19, మార్చి 2019, మంగళవారం

త్వామనురజామి - 34 - చేతిలో చెయ్యేసి చెప్పుకున్నాం...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 33 - సిన్మా ఆట...కాదు - చిన్న మాట!

మేమున్న ఐదవ సెమిస్టర్ - SPMVV క్యాంపస్లో ఇదే ఆఖరి సెమిస్టర్.

ఈ సెమిస్టర్లో పూర్తి చెయ్యాల్సిన జాబితా ...
కరిక్యులర్ - ప్రాజెక్టులూ, MIS సెమినార్ ప్రెజెంటేషన్లూ, ఇంటర్నల్స్, ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్
ఎక్స్ట్రా-కరిక్యులర్ - SPIC-MACAY కార్యక్రమాలు
ఎక్స్ట్రార్డినరీ-కరిక్యులర్ - సినిమాలూ, షికార్లూ, పార్టీలూ, సరదాలూ.

ఆరవ సెమిస్టర్లో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ కోసం పెట్టాల్సిన దరఖాస్తులూ, వాటి మీద దస్కత్తులూ - అవి పంపించాల్సిన ఆఫీసుల చిరునామాలూ - పోగు చేసుకోవడం, పోగుల కొద్దీ కాయితాలు నింపడం, పోస్ట్ చేయడం - ఈ పో-పో-పో లతో వున్న టైమంతా ఎటు పోతోందో, ఎలా ఐపోతోందో తెలీకుండా గడిచి పోతోంది.

ఈ హడావిళ్ల మధ్య ఓ రోజు నాన్న నుంచి ఫోన్ - "లల్లీ! మన ప్రసాద్, విస్సప్ప గారి ఫణి, ఇంకొందరు మనూరి కుర్రాళ్ళు మోటార్ బైక్స్ మీద టూర్ తిరుగుతూ ఓ రెండ్రోజుల్లో తిరుపతి వస్తున్నారు. నీ ఫోన్ నంబర్ ఇచ్చాను ప్రసాదుకి. అక్కడికి రాగానే నీకు ఫోన్ చేస్తాన్నాడు" అని చెప్పారు.

నాకు రెండింతలు సంతోషంగా అనిపించింది. ఒకటి ప్రసాద్ వస్తున్నందుకు, ఇంకోటి బదరికి ప్రసాద్ అంటే ఎవరో చూపించే అవకాశం వస్తున్నందుకు. అసలు సంగతేంటంటే అప్పటికి బదరి మా ఇంట్లో ఎవ్వరినీ చూసుండకపోయినా - నాకసలు అమ్మ పక్క కజిన్స్ ఎంత మందీ, నాన్న పక్క కజిన్స్ ఎంత మందీ - వాళ్లెలా మాట్లాడతారు, ఎలా నవ్వుతారు, ఎలా పాడతారు - ఇల్లాంటివన్నీ చెప్పింది చెప్పకుండా, ఇంక చెప్పడానికేం మిగలకుండా, అసలింతకు ముందు ఎప్పుడో  చెప్పేసినా "అబ్బే ఇదసలు చెప్పందే!" అని దబాయించేసి చెప్పిందే చెప్పేస్తూ - అందులో ముఖ్యంగా మా అనాతవరం గురించి, మా అప్ప గురించి, మా ప్రసాద్ గురించి, తన తమాషా కబుర్ల గురించి, తను నన్ను పిలిచే లకుమారి అనే పేరు గురించి, తను అద్భుతంగా పాడే పాటల గురించి,  తను ఆడే అనాతవరం క్రికెట్ మ్యాచుల గురించి ఎంతో చెప్పి వున్నానేమో - మరి ఆ ప్రసాదే సాక్షాత్తూ వచ్చేస్తుంటే బదరికి తనని పరిచయం చెయ్యాలి అని ఎంతో సంబరపడ్డాను. అదేంటో ... నాకు ఇష్టమైన వాళ్ళందర్నీ బదరికి చూపిస్తే ఆ ఇష్టం రెండింతలయినట్లుండేది.

ప్రసాద్ వాళ్ళు వస్తున్నారు అని నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పగానే బదరి కూడా భలే సంతోష పడి "మనం కూడా తిరుమల వెళ్లి వాళ్లతో కాసేపు సరదాగాగడిపి వద్దాం" అన్నారు. నాకు ఆ ప్లాన్ బాగా నచ్చింది. వాళ్ళు మా హాస్టల్‌కి వస్తే మా విజిటర్స్ రూంలో చెప్పుకోవడానికి కబుర్లే వుండవు. చుట్టూ అందరూ వుంటారు. అదే ... మేం  ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్తే  - ప్రసాద్ పాటలు కూడా వినొచ్చు కదా! అందుకే ...తిరుపతి వచ్చాక ప్రసాద్ ఫోన్ చేయగానే తనకి చెప్పాను - మరసటి రోజు వాళ్ళు దర్శనం చేసుకుని ఉంటే నేను తిరుమలకే వచ్చి కలుస్తానని.

ఆ రెండో రోజు పొద్దున్నే ఆరింటికల్లా బయల్దేరి బస్సులో నేను, బదరి తిరుమల వెళ్లాలనుకున్నాం. పొద్దున్నే తను  మా ఓల్డ్ హాస్టల్ గేట్ దగ్గరకొచ్చి నన్ను తీసుకెళ్ళాలీ అన్నది ప్లాన్.

వెళ్ళేది తిరుమల, వెళ్తోంది బదరితో, వెళ్లాలనుకున్నది ప్రసాద్ కోసం. ఇంకంతే... పసుపు గళ్ళ అంచున్న నల్ల కంచిపట్టుచీర, అద్దాలు కుట్టిన నల్ల బ్లౌజు, నల్ల అద్దాల గాజుల మధ్య పసుప్పచ్చ గాజుగాజులు, జడకి మువ్వలు కుట్టిన పసుపు-నలుపు ఊలు తాడు అల్లుకుని - భలే తయారయ్యా! పొద్దునపొద్దున్నే ఘల్లుఘల్లుమంటూ హాస్టల్ గేట్ దగ్గరకొచ్చేటప్పటికి అక్కడ ఉన్నదెవరేంటి? మొట్టమొదటగా బదరిని నాకు పరిచయం చేసిన RS.

[RS గురించి ఇక్కడ చదివేసుకోవచ్చు (http://boldannikaburlu.blogspot.com/2017/12/20-base.html).]

అలా పసుపూ-నలుపూ గళ్ళుగళ్లుగా, గాజులూ-గజ్జెలూ ఘల్లు-ఘల్లుగా బయటికొచ్చిన నన్ను చూడగానే RS అన్న మొదటి మాట "ఇవాళ అచ్చు అమ్మాయిలా వున్నావు" అని. మరంతకు ముందు దాకా - ఎక్కడికెళ్లినా - నూనె రాసిన దువ్వీదువ్వని తలకో రబ్బర్ బ్యాండూ, ఇస్త్రీ ఎరగని చుంగిణీ నూలు స్కర్టూ, దాని మీదో పొడుగు చేతుల కాలర్ బ్లౌజూ వేసుకుని, చేతికో వాచీ, భుజానికో పింకు సంచీ వేసుకుని, ఓ బొమ్మనెత్తుకుని - ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ - అని పాడుకుంటూ గాలిలో గాలిలా తిరిగే నేను, కుదురుగా జుట్టు దువ్వుకుని, పట్టుచీర కట్టుకుని కనిపించాను మరి!

 తనే వస్తానని చెప్పిన బదరి ఏదో సబ్మిట్ చెయ్యాల్సిన వర్క్ ఉందని - తన బదులు నన్ను తీసుకురమ్మని RS ని పంపించారు. నేను RS తో వెళ్లి వాళ్ళ SBM గేట్ దగ్గర బదరిని కల్సి - అక్కణ్ణించి టౌన్-బస్ ఎక్కి బదరి, నేను తిరుమల బస్టాండుకి వెళ్లి, కొంచెం ఖాళీగా వున్న బస్సెక్కి తిరుమల వెళ్ళేటప్పటికి పదయ్యింది. తిరుమలలో ప్రసాద్ వాళ్ళు వైఖానస ఆశ్రమం ముందు ఒక హోటలుండేది (పేరు మర్చిపోయాను) - అక్కడ రూం తీసుకున్నారు. నన్ను, బదరిని చూడగానే హుషారుగా "రండి రండి" అని ఆహ్వానించారు. వాళ్ళందరూ బదరిని చూడడం అదే మొదటి సారైనా చాలా తొందరగా కలిసిపోయి ఎప్పట్నుంచో ఎరిగున్న వాళ్ళలా మాట్లాడేశారు. అందరం కలిసి పాపవినాశనం వెళ్ళొచ్చాము.

అంతా తిరిగి మధ్యాహ్నం హోటల్ రూంకి తిరిగొచ్చాక బదరి "ప్రసాద్! మీరు చాలా బాగా పాడతారని లల్లీ చెప్పింది. మీరో పాట పాడేస్తే ఆ పాట వినేసి మేమెళ్ళిపోతాం. లల్లి ఆరున్నరలోగా హాస్టల్లో ఉండాలి మరి!" అన్నారు.

"ఏం పాట కావాలోఅడగండి" అడిగాడు అడగ్గానే పాడేసే మామంచి ప్రసాద్.

"అదే! ఓ పాటుంటుంది చూడండి... బుగ్గ మీద పెళ్ళిబొట్టు ముద్దులాడ, రంగులీను నీ మెడలో బంగరపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే... మొదలేదో నాగ్గుర్తు రావట్లేదు కానీ ఆ పాట పాడండి"  అదే కావాలని మరీ అడిగారు బదరి.

అది వినగానే అప్పటిదాకా ఔనా-కాదా అనుకుంటున్నదేదో "ఔను కాక మరేంటి?" అన్నట్లనిపించిందేమో... వెంటనే నవ్వీ-నవ్వని కళ్ళతో నవ్వుతూ, హుషారుగా మొదలుపెట్టి "నన్ను వదలి నీవు పోలేవులే ... అది నిజములే..." పాట పాడేశాడు ప్రసాద్. ఆ పాటలో తనకు నచ్చిన చరణం రాగానే బదరి కంట్లో మెరిసిన మెరుపులు చూసిన నా కంటి మురుపులు ఇప్పటికీ మరపురాని మైమరపులే!

సాయంత్రం నాలుగింటి దాకా ప్రసాద్ పాటలు, అనాతవరం కబుర్లు విని, ఇంకప్పుడు బయల్దేరి తిరుపతి వచ్చేశాం. నన్ను మా హాస్టల్ దగ్గర దింపేసి బదరి వెళ్లిపోయారు. నేను వెంటనే 506-బి లో సునీత దగ్గరికి వెళ్ళాను. అక్కడే నిరుపమ, సబ్-జూనియర్ మాధవి కూడా వున్నారు. నన్ను చూడగానే సునీత "లల్లీ...ఈ పట్టుచీర అచ్చు నీకోసమే నేసినట్టుంది" అని తెగ మెచ్చేసుకుంది. నాకు బోల్డంత సిగ్గేసేసింది. అలా ఆ రోజు ఎప్పటికీ గుర్తుండేలా గడిచిపోయింది.


మార్చ్ నెల 19న మా క్లాస్ అమ్మాయిలందరూ హోలీ ఆడుకుని వేడుక చేసుకున్నారు. నేనది మాత్రం మిస్ అయ్యాను.

ఇక ఏప్రిల్ భలే ఈవెంట్-ఫుల్ నెల. ఈ నెల్లోనే కిరణ్ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చారు. ఈ నెల్లోనే ఘరానామొగుడు సినిమా మూడుసార్లు చూశాను. ఈ నెల్లోనే నిరుపమా, నేనూ జన్మలో పుచ్చకాయలు తినకూడదని ఒట్టేసుకున్నాం.

ఇంతకు ముందు చెప్పాను కదా - సిక్స్త్ సెమెస్టర్లో చెయ్యబోయే ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడాలని చెప్పి కిరణ్ నంబర్ తెచ్చుకున్నానని! ఓ రోజు బాలాజీ కాలనీలో STD బూత్‌కి వెళ్లి ఫోన్ చేశాను కిరణ్‌కి. తను అటు ఫోన్ తియ్యగానే పెద్ద ఉపోద్ఘాతమేమీ లేకుండా "కిరణ్! మీరొకసారి తిరుపతి రాగలరా ప్లీజ్!" అనడిగాను. అసలే చాలా సౌమ్యంగా మాట్లాడే కిరణ్ ఎందుకూ-ఏమిటీ లాంటి ప్రశ్నలేమీ అడక్కుండా "అయ్యో! తప్పకుండానండి! వచ్చే శనివారం వస్తాను" అన్నారు. అన్నట్లుగా వచ్చారు కూడా! తను తిరుపతిలో దిగి హాస్టల్లో నా దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడయ్యింది. అదే టైంకి బదరి కూడా వచ్చారు.

మంచి ఎర్రటి ఎండ. నల్లటి చీర నా మేన్నిండా! దాని కథేంటంటే ... నేనేదో కేరళ-కాటన్ చీర కొనుక్కుంటే... "ఆయ్! హన్నా! మధుపర్కంలా వుంది - ఇలా బాలేదు" అన్జెప్పి దానికో మంచి డిజైన్లో నల్ల ప్రింట్ వేయించేసింది అమ్మ. వెతికివెతికి ఆ చీరే కట్టుకున్నానా రోజు.

సరే! నాకో పక్క కిరణ్, ఇంకో పక్క బదరి - మేం ముగ్గురం ఎండలో నడుచుకుంటూ పద్మావతి కాలేజ్ గోడ పక్క రోడ్డులో SVU వైపు బయల్దేరాం. అలా నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరినీ ఒకరినొకర్ని పరిచయం చేశాను. తర్వాత కిరణ్ కేసి తిరిగి "కిరణ్! నాకు బదరి అంటే ఇష్టం. నాకు తన మీదున్న ఇష్టం వల్ల పప్పీకి ఇబ్బంది రాకూడదని, ఆ సంగతే మాట్లాడదామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. దీని వల్ల పప్పీని చేసుకుందామనుకున్న మీ డెసిషన్ లో ఏమీ మార్పుండదు కదా? ప్లీజ్ ... అర్థం చేసుకుంటారు కదా?" అనగానే కిరణ్ వెంటనే "అరె! అలా ఏం లేదండి లల్లీ! అసలు మీరు ఫోన్ చేసి రమ్మనగానే ఇక్కడికొచ్చాక మీరు పెళ్ళైపోయింది అంటారనుకున్నాను" అన్నారు నవ్వుతూ. "ఇంకా నయమండి, కిరణ్! నా పెళ్లి మా అమ్మా-నాన్న చెయ్యాలి" అని నేనూ నవ్వేశాను. కిరణ్ ఇంకో అరగంట మాతో ఉండి బదరితో తన MBA గురించి, SBM గురించి మాట్లాడి, తన విప్రో జాబ్ గురించి విశేషాలు మాక్కూడా చెప్పి, సాయంత్రం బయల్దేరి మళ్ళీ బెంగళూరు వెళ్లిపోయారు. నాకా రాత్రి చాలా హ్యాప్పీగా అనిపించింది. నాకు చేతనైనంతలో నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలక్కుండా ఏదో గొప్పగా మేనేజ్ చేసేస్తున్న ఫీలింగ్.

అన్నట్లు ఏప్రిల్లో ఘరానామొగుడు రిలీజ్ అయ్యింది. నేను, నిరుపమ, సునీత, సబ్-మాధవి వెళ్ళొచ్చాము. చూసి రాగానే మాతో రాని మల్లికా-నిగమలని తీసుకుని మళ్ళీ వెళ్ళాము. అదయ్యాక మా రూమ్మేట్ నాగలక్ష్మి అడిగిందని తనతో ముత్యం మూడోసారి కూడా ఘరానామొగుడు సినిమా కెళ్ళొచ్చా. అంత మూడు సార్లు చూడడానికి ఆ సినిమాలో ఏం లేకపోయినా - ఆ సినిమాలో నాకేం నచ్చిందీ అంటే నా చుట్టూ వున్నవాళ్లు నాతో కల్సి సినిమా చూడడం సరదాగా ఉందీ అనడం, వాళ్ళ సరదా చూసి నేను సరదా పడడం.

ఇంకిప్పుడు మా పుచ్చకాయ కథ!

అనగనగా ఓ ఎండాకాలపు రోజు... చుట్టూ వున్న కొండల మీదున్న బండల మీద పడ్డ ఎండలు పరావర్తనం చెంది గుండుల్ని మండిస్తున్న రోజు...

నేనూ, నిరుపమ మధ్యాహ్నం క్లాసులైపోగానే అడుగులో అడుగేసుకుంటూ - తినబోయే ఊరించని మెస్సు ఫుడ్డుని తలుచుకుంటూ - ఉసూరుమంటూ - ఈదురు గాలికి ఈసురోమంటూ - నేను నా కాలికి అడ్డొచ్చిన రాయిని తంతూ ఉంటే, "సరిగ్గా నడవలేవా" అంటూ నిరుపమ నన్ను విసుక్కుంటూ - రూంకి వస్తూ వున్నాము.

ఎప్పుడూ లేనిది మా హాస్టల్ బయట ఓ ముసలావిడ కూర్చుని పుచ్చకాయలు అమ్ముతోంది. ఆవిడ ముందు లెక్కకి ఓ పది పుచ్చకాయలున్నాయి. వాటిని చూడగానే మా ఇద్దరికీ తినాలనిపించింది. చల్లచల్లటి, తియ్యతియ్యటి పుచ్చకాయ చెక్కలు చేత్తో పట్టుకుని కొరుక్కు తింటుంటే ఎంత బావుంటుందో మాకు మేమే ఊహించేసుకుని - మాకు మేమే ఊరించేసుకుని - వున్న వాటిల్లో ఓ పే...ద్ద పుచ్చకాయని కొనేసుకుని, దాన్ని ఇద్దరం చెరో చెయ్యి వేసి మోసేస్కుని -

జానే జిగర్ జానే-melon
ఢాఈ సౌ కిలో తేరా వజన్
తూ జో మేరే పైర్ పర్ గిరీ
మర్ జాఊంగీ ఈ క్షణం...


అని రాహుల్ రాయ్-అను అగర్వాల్ (ఆషికీ) వరసలో పాడేస్కుంటూ మా మూడో అంతస్తులో వున్న 603-ఏ రూంలోకి తెచ్చి పెట్టేస్కున్నాం.

ఇద్దరం గబగబా వెళ్లి ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లు నోటికి అహిత - రుచి రహిత - సాంబార్సహిత - అప్పడ విహిత - పెరుగన్నం తినేసి - తినేటప్పుడే పుచ్చకాయని ఎలా కోసుకుని తినాలా అని ప్లానేసేస్కుని - చేతులూ, మూతులూ, ప్లేటులూ కడిగేస్కుని - పరిగే ...త్తుకుంటూ రూంకొచ్చేసి - తలుపు వేసేస్కుని - లైటార్పేసి  - నేల మీద పేపరొహటి పరుచుకుని - ఓ చాకుతో పుచ్చకాయ కోస్కుని - ఎదురెదురుగా కూర్చుని - నెలవంకలాంటి ఒక్కో పుచ్చకాయ ముక్కనీ తీసుకుని - అందరాని చందమామ మాకెందుకూ... అందిన ఈ పుచ్చచెక్క చాలు మాకు... అని నోట్లో-నోట్లో పాడుకుంటూ మొత్తం ఓ గంటలో పుచ్చకాయలో గింజలూ, గ్రీనుపార్టూ  తప్ప అంతా తినేశాం.

ఆ తలుపులేయడాలూ, లైట్లార్పడాలూ, నోట్లో-నోట్లో పాడుకోవడాలూ ఎందుకంటే ... మా రూంలోఎవరైనా ఉంటే తప్పనిసరిగా లైటు వెలుగుతూనే ఉండేది పగలైనా. మా ఇద్దరికీ ఆ రోజు ఆ పుచ్చకాయని అస్సలు ఇంకెవరితోనూ పంచుకోవాలనిపించలేదు. మేమిద్దరమే దాన్ని తినాలీ అనేసుకున్నాం. అందుకని తలుపేసేసి, లైటార్పేసి, నిశ్శబ్దంగా ఉంటే - లోపల మేం లేమనుకుంటారు కదా - అనాలోచించి - అల్లా చేశామన్నమాట!

ఇంతకీ పుచ్చకాయ అంతా తిన్నవాళ్ళం ఏమయ్యాం? పట్టరాని కడుపు నొప్పితో తిన్నగా నడవలేక నడుం దగ్గర అరవై డిగ్రీల కోణంలో ఒంగి - ఓ రెండ్రోజులు ఒంగిఒంగి నడిచాం - literally.

ఆ నొప్పి ... మహా మరపురాని నొప్పి - మళ్ళీ జన్మలో పుచ్చకాయ జోలికెళ్ళమని చెప్పి - నేనూ, నిరుపమా...

చేతిలో చెయ్యేసి చెప్పుకున్నాం...
పుచ్చకాయ ముక్కలు  కొనుక్కోమనీ...
కొన్నా తినమనీ...


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

10, మార్చి 2019, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 16 - ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 15 - ఏలా... ఏలేశ్వరం ఏగుటేలా?

1976 నవంబర్ మొదటి వారం. ఆదివారం రోజున లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు, పంతులుగారు ఆఫీసులో మీటింగ్ పెట్టారు. పెట్టి - నాకన్నీ చెప్పి "ఏలేశ్వరం వెళ్లూ, వెళ్లి ముందు అవన్నీ సరిజేయమని" చెప్పేసి అన్నారు.

