11, మార్చి 2018, ఆదివారం

మా బావ నా కోసం రాసిన గాలికబుర్లు - ఆ పై కొన్ని పేర్ల కబుర్లు



"గాలిలోనే... మాటిమాటికీ... వేలితో నీ పేరు రాయడం - ఏమయిందో ... ఏమిటో ..."  - రాంగోపాల్ వర్మ తన  కోసమే రాయించాడేమో ఈ పాట అన్నంతగా ఇష్టం పెంచేసుకుని - అదే లైన్‌ని పదేపదే  హమ్ చేస్తుండే మా బావ, తన ప్రాజెక్ట్ పని మీద ఫ్లైట్‌లో వెళ్తూ, వస్తూ నాకు రాసిన ప్రేమలేఖలు  - గాలి (బావ) కబుర్లు. 



పెళ్ళికి ముందు, పెళ్ళైన కొత్తలో ప్రేమలేఖలు రాయడం, చదువుకోవడం మామూలే. కానీ పెళ్ళైన ఇన్నేళ్ళకి కూడా ప్రేమలేఖలు, వాటి తో పాటు నాకిష్టమైన ఫోటోలు, ఓ అందమైన పుస్తక రూపంలో అందుకోగలగడం నా అదృష్టం.

ఇంట్లో ఉన్నంత సేపు కబుర్లు చెప్తూ, వింటూ వున్నా కూడా తనకి తనివి తీరలేదట. అందుకే ప్రతీ వారం చేసే విమానప్రయాణం ఎలాగూ తప్పదు. ఆ ప్రయాణ సమయంలో ఏదో పుస్తకం చదువుకోవటమో, పక్కన కూర్చున్న వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండటమో, లేకపోతే పడుకోవటమో చెయ్యటం కాకుండా, నాకు ప్రేమలేఖలు రాయాలనిపించిందట.  తన లాప్‌టాప్ మీద నాకు చెప్పాలనుకున్న కబుర్లు రాయడం కోసం ఎప్పడెప్పుడు విమానం ఎక్కుతానా అని ఆరాటపడేవారట.

అలా జూన్‌లో రాయడం మొదలు పెట్టిన గాలి(లో)కబుర్లు డిసెంబర్‌కి పూర్తయ్యాయి. అంతలోనే వచ్చిన ఒక ఆలోచన ఈ కబుర్లన్నిటినీ ఒక పుస్తకంగా మార్చి నాకు ఇస్తే నేను చదివితే ఎలా వుంటుందా అని.

అది మొదలు తన కొలీగ్స్ అనిల్, కుమార్ గార్లతో కలిసి సాయంత్రం ఆఫీస్ పని అయిపోగానే వాళ్ళ ఆఫీస్ చుట్టుపక్కల వున్న OfficeMax, Kinko's ఇవన్నీ తిరగడం - అవే కాకుండా గూగుల్‌లో వెతికి ఎక్కడెక్కడో వున్న ప్రింటింగ్ స్టోర్స్‌కి వెళ్ళడం - అక్కడ వాళ్ళకి తెలుగులో టైప్ చేసిన కాంటెంట్ చూపించడం - వాళ్ళేమో ఈ ఇంటర్నేషనల్ ఫాంట్ ఇప్పటిదాకా ఎప్పుడూ ప్రింట్ చేయలేదు, ప్రయత్నిస్తాం కానీ ఎలా వస్తుందో చెప్పలేం అనడం. తనేమో తన ఫ్రెండ్స్ కి వీకెండ్ లో ఎక్కడెక్కడికి వెళ్ళాలో లిస్ట్ రాసి ఇవ్వటం, వాళ్ళు అక్కడకి వెళ్లి కనుక్కుని రావటం. కానీ అంతా సీక్రెట్, surprise గా ఉంచాలని చెప్పటంతో, వాళ్ళు కూడా బోల్డంత థ్రిల్డ్ గా ఫీల్ అవ్వటం! ఎక్కడా తనకి నచ్చిన పబ్లిషర్ దొరక్క పోవటంతో, తనే రాత్రుళ్ళు కూర్చుని, ఆ పేజీలన్నింటినీ ఫొటోస్ తీసి, ప్రతీ  పేజీ కి contextual గా సరిపోయేలా మా పాత ఫొటోస్ లోంచి కొన్నింటిని తీసి, వాటికి attach చేసి, ఆ compilation ని షట్టర్ ఫ్లై వాడికి పంపించి - ఓ మాంచి ఫోటో బుక్ తయారు చేయించారట.

ఇదో దాని కవర్ పేజీ, ఇంకా దాన్లోని ఓ కొన్ని కబుర్లు ...




ఫ్లైట్ వెళ్తుంటే చాలా బావుంటుంది బుజ్జాయ్. ప్రతి వారం విమానం జర్నీ చేస్తూ వుంటే రొటీన్ గానే వుంటుందేమో అందరికీ. కాని నాకెందుకో చాలా ఇంటరెస్టింగ్ గానే వుంది ఇంకా. మబ్బుల కన్నా పైన వెళ్తూ వాటిని పైనుంచి చూస్తూ వుంటే, భలే సరదాగా, విచిత్రంగా వుంటుంది.
---- ---- ---- ----

వర్షం వచ్చేలా వున్నప్పుడు దూరంగా మబ్బుల మధ్యలో మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మబ్బులు తెల్లగా కొన్ని నల్లగా కొన్ని ఎర్రగా కొన్ని దోరగా కొన్ని కోరగా వుంటాయి. అలానే, ఇంత ఎత్తులో వెళ్తున్నా కింద వూళ్ళల్లో వెలిగే లైట్లు అక్కడక్కడా కనిపిస్తూ వుంటాయి మసక మసకగా ఏ మబ్బూ లేనప్పుడు. విమానం ఫిలడెల్ఫియా, మన సెయింట్ లూయిస్ లకి దగ్గరగా వచ్చినప్పుడు చాలా బావుంటుంది. నేను మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అవుతున్నప్పుడు సాయంత్రం ఐదో ఆరో ఏడో అయ్యుంటుంది - అప్పుడు బయటికి చూస్తూ ఎలా ఫీల్ అయ్యానో ఇప్పటికీ విమానం లోంచి సిటీ లైట్లు ఎప్పుడు చూసినా అలానే అనిపిస్తుంది - నువ్వు కొత్త బంగారం పెట్టుకుని నాకు చూపిస్తూ మురిసిపోతావే ..అలా - ఊరంతా బంగారం అలంకారంగా పెట్టుకుని ఆకాశంలో ఎవరికో బోల్డంత ఆనందంగా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. బోల్డన్ని ఎల్లో లైట్లు మధ్యలో అక్కడక్కడా తెల్ల లైట్లు - నీ బంగారం గొలుసుల్లో ముత్యాల్లాగా, వజ్రాల్లాగా. 

 ---- ---- ---- ----

మొన్న గురువారం వచ్చేటప్పుడు నా పక్కనున్న వాడు, నన్ను బోల్డంత ఆశ్చర్యంగా అడిగాడు - అదేంటీ అలా ఎలా టైపు (తెలుగు లో) చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒకసారి కళ్ళు మూసి కొంచెం నెమ్మదిగా తెరిచి, చేతిని నెమ్మదిగా వూపుతూ 'జస్ట్ మేజిక్' అన్నా. వాడు కొంచెం కోపంగా చూసేలోపు నవ్వుతూ ఇక్కడ స్టాండర్డ్ డయలాగ్ just kidding అని - వాడికి ఈ టూల్ గురించి చెప్పా. వాడు కూడా నాలానే కళ్ళు తిప్పుకుంటూ ఓహో అదా సంగతి అని తెగ ఆనంద పడి, వాడు మొన్నీ మధ్య Japan వెళ్ళినప్పుడు google translate తో ఎలా మేనేజ్ చేసింది నాకు చెప్పాడు.  
 ---- ---- ---- ----

 ఒక్కసారి, జస్ట్ మళ్ళీ ఒక్కసారి టైం వెనక్కి వెళ్ళగలిగి, మనం మన స్నేహం ఇంకొంచెం ముందుగా మొదలు పెట్టగలిగితే  ... 
టైం లో వెనక్కి వెళ్ళగలగాలి, కానీ ఇప్పటివరకు జరిగినవన్నీ జరుగుతాయి అని తెలిసి వుండాలి. అంటే, ఎప్పుడైతే నిన్ను విసుక్కున్నానో, నీ మీద కోపం తెచ్చుకున్నానో ఆ సందర్భాలన్నీ మళ్ళీ అలాగే రిపీట్ అవ్వాలి. అలా జరుగుతున్నప్పుడు కూడా నేను నిన్ను మంచిగా బోల్డంత ఇష్టంగా చూసుకోవాలి.
 ---- ---- ---- ----

ఇల్లంతా హడావిడిగా తిరుగుతూ ఏంటో పాటలు పాడుకుంటూ, నవ్వుకుంటూ , పిల్లల్ని నన్ను సమానంగా విసుక్కుంటూ, కోపం తెచ్చుకుంటూ, వేటికోసమో వెతుక్కుంటూ, మధ్యలో అప్పుడప్పుడూ 'దొరికిందిరోయ్' అనుకుంటూ - ఇలా రకరకాలుగా కనిపించే, వినిపించే నిన్ను తలచుకున్న ప్రతిసారీ ఎక్కడ వున్నా, ఎంతమందిలోనైనా - నాకు తెలియకుండానే నా మొహంలో నవ్వు వచ్చేస్తూ ఉంటుంది.

 ---- ---- ---- ----


... నువ్వు శ్రద్ధగా చీర కట్టుకునే విధానం, కట్టుకుని ఓ అని మురిసిపోతూ నవ్వుకుంటూ, ''బావా సీ" అంటూ వయ్యారాలు పోవటం, ఇల్లంతా బొమ్మరిల్లులా సర్దటం, నువ్వూ ఓ బొమ్మలా పండగలకి దేవుడి ముందు కూర్చుని దండాలు  పెట్టటం, పెళ్ళైనప్పటినుంచి ఇప్పటివరకూ కొత్త చీర కట్టుకున్న ప్రతిసారీ నా కాళ్ళకి నమస్కారం చెయ్యటం (నీ భుజాలు పట్టుకుని పైకి లేపి దగ్గరికి తీసుకుంటే నీ మొహం మీద కనిపించే చిరునవ్వు), సినిమాలు చూసేటప్పుడు ఏదో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా కార్టూన్స్ చూస్తారే అలా చూడటం, బాంక్ కి వెళ్ళినప్పుడల్లా ఏ నగలు తెచ్చుకోవాలా అనే డైలమా చూపులు, కార్ డ్రైవ్ చేసేటప్పటి స్నూపీ చూపులు - ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలైనా ఎప్పుడూ అన్నీ గుర్తు వస్తాయి. వెంటనే నాకు తెలియకుండానే మొహం మీదకి నవ్వు  వచ్చేస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది.  ఓ ... మేరే ... దిల్ కే చైన్ ...చైన్ ఆయే మేరె దిల్ కో దువా కీజియే... !

 ---- ---- ---- ----

డబ్బు కావాల్సిందే. దాని విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వుండాల్సిందే . కానీ వెధవ డబ్బులు వుంటే ఎంత, పోతే ఎంత - అందరు మంచిగా వుంటే చాలు అని నేనెప్పుడూ అనుకుంటాను. అదే చెప్తూ వుంటాను కదా. నువ్వు కూడా అలానే మాట్లాడితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా మొహం మీదకి నా సిగ్నేచర్ నవ్వు వచ్చేసింది నువ్వు అలా అనగానే. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ, నువ్వు మాత్రం నిజంగా బోల్డంత మంచిదానివే బంగారం !

---- ---- ---- ----
 
ఈ మధ్య కొంచెం అబద్ధాలు చెప్పటం నేర్చుకున్నానోయ్ బంగారం.! మొన్న Monday రాత్రి 'ఇవాళ తొందరగా బజ్జుంటా బుజ్జాయ్' అని నీతో (అబద్ధం) చెప్పానా? కానీ ఫోన్ పెట్టేసి, ఓ రెండు గంటలు కూర్చుని ఈ stationery ని వెతికి డిజైన్ చేశా. బావుందా? నీకు నచ్చిందా?! ఇంకా కొంచెం మార్చాలి., కుదిరితే వచ్చే వారం చేస్తా.

---- ---- ---- ----

(నువ్వెంత ఖోపంగా చూసినా సరే, ఏ కారణం లేకుండా నాతో ఉత్తుత్తి గొడవలు పెట్టుకుని ఏడిచేటప్పుడూ, ఇంకా నన్ను సిగరెట్ తాగటానిక్కూడా వెళ్ళనివ్వకుండా సినిమాని, వాటి పేర్లు పడేటప్పటినుంచీ మొత్తం చూడాలని గొడవ చేసేటప్పుడు మాత్రం ఓ చిన్న బుజ్జి రాక్షసిలా ఉంటావ్. అందులో సందేహం లేదు.)

 ---- ---- ---- ----

ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం కోపంలో వున్నప్పుడు నిన్నేమైనా అని బాధ పెట్టి వుంటానేమో కానీ, నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. ఎంతిష్టం అనడిగావనుకో ..... బుజ్జిగాడికి చెప్తానే... అలా రెండు చేతులూ ఇలా దూరంగా పెట్టి.... అంతిష్టం అంటాను. అంతకన్నా ఏం చెప్పలేను.

---- ---- ---- ----

అవీ ... పొగడికల మాలలల్లి ఈ లల్లీకో పొగడ-మాలే వేసేశారు - తన గాలికబుర్లలో.

ఇవొక ఎత్తైతే - నాకు తను పెట్టిన పేర్లు బోల్డున్నాయి.

(ఇంకో తమాషా విషయం - పెళ్ళైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా మేమిద్దరం ఎవరికైనా చెప్పేటప్పుడు తప్ప ఒకరినొకరం పేరు పెట్టి పిలుచుకోలేదు.)

నచ్చినవేళల్లో నన్ను మెచ్చుకుంటూ పెట్టిన పేర్లు కొన్ని.

నేను తనని ఇబ్బంది పెట్టిన సమయాల్లో కూడా తాను నొచ్చినా నేను నొచ్చుకోకుండా ఆ విషయాన్ని నవ్వుతూ నాకర్థమయ్యేలా - ఒక వేళ పదిమందిలో వున్నప్పుడు చెప్పాల్సి వచ్చినా నాకు మాత్రమే అర్థమయ్యేలా సందర్భానికి తగిన హిట్ (హింట్) పేర్లు ఇంకొన్ని.

నన్ను మొట్టమొదటగా పిలిచిన పేరు బుజ్జాయ్. 

దానికి బంగారం ఎప్పుడొచ్చి జత కలిసిందో సరిగ్గా గుర్తు లేదు కానీ దాని గురించి తాను ముచ్చటగా చెప్పిన ముచ్చట ఒకటి - "అన్నట్లు చెప్పానా? నేనొక్కడినే ఇండియా వెళ్ళినప్పుడు - అంకుల్, బాబు, నేను డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. "చెప్పు బంగారం!"అంటూ నీతో మాట్లాడుతూ ఉంటే అది నీతోనని తెలిసి వాళ్ళిద్దరూ ఎంత మురిసిపోయారో తెలుసా?! మరి పెళ్ళప్పుడే చెప్పాను కదా అంకుల్ కి - నాకు కాలం గడిచే కొద్దీ పెరిగే బంగారాన్ని ఇస్తున్నారు మీరు అంటూ ;) "

ప్రశ్నకి ప్రశ్న అడగడం తప్ప ప్రతి ప్రశ్నకీ ఒక జవాబు మాత్రమే ఉంటుందన్న రూళ్ళు-రుమాళ్ళు అస్సలు పట్టించుకోని, పాటించని నేను తనడిగిన ఏ ప్రశ్నకైనా ఇచ్చే బదులు ప్రశ్నే!

