26, ఆగస్టు 2017, శనివారం

నేనర్స్ Vs. నాన్నగాడు - తల-వెనక-కథలు


"యో నేనర్స్!  క్లాస్‌కి టైమయ్యింది - వెళ్దాం పదండి. "

"ఆగు నాన్నా! "

"అబ్బా నేనర్స్! మళ్ళీ అదేనా ... అదే ఆ వాట్సాప్ చూస్తున్నారా?"
 
"కాదురా బుజ్జిగాడు! వచ్చేవారం ట్రావెల్ కదా - ఫ్లైటు, హోటల్, కారు అన్నీబుక్ చేసుకోవాలి కదా !"

"అబద్ధం చెప్తున్నారు - I know that you are reading ఈనాడు."

"అబద్ధమా? నేను అబద్ధం అసలు చెప్తానా, నాన్నగాడు?"

"ఇప్పుడు అదేగా చెప్తున్నారు?!"

"సరే... సరే...  పద! లేట్ అవుతోంది. కార్లో మాట్లాడుకుందాం."

"నేనర్స్! అమ్మేది?"

"పైనుందిరా - బుజ్జిగాడు. ఎందుకు ఏం కావాలి?"

"నా సాక్స్ కనిపించట్లేదు - Oh wait! I found them."
.... .....
.... .... 




 

"మధ్యలో కూర్చోరా, బుజ్జిగాడు! మాట్లాడేటప్పుడు నువ్వు కనిపించాలి కదా!"

"అబ్బా!!  పదండి నేనర్స్! ఇదిగో - మధ్యలోనే కూర్చుని బెల్ట్ పెట్టుకుంటున్నాను. మిర్రర్లో చూడండి. "

"అవున్రోయ్ ...నాకు తెలీలేదే!"

"మరీ .... పేరెంట్స్ అందరికీ తలవెనకాల కూడా కళ్ళు ఉంటాయి అనేవారు కదా నేను బేబీ గా వున్నప్పుడు?"

"నువ్వు ఇప్పటికీ బేబీవేరా!"

"అదే అదే ... నేను బేబీనే."

"అయితే ఏమంటావిప్పుడు?"

"నిజంగా మీకు, అమ్మకీ తల వెనకాల కళ్ళు ఉన్నాయా? లేవా? చెప్పండి ముందు."

"అమ్మ అంటే గుర్తొచ్చింది - అమ్మకి - పాపం - ఇంకా వర్క్ అవలేదు. ఏదో కాల్లో వుంది. ఇవాళ బయట తిందాంరా బుజ్జిగాడు?"

"ఓకే నేనర్స్! I'm fine either way. కానీ కళ్ళు ఉన్నాయా - లేవా?"

"ఎందుకు లేవూ! శుభ్రంగా వున్నాయి - నాకు నాలుగు, అమ్మకి రెండు."

"ఆ కళ్ళు కాదు - చిన్నప్పుడు మీ కుర్చీ వెనకాల నేను నించునుంటే మీరు చెప్పేవారు కదా!  మీకు నేనేం చేసినా  మీ తల వెనక కళ్ళకి కనిపించేస్తుంది అంటూ?!"

"అవునా ? అలా చెప్పానా?"

"అవును... అవును"

"అయితే చెప్పానేమో ... అరె ! మాటల్లోనే వచ్చేశాంరా  నాన్నా!"

"ఓకే నేనర్స్ - bye!!"

"మంచినీళ్ల బాటిల్ మర్చిపోకురా - తీసుకుని దిగు - సీట్లో నీ పక్కనే ఉంది."

"I got it , నేనర్స్ !"

"Alright నాన్నా ! Have Fun!"
...... ...... .....
..... ..... ......

"హాయ్ నేనర్స్ !"

"ఎలా అయింది నాన్నా - ఇవాళ క్లాస్ ?"

"అయింది  - its over"

"మంచినీళ్ళు తాగినట్లు లేవు - బాటిల్ ఓపెన్ చేయనా?"

"ఊఁ ..."

"అలిసిపోయావా?"

"ఊఁ ..."

"ఇంకేంటి నాన్నా ! టాహా వచ్చాడా ఇవాళ?"

"ఆఁ ..."

"ఆకలి వేసేస్తోందా? పోనీ నీకు నచ్చే కబుర్లు చెప్పుకుందాం కాసేపు - అదేంటిరా బుజ్జిగాడు - అదేదో కొనాలన్నావ్ Nintendo Stitch  కోసం?"

"అదా - next version upgrade - Yarn 2.0"

"అదేంటి నాన్నా - మొన్నే కదా కొన్నాం - అప్పుడే upgrade ఏంటి? Yarn ?"

.....

"ఆహాఁ ...బుజ్జిగాడు - నన్నాట  పట్టిస్తున్నావా? Nintendo Switch ని Stitch అన్నానని?"

"హహ్హహ్హ నేనర్స్ ! అదే మరి - అది Stitch అయితే upgrade Yarn అవుతుంది కదా !"

"నిజమేరోయ్!  హహ్హహ్హ - you got me there !"

"నేనర్స్ ! Are we going out today for dinner?"

"అవున్నాన్నా! అమ్మకి ఇంకా వర్క్ అయినట్లు లేదు - పాపం - అమ్మక్కూడా ఆకలేస్తూ వుంటుందీ పాటికి."

"Hmmm"

"ఇంటికి వెళ్ళగానే గబగబా స్నానం చేసేస్తే తాజ్-ఇండియాకి వెళ్దాం."

"ఓహ్ నేనర్స్! మళ్ళీ అక్కడికేనా ?"

"ఏమ్మా! బోర్ కొట్టేసిందా?

"Hmmm"

"ఈసారి ఏదైనా కొత్తది ట్రై చేద్దాం...సరేనా!"

"కొత్తదంటే ... ఆ రాహు-గారి-కోడి-something ?"

"హహ్హహ్హ - అది రాజుగారి - రాహుగారి కాదు - స్పానిష్‌లో J - H అయినట్టు Indian పేరులో అవ్వదు - Raju అంటే రాజు, రాహు కాదు. ఇంతకీ నీకా పేరు ఎలా తెలుసు?"

"నేను తిన్నాను కదా - అలా!"

"నువ్వు తిన్నావా? అదెప్పుడురా?"


"మా CCL లో  ఫీల్డ్‌ట్రిప్పులకి వెళ్ళినప్పుడు."

"అదేదో ఇంట్రెస్టింగ్ టాపిక్లా ఉందే - చెప్పు చెప్పు!"

"నేను ఫిఫ్త్‌గ్రేడ్‌లో వున్నప్పుడు మమ్మల్ని రెండు restaurants కి తీస్కెళ్ళారు."

"ఎందుకూ?"

"ఒకటి how to do a business, రెండోది how not to do a business చూపించడానికి."

"భలేరా! మీ CCL వాళ్ళకి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఎక్కెడెక్కడికి వెళ్ళారేంటి?"

"How to do a business కి చాలా దూరం డౌన్‌టౌన్‌కి వెళ్ళాం. కానీ how not to do a business చూడడానికిఎక్కడికి వెళ్ళామో తెలుసా, నేనర్స్?"

"నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. "

"చెప్పేస్తున్నా .... చెప్పేస్తున్నా.... తా...జ్ - ఇం ...డి ...యా !"

"నిజంగారా? బుజ్జిగాడు !"

"అవును నేనర్స్ !"

"That's a shame, నాన్నగాడు! ఏం చెప్పారు మీకక్కడ? ఎలా సర్వ్ చేయకూడదు - అలాంటి examples ఏమన్నా చూపించారా?"

"ఊఁ  - నాకు గుర్తు లేదు నేనర్స్ - but they said something like that."

"అయ్యో - పాపం !మన తాజ్-ఇండియా వాళ్ళకి తెలిసిందో లేదో - వాళ్ళని ఇలాంటి ఉదాహరణగా వాడుకుంటున్నారని. అమ్మతో చెప్పాలి తప్పకుండా ఇది - మీకు practical గా ఎంత మంచి విషయాలు నేర్పిస్తున్నారో !"

..... .....
..... .....

"ఏంట్రా బుజ్జిగాడు! సైలెంటుగా వున్నావు? బాగా ఆకలి వేస్తోందా? ఇదిగో ఇంటికి వచ్చేశాం - దిగు!"

"హహ్హహ్హ.... హహ్హహ్హ.... I got you one more time,  నేనర్స్! I got you one more time,  నేనర్స్!"

"ఆరి బుజ్జిగాడు! ఇంతసేపు నువ్వు చెప్పింది కథరా ? భలే నమ్మించావు నన్ను!"

"అదే నేనర్స్ ! మీ తల-వెనకాల-కళ్ళ-కథకి , మీ తల-వెనక నుంచి-నే-చెప్పిన-కథకి బాలన్స్ అయింది కదా!"


21, ఆగస్టు 2017, సోమవారం

పట్టపగలు ౘందమామ కమ్మిన రోజు - ఆకాశం విష్ణుచక్రమై వెలిగిన రోజు

అప్పుడే రెండేళ్ళు అయింది - ఇండియా వెళ్ళి, యింటివారిని చూసి - వెళ్ళొద్దాం ఈ ఏడాది అనుకున్నాం.

తీరా చూస్తే వెళ్ళడానికి వీలు కానన్ని విఘ్నాలు, అవరోధాలు.

అన్నిటికన్నా అసలు విషయం ఏంటంటే వెళ్ళడానికి వలసిన వీసాలు - ముగింపు కొస్తున్న తేదీలతో వెళ్ళ వీల్లేదన్నాయి. 

వాటన్నిటినీ మించి - బుజ్జిజింక - ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆగస్టు-21కి మా గూట్లో మేముండాలి అని పెట్టిన పేచీ.

ఎందుకురా అనడిగితే - "ఎప్పుడో దాదాపు ఐదువందల ఏళ్ళ క్రితం (1442 లో) వచ్చిన గ్రహణపు చుట్టం మళ్ళీ వస్తోంది - మనూరికి. ఇప్పుడు చూడకపోతే మళ్లింకో ఐదు వందలేళ్ళకి కానీ రాదు. అప్పటికి నేనుండను - అందుకే ఇప్పుడు వచ్చినప్పుడు నేనూళ్ళో ఉండాల్సిందే - పట్టువిడుపులు చూడాల్సిందే!" - అని విడుపులేని పట్టు పట్టాడు.

సరే! వస్తున్నాం-వస్తున్నాం అని సంబరంగా చెప్పుకున్న మా రాక-కబురుని మార్చి మళ్ళొచ్చే ఏడాది ఇదే సమయానికి వస్తాం-వస్తాం అని మార్చి చెప్పుకున్నాం.

అలా మొదలయింది - ఈ  అమవసకై ఎదురుచూపు.

జులై ఆఖరివారంలో - అలవాటుగా - ప్రతి ఏడాది చేయించుకునే కంటిపరీక్షకి ఇంటిల్లిపాదీ తరలి వెళ్ళినప్పుడు మా కంటి-వెజ్జు సెకాయ్‌గారి డాక్టరాఫీసులో ఓ కళ్ళజోళ్ళ బొత్తి కనిపించింది - ఊరికే తీసుకోండి - అంటూ.

ఏంటబ్బా ఇవి - చిన్నప్పుడు మన శివకోడు ముసలమ్మ తీర్థంలో కొనుక్కున్న రంగు-రంగు కళ్ళజోళ్ళలా వున్నాయి అని చూద్దునా - అవి గ్రహణాన్ని చూడడానికి వీలైన మేలైన కంటి-జోళ్ళు.

ముందు వైపు రంగులు.... 



వెనక వైపు అక్షరాల-హంగులు...



లాభం, రెండూ, మూడూ,నాలుగూ - అని లెక్కెట్టి - రెండుజోళ్ళ  కళ్ళజోళ్ళు తీసుకున్నాం.

తీసింది నా ఒక్కచెయ్యి అయినా ఆ తీసి-వేత వెనకాల ఒక తల-ఊపు-ఊత, ఒక okay mama -అనే-బుజ్జిజింక-కేరింత వున్నాయి కాబట్టి "తీసుకున్నాం" అనే అనాలి.

ఈలోగా పరీక్ష రాసి, వేసవి సెలవుల  చిటారురోజుల్ని మాతో గడపవచ్చిన అన్నజింక ఒకటి పట్టుకెళ్ళగా మాకు మిగిలినవి ముత్యం-మూడు-కళ్ళజోళ్ళు.

ఎదురు చూడగా చూడగా - ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా తన దారిన తాను తిరిగే కాలచక్రం తిరిగి-తిరిగి - ఎంతగానో ఎదురు చూసిన ఆగస్టు-21 తానే రానే వచ్చింది.

బుజ్జిజింక బడి నుంచి బోల్డన్ని మెయిళ్ళు, ఈ-మెయిళ్ళు - మేమందరం బయటకి వెళ్ళి గ్రహణం చూసేస్తామహో - మీ పిల్లలకి కళ్ళజోళ్ళు మేమే ఇస్తామహో - అంటూ.

బళ్ళోవాళ్ళు పిల్లవాళ్ళకి ఇచ్చిన కళ్ళజోళ్ళు ఇలాంటివి ...ముందు రంగు వేరైనా వెనక వున్న అక్షరాలు అక్షరాలా పైనున్న కళ్ళజోడులాంటివే.



సరి! నేనూ, బదరి మా రెండు-జోళ్ళ-కళ్ళకి కావల్సిన రెండు కళ్ళజోళ్ళు - నీకొకటి-నాకొకటి అని పంచుకోగా ఇంకొక జోడు-కళ్ళకి మిగిలిందొక కళ్ళజోడు.

ఇవాళ పొద్దున్నేవెళ్ళేటప్పుడు ఆఫీస్‌లో నేస్తం కోసమని తన కళ్ళజోడుకి జోడుగా ఆ మిగిలిన కళ్ళజోడు కూడా సంచిలో పెట్టుకుని పట్టుకెళ్ళారు బదరి. 

బుజ్జిజింక బడికి వెళ్ళగానే - నాదైన సోమవారపు ఆఫీసు పని మొదలయింది.

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండున్నరకి పక్కనున్న కిటికీలోంచి బయటికి చూస్తే - చుట్టూ వున్న చెట్లు కనిపించినంతమేరా,  వాటితో పాటు కనిపించని గాలి కూడా బంగారపు మేలి ముసుగు కప్పుకున్నట్టు - వ్యాఖ్యాతీతమైన అపరంజి వన్నె - కళ్ళను మాయ చేసింది.

ఒంటిగంటకి లంచ్ టైం. ఇంతలో బదరి నుంచి మెసేజ్ - బయటికి వెళ్ళి చూడు - చాలా బావుంది అంటూ.

గబగబా తలుపు తీసుకుని ఒక చేత్తో ఫోన్, ఇంకో చేత్తో కళ్ళజోడు పట్టుకుని వెళ్ళి - బయటికి వెళ్ళగానే - ఎదురింటి తలుపులు తెరుచుకుని ఒక చిన్నిపాప, వాళ్ళమ్మ-  పక్క ఇంటినుంచి ఒకాయన, ఆ ముందు ఇంటినుంచి ఇంకా బోల్డంతమంది - కాళ్ళజోళ్ళు వేసుకుని, కళ్ళజోళ్ళు పెట్టుకుని - మెడ వెన్నుమీదగా వెనక్కి వాల్చి - చూపు మిన్ను మీద సారించి - చూస్తూ వున్నారు - ఊఁ ...ఆఁ ... ఓహ్ ! అంటూ.

నేనూ నా ఫోన్ కింద పెట్టి నా కళ్ళజోడులోంచి ఆకాశంలోకి చూడడం మొదలుపెట్టాను.

అప్పటికే గ్రహణం మొదలయి చాలాసేపు అయిందేమో - చిన్నప్పుడు ఇష్టంగా తిన్న గోరుమిటీ ఆకాశంలో ఉన్నట్టు కనిపిస్తే -  అబ్బా! ౘందమామ నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పులా నారింజ రంగులో ఎంత బావున్నాడో - అని మురిసిపోబోతూ - ఉండగా తట్టింది - నేను చూస్తున్నది ౘందమామని కాదు - ఆ మామ కమ్మిన సూరీడు-మామనని.

నెమ్మదిగా బంగారపు-వన్నెలో ఉన్న ఎండ తగ్గి - బాపు సినిమాలో కనిపించే వెన్నెల రంగులోకి తిరిగింది - పరిసరాల రంగు.

[బాపు సినిమాలో వెన్నెల రంగు ఎలా ఉంటుందంటే - భక్తకన్నప్ప సినిమాలో - ఎన్నీయల్లో ఎన్నీయల్లో సందామామా - అనే పాట చూడాలి. అది ఎండలో తీసిన వెన్నెల-పాట అని తెలిసిపోతూ ఉంటుంది.]

అలా చూస్తూ చూస్తూ ఉండగానే - చీకటి కమ్మేసింది - చుట్టూ కీచురాళ్ళ రొద మొదలయింది - ఇళ్ళ ముందున్న dusk-lights వెలిగాయి.




మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం చూడబోను కదా - అందుకని  చీకటిని - కీచురాళ్ళ నేపథ్య సంగీత సహితంగా ఒక చిన్న వీడియో కూడా తీసి దాచుకోవాలనిపించింది.

స్మార్ట్‌ఫోనుంటే అప్‌లోడ్లక్కొదవా అని కదా ఐఫోన్నానుడి !!

ౘందమామ సూర్యుడిని మూసిన చీకటుల వేళ ...



సూన్నారాయణుడు విడుదల అవుతుండగా కురిసిన పగటి-వెన్నెలల హేల ...


ఏ ఫోటోకి, వీడియోకి అందని - నేను చూడగలిగిన అందమైన దృశ్యం ఏంటీ అంటే - 
కనురెప్ప పాటులో మాత్రమే చూడగలిగినది-
కనురెప్ప మూసినా కరగిపోనిది-
కాలమెంత గడిచినా కమ్మని కలలా మిగిలిపోయేది-
కాలాలకావల నాలాంటి మరెవ్వరో కల-కాని వేళ చూడగలిగేది-
అది... 
ౘందమామ సూర్యభగవానుడిని పూర్తిగా కప్పేసిన వేళ - ఆ నారాయణుని వేలిపై తిరిగే విష్ణుచక్రమే కనిపించిందా నింగిలో -  అనిపించిన జ్యోతిర్మండలం!!!

19, ఆగస్టు 2017, శనివారం

త్వామనురజామి - 16 - సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!

కిందటి 19 చెప్పిన కబుర్లు: త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!

థర్డ్ సెమిస్టర్ - నవంబర్ నెల.

కార్తీకమాసం - శరదృతువు.

తక్కువైన పగళ్లు - మిక్కిలైన రాత్రులు.
శీతవేళలో - చుట్టూ వున్న కొండలు తేలికైన ఎండతో బంగరపు పూత పూసుకున్నహేలలో - రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండును అనిపించేవి.

పైగా డిసెంబర్‌లో రాబోతున్న క్రిస్మస్ నుంచి సంక్రాంతి దాకా వుండే సెలవులు,  న్యూఇయర్ సెలబ్రేషన్స్ గురించి బోల్డన్ని కబుర్లు, పప్పి, కుట్టీలకి కొనబోయే సర్ప్రైజ్ గిఫ్టులు - చెప్పలేనంత ఉత్సాహంగా ఉండేది.

అందులోనూ ఈసారి నా క్లాస్‌మేట్స్ అందరికీ న్యూఇయర్ గ్రీటింగ్స్ పంపించాలి అనుకుని అందరి దగ్గరా వాళ్ళ ఇంటి అడ్రెస్సులు తీసుకున్నాను. ఎందుకో వాళ్లకి చెప్పలేదు - సర్ప్రైజ్ చేయాలి కదా మరి!

సర్ప్రైజ్ గిఫ్టులు, గ్రీటింగ్స్ కార్డ్స్ కొనడానికి గాంధీరోడ్‌లో వున్న ఆర్చీస్ గ్రీటింగ్ కార్డులుండే షాప్ -శిల్పం- కి వెళ్ళినప్పుడు శ్యామల, పుని కనిపించారు - వాళ్ళూ నాలాగే  Santy-మోడ్‌లో వున్నారు (అమ్మాయిలం కదా Santa కాలేం కాబట్టి).

నన్ను చూడగానే శ్యామల గుర్తు చేసింది - "సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అవగానే వస్తానన్నావు మా రూంకి - ఇప్పటి దాకా రాలేదు నువ్వు"- అంటూ.

నవంబర్ ఆఖరివారంలో ఇంటర్నల్స్ అయిపోగానే వస్తానని చెప్పి తన ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్ ఎక్కడ వుందో, అక్కడికి ఎలా వెళ్ళాలో అడిగితే చెప్పింది - SVU - SBM (School of Business Management) గేట్లోంచి తిన్నగా లోపలి వస్తే ఎడం పక్కగా ఉంటుంది అని.

అలా శ్యామలతో కబుర్ చెప్తూ న్యూఇయర్ షాపింగ్ కానిచ్చేసి హాస్టల్‌కి వచ్చాను.

ఇంటర్నల్స్ అయిపోయాయి. అనుకున్నట్టుగానే శనివారం సాయంత్రం అరుణాచంచల దగ్గర పర్మిషన్ తీసుకుని శ్యామల వాళ్ళ హాస్టల్‌కి బయల్దేరాను.

తీరా SBM దగ్గరికి వెళ్ళగానే - అదే మొదటిసారి ఆ క్యాంపస్‌కి వెళ్ళడమేమో - కొంచెం కన్ఫ్యూజ్ అయి కుడివైపుగా వున్న బిల్డింగ్ వైపు వెళ్ళాను. అక్కడ అసలు అమ్మాయిలే కాదు - అసలెవరూ కనిపించలేదు. శీతాకాలపు సాయంత్రం చీకటి తొందరగా పడిపోతుంది కదా - కొంచెం బెరుకుగా అనిపించింది. వెనక్కి నా రూంకి వెళ్ళిపోదామని గబగబా నడుస్తూ వచ్చేస్తూ వుంటే - ఇంతలో ఆ బిల్డింగ్‌లోంచి ఒకతను వస్తూ కనిపించాడు. "హమ్మయ్య" అనుకుంటూ ఆగి - ఎలాగోలా పలకరించి శ్యామల రూంకి దారి అడగాలి అనుకుని "May I  know your name?" అనగానే అతను "సతీష్" అని చెప్పి - అప్పటికే అతనికి అర్థం అయింది నేను అక్కడికి పొరపాటుగా వచ్చానని. తన పేరు చెప్తూనే - "These are men's hostels"  అని చెప్తూ నాతో నడిచి వచ్చి ఆ పక్కనే వున్న గర్ల్స్ హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళాడు. మాటల్లో తను MBA చేస్తున్నట్టు చెప్పాడు. సతీష్‌కి థాంక్స్ చెప్పి హాస్టల్ దగ్గర కనిపించిన ఒక అమ్మాయిని శ్యామల పేరు, ఇంజనీరింగ్ బ్రాంచ్ చెప్పి తన రూమ్ ఎక్కడ అనడిగితే శ్యామల తనకి తెలుసని  చెప్పి - రూం దాకా తీసుకెళ్ళి తలుపు కొట్టింది.

శ్యామల నన్ను చూడగానే బోల్డంత సంబరపడింది. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాక - శ్యామల, పుని వెళ్ళి ఈరోజుకి చదువుకుంటూ రూంలోనే భోంచేస్తామని చెప్పి- వాళ్ళ మెస్ లోంచి నాక్కూడా భోజనం తీసుకొచ్చారు.

ఆ ఒక్క రాత్రికి నేను తన రూంకి వెళ్ళడం, రాత్రి ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకోవడం - శ్యామల, నేను - ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాం. అంతే కాదు - ఆరోజు రాత్రి పదకొండు కాగానే - అన్ని రూముల్లో లైట్లు ఆగిపోయి అందరూ పడుకున్నాక - నేను, శ్యామల, పుని స్వెట్టర్లు వేసుకుని బయటికి వెళ్ళి వాళ్ళ హాస్టల్ రూం  బయట వున్న ఒక చెట్టెక్కి కూర్చుని - కబుర్లు చెప్పుకుని, ఫోటోలు తీసుకుని లోపలి వచ్చేశాం. ఆ చెట్టు-కొమ్మాధిరోహణం శ్యామల నాకు మాటిచ్చిన  ప్రి-న్యూఇయర్-గిఫ్ట్ :)

తెల్లవారితే ఆదివారం - పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ టైంకి నా హాస్టల్ రూంకి వచ్చేశాను - వాళ్ళకి నేనుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని.


సెలవులకి ఇంటికి వెళ్ళేలోగా ఒకసారి తిరుమల నడిచి ఎక్కి - నడిచి దిగి వద్దామని ప్లాన్ చేసుకున్నాం మా క్లాస్ అంతా. డిసెంబర్ 21కి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. 12న తిరుమల వెళ్దామని  అనేసుకున్నాం.

డిసెంబర్ నెల ఉత్సాహంగా మొదలయింది. ఏదో ఒక MIS సెమినార్ తప్ప ఇంక టెస్టులు కూడా ఏమీ లేవు.

ఒకరోజు క్లాసులు అయిపోగానే రూంకి వచ్చి ఆ తర్వాతి రోజు MIS సెమినార్ కోసం నోట్స్ తయారు చేసుకుందాం అనుకుంటూ  వున్నాను - ఇంతలో కింద నుంచి "603-A లలితా - విజిటర్స్" అని వినిపించింది.

ఇప్పుడు నాకోసం వచ్చే విజిటర్స్ ఎవరబ్బా - ఎవరైనా మా ఊరినుంచి వస్తుంటే నాన్న ఫోన్ చేసి చెప్తారు కదా - అనుకుంటూ మూడో అంతస్తులో వున్న నా రూమ్ నుంచి -  కళ్ళకడ్డం పడుతున్న జుట్టుని ఒక చేత్తో పట్టుకుని, కాళ్ళకడ్డం పడుతున్న స్కర్ట్‌ని ఇంకో చేత్తో పట్టుకుని - రెండేసి మెట్లు ఒకేసారి దిగుతూ - దాదాపు పరిగెడుతూ - విజిటర్స్ రూంలోకి వెళ్ళాను.

తీరా అక్కడికి వెళ్ళాక టేబుల్ దగ్గర రెండు కుర్చీల్లో కూర్చున్న ఇద్దరు అబ్బాయిలు తప్ప ఎవరూ లేరు. వాళ్ళే నాకోసం వచ్చిన విజిటర్స్ అని అర్థం అయింది.

నేను  తిన్నగా వెళ్ళి వాళ్ళిద్దరి ఎదురుగుండా వున్న ఇంకో కుర్చీలో కూర్చున్నాను.

"హాయ్"
"హలో"

ఇద్దరూఒకరి తర్వాత ఒకరుపలకరించారు నన్ను.

అందులో ఒకతన్ని గుర్తు పట్టాను - దసరాకి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో ఎక్కిన పింక్ షర్ట్ అబ్బాయి.

కాకపొతే అతన్ని నేను గుర్తుపట్టనట్టు చూసి "హాయ్"అని "Who are you? May I know your names? Why are you here?" అని మధ్యలో వాళ్ళకి జవాబు చెప్పే గ్యాప్ ఇవ్వకుండా వరసగా ప్రశ్నలు అడిగాను.

వాళ్లిద్దరూ ఒకరి కేసి ఒకరు  చూసుకుని నా ప్రశ్నలకి జవాబివ్వడం మొదలు పెట్టారు.

"I'm RajaSekhar" (ఇతనే ఇంతకు ముందు కలిసిన inky-pinky-ponky).

"I'm Rama Krishna" (ఇతన్ని ఇంతకు ముందు చూడలేదు).

"ఓకే - మీరెవరో నాకు తెలీదు - ఎందుకిలా వచ్చారు?"

"మేమిద్దరం SVUలో MBA చేస్తున్నాము. నిన్ననే మా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒకసారి హాయ్ చెబ్దామని వచ్చాము" అన్నాడు రాజశేఖర్ అన్న అబ్బాయి.

నాకప్పటికే కొంచెంకొంచెంగా వున్న కోపం హెచ్చేసింది.

వీళ్ళెవరో నాకు తెలీనే తెలీదు - పైగా కాలక్షేపం కబుర్ల కోసం నా దగ్గరికి వస్తారా - హన్నా! - అనేసుకుని - ఇంక వీళ్ళతో మంచిగా మాట్లాడితే కుదరదు అంజెప్పి - "మీరెవరో నాకు తెలియనప్పుడు అసలు నేను మీతో మాట్లాడతానని ఎలా అనుకున్నారో అర్థం కావట్లేదు. మీరింక వెళ్ళొచ్చు" - అనేసి వెనక్కి తిరిగి చూడకుండా నా రూంకి వెళ్ళిపోయాను - మళ్ళీ రెండేసి మెట్లెక్కుతూ.

రూంలోకి రాగానే శ్రీలత అడిగారు - "ఎవరు లల్లీ వచ్చింది?" -అంటూ. నేనుచెప్పినది వింటూనే నన్ను టీజ్ చేస్తూ తను "హాయ్ హాయ్ లల్లీ ! MBA అబ్బాయిలు వస్తే కబుర్లు చెప్పకుండా పంపించేస్తావా" అంటుంటే నవ్వేసి నా MIS నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాను.

ఆ అబ్బాయిల సంగతి అప్పుడే మర్చిపోయాను.

డిసెంబర్ 12న అనుకున్నట్టుగానే మా క్లాసులో అమ్మయిలందరం తెల్లవారుఝామునే బయల్దేరి అలిపిరి దాకా బస్సులో వెళ్ళి - అక్కడి నుంచి తిరుమల నడిచి వెళ్ళాము. నడక దారిలో కారం-దోసెలు తింటూ, జీలకర్ర పొడి కలిపిన నిమ్మకాయ షోడాలు (సోడా కాదు అప్పటి పిలుపు షోడానే :) ) తాగుతూ, మా మాటలు, నవ్వులతో కొండలన్నీ చెవులు చేసుకుని వినేలా - మధ్య మధ్యలో కొండల మధ్యలో రీసౌండ్ వచ్చేలా అరుస్తూ - కొండలు మాతో మాట్లాడుతున్నాయి అనుకుని మురిసిపోతూ - తెగ హుషారుగా ఏడుకొండలూ ఎక్కి - ధర్మదర్శనం చేసుకుని - గుడిలోనే పులిహోర, దద్ధోజనం, లడ్డు ప్రసాదం తిని, గుడి ఎదురుగుండా మెట్ల దగ్గర గాజులు, పూసలు కొనుక్కుని - సాయంత్రం నాలుగింటికి బయల్దేరి కిందకి నడిచి దిగడం మొదలు పెట్టాము.

ఒక పదిహేనేళ్ళ అబ్బాయి - రవికుమార్ అని - మమ్మల్ని - అక్కా -  అని పిలుస్తూ మాట కలిపి సరదాగా కబుర్లు చెప్తూ  మాతోపాటు నడక దారిలో వచ్చాడు. వాళ్ళ నాన్నగారు TTD లో పనిచేస్తారు అని చెప్పి సెలవులకిమా ఊళ్ళకి వెళ్ళేలోగామాకు లడ్డూలు, వడలు తెప్పించి పెడతానన్నాడు. మేమందరం అలిపిరిలో మా హాస్టల్ వైపు వెళ్ళే టౌన్‌బస్ ఎక్కేదాకా మాతో వుండి - తన అడ్రెస్ ఇచ్చి వాళ్ళింటికి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు.

మొదటిసారేమో -  ఏడుకొండలు నడిచి ఎక్కడం, మళ్ళీ అదేరోజు నడిచి దిగిరావడం - కాళ్ళు బాగా నొప్పొచ్చాయి - మా అందరికీ. ఏ ఇద్దరు కలిసినా ముందు కాళ్ళ గురించి పరామర్శలే - ఆ తర్వాతే ఇంకే మాటలైనా.

డిసెంబర్ 15న సురేష్‌కుమార్‌గారు నన్ను SV ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు - SPIC-MACAY గురించేదో మాట్లాడాలి అని.  ఆ రోజు బుద్ధిగా నాకిష్టమైన పసుపు రంగు ప్లెయిన్ షిఫాన్ చీర కట్టుకుని ( formal attire for SPIC-MACAY చీరే మరి! ) మరీ వెళ్ళాను.

నాతో పాటు నా జూనియర్స్ శుభా రామస్వామి , రజని, అరుణ కూడా వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళాక మా నలుగురిని SBM లో వున్న లలితారామకృష్ణన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్టాఫ్‌రూంలో కూర్చుని వచ్చే ఏడాది మేము ఏర్పాటు చేయాల్సిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ - వున్నట్టుండి సురేష్‌కుమార్‌గారు నన్ను అడిగారు - "నువ్వు తిరుపతి చాఫ్టర్ కల్చరల్ సెక్రెటరీగా చేస్తావా?"  అని.

ఆయన చెప్పిన దాన్ని బట్టి SPIC-MACAY కల్చరల్ సెక్రెటరీగా నేను చేయాల్సిన పని - మెంబర్ల నంబర్లు పెంచడం. ఎక్కువమందిని చేర్చడానికి వీలుగా మెంబర్‌షిప్ ఫీ పదిహేను రూపాయలకి తగ్గించారు.

నాకు "ఓస్ ఇంతేగా!" అనిపించింది. ఆనందంగా తలని వీలైనంత స్పీడుగా ఊపి "సరే" అన్నాను.

ఆ తర్వాత - ఆ స్టాఫ్‌రూంలోంచి బయటికి వచ్చేటప్పుడు నా పాదాలు - భూమికి ఒక రెండంగుళాల పైనే - నడిచి వుండాలి.

అలా SBM లోంచి బయటికి వస్తుంటే - అప్పుడే క్లాస్ అయినట్టుంది - MBA చదివే అమ్మాయిలు, అబ్బాయిలు బయటకొచ్చి నించుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వున్నారు.

నేనూ, నా జూనియర్స్ ముగ్గురూ - మేం నలుగురం - SPIC-MACAY కబుర్లు, సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేం చేయబోయాలనుకుంటున్నామో వాటి గురించిన కబుర్లు - చెప్పుకుంటూ మా హాస్టల్‌కి వచ్చేశాం.

ఇంక ఆర్రోజుల్లో మా ప్రయాణం - ఇంటికి వెళ్ళబోతున్నామని అందరికీ చాలా హ్యాపీగా వుంది. డైనింగ్‌హాల్‌లో కలిసిన ప్రతీసారి ఎవరితో మాట్లాడినా - నువ్వే ట్రైన్‌కి వెళ్తున్నావు అంటే నువ్వే ట్రైన్‌కి అంటూ అవే ప్రశ్నలు, అవే జవాబులు.

ఈ సందడంతా చూసి నేను పాడేసుకున్నానిలా ...

(ఇది నా కొసరు పాట - ఇంకో అసలు పాటకి  - పట్టేయండి ఆ అసలు పాటని మరి!)

సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!
హాయ్! ఉరుకుల పరుగుల చకచక ఛుకుఛుకు  ట్రైన్ ఎక్కాలి మా ఇల్లు చేరాలి... 

ఆ టైటిలు పాటతో పాటు ఇంకో సరదా-కొసరు వచ్చేనెల దాకా  ... పాత పాటలు వినే, కొసరు-పాటలకి అసలు-పాటలు కనిపెట్టే సరదా వున్న నా పాట-మిత్రుల కోసం .... 

అదేను హాలిడే అదేను జాలిడే
అమ్మాయిలంత కూడి ఇంటికెళ్ళె సందడే ... 




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
















11, ఆగస్టు 2017, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 5 - కవలపాటలు - అసలు పాట మావికొమ్మల ఊగితే, కొసరుపాట నీలి వెన్నెల కురిసెనట!


అసలు పాట - మా నాన్న నోట (బండారు చిట్టిబాబుగారు కట్టినదట)

ఓ మునిమాపు సంధ్యలో - మింటనున్న రిక్కకో చూపునెక్కుపెట్టి  - మా family anthem లాంటి కోయిల పాటను పాడిన నాన్న గొంతులో పలికిన అసలు పాట - తానెళ్తూ తన ఎఱుకగా మా కుట్టి మాకొదిలెళ్ళిన కోయిల పాట...

ఆ పాటతో నా మొదటి పరిచయం ఎప్పుడంటే ...
 
ఎర్రంచు తెల్ల మధుపర్కాలు
పసుపుతాడు తోడు,  నల్లపూసల పేరు సౌరు
కంఠాన మెరుస్తున్న చమ్కీపూల కర్పూరదండలు
కంటి చివరన తళుకంటించుకున్న నీటిముత్యాలు
లాజహోమంలో వేడెక్కిన చేతులు మండుతున్నాయని వంకే గానీ
పాల నరచేయి ముంచి అమ్మ పెట్టిన అప్పగింతల తాలూకు బెంగేమీ లేదని
బింకాలు పోతున్న అమ్మాయిగా నేను ...
కొంగుముడి చాలదన్నట్టు చిటికెనవేలు మెలికతో కట్టేసుకున్నానని
నా బంగరుబొమ్మవు నీవని ఒట్టేసుకున్నానని ఒదిలేదిక లేదని
పొంకాలుచూపుతున్న అబ్బాయిగా బదరి ...
మా యిద్దరి చుట్టూ చేరిన స్నేహితులు సన్నిహితులు - పలకరింపులు - చిరునవ్వులు; ఛలోక్తులు - పకపకలు
ఉక్కిరిబిక్కిరయ్యే హడావిడి - ఊపిరాడనివ్వని సందడి 

అలసిన అక్కని కనుసన్నల చల్లగా చూడమని - సన్నగా - బావగారికి పన్నీరు జల్లవచ్చిన చిట్టిమరదళ్ళు - ఈ అక్కకు చెల్లెళ్ళు - నా  పక్కన  చేరారు.

మాలో చిన్నది -
పాటలాధరాల పాటలనెప్పుడూ మోసే రాగాల పల్లకి -
పాటే శ్వాసైన నయగారాల వల్లకి -
ఎప్పుడైనా ఎవరైనా పాట పాడమంటే - "కోయిలను నేను - పాడమన్నప్పుడల్లా పాడను - నాకు పాడాలనిపించి నే పాడితే మీరు వినండి" - అని మాటలతో దబాయించే చిలిపితనపు కలికి -
బావగారి నోట నుంచి విన్న మొదటి కోరిక "నువ్వు బాగా పాడతావని మీ అక్క చెప్పింది - ఒక్క పాట పాడవా? " అంటూ.

వెంటనే గొంతు సవరించుకుని ఆ ఫాల్గుణ మాసపు మధ్యాహ్నాన - చిగురాకు-మేతరిని మావికొమ్మల వూగ రమ్మని పిలుస్తూ - తాను నేర్చిన ఓ పాట పాడింది మా ఇంటి కోయిల - విన్న బావగారి గుండెలో ఆ నవనీతగీతి మరపురాని మైమరపు-గీతి కాగా.

తర్వాత - ఎన్నోసార్లు - ఇంకెన్నెన్నో మార్లు - అడిగీ అడగకుండానే - అదే పాట పాడిందెన్ని సార్లో - విని చెవులపంట పండిందెన్నిమార్లో - లెక్క లేనే లేదు.

దేవులపల్లివారి - తొందర పడి ఒక కోయిల ముందే కూసింది - అన్న పాటను ఇంకోరకంగా - తొందర పడి ఒక కోయిల ముందే ఎగిరింది - అన్నట్టు అర్థం చేసుకుందో ఏమో - పాడుతూ పాడుతూ...  పాటల లోకంలో తేలుతూ ... పాట మాత్రం మాకు వదిలి - కన్నుల మెరుపు, చిరునవ్వు తళుకు కలిపి నింగికో నక్షత్రాన్ని  గుచ్చి - ఇదే నా ఆనవాలు మీకింక - అని చెప్పా పెట్టకుండా పయనమై వెళ్ళిపోయింది.

మా కుట్టి లేదు కానీ -
దాని పాట వుంది -
మా చెవుల్లో దాని కబుర్ల-గలగలల, నవ్వుల-సవ్వడుల అలికిడి ఇంకా అలానే వుంది.
మాకు నేర్పి వెళ్ళిన పాట-తోడు వుంది.
మాకు మప్పి పెట్టిన నవ్వుల-వాడుక వేడుక వుంది.

అదిగో --- ఆ గుర్తుతోనే ఆరు-పుష్కరాల వయసులో కూడా ఆరేళ్ళ-బాల్యోత్సాహంతో ఎప్పుడూ ఏదో కొత్త వ్యాపకం కల్పించుకునే మా నాన్న iPhone voice memo తో పాడి పంపిన పాట - యూట్యూబున పదిలమైందట - వినడమే తరువాయట...



మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల

ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
తేనెలా - రసవీణలా - కోనలో -  చిరుసోనలా
స్వరగమక - తమకముల - పులకరింతలకు - తలపు కవితలై - ఉరికి పలుకగా


మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల

నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
ఆగవా ... సుధలీయవా...  అందవా...  ప్రియబాంధవా!
నా గుండె గూటిలో -  ఉండిపోయి - నవనీతగీతి - మైమరచి పాడగా

మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల
ఊగరావే ఊయల
ఊగరావే ఊయల



కొసరు పాట - బాలు-చిత్రల జంట-పాట (ఎస్వీ కృష్ణారెడ్డిగారు కిట్టించినదట)

మా పెళ్ళైన తర్వాత - పదహార్రోజుల పండగలోగా - అత్తవారింట అందరితో కలిసి చూసిన మొదటి సినిమా - రాజేంద్రుడు-గజేంద్రుడు.

