హలో మున్నమ్మా... !
ఏం చేస్తున్నావు నాన్నా?
ఇంతకీ ఎక్కడున్నావ్?
ఇప్పుడే బస్ దిగి ఇంటికి వెళ్తూ మాట్లాడుతున్నావా?
సర్సరే! ఏం లేదూ...నేను ఊర్కే call చేశాను.
నేను మాట్లాడుతూ వుంటాను...
నీకు కుదిరినంతవరకు మాట్లాడు...
మధ్యాహ్నం ఏం తిన్నావు? ఏంటీ ... ల్యాబ్ దగ్గర డైనింగ్ హాల్లో తినేశావా ఏదో!
అక్కడేముంటుందమ్మా మామూలుగా? బర్గరా?
పోన్లే ... కడుపు నిండా తిన్నావుగా? సాయంత్రం ఏంటీ ప్లాను? నువ్వు వండుకుంటున్నావా... లేకపోతే బయట్నుంచి ఆర్డర్ చేసుకుంటావా?
అవున్రా... నాన్నా! నేను పంపించిన ఆ కర్ణాటక ఉప్మా recipe try చేశావా? ఎలా వచ్చింది? బాగా కుదిరిందా?
అది చదవగానే భలే easy గా అనిపించి నీకు పంపించాను. అందులోనూ నీకు తెల్సు కదా నాకు ఉప్మా అంటే ఎంతిష్టమో! పైగా ఆవిడెవరో చాలా చక్కగా రాసింది - English లో.
నీకు జ్ఞాపకం ఉందిరా? చిన్నప్పుడు నిన్ను బజ్జోపెట్టేటప్పుడు రోజూ కథలు చెప్పేదాన్ని. అప్పుడు పుణ్యకోటి అనే ఆవు కథలో చివర్లో ఆవూ-పులీ కలిసి ఉప్మా చేసుకు తింటాయని చెప్పేదాన్ని.
అసలలా ఎందుకు చెప్పేదాన్నీ అంటే...
అసలేమో... ఆ కథలో ఓ పులి ఆవుని తినేస్తాను అంటే అప్పుడా ఆవు - దాని పేరే పుణ్యకోటి - 'పులీ, పులీ! నన్నిప్పుడే తినొద్దూ. నేనింటికెళ్ళి నా బుజ్జిదూడకి బొజ్జ నిండా పాలిచ్చి వస్తాను, అప్పుడు తినూ' అని చెప్పి వెళ్తుంది కదా!
చెప్పినట్టే ఇంటికెళ్ళి బుజ్జిదూడకి పాలు పట్టి, దానికేమో అమ్మ లేనప్పుడు అల్లరి చెయ్యొద్దని చెప్పి, చుట్టూ వున్న ఆవు-ఆంటీలకి దూడని ముందుకొస్తే పొడవొద్దని, వెనక్కొస్తే కాళ్ళతో తన్నొద్దని, ఆకలేస్తే వాళ్ళ పిల్లలతో పాటు పాలు పట్టమని చెప్పి - మళ్ళీ పులి దగ్గరికి తిరిగొస్తుంది. నీగ్గుర్తొచ్చిందా ఆ కథా?
అలా ఆవు పులి దగ్గరికి తిరిగొస్తుంది అని నేను చెప్తూ వున్నప్పుడు నా మెడ చుట్టూ చెయ్యి వేసి, ఓ బుల్లి ౘందమామ లాంటి మొహంతో నా కళ్ళలోకి చూస్తూ కథ వింటున్న నువ్వు - ఆ తర్వాత ఏమవుతుందా అన్నట్టు - ఆ ఆవు place లో అమ్మని, దూడ place లో నిన్ను నువ్వు ఊహించుకుంటున్నట్టు - భలే tension గా నీ చేత్తో నా మెడని గట్టిగా పట్టేసుకునేవాడివి.
అలా వచ్చిన పుణ్యకోటిని పులి మెచ్చుకుని తినదు అని నేను చెప్పగానే నీకు ఆ ending బాగానే నచ్చినట్టు అనిపించినా - చివర్లో "మరి పాపం! పులికి ఆకలేస్తోంది కదా! మరి దానికి అన్నం ఎవరు పెడతారు?" అనడిగావు.
మరప్పుడు నేను "అమ్మని... అర్రే! నాకది తట్టలేదే!" - అనేసుకుని "భలే అడిగావురా...నాన్నా! అదే చెప్పబోతున్నా..." అని - అప్పటికప్పుడు ఆ కథని ఇంకొంచెం extend చేసి "ఫుణ్యకోటిని మెచ్చుకుని పులి 'నిన్ను నేను తినను, ఇంటికి వెళ్ళిపో నీ దూడ దగ్గరికి' అంటుంది కదా అప్పుడు పుణ్యకోటి ఎంతో సంతోషించి గబగబా సుభద్రా ఆర్కేడ్‌లో వున్న షాపుకెళ్ళి వెళ్ళి ఉప్మా రవ్వ తెచ్చి, ఉప్మా చేసి పులికి పెడుతుంది. అప్పట్నుంచి పులి, పుణ్యకోటి ఫ్రెండ్స్ అయిపోతాయి" అని పూర్తి చేసేటప్పటికి - అప్పటికే సగం మూత పడ్డ కళ్ళతో కథ వింటున్న నువ్వు నవ్వుకుంటూ హాయిగా బజ్జునేవాడివి.