ఉదాహరణకి -  ఫోన్ చేసి "బయటికి వచ్చాను. దగ్గర్లో ఇండియన్ స్టోర్ వుంది ఇంట్లోకేమైనా కావాలా?" అంటే "ఆ స్టోర్ చిన్నదా, పెద్దదా?" అంటూనో, "ఫలానా వాళ్ళు పార్టీకి పిలిచారు కాలెండర్లో నోట్ చేశావా?" అనడిగితే "ఏ కాలెండర్లో? అసలు నోట్ చేయకపోతే గుర్తుండదా?" అనో - ఒక్క మాటలో అవును, కాదు అని చెప్పగలిగే ప్రశ్నలకి కూడా ఏదో ఒక ఎదురు ప్రశ్న వేసే నాకు దొరికిన బిరుదు ప్రశ్నావళి.

ఎప్పుడైనా, ఏదైనా అనుమాన పడుతూ ఏమైనా అడిగితే, నాకొచ్చే ధర్మాధర్మ విచక్షణ లేక  (అ) ధర్మసందేహాలకి, నేను పాడే శంకవరాళి రాగానికనుగుణంగా నా కనువైన పేరు శంకరి కాక మరేంటి?


ఇంక తను సరదాగా చెప్పే విషయాలని కూడా అంతగా లోతుగా, చురుగ్గా ఆలోచించకుండా నిజమని నమ్మేసే నా ఇంకో పేరు మందా-రం. ఒకసారి ఎలెక్ట్రానిక్స్ ఎక్కువగా కొనేసి ఇల్లంతా వైర్ల మయం చేసేస్తున్నారని నేను గొడవ పెట్టాను చాలా - ఇంకేమైనా కొంటే అస్సలు కుదరదు అని చెప్పేశాను.  అప్పుడే సామ్స్ లో కొత్త డాన్-అండ్-డస్క్ లైట్స్ చూశారు తను. మా ఇంటికి బావుంటాయని కొనేశారు. (ఆ రోజు తనతో నేను షాపింగ్ కి వెళ్ళలేదు).   ఇంటికి రాగానే చేతిలో ఆ లైట్లు పట్టుకుని కిచెన్ లో ఏదో హడావిడిగా వున్న నాకు వాటిని చూపిస్తూ "చూశావా, మన మెయిల్ బాక్స్ లో ఎవరో పెట్టి వెళ్ళారు. ఏదో కొత్త ప్రాడక్ట్ అనుకుంటా ఫ్రీ శాంపుల్ లా వుంది" అనగానే నా కళ్ళు ఒకసారి వెలిగాయి - "అబ్బో ఎంత మంచి లైట్లో - ఎవరో గాని మంచి పేరున్న కంపెనీ అయుంటుంది" అని తెగ మురిసిపోయాను. తను కూడా ముసిముసిగా నవ్వుతూ "అవునే మందారం" అన్నారు. అసలు విషయం తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత కానీ "మందా-రం" సంగతి అర్ధం కాలేదు. 

తను Fridays ఇంట్లోంచి పని చేసేటప్పుడు, నేను నా ఆఫీస్ కాల్స్ లో మాట్లాడేవి విని, "ఆహా..యామిని అమెరికా వచ్చిన దగ్గర్నుంచీ నువ్వు కూడా yeah-హాకారాలు చేసేస్తున్నావు" అన్నారు.

పుట్టింది కోనసీమలో అయినా గుంటూరు, ప్రకాశం, రాయలసీమల్లో చదివి, పెళ్ళయ్యాక బెంగళూరు చేరి, ఆ తర్వాత అమెరికా వలస వచ్చి స్థిరపడిన తర్వాత ఎవరికీ పట్టియ్యని యాసతో తెలుగు మాట్లాడుతున్నానూ అనుకునే నేను - ఎక్కడో ఒకచోట తనకి దొరికిపోతాను గోదావరి యాసలో మాట కూడా పాటలా సా...గా.. దీ ...సే ... దీర్ఘసుమంగళి గా

పాపం - తనేదో వీకెండు - కొంచెం తీరిగ్గా లేచి సావకాశంగా రోజుని సాగిద్దాం అనుకునే లోపు వంటింట్లోంచి స్వగతంగా, పోట్లాటకి స్వాగతంగా - ఈ ఏడాది కూడా landscaping చేయించడానికి కుదరట్లేదు స్ప్రింగ్ దాటి సమ్మర్ కూడా వచ్చేస్తోంది అనో, ఆ బేస్మెంట్ గోడ దగ్గర  లీక్ ఇంకా పెద్దదవుతోంది షానన్ ని పిలుస్తారా లేదా ఈ వారమైనా అనో - నాలో నేనే మాట్లాడుకునే సమయంలో లివింగ్ రూంలోంచి ఒక పాట వినిపిస్తుంది ...మా-నస-వీణా ... మధు గీతం... మన సంసారం సంగీతం అంటూ :)) .

అప్పుడీ మా-నస-వీణ మానసంలో మెదులుతుంది  ఓ పాట. అది మల్లెపందిరి సినిమాలో ఎస్ జానకి పాడిన తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే కి బదులుగా ఎస్పీబీ విరిచి తొలిచూపు తో-రణమాయే అంటూ పాడిన పాట.

ఇంకో పేరు గూగ్లీ. అబ్బే! ఈ పేరుకీ క్రికెట్ ఆటకి ఏం సంబంధం లేనే లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులైనా మంత్రదండంతో మాయం చేసినట్లు, అంజనానిక్కూడా అందనట్లు ఎక్కడో చిలక-ప్రాణంలా భద్రంగా దాచేసినా అవసరమైనప్పుడు ఇట్టే సెర్చ్ చేసుకొచ్చి చేతికిస్తానని అపర-గూగుల్ అవతారాన్నే నేనని మెచ్చి నాకిచ్చిన పేరు గూగ్లీ. 


ఇంకేంటబ్బా...మర్చిపోయాను ... ఆ ... అదే! తనెన్నో సార్లు ఫోన్ లో చెప్పినా  వాటన్నిటికీ - అంటే ఎలాంటివంటే - కార్లో కొత్త ఇన్సూరెన్స్ కార్డ్ పెట్టు, రోజూ  గుర్తు పెట్టుకుని బోల్డన్ని మంచినీళ్ళు తాగు, బుజ్జిగాడి చేత కూడా తాగించు - అంటూ తను చెప్పేవాటిని ఫోన్ పెట్టేయగానే మర్చిపోయి మళ్ళీ తనొచ్చి గుర్తు చేశాక కూడా అదసలు ఇంతకు ముందు మీరు చెప్పారా, నేను విన్నానా అన్నట్లు వుంటానని పెట్టారబ్బా ఆ పేరు - ఏంటది? గజని కాక ఇంకేంటది?

మా అమ్మే ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది - నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోశానేమో - అంటూ. అది ఓ సారి తను విని, దాన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తూ, మా అమ్మతో ఒప్పేసుకుంటూ - ఆంటీ సరిగ్గా చెప్పారు అంటూ వాగే నా దేవీ!  - నా వాగ్దేవి! అంటూ నా వాగ్ధారకి గుర్తింపునిచ్చారు.

పుట్టినరోజులకో, సెలవు రోజుల్లోనో - పిల్లల కన్నా ఎక్కువగా సరదా పడి వాళ్ళు మనసు పడ్డారనో - వాళ్ళ వంకతో నేనాడేసుకుందామనో లెగోలో, ఇంకోటో కొనేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తానని శాంటాకి పోటీగా శాంటీని చేశారు నన్ను.

ఎక్కడికి వెళ్లినా ఏం కొనాలన్నా డెబిట్టో, క్రెడిట్టో - ఏదో ఒక కార్డు వాడితే సరిపోతుంది. ఒక్కోసారి కొన్ని చోట్ల డబ్బులే కావాలంటారు - ఏ చారిటీ కోసం పెట్టిన ఏ చిన్న స్టాల్ లోనో,స్కూల్ స్టోర్ లోనో. అలాంటప్పుడు లేదనకుండా వాలెట్ అరల-అలలు మధించి చిల్లరభాండం తెచ్చి అందించే నా పేరు ధనలక్ష్మి.

iPad లో తెగ బ్లాగులు చదివేసి, పాటలు విని-వినిపించే నేను ఐ-పద్మిని.

ఎక్కువుగా సాధిస్తున్నట్లు తనకి అనిపించినప్పుడు నాకు ఇచ్చిన ఇంకో నామధేయం సాధ్వి
 
బుజ్జాయ్, బంగారం, ప్రశ్నావళి, శంకరి, మందారం, యామిని,  దీర్ఘసుమంగళి, మానసవీణ, గూగ్లి, గజని, వాగ్దేవి, శాంటీ,  ధనలక్ష్మి, ఐ-పద్మిని,  సాధ్వి  ....ఎన్ని పేర్లో కదా!

ఇవన్నీ....... ఒకెత్తు.

వీటన్నిటినీ మించి విమల అన్నటికన్నా ఇంకో ఎత్తు.

మా ఆడపడుచు పెళ్ళిలో షాపింగ్‌కి నన్ను తోడు రమ్మంటూ - ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ - అని పాడుతూ ఉంటే  "అబ్బా - ఇంక పదే పదే అడగొద్దు నన్ను - నేను రాను అక్కడికి - ఇప్పుడొస్తే నాకు వంట చేయటం కుదరదు - మళ్ళీ మీకే ఆకలేస్తుంది పన్నెండింటికల్లా - అప్పటికప్పుడు నేను పరిగెత్తలేను - మీరే వెళ్ళి రండి " అంటూ పేచీ నాది.

దానికి బదులుగా "ఈ ఒక్కసారీ వెళ్ళొచ్చేద్దాం - తొందరగానే ఒక గంటలో - రా విమలాదేవీ!" అంటూ సముదాయింపు.

అప్పటికే పక్కనుండి మా ప్రళయకలహాన్ని వింటున్న మా అమ్మ "విసుగు ముందు పుట్టి తర్వాత పుట్టింది లలితా పరమేశ్వరి" అంటూ "ఇంతకీ విమల ఎవరండీ" అని తీసింది ఆరా.

కంట్లోంచి పెదవుల మీదికి జారిందో - లేక పెదవుల మీంచి కంట్లోకి ఎగిసిందో కనిపెట్టలేని చిరునవ్వు మెరుపు మొహమంతా వెలిగిస్తుంటే - చిలిపితనపు చిలకరింతతో ఆ ఆరాకి అందిన మాఱుమాట "మీరన్నదే ఆంటీ! విసుగుతో పుట్టి మా ఇంటిని మెట్టి వెలిగిస్తున్న మీ-మా విసుగు మహా లక్ష్మి - విమల - విమలాదేవి  :) "

మా అమ్మెప్పుడూ అంటుంది - మాట చూస్తే మామిడల్లం, మనసు చూస్తే పటికబెల్లం - మా లల్లీకి అని. ఆ విషయాన్ని అంత మంచిగా అర్థం చేసుకుని - తను నాకు పెట్టిన విమల అనే పేరుని వినగానే మా అమ్మ మొహమంతా కమ్మిన నవ్వుని, ఆవిడ పొందిన సంతోషాన్ని పోల్చాలంటే ఏ దివిటీ వెలుగులూ సరిపోవు.

తనకి ఆ పేరంటే ఎంత ఇష్టమంటే - నాకో బుల్లి కారు కొని, దానికి personalized license plate గా ఆ పేరుని అలకరించేంత :)

4, మార్చి 2018, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 10 - చదువయ్యింది - మనువయ్యింది!

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 9 - ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా - ఎదురెళ్ళిన గోదావరి వరద

సెప్టెంబర్లో ఇంగ్లీషు పరీక్ష రాశాను - పాసయ్యాను. నాకు మళ్ళీ వచ్చే జూన్ దాకా టైముంది.

1965 జూన్‌లో కానీ కాలేజ్‌లో జేరడానికి లేదు నాకు.

ఈలోగా రోజూ పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాణ్ణన్నమాట.

మా అన్నగారు కటక్‌లో - విజయా మెడికల్ సిండికేట్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తూ ఉండేవారు.

మా నాన్నగారు పోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి డిసెంబర్ ప్రాంతంలో అనాతవరం వచ్చేశారు వ్యవసాయం చేయడానికి. ఆయనకి ముగ్గురు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల.

మా బావగారిక్కూడా వ్యవసాయం ఉండేది - ఓ తొమ్మిదెకరాలు. విశాఖపట్నం నుంచి చేలో నాట్లు వేసేటప్పడు, కోతలు కోసి మాసూళ్ళు చేసేటప్పుడు ఆయన, మా అక్కగారు వస్తూ ఉండేవారు. వచ్చి ఓ పది రోజులుండి పనులూ అవీ చూసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. జూన్-జులై నెలల్లో నాట్లు వేస్తామన్నమాట. ఆ నాట్లేసే రోజుల్లో ఎప్పట్లాగే వాళ్ళొచ్చారు. వ్యవసాయప్పనుల్లో బిజీగా వున్నాం.

ఓ రోజలాగే బోయనాలు చేస్తున్నాం కూర్చుని.

మా బావగారు - "ఏమయ్యా బాబీ! వ్యవసాయంలో ఏమన్నా మెళకువలు తెలుసుకున్నావా?" అనడిగారు నన్ను.

"తెలియకపోవడమేంటయ్యా బాబూ - ఇంతకాలం తిరుగుతున్నాను కదా! ఫుల్లు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది వ్యవసాయంలో. మహామహా వనచర్ల సుబ్బన్న లాంటి వాడికే నేర్పుతున్నానిప్పుడు -ఆయనకే చెప్తున్నాను " అన్నాన్నేను.

వనచర్ల సుబ్బన్న ఎవరంటే చిన్నప్పణ్ణుంచి మా పొలం పనుల మీద ఉండేవాడు. ఆయనకి అప్పటికి డెబ్భై ఐదేళ్ళు . మా నాన్నగారి కాలం నుంచి ఉండేవాడు. వాళ్ళావిడ వనచర్ల మంగమ్మ అని ఉండేది. సుబ్బన్నని ఇంటినుంచి పొలానికి తీసుకువచ్చేది.

నారు తీసే కాలమది.

" ఏంటి సుబ్బన్నక్కూడా చెప్తున్నావా నువ్వు? అంత అనుభవం వచ్చేసిందా నీకు - ఏం చెప్పి చేయించుకున్నావేం సుబ్బన్న చేత?" అంటూ మా బావగారు ఆశ్చర్య పోయారు.

"ఏముంది? కర్ర పట్టుకుని గట్టుమీద నిలబడి వున్నాడు - దగ్గరికెళ్ళి 'ఏం సుబ్బన్నా - ఇలా నిలబడి వున్నావు - నారు లాగుదువుగాని రా ' అన్నాను. నడండి  బాబయ్య అన్నాడు. ఆ చెయ్ పట్టుకు తీసుకెళ్ళి నారుమళ్ళో ఒంగోబెట్టి - ఇదిగో ఈ నారు పీకిస్తే వాళ్ళు కట్టలు కట్టి పట్టికెళ్తారు అని అక్కడ కూర్చోబెట్టాను" అని చెప్పాను.

అది వినగానే మా బావగారు ఫక్కున నవ్వాడు - ఎందుకంటే సుబ్బన్న కళ్ళు కనబడనంత పెద్దవాడయ్యాడు అప్పటికే - అతని చేత నువ్వు చెప్పి చేయించే వ్యవసాయం ఇదా అంటూ.

అలా నవ్వుతుండగా నోట్లో ముద్ద ముందున్న కంచంలో పడింది. మా బావగారికి పొరబోయింది. దగ్గొచ్చింది. గబగబా మంచినీళ్ళు తాగి నెట్టి మీద కొట్టుకున్నాడాయన. ఇదంతా అక్కడే నించుని వడ్డిస్తున్న మా అమ్మ చూసి "భోజనాల దగ్గర అవేం కబుర్లు - నవ్వించకూడదలా - పొరబోతుంది" అని నన్ను చీవాట్లేసింది.

1965 జూన్లో బీకామ్ లో చేరాను. మా క్లాసులో ఎనభై మంది ఉండేవారు.