అసలింతకీ ఏమిటంటే నేను సోమవారం బయల్దేరి వెళ్ళాలి. మంగళవారం లేదు, బుధవారం మార్కెట్టు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఐఎల్టీడీ మాకు కాంపిటీటర్. వాళ్ళోపెన్ చేస్తున్నారు బుధవారం. అదే సమయానికి మేం కూడా ఓపెన్ చేయాలి. ఈ లోపులో ఏమయిందంటే మా లీఫ్ మేనేజర్ సీతారామయ్య పంతులు గారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ మధ్య. ఆయనెక్కడికీ ప్రయాణాలు చెయ్యట్లేదు. అంచేత ఆయనేమో చిలకలూరిపేటలో ఆగిపోయారు. ఆయన బదులుగా ప్రొడక్షన్ మేనేజర్ LM తనేజా అని యూపీ ఆయన...ఆయనేమో బయ్యింగుకి వస్తాడని చెప్పారు. ఆయనకేమో తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీషు. "సరే అయితే నే బయల్దేరి వెళ్తా రేప్పొద్దున్నే" అన్నా.

ఈలోపులో వీళ్ళేం చేశారంటే విజయవాడలో బుల్లెట్ మోటార్ సైకిలు బుక్ చేశారు ఏలేశ్వరం కోసం అని చెప్పేసి. దాని నంబర్ ఏపీజీ 7631. "నువ్వు విజయవాడ దాకా వెళ్లి, షోరూంకి వెళ్లి ఆ బుల్లెట్ తీసుకుని, దాని మీదే వెళ్ళిపో ఏలేశ్వరం" అన్నారు. విజయవాడ నుంచి ఏలేశ్వరం 230 కిలోమీటర్లు. చిలకలూరిపేట నుంచి మూడొందల కిలోమీటర్లు. సరే అంజెప్పేసి నేను సోమవారం పొద్దున్నే ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయల్దేరి వెళ్ళాను. విజయవాడ చేరేటప్పటికి పదకొండు అయింది.  పదకొండుంపావుకల్లా బుల్లెట్ డెలివరీ ఇచ్చారు నాకు. దాంతో పాటుగా ఓ హెల్మెట్. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరూ హెల్మెట్ వేసేవారు కాదు. కాకపోతే నేను కర్ణాటకలో చేసొచ్చాను కాబట్టి హెల్మెట్ అలవాటయ్యింది. ఓ హెల్మెట్, ఓ జెర్కిను, తరవాత ఏంటంటే గ్లౌజెస్సు, ఇంకా షూస్ - ఇవన్నీ కొనుక్కుని  బుల్లెట్ తీసుకుని, అక్కణ్ణించి బుల్లెట్ మీద  ఏలేశ్వరం బయల్దేరా - వయా రాజమండ్రి. రాజమండ్రికో ఏభై కిలోమీటర్లుంటుందన్నమాట. సరే - దార్లో టిఫిన్లకి, టీలకి ఆగడం ఇవన్నీ చేసేటప్పటికి సాయంత్రం ఐదూ-ఐదున్నరకల్లా ఏలేశ్వరం చేరి పోయాను.

కొత్త బుల్లెట్టు, నేనూ దిగేటప్పటికి ఏలేశ్వరం బ్రాంచ్ వాళ్ళందరూ "ఏంటి బండేసుకొచ్చేశావా ఏకంగా అక్కణ్ణించి నువ్వూ?! " అన్నారు. "బండి కొన్నారయ్యా...మీ ఏరియా బ్రాంచెస్ కోసమే కొన్నారు. వాడినంతకాలం వాడతాను, తర్వాత ఇక్కడే విదిలేస్తాను" అన్నాను. నే తీసుకెళ్లిన బుల్లెట్ కాక అక్కడ జీపొహటుండేది.

ఏలేశ్వరంలో దిగాను కదా...ఆఫీసులో కూర్చుని ఆ రాత్రికి చేసే పనేమీ లేదు కదా! ఆ వూళ్ళో సినిమా హాళ్ళుండేవి. బాల్కనీ రెండ్రూపాయలు. ఫష్షో సినిమాకెళ్ళొచ్చాను. సినిమాలు చూడాలంటే రాజమండ్రి వెళ్ళమన్నారు, ఈ ఊళ్ళో చూడొద్దన్నారు కానీ సినిమాయే కదా అనేసి వెళ్లొచ్చేసాను. అక్కడ చైనులు అంజెప్పేసి ఓ ఎసిస్టెంట్ క్యాషియర్ ఉండేవాడు. అతను శ్రీకాకుళం నుంచొచ్చాడు. అప్పట్లో  ఎస్వీ సోమయాజి అని ఒక సీఏ జేరాడు హెడ్డాఫీసులో ఫైనాన్స్ మేనేజరుగా. ఆయన మేనల్లుడు ఈ చైనులు. ఇతను కాక ఇంకో క్యాషియర్, మేనేజర్, ట్రెయినీ మేనేజర్  - వీళ్లూ ఏలేశ్వరం ఆఫీస్ స్టాఫు.

రెండో రోజు పొద్దున్నే వాళ్ళందర్నీ కూర్చోబెట్టి - చెయ్యాల్సిన కార్యక్రమమేంటి, ఎక్కడికెళ్ళాలి, ఎవర్ని కలవాలి - ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేశా. ఇక్కడేమయిందంటే ఏలేశ్వరం సెంటర్ పాయింటు. ఇటు ప్లెయిన్సులో - అంటే జగ్గంపేట ఏరియాలో - నరేంద్రపురం, భావవరం, గుఱ్ఱాలపాలెం, గండేపల్లి, మన్యంవారిపాలెం - లలో కొంత బర్లీ టొబాకో కొనుగోలు చేశారు. ఇంక రమణయ్య పేట, గుంటువారిపాలెం, కరివేవపాలెం, అమీనాబాద్ కాలనీ, చికిలింత - ఇటువంటి ఏరియాలు ఏజెన్సీ. చాలా డీప్ ఏజెన్సీ అది.

సరే! క్యాషియర్ ఏమన్నాడంటే "బాసూ! రేప్పొద్దున్నే నరేంద్రపురం వెళ్ళిపోదాం. వెళ్లి అక్కణ్ణించి మొదలుపెట్టు నువ్వు" అన్నాడు. అసలు సంగతేంటంటే నే రావడానికి ముందు ఎంక్వైరీకి వచ్చిన దత్తు (మణి) గార్ని కూడా అలాగే మేనేజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్లెయిన్సులో వున్న రైతులు కొంచెం ఎడ్యుకేటెడ్ వున్నారక్కడ. అక్కడ మోసం చేసే జరిగే అవకాశం లేదు. అది చూచాయగా గ్రహించాను నేను. అంచాత "సరే కానీయ్. వెళదాం" అంచెప్పేసి "నువ్వు డ్రైవ్ చెయ్, నువ్వే తీసుకెళ్ళు నన్ను" అంచెప్పి వెనకాల కూర్చున్నా.

నరేంద్రపురం, ఆ చుట్టుపక్కల ఏరియాలు తిరిగాం ఆ రోజున. ఆ రోజు మంగళవారం రోజు. తిరిగినప్పుడేమైందంటే ఏ రైతును కలిసినా కూడా ఎక్కడా ఫ్రాడ్ కనపళ్ళా నాకు. ఇంతకుముందు మణి కూడా పాపం! - అలాగే బోల్తా పడి "అంతా బానే వుంది" అని రాసేశాడు. ఎందుకంటే రైతులందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళని మోసం చేస్తే తాట తీసేస్తారు స్టాఫుని.

అదయ్యాక మరసటి రోజు పొద్దున్న బుధవారం నాడు - ఆ రోజు మార్కెట్టు ఓపెన్ అయ్యేరోజది. దాదాపు ఎమ్మెల్ కంపెనీ రైతులే ఓ వెయ్యి మంది వున్నారక్కడ. ఒక పదిహేను వందల బేళ్లు ప్లాటుఫార్మ్ మీది కొచ్చినయ్ అమీనాబాద్ కాలనీలో. LM తనేజా గారు ఆ రోజు పొద్దున్న చిలకలూరిపేటలో బయల్దేరి పదకొండింటికల్లా వచ్చేస్తాను AB కాలనీకి, ఈలోపులో మీరేర్పాట్లు చేసుకోండి అని చెప్పారాయన.

నేను పొద్దున్నే ఆరింటికల్లా స్నానం అదీ చేసేసుకుని, బుల్లెట్ మోటార్ సైకిలేసుకుని, క్యాషియర్ని  ఎక్కించుకుని తిన్నగా జెడ్డంగి వెళ్ళాను. ఫ్రాడ్ రిపోర్ట్ చేసిన రైతునాయకుడు వసంతరాయుడు ఆ జెడ్డంగిలో ఉంటాడు. వెళ్లి అతన్ని కలిశా.

కలిసి "వసంతరాయుడు గారూ...ఇలా వచ్చాన్నేను. ఎంక్వైరీ కోసమే వచ్చాను. ఇవాళ బయ్యింగ్ వుంది. మీరొక్కసారి ఆ బయ్యింగ్ దగ్గరికి రండి గొడవ లేకుండా. పంతులుగారి కేమో ఆరోగ్యం బాలేదు. ఆయన స్థానంలో వచ్చే ఆయన యూపీ నుంచి వస్తున్నాడు. ఆయనకి తెలుగు రాదు. అంచేత మీరు కూడా వచ్చి నిలబడితే ఏదో విధంగా బయ్యింగ్ ఐపోతే ఈ రోజు నేను మిగతా పనులన్నీ చూస్తానిక్కడ" అంజెప్పేసి అంటే, ఆయన కూడా "సరేనండి" అని అమీనాబాద్ కాలనీకి వచ్చాడు.

వచ్చేటప్పటికి పదిహేనొందల బేళ్లతో కళకళ్ళాడిపోతోంది ప్లాట్‌ఫార్మ్. ఓ పక్కనేమో ఐఎల్టీడీ ప్లాట్‌ఫార్మ్. వాళ్ళకీ అన్ని బేళ్ళూ వచ్చేసినయ్. వచ్చిన  రైతులందరి దగ్గరా పాస్‌బుక్కులుంటాయి. ఎందుకంటే యూనియన్ బ్యాంకు వీళ్ళందరికీ అప్పులిచ్చింది కంపెనీ ద్వారా. వాళ్ళు ఈ అమ్మిన సేల్స్ అన్నీ కూడా మేము యూనియన్ బ్యాంకుకి సబ్మిట్ చెయ్యాలి. చేస్తే వాళ్ళు అప్పు మొత్తం కట్ చేసేస్కుని మిగిలిన బాలెన్సు రైతులకిచ్చేస్తారు. అదీ అక్కడ పధ్ధతి. సరే! "అందర్నీ పాస్‌బుక్కులు తెచ్చుకోమనండి. నేను అన్నీ వెరిఫై చేస్తాను" అని చెప్పా. చెప్పేటప్పటికి సరే నన్నారు వసంతరాయుడు గారు. ఆయనింట్లోనే టీ అదీ తాగాము. తాగి జెడ్డంగి నుంచి బయల్దేరి అక్కణ్ణించి పది పన్నెడు కిలోమీటర్లు -అదంతా అసలు రోడ్డుండదన్నమాట, కొండల్లోంచి వెళ్ళాలి. మోటార్ సైకిలు మీదే అక్కడికెళ్ళాం.

వెళ్ళాక అక్కడేంటంటే అంతా ట్రైబల్స్ - సేనాధిపతులు, కోయలు, చెంచులు, కొండకాపులు. వాళ్లకి అసలు ఏమీ తెలీదు పాపం! వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళని కాంట్రాక్టర్లు అసలు దోచుకోవడమే! అటువంటి ఏరియా అది. పాపం! ఆ రోజుల్లో హే... మీ తెలిసేది కాదు వాళ్ళకి. ఇవాళంటే వాళ్ళూ నేర్చుకున్నారు .

సరే! అక్కడికెళ్లి కూర్చున్నాక ఏంటంటే - ఇంకా టైముంది. మేమెళ్ళేసరికే దాదాపు పదయిపోయింది. పదకొండు గంటలకి వస్తాన్నాడు కదా తనేజా గారు! అన్నట్లుగానే పదకొండు గంటలకి వచ్చేశాడు. వచ్చేసి బయ్యింగ్ మొదలుపెడతానంటే "ముందు మా లెక్కలు తేల్చండి, తర్వాతే మీ బయ్యింగ్, లేకపోతే చెయ్యడానికి వీల్లేదు" అన్నాడు వసంతరాయుడు గారు. 

"సరే! ఆ పాసుబుక్కులు తీసుకు రండి, నేను చూస్తాను" అని చెప్పేసి అక్కడ ఓ టేబుల్ దగ్గర కుర్చీ వేసుక్కూర్చున్నా. క్యాషియర్ని పక్కన కూర్చోపెట్టుకున్నా. అలా కూర్చుని ఒక్కో పాస్‌బుక్ తీసి ఆ ఎంట్రీలన్నీ చూస్తూ, ఎంక్వైరీ చేస్తూ చూస్తుంటే ఒక్కోదానికి అరగంట టైం పడుతోంది. అలా వెయ్యి మంది రైతులవి  చూడాలంటే ఎంత టైం పడుతుంది? అదే వసంతరాయుణ్ణి పిలిచి చెప్పా.

"ఏమండి! ఈ రకంగా చేస్తే నాకెంత టైం పడుతుందో ఆలోచించండి. అవసరమైతే మూణ్నెల్లు కాదు నాలుగు నెల్లు వుంటానిక్కడ నేను. మీ ఎకౌంట్లన్నీ ఫైనలైజ్ చేసి, మీకొచ్చే ప్రతి రూపాయి ఇప్పించి వెళ్తానిక్కణ్ణించి. దయచేసి బయ్యింగ్ ఆపకండి - ఆయన చిలకలూరిపేట నుంచి వచ్చాడు తనేజా గారు. ఆయన్ని బయ్యింగ్ చేసుకుని వెళ్ళిపోనివ్వండి. నేనిక్కడ ఉండి - నేను భరోసా ఇస్తున్నాను మీకు - నేను హామీ ఇస్తున్నా నేనిక్కడుండి మీ కార్యక్రమం అంటా చక్కబెట్టి వెళ్తాను " అంటే "సరే" నని ఆయన అందరికీ మీటింగ్ పెట్టి చెప్పి "ఈయనుంటాడు, కామేశ్వరరావుగారుంటాడు. ఆయన మన వ్యవహారాలన్నీ చూస్తాడు. బయ్యింగ్ చేయనిద్దాం" అంటే తనేజా గారు బయ్యింగ్ చేసేశాడు. ఆ సాయంత్రానికి వెళ్ళిపోయాడు.

ఈ సాయంత్రం లోగా ఏంటంటే నేను ఖాళీగా కూర్చోలేదు. ప్రతివాణ్ణి పిలవడం, పాస్‌బుక్ తీసుకు రమ్మనడం. ఇందులో కొంతమంది ... కొండకాపులు అన్నవాళ్ళు ఏంటంటే ప్లెయిన్స్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవాళ్లు. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళున్నారు. క్యాషియర్ గానీ, మేనేజర్ గానీ వాళ్ళ జోలికి పోలా. వాళ్ళ జోలికి నేనూ పోలేదు. కాస్త ఏమీ తెలియని ట్రైబల్స్ ఉంటే - వాళ్లలో ఒకణ్ణి పిలిచి ఇంటర్వ్యూ చేశా.

" ఏమయ్యా నీకు మందు బస్తాలు ఎన్నిచ్చారు? తెల్లపిండెన్ని? నల్లపిండెన్ని?"
తెల్ల పిండి అంటే డీఏపీ. నల్ల పిండంటే నైట్రైట్స్.
"అయ్యా! నాకు తెల్లపిండి ఒక బస్తా, నల్లపిండి ఒక బస్తా ఇచ్చాడు"
అంటే వీళ్ళు "లేదు ...తెల్లపిండి రెండు బస్తాలిచ్చాం, నల్లపిండి రెండు బస్తాలిచ్చాం" అనే వాళ్ళు.
ఎందుకంటే ఆ మందుబస్తాల్లో కొట్టేశారు వీళ్ళు.
"చూడు క్యాషియరూ! నేను ట్రైబల్స్ చెప్పింది నమ్ముతా! వాళ్ళ అమాయకత్వం చూస్తే నాకు వాళ్లనే నమ్మాలనిపిస్తోంది. వాడు చెప్పింది ఇక్కడ నోట్ చేస్తా. వాడు ఒక బస్తా ఇచ్చాడన్నాడనుక్కో, నువ్వు కాదూ రెండు బస్తాలన్నావనుకో - ఆ రెండో బస్తా నీ పెర్సనల్ ఎకౌంట్లోనో, మేనేజర్ ఎకౌంట్లోనో వేసేసుకోవాలి. ఇందులో ప్రశ్నే లేదు." అంజెప్పేసి కొంచెం గట్టిగానే వాదించేశాను.
ట్రైబల్స్ కూడా "ఓ... ఈయన మన తరఫునే మాట్లాడుతున్నాడు " అంజెప్పేసి వాళ్ళు కూడా మాం...చి హుషారైపోయారు.

మార్కెట్లో బయ్యింగ్ అయిపోయి సాయంత్రం నాలుగింటికల్లా తనేజా గారు బయల్దేరి చిలకలూరిపేటకి వెళ్ళిపోయాడు. ఇంక నేనేంటంటే రోజూ పొద్దున్నే బయల్దేరి అక్కడికెళ్ళడం - అమీనాబాద్ కాలనీలో కూర్చోవడం - ఎందుకంటే "అన్ని ఊళ్ళూ నేను తిరగలేను" అని చెప్పా. "రోజుకో వూరు వాళ్ళు రండి. రోజుకెన్ని ఎకౌంట్లవుతాయో చూసుకుందాం. ఇందులో తక్కువ చేశారు అనుకున్నవాటికి వాళ్ళ ఎకౌంట్లో రాసేస్తాను. ఇందులో నిర్మొహమాటంగా చెప్తున్నాను నేను" అంజెప్పేసంటే వసంతరాయుడు కూడా నాతోటుండేవాడు.

సరే...ఈ ఆఫీసు స్టాఫు  -కొంత డబ్బు కూడా చెల్లించేవారు ట్రైబల్స్‌కి. దానికి వోచర్లు వీళ్ళే వేలిముద్రలు నొక్కేశారు.
ఓ ఏజెన్సీ రైతుని పిలిచి "నీకు డబ్బు ఎంతిచ్చారు" అంటే "నాకో ఒంద రూపాయలిచ్చారయ్యా." అనేవాడు.
"వందేంటి? - అప్పుడేమో చెట్టు కింద కూర్చున్నప్పుడు పాతిక రూపాయలిచ్చాను కదా నీకు?" అనేవాడు క్యాషియర్.
"లేదయ్యా. నాకు నువ్వు ఒందే ఇచ్చావు" అనే వాడు వీడు.

అప్పుడు వందా కోయరైతు పేర్న రాసి, పాతికా వీడి పేరున రాసేవాణ్ణి. ఆ రకంగా మూడు నెల్ల పాటు ఏలేశ్వరంలో వుండి - అంటే మధ్యమధ్యలో శనివారం శనివారం గణపవరం వచ్చేసేవాణ్ని - మళ్ళీ సోమవారం పొద్దున్న బయల్దేరి వెళ్ళిపోతూ వుండేవాణ్ణి బస్సులో. బుల్లెట్ అక్కడే విదిలేశాము. అక్కడికెళ్ళినప్పుడు బుల్లెట్ వాడుకునేవాణ్ణి. ఈ రకంగా చేసి మొత్తానికి మందుబస్తాల్లో, డబ్బు పంపకాల్లో తేడాలన్నీ బయటేశా.

ఈ లోపులో ఏమైందంటే - యూనియన్ బ్యాంకులో ఐఎల్టీడీకి, మా కంపెనీకీ కూడా  ఎకౌంట్లుండేవి. కొంతమంది రైతులు అక్కడా లోన్ తీసుకున్నారు, ఇక్కడా లోన్ తీసుకున్నారు. అంటే అక్కడో రెండు బేళ్లు, ఇక్కడో రెండు బేళ్లు పెట్టేవారు. అలాక్కూడా జరిగింది.  అదేమైందంటే ఆ రైతులకి యూనియన్ బ్యాంకు వాడేం చేశాడంటే మా కంపెనీకి అమ్మిన సేల్ ప్రొసీడ్సన్నీనేమో జమ కట్టేసుకున్నాడు. ఐఎల్టీడీ పేరు మీదిచ్చిన లోన్లు కూడా దీనిమీదే క్లియర్ చేసేశాడు. ఐఎల్టీడీ రైతులకి కాష్ పేమెంట్స్ ఇచ్చేది. దానికి ఆ ట్రైబల్స్ ఏమన్నారంటే "అక్కడా మేం అప్పు తీసుకున్నాం, ఇక్కడా తీసుకున్నాం. ఐఎల్టీడీ మాకు పేమెంట్లు ఇస్తున్నారు. మీరివ్వట్లేదు. అవన్నీ మీరు మిగిల్చేసుకుంటున్నారు" అంటూ కొంచెం రివర్స్ అయ్యారు.

"అది కూడా నేను బయట పడేస్తాను, తొందర పడకండి" అని చెప్పా. ఆ ఇష్యూ తెలియాలంటే నాకు ఆఫీసు స్టాఫు సహకరించట్లేదు. ఏం చెయ్యాలో నాకర్థం కాలా. ట్రెయినీ మేనేజర్ స్వామి కారంచేడు నుంచొచ్చాడు. అతి మెత్తటి వాడు, మంచివాడు. ఇతన్ని బుట్టలో వేసుకుంటే మన పని అవుతుందని చెప్పేసి ఆ స్వామిని బండెక్కించుకుని తిరిగేవాణ్ణి. స్వామికి బుల్లెట్ అంటే మహా ఆనందం, ఇష్టం. "నాకు బండి నేర్పు గురూ!" అనేవాడు. "తప్పకుండా నేర్చుకుందువు గాని బండి" అనేవాణ్ణి.

సాయంత్రం పూట స్వామి, నేను వెళ్లి ఏలేశ్వరం రిజర్వాయిర్ దగ్గర గట్టు మీద కూర్చునేవాళ్ళం.