ఇంతకీ ఆ సుభద్రా ఆర్కేడ్ గుర్తుందా నీకు? మనం కాకినాడలో వున్నప్పుడు భానుగుడి జంక్షన్లో ఉండేది. ఇప్పుడూ వుందేమోలే! అమ్మ-నాన్నగారు ఆక్కడే ఆఫీసులో పని చేసేవాళ్ళం. పొద్దున్నించి సాయంత్రం వరకు నేనూ, సాయంత్రం కాగానే పువ్వులా స్నానం చేయించి, బుల్లి లాగూ-చొక్కా తొడిగి నిన్ను తీసుకొచ్చి నా కప్పజెప్పి - మనిద్దరం ఇంటికొచ్చేస్తే - అప్పట్నుంచి రాత్రి దాకా నాన్నగారు నీకోసం షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళం కదా!
అద్దీ ... ఆ సుభద్రా ఆర్కేడే మన పుణ్యకోటి కథలోకి వచ్చేసింది - నా ఉప్మా మీది ఇష్టం మూలంగా.
అసలింతకీ ఇదంతా ఎందుకు మొదలెట్టానంటే బుజ్జిగాడూ! నువ్వెప్పుడూ అడుగుతుంటావు కదా - "అమ్మా! నువ్వు చేసే నీ వంటలు recipes రాసి పెట్టు నా కోసం" - అని.
నిజం చెప్పాలంటే నాన్నగాడూ... "నీ వంటలు" అన్నావు కానీ ... అవేవీ నేను కనిపిట్టినవి కాదు.
నేనెప్పుడూ వంట నేర్చుకోలేదు కూడా! మా నాన్నమ్మ, దొడ్డలు, అమ్మ, అత్తయ్యలు నా కోసం, నాకిష్టమని చేసిపెట్టిన వంటల రుచులు కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుని , ఆ కూరల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో వాళ్ళు ఏమేం ingredients వాడి వుంటారా అని ఒక్కోదాన్ని విడివిడిగా వాసనని బట్టి, రుచిని బట్టి, texture ని బట్టి గుర్తు పట్టి - trial & error method లో ఒక్కో ingredient ని కలుపుతూ, ఇంకోసారి తీసేస్తూ - అలా నేర్చుకున్నానన్నమాట. అందుకని నేను చేసే వంటల recipeలు తప్పకుండా రాసి పెడతాను... దాని కన్నా ముందు selecting the ingreditents that go into that recipe and preparing them to make that recipe is the most important activity.
అంటే ఓ కూర వండే ముందు ఆ కూరకి ముక్కలు ఎలా తరుక్కోవాలీ, తరిగిన ముక్కల్ని ఎలాంటి గిన్నెలో వండాలీ, వండేటప్పుడు ముక్కల్ని ఎలా కలాపాలీ, చారు ఎంత సేపు కాచాలీ, సాంబారులో ఇంగువ ఎప్పుడు వెయ్యాలీ - ఇల్లాంటివి ఎన్నో చిన్నచిన్న విషయాలు ఒక unique textureనీ, taste నీ తీసుకొచ్చి మనం వండే వంటని ఒక experince లాగా, వండిన వంటని మనం ఎవరికోసమైతే వండుతున్నామో వాళ్ళకి ఒక expression of affection లాగా అనిపించేలా చేస్తాయి. దానికి నేను పెట్టుకున్న పేరు శాక-హృదయం. అదేంటీ అని అడుగుతున్నావా? తొందర పడకు మరీ... ఆ శాకహృదయం కథా-కమామీషూ చెప్తాగా...
నీకు నే కనిపెట్టిన శాకహృదయం గురించి నేర్పాలి.
అందుకే ఈ ఉపోద్ఘాతమంతా...
నీకు చెప్తూ నెమరేసుకుంటూ నేనూ, నేను చెప్పేది వింటూ నేర్చుకుంటూ నువ్వూ - మనిద్దరం కలిసి నేర్చుకోబోయే వంటింటి-పాఠాలకి నాందిగా నాదో సిన్మతీ గిద్యం...
పాకోత్సాహము వంటింటికి, వండిన ఇంతికి
పాకము వండినపుడె పుట్టదు, కూరలనా
శాక హృదయము ననుసరించి వండగ
పాకోత్సాహంబు నాడు గల్గును సిన్మతీ