తరగతి గదులేమో పాకలు - కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల. ఎస్కెబీఆర్ కాలేజ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఒకటే పెద్ద భవనం. మిగతావన్నీ పాకలు - కింద బండలు. చగ్గా ఆ పాకలకింద చల్లగా ఉండేది. అందులో కూర్చుని చదువుతుండేవాళ్ళం.

సాయంత్రం అయ్యేటప్పటికి ఎన్సీసీ. వారానికి నాలుగురోజులు ఎన్సీసీకి వెళ్ళాల్సిందే - యుద్ధకాలం కదా - అందరికీ ట్రైనింగు. రైఫిల్ షూటింగులూ అవీ ఉండేవి మాకు.

హైస్కూల్లో మాతో పాటు చదివినవాడు - సాయిబాబా అని ఒకడుండేవాడు. సిరంగు సత్తిరాజుగారి మనవడు. రైఫిల్ షూటింగులో నేనూ వాడూ బెస్టు అన్నమాట. వస్తే వాడికి, లేకపోతే నాకు రావాలి మొదటి స్థానం. అంతబాగా చేసేవాళ్ళం.

ఆ రకంగా ఆడుతూ పాడుతూ డిగ్రీ మొదటి ఏడాది నడిపించేశాం. జువాలజీ క్లాసుకి మాత్రం ప్రయోగాలు అవీ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ గుఱ్ఱం ప్రకాశరావుగారే మళ్ళీ మాకు పాఠాలు చెప్పేవారు. ఇంతకు ముందులాగే మా ఎన్సీసీ కమాండర్ ఆయన - డిగ్రీలో కూడా.

డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి - అన్నీ పాసయ్యాను.

1966 జూన్-జులై లో రెండవ సంవత్సరం మొదలయింది.

మా మేనమామగారు పప్పు రామకృష్ణారావుగారి మూడో అమ్మాయిని చిన్నప్పణ్ణుంచీ మా అమ్మమ్మగారు వాళ్ళూ అంటుండేవారు - ఇది బాబీ పెళ్ళాం - అని.

1965లోనే  మా అన్నయ్యగారికి చెప్పాను - "అర్జెంటుగా నాకు పెళ్ళి చేసెయ్యాలి , మళ్ళీ ఏదో పుష్కరాలు వస్తున్నాయట పన్నెండు నెలల దాకా పెళ్ళిళ్ళు ఉండవని గురువుగారు చెప్పారు. అందుచేత పెళ్ళి చేసేసుకుంటాను"  - అన్జెప్పి.

అప్పటికింకా ఒడుగు కాలేదు. పెళ్ళి కావాలంటున్నాను. సరే అని హడావిడిగా ముహూర్తాలు పెట్టించేశారు .

1966 మే 30 వ తారీఖు ఒడుగు. జూన్ రెండో తారీఖేమో పెళ్ళి.

మా అమ్మగారేమో మా పెళ్ళి తిరుపతిలో చేయిస్తానని మొక్కుకుందట. కానీ అంత తక్కువ వ్యవధిలో తిరుపతి  వెళ్ళడం అంటే కష్టం ఆ రోజుల్లో.

అంచేత రాజోలు వేంకటేశ్వరస్వామి గుళ్ళో చేసేద్దాం పెళ్ళి అని అందరూ అనేసుకున్నారు.

మే 24. ఆర్రోజుల్లో ఒడుగు, ఆ తర్వాత మూడు రోజుల్లో పెళ్ళి. బట్టలూ అవీ కొనాలి. మా బావగారు అనాతవరం - రెండో పంట మాసూళ్ళకి  వచ్చున్నాడు.

"బాబీని తీసుకుని నేను వైజాగ్ వెళ్తాను. బట్టలవన్నీ అక్కడే కొనేస్తాం." అన్నాడు మా బావగారు.

అది విని మా అన్నగారు - నానిగారు "సరే! మీరలా వెళ్ళి బట్టలవీ కొనుక్కురండి - ఇక్కడ మిగిలిన పనులూ - పందిళ్ళు అవీ వేయించడం మేం చేస్తాం" అని మమ్మల్నిద్దర్నీ పంపించారు.

మేమిద్దరం మే 26 బయల్దేరి విశాఖపట్నం వెళ్ళాం.

కోటిపల్లి రేవు దాటేశాం. SRMT వాళ్ళ బస్సు వైజాగ్ వెళ్ళేది ఎక్కాం.

మా బావగారు మధ్య సీట్లో కూర్చున్నాడు - నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. ఆ రోజు తెల్ల ప్యాంటు - తెల్ల చొక్కా వేసుకున్నాను.

బానే సాగుతోంది ప్రయాణం.

తుని దాటింతర్వాత నక్కపల్లి అడ్డరోడ్డు వస్తుంది. అక్కడొక చిన్న మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర ఓ లారీ వాడొచ్చి మేమెక్కిన బస్సుని గుద్దేశాడు.

ఈలోగా ఏమైందంటే అనుకోకుండా - నేను కుడి పక్క కిటికీ దగ్గర కూర్చున్నాను కదా! మా బావగారికి అటు పక్కన ఓ ఇంజినీరు కూర్చుని వున్నాడు. ఆయన - "బాబూ! నాక్కొంచెం కడుపులో తిప్పుతోంది.  ఆ కిటికీ సీటు నాకిచ్చి ఈ పక్కన కూర్చుంటావా?" అనడిగాడు.

"సరే! మీరిలా కూర్చోండి" - అని చెప్పేసి మా బావగార్ని చివరికి జరగమని నేను మధ్యలో కూర్చున్నాను.

ఆ ఇంజినీరు చెయ్యి బయట పెట్టుకుని కిటికీ దగ్గర కూర్చున్నాడు.

ఇదంతా తునిలో జరిగింది.

తుని దాటాక నక్కపల్లి అడ్డరోడ్డు దగ్గరికి పావుగంట-ఇరవై నిముషాల ప్రయాణం. అక్కడికి రాగానే లారీ వచ్చి కొట్టేసింది. కుడి పక్కనుంచి బస్సుని రాసుకుంటూ వెళ్ళిపోయింది.

నా పక్కనున్న ఇంజినీరుకి చెయ్యి తెగిపోయింది. నా ఒళ్ళంతా ఆయన రక్తం  మా బస్సులో కండక్టరుతో సహా ముగ్గురు చచ్చిపోయారు. ఈ బస్సుకి కుడిపక్కకి రాసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి ఎడం పక్కగా కూడా తగిలేసింది లారీ. పాపం - ఆ కండక్టరుకి పెళ్ళయ్యి మూణ్నెల్లు అయిందట. బస్సు తలుపు దగ్గర నిలబడి వున్నాడు - ఆ విసురుకి కింద పడి  చనిపోయాడు. ఇంకొకాయన పెద్దాయన కూడా పోయాడు. 

ఆ బస్సులో నేను, మా బావగారు, ఇంకో తల్లి ఆవిడ నలుగురు పిల్లలూ తప్ప దెబ్బలు తగలని వాళ్ళు లేరు.

ఇంక నేనూ,  మా బావగారు దిగి - నేనేమో బస్సు పైకెక్కి సామాన్లు దించడం మా బావగారేమో వాటిని అందుకొని కింద పెట్టడం - మొత్తం సామాన్లన్నీ నడిరోడ్డు మీదకి దించేశాం.

ఇంక రోడ్డు మీద నిలబడి అటు అనకాపల్లి వైపు - ఇటు తుని వైపు కార్లు, బస్సులు, వ్యాన్లు - ఏవి వెళ్తుంటే వాటిని ఆపి - ఈ దెబ్బలు తగిలినవాళ్ళని, వాళ్ళ సామాన్లని ఎక్కించడం - ఈ రకంగా అందర్నీ పంపించాం.

అందర్నీ పంపించాక నేను, మా బావగారు, ఆ తల్లి - నలుగురు పిల్లలూ - ఈలోగా వేరే బస్సొస్తే అదెక్కి వైజాగ్ వెళ్ళాం.

మాకు బట్టలు మార్చుకుందుకు కూడా లేదు. గుమ్మంలో దిగేటప్పటికీ మా పెద్ద మామయ్యగారు - ఇంతింత కళ్ళు చేసుకుని "ఏంటి ఒళ్ళంతా ఆ రక్తమేంటి ? ఏమయింది ? ఏంటి? ముందా బట్టలు విప్పు " అంటూ తెగ కంగారు పడిపోయారు.

అప్పుడు నేను - "నాకేం కాలేదు. పక్కనున్నాయనకి దెబ్బ తగిలితే ఆయన రక్తం నా మీద పడింది" - అని చెప్పి లోపలికెళ్ళి స్నానం అదీ చేసొచ్చాను.

ఈ లోపులేంటంటే ఈ వార్త అనాతవరంలో తెలిసిపోయింది.

రేడియోలో సాయంత్రం ఆరుగంటల ప్రాంతీయ వార్తల్లో కోటిపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సుకి ప్రమాదం జరిగింది - ముగ్గురు చనిపోయారు - చాలా మందికి తీవ్రంగా గాయాలు తగిలాయి అని చెప్పారట.

"ఏ బస్సు, ఏ బస్సు?" అని అందరూ అనుకుంటుంటే కోటిపల్లి నుంచి ఒకటే బస్సు - పైగా ఎప్పట్లాగే పళ్ళయ్య మాతోటి  కోటిపల్లి దాకా బస్సెక్కించడానికి వచ్చి వెనక్కెళ్ళిపోయాడు.

ఆ పళ్ళయ్య " అది మన బాబీగారు, లాయరు గారు ఎక్కిన బస్సేనండోయ్" అనగానే ఇంట్లో గొడవ.

పెళ్లి పనులన్నీ మానేసి - ఆ రోజుల్లో ఫోన్లు కూడా అందరిళ్ళలో ఉండేవి కావు. ఒక వేళ ఫోనున్నా లైట్నింగ్ కాల్ పెట్టి మాట్లాడాలి. అప్పుడు మా పెద్దక్కయ్య పాపాయి మావగారు - ఆయన్ని మావతాత అనేవాళ్ళం - కర్రా సూర్యనారాయణగారు - వరహాభట్ల గురుమూర్తిగారని మా అమ్మకి కజినవుతుంది ఆయన భార్య - వాళ్ళింటికెళ్లి - వాళ్ళింట్లో కూర్చుని - అక్కణ్ణించి మావతాత వైజాగ్ మా పెద్దమామయ్య గారింటికి ఫోన్ చేశారు.

ఈ లోపులేమయ్యిందంటే నేనూ, మా బావగారు - స్నానం-గీనం చేసేసి - మరీ మనసుకి ఇబ్బందిగా వుంది అని చెప్పేసి సినిమా కెళ్ళిపోయాం. కృష్ణప్రేమ సినిమా.

ఈ లోగా అమలాపురం నుంచి మావతాత ఫోను చేశారు. మా మామయ్యగారు ఫోన్ తీసి "ప్రమాదం జరిగిన మాట వాస్తవమే! కానీ మనవాళ్ళకేమీ కాలేదు. వాళ్ళొచ్చేస్తారు - మీరేమీ కంగారు పడకండి" అని చెప్పారు.

అయినా కూడా మావతాత ఊరుకోకుండా "లేదు - నేను వాళ్ళతో మాట్లాడాలి - ఏరీ వాళ్ళు? ఎక్కడ? బస్సులో అందరికీ గాయాలయ్యాయట. ముగ్గురు పోయారట. వీళ్ళెక్కడ? బానే ఉంటే ఫోన్ దగ్గరికి రారెందుకు? హాస్పిటల్లో ఉన్నారా? వాళ్ళు బానే ఉంటే వాళ్ళకివ్వండి ఫోను. నేను వాళ్ళతో మాట్లాడితే కానీ ఇక్కడ పనులన్నీ బంద్" అన్నాడాయన.

"లేరయ్యా బాబూ - వాళ్ళేదో సినిమాకెళ్ళారు - వాళ్ళొచ్చాక ఫోన్లో మాట్లాడిస్తాను - ఈలోగా మీరు పనులు చేసుకోండి " అని మా పెద్దమామయ్య అంటున్నా కూడా వినకుండా "లేదు - వాళ్ళతో మాట్లాడాకే ఏ పనైనా" అంటూ మావతాత ఫోన్ దగ్గరే కూర్చున్నారు.

మేం సినిమా నుంచి వచ్చిన తరువాత మా బావగారు మాట్లాడి - "మేము క్షేమం గానే వున్నాము, 29 కల్లా వచ్చేస్తాం. మీరు ఏర్పాట్లవీ చేసుకోండి" - అన్నాక మావతాత కుదుట పడ్డారు.

29 సాయంత్రానికి అనాతవరం చేరాం. వెంటవెంటనే పెళ్ళికొడుకుని చేయడం జరిగిపోయింది.

ఈ లోపు శివకోడులో కూడా ప్రమాదం వార్త తెలుసుకుని మా బావమరిది ప్రసాదు కూడా పందిళ్ళు అవీ వేయించడం ఆపు చేసేశాడు. అసలు బాజాలు, భజంత్రీలు ఏవీ లేవు. 

సరే - మా మటుకు మేము ఒక బస్సు అనాతవరం నుంచి పురమాయించుకుని - ఒడుగు కూడా రాజోల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే అనేసుకుని శివకోడుకి బయల్దేరాం.

పుంతలో ముసలమ్మ గుడి దగ్గరికి చేరేటప్పటికి సన్నాయి వాయిద్యం ఏమీ వినపళ్ళేదు.

అప్పుడు బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను - ఆ రోజుల్లో - వందరూపాయలు అతని చేతుల్లో పెట్టి "ఓ పంజేయవయ్యా  నువ్వూ! బాజాలెలాగూ లేవు - పుంతలో ముసలమ్మ గుడి దగ్గర్నుంచి పెళ్ళి వారింటికి వెళ్ళే వరకు ఆ హారన్ మీద చెయ్యి తియ్యకు. అదే మనకి ఊరేగింపు" అన్నాను.

ఆ పళాన ఆ డ్రైవర్ హారన్ మోగిస్తూ బస్సు నడుపుతుంటే - ఊళ్ళోవాళ్ళందరూ "ఏంటీ బస్సు ఇలా హారన్ మోగించుకుంటూ వెళ్తోంది" అనుకుంటూ చూడడానికి ఇళ్లలోంచి బయటికి వచ్చేశారు.

వస్తోంది ఎవరో తెలీగానే ఇంకేముంది! - "పెళ్ళివారొచ్చేశారు, పెళ్ళివారొచ్చేశారు" - అంటూ ఒకటే హడావిడి, సందడి.

అసలే చీకటి పడింది - ఇంటి ముందు పందిరి, దీపాలు ఏమీ లేవేమో - బస్సు డ్రైవర్ ఇంకా ముందుకెళ్ళాలేమో అనుకుని పెళ్ళివారిల్లు కూడా దాటి ముందుకెళ్ళిపోయాడు.

మళ్ళీ నేనతని దగ్గరికి వెళ్ళి - "బాబూ  ఇల్లు దాటొచ్చేశావ్ వెనక్కి తిప్పు" అని చెప్పి మొత్తానికి ఎలా అయితేనేం మగ పెళ్ళివారం ఆడపెళ్ళివారిల్లు చేరాం రాత్రికి.

అప్పటికప్పుడు వంటలు వండించుకుని బోయనాలు చేసి - రెండో రోజు పొద్దున్న రెండెడ్ల బళ్ళు కట్టించుకుని - ఊళ్ళో అంతా స్నేహితులే కదా - మన బాబీ పెళ్ళి అని అందరూ తలకో బండి ఇచ్చారు - ఆ బళ్ళెక్కి పెళ్ళివారం రాజోలు వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాం.

ఆ గుడికి అప్పటికి కాంపౌండ్ వాలూ అది కూడా లేదు. గుడి, ఒక పుట్టు వెంట్రుకలు తీసే చిన్న మండపం - అంతే!

గుళ్ళో 30న ఒడుగు చేసేశారు. రెండో తారీఖు రాత్రి పెళ్ళి.

పుట్టెంట్రుకలు తీసే కల్యాణకట్ట మండపం మా కళ్యాణమండపం. అక్కడ చుట్టూ వున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేశారు, అలా అందరి సమక్షంలో మా పెళ్లయిపోయింది.