"స్వామీ! నాకో సందేహం. అడుగుతా విను. నాకు ఈ బ్యాంకు ఇష్యూస్ అసలర్థం కావట్లేదు. ఒకసారి బ్యాంకు మేనేజర్ దగ్గరికి నన్ను తీస్కెళ్తావా? ఈ బ్యాంకులో ఏదో మతలబు జరిగింది. మీకు తెలుసా విషయాలు. కానీ చెప్పట్లేదు బయటికి. నువ్వు కూడా ఎందుకు చెప్పట్లేదో నాకర్థం కావట్లేదు. నువ్విందులో నాకు సాయం చేశావంటే నేన్నీకు ప్రామిస్ చేస్తున్నాను -  ఫస్ట్ థింగ్ నీకు బుల్లెట్ నేర్పుతాను. సెకండ్ థింగ్ ఈ మేనేజర్ని, క్యాషియర్ని ఇక్కణ్ణించి లేపేస్తా. ఈ బ్రాంచుకి నువ్వే మేనేజర్ వవుతావ్." అని ఒక విధంగా ప్రోబ్ చేశా.

చేసేటప్పటికీ ...పడ్డాడు నా వల్లో. "తప్పకుండా బాసూ, వెళదాం" అని చెప్పేసి మరసటి రోజు పొద్దున్నే యూనియన్ బ్యాంకు మేనేజర్ దగ్గరికెళ్ళాం.

వెళ్లి "ఏంటి సర్ - ఏంటీ పరిస్థితి? వాళ్ళకీ లోన్స్ ఉన్నాయ్, మాకూ ఉన్నాయ్. మా ఎకౌంట్లో సేల్ డబ్బు జమ చేస్తే  మీరేమో వాళ్ళకేమీ డబ్బులివ్వట్లేదంట. వాళ్లేమో కాష్ పేమెంట్స్ చేస్తున్నారక్కడ. మరి వాళ్ళ లోన్స్ ఎలా తీరుతున్నాయి" అంటే అప్పుడా మేనేజర్ చెప్పాడు " పొగాకు వాడమ్మింతర్వాత మళ్ళీ దొరుకుతాడో లేదో తెలియదండి మాకు. ఆ వచ్చిన అమౌంటుని రెండు ఎకౌంట్సుకి ఎడ్జస్ట్ చేసి పడేశాం మేమిక్కడ. మిగతా ఏమన్నా ఉంటే కాష్ పేమెంట్స్ అక్కడిచ్చుకుంటార్లే అని" అంటూ.

"మా కంపెనీ పేరు పోగొట్టారు కదా మీరు? ఇదేంటి సర్ ఈ పని? ఎవరి ఎకౌంట్ వాళ్ళకే. లేదంటే మీ గుంటూరు ఆఫీసుకి రిపోర్ట్ చేస్తా. అసలు మీ బ్యాంకులో మా ఎమ్మెల్ కంపెనీ ఎకౌంట్ లేకుండా చేస్తా" అని ఆయన్ని బెదిరించా. "బాబ్బాబూ! ఆ పని మాత్రం చేయబోకండి. ఇక్కణ్ణించీ అల్లా చెయ్యనింకా!" అని ఆయన మాటిచ్చాడు. ఛాన్సు దొరికింది కదా - ఈ వసంతరాయుణ్ణి, ఇంకో పదిమంది తెలిసున్న రైతుల్ని తీసుకుని బ్యాంకుకెళ్లి "వీళ్ళ ఫ్రాడ్ ఏమీ లేదు" అని ఆయన చేతే చెప్పించాను. అది విని వసంతరాయుడు వెళ్లి మళ్ళీ మీటింగ్ పెట్టి "ఈ కంపెనీ తప్పు కాదిది. పొరపాటు జరిగింది" అని చెప్పేసి అందరికీ సర్దిచెప్పాడు.

ఆ రకంగా షా కమిషన్ చేసింతర్వాత - ఆ రిపోర్టులన్నీ తీసుకుని - నాలుగు నెల్ల తర్వాత గణపవరం వెళ్లి - లక్ష్మయ్య గారు, సుబ్బన్నగారు, సీతారామయ్య పంతులుగారు, సోమయాజులుగారు, తనేజా గారు - వీళ్ళందరూ కూర్చున్నప్పుడు తీసుకెళ్లిచ్చి - "జరిగిన విషయం ఇదండీ. వ్యవహారం ఇలా జరిగింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సొచ్చింది" అని చెప్తే తక్షణమే లక్ష్మయ్య గారు మేనేజర్ని, క్యాషియర్ని పంపించేశారు బయటికి. అప్పుడు చైనులు హెడ్-క్యాషియర్ అయ్యాడు.

బయటికొచ్చిన మేనేజర్, క్యాషియర్ "కామేశ్వర్రావ్! మాతో సరదాగా ఉంటూనే మా ౘాప కిందకి నీరు తెచ్చావ్." అంటే, నే చెప్పా "ట్రైబల్స్‌ని మోసం చేయడమేంటయ్యా? కంపెనీ మంచి జీతాలే ఇస్తున్నారు. బాగా చూసుకుంటున్నారు. ఎందుకిలాంటి పనులు? నేను మీ ౘాప కిందకి నీరు తీసుకురావడమేంటి? ఉన్న సబ్జెక్టేదో ఓపెన్‌గా చెప్పాను. నామీద ఇక్కణ్ణించి ప్రెజర్ వుంది, అక్కణ్ణించీ వుంది. పైగా ప్లెయిన్సులో మీ గురించి నేనేమీ తప్పుడుగా చెప్పలేదే?! అక్కడ వాళ్లు కరెక్టుగా ఉందని చెప్పిన మాటే చెప్పాను కదా! ఏజెన్సీలో జరిగిన తప్పులు చెప్పకపోతే ఎట్లా? నేనొచ్చిందే అందుకు!" అనేటప్పటికి ఇంకేమంటారు...వెళ్లి వేరే కంపెనీల్లో చేరారు.

అద్దీ ...అద్గదీ...
షా కమిషన్ తోడు 
నేనాటాడిన తీరు
చడీచప్పుడు చేయక 
ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!


<వచ్చేమాటు తరువాయి కథ>


 

3, మార్చి 2019, ఆదివారం

నే...డ్డే చదవండి-3- ధనక్







"పావ్ తలే హో ఠండీ రేత్
పాస్ మే వో సర్సోం కే ఖేత్
సన్‌సన్ కర్‌తీ చలీ పవన్
షారుఖ్ రహేగా నంబర్ వన్
సల్మాన్ రహేగా నంబర్ వన్" 
 
అని పాడుకుంటూ 
ఒక మెరుపు చూపుల అక్కా, ఒక చురుకు మాటల తమ్ముడూ 
నడిచిరట కిలోమీటర్లు మూడొందలు 
అడిగిరట షారుఖ్‌ని 
తమ్ముడికిమ్మని
చూడగలిగిన కన్నులు
ఆ చిన్నారుల మురిపెంపు మాటల చిన్నెలు 
వెండితెర మీద అవి పూయించిన వన్నెలు 
బంగారు ఇసక దారుల విరిసిన 
రంగారు ఇంద్రధనుస్సు కథ 

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
మార్చ్ నెల సంచికలో... 
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: మార్చ్ నెల సరదా సిన్మాయణం
 
ప్రస్తుతానికి ఈ సినిమా Netflix లో వుంది - పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూడాల్సిన సినిమా. డిజిటల్ ఏజ్‌లో కోల్పోతున్న బాల్యపు అమూల్య క్షణాలని బుగ్గ మీద సుతారంగా తట్టి గుర్తు చేసే సినిమా.
 
చూడండి... చూపించండి... 
 
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

23, ఫిబ్రవరి 2019, శనివారం

మనసే జతగా పాడిందిలే - 14 - కవలపాటలు - కన్హయ్యా పాట వరసన - బహదూర్ షా జఫర్ కా తరస్‌నా...

నువ్వంటే నాకిష్టం...
ఆ ఇష్టం ఎందుకు కలిగిందో చెప్పాలంటే కష్టం
గాలి అలల తేలి వచ్చిన నీ గురించిన ఓ కబురో
ఎక్కడో ఎవరో పంచుకున్న నీదైన ఓ తలపో
అదాట్టుగా చిలకరించిన పలకరింపో
అనుకోకుండా రువ్విన నవ్వో - అసలేమీ లేని ఒట్టి నువ్వో
ఇష్ట పడడానికి నాకు పెద్దగా కారణాలక్కర్లేదు
ఇష్టపడాలీ అన్న కారణం తప్ప!
కలిగిన ఇష్టాన్ని - అది నీ మీద కదా! - నీకు చెప్పాల్సిందే!
నీకు చెప్పడం వరకే నా పాత్ర, నా ప్రమేయం 
నీకు నేనిష్టమా, లేదా అన్నది నీ ఇష్టం
అది నాకు సంబంధించిన విషయం కాదు
నీతో నీవు ఆలోచించుకుని తేల్చుకోవాల్సిన విషయం
అంత లేదనుకుంటే అక్కర్లేదనుకుని తేల్చేయ్యాల్సిన విషయం...
నువ్వు కాదన్నా నీ మీద నాకున్న ఇష్టానికేం బెంగ లేదులే!
ఒకసారి పుట్టాక కష్టమో, నష్టమో తప్పదుగా ...
నీ మీద నాకున్న ఇష్టంగానే మిగిలుంటుంది...
అందుకే రాసి పెట్టుకున్నా...
Love, affection, friendship... Give unconditionally - Take nonjudgmentally ~meSayIt


నాకున్న ఇష్టాలు అనంతం అనను కానీ ... వున్న కొన్నైనా అవే నాకు ఆనందం. ఆ కొన్నీ నాకిచ్చే ఆనందం అనంతం. అంత అనంతమైన ఆనందమిచ్చే ఇష్టాల్లో మచ్చుకి రెండు - మొదటిది నెచ్చెలులతో అనువైన వేళ  ముచ్చట్లు, రెండోది ఎవరికీ అనువుగాని వేళ నే వినే హాయైన పాటలు. ఓ పాటలోంచి ఇంకో పాటలోకి వెళ్తూ, ఇప్పటికి ఈ పాటా-నేనూ మాత్రమే నిజం అనుకునేంతగా అందులో మునుగుతూ-తేలుతూ ఉండడం ఇంకా ఇష్టం. అల్లాంటప్పుడు వింటున్న ఏ పాటో ఉన్నపాటున ఇంకే పాటనో గుర్తుకు తెస్తే తక్షణం ఆ ఇంకో పాటను వెతికి పట్టుకుని మురిసిపోవడం మహా ఇష్టమైన వ్యాపకం.

పాటేదైనా - భక్తిగీతమో, రక్తిరాగమో, ముక్తిమార్గమో - విషాదయోగమో, ఖుషీగానమో - ఏదైతే ఏంటి? పాటైతే చాలు...పాట తోడుంటే మేలు.

ఒక పాట అలసిన మనసుకు కుదురునిస్తుంది. ఒక పాట నిలవనీయక ఆడమని తొందరిస్తుంది. ఒక పాట గుండె కంటిన దిగులుని మరిపించి నవ్విస్తుంది. ఒక పాట మరుగునున్న జ్ఞాపకాన్ని కనుకొసల నీటిచుక్కగా నిలబెడుతుంది. కదిలించు పాటేదైనా మంచిదే...మంచి పాటేదైనా మంచికే...


ఇలా పాటలు గురించి తలచుకుంటూ, నాలో నేనే మురుసుకుంటూ - వివిధభారతి-జనరంజని మోస్తరులో నా మనోరంజని కార్యక్రమంలో చూపుడువేలితో ఐ-పాడ్ మీటలు నొక్కుతూ సినీ-కలల-బేహారి రాజ్‌కపూర్ పాటలు వింటూ వున్నా. ఆహ్, ఆవారా, అనాడీ, శ్రీ 420 - ఒకటొకటిగా పాటలూరుతున్నాయి, ఊరి మీరుతున్నాయి.

అంతలో ఈ మధ్యెప్పుడూ వినివుండని ఎప్పటిదో పాట -
అప్పుడెప్పుడో నే పుట్టకముందొచ్చిన కన్హయ్యా సినిమాలోని పాట-
ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఛాయాగీత్‌లో విన్న పాట- 
తెర నిండుగా రాజ్‌కపూర్ మాత్రముండు పాట -
కూర్చున్న చోటు నుండి కదలకుండా పాడుతుండు పాట...
ఈ పాట మొదలైనపుడు కనిపించే చెట్టు నాకున్న ఇష్టాల్లో ఓ ఇష్టం. 

ఈ పాట విషాదమే కానీ కొన్ని లైన్లు భలే తమాషాగాఉంటాయి.

మేరా దిల్ అగర్ కోయీ దిల్ నహీ...
ఉసే మేరే సామ్‌నే తోడ్ దో - ఉసే మేరే సామ్‌నే తోడ్ దో!

నా హృదయం, హృదయమే కాకపోతే
దాన్ని నా ముందే పగలగొట్టెయ్

మై వో గుల్ హూ జో న ఖిలా కభీ...
ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో?
నేనొక ఎప్పటికీ పూయని పువ్వును
నన్నెందుకు కొమ్మ మీంచి కోసేయవు?

నేను నాగ్గుర్తుండి "శాఖ్ (शाख) " అనే మాట ఓ హిందీ పాటలో వినడం ఇదే మొదటిసారి.

మీరూ చూసి, విని -
పాతవీ-ఏడ్పువీ కూడా వినేవారైతే ఇష్టమో,
కొత్తవీ-స్పీడువీ మాత్రమే వినీ-కనేవారైతే  కష్టమో పడతారని ...

యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=4RaoB9usogQ





ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!
మేరా దిల్ అగర్ కోయీ దిల్ నహీ...
ఉసే మేరే సామ్‌నే తోడ్ దో - ఉసే మేరే సామ్‌నే తోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...

మై యే భూల్ జాఊంగా, జిందగీ! - కభీ ముస్కురాయీ థీ ప్యార్ మే...
మై యే భూల్ జాఊంగా, జిందగీ! - కభీ ముస్కురాయీ థీ ప్యార్ మే...
మై యే భూల్ జాఊంగా, మేరా దిల్! - కభీ ఖిల్ ఉఠా థా బహార్ మే...
జిన్హే ఇస్ జహా నే భులా దియా...
మేరా నామ్ ఉన్ మే హీ జోడ్ దో - మేరా నామ్ ఉన్ మే హీ జోడ్ దో!

ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...

తుమ్హే అప్‌నా కహ్‌నే కీ చాహ్ మే - కభీ హో సకే న కిసీ కే హమ్...
తుమ్హే అప్‌నా కహ్‌నే కీ చాహ్ మే - కభీ హో సకే న కిసీ కే హమ్...
యహీ దర్ద్ మేరే జిగర్ మే హై - ముఝే మార్ డాలేగా బస్ యే గమ్...
మై వో గుల్ హూ జో న ఖిలా కభీ...
ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో - ముఝే క్యోం న శాఖ్ సే తోడ్ దో?

ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే...
ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో - ముఝే మేరే హాల్ పే ఛోడ్ దో!
ముఝే తుమ్ సే కుఛ్ భీ న చాహియే... 

 ఈ పాట వింటూ - పాటలో మాటలకి నా మాటలనుకుంటూ, ఆ పాటలో మాటల గురించి నేననుకున్న మాటలు నాతో మాటాడుతున్న బదరితో అంటూ- వుండగా - ఉన్నట్టుండి నాకింకేదో పాట గుర్తొచ్చింది. అది కూడా ఎప్పుడో దూరదర్శన్ రోజుల్లో చూసిన బహదూర్ షా జఫర్ సీరియల్లో విన్న పాట. మన పాటల చక్రవర్తి కిషోర్ కుమార్ అన్నగారైన అశోక్ కుమార్ వేశారు టైటిల్ రోల్.

బహదూర్ షా జఫర్ భారతదేశాన్ని పాలించిన ఆఖరి మొఘల్ చక్రవర్తి. ఆయన ఉర్దూ-కవితా-ప్రపంచక్రవర్తి. ఆయన రాసిన ఘజల్ BR చోప్రా తీసిన హిందీ సీరియల్‌కి టైటిల్ సాంగ్. దీన్ని మహేంద్ర కపూర్ పాడారు. 
అన్నట్టు ఈ చిన్ని గజల్ ముక్కలో నాకు నచ్చిన మాట: ముష్త్-ఏ-గుబార్ - అంటే పిడికెడు దుమ్ము. 

పాపం! చిట్ట చివరి రాజుగా, ఢిల్లీకి మాత్రమే పరిమితమైన తన పాలనతో, మాట వినని, మన్నించని  సిపాయిల ఏలికగా, అశక్తుడైన బహదూర్ షా జఫర్ తనెవ్వరికీ ఇష్టుడని కానని రాసుకున్న పాటలా ఉందిది. కానీ ఆయన రాసుకున్న పాటలు తన తర్వాత తరాల్లో ఎంతో మందికి ఇష్టమౌతాయని అనుకుని వుండడాయన. ఆయన గజల్-ఇష్టుల్లో నా ఇష్టానిదీ ఓ చిన్న పాలు. 

ఆ గజల్ గుర్తు రాగానే యూట్యూబ్లో వెతకడం - పట్టుకోవడం - ఆ గజల్ ముక్క వరకూ తుంచుకోవడం - నా బ్లాగ్లో ఉంచుకోవడం ...జరిగాయి కాబట్టే - అదిక్కడ పంచుకోవడం!

యూట్యూబ్ లింక్: https://www.youtube.com/embed/SSrTsN8SCQ4?start=10&end=127


 

న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ... 

న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ... 
న కిసీ కే దిల్ కా ఖరార్ హూ...

న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ... 
న కిసీ కే దిల్ కా ఖరార్ హూ... 

జో కిసీ కే కామ్ న ఆ సకే...
జో కిసీ కే కామ్ న ఆ సకే...
మై వో ఏక్ ముష్త్-ఏ-గుబార్ హూ!

న కిసీ కీ ఆంఖ్ కా నూర్ హూ...  


ఇలాంటి స్ స్ స్ స్లో.... సోలో ...శోక ... పాటలు కూడా ఇష్టమా నీకు అనడగబోయేవారికి...
ముందే చెప్పినట్టు... 
ఇష్ట పడడానికి నాకు పెద్దగా కారణాలక్కర్లేదు
ఇష్టపడాలీ అన్న కారణం తప్ప! 

 ~ పాటల భైరవి


19, ఫిబ్రవరి 2019, మంగళవారం

త్వామనురజామి - 33 - సిన్మా ఆట...కాదు - చిన్న మాట!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:   త్వామనురజామి - 32 - బెంగ బెంగ బెంగగా... సెకను సెకను సాగగా...

కార్లో మహా హడావిడిగా వుంది. ఓ పక్క పప్పి, స్వాతి మాటలు. ఇంకో పక్క ముందు సీట్లోంచి ఆ మాటల్లో మాట కలుపుతూనే మధ్యమధ్యలో కుట్టి తీస్తున్న కూనిరాగాలు. నా పక్కనే కూర్చుని వున్న ప్రశాంతి నిశ్శబ్దంగా నా చెయ్యి పట్టుకుని పెద్దపెద్ద కళ్ళతో నా మొహం లోకి చూస్తోంది. నేనూ ఆట్టే మాట్లాడకుండా బయటికి చూస్తూ కూర్చున్నాను.

ఓ పావుగంటలో రమణారెడ్డి గారి ఇంటి ముందు ఆగింది కారు. మేమొస్తామని ఎదురు చూస్తూ వాళ్ళింటి సిటౌట్లో నించునున్న రమణారెడ్డిగారు వచ్చి మా కోసం వాళ్ళింటి గేట్ తెరిచారు. "బావున్నారా, అంకుల్?" అని ఆయన్ని పలకరించి ఆయన వెనకాలే ఇంట్లోకి వెళ్ళాం. ఆంటీ పలకరించి - పండక్కదా - అరిసెలు, జంతికలు లాంటివేవో ప్లేట్లలో పెట్టి తినమని బలవంతం చేశారు. అప్పటికే ఇంట్లోనూ, అపర్ణ వాళ్ళింట్లోనూ ఏవో తినుండడంతో నాకేమీ వద్దని చెప్పాను. పప్పి, కుట్టి, స్వాతి, ప్రశాంతి మాత్రం ఒక ప్లేట్ చాలని అందులోనే షేర్ చేసుకుని తింటున్నారు, తింటూ ఆంటీ అడిగిన ప్రశ్నలకి జవాబులేవో అంటున్నారు.వాళ్లంటున్నవి నే వింటున్నాను.

ఇంతలో రమణారెడ్డిగారు నాకేసి తిరిగి  "రామ్మా! నువ్వెలాగూ ఏం తీసుకోవట్లేదు. మాకు పైన అప్‌స్టెయిర్స్ కూడా వుంది. చూపిస్తా పద!" అనగానే లేచి ఆయన వెనకాలే మెట్లెక్కి పైకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న బాల్కనీ లాంటిది ఉంటే, అక్కడ నించుని వాళ్ళింటి చుట్టుపక్కల చూపిస్తూ, ఇంతకు ముందు అదంతా ఎంత ఖాళీగా ఉండేదో, ఇప్పుడు కొత్తగా ఎన్ని ఇళ్ళు కట్టారో ఆయన చెప్తూ ఉంటే, నాకెందుకు అవన్నీ చెప్తున్నారో అర్థం కాకపోయినా, పెద్దాయన అందులోనూ నాన్న ఫ్రెండ్, వినకపోతే బావుండదని ఆయన చెప్పిన వాటికి తలూపుతున్నాను.

అలా చెప్తూ ఆయన ఉన్నట్టుండి "మీ నాన్నగారు నీ విషయంలో చాలా బాధ పడుతున్నారమ్మా! ఆయన్ని అలా చూడడం మాకూ చాలా బాధగా వుంది" అన్నారు.

