19, మే 2019, ఆదివారం

త్వామనురజామి - 36 - కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 35 - భలే భలే మంచి రోజులులే! మళ్ళీమళ్ళీ ఇక రావులే!

గుంటూర్లో ఎండాకాలం
గుండులు మండేకాలం
ఇంటి కిటికీలకి వట్టివేళ్ల పరదాలు
ఇంటి పట్టునున్న మా అక్కాచెల్లెళ్ల కబుర్ల సరదాలు
మామిడిపళ్ళ బుట్టలు
తాటాకుల్లో చుట్టిన ముంజల  కట్టలు
చేతికి నూనె రాసుకుని నేను మాత్రమే తీసే పనసతొనలు
ఎండవేళ చలవని అమ్మ కాచిచ్చే నిమ్మకాయ పిండిన బియ్యపురవ్వ జావలు
నాన్నతో కబుర్లు, అమ్మతో వేళాకోళాలు
మేం ముగ్గురం పాడుకునే పాటలు, నవ్వుకునే నవ్వులు
ఇంటికి వచ్చేపోయే బంధువులు, స్నేహితులూ
ఎప్పట్లాగే ఇల్లంతా సందడి
పీకి వెయ్యని సరదాల పందిరి

అంతట్లో ఓ రోజు రామారావు అంకుల్ ఒచ్చి అమ్మతో "కిందటి మాటు మా ఆల్ఫ్రెడ్ సార్ వాళ్ళ పాపకి మీ పెద్దపాప లెక్కల క్లాసు చెప్పింది కదా! ఆ పాపకి బాగా ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందట. ఈసారి కూడా వేసవి సెలవులకి వాళ్ళు గుంటూరొస్తున్నారు. పెద్ద పాపా ఇంకా ఇంట్లో ఉంటుంది కదా ప్రాజెక్టువర్కు కెళ్లే లోగా! ఓ నెల్రోజులు లెక్కలు చెప్పమనండి" అంటూ.

అలా మళ్ళీ సంగీతా ఆల్ఫ్రెడ్ వాళ్ళ చెల్లెలు అనహితతో కలిసి రోజూ పొద్దున్నే పదింటికి లెక్కలు చెప్పించుకోవడం కోసం నా దగ్గరికి రావడం మొదలయింది. ఓ నలభై ఐదు నిముషాలు లెక్కలు, ఆ తర్వాత నా దగ్గరున్న పుస్తకాల్లో తనకి నచ్సిన ఏ ఎనిడ్ బ్లైటన్ పుస్తకమో, టామ్ సాయరో - ఏదో ఒకటి అడిగి తీసుకెళ్లి, చదివి దాని గురించి మాట్లాడడమో చేసేది సంగీత. అనహిత మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ళ అక్క నాతో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండేది.

జూన్ రెండో తారీఖు. అమ్మానాన్నల పెళ్లిరోజు.  పులిహోర, సగ్గుబియ్యం పరవాణ్ణం, వేయించిన గుమ్మడొడియాలు కలిపిన వంకాయ-బంగాళాదుంప కూర, మామిడికాయ పప్పు, కొబ్బరికాయ తియ్య పచ్చడి, అల్లం పెరుగుపచ్చడి - ఇలాంటి పసందైన మెనూతో మా అమ్మ పెట్టిన బ్రహ్మాండమైన పెళ్లిరోజు భోజనంతో మాకు బ్రహ్మానందం కలిగింది. భోంచేసిం తర్వాత మన్-చాహే గీత్ వింటూ ఆ బహ్మానందాన్ని కంటిన్యూ చేస్తూ వున్నాము. ఇంతలో ఓ అబ్బాయి ఒక ప్యాకెట్టు పట్టుకుని "కామేశ్వరరావుగారు ఎవరండి ఇక్కడ?" అంటూ వచ్చాడు. నాన్న అప్పుడే భోంచేసి పడుక్కున్నారు. అదే చెప్తే ఆ అబ్బాయి "ఆయనకి ఓ కొరియర్ వచ్చిందండి. మీరు సంతకం చేసి తీసుకుంటారా?" అనడిగాడు. సరేనని నేను సంతకం పెట్టగానే తాను తెచ్చిన పాకెట్టు నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడా అబ్బాయి.

నాన్న మామూలుగానే రెండు గంటలకి లేచి అమ్మ పెట్టివ్వబోయే కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. నేనెళ్ళి "నాన్నా! మీకేదో కొరియర్ వచ్చింది" అంటూ ఆ పాకెట్టు చేతికందివ్వగానే "కొరియరా? నాకా? ఇప్పుడెవరు పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు?" అంటూనే దాన్ని విప్పి చూశారు. లోపల మంచి లేత రంగుల్లో గీసిన ఓ కొమ్మ మీద వాలిన రెండు పక్షి బొమ్మలున్న పెయింటింగ్ వుంది. అందులో ఒక గ్రీటింగ్ కార్డు - Wish you a very happy Wedding Anniversary - W. Besil అనుంది.

అది చూడగానే నాన్నకి అదెవరు పంపించారో అసలర్థం కాలేదు. ఆయనకి ఆ W. Besil అన్న పేరుతో ఫ్రెండ్స్ కానీ, తెల్సినవాళ్లు కానీ ఎవరూ లేరు. ఆయన ఎవరు పంపించారా అనాలోచిస్తూ, అసలా కొరియర్ ఎక్కణ్ణించి వచ్చిందో అని from address చూశారు. అక్కడ కూడా W. Besil  అన్న పేరు తప్ప ఇంటి నంబరూ అవేమీ లేవు. నాకూ అదెవరు పంపించారో అస్సలు ఊహించడానికి కూడా చేతకాలేదు.

ఆ రోజు మా నాన్న పడిన తికమక అచ్చు దాసరి వారి వరసలో పాటగా పాడుకోదగింది... (దీని అసలు పాట పట్టుకుని నాకు చెప్తారా? :) )

కొరియరు పోస్టులో... ఓ... ఓ... ఓ...హొయ్!
కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి
వాళ్ళు పంపారా? వీళ్ళు పంపారా?
నాకు వాళ్ళు పంపారా?
వీళ్ళు నాకు పంపారా?

అలా సరదా పాటలేవో రాసేశాను కానీ నాన్నలో అసహనం చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ రెండో రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చినప్పుడు నాన్న నెమ్మదిగా "అసలే ఆ తిరుపతి గొడవతో చాలా చిరాగ్గా వుంది నాకు. మధ్యలో ఈ బెసిల్ ఎవడో అర్థం కావట్లేదు. నేను రెండో లైనూ, మూడో లైనూ  మోటార్ సైకిల్ మీద రౌండ్లు వేసొచ్చాను. అదెవరు పంపించారో అంతు పట్టట్లేదు. వాడెవడో నాకు దొరికాడో వాడి సంగత్తేలుస్తాను" అనడం వినిపించింది.

నాకెందుకో మొదటిసారిగా ఇదేదో తిరిగి తిరిగి నా మీదకొచ్చేలా ఉందని అనిపించింది. ఆ W. Besil ఎవరో తెలిస్తే నాన్న కోపాన్ని ఆ బెసిల్ మీదకి తిప్పచ్చు అనుకున్నాను కూడా. కానీ ఎలా?  నాక్కొంచెం ఏదో జరగబోతోంది అన్న inkling, uneasiness.  కాకపోతే నేనకున్నట్టుగా ఏమీ జరిగిపోలేదు.

నేను బెంగుళూరుకి వెళ్ళే దాకా నాతో ఉందామని కుట్టి కూడా వైజాగ్ నుంచి వచ్చింది. అది వైజాగ్‌లో లలితత్తయ్య ఇంట్లో ఉండి కంప్యూటర్ కోర్సేదో చేస్తూ, బండారు చిట్టిబాబుగారి దగ్గర లలితసంగీతం నేర్చుకుంటూ వుంది. దాంతో ఉంటే కబుర్లకి కొదవేముంది?! దానికి తోడుగా పప్పి ఉంటే నవ్వులకి కొరతేముంది?!

ఓ రోజు మధ్యాహ్నం మేం ముగ్గురమే ఇంట్లో వున్నాం. నాన్న ఆఫీసుకి వెళ్తూ అమ్మకేదో పనుందని అమ్మాజీ ఆంటీ వాళ్ళింటి దగ్గర దింపి వెళ్లారు. నేను నా పుస్తకాలు పెట్టుకునే కిటికీ అర కింద కూర్చుని వున్నాను. నాకెదురుగుండా అద్దాల షెల్ఫుకి ఆనుకుని కుట్టి కూర్చుని వుంది. నా కుడిపక్కనున్న గోడకి అతికించి వున్న Boney-M పోస్టర్ కింద పప్పి కూర్చుని వుంది. ముగ్గురం ట్రయాంగులర్‌గాకూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ వున్నాము.

"మొన్నో రోజు నేను మోపెడ్ మీద వెళ్తుంటే బీచ్ రోడ్డు అప్పులో ఆగిపోయింది. తోసుకుంటూ వెళ్ళాను రాయుడు బాగ్‌కి. తల ప్రాణం తోకకొచ్చిందనుకో. మేడ మీంచి చూస్తూ సాయి ఒకటే నవ్వడం. సరిగ్గా టైంకి సతీష్ ఇంట్లో లేడేమో ఆ వెర్రికుక్క పార్థని కట్టేశారు. లేకపోతే దాని అరుపులకి ఆ తోకలో వున్న ప్రాణం కూడా పోయేది." వైజాగ్‌లో జరిగిందేదో తలపోసుకుంటూ వాపోతోంది కుట్టి.

"అద్సరే కానీ ... నీ కంప్యూటర్ కోర్స్ ఏంటి? ఎంతవరకూ వచ్చింది?" నా ఏరియా అదే కదా అందుకే ఆ ఆరా.

"ఏం కోర్సే లల్లెమ్మా! నాకసలే ఏసీ పడదు. చలేసేస్తూ ఉంటుంది. మొన్నోసారి ఇలాగే కంప్యూటర్ సెంటర్లో ఎవరూ లేరు. నేనొక్కదాన్నే వున్నాను. అటూఇటూ చూసి కాసేపు ఏసీ లేకపోతే ఇవేం పేలిపోవులే అన్జెప్పి ఏసీ మిషన్ పక్కనున్న ప్లగ్గు లాగేశా. మా ఇన్స్ట్రక్టరు లోపలికొచ్చి ఒకటే గొడవ - అది ఏసీ ప్లగ్గు కాదు - కంప్యూటర్లకి పవర్ సప్ప్లై అంటూ లబోదిబోమన్నాడు. నేనేం మాట్లాడకుండా నా పుస్తకాలు సర్దుకుని బండెక్కి ఇంటికొచ్చేశా. నాకూ ఆ కోర్సుకీ ఇంక రాం-రాం!"

అది చెప్పింది వింటూ అసలక్కడ జరిగింది ఊహించుకుంటూ చాలా సేపు నవ్వుకున్నాం. మామూలుగా ఓ పదినిముషాల తర్వాత ఇంకేదో టాపిక్ మొదలై వేరే విషయాలేవో మాట్లాడుకునేవాళ్ళం. కానీ కుట్టి, నేనూ ఆ కంప్యూటర్ సెంటర్లో అది చేసిన పని గురించి తల్చుకుని, తల్చుకుని నవ్వుతూనే వున్నాం. మా ఇద్దరికీ మధ్యలో కూర్చున్న పప్పి ఆపకుండా నవ్వుతున్న మా ఇద్దర్నీ చూసి "బాబోయ్! మీ ఇద్దరికీ ఇవాళ ఏదో అయ్యింది. నేను బయటికెళ్లి కూర్చుంటా. మీ నవ్వులయ్యాకే లోపలికొస్తా" అని పారిపోయింది.

రోజులలా మూడు కబుర్లు-ఆరు నవ్వులుగా జరిగిపోతున్నాయి.

ఈలోగా NAL నుంచి లెటర్ వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసం నేను పంపించిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేశామూ, ఆగస్టులో వచ్చి చేరమని. నాన్న నాకూ, అమ్మకీ, ఆయనకీ విజయవాడ నుంచి బెంగుళూరుకి ట్రెయిన్ టికెట్లు బుక్ చేశారు. మేం బయల్దేరే రోజు లోగా హైదరాబాదు నుంచి లక్ష్మి దొడ్డని రమ్మని చెప్పారు పప్పి, కుట్టీలకి తోడుగా ఉండేందుకు.

ఇంకో పది రోజుల్లో ప్రయాణం. ఆ రోజు పొద్దున్నించీ నాన్న కొంచెం సీరియస్‌గా వున్నారు. భోజనం దగ్గర కూడా ఏదో ఆలోచిస్తున్నట్లు మాట్లాడకుండా గబగబా తినేసి లేచేశారు. ఆ రోజు రాత్రి టీవీలో ఇంగ్లీష్ న్యూస్ అయిపోగానే అమ్మ కలిపిచ్చిన పాలు తాగి పడుకోబోతున్నాను. ఇంతలో నాన్న వాళ్ళ బెడ్రూం లోంచి "లల్లీ! ఓ సారిలా రా!" అన్నారు. నాతో పాటు అమ్మ కూడా వచ్చి, వస్తూనే బెడ్రూం తలుపు వేసేసింది. నాకెందుకో ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లంది - ఇవాళ ఏదో జరగబోతోంది అన్నట్లు.

అంతలోనే మళ్ళీ అనిపించింది - దీని కోసమే కదా ఎదురు చూస్తున్నానూ - అని. నాన్న నాతోనే డైరెక్టుగా మాట్లాడుదాం అనుకోవడం చాలా హాయిగా అనిపించింది. చిన్నప్పట్నుంచీ నన్ను ఏదైనా అడిగే అధికారం, నాకు చెప్పే అవకాశం ఇద్దరికే - అమ్మకి, నాన్నకి. కాకపోతే ఇప్పటిదాకా చెప్పించుకునే అవసరం కల్పించుకోలేదు నేను - నేనాడింది ఆట, పాడింది పాటగానే సాగింది ఇప్పటిదాకా. ఇప్పుడింక తప్పదు. నాన్న నా గురించి ఎంత కోపాన్ని ఆపుకుంటున్నారో, అమ్మ ఎంత బాధ పడుతోందో నాకు తెలుస్తూనే వుంది - కానీ ... నేనేం వాళ్ళని కాదని వెళ్ళబోవట్లేదుగా! వాళ్ళని ఎలా అయినా ఒప్పించగలననే నా నమ్మకం. కానీ...ఎలా? ఆలోచన సాగుతూనే వుంది.

"ఇలా మంచం మీద కూర్చో" అంటూ తన పక్కన చోటు చూపించారు నాన్న.

తరగడ కానుకుని ఆయనకెదురుగా కూర్చున్నాను.

"ఆ తిరుపతి అబ్బాయి - అదే బదరి - ఇప్పుడెక్కడున్నాడు అతను? ఏం చేస్తున్నాడు?"

హమ్మయ్య! కొంచెం సామరస్యంగానే మాట్లాడుతున్నారు నాన్న. కొంచెం ధైర్యంగా అనిపించింది.

"తన MBA అయిపోయింది. ఉద్యోగం కోసం చూస్తున్నారు." అని నా సమాధానం.

"ఆహా..." నాన్నేదో ఆలోచిస్తున్నారు.

నేను అంతటితో ఆపొచ్చుగా! ఉహూ... నాన్న అంత నెమ్మదిగా ఉండడం చూసి ఉత్సాహ పడ్డా!

"అదే నాన్నా! మీరన్నారట కదా తిరుపతిలో కలిసినప్పుడు... ఇంకా చదువు పూర్తి కాలేదు, ఉద్యోగం సద్యోగం లేదు, మా లల్లి వెంట పడుతున్నావెందుకు? - అని. అందుకని ఉద్యోగం వచ్చాకే మిమ్మల్ని కలుస్తానన్నారు." గుక్క తిప్పుకోకుండా అనేశా.

అది వినగానే నాన్న వెంటనే "నేనన్నది అలా అర్థమయ్యిందా? తిరుపతి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి క్లియర్‌గా చెప్పాను ఇల్లాంటివేవీ కుదరవని. నీకూ అర్థమయ్యిందనుకుంటాను."

"... .... ... "

"నువ్వు నా మాట వింటానంటే మన వాళ్లలో  ఇంజినీర్లు, డాక్టర్లు బోల్డు మంది వున్నారు. నీకెవరిష్టమౌతారో చూద్దాం. వాళ్ళతోనే నీ పెళ్లి. నీకిష్టం లేకుండా ఏదీ జరగదు. కావాలంటే ఐఏఎస్ కూడా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం.  ఏదైనా నీక్కావల్సినట్టే చేద్దాం." నాన్న చాలా అనునయంగా చెప్తున్నా - ఇంకాస్సేపట్లో జటాజూటాన్ని విప్పబోయే - లుంగీ,చొక్కా వేసుకున్న తాండవ-శివుళ్లా చెప్తున్నారు.

".... ... ..."

అమ్మక్కోపం వచ్చేసింది. "ఏంటి? నాన్న అంతడుగుతుంటే ఏమ్మాట్లాడవ్? సమాధానం చెప్పు!" గద్దించింది.

అమ్మ కేసి చూడకుండా "నాన్నా! తనంటే నాకిష్టం. తనతో ఉంటే నాకు మీతోనూ, అమ్మతోనూ వున్నట్లే ఉంటుంది. మీకు తెలుసా? నాకు బస్సు పడదు కదా! నాకోసారి తిరుపతిలో బస్సు దిగగానే వామిటింగ్ అయితే తనసలు విసుక్కోకుండా గబగబా వెళ్ళి షోడా తెచ్చి నా మొహం కడిగారు - అచ్చు అమ్మలాగే!  మొన్నా మధ్య తిరుపతిలో ఎవరో అబ్బాయిలు నా విషయంలో గొడవ చేస్తే బదరి, తన ఫ్రెండ్స్ వాళ్ళని బెదిరించి ఇంకెప్పుడూ నా వెంట పడకుండా చేశారు కూడా. నేనంటే తనకి కూడా చాలా ఇష్టం." అని బోల్డు convincing గా మాట్లాడుతున్నానూ అనుకుంటూ గబగబా చెప్పేశాను.

నా మాటలు వింటున్న నాన్నకి  ఆ సమయంలో వచ్చిన కోపాన్ని అంత ఆపుకోగలిగారంటే అది కచ్చితంగా మా అమ్మ వల్లే! ఆవిడ నాన్నని మా ఈ సంభాషణకి ముందు ఎంతగా ప్రిపేర్ చేసి ఉంటుందో! కానీ నా మాటలు వినగానే అమ్మకి అప్పటివరకూ ఆపుకున్న బాధ, కోపం బయటికి వచ్చేశాయి.

"నీకు అమ్మా-బాబూ అని చెప్తే అర్థం అయ్యేలా లేదు. నీకో సంగత్తెలుసా? ఆ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువట. వాళ్ళింటి ముందే మన మణి ఆంటీ వాళ్ళున్నారు. వాళ్ళు చెప్పారు. చూడబోతే ఆ అబ్బాయి అంత మంచివాళ్ళా లేడు" మా అమ్మ ఆవిడ చేసిన డిటెక్షన్ బైట పెట్టేసింది.

సరే! అది మా అమ్మ నాకు చెప్పాలా? SBM బిజ్-బీమ్ అని జరిగిన ఎంబీఏ వాళ్ళ ఇంటర్-కాలేజియేట్ మీట్ కోసమని వచ్చి బదరికి ఉత్తరాలు రాసిన హైదరాబాదు అమ్మాయి గురించీ, తను కనిపిస్తేనే కళ్ళు మెరిసే అమ్మాయిల గురించీ, తను మాట్లాడితే మెలికలు తిరిగే అమ్మాయిల గురించీ, మేమిద్దరం కలిసి కనిపించినప్పుడు తనతో మాత్రం మాట్లాడి నన్ను చూసి మొహం తిప్పుకునే అమ్మాయిల గురించీ చెబ్దామనుకుని అమ్మ కోపం ఇంకా పెంచడమెందుకని ఊరుకున్నాను.

ఇంతలో నాన్న "చెప్పు లల్లీ! ఏమాలోచిస్తున్నావ్? నీ తర్వాత ఇంకా ఇద్దరున్నారు నాకు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నీ ఇష్టమొచ్చినట్లు చేస్తే తర్వాత్తర్వాత మాకెంత ఇబ్బంది అవుతుందో నీకసలేమైనా అర్థమౌతోందా,  లేదా?" అని కొంచెం గట్టిగానే అడిగారు. అంతకు ముందు తిరుపతిలో వున్నప్పుడు బెంగుళూరు నుంచి కిరణ్‌ని రమ్మని పప్పి గురించి మాట్లాడానని, నా వల్ల ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది కలక్కుండా వుండాలని నేనూ ఆలోచిస్తున్నానని చెబ్దామనుకుని మళ్ళీ ఒద్దులే అని ఊరుకున్నాను.

నాన్న అలా గట్టిగా మాట్లాడగానే - ఆశ్చర్యం! ఇదే ఇంకో ఇంకో విషయంలో అయితే వెంటనే ఏడ్చేసి నాకున్న అమృతవర్షిణి అన్న పేరుని సార్థకం చేసుకుని ఉండేదాన్ని - కానీ ఇప్పుడు చాలా స్థిరంగా, నాన్న కేసి చూస్తూ "నాన్నా! మీకు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చెయ్యను. మీరు వద్దంటే నాకిష్టమున్న పని మానేస్తాను కానీ నాకిష్టం లేని పని చెయ్యమని మాత్రం నన్నడక్కండి" అని చెప్పి ఆపాను. (నేనూ, అపర్ణ ఎప్పుడూ అనుకునేవాళ్ళం - మా ఇద్దరికీ శంతనుడికి షరతులు పెట్టిన గంగ ఆదర్శం అని. ఎక్కడో sub-conscious లో వున్న ఆ ఆలోచన నన్ను మా నాన్నతో అలా మాట్లాడేలా చేసింది.)