మూడు రోజుల పెళ్ళి మాది - పెళ్ళయింతర్వాత నాగవల్లి అదీ అయ్యాక అనాతవరం  వచ్చేసి గ్రామసంతర్పణ చెయ్యాలి.

కానీ మా అమ్మ తిరుపతి మొక్కుకుంది కదా - పసుపు బట్టలతోనే తిరుపతి వెళ్ళాలి అని ఆవిడ ప్లాను.

అప్పుడు సోమన్నగారని చెప్పేసి ఉండేవాడు అమలాపురంలో టాక్సీ అయన. ఆ సోమన్నగారి టాక్సీ బుక్ చేసుకుని మా బావగారు కర్రా భాస్కరంగారు, మా అక్కగారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు, నేనూ-కొత్త పెళ్ళికూతురూ - తిరుపతి వెళ్ళాం - మా పసుబ్బట్టలతోనే.

అంబాసడర్ కారు - గంటకి అరవై కిలోమీటర్లు వెళ్ళేది. దార్లో గుంటూర్లో వడ్లమాని ఉమామహేశ్వర్రావుగారి ఇంట్లో ఓ రాత్రి వున్నాం. రెండో రోజు పొద్దున్నే బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకి తిరుపతి చేరాం. స్నానాలు చేసి దర్శనాలు అవీ చేసుకుని ఓ రోజుండి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ వస్తూ నెల్లూరులో ఆ రాత్రికి ఆగి మరసటి రోజుకి అనాతవరం వచ్చేశాం.

వచ్చిన మర్నాడు ఊళ్ళో సంతర్పణ.

అలా డిగ్రీ మొదటి సంవత్సరం అయ్యాక పెళ్ళయ్యింది. నా పెళ్ళికి మా కాలేజ్ వాళ్ళందరూ కూడా వచ్చారు.

బీకామ్ లో హిందీ క్లాసు ఉండేది. మాకు హిందీ లెక్చరర్ ఒకాయన ఉండేవారు - భూపయ్యఅగ్రహారంలో. సాయంత్రం ఆఖరి పీరియడ్ కనక ఆయనది ఉంటే నన్ను పిలిచి "నాయనా వెళ్ళు - కొత్తగా పెళ్లయినవాడివి కదా - ఫో!" అని నన్ను పంపించేసేవారు.

అలా డిగ్రీ రెండవ సంవత్సరం, మూడో ఏడాది - నాటకాలు, నాటికలు వేసుకుంటూ, ఎన్సీసీతో ఆడుతూ పాడుతూ అయిపోయింది.

కాకపోతే నాకు భయమేంటంటే - అమలాపురం ఊళ్ళో మా బావగారు కర్రా భాస్కరంగారుండేవారు కదా - భాస్కర  మెడికల్ స్టోర్స్ ఆయనదే.  మా ప్రిన్సిపాల్ సుబ్బరాజుగారని ఉండేవారు. సుబ్బరాజుగారు తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా చేశారు. మా అమ్మాయి లల్లి (అంటే ఈ బ్లాగ్ రాసే నేనే) తిరుపతిలో MCA ఎంట్రెన్స్ రాసినప్పుడు అక్కడ వైస్-ఛాన్సలర్‌ ఆయనే.

వైస్-ప్రిన్సిపాల్ జి. పి. రమేశం గారని ఉండేవారు. మాథ్స్ చెప్పడానికి చిదంబరం గారని జల్లిపల్లినుంచి వచ్చేవారు. ఆయన జి. పి. రమేశంగారికి మంచి స్నేహితులు. జల్లిపల్లి చిదంబరంగారు, జి. పి. రమేశం గారు మా బావగారికి మంచి ఫ్రెండ్సు. వీళ్ళు అప్పుడప్పుడు మా బావగారి మెడికల్ షాపుకి వచ్చి కబుర్లు చెప్తూ, ఏవో అవసరమైన మందులు కొనుక్కెళ్తూ ఉండేవారు. అంచేత జాగ్రత్తగా ఉండేవాణ్ణి - కాలేజ్ విషయాలేమైనా మా బావగారికి వాళ్ళు చెప్తారేమోనని.

మా బావగారంటే నాక్కొంచెం అభిమానంతో కూడిన గౌరవంతో కూడిన భయం ఉండేదన్నమాట. రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వస్తూ ఆయన సైకిలు బెల్లు వినగానే పుస్తకాలు తీసి చదువుతూ ఉండేవాణ్ణి. అంతవరకూ మా అక్కగారి దగ్గర పాటలు పాడుతూ కూర్చునేవాణ్ణి.

డిగ్రీలో పరీక్షలకి ఎలా చదివే వాణ్ణంటే - సాధారణంగా B.com వాళ్లంటే they can never be calm - ఎప్పుడూ ఎదో సరదా, అల్లరి. కాకపోతే అకౌంట్స్ నేను బాగా చేసేవాణ్ణి. పరీక్షలప్పుడు సాయంత్రం మొదలుపెట్టి రాత్రి తొమ్మిదిన్నర దాకా చదివేవాణ్ణి. అప్పుడు బయటికెళ్ళి టీ తాగి సెకండ్ షో సినిమాకెళ్లిపోయేవాణ్ణి. మళ్ళీ ఒంటిగంటకి ఇంటికొచ్చి అప్పట్నుంచి తెల్లారేదాకా చదివేసేవాణ్ణి. పొద్దున్నే వెళ్ళి పరీక్ష రాయడం - మధ్యాహ్నం నిద్రపోవడం. సంవత్సరమంతా చదవడం ఎప్పుడూ అలవాటు లేదు. మా వాళ్ళందరూ - ఒరే! ఏకసంథాగ్రాహివిరా నువ్వు అనేవారు. ఏకసంథాగ్రాహినో ఏమో కానీ - ఏదో అలా చదివేసి మొత్తానికి బీకామ్ పాసయిపోయాను.

కాకపోతే - జయంతి సత్యనారాయణ గారని మాకు మర్కంటైల్ లా చెప్పేవారు. ఆయన క్లాసులో మాత్రం వెనక బెంచీలో కూర్చుని నేను మంగినపూడి సీతారాం చుక్కలాట ఆడుకునేవాళ్ళం. ఆయనకి మెల్లకన్ను. ఎటు చూస్తున్నారో తెలిసేది కాదు. అటు పక్క చూస్తూ ఇటు పట్టుకునేవారు. కాలేజీలో అందరూ గౌరవంగానే పిలిచేవారు. ఆయన మాత్రం "ఒరేయ్! వడ్లమాని గాడిదా! నువ్వు మాత్రం లా పాసవ్వవురా " అనేవారు. ఆయనలా అనగానే "నాకెందుకు సార్ లా ? పాసవ్వకపోతే నేను వ్యవసాయం చేసుకుంటాను" అనేవాణ్ణి. పైగా ఆయన లాగే మెల్లకన్ను పెట్టి చూసేవాణ్ణి. నిజంగానే ఆయన చెప్పినట్లే మర్కంటైల్ లా ఫైనల్ ఇయర్లో తన్నేసింది. 1968 సెప్టెంబర్లో వైజాగ్ వెళ్ళి రాశాను మర్కంటైల్ లా.

1968లో చదువై పోగానే నేనూ, మా ఆవిడా అరకు, వైజాగ్ అంతా తిరిగి వచ్చాము. అదీ సంగతి! 

సరదాగా ఆడుతూ పాడుతూ చదువయ్యింది
చదువు ముందు బ్రతుకుకి మదుపయ్యింది
మరదలిపై ప్రేమతో ప్రీతితో మనువయ్యింది
మనువు జరిగి చెలువ చనువయ్యింది

<వచ్చేనెల తరువాయి కథ>


24, ఫిబ్రవరి 2018, శనివారం

"అ!"డలిపోయి చేసేశాం... (చలన)చిత్ర సన్యాసం!

అ!ర్రే ... ఇలా అయిందేంటి?




ఏమయింది? - ఎలా అయింది? - ఎందుకు అయింది?  - ఇల్లాంటి ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పాలంటే కొన్ని వేల రీళ్ళ వెనకాలకి వెళ్ళాలి.

అప్పుడెప్పుడో చిన్నపుడు .... మా అమ్మ పొట్టలో వున్నప్పటినుంచి మొదలుపెట్టి పెంచుకున్న ఆ ఇష్టంతో - పద్మవ్యూహం సుభద్ర కడుపులో ఉండి సగమే విన్న అభిమన్యుడు అక్కడే ఆపేశాడేమో కానీ - నేను మాత్రం అక్కడే ఆగిపోలేదు.

నెలల పిల్లగా సీటు పక్కన బొంతలో పడుకునో, ఆ తర్వాత అమ్మ ఒళ్ళో కూర్చుని జోగుతూనో చాలా చూసేసే వుంటాను. దానికి ప్రూఫు - మా అమ్మ "నువ్విది చూసేశావు" అని నాకు గుర్తు చేస్తున్నట్టుగా చెప్పేసిన కథలు ఎప్పుడో నేను పుట్టకముందటి విశేషాలు.

అలా మొదలైన "చూడడం" కొనసాగించిన విధానం ఎల్లాంటిదంటే...

ఇంటి మడేలు అప్పుడే తెచ్చిన చాకింటి బాంబేడైయింగ్ గౌను వేసేసుకుని ...  ఎండాకాలపు ఉక్కకి పేలిన ఒంటికి జాన్సన్స్ ప్రిక్లీహీటు పౌడర్ రాసేసుకుని ...  వెనక్కి దువ్విన జుట్టుకి కట్టిన రిబ్బన్-పోనీటెయిల్‌తో ... కాళ్ళకి హవాయి చెప్పులు వేస్తే ఎప్పుడూ ఒకటి పారేసుకుంటున్నానని బెల్టువైతే విదిలించినా వదలవని అమ్మ కొన్న బెల్టు చెప్పులు వేసుకుని... ఒంటెద్దు బండిలో ముందో వెనకో కాళ్ళు వేలాడేసి కూర్చుని ... వెళ్ళే ఉత్సాహంలో అప్పటివరకూ జుట్లు పట్టుకునో, ఇత్తడి సెమ్మాలు విసిరేసుకునో హోరాహోరీ పోరాడేసుకుని, ఏడ్చేసి కూడా "ఆహా! అప్పచెల్లెళ్ళు అంటే ఇలా ఉండాలి" అన్నంత ఆదర్శప్రాయంగా అంతకు ముందు జరిగిన పోనీపట్టు యుద్ధాలు జరిగాయా, మేము చూశామా అని మా అమ్మ, దొడ్డలు, పిన్నులు, మామయ్యలు, అత్తలు హాచ్చెర్యపడిపోయేలా ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసేసుకుని ...టిక్కెట్లబ్బాయి కిటికీ తెరిచి తిరగేసిన U కన్నంలోంచి అందించిన టిక్కెట్లు అపురూపంగా పట్టుకున్న చెల్లాయత్త కేసి అమృతభాండం పట్టుకున్న మోహినికేసి పిల్ల-రాక్షసులు చూసినట్లు ఆరాధనగా చూస్తూ ...

ఇంకా లైట్లు వెలుగుతున్న హాల్లోకి వెళ్ళడం ...  మనకి కావాల్సిన సీట్లలో కూర్చోవడం ...  కూర్చున్న కుర్చీ విక్రమార్క సింహాసనంలా అనిపించి చుట్టూ వున్న ప్రపంచాన్ని వేరే ఎత్తులోంచి చూస్తున్నట్లు అనేసుకోవడం ...  
"నమో వెంకటేశా ..." అన్న ఘంటసాల పాటతో - వేంకటేశ్వరస్వామి బొమ్మతో తెర మీద బొమ్మలు మొదలైతే - పొగ త్రాగరాదు, దయ చేసి ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, నేడే చూడండి - వగైరా స్లైడ్లను అక్షరం పొల్లు పోకుండా చదువుకుంటూ ... బెంగుళూరులో పెరిగిపోతూ న్యుమోనియా రావడానికి కారణమవుతున్న పార్థీనియం మొక్కలని ఎలా కాలుస్తున్నారో చూపించే న్యూసురీలు ఐదువందల అరవై నాలుగోసారి కూడా అదే మొదటిసారి అన్నట్లు చూస్తూ - "ఆ మొక్కలు మన ముక్కుపుడక పూల మొక్కలు కదా - అయ్యో కాల్చేస్తున్నారా?" అని తెగ బాధపడిపోతూ ... తలమీద ముసుగుతో మైకు పట్టుకుని హిందీలో ఏదేదో మాట్లాడేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయే ఇందిరాగాంధీని చూస్తూ ... చివరాఖరికి  అసలు సినిమాని - నోట్లో నమిలే జంతికల చప్పుడుకి డైలాగులు వినిపించవేమో - అని - అతి నెమ్మదిగా నవులుతూ ... అర్థం అయినా కాకపోయినా తెరమీద కదిలే బొమ్మలని కళ్ళప్పగించి చూసి - ఇంటికి వచ్చి - ఆ రెండో రోజు విన్న పాటలని పాడేసుకుంటూ ... సిని-మా-లక్ష్మివ్రతాన్ని నిరవధికంగా, నిరంతరాయంగా ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు చేశాను నేను.

ఇంక ఆ వ్రతాన్ని ఇంక కొనసాగించలేనేమో అన్న బెంగొచ్చేసింది.

ఒక రోజా - రెండ్రోజులా - కొన్ని ఏళ్ళ సావాసం - ప్రతి మాసం ఒక సినీ-మాసం అన్నట్లు జరిగిన సినీ-మా-ప్రయాణం.

ఒక చేత్తో క్లాసు పుస్తకాలు, ఇంకో చేత్తో విజయచిత్ర, జ్యోతిచిత్ర, సితార, స్టార్ డస్ట్ లాంటి సినిమా పుస్తకాలు పట్టుకుని,  సినీ-గాసిప్పులని పాలగ్లాసు సిప్పు చేస్తూ చదువుతూ, లెక్కలు చేస్తూ రఫ్‌వర్క్‌ కోసమని గీసిన మార్జిన్‌లో పక్కనే రేడియోలో వింటున్న నచ్చిన పాటలు రాసేసుకుంటూ - సిని-మాయలో పెరిగాను.

కిరీటాలు పెట్టుకునే దేవుళ్ళుంటే పౌరాణికాలు, సోషల్ టెక్స్ట్ లో వున్న రాజులు, రాణుల కథలంటే చారిత్రాత్మకం, వనమునేలే రాణి, నగరినేలే రాజు ఉంటే జానపదం, ఇవేవీ కాకపోతే సాంఘికం -  సినిమాల్లో రకాల గురించి ఊరిస్తూ మా అమ్మ చెప్పిన నిర్వచనాలతో చూసే సినిమాలని పోల్చుకుంటూ ఉండేదాన్ని. 

ఎంత చదివినా పరీక్షల ముందు బెంగెట్టేసుకుని గోళ్ళు కొరికేసుకునే నన్ను మరిపించడానికి  " సంవత్సరమంతా చదువుతావు - పరీక్షల ముందురోజు చదవక్కర్లేదు - పద సినిమాకెళ్ళొద్దాం" అని సినిమాకే  తీస్కెళ్ళేవారు నాన్న.

ఇంట్లో పుట్టినరోజులకి, పండగ-పబ్బాలకి, ఇంటికి వచ్చిన చుట్టాలతో, ఇంటి పక్కన పక్కాలతో, చదువుకునేటప్పుడు స్నేహితులతో, పెద్దయ్యాక సన్నిహితులతో,  పెళ్ళైన కొత్తలో ఇద్దరం, పుట్టిన పిల్లలతో కలిపి నలుగురం - ఇలా సందర్భమేదైనా, బంధమూ-సంబంధమేదైనా మా దార్లన్నీ సినీ-దరికే.

హీరో ఆరడుగుల అందగాడైనా - అయోమయపు విజ్జిబాబైనా, ఆడ వేషం వేసినా - పాడు ఏక్షన్ చేసినా చూసేశాను.