నాకొక్క క్షణం లోనే అర్థం అయ్యింది ఆయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో. ఇంతకు ముందు దసరాకి వచ్చినప్పుడు ఉషాంటీ ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు రమణారెడ్డి గారు ఇలా! వీళ్ళందరూ ఇంతగా చెప్తున్నారూ అంటే నాన్నని నేనెంత బాధ పెడ్తున్నానో కదా! అప్పటికీ ఆయనగా నన్నేమీ అనట్లేదు. అసలా విషయం ఎత్తితే నన్ను పరుషంగా మాట్లాడాల్సి వస్తుందేమో అన్నట్లు దాన్ని దాటేసి సరదా కబుర్లేవో మాట్లాడుతున్నారు. అది తల్చుకోగానే నామీద నాకే కోపం, అక్కడితో ఆగకుండా అసలు నేనేం చేస్తే నా నిర్ణయం వల్ల పప్పి, కుట్టిలకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుందా అన్న ఆలోచన కూడా మొదలయింది.

నేను నా ఆలోచనలో ఉండగానే - ఆయన చెప్పిందానికి నన్ను నేనెలా సమర్థించుకుంటూ - ఆయన నన్ను సూటిగా అడగని ప్రశ్నకి  జవాబెలా ఇవ్వాలా అనాలోచించుకుంటున్నానేమో అనుకుని "అదేనమ్మా - మొన్న నాన్నగారు తిరుపతి కూడా వచ్చినట్టున్నారు కదా?" అని ఇంకోసారి అనగలిగీ అనలేని టాపిక్కేదో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్న రమణారెడ్డి గారి కేసి తిరిగాను నేను.

నాకస్సలు ఆయనతో ఏమీ మాట్లాడాలనిపించలేదు. ఆయన నాన్న ఫ్రెండుగా నాకు గౌరవమే. కానీ నాకు సంబంధించిన విషయాలు - అవి పెద్దవైనా, చిన్నవైనా - ఇప్పటిదాకా అమ్మ, నాన్నలతో - వాళ్ళ తర్వాత పప్పి, కుట్టీ, అపర్ణలతో తప్ప ఇంకెప్పుడూ ఎవ్వరితోనూ డిస్కస్ చెయ్యలేదు. ఇప్పుడూ అంతే అనుకున్నాను.

అలా అనుకున్న వెంటనే "అంకుల్! మీరేమీ అనుకోవద్దు. నేనీ విషయం మా నాన్నగారి తోనే మాట్లాడతాను" అని చెప్పి ఊరుకున్నాను. నాన్న నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా సరే - నేను ఆయన తోనూ, అమ్మ తోనే మాట్లాడదలుచుకున్నాను. ఎప్పుడూ ఏ విషయం లోనూ ఎవరి మీదా ఆధారపడని మా నాన్నకి నా వల్ల ఆ అవసరం రాకూడదు. అంతే!

నేనలా అనగానే ఆయన కళ్ళలో కొంచెం ఆశ్చర్యం కనిపించింది. కానీ ఎప్పుడైనా నాన్న కోసం వచ్చినప్పుడు చిరునవ్వు పలకరింపుని మించని పరిచయం ఆయనది నాతో.  అందులోనూ ఆయన మితభాషి - ఇది కూడా నాకు సంబంధించినంత వరకూ మాత్రమే!  ఆ తర్వాత ఆయన చెప్పడానికి, నేను వినడానికి ఇంకేం లేవని మా ఇద్దరికీ అనిపించడంతో నిశ్శబ్దంగా మెట్లు దిగి కిందకి వచ్చేశాం. ఇంకో పది నిముషాలు కూర్చుని అంకుల్-ఆంటీలకి "వెళ్ళొస్తా"మని చెప్పి ఇంటికొచ్చేశాం ఐదుగురు అమ్మాయిలం.

ఇంక ఇంట్లో పండగ హడావిడి మామూలే! పెద్దపండగ రోజు దండాల పండగ కదా! ఇంటికి వచ్చీ రాగానే "నువ్వు మా కన్నా పెద్దదానివే. నీకూ దండం పెడతాం" అన్జెప్పి పప్పి, కుట్టి, స్వాతి, ప్రశాంతి ఒకరి తర్వాత ఒకరు నాకు దండాలు పెట్టేసి నా దగ్గరున్న కొంచెం డబ్బులూ తీసేసుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పాడుకుంటూ పండగ అయిపోయింది. పండగతో పాటు సెలవులు అయిపోవడంతో నేను తిరుపతికి తిరిగి వచ్చేశాను - అప్పటికీ సెలవులైపోయింతర్వాత ఒకట్రెండు రోజులు ఆలస్యంగా.

తిరుపతిలో పొద్దున్నే ట్రెయిన్ దిగాను - ఒక చేతిలో VIP సూట్కేసు, ఇంకో చేతిలో గుంటూరు దేవీ సిల్క్స్ వారి సంచీలో వున్న - అమ్మా, అమ్మక్కయ్యా (లక్ష్మిదొడ్డ) పోటాపోటీగా సర్దిన - నెయ్యి, కందిపొడి, ఉసిరావకాయ, సొజ్జప్పాలు, జంతికలు వగైరా వగైరాలతో  - సరిగ్గా చెప్పాలంటే ... మేత  సమేత VIP సూట్కేసు మోతతో.

దిగీదిగ్గానే ఎదురుగా మల్లిక, నిగమ స్టేషన్ లోపలికి వస్తూ కనిపించారు. వీళ్ళెందుకిటు వస్తున్నారబ్బా అని చూస్తే, నా పక్క బోగీలోంచి - పూలపూల విమల్ చీర కట్టుకుని, బంగారపుటుదయపుటెండని తన పద్మాల్లాంటి కళ్ళని చేరనీయకుండా నల్ల కళ్ళజోడు పెట్టుకుని, ఒక పక్కకి ఒంగి వయ్యారంగా నించుని - రాజ్ కపూర్ సినిమాలో వైజయంతిమాలలా - అచ్చు అలాగే - తనను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్న మల్లిక, నిగమలకి చెయ్యి ఊపుతూ - కనిపించింది మా రాజమండ్రి బ్యూటీ సునీత. తనని పొద్దునపొద్దున్నే అలా చూడగానే - భలే నచ్చేసింది. (అసలు పొద్దున్నే నల్లకళ్లజోడు పెట్టుకుందేంటా అనిపించినా తర్వాత్తెల్సిందేంటంటే కళ్ళలో ఏదో పడి ఎర్రగా అయ్యాయని ఆ కృష్ణ-సులోచనాలని తన సు-లోచనాలకి రక్షగా ధరించిందని). పక్కనే పప్పి, కుట్టి వున్నట్లైతే - ఆ పిల్ల చూడు హైస్సా, ఆ కళ్ళజోడు హైస్సా - అని పాడేసేవాళ్ళమే. ఇప్పటికి మాత్రం వాళ్ళ పక్క నించే వస్తూ "హాయ్" చెప్పేసి బయటకొచ్చి రిక్షా ఎక్కి హాస్టల్‌కి వచ్చేశాను.

అన్నట్టు మర్చిపోయాను చెప్పడం - వచ్చేటప్పుడు నాన్నని అడిగి కిరణ్ విప్రో ఆఫీస్ ఫోన్ నంబర్ తెచ్చుకున్నాను - విప్రోలో సిక్స్త్ సెమిస్టర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని చెప్పి. కిరణ్ మా ఊరి మునసబు గారి అబ్బాయి. తనకి మా పప్పి అంటే ఇష్టం. అప్పటికే మా పప్పిని చేసుకుంటానని మా నాన్నని అడిగి వున్నారు. మా అనాతవరం నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో MCA చదివిన మొట్టమొదటి వ్యక్తి కిరణ్. తనప్పుడు బెంగళూరు విప్రో ఇన్ఫోటెక్‌లో పని చేస్తున్నారు.

తిరుపతికి రాగానే బదరిని కలిసినప్పుడు తనకి చెప్పాను - రమణారెడ్డిగారు నాతో మాట్లాడిన విషయం. అది చెప్తూ నేను కిరణ్ ఫోన్ నంబర్ తెచ్చుకున్న విషయం,తనతో మాట్లాడబోతున్న సంగతి కూడా చెప్పాను. "నా వల్ల పప్పి, కుట్టీలకి ఇబ్బంది రాకూడదు. పండక్కెళ్ళినప్పుడు అమ్మ, పప్పి చెప్పారు - కుట్టి, బాబు ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు అని. బాబు కెలాగూ మీరు తెలుసు. ఇంక కిరణ్‌తో కూడా ఒకసారి మాట్లాడి మన విషయం చెప్తే తనూ మనల్ని అర్థం చేసుకుంటారు. అప్పుడింక వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మా నాన్నకి బెంగుండదు. మీతో మాట్లాడినప్పుడు అదే కదా ఆయన మెయిన్ కన్సర్న్!" అని కూడా అన్నాను.

బదరి క్కూడా నా ఐడియా నచ్చింది. నచ్చిందన్నట్టు తన పెదవుల మీద కొక వెలుగు నవ్వొచ్చింది. నవ్వొచ్చిందన్నట్టు చూడగానే నాకొచ్చిన ఐడియా నాకే నచ్చేసిందింకోసారి. అంతే ... నేనేదో మా నాన్నకి నా వల్ల రాబోతున్న ఏదో గొప్ప సమస్యని ఇట్టే పరిష్కరించేసినట్టు హాయిగా అనిపించింది. వీలైనంత తొందర్లో కిరణ్‌కి ఫోన్ చెయ్యాలి అనుకున్నాను.

నేనిప్పుడున్నది ఫిఫ్త్ సెమిస్టర్ కదా - రాజశేఖర్ (RS) సర్ ఒక మేనేజ్మెంట్ ప్రాజెక్టు MIS టెక్నిక్కులు వాడి చెయ్యాలి అని ఒక ఎసైన్‌మెంట్ ఇచ్చినట్టున్నారు  - అమ్మాయిలందరూ జట్లుజట్లుగా తలో- మేనేజ్మెంట్ టాపిక్ ఎంచేసుకున్నారు - హోటల్ మేనేజ్మెంట్, రైల్వేస్, హాస్పిటల్, ఎయిర్లైన్స్ - ఇలా రకరకాలుగా. సెలవుల్నించి నేను ఆలస్యంగా రావడంతో నాకే టాపిక్ మిగల్లేదు. అప్పటికే మిగిలిన అమ్మాయిలు లైబ్రరీలో పుస్తకాలు రిఫర్ చేసి, కొంత మంది రుయా హాస్పిటల్కి వెళ్లి - ఇలా ఎవరికీ తోచినట్లు వాళ్ళు MIS రిపోర్టులు తయారు చేస్తున్నారు. నాలాగే సునీత కూడా రెండ్రోజులు ఆలస్యంగా రావడంతో తనకీ పార్ట్నర్, టాపిక్ దొరకలేదు.

మేమిద్దరం అసలే టీవీ రూమ్ టీమ్! ఇంటర్నల్ కాలం, సెమినార్ల కాలం, పరీక్షల కాలం - ఎండాకాలం వానాకాలం, శీతాకాలం - ఇలా కాలమేదైనా సరే - ప్రతి సాయంకాలం టీవీలో వచ్చే ఏదో ఒక సిన్మా ప్రోగ్రాం - అదీ ఇదీ అని లేదు - చిత్రహార్, చిత్రలహరి, చిత్రమాల, గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ - చూడందే మా ప్రిపరేషన్ మొదలయ్యేది కాదు. గబగబా డిన్నర్ తినేసి పరిగెత్తుకుంటూ రూముల్లో కంచాలూ, గ్లాసులూ పెట్టేసి అదే పరుగుతో టీవీ రూంలో కెళ్ళి కూర్చునేవాళ్ళం. ఎపుడైనా ఎవరి దగ్గరన్నా నోట్స్ తెచ్చుకోవాలని వెళ్తూ వెళ్తూ టీవీ రూంలో ఇంకా లైటుందేంటా అని తొంగి చూసే నిరుపమకి నేనూ, సునీతా కనిపించగానే బోల్డు కోపం వచ్చేది. "మీరిద్దరూ ఈ జన్మలో పాస్ కారు" అని తిట్టి మరీ వెళ్ళేది. అంత గొప్ప చిత్ర-అనుబంధం నాది, సునీతది.

మామూలుగా నిరుపమ చాలా నెమ్మదిగా భోంచేసేది. అందులోన్ డిన్నర్ టైంలో కబుర్లు చెప్తూ ఇంకొంచెం ఎక్కువసేపు చేసేది. కానీ ఇంటర్నల్స్ వున్న రోజుల్లో చాలా గబగబా తినేసేది. నన్నూ, సునీతనీ కూడా తొందరగా తిని వెళ్లి చదువుకోమని చెప్తూ ఉండేది. మా చదువెలాగూ రాత్రి పది తర్వాతే మొదలయేది. అందుకని తనని ఉడికించాలని ఇంకొంచెం ఆలస్యం చేసేవాళ్ళం. అంతే! నిరుపమకి కోపం వచ్చేసేది. పొడూ...గు జడ విసవిసలాడిస్తూ, చరచరా నడుచుకుంటూ వెళ్లే తనని - డైనింగ్ హాల్ గ్లాస్‌డోర్ దాకా వెళ్ళనిచ్చి - గా...ఠి...గా...- డైనింగ్ హాల్ అంతా రీసౌండ్ వచ్చేలా "రుక్ జా!" అని అరిచి "రుక్ జా! ఓ జానేవాలీ రుక్ జా ...మై తో రాహీ తేరీ మంజిల్ కా ..." అని డైనింగ్ హాల్ దద్దరిల్లేలా పాడేవాళ్ళం. చుట్టూ వున్న అమ్మాయిలు హడలి పోయేవాళ్లు, నిరుపమ ఒక్కసారి వెనక్కి చూసి "మీ ఖర్మ" అంటూ తిట్టుకుంటూ వెడలిపోయేది.

అలాంటి సునీత, నేను ఇప్పుడొక మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ టాపిక్ సెలక్ట్ చేసుకోవాలి. ఆలోచించగా... చించగా... సునీతకి ఎవ్వరికీ తట్టని ఐడియా తట్టింది. "మనిద్దరికీ సిన్మాలంటే ఎలాగూ ఇష్టం కదా! మనం థియేటర్ మేనేజ్మెంట్ చేద్దాం" అంది. నాకూ అది తెగ నచ్చేసింది. "సరే" అంటే "సరే" అనేస్కుని, మమ్మల్ని మేమే "శభాష్" అంటూ మెచ్చేస్కుని, ఇద్దరం RS సర్ దగ్గరికి వెళ్ళి "సర్! మేమిద్దరం థియేటర్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం" అని చెప్పాం. సర్ మాకేసి కొంచెం అనుమానంగా చూసి  "థియేటర్ మేనేజ్మెంటా?" అని, మళ్ళీ "వీళ్లిద్దరికీ ఏదో ఓ టాపిక్ దొరికింది - అంతే చాలు" అనుకున్నారేమో "సరే... carry on" అనేసి వెళ్ళిపోయారు.

సర్ మేమనుకున్న టాపిక్కుని ఒప్పుకోవడమే ఆలస్యం - నేనూ, సునీత కలిసి అనుకున్నదే తడవు ఇద్దరం కలిసి వీవీ మహల్, ప్రతాప్ థియేటర్ అనుకుంటా - ఆ రెండు సినిమా హాళ్ళకి వెళ్ళాం. ప్రతాప్ థియేటర్లో మేనేజర్ని కలిశాం - అప్పుడే నేర్చుకుంటున్న SDLC లో Requirements Gathering Techniques లో ఒకటైన Interview ని ఆయన మీద ప్రయోగిద్దామని. ఎవరో యూనివర్సిటీ అమ్మాయిలు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అని తెలియగానే - పాపం! ఆ థియేటర్ మేనేజర్ ఉబ్బితబ్బైపోయి మమ్మల్ని ఆయన ఆఫీస్ లోకి పిలిచారు.

థియేటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారో చెప్పండి అనడిగిన మాకు - టిక్కెట్లు ప్రింట్ చేయించడం, సినిమాహాలు సిబ్బంది - అంటే - బుకింగ్ క్లర్కులూ, టికెట్లు తీసుకుని లోపలికి పంపించే వాళ్ళు, సినిమా అయిపోయాక శుభ్రం చేసేవాళ్ళు - వీళ్ళందరికీ జీతాలివ్వడం, కేంటీన్ స్పేస్ లీజుకివ్వడం - ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. అంతే కాకుండా ఒకే సినిమా రెండు హాళ్లలో ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ల మధ్య ఒకరి తర్వాత కొంచెం టైం తేడాతో ఇంకొకరు సినిమా మొదలుపెడుతూ, ఒక హాలు నుంచి ఇంకో హాలుకి రీలు డబ్బాలు ఆటోల్లో ఎలా తెచ్చుకుంటారో - ఇలా ఒక దాని వెనక ఒకటిగా సినిమా తెర మీద బొమ్మ కనపడడానికి థియేటర్ వాళ్ళు ఏమేం చేస్తారో మాకు అర్థమయ్యేలా చెప్పారు.

నాకూ, సునీతకి బోల్డంత మెటీరియల్ దొరికింది. ఇద్దరం మేమెలా ప్రెజెంట్ చెయ్యాలో ఆలోచించుకుని చేతులూపుకుంటూ CC (Computer Centre) కి వెళ్ళాం. మా క్లాసులో అమ్మాయిలు అందరూ - ఒక్కో టీములో ఇద్దరు కదా - ఒకరు వెళ్లి నించుని సగం చెప్పి కూర్చోగానే, ఇంకొకరు లేచెళ్లి  మిగిలిన సగం పూర్తి చేస్తూ - వాళ్ళ వాళ్ళ ప్రెజెంటేషన్లు పూర్తి చేశారు. నాకూ, సునీతకీ ఏదో టాపిక్ గురించి మాట్లాడాలి అని తప్పితే దానికో ఫార్మాట్ ఉందని అప్పటికీ తెలీలేదు. చివరిగా మా వంతు రాగానే ఇద్దరం ఒకేసారి లేచి వెళ్ళాం. అప్పటికే మా RS సర్‌కి  మా టాపిక్ మీదే నమ్మకం లేదు, ఇప్పుడిలా ఇద్దరం ఒకేసారి లేచెళ్లి క్లాస్ ముందు నించుని గొంతులు సర్దుకుంటూ ఉంటే "జనగణమన" పాడేస్తామేమో, అంత కన్నా మా ఇద్దరి నుంచీ ఇంకేం expect చేస్తాంలే అన్నట్లు ఓ పక్కనే డెస్క్ మీద కాళ్ళూపుతూ కూర్చున్నారు.

ముందు సునీత మొదలు పెట్టింది (అక్కడ మాట్లాడింది ఇంగ్లీష్ లో - ఇక్కడ రాస్తున్నా తెలుగులో)

"అరె హో సాంబా! జో డర్ గయా, సమ్‌ఝో మర్ గయా .... ఈ డైలాగ్ మీరెక్కడ విన్నారో చెప్పగలరా?" సునీత ప్రశ్న.

"షోలే" ఇరవై గొంతుల కోరస్ జవాబు.

"మరి... లక్ష్మక్కా! మాటివ్వండి ... మాట" సునీతే మళ్ళీ.

"గీతాంజలి" మళ్ళీ క్లాసు నుంచి ఇం-కోరస్ సమాధానం.

"చూశారా? SDLC లో phases అంటే ఆలోచిస్తామేమో కానీ మనకి నచ్చిన సినిమాల్లో డైలాగులు మాత్రం నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాం. అలాంటి సినిమాలు చూపించే థియేటర్లు ఎలా మేనేజ్ చేస్తారో నేనూ, లలిత మీకిప్పుడు చెప్తాం" అంటూ సునీత చెప్పగానే - తనూ, నేనూ మొదలు పెట్టి ఒక్కో సబ్-టాపిక్ alternate గా చెప్తూ ఓ ఇరవై నిముషాలు ఆపకుండా సినిమాల్లోంచి మాకు నచ్చిన డైలాగులు quote చేస్తూ మా ప్రెజెంటేషన్ పూర్తి చేశాం. ఆ రోజుకి మా టాపిక్ టాప్-హిట్! అమ్మాయిలందరూ బెంచీల మీద దబదబా కొట్టి మరీ ఇచ్చిన బాదింగ్-ఒవేషన్ అది.

మా RS సర్ ఎప్పట్లాగే ఏమీ మెచ్చుకోకుండా - "సరే! బానే చేశారు కానీ రిపోర్ట్ ఏదీ?" అనడిగారు.

"రిపోర్టా? మేమేమీ రాయలేదు" అనగానే "ఇప్పుడు రాసి వెంటనే సబ్మిట్ చేయండి" అని చెప్పేసి వెళ్లిపోయారు.

ఇంకంతే! ఆ ప్రెజెంటేషన్‌కి RS వెయ్యబోయే పది మార్కులకి పదికిపది వస్తే - అప్పటివరకు అంతంత మాత్రంగా వున్నా, ఇప్పటికిప్పుడు అమాంతంగా - మాకు పెరగబోయే పెర్సెంటేజ్‌ని  తల్చుకుని నేనూ, సునీత ఆ రోజు మధ్యాహ్నం కూర్చుని మార్కుకు పేజీ చొప్పున పది పేజీల రిపోర్ట్ రాసిచ్చాం - ఆ రిపోర్ట్ చదువుకుని రాసి-రంపాన పెట్టామని RS పళ్ళెలా కొరుక్కుంటారో ఊహించుకుంటూ, నవ్వుకుంటూ...ఓ పో-రెడీ పేరడీ పాడుకుంటూ...


సిన్మా ఆట...కాదు - చిన్న మాట!
ఓ... ఓ... 
సిన్మా ఆట...కాదు - చిన్న మాట!
ఎంతో ప్లాను వేసీ...
ఇంటర్వ్యూలు చేసీ ... 
మేము చేసిన మేనేజ్మెంట్ ప్రాజెక్టు అనే…
సిన్మా ఆట...కాదు - చిన్న మాట!