అది వినగానే ఇంక నాన్న ఏం మాట్లాడలేదు. అమ్మకి మాత్రం చా...లా కోపం వచ్చింది. "నువ్వెంత రాయిలా తయారయ్యావు? ఇంతలేసి మాటలంటున్నా అసలు నీ కంట్లో నీళ్ళే రావేం? ఎంత sensitive, delicate అనుకున్నాను నీ గురించి?? గోముఖవ్యాఘ్రానివి!" అని తిట్టేసింది. నన్ను మా అమ్మ తిట్టిన అతి పెద్ద తిట్టు అదే :))

కనురెప్పల కీవల చనవైన ఆ రూపు
గురుతుగా కమ్మిన చిరునవ్వుల తలపు
కనుపాపలకి అండయై వుండగ కాపు 
నీరెలా పొరలు దాటి ఆ కంటి అదుపు?

నాకెందుకు ఏడుపు రావట్లేదో నన్ను నేనే అడిగిన ప్రశ్నకి నాకు నాకే సమాధానం దొరికేసింది. మా అమ్మకీ చెబ్దామనుకుని అసలే మాట వినట్లేదని నా మీద కోపంగా వుంది, కవితలు కూడా పాడతావా అని తిట్టడానికి సంస్కృతంలో ఏమీ గుర్తు రాక తెలుగులో తిడితే ఆ తిట్ల సౌండ్ నాకు నచ్చకపోవచ్చు. ఈ మాత్త్రం మర్యాద దక్కింది చాలు అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాను.

నేనలా ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి అమ్మ నాన్నతో కోపంగా "దీనికి చెప్పి లాభం లేదు. చూడబోతే ఆ అబ్బాయే మంచివాడిలా వున్నాడు. నేవెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పిల్లాడికి నచ్చ చెప్పుకోమని చెప్తాను." అనేసి నాకేసి తిరిగి "ఇవాళ్టికిక్కడే పడుకో1" అని కసిరింది.

నేను వెంటనే అమ్మ పక్కనే ఓ పక్కకి తిరిగి మంచం అంచుకి జరిగి - ఇవాళ్టికి ఇవాళ బానే గడిచింది. రేపెప్పుడూ ఉంటుంది - బావుంటుంది - అని రోజూ లాగే అనుకుని "ఇంతకీ బదరి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అని ఇంకో ఆర్నెల్ల దాకా - అంటే నా ప్రాజెక్టు అయిపోయే దాకా ఆలోచించను" అని నాకు నేను చెప్పుకుని పడుకున్నాను.



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

12, మే 2019, ఆదివారం

Oh Boy! నీ గల్లీలో bullyల్లేరోయ్!

గల్లీ బోయ్!
కాదండి వీడు సిల్లీ బోయ్!
కానే కాదండి వీడేమీ బుల్లీ బోయ్!
పేరట వీడిది మురాద్
Rap పాటట వీడికి మురాద్
చదివేది మామూలు డిగ్రీ
వుంటారు దోస్తులు జిగ్రీ

తల్లేమో helpless
వంటింటిని వీడదు ఈ మానిని 
సొంతింటిలో ఉండడమే ఓ మెహర్బానీ

తండ్రేమో thoughtless
ఇంటికి తెస్తాడో నయీ మా ని
బిన్ బులాయీ మెహమాన్ ని

మురాద్‌కి వున్నాడో ఛోటా భాయీ
వాడు ఉలకడం పలకడం వినం
ఆ ఇంట్లో ఇంకో మనిషి బూఢీ దాదీ
ఈవిడ కానే కాదు కథకి అదనం

వీళ్లందరిదీ కలదొక వాడట మురికిది 
ముంబైలో ప్రముఖమైన స్లమ్మట అది
దాని పేరట ధారవి

సల్మాన్, మొయీన్ మురాద్‌కి స్నేహితులండి
సాయానికి వీరెప్పుడు రెడీ అండి
డబ్బుల్లేవంటే అడగండి మొయీన్ని
కారెవరిదైనా సరే! తాళం కోసేస్తాడు
దాన్నట్టుకొచ్చేస్తాడు వున్న పళాన్ని
మొయీన్ దగ్గర వుంటారు పిల్లలు
నింపేస్తుంటారు గంజాయి సంచులు
తప్పేదైనా చేసేస్తాడు, చేయిస్తాడు మొయీన్
తను బతుకుతూ, తన పిల్లల్ని బతికించాలంటే 
అలా చేయక తప్పదంటాడు మొయీన్
కొంచెం తేడా అయినా నచ్చేశాడు మొయీన్

హీరోకి  హీరోయిన్ సఫీనా ఫిరదౌసి
అవుతుందట డాక్టర్ చదివేసి
ఇది నిజంగా ఓ cute బుల్లి రాకాసి
ఎవరైనా చూశారో హీరో కేసి
కొట్టేస్తుంది వాళ్ళని అమాంతం మీదకి దూకేసి
సీసాలు బద్దలు కొట్టేసి
తల మీద కొట్టేసి
మురాద్ అడిగితే చెప్పమని ఇంకెప్పుడూ ఆలా కొట్టేయనని ఒట్టేసి
నవ్వేస్తుంది ఓరగా చూసేసి
ఓ చిరునవ్వు దూసేసి
ఎందుకనవసరంగా చస్తావనేసి 
అమ్మా-నాన్నా పెళ్లి చేస్తామంటే సంబంధం చూసేసి
సల్మాన్ని బెదిరిస్తుంది నిన్నే చేసుకుంటాననేసి
దెబ్బకి వాడు పారిపోతాడు హడలి పోయేసి
ఈ పిల్ల ఫిరదౌసి
కనుబొమలెగరేసి
సొట్టబుగ్గల నవ్వులు విసిరేసి
మురిపించేసింది మనసు దోచేసి

ఇందులో వున్నాడో rap స్టార్
వాడే M. C. షేర్
వాడికి వుందో దిల్ మహా more
మురాద్‌కి ఇస్తాడు ఊపు బార్-బార్
Off-screen పేరట సిద్ధాంత్ చతుర్వేదీ!
On-screen నటనతో మెరిపించే పరుసవేది 
వీడి యాక్టింగుకి పెట్టలేం వంకేదీ. 
వీడికిదే మొదటి సినిమా అంటే ఎలా నమ్మేదీ?
ఎలా నిను కనిపెట్టిందో ఆ జోయా అఖ్తర్!?
నటనలో ease తో అయిపోయావ్ జన-మన-చిత్‌చోర్!

జోయా అఖ్తర్!
బార్-బార్ నీకు జోహార్!
ఎందుకూ?...అంటే....

Situation demand చేసిందీ అంటూ....


హీరో రణ్‌వీర్ సింగుకి చివరాఖరి rap పోటీల సీనులో కూడా బ్రాండెడ్ బట్టలేయనందుకు...

హీరో చేత తన అమ్మని బాధ పెడుతున్న నాన్నని పల్లెత్తు మాట కూడా అనిపించనందుకు...

తనకి నచ్చని పనిచేసిన నాన్నని చూపించి తల్లిని "మా బాబుని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా?" అడిగించనందుకు...

బాత్రూంలో హీరో-హీరోయిన్ను కలుసుకున్న సందర్భాన్ని అసందర్భమైన ఏ shower కింద పాటకో వాడుకోనందుకు...

తండ్రి కన్నా వయసులో చాలా చిన్నదిగా అనిపించిన కొత్త పినతల్లికి హీరో మీద కలిగిన అభిమానాన్ని rap పాటకే పరిమితం చేయక లేనిపోని చెత్తగా మార్చనందుకు...

హీరోయిన్ అలియా భట్టుకి అక్కర్లేని డిజైనర్ డ్రెస్సులు వేయనందుకు...

హీరో-హీరోయిన్లని ఏ స్విజ్జర్లాండో పట్టుకెళ్లి డాన్సాడించనందుకు...


జోయా అఖ్తర్!
బార్-బార్ నీకు జోహార్!
ఎందుకూ?...అంటే....  
నీ సినిమాలో...

సరైన బట్టలు కూడా కొనుక్కోలేని హీరో ఇంటిని  ఏ బీచ్ ఒడ్డునో కళాత్మకంగా చూపించనదుకు...

కార్ డ్రైవర్ ఐన హీరో మామూలు కార్ డ్రైవర్ లాగే ఒదిగున్నందుకు...

ఒంటి వేలుతో సెక్యూరిటీ గార్డ్ పొమ్మని సైగ చేస్తే, హీరో వాణ్ణి గాల్లో కెగిరి తన్ని ఏడు సముద్రాలవతల పడేయకుండా నోర్మూసుకుని కార్లో కొచ్చి కూర్చుని ఆ గుండె మంటతో rap పాడుకున్నందుకు...

కార్లో వెనక కూర్చుని ఏడుస్తున్న కార్ ఓనర్ కూతుర్ని గుండెకి హత్తుకుని, పాట పాడి ఓదార్చకుండా అచ్చు ఓ కార్ డ్రైవర్ లాగే మనసులోనే బాధపడుతున్నా పైకి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినందుకు...

హీరో తనకెదురైన ప్రతి అవమానాన్ని తనకిష్టమైన rap పాటలో గెలుపుకి ఉపయోగించుకున్న తపనని చూపినందుకు...

అసలూ ... తొమ్మిదేళ్లుగా successful హీరో ఐన రణ్‌వీర్ సింగ్ తనకి introduction song పెట్టకుండా ఏ పేరూ-ఊరూ లేని సిద్దాంత్ చతుర్వేదికి పెట్టినా ఉక్రోషపడనందుకు...

తనే హీరో అయినా  రణ్‌వీర్ సింగ్ సిద్దాంత్ చతుర్వేదిని అనుసరిస్తున్నట్టు, అతనికి తాను mentee అయినట్టు మాట విన్నట్లు నటించినందుకు...

సినిమా మొదలైందగ్గర్నుంచీ మిత్రలాభాన్నే చూపించినందుకు - మనుషుల్లో మంచితనాన్నే చూపించినందుకు...

Oh Boy! నీ గల్లీలో bullyల్లేరోయ్! - అనిపించినందుకు...

సినిమాలు చూసి చెడిపోతారన్నదే నిజమైతే - ఈ సినిమా చూసి బాగు పడొచ్చు...
ఇందులో కల వుంది
కలని అందుకోవడానికి పరుగుంది
కలని అందుకునే పరుగులో నేస్తాల తోడుంది
కలని గెలిచిన హీరో తనవారికి పంచిన ప్రేముంది.

అన్నట్టు ఈ సినిమాలో rap పాటలన్నీ ఓ ఎత్తైతే ...
జీవితంలో ఇష్టంగా చేయాలనుకున్నది ఏదైనా సరే
ఆ ఇష్టమేదో కనుగొని
ఆ కనుగొన్న ఇష్టాన్ని ఇష్టంగా కలగని
ఆ కలని కళ్ళలో నింపుకుని
కన్న కలని అందుకుని
ఆ కలని జీవించడంలో వున్న మజాని  చూపించిన ఓ అందమైన పాట - నాకు భలే నచ్చేసిన పాట - జీనే మే ఆయే మజా!

ఇస్‌కో సున్‌నే భీ హై మజా! 
~ సినీ-మా-లక్ష్మి  





తరాజూ కే బస్ దో థాల్ హై
ఏక్ ఓర్ హమ్ దూజే మే ఖ్వాబ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా

ఖరీదా నహీ జాతా ఖ్వాబ్ హై
కిరాయా భీ ఐసా లాజవాబ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా

తూ జో మిలా జాగా ఖ్వాబ్ హై
ఖోయీ హుయీ మేరీ కితాబ్ హై
ముస్కాయా సా ఆదాబ్ హై
జీనే మే ఆ హై మజా

సుస్తాయే మౌసమ్ ఆబాద్ హై
హవావోం కే రుఖ్ హమ్ సే నారాజ్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా

తూ జో మిలా చిడా సాజ్ హై
ఖామోషీ కో మిలీ ఆవాజ్ హై
బెహ్‌తీ హవా సా ఎహ్‌సాస్ హై
జీనే మే ఆ హై మజా

బిగ్‌డా  హువా హిసాబ్ హై
థోడా నఫా థోడా నుక్‌సాన్ హై
జిందగీ యే పరేషాన్ హై
గనీమత్ హై తూ హై యహా
జీనే మే ఆ హై మజా




5, మే 2019, ఆదివారం

నే...డ్డే చదవండి - 5 - అద్దాలమేడ



అనగనగా...  ఓ కథల-కమామీషుల చిత్రవాడ 
కనుగొనగా - మెరిసెనట అందులో ఓ అద్దాలమేడ 
ఆ మేడ నుందురట తళుకుబెళుకు తారలు 
ఆ తారల కబురందించిరట దాసరివారలు 

ఆ వాడల  - మెరిసిన మేడల నున్న తారల కబురుల - దాసరి వారి కథలు... 

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
మే నెల సంచికలో...
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: మే నెల సరదా సిన్మాయణం
 
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు
 
 



28, ఏప్రిల్ 2019, ఆదివారం

వీడ్కొలుపు ఓ వేడుకే!

ఏదో ఒక కొలువుని అంటిపెట్టుకుని కాకుండా
ఇచ్ఛామాత్రంగా పని చేసేటప్పుడు,
ఆ చేసే చోట వ్యవహారకర్తలు మారినప్పుడు,
ఆ మార్పు ఒక్కోసారి లాభసాటిగా ఉన్నా ఉండకపోయినా ఫర్వాలేదు. 
కానీ అప్పటికి వున్న స్థితిని, పరిస్థితిని తగ్గించేదిగా వుండకూడదు.
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆర్థికంగా కొంచెం తగ్గినా సహించొచ్చు.
కానీ హార్దికంగా లోటుంటే ఆ చోటున ఇంకా ఉండడం సాధ్యం కాదు.

అదిగో అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు -
ఇక్కణ్ణుంచి ఎంత తొందరగా బయట పడదామా! - అని ఒక్కసారి అనిపించినప్పుడు
మన మనుగడకి మన్ననైన ఇంకో దారేదన్నా ఉందా అని వెతుకుతున్నప్పడు
అప్పటివరకూ అటూ ఇటూ ఊగిసలాడుతూ 
చేతికందక వున్న ఆదరువేదో
తనంతట తానే చేతికి చిక్కితే
ఇంకంతకన్నా కావాల్సిందేంటి?
ఉన్నపళాన ఎగిరి అందుకోవాల్సిందే! 
ఉన్న చోట కొలువుకి సెలవు చెప్పి 
విలువ లేమి వున్న తావు వీడి
చెలిమి పూతావుల చెలువొందు నెలవుల కొలువుల కేగాల్సిందే!

ఈ నెలలో బదరికి అలాంటి పరిస్థితే వచ్చింది. ఎప్పట్నుంచో చేస్తున్న ప్రాజెక్టు వదలాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ కాకుండా వేరే చోటెక్కడైనా సరే వెళ్ళిపోదాం అనుకోగానే, అనుకోకుండా, కోరుకున్న చోట కొత్త ప్రాజెక్ట్ దొరికింది. ప్రస్తుతానికి చేస్తున్న చోట ఏప్రిల్ 19న వదిలేస్తున్నానంటూ రెండువారాల నోటీసు ఇవ్వడమూ అయ్యింది. అదొక టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయ్యింది. దాంతో పాటు వీడ్కొలుపు సన్నాహమూ మొదలయ్యింది.

వీడ్కొలుపు నోటీసులో మొదటివారం బదరి తన టీము పది-పదిహేను మందితో కలిసి లంచ్‌కి వెళ్లారు. అందులో ఎంప్లాయిస్, కన్సల్టెంట్స్ అందరూ ఉండడంతో బిల్లు ఎవ్వరివ్వాలీ అనే గందరగోళం రానే వస్తుందని ఊహించి, వాళ్ళందరూ ఇంకా భోంచేస్తుండగానే బదరి నెమ్మదిగా లేచెళ్ళి అందరి బదులూ తనే బిల్లు కట్టేశారు. తీరా అందరూ ఎవరి చెక్కులు వాళ్ళు తెమ్మని అడిగే సమయానికి రెస్టరెంట్ వాళ్ళు బదరి ఇచ్చేశారని చెప్పగానే అందరూ తెగ ఆశ్చర్యపోయి బదరికి థాంక్స్ చెప్పారు.

అక్కడినుంచి తిరిగొస్తూ వుండగా బదరితో పాటు తన ఫ్రెండ్ డీన్, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలిసి కార్లో హోటల్‌కి వస్తూ ఉండగా, ఆ ఇద్దర్లో ఒకబ్బాయి అడిగాడట: "మేమందరం మీకు ఫేర్‌వెల్ లంచ్ అని వస్తే మా అందరికీ మీరు పే చేశారేంటి?" అని. అది వినగానే "అక్కడ మనతో పాటు చాలా మంది లోకల్ వాళ్ళు వున్నారు. వాళ్ళకి మన ట్రావెలర్స్‌కి ఇచ్చినట్లుగా  Per Diem ఇవ్వరు. వాళ్లకి ఇబ్బంది కలక్కుండా వుండాలని అలా చేశాను." అంటూ బదరి అన్న మాటలు విని ముందు సీట్లో కూర్చున్న డీన్ వెనక్కి తిరిగి "I still have a lot to learn" అనడం బదరికొక వీడ్కొలుపు-బహుమతి డీన్ నుంచి. 

ఇక  ఏప్రిల్ 14 నుంచి 18 వరకూ బోల్డన్ని వీడ్కొలుపు లంచులూ, డిన్నర్లూ.  అంతా కోలాహలంగా జరిగిపోతోంది. ఆ విశేషాలు ఫోన్లో వింటూ నేనూ ఆనందిస్తున్నాను.

ఏప్రిల్ 16న బదరి నుంచి నాకొక ఫోటో - ఒక ఆకుపచ్చ రంగు గిఫ్ట్ పాక్ పట్టుకున్నట్టు, దాంతో పాటు ఓ  టెక్స్ట్ మెసేజ్ : Surprise gift from Sheraton guys with many hugs. Can't still believe it. Wondering if I really deserve all this - అంటూ.




ఏంటీ సంగతి అనడిగితే తను సాయంత్రం ఆఫీస్ నుంచి హోటల్ రూంకి వెళ్తూ ఉంటే వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ హోటల్ ఫ్రంట్-డెస్క్ దగ్గర పని చేసే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ తన దగ్గరకొచ్చి "We are going to msiss you" అంటూ చాలా ఆత్మీయంగా కౌగిలించుకుని వీడ్కోలుపు శుభకామనలు తెలిపారట. వాళ్లందరికీ థాంక్స్ చెప్పి తన రూంకి వెళ్లిన బదరికి అక్కడ ఇంకో పెద్ద ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ఏంటీ అంటే...


ప్రతిరోజూ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి హోటల్ రూంకి వచ్చేటప్పుడు ఫ్రంట్-డెస్క్ దగ్గర పనిచేసే అమ్మాయిలు, అబ్బాయిలు గెస్టులతో బిజీగా లేకుండా, వాళ్ళేదో తలొంచుకుని పని చేసుకునే వేళ వాళ్ళని దూరం నించే పేరు పెట్టి పిలిచి మరీ పలకరించడం బదరికి అలవాటు. ఆ అలవాటు తనకి బోల్డంత ఇష్టాన్ని, అభిమానాన్ని సంపాదించి పెట్టింది ఆ హోటల్ స్టాఫ్ నుంచి.

ఇదొక ఎత్తైతే తండూరిఫ్లేమ్స్ అనే రెస్టరెంట్‌లో జరిగింది ఇంకో ఎత్తు.

తండూరిఫ్లేమ్స్ బదరికి ఇష్టమైన ఒక రెస్టరెంట్‌. ఎప్పుడూ చెప్తూ ఉండేవారు - అక్కడ భోజనమే కాదు సెర్వింగ్  కూడా చాలా ప్రొఫెషనల్‌గా బావుంటుంది అని. ఇంక ఆ ప్లేస్ వదిలేసే ముందు ఒకసారి లంచ్ చేద్దామని అక్కడికి వెళ్లారు బదరి & టీం. వెళ్ళినప్పుడు మామూలుగా అక్కడ పని చేసే ఒకతనికి తను ప్రాజెక్టు మారుతున్నానని, వచ్చేవారం నుంచి రానని చెప్పారట బదరి.

బదరి, తనతో వెళ్ళిన వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. ఇంకొక్కరొక్కరుగా వెళ్లి బిల్ చేద్దామనుకుని ముందు డీన్ వెళ్ళగానే ఆ రెస్టరెంట్ అతను "Please be seated, Sir! We have a surprise for Badari Sir" అనగానే డీన్ గప్‌చుప్‌గా వచ్చేసి తన సీట్లో కూర్చుండిపోయాడు.

ఈ లోగా అందరివీ భోజనాలు ఐపోయాయి. అప్పుడు రెస్టరెంట్ అతను ఒక కేక్, ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టగానే బదరి టేబుల్ దగ్గర అందరూ చప్పట్లు కొట్టారట. పైగా ఏదో మ్యూజిక్ చాలా హై వాల్యూమ్లో ప్లే చేశారట. అది చూసి రెస్టరెంట్‌లో మిగిలిన టేబుల్స్ దగ్గర వున్న వాళ్ళందరూ లేచొచ్చి బదరికి "Happy Birthday" అని చెప్తుంటే బదరి నవ్వి "ఇవాళ నా పుట్టినరోజు కాదు, నాకు Farewell పార్టీ ఇది" అనగానే అందరూ "Farewell ఇలా కూడా చేస్తారా? మేమెప్పుడూ చూడలేదు, వినలేదు" అని బోల్డు ఆశ్చర్యపోయి బదరికి బెస్ట్ విషెస్ చెప్పారట.

బదరికి అది first-time-in-life-kind-of-thrill. చాలా చాలా సంతోషించారు. అదంతా అయి బయటికి రాగానే కెన్ హారిసన్ అనే కొలీగ్ బదరి దగ్గర కొచ్చి "ఇందాక లోపల వాళ్ళు ప్లే చేసిన పాటేమిటో తెలుసా?" అనడిగితే, బదరి తను సరిగ్గా వినలేదు అని చెప్తే, దానికి కెన్ సమాధానం "అది Farewell to you My Friends !" అంటూ. 

ఇప్పుడు వెళ్లబోయే నిన్నాపం
నీపై అలగబోం
ఇంకెప్పుడిటు రాకని అననే అనం
నీ చోటెవ్వరికీ ఇవ్వబోం
నీ మనసు మళ్ళి,
మళ్ళెప్పుడైనా ఇటొస్తున్నానని కబురంపితే చాలు
మన్నననిస్తాం...
మనవాడు మన కోసమే వచ్చాడనుకుంటాం 

- అంటూ ఎంతో అభిమానంగా వీడ్కొలుపు తెలిపారు బదరికి అందరూ.