హీరోని కొట్టి పచ్చడి చేద్దామని రూంలో కూర్చుని గట్టిగా అరుస్తూ రహస్యంగా ప్లాన్లు వేస్తున్న విలన్ మాటల్ని కిటికీ బయట నుండి విని - చడీచప్పుడు చేయకుండా వెళ్ళి హీరోకి చెప్పాల్సిన హీరోయిన్ను - విలన్ కంటే గట్టిగా "హన్నా! మా హీరోని కొట్టేద్దామనుకుంటున్నావా ? ఆయ్ - నీకెంత ధైర్యం! వుండు నేనేం చేస్తానో? మా హీరోతో చెప్పి నీ పని పట్టిస్తాను" అంటూ అరుస్తూ వెళ్ళబోయి ఆ విలన్ చేతుల్లో చిక్కి - ఏ గాజు ముక్కల మీదో,  కుండ పెంకుల మీదో పాదాలు రక్తాలు కారే దాకా - అద్దాల పరికిణీ వేసుకుని మరీ డాన్స్ చేసేస్తుంటే అయోమయ-భాష్పాలు రాల్చాను.

మాయాబజారులో ఘటోత్కచుడి ముందు కెవి రెడ్డి చేర్చిన గిన్నెలను అరువు తెచ్చుకుని  విఠలాచార్యుడు జగన్మోహినిలో బుల్లి-తెల్ల-దెయ్యప్పిల్ల చేత పేర్పించినా చప్పట్లు కొట్టుకుంటూ చూశాను.

ఆరాధనలో చివరి పదినిముషాల సీనులో - "రావే తల్లీ! నువ్వొచ్చి కనిపించకపోతే నాగేసొర్రావు కళ్ళే కాదు ప్రాణాలే పోతాయి" అని జగ్గయ్య, గుమ్మడి, రమణారెడ్డి బ్రతిమాలుతున్నా - నోట్లో చీర కుక్కుకుంటూ, గుడ్లలో నీరు కుక్కుకుంటూ - స్తంభాల వెనకనా, గోడల పక్కనా దాక్కుంటున్న సావిత్రిని చూసి - "అబ్బే! గుండమ్మకథలో ఎంచక్కా చేసింది - ఏంటిక్కడ బుర్ర లేకుండా బిహేవ్ చేస్తోంది - ఇంతా చేసి ఇప్పుడే వచ్చిన ఆ కళ్ళు మళ్ళీ పొతే ఇంకెలా - ఇదింకో చిరంజీవులా- దేవుడా! " అని కుర్చీ అంచుమీద గోళ్ళు కొరికేసుకుంటూ తెగ టెన్షన్ పడిపోయాను.

పైన చెప్పినవి మచ్చుక్కొన్ని నచ్చకపోయినా నొచ్చుకోని ఉదాహరణలు.

ఆట్టే సాగదీయకుండా ఇంకొన్ని నొచ్చుకున్నా, నచ్చినా-నచ్చకున్నా, చూసేసిన మెచ్చు-తునకల గురించి చెప్పాలంటే ...

కరుణామయుడు విజయచందర్ కోసం కన్నీరు కార్చాను.

అడవిరాముడితో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ గొంతు కలిపి పాడాను.

రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి  అన్న"టి-పాట" పాడిన ఎంటీవోణ్ణి మురిపెంగా చూశాను.

ఆ తర్వాత నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ  అంటూ "డి-పాట" పాడిన మనవణ్ణీ  - "పోన్లే-మన ఎంటీవోడి మనవడే మనవాడే" అనుకుని వినీ-విననట్టు ఆట్టే ఆక్షేపించకుండా పక్కకి తోసేశాను.

మనవూరి పాండవుల చిరంజీవి, నందమూరి అందగాళ్ళు, అక్కినేని వంశజులు, మంచువారి వారసులు, దగ్గుబాటి వీరులు - "ఒక్కణ్ణి కాదు ఆడియన్స్ - వంద మందిని ఒదుల్తాము మీ మీదకి"  అంటూ తమ్ముళ్ళని, కొడుకులని, అల్లుళ్ళని, మేనల్లుళ్ళని, మనవలని  - కురుసంతతి-సంఖ్యకి దీటుగా నట-కార్ఖానాలా ఉత్పత్తి చేసి పంపిస్తుంటే - "పోన్లే! వాళ్ళెలాగూ డాక్టర్లయ్యి మన ప్రాణాలు తీయబోవట్లేదు అదే పదివేలు"  అనుకుని యథాశక్తి ఇంటికో-ఏక్టర్ మాత్రమే అని నిబంధనలేమీ పెట్టకుండా తలకో సినిమా చొప్పున వాళ్ళందరి సినిమాలు చూసి పెట్టాను.

చిన్నప్పటి స్కూల్లో ఫ్రెండు భారతికి బాబాయి కొడుకని, కాకుటూరివారిపాలెం వారబ్బాయని తొట్టెంపూడి గోపీచందు సినిమాలు చూశాను.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని శంకరాభరణ రాగం ఆరోహణలో వినిపించిన కాశీనాధుని విశ్వనాథుని సినిమాలు చూశాను.

అన్నీ బావున్నా తెర మీద వంకర-టింకరగా నించుని, అసందర్భంగా నవ్వుతోందని కుంచెం నచ్చకపోయినా, ముళ్ళపూడివారి పలుకులు పలుకుతాయని బాపు-బొమ్మలనీ చూసేశాను.

మీసాల్రాని అబ్బాయిలతోనూ, ఓణీయే ఇంకా సరిగ్గా వేసుకోవడం రాని ముద్దమందారాల తోనూ సినిమాలు తీస్తున్నాడని మా అమ్మ చూడనివ్వకపోయినా కోపం తెచ్చుకుని స్తంభానికి తల కొట్టుకోకుండా ఆవిడ చూపించిన  జంధ్యాల సినిమాలు మాత్రమే చూశాను.

పొడుగు జళ్ళేసుకుని - నూలు చీరలు చుట్టేసుకుని - గోదారి ఒడ్డున తెగ పరిగెట్టేసే వంశీ హీరోయిన్ల కోసం చూశాను.

ముందంతా భలే తీసి చివర్లో చంపేస్తాడని కోపం వున్నా బాలచందర్ సినిమాలూ విసుక్కోకుండా చూశాను.

చెప్పాలనుకున్నది చాలా డీసెంటుగా చెప్పే సింగీతం వారి సినిమాలు ఇష్టంగా చూశాను.

ఇంకా దాసరి ప్రేమ-సిరీసు,  జీన్సు-ప్యాంటు మీద గళ్ళజాకెట్టు వేసుకున్న రాఘవేంద్రరావు ఫ్రూటు-గరల్సు - అబ్బో - చాలా చూశాను.

కోడి రామకృష్ణ, బాలూ మహేంద్ర, మణిరత్నం, ఎస్వీ కృష్ణారెడ్డి, కృష్ణవంశీ, గుణశేఖర్, గోదావరి శేఖర్, సంచుల కొద్దీ పంచులు రాసే త్రివిక్రమ్, క్రిష్షు, మారుతి, భాస్కర్, విజయభాస్కర్ - గట్రా గట్రా - ఎట్సెట్రా .... ఇలా పేరుపేరునా చెప్పుకోవాలంటే - అప్పటినుంచి ఇప్పటిదాకా ఎంతోమంది దర్శకుల-నటుల సినిమాలు లెక్కలేనన్ని చూశాను.


సినిమా చూసిన ప్రతిసారీ నచ్చితే ఎలాగూ మంచిగానే మాట్లాడుకుంటాం. నచ్చకపోయినప్పుడు కూడా - "పోన్లే - నేను వండిన వంట బాలేదంటేనే తెగ బాధ పడిపోతాను - అంత మంది కలిపి వండాల్సిన సినిమా అది. బాలేదంటే వాళ్లకెంత బాధ?" అని తలా-తోకా లేని లాజక్కులతో నాకు నేనే సర్ది చెప్పేసుకుని - హ్యాప్పీగా సినిమాలు చూసేసుకుంటూ - చిప్స్ నవిలేసుకుంటూ ఏదో నా మానాన నేను సినీ-మాయలో పడి రోజులు గడిపేస్తుంటే....

అనుకోలేదమ్మా ... ఇలా ఉంటుందని 
ఇలా అవుతుందని... 
దెబ్బే పడుతుందని...  మతే పోతుందని,,, 
సినిమా చూసే అప్పటిదాకా అనుకోలేదమ్మా... (చదివేవారూ - అసలు పాట పట్టగలరేమో చూడండి!)

ఒక్క వారం రోజులు వెనక్కి వెళ్ళగలిగితే ... ఆ ఒక్క బల-సీను క్షణాన్ని వెనక్కి తెచ్చుకోగలిగితే ఎంత బావుంటుందో?

ఇప్పటికి ఇలా అనుకోవడమే తప్ప - మా చేతుల్లో ఏమీ లేదు కదా!

కిందటి శుక్రవారం - ఊపిరాడని పనితో ఉన్న మతి పోతోందని - ఊరు మారితే గాలి మళ్ళుతుందని, మనసు తుళ్ళుతుందని అనుకుని పొరుగూరు వెళ్ళామా?

ఆ ఊళ్ళో సినిమా ఊసొచ్చినప్పుడు "అ!మ్మో! ఈనాడు-వాడు  అ!ద్దిరిపోయింది అని చెప్తే చెప్పాడు - ఇది మాత్రం చూడొద్దు" అని ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని మరీ ఒట్టెట్టుకున్నామా?

ఆదివారం గూటికి తిరిగొచ్చేటప్పుడు బదరి వాట్సాప్ ఎందుకు చూశారో ?
అందులో ఎవరు ఇది బావుందని చెప్పారో?
మేమెందుకు ఇంటికి చేరగానే ఆదరా-బాదరా ఆమ్ తినేసి బుజ్జిజింకని బజ్జోమని పరిగే...త్తుకుంటూ సినిమా హాలుకెళ్ళి పోయామో?


ఆదివారం కదా రష్షుండదులే అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ సినిమా హాలు చేరి చెరో టిక్కెట్టూ కొనుక్కుని - కాళ్ళు జాపేసుకుని - గంటా-ఏభై ఐదు నిముషాల సినిమా చూస్తున్నంత సేపూ - కథింకా మొదలు కాలేదు అని మాకు మేమే నచ్చ చెప్పుకుంటూ - తీరా అయిపోయాక ఏం చూశామో అర్థం కాక - మాటల్లేవ్ - మాట్లాడుకోడాల్లేవ్ అన్న నినాదంతో నోట మాట రానివాళ్ళమై, మాటొచ్చినా మాటల్లేనివాళ్లమై - మాటిమాటికీ చూసిన సినిమాని తలుచుకుని ఇప్పటికీ అ!డలిపోతున్నాము.

నాని-చేప, రవితేజ-చెట్టు అంటే  - ఏంటవి ? అసలవి ఎందుకున్నాయ్? అవి సినిమాకేం చేశాయ్?

ఆ ముక్కుపుడకలేంటి? సినిమా మొత్తంలో అందరూ దాదాపు కూర్చునే ఏక్ట్ చేయడమేంటి?

అవసరాల శ్రీనివాసు అవసరమేంటి? ఆయన ఆడావిడ అయిపోయిన హడావిడి ఏంటి?

ఆ చిన్నపిల్ల ఏంటి? ఆ మాటలేంటి?

మురళీశర్మ మ్యాజిక్కు ఏంటి? ఆ టాయిలెట్టు సీనేంటి? తాగిన బ్లూబెర్రీ మొహితో ఏంటి?

అసలా సినిమా మొత్తం ఒక ఫుడ్-కోర్ట్ లో జరుగుతోందని, అందరూ తలో స్టేజూ వేసుకుని అక్కడక్కడే కూర్చుని డ్రామా వేశారని సినిమా అయిపోయేదాకా అర్థం కాని లెవెల్కి నా ఐక్యూ పడిపోవడమేంటి?

కాజల్ చేసిన అద్భుత నటనేంటి? రెజీనా పీల్చిన ముక్కేంటి? నిత్యామీనన్ ఉండి చేసిందేంటి?

రోహిణి తప్ప అసలింక మిగిలిన అమ్మాయిలెవరైనా తెలుగువాళ్ళలా కనిపించారేంటి?

ఆ పక్కజుట్టు-ప్రగతి రోలేంటి - ఆ నోరు తిరగని వంటల గోలేంటి?

గంటా-ఏభై ఐదు నిముషాల సినిమా అయిపోయాక కూడా - సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనిపించిన వైనమేంటి?

వాళ్ళేం తీశారు? మేమేం చూశాం? అందులో నాకెంత అర్థమయ్యింది? అస్సలడగొద్దు.

నచ్చని విషయాల గురించి మాట్లాడకూడదని, మరిచిపోవాలని పదేపదే బదరి చెప్పగా కష్టపడి నేర్చుకున్నాను, ignorance is bliss అని ఇంకోసారి రిమైండ్ చేసుకున్నాను - అనుకుంటూనే పైనో పెద్ద లిస్టు రాశాను. 

పేపర్లలో తెగ రాస్తున్నారు - ఇండియాలో నెగటివ్ టాక్ వచ్చింది కానీ అమెరికాలో ఆదరిస్తున్నారు అంటూ.

అది చదివి అమెరికాలో - మాలాగా ఎందరో! - అని నవ్వుకున్నాం.

సరే! ఇంతవరకు వచ్చాక - అసలు విషయం చెప్పాలి కదా!

ఓయ్ సినిమా!

ఎప్పుడో నేను పుట్టక ముందు పుట్టావు నువ్వు.  చిన్నప్పట్నుంచి నిన్ను చూస్తూ పెరిగాను నేను.

ఇకపై నిన్ను చూడకుండా ఉంటే నేను పదిలం.  నేను చూసినా చూడకపోయినా నువ్వింకా పదికాలాలుండడం ఖాయం.

కనీసం ఈ 2018 సంవత్సరంలో కొన్ని అజ్ఞానవాసి టైపు సినిమాలు చూడకుండా తప్పించుకున్నామని అనుకున్నా - దొరికిపోయాం - ఈ ఒక్క సినిమాతో.

ఎంతో కష్టపడి తీస్తారు - లివ్ ఎండ్ లెట్ లివ్ - అన్నారు కదా ఓ ఇరవయ్యో, పాతికో విచ్చు-డాలర్లు పొతే పోయాయి - మనం చూస్తే వాళ్ళకి డబ్బులొచ్చి ఇంకొంచెం మంచి సినిమాలు తీస్తారు అన్న మాటింక లేనే లేదు.

అందుకని ఇప్పట్నించీ మళ్ళీ 2019 దాకా సినిమాలు థియేటర్‌కి వెళ్ళి మాత్రం చూడం.

ఊరికే వస్తే యూట్యూబులోనో, యప్పు-టీవీలోనో చూస్తాం - అంతగా చూళ్ళేకపోతే కట్టేసుకునేవీలుంటుంది కదా! - అందుకన్నమాట!

నిజ్జంగా...నిజ్జం!

 "అ!"డలిపోయి చేసేశాం... (చలన)చిత్ర సన్యాసం!

మళ్ళీ ఎప్పుడో - ఈ బాధ మరపుకొచ్చినప్పుడు -మళ్ళీ కలుద్దాం... ఏ థియేటర్లోనో!

అంతవరకూ  ...నీకూ మాకూ టి!

ఇట్లు,
పతీ సమేత సినీ-మా-లక్ష్మి


19, ఫిబ్రవరి 2018, సోమవారం

త్వామనురజామి - 22 - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 21 - చిట్టిపిట్టలు మా చుట్టాలే - వచ్చీ పోయే అతిథులే!

న్యూఇయర్స్‌డే.

అప్పటికి రెండ్రోజుల ముందే పాపాయి అత్తయ్య కూడా వచ్చివున్నారు. ఇల్లంతా ఎప్పట్లాగే శ్రీరామనవమి పందిరిలా, పెళ్ళివారిల్లులా వుంది.