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16, ఫిబ్రవరి 2019, శనివారం

నే...డ్డే చదవండి-2-రాగదీపం




 
నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
ఫిబ్రవరి నెల సంచికలో
ఆరున్నొక్క-రాగమయిగా లక్ష్మి 
అనురాగమయిగా జయసుధ... 
ఈ రాగానురాగాల మధ్య నలిగిన 
త్యాగమయుడుగా నటసామ్రాట్  ఏఎన్నార్ ...
ఈ రాగులు*, త్యాగులు, రాగ-విరాగులు నటించిన 
దాసరివారి దర్శకత్వ-పరాగదీపం  - రాగదీపం
ఏనాడో విడుదల…
ఈనాడు మళ్ళీ చెప్పబడె ఇలా…
క్లిక్కుడి ఈ లింకుని అలా అలా... ఫిబ్రవరి నెల సరదా సిన్మాయణం




((*రాగులంటే చిరుధాన్యాలు కాదు సుమీ - ప్రాస కొరకై ప్రయాస మాత్రమే!!)

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 5 - అనగా వంచించారు - తినగా వంచినచారు

తోచీతోచని అసుర సంధ్య
మామూలు రోజుల్లో ఇప్పటికింకా వెలుగుండేదే
ముసురుకున్న మబ్బుల్లో చిక్కి సూర్యుడు తొలిగాడేమో
కమ్ముకోవడానికిదే అదనని అలముకున్న చిక్కనైన చీకటి
వెదకబోని దారిలో దొరకబోని రత్నాల్లా కనిపిస్తున్న ఇంటి కిటికీలోంచి కనిపిస్తున్న వచ్చీపోయే కార్ల హెడ్‌లైట్లు
అంత కన్నా మంచి సమయమేది కాఫీ పీనే కీ, కలిమితో బాతాఖానీకి?!
పొగలు కక్కే కాఫీ ఓ చేత, మీట నొక్కిన ఫోన్ ఓ చెంప
కలిమితో కబుర్లు మొదలిక...

"హలో!"

"హలో! హలో! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి? ఏంటి విశేషం?"

"ఫోన్ చెయ్యగానే నువ్వు తీశావ్ చూడు  - అదే విశేషం! ఇప్పటిది ముత్యంగా మూడోసారి నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించడం. ఏదీ నువ్వు దొరికితేగా! కలిమి... బా...గా బిజీ!"

"హహహ అదేం లేదులే. మొన్నెప్పుడో నువ్వు పెట్టిన మెసేజ్ విని తను నవ్వుకున్నారు కూడా - ఏమన్నావ్ -  అదే...  - 'తల్లీ! ఎన్నిసార్లు చేసినా VM కే వెళ్తోంది. ఇప్పటిప్పట్లో ఫోన్ చేసేలా లేవు, తీసేలా లేవు. ఇక నే చేయను. ఉలకని పలకని రాయిలా కాక పందార పలుకుల పావురాయిలా ఉందూ కొంచెం! నీ call-చెయ్యని తనంతో నన్ను కాల్చక గబగబా కాల్చెయ్యి మరీ' అని పెట్టావుగా. నేనే call చేద్దామనుకుంటున్నాను. ఇంతలో చేశావ్. పోన్లే! సరే గానీ ఏంటి ఇంతకీ విశేషాలు? మీకు టైం ఎంతయింది ఇప్పుడూ?"

"అసురసంధ్య వేళ కలిమి దొరికె దేవీ...కలిమి చెలిమి దొరికె దేవీ! "

"పాట వరస బావుంది. మీకిప్పుడు సాయంత్రం అన్నమాట! సర్లే. ఇంతకీ దాన్ని అసుర సంధ్య అనెందుకన్నారో, రాక్షసులు తిరిగే వేళనో, ఏమో కదా!?"

"అదేమో కానీ మా బదరి మాత్రం అది బారు-విహారులు తాగం-పానం-అల్లరి ఇంకా మొదలు పెట్టని వేళయి ఉంటుంది అందుకే అసుర సంధ్య అయింది అంటారు"

"సరి పోయింది ... మాటలల్లుకోవడంలో మీ ఇద్దరూ ఇద్దరే!"

"ఇంతకీ నువ్వెందుకు అంత బిజీయో చెప్పలేదు... ఏమన్నా రిలీజ్ నడుస్తోందా?"

"అదేం కాదు. మా అపార్టుమెంట్ కమ్యూనిటీలో ఒకళ్ళింట్లో పెళ్లి.  మా అందరిళ్ళలో హడావిడి అంతే. అన్నట్టు మరిచిపోయాను. వాళ్ళదీ గోదావరి పక్కే. అందుకే ఆవిడ వాళ్ళ పిల్లాణ్ణి  పెళ్ళికొడుకు చేసిందగ్గర్నుంచీ 'పెళ్ళికొడుకుని చేశాక నది దాటకూడదు, పొలం వెళ్ళకూడదు అని మా చిన్నప్పుడు చెప్పేవారు.' అని ఆ అబ్బాయిని ఇల్లు దాటనివ్వట్లేదనుకో. ఇప్పుడు నదులు, పొలాలు ఎక్కడున్నాయి. అయినా అప్పుడా ఆచారాలు ఎందుకు పెట్టారో. ఇప్పుడు కూడా అలాగే నడిపించాలంటే ఇప్పటి జెనరేషన్ వాళ్లకి నచ్చద్దూ?"

"ఊఁ "

"ఏంటి ఒట్టి 'ఊఁ' తో ఆపేశావ్?"

"వాళ్ళమ్మగారు చెప్పింది కరెక్టే! ఆ అబ్బాయి ఆవిడ మాట వినాలి"

"సరి! మీ గోదావరి వాళ్ళనా ఆవిణ్ణి వెనకేసుకొస్తున్నావ్?"

"గోదావరిని వెనకేసుకు రావడం, కావేరికి ఎదురీదడం కాదు. ఒకసారి పెళ్లి కుదిరాక, అందులోనూ పెళ్ళికొడుకుని చేశాక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే ఇంకో అమ్మాయి జీవితం ఆ అబ్బాయితో ముడిపడింది. అనుకోనిది ఏమైనా జరిగితే రెండు కుటుంబాలు బాధ పడతాయి. అందుకే అలా చెప్పి వుంటారు మన పెద్దవాళ్ళు"

"కదా! నిజమే! నేనింత ఆలోచించలేదులే! నీకు భలే తడ్తాయి ఈ రీజనింగ్స్!"

"మెచ్చావు సరే! మేకతోలేది? హహహ!"

"అవునూ... మీ ఊళ్ళో ఎస్పీబీ లైవ్-ఇన్ కాన్సర్ట్ ఉందట కదా? వెళ్తున్నారా మీరు?"

"ఉహూ! నాకు ఆయన దగ్గరికి వెళ్లి పలకరించాలని, మాట్లాడాలని ఏమీ లేదు. అలా అని ఆయనకీ నేను తెలీదు. వెళ్లకపోతే ఏమనుకుంటారో అన్న మొహమాటాల్లేవు. ఇది వరకంటే సినిమాల వాళ్ళు అపురూపంగా కనిపించే వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము లేమన్నా జరిగితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేదేమో...ఇప్పుడు పొద్దున్న లేస్తే టీవీల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటర్వ్యూలే. మన ఇంట్లో మనతో కూర్చుని వాళ్ళ విశేషాల్ని చెబుతున్నట్లే వుంటోంది. నాకు ముందు ఆ ప్రోగ్రాం గురించి తెలియగానే ఒక్క క్షణం వెళ్దామా  అనిపించింది. మళ్ళీ ఒద్దులేబ్బా అనేసుకున్నా"

"ఔనౌను ... నాగ్గుర్తుంది నీ సెలబ్రిటీస్-చార్మినార్ పోలిక. అది సరే! రథసప్తమి వస్తోంది కదా - రేపు పన్నెండో తారీఖు."

"ఔను కదా! చిన్నప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయడం, ఆ తర్వాత చిక్కుడాక్కుల్లో బియ్యప్పరవాణ్ణం తినడం - అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ భలే మంచిగా అనిపిస్తుంది."

"కదా! ఇప్పుడలా చెయ్యాలి అని తెలిసినవాళ్ళూ, తెలిసినా చేసేవాళ్ళూ బాగా తగ్గిపోతున్నారు. అదే బాధ!"

"తల్లీ కలిమీ! మనకి మనకే బాధ పడాల్సిన విషయాలు సవాలక్ష. ఇప్పుడింకో కొత్త బాధ add చేసుకోకు. ప్రపంచంలో మనం తప్పకుండా చెయ్యాలి, చెయ్యకపోతే మన జీవితం బావుండదు అని చేసే rituals గురించి అస్సలు ఐడియాయే లేకుండా మన కన్నా ఆనందంగా, ఆరోగ్యంగా బతుకుతున్నవాళ్ళు కోటానుకోట్లు. నా వరకు నాకు తెలిసి తెలిసి ఎవరినీ ఇబ్బంది పెట్టకపోవడమే మంచి సంప్రదాయం - అది పూజైనా, పునస్కారమైనా!"

"నేనొప్పుకోను! నువ్వు మాత్రం రోజూ స్తోత్రాలు, పాడుకుంటావ్, లలిత నేర్చుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటూ అంటావ్. నీకు లోపల్లోపల దేవుడంటే భయమే! ఆంటీ అంటుంటార్లే 'మా లల్లి పెళ్ళికి ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడే ఇలా కొత్తగా మాటాడుతోంది' అని. నువ్వు మాత్రం ఆచారాలున్న background నుంచి రాలేదా? వాటినెప్పుడూ కాదనకుండా ఆచరించలేదా?"

"నువ్వన్నది నేను ఏదీ కాదనను."

"మరి..."

"అరె! నన్ను పూర్తిగా చెప్పనీయ్! చిన్నప్పుడు నాన్నమ్మతో గుడి కెళ్ళేదాన్ని. తర్వాత మా శివకోడు శివుణ్ణి చూడ్డానికీ వెళ్లేదాన్ని - ఎందుకంటే ఆ గుడిలో మా తాతగారు కట్టించిన మండపం, దాని పక్కనున్న బిళ్ళగన్నేరు చెట్టూ ఇష్టం కాబట్టి. మా అమ్మ పూజ్జేస్తుంటే పక్కనే కూర్చుని ఆవిడకి వరలక్ష్మీ వ్రత కథలూ, వినాయకచవితి కథలూ చదివేదాన్ని.  అది చదవడం మీద ఇష్టం, దేవుడు కొడతాడన్న భయంతో కాదు. తర్వాత్తర్వాత పెళ్లయ్యాక ఏదైనా చేయను అంటే దాంతో వచ్చే conflict ని భరించడంలో వున్న బాధ కన్నా - ఒక్క గంటో, అరగంటో నాది కాదనుకుని పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తే దాని వల్ల వాళ్ళకొచ్చే ఆనందం బావుందనిపించేది. అందులోనూ నాలా ఎవరైనా ఒక అబ్బాయి మాట్లాడితే 'Wow! ఎంత progressive గా మాట్లాడుతున్నాడు' అనుకునే వాళ్ళే ఆడపిల్లనైన నన్ను aggressive అనేస్కునే వారు తప్పకుండా. ఎందుకొచ్చిన తిప్పలు కదా! నా వరకు నాకు ఈ భక్తి, నమ్మకం అనే విషయాలు చాలా personal. అనవసరంగా వాటిని exhibit చేసి నేను ఏ ఒక్క groupకో మాత్రమే చెందుతానని అనిపించుకోవడం నచ్చదు."

"మరి స్తోత్రాల మాటో - అవెందుకో మరి?"

"ఇవాళ నన్ను ఒదిలిపెట్టేలా లేవు - హహహ!"

"మరి... ఎప్పుడూ మాట్లాటేనా? అప్పుడప్పుడూ నీతో ఇలా పోట్లాడితేనే సరదా!"

"అల్లాగే కానిద్దాం... కానీయ్. మాట్లాటో, పోట్లాటో నీతో ఏదైనా సరదాట్లాటే"

"నేనడిగిందానికి చెప్పు - మనసులో ఏమీ లేకుండానే ఈ భాగవతాలూ, భగవంతుడి స్తోత్రాలూ - వీటి సంగతి ఏంటి?"

"తల్లీ! భాషానురక్తికీ, భక్తికీ ముడిపెట్టకు. నాకు అర్థాలంకారాలూ, శబ్దాలంకారాలూ వుండేవి ఏవైనా చదవడం, పాడుకోవడం ఇష్టం. పోతన పద్యం, కృష్ణశాస్త్రి కవిత, ముళ్ళపూడి వచనం - ఇవన్నీ తీపి తీపి తెలుగు, అవి తేట తేట తెలుగు... అంతే! అది కృష్ణుడి కథా, కృష్ణశాస్త్రి వ్యథా అనే తేడా లేదు నాకు."

"హ్మ్ ...పోన్లే - ఇంక విసిగించనులే... అయినా చెప్పావుగా ఇంతకు ముందెప్పుడో - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్, పిల్లలూ, ఫిల్ములూ... కావవీ నా టాపిక్కులకి top-pick లని! ఇంతకీ ఇవాళ్టి ఘుమఘుమలేంటి నీ వంటింట్లో?"

"వంచించారు"

"ఏమది? ఏమని వచించావు. వంట చేయక యింటివారిని వంచించావా?"

"ఉండు మరి! నా పచనం గురించి ఈ  వచనం కూడా విను. ఇవాళ మా వంటింటి వంట బస్సారు, అంటే కన్నడంలో బగ్గిసువ సారు, దాన్నే తెలుగులో గబగబా అనగా వంచించారు  - తినగా వంచినచారు. ఆక్కూరలు ఉడికించిన నీళ్ళని వంచి (వార్చి), ఆ నీళ్లతో చేసే చారిది."

"తల్లీ! నీ పచనం, నీ వచనం, ఆ పైన నీ రచనం ...చేయబోయి నిర్వచనం - నేనాయె నిర్-వచనం"

"భలే!  చూశావా ...నాతో పోట్లాట అన్నావు కానీ మాటలతో ఆట్లాడుతున్నావ్!"

"నీతో మాటే ఒక ఆట. నాదేం లేదులే ... పూలల్లిన నారని. ఆ మాత్రం వాసనంటక పోదు"

"పూలల్లిన నారవి కాదు - పూవంటి నారివి, పూవింటి నారివి"

"ఆహా.. హా ... హా - నువ్వంటూ నే వింటూ ఉంటే బావుంటుంది సుమీ!"

"అలా నేనన్నది తలుచుకుంటూ నవ్వుకుంటూ అక్కడ నువ్వుండు. నువ్వన్నది బావుందనుకుంటూ వండుకుంటూ ఇక్కడ నేనుండు. టాటా...  వీడుకోలు. ఇప్పటికి bye - ఇంక సెలవు"

"హహహ ...bye bye"

చివరాఖరి సిప్పు

Love, affection, friendship... Give unconditionally - take nonjudgmentally ~meSayIt

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

మిస్టర్ ఎమ్మెల్కే, మేం కలిసున్నాం మీ వల్లే!


అప్పుడెప్పుడో బో...ల్డన్ని రోజుల క్రితం - దాదాపు ఆరున్నొక్కేళ్ళ క్రితం.
అబ్బరాల మనవల్ని చూసి మురిసిపోవడానికి గాలిదారుల వచ్చారప్పుడే మా అత్తగారు
అప్పటికింకా అన్నజింక హై స్కూల్లో, బుజ్జిజింక ఎలిమెంటరీ స్కూల్లో.
అప్పుడప్పుడే ఇద్దరికీ శీతాకాలపు సెలవులు ముగిశాయి.
జనవరిలో మూడో సోమవారం నాడు  ఉత్తర అమెరికా అంతా జరుపుకునే  మార్టిన్ లూథర్ కింగ్ (MLK Jr.) పుట్టినరోజు సెలవు కూడా చెల్లిపోయింది.

అక్కడ - ఇండియాలో ధనుర్మాసపు సంక్రాంతి సంబరాలు ముగిశాయి
ఇక్కడ అమెరికాలో - వారాంతపు సంక్రాంతి వేడుకలు మొదలయాయి
ఆ ఆటలు, పాటలు చూసి-విని, విందుభోజనం తిని వద్దాం పద అనుకుని, అందరం కలిసి బయలుదేరాం కారులో - అమ్మ, నాన్న, పిల్లలిద్దరూ, నాన్నమ్మ.

వెనక సీట్లో ఇద్దరి మనవల మధ్యన నాన్నమ్మ కూర్చున్నారు. వాళ్ళ కబుర్ల కుహు-కుహూలు వింటూ మురిసిపోతున్నారు.

బుజ్జిజింక చేతిలో అంతకు ముందు రోజు బళ్లో వాడు వేసుకొచ్చిన  మా ఫామిలీ పోర్ట్రయిట్. అందులోకి తొంగి చూసిన నాన్నమ్మ "అదేంటమ్మా! మీ నలుగురే వున్నారు? నాన్నమ్మ ఏదీ?" అనడిగారు బుంగమూతి పెట్టి - రెండోబాల్యపు కినుకతో.

మాటల కుప్ప వాడు దొరుకుతాడా?మెరిసే జింక కళ్ళతో చేతిలో వున్న కాగితపు-బొమ్మని చూస్తూ...



"నాన్నమ్మా! మీఱూ ..."  (మీరు లో "రు" ని రోల్ చేస్తూ మాట్లాడ్తాడు బుజ్జిగాడు)

"ఆ! నేనూ ..."  ఏం చెప్తాడా అని నాన్నమ్మకి ఆత్రం.

మిగిలిన ముగ్గురమూ కూడా చెవులప్పగించాం.

అంతలో... వాడికేం గుర్తొచ్చిందో - హఠాత్తుగా బుజ్జిజింక గుండ్రని బుగ్గల్లోంచి తోసుకొచ్చిన మాటలు "మనమందరం అమ్మతో కలిసి ఉన్నామంటే దానికి కారణమెవరో తెలుసా?" అంటూ.

అప్పటి దాకా ముందు సీట్లో కూర్చుని ఏవో కబుర్లాడుతున్న నేను వెనక్కి తిరిగాను ఆ ప్రశ్న అర్థం కాక.

"అదేంటి నాన్నగాడూ? అలా అడిగావేంటమ్మా? నాన్నమ్మ కదా ఆ బొమ్మలో నేనెక్కడా అని అడుగుతున్నారు? అమ్ముంది కదా అందులో?" రోడ్డు మీద నుంచి చూపు తిప్పకుండానే బదరి బుజ్జిజింకని అడిగారు.

"అమెరికాలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు కలిసుండడానికి కారణం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్" మెరుస్తున్న కళ్ళు తిప్పుకుంటూ చెప్తున్న బుజ్జి బుగ్గల్లోంచి జారిన విజ్ఞాన గుళికలివి.

అప్పటికీ మాకెవ్వరికీ ఏమీ అర్థం కాలేదు.

"భలే చెప్పావే! స్కూల్లో చెప్పారా? అది సరే గానీ నువ్వేసిన బొమ్మలో నేనెక్కడా?" నాన్నమ్మ అసలు విషయం వదిలిపెట్టదలుచుకోలా.

"మీఱు… మీఱు… వాకింగ్‌కి వెళ్ళాఱు. అందుకే నా బొమ్మలో లేఱు" తేల్చి చెప్పేశాడు బుజ్జిమనవడు.

భళ్ళున నవ్వారు నాన్నమ్మ, "అమ్మదొంగా! ఈ మాట ఆలోచించడానికి తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అంటూ మాట మారుస్తావా?" అంటూ.

"ఊఁ" - బుజ్జిజింక పరధ్యానపు సమాధానం కంటి చూపు కిటికీలోంచి బయటి దీపాల్ని లెక్క పెడుతూ, కాళ్ళ ఊపు ఎదురుగుండా సీటుకి ఎక్కి పెడుతూ.

ఆ బుజ్జి తలలో ఏవో రంగురంగుల ఊహల సీతాకోకచిలుకలు సందడి చేస్తున్నాయని అమ్మకీ, నాన్నగారికి ఉప్పందిపోయింది.

"మార్టిన్ లూథర్ కింగ్ డే అయిపోయి రెండు వారాలయ్యింది కదా? ఇంకా అదే పాఠం చెప్తున్నారా?" అన్న అడగనే అడిగాడు అమ్మా-నాన్నల మనసులోని మాట తనకి తెలిసిపోయినట్లుగా.

"ఊఁ అన్నా! అందుకే అమ్మ మనతో ఉంది" మళ్ళీ అదే మాట వల్లె వేస్తున్నట్లుగా. 

"మార్టిన్ లూథర్ కింగుకీ, అమ్మ మనతో కలిసుండడానికి సంబంధం ఏంటి?" ఇంక ఆగలేక అడిగేశారు అమ్మా-నాన్న బుజ్జిజింకని ఓ యుగళ-ప్రశ్న.

చిట్టిచిట్టి చేతి వేళ్ళు ఒక్కొక్కటిగా మూసిన గుప్పిట్లోంచి తెరుస్తూ "నేను... , అన్న... , నాన్నగారు...  నల్లవాళ్ళం" - ఇక్కడితో కుడిచేతి నుంచి ఎడమకి చేతికి మారి, ఇంకో రెండు వేళ్ళు లెక్కపెడుతూ "అమ్మ... , నాన్నమ్మ...  తెల్లవాళ్ళు. మనమందరం కలిసున్నామంటే అది మార్టిన్ లూథర్ కింగ్ జూనియరే వల్లే! లేకపోతే మనమిలా కలిసి ఉండగలిగేవాళ్ళమే కాదు. We should thank MLK Jr."

హమ్మయ్య! పొడుపు కథ విప్పేశాడు బుగ్గల-దొర.

పనిలో పనిగా బొమ్మలో చేర్చని నాన్నమ్మ అలక తీర్చడానికి అమ్మతో కలిపి లెక్కెట్టేశాడు ఇద్దరు తెల్లవాళ్ళుగా. 