కొసమెరుపు:

ఇంటికొచ్చి బదరి ఈ విశేషాలన్నీ చెప్తుంటే, సంబరంగా వింటున్న నాకు, బుజ్జిజింకకి, సెలవు పెట్టి ఇంటికొచ్చిన అన్నజింకకి - బదరి నేర్పిన ఓ కొత్త పాఠం: If  people are doing something good for you when they don't have to, that is because of thier goodness, but not your greatness. 

అది వినగానే బుజ్జిజింక "నాన్నగారూ! This sounds like a Reader's Digest quote!" అంటూ తెగ మురిసిపోయాడు.

ఇంకొసమెరుపు (దిష్టిచుక్కలా):

ఇంతా జరుగుతుంటే - ఇంతటి ఇష్టాన్ని వదిలెళ్ళే కష్టం కలవరపెడుతుంటే - అది తేల్చెయ్యడానికీ, మనసారా నవ్వుకుని తేలిక పడ్డానికా అన్నట్టు ఒక అనుమానచక్రవర్తి "ఈ ఫేర్‌వెల్ హడావిడి చూస్తుంటే looks like people are happy that you are leaving!"  అంటూ సందేహ పడ్డాడట.

ఈ మాటా పైన చెప్పిన అన్ని మాటల్లాగే వెలుగుతున్న నవ్వుతో చెప్పారు బదరి.
ఇది వినగానే - ఇంట్లో అందరం - That's another way to look at it - అనుకున్నాం. 
ఫక్కున నవ్వుకున్నాం...



19, ఏప్రిల్ 2019, శుక్రవారం

త్వామనురజామి - 35 - భలే భలే మంచి రోజులులే! మళ్ళీమళ్ళీ ఇక రావులే!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 34 - చేతిలో చెయ్యేసి చెప్పుకున్నాం...

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చిట్టచివరి రోజులు.

అందులో గుర్తుండీ ఉండనట్టున్న కొన్ని విశేషాలు...

నేను స్టేజ్ అలంకరించి, ఆర్గనైజ్ చేసిన ఆఖరి SPIC-MACAY కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో జరిగిన గోట్టు (చిత్రవీణ) రవికిరణ్‌ది.

మాకు మా జూనియర్స్ ఇచ్చిన ఫేర్‌వెల్ పార్టీ. అది మా CC (Computer Centre) లోనే జరిగింది. అదే టైంకి బదరిని చూడడానికని తన చిన్ననాటి ఫ్రెండ్ అనిల్ వచ్చారు తిరుపతికి. మాకు ఫేర్‌వెల్ జరిగే రోజునే అనిల్ బదరితో కలిసి మా హాస్టల్‌కి వచ్చారు నన్ను పలకరించడానికి. వాళ్ళిద్దరితో కలిసిపద్మావతి కాలేజ్ మీదుగా నడిచి బోల్డు చుట్టూ తిరిగి మా CC కి వెళ్ళాను. అసలే ఎండాకాలపు ఎర్రటెండ - అందులో మళ్ళీ కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆరెంజ్ కలర్ చీర, దాని మీద రంగురంగుల నల్ల చికెన్ వాయిల్ బ్లౌజ్. నాకస్సలు నచ్చలేదు నా కాషాయాంబరం - కానీ ఆ రోజుకి చేతికందినదదే - ఇంకోటి వెతికి కట్టుకోవడానికి ఓపికే లేనిదే!

ఆ తర్వాత ఇంకోటేంటంటే మా కాలేజ్ ఏనివర్సరీ. ఆ రోజు ప్రత్యేకతలు మా క్లాసు-కోకిల ఉమాదేవి పాడిన జోలా ...జోలమ్మ జోలా (సినిమా-సూత్రధారుల్లో రమ్యకృష్ణ నీలం రంగు చొక్కాతో డాన్సాడి పాడిన పాటది) పాట, మా క్లాసు-నెమలి నిరుపమ ఆడిన యూనిటీ ఇన్ డైవర్సిటీ థీమ్ బాలేలో రాజస్థానీ ఆట - అటు పిమ్మట మా లెక్చరర్ స్టాఫుతో మేమందరం తీయించుకున్న కుఠో - ఆ కుఠో కోసం నే కట్టుకున్న పసుప్పచ్చని షిఫాన్ చీర, దానిమీద వేసుకున్న అంతే పసుప్పచ్చని నల్లదారాల అద్దాల బ్లౌజ్.

ఇంటర్నల్స్, మెయిన్ ఎగ్జామ్స్ అంటూ తెగ హడావిడి. పరీక్షలప్పుడు మాత్రమే దొరికే స్పెషల్ టీ. దాన్ని తాగి పడుకోవడం నా స్పెషాలిటీ. హఠాత్తుగా ఓ రోజు అసలీ మధ్య పుస్తకమే పట్టలేదు ఒకసారి చదువుదాం అనుకుని - అసలు స్టడీకే చాన్సు లేదు, అందులో మళ్ళీ కంబైన్డ్ స్టడీ అంటూ మా హాస్టల్ ముందు ఎండి-ఇసుక దేరిన కాలవలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ చుర్రుమనే వేళ కూర్చుని మా క్లాసమ్మాయి సునీలతో చదవబోయిన ఒక్కటంటే ఒక్క చాఫ్టరు. దాంతో సునీలకి తెలిసొచ్చిన నా కుదురులేని తనం ప్లస్ నా un-చదువరితనం. దాంతర్వాత డోంట్-కమ్-బైండు, మైండ్-యువరోన్-స్టడీసే అన్నట్లు ఎవరికి వారే-ఇసుక ఏటి తీరే!

ఇంతలో సిక్స్త్ సెమ్ ప్రాజెక్టు కోసమని అప్లికేషన్లు, కవరింగ్ లెటర్లూ రాసుకోండని సంధ్యా మేడం ఇచ్చిన అడ్రెస్సులు బోల్డన్ని. నాకందులో నచ్చింది, నే ఫేవరింగ్‌గా కవరింగ్ లెటర్ రాసింది మాత్రం ఒకే ఒక్క ఎడ్రెస్సుకి - మిస్టర్ ఎమ్మార్ నరసింహ స్వామి (హెడ్, టెక్నికల్ సెక్రటేరియట్), నేషనల్ ఏరోనాటికల్ లేబొరేటరీ, బెంగళూరు. అందులో నా గైడు కృష్ణన్ గారు, ALD డివిజన్‌కి డెప్యూటీ హెడ్. అప్పటికి NAL లో మా సీనియర్ సునీత తన 6త్ సెమ్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడే గ్రాడ్యుయేట్ ట్రెయినీగా చేరింది. తనక్కూడా ఒక లెటర్ రాశాను - నాకు NAL లో ప్రాజెక్ట్ చెయ్యాలని ఉందని. తను వెంటనే రిప్లై ఇచ్చింది - నాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తానని. హమ్మయ్య! అప్పుడే నాకిష్టమైన బెంగళూరు లోనే  ప్రాజెక్ట్ చెయ్యబోతున్నానని బోల్డంత సంబరంగా అనిపించింది.

ఇలా ఒకదానికొకటిగా జరిగిపోతూ ఉండగా అనుకోకుండా మొదలయింది నాకో బెంగ! అప్పటిదాకా నడిచిన ఆ యూనివర్సిటీ అవెన్యూ రోడ్లని, చుట్టూ పెద్దపెద్ద ఏనుగుల్లా పడుకుని వున్న కొండల్నీ, అలిపిరి దాకా సాగిన ఈవెనింగ్ వాకుల్ని ఇంకొద్ది రోజుల్లో వదిలి వెళ్ళిపోవాలి కదా అని. అలా అనిపించిందే తడవు ప్రతీ ఆదివారం బదరితో వెళ్లి చుట్టుపక్కల వున్న నాకిష్టమైన చిన్నచిన్న వూళ్ళూ, అక్కడ చిరకాలంగా వున్న దేవుళ్ళూ అందరినీ పలకరించి వచ్చేదాన్ని.

అలా వెళ్ళినవే తొండవాడ శివాలయం, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడి, శౌర్యానికి గీసిన గిరి చంద్రగిరి (కోట). తొండవాడ శివాలయం దగ్గర తెలుగు సినిమా ఫైటింగు సీన్లు షూట్ చేసేవారనుకుంటా. వెంకటేష్ ఏక్ట్ చేసిన చంటి సినిమా ఫైటోటి  అక్కడే తీసినట్టున్నారు. శ్రీనివాసమంగాపురంలో వేంకటేశ్వరస్వామి విగ్రహం దాదాపు ఆరడుగులెత్తు. అక్కడ రోజూ కళ్యాణం చేస్తారు. చంద్రగిరి కోట ఎన్నిసార్లు చూసినా నాకు నచ్చేసేది. ఒకప్పుడు రాజులు, రాణులు తిరిగిన నేల మీద నేనూ అడుగులేశానని మురిసేదాన్ని.  చంద్రగిరిలో ఒక మంచి మెస్ ఉండేది - సిమెంటు దిమ్మెల మీద నాపరాళ్ళు వేసి వాటి మీద విస్తరాకులేసి వేడివేడి అన్నం, పుల్లపుల్లటి పప్పు, కారంకారంగా పచ్చడి, చల్లచల్లగా గడ్డపెరుగు వేసి భోజనం పెట్టేది ఒకావిడ. ఆ భోజనం కూడా చేసొచ్చాను. గోవిందరాజస్వామి గుళ్లో దద్ధోజనం, కోదండరామస్వామి గుళ్లో పులిహోర తిన్నాను. అలిపిరి సరే సరి! వెళ్తూనే వున్నాను. కపిలతీర్థం రాజశేఖర్ (RS), జయలతో కలిసి నేనూ, బదరి ఒకసారి వెళ్ళాము. అప్పుడే RS మా ఇద్దరికీ కపిలతీర్థం మెట్ల మీద ఒక ఫోటో తీశారు - పూలపూల నల్లచీరలో పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ నేను, పక్కనే గడ్డం కింద చెయ్యి పెట్టుకుని నా నవ్వు చూసి మురుస్తూ, మెరుస్తున్న కళ్ళతో బదరి.

అన్నట్లు నా ఫిఫ్త్ సెమ్ జరుగుతున్నప్పుడు అదే టైంలో పమిడి పద్మజ MSJ (జర్నలిజం) లో జాయిన్ అయింది. తను టంగుటూరులో నా క్లాస్మేట్, ఫ్రెండ్ అయిన చంద్రశేఖర్ చెల్లెలు. తనో రోజు టీటైంలో కలిసినప్పుడు మాట్లాడుతూ "చిన్నన్నయ్య కాలికట్ నుంచి నన్ను చూడడానికి తిరుపతి వస్తున్నాడు లలితా!" అని చెప్పింది. భలే! అలా వచ్చిన చంద్రని బదరికి పరిచయం చేశాను. మేం ముగ్గురం కలిసి టౌన్లోకి వెళ్లి ద్వారకలో భోంచేసి, ఎంటీఆర్ ఆరాధన సినిమా కూడా చూశాం.

నా ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా ముందరే బదరి ఎగ్జామ్స్ అయిపోయాయి. తన MBA పూర్తయ్యింది. ఇంక ఉద్యోగాలు వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఇంకో రెండ్రోజుల్లో తన హాస్టల్ రూం ఖాళీ చేసి గుంటూరు వెళ్లి, వాళ్ళమ్మగారి దగ్గర  ఓ వారం రోజులుండి తర్వాత మెడ్రాస్ వెళ్దామని తన ప్లాను.

అప్పట్లో నేను ఎప్పుడూ ఇంక్ పెన్ తోనే రాసేదాన్ని. నా ఎగ్జామ్స్ మొదలయేముందు ఓ రోజు ఇంక్ బాటిల్ కొనుక్కోవాలని బాలాజీ కాలనీకి వెళ్లి వెనక్కి నడిచొస్తూ ఆ పక్కనే వున్న ఒక చిన్న రైల్వే స్టేషన్‌కి వెళ్దామని బదరిని అడిగాను. అవిసె పూల చెట్లతో వుండే ఆ స్టేషన్ నాకు చాలా ఇష్టం. బదరి ఊరెళ్ళే లోగా ఒక్కసారి ఆ స్టేషన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని అక్కడ ఆగే పాసెంజర్ ట్రెయిన్ చూడాలనిపించింది. వెంటనే వెళ్లి అక్కడ కూర్చుని, ఓ పది నిముషాలు కబుర్లు చెప్పుకుని వెనక్కి బయల్దేరాం.

సాయంకాలమైనా - ఎండాకాలపుటెండ... వేడిగా వుంది. కట్టుకున్న పటోలా చీర బరువుగా గుచ్చుతోంది. చేతికున్న వాచ్ చిరాగ్గా అనిపిస్తోందని తీసి ఇంక్ బాటిల్ పట్టుకున్న చేత్తో పట్టుకున్నాను. దుమ్ము, చెమట... ఏంటో చెప్పలేనంత చిరాగ్గా వుంది. దిగులుగా వుంది. బెంగగా వుంది. తిరుపతి మీద బెంగా? చదువైపోయి చెరో దారీ అయిపోతామన్న దిగులా? ఎటూ తేలట్లేదు కానీ - ఏడుపొచ్చేస్తోంది. మాట్లాడాలని కూడా అనిపించక నిశ్శబ్దంగా నడుస్తున్నాను.  ఓ ఐదు నిముషాలు కాగానే బదరి "బాగా అలసిపోయినట్టున్నావ్. ఇక్కడే పక్కన మా సీనియర్ రూఫస్ వాళ్ళ రూం వుంది. కాసేపక్కడ ఆగుదాం." అన్చెప్పి అదే రోడ్డులో ఓ మేడ మీద రూఫస్ అద్దెకుంటున్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రూఫస్ వాళ్ళన్నయ్య జేసన్‌తో కలిసి ఉండేవాడు. వాళ్ళింట్లో ఓ పదినిముషాలు కూర్చుని, కొంచెం మంచినీళ్లు తాగాక కొంచెం హాయిగా అనిపించింది. రూఫస్, జేసన్‌లకి bye చెప్పేసి మా హాస్టల్‌కి వెళ్దామని బయల్దేరాం. నాకు కొంచెం ఓపిక రాగానే మళ్ళీ ఏవో కబుర్లు నడుస్తున్నాయి.

ఉన్నట్టుండి బదరి "బుజ్జాయ్! రేపొక సారి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళొద్దామా?" అనడిగారు.

"ఎందుకూ?" అంటూ నా ప్రశ్న.

"ఏం లేదూ... నీ ఎగ్జామ్స్ అయిపోయాక గుంటూరు వెళ్ళిపోతావు. నేనేమో ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎటో వెళ్తాను. నాకెందుకో బెంగగా వుంది. నిన్ను మీ నాన్నగారు మీ వూరు పంపించేస్తారేమో. ఇంకెప్పటికీ నిన్ను చూడలేనేమో అనిపిస్తోంది"

"మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అల్లా ఎప్పుడూ చేయరు. అన్నట్లు మీరు ఉద్యోగం బెంగుళూరులో మాత్రమే వెతుక్కోండి. నాకా ఊరే ఇష్టం." - నా ధోరణి నాదే!

"నీకు తెలీదు బుజ్జాయ్! మా ఫ్రెండొకడికి అలాగే జరిగింది. ఆ అమ్మాయిని అలాగే ఎక్కడికో పంపించేశారు. వాడి బాధ చూడలేకపోయాన్నేను" - నాకర్థం కావట్లేదే అని తన బాధ.

"మీ ఫ్రెండు విషయం వేరు, మన విషయం వేరు. అసలింతకీ రిజిస్ట్రార్ ఆఫీసుకి దేనికి?"

"అసలు పెళ్లి చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటో అడిగొద్దాం. ఎందుకైనా మంచిది"

"అలా అయితే అస్సలు రాను. మన పెళ్లి మా అమ్మ-నాన్న చెయ్యాల్సిందే."

"నే చెప్పేది అర్థం చేసుకో...వాళ్ళు చేస్తే సరే! లేకపోతే - నిన్ను మీ కోనసీమ పంపించేస్తే? నువ్వెప్పటికీ నాకు కనపడకపోతే?!"

అసలే... తను ఊరెళ్ళిపోతున్నారు అని బెంగతో వున్నానేమో... నేనెంతగా చెబుతున్నా అబ్బాయి వినట్లేదని బోల్డంత కోపం, ఉక్రోషం వచ్చేసాయి. అంతే! రోడ్డు మధ్యలో ఆగి - చేతిలో వున్న ఇంక్ బాటిల్, వాచ్ - రెండూ ఆ మట్టిరోడ్డుకి పక్కనే వున్న తుప్పల్లోకి విసిరేశాను. ఒక్క నిముషం అబ్బాయికేమీ అర్థం కాలేదు. నాక్కోపం వచ్చిందని అర్థం కాగానే తను ఏమీ మాట్లాడకుండా వెళ్లి, ఓపిగ్గా ఆ తుప్పల్లో వెతికి ఇంక్ బాటిల్, వాచ్ తెచ్చి - అవి నా చేతికివ్వకుండా తనే పట్టుకుని మా హాస్టల్ దాకా వచ్చి, నన్ను దింపి వెళ్తూ "ఎంత కోపం వచ్చినా అలా అన్నీ విసిరేయకూడదు. పరీక్షలు బాగా రాయి. నే వెళ్లే ముందు వీలయితే ఒకసారొచ్చి కలుస్తాను - లేకపోతే మళ్ళీ మన పెళ్ళికే!" అని నవ్వుతూ చెప్పి వెళ్తుంటే అప్పుడు నిజంగా - నిజ్జంగా ఈ అబ్బాయినింకెప్పుడూ వదిలి ఉండలేను అనిపించింది. తనన్నట్లే ఇంక మళ్ళీ తిరుపతిలో కలవడం కుదరలేదు. మళ్ళీ ఇంకెప్పటికో! అన్నది ఊహకే అందలేదు. నా ప్రాజెక్టు అవ్వాలి, తనకి ఉద్యోగం రావాలి. ఈలోగా అమ్మా-నాన్న ఒప్పుకోవాలి. ఇంకెప్పటికి కలుస్తామో! కాకపొతే కలవమేమో అన్న బెంగ మాత్రం నాకు లేదు. ఎక్కడున్నా బదరి నా కోసం వస్తారన్న నమ్మకమే!

పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. అందరూ సీరియస్‌గా చదువుకుంటున్నారు.  ఎవరి రూంలో వాళ్ళు, ఎవరి గ్రూపుతో వాళ్ళు - ఎవరికి వాళ్ళుగా వున్నారు - ఎప్పట్లాగే. అందులోనూ కొంతమంది ఏవో చిన్నచిన్న గొడవలతో ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకోవట్లేదు. నాకెందుకో వెళ్ళేలోగా ఒక్కసారైనా మా క్లాస్ అమ్మాయిలు అందరూ కలిసి భోంచేస్తే బావుండుననిపించింది. అనిపించడమే తడవు ఓ రోజు రాత్రి అందరి రూములకి వెళ్లి, ప్రతి ఒక్కరికీ "మనం SPMVV వదిలి వెళ్లాక ఇంకెప్పుడు కలుస్తామో! రోజూ ఎవరికి వాళ్ళం వాళ్ళ రూం వాళ్ళతోనే కలిసి లంచ్, డిన్నర్ చేస్తున్నాము. ఈ ఒక్కసారికీ అందరం ఒకే టేబుల్ దగ్గర భోంచేద్దాం" అని చెప్పాను. బంగారు తల్లులు! "లలితా...నువ్వు చెప్పావుగా తప్పకుండా చేద్దాం" అన్నారు. అన్నట్లుగానే అందరూ డైనింగ్ హాల్‌కి ఒకే టైంకి వచ్చారు. మేమందరం గుండ్రంగా కుర్చీలు వేసుకుని మధ్యలో సాంబార్ బకెట్టు పెట్టుకుని, బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ-వింటూ, నవ్వుకుంటూ-తింటూ భలే మంచిగా ఎంజాయ్ చేశాం. అది నాకుగా నేను కావాలనుకున్న ఒక మంచి జ్ఞాపకం!

పరీక్షలు ఐపోయాయి. ఆఖరి రోజు రానే వచ్చింది.

మా క్లాసు అమ్మాయిలెవరంటే ... 

ఉమాదేవి, గంగాదేవి, వీసీ ఉష, ఇందు, సుజాత, మారుతి, అనిత, సునీల, మేరీ రూత్, ప్రగతి, మాధవీలత, కె అపర్ణ, ఉషశ్రీ, అన్నపూర్ణ, సోనియా, రేఖ, కె ఉషారాణి, అమృతవల్లి, పద్మప్రియ, జయమణి, సునీత, మల్లిక, నిగమ, నిరుపమ, డే స్కాలర్లు - యూ అపర్ణ, అరుణ... - అందరితో పాటు - నేను!

అందరూ చివరిసారిగా రైల్వే స్టేషన్లో ఒకరినొకరు హగ్ చేసుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఎంత మిస్ కాబోతామో చెప్పుకుంటూ, ఉత్తరాలు రాసుకుందామని ఒట్లేసుకుంటూ - వుంటే - నేను మాత్రం ఎప్పట్లాగే - దూరం నుంచే వాళ్ళని చూస్తూ, వీళ్ళకి అసలు నేనెప్పుడైనా గురుకొస్తానా అనుకుంటూ, నా తిరుపతి జ్ఞాపకాలని పదిలంగా మోసుకుంటూ - నాలో నేనే - భలే భలే మంచి రోజులులే! మళ్ళీమళ్ళీ ఇక రావులే - అని పాడుకుంటూ... నాకు నా సబ్-జూనియర్ మాధవి నా గురించి రాసిచ్చిన కొన్ని మాటలని ఇష్టంగా చదువుకుంటూ - మిలమిల మెరిసే తిరుపతి మెట్ల దారిని చూసుకుంటూ ... మళ్లింకొక్కసారి ఇక్కడికి వస్తాను ప్రాజెక్ట్ వైవాకి అనుకుంటూ... ముందున్న రోజుల్ని మురిపెంగా తలచుకుంటూ - ఇంటికి బయల్దేరాను.