ముగ్గురాడపిల్లల మా ఇంట్లో ఆరడి-పాలై-అలమటించినవాడు - అప్పటికి ఇంకా మా ఇంట్లోనే వుండి  - KLCE లో ఇంజనీరింగ్ చేస్తున్న తమ్ముడు శ్రీనివాసుడు .

కాలేజ్ వున్న రోజైనా, సెలవు రోజైనా పొద్దున్నే ఏడుగంటల టైంలో మా ఇంటి ముందు సైకిల్ బెల్లు మోగేది. మోగించేవాడు సీతారాముడు - శ్రీనివాసుడి నేస్తుడు.

ఆ బెల్లుమోత వినగానే పిన్నికిం జెప్పడు బ్రష్షుపేస్టుయుగముం జేదోయి విడవడే అన్నట్లు చొక్కాలేకుండా, ఒంటిమీదున్న ఓ బుజ్జి-తువాలు-ధారుడై పరిగే..త్తుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళేవాడు శ్రీను.

అసలే పాపం - మా చిన్నపాప్పిన్నేమో -  ఏదో మా ఇంట్లో మా ముగ్గురాడపిల్లల మధ్యనా వుంటే మేమెలాగూ చెయ్యని పనీ-పాటా వాడికి నేర్పి ప్రయోజకుణ్ణి చేస్తామని - కొండంత ఆశతో, ఆశయాలతో వాణ్ణి గుంటూరు పంపించింది.


మా అమ్మకేమో బెంగ - ఈ తెల్ల-కూబరుణ్ణి అరా-కొరా కోరా-రంగు తువ్వాల్లో చూసేసి, మోహించేసి నాలుగోలైనులో విహారం చేసే అమ్మాయిలెవరైనా మోసుకెళ్ళిపోతారేమోనని.

అసలే వాడు మా ఇంటి కమల-హాసనుడు, రోజుకోసారైనా మా మీద అలిగి ఎర్రబడే అరుణాననుడు.

అందుకని వాడో - పావుగంటో, అరగంటో గేటు దగ్గర నించుని - క్రీగంటో, వాలుగంటో - బ్రాడీపేట నాలుగోలైనులో ట్యూషన్లకోసమని సైకిళ్ళెక్కి వెళ్ళే రంగురంగుల చుడీదార్లు-or-పరికిణీఓణీ-ధారిణులని చూస్తూ సీతారాముడితో కబుర్లాడేసుకుని - ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చేటప్పటికి - రెండు తలంట్ల టైమూ అయ్యేది.

ఒక తలంటు మా అమ్మ చేతిలో -  అదెలా మొదలయేదంటే....

"ఏంట్రా శ్రీనూ - ఇంతసేపు వీధిలో నించుని ఎం చేస్తున్నావ్?"

"ఏం లేద్దొడ్డా! ఫ్రెండొస్తేనూ ...."

"ఫ్రెండా - ఎవరూ సీతారామేనా  - లోపలకి రాకుండా ఆ గేటు దగ్గర కబుర్లేంటి?"

"అదీ..."

"నువ్వూ,  వాడూ ఏం మాట్లాడుకుంటారో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు - వెనకటికి ఎవరో అన్నట్లు face is the index of the mind... "

"....."

"చదువుకునేటప్పుడు చదువుకోకపోతే తర్వాత బాధ పడాలి   - మనకన్నా బాగా చదువుకునే వాళ్ళతో తిరిగితే మనకీ చదువు మీద ఇంట్రెస్టు ఉంటుంది - స్పర్థయా వర్ధతే విద్యా అన్నారు అందుకే"

"అలాగే దొడ్డా!"

ఇలా ఇంగ్లీషు, సంస్కృతం సామెతలతో తలతిరిగి ఉన్న వాణ్ణి రష్కించడానికి  వెళ్ళి - నేనూ ఓ చిలక-పలుకన్నా- కొంచెం వినయంగా - "అవునమ్మా - విద్యా దదాతి వినయం అని కూడా అన్నారు కదా - వీడికి పాపం నీ దగ్గర వినయం ఎక్కువే - అంటే విద్యున్నట్లే కదా !" - అంటూ.

 (ఇంతకీ "అన్నారు కదా - అన్నారు కదా " అంటున్నాం కానీ అవన్నీ ఎవరన్నారో నాకూ, మా అమ్మకీ కూడా నిజ్జంగా తెలీదు.)

"వాళ్ళే అతివినయం ధూర్తలక్షణం అని కూడా అన్నారు - ఇంక తలంట్లూ అవీ కానివ్వండి" అంటూ వాడితో పాటు నాకూ రెండు అక్షింతలు వేసేది.

ఆ రకంగా వాడికి రెండోదీ, అసలుదీ ఐన ఇంకో తలంటు కూడా పూర్తయేది మా అమ్మ చేతిలో.

వాడికప్పటికే నా మీద బోల్డు కోపం వచ్చేసుండేది - మా అమ్మ ఏదో మూడు పాఠాలతో ఆపేస్తుందీ అనుకుంటే దాన్ని నేనింకోటి చేర్చి పెంచానని.

తమ్ముడు-శ్రీనుకి అప్పటికి ఆషికి (రాహుల్ రాయ్, అను అగర్వాల్) పాటలంటే చాలా ఇష్టం.

పాపం - కొత్తేడాది పొద్దునపొద్దున్నే వాడికి మా అమ్మ ప్రైవేటు చెప్పిందని - అది మర్చిపోయేలా చేసి వాడికో సిల్వర్ లైనింగ్ ఇద్దామని - ఆరోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత - మూడింటికి - పప్పి, కుట్టి, నేను అరండల్‌పేటలో వున్న సంగీత్‌సాగర్‌కి వెళ్ళి శ్రీనుకోసం ఆషికి పాటల కాసెట్ తెద్దామని అనుకున్నాము.

అనుకున్నట్టే బయల్దేరాం - నడుచుకుంటూ వెళ్ళొద్దామని. శీతాకాలపు ఎండ - భలే హాయిగా వుంది.

కోరారంగులో నారింజరంగు అంచున్న బెంగాల్ కాటన్ చీర కట్టుకుని బయటికి రాగానే - చూసీ చూడగానే పాపాయత్తయ్య - "మధుపర్కంలా వుంది ఈ చీర లల్లీ - పెళ్ళి కళొచ్చింది నీకు" అని మురిసిపోతూ తెగ మెచ్చేసుకున్నారు.

అది విని పప్పి, కుట్టి - "లల్లెమ్మా! జాగ్రత్త - కొంచెం చూసుకుని నడు - కళ్ళు నెత్తికెక్కేసి ఉంటాయి ఈ పాటికి" అంటూ తెగ మోసేయడం మొదలుపెట్టారు. వాళ్ళని పట్టించుకోకపోతే అక్కడితో ఆపేస్తారు. అందుకే అసలేం వినిపించుకోనట్టు ఇంకేదో సంబంధం లేని టాపిక్కేదో మొదలుపెట్టేసరికి నేననుకున్నట్లే మాట-మళ్ళిపోయారు.

బ్రాడీపేట - జనవరి ఒకటి చాలా షాపులకి సెలవేమో - ట్రాఫిక్ అస్సల్లేక ఖాళీగా వుంది. రోడ్ల మీద ఎవరూ తిరగట్లేదు. మేం ముగ్గురం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము.

సరిగ్గా బ్రాడీపేట 4/10 దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరమ్మాయిలు మాలాగే నడుచుకుంటూ ఎదురొచ్చారు. వాళ్ళెవరో మాకు తెలీదు. వాళ్ళు మమ్మల్ని చూడగానే హఠాత్తుగా ఆగి - నా దగ్గరికి వచ్చి "మీరీ చీరలో చాలా బావున్నారండి", అనగానే నాకేం చెప్పాలో తెలీక మొహమాటంగా "థాంక్స్" అని చెప్పాను. వాళ్ళటు వెళ్ళీ వెళ్ళగానే కుట్టెమ్మ "ఇంక దీన్నివాళ పట్టలేం" అంటూ ఒకటే నవ్వు.

మొత్తానికి ఎలా అయితేనేం - మాక్కావాల్సిన పాటల కాసెట్ కొనుక్కుని ఇంటికి వచ్చాము - శ్రీనివాసుకిచ్చాము.

అలా కొత్తసంవత్సరపు సందడి ముగిసింది.

సంక్రాంతి రోజులు - రోజూ రాత్రి తొమ్మది దాటాక  రోడ్డు ఖాళీగా వున్నప్పుడు ముగ్గులు వేసేదాన్ని. నాకు తోడుగా కబుర్లు చెప్తూ పప్పి, కుట్టి, ప్రశాంతి, శ్రీను నించుని వుండేవారు.

ముగ్గులేస్తూ పరిసరాలు మర్చిపోయే నన్ను " లల్లీ! జరగవే బాబూ - పందిలా వుంది ఈ పంది - నిన్ను తొక్కేస్తుందేమో!" అంటూ కేకలేసేది కుట్టి - రాత్రిపూట నగరసంచారానికి బయల్దేరి - పిండితో కలిపి వేసే ముగ్గుని నాకేసి నాకమంపేయడానికి వచ్చే సంతానసహిత-వరాహ పరివారాన్నిచూసి.

అవొచ్చినప్పుడు ఒక్క గంతేసి మా గేటు గట్టెక్కి - అవెళ్ళగానే మళ్ళీ ముగ్గులోకి దిగేదాన్ని :)

ఓరోజలాగే పదిహేను - మధ్య చుక్క - ఎనిమిది వచ్చేవరకూ చుక్కలు పెట్టి సాల్టు-బిస్కెట్ల ముగ్గు వేస్తుంటే అప్పటిదాకా ఏవో మామూలు కబుర్లు చెప్తున్న శ్రీను - ఒక్కసారిగా ఆర్గానిక్కెమిస్ట్రీ పూనినవాడై - "లల్లీ - ఇవి బెంజీన్ రింగుల్లా వున్నాయి కదా" అంటూ ఏదో చెప్పబోయాడు.

ఇంకంతే - కామర్సు చదివే నా చెల్లెళ్ళు calm గా వుంటారా ?

"శ్రీనివాసూ - నీకు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అంటే తెలుసా - ఈరోజేదో పాపం బెంజీన్ రింగులు సాల్టు బిస్కెట్లలా వున్నాయి అని ఉత్సాహపడితే రేపు ఆ ఆర్గానిక్ ఈక్వేషన్స్ చేసేటప్పుడు ఇంత ఆనందముండదని" అంటూ వాడి చెవి దగ్గర హోరెత్తించేసి వాడు మామీద అలిగి ఇంట్లోకి వెళ్ళిపోయేదాకా వదల్లేదు.

ఇలా ముగ్గేసే రోజుల్లో 4/19 లో మా ఏసీ కాలెజ్ ఫిజిక్స్ లెక్చరర్ హనుమంతరావుగారి ఇంటి దగ్గరున్న ఎలక్ట్రిక్ స్తంభం కింద ఎవరో ఇద్దరు నేను ముగ్గేసినంతసేపూ నించుని చూస్తున్నట్టు అనిపించేది - మొదట్లో అంతగా పట్టించుకోలేదు. నాల్రోజుల తర్వాత అర్థమయ్యింది - వాళ్ళు సరిగ్గా నేను ముగ్గు వెయ్యడం పూర్తి చేయగానే - వెళ్ళిపోతున్నారని. కాకపోతే ఎవరో సరిగ్గా తెలీలేదు. తెల్సుకోవడానికి వీలూ కుదరలేదు. అవసరమూ అనిపించలేదు - వాళ్ళేమీ గొడవ చేయకుండా నించుని వెళ్ళిపోతూ వుండడంతో.

పగలు మాటలు, పాటలు - రాత్రి పూట చిత్రహార్, చిత్రలహరి అయ్యాక ముగ్గులు - ఆ తర్వాత నిద్రొచ్చేదాకా మూడు కాలేజుల కబుర్లు - సంక్రాంతి పండగ సందళ్ళు - అన్నీ ముగిసి మళ్ళీ నేను హాస్టల్‌కి తిరిగి వెళ్ళే రోజొచ్చింది - జనవరి 21.

షరా మామూలే -  స-స్వ-పరివారసమేతంగా వచ్చి - స"మేత"గా (పచ్చళ్ళూ, నెయ్యీ, జంతికలూ, చక్కిలాలూ, సొజ్జప్పాలూ వగైరాలతో) నన్ను రైలెక్కించారు - అమ్మా, నాన్నా.

ట్రెయిన్ ఎక్కిన నాకు - లోపలున్నవాళ్ళందరినీ ఒకసారి చూసి నా లగేజ్ సర్దుకోబోతూ నా సీట్ వైపు చూసింతర్వాత అనిపించిందొకటే - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి (ఒక  ప్రముఖమైన పాత సినిమాలో ఒకానొక డైలాగు వరసలో) - అంటూ.

టైటిల్: అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి కి అసలు మాటేది?
ఈ కింది కొసరు పాటకి అసలు పాటేది?
 
తలచిచూడు సినిమాలని - దొరుకుతుంది ఆ పదము 
గుర్తు పడితే ఆ పదాన్ని - తట్టుతుంది ఆ మూలం 
ఆ మాటా ఎక్కడిదో - ఆ మూలం ఎప్పటిదో
చెప్పుకుంటే చాలును - నీ క్విజ్జు నెగ్గిపోవును...    



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

తెలుగు వెలుగు - 3 - భలే మంచిపాట వినిపించి(రాయించి)న రోజు

అక్కడ - ఆరోజు:

తేదీ: ఫిబ్రవరి 10, 2018

స్థలం: తరతరాల నట్టిల్లు - ఆ నట్టింట్లో ఓ బల్ల

సందర్భం: బుల్లన్నగారి పెళ్ళిరోజు వెండి పండగ

రాగం తీసినవారు: బుల్లన్నగారి బాబాయిగారు / మా నాన్నగారు

తాళం వేస్తూ సాయం పట్టినవారు: బుల్లన్నగారు

రాగం-తాళం ఫోన్లో పట్టి పంచినవారు: బుల్లన్నగారి అమ్మాయీ-మణి గారు - బుల్లి-లలితగారు



ఇక్కడ - ఈరోజు:
 
తేదీ: ఫిబ్రవరి 11, 2018

స్థలం: సముద్రాలవతల ఒకానొక చలిదేశంలో మా బొమ్మరిల్లు

సందర్భం: తెలుగు వినివ్రాత పథకం (అమ్మ వేసినది)

పాట చదివినవారు: అమ్మ

పాట చదువుటకు అక్కడక్కడ రాగం తీస్తూ సాయం పట్టినవారు: నాన్నగారు aka నేనర్స్

పాట విని వ్రాసినవారు: బుజ్జిజింక

వినివ్రాతని ఫోన్లో పట్టి పంచినవారు: అమ్మ

ఇప్పటి వినివ్రాత ప్రత్యేకత: 

అనుకోకుండా సమయానికి అందిన తాతగారి పాట.
అందులో వున్న బోల్డు గుణింతాలు, ఒత్తులు, గమ్మత్తులు.
ప్రతి ఆదివారపు వినివ్రాతకి బుజ్జిజింక అనుమతించిన మితి - ఐదంటే ఐదు వాక్యాలు - అంతకంటే ఎక్కువంటే కుదరదన్న బుజ్జిజింక సాధింపు.
వచ్చేవారం సెలవు ఇచ్చేద్దాం - ఇప్పటికి ఈ పాట రాసేద్దాం అని చెప్పి ఒప్పించడానికి - ఇంకొంచెం ఎక్కువ రాయించడానికి అమ్మ పడ్డ ఆపసోపాలు.
వెరసి .....
భలే మంచి పాట .... 
వినిపించిన రోజు .... 
బుజ్జిజింక కరుణించి రాసిన రోజు ....