["Me, Anna, Naannagaru are black people & Amma and Naannamma are white people. We are all living together today because of Martin Luther King Jr. Otherwise, it would not have been possible. We should thank MLK Jr"]

ఫక్కుమని రాబోయిన నవ్వు పంటి వెనకాలే నొక్కి పట్టేశాం - కార్లోని శ్రోతలం నలుగురం.
నవ్వితే ఇంకేమన్నా ఉందీ?!
మా నవ్వులు పువ్వులు పూయడం మాట అటుంచి, బుజ్జిజింక బుగ్గలు పూరించి, కన్నుల నీలాలు కురిపించేవి.
కారిన నీలాలతో మారాము మీరేది
మీరిన మారాముతో పండగ జరిగే వీలేది?
అందుకే... అందరం చేతులెత్తి దండమెట్టి
అనుకున్నాం...
గట్టిగా అన్నాం కూడా ...
మిస్టర్ ఎమ్మెల్కే,  మేం కలిసున్నాం మీ వల్లే! 
ఎప్పటికీ మర్చిపోము మీ మేలే !

27, జనవరి 2019, ఆదివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 7 - లక్ష్మిదొడ్డ, సుబ్బారావు పెదనాన్న

"డియర్ పాపా! ఇప్పుడు మధ్యాహ్నం రెండయ్యింది. బాగా ఎండగా వుంది. పది నిముషాల ముందే నేనూ, మీ బావ సుబ్బులు టీ తాగాము. పప్పి బయట ఆడుకుంటోంది. నేను, పప్పి బయల్దేరి శనివారం మూడు గంటల బస్సుకి వస్తున్నాము. లల్లీ, కుట్టీలు కులాసాగా ఆడుకుంటున్నారని తలుస్తాను. వాళ్ళకి దొడ్డ బోంబే డైయింగ్ స్కర్టులు, ఎమ్మెస్ 55 షిమీజులు తెస్తోందని చెప్పు. కుట్టీ కోసం లస్కోరా తెస్తున్నాను. బాబీ కిష్టమని మజ్జిగట్లు వేసి పట్టుకొస్తాను, పిల్లలు జాగ్రత్త. వుంటాను మరి - ఇట్లు లక్ష్మి"

నా చిన్నప్పుడు వేసవి సెలవుల ముందు ఇలాంటి తాయిలం లాంటి కమ్మని కబురు మోసుకొచ్చే నీలంరంగు ఇన్లాండు లెటరు కోసం మా అమ్మతో పాటు నేను కూడా తెగ ఎదురు చూసేదాన్ని.

ఉత్తరం వచ్చిన మూడో, నాలుగో రోజులకి ఓ ఎయిర్-బాగ్గులో బట్టలు, పైన కవర్ వుండే ప్లాస్టిక్ బుట్టలో చెగోడీలు, జంతికలు, లేతకొబ్బరి తురిమి బెల్లం పాకం పట్టి చేసిన లస్కోరా, పుల్లమజ్జిగలో అటుకులు నానేసి వేసిన మజ్జిగట్లు పట్టుకుని  ఫుల్ వాయిలు చీర కట్టుకొచ్చిన కాశీ-అన్నపూర్ణలా వచ్చేది మా లక్ష్మిదొడ్డ.

మా ఇంటికి ఎవరొచ్చినా బస్టాండుకో, రైల్వే స్టేషనుకో వెళ్లి రిసీవ్ చేసుకునేవాళ్లం. మా లక్ష్మిదొడ్డ మాత్రం ఎంత రాత్రైనా ఆవిడంతట ఆవిడే ఎక్కొచ్చిన బస్సో, రైలో దిగి - రిక్షానో, ఆటోనో కట్టించుకుని జా... మ్మని ఇంటికొచ్చేసేది. అసలు మా లక్ష్మిదొడ్డతో ఉంటే మననంటిపెట్టుకుని వున్న భయానికే ధైర్యమొచ్చేసి, మననొదిలేసి ధైర్యంగా వెళ్ళిపోతుంది.

వస్తూవస్తూ ఉత్తరంలో రాసినట్లే బోంబే డైయింగ్ స్కర్టులు, వాటి మీదకి బ్లౌజులు తెచ్చేది. వాటికి తోడు వేసంకాలం పిల్లలు మల్లెపువ్వుల్లా ఉండాలి అంటూ తెల్లటి షిమీజులు ఎమ్మెస్ 55 గుడ్డతో కుట్టించి తెచ్చేది.

అప్పటికి నేను ఇంకా బళ్ళో వున్న రోజులు. లక్ష్మిదొడ్డతో పాటే వచ్చే పప్పికి భుజాలు దాటని బాబ్డ్ హెయిర్ ఉండేది. దానికో హెయిర్ బ్యాండు. పప్పిని అలా చూడగానే అప్పటిదాకా రెండు జళ్ళేసుకుని రంగురంగుల రిబ్బన్లతో పైకి కట్టుకునే నేను వెంటనే జుట్టిప్పేసుకుని బాబ్ కట్ చేయించేసుకునేదాన్ని మా దొడ్డ చేత. అందులోనూ మహా-ఆశావహి అయిన మా అమ్మకొక నమ్మకం ఉండేదేమో - బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదని - ఎలాగోలా నాకు బుద్దొస్తే చాలనుకుని జుట్టు కత్తిరించడానికి ఒప్పుకునేది.  అంతే! ఇంక ఆ వేసవి కాలపు సాయంత్రం - బాబ్డ్ హెయిర్, తెల్ల షిమీజు లల్లమ్మ గారు, బాబ్డ్ హెయిర్, ఇంకో తెల్ల షిమీజు పప్పమ్మ గారు - అని గంతులేసుకుంటూ తిరిగేవాళ్ళం పప్పి, నేను. అన్నట్లు మా ఇద్దరికీ లల్లి, పప్పి అనిన్నీ, ఆ తర్వాత కుట్టికి కుట్టి అనిన్నీ పేర్లు పెట్టింది మా లక్ష్మి దొడ్డే!

అసలు లక్ష్మిదొడ్డ వచ్చిందంటే ఇంట్లో ఒకటే సందడి. ఓ పక్క అమ్మతో కబుర్లు చెప్తూనే, ఇంకో పక్క పొద్దున్న కాఫీలు కలపడం దగ్గర్నుంచీ, మధ్యాహ్నం మూడింటి వేళ పిల్లలకి ఆకలేస్తోందని పూరీ-బంగాళాదుంప కూర, సాయంత్రం "అస్తమానూ అన్నమే ఏం తింటాం?" అంటూ వేసే రొట్టిముక్కలూ, అందులోకి చేసే సివంగి పులుసూ, పప్పీ కోసమని తెచ్చే తేనెపానకం - ఇలా ఒక చిన్న సైజు ఫుడ్-ఫెస్టివల్ నడిచేది మా ఇంట్లో రోజూ.

ఇవి కాక దొడ్డ మాకోసమే ఇంట్లో తయారు చేసే మిక్స్డ్ ఫ్రూట్ జాములు, రోజ్ మిల్క్ ఎస్సెన్సూ, కస్టర్డ్ పౌడర్ పాలల్లో మరిగించి దాంట్లో ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, అరటి పళ్ళేసి చేసే ఫ్రూట్ సలాడ్, రేగి వడియాలు, దేవుడి పెళ్లి గారెలు, సొజ్జప్పాలు - వాహ్! ఎన్నెన్ని వంటలు, ఎన్నెన్ని వంటలు, నాకున్నదేమో ఒకటే నోరు  - అని ఒకానొక శోభన్ బాబు పాట స్టయిల్లో పాడేసుకుంటూ - తిన్నవాళ్ళం తిన్నట్లే ఉండేవాళ్ళం.

నేను వేసవికాలం ఒంటిపూట  బడికెళ్ళి ఎండలో నడుచుకుంటూ ఇంటి దాకా వచ్చి, బయట మెట్ల మీదే కూర్చుని ఆకలి అని ఏడుస్తూ ఉంటే, మా లక్ష్మి దొడ్డ గబగబా అన్నం కంచంలో పెట్టి అక్కడికే తెచ్చిచ్చి, నేనో రెండు ముద్దలు తిన్నాకే ఇంట్లోకి తీసుకెళ్లేది.

మా లక్ష్మిదొడ్డ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే - పల్చగా, కొంచెం తొరకలు-తొరకలుగా మీగడ పైకి తేలేలా చిలికి, చంద్రావతి ఇంట్లోంచి తెచ్చి మరీ వేసే దబ్బాకులు కలిపి, ఉప్పేసిన వెన్నమజ్జిగ - దాని పేరు దబ్బాకు-మజ్జిగ. అది తాగి ఔరా ఏమి రుచి?! - అన్నాం మైమరచి! 

ఈ రోజుకి కూడా వేసవి కాలం రాగానే బజారుకి వెళ్లి మామిడి కాయలు దగ్గరుండి ముక్కలు కొట్టించుకొచ్చి, కారం-ఆవపిండి కొనుక్కొచ్చి ఆవకాయ పెట్టే మా ఇంటి ఆంధ్రమాత లక్ష్మిదొడ్డే! 


నేను ఐదో తరగతిలో వున్నప్పుడు బళ్ళో మల్లయ్య మాస్టారు "ఆధునిక మూల్యాంకన దర్శిని"  అనే పుస్తకం గురించి చెప్పారు. అందులో వుండే లెక్కలు, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులలో వుండే కొత్తకొత్త ఎక్సర్సైజుల గురించి విన్న తర్వాత నాకెలాగైనా ఆ పుస్తకం కొనుక్కోవాలనిపించింది. తీరా అమ్మతో వెళ్లి ఊళ్ళో వున్న పుస్తకాల షాపులో అడిగితే అది విజయవాడలో తప్ప దొరకదు అని చెప్పారు. వెంటనే విజయవాడ సత్యన్నారాయణపురంలో రాజన్ కిళ్లీషాపు పక్కనున్న ఇంట్లో అద్దెకున్న మా లక్ష్మిదొడ్డకి ఉత్తరం రాసేశాను నాకు ఆధునిక మూల్యాంకన దర్శిని పుస్తకం కొనిపెట్టమని. నా ఉత్తరం అందిన వెంటనే "మన లల్లి అడిగింది, వెంటనే కొని పంపిద్దాం" అన్చెప్పి మా సుబ్బారావు పెదనాన్న ఆ పుస్తకం కొని, దానికి మంచి రంగురంగుల సోవియట్ ల్యాండ్ పేజీల అట్ట వేసి రిజిస్టర్డ్ పోస్టులో పంపించారు. ఐదో తరగతిలో అంత అందమైన ప్యాకేజ్ అందుకోవడం నాకు భలే గొప్పగా అనిపించింది. ఈ రోజుకీ ఏ పుస్తకం కొన్నా, ఆ కొత్తపుస్తకపు వాసనలో జ్ఞాపకం వచ్చేది ఆ ఆధునిక మూల్యాంకన దర్శిని వాసనలే.

మొట్టమొదటి సారిగా ఇల్లు వదిలి హాస్టలుకి వెళ్ళినప్పుడు ఇంటికి దూరంగా వుండి బెంగ పెట్టుకుంటానని హైదరాబాదు నుంచి లక్ష్మిదొడ్డ, అప్పటికే ఉద్యోగం కోసం రియాద్ వెళ్లిన సుబ్బారావు పెదనాన్న చెరో ఉత్తరమూ రాసేవాళ్ళు. నాకు స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఇష్టం అని తెలిసిన పెదనాన్న నా కోసం తనకి, తన స్నేహితులకి వేరే దేశాల నుంచి వచ్చే ఉత్తరాల మీద వుండే స్టాంపులని తీసి, దాచి నాకు రాసే ప్రతి ఉత్తరంలో పెట్టి పంపించేవారు.

నా పెళ్ళైన కొత్తలో గ్యాస్ సిలిండర్లు అంత సులువుగా దొరికేవి కావు. "అడగ్గానే మనకిష్టమైనట్టు పెళ్లి చేశారు కదా, మన పెద్దవాళ్ళనింకెప్పుడూ ఏమీ అడిగి కష్టపెట్టకూడదు" అనేసుకుని కిరోసిన్ స్టవ్వుతో సతమతమౌతూ - ఇంగువ పోపు ఘుమఘుమలకన్నా కిరోసిన్ ధుమధుమలతో నా వచ్చీరాని వంటని నింపేస్తున్నానని తెలిసి - "అయ్యో పాపం! పిల్ల కష్ట పడుతోంది" అని తెలిసిన గ్యాస్ డీలర్ల చుట్టూ పట్టువదలకుండా తిరిగి నాకోసం ఓ సిలిండర్ని సంపాదించేసింది మా లక్ష్మిదొడ్డే.

తొలిచూలు కానుపుకి రాజమండ్రి వెళ్లిన నా కోసం, అమ్మకు సాయంగా ఉండడం కోసం రాజమండ్రి వచ్చింది లక్ష్మిదొడ్డ. అప్పుడు అమ్మావాళ్లు అద్దెకున్న నిబ్బరాజు గారింట్లో సదుపాయంగా ఉండదని పురుడైన పదకొండో రోజు వరకూ హాస్పిటల్లోనే ఉంచింది అమ్మ నన్నూ, పుట్టిన బుజ్జిగాడినీ. ఆ పదకొండు రోజులూ లక్ష్మిదొడ్డ నాకు సాయంగా నాతో పాటే ఉండేది. రాత్రి పూట పక్కలో వున్న చంటిపిల్లాడు కదిలితే,  నా కన్నా ముందు ఆవిడ లేచి "నువ్వు పడుక్కో లల్లీ! నిద్ర లేకపోతే నీరసం వస్తుంది" అంటూ చంటిపిల్లాణ్ణి  రెండు చేతుల్లో ఎత్తుకుని ఊపుతూ రాత్రంతా అలాగే కూర్చునేది. మళ్ళీ పొద్దున్నే పెందరాడే నేను లేవకుండానే ఇంటికెళ్లి స్నానం చేసి, చాకింటి చీర కట్టుకుని కొత్తరూపాయి నోటులా ఫెళఫెళలాడుతూ, నా కోసం పాలూ, బ్రెడ్డూ పట్టుకొచ్చేది. నా పథ్యం కోసం శొంఠిపొడి, కాయం, కారప్పొడి అన్నీ ఓపిగ్గా చేసి పెట్టేది. మధ్యాహ్నం భోజనం తర్వాత కవిరి వేసిన తాంబూలం కట్టించుకొచ్చి నాతో తినిపించేది. అన్నం తినగానే నిద్రొస్తోంది అంటే బాలింత మధ్యాహ్నం పడుకోకూడదు అని, అలా అని పుస్తకాలూ చదవకూడదు అని, నాతో ఏవో కబుర్లు చెబుతూ కూర్చునేది. అందులోనూ అదే టైంలో కత్తిపీటతో అనాసపండు కోస్తూ తన చెయ్యి కూడా కోసుకుంది పాపం! అది బాగా లోతుగా తెగింది కూడా. అయినా సరే! అదేమీ లెక్క చెయ్యకుండా మా అమ్మతో పాటు, తనూ ఇంకో అమ్మలాగే నాకు ఏ నొప్పీ తెలీకుండా, తెలీనీకుండా సేవ చేసింది.

నేను పుట్టిన దగ్గర్నుంచీ, నాకు పిల్లలు పుట్టే వరకూ నా జీవితపు పుస్తకంలో మా లక్ష్మిదొడ్డ ప్రసక్తి రాని పేజీ లేదు.

మా చిన్నప్పుడు ...
ఒళ్ళంతా వాయిలు కోక
కళ్ళకు కాటుక రేఖ
బారెడు ఈత పాయల జడ
తెల్లగా - చలాకీగా
సన్నగా - చురుగ్గా
ఒబ్బిడిగా - శుభ్రంగా 
పొడుగ్గా - గడుగ్గాయిలా
చూడ్డానికి "అమెరికా అమ్మాయి" దేవయానిలా ఉండేది మా దొడ్డ.


అలా అమెరికా అమ్మాయి సిన్మా హీరోయిన్లా వుండే మా దొడ్డకి సరిగా-సరిజోడుగా మా సుబ్బారావు పెదనాన్న కూడా అమెరికా అబ్బాయిలా ఉండేవారు. పచ్చగా, ఎత్తుగా, సన్నగా ఉండి మెడికల్ రిప్రెజెంటేటివ్ కిట్ పట్టుకుని, తలకి హేటూ, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని వచ్చే మా పెదనాన్నని చూసి ఎవరో ఫారినర్ అని అనుకునేవాళ్లు.

ఇల్లాళ్లు వాళ్ళవాళ్ళ పతిదేవుళ్ళని పదిమందిలో "ఏమండీ" అని పిలవడానికే మొహమాట పడుతూ ఉండే ఆ రోజుల్లోనే లక్ష్మిదొడ్డ మా సుబ్బారావు పెదనాన్నని "ఇదిగో సుబ్బులూ!" అని పిలిచేది. ఇద్దరూ చిన్నపిల్లల్లా  పోట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ అంతలోనే పోట్లాట మర్చిపోయి బోల్డన్ని మాట్లాడుకునేవాళ్లు. పిల్లలైన మాతో ఆట్లాడుకునేవాళ్లు. పప్పిని తీసుకెళ్లి పెంచుకున్నదొడ్డ-పెదనాన్నలకి కొంచెం ఆలస్యంగా ప్రశాంతి పుట్టింది. సుబ్బారావు పెదనాన్నకి పుట్టపర్తి సాయిబాబామీద చాలా నమ్మకం ఉండేది. అందుకే ప్రశాంతికి ఆ పేరు పెట్టారు.

అన్నట్లు మర్చిపోయాను చెప్పడం... మా దొడ్డ వాడే భాష చాలా తమాషాగా ఉంటుంది. 

లొడలొడ వాగడం - అంటే ఎక్కువగా మాట్లాడడం
దడదడలాడిపోతోంది - అంటే నీరసంగా వుంది
లొట్టలొట్ట చేతులు, లొట్టలొట్ట కాళ్ళు - అంటే సన్నగా ఉన్నట్లు (నన్ను చిన్నప్పుడు ఎప్పుడూ ఇలాగే అనేది)
వంకాయ బంగాళదుంప పేస్ట్ - పేస్ట్ అంటే ముద్దకూర
టమటమా పప్పు - టొమాటో పప్పు
టమటమలాడించడం - దెబ్బలాడడం (పోట్లాట)
మంకీ బ్రాండ్ - అల్లరి పిల్లలు
డిబ్బీ - పెద్దకబుర్లు చెప్పే పిల్లలు

ఇప్పటికీ ఒక్క నిముషం కూడా కూర్చోకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది మా లక్ష్మిదొడ్డ. 

ప్రశాంతి చిన్న పిల్లగా వున్నప్పుడే - కొండంత అండగా వుంటారనుకున్న పెదనాన్న గుండెనొప్పి  భరించలేక వెళ్ళిపోతే - తనకి తానే అండనుకుని, తనని తానే ఆదుకుని - పట్టుదలే పెట్టుబడిగా చీరల వ్యాపారం చేసి - తన కాళ్ళ మీద తను నిలబడి - తన కూతుర్ని ఒకింటి కోడలిగా నిలబెట్టింది స్వయంసిద్ధ మా లక్ష్మిదొడ్డ.

మా లక్ష్మిదొడ్డ  ఐదు-పదహార్ల వయసులోకి అడుగు పెట్టబోతూ కూడా పదహారేళ్ళ పడు-చురుకుదనంతో కదులుతూ ఉంటుంది. "నీకెన్నేళ్లు దొడ్డా!" అనడిగే నాతో "ఎంతా?! ఇంకా పదహారే నాకు" అని నవ్వేస్తుంది ఇప్పటికీ.

GPS పెట్టుకుని కూడా తప్పిపోగలిగే హైదరాబాదు రోడ్లలో, ఏ రోడ్డులో ఏ మలుపులో చెట్టు ఉంటుందో, పోస్టుబాక్స్ ఏ వైపు ఉంటుందో చీకట్లో కూడా గుర్తులు చెప్పగలిగే మా లక్ష్మిదొడ్డని చూసి క్యాబ్ డ్రైవర్లు కూడా ఆశ్చర్యపోతారు.

కలిమి మిగలదు
లేమి నిలవదు
కలకాలం ఒకరీతి గడవదు
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా 
వాడిన బ్రతుకే పచ్చగిల్లదా  -

అన్న పాట స్ఫూర్తితో, ఎంత కష్టాన్నైనా నవ్వుకుంటూ, ఈదుకుంటూ వచ్చేసిన మా లక్ష్మిదొడ్డ నా all-time-favorite-real-life-heroine!

 It is always said that:
    Every fairy tale has a prince
    Every story has a hero
    Every family has a head
    Every office has a chairman

    and also that:

    Two is a company
    Together can have fun
    Duet is sung by two
    Duel is done by two

    You rewrote all those rules:


    You took over the prince
    You made hero a part of you (i.e., heroine)
    You're both mommy and daddy for your offspring.
    You're the boss of your life

    and also


    You learnt to enjoy being yourself
    You have fun even while chasing your life
    You sing all voices in a life's chorus
    You play all sides in the game of life.....

    That's why I'm proud to say....లక్ష్మిదొడ్డా!

    YOU inspire me.....

19, జనవరి 2019, శనివారం

త్వామనురజామి - 32 - బెంగ బెంగ బెంగగా... సెకను సెకను సాగగా...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 31 - నాన్న మది పువ్వువలె మెత్తనమ్మా...

సెలవులొచ్చో, వాటంతట అవి రాకపోతే నేనే పుచ్చుకునో ఇంటికి వెళ్ళడం అనేది ఓ సంబరం.

ఈసారి ఆ సంబరం మరింత ముమ్మరం.

దానికి కారణం మూడింతలు - మైసూర్ SJC లో MCA చేస్తున్న అపర్ణ కూడాఈ సంక్రాంతి సెలవులకి గుంటూరు వస్తోందని తెలియడం ఒకటైతే, వైజాగ్ నుంచి కుట్టి, స్వాతి వస్తున్నారని తెలియడం రెండో ఇంత, మూడో అంత లక్ష్మి దొడ్డ, ప్రశాంతి గుంటూరు అప్పటికే వచ్చి ఉండడం. మా కోనేరు లక్ష్మయ్య ఇంజినీరు శ్రీనివాసుడు ఎలాగూ వస్తాడు. పండగేదైనా మా ఇంట శ్రీరామనవమి పందిరి సందడే.