<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

13, ఏప్రిల్ 2019, శనివారం

నే...డ్డే చదవండి-4- మేఘసందేశం








కళాత్మకత హంపి రాళ్ళ పాలు 
కవితాత్మకత కవి-పిక-త్రయపు ఆనవాలు 

నారీ నారీ నడుమ  ఏఎన్నారీ అనేది దాసరి వారి సినిమాల అచ్చు 
ఆ అచ్చులో ఇమిడినదే ఇంకోమాటు ఈ కళాత్మక మచ్చు 
 
 నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
ఏప్రిల్ నెల సంచికలో...
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: ఏప్రిల్ నెల సరదా సిన్మాయణం

ఒక్క మాట: సినిమా అంటే నాకొక కాలక్షేపం - గట్టిగా చెప్పాలంటే అస్సలేమీ ఆలోచించకుండా నేను enjoy చేసే dumb-time . దాని గురించి కబుర్లు రాయడం ఓ ఆటవిడుపు.  ఈ సరదా సిన్మాయణంలో రాసేవన్నీ నేను చూసొచ్చిన సినిమా కథ చెప్పమని అడిగి మరీ చెప్పించుకునే నేస్తాలకి చెప్తున్నట్లు రాస్తున్నవే తప్ప తెలివిడి కలిగిన వీక్షకులు రాసే రివ్యూలు కావు. కేవలం ఓ నా వ్యూలు మాత్రమే.

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

6, ఏప్రిల్ 2019, శనివారం

వికారిని...సహకారిని...

అలుపెరుగక - ఆదమరవక 
ఇంకెంత దూరమనక - ఇంకెక్కడ మజిలీ అనక
ఉన్న చోటుండక - ఉస్సురుస్సురనక
ఎప్పుడూ - ఎడతెగక -  ఎక్కడా ఆగక
ఒంటరిననుకోక - ఒలపక్షం లేక 
కదులుతూ ఉంటుంది
కాలమది - కలకాలముండునది 
అందులో ఒక అంశమట తిథి
తిథుల్లో అనాదిగా ఆది ఐనది
చైత్రశుధ్ధపాడ్యమి
చాంద్రమాన పంచాంగంలో మొట్టమొదటి పుట దానిది
ఏడాదికి తొలి పండగది.
పేరట ఉగాది.

ఎన్ని కొత్త ఉగాదులొస్తున్నా, ప్రతి ఉగాదికీ గడిచిన ఉగాది రోజుల్ని నెమరేసుకోవడం, మరుగున పడ్డ జ్ఞాపకాల్ని ఓ సారి తలచుకుని నవ్వుకోవడం, ఆ నవ్వులతో ఉగాదిని గడుపుకోవడం ఎప్పుడూ జరిగినట్లే ఈ ఉగాదికీ...

అప్పట్లో...
పెరుగుతున్న పగళ్ళు 
అప్పటివరకూ వెచ్చని పూతలా వున్న సూరీడి వెలుగు కాస్తా వేడి వాతలా అనిపిస్తూ
తరుగుతున్న రాత్రుళ్ళు 
అప్పుడప్పుడే పెరుగుతున్న కరెంటు కోతలు 
ఉక్కి ఉసురుసురనే  ప్రాణాల విసురుతో ఊగే విసనకఱ్ఱలు
ఎర్రెర్రటి లేత ఆకులతో, పచ్చని పిందే-కాయలతో గుబురుగా నవనవలాడుతున్న మామిడి చెట్లు
వాటి కొమ్మల్లో ఎక్కడో కూర్చుని కూతకి బదులుగా కూసే మా పిల్లమూకతో పంతాలు పోయి ఇంకా ఇంకా కూసే కోయిల్లు 
నిలువెల్లా పూసిన వేపచెట్లు
అప్పటివరకూ స్తబ్ధుగా వున్న లోకమేదో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లు అంతటా ఒకే సందడి, హడావిడి - ఉగాది వస్తోందంటూ.
ముందే తెచ్చి పెట్టిన పంచాంగాలు, పిడపర్తి వారిదోటి, నేమాని వారిదింకోటి. ఉగాది దాకా తెరవకూడదని, చదవకూడదని చెప్పేవారు నాన్న.
అసలు వెనకేం జరిగిందో, ముందేం జరగబోతోందో అక్కర్లేని, అసలేం జరుగుతున్నా లెక్క చెయ్యని  చీకూ-చింతా లేని ప్రాణాలు మావి. అయినా ఆ అక్కర్లేనితనం లోనే పంచాంగంలో రాసిన కొత్త అక్షరాల్లో ఏం రాసుంటారా అనే కుతూహలం. అయినా నాన్న చెప్పారని ఉగాది రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఉట్టినే! అసలలా ఎదురు చూడ్డమెందుకంటే ...చెప్తా...చెప్తా... ముందు ఉగాది రోజు గురించి మొదలెట్టాక.

ఉగాది అనగానే అమ్మ కాటన్ చుడీదార్లు కొనేది. రాబోయే ఎండాకాలానికి హాయిగా వుంటాయని. ఒక ఉగాదికి అల్లాగే కుట్టించింది - నాకో ఆకుపచ్చ చారలది. నేను దానికో చిన్న పసుప్పచ్చ టెడ్డీబేర్ బ్రూచ్ కొనుక్కున్నాను ఎడం పక్క భుజం దగ్గర ఎక్కించుకోవడానికి. పప్పీదేమో పసుప్పచ్చ చారలది. పప్పి దాన్ని ఉగాది పూటకి పులివేషమనేది. మాకన్నా పొడుగ్గా వుండే కుట్టీకి కుట్టించక్కర్లేదు - రెడీమేడ్లో దొరికేసింది భలే మంచి డ్రెస్సు. 

ఇక ఉగాది రోజు వేపపూత ఒలవడం, మామిడికాయ ముక్కలు తరగడం నా ఒంతు. బెల్లం కోరడం ఒంతులేసుకునే పప్పీ, కుట్టీల ఒంతు. మిగిలేదిక కొబ్బరికాయ. దాని చుట్టూ బోల్డంత పీచు. ఓ ఇనప అట్లకాడ నా చేతిలో పెట్టి "కోనసీమలో పుట్టావు, కొబ్బరికాయ ఒలవడం రావాలి" అంది అమ్మ ఓ సారి. ఓ పది నిముషాలు ఎలాగోలా అటు వంగి, ఇటు వాలి, "నేనసలు ఇంత పీచుతో పుట్టకపోయి ఉంటే బావుండేది" అని కొబ్బరికాయే వాపోయేలా మొత్తానికి పీచు-ఒలుచుడు కార్యక్రమం పూర్తయింది ఆ సారికి. తరవాత్తర్వాత కొబ్బరికాయకి ఆట్టే దెబ్బ తగలకుండా పీచు తీయడం, చేతికి నూనె రాసుకుని పనసపండు కోసి తొనలు తీయడం లాంటి వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించా - అమ్మ మెప్పు కోసం.

మేము కిందామీదా పడి ఒలిచిచ్చిన, కోరిచ్చిన వాటితో మా అమ్మ ఉగాది పచ్చడి చేసిచ్చేది. అది తినేసి - అప్పుడు మొదలెట్టేవాళ్ళం మా పంచాంగపఠనం. 

రాజులే పూజ్యమైన రోజుల్లో రాజపూజ్యం, అవమానం లెక్కలు తేల్చి చూసుకోవడం ఎలా? దానికి మా లెక్కేంటంటే...  అడిగిన వెంటనే అమ్మ పెడితే రాజపూజ్యం ఎకౌంట్లో, "ఉండో నిముషం. కాస్సేపాగి పెడతాను" అంటే అవమానం కౌంట్లో వేసేసుకునే వాళ్ళం. నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఏమో మా ఆదాయం, అమ్మ మా కోసం కొనేవన్నీ మాకే వ్యయం. అలా అల్లిబిల్లి లెక్కలేసేసుకుని అవి పంచాంగంలో మా రాశిఫలితాలకి సరిపోతాయో లేదో చూసుకునేవాళ్ళం.

ప్రతీసారీ ప్రతి ఒక్క రాశికీ "విద్యార్థులకి రెండో ఛాన్సులో విజయం" అనుండేది అందులో. అది చదువుకుని ఒకళ్ళనొకళ్ళం "ఈసారి నువ్వింక పాడుకోవాలి  ఉందిగా సెప్టెంబర్ మార్చి పైనా " అంటూ, అనుకుంటూ, నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా - ఇంతలో నాన్నొచ్చి "అంతెక్కువ నవ్వకండి, మూతి చెవులదాకా సాగిపోతుంది, పెళ్లిళ్లు చెయ్యలేను" అంటే దానికింకా నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా గంట పది కొట్టేది.

అంతే! ముగ్గురం పంచాంగాలు మధ్యాహ్నభోజనానంతరపఠనానికి దాచుకుని టీవీ ముందు చేరేవాళ్ళం. ఎందుకూ? దూర్‌దర్శన్‌లో వచ్చే ఉగాది కవి సమ్మేళనం చూడడానికి. అది చూశాక మా ఇంటి మేడ మీద చేరేవాళ్ళం. అక్కడ మా కపి-సమ్మేళనం జరిగేది.

అలా గుర్తున్నదే అప్పటిది ఓ  కవిత - ఇప్పటికీ పప్పి, నేనూ ఉగాది అంటే తలుచుకుని, తలుచుకుని మరీ నవ్వుకునే కవిత...

నీళ్లు నిండితే అది నది
నీళ్లు ఎండితే గోడల్లేని గది

నేనన్నది వినగానే ...

వహ్వా...వహ్వా  అనేది పప్పి నవ్వు కప్పిన మెచ్చుకోలైతే

ఏం చెప్పావే లల్లెమ్మా!
ఇది విని పరిగెడతారే జనమా!  - అనేది కుట్టి కప్పని మేకతోలు.

ఏ ఉగాదైనా అదే వరస. ఇప్పటికీ ఉగాది అంటే ఏదో అల్లిబిల్లి కవిత ఆల్లనిదే ఆనాడు ఉగాదిలా ఆనదు.

అందులోనూ ఈసారి ఉగాది పేరు విన్నప్పట్నుంచీ ఒకటే అనిపిస్తోంది - అసలు వికారి అనెందుకు దీన్నన్నారని. అదుగో ... అలా అలా అనుకుంటూ వికారితో నేనంటున్నట్టూ, వికారి నేనన్నది విని తిరిగి నాతో అంటున్నట్టూ... ఈ వికారి నామ నూతన సంవత్సర ఉగాదికి నే రాసుకున్న pun-చాంగం!

"ఉగాదీ!
అరవై పేర్ల బడాయీ!
ఏటేటా కొత్త పేరు నీకు, సంగతేంటది?
అందులోనూ ఈమాటు నీ పేరట వికారి
ఎబ్బే! ఏం పేరది?"
అని నేననుకున్నానో లేదో
నేనన్నది విందేమో అనిపించిన వికారి ఇలా అన్నట్లనిపించింది...
"కదిలే కాలంలో ఎప్పట్లానే ఓ పాలు నేను
నీకేదో ఇరవయి - అరవయ్యని- నువ్వేసిన లెక్క నేను
ఆ లెక్కేదో లెక్కే చెయ్యక సాగేది నేను
ఎబ్బే! అని నువ్వన్న నా పేరు నేనడిగి తెచ్చుకున్నది కాదు
అది లేదని నే నొచ్చుకున్నది కాదు
ఆ పేరు
నాకిచ్చినవారు
ఎవరో నీలాంటి నోరున్నవారు
నా పేరు బట్టి వారి తీరు మారుతుందనుకున్నవారు
మారని వారి తీరుకి నా పేరే కారణమనొచ్చనుకున్నవారు
ఇదీ నీ పేరని ఒకరన్నాక
ఆ పేరుతో మనక తప్పదు
ఆ పేరే నాదనుకోక తప్పదు
అందుకే... నేను వికారిని
చేతకాని నెపాలకి వికారిని...
చేవ కలిగిన జీవితాలకి సహకారిని..."

31, మార్చి 2019, ఆదివారం

ఆ ఊసే తలచక మరచుటే మంచిదని!

ఎప్పుడో జనవరిలో పోస్ట్ చేయాల్సిన కబురిది.
అనుభవం, ఆలోచన బదరివి.
అక్షరం, అనువాదం (బ్లాగ్ మాటల్లోకి) మాత్రం - తన ఇంటిసిరిని 😇 - నావి! 
విషయం పాతదైనా ఆలోచనల్లో అది తెచ్చిన వెలుగు మాత్రం కొత్తదే.
ఒక పాఠంలా రాసుకో తగినదే!
తర్వాతి తరానికి నేర్పుకో తగినదే!

*************


వేరే వూళ్ళో చేయాల్సిన ఉద్యోగ రీత్యా వున్న ఊరు వదిలి ప్రతి వారం ప్రయాణం చేసి, ఫ్లైటు దిగి హోటల్ చేరీ చేరగానే ఫోన్ చేసి ఇంటిసిరికి నే చెప్పే మాట ... 

"ఈసారి వచ్చిన హోటల్ రూమ్ బావుందోయ్!"

నేనేం చెప్పినా ఓపిగ్గా వింటుంది. కానీ,  ఇంటి పట్టున గువ్వపిట్టలా వుండే తనకి నిజంగా తెలుస్తుందా హోటల్ రూమ్ బావుండడానికీ, బాలేక పోవడానికీ తేడా?

ఏ కుంగిపోయిన పరుపో వస్తే నిద్ర పట్టక దొర్లీదొర్లీ, లేచిందగ్గర్నుంచీ మళ్లీ ఎప్పుడెప్పుడు పని మానేద్దామా, పడుకుందామా అని ఆరడి చేసే కనురెప్పలకి కనిపించని దారాలు కట్టి తెరిచి ఉంచడం ఎంత కష్టమో అర్థమయేలా చెప్పడం వీలయ్యే పని కాదు.

ఆఁ ! తనకి అర్థం కాకపోయినా పర్వాలేదు లెద్దూ. నేనొక్కణ్ణీ కష్టపడితే చాలదూ?! నవ్వులో తన తోడుండాలి కానీ నొప్పి తనకి తెలియనే కూడదు. ఆ ఇంటి అబ్బరాల ఆడపిల్ల తన వారినందరినీ వీడి నా ఇంటి దీపమైంది. అది చాలు.

అవునూ... తను పుట్టింటిని వదిలొచ్చింది సరే... మరి నేనూ మా అమ్మకి దూరంగానే వున్నాను కదా! నాకూ పుట్టింటి బెంగ ఉండాలి, ఉండడం న్యాయమే కూడా. ఇలా ఆలోచించ కూడదేమోలే! ఎంతైనా కనుల నీరు దొరలనీయలేని మగదొర పుటక పుట్టాను కదా మరి. సరి సరి! ప్రస్తుతానికి ఈ దారి మళ్లే తలపునాపి పరుపు వైపుకి మళ్లించెద గాక!

ఎంత బావుందీ గది?!
ఎంత పదిలమీ గది !
పరుపుమీద చక్కగా
పవ్వళించి ఉండగా... అని పాడుకుంటూ పడుకుంటానా పూటకి.

రాత్రి అలారం పెట్టుకుంటాను అంకెలారా ఐదింటికి. లేచి పళ్ళు తోమి, షవర్ కింద షివరై , తొరతొరగా తయారై - ఇంకా తొరగా ఆఫీసు కెళ్ళిపోయి పురుష లక్షణంతో రెండో పురుషార్థం సాధిద్దామని. కానీ పొద్దున్నే శ్రావ్యంగా మోగే అలారాన్ని దాని పని దాన్ని సవ్యంగా చేయనీయకుండా స్వయంగా నా చేతుల్తో మూడు సార్లు snooజిస్తా. ఐదున్నరకి లేస్తా. నా పనులన్నీ కానిచ్చి ఆఫీసుకి బయల్దేరేటప్పటికి నా గదంతా కిష్కింధాపుర వాసుల విడిదిలా తయారవుతుంది.

ఇక సాయంత్రం ఏ తండూరీ ఫ్లేమ్స్ లోనో, దోశ ఎక్స్‌ప్రెస్ లోనో  'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అనేసుకుని హోటల్ గదికి చేరతాను. నా గది అప్పటికి ముందు తెలిసెనూ ప్రభూ... నీవు వచ్చు ఈ నిదుర క్షణమిదే అన్నట్లు ఎక్కడి దుప్పట్లు అక్కడ టక్కు చేయబడి, అంత లావు కంఫర్టర్లు కూడా ఒద్దికగా ఒత్తిగిలి ఉండి కుదురుగా ముస్తాబై ఉంటుంది.

అప్పుడు తీరిగ్గా ఆ-తల్పశాయినై , దక్షిణ హస్తమున సెల్ఫోను ధరించి నా ఇంటిసిరికి ఫోన్ చేస్తాను. అప్పుడు వస్తుందీ పరుపుల ప్రసక్తి. దాని వెంటనే ఆ పరుపుల నంత చక్కగా సర్దే రూం సర్వీస్ చేసే ఆడవారి గురించిన ప్రశంసా, పునరుక్తీ!

ఆలోచిస్తే నిజంగా ఎంత కష్టం కదా! ఒక్కో పరుపు లావొక్కింతయు లేదు అనడానికి వీల్లేకుండా ఇంతై, ఇంతింతై అన్నట్లుంటుంది. అనకొండకి కజిన్లా ఉంటుంది. దాన్నెత్తి పట్టి  ఫిట్టెడ్ షీటని, మామూలు షీటని, ఇలా రెండు రకాల దుప్పట్లని ఆ పరుపు కింద అట్టేపెట్టి, ఆ పై ఇంకో బరువుకే బరువు - బెబ్బరువు - లాంటి కంఫర్టర్ వేసి శయ్య దీర్చడం అంత తేలికేం కాదు. ఈ హోటల్లో నా గదిలాంటి గదులెన్నో!

రూం సర్వీస్ చేసే ఆడవారి గురించి చెప్పాలంటే వాళ్లలో ఎక్కువ శాతం మెక్సికన్లు. గంటకి ఏడో, ఎనిమిదో డాలర్లకి మించి సంపాదించ లేని వాళ్లు. పిల్లల్ని బళ్ళో వదిలొచ్చిన అమ్మలు, తల్లుల్ని పిల్లల్లా సాకే అమ్మాయిలు, అమ్మల గన్న అమ్మలు, అమ్మ చాటు అమ్మాయిలు - వీళ్ళలో ఎవరో ఒకరు. కలలూరే కళ్ళు, కలలాగిన కళ్ళు, కన్నీళ్లాగని కళ్ళు, కన్నీళ్ళెండిన కళ్ళు - వీటిలో ఏవో ఒకటైన రకపు కళ్ళున్నవాళ్లు.

వాళ్లెవరో నాక్కనిపించరు. కానీ ఆ  అదృశ్యహస్తాల సహాయాన్ని వూరికే అందుకోవడం న్యాయంగా అనిపించదు నాకు. అందుకే రోజూ గది విడిచి ఆఫీసుకి వెళ్లే ముందు ఓ కాయితం మీద "థాంక్ యూ" అని రాసి, దాని మీద కొన్ని డాలరు నోట్లు పెట్టి వస్తాను. అలా చేయటం కోసమే ఒక డాలరు నోట్లు బొత్తిగా తెచ్చుకుంటాను. సాయంత్రం భోజనం ముగించి రూంకి వచ్చేవేళకి పొద్దున్న నేను కాయితం నోటు, డాలరు నోట్లు పెట్టిన చోట "థాంక్స్ ఫర్ ద టిప్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ స్టే హియర్" అన్న బదులు-నోటు చూడగానే ఏదో సాధించిన చిన్న ఆనందం. నేను పెట్టే రెండు డాలర్ల టిప్పుతో దాంతో వాళ్ళ జీవితాలు మారకపోవచ్చు కానీ వాళ్ళ జీవితసేతువుకి ఓ రెండు గులకరాళ్లు పేర్చిన తృప్తి నాకు మిగులుతుంది.

ఇప్పటికి ఎనిమిదేళ్లుగా ఇదే వాడుక అయింది.

కిందటి వారం ఇంటికెళ్లి Carry-on తెరిచి చూస్తే నా బ్రష్షు, పేస్టు, షేవింగ్ కిట్టు పెట్టుకునే లెదర్ పౌచ్ కనిపించలేదు. పొరపాట్న బాక్‌పాక్‌లో ఏమన్నా పెట్టానా అని తెగ వెతికాను. ఉహూ! అందులో కూడా లేదు. అందులోనే ఉండిపోయి, పోయి, ఇప్పుడు లేకుండా పోయిన ఓరల్బీ(Oral-B), దంతకాంతి గురించి నాకేం బెంగ లేదు కానీ "కొనేదేదో మంచిది కొనుక్కోండి" అని నా చేత నా ఇంటిసిరి కొనిపించిన నూటడెబ్బై డాలర్ల షేవింగ్ కిట్టుని తలుచుకుని తెగ దిగులుపడ్డా. కొనక కొనక కొన్న ఖరీదైన క్షుర-కత్తి మరి.

సరే! పోయిందేదో పోయింది. ఇప్పుడు వగచేం లాభం. వచ్చే వారం ఎలాగూ అదే హోటల్‌కి వెళ్తాను కదా. రిసెప్షన్‌లో అడుగుదాం అనుకున్నాను. వారాంతం అంతా నా కలలూ, కలవరింపులూ నా పోయిన క్షౌర-కిట్టు గురించే.

ఎప్పట్లాగే ఆదివారం పొద్దున్నే బయల్దేరి ఆకాశ మార్గాన నా ఉద్యోగవాడ చేరాను. హోటల్ రూంలో సామాను పెట్టేసుకుని రిసెప్షన్ దగ్గరున్న అమ్మాయిని పలకరించి కనిపించకుండా పోయిన నా తోలుసంచీ గురించి వివరించి మీకెవరైనా "ఇదిగో దొరికింద"ని అందజేశారా? అని విచారిస్తూ విచారించాను.

"అయ్యో అలాగా! పోయిందా? రూం సర్వీసుని అడిగి చూస్తాను. రేపు మళ్ళీ రండి" అని హామీ ఇచ్చింది.

రమ్మన్న ఆ రేపటిరోజు మళ్ళీ వెళ్ళాను.