9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 8 - కవలపాటలు - అసలు కన్నడకులనారితో సిసలు తెలుగింటివిరిబోణి

అప్పుడెప్పుడో రాసేసిన నా పాత పోస్టునొకదాన్నిఅప్పు తెచ్చుకుంటున్నాను - ఇక్కడ: నా "నీకో-పాఖ్యానం"

పెళ్ళయిన తర్వాత మొదటి సారిగా బదరి, నేను ఇంట్లోకి కావలసినవి కొందామని ఒక పే...ద్ద లిస్టు రాసుకుని ఇంటి దగ్గర విద్యాపీఠ్ సర్కిల్‌లో వున్న ఫాన్సీ-కం-మెడికల్ షాప్ కి వెళ్ళాము. 
అక్కడ లిస్టులో వున్నవి అన్నీ తీసుకున్న తర్వాత బదరి అడిగారు "ఇంకేమైనా కావాలా?" అని. 
నాకు వెంటనే నా స్పెషల్ సోప్ లిస్టు లో వ్రాయడం మరిచిపోయానని  గుర్తు వచ్చింది. 
వెంటనే నేను హడావిడిగా "నీకో!" అన్నాను. 
బదరి అది వినగానే "నాకు సరే, నీకేం కావాలో చెప్పు" అన్నారు. 
నేను మళ్ళీ "నీకో!" అన్నాను. 
పాపం! బదరి మళ్ళీ సాధ్యమయినంత ప్రశాంతంగా " బుజ్జాయ్! నీకు కావలసినది ఏంటో చెప్పు - నా సంగతి తర్వాత " అన్నారు. 
మళ్ళీ నేను అదే "నీకో!" పాటే పాడాను.
పాపం - షాప్ అతను - మా ఇద్దరికేసి టెన్నిస్ మాచ్ చూస్తున్నట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళవేపు తిరుగుతూ చూస్తూ అలిసిపోయి తల పట్టుకుని ఈ బేరం తెగేది కాదన్నట్టు చూస్తూ నించున్నాడు. 
అంతే ప్రశాంత-బదరి కాస్తా అశాంత-బదరి అయిపోయి "బుజ్జాయ్! నీకేం కావాలో చెప్పు- సరేనా?" అన్నారు - ఖోపంగా!
నేనూ ఇంకా ఖోపంగా "నీకో అని చెప్పానా? నాకు 'నీకో' సోప్ కావాలి" అన్నాను....
అంతే! ఆ షాప్ అతను ఇంకాసేపుంటే నేను ఇంకేం తంటా తెస్తానో అని భయపడిపోయి గబగబా సోప్ ఒక బాగ్ లో వేసి, బిల్ బదరి చేతిలో పెట్టేశాడు.
------------------------------------------------------------------------------------------------------------------------
 
ఇంతకీ ఈ పాత-కబురు ఈ కొత్త-పోస్టుకు ఎందుకు పట్టుకొచ్చానూ అంటే - ఇది నేను చూపించి -వినిపించబోయే కవలపాటల పరిచయానికి కొంచెం దగ్గర విషయంలా అనిపించడమే. అదీ కాక ఆ కవలపాటలతో నాకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించడానికి కూడా ఆ పాత-కబురు ఊతమవుతుందని.

ఈ రోజు వినబోయే కవలపాటలు ఎలాంటివంటే -- ఒకే కథ - రెండు భాషలు (కన్నడ - శరపంజర, తెలుగు - కృష్ణవేణి) - రెండు భాషల్లో ఒకే సంగీత దర్శకుడు - విజయభాస్కర్.

 గణపవరంలో శ్రీరామనవమి పందిరిలో మొదటిసారిగా కృష్ణవేణీ... పాట విన్నజ్ఞాపకం. అప్పుడు అందులో కృష్ణవేణి, విరిబోణి అణ్టూ విణిపిణ్చిన ణకారాలు భళే ణచ్చేషాయి :)

ఆ తర్వాత విన్న కన్నడపాట కూడా అంతే మిన్నగా - ఇదే అల్వా చిన్నద హాడు ಎಂదరే -  ఎనిసుత్తదె (ఇదే కదా బంగారపు పాట అంటే - అనిపిస్తుంది) - అని కన్నడలో మురిసేలా చేసింది.

సరే! ఈ పాటలకి నాకూ ఉన్న సంబంధం - ఏంటంటే - ఈ రెండు పాటలూ ఒకటి కృష్ణానది గురించి, ఇంకోటి కావేరి గురించి.

నేను పుట్టినదే - కృష్ణవేణికి నెచ్చెలి , కావేరికి సంగాతి - అయిన గోదావరి ఒడిలో.
కృష్ణానది సమీపాన చదువు మొదలుపెట్టి, కావేరీనది దరిదాపుల్లో గట్టెక్కించాను (నా ఫైనల్ ప్రాజెక్టు NAL లో).
కృష్ణానది అలల ఆశీస్సులతో పెళ్ళాడి , కావేరీనది కెరటాల దీవెనల దరి కాపురమెళ్ళాను.

ఇవన్నీ పక్కన పెడితే - ముందు రాసిన నా పాత-పోస్ట్ కబుర్లకి ఈ పాటలకి సంబంధమేంటి అంటే... ఈ అసలు పాట-సిసలు పాటల్లో భావం చూస్తే - అమ్మాయి నది గురించి పాడుతుంటే, అబ్బాయి అమ్మాయి గురించి పాడుతుంటాడు. ఇక్కడ ఎవరి పాట-వరస వాళ్ళదే :)

నా నీకో-పాఖ్యానం చదివితే - అమ్మాయి నీకో  (సబ్బు) కావాలంటుంటే, అబ్బాయేమో అమ్మాయికేం కావాలో (చెప్పలేకపోతోందేమో) అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ఎవరి మాట-విసురు వాళ్ళదే :)

హమ్మయ్య! పాట వెనక మాటలు అయిపోయాయి.

ఇంకాట్టే పాట్లు పడకుండా పాటల గురించిన మాటల్లోకి వెళ్తే...

అసలీ రెండు పాటల్లో నాకర్థం కానివిషయం ఒకటుంది - నదిలో సరిగంగస్నానాలకి దిగిన వీరో-వీరోయిన్లు తలారా మునిగింతర్వాత - ఎవరో పూజారి వేంచేసి చెంబుతో తలమీద నీళ్ళెందుకు పోశారూ అని!

అసలు పాట - కన్నడ కులనారి బగ్గె (గురించి) :

తెరమీద బొమ్మ: శరపంజర (1971)
పదాలు పేర్చినవారు: కణగాల్ ప్రభాకర శాస్త్రి
పాడినవారు: పిబి శ్రీనివాస్, పి సుశీల 
పెదవులు కదిల్చినవారు: గంగాధర్, కల్పన
ఈ సినిమా నేను ఇప్పటి దుర్దర్శన రోజులకి ముందున్న దూర్‌దర్శన్ రోజుల్లో - ఆదివారం మధ్యాహ్నం వచ్చే - మా ముగ్గురు అక్కచెల్లెళ్ళం ఇష్టంగా ఎదురు చూసి మరీ - సబ్‌టైటిల్స్ చదువుకుంటూ చూసే - ప్రాంతీయభాషాచిత్రాల్లో - ఒకసారి వేసినప్పుడు చూశాను.

సినిమా అంతగా గుర్తు చేసుకోవడం నాకిష్టం లేదు కానీ అందులో ఒక డైలాగ్ మాత్రం వద్దన్నా గుర్తొస్తుంది ఎప్పుడు ఈ పాటలు విన్నా: నాన్ బందే...నాన్ నోడ్దె... నాన్ గెద్దె (I came... I saw... I conquered - Julius Caesar's "Veni...vidi...vici")

ఈ పాటలో కూర్గ్-స్టైల్ చీరకట్టులో కల్పన ఆట - నమ్మ నోట -  పసందట!

నోడి - ఎంజాయ్ మాడి!



తులా మాసేతు కావేరీ...  సర్వతీర్థాశ్రితా... నదీ.... ఆఆఆఆ 
పంచపాతక సంహర్త్రీ ... వాజినేద ఫలప్రదా.... ఆఆఆఆ
భక్తానుకమ్పే... మునిభాగ్యలక్ష్మీ 
నిత్యే ... జగన్మంగళదానశీల.... ఆఆఆఆ
నిరంజనే దక్షిణదేశ గంగే  .... దక్షిణదేశ గంగే
కావేరీ  ... కావేరీ ...  మమ ప్రసీద
మమ ప్రసీద...  మమ ప్రసీద...


కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి... కావేరి
కొడగిన కావేరీ...
కావేరీ...  నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ... 
కావేరీ ...  నీ ఒలవిన సింగారీ
కొడగిన కావేరీ... 
కావేరీ...  నీ బెడగిన వయ్యారీ
కన్నడ కులనారీ... 
కావేరీ ...  నీ ఒలవిన సింగారీ

హ హ్హ హ్హాహ్హా .... హొహ్హోహ్హొహ్హో

ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ...  నీనే జేనిన జీవనది
ఋషిజన జీవన తపోనిధి ... ఆఆఆఆ
కావేరీ ...  నీనే జేనిన జీవనది
రైతర బాళిన భాగ్యనిధ.... ఆఆఆఆ
కావేరీ ...  నీ నడెయువ నెలవెల్ల పుణ్యద సన్నిధి

ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ

కొడగిన కావేరీ...
కావేరీ...  నీ బెడగిన వయ్యారి

ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా...  ఆహా ...

హాలిన అలెయాగి ఆడోళె .... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
హాలిన అలెయాగి ఆడోళె.... ఆఆఆఆ
కావేరీ... నీ బాళిన సువ్వాలె హాడోళె
చిన్నద నాడిన హొన్నాళె .... ఆఆఆఆ
కావేరీ... నీ నవరసవాహిని గిరిబాలె

ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ

కొడగిన కావేరీ...
కావేరీ...  నీ బెడగిన వయ్యారి

అహ్హహా హా హా హా

గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ...  నీ గంధర్వ గానద ఆనందలహరి
గంధద సీమెయ సౌందర్యలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ గంధర్వ గానద ఆనందలహరి
పతిత పావని అమృతలహరి.... ఆఆఆఆ
కావేరీ... నీ లలిత లతావని శృంగారలహరి

ఆఆఆఆ ... ఆఆఆఆ ... ఆఆఆఆఆఆఆఆ

కొడగిన కావేరీ...
కావేరీ...  నీ బెడగిన వయ్యారి
కన్నడ కులనారీ...
కావేరీ...

సిసలుపాట - తెలుగింటి విరిబోణి గురించి:

తెరమీద బొమ్మ: కృష్ణవేణి (1974)
పదాలు పేర్చినవారు: సి నారాయణ రెడ్డి
పాడినవారు: వి రామకృష్ణ దాస్, పి సుశీల 
పెదవులు కదిల్చినవారు: కృష్ణంరాజు, వాణిశ్రీ

ఈ సినిమా ఈ మధ్యనే - సగం సినిమా కళ్ళకి చేతులడ్డుపెట్టుకుని వేళ్ళ సందుల్లోంచి చూస్తూ చూశాను - నాకేదైనా ఇష్టం లేని సీనోస్తే అలాగే చూస్తాను నేను మరి.

అంత కష్టపడి చూడడం ఎందుకంటే - మంచిమంచి పాటలుంటాయి  - పాటల్లో రంగుల చీరలలో - నగల హంగులతో మెరిసిపోయే వాణిశ్రీ వుంటుంది మరి!

పల్లవి పాడేటప్పుడు - గులాబీ రంగు బెనారస్ చీర, నీలం గాజులతో, మెళ్ళో వాణిశ్రీ-మార్కు-నెక్లెస్‌తో వాణిశ్రీ.... 
మళ్ళీ రెండో చరణంలో - పసుపు రంగు పట్టుచీర, వడ్డాణం, వంకీలు, పాపిడిబొట్టు పెట్టుకుని తెలుగింటి అలివేణిలా వాణిశ్రీ.... 
మూడో చరణంలో - శిల్పరమణిలా కనిపించే వాణిశ్రీ ....
యవనిక అంతా వాణిశ్రీ-మయమిక!

కన్నడపాటలో చరణాల కన్నా తెలుగు పాటలో చరణాలు పొడుగ్గా ఉంటాయి - ఎంతైనా కృష్ణంరాజు పాట కదా - ఆరడుగుల పాట. మూడో చరణంలో "ఏ శిల్ప రమణులు, ఏ దివ్యలలనలు" అన్న దగ్గర చేతులు అటూ ఇటూ విసురుకుంటూ చేసిన రాజుగారి అభినయం - నేత్రపర్వం.

ఈ పాటలో కనిపించిన కృష్ణ నిండుగా, కనకదుర్గ గుడి ఖాళీగా వున్నాయి - అవే ప్రస్తుతంలో అటుదిటు అయ్యాయేమో కదా - నీళ్లు తక్కువయ్యి కృష్ణ  ఖాళీగా, భక్తులెక్కువయ్యి దుర్గ గుడి నిండుగా.

ఇప్పటికే చాలా చెప్పేశాను - చూడడమే తరువాయి ....





హే జనని కృష్ణవేణి ...రాజిత తరంగవాణి... ఆఆఆఆ
పంచ పాతక హారిణి...పరమ మంగళకారిణి... ఆఆఆఆ
దక్షిణోర్వి దివ్యవాహిని ...అక్షీణ భాగ్య ప్రదాయిని ... ఆఆఆఆ
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంసేవిని.. ఆఆఆఆ
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ  ..
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధినీ ...
కృష్ణవేణి... ఆఆఆ....కృష్ణవేణి... ఆఆఆ... మమ ప్రసీద .. మమ ప్రసీద... 

కృష్ణవేణి... కృష్ణవేణి.... కృష్ణవేణి... కృష్ణవేణి....
కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ...  నా ఇంటి అలివేణీ... 
కృష్ణవేణీ...  తెలుగింటి విరిబోణీ... 
కృష్ణవేణీ...  నా ఇంటి అలివేణీ...

హహ్హహ్హహ్హా... హహ్హహ్హహ్హా....

శ్రీగిరిలోయల సాగే జాడల... 
శ్రీగిరిలోయల సాగే జాడల... 
విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు ...

లావణ్యలతవై నను చేరువేళ... 
లావణ్యలతవై నను చేరువేళ...
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణీ ...

ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ... 

ఆ ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా...  ఆహా ...

నాగార్జున గిరి కౌగిట ఆగి... 
నాగార్జున గిరి కౌగిట ఆగి ...
బీళ్ళను బంగారు చేలగా మార్చేవు ... 
ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆంధ్రావనికే అన్నపూర్ణవై కరువులు బాపేవు..బ్రతుకులు నిలిపేవు... 
నా జీవనదివై ఎదలోన ఒదిగి...
నా జీవనదివై ఎదలోన ఒదిగి ... 
పచ్చని వలపులు పండించు కృష్ణవేణీ ...

ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ నా ఇంటి అలివేణీ...

అహ్హహా హా హా హా

అమరావతి గుడి అడుగుల నడయాడి...
అమరావతి గుడి అడుగుల నడయాడి ...
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు...

ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు
ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు
నోచని  అందాలు దాచిన కృష్ణవేణీ ...

ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అభిసారికవై హంసలదీవిలో ...
సాగర హృదయాన సంగమించేవు...

నా మేని సగమై...  నా ప్రాణసుధవై...
నా మేని సగమై...  నా ప్రాణసుధవై... 
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణీ...

కృష్ణవేణీ... తెలుగింటి విరిబోణీ ...
కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ... 




ఎంత మంచి పాటలు కదా! 
వింటే చింతలన్నీ ఎగిరిపోవు కదా!
గీతాలు ఇంతలై  అంతలై కవ్వింతలై నవ్వింతలై 
వంతలు లేని సంగీతలోకం సొంతమౌ గదా!
అందుకే... వింటూ .... అంటూ... ఇందిందే వుండండి 
వస్తా .... వెళ్ళొస్తా - మళ్ళింకొన్ని పాటలతో వస్తా.... 

~పాటల భైరవి 

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

తెలుగు వెలుగు - 2 - క్క క్కా క్కి అంటూ కిక్కిరిన అక్కరాలు

ఇంతకు ముందు వెలిగించిన తెలుగు : తెలుగు వెలుగు - 1 - తొలి వినివ్రాత  

కిందటి ఆదివారం ఉత్సాహంగా తెలుగుతో ఆటలు మళ్ళీ మొదలు పెట్టాము - మరి ద్వితీయవిఘ్నం కాకూడదు కదా!  