గుంటూర్లో రైలు దిగిన నా ఒక్కదాని కోసం అందరూ కలిసి వచ్చేశారు - బిలబిల్లాడుతూ - నాన్నా, పప్పి, కుట్టి, స్వాతి, ప్రశాంతి, శ్రీను. అందరం రిక్షాల్లో ఊరేగింపుగా జుయ్...మని స్పీడుగా ఇంటికొచ్చేశాం. ఇంటికొచ్చీ రాగానే లక్ష్మి దొడ్డ వేడివేడి పాలు-బోర్న్‌విటా కలిపి ఇచ్చింది. ఇక అందరం బయట కుర్చీల్లో కూర్చుని బోల్డన్ని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. వాటికి అంతెక్కడ! ఈలోగా మా ప్రశాంతి నెమ్మదిగా వచ్చి నేను కూర్చున్న కుర్చీ చేతికర్ర మీద ఓ పక్కగా తిరిగి కూర్చుంది. అది మా అందరి కన్నా చిన్నది. లక్ష్మి దొడ్డకి కొంచెం ఆలస్యంగా పుట్టింది. అది పుట్టింతర్వాత మూణ్ణెల్లప్పణ్ణుంచీ దాదాపు ఏడాదిన్నర దాకా మా దగ్గరే పెరిగింది. అందుకే దానికి మేము అక్కలం, అమ్మలం కూడా.

సరే! అలా కూర్చున్నది ఊరికే వుండొచ్చు కదా!
నాకేసి చూస్తూ "ముగ్గు దించవా లల్లీ?!" అనడిగింది.
"ముగ్గులూ, చుక్కలూ రాత్రికి దించుతాను కానీ నీ లెక్కల పుస్తకం తెచ్చుకోమన్నాను కిందటి మాటు. తెచ్చావా?" అనడిగాను.
"ఇప్పుడే తెస్తా లల్లీ!" అని లోపలి తుర్రుమంటూ వెళ్ళిపోయింది.
అది అలా పరిగెత్తడం చూసి కుట్టి "ఏమడిగావే దాన్ని? మళ్ళీ లెక్కలు చెప్తానన్నావా? అలా అయితే అది మరిహ బయటికి రాదు." అని గట్టిగా నవ్వింది.

అదీ ఇదీ అని లేకుండా పాటలు, సినిమాలు, కాలేజులు, క్లాసులు, ఫ్రెండ్స్ - ఆకాశం కింద మా పరిధిలో మాకు తెలిసిన విషయాలన్నీ మాట్లాడేసుకున్నాం. ఆ రోజు మాత్రం ఇంట్లో ఉండి మరుసటి రోజు నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలీ, ఏమేం కొనుక్కోవాలీ అని తెగ ప్లాన్ చేసేసుకున్నాం. ఓ గంటా-గంటన్నర అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత అసలీ ప్రశాంతి ఎక్కడా, చడీ-చప్పుడూ లేదేంటా అని వెళ్లి చూస్తే బాయిలర్లో చిన్నచిన్న బొగ్గు ముక్కలేస్తూ ఆడుకుంటూ కనిపించింది. నన్ను చూడగానే ఓ చిన్న రాయి తీసుకుని అక్కడ సగం కొట్టివున్న కుంకుడు కాయలు కొట్టడం మొదలుపెట్టింది.

"ఏంటే ప్రశాంతీ? లెక్కల పుస్తకం ఏదీ?" అనడిగిన నాకు "నువ్వు తలంటుకోవాలి కదా లల్లీ... నీ కోసమే కుంకుడుకాయలు కొడుతున్నా" అంది. వెంటనే వెనక నుంచి అమ్మ "పాపం! దాన్ని సెలవుల్లో కూడా చదువు, లెక్కలు అని హడలగొట్టకు. నువ్వొస్తే ఒకటే హడావిడి. ఎవర్నీ నించోనీయవు, కూర్చోనీవు. ముందెళ్ళి ఆ తులశమ్మ దగ్గర ముగ్గెయ్యి" అంటూ నన్నక్కణ్ణుంచి తరిమేసింది.

నేను ఇంటికి వచ్చిన నాలుగు రోజులకి అపర్ణ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి వాళ్ళు వెంకటేశ్వర బాలకుటీర్ పక్కనుండే హనుమాయమ్మ గారి ఇంటి నుంచి బ్రాడీపేట 4/21 లో ఇంకో ఇంటికి మారామని చెప్పింది. అమ్మతో చెప్పి అపర్ణతో వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళాను. ఆ వెళ్లే దారిలో తనకి బదరి గురించి చెప్పాను. తను కూడా సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చారని చెప్పాను. తను భలే ఎక్సైట్ అయ్యి ఈసారి ఎలాగైనా బదరిని కలవాలి అని చెప్పింది. ఆంటీ, అంకుల్‌కి కూడా చూపించాలి అని చెప్పింది.

నేను, అపర్ణ నేల మీద కాలు - నింగిలో చూపు వున్న వాళ్ళం. గాలి వీచినా, చినుకు తగిలినా అది అప్పటికి మా కోసమే, మాకోసం కాక ఇంకెవరి కోసం? అన్న arrogance మా సొంతం. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా మాకు మేమే - మాతో మేమే. చుట్టుపక్కల పరిసరాల్తో, నడిచే వాళ్ళతో సంబంధం లేకుండా, ఎవరి ఉనికినీ  పట్టించుకోకుండా ఎప్పట్లాగే కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, గాల్లో తేలుకుంటూ అపర్ణ వాళ్ళింటికి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన నన్ను చూసి ఆంటీ బోల్డంత సంబర పడ్డారు. మళ్ళీ నాకూ అపర్ణతో పాటు బెండెకాయ పల్య, రసం అన్నం పెట్టారు. అప్పుడే అపర్ణ ఆంటీకి "సంక్రాంతి పండగ రోజు లలిత తన ఫ్రెండ్ బదరిని తీసుకొచ్చి పరిచయం చేస్తుంది" అని చెప్పింది. అలా చెప్పిందే కానీ నాకు అది ఎలా జరిగేలా చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకంటే బదరిని నేనెప్పుడూ అప్పటి దాకా గుంటూరులో కలవలేదు. ఇంకా సంక్రాంతికి టైం వుంది కదా చూద్దాం అనుకున్నాను.

మాకు గుంటూర్లో కుదిరినప్పుడల్లా శంకర్ విలాస్ సెంటర్ దాకా సాయంత్రం పూట నడుచుకుంటూ వెళ్లడం ఓ సరదా. ఈసారి కూడా ఇంట్లో వున్న పిల్లలం అందరం కలిసి శంకర్ విలాస్ దాటి వెళ్లి - నవోదయ, విశాలాంధ్రల్లో పుస్తకాలు, సంగీత్ సాగర్‌లో కేసెట్లు కొనుక్కుని - రాయల్ ఐస్‌క్రీంస్‌లో కసాటా తిని, వెనక్కి తిరిగి వస్తూ ఉంటే పదో అడ్డరోడ్డు దగ్గర జిలేబీ కొంటూ బదరి వాళ్ళ అమ్మగారు, బదరి, తన పక్కనే పరికిణీ-ఓణీలో వున్న ఒక అమ్మాయి కనిపించారు. అనుకోకుండా తనలా కనిపించగానే...

మాటలాడు పెదవులాగె
నడకలోని పదములాగె
ఆగి ఆగి వీచె గాలి ఆగె
వీచు గాలికూగు కురులు ఊగుటాగె 
ఊగు కురుల తూగు పూల ఊసులాగె 
ఊసులాగె... ఊహలాగె...  
ఉన్నపాటున - ఉత్తలపాటున 
ఆడే ఊపిరాగె... ఆగే ఊపిరాడె
ఊపిరాగె... ఊపిరాడె... 

అన్నట్లయ్యింది.

ఎంత తిరుపతిలో తనతో మాట్లాడినా గుంటూరులో బదరిని చూస్తే ఏదో తెలియని తబ్బిబ్బుగా, తత్తరపాటుగా అనిపించింది.
తను నన్ను చూస్తూనే నవ్వుతూ నడుచుకుంటూ దగ్గరగా వచ్చి "హాయ్!" అని ఆగారు.
నేను వెంటనే హడావిడిగా "హాయ్! మేమందరం ఊరికే అలా షాపింగ్ కొచ్చాం, పప్పి, కుట్టి ..ఇదిగో ఇలా అందరం" అని తడబడుతూ పరిచయం చేస్తుంటే తన పెదవుల మీద అదే నవ్వు "నాకు తెల్సులే! నీకు నేను కనబడడం నచ్చిందిలే!" అన్నట్లు.
తను కూడా "ఇదిగో... నాతో మా అమ్మ" అంటూ " అమ్మా! తినే లలిత, వాళ్ళ చెల్లెళ్ళు" అని పరిచయం చేశారు. వెంటనే వాళ్ళమ్మగారు "ఈ అమ్మాయేగా ...కిందటేడాది న్యూ ఇయర్ ముందు మనింటికి గమ్ము కోసం వచ్చిందీ. నాకెందుకు గుర్తు లేదూ!" అన్నారు.
అది వినగానే ఇంకా మొహమాటంగా అనిపించింది.
ఇంతలో బదరి తన పక్కనే పరికిణీ-ఓణీ వేసుకుని, పే...ద్ద జడ వేనుకుని, పెద్దపెద్ద కళ్ళతో నాకేసి కొంచెం ఆసక్తిగా, కొంచెమంటే కొంచెమే కోరగా, ఓరగా చూస్తున్న అమ్మాయిని చూపించి "మా చెల్లాయ్ తులసి" అని చెప్పారు.
తనని చూస్తూనే మా పప్పి "అరే! తులసి నా క్లాసే. BH స్కూల్లో చదివేటప్పుడు మేమిద్దరం ఒకే సెక్షన్" అంది.

అది అప్పటిదాకా నాకూ, బదరికి కూడా తెలీదు. కానీ ఇప్పుడిలా తెలియడం భలే బావుంది అనిపించింది నాకు. ఓ ఐదు నిముషాలు అందరం ఒకరితో ఒకరు సందడిగా మాట్లాడేసుకుని ఎవరి దారిన వారు వెళ్లబోతుండగా బదరికి మాత్రమే వినిపించేలా చెప్పాను - "సంక్రాంతి రోజు అపర్ణ వాళ్ళింటికి రండి, పొద్దున్న పదింటికి ...4/21, ఆంటీ కూడా రమ్మన్నారు " అని.

ఒక్క క్షణం నే చెప్పేది, తను వినేదీ అర్థం కానట్లు ఎడమ కంటి కనుబొమ ఒకసారి పైకి లేచి కుదురుకుంది. పెదవి చివర ఓ చిన్ననవ్వు చిందూరుకుంది. తల అంతకన్నా చిత్రంగా ఓ పక్కకి వంగి ఊగింది. నాక్కొంచెం గుండె దడదడలాడింది - ఇది సాహసమేమో కదా అని. మళ్ళీ అపర్ణకి చెప్పిన మాట మాటో! జో మాటా దియా వో నిభానా పడేగా ... అది గుర్తుకి రాగానే తడబడిన అడుగు వడివడిగానే సాగింది. ఇంటికొచ్చేశాం.

పండగ రోజులు కదా! ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల తర్వాత బ్రాడీపేట నాలుగో లైన్లో ట్రాఫిక్ అంతా తగ్గాక మా ఇంటి ముందు నీళ్లు జల్లుకుని, పప్పి, కుట్టి, స్వాతి పక్కనే నించుని కబుర్లు చెప్తూ, ప్రశాంతి నేనెటు తిరిగితే అటు వీలుగా ముగ్గుగిన్నె అందిస్తూ, మధ్యమధ్యలో సూకరాగమనాలర్టులు ఇస్తూ ఉంటే, సంతానాన్ని వెంట తెచ్చుకుని సంతసంతో నిశావిహారులై చరించే వరాహమాతల సమూహాలకి దారి ఇస్తూ, అటు ఒంగి, ఇటు ఒంగి మొత్తానికో ముగ్గు పూర్తి చేసి, దాని చుట్టూ అందరం చేరి తీక్షణంగా, తలో చిటికెడు ముగ్గు వేళ్ళతో పట్టుకుని, అందరం కలిసి ముగ్గేసేస్తున్నట్లు పోజెట్టేసుకుని, ముగ్గొహటి-చక్కని చుక్కలైదు అని మాకు మేమే caption ఇచ్చేసుకుని, మా ముగ్గు చూసిన ముచ్చట కన్నా దానికి ఫోటో తీయాలన్న ముచ్చటెక్కువగా వున్న మా తమ్ముడు శ్రీనుగాడితో ఓ ఫోటో తీయించేసుకునే వాళ్ళం. అప్పటికి ఛాయాగీత్ టైం అయ్యేది. పాటలు వినేసి, అమ్మనో, లక్ష్మి దొడ్డనో పాట్లు పెట్టి దొడ్డ-భాషలో తలో టీకాయ తాగేసి, నిద్రొచ్చేదాకా పుట్టినప్పట్నుంచీ అప్పటిదాకా గుర్తున్న సంక్రాంతుల కబుర్లు చెప్పకుని నిద్ర పోయేవాళ్ళం.

ఈసారి స్వాతి కూడా ఉందిగా మాతో... అందుకని మా సంక్రాంతి కబుర్లన్నీ నాన్నమ్మ వెళ్లిపోక ముందు అనాతవరంలో మేమందరం కలిసి చేసుకున్న సంక్రాంతి నాడు అనుకోకుండా అందరం పసుపు రంగు చుడీదార్లు వేసుకుని మా పొలంలో పచ్చాపచ్చటి వరిచేలలో రవన్నతో తీయించుకున్న ఫోటోలు, ఆ తర్వాత వెళ్లిన మురమళ్ళ ప్రభల తీర్థం గురించే. మా ముగ్గులూ, కబుర్ల మధ్య భోగి రానే వచ్చింది. భోగి పళ్ళు పోద్దామంటే ఆఖరికి బుల్లిచెల్లి ప్రశాంతల్లి కూడా భోగిపళ్లు పోసే వయసు దాటి,  భోగిపళ్లు పోయడానికి రేగిపళ్ళు కోసేంత పెద్దదయ్యింది. అందుకే అందరం మా మేడెక్కి బోల్డు కబుర్లు చెప్పుకున్నాం.

ఆ రోజు రాత్రి భోంచేస్తుంటే నాన్న "లల్లీ! మీరందరూ రేపు రమణారెడ్డి గారి ఇంటికి వెళ్ళాలి. పొద్దున్న పదిన్నరకి కారు పంపిస్తాను. వెళ్లి రండి" అన్నారు.
"అదేం నాన్నా? వాళింట్లో ఏమన్నా పేరంటమా?" రమణారెడ్డిగారు నాన్న ఫ్రెండు. కొంచెం వెడల్పు మొహమున్న వేంకటేశ్వరస్వామి విగ్రహం లాగా ఎప్పుడూ చిద్విలాసంతో కనిపిస్తారు.
"అదేం కాదు. అమ్మవాళ్ళు రారు గానీ పిల్లలు ఓ సారి వెళ్లి రండి. ఎప్పణ్నుంచో చెప్తున్నారు ఒకసారి పంపించమని"

అసలే - ఇంటికొచ్చిన దగ్గర్నుంచి, నాన్న - పాపం - నన్నేమీ అనట్లేదని కొంచెం గిల్టీ గానే వుంది నాకు. ఎప్పట్లాగే మాట్లాడుతున్నారు. మేమెక్కడికి వెళ్తున్నా, ఏం కొనుక్కుంటామన్నా ఎంతడిగితే అంత జేబులోంచి లెక్క పెట్టకుండా తీసిస్తున్నారు. అస్సలు తిరుపతి వచ్చినప్పటి విషయాలే ఎత్తట్లేదు. అమ్మ కూడా ఎప్పట్లాగే వుంది. కొంచెం కూడా విసుగు, చిరాకు చూపించట్లేదు. నేను ఇంట్లో ఉన్నంత సేపూ నాకిష్టమైనవి చేసి పెట్టడానికి తెగ తాపత్రయపడిపోతోంది.

సంక్రాంతి రోజు పొద్దున్న పదింటికి కదా! అపర్ణ వాళ్ళింటికి వెళ్ళాల్సింది. నయం! - ఒక అరగంటైనా టైముంటుంది అనుకుని "సరే నాన్నా! వెళ్తాం" అని చెప్పాను. నేను సరే అనకపోయినా వేరే ఆప్షన్ లేదు కానీ, ముందుగా చెప్పడం నాన్న నాకిచ్చిన "pretentive" option, దానికి సరేననడం నా అణకువ-ప్రదర్శనావకాశం.

మర్నాడు అందరం తొందరగా లేచి - ముందురోజు నలుగుల-తలంట్ల హడావిడి ఎలాగూ అయిపొయింది కదా - ఆట్టే నీళ్ళు పారబోయకుండా గబగబా స్నానాలు చేసి రెడీ అయిపోయాం. అప్పటికే అమ్మ పులిహోర, దొడ్డ సొజ్జప్పాలు చేసేశారు. అవి తినేసి తొమ్మిదిన్నరకల్లా బయట కేన్ కుర్చీల్లో కూర్చుని వున్నాం. తొమ్మిదీ ఏభై కాగానే అప్పటిదాకా వీళ్ళందరూ నాతో బయల్దేరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అనాలోచిస్తూ తెగ గోళ్లు కొరికేస్తున్న నేను చటుక్కున లేచి, చెప్పులేసుకుని "నేను అపర్ణ వాళ్ళింటి దగ్గర వుంటాను. మీరందరూ కార్రాగానే అక్కడికొచ్చి నన్ను ఎక్కించుకెళ్ళండి" అని వాళ్ళెవ్వరూ నన్నింకో మాటాడక్కుండా "అమ్మా! నేనపర్ణ వాళ్ళింటి దగ్గర కారెక్కుతాను. తనకి నా కొత్త చీర చూపిస్తానని చెప్పాను" అని అమ్మక్కూడా చెప్పేసి గబగబా నడుచుకుంటూ అపర్ణ వాళ్ళింటికి వెళ్ళాను. నన్ను చూసి అపర్ణ "మమ్మీ! లలిత ఫ్రెండు బదరికి మనిల్లు తెలీదు కదా! మన స్ట్రీట్ చివర నించుని తను రాగానే తీసుకొస్తాం" అన్జెప్పి నాతో పాటు బయటికి వచ్చింది.

మేమలా అడుగు బయటికి పెట్టామో లేదో ... ఎదురొచ్చినఅబ్బాయిని చూసి -
నా మన మోహన మనోజ్ఞ మూర్తి చిరునవ్వు జిలుకుచు మ్రోల నిలిచె** అన్నట్లాయె
మబ్బూ-మెరుపూ కలిసి వచ్చినట్లాయె
కొత్తగా మోము కప్పిన చిఱుసిగ్గు వలిపెంపు పొర చిక్కనైనట్లాయె 
ఈ పొద్దు నన్ను నేనే కనుగొన్నట్లాయె 
ఇది ఇంతకు ముందెన్నడూ ఇలా వుండినట్లున్న జాడ లేనట్లాయె.
(**దేవులపల్లి వారి మాటొహటి అప్పు తెచ్చుకున్నా - అవీ ఆ చుక్కలు **)

ముగ్గురం కలిసిఅపర్ణ వాళ్ళింట్లోకి వెళ్ళాం. బదరి shook hands with uncle. శాంతాంటీ మా ముగ్గురికీ కప్పుల్లో పరవాణ్ణం పెట్టారు. తింటూ, ఆంటీ-అంకుల్, అపర్ణ తన గురించి, SVU గురించి అడుగుతున్నప్రశ్నలకి బదరి చెప్తున్న జవాబులు వింటూనే వున్నాను కానీ నా చూపు ఒక నిముషం నా చేతికున్న వాచ్ వైపు, ఇంకో నిముషం బయట గేటు వైపు. పదిన్నరకి కారొస్తుంది, రమణారెడ్డి గారింటికి వెళ్ళాలి కదా.

ఇంతలో ఆంటీ నన్నేదో అడిగితే ఆవిడకి జవాబివ్వడానికి నోరు తెరిచానో లేదో - కొత్త డ్రెస్సులు ఫెళఫెళలాడుతూ, కాళ్ళ చెప్పులు టపటపలాడుతూ - కార్ 21వ అడ్డరోడ్డు మొదట్లో ఆపి చార్-దేవియా లాగా పప్పి, కుట్టి, స్వాతి, ప్రశాంతి బిలబిల్లాడుతూ అపర్ణ వాళ్ళింట్లోకి వచ్చేశారు.

అక్కడున్న బదరిని చూడగానే వాళ్ళ కళ్ళు ఏదో రహస్యం కనుక్కున్నట్లు తళతళలాడాయి. ఒకరి కేసి ఒకరు చూసుకుని తెగ నవ్వేసుకున్నారు. నేనొక్క నిముషం - చెప్పొద్దూ - అబ్బా! వీళ్ళిక్కడికి రాక ముందే నేను బయటికి వెళ్ళాల్సింది - అనుకున్నాను. మళ్ళీ - ఇప్పుడిక్కడ అంత ఇబ్బందికరమైన విషయం ఏముంది? - అనుకుంటూ Be yourself. No one can say it is wrong అన్న Charles Schulz గారి మాటల్ని తలిచేసుకుని, నన్ను నేను సంబాళించేసుకుని - అక్కడున్న అందరికీ, బదరితో సహా, వెళ్ళొస్తానని చెప్పి నాకోసం వచ్చిన బాలికా-చతుష్టయంతో కలిసి బయటకొచ్చేశాను.

కార్ దగ్గరికి నడుస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక్కోళ్ళూ ఒకో expression. ప్రశాంతి చిన్నపిల్ల. రోడ్డు మీద గెంతుకుంటూ నడుస్తోంది. మాటలు పొదుపుగా వాడే పప్పి నవ్వులు మాత్రం విరివిగానే చిందిస్తోంది. కుట్టి "లల్లెమ్మా! ఇందుకా పరిగెత్తుకొచ్చావ్?!" అని దొంగగా నవ్వుతోంది. స్వాతేమో ఏదో కనిపెట్టేసినట్లు "ఎవరికీ చెప్పంలే!' అని భరోసా ఇస్తోంది.

నేనెవరినీ పట్టించుకోనట్లు సీరియస్సుగా మొహం పెట్టి కార్ వెనక సీట్లో ఎక్కేసి కూర్చున్నాను. వెనక సీట్లో నేనూ, పప్పి, స్వాతి, ప్రశాంతి కూర్చున్నాము. కుట్టి ముందు సీట్లో కూర్చున్నా వెనక్కి తిరిగి ఓ... కబుర్లు చెప్పేస్తోంది. నాకేంటో inkling - ఇవాళేంటో సవ్యంగా జరిగేలా లేదు అన్నట్లు.

ఎప్పుడూ లేంది రమణారెడ్డి గారు మమ్మల్ని వాళ్ళింటికి రమ్మనడమేంటో, నాన్న కారెక్కించి మరీ వాళ్ళింటికి పంపడమేంటో, మేమెళ్ళి వాళ్ళింట్లో చేయబోయేదేంటో - ఏంటో అంతా గజిబిజిగా, కొంచెం disturbed గా అనిపించింది. అసలిప్పుడు ఎక్కడికీ వెళ్లాలని లేదు. కానీ నాన్న చెప్పారని, వెళ్లక తప్పదని వెళ్ళడమే...

బెంగ బెంగ బెంగగా...
సెకను సెకను సాగగా...
కొత్తగ ఇప్పుడూ - చిక్కులేమి వద్దుగా ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>> 


16, జనవరి 2019, బుధవారం

నే...డ్డే చదవండి-1- స్వయంవరం

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
ఆంధ్రుల అందాల నటుడు నటభూషణుడు శోభన్‌బాబు...
అందాల నటి జయప్రద...
నటించిన దాసరివారి దర్శకత్వవరం - స్వయంవరం...
ఏనాడో విడుదల…
ఈనాడు మళ్ళీ చెప్పబడె ఇలా…
క్లిక్కుడి ఈ లింకుని అలా అలా... జనవరి నెల సరదా సిన్మాయణం

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

13, జనవరి 2019, ఆదివారం

మంచుపూట నేర్చిన మంచిమాట - సంక్రాంతుల కాంతుల మించునంట...

ఎప్పట్లాగే ఈసారి కూడా సంక్రాంతి పుష్యలక్ష్మి మా ఊళ్ళో మంచుపూల వానలో తనివి తీరా తడిసింది.
ముగ్గు లేదని ముడుచుకున్న వాకిలి మంచుపూతతో మెరిసింది, మురిసింది.
నేల మీద నిలవలేని ముగ్గు ఇంటి ముంగిట ఇనప గుమ్మటమెక్కి మంచు చుక్కల మెలికలు తిరిగింది.


పెరట్లోని చెట్లు -  కప్పుకున్న ఆకులవీ, తప్పుకున్న ఆకులవీ - మంచు చిగురులు తొడిగాయి.  



శుక్రవారం మధ్యాహ్నం మొదలైన మంచువాన శనివారం మధ్యాహ్నానికి ఓ పదంగుళాల దళసరి కంబళైంది పుడమికి.
శుక్రవారం బడులు తొందరగా వదిలేశారు - పిల్లలను చప్పున ఇంటికెళ్లి వెచ్చగా ఒదిగుండమని.
శనివారపు ఆట-బడులు, పాట-బడులు అన్నీ కూడా చలి పాలబడి మూత-బడులు. 

ఇంట కాలు నిలవని పిల్లలు కాలుగాలిన పిల్లులే ఇక !
ఊసుబోవని ఇంటి సావిట్లో ఆటల పందిరిగా పిల్లలజంట  - వంటింట్లో పాటల సందడి తోడుగా గరిట తిప్పగా సాగిన నా వంట.
అన్నాల వేళకు నోటికి హితవుగా వెచ్చావెచ్చని పులుసు కూరల బువ్వల నిండిన బొజ్జలు.
ఆకలి తీరినపాటునే మళ్ళీ మొదలైన Super Mario Odyssey ఆటలు. 
ఆటల మునిగిన పిల్లల పక్కనే ఓ మూల కూర్చుని నెమరేస్తూ నే తిరగేసిన పాత పుస్తకాల దొంతరలు.

వారానికి ఒక పూట అపురూపంగా దొరికే siesta-సమయాన్ని అందబుచ్చుకుని, మెట్లెక్కి వెళ్ళబోతున్న నాన్నగారు చెప్పిన మాట - సరిగ్గా మూడున్నరకి లేపమని. ఎందుకూ అంటే ఇంటి ముందున్న మంచుమరుగు ఇప్పుడిప్పుడే కరగదు కదా! ఎత్తిపోద్దామని.

నేనర్స్ చెప్పిన మాట విన్న పిల్లలు - ఒకరికొకరు కనుసైగ చేసుకున్నారు ముసిముసినవ్వులతో.
వాళ్ళ ఎత్తు ఏంటంటే తను లేచేలోగా చడీచప్పుడు చేయక వెళ్లి దాదాపు ముప్పావు అడుగు ఎత్తున్న మంచు-కంబళిని సంబాళించాలని.

ఈలోగా ఏమయ్యిందంటే ఇంటి బయటున్న చిరుగంట మోగింది.
ఎవరా అని తలుపు తీస్తే - ఎవరో ఇద్దరు బంగారుతండ్రులు, మా-మంచివారు, కొంచెం పైకమిస్తే మంచు తొలిగిస్తామని వచ్చారు.
వచ్చి అడిగిందే తడవు వాళ్ళడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి, వారు చెయ్యబోయే సాయానికి మెచ్చానని ఓ మాటందించి, లోపలికొచ్చి పిల్లలకి మీ ఆట ఆపక్కర్లేదు, మంచు తొలిగించే ఆపద్బాందవులొచ్చారని చెప్పా.

ఓ గంట లోపులోనే ఇంటి ముంగిలి మంచు-నలుగు తొలిగి వెలిగిపోయింది. వచ్చినవారు నేనిచ్చినది పుచ్చుకుని నవ్వుమొహాలతో తరలిపోయారు.

ఈలోగా నిద్రనుంచి లేచొచ్చి కిటికీలోంచి బయటికి చూసిన నాన్నగారికి తళతళలాడుతున్న వాకిలి కనిపించి ఆశ్చర్యపోయారు. జరిగిందేంటో తెలుసుకుని తనను లేపనందుకు నొచ్చుకున్నారు.

"మీరెందుకు లేవడం, నేనర్స్? మంచు తీస్తామని ఎవరో వచ్చారు. అమ్మ డబ్బులు కూడా ఇచ్చింది. ఫర్లేదు! మన పని తగ్గింది. వాళ్ళకీ కొంచెం allowance దొరికింది" పిల్లల సర్దిచెప్పబోయారు.

"వాళ్లకి ఎంతసేపు పట్టింది?" నాన్నగారి ఆరా.

"ఎంతా ? మహా అంటే ఓ నలభయ్యో-ఏభయ్యో  నిముషాలు" ఆట మీంచి చూపు తిప్పకుండానే వచ్చింది ఉత్తరం. 

"అదే మరి! వాళ్ళిద్దరికీ ఏభై నిముషాలు పట్టింది. అంత చలిలో ఆరుబయట పనిచేయడం ఎంత కష్టం? మనందరం తలో చెయ్యీ వేసుంటే అందరికీ తలో పది నిముషాలే పట్టేది కదా! డబ్బులివ్వడంతో వాళ్లకేదో మనం ఉపకారం చేశాం అనుకోకూడదు. వీలైనంత వరకూ చెయ్యగలిగిన సాయం చెయ్యాలి. ఈసారి నుంచీ అలాగే చేద్దాం - సరేనా?!" - అనునయింపు చాటున ఓ చిన్న మందలింపు.

"అలాగే నేనర్స్, తప్పకుండా గుర్తుంచుకుంటాం!" ఆట ఆగి ఆలోచనయ్యింది. ఆలోచన ఆర్ద్రతయింది. ఆర్ద్రత  మరువలేని బతుకు-పాఠమయ్యింది.

Sun-కాంతి లేని మా చోట
సంక్రాంతి మనసుకి మాత్రమే తెలిసిన ముచ్చట 
మంచుపూట నేర్చిన మంచిమాట 
సంక్రాంతుల కాంతుల మించునంట... 



                                                                                    

6, జనవరి 2019, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 15 - ఏలా... ఏలేశ్వరం ఏగుటేలా?

గతనెల కబుర్లు :  అవతారంగారి నారాయణగారి బాబి - 14 - లెక్కల నుంచి లీఫ్ దాకా...

ఈసారి కొంచెం నా వాహనయోగం గురించి, ఏలేశ్వరం ప్రయాణం గురించి కొన్ని విశేషాలు చెప్తాను.

1975 జూన్ నాటికి జంగారెడ్డి గూడెం సీజన్ అయిపోయింది. జంగారెడ్డి గూడెంలో వున్నప్పుడు జీపులు, కార్లు డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను. మహీంద్రా జీపులేంటంటే లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ అమెరికా కార్లలాగా. ఎంబాసడర్ కార్లేమో రైట్-హ్యాండ్ డ్రైవ్. రెండిటి మీదా నేర్చుకున్నాను. ఒక విధంగా సవ్యసాచిని నేను. అవీ ఇవీ కూడాను ఒకే రకంగా డ్రైవ్ చేసేవాణ్ణి చగ్గాను!

మైసూర్ సీజన్ ఆగస్ట్ నుంచి జనవరి దాకా ఉండేది. 1976లో మైసూర్ టొబాకో సీజన్‌కి కూడా వెళ్ళాను. చిన్నచిన్న మాటలతో కన్నడ మాట్లాడడం నేర్చుకున్నాను కదా! అక్కడే ఒక కొత్త Yezdi కొనుక్కుని దాని మీద తిరుగుతూ ఉండేవాణ్ణి. రోజూ నేను ఏరియాకి వెళ్లాల్సిందే. రామనాథపుర, పెరియపట్న, అర్కల్ గూడా, దావణగెరె - ఇవన్నీ ఒకే లైన్లో వుండే బ్రాంచెస్. పొద్దున్నే బయల్దేరి ఇవన్నీ చూసుకుని సాయంత్రం హాసన్ వచ్చేసేవాణ్ణి. ఒక్కోసారి ఏంటంటే మధ్యాహ్నం బయల్దేరి వెళ్ళాల్సొచ్చేది. ఎందుకంటే రైతులకి చెక్స్ ఇచ్చేవాళ్ళు. పొద్దున్నే బ్యాంకుకి వెళ్లి రైతుల పేర్న చెక్కులు తీసుకుని మధ్యాహ్నం బయల్దేరి వెళ్లి అందరికీ చెక్కులు ఇచ్చి, రిపోర్ట్స్ అన్నీ సేకరించుకుని రాత్రికి హాసన్ వచ్చేసేవాణ్ణి. షిమోగా వెళ్లాలంటే అజిత్ గారు కారిచ్చేవాడని చెప్పాను కదా ఇంతకు ముందు!

అలా ఒకసారి షిమోగా ఏరియాకి వెళ్ళినప్పుడే - అక్కడ తెలుగులో మన ఎంటీఆర్ నటించిన 'నేరం నాది కాదు ఆకలిది' అనే సినిమాకు వెళ్ళాం, నేనూ, బయ్యర్లు. వెళ్ళినప్పుడు అక్కడ కార్ డ్రైవర్ పొట్ట ఉబ్బరంగా వుంది అంటే నేను కన్నడ నేర్చుకున్నాను (అనుకున్నాను) కదా! - వచ్చీరాని కన్నడలో కూడబలుక్కుని "గండసరిగె మాత్ర, హెంగసరిగె మాత్ర" అన్న బోర్డులు చదివి ఆ "మాత్ర" కి ఒక కొమ్మోటి ఎక్కువ వేసుకుని చదివి "ఒరేయ్! ఇదిగో ఇక్కడ 'గండసరిగె మూత్ర' అని రాసుంది. ఇక్కడ నీ పని కానీయ్" అని చెప్పా. పాపం! వాడు వెళ్లి నేను చెప్పిన స్థలంలో ఒకటికి వెళ్లి వచ్చాడు. తీరా చూస్తే అవి టికెట్ కౌంటర్లు. ఆ సిన్మాహాలు మేనేజర్ వచ్చి మా డ్రైవర్ని తల వాచేట్లు చీవాట్లు పెట్టాడు.

నేను మైసూర్ సీజన్‌కి వెళ్ళినపుడే ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే వైట్ బర్లీ టొబాకో కొనడం మొదలుపెట్టింది. మన తూర్పుగోదావరిలో ఏలేశ్వరం అంజెప్పేసి ఒక ఊరుంది. జగ్గంపేట దాటింతర్వాత హైవేలో సోమవరం, ఎర్రవరం ఉంటాయి. ఎర్రవరం దగ్గర ఎడమ పక్కకి వెళ్తే ఏలేశ్వరం వస్తుంది. ఏలేశ్వరం దాటాక రమణయ్యపేట అనే ఊరొస్తుంది. అక్కణ్ణించి మొత్తం ఏజెన్సీ ఏరియా - అమీనాబాద్ కాలనీ, చికిలింత, కరుదేవపాలెం ఇలాంటి గ్రామాలు చాలా వున్నాయి అక్కడ. ఆ గ్రామాల్లో వైట్ బర్లీ టొబాకో పండించేవారు. అది అక్కడుండే కోయజాతివారు పండించేవాళ్ళు. అది కూడా మా కంపెనీ వాళ్ళు టేకప్ చేశారు. దానికీ లీఫ్ మేనేజర్ సీతారామయ్య పంతులుగారు. మైసూర్ సీజన్ అయిపోయాక ఆయన ఏలేశ్వరం వెళ్లి వైట్ బర్లీ పొగాకు కొనుగోళ్లు చూసుకునేవారు. 1975లో అక్కడ మేనేజర్ డి.ఎస్. శాస్త్రి అని ఒకతను ఉండేవాడు - దారా శాస్త్రి అని. ఈ దారా శాస్త్రి సోదరుడు ఇంకో దారా శాస్త్రి. అతను కాకినాడలో ఇంకో వేరే కంపెనీలో ఎక్సపోర్ట్స్ లో ఉండేవాడు. బసవేశ్వరరావు అని ఒక క్యాషియర్ ఉండేవాడు ఏలేశ్వరంలో. అతను చిలకలూరిపేట నుంచొచ్చాడు. స్వామి అని కారంచేడు నుంచి ఒక ట్రెయినీ మేనేజర్ ఉండేవాడు. ఏలేశ్వరం ఏరియాని ఈ ముగ్గురూ - దారా శాస్త్రి, బసవేశ్వరరావు, స్వామి - డెవలప్ చేశారు. దారా శాస్త్రి, బసవేశ్వరరావు ఏలేశ్వరంలో ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉండేవారు. స్వామి ఆఫీస్ గెస్ట్ హౌసులో ఉండేవాడు.

నేను మైసూర్ నుంచి గణపవరం వచ్చేశాక మళ్ళీ కంపెనీకి మామూలుగా వెళ్తుండేవాణ్ణి. కొంచెం ఎకౌంట్స్ సెక్షన్ వదిలేసి అంకెలు, లెక్కలు పక్కన పెట్టి లీఫ్ లోకి వచ్చేశాను నెమ్మదిగా. ఇంతకు ముందు చెప్పాను కదా జంగారెడ్డిగూడెం వెళ్లి షా కమిషన్ లీడ్ చేశాను. జంగారెడ్డిగూడెంలో వున్న 18 బ్రాంచులకీ వెహికల్ ఇన్ఛార్జ్ కూడా అయ్యాను. పద్ధెనిమిది వాహనాలు - కార్లు, జీపులు - మొత్తం కలిపి నాకింద ఉండేవి. వాటికేంటంటే డ్రైవర్లు డ్రైవింగ్ ఎలా చేస్తున్నారో కనుక్కుంటూ, లైసెన్సులు, RCలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని, బండి కండీషన్లో ఉందో లేదో నేను చూసి సర్టిఫై చేస్తేనే బండి కంపెనీలో పెట్టడం, లేకపోతే లేదు. ఈ రకంగా పంతులుగారు నాకు అదనపు భాద్యతలు, మిగిలిన వాళ్ళకి నా మాటను పాటించాలన్న strict instrctions ఇచ్చేశాడు. నాతో పాటుగా ముక్కు రంగారావు, రవిశంకర్, ప్రసాద్ ఇలా కొంత మంది స్టాఫుని నేనే ఎపాయింట్ చేసుకున్నాను. సీతారామయ్య పంతులుగారు కూడా వాళ్ళని తీసుకోవడానికి ఒప్పుకున్నారు. అక్కడే ASN మూర్తి అనే అతను క్యాషియరుగా ఉండేవాడు. MBR ప్రసాద్ అనే అతను బ్రాంచ్ మేనేజర్. మస్తాన్ రావు గ్రేడింగ్ సూపర్‌వైజర్. అతను గ్రేడింగ్ లేని ఆదివారాల్లో కూడా అలవాటు మర్చిపోలేక గాల్లో అరుస్తూ ఉండేవాడు "హేయ్!" అంటూ ఏదో జనం మీద అరుస్తున్నట్లుగా. "ఏంటిది మస్తానూ?!" అనడిగితే "మర్చిపోయాను బాసూ!" అంటుండేవాడు. జంగారెడ్డిగూడెంలో ఈ ప్రకారంగా 1976 బానే జరిగిపోయింది.

ఈలోగా ఏలేశ్వరం నుంచి మద్ది లక్ష్మయ్య గారికి ఒక ఉత్తరం వచ్చింది. ఏలేశ్వరం సీజన్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉంటుంది. అక్కడ వుండే రైతులు పొగాకు కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని మద్ది లక్ష్మయ్య గారికి ఉత్తరం రాశారు. ఆయన అది చదివి పక్కన పడేశారు. అప్పుడు అక్కడుండే రైతు నాయకుడు వసంత రాయుడు అనే అతను ఒక ఉత్తరం లక్ష్మయ్యగారి భార్య సీతమ్మగారి పేర రాశాడు  -"అమ్మా! ఇక్కడ కొనుగోలులో ఏదో తేడా జరిగింది. మీ కంపెనీ కోసం మేం పొగాకు వేశాం. మీరు పెట్టమంటే బేళ్లు పెడతాం కానీ మా వ్యవహారం సెటిల్ అయ్యాకే మీరు బేళ్లు కొనుగోలు చెయ్యాలి. లేకపోతే మీకు అమ్మం. మొత్తం ఐఎల్టీడీకి వేసేస్తాం" అంటూ. ఐఎల్టీడీ మా కాంపెటీటర్ కంపెనీ. ఆ ఉత్తరం సీతమ్మగారికి చేరింది - హోమ్ డిపార్టుమెంటుకి. ఆవిడ అది తీసుకెళ్లి లక్ష్మయ్యగారికిచ్చి "ఏంటండీ ఇది? ఏదో గొడవవుతున్నట్లుంది?" అంటే ఆయన ఆ ఉత్తరం పట్టుకుని కంపెనీకి వచ్చారు. వచ్చి సుబ్బన్నగార్ని, పంతులు గార్ని పిలిచి మీటింగ్ పెట్టి ఆ ఉత్తరం సంగతి చెప్తే వాళ్ళందరూ మాట్లాడుకుని ముందు దత్తుని అంటే మా బావమరిది మణిని పంపించారు ఏలేశ్వరం.

మా బావమరిది మణి కోనసీమలో పుట్టి పెరిగినా కూడా వాడికి ఒక వెటకారం కానీ, లౌక్యం కానీ తెలీదు పాపం! చాలా ముక్కుసూటి మనిషి, సిన్సియర్ ఫెలో. వాడు కంపెనీలో కూడా పని చేసేటప్పుడు అకౌంట్స్ పుస్తకాలు ముందేసుకు కూర్చుంటే తల కూడా పైకెత్తేవాడు కాదు. వాడిని ఏలేశ్వరం పంపించినప్పుడు అకౌంట్ పుస్తకాలు అక్కడున్నవాళ్ళు ఏవి చూపిస్తే అవే చూశాడు. అవన్నీ సరిగ్గానే వున్నాయి. వాటిని చూసి వాడు అన్నీ సరిగ్గానే ఉన్నాయని రిపోర్ట్ రాశాడు. తప్పితే రైతులని పలకరించి వాళ్ళతో మాట్లాడి అసలు తప్పు ఎక్కడ జరిగిందో పాపం!  కనిపెట్టలేకపోయాడు.

దాంతో లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు, పంతులుగారు - ముగ్గురూ కలిసి మాట్లాడుకుని "కామేశ్వర్రావుని పంపిద్దాం. షా కమిషన్ వుంది కదా" అన్జెప్పి నన్ను పిలిచి "నువ్వు బయల్దేరి ఏలేశ్వరం వెళ్ళు. అసలక్కడేం జరుగుతోందో కనుక్కో. నువ్వు సినిమా చూడాలంటే రాజమండ్రి వెళ్ళు. డ్రింక్ తీసుకోవాలంటే రాజమండ్రి వెళ్ళు. అక్కడ మాత్రం ఏమీ తీసుకోకు. నిష్పక్షపాతంగా అక్కడ ఏం జరిగిందో మాకు రిపోర్ట్ ఇయ్యి" అని చెప్పి నన్ను ఏలేశ్వరం పంపించారు. సరే! నేను ఏలేశ్వరం బయల్దేరాను.

ఏలా...  ఏలేశ్వరం ఏగుటేలా? 
ఈలా ... ఇప్పుడే అడుగుటేలా?
మేలా ... ఒక్కటీ ఓపిక పడితే నెలా!
చాలా ... కథుంది చెప్పుకునేలా!


<వచ్చేమాటు తరువాయి కథ>