"సారీ సర్! మీ సంచీ లేదు కానీ మీ నష్టానికి బదులుగా మా హోటల్ వారిచ్చే బ్రష్షు-పేస్టూ తీసుకోండి. వాటితో మీ పళ్ళు తోంకోండి" అని నన్ను తిప్పి పంపించేసింది.

రూం లోకి వచ్చానే కానీ బోల్డంత ఖోపంగా వుంది. నేను తప్పకుండా నా బట్టలు సర్దుకునేటప్పుడు గది లోనే మంచం మీదనే మర్చిపోయి వుంటాను. తప్పకుండా రూమ్ సర్వీస్ వాళ్లకి కనిపించే ఉంటుంది. అదేమన్నా చిన్నదా, చితకదా! ఎవరో నా గది శుభ్రం చేసినవాళ్ళే తీసుకుని వుంటారు.

"అసలాగు! మళ్ళీ ఒకసారి ఆ హోటలమ్మాయిని అడిగొద్దాం - ఆ రోజు నేను గది ఖాళీ చేశాక ఎవరొచ్చి శుభ్రం చేశారో?!"  అనుకుని గది బయటకొచ్చి తాళం వేసి రిసెప్షన్ దగ్గరికి నడిచాను.

ఆ సమయానికి ఆ అమ్మాయి వేరే ఎవరితోనో మాట్లాడుతోంది. ఓ ఐదు నిముషాలు అక్కడే నించున్నాను. నా మనసులో ఏదో తెలీని ఉక్రోషం.

"నేను రోజూ రెండు డాలర్లు ఇస్తానే - ఏడాది పొడుగునా దాదాపు ఏభై వారాల పాటు ప్రతి వారం నాలుగు రోజులు - ముక్కూ మొహం తెలియని రూమ్ సర్వీస్ వాళ్లకి. ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా నా షేవింగ్ కిట్టు దొరికితే గప్‌చుప్‌గా దాచేసుకుంటారా? అసలు ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా?" - ఇలా ఆలోచిస్తూ నించున్నాను.

ఇంతలోనే ఎవరో తట్టి లేపినట్లు ఇంకో ఆలోచన "అరె! ఇప్పుడు నేనిలా ఎంక్వయిరీ చేస్తే - పాపం! హోటల్ వాళ్ళు నా గది శుభ్రం చేసిన వాళ్లెవరో కనుక్కుని ఆవిడ ఉద్యోగం తీసేస్తే? అసలే వాళ్లకిచ్చే జీతాలు తక్కువ. వున్న ఉద్యోగం పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతైనా సమయం పట్టొచ్చు. అసలు ఎవరు తీశారో, అసలేం జరిగిందో తెలీకుండా ఎవర్నైనా నిందించడం తప్పు కదా! ఎవరో ఒకరు చేసిన చిన్న పొరపాటుకి మొత్తం రూమ్ సర్వీస్ వాళ్లందరికీ చెడ్డపేరు వస్తుంది నేను ఇలా పట్టిపట్టి అడగడం వల్ల. ఒద్దు. అలా జరక్కూడదు." అంటూ.

ఈలోగా ఆ రిసెప్షన్ లోని అమ్మాయి నాకేసి తిరిగి "నేను మీకెలా సహాయం చేయగలనండి?" అనడిగింది.

"మీ హోటల్లో నా గది వుండే ఫ్లోర్లో రూమ్ సర్వీస్ చేసే ఆడవారి వివరాలు ఇవ్వగలరా?" అన్నాన్నేను.

ఆశ్చర్యం ఆ అమ్మాయి కళ్లల్లో.  "ఎందుకో తెలుసుకోవచ్చా?" అని అడిగింది.

"ఇంకో రెండు వారాల్లో కొత్త సంవత్సరం వస్తోంది కదా - వాళ్లకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్, మిఠాయిలు కొందామని" అంటూ నా సమాధానం.

"ఎంత మంచివారు మీరు! ఈ హాలిడే సీజన్ లో మీరిచ్చే ఈ బహుమతితో  అది అందుకునే వారి కళ్ళలో దీపాలు వెలిగించబోతున్న మీకు మా హోటల్ స్టాఫ్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు." అన్న ఆ హోటలమ్మాయి మాటలకి మురుస్తూ వెనక్కి తిరిగిన నాకు రాబోతున్న కొత్త ఏడాది నాకనిపించిందేంటంటే...

అనుకోనిది జరిగితే 
తెలిసీ తెలియక అనరాదెవ్వరినీ 
అందరిలో తప్పెవరిదో ఒకరిదే ఐతే
ఒక గాటన కట్టరాదందరినీ  
జరిగిన తప్పు ఊపిరి తీయునంతటిది కాకపోతే 
ఆ ఊసే తలచక మరచుటే మంచిదని!

*************

కొసాకూ నవ్విద్దామని ఓ కొసమెరుపు:

ప్రతిరోజు పొద్దున్నే ఆఫీసు కెళ్లే ముందు హోటల్ రూం టేబుల్ మీద డాలర్లు, దాంతో పాటు "Thank You for your service ...~B " అంటూ ఓ థాంక్యూ నోటు పెట్టడం బదరి(B) హోటలానవాయితీ. 

దానికి బదులుగా "Thank You, Mr. B. I hope you're enjoying your stay here...CY" అంటూ సాయంత్రానికో నోట్ కనిపించేది తనకి. 

"ఓహో! ఎవరో CY అనే ఆవిడ రూమ్ సర్వీస్ చేస్తోంది కాబోలు. భలేనే! షిఫ్టులు మారినా నా రూంకి మాత్రం ఎప్పుడూ ఆవిడే వస్తున్నట్లుంది" అని బదరి అనుకోలు, అనుకుంటూ ఆశ్చర్యంతో తలమునకలు. 

ఇదంతా రెండేళ్ల క్రితం సంగతి. 

ఆ తర్వాత ఉద్యోగమూ మారింది, ఊరూ మారింది, ఉండే హోటళ్ళూ మారుతూనే వున్నాయి. 

ఈ మధ్య హఠాత్తుగా మళ్ళీ "CY" నుంచి థాంక్యూ నోట్లు అందాయి. 

"అరె! ఇక్కడ ఇంకో CY నా?" అని హాచ్చెర్యపోయేలోగా బదరికి తట్టింది ఏంటంటే తనున్నది Court Yard అనిన్నీ, దాన్ని పొడి అక్షరాల్లో CY అనుకోవచ్చనిన్నీ, అంటారనిన్నీ! రెండేళ్ల క్రితం CY కూడా ఈ తరహాలోనిదేననిన్నీ!


24, మార్చి 2019, ఆదివారం

అదిగో చూడుము...బాల్విను జింకా! ఆమ్ అయ్యే మా వనమింకా ...

ఉత్తరమెరికాలో వసంతాగమనం.
దాంతో పాటు నాకూ బెంగాగమనం.


చైత్ర వైశాఖ మాసములు - వసంత ఋతువు - చెట్లు చిగిర్చి పూలు పూయును అని చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదువుకున్న ఆరు ఋతువుల్లో నాకెంతో ఇష్టమైన పూలకారే ఈ వసంతం. మరి ఇష్టమైన కాలంలో బెంగేంటి కదా?

మరదే - ఈ పూటకి, ఈ పోస్టుకి చెప్పుకోబోయే కబురూ, కథా-కమామీషూ... ముందు మొన్నటితో మొదలెట్టి, అక్కణ్ణుంచి నా చిన్నప్పటికెళ్లి, మళ్ళీ వెనక్కొచ్చి నిరుటి పూల కబుర్లతో ముగిద్దామని అనుకుంటున్నా. ఈ శాఖాచంక్రమణాలూ, చక్రభ్రమణాల మధ్య ఆట్టే కుదుపు లేకుండా నెగ్గుకొస్తే ఈ పూటకది మాబాగే!

 మొన్న మార్చ్ 21న Spring Equinox.

కిటికీలోంచి చూస్తే మండుతుందేమో అనిపించేంత మాయ ఎండ. తీరా తలుపు తీసి కాలు బయటపెడితే చలి ములికితో కూడి పొడుస్తుంది తప్పితే ఒంటికి వెచ్చని మలాము హాయినిచ్చే తీరు లోనే ఉండదు. అప్పటివరకూ మబ్బుల చాటునో, మంచుల మాటునో ఉండి చురుకంతగా పుట్టించని సూర్యుడు ఉన్నట్టుండి తన కిరణాలకి సాన పెట్టుకునిరోజూ పొద్దున్నే పలకరిస్తున్నాడు -రోజంతా వెలుగులు చిలకరిస్తున్నాడు.

సూర్యుడిలా తయారై వస్తాడనే ఓ రెండు వారాల క్రితమే పదో తారీఖున - Daylight Savings time మొదలైతే - ఆట్టే నొచ్చుకోకుండా - పొద్దున్న ఓ గంట ముందుగా లేవాల్సి వస్తే  మాత్రమేంటి, సాయంత్రపు పని ఓ గంట ముందుగానే ఆపెయ్యొచ్చుగా - ఏ గంట అటూ-ఇటూ అయినా రోజుకున్నవి ఇరవై నాలుగేగా, అవి తరిగేదీ, పెరిగేదీ లేదుగా - అని నచ్చచెప్పేసుకుని -

When there is Spring in the air
It's so hard not to Spring forward
With a Spring in one's step
So here I'm...
"Spring"ing forward - with a "Spring"in my step...

- అని ఏవేవో రాతలు రాసేస్కుని, ఇంకా వచ్చీరాని స్ప్రింగుని తల్చుకుని, నా పాదాల్లో లేని స్ప్రింగులని తగిలించేస్కుని, పూలకారుకి ఆహ్వానం పలికేద్దామని తయారయి వుందామనుకున్నా.

Spring, వసంతం...ఆమని... బసంత్ ... బహార్... - భాషేదైనా పూలకారుకున్న పేర్లన్నీ ఎంతందంగా వుంటాయో! వసంతంలో కొమ్మల పూచే పువ్వులు, ఆ పువ్వుల జూచి సంబరంతో కొమ్మలు నవ్వే నవ్వులు ఇంకా అందంగా ఉంటాయి.

అందుకేనేమో పాతాళభైరవి సినిమాలో రాకుమారి చెలికత్తెలతో కలిసి వాళ్ళ కోటలో వున్న ఉద్యానవనంలో కొమ్మలనీ, రెమ్మలనీ, పువ్వులనీ చూస్తూ, మురుస్తూ, ఆడుతూ-పాడుతూ ఓ పాట పాడేసుకుంది...


తీయని ఊహలు హాయిని గొలిపే
వసంత గానమే హాయీ
వసంత నాట్యమే హాయ్ హాయ్
చివురుల దాగి తీవెల నూగి
పూవులు ఘుమఘుమ నవ్వగా 
వని ఎంతో పరిమళించెనే
మనసెంతో పరవశించెనే -----అంటూ...

ఆ పాట నెమరేసుకుంటూ చుట్టూ చూద్దునా... వద్దన్నా వచ్చేసి ఆకుల్ని రాల్చేసిన శిశిరంపు గాలికి అలసి, ఆ పై కురిసిన మంచు వానల తడిసి, వాలి, సోలి, సొక్కి మోడులై తలలొంచిన మొక్కల వాడిన కొమ్మలు మెల్లమెల్లగా తలలెత్తి తొందరలో తొడుక్కోబోయే పచ్చరంగు పరికిణీల మీద పుప్పొడులద్దిన పూల చోళీల సింగారాన్ని ఊహించుకుని మురుస్తున్నట్లు కనబడ్డాయి.

ఏ గాలి రెక్కల మీద తేలో, ఏ పక్షి ముక్కు అంచున వాలో, వున్నచోట నుంచి ఎగిరి తాము మునుముందు పూయించబోయే పూతావుల సిరులు తమకే చెందాలని రాసున్న భూ-తావుల పడి, మంచు కప్పిన పొరల మీద నులివెచ్చటి ఎండ తగలగానే బిలబిలమంటూ పైకొచ్చిన చిన్నిచిన్ని మొలకలు కొన్ని అగపడ్డాయి.

వీటన్నిటి మధ్యా - అప్పటిదాకా - శిశిరానికి అదరక, శీతవేళకి బెదరక, పచ్చదనపు అద్దకాన్ని వెలిసిపోనివ్వక, చుట్టూ వున్న మోడుల మధ్య ఠీవిగా నిలచిన సతతహరితాలు - Pines, Spruce - లాంటి చెట్లన్నీ తగిలీ తగలని ఎండ పొడకి సందడి చేస్తున్న చెట్లనీ, మొక్కలనీ, మొలకలనీ చూస్తూ, వాటికున్న సంబరం తాము పొందలేమనుకుని నిట్టూరుస్తూ  - "ఎప్పుడూ ఒకే తీరుగా వుండే మాబోంట్లకు ఉగాదీ, ఉషస్సూ వుండవనేనేమో ఆ తెలుగు భావకవి నా కుగాదులు లేవు, నా కుషస్సులు లేవు అంటూ మేము పాడుకోవడానికో పాట రాశాడు" అనుకుని ఉసూరుమంటున్నట్లున్నాయి.


పుట్టిన భూమిలో చైత్రానికి, ఉగాదికి, వసంతారంభానికి ఇంకో వారం రోజుల పైగా వార వున్నా నేనున్న చోట official గా ఆమని వచ్చేసింది. ముందుముందు చూపు సోకినంత మేరా కనులకి పండగే!

ఎండ పొడన కాలిబాటన నడుస్తూ
నడక పొడుగునా పసరిన చెట్టూ, చిగిర్చిన ఆకూ,  విరిసిన పువ్వూ లెక్కెట్టుకుంటూ
ఆ తావున విరిసిన పూవేదని...
ఆ పూతావుల తావు ఏ వని?
అని అడిగినదే అడుగడుగునా అనుకుంటూ
ఆ వని, ఈ వని కలయజూసుకుంటూ
ఆమని వేళల తిరుగాడడం
పూల తేరెక్కినంత సంబరం నాకు.

అసలీ పూలతో సావాసం ఎలా మొదలైదంటే...

సంక్రాంతికి అనాతవరం వెళ్ళినప్పుడల్లా ఏ పొలం గట్టు మీదో తిరుగుతూ, అక్కడ దొరికిన బుజ్జిబుజ్జి బంతిమొక్కలో నాలుగిటిని పదిలంగా - దెబ్బ తగలకుండా, ఎండ సోకకుండా పట్టుకుని  ఆ చిట్టిమొక్కల వేళ్ళ చుట్టూ నా చేతివేళ్ళు భద్రంగా చుట్టి - ఇంటికి తెచ్చి తులసి కోట పక్కన మట్టిలో చిన్నచిన్న కుదుళ్ళు కట్టి, నీళ్లు పోసి మారాకు వేస్తే మురిసి పోయేటంతలో సంక్రాంతి సెలవులు అయిపోయేవి. ఆ తర్వాత వేసవి సెలవులకి వెళ్ళినపుడు నాన్నమ్మ, లలిత దొడ్డ చెప్పేవారు "నువ్వేసి వెళ్లిన మొక్కలకి ఎన్ని బంతిపూలు పూశాయనుకున్నావ్?! పెద్ద పెద్ద దండలు కట్టి మన ఇనప్పెట్టె మీదున్న రాములవారికి, సీతామ్మవారికి వేశాం ఎంచక్కా!"అంటూ. అది వింటూనే - సీతమ్మకే కాదు నీకునూ వేయిస్తీ బంతిపూదండలు రామచంద్రా! - అని మురిసేదాన్నే కానీ ఆ పూసిన పూలను, వేసిన దండలనూ చూడలేదే అనెప్పుడూ అనుకోలేదు. ఇక వేసవిలో ఆకులు దూసి పూయించిన మల్లెపూలు, తీగకు పాకిన సన్నజాజులు, పొద్దుటి దేవతార్చనకు సజ్జ నిండిన ఇటుకరంగు నిత్యమల్లెలు, ఎర్రటి ముద్దమందారాలు, తెలుపూ-ఎరుపుల నూరువరహాలు, లేత ఊదారంగు డిసెంబర్ పూలు, పసుపుపచ్చ, ఆకుపచ్చ, అసలురంగు కనకాంబరాలు. ఓహ్! ఎన్ని పూలో!

ఇక మా శివకోట్లో ఐతే చెప్పనే అక్కర్లేదు... **ఆరు ఋతువులు ఆమని వేళలే! మల్లెలు, మొల్లలు, చిరుగాలికి సోలే కాశీరత్నాలు, కాడెరుపు పారిజాతాలు, బంతులు, చేమంతులు, కారబ్బంతులు, చిట్టి చేమంతులు, ముద్దమందారాలు, రేక మందారాలు, కనకాంబరాలు - **ఇవన్నీ వచ్చీ పోయే అతిథులే! (**దేవులపల్లి వారి పాటలో మాటలవి).

ఆ తర్వాత మల్లయ్య మాష్టారి బళ్ళో కెళ్లే రోజుల్లో పూ-నేస్తులు కరణంగారి వాకిట్లో తీగ మీదికి పాకిన బుల్లిబుల్లి గులాబీ రంగుపూల బఠాణీ పూతీగలు, ఎర్ర పూల ముస్తాబుతో అవిసె చెట్లు, అపురూపంగా దొరికే మొగలిరేకులు.

జంగారెడ్డి గూడెంలో స్నేహం కుదిరిన పూబాలలు - కాగితం పూలు, నందివర్ధనాలు, గరుడవర్ధనాలు, విరజాజులు, గన్నేరు, నిద్రగన్నేరు, సింహాచలం సంపెంగ, జిల్లేడు పూలు, ఉమ్మెత్తపూలు, పార్థీనియం పూలు, రకరకాల గడ్డిపూలు.

ఆ పైన  టంగుటూరు హైస్కూల్లో  ఏడో తరగతి చదివేటప్పుడు ఇంటి ముందున్న పాకలో మేకలతో ఆడుకుంటున్న నన్ను   "హిందీ పరీక్షలకి కడుదువు గాని రా అమ్మాయ్!" అని చిన్న హిందీమాష్టారు నాగభూషణంగారు పిలిస్తే ఎప్పుడో మూడో తరగతి లోనే హిందీ మొదలెట్టేసిన నాకు ఇంకా అందులో పరీక్షలు కట్టి మరీ నేర్చుకోవాల్సింది ఏముందా అనిపించింది. అందులోనూ అలా కట్టేసినట్టు ఒక చోట కూర్చుని చదవాలంటే - "అమ్మో! ఇలాక్కుదరదు" అనిపించేసి హిందీ ట్యూషన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా అనుకుంటూ వున్నాను. ఇంతలో మా ఇంటి ఓనర్ వెంకట శేషయ్యగారు ఇంటి ముందు కుళాయి వేయించారు. పొద్దున్న, సాయంత్రం ఓ రెండు గంటల పాటు కుళాయిలో నీళ్ళొచ్చేవి.

అప్పటికి మా ఇంటి వాటా ముందు వైపు వేసిన పందిరి మీదుగా అల్లుకున్న కాకరపాదులు, ఇంటి వెనకాల నూతి దగ్గర గన్నేరుచెట్టు ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కుళాయిలో నీళ్లు పట్టుకుంటూ ఉంటే చుట్టూ వున్న నేల తడుస్తూ ఉండేది. ఆ తడిసిన నేలలో చిన్నచిన్న మళ్ళు చేసి "చెప్పుతో నలిపి వేస్తేనే కొత్తిమీర మొక్కలొస్తాయి. మా తెలుగు మాష్టారు చిన్నప్పుడు మా క్లాసులో అల్లరి చేసిన వాళ్ళని ధనియాల జాతి అని తిట్టేవారు" అని అమ్మ చెప్తూ, నలిపిచ్చిన ధనియాలు వేసి - మూణ్ణాలుగు రోజుల్లో చింతాకుల్లాంటి చిట్టి ఆకుల్తో పైకొచ్చి, ఇంకో రెండ్రోజుల్లో డిజైన్లు, డిజైన్లుగా విచ్చుకునే కొత్తిమీరతో నా వనారంభం సంబరంగా జరిగింది.

రోజూ సాయంత్రం ఆడుకోవటానికో, సంగీతం పాఠానికిఓ పది నిముషాలు ముందెళ్ళినప్పుడో పిచ్చయ్యశాస్త్రిగారి అమ్మాయి రాజేశ్వరి దగ్గరికి వెళ్లేదాన్ని. సాయంకాలం కదా - వాళ్ళ పెరట్లో బోల్డన్ని సందెమల్లెలు -  ఎఱ్ఱవీ, పసుప్పచ్చవీ, తెల్లవీ, పేరుకి తగ్గట్టు చంద్రకాంత రంగువీ - పూసి ఉండేవి. రాజేశ్వరి వాళ్ళ నడుమొంగిపోయిన బామ్మగారు, అప్పుడప్పుడూ కొంచెం గట్టిగా మాట్లాడతారు అనిపించినా ఆప్యాయంగా పలకరించే సుబ్బతాయమ్మగారు - వీళ్ళిద్దరితో కబుర్లు చెప్తూ రాజేశ్వరితో కలిసి ఆ పూలన్నీ కోసుకుని అప్పటికప్పుడు రాజేశ్వరి వాళ్ళమ్మగారు మాల కట్టిస్తే తల్లో పెట్టుకుని మురిసిపోవడం ఒక ఎత్తైతే, అంతకు ముందు కోయకుండా మొక్కకే మిగిలిన పూలల్లో వచ్చే నల్లటి మిరియాల్లాంటి చంద్రకాంత విత్తనాలు జాగ్రత్తగా వలిచి తెచ్చుకుని నా చిన్న కుళాయి-తోటలో వేసుకోవడం ఇంకో నిలువెత్తు దండెత్తు. సాయంకాలాలు మాత్రమే విచ్చుకునే చంద్రకాంతల్ని సందెమల్లెలంటారని అప్పుడే తెలిసింది నాకు.