"తెలుగేమిటి ? ఆటలేమిటి ? తెలుగుతో ఆటలేమిటి? హన్నా!" - అంటారా?

అవును - అవి తెలుగుతో ఆటలే - పాఠాలు కాదు, కాదంటే కాదంతే! 

పాఠమంటే పదామడలు పరిగెట్టి మరీ పారిపోతాం. 

ఆట అంటే అలుపెరక్కుండా ఆడేస్తాం. 

తరతరాలుగా సాగుతున్న మా ఇంటి పరంపర ఇది. 

నిన్న మధ్యాహ్నం గలగలలాడే కబుర్ల మధ్య -
క-ఒత్తుని తలుచుకుని 
"ఎలా రాయాల్రా?!" అని నాలో నేనే అనుకుంటున్నట్టు- 
నాకేమో ఏమీ గుర్తు రానట్టు- 
క-ఒత్తుని చుక్కల్లో వెతుక్కుంటున్నట్టు పైకి చూడబోతే - 
గాలిలో వేలితో గీసి మరీ చూపించాడు బుజ్జిజింక. 

"హమ్మయ్య - రేపటి వ్రాత-ఆటకి ఆటంకముండదింక" - అనుకుని - చుక్కలు వెలిగించిన అన్ని దిక్కులకూ దండమెట్టేసుకున్నాను. 

ఇవాళ - అక్షరాలా ఆదివారం సాయంత్రం - సూపర్ బౌల్ -52 మొదలయే ముందు - మా కబుర్ల టాపిక్కు క-ఒత్తుతో మాటలు రాయడమెలా?!

బుజ్జిజింకకి క కింద క-ఒత్తు (ద్విత్వాక్షరం) బాగానే అర్థం అయ్యింది. ఎందుకంటే అసలు అక్షరంలో, ఒత్తులోఉన్నది ఒకటే శబ్దం కాబట్టి అంతగా తికమక పడలేదు.


సంయుక్తాక్షరం - అంటే ర కింద క-ఒత్తు, స కింద క-ఒత్తు - ఎలా చెప్పాలా అని ఆలోచించి - తెలుగులోకి వాడికిష్టమైన లెక్కల్ని అప్పు తెచ్చుకున్నాను. 

ప్లస్సులూ (plus +), ఈజీకొల్టులూ (is equal to =) పెడితే కళ్ళు వెలిగి స్టెప్పులడిపోతాయంటే నమ్మేయాలంతే!

కింద రాసినట్టు కాయితం మీద ప్రవేటు చెప్పేయడమే తరువాయి - బుజ్జిజింక అక్షరాలు అల్లుకుపోయాడు.

ద్విత్వాక్షరం (లేక) సంయుక్తాక్షరం = హల్లు + హల్లు + అచ్చు


ముందు ద్విత్వాక్షరం ఎలా తయారవుతుందంటే ....
క్క 

క్ + క్ + అ 
     =  క్ + (క్) + అ
     =  (క్ + అ) + (క్)
     =  క  + (క్) 
     =  క్క 

మొదటి హల్లు "క్" = ముఖ్య-హల్లు-క 
రెండో హల్లు "క్" = క-ఒత్తు


అదే సూత్రం సంయుక్తాక్షరానికి అన్వయిస్తే ...

ర్క 

ర్ + క్ + అ 
     =  ర్ + (క్) + అ 
     = (ర్ + అ) + (క్)
       + (క్) 
     =  ర్క 

మొదటి హల్లు  "ర్ " = ముఖ్య-హల్లు "ర"
రెండో హల్లు "క్" = క-ఒత్తు

స్క 
 
స్క = స్ + క్ + అ = స్ + (క్) + అ = స + (క్) = స్క 

స్ + క్ + అ 
     =  స్ + (క్) + అ 
     = (స్ + అ) + (క్) 
    స  + (క్) 
     =  స్క 


మొదటి హల్లు  "స్ " = ముఖ్య-హల్లు "స"
రెండో హల్లు "క్" = క-ఒత్తు

బుజ్జిజింకకి పాఠం నచ్చింది మొత్తానికి... 
మళ్ళీ ఓ ఐదు వాక్యాలు మా తెలుగు వెలుగు ఖాతాలో జమ... 
నవ్వుల-పువ్వుల్లో పెట్టి మరీ ... 






ఆట్టే అర్థాలు వెతక్కూడదు మరి - 
ఒత్తంతా క-ఒత్తు మీదేనంటే సరి!

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 9 - ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా - ఎదురెళ్ళిన గోదావరి వరద

గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 8 - అరటికాయ బజ్జీ న-ఖాదనం - కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం

1963 మార్చ్ ఎస్సెస్సెల్సీ పరీక్షలు రాసేసి వైజాగులో - పాస్ అయ్యాను.

తర్వాత అనాతారం వచ్చేసి 63 జూన్లో అమలాపురం ఎస్కెబీఆర్ (SKBR) కాలేజీ - లో పీయూసీ (ప్రీ-యూనివర్సిటీ కోర్స్) చేరాను. అది ఒక్కేడాది కోర్సు - అదయ్యాక మూడేళ్ళు డిగ్రీ.

పీయూసీలో  నా  గ్రూపేమో అకౌంట్స్ ఎండ్ ఎకనామిక్స్. ఒక సైన్స్ సబ్జెక్టు కూడా తీసుకోవాలి. నాకేంటంటే చిన్నప్పట్నించీ జంతువులంటే ప్రేమెక్కువ - ఈ ఆవులూ, గేదెలూ, గుఱ్ఱాలూ - వీటితో తిరిగేవాణ్ణి కదా - అందుచేత జువాలజీ తీసుకున్నాను.

రోజూ అనాతవరం నుంచి ఎనిమిది కిలోమీటర్లు - సైకిలు మీద వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి.

నాతో పాటు నాయనరాజుగారి సూరి కూడా ఉండేవాడు. నాతోపాటే పీయూసీ సగం వరకు చదివాడు - తర్వాత మైనింగ్‌లో చేరతానని చెప్పి కొత్తగూడెం వెళ్ళిపోయాడు.

కాలేజీలో మా క్లాసులో ఓ నలభై మందిమి ఉండేవాళ్ళం.

అందులో ముఖ్యంగా కొల్లూరు సుబ్బారావని తొండారం అతను మంచి ఫ్రెండు.

ఇంకా - మాచిరాజు ప్రభాకరు, కూచిమంచి సత్యనారాయణమూర్తి (చంటబ్బాయ్ అనేవాళ్ళం), మంగిపూడి సీతారామయ్య , దీక్షితులు , కాంతిలాల్ - వీళ్ళందరూ నా స్నేహితులు. .

మాకు ఇంగ్లీషుకి ఒక లెక్చరర్ వచ్చేవారు - ఆయన అసలు పేరు జీవీకే గారు - గాది వెంకట కృష్ణారావుగారు. ఆయన కెందుకో పకోడీ గారని పేరు పెట్టారు. ఆయన కొడుకు - సూరి అని చెప్పేసి - వాడు కూడా నా ఫ్రెండే. వాడూ, నేనూ ఆర్టిస్టులం - ఇద్దరం కూడా నాటికలేసేవాళ్ళం. కాలేజీ వార్షికోత్సవాలూ వాటిల్లో మేమిద్దరం నాటికలేసేవాళ్ళం.

మణిమామయ్య కూడా మా కాలేజీ లోనే ఉండేవాడు. వాడు నాకన్నా వయసులో చిన్న- కానీ ముందు ఎస్సెల్సీ పాసయ్యాడు - అందుకని నాకన్నా ఒకేడాది సీనియర్ అయ్యాడు చదువులో. వాడేమో నాటకాలేసేవాడు. వాడు బీకాం చదువుతూ ఉండేవాడు.

నాటకం అంటే అంకాలుంటాయన్నమాట. నాటిక అంటే ఒకటే అంకం. ఆ రోజుల్లో నేనూ, ఈ గాది సూరి - "పేటెంటు మందులు" - అని ఒక నాటికేశాం.

అందులో వాడు కాంపౌండరు, నేనొక లాయర్ని. మా నాటికకి మొదటి బహుమతి వచ్చింది.

అప్పుడు SV రంగారావు వచ్చాడు మా కళాశాల వార్షికోత్సవానికి - వచ్చి ఆయనిచ్చాడు ప్రైజు మాకు.

పీయూసీ అంతా అలా సరదాగా గడిపేస్తున్నాం.

1964లో ఏమైందంటే చైనా యుద్ధం వచ్చింది.

అపుడు ఎన్సీసీ (NCC) అందరికీ తప్పనిసరి చేశారు.

ప్రతివాళ్ళూ ఎన్సీసీ లో చేరాలి. మేమందరం చేరాం.

మొదట్లో మాకు యూనిఫామ్ కూడా లేదు. తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, సన్నటి నల్ల బెల్టు, బూట్లు. మూణ్ణాలుగు నెల్లు పోయింతర్వాత యూనిఫామ్ ఇచ్చారు - కింద కాకీ ప్యాంటు,పైనేమో గచ్చకాయ రంగు ఫుల్‌హాండ్స్ చొక్కా.

చిన్నప్పుడు నాకెలాగూ స్కూల్లో స్కౌటింగ్ అలవాటే కాబట్టి ఎన్సీసీ కూడా చాలా ఈజీగా, ఆటలాగా ఉండేది.

గుఱ్ఱం ప్రకాశరావుగారని మా ఎన్సీసీ కమాండర్. ఆయనే మాజువాలజీ లెక్చరర్ కూడా.

ఒకసారి వారం రోజులు ఎన్సీసీ క్యాంపు అన్జెప్పి పెద్దాపురం తీసుకెళ్ళారు. అక్కడ రైఫిల్ షూటింగ్ రేంజ్ ఉండేది.

తెల్లవారుఝామునే లేపి గ్రౌండులో పరిగెట్టించేవారు - వ్యాయామమూ, శారీరక దృఢత్వం పేరు చెప్పి. ఓ రెండ్రోజులు సరదాగానే అనిపించింది.

ఆ తర్వాత - ఆ పొద్దున్నే లేవడం, చన్నీళ్ళస్నానం, పరుగు నా వల్ల కాదనిపించింది. మూడోరోజు ట్రాకులో ఓ రెండు రౌండ్లు పరిగెట్టగానే - కింద పడిపోయాను పొట్ట పట్టుకుని - "అమ్మో! కడుపు నెప్పి" అంటూ.

వెంటనే నన్ను మోసుకెళ్ళి దగ్గర్లో వున్న హాస్పటల్లో చేర్చారు - నాకు తోడుగా ఇంకో ఇద్దరు. హాయిగా బెడ్డు మీద పడుకుని వాళ్ళు తెచ్చిపెట్టే ఇడ్లీలు, పునుగులు తింటూ ఉండేవాణ్ణి - నాతోపాటు వాళ్ళూను.

ఓ  రెండ్రోజులు  బానే గడిచాయి.

ఓ రోజు పొద్దున్నే ఇడ్లీలు లాగిస్తూ కడుపునెప్పని ట్రాక్ చుట్టూ తిరగడం ఎలా తప్పించుకున్నానో చెప్పుకుంటూ నవ్వుకుంటున్న మా ముగ్గురి మాటలూ - నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చిన మా కమాండర్ గారు వెనకాల్నుంచి విని - "హన్న వడ్లమానీ - ఎక్సర్సైజ్ తప్పించుకోవడానికి వేసిందా ఈ  ఎత్తు?" - అంటూ చీవాట్లేసేశారు.

కాకపొతే అప్పటికే క్యాంపు గడువు అయిపోవడంతో పెద్దగా శిక్షేమీ లేకుండా తప్పించుకున్నాను. అదీ ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా.

1964 మార్చ్ పరీక్షలు రాశాను - ఇంగ్లీష్‌లో నేను పూరు కదా - పరీక్ష తన్నేహింది.

ఆ టైం నాకెలా కలిసొచ్చిందంటే- మనకి వ్యవసాయం వుంది కదా - పొలం వెళ్ళి వ్యవసాయం మీద కొంచెం పట్టు సాధించాను.

64 సెప్టెంబర్లో - పోయిన ఇంగ్లీషు - ఆ ఒక్క సబ్జెక్టు కట్టుకుని మళ్ళీ 65లో కాలేజ్‌లో చేరిపోవచ్చు - డిగ్రీలో.

సరే! సెప్టెంబర్ పరీక్షలకి ప్రిపేర్ అవడం మొదలు పెట్టాను. దానికోసం అమలాపురంలో ఉండేవాణ్ణి.

ముక్కామల భానుడుకామేశ్వరరావు అని ఒక చెవిటాయన ఉండేవాడు. ఆయన కో-ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనేంటంటే చదివింది ఎస్సెల్సీ - కానీ ఇంగ్లీషు, ఎకౌంట్సు మాస్టర్ ఆయన.

ఆయన దగ్గర ట్యూషన్ - నేను -  కొల్లూరు సుబ్బారావుదీ తన్నేసింది - మేమిద్దరమూ కూడా అయన దగ్గర చేరాము.  నేను అమలాపురంలో మా అక్కయ్య పాపాయి గారింట్లో వుండి - చదువుకుంటూ ఉండేవాణ్ణి.

మా బావగారు కర్రా భాస్కరంగారు - ఆయనకి భాస్కర మెడికల్ స్టోర్స్ ఉండేది.

ఆగస్టు నెలలో మా నాన్నగారికి ఆరోగ్యం బావులేక ఆయన్ని విశాఖపట్టణం తీసుకుని వెళ్ళారు - KGH లో జాయిన్ చేశారు. ఆయన అక్కడ స్వర్గస్థులయ్యారు.

అప్పుడింక అమలాపురంనుంచి బయల్దేరి - నేను, మా బావగారు, అక్కయ్య, వాళ్ళ పిల్లలూ - విశాఖపట్టణం బయల్దేరాం.

అసలే శ్రావణమాసం - కోటిపల్లి గోదావరిలో  అసలు పడవలు నడపనీయట్లేదు - వరద మీదుంది గోదావరి. పోలీసులు - పూర్తి బందోబస్తు అదీనూ.

పడవ వాళ్ళని - "మా మావగారు చనిపోయారు అర్జెంటుగా వెళ్ళాలి"  అంటూ  మా బావగారు బ్రతిమిలాడితే -  వాళ్ళు మొత్తానికి ఓ పడవ ఏర్పాటు చేసి - జాగ్రత్తగా దించమని - మమ్మల్ని పడవెక్కించి పంపించారు.

పడవలో ఉండగానే - మధ్యలో కెళ్ళేటప్పటికి పెద్ద వర్షం - చాలా భయమేసింది మాకు - నిండు గోదావరి.

ముక్తేశ్వరం నుంచి నాలుగైదు కిలోమీటర్లు కోటిపల్లి -  కోటిపల్లిలో మళ్ళీ ఇంకో రెండు-మూడు  కిలోమీటర్లు గోదావరి - మొత్తం ఎనిమిదికిలోమీటర్లు వరదగోదావరిలో వెళ్ళాలన్నమాట.

చాలా భయంకరమైన ప్రయాణం అది.

అవతలి ఒడ్డు చేరి SRMT బస్సు తీసుకుని కాకినాడ వెళ్లిపోయాం. కాకినాడలో టాక్సీ కట్టించుకుని వైజాగ్ మద్యాహ్నం మూడు గంటలకి చేరాం. అప్పటికే అంత్యక్రియలు మొదలు పెట్టేశారు. అలా మా నాన్నగారిని చివరి సారిగా చూసుకుని - తిరిగి అనాతవరం చేరుకుని మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం.

అనాతవరం ఇంట్లో మా నాన్నగారు -  బుల్లినారాయణగారు అనబడే - వడ్లమాని సూర్యనారాయణగారి హయాం ముగిసింది.

నరసింహ శతకంలో చెప్పినట్లు.... 

సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు
భూషణ వికాస శ్రీ ధర్మపురనివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర



<వచ్చేనెల తరువాయి కథ>