేశాల్లో అతిథిగా, వక్తగా చూడగానే చాలా ఆనందంగా అనిపించింది - దానికి ఒక కారణం వుంది. లిటరరీ కమిటీ మొదలుపెట్టిన కొత్తలో బదరి కూడా చాలా ఇష్టంగా వాలంటీర్ చేద్దామనుకున్నారు. కానీ రాను రాను తనకి అంతగా ఉత్సాహంగా అనిపించక డ్రాప్ అయ్యారు. కానీ అప్పటికే తానా-2017 వెబ్‌సైట్‌లో తన పేరు, ఫోన్ నంబర్ చేర్చబడ్డాయి.

ఒక శనివారం మధ్యాహ్నం బదరి సెల్‌ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది. తెలియని పేరు - అయినా ఎవరో అనుకుంటూ తీస్తే టెక్సస్ నుంచి సుధ అనే ఆవిడ మాట్లాడుతూ తనకి తానాలో యక్షగానం గురించి ఒక ప్రసంగం ఇవ్వాలని ఆసక్తిగా వుంది - లిటరరీ కమిటీ అధ్యక్షులు రవి పసుపులేటి గారికి ఫోన్ చేస్తే ఆయన దొరకట్లేదని బదరికి ఫోన్ చేశానని చెప్పారు. ఆవిడ యక్షగానంలో రెండు డాక్టరేట్లు చేశారని వినగానే - బదరి చాలా మెచ్చుకుని - ఆవిడకి చెప్పారు - తను లిటరరీ కమిటీలో లేకపోయినా రవిగారికి ఆవిడ గురించి చెప్తానని.

కానీ ఆ తర్వాత - ఎన్నిసార్లు ప్రయత్నించినా - మా ఇద్దరికీ సుధగారికి తానా సమావేశాలకి వచ్చే అవకాశం దొరికిందో లేదో , ఆహ్వానం అందిందో లేదో - తెలియలేదు. అదీ  - సుధగారిని తానా సాహిత్య సమావేశాల్లో చూడగానే నా ఆనందానికి కారణం.

ఆవిడ స్పీచ్ కూడా - నేను పూర్తిగా అసలు వినలేకపోయాను కానీ - విన్న కొంచెం చాలా authentic గా, తాను  మాట్లాడే విషయం మీద ఎంతో command వున్న వారిలా అనిపించారు. మరి - పదేళ్ల పరిశోధన- రెండు డాక్టరేట్లు అంటే మాటలా మరి?!  తర్వాత ఇంట్లో మాటల్లో ఆవిడ గురించి చెప్పగానే బదరి కూడా చాలా సంతోషించారు - ఆవిడ తానాకి రాగలిగినందుకు.

సుధగారి తర్వాత  తన బుల్లి మనవడి మీద ఎన్నో నానీలు రాసిన గ్రానీ విజయశ్రీ కుప్పాగారు నానీల గురించి పరిచయం చేశారు.

విజయశ్రీ గారి - నానీల ప్రక్రియ ఒక పరిశీలన - ఆవిడ మాటల్లో:

"ఇప్ప్పుడు ఈ రోజుల్లో అన్నీ స్పీడే - రెండు నిముషాల కవిత ఒక నిముషంలో వినాలి. 

కాలంతో మారక పోతే కవిత బతికి బట్టకట్టదు . 

ఎన్. గోపీగారు నానీల సృష్టికర్త. 

నానీ చట్రం ఏంటంటే 20 అక్షరాలకి ఎక్కువ, పాతిక అక్షరాలకి తక్కువగా ఉండాలి. 

నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. మొదటి రెండు పాదాల్లో ఏదో ఒక వృత్తాంతం ఉండాలి - తరువాయి రెండు పాదాలు సమర్థవంతంగా మొదటి రెండు లైన్లని సమన్వయం చేస్తూ, చాకచక్యంగా, చమత్కారంగా - ఒక మెరుపు ఉండేలా పూరించాలి. 

నానీ అంటే ఏవో కొన్ని పరిమిత భావాలు కాదు. నానీల ప్రపంచం విస్తారం. 

గద్యరూపంలో చెప్పే గడుసు పద్యం నానీ. 

చిల్లర భవానీ దేవిగారు నానీలు రాసిన మొదటి మహిళ. నేను ఆరవదాన్ని. 

ప్రాణం-ప్రణవం అనే 108 నానీలతో ఒక పుస్తకం రాశాను. 

నా నానీల నుంచి కొన్ని మీతో పంచుకుంటున్నాను

< ఈ కింది నానీల ఫార్మాట్ సరిగా ఉండకపోవచ్చు - విజయశ్రీ గారి లైన్లు గుర్తున్నాయి కానీ పదాలు-పాదాల లెక్కలు తెలీక  free-form లో రాసేశాను >


వివాహమా ఎంత పని చేశావు ?
నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావు

ఆదిశక్తి అంటే ఊరుకోను 
ఆమె శక్తి అనండి చాలు

అర్థ నారీశ్వరమంటే సగభాగమే కదా 
మరి సమానత్వమెందుకు?

మగాళ్లు మంచివారంటారా ?!
అది ఆడవాళ్ల చలవే!"

- అంటూ తన నానీల ప్రసంగం ముగించారు విజయశ్రీగారు.

చివరిగా తెలంగాణ మహిళా కథలు (ప్రోగ్రాం లిస్టులో ఉన్నట్లు కవితలు కాదు) అనే అంశం మీద మాట్లాడడానికి -  పట్టుచీర కట్టుకుని, పొడుగైన జడతో - అచ్చతెలుగు-తెలంగాణ ఆడపడుచు డాక్టర్ త్రివేణిగారు మైకు దగ్గరికి రాబోతూ ఉండగా - ఇంతలోనే విజయశ్రీగారు - ఒక్క ముఖ్యమైన విషయం మర్చిపోయానంటూ మళ్ళీ మైకు దగ్గరికి వచ్చారు.

అసలే సమయం మించిపోయింది -  త్రివేణిగారికి సమయం సరిపోదేమోనని మా 132-గదిలో వున్న మేమందరం - చెప్పొద్దూ - కొంచెం బెంగ పడ్డాం.  పాపం! - ఇండియా నుంచి విమానమెక్కి ఎంతో  మాట్లాడదామని ఆశతో వచ్చారు - కనీసం ఐదు నిముషాలైనా ఆవిడకి దొరుకుతాయో లేదో - అని.

విజయశ్రీ గారు తన నానీల పుస్తకాన్ని మొదటగా పరిశీలించి తన అభిప్రాయం చెప్పిన రవి పసుపులేటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి కూర్చున్నారు.

చివరికి తన వంతు వస్తుందో రాదో అనుకుంటూనే - ఆ చిట్టచివరి ఐదు నిముషాల కోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన త్రివేణిగారు మైకు దగ్గరికి వస్తూనే "ఆఖరి స్పీచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా"అని ఎంతో స్పోర్టివ్‌గా తన ప్రసంగం మొదలుపెట్టి "తెలంగాణ మహిళలు రాసిన కథల గురించి మాట్లాడడానికి వచ్చాను - మీ ప్రోగ్రాంలో రాసినట్లు కవితల గురించి కాదు" అని చెప్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అంతటితో 40వ తానా - సాహిత్య సంబరాలు ముగిశాయి.

వీలైనంతవరకూ అతిథుల్ని పేరు పేరునా పలకరించి అభినందించాను.

సాయిబ్రహ్మానందం గొర్తిగారి దగ్గరికి వెళ్లి పలకరించి ఆయన ఆంధ్రజ్యోతిలో రాసిన "ఆనాటి చెలిమి ఒక కల" కథ గురించి కాసేపు మాట్లాడాను.

అలా మాట్లాడుతూ ఉండగానే - సాయిబ్రహ్మానందంగారు "మీకు నవలలు చదివే అలవాటు ఉందా?" అనడిగి తన నవల - అంతర్జ్వలన - కాపీ ఒకటి సైన్ చేసి ఇచ్చారు - చదివి అభిప్రాయం చెప్పండి అంటూ.

నాకు వెంటనే పుస్తకప్రియులు అమృతరెడ్డిగారు గుర్తొచ్చారు- వెంటనే పక్కనే ఎవరితోనో మాట్లాడుతున్న అమృతరెడ్డిగారిని సాయిబ్రహ్మానందంగారి దగ్గరికి తీసుకెళ్లి - "నాతోపాటు ఇంకొక మంచి పుస్తకప్రియులు వున్నారిక్కడ - ఆయనకీ ఓ కాపీ ఇవ్వండి " అని చెప్పి మొహమాటపెట్టి మరీ ఇప్పించేశాను.

డబ్బులిచ్చి పుస్తకాలు ఎక్కడైనా, ఎప్పుడైనా కొనుక్కోగలం - కానీ రచయిత స్వహస్తాలతో సంతకం చేసి ఇచ్చిన కాపీ మాత్రం ఎక్కడా కొనుక్కోలేం కదా - మరి?!

ఆఖరుగా ఆహ్వానితులైన గెస్టులు, ఆహ్వానించిన హోస్టులు - అందరం కలిసి ఒక పే... ద్ద గ్రూప్ ఫోటో తీసుకున్నాం.  ఫోటోకి రానంటున్న నరిశెట్టి ఇన్నయ్యగార్ని మొత్తానికి ఎలాగో ఒప్పించి ఆయన్నీ మా ఫోటోలోకి తెచ్చేసుకున్నాం.



ఆ ఫోటో తీసుకునే టైంలో - మా వెనక వరసలో నిల్చుని - ఒకరి తరవాత ఒకరుగా చేరుతున్నవాళ్లకి చోటు ఇస్తూ - వెనక్కి వెనక్కి జరుగుతున్న నారాయణస్వామి గారు ఫొటోలో (కన)పడతారో, పడరో అని వారి సతీమణి సావిత్రిగారు కుంచెం బెంగ పెట్టేసుకున్నట్టు క(వి)నిపించారు.

ఫోటోల హడావిడి అయ్యాక - బయట కలిసినప్పుడు త్రివేణి గారి జడను నేను, నా ముక్కు-బులాకీని ఆవిడ పరస్పరం నచ్చేసుకుని - మెచ్చేసుకుని -  మురిసిపోయాం.

నేను ముందే చెప్పినట్టు ఈ ఆఖరి ప్రసంగాల గురించి ఎవరి దగ్గరైనా రికార్డింగ్ దొరికితే మళ్ళీ రాయాలనివుంది.

మొత్తానికి తానా - లిటరరీ కమిటీ వాలంటీర్ పేరుతో - లిటరల్‌గా నేనేమీ చేయలేకపోయినా - నావంతుగా నేను ఒక శ్రద్ధ గల శ్రోతగా - తెలుగుని నిలపడానికి ఎంతో కృషి చేస్తున్న ఈ గొప్ప గొప్ప వ్యక్తులందరికీ - ఉడతా-భక్తిగా చెవులప్పగించాను. వారి మాటలని నా బ్లాగ్ముఖంగా మీకందించగలిగాను.

అన్నటికన్నా నచ్చిన విషయం ఏంటంటే - వక్త:శ్రోత నిష్పత్తి 1:3 - అయినా కూడా ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా - అయ్యో మనమాటలు వినడానికి వున్నది ఇంత మందేనా అనుకోకుండా - పెద్ద మనసుతో వారి స్థాయి కబుర్లని నాలాంటి వారికి కూడా అర్థమయేంత సరళమైన భాషలో ఎంతో ఇష్టంగా పంచుకున్న మా తానా-అతిథులందరికీ వందల-వందనాలు.

నేను శ్రోతగా పాల్గొనాలనుకున్న తానా- సాహిత్య సమావేశాలు అయిపోయాయి. ఆదివారం సాయంత్రం దాదాపు ఏడు కావొస్తోంది.

అమృతరెడ్డి-సుగుణ దంపతులతో కలిసి తానా-వారి-సాయంకాలపు-విందు అందుకుని - నేను సుగుణ గారితో కలిసి ఒక గంట మెయిన్ స్టేజ్ ప్రోగ్రాం చూడడానికి వెళ్ళాను - బదరి వచ్చి నన్ను పిక్ చేసుకునేలోగా టైం ఉందని.

సుజాత వింజమూరి గారి "కృష్ణవేణి" నృత్యరూపకం - అంతకుముందు చూసిందే అయినా - మళ్ళీ చూడడానికి చాలా బావుంది.

దాని తర్వాత ఫేషన్ షో అని ప్రకటించారు.

అప్పుడు గుర్తొచ్చింది - నిన్నమా  లిటరరీ కమిటీ మెంబర్ అయిన గిరిధర్ - తను ఫేషన్ షో లో పాల్గొంటున్నాను అని చెప్పిన సంగతి.

మంచి టైంకి వచ్చాను అనుకుని - గిరిధర్ స్టేజ్ మీద కనిపించే దాకా వుండి - చూసి - బయటికి వచ్చేశాను.



ఇంతలో బదరి నుంచి ఫోన్ - పది నిముషాల్లో కన్వెన్షన్ సెంటర్ దగ్గరకి వస్తున్నానని.

గబగబా బయటికి వస్తున్న నాకు - అక్కడ వరసలుగా పేర్చిన సావనీర్లు కనిపించాయి.

ఒక్క సావనీర్ కాపీ కోసం - నిన్న - అంటే శనివారం రోజున (మే 27) - సావనీర్-కమిటీ వాళ్ళకి - స్వాతిముత్యంలో ఉద్యోగం కోసం సోమయాజుల్ని వెంబడించిన కమల్‌హాసన్‌ని గుర్తు తెచ్చేలా - విసిగించిన నేను గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది.

అక్కడే కూర్చుని వున్న చంద్ర గుమ్మిగారిని - తీసుకోవచ్చా- అని అడిగి ఇంకో కాపీ సావనీర్ "లాభం" అనుకుంటూ ఇంటికి తెచ్చుకున్నాను.

ఇంటికి వస్తూ కార్లో మా సంభాషణ అంతా రేపటి - సోమవారం మే 28, 2017- గురించే.

ఆ సోమవారం ఎలా జరిగిందంటే - ఇక్కడ  చదవాల్సిందే: తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...

ఇక్కడితో ఆదివారం - మే 27, 2017 మధ్యాహ్నం కబుర్లు ముగిశాయి - ఆ ముందు జరిగిన విశేషాల కబుర్లు తదుపరి పోస్టులో - జ్ఞాపకాలలో వెనక్కి నడుస్తున్నాను కదా నేను :)

నేనూ అననా ఓ నానీని ?!

తెలుగు మాట్లాడితే
వినేవాళ్లేరి?
నేనా, తానా ?
తానాలో మేమా? హహ్హహ్హ!


19, జూన్ 2017, సోమవారం

త్వామనురజామి - 14 - చదువంతా... ప్రతి క్లాసు ఆటలాగ సాగింది...


కిందటి 19 చెప్పిన కబుర్లు 

సెకండ్ సెమిస్టర్ మొదలయింది - Data Structures తో పాటు Business Data Processing (COBOL), Accountancy -  ఇవీ మెయిన్ సబ్జెక్ట్స్.

ఈ రెండో సెమిస్టర్‌కి కాలేజ్, హాస్టల్ - రెండూ బాగానే అలవాటు అయ్యాయి.

పైగా వారం వారం ఇంటినుంచి ఫోన్ వచ్చేది. రెండు వారాలకో ఉత్తరం - పెదనాన్నో, లక్ష్మి దొడ్డో,  శ్రీనో, వేణూనో - ఎవరో ఒకరు రాసేవారు. దాంతో బెంగ తగ్గి చదువు మీద కాన్సంట్రేషన్ పెరిగింది.

అకౌంటెన్సీ -  మాకు మూడో, నాలుగో బాచ్‌ల ముందు SVU లో MBA చేసిన రాజశేఖర్ సర్ టీచ్ చేసేవారు. మా అమ్మాయిల MCA క్లాసుకి మొట్టమొదటి మేల్ లెక్చరర్.