మా స్కూల్లో జమ్ములపాలెం, ఆలకూరపాడు - ఊళ్ళ నుంచి వచ్చే అమ్మాయిలు బోల్డు మంది వుండేవాళ్ళు. అసలు అంత దూరం నుంచి వాళ్ళందరూ బడికి నడిచి రావడం, కారియర్లలో అన్నాలు తెచ్చుకుని ఒక చోట కూర్చుని తినడం - నాకసలు భలే fascinating విషయాలు. ఎప్పుడైనా రెండో శనివారం సెలవురోజు కదా - అమ్మనడిగి నేనూ వాళ్లతో నడుచుకుంటూ శుక్రవారం జమ్ములపాలెంలో, ఆలకూరపాడో వెళ్లేదాన్ని. అక్కణ్ణించి వస్తూ వస్తూ  - మెత్తగా ఊలులా వుండే ఇంగ్లిష్ పూలు, ఉరుమురిమితే పూసే ఉరుం పూలు చెంగల్వలు, చిలకముక్కు పూలు, సీతమ్మవారి జడకుచ్చులు - ఇలా రకరకాల పూల మొక్కలు తెచ్చుకునేదాన్ని - నాకు నా నేస్తాలిచ్చిన పూలకానుకలవి.

ఇక మా ఆట-పాటల నెలవు గుంటూరు ఇంట్లో ఇంటి ముందున్న మూడూ బై నాలుగడుగుల మట్టి నేలలో ఓ పక్కగా వేసుకున్న తులశమ్మ పక్కనే ఓ రెండు చంద్రకాంత మొక్కలు కుదురుకున్నాయి. అక్కడే మా పప్పి కూడా ఓ గులాబీ మొక్క వేసింది. అసలు మా ఇంట్లో పప్పి దారే వేరు. ఎన్నికలో, ఎంపికలో దానిది ఓ ప్రత్యేకమైన అభిరుచి. అలాంటిలాంటివి దానికి నచ్చేవి కావు. నేనేదో - రెండు చుక్కలు నీళ్లు పోసినా - ఆ మాత్రపు చిలకరింపుకే మురిసిపోయి కొమ్మకొమ్మా పులకరించినట్లు  జలజలా పూలు పూసేసే అల్పసంతోషీ-మొక్కల్నే పెంచేదాన్ని. పప్పి వేసిన గులాబీ అంటు కెన్ని సూకరాలో! దానికి పప్పి టీ పొడి, ఉల్లిపాయ తొక్కలు - ఇలా వెరైటీ ఫలహారాలు పెట్టి పెంచేది. ఆ గులాబీ చెట్టు - అన్నీ తిని మాకన్నా పొడుగు పెరిగి - సరిగ్గా అట్లతద్ది నాడు - అంటే పప్పి పుట్టినరోజు నాడు మాత్రం ఒక్కటంటే ఒక్కటే పువ్వు - చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా - పూసేది. ఇంట్లో మేం పెంచే మొక్కలు చాలక బాలకుటీర్ పక్క సందులో వుండే అపర్ణ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు - బాలకుటీర్ కాంపౌండ్ లోంచి వాళ్ళింటి సందు లోకి వాలే గోరింటాకు చెట్టు పువ్వులు కూడా కోసి తరగడాల కింద పెట్టుకుని పడుకునేవాళ్ళం - పరీక్షలప్పుడు - కంబైన్డ్ స్టడీ-లెస్సు, కబుర్లు-మోరు రోజుల్లో - నేనూ, అపర్ణ.

గుంటూరొదిలి తిరుతిలో చదివేటప్పుడు హాస్టల్ ముంగిట్లో మందార చెట్టు ఒకటుండేది. వారంవారం తలంటు కోసమని మందారాకులు కోసేస్తున్నానని కాపలా కాసే వాచ్మన్ కళ్ళు కప్పి మందార పూలనో సారి పలకరించి మరీ ఆకులు కోసుకునేదాన్ని. కాలేజ్ కెళ్లే దారికి అటూ ఇటూ ఈసురోమంటూ గాలెటు వీస్తే అటొంగిపోయే గన్నేరు మొక్కలేవో ఉండేవి. వాటి జోలికి నేనెళ్ళే దాన్ని కాదు. వేసవిలో క్యాంపస్ లో వున్న చెట్ల నిండా పట్టిన మామిడి పూత మాత్రం మత్తెక్కించేది.

పెళ్ళయ్యి బెంగళూర్లో ఉండాలనుకున్నదే లాల్బాగ్ గాజినమనెలో జరిగే పూల పండక్కోసం. ఇంతలో ఏం జరిగిందంటే ఇళ్లలో రోజూ వచ్చే చెత్తని కొంచెం దూరం వెళ్లి పడేసే ఓపిక లేని ఇరుగింటివారు దాన్ని తీసుకొచ్చి రోడ్డు వైపుకి వున్న మా ఇంటి గోడ పక్కన పడేసేవాళ్ళు. ఒద్దని ఒకట్రెండు సార్లు చెప్పాక నాకే మొహమాటం వేసింది - పదేపదే చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అని. అంతే! ఒక చిన్న అట్లకాడా, ఓ బకెట్టు నీళ్లు పట్టుకెళ్లి - ఓ రెండు గంటలు శ్రమదానం చేసి - మా ఇంటి గోడ పొడుగూతా నేలని చదును చేసి - ఓ డజను పూల మొక్కలు వేసి కుదుళ్ళు కట్టేశా. ఆ నెల ఇంటి అద్దె డబ్బుల వసూలుకొచ్చిన మా ఇంటి ఓనర్ నారాయణస్వామి గారి అబ్బాయి కళ్ళలో - నే వేసిన పువ్వొత్తులు మెరిశాయి.

అన్నట్లు బెంగళూరులో ఇల్లు కట్టుకుని "హందర" అన్న పేరు పెట్టుకుని, పేరుకి తగ్గట్టు పూలపందిరిలా ఉంచుకునే అపర్ణ నాకో చదరపు అడుగు రాసిచ్చేసి అందులో నాకిష్టమైన కాశీరత్న, చంద్రకాంత మొక్కలు వేసింది.

ఉన్న ఊరినీ, కన్నవారినీ ఒదిలి ప్రవాసం వచ్చిన నాకు ఎటు చూసినా నవ్వుతున్నట్లుండే రంగురంగుల పూలు - ఇళ్ల ముందూ, అంగళ్లలో - ఎక్కడ చూసినా - "పేరు తెలుసుకో, నా రూపు చూసుకో" అన్నట్లు మురిపిస్తుండే ముద్దొచ్చే పూలు చూసి బోల్డంత ఆనందం.

ఇంక వుండబోయేది ఇక్కడే అనుకుని ఇల్లు కొనుక్కున్న వెంటనే - కుదరలేదు కానీ - ఓ రెండేళ్ల తర్వాత మొక్కలేసుకునే సరదా మళ్ళీ మొదలయింది.

ఎప్పుడో చిన్నప్పుడు ఇష్టంగా చదువుకుని కంఠస్థం చేసిన Wordsworth - Daffodils** గుర్తు చేసేసుకుని బోల్డన్నిరంగురంగుల Daffodils, Irises, లిల్లీలు, వాటితో పాటే లెవెండర్ ఒకటి తెచ్చుకుని ఇంటి ముందు వేసేసుకుని నేనూ - ఇవన్నీ మాకు చుట్టాలే - అని కృష్ణశాస్త్రి గారిని తలచుకున్నా.

**I wandered lonely as a cloud
That floats on high o'er vales and hills,
When all at once I saw a crowd,
A host, of golden daffodils;
Beside the lake, beneath the trees,
Fluttering and dancing in the breeze.
**

ఓ రెండ్రోజులుమొక్కలన్నీ ఆరోగ్యంగా తలలూపుతూ - చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే - అని పాడుకుంటున్నట్లు రంగురంగుల పూలు పూసేశాయి. పువ్వుపువ్వునీ పలకరించి వచ్చిన నాకు ఆ రాత్రి కలల నిండా ఎన్ని సీతాకోకచిలకలో!

రెండో రోజు పొద్దున్న చూద్దునా...పువ్వుల్లేవు ఒక్క మొక్కకీ. పైగా మొక్కలన్నీ ఎవరో తొక్కేసినట్లు నేలకి అతుక్కుపోయి వున్నాయి. బోల్డంత బాధేసేసింది. వెంటనే బదరిని పిలిచి చూపించాను. మా ఇద్దరికీ అర్థం కాలేదు. మా చుట్టుపక్కల ఇళ్లలో మొక్కలూ, పూలూ అన్నీ నిన్న ఎలా ఉన్నాయో ఇవాళా అలాగే వున్నాయి. ఒక్క మా ఇంటి ముందే అన్నీ తెంపేసి వున్నాయి.

సరే! మాకు అది పెద్ద మిస్టరీ - మా ఇంటి ముందు మొక్కలే ఇలా అయ్యాయి ఏమిటా అని!  నాకు మాత్రం నిజ్జంగా మళ్ళీ కలొచ్చింది - మా ఇంటికొద్దామనుకున్న సీతాకోకచిలుకలు రెక్కలు సర్దుకుని వేరే ఇళ్ళకి వెళ్ళిపోతున్నట్లు.

తీరా ఓ రోజు ఆఫీస్ నుంచి వస్తున్న మాకు మాఇంటి ముందు మిగిలిన మొక్కలు, ఆకుల్ని భోంచేస్తున్న జింక-కుటుంబం కనిపించింది. జింక అమ్మ-నాన్నా చేరి వాటి పిల్ల-జింకలకి కొసరికొసరి అసలవి ఇంకెక్కడా తినని లెవెండర్ ఆకులు కూడా తినిపించేస్తున్నాయి. కార్ ఇంటి ముందు పార్క్ చేయబోతున్న మమ్మల్ని చూసి "చేతైతే మమ్మల్ని పట్టుకో" అన్నట్లు చూసి ఒక్క గెంతులో ఇంటి వెనక చెట్ల లోకి వెళ్లిపోయాయి.



వాటిని చూడగానే నాక్కొంచెం కోపమూ వచ్చింది, వాటి బెదిరే కళ్ళని చూసి జాలీ వేసింది. మమ్మల్ని చూసి ఆ కంగారులో ఒకదాని కాళ్లు ఒకటి తొక్కుకుని దెబ్బలు తగిలించుకుంటాయేమోనని.

ఇంతలో పక్క నుంచి బదరి "మన పురాణాల్లో మునివాటికల్లో జింకలు తిరిగేవని గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ మనింటి దగ్గర తిరుగుతున్నాయి అంటే ఇంకెంత గొప్పో చూడు. పాపం! తిననీ వాటిని ... మనకి పోయేదేముంది." అన్నారు. ఇంక తిరుగేముంది... మా ఇంటి ముందు మొక్కలు ఆ నాటి నుంచి జింకార్పణం! ప్రతి ఆమనిలో నేను మొక్కలు వేయడం, అవొచ్చి "ఆమ్" తినడం!

నాకు ఒక సందేహం - మా ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో మొక్కలు ఈ జింకలెందుకు తినట్లేదూ అని. అదే అడిగితే మా ఇంటి పక్క బార్బ్ "Deer Repellant" వాడమని సలహా ఇచ్చింది. పోన్లే- ఇదేదో కొట్టి చూద్దాం అని ఓ డబ్బా పట్టొకొచ్చాము. తీరా ఒకసారి స్ప్రే చేయగానే ఆ వాసనకి కడుపులో తిప్పింది. పాపం! జింకలకి ఈ వాసన తగిలితే వాటికేమన్నా వచ్చినా మనకి తెలియదు. పైగా మనం పీల్చే గాలిలో కూడా లేనిపోని కెమికల్స్ కలుస్తాయి అన్చెప్పి ఆ డబ్బా Trash లో పడేశాం.

అలా ఓ ఐదారేళ్ళు ఇంటి ముందు మొక్కలే వెయ్యలేదు - ఒక వేళ వేసినా వాటికి పెరిగే అవకాశం రాలేదు.

నిరుడు మాత్రం మా ఇంటి దగ్గర వుండే Matt నేను మీ ఇంటి ముందు ల్యాండ్-స్కేప్ చేస్తాను అంటే ముగ్గురు పిల్లల తండ్రి - అతనికి ఏదో సహాయంగానూ ఉంటుంది, మా ఇంటి ముందు నే కలగన్న సీతాకోకచిలకల పేరంటమూ జరుగుతుంది అనుకుని "సరే" నన్నాము. Weed రాకుండా ఉంటుందని Green Mat వేసి మరీ - మేము ఆన్లైన్లో కొన్న Deer Resistant మొక్కలు వేశాడు Matt. ఓ పది రోజుల్లో వేసిన అడ్డుని దాటుకుని మరీ weed వచ్చేసింది. ఆ weed మధ్యలో వున్న మొక్కల్ని ఎంచుకుని మరీ తిని జింకలెళ్ళిపోయాయి.

ఉసూరుమన్న నా మొహం చూసి బదరి Matt ని ఇంకోసారి మట్టిని తిరగేసి మొక్కలు వెయ్యమన్నారు. అతను సరే నన్నాడు.

ఓ శనివారం పొద్దున్నే వంట హడావిడిలో వున్న నన్ను బదరి కిటికీ దగ్గరికి పిలిచి "బుజ్జాయ్! ఇలా చూడొచ్చి... ఎవరో పెద్దావిడ మన ఇంటి ముందు weed తీస్తోంది" అన్నారు. నాకేమో నిజంగామొహమాటం వేసేసింది. మా చుట్టుపక్కల వున్న అన్ని ఇళ్లల్లో మా ఇంటి ముందు మాత్రమే మోకాలెత్తు weed వుంది. ఆ weed మధ్యలో చుక్కల్లా మూడు పూలు అంతే !




మా ఇంటి ముందు నుంచి రోజూ వెళ్లే వాళ్లెవరో చూడలేక వాళ్ళే శుభ్రం చేస్తున్నారేమో అనుకున్నాను. అలా అనుకోగానే - వంట చేస్తున్నానని వంక పెట్టి బదరినే బయటికెళ్లి అడగమన్నాను ఆవిడెవరో. తీరా చూస్తే ఆవిడ Matt వాళ్ళమ్మ. Matt కి నిజంగా ల్యాండ్-స్కేపింగ్ చేయడం తెలీదు. అందుకని ఆవిణ్ణి పట్టుకొచ్చాడు. మొత్తానికి మ్యాటూ, మ్యాటు-మాతా కలిసి - కొన్ని అసలు మొక్కలూ, ఇంకొన్ని కలుపు మొక్కలకీ కుదుళ్ళు కట్టి, వాటికి చుట్టూ వలలు కట్టి, వాటి మీద తెల్లటి రాళ్ళేసి - మొత్తానికి మా ఇంటితోటని ఒబ్బిడి చేశారు. నేను కొన్న మొక్కల చార్టు చూసి "అయ్యో!మీరు కొన్ని మంచి మొక్కలు పీకేసి, అక్కడ కలుపు మొక్కలు పాతారు" అంటే "పోన్లే లలితా! అందంగా వుంది కదా కలుపు మొక్కైతే నేమి?" అందా మ్యాటు-మాత!  నాకా మాట నిజంగా బోల్డు నచ్చేసింది.

ఇంతా చేసి - ఆ మొక్కలన్నా మిగిలాయా అంటే... వలలని మూతులతో ఎత్తి మరీ తినెళ్లిపోయాయి మా జింక-చుట్టాలు.


అదిగో చూడుము...బాల్విను జింకా!
ఆమ్ అయ్యే దానికి మా వనమింకా ...
అనుకుంటూ మేం మిగిలామింక!


19, మార్చి 2019, మంగళవారం

త్వామనురజామి - 34 - చేతిలో చెయ్యేసి చెప్పుకున్నాం...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 33 - సిన్మా ఆట...కాదు - చిన్న మాట!

మేమున్న ఐదవ సెమిస్టర్ - SPMVV క్యాంపస్లో ఇదే ఆఖరి సెమిస్టర్.

ఈ సెమిస్టర్లో పూర్తి చెయ్యాల్సిన జాబితా ...
కరిక్యులర్ - ప్రాజెక్టులూ, MIS సెమినార్ ప్రెజెంటేషన్లూ, ఇంటర్నల్స్, ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్
ఎక్స్ట్రా-కరిక్యులర్ - SPIC-MACAY కార్యక్రమాలు
ఎక్స్ట్రార్డినరీ-కరిక్యులర్ - సినిమాలూ, షికార్లూ, పార్టీలూ, సరదాలూ.

ఆరవ సెమిస్టర్లో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ కోసం పెట్టాల్సిన దరఖాస్తులూ, వాటి మీద దస్కత్తులూ - అవి పంపించాల్సిన ఆఫీసుల చిరునామాలూ - పోగు చేసుకోవడం, పోగుల కొద్దీ కాయితాలు నింపడం, పోస్ట్ చేయడం - ఈ పో-పో-పో లతో వున్న టైమంతా ఎటు పోతోందో, ఎలా ఐపోతోందో తెలీకుండా గడిచి పోతోంది.

ఈ హడావిళ్ల మధ్య ఓ రోజు నాన్న నుంచి ఫోన్ - "లల్లీ! మన ప్రసాద్, విస్సప్ప గారి ఫణి, ఇంకొందరు మనూరి కుర్రాళ్ళు మోటార్ బైక్స్ మీద టూర్ తిరుగుతూ ఓ రెండ్రోజుల్లో తిరుపతి వస్తున్నారు. నీ ఫోన్ నంబర్ ఇచ్చాను ప్రసాదుకి. అక్కడికి రాగానే నీకు ఫోన్ చేస్తాన్నాడు" అని చెప్పారు.

నాకు రెండింతలు సంతోషంగా అనిపించింది. ఒకటి ప్రసాద్ వస్తున్నందుకు, ఇంకోటి బదరికి ప్రసాద్ అంటే ఎవరో చూపించే అవకాశం వస్తున్నందుకు. అసలు సంగతేంటంటే అప్పటికి బదరి మా ఇంట్లో ఎవ్వరినీ చూసుండకపోయినా - నాకసలు అమ్మ పక్క కజిన్స్ ఎంత మందీ, నాన్న పక్క కజిన్స్ ఎంత మందీ - వాళ్లెలా మాట్లాడతారు, ఎలా నవ్వుతారు, ఎలా పాడతారు - ఇల్లాంటివన్నీ చెప్పింది చెప్పకుండా, ఇంక చెప్పడానికేం మిగలకుండా, అసలింతకు ముందు ఎప్పుడో  చెప్పేసినా "అబ్బే ఇదసలు చెప్పందే!" అని దబాయించేసి చెప్పిందే చెప్పేస్తూ - అందులో ముఖ్యంగా మా అనాతవరం గురించి, మా అప్ప గురించి, మా ప్రసాద్ గురించి, తన తమాషా కబుర్ల గురించి, తను నన్ను పిలిచే లకుమారి అనే పేరు గురించి, తను అద్భుతంగా పాడే పాటల గురించి,  తను ఆడే అనాతవరం క్రికెట్ మ్యాచుల గురించి ఎంతో చెప్పి వున్నానేమో - మరి ఆ ప్రసాదే సాక్షాత్తూ వచ్చేస్తుంటే బదరికి తనని పరిచయం చెయ్యాలి అని ఎంతో సంబరపడ్డాను. అదేంటో ... నాకు ఇష్టమైన వాళ్ళందర్నీ బదరికి చూపిస్తే ఆ ఇష్టం రెండింతలయినట్లుండేది.

ప్రసాద్ వాళ్ళు వస్తున్నారు అని నాన్న ఫోన్ చేసిన సంగతి చెప్పగానే బదరి కూడా భలే సంతోష పడి "మనం కూడా తిరుమల వెళ్లి వాళ్లతో కాసేపు సరదాగాగడిపి వద్దాం" అన్నారు. నాకు ఆ ప్లాన్ బాగా నచ్చింది. వాళ్ళు మా హాస్టల్‌కి వస్తే మా విజిటర్స్ రూంలో చెప్పుకోవడానికి కబుర్లే వుండవు. చుట్టూ అందరూ వుంటారు. అదే ... మేం  ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్తే  - ప్రసాద్ పాటలు కూడా వినొచ్చు కదా! అందుకే ...తిరుపతి వచ్చాక ప్రసాద్ ఫోన్ చేయగానే తనకి చెప్పాను - మరసటి రోజు వాళ్ళు దర్శనం చేసుకుని ఉంటే నేను తిరుమలకే వచ్చి కలుస్తానని.

ఆ రెండో రోజు పొద్దున్నే ఆరింటికల్లా బయల్దేరి బస్సులో నేను, బదరి తిరుమల వెళ్లాలనుకున్నాం. పొద్దున్నే తను  మా ఓల్డ్ హాస్టల్ గేట్ దగ్గరకొచ్చి నన్ను తీసుకెళ్ళాలీ అన్నది ప్లాన్.

వెళ్ళేది తిరుమల, వెళ్తోంది బదరితో, వెళ్లాలనుకున్నది ప్రసాద్ కోసం. ఇంకంతే... పసుపు గళ్ళ అంచున్న నల్ల కంచిపట్టుచీర, అద్దాలు కుట్టిన నల్ల బ్లౌజు, నల్ల అద్దాల గాజుల మధ్య పసుప్పచ్చ గాజుగాజులు, జడకి మువ్వలు కుట్టిన పసుపు-నలుపు ఊలు తాడు అల్లుకుని - భలే తయారయ్యా! పొద్దునపొద్దున్నే ఘల్లుఘల్లుమంటూ హాస్టల్ గేట్ దగ్గరకొచ్చేటప్పటికి అక్కడ ఉన్నదెవరేంటి? మొట్టమొదటగా బదరిని నాకు పరిచయం చేసిన RS.

[RS గురించి ఇక్కడ చదివేసుకోవచ్చు (http://boldannikaburlu.blogspot.com/2017/12/20-base.html).]

అలా పసుపూ-నలుపూ గళ్ళుగళ్లుగా, గాజులూ-గజ్జెలూ ఘల్లు-ఘల్లుగా బయటికొచ్చిన నన్ను చూడగానే RS అన్న మొదటి మాట "ఇవాళ అచ్చు అమ్మాయిలా వున్నావు" అని. మరంతకు ముందు దాకా - ఎక్కడికెళ్లినా - నూనె రాసిన దువ్వీదువ్వని తలకో రబ్బర్ బ్యాండూ, ఇస్త్రీ ఎరగని చుంగిణీ నూలు స్కర్టూ, దాని మీదో పొడుగు చేతుల కాలర్ బ్లౌజూ వేసుకుని, చేతికో వాచీ, భుజానికో పింకు సంచీ వేసుకుని, ఓ బొమ్మనెత్తుకుని - ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ - అని పాడుకుంటూ గాలిలో గాలిలా తిరిగే నేను, కుదురుగా జుట్టు దువ్వుకుని, పట్టుచీర కట్టుకుని కనిపించాను మరి!