ఒక పాట రాగానే - అరె! ఇది మన కుట్టి పాటలా ఉందే! - అనిపించింది. అనిపించడమేంటి - అలాగే వినిపించింది కూడాను.

సరే - కాపీ "రైటు" మరి - మనం దాన్ని రాంగుగా తీసుకోకూడదు - అనేసుకుని చెవులారా వినేసి అసలు పాటతో కొసరు రాగం సరిపోల్చేసుకుని - నవ్వుతూ తేల్చేసుకున్నాం.

ఏదేమైనా కానీ ఈ కొసరు పాటలో ఓ రెండు లైన్లంటే నాకు మక్కువ.

అవేంటంటే...
కాలమేంటి  అంటే మనకు అనుకూలమైనదే - అనీ
మరి కానుక మాటేంటి అంటే - శుభ ముహూర్తం కాక మరేంటి - అనిన్నీ
అర్థమిచ్చే - కాలమా అనుకూలము - కానుక సుముహూర్తము  అన్న వాక్యాలు


అంతే కాక - గోరింటపూల పొదరింటిలోన - అన్నమాటలు దేవులపల్లివారిని జ్ఞప్తికి తెచ్చి - ఈ పాట నాకిష్టం సుమా - అనేలా చేశాయి.

సరే ... జల్లు-వానలో డ్రిల్లు-డాన్సులా వుండే ఈ పాట చూసి-విని, పై అసలుతో ఈ కొసరుని పోల్చి నవ్వులు కొల్చేసుకోండి మరి ...







నీలి వెన్నెల జాబిలీ... 
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని 
నీలి కన్నుల కోమలి

నీలి వెన్నెల జాబిలీ...
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని 
రాగవీధుల సాగనీ

నా వలపుల కోవెల మంటపం
నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్వే సోయగం
తొలిప్రేమకు ఆయెను తోరణం
ప్రేమలే పెనవేయగా  
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు - సరసాలసుధలు - మనసార మరులు - పండించుకొందమా

నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని

ఓ చల్లని చూపుల దేవత
ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా
జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము
కానుక సుముహూర్తము
గోరింటపూల - పొదరింటిలోన - నీ కంటి దీపమై - జంట చేరనా


నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని 
రాగవీధుల సాగనీ


నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని 
నీలి కన్నుల కోమలి

అదండీ మరి ... 
అసలు పాట మావికొమ్మల 
కోయిల ఊయలలూగితే 
కొసరుపాట నీటి జాడల 
నీలి వెన్నెల కురిసెనట... 
ఆ ఊయల ... ఈ వెన్నెల 
నా బ్లాగున - మీకై ఈ నెల ... 

~పాటల భైరవి 

5, ఆగస్టు 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం


నేను థర్డ్‌ఫారంలో వుండగా - మా అన్నయ్యకి - అంటే వడ్లమాని సోమేశ్వరరావుగారు ఆయన పేరు - నాని గారంటారు -  ఆయన పెళ్ళి  కాకినాడ-గాంధీ నగర్‌లో మా వదినగారి మేనత్తగారి ఇంటి దగ్గర జరిగింది.

అనాతారం నుంచి - వూళ్ళోవాళ్ళు,  బంధువులు, మా నాన్న గారు, మేమందరం - చగ్గా కోటిపల్లి వరకు వెళ్లి - కోటిపల్లిలో గోదావరి దాటి - SRMT బస్సుల్లో కాకినాడ పెళ్ళికి తరలి వెళ్ళాము అందరమునూ.

మా దివాణం ఇంట్లో ఓ పే... ద్ద  విసనకర్ర  ఉండేది. అది ఎంత పెద్దదంటే - మామూలు విసనకర్రలకి  పదిరెట్లు ఉంటుందన్న మాట. దాన్ని ఊపుతూ విసరడానికి మా ఆస్థాన క్షురక-విద్వాంసుడు వీరన్న అని ఉండేవాడు. 

ఆ విసనకర్ర-వీరన్న, నన్ను సినిమాలకి తీసుకెళ్ళే పళ్ళయ్య - వీళ్ళు కూడా పెళ్ళికి మాతో కాకినాడ వచ్చారు.

అది మూడు రోజుల పెళ్ళి. ఆ రాత్రి పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక సదస్యం, మర్నాడు నాగవెల్లి.

మర్నాడు పొద్దున్న పూట పన్లేవీ లేవు.

కాకినాడలో కుళాయిచెరువు అని - గాంధీ నగర్ పక్కన  రామారావు పేట దగ్గరుంటుంది.

ఆ కుళాయి చెరువు పక్కన పేద్ద గులాబ్జాం తోట ఒకటుండేది.

మా కుర్రాళ్ళందరూ - అసలే న-వాల-(వా)-నరావతారులం కదా! - అలవోకగా తోటలో అలా దూరి - అవలీలగా చెట్లెక్కి - ఆ గులాబ్జాంపళ్ళు - అందినవి అందినట్టు, అందనివి అందిపుచ్చుకుని - కోసుకుని - తింటూ మళ్ళీ వెనక్కి పెళ్ళివారింటికి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాం.

మాతో పాటే - వీరన్న, పళ్ళయ్య కూడా వచ్చారు.

గాంధీ నగర్‌పార్కు  దగ్గరకొచ్చేటప్పటికి - వీరన్న మెల్లిగా నా పక్కకొచ్చాడు.

"బాబీగారూ! నేనొకటికి వెళ్ళాలి. కడుపుబ్బరంగా వుంది. ఎక్కడెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడెళ్ళాలండి?" అన్నాడు.

అప్పుడే పార్క్ దగ్గరకి వచ్చాం కదా!

నేను చుట్టూ చూసి - "ఈ పార్కంతా మనోళ్ళదే  - మనదే ఈ స్థలమంతా -  అంచేత నీ ఇష్టం!  ఎక్కడో అక్కడ కానిచ్చేసేయ్" అన్నా.

అనగానే వీరన్న గబగబా పార్క్ గోడ దగ్గర పనికానిచ్చుకున్నాడు.

అది ఓ పోలీసాయన చూసి -  వీరన్నని పట్టుకుని తీసుకెళ్ళి  పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెట్టేశాడు. మేం కుర్రాళ్ళం, మాతోపాటు పళ్ళయ్య - భయపడి పరిగెట్టుకుంటూ వచ్చేశాం ఇంటికి.

ఈ లోపులేమో - వధూవరులకి - విసనకర్ర విసరాల్సిన టైం వచ్చింది.

మా నాన్నగారేమో - "ఏడీ వీరన్న? పిలవండి"  అంటే - అప్పుడు పళ్ళయ్య - వీరన్నని పోలీసులు తీసుకు పోయారు - అంటూ - భయపడుతూనే జరిగిన సంగతి చెప్పాడు.

అయ్యో అని చెప్పి - అప్పుడు మా వదినగారి తండ్రి పేరి ప్రసాదరావుగారు, మా వదినగారి మేనత్త భర్త అయిన  శిఖా  కామేశ్వరరావుగారు - వీళ్ళిద్దరూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వీరన్నని విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

అదుగో - అలా తెలిసీ తెలియని వయసులో - ఆడుకుంటూ-పాడుకుంటూ - అన్నిటినీ చులాగ్గా తీసుకుంటూ - నెమ్మదిగా ఫిఫ్తుఫారం దాకా వచ్చాను.

ఫిఫ్తుఫారంలో ప్రవేశించేటప్పటికి నాకు గుర్రపు స్వారీ అదీ బాహా అలవాటైపోయింది.

అదెలా అంటే...

నేను లెక్కల్లోనూ, ఇంగ్లీషులోను బాగా పూరు. అందుకని మా నాన్న గారేం చేసారంటే - లెక్కలూ, ఇంగ్లీషు ప్రైవేటు చెప్పే ముక్కామల కృష్ణ మూర్తిగారికి - మా ఇంట్లో ఓ మూడు గదులు  అద్దెకిచ్చారు - ఒక పోర్షన్ కింద.

ముక్కామల కృష్ణ మూర్తిగారికి - సుబ్బారావు, శేషగిరిరావు అని ఇద్దరు మగపిల్లలు - బాగా చిన్నవాళ్ళు.  ఆయన, ఆయన భార్య, తల్లి, ఓ తమ్ముడు - వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉండేవారు.

నాతో పాటు మా వూళ్ళో కుర్రాళ్ళు - నాయనరాజుగారి సూరిగాడు, నారాయణమూర్తి సత్తిగాడు, మెహబుల్లా అని ఓ ముస్లిమూ- ఇలా మొత్తం ఏడెన్మండుగురు ప్రైవేటుకి వచ్చేవాళ్ళు.  రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలవరకు చదువు. తర్వాత అరుగుమీదే పడుకునేవాళ్ళం.

నాకసలు చీకటన్నా, దొంగలన్నా, ఆఖరికి పాములన్నా - అందరూ చీకటి రాత్రుల్లో అనవసరంగా తలచుకుని అంతకన్నా అత్యనవసరంగా భయపడిపోయే దెయ్యాలన్నా - భయం లేదు.


అందరూ పడుక్కున్నాక - పదీ-పదిన్నరకి గంటలకు లేచేవాళ్ళం - నేను, నాయనరాజుగారి సూరిగాడు. లేచి - స్మశానానికి వెళ్ళేవాళ్ళం.

ఆ సమయంలో అక్కడ గుఱ్ఱబ్బండివాళ్ళ గుఱ్ఱాలు గడ్డి మేస్తూ ఉండేవి. అవి రాత్రల్లా స్మశానంలో గడ్డి మేసి ఏ తెల్లవారుఝామునో ఇంటికి తిరిగి వెళ్ళేవి.

నేను వెళ్తూ నాతోపాటు ఒక కొబ్బరితాడు పట్టికెళ్ళేవాడిని.

అప్పటికి గుఱ్ఱానికి - నాలిక పైకెత్తి కింది దవడకి కళ్ళెం ఎలా వెయ్యాలో నేర్చుకున్నాను. అంతే - గడ్డి మేస్తున్న గుఱ్ఱాల్లో ఒకదాన్ని పట్టుకుని - దానికి కళ్ళెమేసి - దాన్నెక్కి నెమ్మదిగా చెరువు గట్టున స్వారీ చేస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ రాత్రి ఏ పన్నెండు, ఒంటిగంటకో గుఱ్ఱాన్ని విదిలేసేవాణ్ణి.

ఇదంతా ఎవరికీ తెలీకుండా చేసేవాణ్ణి.

ఓ రోజు మంచి వెన్నెలగా వుంది. రోజూలాగే ఓ గుఱ్ఱాన్ని పట్టుకుని ఎక్కి - ఇవాళ పొలం వైపు వద్దు - ఊరి వీధుల్లో తిరుగుదాం - అనుకుని రెండో వీధిలో తిరుగుతున్నాను - పాండురంగమహాత్మ్యంలో ఎన్టీఆర్ లాగా తెల్ల చొక్కా వేసుకుని.

అదేమో మహాపేచీ-గుఱ్ఱం - ఓ పట్టాన లొంగలేదు. ఎలాగో లొంగదీసుకుని కళ్ళెం వేశాను. మాంచి దౌడు మీద వెళ్తోంది.

రెండోవీధిలో చిన్నమేష్టారు ఓరుగంటి అప్పారావు గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ పెంకిగుఱ్ఱం ముందు రెండు కాళ్ళు తన్నిపెట్టి తలకాయ వంచేసి - హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో - చిన్నమేష్టారి ఇంటికి వున్న ఇనుపగేటు మీద పడిపోయాను. ఆ గేటుకి ఇనపఊసలు - బల్లేల్లా ఉండేవి. అందులో ఒక ఊస కంటి పైన దిగిపోయింది. ఇంకా - నయం కన్ను పోలేదు.

నా తెల్లచొక్కా అంతా ఎర్రగా రక్తం. ఒక్కసారిగా "అయ్యబాబోయ్" అని అరిచాను. ఆ ఎదురుగుండా కృష్ణమూర్తిగారి కాముడు అని ఉండేవారు - అనిపిండివారు. నా అరుపు విని లేచొచ్చి - నా దెబ్బ చూసి - "అమ్మయ్యో-ఎంత రక్తమో" అంటూ నా చొక్కానే విప్పి కట్టుకట్టి ఇంటికి తీసుకెళ్ళారు.

ఇంటికి వెళ్ళగానే - మా నాన్న ఆ రక్తం అదీ చూసి - అంత రాత్రిపూట ఏదో దెబ్బలాటకెళ్ళి తన్నులు తినొచ్చాననుకుని - నాకు దెబ్బ తగిలిందని కూడా చూడకుండా - ఇంకో నాలుగు దెబ్బలు గా...ఠిగా వడ్డించారు.

ఇంతలో గమ్మున మా అమ్మ - "అయ్యో పిల్లాడికి దెబ్బ తగిలింది" - అంటే అప్పుడు చూసి ఆయన - మా పొలాలు అవీ చూసే దాట్లరాజుగారిని పిలిచారు. ఆ రాజుకిగారికి కొంచెం ఆయుర్వేదం తెలుసు. ఆయనచేత కట్లు కట్టించి - అంత రాత్రిపూట గుఱ్ఱబ్బండి కట్టించి - మా నాన్న, నేను, దాట్లరాజుగారు కలిసి - అమలాపురంలో - MBBS డాక్టర్ మంథా  సుబ్బారావుగారని - మా వదినగారి చుట్టం ఉండేవారు - ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రి రెండున్నరో-మూడో అయింది. అక్కడ పప్పు సత్యం గారని కాంపౌండరు ఉండేవారు. ఆయన్ని లేపుకొచ్చారు. డాక్టరుగారు - దెబ్బ చూసి - దీన్నిలా వదిలేస్తే కాదు కుట్టాల్సిందే - అని అన్నారు.

ఆ రోజుల్లో ఏంటంటే - అలా ఏమన్నా దెబ్బ తగిలి కుట్టాలంటే - అనస్తీషియా ఇచ్చేవారు కాదు - సూదిలో దారమెక్కించి బొంత కుట్టినట్టు కుట్టేసేవారు.

నేను - డాక్టరుగారి మాట వినగానే - కాళ్ళతో చేతుల్తో అందరిని తన్నేసి ఎవర్నీ దగ్గరికి రానీయకుండా, నా దెబ్బని ముట్టుకోనీకుండా - గొడవ గొడవ చేసేశాను.

డాక్టరుగారు - "వీడింక కుట్టనీడు - మచ్చుంటే ఉంటుంది" - అంజెప్పి డ్రెస్సింగ్  చేసేసి మందులిచ్చి పంపించేశారు.

అప్పట్నుంచి - రెండేసి రోజులకొకసారి - మా మేనత్తకొడుకు నాగన్నకి సైకిలిచ్చి - నన్ను వాడితో అమలాపురం పంపించి - డ్రెస్సింగ్ మార్పించేవారు. నెమ్మదిగా ఆ దెబ్బ తగ్గిపోయింది.

అలా అని గుఱ్ఱాలెక్కడం మానలేదు. పైగా వాటినెక్కి పంట బోదెల్లొ ఇట్నుంచి అటు దూకిస్తూ వుండేవాణ్ణి. ఓసారి అలా దూకిస్తుంటే కళ్ళెం తెగిపోయి బోదెలో పడి ఎడం చెయ్యి విరిగింది.  మళ్ళీ దానికో కట్టు.

మా నాన్న అమలాపురం వెళ్ళడానికి గుఱ్ఱబ్బండి వచ్చేది. ఆ బండతనికి మా అమ్మ - ఏదో ఒక టిఫిను, కాఫీ తినడానికి-తాగడానికి ఇచ్చేది. అతను సందులోంచి పెరట్లోకి వెళ్ళి తింటుండగా - ఈ లోపులో నేను ఆ బండేసుకుని మూడు వీధులూ తిరిగొచ్చేవాణ్ణి.

"అయ్‌బాబోయ్! బాబీగారు బండేసుకుని వెళ్ళిపోయారండి ! " అని వెతుక్కుంటూ వచ్చేవాడు బండతను.

అప్పటికి మా నాన్న కొట్టడం తగ్గించారు - కళ్ళెఱ్ఱజేసేవారు అంతే.

ఈలోగా అమలాపురానికి కొత్తగా రిక్షాలొచ్చాయి. రిక్షా వచ్చి ఇంటిముందు ఆగితే అది కూడా వేసుకెళ్ళిపోయి మూడు వీధులూ తిరిగి తొక్కేసేవాణ్ణి.

ఈలోగా విత్-హెల్డ్ నుంచి మామూలు హాజరుకొచ్చేశాను. నడక-పనిష్మెంటు కూడా ముగిసిపోయింది. ఆ రోజుల్లో - ర్యాలీ, హెర్క్యులెస్, రాబిన్‌హుడ్ - అని మూడు రకాల సైకిళ్ళు ఉండేవి. నాకు మా నాన్న రాబిన్‌హుడ్ సైకిలు కొనిచ్చారు.

ఆ సైకిలు మీద భీమనపల్లి హైస్కూలుకి వెళ్ళడం, రావడం - స్కూల్లో కబడ్డీ, బాల్-బాడ్మింటను, బేస్‌బాలు - లాంటి స్పోర్ట్స్ ఆడేవాణ్ణి.  అమలాపురం, కొత్తపేట, ముక్తేశ్వరం- స్కూళ్ళతో గ్రిగ్స్ ఆటలపోటీలు ఉండేవి.

అలా మూడు స్వారీలు-ఆరు ఆటలుగా ఫిఫ్తుఫారం గడిచింది.

<వచ్చేనెల తరువాయి కథ>

29, జులై 2017, శనివారం

ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే ( తానా జ్ఞాపిక నుంచి నా జ్ఞాపకం)


 బోలువో, బోల్డువో - బోల్డన్ని కబుర్లు రాస్తున్నానామరి!
అందులోనూ అంకెలతో పాటు అక్షరాలతోనూ, మాటలతోనూ నా ఆటల-పాటల సరదా ఉండనే ఉందా?!

అదీ - అద్గదీ ... అదే మరి  - చేర్చింది నన్ను తానా చోటికి - తానాలోని సాహిత్యకమిటీకి.

తానా జ్ఞాపికకి ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు  అన్న శీర్షికన వ్యాసమో, కథో, కవితో రాస్తే బావుంటుందని హితులు, స్నేహితులు, సన్నిహితులు అన్న మాట పట్టుకుని తానా-వారి శీర్షికని నా మాటల్లో ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే అనేసుకునితెలుగుమాట మీద నాకున్న ఇష్టాన్ని ఆ మాటా - ఈ మాటాగా - మాటలు పేర్చి-  కొన్ని మాటల్లో రాసి పంపించాను.



నన్నచ్చెరువున ముంచెత్తుతూ అదచ్చయ్యింది - అచ్చు పత్రికన నిచ్చలుగా నిలిచింది.

ఆ కబురు - ఈ కబురు అంటూ ప్రతీ వారం చెప్పడానికో కబురు ఎలాగూ ఉంటోంది కదా అని  ఓ పక్కన పెట్టగా - మరుగున వున్న ఈ జ్ఞాపిక-కబురు ఈ రోజుకి బ్లాక్కెక్కించాలనిపించింది.

రెండు చోట్ల మాత్రం అచ్చులో మార్పు కనిపించింది. అదీ... ఈ పేరాలో :



అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.


"ఆ-ఈ-ఏలు త్రికములనబడును" అన్న త్రికసంధి సూత్రాన్ని తలుచుకుంటూ ఆదో-ఈదో-ఏదో అన్న నా పన్-ధోరణి ఎడిటింగ్‌లో ఆటకట్టి ఆదో-ఇదో-ఏదో గా పండిపోయింది.

నా మోమాటం లేని హకారాన్ని హల్లు-అప్పు తెచ్చుకుని మోహమాటంగా  అచ్చు- తప్పయ్యింది.

ఏదేమైనా నా-మాట అచ్చులో తానా-మాటయ్యింది. ఈ రోజుకి నా బ్లాగుకి పోస్టయ్యింది. 



ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే



ఓ న మః
శి వా యః
సి ద్ధం న మః

- అని నాలుగు పక్కలా పసుపు గౌర్లు పెట్టిన నల్లటి కొత్త పలక మీద తిన్నగా, పొడుగ్గా, బల్-నున్నగా వున్న పాలబలపం పట్టిన నా చేయి పట్టి రామశేషు మేష్టారు రాయించగానే నాలోని పసితనం ఆ అక్షరాల పసిడితనపు భ్రాంతిలో పడిపోయింది.

అప్పటివరకు ఆటపాటలే ఆరుకాలాలుగా సాగిన నాకు ఈ కొత్త అక్షరాలు దిద్దే ఆట బహు బాగా నచ్చింది. పొద్దున్న బళ్లోకి వెళ్లగానే మల్లయ్య మేష్టారు, రామయ్య పంతులుగారు, కోటేశ్వర్రావు మేష్టారు, రామశేషు మేష్టారు అన్ని తరగతుల పిల్లలనీ రెండు వరసల్లో నిలబెట్టి చేయించిన ప్రార్థన -

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

అని ఆ చదువులతల్లి పద్యంతో మొదలు. 

ఆ తర్వాత రోజూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడాల్సిందే. ఇవి రెండూ అయిన తర్వాతే పాఠాలు. 

పొద్దున్న పలకమీద మేష్టారు రాసిచ్చిన అఆలు నున్నగా జుట్టు దువ్వుకుని ముస్తాబైన కళకళలాడే అందమైన సన్నటి మెరుపు తీగల్లాంటి ఆడపిల్లల్లా కనిపించేవి. 

వాటిని దీక్షగా దిద్దీ, దిద్దీ - మధ్యాహ్నానికి శ్రద్ధగా పెంచి పెద్ద చేసేశాను - అని మురిసిపోయే సమయానికి అవి ఆటపాటల్లో, అరువు దెబ్బలాటల్లో జుట్టు చెదిరి, కాటుక కంటి హద్దులు దాటి బుగ్గల దాకా పాకిన గడుగ్గాయి అమ్మాయిల్లా తయారయేవి. 

ముందు రోజు రాసిచ్చిన నాలుగక్షరాలు గబగబా నేర్చేసుకుంటే మరుసటి రోజు ఇంకొన్ని కొత్తక్షరాలు పోగేసుకోవచ్చని - అలా కూడబెట్టుకున్న అక్షరాలతో కూడబలుక్కుని కనిపించిన కాయితమల్లా చదివేస్తూ ఉంటే కళ్ల ముందు రోజుకో కొత్త బంగారు లోకపు కిటికీ తెరుచుకుంటూ ఉంటుందని తెలిసిపోయింది. 

ఇంకేముంది - పరుగాపక చదువుబండి సాగింది. 

అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు .... ఆ ... అక్కడ - ఆ గుణింతాల మలుపు దగ్గర బండి కొత్తదారి పట్టింది. 

క-కార అ-కారముల క  - క-కార ఆ-కారముల కా 
క-కార ఇ-కారముల కి  - క-కార ఈ-కారముల కీ 
క-కార ఉకారముల కు  - క-కార ఊకారముల కూ ...  అని గుణింతపు రాగాలు పాడుకుంటూ చిందులేసింది. 

అలా - అక్షరాలా - అక్షరాల మాలల్లుతూ మాటలూ, మాటల మూట గట్టి వాక్యాలు - చదవడం, రాయడం వచ్చేసింది - అలా రావడం నచ్చేసింది. 
తరగతులు త్వరితగతిన దాటుతుంటే జీవభాష వ్యాకరణం - జన జీవన వ్యవహారం ఒకేలా అనిపించేవి. 
అదెలా అంటే -  
మాటల మధ్య సంబంధాలు సంధులని 
మాటలు చేసే సావాసాలు సమాసాలని 
మాటలు చేసుకునే సోకులు అలంకారాలని 
మాటలు కట్టుకునే గుంపులు గణాలని 
మాటలు పేర్చి (పద్య)మాలలు కూర్చొచ్చని
ఆ మాటకొస్తే మాటకి, మనిషికీ బహు దగ్గర సంబంధముందనీ 
మాట కలిపిన మనసు కలుస్తుందని 
మాట నేర్పులేని మనిషికి  మనసు-చేర్పువుండదని 
మాటల గురించి ఇన్ని మంచి మాటలు తెలిశాక 
మాట-మనిషి అరమరికలు లేని అమరిక అని  ఎరుకయింది.
ఆ ఎరుకతోనే మాట తూలక ఒబ్బిడిగా వాడితే మాట మరింత ఎన్నికగా మన్ని మన్ననిస్తుందని తెలిసింది.

సరి సరి - ఈ మాటల-మాటలతో ఏమారి నా దారి దారి-మళ్లిపోయినట్లుంది.

ఎక్కడ ఆగాను - గుణింతాల దగ్గర కదూ ?! అనగా-అనగా తెలుగు-చదువు అతిశయ రాగపు బాట పట్టింది. హై స్కూల్ చదువులో విభక్తులు, ప్రత్యయాలు నేర్చి సంధులతో సంధి కుదిరింది. సంధులు నేర్వడం లెక్కలు కూడడం ఒకేలా అనిపించేది - రెంటి మీదా మక్కువ మిక్కిలిగా పెరిగింది.

అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.

తెలుగు బాటలో తొలితొలి దారుల మలుపులు దాటి - సాగే కొద్దీ ఒక్కొక్క మెట్టునెక్కుతుంటే  - కనుల చూపుకాననివీ  మినుకు-చూపులకానేవి అయిన మిణుకు లోకాల మజిలీలెన్నో. 

ఆ మజిలీలలోనే మొట్టమొదటిసారిగా అందిపుచ్చుకున్నవి  అందమైన ముగ్గులా అనిపించే దేవులపల్లి వారి అక్షరాలలో వరమోయి అనిపించిన నేటిరేయి కవితలు, మనపక్షం కాకపోతేనేమి కురిసేద్దామా అని వెన్నెలలే పరవశించే కృష్ణపక్షపు పాటలు. లోకానికి బాధ పంచిన ఆయన భాష ఆ బాధలో సౌఖ్యాన్నే చూపింది.

అలా సొంతమైంది  - క్షరము కాని అక్షరాల సాయంతో నింపుకున్న చదువుల అక్షయ తూణీరం. అమ్మ చెప్పిన 'విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అన్న లోకోక్తి పట్టుకుని - జీవితపు సహచరునితో కలిసి - కోటివిద్యల్లో చెరో విద్యా ఎన్నుకుని తెలుగు దేశపు ఎల్లలు దాటి ప్రవాసమొచ్చాము. తెలుగు పాటలకు జిలుగులద్దిన మన-సు-కవి ఆత్రేయ గారన్నట్టు దూరమైన కొలది అనురాగం పెరుగుతుంది కదా!  ఏ పని మీదో బయటికి వెళ్లినప్పుడు తెలుగు మాట వినగానే అమ్మ-ఆవకాయ-ఇల్లు ఇత్యాదిగా అ-ఆ-లు జ్ఞప్తికొచ్చి మనసునీ-నోరునీ ఒక్కలా ఊరించేవి.

ఏ రెండు-మూడేళ్లకో వీలు కుదిరి సెలవు చిక్కి కన్నవారిని-మునుపున్న వూరుని చూడడానికి వెళ్లినప్పుడు వస్తూ వస్తూ మూటకట్టుకొచ్చిన కమ్మని కథలుండే-కమ్మలుగల-పుస్తకపు-తాయిలాలెన్నో.

ఈమధ్యే - నలుగురం చేరి కబుర్లాడుకునే వేళ - "ఎండాకాలంలో వడదెబ్బ తగిలిందెవరికో" - అన్న మా మాటలు విని - మా మాటల మేత నందిపుచ్చుకుని తామూ తెలుగు-పులుగులమై ఎగరాలని చూస్తున్న మా వంశవృక్షపు చిగురులు "Was she hit by a వడ? అని అడగ్గానే - ఫక్కుమనే నవ్వుతో బాటు "ఫర్వాలేదు - తినిపిస్తున్న తెలుగు-చిగురాకు వగరు - వగరు అంటూ తింటున్నా తీపిరాగమే పలికిస్తోంది - ఇలాగైతే మన తెలుగుకి ఢోకా లేదు - ఎల్లెడలా వెలిగేస్తుంది" అన్న నమ్మిక కుదిరింది.

ఉపసంహారం: 

తెలుగు - మన తెలుగు
మాటల వెలిగే - మనదైన వెలుగు
వీనుల విందు - పాటల పసందు
తెలుగు పలుకు అనండి -  మీరు వినండి
ఎవరైనా అనగా వింటుంటుండండి
ఇంకెవరో వినగా మీరంటుంటుండండి
తెలుగు అంటుంటే మనం వింటుంటే - ఎంత బావుంటుందో !
ఇలాగే అంటూ వింటూ వుంటే మన తెలుగు ఎంతకాలమైనా ఇలా వుంటూనే వుంటుంది
ఇలలో ఎప్పటికీ నిలిచి వుంటుంది - ఎల్లలు దాటి వెలుగుతుంది - ఎల్లెడలా వెలిగిస్తుంది.



22, జులై 2017, శనివారం

ఆ కబురు... ఈ కబురు... ఓ కోతి కబురు


మామూలుగా ఏ జలుబో, దగ్గో వచ్చి - మూలుగుతూ మందివ్వండి అని వెళ్తే - ఆ మూలుగుకి హీలుగా anti-biotics ఇస్తూ -  కన్నడ దేశాన్నుంచొచ్చి - ఈ సిరిమిన్నల దేశంలో స్థిరపడ్డ మామంచి*-డాక్టర్ చంద్ర శేఖర్‌గారు ఇచ్చే dosage ఎలా ఉంటుందంటే - మొదటి నాలుగు రోజులు నాలుగు చొప్పున, తర్వాతి నాలుగు రోజులు ఒకటి చొప్పున.

(*మామంచి=మహా-మంచి మరియు మా-మంచి) 

నాకు గత ఆరున్నొక్క వారాలుగా తానా కబుర్లు రాస్తూ ఉంటే  - బోల్డంత సేపు రైల్లో ప్రయాణం చేసింతర్వాత - దిగాక్కూడా - ఇంకా అటూ ఇటూ ఊగుతున్నట్టనిపిస్తుందీ - అలా - ఇంకా తానా సంబరాల్లోనే ఉన్నట్టు, ఇంటికి రానట్టు అనిపించేస్తోంది. తెగ బెంగొచ్చేస్తోంది.

అందుకే తానా-కబుర్లు వరసగా చానా రాసేశాను కదా - ఇంకిప్పట్నుంచీ నెలకొకటి రాద్దామని - మా డాక్టరుగారి మోడులో, మోతాదులో 

ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు బోల్డున్నాయి కానీ - తానా-కబుర్లకి తాత్కాలిక విరామం - ఎందుకంటే నాక్కొంచెం మామూలు కబుర్లు చెప్పేసుకుని రిఫ్రెష్ అవాలనివుంది.

అంతే  - అంతకంటే మరేం లేదు.

తాత్కాలిక-తానా-వైరాగ్యం అన్నమాట.

తినగ తినగ వేము తీపి కానీ, అనగ అనగ ఒకే-కబుర్లు ఓకే కాదు మరి.

మర్చిపోయినవి ఎలాగూ మర్చిపోతాను - నాకు గుర్తుండాల్సినవే గుర్తుంటాయి - విన్నప్పుడైనా - విన్న ఆర్నెల్లకైనా.

అందుకని ఏదో సమాచార-loss ఉంటుందని అనుకోను.

ఇవాళ రాసినా - ఇంకో నెల తర్వాత రాసినా అవే కబుర్లు. అదీ నా ధైర్యం.

అసలు నిజం చెప్పాలంటే మొదట్లో నా కబుర్లెప్పుడూ extemporeగా రాసినవే తప్ప - ఏదో అనుకునీ, అనాలకునుకునీ - రాసేవీ - రాసినవీ కాదు.

అలాంటిదీమధ్య అనుకోకుండానే తెగ studiousగా - నా బుద్ధికి విరుద్ధమైనదేదో చేసేస్తున్న ఫీలింగ్.

ఏదో ఒక టాపిక్ లేకుండా ఫ్రీగా, కేర్-ఫ్రీగా, టాపిక్-ఫ్రీగా రాసినట్లు గానీ , ఏ విషయమూ లేకుండా అసలు విషయమే కాని  విషయమే రాసినట్టు గుర్తు లేదు.

అందుకే మళ్ళీ నా గాలి-కబుర్ల mode లోకి వచ్చేశాను - సరదా కబుర్లు ఇవీ అంటూ - ఈ పోస్టుతో - ఒక్క కీ పోటుతో.

సరే! ముందుగా మున్ముందుగా ఓ బుల్లి వివరణ - ఈ పోస్టు పేరు గురించి.

ఆ కబురు ... ఈ కబురు ... ఓ కోతి కబురు ... అనగానేమి ?

ఆ కబురు - ఆపేసిన తానా-కబురు.
ఈ కబురు - ఈనాటి సరదా కబురు
ఓ కోతి కబురు - చదివిస్తాగా ...ఉందురూ!

అనగనగా ఓ బెద్ద-మామయ్య.
ఆ బెద్ద-మామయ్యకి ఓ బుల్లి మేనల్లుడు  - బుజ్జి-బాబు.
రెండార్ల వయసువాడు - ఆరున్నొక్క క్లాసువాడు. 
వాడే ఈనాటి కబుర్ల హీరో.
బెద్ద-మామయ్యకి వారం వారం టెలి-తీగల మీద భూమికి ఆవల ఉన్న చెల్లితో - అదే మన హీరో తల్లితో - మాట్లాడకపోతే, ఆ చెల్లి నవ్వుల రవ్వలు  తీగల మాటున రాగాలై వినిపించకపోతే అస్సలంటే అస్సలు తోచదు - ఇది సిసలైన కబురు.

ఓ రోజలా కబుర్లాడుదామని టెలి-మీటలు నొక్కి పలకరించబోయేవేళ  - బుజ్జి-బాబు ఎత్తాడు ఫోను.

"హలో మామయ్యా!'

"బుజ్జి-బాబూ! బావున్నావా? ఏం చేస్తున్నావు అమ్మేం చేస్తోంది?"

"బావున్నాను మామయ్యా! మరి మామయ్యా! బయట కోతులు వచ్చాయి. అందుకే అమ్మ అటు కొట్టడానికి వెళ్ళింది "

"అమ్మో! అవునా! నువ్వూ కొడతావా కోతుల్ని?"

"అవును మామయ్యా! ఒక స్టిక్కు తీసుకుని కొడతాను"

"అరె! అలా ఎవరైనా కోతుల్ని కర్రతో కొడతారా?"

"మరెలా కొట్టాలి, మామయ్యా?"

"కొబ్బరికాయతో. మరీ ... కోతి అంటే ఆంజనేయస్వామి కదా - గుళ్ళో ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొడతాం కదా - మరి కోతికీ అంతే - కొబ్బరికాయ కొట్టాలి"

"ఆంజనేయస్వామి సగం మనిషి - సగం కోతి కదా, మామయ్యా! ఇదేమో పూర్తి కోతి - తేడా వుంది కదా?!"

"సగం-కోతికన్నా పూర్తి-కోతి  ఇంకా గొప్పకదా! ఇంకా ఎక్కువ గౌరవించాలి"

"అవును మామయ్యా!నాకూ అప్పుడప్పుడు డౌటు వస్తూ ఉంటుంది"

"ఏంటా డౌటు?"

"మనుషులు కోతి నుంచి పుట్టారని చెప్తారు కదా? అసలెలా పుట్టారూ అని?"

"భలే ఉందిరా ఇది? ఎవరు చెప్పారు నీకిది? మనిషి కోతి నుంచి వచ్చాడా? నాకు తెలీనే తెలీదే!"

"అవును మామయ్యా! మా స్కూల్లో చెప్పారు - పుస్తకాల్లో కూడా రాశారు"

"అలా అయితే మనకి ancestor కోతి కదా - మనింట్లో ఓ కోతి ఫోటో కూడా పెట్టుకోవాలేమో కదా?!"

"హహ్హహా ...  హహ్హహా"

"నవ్వొచ్చేస్తోందా నీకు ? భలే. మరిది చెప్పు - మనం కోతి నుంచి పుడితే మరి తోకేమయ్యింది?"

"డెవలప్ అయ్యాం కదా, మామయ్యా! అందుకే తోక పోయింది"

" డెవలప్ అయితే తోక బో... ల్డంత పొడుగవ్వాలి - కానీ -  మాయమై పోతుందేంటి?"

"డెవలప్ అంటే ఛేంజ్ మామయ్యా! అందుకే మరి తోక తగ్గిపోయి తగ్గిపోయి మాయమై పోయింది"

"ఓహో - డెవలప్ అంటే ఛేంజా - ఇది కూడా తెలీదురా నాకు - నీకు చాలా విషయాలు తెలుసే! ఇంతకీ నువ్వు మీ అమ్మకి చెప్పావా నువ్వు కోతికి పుట్టావని?"

"హహ్హహా ...  హహ్హహా"

"అవునూ - కోతి నుంచి పుట్టాం అని చెప్పావు కదా - అందుకేనేమో ఒక్కోసారి మనం చేసే అల్లరి చూసి తే "కోతి వేషాలు వెయ్యకు" అని కోప్పడతారు - కదా ?"

"అవును మామయ్యా! కానీ అలా తిట్టేవాళ్ళు కూడా కోతులే కదా - ఎందుకంటే కోతులే కోతులతో మాట్లాడగలవు కదా?! అందరం కోతుల్లోంచే వచ్చాము కదా?!

"మంచి డౌటేరోయ్! నాకు తట్టనే లేదు - అందుకేనేమో కదా -  మనం గోడలెక్కి ఆడుకుంటామూ, చెట్లెక్కుతామూ"

"అవును - మామయ్యా!"

"అవున్రా - నువ్వెప్పుడైనా చెట్లెక్కావా? నీకు చెట్లెక్కడం వచ్చా?"

"లేదు మామయ్యా "

"నాకూ చెట్లెక్కడం రాదురోయ్ - నీపోలికే వచ్చినట్టుంది నాకు - కానీ... మీ అత్త చెట్లెక్కేది తెలుసా?!"

అప్పుడెప్పుడో - సెలవులకి వచ్చినప్పుడు - లేపాక్షి గుడిలో - చెంగుమని చెట్టెక్కిన అత్తరూపు కళ్ళ ముందు వెలిగి - బుజ్జి-బాబు నోట పెటేల్మన్న నవ్వు - బెద్ద-మామయ్య పక్కనే నించుని కోతి-కబుర్లు విటున్న అత్త పెదవుల మీద పకాల్మంది. ఎండాకాలపు పగటిలో పండు వెన్నెలయ్యింది.


19, జులై 2017, బుధవారం

త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!

కిందటి 19 చెప్పిన కబుర్లు

దసరా ... అంటే ఎలాంటి పండగ?

మహా సరదా పండగ - పది రోజులకు పైగా సెలవులు పప్పి, కుట్టిలకి, నాకు - పైగా లక్ష్మి దొడ్డ,  ప్రశాంతి వస్తారు. వీలైతే బాబూ వస్తాడు - చిన్న శ్రీను ఇక్కడే వున్నాడు.

వీటన్నిటికీ తోడు ప్రతి దసరాకి - వారం రోజుల ముందునుంచీ ఇల్లు దులపడం, కడగడం -  తెల్ల నామురాయి నీళ్ళల్లో తడిపి - ఆ తడి నాముతో ఇల్లంతా నా చేత మా అమ్మ వేయించే ముగ్గులు -  మా అమ్మ  - ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులతో, మాష్టారితో కలిసి ఇంటింటికి వెళ్ళి - "ఏదయా! మీ దయా మామీద లేదు - ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు - అయ్యవారికి చాలు ఐదు వరహాలు - పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు" - అంటూ ఎలా పాడేవారో చెప్తూ ఇష్టంగా గుర్తు చేసుకునే పాటలు - దుర్గాష్టమి రోజు అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయి ఉగ్రంగా ఉంటుందని - మహర్నవమి రోజుకి మాష చక్రాలు, ఆవడలు చేయాలని - కథలు చెప్తూ - ఆవిడ చెప్పే కథలకి మావైన అర్థాలు తీసుకుని అమ్మని ఉడికిస్తూ మేం ముగ్గురం మాలో మేమే నవ్వుకునే అల్లరి కబుర్లు, నవ్వులు - ఇల్లు మహా సందడిగా ఉండేది.

ఈ సందడికి తోడు కొత్త బట్టల హడావిడి. నేను హాస్టల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికే అమ్మ డ్రెస్ మెటీరియల్ కొని ఉంచేది. నాకు గుర్తుండి - నా MCA అయ్యేవరకూ ప్రతి పండక్కీ మా ముగ్గురికీ ఒకే రంగు బట్టలు ఉండేవి. పప్పి, కుట్టి ఇంట్లోనే ఉండేవారు కాబట్టి వాళ్ళ డ్రెస్సులు పండక్కి ఒక వారం ముందుగానే తయారైపోయేవి - కుట్టించుకోవడం, చున్నీలు జిగ్-జాగ్ చేయించుకోవడం. నావి మరి - నేనింటికి వచ్చి నాకెలా కావాలో చెప్పేదాకా అమ్మ కుట్టించేది కాదు - అందుకని పండగ ముందు రోజు వరకూ టైలర్ చుట్టూ తిరగడం నాకు అలవాటే.

ఆ తిరగడంలో నాకు బోల్డంత ఉక్రోషం వచ్చేసేది - ఒక్కోసారి అసలు టైంకి ఇస్తారో ఇవ్వరో అని టెన్షనూ వచ్చేది .  ఈ దసరాకలాగే అయ్యింది. ఎప్పుడూ కుట్టే ఆస్థాన-టైలర్ నాగేశ్వర్రావు దగ్గర మిషన్ ఏదో రిపేర్ ఉందని నావి కుట్టననేశాడు. సరే - ఇంకేం చేయాలో తెలీక అప్పుడే 18 అడ్డరోడ్డులో మా ఇంటికి ఎదురుగుండా రోడ్డులో కొత్తగా పెట్టిన టైలర్ షాప్‌లో ఇచ్చి వచ్చాను - చుడీదార్ కుట్టి ఇవ్వమని. అష్టమి సాయంత్రం దాకా ఇవ్వనే లేదు.

ఎక్కెడికి వెళ్లినా , అదెంత చిన్నపని అయినా మా ముగ్గురికీ కలిసి వెళ్ళడం అలవాటు కాబట్టి - నవమి పొద్దున్నే తొమ్మిదింటికి ముగ్గురం టైలర్ దగ్గరికి వెళ్ళాం.

నేను షాప్ ముందు ఉన్న రెండు మెట్లు ఎక్కి "నా డ్రెస్ కుట్టడం అయిందా?" అనడిగితే - తలొంచుకుని ఎవరిదో పరికిణీ కుడుతున్న అతను తల కూడా ఎత్తకుండా లేదన్నట్టు తలూపాడు.

"ఇంకెప్పుడిస్తారండి? ఇలా అయితే ముందే చెప్పి ఉండచ్చు కదా - కుదరదని. ఇలా ఆలస్యం చేస్తే ఎలా?" - కోపమో దుఃఖమో - మాటలు గబగబా వచ్చేస్తున్నాయి.

పక్కనే తన-మార్కు చిరునవ్వుతో పప్పి, నవ్వితే నేనేడుస్తానేమో అన్నట్టు - బుగ్గల్లో నవ్వు దాచుకుని పగలబోతున్న బుడగలా కుట్టి - ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటున్నారు.

అప్పటికీ ఆ టైలరతను తల తిప్పలేదు - పాపం - అతనికి అప్పటికే చాలా కుట్టాల్సినవి వున్నాయి - పైగా ఎదురుగా నా దబాయింపు ఒకటి.

అంతే - ఇంక కోపం పట్టలేక - "సరే అయితే! - మీరిప్పుడు కుట్టిచ్చినా నేను తీసుకోను - మీరే ఉంచుకోండి" అని పరిగెట్టుకుంటూ - వెనక నుంచి  పప్పి, కుట్టి పిలుస్తున్నా ఆగకుండా ఇంటికొచ్చేసి - చేతికందిన పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాను. నాక్కోపం వస్తే మాట్లాడకుండా పుస్తకాలు చదివేసేదాన్ని - అలా అయితే వాళ్ళ కేసి చూడడం, మాట్లాడడం ఎవాయిడ్ చెయ్యొచ్చు కదా!

ఓ రెండు పేజీలు చదివానో లేదో - వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చారు -వస్తూనే కుట్టి అడిగింది - "అదేం కోపమే లల్లెమ్మా! డ్రెస్సు కుట్టడం లేట్ అయిందని వాళ్ళనే ఉంచేసుకోమంటే ఎవరికే నష్టం?" - అంటూ.

ఆ మాట విన్న మా అమ్మ  - నాకొచ్చే ఏ బాధకైనా, కోపానికైనా ఆవిడ పెట్టే లింకు నా భోజనానికే - ఎప్పట్లాగే "అందుకే కడుపునిండా తినాలి - అప్పుడైతే మాట్లాడడానికి ఓపిక ఉంటుంది - ఆ విసుగు తగ్గుతుంది" - అంటూ - ఇంకా ఏదో అనబోతూ ఉంటే  - పప్పి అమ్మ మాట మధ్యలోనే అందుకుని  "తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్" - అంటూ ఆవిడ స్టాక్-డైలాగ్‌ని పూర్తి చేసేలోగా - "ఆ...  కండ కలవాడేను మనిషోయ్ - (మొక్కజొన్న) కండెలు నమిలెడిది లల్లోయ్!" - అంటూ దానికింకో రాగయుక్తపు-పొడిగింపు కలిపింది కుట్టి.

ఇలా పొంతన లేకుండా ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే - ఎప్పుడొచ్చారో నాన్న - వెనకనుంచి "అలా ఎక్కువ నవ్వితే మీ నోళ్ళు చెవులదాకా సాగిపోతాయి - ఎప్పుడో ఇలాగే" అని అన్నారో లేదో - అంతగా సాగిపోతే మేమెలా ఉంటామో ఊహించుకుని ఇంకొంచెం ఎక్కువ నవ్వుకున్నాం మా అమ్మాయీ-త్రయం.

మొత్తానికి ఆ రోజు సాయంత్రం పప్పి, కుట్టి నేను లేకుండా వెళ్ళి టైలర్ దగ్గర్నుంచి నా డ్రెస్ తీసుకొచ్చారు. నా కొత్తబట్టల కథ సుఖాంతం.

సరదా సరదాగా దసరా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉంటుందో - ఇంటి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు అంతే బెంగగా ఉంటుంది.

మళ్ళీ అందరూ వచ్చి ట్రెయిన్ ఎక్కించారు - మా అమ్మ ఎప్పట్లాగే Higginbotham's లో CSR, Tinkle, Wisdom - ఇలాంటి పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి నాకిచ్చింది. ఎప్పట్లాగే నేనున్న ట్రెయిన్ కదిలి నేనింక కనిపించను అనేదాకా చేతులూపుతూ నించుని - సెండాఫ్‌ ఇవ్వటానికి వచ్చిన ఇంటిల్లిపాదీ ఇంటికెళ్ళిపోయారు.

ఈసారి నాతోపాటు శ్రీలత కూడా ఉండడంతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ఎప్పటికన్నా హుషారుగానే సాగింది.

మళ్ళీ back-to-pavilion. థర్డ్ సెమిస్టర్ కదా - పైగా సత్యం సర్ టీచ్ చేసే OB నాకు తెగ నచ్చేసేది - సబ్జెక్ట్, దాంతో పాటు ఆయన టీచ్ చేసే పధ్ధతి.

ఒక కవిత కూడా రాసుకున్నాను అప్పుడు - అదొక bookmark గా తయారుచేసుకున్నాను కూడా.
Whenever i think of Behavioural Science
My mind will be full of  **Robbins, Davis, Luthans
Who were introduced by you
They give me utmost joy too
As long as the clouds trail on the hills
I will be coming to your class
With Pleasure - but not with pressure

(** Stephen Robbins, Ketih Davis, Fred Luthans are the authors who wrote the Organizational Behaviour text books)

ఇవే కాకుండా సత్యం సర్ క్లాస్ నచ్చడానికి ఇంకో కారణం కూడా ఉంది - ఆయన క్లాస్ అయిపోగానే నెక్స్ట్ క్లాస్ మొదలయేలోగా ఒక పదినిముషాలు టైం ఉంటుంది కదా - అప్పుడు మా CC (కంప్యూటర్ సెంటర్) ముందున్న మావిడిచెట్టు కాయలు కర్రతో కొట్టి కోసి ఇచ్చేవారు - మా మధ్యాహ్నపు స్నాక్ అవి - డైనింగ్ హాల్ నుంచి తెచ్చుకున్న ఉప్పుతో కలిపి.

ముందు సెమిస్టెర్స్ కన్నా ఈసారి నా క్లాస్‌మేట్స్‌తో కూడా ఎక్కువగా కలిసి క్లాసెస్‌కి  వెళ్ళడం, వాళ్ళ రూముల్లోకి వెళ్ళి కొంచెం సేపు కూర్చుని రావడం మొదలుపెట్టాను.

103-సి లో ఉషశ్రీ, అపర్ణ, ప్రగతి, మాధవీలత - 502-బి లో నిగమ, నిరుపమ, మల్లిక -  506-బి లో పద్మప్రియ, సునీత; 501-ఏ లో అమృతవల్లి, ఉషారాణి, 201-బి లో అన్నపూర్ణ, సోనియా - వీళ్ళని వారానికి ఒక్కసారైనా వెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ని.

రోజూ సాయంత్రం ఏడింటికో ఎప్పుడో హాస్టల్ మేట్రన్స్ హాజరు తీసుకునేవాళ్ళు - అమ్మాయిలందరూ హాస్టల్ బయటకి వెళ్లి ఎటెండెన్స్ వేయించుకుని రావాలి.

నేను ఆ ఎటెండెన్స్, డిన్నర్ అయిపోయాక - షిప్లీని పట్టుకుని - కళ్యాణి బ్లాకులో నా రూమ్ నుంచి - రెండు బ్లాకులని లోపలనుంచి కనెక్ట్ చేసే డైనింగు హాల్ ముందు నించి - కిన్నెరలో వున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని.

రాత్రి డైనింగ్ హాల్ మూసేశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చుని చదువుకుంటూ ఉండేవారు.

నేను ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పో, పాటలు పాడో - రాత్రి పదకొండింటికి నా రూంకి వెళ్ళే టైంకి వాళ్ళింకా చదువుకుంటూనే వుండేవాళ్ళు. కాకపొతే సగం నిద్రావస్థలో వుండేవాళ్ళేమో - ఆ రాత్రిపూట జడ సరిగ్గా వేసుకోవడం రాక వదిలేసిన జుట్టుతో, చేతిలో షిప్లీతో వచ్చే నన్ను చూసి - ఉలిక్కిపడి - వాళ్ళ వీపులు వాళ్ళే - థూ థూ - అని కొట్టుకుని - నన్నొక్కసారి గట్టిగా విసుక్కునేవాళ్ళు - ఆ జడేసుకోవచ్చు కదా - జడుసుకుని చస్తున్నాం - అంటూ. అందులోనూ అమ్మ ఏరికోరి కుట్టించిన బాంబే డైయింగ్ - తెల్ల పువ్వుల నైటీలు వేసుకునే దాన్ని. వాళ్ళలా అనగానే - హహ్హహ్హ- అని నవ్వి పరిగెట్టేదాన్ని. దెబ్బకి రూముల్లోకి వెళ్ళిపొయ్యేవాళ్ళు.


మొత్తానికి రోజులు భలే పరిగెడుతున్నాయి.


నా సీనియర్స్ శ్రీలత, సంగీత, గుత్తి పద్మజ, పద్మజవల్లి - వాళ్ళు అప్పటికే ఫోర్త్ సెమిస్టర్.

(వాళ్ళు మామూలుగా అయితే ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండాలి - కానీ మా కన్నా ఒక సెమిస్టరే ఎక్కువ - ఒక పూర్తి సెమిస్టర్ టైం లాస్ అయిందని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు.)

వాళ్ళు నలుగురూ కలిసి బాలాజీ కాలనీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్‌లో Unix / Shell Scripts & C నేర్చుకుందామని చేరారు. వాళ్ళతో పాటే నేనూను - ముందు ముందు పనికొస్తుంది కదా అని.

సంగీత హైద్రాబాదునుంచి తన TVS 50 తెచ్చుకుంది - ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుందని. ఈ Unix క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు నన్ను తన వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళేది.

సాయంత్రం కాగానే - వారానికి ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళమో గుర్తు లేదు కానీ వెళ్ళిన ప్రతి రోజూ ఆ యూనివర్సిటీ ఎవెన్యూ రోడ్డులో  - జుయ్ జుయ్ మంటూ - వెళ్ళిన ఆ TVS రైడ్స్ తెగ ఎంజాయ్ చేశాను నేను.

నవంబర్ మొదటివారంలో ఫోన్ చేసినప్పుడు నాన్న చెప్పారు శ్రీనన్న బెంగుళూరునుంచి తిరుపతి వస్తున్నట్లు. ఈలోగా శ్రీనన్న దగ్గర్నుంచి కూడా ఉత్తరం - తను నవంబర్ థర్డ్ వీక్‌లో తిరుపతి వచ్చి - ఒకవేళ నాకు గనక కుదిరితే తనతో పాటు కడపలో ఉన్న సుందరి పిన్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్తానని.

నాకింక బోల్డంత ఆనందం - శ్రీనన్న వస్తున్నాడని. శ్రీనన్నతో కబుర్లు చెప్తూ ఉండడం నాకు చాలా ఇష్టం. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా తను వస్తున్నాడంటే ఆ రోజు కాలేజ్ మానేసేదాన్ని.

నా క్లాస్‌మేట్ అమృతవల్లిది కూడా కడప - తను చేసే smocking work నైటీల మీద, డ్రెస్సుల మీద చాలా బావుండేది. తను ఎంత స్టూడియస్సో - అంతే జోవియల్ & స్టైలిష్.

తనకి నేను కడప వెళ్తున్నానని చెప్పగానే - తను కూడా చాలా సరదా పడింది - ఎందుకంటే ఆ వారం తను కూడా ఇంటికి వెళ్తున్నాను అని - నన్ను వాళ్ళింటికి రమ్మని కూడా చెప్పింది.

వెంటనే గబగబా వాళ్ళింటికి డైరెక్షన్స్ అడిగి నోట్ చేసేసుకున్నాను. నాకు సుందరి పిన్ని వాళ్ళ ఇంటి ఎడ్రెస్ తెలీదు కాబట్టి ఈ ఊరుకైనా ల్యాండ్-మార్క్ బస్టాండ్ కదా - అందుకని అక్కణ్ణించి దారి  చెప్పమన్నాను.

బస్టాండ్ దగ్గర నుంచి అమృతవల్లి చెప్పిన ల్యాండ్-మార్క్స్: అప్సర థియేటర్, టీటీడీ చౌల్ట్రీ, అన్నమాచార్య విగ్రహం, దేవి స్టూడియో - ఆ స్టూడియోకి ఇవతల వాళ్ళిల్లు.

నాకింక భలే ఎక్సయిటెడ్‌గా అనిపించింది - కడప ప్రయాణానికి రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టాను.

శ్రీనన్న హాస్టల్‌కి శుక్రవారం సాయంత్రం వచ్చాడు - శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లిలకి తనని పరిచయం చేశాను -  తను కాసేపు మాతో కబుర్లు చెప్పి - రేప్పొద్దున్న కడపకి వెళ్తున్నాము రెడీగా వుండు అని నాతో చెప్పి తను హాటల్‌కి వెళ్ళాడు. తనటు వెళ్ళగానే - అంతవరకూ మాట్లాడిన మా సీనియర్ పద్మజవల్లి - He is so informative - అనగానే నాకు భలే గొప్పగా అనిపించింది - మా శ్రీను కదా - అందుకని.

మరుసటిరోజు బయల్దేరి కడపలో సుందరి పిన్ని ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూడగానే సుందరి పిన్ని తెగ సంబరపడ్డారు. శనివారం సాయంత్రం శ్రీనన్న ఇంట్లో పిల్లలందరినీ - అంటే చైతన్య, సౌజన్య లతో పాటు నన్ను - తీసుకుని ఆమీర్ ఖాన్ - దిల్ - సినిమాకి తీసుకెళ్ళాడు .

ఆదివారం పొద్దున్న పదింటికి ఎడ్రెస్ వెతుక్కుంటూ అమృతవల్లి వాళ్ళింటికి వెళ్ళాము - నేను, శ్రీనన్న. అక్కడ ఒక అరగంట కూర్చుని - అమృతవల్లిని, వాళ్ళ అమ్మగారిని పలకరించి - మళ్ళీ ఇంటికి వచ్చేశాం. నాకు ఆరోజు అమృతవల్లి వాళ్ళ ఇంట్లో షోకేసులో ఉన్న చిన్న-చిన్న ఇత్తడి సామాను, ఇంకా బోల్డన్ని బొమ్మలు - బోల్డు నచ్చేశాయి - ముఖ్యంగా ఆ ఇత్తడి సామాను చూడగానే మా నాన్నమ్మ నాకిచ్చిన చిన్న ఇత్తడి డేగిసాలు, గోకర్ణాలు, నేతి జాలీలు గుర్తుకొచ్చాయి. కాకపోతే నా దగ్గరున్నవి ఎక్కడో పోగొట్టుకున్నాను - అప్పటికే.


ఆ తర్వాత రోజు - సోమవారం - కాకపోతే సుందరిపిన్ని ఉండిపొమ్మన్నారని - ఒక్కరోజు కాలేజ్ పొతే పర్వాలేదని ఆదివారం సాయంత్రం కాకుండా సోమవారం పొద్దున్న బయల్దేరి వచ్చి నన్ను హాస్టల్ దగ్గర దింపేసి శ్రీనన్న బెంగళూరు వెళ్ళిపోయాడు.

మళ్ళీ - కథ మామూలే!

పొద్దున్న - కాలేజ్‌లో క్లాసులు -
సాయంత్రం - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట! - అంటూ ఆడుతూ పాడుతూ రోజులు సాగుతూ...
నేనిక్కడ ఆగుతూ ...
మీరీలోగా ఆ టైటిల్ పొడుపు-పాట విప్పుతూ
దాంతో పాటు ఈ కొసరు పాట పని పట్టుతూ...

క్లాసు లేదని...  డోంటీచు మాకని  
మాటినీ ఉందని ... మమ్ము నేడు వెళ్లనీ 
ఓ సారూ ... నో  హాజరూ !

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16, జులై 2017, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం


పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా - బదరి నన్ను అమెరికా's సెంటర్ దగ్గర దింపి - లోపలికి వెళ్ళి ఎవరైనా వున్నారో లేదో నేను చూసి - తనకి కాల్ చేశాక వెళ్తానని - బయటే కార్లో కూర్చుని వున్నారు.

ఇంతకీ బదరి బెంగేంటంటే ...

రోజూ విడవక తిరిగే తెలిసిన దారుల -
పూబాలల, పుప్పొడుల జాడల - అడుగులు కదిపి
కాళ్ళ వెంట నడిచి - నడకల నాపు పిల్లుల - జతగా నడుస్తూ
కాలి అలికిడికి దడిచి - పరుగాపని ఉడతల - వడిగా కలుస్తూ
ఏ దారి వెళ్తున్నానో మైమరచి  -
నా దారిని మరిచి -
దొరికిన దారే "గో"దారని -
ఏ దారిన పడితే ఆ దారే నా దారని
ఏదో ఒక దారిన ఇంటికి చేరడమే నాకున్న దారని
తిరిగే తన నిజదార -
నైజం తెలిసిన బదరి - అలా వెయిట్ చేయడంలో వున్న దారి - తన జవాబుదారి తప్ప మరేం కాదు :)

లోపలికి వెళ్ళగానే - అక్కడ కూర్చున్న సెక్యూరిటీ లేడీకి గుడ్‌మార్నింగ్ చెప్పి - అలా చూశానో లేదో - లోపల అప్పటికే మెరిసిపోతున్న చీరలు, రకరకాల డ్రెస్సుల్లో హడావిడిగా మెయిన్ స్టేజ్ వైపు వెళ్తున్న అమ్మలు, అమ్మాయిలు కనిపించారు.

వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి - బయట కార్లోంచి లోపలికి చూస్తున్న బదరికి - "పర్వాలేదు- నేనొక్కదాన్నే కాదు - ఇంకా లోపల చాలా మంది వున్నారు - మీరు ఇంటికి వెళ్ళొచ్చు" - అని చెప్పి తను వెళ్ళగానే - లోపలి వెళ్ళాను.

లోపల అందరూ బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపుగా వెళ్తున్నారు.

ఎదురుగుండా చిన్నారి దేవాంశి - వాళ్ళమ్మ అంజలి కనిపించి - హాయ్ చెప్పారు. అంతకు కొన్నిరోజుల ముందు Tae-Kwon-Do టోర్నమెంట్‌లో - నాలుగేళ్ళ బుల్లిపాప - దేవాంశి - అమెరికన్ నేషనల్ Anthem - భలే పాడింది. అదే ఇంకోసారి గుర్తు చేసుకుని - చెప్పి - అంజలికి పుత్రికోత్సాహము కలిగించాను.

అప్పుడే అంజలి చేతిలో కాఫీ చూసి - నేనూ ఒక కప్ తెచ్చుకుందామని బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపు కదిలాను. కానీ అక్కడున్న క్యూ చూసి - వద్దులే - అనేసుకుని - మళ్ళీ వచ్చి ఈరోజు తానా-సాహిత్య కార్యక్రమాల్లో మొదటిదైన అష్టావధానం జరగబోయే ఫెర్రార థియేటర్ ముందున్న కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాను.

ఇంతలో - మా లిటరరీ కమిటీ మెంబర్ - సుధాకర్ - ఫెర్రార థియేటర్ లోపలనుంచి బయటికి వస్తూ కనిపించారు. తనని చూడగానే - నేనూ థియేటర్ లోపలికి వెళ్ళాను.

అక్కడ అమృతరెడ్డి-సుగుణ -గార్లు కనిపించగానే - నిన్నటి రోజు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు-సాయం చేసిన సుగుణగారికి డబ్బులు ఇస్తూ - దాంతోపాటు అమృతరెడ్డిగారికి - భరాగో కథలు పుస్తకం ఇస్తూ - మీరిచ్చిన అప్పుకి నా వడ్డీ అండీ - అనగానే - సుగుణ గారేమో - "మీరిలా పుస్తకాలు ఇస్తారనుకుంటే అసలు డబ్బులు ఇచ్చేదాన్నే కాదు" అనీ -  అమృతరెడ్డిగారేమో "మీరిలా పుస్తకాలు ఇస్తారంటే మీకు రోజూ డబ్బులు అప్పిస్తాను" అనిన్నీ - మొత్తానికి రోజులో మొదటి నవ్వులు పూయించారు. అప్పుడే అమృతరెడ్డిగారు నేనెప్పటినుంచో చదువుదామనుకుంటున్న కాళీపట్నం రామారావుగారి కథలు - పుస్తకం నా చేతికందించారు - చదివి ఇవ్వండి అంటూ.

ఆ పక్కనే కొత్తపాళీ-నారాయణస్వామిగారు కనిపించారు. ఆయన నన్ను చూడగానే - దగ్గరికి వచ్చి - "అమ్మా! నిన్న మీరు పలకరించినప్పుడు మాట్లాడలేకపోయాను. నేను మీకు తెలుసన్నారు? ఎలా తెలుసు" - అనడిగారు. "మీ బ్లాగ్ చదివేదాన్నండి - మిమ్మల్ని ఇలా కలవడం ఆనందంగా వుంది" - అని చెప్తూ - ఆయనతో పరిచయ వాక్యాలు అయ్యాక - ఏవో బ్లాగుల విశేషాలు, నిడదవోలు మాలతిగారి బ్లాగులు, అనువాదాలు, అవీ మాట్లాడుతూ ఉంటే - ఇంతలో స.వెం. రమేష్‌గారు వచ్చి - అసలు అష్టావధానం అంటే ఏంటి అనడగ్గానే - నారాయణస్వామిగారు ఆయనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అవధానం ఎలా మార్పులు చెందింది - అసలు అష్టావధానంలో ఏమేమి అంశాలు ఉంటాయి - అనే విశేషాలు ఒక ఐదారు నిముషాలు చక్కగా వివరించారు.

అది వింటూ నిల్చుని ఉన్న నన్ను - ఆ పక్కగా కూర్చుని వున్న సదా-రమ దంపతులు వారి దగ్గరికి రమ్మని పిలిచారు. వెళ్ళిన నన్ను - పేరు, ఊరు - అడిగి - "మీ తెలుగు ఎంత బావుందోనండి - అసలు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపించింది - పైగా మీ పేరు మాకెంతో ఇష్టమైన గాయని శ్రీలలిత పేరు. మేము మెంఫిస్‌లో ఉంటాం - మా ఊళ్ళో మంచి గుడి ఉంది. మా ఇంటికొచ్చేయండి - మీకు చూపిస్తాం. వచ్చేముందు ఒక్కసారి కాల్ చేయండి చాలు" - అని అప్పటిదాకా ముక్కు-మొహం తెలియని నన్ను అంత ఇష్టంగా పలకరించి అభిమానంగా మాట్లాడుతూ - తాము తెచ్చుకున్న పాల-టీ పాలు పంచి ఇచ్చిన - నా వాక్కు మెచ్చిన - ఆ దంపతులని చూడగానే - ఒక్క నిముషం - అవాక్కయ్యాను.

వారి పక్కనే కూర్చుని అవధానం చూద్దామని రమగారి పక్కనే కూర్చున్నాను.

ఇంతలో నారాయణస్వామిగారు వచ్చి - అమ్మ! మీరు అవధానంలో పాల్గొనగలరా ?" అనడిగారు.

"పాల్గొనడం మాట అటుంచి - నేనింతవరకు - ఒక్క అవధానం కూడా పూర్తిగా చూడలేదు" - అని చెప్పాను.

"ఫర్వాలేదు - మీరు చేయగలరు - సమస్యకి పృచ్ఛకులు కావాలి - ఇదిగో సమస్య నేనిస్తాను మీకు - ఇందులో మొదటిది యుక్తంగా ఉంటుంది - అదే ఇవ్వండి" అంటూ ఒక చిన్న కాగితం నాచేతికిచ్చారు.





 అది పట్టుకుని - నా చేతిలో వున్న పుస్తకాల సంచీని - సదా-రమ-గార్ల దగ్గర వదిలి -

యమాతారాజభానసలగం 
భ ర న భ భ ర వ 
న జ భ జ జ జ ర 
మ స జ స త త గ 
స భ ర న మ య వ -

అని ఎప్పుడో పదోతరగతిలో వదిలేసిన ఛందస్సు పాఠాలు గుర్తు తెచ్చుకుంటూ - వేదిక మీదికి వెళ్ళాను.

వేదిక మీద - అష్టావధానం చేయబోతున్న నరాల రామారెడ్డిగారు, సంధానకర్త రామారాజభూషణుడు గారితో పాటు - నాతో కలిపి వేదిక మీద ఉన్న ఎనిమిది మంది పృఛ్ఛకులు ఎవరంటే:



నిషిద్ధాక్షరి: జువ్వాది రమణగారు
**సమస్య: నేను 
దత్తపది: గాజులపల్లి రామచంద్రారెడ్డిగారు
వర్ణన: కుప్పా విజయశ్రీగారు
న్యస్తాక్షరి: మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు
ఆశువు: బండ్ల హనుమయ్యగారు
ప్రబంధపఠనం: దిట్టకవి సుందర్‌గారు
అప్రస్తుతప్రసంగం: కొత్తపాళీ-నారాయణస్వామిగారు

[**లలిత ఉవాచ: భలే - కుదిరింది - సమస్య నేనే అవడం ;) -  ఆఫీస్‌లో Harry ఆత్మీయంగా నాకు ప్రసాదించిన బిరుదు:  Trouble - Lalitha! The T in your name stands for Trouble - అంటూ. దానికి కారణం ఏంటంటే - బోల్డంత మాట్లాడేసుకుని, వాదించేసుకుని - హమ్మయ్య - అన్నిరకాలుగా ఆలోచించేశాం - Let's finalize this design - అని అందరూ ఊపిరి తీసుకోబోయే సమయంలో - Oh wait! This is all good - but I see an issue...- అంటూ అప్పటివరకూ కనిపించని ఇంకేదో సమస్యని బయటికి తెస్తానని - "అబ్బా! ఇలాంటివన్నీ నీకే ఎందుకు కనబడతాయి - ఎలాగైనా - ట్రబుల్‌వే కానీ మామంచి ట్రబుల్‌వి" - అంటుంటారు నన్ను. అసలు సమస్యా పూరణంకి మొదట అనుకున్నది ఆలూరి సురేంద్ర కుమార్‌గారిని - కానీ తానొకటి తలిచిన - తానా ఒకటి తలిచిందని - సమస్యాపూరణం కాదు - అక్కడ సమస్యే అవ్వాలంటే నేను తప్ప ఇంకెవ్వరు నాకు పోటీ? :) ]

వేదికకి అటు నలుగురు, ఇటు నలుగురుగా - పృచ్ఛకుల కోసం వేసిన కుర్చీల్లో కూర్చున్నామో - లేదో - అప్పుడు గుర్తుకొచ్చింది - నా ఫోన్ పుస్తకాలసంచీలో పెట్టేశానని - కనీసం అది ఉంటే అయినా - అంతకుముందే  సేవ్ చేసుకున్న నారాయణస్వామిగారి నంబరుకి టెక్స్ట్ చేసి - నా సందేహాలు తీర్చుకోగలిగేదాన్ని కదా - అని తెగ బెంగ పడిపోయాను.

ఇంతలో - ఆయనకే ఏదో అనుమానం వచ్చినట్టుంది - నా దగ్గరికి వచ్చి - వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా - అన్న చంపకమాల పద్య-పాదంలో అన్ని జ-గణాలూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి - అన్నీ సరిగ్గానే వున్నాయి అని చెప్పి వెళ్ళారు.

నేను కూడా - మనసులో లెక్కలేసేసుకుని - పోన్లే! అన్ని గణాలూ బానే వున్నాయి - ఏదో ఈ ఒక్క లైనూ చెప్పేస్తే నా అవధాన-అవస్థ తీరిపోతుంది అనుకున్నాను.

ఇంతలో నా పక్కన కూర్చున్న జువ్వాది రమణగారు - నా దగ్గరున్న సమస్య చూసి - "అవధానిగారు ఇదెలా పూర్తి చేస్తారో చూడాలి. ఒకవేళ ఆయన చెప్పలేకపోతే మీరు పూరించాల్సి ఉంటుంది" అన్నారు.

అంతే ! ఆ మాటతో నరాల రామారెడ్డిగారి అష్టావధానం - నా పాలిట కష్టావధానం కాబోతోందని అర్థమైపోయింది నాకు.

చేసేదేముంది - కష్టమో, క్లిష్టమో - మొట్టమొదటి అష్టావధానం - పార్టిసిపేటేద్దాం - అనేసుకునేశాను.

వేదిక మీద అందరి పృచ్ఛకుల పరిచయాలు మొదలయ్యాయి.

నా వంతు వచ్చేసరికి - "నా పేరు లలిత - తెలుగు ఇష్టం - తెలుగులో పుస్తకాలు చదువుతాను - అంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు"- లాంటి మాటలేవో చెప్పి ఊరుకున్నాను.

ఒక మాట: మిగిలిన తానా-పోస్టులకి , ఈ అవధానం పోస్టులకి ఒక తేడా వుంది. మిగిలినవన్నీ - విన్నవి గుర్తు పెట్టుకుని రాస్తే - ఈ అవధానం పోస్టులు మాత్రం మా సాహిత్య కమిటీ సభ్యులు - కూచి శాస్త్రిగారు - రికార్డ్ చేసిన వీడియో ఆడియోని చెవిలో-ఇయర్‌బడ్స్ పెట్టుకుని రాశాను. 

వీడియో ఇలా మొదలవుతుంది (వీడియో యూట్యూబ్ లింక్ ఈ అవధానం పోస్టుల చివర ఇస్తాను - ఓపిక పట్టండి ప్లీజ్!)


అందరికన్నా చివరిగా వచ్చిన మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు తన ఆలస్యానికి క్షమాపణలు చెప్తుండగా వీడియో మొదలవుతుంది.

 చంద్రహాస్‌గారికి ఇది మూడో అవధానం - ఇంతకుముందు మేడసాని మోహన్‌గారు, గరికిపాటి నరసింహారావుగారు చేసిన అవధానంలో పాల్గొన్నారట.

సంధానకర్త రామరాజభూషణుడుగారు అప్పటికే కాలాతీతమయింది - మరింత జాగు చేయకుండా కార్యక్రమం మొదలుపెడదామని చెప్పి - అవధానిగారిని సభకి పరిచయం చేశారు:
శ్రీ నరాల రామారెడ్డిగారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు. పదహారో ఏటనుంచి అవధానం మొదలుపెట్టారు. వెయ్యికి పైగా అవధానాలు దేశ విదేశాల్లో దిగ్విజయంగా సాధించారు. వారు చేసిన రచనలు - గాథాత్రిశతి, కర్ణభారతం, అవధానకవిత మొదలైనవి. మీ మనసుల్ని తుమ్మెదల్లాగా ఈ  కవితా ధారని గ్రోలడానికి విహరింపజేయండి - అంటూ శ్రీ నరాల రామారెడ్డిగారిని అవధానం ప్రారంభించమని కోరారు.

నరాల రామారెడ్డిగారి ఉపోద్ఘాతం:

నలభై వసంతాలు పూర్తిచేసుకుని ఇరవై ఒకటవ మహాసభగా రూపుదిద్దుకున్న ఈ తానా మహాసభలకు ఆత్మీయంగా, ఆప్యాయంగా ఆహ్వానించిన తానా అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరిగారికి, కన్వీనరుగారికి, కార్యవర్గసభ్యులకు అందరికీ నా హార్దికాభినందనలు. 1992లో మొదటిసారిగా ఆటా ఆహ్వానం మీద న్యూయార్క్ నగరంలో అష్టావధానం చేశాను. ఆ తర్వాత ఆటా వారు పిలవగా మూడుసార్లు, నాట్స్ వారు పిలవగా మూడుసార్లు గత 20, 25 సంవత్సరాలుగా అమెరికా వచ్చి అవధానం, అవధానం మీద ఉపన్యాసాలు  చేశాను. ఈ 21వ తానా మహాసభలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

అవధానానికి ముందుఉపోద్ఘాతంగా నాలుగైదు పద్యాలు చెప్పడం సంప్రదాయం. దానికి కారణం - సాహిత్యవాతావరణంలోకి ప్రేక్షకులని తీసుకుపోవడం. అందుకని సంక్షిప్తంగా నా అవధానం గురించి నాలుగైదు విషయాలు చెప్తాను.

కవితా ఆవాహనం:

ఒక తరుణ తరంగం సంచలిస్తే
ఒక కిరణ కురంగం సంచరిస్తే
ఒక వనవల్లిక పల్లవిస్తే
ఒక నవచంద్రిక పల్కరిస్తే
ఒక ప్రశాంత కాసారజలం కదలివస్తే
ఒక నిశాంత నీహారకణం నిలిచి చూస్తే
ఒక రాగమాలిక రవళిస్తే
ఒక మేఘబాలిక దిగివస్తే
అదే అదే నా కవితారూపం
అదే అదే నా హృదయ దీపం
అదే అదే నా విజయచాపం

తెలుగు భాషలో ఉండే అందమైన పదాలను పరిచయం చేయడం కోసం ఛందస్సులేని ఒక చిన్న వచన కవితలాగా చెప్పాను.

అవధానమన్నప్పుడు పద్యకవితలోనే సాగుతుంది. ఇప్పుడు పద్యం లోకి ప్రవేశిస్తాను.

ఏ తల్లి వర్ణింప కవీంద్రుల కలములు కదలివచ్చు
ఏ తల్లి కీర్తి గానింప గాయక కంఠముల రాగములు దేలి పొరలిపోవు
ఏ తల్లి రూపు చిత్రింపగ చిత్రకారుల చేతికుంచెలు తలలనూచు
ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చీని ఉలులెల్ల నిలువెల్ల జలదరించు
ఆమె ... పారిజాత మనోజ్ఞ భూవిజాతజాత సుజాత ప్రపూత నేత్ర
భారతీ దేవి!  జ్ఞాన పుష్పష్పాలతావి! 
నాట్యమాడును గాక నా నాల్కపైన!

ఉపోద్ఘాతం ఇలా చెప్పిన సభలో ఈ "నాట్యమాడును గాక నా నాల్కపైన " అన్నమాట విన్న తర్వాత ఓ పృచ్ఛకుడు వర్ణనలో అడిగాడు - ఎక్కడో బ్రహ్మలోకంలో బ్రహ్మ సన్నిధానంలో ఉన్న సరస్వతిని మీరు ఆహ్వానించి మీ నాలుక మీద నిలుపుకున్నారు. సరస్వతి ఇప్పుడు మీ నాలుక మీద వుంది కదా ! మీరు బ్రహ్మదేవునికి సరస్వతీవియోగం కలిగించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఓ పద్యం చెప్పండి - అన్నాడు.

అప్పుడు ఓ ప్రార్థనగా - క్షమాపణ చెప్తూ - ప్రాయశ్చిత్తంగా చెప్పిన పద్యం

జననీ! నాథుని నాలుగు వక్త్రములలో సంచారమున్ జేసి
జీవనమాధుర్యము గ్రోలు నిన్నిచటి కాహ్వానించి
నీ ప్రాణనాథునకున్ నీకెడబాటు చేసితిని
నా దోషమ్ము మన్నించి  మోహనభావములు కల్గు పద్యములు నాకందించవె భారతీ!
- అని పూజాపుష్పమును సమర్పించి అవధానమును ప్రారంభించాను.

నాట్యమాడునుగాక నా నాల్కపైన

ప్రత్యూష పవనాంకురములు సోకినయంత రింగున యెగురు తరంగమట్లు
శ్యామల శాద్వల సార కేదారాల చెంగున ఎగురు కురంగమట్లు
పూల మొక్కలవంటి పాలరెక్కలు సాచి హాల్లీసకించు విహంగమట్లు
తోకచుక్క విధాన తోయదాంగన వీధి తారాడి ఆడు పతంగమట్లు

ఒక  తరంగమట్లు - ఒక కురంగమట్లు - ఒక విహంగమట్లు - ఒక పతంగమట్లు

కల్పతరుపుష్పకల్పిత తల్పమసృణకల్పనాకల్పశిల్పసంకల్పగరిమ
(  కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇక్కడ భలేగా వినిపిస్తుంది )

ఈ మొత్తం సమాసానికి కవిత్వం మెత్తగా ఉండాలని - అంతే - మృదులంగా ఉండాలి - మధురంగా ఉండాలి

కల్పతరు పుష్ప కల్పిత  తల్పమసృణ కల్పనాకల్ప శిల్ప సంకల్ప గరిమ
పలుకు పలుకున తేనెలు చిలుకరించి
కదలి వచ్చునుగాక నా కవనకన్య
నా కవనమ్ములో నిలుచు
నాకవనమ్మున పూయు

నా కవనం - నాక వనం (కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇంకోసారి)

[లలిత ఉవాచ: ఇక్కడ నాకు వేటూరిగారి ఎన్నో పాటలు గురుకొచ్చాయి - ముఖ్యంగా - కురుక్షేత్రం సినిమాలో - సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో వచ్చిన - మ్రోగింది కళ్యాణ వీణా - అనే పాటలో కల వరించి, కలవరించి పులకిత తనులత నిను చేరుకోగా అన్న వాక్యం]

కల్పకాలోక పుష్పగుచ్ఛముల నూత్న సుగంధము
దివ్య వాహినీ శీకర సిక్త రక్త సరసీజ మరందము
ఆమ్ర శాఖికా కోకిల గానమున్ నవ యువ చకోర మయూర విలాస నాట్యముల్
నాకవనమ్ములో నిలుచు
నాలో పూచిన పూల భావనలు - పెన్నా వాహినీ ...

ఇప్పుడు మా పెన్నలో నీళ్ళు లేవు కాబట్టి - దురదృష్టం - పెన్న ఎండిపోయింది -  మా కడుపు మండిపోయింది - పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం గారిది - మీ అందరికీ తెలుసు -  నీళ్ళున్న గంగ చెప్పుకుందాం -

నాలో పూచిన పూల భావనలు
గంగా వాహినీ  మోహినీ లీలా ఖేల భయత్పతంగములు
నారీ స్నిగ్ధ గండస్థలీ క్రీలావణ్య వయత్పురంగములు
మల్లీ వల్లికా హేలా షట్పద రాగ భృంగములో నర్తించున్ సభా వేదికల్
సాహిత్యామృత దివ్య నిర్ఝరుల్లో స్నానంబు గావించి
జ్యోత్స్నాహాసమ్ముల పూర్ణిమా నిశలలో సౌందర్యమున్ జూచి
కాంతా హల్లీసక రాగ భంగిమలలో తారుణ్యమున్ జూచి
నా ఊహా కీరము సాగు గావుత వసంతోద్యాన వీధీస్థలి

ఇప్పటికే ఉపోద్ఘాతం మరీ ఎక్కువ కాకుండా - పృచ్ఛకుల గురించి, పండితులను గురించి సభలో అందరికీ ఒక నివాళి అర్పించి - మళ్ళీ అవధానంలోకి ప్రవేశిద్దాం.

ప్రతిభావంతులు సాహితీ గగన భాస్వంతుల్
సుధావాహినీ ప్రతిభస్వాంతుల్  నిష్కళంక కరుణా స్వచ్ఛ స్రవంతుల్
వినిర్జిత దిగ్దంతులు సత్కవిత్వ రచనా చింతుల్
సభావేదికాగత ధీమంతులు -పండితోత్తములకు కైమోడ్పు కైసేసెదన్

సరే - ఈ సంక్షిప్తమైన ఉపోద్ఘాతము తరువాత - అధ్యక్షులు రామరాజభూషణుడుగారని చెప్పారు - ఆరోజు రామారాయల సభకు భూషణంగా ఉన్నవాడు భట్టుమూర్తి రామరాజభూషణుడు - ఈరోజు రామారెడ్డి అవధానసభకు భూషణంగా కూర్చున్నవాడు ఈ రామరాజభూషణుడు.

వారు చెప్పినట్లుగా నేను 1965వ సంవత్సరంలో తిరుపతిలో ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివేటప్పుడే అవధానం చేయడం ప్రారంభించాను. కొన్ని వందల అవధానాలు చేయడం మీ అందరికీ తెలుసు. ఎన్నో విభిన్నమైనటువంటి రకరకాల అంశాల్లో మమ్మల్ని పరీక్ష చేశారు - చాలా బాధలు పెట్టారు. ఇబ్బందులు పెట్టారు. 

అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా - ఆ సమస్య లేక దత్తపది - అవి రెండూ చమత్కారానికి ప్రతీకలు.

న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. వర్ణన, ఆశువు - కవితా పరీక్ష.

అప్రస్తుతప్రసంగము, తరవాత గంటలుంటే గంటలు - లేకపోతే ప్రబంధ పఠనం - ఏకాగ్రతకు పరీక్ష.

ఇలాగ రకరకాల పరీక్షల్లో - రకరకాల పృచ్ఛకులను మేము ఎదుర్కొంటుంటాము.

పృచ్ఛకులు సమస్య కానీ దత్తపది కానీ ఇచ్చేటప్పుడు విరుద్ధార్థం బాగా స్పష్టంగా ఉండాలి . అప్పుడే సమస్యాపూరణం కూడా అందంగా ఉంటుంది.

అలాగే దత్తపదులు కూడా ఆ భావాలకు ఒదిగేటట్లుగా పదాలు ఇవ్వాలి.

కొంతమంది ఏదో నాలుగు పదాలు ఇవ్వొచ్చు కదా అని - నోటికొచ్చిన నాలుగు ఊళ్ళ పేర్లో - నాలుగు వస్తువుల పేర్లో ఇచ్చి చెప్పమంటారు.

అవి ఒదుగుతాయా లేదా అన్నది విచారణ చేయరు.

కొందరిస్తారు - సమస్య - ఇప్పుడే సరస్వతీచతుర్ముఖులకు వియోగం అన్నాను కదా - ఆ పద్యం ఒకటి చెబుతాను.

ముక్కంటి నలువ చెలువకు ముద్దులు పెట్టెన్

ముక్కంటి - ఈశ్వరుడు - నలువ చెలువ - సరస్వతికి ముద్దులు పెట్టెన్ - ఇది విరుద్ధార్థం - ఇది పూరణ చేయమన్నారు.

బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. మనం కంప్యూటర్లో మునిగిపోయినట్లుగా ఆయన కూడా సృష్టిలో మునిగిపోయాడు. పాపం - సరస్వతీదేవికి ఏవిధమైన ఎంజాయ్మెంట్ లేదు. ఓ షాపింగ్ గానీ, ఓ సినిమాకు పోవడం గానీ - దేనికీ లేదు. ఆమెకు చాలా కోపమొచ్చింది.

ఇలా అంటున్నది:

క్కడి సృష్టిది నాపై
మక్కువ చూపవని వాణి మౌనము పూనన్ ...మూతి ముడుచుకుని అలిగింది
చెక్కిలి నిమురుచూ చిలిపిగ
ముక్కంటి (ముక్కు అంటి ) నలువ (బ్రహ్మ) ... చెలువకు ముద్దులు పెట్టెన్.

అక్కడ ముక్కంటి అనేచోట విరుపులో మెరుపు పుట్టించడమే సమస్యాపూరణం.

ఆ సమస్యలో క్లూ దాచిపెట్టాలి పృచ్ఛకుడు.

ఒక్కొక్కసారి ఏమీ ఉండదు - వేగ్గా (vague గా) ఉంటుంది - మనం దాన్నిఒక సన్నివేశం కల్పించుకుని చెప్పాల్సి వస్తుంది.

అలా చిన్న చిన్న సమస్యలు చెప్పాం - చాలా కష్టమైన సమస్యలూ పూర్తిచేశాం.

ఈ తానా తెలుగుపలుకులో కూడా అవధానంలో సమయస్ఫూర్తి అనే వ్యాసంలో కొన్ని సమస్యలు, దత్తపదులు ఇచ్చాను.

ఆ క్లూ కనుక్కోవడమే చాలా కష్టమన్నమాట.

ఓసారి ఓ సమస్య - కులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్

శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు - అంటువంటి మహానుభావుడు - ఒక కులటను గూడి - వేశ్యను కూడి హాయిగా కోర్కెలు తీర్చుకుని ఆనందిస్తున్నాడని సమస్య.

చాలా విరుద్ధార్థం  కదూ! దాన్ని పూరణ చేయమన్నారు.

అక్కడ ఎక్కడ విరుపులో మెరుపు పుట్టించాలా అని ఆలోచించా.

సరే! రామలక్ష్మణులు అరణ్యవాసం వెళ్ళారు  - సీతతో పాటు. నదీతీరంలో పర్ణశాల కట్టుకున్నారు - అప్పుడు సందర్భం ఒకటి ఇస్తున్నా -

కలతన్ జెందక తండ్రి మాట నిలుపన్ కష్టంబునన్  సైచి కా
నల లోలన్ పదునాలుగేండ్లు గడపన్ సౌమిత్రితో సీతతో
చెలువొప్పారగ పర్ణశాల రచియించెన్ హాయిగూర్పన్ కొలం
గులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్

(హాయి కూర్పన్ - కొలంకులు అటన్ - కొలనులు కొలంకులు అవుతుంది - అంటే లేక్ వ్యూ అన్నమాట).

అలాగే దత్తపదులు ఇచ్చేటప్పుడు కూడా - ఎన్నోరకాల దత్తపదులు చేశాను.

ఇటీవలనే - మే 13వ తేదీ అనుకుంటా - ఆంధ్రజ్యోతిలో వనం జ్వాలానరసింహారావుగారు ఒక వ్యాసం రాశారు - తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంలో కెసిఆర్ ఆదేశాన్ననుసరించి చేస్తున్నామని ఒక వ్యాసం రాశారు.

(ఆ వ్యాసం ఇక్కడ చదువుకోవచ్చు: http://www.andhrajyothy.com/artical?SID=410742)

అందులో 1975 ప్రాంతం నుంచి జరిగిన మహాసభల గురించి అనేక విషయాలు చెప్పుతూ - ప్రత్యేకంగా చెప్పవలసినది ఒకటున్నది - ఎగ్జిబిషన్ గ్రౌండులో పట్టుమని పాతికేళ్ళు నిండని నరాల రామారెడ్డి అవధానం చూశాను - అప్పుడో పృచ్ఛకుడు నాలుగు పదాలిచ్చాడు. ఆ నాలుగు పదాలు - బీరు, బ్రాందీ, విస్కీ, రమ్. ఈ నాలుగు పదాలు తీసుకుని - మధువుల పేర్లు - వధువు మీద - ఒక అందమైన అమ్మాయి మీద పద్యం చెప్పమన్నాడు.

అప్పుడు నాకు గుర్తున్న పద్యం అంటూ జ్యోతిలో ఆ పద్యాన్ని ఉదాహరించారు.

ఆ పద్యం ఏంటంటే... 

అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాంధీ కృత శ్యామలా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమై
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్

(నా గుండెల బీరువా తెరచి ప్రేమ అనే మనోజ్ఞ రత్నం - అంటే డైమండ్ నీకర్పించుకున్నాను -  అదెక్కడవెలుగు? నీ అభ్ర+అంధీకృత - అంటే నీలిమేఘాల్లాగ చీకటైపోయిన - అంటే కురులు అంత నల్లగా వున్నాయి - అభ్రాంధీ కృత శ్యామలా న్విత మౌ నీ కచ సీమ వెల్గు - అంటే శిరోమణిలాగా వెలుగు.
హృదయా విష్కీర్ణ - హృదయ + ఆవిష్కీర్ణ  - ఆవిష్కృత వుంది కానీ - ఆవిష్కీర్ణ  కల్పించాం - విస్కీ కోసం
రంభవొ - రం ; జగజ్జిన్నుతిన్ - జిన్ను కూడా కలిపాం)

నే ఇలా చెప్తే - ఆ పృచ్ఛకుడన్నాడు - ఏమండీ - నేను బ్రాందీ అని ఇస్తే - మీరు బ్రాంధీ అని ఒత్తి చెప్తున్నారు - ఏంటి - అని.

అప్పుడు నేనన్నాను - సెకండ్ రౌండు కదండీ కొంచెం కిక్కెక్కింది - అని.

ఇలా పద్యం చాలా అందంగావచ్చింది.

ఇలాగే ఇంగ్లీషు పదాలిస్తారు - తెలుగు పదాలిస్తారు - రకరకాల పదాలిస్తారు. టీవీల పేర్లిస్తారు - సినిమా యాక్టర్ల పేర్లిస్తారు - ఎన్నో వెరైటీస్ వున్నాయి . 

అవన్నీ చెప్పడం సాధ్యం కాదు కానీ - జగ్గయ్య గారి అధ్యక్షతన 1975లో తిరుత్తణిలో అవధానం చేసినప్పుడు - నాకు నచ్చిన దత్తపది ఇంగ్లీషు పదాలిచ్చారు - రాకెట్లు, జాకెట్లు, పాకెట్లు, లాకెట్లు.

ఇవి శార్దూలంలో నాలుగు పాదాల్లో మొదటొచ్చేటట్లుగా అందమైన అమ్మాయిని వర్ణించమన్నారు.

అమ్మాయి రాకెట్లా ఉందని, జాకెట్టు అందమైందని చెప్పకూడదు. ఆ పదాలకి ఆ అర్థాలుండకూడదు.

అప్పుడు నేను చెప్పిన పద్యం - మళ్ళీ అమ్మాయిని ఊహించుకుంటూ భావకవిత ...

రాకెట్లుండునో నీదు రాక వలన్ రాకా శరద్రాత్రి రో
జాకెట్లుండును నీకపోల సుషమా సౌందర్య సౌరభ్యముల్
పాకెట్లున్ననూ పూలమేడ అగు నీ పాదాలు పారాడ రే 
లాకెట్లుండును కోమలాంగి! ప్రణయాహ్లాదంబు పండింపవే

(పాకెట్లుండును - పూరి పాక ఎలా వున్ననూ
రోజా కెట్లుండును - గులాబీ పువ్వుకెలా ఉంటుంది - నీ చెక్కిళ్ళ సౌందర్యం
రేలాకెట్లుండును - రేలు + ఆకెట్లుండును - రేయికి అడ్డం ఎట్లుండును)

ఒక్కోసారి చాలా కష్టమైన పదాలిస్తారు. బళ్లారిలో అవధానం చేస్తున్నపుడు - ఓ దత్తపది ఇచ్చారు- చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - వీటితో విశ్వామిత్ర తపోభంగం వర్ణించమని.

విశాఖపట్నంలో ఒక మితృడిచ్చాడు 1985లో - వూరబంది, కోడిపెట్ట, జెల్లచేప, కప్ప  - ఇన్ నాలుగు మాటలతో బ్రాహ్మణుల పెళ్ళి భోజనాన్ని వర్ణించమని.

ఊర బందిరి  వేసి నోరూరునట్లు
వేడి వేడిగ మంచి పకోడి పెట్ట
ఇంపు నింపు పాయసం మోజెల్ల చేప
చెప్పలేని రుచులు మా కప్పగించె

అంతకుముందు నెల్లూరులో రామారావుగారు విశ్వామిత్ర తీస్తుండగా - క్రౌన్, ఒనీడ, వీడియోకాన్, బుష్ - టీవీల పేర్లతో ఒక పద్యం చెప్పా :

ఔరా! మేనక వక్ర మార్గమున శక్రౌన్నత్యమున్ గోరి
స్వర్గ వనీడాంబికశోభ దేహమున పొంగన్ నాట్యమున్ జేసె
పల్లవచిత్తుండై భ్రాంతి చెందె తపమెల్లన్ వీడి యో కాంతా
నా సమిధన్ బుష్కళ సౌఖ్యమిమ్మనుచు విశ్వామిత్రుడర్థించెన్

అదో పధ్ధతి. కానీ చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - పదాలతో కష్టం - వాటిని తెలుగు, సంస్కృత పదాలుగా మలచుకోవాలి. దానికిలా చెప్పాను:

రతి రాగమ్ములు వీచికెందలుకులూరన్ నేత్ర  పోణంబులన్
వ్రత భంగమ్ము నేమటంచు ప్రణయ వ్యామోహ లీలాత్ముడై
కుతుకంబొప్పఁగా గాది సూనుడు తపోర్కుండౌరా చిత్తంబునన్
ధృతి క్షీణింపగా ధారపోసె తపంబీ ఫుల్ల పద్మాక్షికి

ఇలా ఎన్నో దత్తపదులు - చెరకును గానుగలో వేసి తిప్పినట్లుగా - అందమైన పద్యాలను రాబట్టారు.

ఇవీ నా అవధాన ప్రస్థానంలో కొన్ని అంశాలు.

తానాలో మొట్టమొదటి అవధానం చేస్తున్నాను కాబట్టి తానా సభ్యుల కోసం నాలుగు పద్యాలిప్పుడు జ్ఞాపకం చేశాను.

ఇప్పుడు అవధాన రంగంలో ప్రవేశించుదాం.

---------------------------------------------------------------------------------------------------------------------

మరొక్కమాట: 
ఎక్కడైనా పై పద్యాల్లో - గణ, యతి, పాద, ప్రాస, అక్షర, శబ్ద - సంబంధిత తప్పులుంటే - అవి నా తెలుగు-తక్కువ-తనం, వినికిడి-దోషమే కానీ మరేమీ కాదు - మన్నించేయండి.
 
అసలెప్పుడూ అష్టావధానం పూర్తిగా చూసి వుండని నేను - నేను చూసిన, పాల్గొన్న మొట్టమొదటి అవధానాన్ని - ఒక యూట్యూబ్ లింక్ పెట్టేసి వదిలేయడానికి మనసొప్పక - ఉన్నది ఉన్నట్లుగా, కన్నది కన్నట్లుగా, విన్నది విన్నట్లుగా - అక్కడక్కడ - వీడియోకి సౌలభ్యమైనా - రాతకి అనువుగాని పునరుక్తి లేకుండా - ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తున్నాను.

అసలు అవధానము తదుపరి పోస్టులో...


8, జులై 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - అసలు కబుర్లు



ఇంతకు ముందు జరిగినదేమిటో తెలియాలంటే ఈ కొసరు కబుర్లు చదవాల్సిందే మరి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు


వేదిక మీద చేరిన అతిథులని పరిచయం చేస్తూ - మద్దుకూరి చంద్రహాస్‌గారు చర్చా కార్యక్రమం ప్ర-జ (ప్రశ్న-జవాబు) పద్ధతిలో ఉంటుందనిన్నీ, కార్యక్రమాన్ని నడిపించేవారు ప్రశ్నాతూణీరం మ్యూజికాలజిస్ట్ రాజాగారనిన్నీ చెప్పి - రాజాగారి గురించి చెప్పిన కొన్ని పరిచయ వాక్యాలు:

రాజాగారు ఆపాతమధురాలు అనే శీర్షికన పత్రికల్లో పాటలు, వాటి రాగాల గురించి బోల్డన్ని విశేషాలు రాస్తారట. అదే పేరుతొ ఒక పుస్తకం కూడా ప్రచురించారట. రాజాగారిని వి. ఏ. కె. రంగారావుగారి వారసులు అంటారట అందరూ - ఆయనలాగే పాటలు గురించి మాటలు ఇష్టంగా రాస్తారని. ఇంకా - రాజాగారు హాసం అనే పత్రికకి సంపాదకులు కూడానట.

<<<లలిత ఉవాచ: ఆపాతమధురాలు అన్న మాట వినగానే నాకు మంచి మంచి పాత పాటలుండే రాజిగారి ఆపాత మధురాలు బ్లాగ్ గుర్తొచ్చింది.>>>

తర్వాత సీతారామశాస్త్రిగారు, క్రిష్‌గారు - ఇద్దరూ - ఒకరి తర్వాత ఒకరుగా తమ గురించి చిరు-చిరు పరిచయవాక్యాలు మాట్లాడారు.  

మైకు రాజాగారి చేతికి వచ్చింది.

రాజాగారప్పుడేమన్నారంటే:

"జగమెరిగిన సీతారామశాస్త్రిగారిని సగమెరిగిన నేనడిగే ప్రశ్నలు మొదలు పెడతాను.

మొదటి ప్రశ్న: మీ సాహిత్య మథనం వెనక కథ వినాలని వుంది. మీరు రాసే పాటలు యువతకి స్ఫూర్తి కలిగించేలా universal అప్పీల్ తో ఉంటాయి.

ఉదాహరణకి -


కన్నీరై కురవాలా?
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా?
నిను చుడాలంటే అద్దం జడిసేలా.
(సినిమా: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

అలాగే ముగ్గురు గొప్పవాళ్ళు ఒకే విషయాన్ని వారి వారి దృక్పథం నుంచి వ్యక్తం చేసిన తీరులో వున్న సామ్యం  ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆత్రేయగారు జయభేరి సినిమాలో సామాన్యుడికి అందుబాటులో లేనిది కళే కాదని చెప్పిస్తారు కథానాయకుడితో. 

క్రిష్‌గారు తన సినిమాలో అది కళ - ఇది కల అనిపిస్తారు. 

<<<లలిత ఉవాచ: ఏం సినిమానో అది - నేను గమ్యం, వేదం తప్ప క్రిష్ సినిమాలు ఏవీ పూర్తిగా చూడలేదు>>>

సీతారామశాస్త్రిగారేమో


ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం 
(సినిమా: రుద్రవీణ -  తరలి రాదా తనే వసంతం పాటలో) - 
అంటారు.


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా 
(సినిమా: పట్టుదల )

ఈ పాట వింటే ఎంతైనా నేర్చుకోవచ్చు - అసలిలాంటి పాటలు సైకియాట్రిస్ట్ అవసరం రాకుండా చేస్తాయి.

పాటలని అంత విహంగవీక్షణంతో రాయగలగడం మీకెలా సాధ్యపడింది?  - అని అడుగుతూ మైకుని సీతారామశాస్త్రిగారికి అందించారు.

సీతారామశాస్త్రిగారు - సభకి నమస్కారం చేసి : 

"రాజాగారు  మీరడిగిన ప్రశ్న - సముద్రమంత సబ్జెక్టు. మూడు పురిషెళ్ళలో పట్టాలంటే అగస్త్యుడి శరీరానికి ఇక్కడ చాలా మందే వున్నా - శక్తికి చాలం. అయినా ప్రయత్నిస్తాను. 

సినీకవి - నేతిబీరకాయ పోలిక నాకు చాలా చికాకు కలిగిస్తుంది.

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం

సాహిత్యం ఆలోచనామృతం - సంగీతం ఆపాత మధురం. రెంటినీ విడివిడిగా ఊహించలేం.

<<<లలిత ఉవాచ: ఇక్కడ నాకు స్వాతికిరణం సినిమాలో వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే అన్న పాటలో -  ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ... ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము అన్న లైన్లు గుర్తుకొచ్చాయి.>>>

సాహిత్యానిది విస్తృత పరిధి - కథ, వచనం, వ్యాసం, నాటకం, నాటిక, గల్పిక, కవిత. కవితకి మళ్ళీ చాలా విశేషణాలు చేరాయి - స్త్రీ వాద, దళిత, వచన - ఇత్యాది.

వీటన్నిటితో ఎదిగిన వికాసం కళ.

నేను మొదట్లో RSS మెంబర్‌ని. విశ్వనాథ్‌గారి సిరివెన్నెల సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. 

ఆ సినిమా తర్వాత కలిసిన దర్శకులు, నిర్మాతలు విధాత తలపున - లాంటి డ్యూయెట్ రాయమనేవారు. 

పొదల్లో దొర్లే సన్నివేశాలకి "నీ రాజసానికి నీరాజనం" లాంటి పాటలు రాశాను. 

భయపడి మారు మాట లేకుండా "పాట బావుందండి" అని ఓ దండం పెట్టేవారు - మళ్ళీ కనిపించేవారు కాదు.

ఓ నిర్మాత ఏదో ఒక సినిమాలో చెప్పిన సన్నివేశానికి "ఓ బాబూ - నీ మమతల కోవెల కూలే" అనే పాటేదో రాశాను. 

27 సంవత్సరాలు నా మొహం చూడలేదు. 

తర్వాత అదే పాటని "ఓ బాబూ - నువ్వు జైలుకి వెళ్ళిపోయావు" అని తిప్పి రాయించుకున్నట్టు తెలిసింది.

వేటూరిగారికి, నాకు సినిమా తెరే వేదిక - పుస్తకాలు రాసి అచ్చు వేయించుకునే వీలు లేదు -  అందుకే మా పాటల్లో కవిత్వం ఉంటుంది. మిగిలిన సినీకవులు - ఆత్రేయగారిని మినహాయించి - "నా సరి నీవు, నీ గురి నేను , నీ మీద ఆ నాకు ప్రేమ - నాకు నువ్వే భామ" ఇలాంటి సాదా సీదా పాటలు రాశారు తప్పితే కవిత్వం ఉండదు ఆ పాటల్లో .