అప్పటివరకు ఫిజిక్స్, మాథ్స్ చదివిన నాకు మొదటిసారిగా కామర్స్ సబ్జెక్ట్ చదవడం - ఆ గీతలు గీసి అంకెలు బాలన్స్ చేయడం సరదాగా ఉండేది. దానికి తోడు కేస్ స్టడీస్ అనీ, రియల్ మార్కెటింగ్ ఉదాహరణలు అనీ రాజశేఖర్ సర్ చెప్పే పాఠాలు ఆసక్తికరంగా ఉండేవి.

అప్పటికి లలితా రామకృష్ణన్ అని సీనియర్ బ్యాచ్‌లకు మేనేజ్‌మెంట్ సబ్జక్ట్స్ చెప్పే లెక్చరర్ ఒకావిడ ఉండేవారు. ఒకరోజు ఆవిడ - SV ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ సురేష్ గారితో కలిసి  - మా MCA క్లాసులు జరిగే CC (కంప్యూటర్ సెంటర్) కి వచ్చి - SPIC-MACAY గురించి చెప్పి ఆసక్తి వున్నవాళ్లు మెంబర్స్ కావొచ్చు అని చెప్పారు.

SPIC-MACAY అంటే Society for Promotion of Indian Classical Music and Culture Amongst Youth.

దాంట్లో భాగంగా - దేశంలో గొప్ప గొప్ప సంగీత, నృత్య కళాకారులని మా యూనివర్సిటీకి ఆహ్వానించి - వాళ్ళతో కచ్చేరీలు, ప్రదర్శనలు ఇప్పించే కార్యక్రమాలని ఏర్పాటు చేసే - అవకాశం మాకుంటుందని చెప్పారు.

దానికోసం SPIC-MACAY - తిరుపతి చాఫ్టర్ మొదలు పెడుతున్నారని, మొదటి కార్యక్రమం తొందరలోనే అని చెప్పారు.

నాకింక బోల్డంత ఉత్సాహంగా అనిపించింది - నాకంటూ అభిమాన కళాకారులు ప్రత్యేకంగా ఎవరూ లేకపోయినా ఎటువంటి సంగీతం లేక నృత్యం అయినా ఎంజాయ్ చేసే అలవాటున్న నాకు తెగ నచ్చేసింది SPIC-MACAY.

వెంటనే పాతిక రూపాయల మెంబర్‌షిప్ కట్టి SPIC-MACAYలో చేరాను.



మొట్టమొదటి కార్యక్రమం - ప్రముఖ వయోలిన్ విద్వాంసులు - M. S. గోపాలకృష్ణన్ గారిది.

ఆ కార్యక్రమానికి -  స్టేజ్‌కి ముందూ వెనకా కూడా చాలా ఏక్టివ్‌గా పని చేశాను నేను - నా  సీనియర్స్‌తో కలిసి. మొట్టమొదటిసారి అంత గొప్ప కళాకారుల సభలో వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పడం ఒక మంచి జ్ఞాపకం.

 SPIC-MACAY కార్యక్రమాల కోసం అప్పుడప్పుడు సురేష్ గారి దగ్గరికి SV ఇంజనీరింగ్ కాలేజ్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు శ్యామల, పుని (సునీత) అనే ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలు వచ్చి పలకరించారు. అందులో శ్యామల నన్ను నా ఇంటిపేరు అడిగి - నువ్వూ, నేను కజిన్స్ - అని చెప్పింది.

నాకు భలే తమాషాగా అనిపించింది - ఇప్పటివరకూ నాకసలు తెలియని అమ్మాయి వచ్చి మనిద్దరం కజిన్స్ అని చెప్పేటప్పటికి.

అదెలా అనడిగాను.

నీ ఇంటి పేరు బట్టి చెప్పాను - అంటూ మా ఇద్దరికీ కామన్ అయిన బంధువుల పేర్లు చెప్పింది.

అసలు నన్ను పలకరించాలని నీకెలా తోచింది అనడిగాను.

వెంటనే శ్యామల - "నువ్వు సురేష్ సర్ దగ్గరికి వచ్చినప్పుడు మా క్లాస్ అబ్బాయిలు నిన్ను చూసి నా దగ్గరికి వచ్చి - శ్యామలా! ఈ రోజు నీలాగే ముక్కుకి రింగ్ పెట్టుకున్న ఒకమ్మాయిని చూశాము - చూడడానికి కూడా నీలానే వుంది -  అని చెప్పారు.  నాక్కూడా నాలాంటి అమ్మాయి ఎవరా అని క్యూరియాసిటీ పుట్టి నిన్ను చూడడానికి వచ్చాను" - అని చెప్పింది.

అంతే! ఇంక తనతో బోల్డన్ని కబుర్లు - పప్పి, కుట్టీల గురించి, వాళ్ళని నేను ఎంత మిస్ అవుతున్నానో, శ్యామల తెలియడం వల్ల ఎంత సంతోషంగా ఉందో - ఇవే  కాకుండా నా కాలేజ్ కబుర్లు, హాస్టల్ కబుర్లు అన్నీ మాట్లాడుకుంటూ చాలాసేపు తనతో గడిపి వచ్చేస్తుంటే - అవి చాలనట్లు - "లలితా - ఈ శనివారం మా హాస్టల్ రూంకి రా - సరదాగా కబుర్లు చెప్పుకుందాం" అంది.

వస్తాను కానీ మరీ ఈ శనివారమే కాదు అని చెప్పి వచ్చేశాను.

తర్వాత ఒకటి రెండు సార్లు శ్యామలే తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చినన్ను చూసి వెళ్ళేది. తనకి అప్పుడు చెప్పాను - సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అయ్యాక వస్తానని.


రోజులు మహా ఉత్సాహంగా జరుగుతున్నాయి - కొత్త కొత్త జూనియర్ బాచెస్ వచ్చాయి - అన్ని డిపార్టుమెంటుల్లో - MCAలో కూడా.

ఇంతలోనే రెండో SPIC-MACAY కార్యక్రమం  కూడా ప్లాన్ చేశారు - హరి ప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కాన్సర్ట్.

నాకు జూనియర్స్‌లో శుభా రామస్వామి, రజని, అరుణ అనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో కలిసి కొత్తగా చేరిన మా జూనియర్స్‌ అందరినీ SPIC-MACAYలో మెంబర్స్‌గా చేర్పించాను.


హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వాయించిన - సిరివెన్నెల సినిమా పాటలు తెలుగు అమ్మాయిలకి - ఆయన పండిట్ శివ్‌కుమార్‌శర్మతో కలిసి శివ్-హరిగా సంగీత దర్శకత్వం వహించిన సిల్‌సిలా-పాటలు హిందీ వచ్చిన అమ్మాయిలకి వినిపించేసి - వాళ్ళు నా మాటల-పాటల మైకంలోంచి కోలుకునేలోగా - పాతిక రూపాయలు నా చేతిలోకి, SPIC-MACAY మెంబర్‌షిప్ కార్డు వాళ్ళ చేతిలోకి ఎప్పుడు మారాయో  - కనురెప్ప పాటే అయిందీ - మెంబర్‌షిప్పు ఆట అన్నట్లుగా అయేది.

మొత్తానికి హరిప్రసాద్ చౌరాసియా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

ఆయనతో పాటు తబలా వాయించడానికి ప్రముఖ తబలా విద్వాంసులు అల్లారఖాకి తనయుడు,  జాకిర్ హుస్సేన్‌కి తమ్ముడు అయిన ఫజల్ ఖురేషి వచ్చారు.

వాళ్ళిద్దరితో పాటు స్మిత అని ఇంకొకావిడ కూడా వచ్చారు - తంబుర వాయించడానికి.

ఆరోజు రాత్రి వాళ్ళ భోజనాల టైంలో మా యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో కలిసినప్పుడు సీనియర్ గుత్తి పద్మజ తనకి వచ్చిన ఒక ట్యూన్ ఫ్లూట్ మీద హరిప్రసాద్ చౌరాసియా ముందు వాయించడం ఇంకో బహు మంచి జ్ఞాపకం.

హరిప్రసాద్ చౌరాసియా కార్యక్రమం తర్వాత - మా జూనియర్స్‌లో నా పరపతి, పలుకుబడి బాగా పెరిగిపోయాయి.

అటు సీనియర్స్, ఇటు జూనియర్స్ - మధ్యలో కాలేజ్ టైంలో క్లాస్‌మేట్స్ - వీళ్ళే  కాకుండా తోచీ తోచనివేళ షిప్లీని పట్టుకుని కారిడార్లలో - అప్పటి మూడ్‌ని బట్టి - ఏ ఆకులో ఆకునై అనో  , లేకపోతె ప్రతీ రాత్రి వసంత రాత్రి అనో దేవులపల్లి వారి పాటతో పాటుగా తిరిగే నన్ను ఆపి - వాళ్ళ రూములోకి పట్టుకెళ్లి - "ఆ పాటేదో ఇక్కడ పాడు" - అనే హోంసైన్స్ అమ్మాయిలు, నన్ను దూరం నుంచే చూస్తూ ఇష్టంగా నవ్వే ఇంగ్లీష్ లిటరేచర్ అమ్మాయిలు, సెరికల్చర్ పట్టు-వనితలు, కాబోయే-టీచర్లయిన బీఎడ్ వాళ్ళు - ఒకరేమిటి - హాస్టల్ మొత్తం నా ఫ్రెండ్సే.

పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ - హడావిడిగా చేసేసి వెళ్ళిపోయినా - సాయంత్రం డిన్నర్ టైంలో తీరిగ్గా అందరినీ  ఒకసారి పలకరించి - నాక్కావాల్సిన సాంబార్ బకెట్ (ముక్కలతో నిండుగా వున్నది కావాలి కదా - మరి) ఒకటి ఏ టేబుల్ మీదున్నా సరే - తెచ్చుకుని నా పక్కన పెట్టుకుని - అన్నం తక్కువ - ముక్కలెక్కువ తిని, మా అమ్మ చెప్పి వెళ్లడంతో - ప్రతిరోజూ రాత్రిపూట కొదై  లేకపోతే  కణ్ణగి - పిలిచి మరీ ఇచ్చే ఒక గ్లాసు పాలు పట్టుకుని రూంకి వచ్చేటప్పటికి తొమ్మిదయ్యేది.

అప్పటికి శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లి - అందరూ చదువుకుంటూ వుండేవాళ్ళు.

నాకెప్పుడూ క్లాసులో విన్న పాఠాలు నెమరు వేసుకోవడం తప్ప పుస్తకం పట్టి చదవడం అలవాటు లేదు - మంచం మీద పడుకుని ఆరోజు క్లాస్‌లో విన్న  పాఠాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి - అకౌంటెన్సీలోనో, NM (Numerical Methods) లోనో వున్న హోంవర్క్ పూర్తి చేసేదాన్ని.

ఆగస్టులో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అయ్యాయి. ఈసారి కొంచెం పెద్దయ్యాను కదా - ఒక ఆరు నెలలు - అందులోనూ జూనియర్స్ వున్నారు కదా - ఇంక బెంగంటే బావుండదు కదా -  అందుకని అమ్మ రావాల్సిన అవసరం లేకపోయింది.

థర్డ్ సెమిస్టర్ ఒక రెండు రోజుల సెలవు తర్వాత మొదలయింది.

OB (Organizational Behaviour) లాంటి మేనేజ్‌మెంట్ సబ్జక్ట్స్ పెరిగాయి. సత్యం సర్ టీచ్ చేసే వారు. సత్యం సర్ ఇంకో SVU - MBA ప్రాడక్ట్. ఈయన క్లాసులు సరదాగా జరిగేవి.

ఇంతలో అక్టోబర్ - దసరా సెలవులు వచ్చాయి.

శ్రీలత, నేను, ఇంకా గుంటూరు అమ్మాయిలు - సుమలత, ఉషా లక్ష్మి - అందరం నారాయణాద్రికి టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాం.

నేను టికెట్ రిజర్వ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడూ నాకు సైడ్‌బెర్త్ కావాలని అడిగి మరీ తీసుకునేదాన్ని. ఈసారి కూడా అంతే  - నాదీ, శ్రీలతది పక్క పక్క సీట్స్.

మా లగేజ్ పట్టుకుని ట్రైన్ ఎక్కాము. సీట్లలో కూర్చుని - నోరు మూస్తే ట్రైన్ హోరు వినబడుతుందేమో - దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు - అన్నట్లు మాట్లాడుకుంటూనే వున్నాము.

ఇంతలో ట్రైన్‌లోకి ఒకతను ఎక్కి మా ముందు నుంచే వెళ్లి మా పక్కనున్న సైడ్‌బెర్త్‌-సీట్‌లో కూర్చున్నాడు. మేమంతగా పట్టించుకోలేదు - బోల్డంత మంది ఎక్కుతూ వుంటారు - ట్రైన్ మా సొంతం కాదు కదా.

నారాయణాద్రి గూడూరు స్టేషన్‌లో ఒక గంట ఆగేది - ఇంజిన్ మార్చుకోవడానికి.

మా పక్క సీట్లో అతను గూడూరు స్టేషన్లో దిగి బిస్కెట్ పాకెట్లు, మంచినీళ్ల బాటిల్ కొనుక్కుని మళ్ళీ ట్రైన్ ఎక్కాడు.

తన సీట్లోకి వెళ్ళబోతూ శ్రీలతతో మాట్లాడుతున్న నా దగ్గర ఆగి ఒక గుడ్‌డే బిస్కెట్ పాకెట్ తీసుకోమన్నట్టు నాకేసి చెయ్యి చాపాడు.

"ఏంటిది?" - అప్పటికే నాకు కోపం వచ్చేసింది - ముక్కూ మొహం తెలియని ఎవరో వచ్చేసి బిస్కెట్లు ఇవ్వడం ఏంటి అని.

"పర్లేదు తీసుకోండి - అందరికీ తెచ్చాను" - ఆ అబ్బాయి సమాధానం.

"నేనేమన్నా కుక్క-పిల్లలా కనిపిస్తున్నానా?" - కోపంలో ఏం మాట్లాడుతున్నానో తెలియనంత తిక్కగా అడిగాను.

ఎదురుగుండా శ్రీలత ఏం  మాట్లాడకుండా నవ్వాపుకుంటూ - "వద్దులెండి - మా దగ్గర వున్నాయి " అని చెప్తుంటే - ముందుకు చాచిన చేతిని వెనక్కి తీసుకుని తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడతను.

అతన్నింక ప్రశాంతంగా కూర్చోనివ్వాలనిపించలేదు.

మా దగ్గర ఆగినప్పుడు చూశాను - అతనొక పింక్ షర్ట్ వేసుకుని వున్నాడు.

"శ్రీలత! మీకు తెలుసు కదా - పింక్ వేసుకుంటే మా స్కూల్లో చిన్నప్పుడు ఏం పాట పాడేవాళ్ళమో?" - అనడిగిన  నాకు - "ఏమో లల్లీ - ఏంటది?" అన్న శ్రీలత ప్రశ్న సమాధానం.

"అదే -
 Inky Pinky Ponky
Father had a donkey
Donkey died
Father cried - ఇప్పటికీ పింక్ చూస్తే నాకదే పాట గుర్తుకొస్తుంది"

-  అని నాకు బాగా వచ్చిన పర-మన-ఆందోళన-రాగంలో రెండు సార్లు రాగయుక్తంగా పాడుతూ కిటికీలోంచి బయటికి చూసేటప్పటికి మా పక్క సీట్లోని అబ్బాయి మావైపు రాకుండా కంపార్టుమెంటులో ఆ చివరి వరకూ నడిచి ఎప్పుడు దిగి వెళ్ళాడో - బుద్ధిమంతుడిలా ఒక పుస్తకంలో తల దూర్చి మహ-సీరియస్‌గా చదివేసుకుంటున్నాడు. ఆ చదువరి మళ్ళీ ట్రైన్ కదిలేదాకా లోపలి రాకుండా అక్కడే కూర్చున్నాడు.

ట్రైన్ కదిలిన తర్వాత గుంటురులో దిగే దాకా - దిగాక కూడా అతన్నింక మళ్ళీ చూడలేదు.

దసరా సెలవుల తర్వాత వెనక్కి వెళ్ళి - మళ్ళీ నేను కాలేజ్ కబుర్లు మొదలు పెట్టేదాకా... కొంచెం విరామం.

ఈలోగా ... ఈ పోస్ట్ టైటిల్ పాట - ఈ కింది క్లూ పాట - నే కట్టిన వరస కనిపెట్టి, వరస పెట్టి పాడేసుకోండి మరి...

టైటిలేమిటో - ఆ పాట ఏమిటో 
టైటిలేమిటో - ఆ పాట ఏమిటో  
ఆ టైటిల్... ఓ పాటే ... 
ఆ పాటా అతి మధురము 
ఈ పాటా శృతి మధురము



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

17, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2

ఈ రోజు మధ్యాహ్నం ముందుగా  నేటి సాహిత్యం - తీరు తెన్నుల గురించి సంభాషణ ప్రారంభించిన  ధర్మాగ్రహ-మేఘ గర్జన చందు సుబ్బారావుగారి అధ్యక్షతలో ఇప్పటి వరకూ  కథల కథలు వినిపించినవారు  వాసిరెడ్డి నవీన్‌గారైతే, నవలా ప్రపంచంలో విహరింప జేసినవారు  సాయిబ్రహ్మానందం గొర్తి గారు.

ఆ కబుర్లిక్కడ  చదివేసుకోవచ్చు: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1

ప్రస్తుతపు ప్రసంగం కవి యాకూబ్‌ గారిది.

యాకూబ్‌ గారి - సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరుస్తున్న కవిత:

చందు సుబ్బారావుగారి పరిచయ వాక్యాలతో తన కుర్చీలోంచి లేచి పోడియం దగ్గరికి వచ్చిన కవి యాకూబ్‌ గారు మృదువైన కంఠస్వరంతో తన కిష్టమైన కవితాలోకాన్ని సామాజిక మాధ్యమాల తోడ్పాటుతో ఎంతగా విస్తరించగలుగుతున్నారో చాలా ఉత్సాహంగా వివరించారు.

ఆయన మాటలు నా బ్లాగ్నోట ఇలా :

"అమెరికా వచ్చి మూడు రోజులయింది. వేదిక మీదికి వచ్చి పదినిముషాలయింది. ఈ నిరీక్షణ చాలా బావుంది - వేదిక మీదికి రావడానికి చేసినది.

మా చందు సుబ్బారావు గారిది. మాటల జోరు - జలపాతపు హోరు.

నాకిష్టమైన కవిత్వం గురించి ఇంకా ఇష్టమైన విషయాలు ఒక ఐదారు నిముషాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

 తెలుగు బోధిస్తాను నేను.

విద్యార్థిగా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొంటూ - పాటలు పాడుకుంటూ వచన కవిత్వం వైపు రావడానికి - ఆరోజుల్లో అందరిలాగే శ్రీశ్రీ నాకాదర్శం. - ఇంకా అజంతా, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అభిమాన కవులు.

పాతిక-ముప్పై ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి  చూస్తే తెలంగాణా ఉద్యమం - సంఘర్షణల మధ్య కవిత్వం ఎలా వుంది అని ప్రశ్నిస్తే - కవిత్వానికి కాలం చెల్లిపోయింది - ఏభై-అరవై ఏళ్ళ వాళ్ళు తప్ప ఎవరూ రాయరు - కవిత్వం ఇంక ఉండదేమో - అని రకరకాల సందేహాలు వెలిబుచ్చేవారు.

అలా కవిత్వానికి కాలం చెల్లిపోకూడదని  - నా ప్రయత్నంగా  - కాలేజ్‌లో ఒక నల్ల బోర్డు మీద ఈవారం కవిత  అని శీర్షిక పెడితే ఎవరో పిల్లాడు సాయంత్రం పూట కొన్ని లైన్లు కవిత రాసేవాడు. ఎవరా అని పిలిపిస్తే అతనొక స్లమ్ ఏరియాలో ఉండేవాడు.

పగలల్లా పనిచేసి సేదతీరడానికి అతనాశ్రయించింది కవితని. 

మానవ పథికుడు చేరుకునే విశ్రాంతి మందిరం కవిత.

అతనొక పబ్‌లో పనిచేసేవాడు. సాయంత్రం కాలేజ్‌కి వచ్చి బోర్డుమీద కవిత రాసి పెట్టి వెళ్ళేవాడు. తన కవితలని వార్త, ఆంధ్రజ్యోతి - పత్రికలకి పంపించేవాడు. కానీ ఎవరూ వేసుకునేవాళ్ళు కాదు. అదలాగే జరిగితే అతనేం చేస్తాడు - తన కవితల కాయితాలు, పుస్తకాలు దాచుకుని తాను పెద్దయ్యాక తన పిల్లలకి చూపించుకుని "ఒకప్పుడు నేను కవితలు రాసేవాణ్ణి" అని చెప్పుకుంటాడు. అంతే.

ఇప్పుడు సోషల్ మీడియా అతనిలాంటి వాళ్లకి సహాయం చేస్తోంది.  ఇప్పుడు అతని కవితలు ప్రచురించడానికి ఏ సంపాదకుడూ అవసరం లేదు.

ఎవరైనా సోషల్ మీడియాలో ఒక వేదిక నిర్మిస్తే రాయాలనుకునేవాళ్లు కవితలు రాసి అక్కడ పోస్ట్ చేయగలుగుతారు.

అవి చదివి - "నువ్వు కవివి కావు" అని జడ్జ్ చేయకుండా "ఈ లైను ఇలా రాయి" అని భుజం తట్టేవాళ్ళు కావాలి. చేకూరి రామారావుగారి "చేరాతలు" లా  కొత్తకవులకి ప్రోత్సాహకరంగా మాట్లాడాలి.

శివారెడ్డిలా కాఫీ హోటల్లో కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ కవితలు రాయించాలి.

అలా చేస్తే తెలుగు కనుమరుగు కాదు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న యువకవుల కవితల్లో అపురూపమైన పదజాలం వస్తోంది.

బాల సుధాకర్ మౌళి, కాశీనాథ్, నందకిషోర్ - లాంటి కవులు రకరకాల ప్రాంతాల వ్యవహారిక భాషలో కవిత్వం రాస్తున్నారు.

సామాజిక మాధ్యమాల వల్ల - కవి సంగమం, కవి సమయం, వాట్సాప్ గ్రూపులు - కవులకి వేదికలు ఏర్పాటు చేస్తున్నాయి. 

ఏ కవితలో ఏ గొప్ప శక్తి ఉందో ? 

స్వర్ణాయుల కృష్ణవేణి అని ఒకావిడ ఇంటర్ ఫెయిల్ అయ్యి  ఒకటో తరగతి వాళ్లకి పాఠాలు చెప్తూ ఉంటుంది - కవితలు రాస్తోంది. యూట్యూబులో వీడియో ఉంటుంది - కవిసంగమం తరఫున - చూడండి. 

చేరా-మోడల్లో ప్రోత్సహించి కొత్త కవులతో కవితలు రాయించి 144 కవితలతో ఒక సంకలనం ప్రచురించాం. 

కవిసంగమం డిజైన్ చేశాను. కవిత్వం బతుకుతుంది అని ఆశావహంగా వుంది. 

ఎవ్వరు పని చేసినా ఎల్లలు లేని తెలుగు కోసమే !" -

అని యాకూబ్‌గారు  అంటూ ఉండగానే - ఇంకా - అప్పటికి కూడా - అంతకుముందు వరకూ నిండు గోదారిలా చిక్కగా వున్న గది - ఒక్కసారిగా ఎండాకాలపు-నీటిపాయలా చిక్కిపోయిందని - ఇలా అయితే తెలుగు ఎలా బ్రతుకుతుందని - ఆవేదనతో వున్న చందు సుబ్బారావుగారు "ఆ రాస్తున్నారు - అవీ ఓ కవితలే - ఒక్కరైనా తిలక్ లాగా ఎప్పటికీ నిలిచే ఒక్క వాక్యమైనా రాయగలుగుతున్నారా ?" - అని రుసరుసలాడారు.

అది వింటూనే యాకూబ్‌గారు  - "చందు సుబ్బారావుగారు! మిమ్మల్ని గొప్ప రచయిత అనడానికి మేమున్నాం - మరి మమ్మల్ని కవులని తలుచుకోవడానికి ఎవరో ఒకరు మా తర్వాత వాళ్ళు కూడా ఉండాలి కదా సార్! అందుకే కవిత్వం ఉంటుంది - ఉండాలి సార్! 

కూలి పని చేసుకునే వాళ్ళు, ప్రొక్లైనర్ రిపేర్ చేసే నరేష్ కుమార్ , బార్బర్ షాప్ లో పని చేసే కుర్రాడు - వీళ్ళందరూ కవులమైన నాతో, పాపినేని శివశంకర్‌తో డయాస్ పంచుకుంటున్నామని సంతోషిస్తున్నారు." -

అని చెప్పి ప్రసంగం ముగించారు.

చందు సుబ్బారావుగారు లేచి మైకు దగ్గరికి వచ్చి - "కవితని జడ్జ్ చేయాలి. మీరు వందలు వందలు రాసుకోండి - మేం జడ్జ్ చేస్తాం " - అంటూ నవలా రచయిత సూర్యదేవర రామమోహనరావు గారిని నవల గురించి మాట్లాడడానికి ఆహ్వానించారు.

సూర్యదేవర రామమోహనరావు గారి - పాపులర్ నవల పరిధులు, ప్రయోజనాలు: 

సూర్యదేవర రామమోహనరావుగారి మాటలు - వ్యాపార నవల గురించి:

"సాహిత్యం అంత్యదశలో వుంది. పాఠకులు లేరు. వలసదారులు అజ్ఞానుల్ని చేశారు. ఇప్పటికీ తెలుగులో భట్టి విక్రమార్క కథలు, శిరచ్ఛేద చింతామణి కథలు, యద్దనపూడి నవలలు చదివినవారు ఎక్కువ. 

అసలు రచయితలెలా పుడతారంటే మూడు కారణాలు - అవసరం, ఆవేశం, దురద. 

నేను 80ల్లో డబ్బు కోసం రాశాను. నా నవలలు 60-70 వేల కాపీలు పోయేవి. ఇప్పుడు మూడు వేలు దాటట్లేదు. 

కవిత్వం నెట్లో రాయడం బాలేదు. 

రామోజీరావుగారి కొడుకులు నెట్లో పత్రిక నడుపుదామంటే నేనున్నంత కాలం ప్రింట్ వుండాల్సిందే అన్నారాయన. 

ఒకానొక కాలంలో నవల కోసం లెండింగ్ లైబ్రరీలు కిటకిటలాడేవి. 

ఒక్కో నవల - యండమూరివి  లక్ష,మల్లాది నవలలు 70 వేలు, నావి అరవై వేలు కాపీలు అచ్చయ్యేవి . 

ఇప్పుడు చూస్తే ఏంటి పరిస్థితి? ఓల్గా పొద్దుగూకులూ స్వేచ్ఛే. కుప్పిలి పద్మ - చెలం మైదానం ఆరుసార్లు చదివానంటుంది. నువ్వు రాయాలమ్మా - చదవడం ఏంటి - అనుకుంటాన్నేను. రంగనాయకమ్మ - రామాయణం, భారతం తిట్టడం మానేసి కొత్తవి రాయాలి. 

సాహిత్యం పాడైపోవడానికి కారణం - రచయితలూ రాసినవే రాస్తున్నారు. 

అమెరికాలో నవలలు బాగా చదువుతారు. Ian McEwan రాసిన Nutshell అనే నవల చదివాను. ఒకమ్మాయి కడుపుతో వున్నపుడు తన ప్రియుడితో కలిసి తన భర్తని చంపడానికి  చేస్తుంది. అది కడుపులో వున్న బిడ్డ విని - పుట్టి - పెద్దయ్యాక తల్లి మీద పగ తీర్చుకుంటాడు. ఇది మన భారతంలో అభిమన్యుడి కథలా లేదూ?

Avtaar సినిమా అంతా మన గంధర్వుల, ఉపదేవతల కథ.  

అమెరికా వాళ్ళు మన రామాయణం, భారతం ఆధారంగా కొత్త కొత్త కథలు రాసుకుంటున్నారు.

మరి మనమో - తిట్టుకుంటూ కూర్చుంటున్నాము.
రాజమండ్రిలో - వాస్తు, పంచాంగాలు, అపూర్వ  చింతామణి - అమ్ముకుంటున్నాము. 

పాఠకులని పెంచడానికి ప్రయత్నం లేదు. పబ్లిషర్స్ లేరు. 

మనం కూడా మన రామాయణం, భారతం, వేదాల్లోంచి కొత్తకొత్త కథలు పుట్టించే రచయితలని తయారు చేసుకోవాలి. 

నేను నా నవలలని ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేయించి డెన్వర్ లో ఒక పబ్లిషింగ్ హౌస్ తో కలిసి ప్రచురించాలని ప్రయత్నిస్తున్నాను. 

కౌటిల్యుడెప్పుడో అర్థశాస్త్రంలో రాశాడు - సాహిత్యపు పన్ను వుండాలని, దానితో లైబ్రరీలు కట్టించాలని. 

కర్ణాటక ప్రభుత్వం 7.5% సాహిత్యపు పన్ను వసూలు చేస్తోంది. 

మన రెండు తెలుగు ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చెయ్యట్లేదు. ప్రభుత్వం పూనుకుంటే తప్ప సాహిత్యం నిలవదు"-

- అని కొంచెం ఆవేశం, కొంచెం ఆవేదన, మరి కొంచెం వ్యగ్యం కలిపి ఎన్నో ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు ప్రముఖ నవలా రచయిత - సూర్యదేవర రామమోహనరావుగారు.

ఎల్లలు దాటిన తెలుగు సాహిత్యాన్ని ఎల్లప్పటికీ నిలపడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి అన్న సూర్యదేవర రామమోహనరావుగారి ప్రసంగాన్ని మెచ్చుకుంటూ తర్వాతి వక్త పాలపర్తి ఇంద్రాణిగార్ని - "ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడండి" - అంటూ ఆహ్వానించారు కొంచెం చల్లబడ్డ చందు సుబ్బారావుగారు.

పాలపర్తి ఇంద్రాణిగారి - బాల సాహిత్యం:

చీర కట్టుకున్న సీగానపెసూనాంబలా వున్న ఇంద్రాణిగారు మైకు దగ్గరికి వస్తూనే "నన్ను చిన్నపిల్లని చేసి నాకు  తక్కువ టైం ఇచ్చారు" అంటూ అందరినీ నవ్వించారు.

అప్పటిదాకా వేడిగా, వాడిగా, వెచ్చగా జరుగుతున్న సభ - అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చూపించే చందమామ వెన్నెల సోకినట్లు చల్లబడింది.

ఇంద్రాణి కబుర్లు నాకు భలే నచ్చేశాయి - బహుశా అవి ఇప్పటికీ అవకాశం దొరికితే Legosతో ఆడుకుందామా అనుకునే నా ప్రపంచానికి దగ్గరగా అనిపించినందుకేమో :)

ఇంక మరి  ఇంద్రాణి గారి బాలల-కబుర్లు ఇక్కడ:

"ఇక్కడ బాల-సాహిత్యం గురించి మాట్లాడడానికి వస్తుంటే ఇది గుర్తుకొచ్చింది. చలం గారిని ఒకసారి ఏదో స్కూల్లో సభలో మాట్లాడమని పిలిస్తే వెళ్లి  చెప్పారట : ఇప్పటికిప్పుడు ఈ స్కూల్ పడిపోవాలి - టీచర్లు చచ్చిపోవాలి, పిల్లలు పారిపోవాలి - అని.

నేను చాలా చెప్పాలని వచ్చాను. కానీ టైం  లేదు.

ఇప్పటివరకూ ఈ సభలో పెద్దవాళ్ళు చెప్పిన విషయాలతో నాకేం సంబంధం లేదు.

నాకు చందమామ చదవడం , కార్టూన్స్ చూడడం ఇష్టం. టిన్‌టిన్ చూస్తాను.

చిన్నప్పుడు మా నాన్నగారు సైకిలు మీద ముందు చిన్న సీటు మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లి చందమామ, పిప్పరమెంట్లు కొనిపెట్టేవారు.

చందమామలో బొమ్మలు చాలా అందంగా ఉండేవి - నాకు అద్భుతం గా అనిపించేవి.

అలాగే విజ్‌డం అనే పుస్తకం కూడా చదివేదాన్ని. అందులో ప్రతీ పేజీలో కింద ఒక సూక్తి  వుండేది. నాకు బాగా ఇష్టమైన సూక్తి: " కార్యసాధకుడు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు". 

నాకనిపించేదేంటంటే తల్లులే తొలి బాలసాహితీవేత్తలు.

చిన్నప్పుడు నేను బాగా సెన్సిటివ్. నాకు ధైర్యం చెప్పడానికి మా అమ్మగారు చెప్పిన సూక్తి: ఏనుగు వీధిలో వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. ఏనుగు చలించదు" అది నాకు చాల ఇష్టమైంది - దాన్ని నా పుస్తకాల అలమారులో అతికించుకున్నాను.


గోరంత దీపం కొండంత వెలుగు - మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, ఆకేసి పప్పేసి - అని పాడే చక్కిలిగింతల పాట, చందమామ రావే - అంటూ గోరుముద్దలు తినిపించే అమ్మ పాట - ఇవన్నీ బాలసాహిత్యం కింద వస్తాయి.  ఇవే కాక - వదినగారు మీరు వాసి గలవారు, వండబోయిన చోట కుండ నాకబోయేరు, ఇంకా పొడుపు కథలు - ఇవన్నీ కలిసిన  బాలసాహిత్యం మౌఖికంగానే వ్యాప్తి చెందింది. .

నాకు చిన్నప్పుడు బావా బావా పన్నీరు - బావని పట్టుకు తన్నేరు పాట చాల ఇష్టం. నాకున్న ఇద్దరు బావల్నీ అలా పట్టుకు కొట్టాలని వుండేది. కానీ ఆ కోరిక తీర లేదనుకోండి.

చందమామ కథల్లో అల్లరి దెయ్యాల కథలు నాకు చాలా నచ్చేవి. భయం వెయ్యకపోగా ఆ దెయ్యాలు కనిపిస్తే బావుండనిపిస్తుంది.

రాజకుమార్తెలు, రాకుమారులు, స్వయంవరాలు - ఆ కథలన్నీ అద్భుతంగా ఉండేవి. నాకు స్వయంవరం  కోరిక తీరనే లేదు.

ఇంక భేతాళ కథలు. విక్రమార్కుడికి మౌనభంగం అయి భేతాళుడు చెట్టు మీదికి ఎగిరిపోయినప్పుడు అసలెందుకీ విక్రమార్కుడు మాట్లాడుతాడు అనుకునేదాన్ని. చివర్న వుండే విక్రమార్కుడి సమాధానం చదవకుండా పరిష్కారం ఊహించాలని ప్రయత్నించేదాన్ని. కానీ అప్పటి నా స్థాయికి అది కుదిరేది కాదు.

ఇప్పటికీ చందమామలు చదువుతాను నేను. పాతికేళ్ళ నాటి చందమామ కథ అని పాత కథలతోనే నడిపిస్తున్నారు.

చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను.

పిల్లల కోసం సృష్టించే సాహిత్యం కొంచెం భాద్యతాయుతంగా వుండాలి.

అదెలా అంటే - కథల్ని ఆసక్తి కలిగించేలా చెప్పాలి.

చెప్పకూడనివి చెప్పకూడదు.

ఉదాహరణకి - బుర్రుపిట్ట బుర్రుపిట్ట పాటలో ఎలాంటి భావం వుందో చూడండి - అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది - మగనిచేత మొట్టికాయ తింటనన్నది అనే లైన్లలో.


బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగనిచేత మొట్టికాయ తింటనన్నది

మా పాప చిట్టి చిలకమ్మా - అమ్మ కొట్టిందా అని చెప్పడం మొదలు పెట్టిన ప్రతీసారి ఏడ్చేది - అమ్మ కొట్టడం అన్న భావనే భరించలేనట్లు.

- అంటూ తను మాట్లాడిన ప్రతీ మాటకీ శ్రోతల నవ్వుల-నజరానాలు బోల్డన్ని అందుకుంటూ పిల్లల సాహిత్యంపై ప్రసంగాన్ని ముగించారు ఇంద్రాణి.

ఇంద్రాణి ప్రసంగం అవ్వగానే కొత్తపాళీ-నారాయణ స్వామిగారు లేచి - "ఒక నిముషం మాట్లాడుతాను నేను. ఇంతవరకూ మాట్లాడిన ఇంద్రాణి తన గురించి తను చెప్పుకోలేదు కానీ తను చాలా మంచి కవయిత్రి. ఈ మధ్యనే తన పాపతో తల్లిగా తను జరిపిన సంభాషణల్ని "చిట్టి చిట్టి మిరియాలు"అని ఒక సంకలనంలా తీసుకొచ్చింది" అని ఎంతో ఆత్మీయంగా పరిచయం చేశారు.

అప్పుడు గుర్తొచ్చింది నాకు ఏప్రిల్-2017 ఈమాట సంచికలో చంద్రలతగారు పరిచయం చేసిన ఇంద్రాణిగారి "చిట్టి చిట్టి మిరియాలు" పుస్తక పరిచయం - అది చదవగానే - మిఠాయి పొట్లం లాంటి సమీక్ష – పుస్తకం తప్పక చదవాలి అనిపించేలా వుంది - అంటూ అక్కడ నేను పెట్టిన వ్యాఖ్య.  అది గుర్తుకు రాగానే  అనేసుకున్నాను - ఆ పుస్తకం తప్పక చదవాలని.

--------------------------------------------------------------------------------------------------------------


ఇప్పటికి ఇక్కడ ఆపుతున్నాను. ఈ ముగింపునాటి ముగింపు-పోస్ట్ వచ్చేవారం.  ఆ తర్వాత తొలినాటి కబుర్లకి వెళ్తాను.


తన - తానా - ఒక్క సౌండునుండు
వినగ వినగ దీర్ఘపు జాడ వేరు
తన కబుర్లందు తానా కబుర్లు వేరయా
చెప్పుతుంట నేను - చదవ రండి మీరయా!


10, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1

అప్పటిదాకా పెళ్లిపందిరిలా కిలకిలమంటూ కళకళలాడిన మా నూటముప్పైరెండో గది - ఒక్కసారిగా - రైలెళ్ళిపోయింతర్వాత ఖాళీ అయిన ప్లాటుఫారంలా వెలవెలబోయింది.

వెనక్కి తిరిగి ఎవరున్నారో, ఎవరు లేరో చూడడానికి కూడా మొహమాటం వేసింది.

వేదికమీద తదుపరి కార్యక్రమానికి ఒక్కరొక్కరుగా చేరుతున్న- తానా-అతిధులైన - వారి వారి రంగాల్లో తమదంటూ ముద్ర వేసుకున్న వక్తలని చూస్తూ - వారి కనులకి బోల్డన్ని శ్రోతలుగా కనిపించి ప్రోత్సహించగలిగేలా - నేను ఇంకొన్ని పెక్కు-నేనులుగా మారగలిగే విద్య ఏమన్నా నాకు తెలిస్తే బాగుండుననుకున్నాను.

అసలే అంతకు ముందు జరిగిన బహుళ-జనాదరణ-సంప్రాప్తిత-సాహిత్య కార్యక్రమం మొదలు-ముగింపు రెండూ ఆలశ్యం అవడంతో ఈ సాహిత్య - ప్రక్రియల-ప్రసంగాల కార్యక్రమం  - వక్తలకి, వారికి లభించబోయే సమయానికి - విలోమానుపాతంలో మొదలయింది. 



ఏదైతేనేం - డాక్టర్ చందు సుబ్బారావుగారి అధ్యక్షతన నేటి సాహిత్యం - తీరుతెన్నులు అనే సాహితీ ప్రసంగాల కార్యక్రమం మొదలయింది.


ఆయన ఖంగుమంటున్న గొంతుతో అధ్యక్షోపన్యాసం మొదలు పెట్టి - "ఇంతకుముందు ఇక్కడ మాట్లాడి వెళ్ళినవారు వారివారి వృత్తుల్లో పదిశాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి మాటలు విని అబ్బో - మన తెలుగు బతికేస్తుంది అనుకోవడానికి లేదు. నేటి సాహిత్యం అని తెలుగు గురించి  మాట్లాడుకోవడానికి మిగిలిందేమీ లేదు. ఇంక మనమంతా నిన్నటి సాహిత్యం గురించే మాట్లాడుకోవాలి" - అంటూ మాట్లాడుతుంటే -  నాకనిపించి, నేననుకున్న మాట - "పెద్దాయనకి కోపం వచ్చింది".  కానీ అది ధర్మాగ్రహమే అనిపించింది కూడా.

దాదాపు నూటయాభై మంది సౌకర్యంగా కూర్చోగలిగిన మా నూటముప్పైరెండులో - అందులో పదిశాతం మంది మాత్రమే - అక్కడక్కడా - ఖాళీ కుర్చీల దారంలో గుచ్చిన పూలలా కనిపిస్తుంటే - తానా - అనగా తెలుగు ఎసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా - ఒక విరోధాభాసాలంకారమే (oxymoron) సుమీ - అనింకొక్కసారి అనిపించింది.

వాసిరెడ్డి నవీన్‌గారి - మారుతున్న కథా వస్తువు: 

మొదటగా వాసిరెడ్డి నవీన్‌గారు కథ గురించి, కథల్లో మారుతున్న వస్తువు గురించీ మాట్లాడారు. పూర్తిగా ఆయన మాట్లాడినది - విన్నది - వున్నట్లుగా - అంతా చెప్పలేకపోతానేమో - కానీ ఆయన ప్రసంగ సారాంశం ఇది:

"ఉరుముల పిడుగుల వానలాంటి చందు మాటలు విన్నాం - చందు సుబారావుగారిని ప్రేమగా చందు అని పిలుస్తాము. భావజాలాల్లో ఒకదానికి, వేరొకదానికీ జరిగే సంఘర్షణే చందు ఆవేదన. తన బాధంతా సాహిత్యానికి విలువైన స్థానం లేదని. 

మానవ, సామాజిక ఆర్ధిక సంబంధాలు మారితే విలువలూ మారతాయి. వాటి ఆధారంగా రాసే సాహిత్యమూ మారుతుంది. తెలుగు సాహిత్యపు పరిస్థితి అంత నిరాశాజనకంగా లేదు కానీ మేలుకోకపోతే చచ్చిపోతుంది. ఒకటే ఆశ ఏంటంటే పల్లెల్లో ప్రజల నాలుకల మీద వున్నంతకాలం తెలుగు ఎక్కడికీ పోదు. 

కథ తనకున్న పరిధిలో ఒక సంఘటన గురించి  "ఎందుకు, ఏమని, ఎలా" అనే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.  

నేను కథల మీద పనిచేస్తాను కానీ కథా రచయితనని చెప్పుకోలేను. 

గురజాడ కాలంలో మొదలైన కథలు ఎప్పటికప్పుడు ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులని ప్రతిబింబిస్తూ తదనుగుణంగా మారుతూ వచ్చాయి. 

గురజాడ దిద్దుబాటు కథలో స్త్రీ విద్య వస్తువైతే, కందుకూరి వీరేశలింగంగారి కాలంలో, ఆ తర్వాత వచ్సిన కథల్లో  వితంతు వివాహం ప్రధాన వస్తువయింది. అటుపైన స్త్రీల పక్షాన గొంతు వినిపించిన చెలం కథలు, ఇటీవల గ్లోబలైజేషన్ అంశంగా రాస్తున్నపెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, ఖదీర్‌బాబు కథలు - ఇవీ క్రమంగా మార్పు చెందిన కథా రూపానికి ఆనవాళ్లు. 

<<<ప్రసంగం మధ్యలో కొత్తపాళీ - నారాయణస్వామిగారి టైం చెక్ - సమయం తక్కువుంది - ఇంకా మాట్లాడాల్సిన వక్తలున్నారు అని. >>>

వైయక్తిక జీవితానికి, మానసిక పరిస్థితికి సంబంధించిన ఘర్షణ, సంఘర్షణే కథ, కథకి వస్తువు. 

ఇటీవల సత్యవతి గారి స్త్రీవాద కథ ఒకటి చదివాను.  సూపర్ మామ్ సిండ్రోమ్ అని. ఒక చనిపోయిన స్త్రీ తెల్లగా సున్నంలా మారిపోతుంది. డాక్టర్లు పరిశోధించి - రకరకాల పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్లు - బిళ్ళలు మింగి తానే బిళ్ళగా మారిపోయింది అని చెప్తారు. ఇది అధివాస్తవిక కథ. ఇలాంటి కథల్లో సంక్లిష్టత, అస్పష్టత ఉంటాయి. 

మొన్నొక రోజు ఎవరిదో ఒక కథ చదివి రాసినతన్ని అడిగాను - ఈ కథ అర్థం కాలేదు - మీరేం చెప్పదలచుకున్నారు అని. వెంటనే అతను "మీకో, ఇంకెవరికో అర్థమయ్యేట్లు నేనెందుకు రాయాలి? నేనెందుకు రాశానో నాకే తెలీదు. నా ఘర్షణ చెప్పాలనుకున్నాను. రాశాను" అన్నాడు. 

ఒక మాటలో చెప్పాలంటే కథలకిది సంధికాలం. ఆలోచనల్లో స్పష్టత రావాలి - వస్తుంది. కథ స్వరూపం మారుతుంది. 

 - అంటూ నవీన్‌గారుమారుతున్న కథావస్తువు గురించి తమ ప్రసంగం ముగించారు.

చందు సుబ్బారావుగారు గారు - వాసిరెడ్డి నవీన్‌గార్ని లివింగ్ లైబ్రరీ ఆఫ్ AP అని ప్రశంసిస్తూ - తాము చదివిన మళ్ళెప్పుడొస్తావక్కా అనే కథ గురించి ఇలా చెప్పారు:

విశాఖలో అంధబాలికల పాఠశాలకి గీతమ్స్ కాలేజ్‌లో పని చేసే ఒకావిడ వచ్చి చనిపోయిన వాళ్ళ అబ్బాయి జ్ఞాపకంగా బట్టలు, స్వీట్స్ పంచుతానంటుంది. అప్పుడు అక్కడ వున్న అంధబాలికల్లో ఒక పిల్ల - మాకు స్వీట్స్ వద్దక్కా - అంటూ ఆవిడ చెవిలో - వ్యక్తురాళ్ళైన ఆడపిల్లలకికావలసిన వస్తువులు కావాలని చెప్తుంది. ఆవిడ అలాగే వాళ్ళకవసరమైనవి కొని తెచ్చిస్తే అవి చూసి వార్డెన్ - ఎవరిచ్చారు - అనడుగుతుంది. మొన్నొచ్చిన అక్క ఇచ్చిందని ఆ పిల్లలు చెప్తే - వార్డెన్ ఆ ఇచ్చినావిడని ఇంకెప్పుడూ రావద్దని చెప్తుంది. అలా వెళ్ళిపోతున్న ఆవిణ్ణి ఆ అంధబాలికలు " మళ్ళెప్పుడొస్తావక్కా" అనడగడం - ఇదీ కథ 

ఈ కథని ఏ పత్రికల వాళ్ళూ వేసుకోలేదు. 

ఈ కథ కళ్ళు లేని ఆడపిల్ల పెద్దదయే కష్టం కథ. ఇలాంటి కథలు రాయాలి. 

విషయం చిన్నదైతే ఇలా కథ - అదే పెద్దదైతే నవల. 

ఇప్పుడలాంటి నవల గురించి సాయిబ్రహ్మానందం గొర్తి గారు మాట్లాడతారు -

- అంటూ తర్వాతి వక్త సాయిబ్రహ్మానందం గొర్తి గారిని నవల గురించి మాట్లాడమని ఆహ్వానించారు.

సాయిబ్రహ్మానందం గొర్తి గారి - ఇటీవలి నవల:

సాయిబ్రహ్మానందంగారు తన మృదుసామగ్రి అయిన లాప్‌టాప్ తెచ్చుకున్నారు కానీ చెవులప్పగించాల్సిన చోట కళ్లప్పగిస్తామేమో అని ప్రొజెకర్లేవీ మేము అమర్చలేదేమో - పాపం - లాప్‌టాప్‌ని మాట్లాడే మైక్ దగ్గరే పెట్టుకుని  కొంచెం ఇబ్బంది పడుతూనే ప్రసంగించారు.

ఆయన చెప్పిన మాటలు -నాగ్గుర్తున్నంతవరకూ ఇవి -

"నేను కొన్ని కథలు, రెండు నవలలు రాశాను. 

నవల అనేది విస్తృతమైన వస్తువు. నాకు కేటాయించిన పదిహేను నిముషాల్లో - ఇటీవల నవలల్లో వచ్చిన మార్పులు, నా పరిశీలన - సాధ్యమైనంత వరకూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. 

ప్రపంచ సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అందులో నవలది పెద్ద స్థానం. 

సాహిత్యం జీవితం నుంచి పుడుతుంది. కథ ఒక సంఘటన అయితే  నవల  జ్ఞాపకాలని గుదిగుచ్చి చూపిస్తుంది. మనిషి జీవితానికి దగ్గరగా వుండే వస్తువు. 

నవల పాశ్చాత్య ప్రక్రియ. నావెల్ అనే మాటలోంచి నవల వచ్చింది.

తెలుగులో వేల నవలలు వున్నాయి. ఏ కాలపు నవలది  ఆ కాలపు ఆలోచన. ఇప్పుడు నవల తీరు మారింది. స్త్రీవాద నవలలు వచ్చాయి - ఇవి వెస్టర్న్ టైప్. ఆలోచనల నవలలు - యండమూరివి ఈ తరహాలో ఉంటాయి. 

సాంకేతిక ప్రగతి వచ్చాక నవలలు తగ్గాయి - పత్రికలు తగ్గాయి - పాఠకులు తగ్గారు. నవలలకి పబ్లిషర్స్ లేరు. USలో నవలలు చాలా ముఖ్యమైనవి. USలో 30-40 శాతం సినిమాలు నవలల ఆధారంగా తీస్తారు. మన తెలుగు సినిమాలెలాగూ వెస్టర్న్ సినిమాలకి కాపీలు కాబట్టి నవలల అవసరం లేదు. 

ఇటీవల వచ్చిన - నేను చదివిన - కొన్ని మంచి నవలలు: వి. చంద్రశేఖర్ రాసిన నల్ల మిరియం చెట్టు, నక్కా విజయరామారావు - నాగమ్మ కథ, నామిని - మూలింటామె, కల్పనా రెంటాల - తన్హాయి.  

<<<మళ్ళీ ఇంకొక్కసారి  కొత్తపాళీ - నారాయణస్వామి గారి టైం చెక్  - ఈ టైం చెక్కులెలా గుర్తున్నాయీ అంటే - అసలు సమయం లేదు అని ఒక్కొక్క వక్తకీ పది-పదిహేను నిముషాలు కేటాయించినప్పుడు అసలింతమందికి  ఆ పది-పదిహేను నిముషాలైనా అందుతాయో లేదో పాపం అంత దూరం నుంచి వచ్చారు అని నాలో నేనే అనుకునేవేళ  నారాయణస్వామిగారు టైం చెక్ చేయడం - దాన్ని పైకి బిగ్గరగా అనడం నాకు నిజంగా నచ్చింది - గుర్తు పెట్టుకున్నాను కనుక :) >>> 

నిన్న సంజనాపద్మం మాట్లాడుతూ 2000 పేజీల నవల రాస్తున్నాను అనగానే సంతోషించాను. 

కలకత్తాలో ఒక ఇండియన్ అబ్బాయి అనాధగా తిరుగుతూ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటుండగా ఒక ఆస్ట్రేలియన్ కుటుంబం అతన్నిఅడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర పెరిగి పెద్దయిన తరవాత ఆ అబ్బాయి తన మూలాల్ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు. ఆ అనుభవాలన్నింటినీ ఒక నవలగా రాస్తే 30 భాషల్లోకి అనువదించారు. దాన్ని Lion అనే సినిమాగా తీస్తే ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. 

మనుషుల జీవితాన్ని పట్టి చూపుతుంది నవల అనడానికి ఇది మంచి ఉదాహరణ -

- అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సాయిబ్రహ్మానందం గారు.

-------------------------------------------------------------------------------------------------------------------

అసలు ఈ ప్రసంగాలు వీడియో రికార్డ్ చేద్దాం - మా ఇంట్లోంచి వీడియో cam తీసుకెళ్లి అన్న ఐడియా చాలా ఆలస్యంగా వచ్చినందుకు నన్ను నేనే బోల్డంత "హన్నా!" అనేసుకున్నాను.

ఈ ప్రసంగాల విశేషాలన్నీ పైపైన రాసేద్దామనుకున్నాను కానీ మనసొప్పలేదు.

రాయడం మొదలు పెట్టేదాకా తెలియలేదు - నేను రాయాలనుకున్నదీ, రాయాల్సిందీ ఎంత ఉందో!

నేను విన్నదంతా నా ఆత్మీయులైన మీతో  - నాతో పాటు మీరూ వినివుంటే బాగుండును అనుకుని - అలా జరగలేదు కాబట్టి గుర్తున్నంతవరకూ నేను విన్న మంచి కబుర్లు మీతో చెప్పేసుకోవాలని - ఈ తానా-కబుర్ల సిరీస్ మొదలుపెట్టాను.

చివరికి నేననుకున్నట్టే - నా తానా-సిరీస్ మెమెంటో సినిమా లాగే ముందుకీ వెనక్కీ - నడుస్తోంది.

మే 28 మధ్యాహ్నపు కార్యక్రమ విశేషాలు ఒక పోస్టులో వచ్చేస్తాయి అనుకున్నాను కానీ - రెండు మూడు భాగాలు అయ్యేలా వున్నాయి.

కబుర్లు మొదలు పెట్టడానికి స్టార్టింగ్ ట్రబుల్ 
మొదలుపెట్టాక ఆపడానికి స్టాపింగ్ ట్రబుల్ 
- వెరసి డబుల్-ట్రబుల్ :)
ఒకటి ముందో - ఇంకోటి వెనకో 
అపేక్షకో - ఆక్షేపణ లేకో 
మీ కాలక్షేపానికో  
తప్పక - కొనసాగిస్తాను కబుర్లు 
Stay Tuned !

3, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...

 కిందటి వారం అన్నజింక  వేసవి సెలవులకని ఇంటికొచ్చినపుడు వాడితో ఏవో సినిమా కబుర్లు చెప్తూ బదరి మెమెంటో (మన తమిళ-తెలుగు-హిందీ గజినీల ఆంగ్ల మాతృక మెమెంటో) ఎంత బావుంటుందో చెప్తూ - అసలు క్లైమాక్స్ నుంచి వెనక్కి సినిమా తీయడానికి అసలా డైరెక్టర్‌కిఎంత ధైర్యం ఉండాలి - అంటూ తెగ మెచ్చేసుకుంటుంటే విన్నాను.

అదుగో - అప్పుడే అనుకున్నాను - నా ఈ నాలుగైదు నెలల నానా సంబరాల తానా విశేషాల కబుర్లని చివరిరోజు  నుంచి మొదలుపెట్టి వెనక్కి చెబ్దామని.

అదెలాగంటే ...
తా(నా) సంబరాల తాజాకబుర్లు  - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు  - <పోస్ట్ పేరు>
తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - <పోస్ట్ పేరు>
 తా(నా) సంబరాల తాజా(-3)కబుర్లు - <పోస్ట్ పేరు>
 ... ... ...  ... ... ... ... ... ... ... 
 ... ... ...  ... ... ... ... ... ... ...
 తా(నా) సంబరాలు - మజాగా మొదలు   - <పోస్ట్ పేరు>

అదీ వరస. 

లెక్కప్రకారం తానా-2017 మే 28తో ఆఖరు. కానీ నావరకు నాకు ఆ సంబరం గురువారం (జూన్ 1) దాకా కొనసాగింది.  

సోమవారం మాకు సెలవు రోజు కదా (మెమోరియల్ డే) - అనుకున్న ప్రకారం పొద్దున్నే లేచి తయారయి బదరి సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌కి వెళ్ళి మా అపురూప-అతిథులని ఇంటికి తీసుకొచ్చేట్లు, నేనేమో వాళ్ళు ఇంటికి వచ్చేలోగా ఆట్టే ఆటలు-పాటలతో కాలక్షేపం చేయకుండా బుద్ధిగా వంట చేసేట్టు - ఒడంబడికలు జరిగిపోయాయి. 

తొమ్మిదింటికల్లా వంట మొదలుపెట్టి దోసకాయ పప్పు, బంగాళదుంప వేపుడు, గోంగూరపచ్చడి, టమాటాచారు, వూరుమిరపకాయలు చేసేసి - బదరితో ముందు రెండు రోజుల తానా-కబుర్లు చానా ఉత్సాహంతో చెప్పేస్తూ వున్నాను నేను.

నా మాటలు వింటున్న తను ఉన్నట్టుండి - ఇవాళ మనింటికి రాం-రాబర్ట్-రహీం వస్తున్నారు కదా! - అంటూ చిన్నగా నవ్వారు.

అది వినగానే - భలే చెప్పారు బావా - అంటూ నా సెల్‌ఫోన్‌ చూసిన నాకు అందులో  10:22 AMకి ఒక మిస్డ్‌కాల్ కనిపించింది. వెంటనే నేను ఆ నంబర్ మా అతిథుల్లో ఒకరిదిగా గుర్తు పట్టి ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా పిలుపు చేరట్లేదు. 

కొంచెం కంగారుగా అనిపించింది.

అరెరె -  ఊరు కాని ఊళ్ళో వాళ్ళింటికి రమ్మని చెప్పింది - తీరా ఫోన్ చేస్తే తీయను కూడా తీయలేదు - అనుకుంటారనే కాక చెప్పినట్లు బదరి ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నారేమో - అన్చెప్పి వెంటనే వారుంటున్నామని చెప్పిన అమెరికా కన్వెన్షన్ సెంటర్ పక్కనే వున్న Mariott కి గూగుల్లో ఫోన్‌నంబర్ వెతికి ఫోన్ చేస్తే నేను చెప్పిన ఇంటిపేరుతో వాళ్ళ హోటల్లో ఎవరూ బస చేయలేదని ఆ స్వాగతకర్త్రి చెప్పింది. 

అలా చెప్తూనే రోడ్డుకావల ఇంకో Mariott ఉందని చెప్పి ఆ ఫోన్‌నంబర్ ఇచ్చింది. వెంటనే అక్కడికి ఫోన్ చేసి ఇంటిపేరు చెప్పగానే అక్కడి స్వాగతకర్త్రి వెంటనే ఆ గెస్ట్ వున్న గదికి ఫోన్ కలిపింది. కానీ ఎవరూ ఫోన్ తీయట్లేదు. 

ఇంతలో బదరి బయల్దేరారు - హోటల్ దగ్గరికి వెళ్ళి కనుక్కుని మా ఇంటికి వచ్చేవారిని తీసుకుని వస్తానని.

తను బయల్దేరిన పావుగంటకి ఒక తెలియని నంబర్‌నుంచి కాల్ వచ్చింది. తీసినవెంటనే అవతలనుంచి మా అతిథుల్లో ఒకరైన వాసిరెడ్డి నవీన్‌గారు - "లలితగారు! నా ఫోన్ ఎందుకో పని చెయ్యట్లేదు - అది చెబ్దామనే చేస్తున్నాను" అనగానే "నమస్తే అండి నవీన్‌గారు! బదరి బయల్దేరారు - వచ్చేస్తూ వుంటారు. మీరిప్పుడు చేసిన ఫోన్‌నంబర్ తనకివ్వనా?" - అనడిగితే "వద్దమ్మా! ఈ ఫోన్ నాది కాదు - నేను లాబీలోనే కూర్చుని వుంటాను" అన్నారు. 

సరేనని ఆ ఫోన్ పెట్ట్టేశాక వెంటనే బదరికి ఫోన్ చేసి - బావా! నవీన్‌గారి ఫోన్ పనిచేయట్లేదు - అని చెప్తూనే వున్నాను - ఇంతలో మళ్ళీ నవీన్‌గారి నుంచి ఫోన్ - ఫోన్ పనిచేస్తోందని. 

మొత్తానికి మా ముగ్గురు అతిథులని తీసుకుని వస్తూ బదరి ఫోన్ చేశారు - నాతో సహా అందరూ మంచి ఆకలి మీద వున్నాము - అంటూ. 

వంట అయిపొయింది - వాళ్ళొచ్చేలోగా ఇంకో అరగంట టైం వుంది అని మెంఫిస్ తిరుగు ప్రయాణంలో వున్న రమా-సదా దంపతులకి ఫోన్ చేసి ముందు రోజు మళ్ళీ కలవలేకపోయినందుకు సారీ చెప్పి - మళ్ళీ తీరికగా ఒకసారి సెయింట్ లూయిస్ చూడడానికి రమ్మని ఆహ్వానించి - తర్వాత వసుధకి ఫోన్ చేశాను. 

వసుధతో - ముందు రోజు సినీ సాహిత్య ప్రసంగాల్లో కలిసిన అయోధ్యకుమార్ గురించి మాట్లాడి - ఆ మాటల మధ్యలో మా ఇంటికి వస్తున్నవారి గురించి చెప్పాను. 

అది వినగానే తనూ సంబరపడి - సాయంత్రం వాళ్ళని కలవడానికి వస్తాను వీలైతే అయోధ్య కుమార్ తో కలిసి అని. 

సరే అని ఫోన్ పెట్టానో లేదో మళ్ళీ ఐదు నిముషాల్లో ఫోన్ చేసి గోగినేని బాబు గారిని తీసుకు రావచ్చా అనడిగింది వసుధ. 

"ఆయన బేబీ కాదు కదా - అల్లరి చేయరు కదా - అలా అయితేనే తీసుకురా" అని కొంచెం తనని ఆట పట్టిస్తూ నా గాలి-కబుర్లేవో చెప్తూనే వున్నాను - ఈలోగా మా బుజ్జిజింకలిద్దరూ - they are here - అంటూ తలుపు తీయడానికి వెళ్ళి - లోపలి వస్తున్న ముగ్గురినీ - వాసిరెడ్డి నవీన్‌గారు, కొలకలూరి ఇనాక్‌గారు, కవి యాకూబ్‌గార్లని - చేతులు జోడించి - నమస్తే - చెప్తూ ఆహ్వానించారు. 

నేను కూడా వసుధకి bye చెప్పేసి - రండి రండి - అంటూ ఎదురెళ్ళి - మీ ముగ్గురినీ మా బదరి రాం-రాబర్ట్-రహీం అన్నారు - అనగానే యాకూబ్‌గారు "భలే" అని ముచ్చట పడ్డారు.   

లోపలి వస్తూనే యాకూబ్‌గారు చుట్టూ చూస్తూ కనులానిన ప్రతిచోటా కనిపిస్తున్న లెగో్‌స్‌ని చూసి - ఎన్ని బొమ్మలో - అని ఆశ్చర్యపోయారు. అవి బుజ్జిజింక చేసినవి అని చెప్పగానే - పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మీ ఇల్లు - అని మురిపెంగా మెచ్చుకున్నారు.

వచ్చిన ముగ్గురూ - సోఫాల్లో కూర్చుని సేద తీరాక - ఓ పది నిముషాలు పరిచయాలు, కుశలప్రశ్నలూ అయ్యాక - వచ్చిన అతిథులకి, బదరికి భోజనాలు వడ్డించాను. బుజ్జిజింకలు అప్పటికే తినేసి ఉన్నారేమో వాళ్ళ గదిలోకి వెళ్ళి పుస్తకాలు చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

భోంచేస్తూ - ఎర్రగా వేగిన బంగాళదుంపల వేపుణ్ణి - తింటూ నవీన్‌గారు - "అసలమెరికాలో బంగాళదుంపలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది - ఇలా వేగనే వేగదు - భలే చేశావమ్మా" అని మెచ్చుకున్నారు. అలా అంటూనే - "వంకాయ కూరకూడా అంతే , మీ అమెరికాలో బా రాదు. నేను వంకాయ కూర చాలా బాగా చేస్తాను" - అన్న ఆయన మాట విని నేను వెంటనే చెప్పాను - "అయితే మీరింకోసారి మా ఇంటికి రావాల్సిందే నేను చేసే వంకాయ కూర తినడానికి" - అని.

కబుర్లు చెప్పుకుంటూ - నా వంటలని పదేపదే మెచ్చుకుంటూ - మా బదరి-సహిత అతిధి-త్రయం నెమ్మదిగా సోఫాలో చేరారు మళ్ళీ.

ఇనాక్‌గారు భోజనానికి ముందే - అయిన తర్వాత పడుకుంటానని చెప్పడం వల్ల - బదరి ఆయన్ని తీసుకెళ్లి - పైన మా బెడ్‌రూంలో పడుకోమని చెప్పి వచ్చారు.

ఇంక - నవీన్‌గారు "ఒక్క ఐదు నిముషాలు పడుకుని లేస్తాను - ఈలోగా మీరు భోంచేసి రండి" అని నాకు చెప్తూనే సోఫాలో వాలారు.

పక్కనే రిక్లైనర్‌లో కూర్చున్న యాకుబ్‌గారూ నెమ్మదిగా కాళ్ళు చాపారు.

రెండు నిముషాల్లో గాఢనిద్రలోకి జారిపోయారు  నవీన్‌గారు. కళ్ళు మూతలు పడుతున్న యాకుబ్‌గారిని ముందు గదిలో వున్న ఇంకో సోఫాలో పడుకోమని చెప్పాము.

యాకుబ్‌గారు పడుకున్న పది నిముషాలకి అమృతరెడ్డిగారు ఫోన్ చేశారు - "నేను ఇటుపక్కకి వచ్చానండి - యాకుబ్‌గారు మిసిసిపి చూడాలని ఉందన్నారు కదా - వస్తానంటే తీసుకెళ్దామని" అంటూ. నేనాయనకి చెప్పాను - ఇప్పుడే పడుకున్నారండి, పాపం లేపాలనిపించట్లేదు , బాగా అలసిపోయి వున్నారు - వద్దులెండి" అంటూ - "ఒకవేళ ఆయన ఒక అరగంటలో లేస్తే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, వీలైతే వద్దురుగానీ " అని కూడా చెప్పాను.


ఇండియాలో బయల్దేరిన దగ్గర్నుంచీ ఒక్క క్షణం తీరిక లేకుండా అలసిపోయి వున్నారేమో ఒక మూడుగంటలు గాఢంగా నిద్రపోయారు వాళ్ళిద్దరూ - ఇనాక్‌గారు ఇంకొంచెం ఎక్కువసేపు. 

ముందుగా నవీన్‌గారు  లేచారు. ఓ రెండు గంటలు మాతో కబుర్లు చెప్పారు. తానా తెర-ముందు-విశేషాలు, తెర- వెనుక-తమాషా కబుర్లు - ఎన్నో బోల్డన్ని కబుర్లు.

అసలు కథలెలా రాయాలి - అన్న బదరి ప్రశ్నకి చాలా విపులంగా ఆ  టెక్నిక్స్ & టెక్నికాలిటీస్ గురించి చెప్పారు.

కబుర్లు అలా అలా సాగుతూ తానా-సావనీర్ దగ్గర ఆగాయి.

"నేనూ రాశానండి - సావనీర్లో" అనగానే "ఏదీ చూపించండి - నేనే ఎడిట్ చేశాను దాన్ని" అన్నారు నవీన్‌గారు.

నా "ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే" వ్యాసం చూపించగానే - "ఓ లలిత టి .ఎస్ అంటే మీరా? ఇది మీర్రాశారా ? నేనే సెలెక్ట్ చేశాను దీన్ని - చదవగానే బావుందనిపించి" అనగానే నాకు బోల్డంత సంబరం - నా గాలి కబుర్లు నవీన్‌గారంతటి వారికి నచ్చాయని తెలియగానే.

ఇంతలో - నిద్ర లేచిన యాకుబ్‌గారు కూడా - నేను టీ కలిపి తెచ్చేలోగా - నా ఎల్లలు దాటే-ఎల్లెడలా వెలిగే చదివి - "మీ వాక్యం పరుగులు పెడుతుంది - శైలి బావుంది" అని చెప్పారు. నా బోల్డంత సంబరం ఇంకో బోల్డంత అయింది.

నెమ్మదిగా సాయంత్రం ఆరు-ఆరున్నర అయింది. వారి బంధువులు గోకుల్, అభిజ్ఞ రావడంతో నవీన్‌గారు వాళ్ళతో వెళ్ళిపోయారు - మళ్ళీ మా ఇంటికి వస్తానని మాటిచ్చి.

ఆయన వెళ్లిన అరగంటకి ఇనాక్‌గారు లేవడం, ఇంతలో గోగినేని బాబుగార్ని తీసుకుని వసుధ, వెంకట్ మా ఇంటికి రావడం - అప్పుడు మొదలుపెట్టి రాత్రి భోజనాలు అయ్యేదాకా - బాబుగారు, యాకుబ్‌గారు, ఇనాక్‌గారు, బదరి, వసుధ - మాట్లాడుతూ ఉంటే వినడం - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు - అని పాడుకోవాలనిపించే సందర్భం నాకు.

మాటల మధ్యలో - ఈరోజుల్లో అబద్ధాలు వాస్తవాలుగా ఎలా చలామణీ అవుతున్నాయో - అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే  "ఈ రోజుల్లో వాస్తవాలు లేవండీ - ఉన్నవన్నీ వాట్సాపవాస్తవాలు" అన్న నా సరదా-కబుర్లు విని బాబుగారు "బావుంది మీ మాట " అని మెచ్చేసుకుంటే - వసుధ అభిమానం "లలిత మాటలంతే భలే ఉంటాయి" అని దాన్నింకొంచెం హెచ్చవేసింది.

భోజనాలవగానే వసుధ, గోగినేని బాబుగారు వసుధ వాళ్ళింటికి వెళ్ళారు.

మరసటి రోజు మంగళవారం. యాకుబ్‌గారి ప్రయాణం డెన్వర్‌లో వున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి - ఫ్లైట్ మధ్యాహ్నం మూడింటికి.

పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి యాకుబ్‌గారు, ఇనాక్‌గారు ఒక అరగంట వాకింగ్ చేసి వస్తామని వెళ్ళారు.

ముందురోజు అనుకున్న ప్రకారం వసుధ తొమ్మిదింటికి వచ్చి- క్లేటన్‌లో ఎథికల్‌సొసైటీలో బాబుగారివ్వబోతున్న ప్రసంగానికి - అదయిన తరవాత మిసిసిపి-మిజొరి సంగమం చూపించడానికి ఇనాక్‌గారిని తీసుకెళ్ళి - సాయంత్రం మా ఇంట్లో దిగబెడ్తానని చెప్పింది.

ఇంట్లో వున్న యాకుబ్‌గారు "ఇవాళ ప్రయాణం లేకపోతే నేనూ మిసిసిపి చూసేవాణ్ణి" అనుకున్నారు ఒకసారి. అంతలోనే కొన్నిగంటల్లో చూడబోతున్న మనవణ్ణి తలచుకుని మురిసిపోయారు.

యాకుబ్‌గారు వారి సతీమణి లక్ష్మి గారి గురించి సౌభాగ్య గారు రాసిన పరిణత కవయిత్రి శిలాలోలిత పుస్తకం ఇచ్చారు నాకు.

మీ పుస్తకాల పేర్లు చెప్పండి - ఈసారి ఇండియా వచ్చినపుడు కొని తెచ్చుకుంటాము - అంటే - "నేనిస్తాను గదరా తల్లీ!" - అంటూ ఎంతో నొచ్చుకున్నారు - కవి యాకుబ్. 

బదరితో భోజనం చేస్తూ - "బదరిగారు! నిన్నటినుంచి మీమాటలు వింటూ అనుకుంటున్నాను - మీరూ మా ఖాతాలోని వారే" - అంటూ ఎంతో అభిమానంగా మమ్మల్నీ వారి ఆత్మీయుల్లో చేర్చేసుకున్నారు యాకుబ్‌గారు.

ఒంటిగంటకు బదరితో ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరుతూ "బై 1205" అని మా ఇంటికీ చెప్పి వెళ్ళారు  - కవి యాకుబ్ .

ఐదున్నరకల్లా ఇనాక్‌గారిని ఇంట్లో దింపి వెళ్ళింది వసుధ.

పగలంతా తిరుగుతూ అలసిపోయిన ఇనాక్‌గారు భోంచేసి తొందరగా పడుకుండిపోయారు.

సాయంత్రం ఏడుంపావుకి కాలిఫోర్నియా నంబర్ నుంచి నాకొక కాల్ వచ్చిందని చెప్పారు బదరి. ఎవరా అని వెంటనే చేస్తే - అవతల నుంచి - సాయి బ్రహ్మానందం గొర్తి గారు - "నవీన్‌గారు ఇచ్చారు మీ నంబర్. తానాలో మీతో మాట్లాడ్డం కుదరలేదు - మీరు ముందే తెలిసుంటే బావుండేది" -  అంటూ.

అది వినగానే తానా-నాకు-చానా-మంచి-చేసింది అనిపించింది.

ఎక్కడో ఏదో నాలుగు గాలి-కబుర్లు రాసుకునే నాకు సాహిత్యంలో వాళ్ళదైన ముద్ర వున్న వీళ్ళందరి పరిచయం, ఆదరణ - కలగడం, దొరకడం - దానికి కారణం - తమదైన మనఃశ్రీగంధపు-తావిని వారిపక్కనున్న నాలాంటి వాళ్ళక్కూడా ఆపాదించగలిగిన వాళ్ళ-మంచితనం.

 బుధవారం అన్నజింక  ప్రయాణం - కాలిఫోర్నియాకి . వాడిని విమానం ఎక్కించి - ఇనాక్‌గారితో సెయింట్ లూయిస్ ఆర్చ్, మెరామెక్ కావెర్న్స్ సందర్శనం - తర్వాత సిగ్నేచర్-ఇండియా లో భోజనం.

భోజనం చేస్తున్న నా మొహంలో అలసట చూసి - ఇనాక్‌గారు - "అమ్మా ! రేపింక మీరు కష్టపడొద్దు - నాకు పాలల్లో ఓట్స్ ఇచ్చేయండి" అనగానే ఆయన ఎంత సున్నిత మనస్కులో - భాషలోనే కాదు, భావంలోనూ ఎంత ఉన్నతులో అనిపించింది.

ఆయన మాట నేను విన్లేదు - అది వేరే సంగతి. అమ్మో - ఓట్స్ పెట్టేస్తే నేను చేసే కట్టు-పొంగలికి పొగడ్తలెలా వస్తాయి?! బెంగెట్టేసుకోదూ ?!

ఇనాక్‌గారు బదరితో  "బదరిగారు! మీరదృష్టవంతులు - అమ్మాయిలో ఇంకా ఆ బాల్యగుణం అలానే వుంది. మనుషులు కావాలి, మా ఇంటికి రావాలి - మాతో ఉండాలి అనుకోవడం పిల్లల స్వభావం - ఈమె ఎప్పటికీ రఫ్‌గా  వుండలేదు" అని అంటూ "నేను చిన్నప్పుడు ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళు వెళ్ళిపోకూడదని వాళ్ళ సంచీ నా స్కూల్ బాగ్లో దాచేసేవాణ్ణి" - అని ఆయన చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు.

అన్నట్టు - మర్చిపోయాను - నాకు వారి అమ్మాయి కొలకలూరి మధుజ్యోతి రాసిన నాన్న పుస్తకం ఇచ్చారు ఇనాక్‌గారు. తానా పుణ్యమా అని నా పుస్తకాస్తి పెరిగింది.

ఇంకో ముఖ్య విషయమేంటంటే - తానా-సాహిత్య కమిటీ ప్రసక్తి వచ్చిన ప్రతీసారి ఇనాక్‌గారు అమృతరెడ్డి గారిని "He is a nice gentleman" అంటూ ఇష్టంగా తలచుకునేవారు. 

ఇంక గురువారం రానే వచ్చింది - మధ్యాహ్నం మూడింటికి షికాగోకి ట్రైన్. బదరి, నేను - సెయింట్‌లూయిస్ డౌన్‌టౌన్‌లోని ఏంట్రాక్ స్టేషన్‌కి వెళ్ళాము - ఇనాక్‌గారిని తీసుకుని. నవీన్‌గారిని స్టేషన్‌ దగ్గర కలవాలని ప్లాన్.

నవీన్‌గారు 2:46కి వచ్చారు.

ఇనాక్‌గారి లగేజ్ పట్టుకుని సినిమాలో క్లైమాక్స్ సీనులా పరిగెట్టి, పరిగెట్టి వాళ్ళిద్దరినీ క్షేమంగా ట్రైన్ ఎక్కించి "హమ్మయ్య" అనుకున్నాం - మేమిద్దరం.


దరి కాని దూరమందు వేదికల మీద చూసి 
మురియుటే నాకిరవైనదని పరి పరి  తలచు నాకు 
విరివిగ దొరికెబో - తానా పుణ్యమాని 
సరిలేని సజ్జన-సాహిత్య-సాంగత్యము

2, జూన్ 2017, శుక్రవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి

అనగనగా తూర్పుగోదావరిజిల్లాలో ఒక అందమైన పల్లెటూరు. 

ఆ పల్లెటూర్లో ఒక అబ్బాయి . 

ఆ  అబ్బాయిపెరిగి పెద్దయ్యి, పెళ్ళై - తండ్రై - తాతై తన కథ తనే చెప్పుకోవాలనుకున్నప్పుడు - ఆ కథకి నా బ్లాగు ఊతమయ్యింది. 

సినిమాకి  వెళ్దామంటే  రాలేదని అమ్మ గుడికి వెళ్తుంటే పూజ బుట్టలో ఇసక పోసేయడం-
కోపం వస్తే ఇంట్లో ఎవ్వరికీ లేకుండా అన్నం, కూరలు అన్నీ తినేయడం-
గుఱ్ఱాలెక్కడం-
గుఱ్ఱం  దొరక్కపోతే గాడిదకి తాటాకులు కట్టి పరిగెత్తించడం-
మంగళగిరి పానకాల స్వామి గుడిలో పూజారి పానకం బిందెలు తెచ్చేలోగా ఆలశ్యం అయిపోతోందని మడి కట్టుకున్న అమ్మన్నత్తయ్యతో అందరికీ  తీర్థ-ప్రసాదాలు ఇప్పించెయ్యడం-
సింహాచలం వెళ్దామనుకున్న వారిని సింహాచలం నుండి తిరిగొచ్చేసిన బస్సెక్కిచ్చడం-

- అబ్బో ఒకటి కాదు ఇలా చెప్పుకుంటే ఓ పే........ద్ద లిస్టే అవుతుంది. 
ఇంతకీ ఈ కథ ఎవరిదో వారి మాటల్లోనే చెప్తేనే బావుంటుంది ..
ఇదిగో నా కథ చెప్తున్నాను - నేను చెప్పినట్లే నా మాటల్లోనే రాయి. 
కథకి పేరు - అవతారంగారి నారాయణగారి బాబి - అని పెట్టు. 
అల్లా ఎందుకంటే మా వూళ్ళో ఐదుగురం బాబీలు వున్నాం - పంచబాబీలు పంచభీముళ్ళలా. 
నేను పుట్టడం 1945 -కొత్తింట్లో. 
అప్పటికే పుట్టి వున్నవారు, పుట్టిపోయినవారితో కలిపి ఏడుగురి తర్వాత అష్టమగర్భం నేను. నాకు ముందు పుట్టిన పిల్లాడికి మా తాత అవతారంగారి పేరు పెడితే వాడు పోయాడని వాడి తర్వాత పుట్టిన నాకు అవతారంగారి తండ్రిగారు - కామయ్యగారి పేరు పెట్టారు - కామేశ్వర్రావని. 
మా నాన్నగారు 1942లో ఇల్లు కట్టారు - అనాతారంలో - మిగతావాళ్ళందరూ శివకోడులో పుట్టారు గానీ నేను కొత్తింట్లో పుట్టాను - 1945 నవంబర్ 13వ తారీఖు. 
నెహ్రూగారికి నాకు ఒక రోజే తేడా. 
ఒక రోజు తేడాతో ఆయన ప్రైమ్మినిస్టర్ అయాడు - నేనిలాగయిపోయాను. 
లేపోతే ప్రైమ్మినిస్టర్ అయిపోయేవాణ్ణి నేను కూడాను. 
అదో - అలా - 45 లో పుట్టి చిన్నంగా పెరుగుతూ వస్తో ఉంటే నాకప్పుడు మూడో - ఐదో నెలలు వచ్చాయి నాకు. 
ఈ స్టోరీ ఎర్రమామ్మ చెప్పింది నాకు. 
ఎర్రమామ్మంటే మా నాన్నమ్మ తోడికోడలు. 
ఆవిడ సరదాగా అందరినీ తిడుతూ ఉండేది - ఎవరు కనపడ్డా - ఆఖరికి ఊరి ప్రెసిడెంట్ కనపడ్డా అలాగే తిట్టేసేది. పన్ను కట్టలేదని ప్రెసిడెంటొచ్చి సామాను బయటపడి ఇల్లు జప్తు చేయిస్తానంటే - నా సామాను బైట పడేస్తానంటావురా - అని తెగ తిట్టి పోసేది. 
ఆవిడేం చెప్పిందంటే - ఓ రోజు ఆ ఎర్రమామ్మ, మా నాన్నమ్మ తులసి కోట పళ్ళెంలో కూర్చుని కబుర్లు చెపుకుంటున్నారట. 
ఈలోపులో మా కాళత్తయ్యొచ్చిందట - నాకు మూణ్ణెళ్లు ముందు పుట్టింది - కాళత్తయ్య కూతురు - దాన్నెత్తుకుని. 
ఆ కాళత్తయ్యొచ్చీ - మా నాన్న దగ్గర - "అన్నయ్యా అన్నయ్యా - మళ్ళీ కామయ్యగారు, కావమ్మగారు పుట్టేశారూ" అంటే "నువ్వూ -  నీ వెర్రి కబుర్లు - వీడికన్నా అది మూడు నెలలు పెద్దది కదా"  అని మా నాన్న అన్నారట . 
అంటే "రాముడి కన్నా సీత పెద్దది కాదేంటి - వీళ్లిద్దరికీ పెళ్లి చేసేద్దాం" అన్న కాళత్తయ్యని పట్టుకుని తెగతిట్టి ఇంకా కోపం తగ్గక - "ఈ వెధవకి ఇప్పుడే పెళ్లా" అని ఆ రెక్కట్టుకుని ఆ ఐదునెలల పిల్లాణ్ణి నన్ను కటకటాల్లో ఉయ్యాలా బల్ల దగ్గర్నుంచి విసిరేశారట పెరట్లోకి. 
విసిరేస్తే ఎర్రమామ్మ ఒళ్ళో పడ్డాను. "భడవకానా - నా ఒళ్ళో పడి బతికావ"నేది. 
ఇంకక్కడనుంచి దినదిన ప్రవర్ధమానం. 
ఐదేళ్ళ వయసువరకూ పుట్టు వెంట్రుకలు లేవు. నా ఫోటో వుంది - పుట్టువెంట్రుకలు తీయకుండా వున్నది - కింద బూట్లు, పైన గిరజాల జుట్టూ నేను. 

ఐదోసంవత్సరంలో నాకు పుట్టు వెంట్రుకలు తీశారు. 
ఆరో సంవత్సరంలో అక్షరాభ్యాసం, బళ్ళో వేయడం జరిగింది. 
స్కూలుకి వెళ్ళేవాడినికాదు. 
మా వూళ్ళో అనుపిండి రామ్మూర్తిగారని ఉండేవారు - మునసబుగారి అన్నగారు. 
ఆయనొక బెత్తం పట్టుకుని వెనకాల నిక్కరు పిఱ్ఱ మీద కొడుతూ బడికి తీసికెళ్ళి అక్కడ పడేసేవారు మమ్మల్ని- నన్నూ, కాళత్తయ్యగారి నాగన్నని. 
ఏదో ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం బళ్ళో. 
ఈలోగా నాతో చేరినవాళ్ళందరూ ఒకటో క్లాసునుంచి రెండో క్లాసుకెళ్ళారు. 
రాజూ మాష్టారని ఒకాయన - "ఒరే! నువ్వింకా ఒకటేరా" అన్నాడు. 
అంటే మనం ఒకటో క్లాసే ఫెయిల్ అన్నమాట. 
ఫెయిల్ అంటే ఏడుస్తానని - "నువ్వు పెద్దొకటిరా" - అనేవారు. 
అలా పెద్దొకటి కూడా చదివాను నేను.

<వచ్చేనెల తరువాయి కథ>

27, మే 2017, శనివారం

ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!


చిన్నప్పుటినుంచి నా పెళ్లయ్యే దాకా - ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం - తలదువ్వి జడ వేయడం పూర్తయిన ప్రతిసారి ముందుకి తిరగమని - దువ్వెనతో ముంగురులు దువ్వుతూ మా అమ్మ తరచుగా అనే మాట - నుదురు చిన్నదైతే కుదురు తక్కువంటారు. నీకు నుదురు పెద్దదే కానీ ...- అని ఆపేసేది - ఆ తదుపరి నన్ను పూరించుకోమన్నట్టు. 

కుదురుండేది కుండలకి, బిందెలకి కానీ నాక్కాదు - అనేసి మాట మార్చేసి నుదుటికి విలోమ నిష్పత్తిలో వున్న నా కుదురుని సమర్థించుకునేదాన్ని. 

ఇంత హఠాత్తుగా నా కుదురు ప్రసక్తి, దాని గురించి మా అమ్మ ఉక్తి ఎందుకు గుర్తొచ్చాయంటే - ఈ మధ్య కాలంలో - అంటే గత నాలుగైదేళ్ళుగా నా ఫ్రెండ్స్ కొందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగా, బిక్రం యోగా, మెడిటేషన్‌ల గురించి మాట్లాడుతూ - వాళ్ళు వెళ్ళే తరగతుల గురించి చెప్తుంటే విని - అమ్మో! అంతసేపు కదలకుండా మాట్లాడకుండా ఒకచోట కూర్చోవడమే?! నాకింకా యోగా చేసే టైం రాలేదు - అని నవ్వేసేదాన్ని. 

ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ,  మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో -  జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని. 

మా వూళ్ళో లైబ్రరీలో ఉచితమైన ఉచిత-మెడిటేషన్-తరగతులు ప్రతివారం జరుగుతాయి అని తెలిసినా, అవి నడిపేది మా బుజ్జిజింక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారైన సాయిరాంగారని తెలిసినా, కలిసినప్పుడల్లా ఉత్సాహంగా సాయిరాం గారు చెప్పే ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి ఎన్నిసార్లు విన్నా, తరచుగా ఆ మెడిటేషన్ సెషన్స్ గురుంచి వివరాలతో ఎన్ని email రిమైండర్స్ వచ్చినా - ఇది మాత్రం నావల్ల కాదు - అనుకునేదాన్ని. 

నా బెంగల్లా - ఇరవయ్యో, ముప్పయ్యో - నిముషాలు మాట-పాట లేకుండా కూర్చోవాల్సి రావడమే. 

మెడిటేషన్ అంటే హెజిటేషన్ లేకుండా దూరంగా జరిగే నాకు సాయిరాంగారు Guided Meditation అనే యూ-ట్యూబ్ లింక్  ఒకటి పంపించారు - ఇది ఒక ఇరవై నిముషాలు వుంటుంది, బిజీగా వుంటూ తీరిక సమయం ఎక్కువ లేని వాళ్ళ కోసం తయారు చేశానిది, చూడండి - అంటూ. 

సరే - అరచేతిలో వాట్సాప్ ధ్యానం - ఓ ఇరవై నిముషాలే కదా - అని కళ్ళు మూసుకుని వినడం మొదలుపెట్టాను. 

వేణునాదంతో పాటు మంద్రంగా వినిపిస్తున్న సాయిరాంగారు శ్వాస తీసుకోవడానికి, మనసు లగ్నం చేయడానికి ఇస్తున్న సూచనలు వింటూ - ఆచరిస్తూ - ఇరవై నిముషాలు ఎలా గడిచిందో తెలీదు. 

నాకు మాత్రం చాలా నచ్చేసింది సాయిరాం గారి ఈ Guided Meditation. 

అందుకే చెప్తున్నాను - ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!



ఇదే కాకుండా ప్రతి శుక్రవారం Global Meditation సెషన్స్ నడుపుతారు సాయిరాం గారు.

ఆ సెషన్ వివరాలు ఇవి:

Global Meditation sessions can be attended via free conference call or web.

Global meditation is conducted on every Friday and session starts @ 9pm CST and lines are opened at 8:45pm CST. It is a one hour session. There will not be any session on holiday weekends.

You can ask questions before or after the meditation session.

Call details:

Join online meeting:

Or by phone:

United States: (218) 339-7800 

Participant Access Code: 507 7577
మరిన్ని వివరాలకై సాయిరాం గారి Website

ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
సాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత

ఏమీ ఆశించక -  అందరికీ మంచి జరగాలనే బహు-మంచి ఉద్దేశ్యంతో ధ్యానం వలన కలిగే లాభాలను తెలియజేయాలి అనుకుని - నిబద్ధతతో తన వారాంతపు తీరిక సమయాన్ని Global Meditation సెషన్స్ కోసం వెచ్చిస్తున్న సాయిరాంగారూ...

ఉరుకుల-పరుగుల అమెరికా జీవితంలో వారానికి ఒకేసారి అపురూపంగా దొరికే family-time ని ఆ ధ్యానం తరగతులకి ధారపోస్తున్న సాయికి నిశ్శబ్దంగా ఊతమిస్తున్న సహచరి - మాధవి...

ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించే రాశారేమో - కృష్ణపక్షం లోని ఈ భావ కవిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు...

మావిగున్న కొమ్మను మధుమాసవేళ 
పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ

కలిసినప్పుడల్లా మనసారా నవ్వుతూ - నోరారా పలకరించే సాయి, మాధవి దంపతులకి శుభాభినందనలు - శుభకామనలు. 

19, మే 2017, శుక్రవారం

త్వామనురజామి - 13 - మా కోసం కొండలు అన్నీ మారాయి ఫ్రెండులుగా ...

కిందటి 19 చెప్పిన కబుర్లు 

ఫిబ్రవరి మొదటివారానికే  కొత్త హాస్టల్ రూముల్లోకి వెళ్లిపోయాము మా క్లాస్‌మేట్స్ అందరం. 
నేనూ కళ్యాణిబ్లాక్‌లో రెండో అంతస్తులో వున్న 603 వింగ్‌లోని రూమ్-A లో చేరిపోయాను - సట్రంకుసమేతంగా. 

పద్మావతి యూనివర్సిటీ హాస్టల్స్ చాలా బావుండేవి. 

హా"స్టల" పురాణం: 
కల్యాణి, కిన్నెర - లేత ఆకుపచ్చరంగులో వుండే hexagonal  భవనాలు. 

కల్యాణిబ్లాక్‌లో ముఖద్వారంగా గ్లాస్ స్లైడింగ్‌డోర్ ఉండేది. అందులోంచి లోపలకి అడుగు పెట్టగానే ఎదురుగా విజిటర్స్ రూం - మూడు మేజాలు, ఆరు కుర్చీలుగా . 

ఏ కుదిరిన సాయంత్రమో, కుదుర్చుకున్న వారాంతమో - చుట్టుపక్కల వున్న కళాశాలల, విశ్వవిద్యాలయాల నుంచి మా హాస్టల్-వాసినుల సందర్శనానికి వచ్చే నూనూగు-మీసాల-రాయళ్ల గలగల-కబుర్లతోనూ , ఎవరి కోసం ఎవరొచ్చారా అని కుతూహల పడుతూ పదేపదే ఆ రూములోకి పరిగెత్తే చూపుల్ని బయటికి లాక్కుంటూ హడావిడిగా అటూ ఇటూ తిరిగే లేడి-కన్నుల-లేడీలతోనూ మా some-దర్శకులగది భలే సందడిగా ఉండేది. 

విజిటర్స్ రూంకి కుడిగా వుండే ఆఫీసు రూముని దాటుకునో, ఎడమగానో వెళ్తే లోపల - మధ్యలో పచ్చికతో నిండి వున్న గ్రౌండ్ చుట్టూ ఆరు వింగులుగా (401-406), ఆ పైన మెట్ల మీదుగా పైకి వెళ్తే ఇంకో ఆరు వింగులు (501-506), ఇంకా ఆ పై...న ఇంకొన్ని మెట్లు దాటితే మరింకో ఆరు వింగులు (601-606) - వాటికి అటూ ఇటూ పై డాబా మీదకి వెళ్లడానికి రెండు వరసల మెట్లు వుండేవి. 

కిన్నెర కూడా ఇదే వరస 101-106, 201-206, 301-306 - కాకపొతే కార్యాలయాల, సందర్శకాలయాల గదులు తీసేసి.

గ్రౌండ్ , ఫస్ట్, సెకండ్ - మూడు ఫ్లోరుల్లో ఆరేసి వింగ్స్ - ఒక్కో వింగులో మూడేసి రూములు, ఒక్కో రూములో మూడేసి అరలు, మూడేసి పడక-స్థలాలు - మొత్తానికి ఒక్కో హాస్టల్ బ్లాక్ బిల్డింగ్ మూడోఎక్కానికి బ్రాండ్ ఎంబాసడర్‌లా వుండేది. 

నా రూము కల్యాణిలో రెండవ అంతస్తులో 603-A. 

మా 603 వింగులోంచి బయటికి రాగానే terrace మీదకి వెళ్లడానికేమో అన్నట్టు మెట్లుండేవి - కానీ అవెక్కడికీ వెళ్లేవి - వెళ్లనిచ్చేవి కావు. పగలు రంగురంగుల వస్త్రధారులై ప్రతి గాలి తాకిడికి రెపరెపలాడేవి - రాత్రి వేళల అప్పుడప్పుడు ఏ పరీక్షలైపోయిన వేసవి వెన్నెల రాత్రిపూటో మల్లెలు దండలుగా కూర్చుతూ కూనిరాగాలు తీసే కన్నెల గొంతులకి నిశ్శబ్ద శ్రోతలయ్యేవి. 

ఇంక 603 వింగులోని అమ్మాయీ-మణి-సాంద్రత ఎలాంటిదంటే ... 

A లో శ్రీలత, పద్మజవల్లి - నాకు MCAలో సీనియర్స్, నేను. 
B లో సంగీత, గుత్తి పద్మజ - నాకు MCAలో  సీనియర్స్, శాంతిరోహిణి, నిర్మలాషర్మిలి - ఇద్దరూ M.Sc Maths. 
C లో ముగ్గురే - వీణావాణి నాకు సీనియర్, ఇంకో ఇద్దరు హోంసైన్స్ అమ్మాయిలు. 


ప్రతీ రూము మళ్లీ మూడు వింగులుగా ఉండేది. మా A లో ఎడమ పక్క వింగ్ శ్రీలత, కుడి పక్క పద్మజవల్లి, మధ్య వింగ్ నాది. కిటికీ పక్కనే నా మంచం - మంచం కింద నా ట్రంకు, మంచం మీద షిప్లీ. 

నా మంచానికి perpendicular గా ఇంకో ఖాళీ మంచం ఉండేది - మధ్య వింగ్ కొంచెం  విశాలంగా ఉండేది - అందుకని రెండు మంచాలు వేసి ఉండేవి. నేను రూంలోకి వెళ్లిన కొన్ని నెలల దాకా ఆ రెండోమంచం ఖాళీగా ఉండేది. 

సాయంత్రం కాగానే నా కిటికీలోంచి తిరుమలకి నడిచి వెళ్లేదారి దీపాలవెలుగులో సత్యభామజడలా మిడిసిపడుతూ కనిపించేది -  ఆచివరగా వేంకటేశ్వరనామం, శంఖు-చక్రాలు - రోజూ కన్నుల కెదురుగా దీపావళే! 

వర్షాలెక్కువ పడ్డప్పుడు ఆ కొండల్లోంచి స్ప్రింగయ్యే ad hoc ముస్తాబులాంటి పిల్ల-జలపాతాల వల్ల మనసుకి తెలియని హాయి - పాదాలలో స్ప్రింగులు మొలిచాయా అనిపించేలా అలుపులేని నిలకడ-లేమి. 


నా కొత్త రూమ్ నాకు చాలా నచ్చేసింది. దానికితోడు నాకెంతో ఇష్టమయిన సీనియర్స్ శ్రీలత, సంగీత, గుత్తి పద్మజల కంపెనీ. 


సన్నటి గొంతుతో తన ఇంజినీరింగ్ కాలేజ్ విశేషాలు, వాళ్ల అక్కకి పుట్టిన పాప గురించి బోల్డన్ని కబుర్లు చెప్పే శ్రీలత -  ఏదైనా సరే బోల్డంత లాజికల్‌గా ఎనలైజ్ చేస్తున్నట్లు మాట్లాడే సంగీత - పాటలతో, నవ్వులతో సందడంటే తనేనేమో అనిపించే మా వింగ్-అలీషా చినాయి గుత్తిపద్మజ - వీళ్లతో పాటే నేను. 


ఒక్క క్లాసులకి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన టైమంతా ఆ ముగ్గురితోనే గడిపేదాన్ని. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ - అన్నిటికీ A, C - రూముల్లో వున్న MCA వాళ్లం ఐదుగురం కలిసి వెళ్లేవాళ్లం. సీనియర్స్ - శ్రీలత, సంగీత ఒక జతగా - వాళ్లతో నేనూ ఒక వంతగా - గుత్తిపద్మజ, పద్మజవల్లి ఒక జతగా వుండేవాళ్లు. 


కొత్త హాస్టల్‌కి - నాకు నచ్చిన రూంలోకి వెళ్లినా నాకు కొంచెం ఇంటి మీద బెంగగానే వుండేది. వూర్కూరికే కళ్లలో నీళ్లొచ్చేస్తూ ఉండేవి. 

అలాంటి రోజుల్లో - ఒకరోజు డిన్నర్ చేసేటప్పుడు దిగులుగా వుండి అన్నం తిననన్నానని - సంగీత - తన ప్లేట్లో అన్నం కలిపి నాకు నోట్లో పెట్టింది. అది మొదలు దాదాపు చాలా రోజుల (నెలలేమో కూడా) పాటు నాకు సంగీతే అన్నం కలిపి పెట్టేది. ఇంట్లోనే కాదు హాస్టల్లో కూడా నా గారం సాగడం - అది నా గొప్పదనం కాదు, నా చుట్టూ వున్న వాళ్ల మంచితనం. 


కళ్యాణి బ్లాక్‌కి అలవాటు పడుతున్నాను అనుకునేలోగా మొదటి సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ వచ్చింది - ఫిబ్రవరి మూడోవారంలో మొదలని. అటో రోజు ఇటో రోజు తీసేస్తే గట్టిగా వారం రోజుల్లేవు పరీక్షలు మొదలవడానికి. 

హాస్టల్ ఆఫీస్‌లో వున్న ఫోన్ రాత్రిపూట ఆఫీస్ రూముకి వున్న గ్రిల్‌లోంచి అందుకొని - అమ్మాయిలకి ఇంటినుంచి ఫోన్ వస్తే మాట్లాడడానికి వీలుగా వుండేది. 

నాకు సాధారణంగా నాన్న శనివారం తొమ్మిదింటి తర్వాతో, ఆదివారం పొద్దున్న పదింటికో ఫోన్ చేసేవారు. అప్పుడే అందరూ మాట్లాడేవారు. అలా ఫోన్ చేసినప్పుడు చెప్పాను - ఇంకో వారంలో సెమిస్టర్ ఎగ్జామ్స్ అని. నా గొంతులో బెంగ వినిపించిందో ఏమో అప్పటికి ఏమీ మాట్లాడలేదు కానీ మళ్లీ రెండో రోజు పొద్దున్నే ఫోన్ చేశారు నాన్న - అమ్మ వస్తోంది తిరుపతికి - ఓ వారం నాతో హాస్టల్లో ఉంటుందని - వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోమని. 

ఆరోజు నాకింక కాళ్లు భూమ్మీద ఆనలేదు - పరుగు తప్ప నడవలేదు. 

అమ్మ వచ్చేరోజు శ్రీలత, సంగీత నాతో రైల్వేస్టేషన్‌కి వచ్చారు - అమ్మని రిసీవ్ చేసుకోవడానికి. 

అమ్మొచ్చింది. నాతోపాటే డైనింగ్‌హాల్‌కి వచ్చే అమ్మని చూసి అందరూ అడిగేవారు - ఏంటాంటీ, లలిత చేత ఎగ్జామ్స్ రాయించడానికొచ్చారా? - అని. 

నా భాగంలో వున్న ఖాళీ మంచం మీద అమ్మ పడక. నేను  పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు - అమ్మ ఒక్కతే వుండేది కదా రూమ్ లో - అప్పుడు కిందకి వెళ్లి - హాస్టల్ ఆఫీసులో అన్నీ తుడుస్తూ శుభ్రం చేస్తూ వుండే ఆయాల దగ్గరికి వెళ్లి - మా అమ్మాయి బట్టలుతకడానికి ఎవరైనా దొరుకుతారా - అని వాకబు చేస్తూ వుండేది. మా హాస్టల్ బయట చెట్టుకింద ఇస్త్రీ చేసే అతన్ని కూడా అడిగింది. చివరికి రూములు శుభ్రం చేసే ఒక ఆయాని కుదిర్చింది. 

ఇంకా తోచనివేళ - జుట్టు విప్పుకుని బుల్లి రాక్షసిలా వున్న షిప్లీ జుట్టు చిక్కు తీసి జడ వేసింది అమ్మ. 

అలా - పాపం - నాకోసం మా అమ్మ ఒక వారం రోజులు హాస్టల్లో కాలక్షేపం చేసి నా పరీక్షలు అయ్యాక గుంటూరు వెళ్లింది. 

ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అవ్వగానే మా క్లాసుమేట్స్ అందరం తిరుమల నడిచి వెళ్ళాం. ఒక రోజు పొద్దున్నే ఐదు గంటలకి బస్సులో అలిపిరిదాకా వెళ్లి - అక్కడినుంచి ఓ మూడున్నర గంటలు నడిచి తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ సాయంత్రం బస్సులో కిందకి వచ్చేశాం. 

కొండ ఎక్కేటప్పుడు బోల్డన్ని కబుర్లు, పాటలు. 

అచ్చతెలుగులో స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ, పాడుకుంటూ వెళ్తున్న తెలుగమ్మాయిలమైన మమ్మల్ని చూసి - మాకు రాని తమిళంలో జోకులేస్తూ తెగ గందరగోళం చేస్తున్న తమిళ-పైయ్యన్లను చూసి - అప్పటికప్పుడు మా కాట్పాడి-ఉష, అరక్కోణం-ఇందుల దగ్గర ఒక పాట నేర్చేసుకుని - మేము 'అరవం' కానీ పాడుతాం అని  గా... ట్టిగా అరిచి మరీ పాడేశా - తమిళ-పైయ్యన్ల నోళ్లు మూతపడి చెవులు మాత్రమే పనిచేసేలా ... 


సురాంగనీ సురాంగనీ సురాంగనీకమాలు కనవా 
మాలు మాలు మాలు సురాంగనీకమాలు - సురాంగనీకమాలు కనవా
అడుపిరుక్కు - నెరపిరుక్కు ఆకముడిల్లై
పక్కద్ వీట్ల పయ్యన్ను పాకముడిల్లై
సురాంగనీ సురాంగనీ సురాంగనీకమాలు కనవా 
మాలు మాలు మాలు సురాంగనీకమాలు - సురాంగనీకమాలు కనవా 

-అంటూ. (ఇప్పటికీ ఈ పాటలో ఆ మొదటి రెండు లైన్ల అర్థం తెలీదు.)

ఏడుకొండలు నడిచి ఎక్కడం మొదటి సారి కాకపోయినా క్లాస్‌మేట్స్‌తో వెళ్లడం చాలా సరదాగా అనిపించింది. మా మాటలు, పాటలు వింటున్నట్టున్న కొండలు మహా-ప్రియంగా కనిపించాయి. 

మా ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు కొంచెం ఆలస్యం అవడంతో వెంటనే సెకండ్ సెమిస్టర్ మొదలయింది - మధ్యలో ఒకటి రెండు రోజుల సెలవు తర్వాత. 

హాస్టల్లో ప్రతి రోజూ వచ్చే పోస్ట్ అంతా మా విజిటర్స్ రూము ముందు పెట్టి వెళ్ళేవాళ్ళు పోస్టుమేన్. పొద్దున్న పూట క్లాసులయి లంచ్‌కి వచ్చినప్పుడు మాకొచ్చిన లెటర్స్ వెతుక్కుని తీసుకునేవాళ్ళం. 

ఒకరోజు ముందుగా వచ్చేసిన శ్రీలత నాచేతికి ఒక ఎన్వలప్ ఇచ్చారు. దానిమీద ఎడ్రెస్ ఇలా వుంది:

V. లలితా త్రిపుర సుందరి 
పద్మావతి యూనివర్సిటీ హాస్టల్ 
తిరుపతి - 517.502 
నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది - నాకు ఉత్తరాలు రాసేవాళ్ళెవ్వరూ ఎడ్రెస్ అలా రాయరు. నా పూర్తి పేరు రాయరు , పైగా నా రూమ్ నంబరూ, కళ్యాణి బ్లాక్ పేరు రాస్తారు. 

ఎవరై వుంటారా అని తెరిచి చూస్తే అందులో ఇలా వుంది:

లలితా త్రిపుర సుందరి గారికి,

నా పేరు ప్రసాద్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నా సొంతంగా బిజినెస్ చేస్తున్నాను. 
నేను గుంటూరు నుంచి మీరు వచ్చిన ట్రైన్ లోనే తిరుపతికి వచ్చాను. నాకు మీ నవ్వు, మీ ఫామిలీ మెంబర్స్ మధ్య affection చాలా నచ్చాయి. మీకీ లెటర్ అందగానే నాకు రిప్లై రాస్తారు కదూ !

Yours Sincerely, 
ప్రసాద్ 

అది చదువుతూనే శ్రీలత చేతికి అందించాను - తననీ చదవమని. 

శ్రీలత ఇంక ఒకటే నవ్వు - ఎవరు లల్లీ, ఈ అభిమాని, నీ పూర్తి పేరు కూడా తెలిసిపోయిందే.  ఏంటి సంగతి? - అంటూ.

అప్పుడు తట్టింది - గుంటూరులో రైలు ఎక్కేముందు రిజర్వేషన్ చార్టులో నేను చూసిన V . లలితా త్రిపుర సుందరి  హైఫెను పదిహేనూ  ఇంత పని చేసిందీ అని. 

అదే చెప్పాను శ్రీలతకి. 

రిప్లై రాస్తావా - అనడిగిన తనకి చెప్పాను - ఎవరో ముక్కూ మొహం తెలియనివాడు కాలక్షేపానికి రాసిన ఉత్తరం అది - అదంత పట్టించుకోవక్కర్లేదు - అని అప్పుడే చింపేశాను. 

కాలేజ్, హాస్టల్ బాగానే అలవాటయ్యాయి. 

రోజూ సాయంత్రం క్లాసులు అయిపోగానే శ్రీలత, సంగీత, నేను - టీ గ్లాసులు పట్టుకుని బయట చెట్ల కింద గడ్డిలో కూర్చుని వచ్చేపోయే విజిటర్సుని చూస్తూ - మేము చూస్తున్నామని తెలియగానే తడబడే అడుగులతో గబగబా వెళ్లిపోయే అబ్బాయిలని చూసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం. 

అప్పుడే - ఆ కబుర్లలోనే - అమ్మాయిలని కలవడానికి వచ్చి మా జంట-మేట్రన్లు కణ్ణగి-కొదై ప్రశ్నలకి జవాబు చెప్పడానికి తికమకపడి సతమతమయ్యే అబ్బాయిలని లా-జవాబ్ అనిన్నీ, వెన్నెల కన్నెల మనసులని దోచడానికా అన్నట్లు  మీసాలు కూడా తీసేసి వచ్చే మచ్చలేని చంద్రుళ్లని బే-మిసాల్  అనిన్నీ ప్రశంసించే నాకు - శ్రీలత చేసిన బిరుదు ప్రదానం LGP - అంటే లల్లి గోల పిల్ల :)

ఇదిగో - ఇక్కడ ఆగి - నా ఫ్రెండులైన కొండల ఎక్కిన రోజులు తలుచుకుంటూ వుంటా... 

మీరేమో నా పోస్టు టైటిలు, కిందిచ్చిన సరదా-క్లూ ఏ పాటలో చెప్పుకోమంటా...

లైఫంటే పాటేనంట - నోటికొచ్చినట్టు పాడేస్తూ వుంటా 
ట్యూనంటూ కుదిరిందంటే పేరడేదో కూర్చేస్తూ వుంటా
పాటే నా తోడు ఉంటే మాటింక ఎందుకంటా 
క్లూ ఇస్తా మీకంట ఇది కూడా పేరడంట 
మీకంటూ తెలిసిందంటే క్లూ ఏదో టైటిలేదో చెప్పమంటా ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>