 తనే వస్తానని చెప్పిన బదరి ఏదో సబ్మిట్ చెయ్యాల్సిన వర్క్ ఉందని - తన బదులు నన్ను తీసుకురమ్మని RS ని పంపించారు. నేను RS తో వెళ్లి వాళ్ళ SBM గేట్ దగ్గర బదరిని కల్సి - అక్కణ్ణించి టౌన్-బస్ ఎక్కి బదరి, నేను తిరుమల బస్టాండుకి వెళ్లి, కొంచెం ఖాళీగా వున్న బస్సెక్కి తిరుమల వెళ్ళేటప్పటికి పదయ్యింది. తిరుమలలో ప్రసాద్ వాళ్ళు వైఖానస ఆశ్రమం ముందు ఒక హోటలుండేది (పేరు మర్చిపోయాను) - అక్కడ రూం తీసుకున్నారు. నన్ను, బదరిని చూడగానే హుషారుగా "రండి రండి" అని ఆహ్వానించారు. వాళ్ళందరూ బదరిని చూడడం అదే మొదటి సారైనా చాలా తొందరగా కలిసిపోయి ఎప్పట్నుంచో ఎరిగున్న వాళ్ళలా మాట్లాడేశారు. అందరం కలిసి పాపవినాశనం వెళ్ళొచ్చాము.

అంతా తిరిగి మధ్యాహ్నం హోటల్ రూంకి తిరిగొచ్చాక బదరి "ప్రసాద్! మీరు చాలా బాగా పాడతారని లల్లీ చెప్పింది. మీరో పాట పాడేస్తే ఆ పాట వినేసి మేమెళ్ళిపోతాం. లల్లి ఆరున్నరలోగా హాస్టల్లో ఉండాలి మరి!" అన్నారు.

"ఏం పాట కావాలోఅడగండి" అడిగాడు అడగ్గానే పాడేసే మామంచి ప్రసాద్.

"అదే! ఓ పాటుంటుంది చూడండి... బుగ్గ మీద పెళ్ళిబొట్టు ముద్దులాడ, రంగులీను నీ మెడలో బంగరపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే... మొదలేదో నాగ్గుర్తు రావట్లేదు కానీ ఆ పాట పాడండి"  అదే కావాలని మరీ అడిగారు బదరి.

అది వినగానే అప్పటిదాకా ఔనా-కాదా అనుకుంటున్నదేదో "ఔను కాక మరేంటి?" అన్నట్లనిపించిందేమో... వెంటనే నవ్వీ-నవ్వని కళ్ళతో నవ్వుతూ, హుషారుగా మొదలుపెట్టి "నన్ను వదలి నీవు పోలేవులే ... అది నిజములే..." పాట పాడేశాడు ప్రసాద్. ఆ పాటలో తనకు నచ్చిన చరణం రాగానే బదరి కంట్లో మెరిసిన మెరుపులు చూసిన నా కంటి మురుపులు ఇప్పటికీ మరపురాని మైమరపులే!

సాయంత్రం నాలుగింటి దాకా ప్రసాద్ పాటలు, అనాతవరం కబుర్లు విని, ఇంకప్పుడు బయల్దేరి తిరుపతి వచ్చేశాం. నన్ను మా హాస్టల్ దగ్గర దింపేసి బదరి వెళ్లిపోయారు. నేను వెంటనే 506-బి లో సునీత దగ్గరికి వెళ్ళాను. అక్కడే నిరుపమ, సబ్-జూనియర్ మాధవి కూడా వున్నారు. నన్ను చూడగానే సునీత "లల్లీ...ఈ పట్టుచీర అచ్చు నీకోసమే నేసినట్టుంది" అని తెగ మెచ్చేసుకుంది. నాకు బోల్డంత సిగ్గేసేసింది. అలా ఆ రోజు ఎప్పటికీ గుర్తుండేలా గడిచిపోయింది.


మార్చ్ నెల 19న మా క్లాస్ అమ్మాయిలందరూ హోలీ ఆడుకుని వేడుక చేసుకున్నారు. నేనది మాత్రం మిస్ అయ్యాను.

ఇక ఏప్రిల్ భలే ఈవెంట్-ఫుల్ నెల. ఈ నెల్లోనే కిరణ్ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చారు. ఈ నెల్లోనే ఘరానామొగుడు సినిమా మూడుసార్లు చూశాను. ఈ నెల్లోనే నిరుపమా, నేనూ జన్మలో పుచ్చకాయలు తినకూడదని ఒట్టేసుకున్నాం.

ఇంతకు ముందు చెప్పాను కదా - సిక్స్త్ సెమెస్టర్లో చెయ్యబోయే ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడాలని చెప్పి కిరణ్ నంబర్ తెచ్చుకున్నానని! ఓ రోజు బాలాజీ కాలనీలో STD బూత్‌కి వెళ్లి ఫోన్ చేశాను కిరణ్‌కి. తను అటు ఫోన్ తియ్యగానే పెద్ద ఉపోద్ఘాతమేమీ లేకుండా "కిరణ్! మీరొకసారి తిరుపతి రాగలరా ప్లీజ్!" అనడిగాను. అసలే చాలా సౌమ్యంగా మాట్లాడే కిరణ్ ఎందుకూ-ఏమిటీ లాంటి ప్రశ్నలేమీ అడక్కుండా "అయ్యో! తప్పకుండానండి! వచ్చే శనివారం వస్తాను" అన్నారు. అన్నట్లుగా వచ్చారు కూడా! తను తిరుపతిలో దిగి హాస్టల్లో నా దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడయ్యింది. అదే టైంకి బదరి కూడా వచ్చారు.

మంచి ఎర్రటి ఎండ. నల్లటి చీర నా మేన్నిండా! దాని కథేంటంటే ... నేనేదో కేరళ-కాటన్ చీర కొనుక్కుంటే... "ఆయ్! హన్నా! మధుపర్కంలా వుంది - ఇలా బాలేదు" అన్జెప్పి దానికో మంచి డిజైన్లో నల్ల ప్రింట్ వేయించేసింది అమ్మ. వెతికివెతికి ఆ చీరే కట్టుకున్నానా రోజు.

సరే! నాకో పక్క కిరణ్, ఇంకో పక్క బదరి - మేం ముగ్గురం ఎండలో నడుచుకుంటూ పద్మావతి కాలేజ్ గోడ పక్క రోడ్డులో SVU వైపు బయల్దేరాం. అలా నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరినీ ఒకరినొకర్ని పరిచయం చేశాను. తర్వాత కిరణ్ కేసి తిరిగి "కిరణ్! నాకు బదరి అంటే ఇష్టం. నాకు తన మీదున్న ఇష్టం వల్ల పప్పీకి ఇబ్బంది రాకూడదని, ఆ సంగతే మాట్లాడదామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. దీని వల్ల పప్పీని చేసుకుందామనుకున్న మీ డెసిషన్ లో ఏమీ మార్పుండదు కదా? ప్లీజ్ ... అర్థం చేసుకుంటారు కదా?" అనగానే కిరణ్ వెంటనే "అరె! అలా ఏం లేదండి లల్లీ! అసలు మీరు ఫోన్ చేసి రమ్మనగానే ఇక్కడికొచ్చాక మీరు పెళ్ళైపోయింది అంటారనుకున్నాను" అన్నారు నవ్వుతూ. "ఇంకా నయమండి, కిరణ్! నా పెళ్లి మా అమ్మా-నాన్న చెయ్యాలి" అని నేనూ నవ్వేశాను. కిరణ్ ఇంకో అరగంట మాతో ఉండి బదరితో తన MBA గురించి, SBM గురించి మాట్లాడి, తన విప్రో జాబ్ గురించి విశేషాలు మాక్కూడా చెప్పి, సాయంత్రం బయల్దేరి మళ్ళీ బెంగళూరు వెళ్లిపోయారు. నాకా రాత్రి చాలా హ్యాప్పీగా అనిపించింది. నాకు చేతనైనంతలో నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలక్కుండా ఏదో గొప్పగా మేనేజ్ చేసేస్తున్న ఫీలింగ్.

అన్నట్లు ఏప్రిల్లో ఘరానామొగుడు రిలీజ్ అయ్యింది. నేను, నిరుపమ, సునీత, సబ్-మాధవి వెళ్ళొచ్చాము. చూసి రాగానే మాతో రాని మల్లికా-నిగమలని తీసుకుని మళ్ళీ వెళ్ళాము. అదయ్యాక మా రూమ్మేట్ నాగలక్ష్మి అడిగిందని తనతో ముత్యం మూడోసారి కూడా ఘరానామొగుడు సినిమా కెళ్ళొచ్చా. అంత మూడు సార్లు చూడడానికి ఆ సినిమాలో ఏం లేకపోయినా - ఆ సినిమాలో నాకేం నచ్చిందీ అంటే నా చుట్టూ వున్నవాళ్లు నాతో కల్సి సినిమా చూడడం సరదాగా ఉందీ అనడం, వాళ్ళ సరదా చూసి నేను సరదా పడడం.

ఇంకిప్పుడు మా పుచ్చకాయ కథ!

అనగనగా ఓ ఎండాకాలపు రోజు... చుట్టూ వున్న కొండల మీదున్న బండల మీద పడ్డ ఎండలు పరావర్తనం చెంది గుండుల్ని మండిస్తున్న రోజు...

నేనూ, నిరుపమ మధ్యాహ్నం క్లాసులైపోగానే అడుగులో అడుగేసుకుంటూ - తినబోయే ఊరించని మెస్సు ఫుడ్డుని తలుచుకుంటూ - ఉసూరుమంటూ - ఈదురు గాలికి ఈసురోమంటూ - నేను నా కాలికి అడ్డొచ్చిన రాయిని తంతూ ఉంటే, "సరిగ్గా నడవలేవా" అంటూ నిరుపమ నన్ను విసుక్కుంటూ - రూంకి వస్తూ వున్నాము.

ఎప్పుడూ లేనిది మా హాస్టల్ బయట ఓ ముసలావిడ కూర్చుని పుచ్చకాయలు అమ్ముతోంది. ఆవిడ ముందు లెక్కకి ఓ పది పుచ్చకాయలున్నాయి. వాటిని చూడగానే మా ఇద్దరికీ తినాలనిపించింది. చల్లచల్లటి, తియ్యతియ్యటి పుచ్చకాయ చెక్కలు చేత్తో పట్టుకుని కొరుక్కు తింటుంటే ఎంత బావుంటుందో మాకు మేమే ఊహించేసుకుని - మాకు మేమే ఊరించేసుకుని - వున్న వాటిల్లో ఓ పే...ద్ద పుచ్చకాయని కొనేసుకుని, దాన్ని ఇద్దరం చెరో చెయ్యి వేసి మోసేస్కుని -

జానే జిగర్ జానే-melon
ఢాఈ సౌ కిలో తేరా వజన్
తూ జో మేరే పైర్ పర్ గిరీ
మర్ జాఊంగీ ఈ క్షణం...


అని రాహుల్ రాయ్-అను అగర్వాల్ (ఆషికీ) వరసలో పాడేస్కుంటూ మా మూడో అంతస్తులో వున్న 603-ఏ రూంలోకి తెచ్చి పెట్టేస్కున్నాం.

ఇద్దరం గబగబా వెళ్లి ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లు నోటికి అహిత - రుచి రహిత - సాంబార్సహిత - అప్పడ విహిత - పెరుగన్నం తినేసి - తినేటప్పుడే పుచ్చకాయని ఎలా కోసుకుని తినాలా అని ప్లానేసేస్కుని - చేతులూ, మూతులూ, ప్లేటులూ కడిగేస్కుని - పరిగే ...త్తుకుంటూ రూంకొచ్చేసి - తలుపు వేసేస్కుని - లైటార్పేసి  - నేల మీద పేపరొహటి పరుచుకుని - ఓ చాకుతో పుచ్చకాయ కోస్కుని - ఎదురెదురుగా కూర్చుని - నెలవంకలాంటి ఒక్కో పుచ్చకాయ ముక్కనీ తీసుకుని - అందరాని చందమామ మాకెందుకూ... అందిన ఈ పుచ్చచెక్క చాలు మాకు... అని నోట్లో-నోట్లో పాడుకుంటూ మొత్తం ఓ గంటలో పుచ్చకాయలో గింజలూ, గ్రీనుపార్టూ  తప్ప అంతా తినేశాం.

ఆ తలుపులేయడాలూ, లైట్లార్పడాలూ, నోట్లో-నోట్లో పాడుకోవడాలూ ఎందుకంటే ... మా రూంలోఎవరైనా ఉంటే తప్పనిసరిగా లైటు వెలుగుతూనే ఉండేది పగలైనా. మా ఇద్దరికీ ఆ రోజు ఆ పుచ్చకాయని అస్సలు ఇంకెవరితోనూ పంచుకోవాలనిపించలేదు. మేమిద్దరమే దాన్ని తినాలీ అనేసుకున్నాం. అందుకని తలుపేసేసి, లైటార్పేసి, నిశ్శబ్దంగా ఉంటే - లోపల మేం లేమనుకుంటారు కదా - అనాలోచించి - అల్లా చేశామన్నమాట!

ఇంతకీ పుచ్చకాయ అంతా తిన్నవాళ్ళం ఏమయ్యాం? పట్టరాని కడుపు నొప్పితో తిన్నగా నడవలేక నడుం దగ్గర అరవై డిగ్రీల కోణంలో ఒంగి - ఓ రెండ్రోజులు ఒంగిఒంగి నడిచాం - literally.

ఆ నొప్పి ... మహా మరపురాని నొప్పి - మళ్ళీ జన్మలో పుచ్చకాయ జోలికెళ్ళమని చెప్పి - నేనూ, నిరుపమా...

చేతిలో చెయ్యేసి చెప్పుకున్నాం...
పుచ్చకాయ ముక్కలు  కొనుక్కోమనీ...
కొన్నా తినమనీ...


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

10, మార్చి 2019, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 16 - ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 15 - ఏలా... ఏలేశ్వరం ఏగుటేలా?

1976 నవంబర్ మొదటి వారం. ఆదివారం రోజున లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు, పంతులుగారు ఆఫీసులో మీటింగ్ పెట్టారు. పెట్టి - నాకన్నీ చెప్పి "ఏలేశ్వరం వెళ్లూ, వెళ్లి ముందు అవన్నీ సరిజేయమని" చెప్పేసి అన్నారు.

అసలింతకీ ఏమిటంటే నేను సోమవారం బయల్దేరి వెళ్ళాలి. మంగళవారం లేదు, బుధవారం మార్కెట్టు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఐఎల్టీడీ మాకు కాంపిటీటర్. వాళ్ళోపెన్ చేస్తున్నారు బుధవారం. అదే సమయానికి మేం కూడా ఓపెన్ చేయాలి. ఈ లోపులో ఏమయిందంటే మా లీఫ్ మేనేజర్ సీతారామయ్య పంతులు గారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ మధ్య. ఆయనెక్కడికీ ప్రయాణాలు చెయ్యట్లేదు. అంచేత ఆయనేమో చిలకలూరిపేటలో ఆగిపోయారు. ఆయన బదులుగా ప్రొడక్షన్ మేనేజర్ LM తనేజా అని యూపీ ఆయన...ఆయనేమో బయ్యింగుకి వస్తాడని చెప్పారు. ఆయనకేమో తెలుగు రాదు, హిందీ, ఇంగ్లీషు. "సరే అయితే నే బయల్దేరి వెళ్తా రేప్పొద్దున్నే" అన్నా.

ఈలోపులో వీళ్ళేం చేశారంటే విజయవాడలో బుల్లెట్ మోటార్ సైకిలు బుక్ చేశారు ఏలేశ్వరం కోసం అని చెప్పేసి. దాని నంబర్ ఏపీజీ 7631. "నువ్వు విజయవాడ దాకా వెళ్లి, షోరూంకి వెళ్లి ఆ బుల్లెట్ తీసుకుని, దాని మీదే వెళ్ళిపో ఏలేశ్వరం" అన్నారు. విజయవాడ నుంచి ఏలేశ్వరం 230 కిలోమీటర్లు. చిలకలూరిపేట నుంచి మూడొందల కిలోమీటర్లు. సరే అంజెప్పేసి నేను సోమవారం పొద్దున్నే ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయల్దేరి వెళ్ళాను. విజయవాడ చేరేటప్పటికి పదకొండు అయింది.  పదకొండుంపావుకల్లా బుల్లెట్ డెలివరీ ఇచ్చారు నాకు. దాంతో పాటుగా ఓ హెల్మెట్. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరూ హెల్మెట్ వేసేవారు కాదు. కాకపోతే నేను కర్ణాటకలో చేసొచ్చాను కాబట్టి హెల్మెట్ అలవాటయ్యింది. ఓ హెల్మెట్, ఓ జెర్కిను, తరవాత ఏంటంటే గ్లౌజెస్సు, ఇంకా షూస్ - ఇవన్నీ కొనుక్కుని  బుల్లెట్ తీసుకుని, అక్కణ్ణించి బుల్లెట్ మీద  ఏలేశ్వరం బయల్దేరా - వయా రాజమండ్రి. రాజమండ్రికో ఏభై కిలోమీటర్లుంటుందన్నమాట. సరే - దార్లో టిఫిన్లకి, టీలకి ఆగడం ఇవన్నీ చేసేటప్పటికి సాయంత్రం ఐదూ-ఐదున్నరకల్లా ఏలేశ్వరం చేరి పోయాను.

కొత్త బుల్లెట్టు, నేనూ దిగేటప్పటికి ఏలేశ్వరం బ్రాంచ్ వాళ్ళందరూ "ఏంటి బండేసుకొచ్చేశావా ఏకంగా అక్కణ్ణించి నువ్వూ?! " అన్నారు. "బండి కొన్నారయ్యా...మీ ఏరియా బ్రాంచెస్ కోసమే కొన్నారు. వాడినంతకాలం వాడతాను, తర్వాత ఇక్కడే విదిలేస్తాను" అన్నాను. నే తీసుకెళ్లిన బుల్లెట్ కాక అక్కడ జీపొహటుండేది.

ఏలేశ్వరంలో దిగాను కదా...ఆఫీసులో కూర్చుని ఆ రాత్రికి చేసే పనేమీ లేదు కదా! ఆ వూళ్ళో సినిమా హాళ్ళుండేవి. బాల్కనీ రెండ్రూపాయలు. ఫష్షో సినిమాకెళ్ళొచ్చాను. సినిమాలు చూడాలంటే రాజమండ్రి వెళ్ళమన్నారు, ఈ ఊళ్ళో చూడొద్దన్నారు కానీ సినిమాయే కదా అనేసి వెళ్లొచ్చేసాను. అక్కడ చైనులు అంజెప్పేసి ఓ ఎసిస్టెంట్ క్యాషియర్ ఉండేవాడు. అతను శ్రీకాకుళం నుంచొచ్చాడు. అప్పట్లో  ఎస్వీ సోమయాజి అని ఒక సీఏ జేరాడు హెడ్డాఫీసులో ఫైనాన్స్ మేనేజరుగా. ఆయన మేనల్లుడు ఈ చైనులు. ఇతను కాక ఇంకో క్యాషియర్, మేనేజర్, ట్రెయినీ మేనేజర్  - వీళ్లూ ఏలేశ్వరం ఆఫీస్ స్టాఫు.

రెండో రోజు పొద్దున్నే వాళ్ళందర్నీ కూర్చోబెట్టి - చెయ్యాల్సిన కార్యక్రమమేంటి, ఎక్కడికెళ్ళాలి, ఎవర్ని కలవాలి - ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేశా. ఇక్కడేమయిందంటే ఏలేశ్వరం సెంటర్ పాయింటు. ఇటు ప్లెయిన్సులో - అంటే జగ్గంపేట ఏరియాలో - నరేంద్రపురం, భావవరం, గుఱ్ఱాలపాలెం, గండేపల్లి, మన్యంవారిపాలెం - లలో కొంత బర్లీ టొబాకో కొనుగోలు చేశారు. ఇంక రమణయ్య పేట, గుంటువారిపాలెం, కరివేవపాలెం, అమీనాబాద్ కాలనీ, చికిలింత - ఇటువంటి ఏరియాలు ఏజెన్సీ. చాలా డీప్ ఏజెన్సీ అది.

సరే! క్యాషియర్ ఏమన్నాడంటే "బాసూ! రేప్పొద్దున్నే నరేంద్రపురం వెళ్ళిపోదాం. వెళ్లి అక్కణ్ణించి మొదలుపెట్టు నువ్వు" అన్నాడు. అసలు సంగతేంటంటే నే రావడానికి ముందు ఎంక్వైరీకి వచ్చిన దత్తు (మణి) గార్ని కూడా అలాగే మేనేజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్లెయిన్సులో వున్న రైతులు కొంచెం ఎడ్యుకేటెడ్ వున్నారక్కడ. అక్కడ మోసం చేసే జరిగే అవకాశం లేదు. అది చూచాయగా గ్రహించాను నేను. అంచాత "సరే కానీయ్. వెళదాం" అంచెప్పేసి "నువ్వు డ్రైవ్ చెయ్, నువ్వే తీసుకెళ్ళు నన్ను" అంచెప్పి వెనకాల కూర్చున్నా.

నరేంద్రపురం, ఆ చుట్టుపక్కల ఏరియాలు తిరిగాం ఆ రోజున. ఆ రోజు మంగళవారం రోజు. తిరిగినప్పుడేమైందంటే ఏ రైతును కలిసినా కూడా ఎక్కడా ఫ్రాడ్ కనపళ్ళా నాకు. ఇంతకుముందు మణి కూడా పాపం! - అలాగే బోల్తా పడి "అంతా బానే వుంది" అని రాసేశాడు. ఎందుకంటే రైతులందరూ చదువుకున్నవాళ్ళు. వాళ్ళని మోసం చేస్తే తాట తీసేస్తారు స్టాఫుని.