<<<లలిత ఉవాచ: ఇది వినగానే నాకు చెయ్యెత్తి - ఒక ఐదు నిముషాలు మాట్లాడే అవకాశం అడిగి - ముందుగా కవులుగా ప్రసిద్ధి చెంది అందమైన పాటలు రాసి మెప్పించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని, సముద్రాల వారిని, పింగళి గారిని, దేవులపల్లి వారిని, శ్రీశ్రీ గారిని, దాశరథిగారిని, సినారె గారిని, జాలాది గారిని - ఇంకా నేను ఇక్కడ లిస్ట్ చేయకపోయినా - ఎందరో అద్భుతమైన కవితా-హృదయమున్న పాటలు రాసిన ఎందరో సినీకవులని - గుర్తు చేద్దామా అనిపించి - మళ్ళీ నాకు నేనే - అంతవసరమా - అనేసుకుని  - నోరు గా...ఠిగా మూసుకుని కూర్చున్నాను. నా వరకు నాకు - ఎవరి గొప్ప వారు చెప్పుకున్నంతసేపు పర్వాలేదనిపిస్తుంది - ఎదుటి వారి ప్రసక్తి తెచ్చి పోల్చుకోనంతసేపు. >>>

సినిమా పాటకి ఓ భాషుంది.  నేను ఇతిహాద్ విమానంలో వచ్చాను. అందులో ఎయిర్ హోస్టెస్ వచ్చి "ఖ్ ఖ్ ఖ్ ... ఖ్ ఖ్ ఖ్ " అంటే బెల్ట్ పెట్టుకోమని ఆవిడ భావం.

నా పాటలు విని వాటి భావంతో resonate అయ్యేవారున్నారు - దాన్నే స్ఫూర్తి అంటున్నారు.

సిరివెన్నెల సినిమా తర్వాత రుద్రవీణ దాకా నాకు మంచి పాటలు రాసే అవకాశం రాలేదు. ఆ మధ్యకాలంలో నాకు దక్కినవి - ఓ నమస్కారం, తాంబూలం.

సినీపరిశ్రమ ఎవరికీ రెండో చాన్సు ఇవ్వదు. నాకు మాత్రం పదిహేను అవకాశాలు ఇచ్చింది. ఒకసారి ఇలాగే - ఎందుకు నన్నందరూ ఇలా పాటలు ఒక సినిమాకి మించి పాటలు రాయించుకోవట్లేదు? - అని ఆలోచించి ఒక పదిహేను సినిమాల కాసెట్లు కొనుక్కుని (వేరేవాళ్ళవి) విని సినిమా పాట రాయడం నేర్చుకున్నాను. 

లేడీస్ టైలర్ సినిమాలో చూడకూడని చోట - ఉండకూడని మచ్చ. దాని గురించి పాట రాయాలి.

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క -

అనే పాటలో - శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా - అంటూ శ్రీదేవి, వాణి, పశుపతిరాణిని గురించి రాసిన నన్ను ఒప్పిన దర్శక నిర్మాతలకి నా నమస్కారం.

- అంటూ తన పాటల-ప్రస్థానం గురించి ఎన్నో విశేషాలు చెప్తూ సీతారామశాస్త్రిగారు క్రిష్ గురించి కూడా కొన్ని కబుర్లు చెప్పారు.

"సినిమా ప్రపంచంలో సాధారణంగా సినిమా తీయడం మొదలు పెట్టాక ఆగడం అరుదు. ఆగదు. ఈ క్రిష్ గమ్యం తీసే టైములో ఎనిమిది నెలలు ఆపాడు. తెలిసిన కుర్రాడు - నాకప్పజెప్పారని సలహాలు ఇచ్చేవాణ్ణి - వినేవాడు - విన్నట్టు నటించేవాడని గమ్యం మొదటిసారి చూసినప్పుడు తెలిసింది.

గమ్యం చూడగానే చెప్పాను - క్రిష్ ! ఇప్పటికే నేను నీ సినిమాకి behind-the-scenes దర్శకుణ్ణి అంటున్నారందరూ. కానీ అసలేం జరిగిందో ఈ గదిలో వున్న నాకు తెలుసు, నీకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు - Go after your dream! గమ్యం డైరెక్టుగా రిలీజ్ చెయ్యి అని చెప్పాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు."

- అని గమ్యం సినిమా గురించి మాట్లాడిన తర్వాత

"సినిమా నాకొక పోస్టుబాక్సు లాంటిది. అందులో నా పాటలనే ఉత్తరాలు వేస్తుంటాను. అవి అందుకున్నవాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు"

- అంటూ తననడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ముగించారు.


ఈలోగా క్రిష్ అందుకుని - మైకందుకుని...

"మనసులోని నీవైన భావాలే - బయట కనిపిస్తాయి దృశ్యాలై. నాకు సినిమా అలాంటి ఒక మీడియం.

గంధం నాగరాజు, బుర్రా సాయిమాధవ్, వాసిరెడ్డి నవీన్‌గారు - ఇలాంటివారు కథని చేరవేస్తారు."

- అని తన  మొదటి సినిమా గమ్యం గురించి కొన్ని మాటలు చెప్పాక

"నన్ను క్లుప్తంగా చెప్పమన్నారు కానీ నేను మా గురువుగారికి  <<<సిరివెన్నెల గారిని చూసి నవ్వుతూ>>> శిష్యుళ్ళా  బిహేవ్ చేస్తున్నాను' అంటూ

"శాతకర్ణిలో ఎకిమీడా పాట పల్లవి చదివినప్పుడు - గురువుగారు... ఈ పాట ఎంతమందికి అర్థం అవుతుందండి - ఇంకోలా ప్రయత్నిద్దామా - అంటే నన్ను చూసి ఒక నవ్వు నవ్వారంతే. సరే - కానిమ్మని అలానే ఉంచేశాం - ఆ పాట ఈనాడు ఎంత పెద్ద హిట్టో మీకందరికీ తెలిసిందే!"

<<< లలిత ఉవాచ: మళ్ళీ ఇక్కడ నా మైండ్ కోతికొమ్మచ్చి ఆడేసింది - నిజమా - వూరికే ఆన్లైన్లో దొరికిన శాతకర్ణి సినిమా ఇదే పాట దగ్గర - అబ్బా - చాలింక - అని ఆపేసిన నా కళా-intoleance ని తల్చుకుని - నీకెలా అయినా కళాపోషణ, కలాపోశన (మహాదుష్ట సంధి, అతిమహాదుష్ట సమాసం కల+ఆపోశన - అంటే వేరేవాళ్ళ కలలని నా కళ్ళతో అలాగే చూడగలగడం) తగ్గి కళా-క్రోశం ఎక్కువైపోయింది - అని నన్ను నేనే హన్నా! - అనేసుకున్నాను. >>>

సినిమా మొదలుపెట్టాక గురువుగారు చుట్టుపక్కల అన్నీ మర్చిపోయి తనలో తనే మునిగిపోతారు." అంటూ సీతారామశాస్త్రిగారి గురించి చా ...లా అభిమానంతో, ఆత్మీయతతో మాట్లాడారు - ఆయన ప్రియ-శిష్య్ క్రిష్.

<<<లలిత ఉవాచ: ఇది వినగానే నాలో నేనే - Oh - perhaps he becomes a sole-soul అని అనుకుని - నా sole-soul ప్రయోగం నాకు నాకే తెగ నచ్చేసి - ఎప్పటికైనా Sole-Soul అనే ఒక Terzanelle రాయాలి అని ప్రస్తుత కార్యక్రమానికి ఒక అస్సలేమీ సంబంధం లేని గుర్తు పెట్టేసుకున్నాను. >>>

<<<ఇంకో లలిత ఉవాచ: ఇంతలో అప్పటివరకు నా పక్క కుర్చీలో కూర్చునివున్న మిణుగురులు సినిమా దర్శకుడు అయోధ్యకుమార్ లేచి - నేనింక వెళ్తానండి - వేరే పనుంది - అనగానే తలూపాను. తీరా అతనెళ్ళిపోయాక - అయ్యో ఏదో పార్టిసిపేట్ చేద్దామని వచ్చినట్టున్నారు - వసుధ అసలు రవిగారికి ఏం చెప్పిందో - పాపం ఇతనికి అసలు వేదిక మీదకి వెళ్ళే అవకాశమే రాలేదు - అని కాసేపు అనుకున్నాను కానీ - అంతకన్నా ఏం చేయలేకపోయానని ఇప్పటికీ ఏదో చిన్న బాధ.  >>>

ఎకిమీడా పాట ప్రసక్తి రాగానే మళ్ళీ మద్దుకూరి వారందించిన మైకందుకుని రాజాగారేమన్నారంటే -

"ఈ  ఎకిమీడా అన్న పదం రాజకోటరహస్యం సినిమాలో పింగళిగారు వాడారు - ఓ జ్యోతిలక్ష్మి పాటలో - మళ్ళీ ఇప్పుడు సీతారామశాస్త్రిగారు శాతకర్ణిలో రాశారు" - అని.

<<< లలిత ఉవాచ: రాజాగారు ఆ పాటేంటో చెప్పలేదు కానీ - అసలే పాటల-భైరవి-నామాంకిత-అపరాగ-పరిశోధనాసక్తను కదా - అది ఈ రోజు ఈ పోస్ట్ రాస్తూ ఆ పాటేంటబ్బా అని వెతికితే యూట్యూబులో - ఘన నాట్యము ఆడే ఎడ తూలేవో ఎకిమీడా - అంటూ జోతిర్లక్ష్మి భలేగా డాన్సాడేస్తున్న పాటొకటి కనిపించింది. >>>

రాజాగారు ఆత్రేయగారి గురించి ఆయనకి గుర్తొచ్చిన ఒక తమాషా విషయం  కూడా పంచుకున్నారు - ఎవరో ఆత్రేయగారిని అడిగారట - నాటకరంగం మా తల్లి అంటారు, సినిమారంగానికి వచ్చిన తర్వాత నాటకరంగానికి మీరేం చేశారు - అని. దానికి ఆత్రేయగారి సమాధానం - ఏం చేయను నాయనా! నాటకరంగాన్ని ప్రేమించాను - సినిమారంగాన్ని పెళ్ళాడాను. పెళ్ళాడినదాన్ని వదల్లేను - ప్రేమించిన దాన్ని మరువలేను- అంటూ.

ఇంక - రాజాగారి - రెండో ప్రశ్న - సీతారామశాస్త్రిగారికి: పాటల్లో శృంగారం గురించి మాట్లాడితే - మీరు మడి కట్టుకుని రాస్తున్నారు అంటారు - అలా ఎందుకు?

సీతారామశాస్త్రిగారి సమాధానం: 

భాష రెండు రకాలు - ప్రయివేటు, పబ్లిక్. 

సినిమా భాషా ప్రదర్శనకి ఒక వేదిక. దాంట్లో వాడేది సగటు భాష. 

ఇకపోతే శృంగారం రసరాజం. 

కావ్యం కాంతా సమ్మతం అంటారు. శృంగారం గురించి చెప్పాల్సిందే. కానీ చెప్పే పధ్ధతి మనసుకి హాయిగా ఉండాలి. బూతు మనసుకి వెగటు కలిగిస్తుంది కానీ -   చిలిపి నవ్వు మొలిపించదు. 

ఆడపిల్లని అల్లరి చేసి ఏడిపించాలి - బావుంటుంది - కానీ అది - సరదాగా - ఆ అమ్మాయి కూడా - తర్వాత నవ్వుకునేలా సాగాలి. 

నేను సినిమా రచయిత కన్నా ముందు కొడుకుని, అన్నని, భర్తని, తండ్రిని. 

గమ్యం సినిమాలో ఒక రికార్డింగ్ డాన్సుకి పాట రాయాల్సొచ్చినప్పుడు కూడా - హద్దు మీరకుండా రాసిన చింతామణి పాటలో - ఆ అమ్మాయి చేత పలికించిన మాటలివి: 

నిందలో నిజమో కానీ ఎందుకా కథలన్నీ
మందిలో దొరలే కానీ దొంగలసరెవ్వరని
గుండెలలోని గూడుపుఠాణి అడిగేదెవ్వరనీ... 

రాజాగారి మూడో ప్రశ్న:

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
(సినిమా: అంకురం)

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని 
(సినిమా: గాయం )

ఇంత మంచి సాహిత్యం రాసిన మీకు జాతీయ స్థాయిలో ఎవార్డు రావట్లేదేంటి? జాతీయ స్థాయి కొలతలు ఏంటి - ఉదాహరణకి సుబ్బిరామిరెడ్డిగారి లాబీయింగ్? 

దీనికి ముందుగా క్రిష్ దగ్గర్నుంచి వచ్చింది సమాధానం - మాటలు తడబడేంత ఆవేశంతో:


ఎన్టీఆర్ గారికి భారతరత్న, గురువుగారికి జాతీయస్థాయి ఎవార్డు రాకపోవడం - జాతీయ ఎవార్డులు చేసుకున్న దౌర్భాగ్యం. 

సూర్యుడి పక్క దివిటీల్లాంటివి వీరికి జాతీయ ఎవార్డులు. 

నా మణికర్ణిక సినిమాకి మాటలు, పాటలు రాస్తున్న ప్రసూన్ జోషి - సీతారామశాస్త్రిగారి పాటల్నే ట్రాన్స్‌లేట్ చేస్తూ ఈయన తెలుగుకే పరిమితమవడం దురదృష్టకరమైన విషయం అని అన్నారు

- అంటూ మాట్లాడారు.

వెనువెంటనే మైకందిన సీతారామశాస్త్రిగారు: "గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం" అని గట్టిగా నవ్వి - ఇంకా ఇలా అన్నారు: జాతీయ స్థాయిలో గుర్తింపు కలగలేదని ఏనాడూ కించ పడలేదు. నా అభిమానుల నుంచి ఇన్ని వందల వేల జాతీయ ఎవార్డులు లభిస్తుంటే ఆ నిర్జీవమైన జాతీయ ఎవార్డ్ ఎందుకు నాకు? 

ఇక్కడికొచ్చి అందరూ పద్మశ్రీలు తెచ్చుకుంటారు. 

నేను మాత్రం పద్మశ్రీని తెచ్చుకుని ఇక్కడికి వచ్చాను - మా ఆవిడ పేరు పద్మశ్రీ. అన్నట్టు ఈరోజు - అంటే మే 28 - మా పెళ్ళిరోజు - అని చెప్పారు.

వెంటనే అందరం చప్పట్లతో వేదిక మీద కూర్చున్నసీతారామశాస్త్రిగారికి, వేదిక ముందు కూర్చున్న వారి శ్రీమతి పద్మశ్రీ గారికి వివాహవార్షికోత్సవ శుభకామనలు అందజేశాము.

రాజాగారి నాలుగో ప్రశ్న: మీర్రాసిన పాటల్లో పదాల అర్థాలు దర్శకునికి వివరించాల్సిన అవసరం వచ్చిందంటారు. ఆ సంగతేంటో చెప్తారా?

సిరివెన్నెలగారి బదులిది: 

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ (సినిమా: అష్టా చమ్మా) పాటలో -

చూశాక నిన్ను వేశాక కన్ను - అనే లైనులో వేశాక కన్ను లో అది అష్టాచమ్మా ఆటలో వేసే గవ్వ కన్ను 

అలాగే - నీ పంట పండిందె ప్రేమ - అన్న చోట - పంట పండడం అష్టా చమ్మా ఆటలో పంట పండడం. 

ఆ రెఫరెన్సెస్ అన్నీ అష్టాచమ్మా ఆటలో గవ్వల నుద్దేశించినవి. ఆ ఆట తెలియందే పాటలో వున్న పదాల సొగసు అర్థం కాదు. 

Idiom వల్ల భాష అందగిస్తుంది. తెలుగు నాకు అన్నం పెట్టింది. అనకాపల్లి నుంచి అమెరికా రప్పించింది. 

ఒకసారి ఇలాగే ఎస్పీబాలుగారిని సరదాగా సితార కోసం ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. అది తెలియగానే బాలుగారు - అమ్మో - ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి- అంటే నేనన్నాను - తొందరగా పెట్టుకోండి - ఇప్పటికే సోఫాలో బాగా జరిగిపోయింది - అని. అది వినగానే బాలుగారు పెద్దగా నవ్వేశారు. 

ఇలా చెప్తూ సీతారామశాస్త్రిగారు - అందమైన పదాలతో తాను అల్లుకున్న గాయం సినిమాలోని ఈ కింది పాటను గుర్తు చేసుకున్నారు.

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖాన మనలేని వికాసమెందుకని,
సుమాల బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం 
(సినిమా: గాయం) 

ఇంతలో మద్దుకూరి చంద్రహాస్‌గారు క్రిష్‌గారిని సాహిత్యంతో మీ పరిచయం గురించి చెప్పండి అని అడగ్గానే - క్రిష్‌గారు చిన్నప్పటినుంచి ఉమ్మడి కుటుంబంలో, తాతగారి దగ్గర పెరిగిన తనకి - పుస్తకాలు ఎక్కువగా చదివే అవకాశం ఇటీవలే కలుగుతోంది అని చెప్పారు. తనకి రావిశాస్త్రిగారి కథలు ఇష్టమనీ, వారి న్యాయం కథలోని వేశ్య పాత్ర తన వేదం సినిమాలో ఒక పాత్రకి స్ఫూర్తి అని కూడా చెప్పారు.

ఈలోగా సీతారామశాస్త్రిగారు అందుకుని - క్రిష్ ఎప్పుడూ అనవసర వినయాలకి పోలేదు. దర్శకుడు సినిమాని మనందరికన్నా ముందు చూసేవాడు. ఆ చూపు బాగా తెలిసినవాడు క్రిష్ - అన్నారు.

దానికి ముక్తాయింపుగా క్రిష్‌గారు అన్నది - నాకు తెలియనిది ఒక్కటే - నాకు బాగా తెలుసు అనుకోవడం.


రాజాగారి ఐదో మరియు ఆఖరి ప్రశ్న: పరభాషా గాయకులు పాడడం వల్ల ఒక్కోసారి పాట అర్థం మారిపోతోంది. ఉదాహరణకి - నా మనసాగేదెలా అని రాస్తే నా మనసా గేదెలా అని పాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?

సీతారామశాస్త్రిగారు నవ్వి: ఒకసారి ఇలాగే బాబా అణుకేంద్రం లో పనిచేసే యువ సైంటిస్టులు కొందరు - నా అభిమానులు అంటూ వచ్చి నన్నడిగారు: రికార్డింగ్ టైంలో నేను లేందే చేయకూడదని కండిషన్ పెట్టలేరా అంటూ. 

వాళ్ళనడిగాను నేను వెంటనే: మీరు నా మీద జాలి చూపిస్తున్నారా? లేకపోతే మీ తెలివితేటలు చూపిస్తున్నారా - అని. 

A song is a lyric told musically. 

రాజాధిరాజా వంశభుజబీజా - అని పాడతారు. అది వంశభూజబీజ - భూజ అంటే చెట్టు - వంశమనే చెట్టు అని అర్థం. 

గాయకులెప్పుడూ అర్థం చర్చించి పాడాలి. 

- అంటూ క్లుప్తంగా జవాబిచ్చారు - అప్పటికే సమయం మించి పోతుండడంతో - తర్వాతి కార్యక్రమానికి వేళవుతోంది మరి.

అలా మాటలతో, పాటలతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో మ్యూజికాలజిస్ట్ రాజాగారి ప్ర-జ కార్యక్రమం చాలా entertaining గా, informative గా జరిగింది - ఎంతైనా సినిమా కబుర్లు కదా!

ఇంకో విషయం - ఇంతకుముందు జరిగిన సాహిత్య ప్రసంగాలు, అష్టావధానం అయిన తర్వాత మా సాహిత్య కమిటీలోని అందరితో కలిసి ఫోటో తీయించుకున్న మా కమిటీ-చెయిర్ రవిగారు ఈ పాటల-మాటల కార్యక్రమం తర్వాత మేము లేకుండానే క్రిష్ పక్కన నిలబడి ఫోటో తీయించేసుకున్నారు - అబ్బే - అలా అని నేనేదో బాధపడిపోతున్నానని కాదు - జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే :)

కొసమెరుపుగా - మైమరపుగా - ఇదిగో సిరివెన్నెలగారు తానా-2017 లో పాడిన పాట (ఈ పాట రికార్డ్ చేసి అందించిన నాణెమైన-నానీల విజయశ్రీ గారికి బో...ల్డన్ని ధన్యవాదాలు!!!)





ముందే చెప్పానుగా - ఈ తానా-సిరీస్ ఒక మెమెంటో-టైప్ సిరీస్ అని - అందుకని ఈ "క్రిష్"పక్షపు-సిరివెన్నెల కురిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడికెళ్ళి చదివేసుకోండి మరి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1 

ఇంకా తానా-కబుర్లు అయిపోలేదండోయ్ - తదుపరి పోస్టుల్లో మరి కొన్ని విశేషాలు - Stay Tuned!