అదయ్యాక మరసటి రోజు పొద్దున్న బుధవారం నాడు - ఆ రోజు మార్కెట్టు ఓపెన్ అయ్యేరోజది. దాదాపు ఎమ్మెల్ కంపెనీ రైతులే ఓ వెయ్యి మంది వున్నారక్కడ. ఒక పదిహేను వందల బేళ్లు ప్లాటుఫార్మ్ మీది కొచ్చినయ్ అమీనాబాద్ కాలనీలో. LM తనేజా గారు ఆ రోజు పొద్దున్న చిలకలూరిపేటలో బయల్దేరి పదకొండింటికల్లా వచ్చేస్తాను AB కాలనీకి, ఈలోపులో మీరేర్పాట్లు చేసుకోండి అని చెప్పారాయన.

నేను పొద్దున్నే ఆరింటికల్లా స్నానం అదీ చేసేసుకుని, బుల్లెట్ మోటార్ సైకిలేసుకుని, క్యాషియర్ని  ఎక్కించుకుని తిన్నగా జెడ్డంగి వెళ్ళాను. ఫ్రాడ్ రిపోర్ట్ చేసిన రైతునాయకుడు వసంతరాయుడు ఆ జెడ్డంగిలో ఉంటాడు. వెళ్లి అతన్ని కలిశా.

కలిసి "వసంతరాయుడు గారూ...ఇలా వచ్చాన్నేను. ఎంక్వైరీ కోసమే వచ్చాను. ఇవాళ బయ్యింగ్ వుంది. మీరొక్కసారి ఆ బయ్యింగ్ దగ్గరికి రండి గొడవ లేకుండా. పంతులుగారి కేమో ఆరోగ్యం బాలేదు. ఆయన స్థానంలో వచ్చే ఆయన యూపీ నుంచి వస్తున్నాడు. ఆయనకి తెలుగు రాదు. అంచేత మీరు కూడా వచ్చి నిలబడితే ఏదో విధంగా బయ్యింగ్ ఐపోతే ఈ రోజు నేను మిగతా పనులన్నీ చూస్తానిక్కడ" అంజెప్పేసి అంటే, ఆయన కూడా "సరేనండి" అని అమీనాబాద్ కాలనీకి వచ్చాడు.

వచ్చేటప్పటికి పదిహేనొందల బేళ్లతో కళకళ్ళాడిపోతోంది ప్లాట్‌ఫార్మ్. ఓ పక్కనేమో ఐఎల్టీడీ ప్లాట్‌ఫార్మ్. వాళ్ళకీ అన్ని బేళ్ళూ వచ్చేసినయ్. వచ్చిన  రైతులందరి దగ్గరా పాస్‌బుక్కులుంటాయి. ఎందుకంటే యూనియన్ బ్యాంకు వీళ్ళందరికీ అప్పులిచ్చింది కంపెనీ ద్వారా. వాళ్ళు ఈ అమ్మిన సేల్స్ అన్నీ కూడా మేము యూనియన్ బ్యాంకుకి సబ్మిట్ చెయ్యాలి. చేస్తే వాళ్ళు అప్పు మొత్తం కట్ చేసేస్కుని మిగిలిన బాలెన్సు రైతులకిచ్చేస్తారు. అదీ అక్కడ పధ్ధతి. సరే! "అందర్నీ పాస్‌బుక్కులు తెచ్చుకోమనండి. నేను అన్నీ వెరిఫై చేస్తాను" అని చెప్పా. చెప్పేటప్పటికి సరే నన్నారు వసంతరాయుడు గారు. ఆయనింట్లోనే టీ అదీ తాగాము. తాగి జెడ్డంగి నుంచి బయల్దేరి అక్కణ్ణించి పది పన్నెడు కిలోమీటర్లు -అదంతా అసలు రోడ్డుండదన్నమాట, కొండల్లోంచి వెళ్ళాలి. మోటార్ సైకిలు మీదే అక్కడికెళ్ళాం.

వెళ్ళాక అక్కడేంటంటే అంతా ట్రైబల్స్ - సేనాధిపతులు, కోయలు, చెంచులు, కొండకాపులు. వాళ్లకి అసలు ఏమీ తెలీదు పాపం! వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళని కాంట్రాక్టర్లు అసలు దోచుకోవడమే! అటువంటి ఏరియా అది. పాపం! ఆ రోజుల్లో హే... మీ తెలిసేది కాదు వాళ్ళకి. ఇవాళంటే వాళ్ళూ నేర్చుకున్నారు .

సరే! అక్కడికెళ్లి కూర్చున్నాక ఏంటంటే - ఇంకా టైముంది. మేమెళ్ళేసరికే దాదాపు పదయిపోయింది. పదకొండు గంటలకి వస్తాన్నాడు కదా తనేజా గారు! అన్నట్లుగానే పదకొండు గంటలకి వచ్చేశాడు. వచ్చేసి బయ్యింగ్ మొదలుపెడతానంటే "ముందు మా లెక్కలు తేల్చండి, తర్వాతే మీ బయ్యింగ్, లేకపోతే చెయ్యడానికి వీల్లేదు" అన్నాడు వసంతరాయుడు గారు. 

"సరే! ఆ పాసుబుక్కులు తీసుకు రండి, నేను చూస్తాను" అని చెప్పేసి అక్కడ ఓ టేబుల్ దగ్గర కుర్చీ వేసుక్కూర్చున్నా. క్యాషియర్ని పక్కన కూర్చోపెట్టుకున్నా. అలా కూర్చుని ఒక్కో పాస్‌బుక్ తీసి ఆ ఎంట్రీలన్నీ చూస్తూ, ఎంక్వైరీ చేస్తూ చూస్తుంటే ఒక్కోదానికి అరగంట టైం పడుతోంది. అలా వెయ్యి మంది రైతులవి  చూడాలంటే ఎంత టైం పడుతుంది? అదే వసంతరాయుణ్ణి పిలిచి చెప్పా.

"ఏమండి! ఈ రకంగా చేస్తే నాకెంత టైం పడుతుందో ఆలోచించండి. అవసరమైతే మూణ్నెల్లు కాదు నాలుగు నెల్లు వుంటానిక్కడ నేను. మీ ఎకౌంట్లన్నీ ఫైనలైజ్ చేసి, మీకొచ్చే ప్రతి రూపాయి ఇప్పించి వెళ్తానిక్కణ్ణించి. దయచేసి బయ్యింగ్ ఆపకండి - ఆయన చిలకలూరిపేట నుంచి వచ్చాడు తనేజా గారు. ఆయన్ని బయ్యింగ్ చేసుకుని వెళ్ళిపోనివ్వండి. నేనిక్కడ ఉండి - నేను భరోసా ఇస్తున్నాను మీకు - నేను హామీ ఇస్తున్నా నేనిక్కడుండి మీ కార్యక్రమం అంటా చక్కబెట్టి వెళ్తాను " అంటే "సరే" నని ఆయన అందరికీ మీటింగ్ పెట్టి చెప్పి "ఈయనుంటాడు, కామేశ్వరరావుగారుంటాడు. ఆయన మన వ్యవహారాలన్నీ చూస్తాడు. బయ్యింగ్ చేయనిద్దాం" అంటే తనేజా గారు బయ్యింగ్ చేసేశాడు. ఆ సాయంత్రానికి వెళ్ళిపోయాడు.

ఈ సాయంత్రం లోగా ఏంటంటే నేను ఖాళీగా కూర్చోలేదు. ప్రతివాణ్ణి పిలవడం, పాస్‌బుక్ తీసుకు రమ్మనడం. ఇందులో కొంతమంది ... కొండకాపులు అన్నవాళ్ళు ఏంటంటే ప్లెయిన్స్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవాళ్లు. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళున్నారు. క్యాషియర్ గానీ, మేనేజర్ గానీ వాళ్ళ జోలికి పోలా. వాళ్ళ జోలికి నేనూ పోలేదు. కాస్త ఏమీ తెలియని ట్రైబల్స్ ఉంటే - వాళ్లలో ఒకణ్ణి పిలిచి ఇంటర్వ్యూ చేశా.

" ఏమయ్యా నీకు మందు బస్తాలు ఎన్నిచ్చారు? తెల్లపిండెన్ని? నల్లపిండెన్ని?"
తెల్ల పిండి అంటే డీఏపీ. నల్ల పిండంటే నైట్రైట్స్.
"అయ్యా! నాకు తెల్లపిండి ఒక బస్తా, నల్లపిండి ఒక బస్తా ఇచ్చాడు"
అంటే వీళ్ళు "లేదు ...తెల్లపిండి రెండు బస్తాలిచ్చాం, నల్లపిండి రెండు బస్తాలిచ్చాం" అనే వాళ్ళు.
ఎందుకంటే ఆ మందుబస్తాల్లో కొట్టేశారు వీళ్ళు.
"చూడు క్యాషియరూ! నేను ట్రైబల్స్ చెప్పింది నమ్ముతా! వాళ్ళ అమాయకత్వం చూస్తే నాకు వాళ్లనే నమ్మాలనిపిస్తోంది. వాడు చెప్పింది ఇక్కడ నోట్ చేస్తా. వాడు ఒక బస్తా ఇచ్చాడన్నాడనుక్కో, నువ్వు కాదూ రెండు బస్తాలన్నావనుకో - ఆ రెండో బస్తా నీ పెర్సనల్ ఎకౌంట్లోనో, మేనేజర్ ఎకౌంట్లోనో వేసేసుకోవాలి. ఇందులో ప్రశ్నే లేదు." అంజెప్పేసి కొంచెం గట్టిగానే వాదించేశాను.
ట్రైబల్స్ కూడా "ఓ... ఈయన మన తరఫునే మాట్లాడుతున్నాడు " అంజెప్పేసి వాళ్ళు కూడా మాం...చి హుషారైపోయారు.

మార్కెట్లో బయ్యింగ్ అయిపోయి సాయంత్రం నాలుగింటికల్లా తనేజా గారు బయల్దేరి చిలకలూరిపేటకి వెళ్ళిపోయాడు. ఇంక నేనేంటంటే రోజూ పొద్దున్నే బయల్దేరి అక్కడికెళ్ళడం - అమీనాబాద్ కాలనీలో కూర్చోవడం - ఎందుకంటే "అన్ని ఊళ్ళూ నేను తిరగలేను" అని చెప్పా. "రోజుకో వూరు వాళ్ళు రండి. రోజుకెన్ని ఎకౌంట్లవుతాయో చూసుకుందాం. ఇందులో తక్కువ చేశారు అనుకున్నవాటికి వాళ్ళ ఎకౌంట్లో రాసేస్తాను. ఇందులో నిర్మొహమాటంగా చెప్తున్నాను నేను" అంజెప్పేసంటే వసంతరాయుడు కూడా నాతోటుండేవాడు.

సరే...ఈ ఆఫీసు స్టాఫు  -కొంత డబ్బు కూడా చెల్లించేవారు ట్రైబల్స్‌కి. దానికి వోచర్లు వీళ్ళే వేలిముద్రలు నొక్కేశారు.
ఓ ఏజెన్సీ రైతుని పిలిచి "నీకు డబ్బు ఎంతిచ్చారు" అంటే "నాకో ఒంద రూపాయలిచ్చారయ్యా." అనేవాడు.
"వందేంటి? - అప్పుడేమో చెట్టు కింద కూర్చున్నప్పుడు పాతిక రూపాయలిచ్చాను కదా నీకు?" అనేవాడు క్యాషియర్.
"లేదయ్యా. నాకు నువ్వు ఒందే ఇచ్చావు" అనే వాడు వీడు.

అప్పుడు వందా కోయరైతు పేర్న రాసి, పాతికా వీడి పేరున రాసేవాణ్ణి. ఆ రకంగా మూడు నెల్ల పాటు ఏలేశ్వరంలో వుండి - అంటే మధ్యమధ్యలో శనివారం శనివారం గణపవరం వచ్చేసేవాణ్ని - మళ్ళీ సోమవారం పొద్దున్న బయల్దేరి వెళ్ళిపోతూ వుండేవాణ్ణి బస్సులో. బుల్లెట్ అక్కడే విదిలేశాము. అక్కడికెళ్ళినప్పుడు బుల్లెట్ వాడుకునేవాణ్ణి. ఈ రకంగా చేసి మొత్తానికి మందుబస్తాల్లో, డబ్బు పంపకాల్లో తేడాలన్నీ బయటేశా.

ఈ లోపులో ఏమైందంటే - యూనియన్ బ్యాంకులో ఐఎల్టీడీకి, మా కంపెనీకీ కూడా  ఎకౌంట్లుండేవి. కొంతమంది రైతులు అక్కడా లోన్ తీసుకున్నారు, ఇక్కడా లోన్ తీసుకున్నారు. అంటే అక్కడో రెండు బేళ్లు, ఇక్కడో రెండు బేళ్లు పెట్టేవారు. అలాక్కూడా జరిగింది.  అదేమైందంటే ఆ రైతులకి యూనియన్ బ్యాంకు వాడేం చేశాడంటే మా కంపెనీకి అమ్మిన సేల్ ప్రొసీడ్సన్నీనేమో జమ కట్టేసుకున్నాడు. ఐఎల్టీడీ పేరు మీదిచ్చిన లోన్లు కూడా దీనిమీదే క్లియర్ చేసేశాడు. ఐఎల్టీడీ రైతులకి కాష్ పేమెంట్స్ ఇచ్చేది. దానికి ఆ ట్రైబల్స్ ఏమన్నారంటే "అక్కడా మేం అప్పు తీసుకున్నాం, ఇక్కడా తీసుకున్నాం. ఐఎల్టీడీ మాకు పేమెంట్లు ఇస్తున్నారు. మీరివ్వట్లేదు. అవన్నీ మీరు మిగిల్చేసుకుంటున్నారు" అంటూ కొంచెం రివర్స్ అయ్యారు.

"అది కూడా నేను బయట పడేస్తాను, తొందర పడకండి" అని చెప్పా. ఆ ఇష్యూ తెలియాలంటే నాకు ఆఫీసు స్టాఫు సహకరించట్లేదు. ఏం చెయ్యాలో నాకర్థం కాలా. ట్రెయినీ మేనేజర్ స్వామి కారంచేడు నుంచొచ్చాడు. అతి మెత్తటి వాడు, మంచివాడు. ఇతన్ని బుట్టలో వేసుకుంటే మన పని అవుతుందని చెప్పేసి ఆ స్వామిని బండెక్కించుకుని తిరిగేవాణ్ణి. స్వామికి బుల్లెట్ అంటే మహా ఆనందం, ఇష్టం. "నాకు బండి నేర్పు గురూ!" అనేవాడు. "తప్పకుండా నేర్చుకుందువు గాని బండి" అనేవాణ్ణి.

సాయంత్రం పూట స్వామి, నేను వెళ్లి ఏలేశ్వరం రిజర్వాయిర్ దగ్గర గట్టు మీద కూర్చునేవాళ్ళం.

"స్వామీ! నాకో సందేహం. అడుగుతా విను. నాకు ఈ బ్యాంకు ఇష్యూస్ అసలర్థం కావట్లేదు. ఒకసారి బ్యాంకు మేనేజర్ దగ్గరికి నన్ను తీస్కెళ్తావా? ఈ బ్యాంకులో ఏదో మతలబు జరిగింది. మీకు తెలుసా విషయాలు. కానీ చెప్పట్లేదు బయటికి. నువ్వు కూడా ఎందుకు చెప్పట్లేదో నాకర్థం కావట్లేదు. నువ్విందులో నాకు సాయం చేశావంటే నేన్నీకు ప్రామిస్ చేస్తున్నాను -  ఫస్ట్ థింగ్ నీకు బుల్లెట్ నేర్పుతాను. సెకండ్ థింగ్ ఈ మేనేజర్ని, క్యాషియర్ని ఇక్కణ్ణించి లేపేస్తా. ఈ బ్రాంచుకి నువ్వే మేనేజర్ వవుతావ్." అని ఒక విధంగా ప్రోబ్ చేశా.

చేసేటప్పటికీ ...పడ్డాడు నా వల్లో. "తప్పకుండా బాసూ, వెళదాం" అని చెప్పేసి మరసటి రోజు పొద్దున్నే యూనియన్ బ్యాంకు మేనేజర్ దగ్గరికెళ్ళాం.

వెళ్లి "ఏంటి సర్ - ఏంటీ పరిస్థితి? వాళ్ళకీ లోన్స్ ఉన్నాయ్, మాకూ ఉన్నాయ్. మా ఎకౌంట్లో సేల్ డబ్బు జమ చేస్తే  మీరేమో వాళ్ళకేమీ డబ్బులివ్వట్లేదంట. వాళ్లేమో కాష్ పేమెంట్స్ చేస్తున్నారక్కడ. మరి వాళ్ళ లోన్స్ ఎలా తీరుతున్నాయి" అంటే అప్పుడా మేనేజర్ చెప్పాడు " పొగాకు వాడమ్మింతర్వాత మళ్ళీ దొరుకుతాడో లేదో తెలియదండి మాకు. ఆ వచ్చిన అమౌంటుని రెండు ఎకౌంట్సుకి ఎడ్జస్ట్ చేసి పడేశాం మేమిక్కడ. మిగతా ఏమన్నా ఉంటే కాష్ పేమెంట్స్ అక్కడిచ్చుకుంటార్లే అని" అంటూ.

"మా కంపెనీ పేరు పోగొట్టారు కదా మీరు? ఇదేంటి సర్ ఈ పని? ఎవరి ఎకౌంట్ వాళ్ళకే. లేదంటే మీ గుంటూరు ఆఫీసుకి రిపోర్ట్ చేస్తా. అసలు మీ బ్యాంకులో మా ఎమ్మెల్ కంపెనీ ఎకౌంట్ లేకుండా చేస్తా" అని ఆయన్ని బెదిరించా. "బాబ్బాబూ! ఆ పని మాత్రం చేయబోకండి. ఇక్కణ్ణించీ అల్లా చెయ్యనింకా!" అని ఆయన మాటిచ్చాడు. ఛాన్సు దొరికింది కదా - ఈ వసంతరాయుణ్ణి, ఇంకో పదిమంది తెలిసున్న రైతుల్ని తీసుకుని బ్యాంకుకెళ్లి "వీళ్ళ ఫ్రాడ్ ఏమీ లేదు" అని ఆయన చేతే చెప్పించాను. అది విని వసంతరాయుడు వెళ్లి మళ్ళీ మీటింగ్ పెట్టి "ఈ కంపెనీ తప్పు కాదిది. పొరపాటు జరిగింది" అని చెప్పేసి అందరికీ సర్దిచెప్పాడు.

ఆ రకంగా షా కమిషన్ చేసింతర్వాత - ఆ రిపోర్టులన్నీ తీసుకుని - నాలుగు నెల్ల తర్వాత గణపవరం వెళ్లి - లక్ష్మయ్య గారు, సుబ్బన్నగారు, సీతారామయ్య పంతులుగారు, సోమయాజులుగారు, తనేజా గారు - వీళ్ళందరూ కూర్చున్నప్పుడు తీసుకెళ్లిచ్చి - "జరిగిన విషయం ఇదండీ. వ్యవహారం ఇలా జరిగింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సొచ్చింది" అని చెప్తే తక్షణమే లక్ష్మయ్య గారు మేనేజర్ని, క్యాషియర్ని పంపించేశారు బయటికి. అప్పుడు చైనులు హెడ్-క్యాషియర్ అయ్యాడు.

బయటికొచ్చిన మేనేజర్, క్యాషియర్ "కామేశ్వర్రావ్! మాతో సరదాగా ఉంటూనే మా ౘాప కిందకి నీరు తెచ్చావ్." అంటే, నే చెప్పా "ట్రైబల్స్‌ని మోసం చేయడమేంటయ్యా? కంపెనీ మంచి జీతాలే ఇస్తున్నారు. బాగా చూసుకుంటున్నారు. ఎందుకిలాంటి పనులు? నేను మీ ౘాప కిందకి నీరు తీసుకురావడమేంటి? ఉన్న సబ్జెక్టేదో ఓపెన్‌గా చెప్పాను. నామీద ఇక్కణ్ణించి ప్రెజర్ వుంది, అక్కణ్ణించీ వుంది. పైగా ప్లెయిన్సులో మీ గురించి నేనేమీ తప్పుడుగా చెప్పలేదే?! అక్కడ వాళ్లు కరెక్టుగా ఉందని చెప్పిన మాటే చెప్పాను కదా! ఏజెన్సీలో జరిగిన తప్పులు చెప్పకపోతే ఎట్లా? నేనొచ్చిందే అందుకు!" అనేటప్పటికి ఇంకేమంటారు...వెళ్లి వేరే కంపెనీల్లో చేరారు.

అద్దీ ...అద్గదీ...
షా కమిషన్ తోడు 
నేనాటాడిన తీరు
చడీచప్పుడు చేయక 
ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!


<వచ్చేమాటు తరువాయి కథ>


 

3, మార్చి 2019, ఆదివారం

నే...డ్డే చదవండి-3- ధనక్







"పావ్ తలే హో ఠండీ రేత్
పాస్ మే వో సర్సోం కే ఖేత్
సన్‌సన్ కర్‌తీ చలీ పవన్
షారుఖ్ రహేగా నంబర్ వన్
సల్మాన్ రహేగా నంబర్ వన్" 
 
అని పాడుకుంటూ 
ఒక మెరుపు చూపుల అక్కా, ఒక చురుకు మాటల తమ్ముడూ 
నడిచిరట కిలోమీటర్లు మూడొందలు 
అడిగిరట షారుఖ్‌ని 
తమ్ముడికిమ్మని
చూడగలిగిన కన్నులు
ఆ చిన్నారుల మురిపెంపు మాటల చిన్నెలు 
వెండితెర మీద అవి పూయించిన వన్నెలు 
బంగారు ఇసక దారుల విరిసిన 
రంగారు ఇంద్రధనుస్సు కథ 

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
మార్చ్ నెల సంచికలో... 
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: మార్చ్ నెల సరదా సిన్మాయణం
 
ప్రస్తుతానికి ఈ సినిమా Netflix లో వుంది - పిల్లలతో కలిసి చూడదగ్గ సినిమా, తప్పకుండా చూడాల్సిన సినిమా. డిజిటల్ ఏజ్‌లో కోల్పోతున్న బాల్యపు అమూల్య క్షణాలని బుగ్గ మీద సుతారంగా తట్టి గుర్తు చేసే సినిమా.
 
చూడండి... చూపించండి... 
 
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు