28, ఏప్రిల్ 2018, శనివారం

కృష్ణ-పక్షమైన రజని

చిన్నప్పుడు - ఇంట్లో దేవతార్చనకి పూలు కోయడం బోల్డంత ఇష్టంగా ఉండేది.

పూలు కోయడం అనేది మామూలు పనే. అందులో పట్టి చూడడానికి ఏ విశేషమూ వుండదేమో. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు పూలు కోసే ఆ పది, పదిహేను నిముషాల సమయం ఎంతో బాగా అనిపించేది. పైగా అప్పటికి వున్న ఊరు, ప్రదేశాన్ని బట్టి, అప్పటికి వింటున్న పాటల బట్టి ఎన్నో ఎన్నెన్నో మంచి జ్ఞాపకాలు.

జంగారెడ్డిగూడెంలో  వున్నప్పుడు పొద్దున పొద్దున్నే వెళ్ళి గార్డుగారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో వున్న గరుడవర్ధనం పూల చెట్టెక్కి - దగ్గర్లోనే వున్న గుడి మైకులోంచి వచ్చే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గొంతులో 'శ్రీరంగ పుర విహారా ..." వింటూ అమ్మ చేసే పూజ కోసం రేపు విడవాల్సిన మొగ్గలకి చేయి తగలకుండా కోసిన పూలు తెల్లటి జ్ఞాపకం.

పీబీ శ్రీనివాస్, ఎస్జానకి మెత్తటి గొంతులతో శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడుతుంటే మేల్కొంటున్న మా గుళ్ళో శివుడితో పాటే లేచి చెల్లాయత్త వంటింట్లో కొలువైన ఇష్టదేవతల పూజ కోసం కోసిన ముద్ద మందారాలు, మొల్లలు - ఎర్రటి తెల్లటి జ్ఞాపకం. 

అనాతవరం నట్టింట్లో దేవుడి గూట్లో సింహాసనంలో విఘ్నేశ్వరుడు, అన్నపూర్ణాదేవి విగ్రహాలకి పూజ చేసే లలిత దొడ్డ పూజ కోసం ఆల్ ఇండియా రేడియో - విశాఖపట్టణం స్టేషన్లో వచ్చే భక్తిరంజని పాటలు వింటూ పూలబుట్ట లోకి కోసిన మందారాలు, నిత్యమల్లె పూలు, డిసెంబరాలు  - రంగురంగుల జ్ఞాపకం.

పూజ కోసం కోసిన ఆ పూలని తాకి తాకి, ఆ పూల పేర్లను పలుమార్లు తలచి తలచి మురిసిపోయేదాన్ని.

అసలా పూల మీద అంత ఇష్టం ఎలా కలిగిందీ, అదెలా పెరిగిందీ అనాలోచిస్తే - మనసులో మొట్టమొదటగా కదిలేదీ, మెదిలేదీ ఒక సంప్రదాయ గీతం.

కాటుక రంగులో చుక్కల వెలుగులో హొయలుపోతున్న రాజసమైన కృష్ణరజనిని వెలుగు రేఖలతో వెలిగిస్తూ ఎదిగివస్తున్న ఛాయామార్తాండ బింబపు పెంపుని జాముజాముకీ పూలతో, పూలమీద మెరిసే  నానావిధవర్ణరాశులైన నవరత్న శోభలైన పుప్పొడుల ఛాయలతో పోల్చి - శ్రీ సూర్యనారాయణా ... మేలుకో ... హరి సూర్యనారాయణా అతి మెత్తగా ఆ భానుడిని మేలుకొమ్మని స్తుతిస్తూ, నుతిస్తూ - బాలాంత్రపు రజనీకాంతరావుగారు కూర్చిన సూర్య-స్తోత్ర-మాల వింటూ పెరిగానేమో - అక్కడ మొదలయి - ఇప్పటికీ వింటుంటానేమో - ఇల్లిప్పటిదాకా పూల పేరు వినగానే చుట్టుముట్టే పులకరింతల పొలకువ నన్నల్లాగే అంటిపెట్టుకుని వుంది.



శ్రీ  సూర్యనారాయణా ... మేలుకో ... హరి సూర్యనారాయణా
పొడుస్తూ భానుడు పొన్నపూవూ ఛాయ పొన్నపూవూ మీద బొగడ పూవూ ఛాయ
ఉదయిస్తు భానుడు ఉల్లిపూవూ ఛాయ ఉల్లిపూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ
గడియెక్కి భానుడు కంబపూవూ ఛాయ కంబపూవూ మీద కాకారి పూ ఛాయ
జామెక్కి భానుడు జాజిపూవూ ఛాయ జాజిపూవూ మీద సంపెంగి పూ ఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపూవూ ఛాయ  మల్లెపూవూ మీద మంకెన్న పొడి ఛాయ
మూడుజాముల భానుడు మూలగపూవూ ఛాయ మూలగపూవూ మీద  ముత్యంపు పొడి ఛాయ
అస్తమాన భానుడు ఆవపూవూ ఛాయ ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ
వాలుతూ భానుడు వంగపండూ ఛాయ వంగపండూ మీద వజ్రంపు పొడి ఛాయ
గ్రుంకుతూ భానుడు గుమ్మడీ పూ ఛాయ గుమ్మడీ పూ మీద కుంకంపు పొడి ఛాయ 

అలా అలా ఆ పూల ఛాయలో బాల్యపు పసిదారుల పరుగెత్తి  - పసిడి వన్నెల కౌమారంలో అడుగిడి - అప్పటివరకూ పరుగిడిన అడుగు,  అలికిడి కూడా వినబడని నడకల నిలకడ కాగానే కంటికానినవి అచ్చొత్తిన పుస్తకాల విచ్చిన పూలలాంటి అచ్చతెలుగు అక్షరాల మాలలు -  దేవులపల్లివారి జిలిబిలి పలుకుల కృష్ణపక్షపు కవితా చంద్రికలు. 

మొట్టమొదటగా పాడుకున్న దేవులపల్లివారి పాట - ఇప్పటికీ జీవనగమనమైన పాట -ఆకలా , దాహమా చింతలా వంతలా ?- ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ ! అంటూ సాగే ఆకులో ఆకునై ... అన్న పాట.

నేను పుట్టక మునుపే - అప్పటివరకు పల్లెల దారుల, ఏటి దాపుల, తోటల తోపుల మావిచివురుల మేసి కవితా-గానమాలపించిన కృష్ణ-కోకిల కంఠం మూగబోయిందట.
బెంగటిల్లిన ఆ కవికోకిల కవితాఝరిని ఆగనీయక తన కంఠంతో సంగీత-రజనీకాంతులతో వెలిగించారట రజని. ఆ గేయ కవితా కాంతులే కృష్ణరజని (కృష్ణశాస్త్రిగారి సాహిత్యం, రజనీకాంతరావుగారి సంగీతం) పేరిట కవితా-గేయాలయాయని  చదువుకున్నాను.

ఆ రజనీకాంతరావుగారు సాహిత్యంతో ఆడుతూ, సంగీతంతో పాడుతూ - ఆడుతూ, పాడుతూ - తెలుగు పాటని పలికించి, తెలుగు బాటని వెలిగించి - అమరపురికి తరలిరట - మరపురాని మధుర గీతాలు మనకి పంచి - ఈ విళంబిలో, వైశాఖ శుద్ధ సప్తమి నాడు (2018 ఏప్రిల్ 22).

కృష్ణశాస్త్రిగారి కవిత అమృతవీణట  - 
సంగీత చంద్రికల నలదినవి రజనీవారి కాంతులట  
అమృతవీణపై కాంతులీనిన కృష్ణరజని సాహిత్యసంగీతాల ప్రోవట
తన పక్షాన కృష్ణశాస్త్రిగారు లేని లోటు తోచిందో ఏమో 
తన పక్షమందు కృష్ణ లేక రజని కృష్ణపక్షమాయెనట    
సఖుని దరికి కృష్ణ-పక్షమైన రజని తరలినారట
వారిరువురి కలయిక నాకములోనట 
కృష్ణ-రజనీకాంతులు లేని భాషా-కృష్ణపక్షపు-రజనిలో కినిసెనిప్పుడట 
తెలుగు భావ కవిత....

ఇప్పుడింక తెలుగు భావకవితకే నోరుంటే ఇలా పాడుకునేదేమో ... అప్పుడెప్పుడో  కృష్ణశాస్త్రిగారు రాసుకున్న ఒక పాటలో మాటల్లా ...

ఆగి ఆగి మ్రోగి మ్రోగి 
అదే పిలుపు! అదే పిలుపు!
ఆగి ఆగి సాగి సాగి 
అదే నడక! అదే నడక! 
తెమలనీవు నా జాతర 
తెలవారదు కృష్ణరజని


19, ఏప్రిల్ 2018, గురువారం

త్వామనురజామి - 24 - తంతిలేఖ రాశా నీకంది వుంటదీ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 23 - నీకై వచ్చితినోయీ...ఎండల్లో తిప్పితినోయీ...


అనుకున్నట్టుగానే అబ్బాయి మద్రాస్ వెళ్ళే రోజొచ్చింది. ఆ ముందు రోజు సాయంత్రం యూనివర్సిటీ రోడ్డులో కుడి పక్కకి తిరిగి అలిపిరి దాకా వెళ్ళే బదులు ఎడం పక్కగా నడుచుకుంటూ వెటర్నరీ కాలేజ్ దాకా వెళ్ళాం - వాకింగ్‌కి.

అప్పుడే చెప్పారు - తన సీనియర్ రాజశేఖర్ ఫ్రెండ్ జయ చదివేది ఆ కాలేజ్ లోనే అని. ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు ఆ అమ్మాయికి  ముందే చెప్పి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తానని చెప్పారు.

అక్కడి నుంచి మా హాస్టల్ కేసి తిరిగి వస్తూ రోడ్డు పక్కనే ఒక చెట్టు కింద వున్న నాపరాయి బెంచ్ మీద కూర్చుని తన చేతిలో వున్న - నాకు తిరిగి ఇద్దామని తీసుకొచ్చిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చూపించారు. భలే! నేను చదవమని ఇచ్చిన పుస్తకాన్ని అస్సలు నలపకుండా చదవడమే కాకుండా దానికి మంచి బ్రౌన్ పేపర్‌తో అట్ట వేసి తెచ్చారు. ఆ అట్ట  మీద ఒక మూలగా మద్రాసులో తనుండబోయే ఫ్రెండు - సాయి గిరిధర్ - వాళ్ళ ఇంటి ఎడ్రెస్ రాసి వుంది.

"ఏంటి ఈ ఎడ్రెస్?"

"ఓ రెండు నెలలు ఉండను కదా - నీకేమన్నా కబుర్లు చెప్పాలనిపిస్తే లెటర్ రాయి - లేకపోతే మానెయ్"

హన్నా! నీ మాటల్లో, పాటల్లో బిజీగా ఉంటావేమో - వీలుచూసుకుని ఒక ఉత్తరం రాయవా - ప్లీజ్ - అనకుండా రాస్తే రాయి, లేకపోతే మానేయ్ అనేయడమే - హన్నా...హన్నన్నా! అనేసుకుని కాసపు మాట్లాడలేదు నేను.

ఆ బెంచ్ మీద ఒక ఐదు నిముషాలు కూర్చుని లేచి మళ్ళీ మా హాస్టల్ వైపు నడవడం మొదలు పెట్టామే కానీ నేనస్సలు మాట్లాడట్లేదు.

ఓ ఐదు మౌన-యుగాలు అలా నడిచాక - ఉన్నట్టుండి ... ఓ ప్రశ్న.

"ఔను బుజ్జాయ్...నీకు పజిల్స్ అంటే ఇష్టం కదా! నేనొక ఈజీ పజిల్ అడుగుతా చెప్తావా?"

"... ..."

"సర్లే! మాట్లాడవా అయితే? జవాబు చెప్పడానికి మాట్లాడాల్సిన అవసరం లేని పజిల్ ఇది ...అడగనా?"

"... ... "

(కానీ మనసులో ఆ పజిలేదో గబగబా అడిగితే బావుండుననిపించేస్తోంది - ఎందుకంటే ఇంకో ఇరవై నిముషాల్లో హాస్టల్ దగ్గరకి వెళ్ళిపోతాం.)

"అడిగేస్తున్నా .... అడిగేస్తున్నా.. "

ఇంక మాట్లాడకుండా వుండలేక "అబ్బ! ఇంకెంతసేపు తొందరగా అడగండి" అనేశాను.

"అదీ అలా అడుగు - అలా అయితేనే నిన్ను నేనడుగుతా. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు - ఒక మూగబ్బాయి షాపుకి వెళ్ళి పెన్సిల్ కావాలని ఎలా అడుగుతాడో చెప్పు?"

ఇదీ ఓ ప్రశ్నేనా అన్నట్లు చూసి నా కుడి చేత్తో ఎడమ అరచేతి మీద రాస్తున్నట్లు ఏక్ట్ చేసి "ఇలా ..." అని చెప్పాను.

కళ్ళెగరేసి "భలే చెప్పావే! " అన్నట్లు నవ్వుతూ నన్ను చూస్తూ ఓ రెండు నిముషాలు ఏదో ఆలోచిస్తున్నట్టు ఆగి "మరైతే.... ఒక కళ్ళు లేని అబ్బాయి షాపుకెళ్ళి ఐస్‌క్రీం కావాలని ఎలా అడుగుతాడూ?" అనడిగారు.

నేనప్పుడు - 'ప్రశ్న అడగడానికే ఇంత ఆలోచించాలా - హుఁ  - నేనేనెంత తొందరగా జవాబు చెప్తానో చూడండి' అన్నట్లు తలెగరేసి - అస్సలొక్క నిముషం కూడా ఆలోచించకుండా - కళ్ళు గా... ఠిగా మూసేసుకుని చేత్తో కుడి చెయ్యి నోటి దగ్గర పెట్టి నాలిక బైట పెట్టి  కోన్ ఐస్‌క్రీంని తింటున్నట్టు ఏక్ట్ చేసి చూపించాను.

ఓ రెండు నిముషాలు పక్కనుంచి ఎలాంటి మాటా లేదు.

ఏంటా అని పక్కకి తిరిగి చూస్తే - హహ్హహ్హ అని నవ్వుతూ "కళ్ళు లేకపోతే నోరేమైంది ఐస్‌క్రీం అడగడానికి?" అని తను అనగానే నాకూ బోల్డంత నవ్వొచ్చేసింది.

అలా నవ్వుతూనే - గుడ్‌నైట్, హాపీజర్నీ చెప్పేసి - whose whose hostel they they go అనేసుకున్నాం.

------------------------------------------------------------------------------------------------

మా థర్డ్ సెమిస్టర్ పరీక్షలు మొదలు ... పరీక్షలు కదా పాపం అమ్మాయిలు టీ తాగి నైటవుట్లు చేసి చదువుకుంటారు అని మా డైనింగ్ హాల్లో రాత్రి తొమ్మిదిన్నరకి చిక్కటి స్పెషల్-టీ ఇచ్చేవారు.

ఆ చిక్క-టీ  తెచ్చుకుని - కొంచెం కొంచెం వెచ్చగా పుచ్చుకుంటూ - టీవీ రూంలో రాత్రి  పదిన్నరకి వచ్చే సోమవారపు-చిత్రమాలో, లేకపోతే ఏ ఫిల్మ్-ఫేర్ ఎవార్డ్స్లో చూస్తూ - ఆ పెద్ద గ్లాసుడు చిక్క-టీ తాగేసి - రూంకి వెళ్ళిపోయి "హమ్మయ్య" అనుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుండిపోయేదాన్ని.

ఆడుతూ, పాడుతూ పరీక్షలు అయిపోయాయి. వెంటనే  ఫోర్త్ సెమిస్టర్ మొదలయింది. ఇంకొన్ని వారాలయితేనే కానీ వేసవి సెలవులు మొదలవవు.

తిరుపతిలో ఎండలు కొండల మీదుగా పరావర్తనం చెంది జుట్టు కిందున్న గుండులను కూడా మాడ్చేస్తున్నాయి. పగలంతా ఎలా వున్నా సాయంత్రాలు మాత్రం భలే ఉండేవి. టౌన్ లోకి ఎవరు వెళ్తున్నా మల్లెపూలు బోల్డు తెచ్చేవారు. మాలలు కట్టడం వచ్చినవాళ్ళు చకచకా మాలలల్లి అందరికీ ఇచ్చేవారు.

నాకెప్పుడో చిన్నప్పుడు చేతి వేళ్ళతో దారం మల్లెపూవు కాడ చుట్టూ తిప్పి ముడి వేయడం రాక ఏడుస్తున్నానని - నాకు సులువుగా ఉంటుందని కాలి బొటనవేలికి దారం ముడేసి కాలి-మాల కట్టడం నేర్పారు నాన్నమ్మ.

మళ్ళీ ఇన్నేళ్ళకి మాల కట్టడం నేర్చుకోవాలి అని సరదా వేసింది. మా క్లాస్‌మేట్ పద్మప్రియ చాలా బాగా మల్లెపూల మాల కట్టేది. ఒకసారి తన పక్కనే కూర్చుని ఎంత బాగా కడుతోందో అనుకుంటూ చూస్తుంటే తనే నాకొక ఐడియా ఇచ్చింది - చుట్టుపక్కలున్న చెట్ల ఆకులు తెస్తే మాల కట్టడం నేర్పుతాను, అప్పుడు మల్లెపూల మాల కట్టడం తొందరగా వస్తుంది - అని.

అన్నట్లుగానే నాకు మల్లెపూలు మాల కట్టడం వచ్చేదాకా ఓపిగ్గా విసుక్కోకుండా నేర్పింది పద్మప్రియ.

రాత్రి ఒక్కోసారి పవర్-కట్ ఉండేది.

అప్పుడు మా 603-వింగ్ ముందున్న స్టెయిర్-కేస్-లాండింగ్ మీద కూర్చుని ఆ చీకట్లో గొంతెత్తి "మంచిగంధం ముద్ద మీద - నల్ల కస్తూరి బొట్టు లాగా - ౘందమామ ఆకాశంలో అందగించాడూ  - చిందులేశాడూ" అని పాడుకోవడం -
ఆ చీకట్లో గుత్తి పద్మజ "నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో ..నీడల్లే వున్నా...నీతో వస్తున్నా" అంటూ అందరినీ అల్లరిగా భయపెట్టడం- అందరం హాస్టల్ టెర్రేస్ మీద పక్కలు వేసుకుని ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం - లేదింక వేసవిని మించిన హాయింక - అనిపించేది.

ఓ రోజు కరెంట్ పోయిందని రూంలో వేడిగా ఉందని అందరం టెర్రేస్ మీద పడుకున్నాము. నాకు అర్థరాత్రి వేళ మెలకువ వచ్చింది. చెవిలో ఏదో నొప్పి - లోపల ఏదో కదులుతోంది. నాకు వెంటనే అర్థమయింది - చెవిలో పురుగు దూరిందని.

వెంటనే "వాఁ ..." అని ఏడవడం మొదలు పెట్టాను. నా ఏడుపుకి పక్కనే పడుకుని వున్న శ్రీలత, సంగీత అందరూ లేచారు.

లేచీ లేవగానే హడావిడిగా వెళ్ళి ఒక టార్చ్‌లైట్  తీసుకొచ్చారు.

చెవి దగ్గర టార్చ్‌లైట్ పెడితే లోపల ఉన్నదేదో ఆ వెలుగు చూసి బయటికి వస్తుందని కాసేపు నా చెవి దగ్గర వెలుగుతూ, ఆరుతూ ఉండేలా పట్టుకున్నారు. దాంతో ఆ లోపల ఉన్నదేదో బయటికి రావడం మాటే మర్చిపోయి  ఆ డిస్కో-లైట్ వెలుగుల్లో ఇంకా స్పీడుగా తిరగడం మొదలుపెట్టింది. నాకేమో ఆ తిరుగుడుకి నొప్పి ఇంకా ఎక్కువయ్యింది. ఆరున్నొక్కరాగపు శృతి పెరిగింది.

నా బాధ చూడలేక - శ్రీలత "ఏడవకు లల్లీ - చెవిలో కొంచెం నీళ్ళు పోస్తే - చచ్చిపోయి తేలి వచ్చేస్తుంది" అంటూ ఓ నాలుగు చుక్కల నీళ్ళు చెవిలో పోశారు. తనన్నట్లే చెవిలో వున్నది చచ్చిపోలేదు కానీ బైటికి వచ్చేసింది - తీరా చూస్తే అదొక బుల్లి నల్లచీమ - పాపం దానికెంత భయమేసిందో అనుకుని జాలి పడి మేడ మీద వదిలేశాం.

చీమ చెవిలో ఆడుకోవడం, తర్వాత నీళ్ళలో ఈదులాడుకోవడంతో రెండోరోజు చెవి కొంచెం నొప్పి చేసింది. క్లాసులకి కూడా వెళ్ళలేక రూమ్ లోనే పడుకున్న నన్ను అలా చూడలేక, శ్రీలత ఒక రిక్షా పిలుచుకొచ్చి బాలాజీ కాలనీలో వుండే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆవిడ చెవిలో చూసి ఏమీ లేదు - ఇయర్-డ్రాప్స్ వాడితే నొప్పి తగ్గిపోతుందని చెప్పారు. ఆవిడన్నట్లే మరుసటి రోజుకి చెవినొప్పి తగ్గింది.

మళ్ళీ క్లాసులు - డైనింగ్ హాల్లో కబుర్లు, పాటలు అన్నీ మామూలే.

ఒక వారం ఇంటికి ఫోన్ చేసినప్పుడు నేను హాస్టల్లో చేసే కూరలు నచ్చక జస్ట్ పెరుగు అన్నం, సాంబార్లో ముక్కలు మాత్రం తింటున్నానని విని మా అమ్మ - పాపం - "లల్లీ! మీ హాస్టల్లో ఎగ్ పెడతారు కదా. ఒకసారి ట్రై చెయ్యి. సహిస్తే తిను ఫరవాలేదు. అలా ఉట్టి పెరుగూ అన్నం తింటే నీరసమొస్తుంది. క్రితం సారి నేనొచ్చినప్పుడు మీ మేట్రన్‌కి చెప్పాను కూడా నీకు రాత్రిపూట వేడి పాలు ఇమ్మని - ఇస్తున్నారా?" - అని ఒకటే బాధపడిపోయి ఒకటికి రెండు సార్లు ఎగ్ తినడం అలవాటు చేసుకోమని చెప్పింది.

అలా హాస్టల్లో గురువారం రాత్రి పూట చేసే ఉడికించిన ఎగ్ కూర తినడం మొదలు పెట్టాను. డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే ముందున్న టేబుల్స్, కుర్చీలు దాటుకుంటూ వెళ్తే వెనకగా వున్న కిచెన్ ముందు రెండు నాపరాళ్ళ అరుగులు ఉండేవి.

కుడి పక్కనున్న అరుగు మీద పెద్ద గిన్నెలో అన్నం, ఇంకో గిన్నెలో ఒక కూర - కారెట్టో, బీట్రూటో, వంకాయో (ఎప్పుడూ అవే),  పక్కనే ఇంకో గిన్నెలో గడ్డ పెరుగు వుంచేవాళ్ళు.  ఎడమ పక్క అరుగు మీద అప్పడాలు, ఎగ్ కూరలాంటి స్పెషల్ కూరలు పెట్టేవాళ్ళు.

గురువారం రాత్రి ఆ ఎడమ పక్క అరుగు దగ్గర కణ్ణగి నించుని ఒక్కొక్క ఎగ్ గరిటతో తీసి అమ్మాయిల ప్లేట్లలో వడ్డించేది. ఒక్కోసారి అక్కడ చాలా మంది ఉండి బోల్డన్ని ప్లేట్లు ఆవిడ ముందు చాచి నించునేవారు. వాళ్ళలో నేనూ దూరి నా ప్లేట్ ముందుకి చాపి - "ఓ గుడ్డు పెట్టండి ప్లీజ్!"  అని అనే దాన్ని. ఓ రెండు వారాల దాకా మా కణ్ణగి అంతగా పట్టించుకోలేదు. మూడో గురువారం అలాగే "ఓ గుడ్డు పెట్టండి ప్లీజ్!" అనగానే నా ప్లేట్లో ఎగ్ వేయబోతూ ఆగి "నువ్వడక్కపోయినా కూర వేస్తాను" అంది ఆవిడ (implied meaning ఇంక గుడ్డు పెట్టే మాటెత్తకూ అని.). ఇంకెందుకంటాను కదా - నేననాలనుకున్నది - నేనంటుంటే ఆవిడ వినాలనుకున్నది - ఆవిడ విందీ, ఆవిడకి అర్థం అయిందీ - mischief accomplished! ఆ తర్వాత ఎగ్ అంతగా నచ్చక తినడం ఆపేశాను - అద్దర్వాత సంగతి.

ఈలోగా ఏప్రిల్ ఆఖరి వారం - వేసవి సెలవులు మొదలవబోతున్నాయి. మళ్ళీ రైళ్లు, టిక్కెట్లు, రిజర్వేషన్లు - హడావిడి.
 
ఇప్పటిదాకా అబ్బాయిని తలుచుకుంటున్నా, పుస్తకం మీద ఎడ్రెస్ కనిపిస్తున్నా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. పంతం - తప్పకుండా రాయి ఎదురు చూస్తుంటాను అని చెప్పలేదని.

ఈలోగా ఇంటికి వెళ్ళే రోజు దగ్గరికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళేలోగా అబ్బాయికి ఏమైనా చెప్పాలనిపించింది. వెంటనే శుభని తోడు తీసుకుని SVU లో వున్న పోస్ట్-ఆఫీసుకి వెళ్ళి ఒక టెలిగ్రాం ఇచ్చాను మద్రాసు ఎడ్రెస్‌కి - Tere mere sapne ab ek rang hain, Jahaan bhi le jaaye raahe ham sang hai - అని.


తంతిలేఖ రాశా నీకంది వుంటదీ... రూ రు రూ
పాట-బాణమేశా మది బెంగగుంటదీ... రూ రు రూ

- అని పాడుకుంటూ వేసవి సెలవులకి రైలెక్కి ఇంటికి వెళ్ళాను.

తర్వాత కథ వేసవి సెలవుల తర్వాత... 



< <<... మే లో వేసవి సెలవులు కదా - అందుకని మళ్ళీ జూన్ 19 కి ఇంకొన్ని కబుర్లు ->>


16, ఏప్రిల్ 2018, సోమవారం

బుజ్జోడు - విజ్జోడు

పై నుంచి కింద దాకా మేచింగ్ వేసుకోవడం అలవాటు - బుజ్జిజింకకి...

రేపటికి ఏం వేసుకోవాలో ఈ రోజు రాత్రే తీసి పెట్టేసుకుంటాడు.

ఓ నాలుగు నెలల క్రితం రోజూ లాగే ఒకానొక ఆరోజు కూడా ఎంచుకున్నది - ఆపాదమస్తకం నీలవర్ణవస్త్రధారణం....

బజ్జోడానికి ముందు కొన్ని కబుర్లు - అవీ, ఇవీ చెప్పుకుని చెవులదాకా దుప్పటి కప్పి ఇవతలికి రాబోతుంటే... ఇంతలో ఓ నిట్టూర్పు.

"హ్మ్!"

ఏంటో పాపం హోంవర్క్ ఏమన్నా మర్చిపోయాడా అని - అడగబోయేలోగా - మళ్ళీ ఇంకో నిట్టూర్పు. 

"హ్మ్ - ఏంటో రేపు ఎలా వెళ్ళాలో స్కూల్‌కి?!"

"అదేం - రేపేమన్నా బస్ రాదా? నాకేం నోట్ రాలేదే స్కూల్ నుంచి?"

"అదేం కాదు. బస్సొస్తుంది "

"మరింకేంటి?"

"రేపు స్కూల్లో మిస్‌మేచ్ డే...."

"అంటే?"

"అస్సలు ఏదీ కూడా మేచ్ అవ్వకూడదు."

"సరే.... మరి...రేపటికి నీ డ్రెస్ అంతా నువ్వంతా మేచ్ చేసుకున్నావు కదా - నీ స్కూల్ బేగ్ తో సహా - అంతా బ్లూనే కదా?"

"నాకెప్పుడూ నా shtuff అంతా ఒకేలా ఉంటేనే ఇష్టం."

(వాడనే ఆ shtuff అనే వాడి మాట వాడంటూ ఉండగా వినడం నాకెంతో ఇష్టం.)

"అలాగే కానీయ్ మరి... నీకెలా ఇష్టమైతే అలా ఉండడమే నయం."

"అవుననుకో ...కానీ .... "

Chin-కింద చెయ్యి పెట్టి కాసేపు thinking అయ్యాక - "Oh well! I go a step farther than everybody. I mismatch the mismatch day. Get it, Amma?"

"ఓ - భలే ఉందిరా - అది height of mismatch కదా?"

"Oh yeah! They all mismatch their shtuff and I mismatch the mismatch itself!"


"ఇదేదో బావుంది నీ mismatch quote - నేను రాసుకుని దాచుకుంటాను."

"మరమ్మా... mismatch నితెలుగులో ఏమంటారు?"

"ఊఁ - ఒక్క నిముషం ఆలోచించనీ - match అవ్వడం అంటే... జోడు కుదరడం."

"మరి mismatch అంటే?"

"జోడు కుదరకపోవడం"

"అబ్బా - అలా కాదు - ఇంకో అ-మాట లేదా?"

"అ-మాట?"

"అదే ... నువ్వు చెప్తావే సత్యం-అసత్యం, న్యాయం-అన్యాయం ...అలా జోడు-అజోడు కాదా?"

"హహహ ఓ అలాగా ... అబ్బే అజోడు లేదు కానీ విజ్జోడు వుంది - తెలుగు dictionary లో చూశా"

"అంటే జోడు-విజ్జోడు?"

"అవును - అదే match కి mismatch లా జోడుకి విజ్జోడు సరిజోడు"

"భలే భలే నాన్నగారు నన్నేమంటారూ?"

"బుజ్జోడు"

"మరి నా match కి mismatch  ఏంటీ - తెలుగులో?"

"జోడుకి విజ్జోడు"

"నేను బుజ్జోడు - mismatch of my match - అంటే జోడుకి విజ్జోడు"

"ఇదేదో బావుందిరోయ్ - బుజ్జోడు, జోడు, విజ్జోడు, సరిజోడు - నేనిక్కడే ఉంటే నువ్వు బజ్జోడు కానీ నన్నింక వెళ్ళనిచ్చి చూడు - గుడ్ నైట్!"

"గుడ్ నైట్ అమ్మా"
 

7, ఏప్రిల్ 2018, శనివారం

కాఫీ విత్ కలిమి - 2 - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ...




పైనున్న తలెత్తి చూస్తున్న ఆ ఐరిస్-రాణి గతకాలపు-వసంత వైభవం.
కిందున్న కొబ్బరి-బొండాల ముగ్గు పూల ముస్తాబు లేదని అలిగిన మా వాకిలిని మరిపించడానికి వేసిన రంగవల్లి.



ఈ యేడాది...
మార్చ్ నెల 21 వ తారీఖు Spring Equinox  ...
హడావిడిగా స్కూళ్ళకి సెలవులిచ్చారు - Spring Break అంటూ... 
చైత్రమాసం శుద్ధపాడ్యమి విళంబినామ ఉగాది ...
సందడిగా పండగ చేసుకున్నాం - ఉగాది పచ్చడి తిన్నాం... 
చుట్టుపక్కల చెట్లింకా శిశిరపు పసిడిని ఒదులుకోలేదు -
తేనెపట్టుల చుట్టాలింకా పుప్పొడి మిసిమిని మెదువుకోనేలేదు. 

ఆమని ఆగమించింది - పేరుకి అంతే!
ఫెళ్ళున ఎండ కాసి కొమ్మకొమ్మనా చిగుళ్ళు తొడిగి 
మొగ్గలొచ్చి పూలు విచ్చి రెమ్మ రెమ్మనా ఉవ్విళ్లూరే కోయిలలూయలలూగి 
ఆ వనప్రియ పాడిన పాటలకే చివుళ్ళొచ్చాయో 
చివుళ్ళ మేతకే ఆ కుహూకంఠపు కూతలు గీతాలయ్యాయో 
కూత ముందా చిగురు మేత ముందా 
అన్న బువ్వా-సవ్వడుల లెక్కలింకా మొదలెట్టనే లేదు ... 
అంతలోనే...
వాన మొయిలుల ఆగం మించింది - వూరిలో వింతే!
ఫెళ ఫెళ ఉరుములు తళ తళ మెరుపులు 
మబ్బులొచ్చి నేల తడిచి చినుకు చినుకునా చిందులాడే నీటి ముత్యాల వానవిల్లు మెరిసి 
ఆ నింగి చుట్టపు అంచున నేల మురిసిందా 
ఈ పుడమి మురిపానికే హరివిల్లు మెరిసిందా 
అన్న మెరుపూ-మురుపుల సందడికే మా వూరు నెలవయింది... 


కిటికీ కవతల చినుకుల చిందులాట - వానలో - కరిమబ్బు గొడుగులో
కిటికీ కివతల చెణుకుల సందడాట - ఫోనులో - కాఫీమగ్గు పొగలతో...

"హలో"

"హాయ్ - ఎన్నాళ్ళకెన్నాళ్ళకి?"

"ఎలా వున్నావ్?"

"బ్రహ్మాండం  - నువ్వో?"

"అండ-పిండి బ్రహ్మాండం"

"అచ్చుతప్పు అప్పు తెచ్చుకున్నావా?"

"అబ్బే - నేనన్నది సరిగ్గానే - అండ-పిండి బ్రహ్మాండం"

"అదేం లెక్క?"

"ఇంటి పట్టున ఉండి పకోడీ తిందామా, బజ్జీ లేద్దామా అనిపించే వాతావరణంలో వున్నాను మరి"

"సరి పోయింది ... ఇంతకీ ఏంటి విశేషాలు?"

"ఏముంటాయి - ఈ మద్య మాట్లాడ్డానికి టాపిక్కులే ఉండట్లేదు - ఇంకెక్కడి టాక్కులు?"

"అదేమలా?"

"తర్వాజ్జెప్తా కానీ ...ఇంతకీ నా బ్లాగ్ చదివావా?"

"అప్పుడే ఇంకో కొత్తది రాసేశావా? రెండ్రోజుల్నుంచీ ఇంటర్నెట్ ప్రాబ్లెమ్... వూరికే డ్రాప్ అయిపోతోంది - నీ కొత్త బ్లాగ్ పోస్టుని పక్కింటివాళ్ళ కృపతోనైనా చదివేయాలి"

"పక్కింటివాళ్ళ కృపా? అదేంటి"

"వాళ్ళ వై-ఫై వాడేస్తే దాన్నలాగే అంటార్లే - నీ బ్లాగ్ చదవడానికి enthusiasm ఎక్కువ - ethics తక్కువైనా పర్లేదులే - హహ్హహ్హ!"

"హహ్హహ్హ... ఇది వింటే మన చిన్నప్పటి ట్రంక్-కాల్ రోజుల్లో PP గుర్తుకొస్తోంది - PP అంటే పక్కింటివాళ్ళ-ఫోనుకి particular person అని ఒక నైసు పేరు"

"అద్సరే కానీ... ఇంతకీ ఏంటి ఈసారి టాప్పిక్కు?"

"టాప్పిక్కు - భలే ఉందీ మాట - ఆ మధ్య అక్షరం చేసిన అక్కరేంటో నీకు - దాన్నలా నొక్కి వక్కాణించావు?"

"ఏదైనా ఒక talk కి top గా pick చేసుకునే subject = టాప్పిక్కు అన్నారు కదండీ మరి?"

"అబ్బబ్బబ్బబ్బా...  నచ్చేసింది ... నిజంగా చెప్పాలంటే నా గాలికబుర్లకి టాకు-టాపిక్కు-టాప్పిక్కు అనేవేవీ ఉండవని నీకు తెల్సు కదా! టాపిక్కు అంటే ఇంకోటి గుర్తొచ్చింది - మాట్లాడడానికి - మాటలాడడానికి నాకు Linus ఆదర్శం"

"Linus అంటే మన Charlie Brown ఫ్రెండేనా?"

"అవును - వాడే... వాడెప్పుడో There are three things I have learned never to discuss with people: religion, politics, and the Great Pumpkin అన్నట్లుగా నేను రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్లూ లాంటి ఎవరితోనైనా సరే గొడవైపోయే సంగతులే తేను నా మాటల్లోకి. Linus చెప్పిన ఆ మూడిటితో పాటు అదే వరసలో నావింకో రెండు - పిల్లలూ, ఫిల్ములూ"

"అదేం మాట ? పిల్లలూ-ఫిల్ములూ అంటూ పి-గుణింతం నేర్పుతున్నావా నీ తెలుగు-వెలుగు పథకంలో?"

"అలాంటి భాషోద్ధరణ ఏమీ లేదు కానీ - ఎందుకో మరి పిల్లల గురించిన ఏ టాపిక్కూ ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. నేను గమనించిందేంటంటే పిల్లల పెంపకం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. మన చేతి ఐదు వేళ్ళూ ఒకలాగే ఎలా ఉండవో - పిల్లల విషయంలో తల్లుల అభిప్రాయాలూ అంతే varied గా అనిపిస్తాయి నాకు.  అందులో చాలా elements కలుస్తాయనుకుంటాను - చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం, అందులో వాళ్ళు నేర్చుకున్నది, నేర్చుకుంటే బావుండును అనుకున్నది, పెరుగుతూ నేర్చుకున్నామనుకున్నది - ఇలా రకరకాల పాఠాలని తమ పిల్లలకి నేర్పే ప్రయత్నంలో - ఎవరి అనుభవం వారిది, ఎవరి ప్రత్యేకత వారిదే. అందుకని ఏదో పైపైన కబుర్లు తప్ప ఎవరి బొటనవేళ్ళూ తొక్కకుండా జాగ్రత్త పడుతూ వుంటాను. అప్పటికే కొన్ని తప్పులు చేశాననుకో - వూరికే ఉండలేక - అడిగారు కదా అని ఏవో సలహాలు చెప్పి. ఇప్పుడింక ఆ సరదా కూడా లేదు"

"బావుందమ్మాయ్ - నీ పిల్లా-సఫీ. ఒప్పుకుంటున్నాను. మరా ఫిల్ముల మాటేంటి?"

"ఆ ముచ్చట కూడాచెప్పాలి మరి నీకు ...అప్పుడెప్పుడో తాతగారి వారసత్వం పదే పదే గుర్తు చేసే మనవడి సినిమా ఏదో చూసి హాల్లోంచి బైటికి వస్తూ 'సినిమా ఎలా ఉందండి?" అని అడిగిన వారితో 'ఈ అబ్బాయి కొంచెం తాతలు తాగిన నేతుల గురించి - నేత అయిన తాత గురించి ఆట్టే చెప్పకుండా, ఆ అంక-తాడనం చేయకుండా సినిమా చేస్తే చూడాలని వుంది ఎప్పటికైనా' అన్నాను అంతే  - అంతకి ఎక్కువా కాదు, ఇంకో మాట తక్కువా కాదు. నన్నడిగి మరీ నా సమాధానం విన్నవారికి నేనన్నది నచ్చలేదు - ఇప్పటిదాకా మళ్ళీ నాతో మాట్లాడింది లేదు. అప్పుడర్థమయ్యింది Linus లిస్టుకి నే చేర్చిన పిల్లలతో పాటు ఫిల్ములు కూడా జత చెయ్యాలని - అంతే - అలా తయారయ్యింది - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ... ! "

"మొత్తానికి నీ కబుర్లతో బోల్డంత టైం తెలీకుండా గడిచిపోయింది" 

"అవును ---నేనూ పెట్టెయ్యాలి గబగబా ఫోనింక - వాళ్ళొచ్చేస్తారింతలో -పచ్చడి చెయ్యాలి"

"ఆ!!!..."

"హహ్హహ్హ - వాళ్ళని కాదులే - టమాటాల్ని"

"హహ్హహ్హహ్హహ్హ .... నువ్వున్నావే .... హహ్హహ్హ"

"నేనున్నాలే - ఇలాగే అంటూనే నేనుంటుంటాలే ...bye మరి!"

"Bye !!!"


చివర్లో ఓ చిన్న సిప్పు - కరెంటు టాకు-టాపిక్కు-టాప్పిక్కు:

"పేపర్ చూశావా?"

"ఏముంది అందులో?"

"నార్త్ కొరియా కుడ్ బి ఏబుల్ టు న్యూక్ యూఎస్"

"కుడ్ బి ఏబుల్  ఏంటో కుడ్ అంటే చాలదూ? - అయినా ఆ కిమ్మొస్తే ఈ ట్రంపు కిమ్మనకుండా ఉంటాడా ఏంటి?"

"నిజంగా జరిగేది పెట్టేది ఏమీ లేదు - జనాలని వూరికే భయ పెట్టడానికి - ఏదో  సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అంతే!"

"పేపరు - సెన్సేషన్ అంటే గుర్తొచ్చింది - సల్మాన్ ఖాన్‌ని జైల్లో పెట్టారట కదా -ఏడ్చాడట కూడా"

"అవును ఇరవై ఏళ్ళ తర్వాత"

"మరి అతన్ని పోలీసులు కొడతారా జైల్లో - మన సినిమాల్లో చూపిస్తారే అలా?"

"అసలేమనుకుంటున్నావ్ నువ్వు - కొట్టడమా ఏమన్నానా - పక్కన్నుంచుని సెల్ఫీలు తీసుకుంటారు అంతే"

"పోన్లెండి ఇప్పటికైనా జైల్లో పెట్టారు - పాపం ఫుట్-పాత్ మీద పడుకున్నవాళ్ళని చంపేశాడు కూడాను"

"ఇది జస్ట్ జోధ్‌పూర్ కోర్ట్ తీర్పు - ఇంకా బెయిళ్ళుంటాయి - పై కోర్టుకి అప్పీళ్ళుంటాయి - అప్పుడే ఏమైంది - అసలెన్ని రోజులు లోపలుంచగలుగుతారో చూడాలి"

"అయ్యో!  మరి ఈ ఇరవై ఏళ్ళ శ్రమ, అదేదో హైద్రాబాదాయన చేసిన కృష్ణజింక DNA టెస్టులు, దానికోసం  ఆయనకి  ఇచ్చిన ఫీజులు - బోల్డు డబ్బు, టైము ఖర్చు కదా - వేసిన శిక్ష ఐదేళ్ళు కాకుండానే అప్పుడే వదిలేస్తే?"

"జనాల డబ్బు అది - ఎవరికి పడుతుంది?"

"అసలెప్పటికి జనాలకి తెలుస్తుందో కదా? పాపం! తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేనివాళ్ళెంతమందో! అసలు సల్మాన్ ఖాన్‌ని కోర్టులు, జైళ్లు అని తిప్పకుండా తనింట్లో తనని ఉండనిస్తే కనీసం పబ్లిక్ మనీ వృధా అవదు."

"హ్మ్ !"

"నాకింకా అస్సలు నచ్చనిదేంటంటే - సల్మాన్ ఖాన్‌కి శిక్ష వేసింది మనుషుల్ని చంపినందుకు కాదు - కృష్ణజింకలని వేటాడినందుకు. మన దేశంలో స్టేటస్ లేని మనుషులకి అయ్యే డేంజర్ లెక్కలోకి రాదు కానీ జంతువులకి మాత్రం endangered స్టేటస్సు ! అస్సలు బాలేదిది - మనుషులని చంపినందుకు వారి తరఫున కేస్ పెట్టే దిక్కు లేదు. వాళ్ళని వచ్చే జన్మలో కృష్ణజింకలుగా పుట్టించమని కృష్ణుణ్ణి అడగాలి - అంతే అంతే !!"

1, ఏప్రిల్ 2018, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 9 - కవల పాటలు - ఏక-కలపు అపురూప-కవలలు


కొత్త సంవత్సరం - కొత్తగా యప్-టీవీకి చందా కట్టాము - ఒక సంవత్సరం కట్టుబడి ఉందామని.

వారానికో మూణ్ణాలుగు గంటలు మనసుకి నచ్చిన పాతవో - మనసు నొచ్చినా కొత్తవో సినిమాలు చూడగలిగినంత సేపు మాత్రమే చూసి ఆపేయొచ్చు అన్న వీలుంటుంది కదా అని.

రీళ్ళు రీళ్ళు సాగే తెలుగు సీరియళ్ళు - ఎప్పుడూ చూడలేదు కానీ - మనవళ్ళ ఆటపాటలు చూద్దామని వచ్చిన నాన్నమ్మ ఇక్కడ ఉన్నప్పుడో , అమ్మమ్మ-తాతగార్లు వచ్చినప్పుడో తెలుగు టీవీ కోసమని చందా కట్టేవాళ్ళం - వాళ్ళ కాలక్షేపం కోసం.

వాళ్ళు టీవీ చూసే టైంలో అటూ-ఇటూ తిరుగుతూ ఓ కన్నుతో చూసీ చూడక - ఓ చెవితో వినీ వినక - వచ్చీరాని తెలుగు భాషా జ్ఞానంతో సీరియళ్ళలో కొన్ని సీన్లు చూసి  - అన్నజింక అన్న మాటలు ఇప్పటికీ గుర్తే -"అమ్మా ! ఇండియాలో ఎవరి మీదన్నా కోపమొస్తే గ్లాసులో మజ్జిగిచ్చి చంపేస్తారా?" - అంటూ.

అప్పటినుంచి టీవీ వినొద్దు-టీవీ కనొద్దు - టీవీ మనకొద్దు అన్నది మా ఇంటి టీవీ-"న"నాదం అయ్యింది.

సరే - మరిప్పుడు ఇంట్లో కొత్తగా టీవీ మోగడం మొదలయింది. స్వరాభిషేకం అనే కార్యక్రమమేదో బావుందని అమ్మ చెప్తే ఒకే ఒక్క ఎపిసోడ్ చూశాను - జనవరి చివర్లోనో ఎప్పుడో.

ఆ కార్యక్రమంలో రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో తను పాడిన పాటల గురించి మాట్లాడుతూ  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  - తన అంటే ఎస్పీబీ సంగీత దర్శకత్వంలో రమేష్ నాయుడు గారు పాడిన ఒక అపురూపమైన పాటొకటి హమ్ చేశారు. అసలే నాకు అసలు పాటల కన్నా ఇలాంటి కొసరు కబుర్లంటే మహా సరదా. ఆ అరుదైన పాట  "రాదా...మళ్ళీ వసంత కాలం?" అంటూ మొదలవుతుంది.

ఎస్పీబీ ఇంకా ఏం  చెప్పారంటే "నేను స్రవంతి సినిమాకి సంగీతం సమకూర్చేటప్పుడు ఈ పాట రమేష్ నాయుడు గారి చేత పాడిద్దామని ఆయన పాటల బాణీలోనే ఉండేట్లు చేశాను. ముందు ససేమిరా పాడను అన్నారాయన. నేను సిగరెట్లు ఎక్కువ కాలుస్తాను - గొంతెత్తి పాడలేను అన్నారు. లేదు - మీరు పాడగలరు అని ఒప్పించి పాడించాను. అటు తర్వాత ఈ పాట ట్యూన్ విన్న వేటూరిగారికి ఎంత నచ్చిందంటే ఆయన సంగీతం కూరుస్తున్న ఒక ప్రైవేట్ క్రైస్తవ భక్తి గీతాల ఆల్బంలో ఒక పాట ఇదే వరసలో రాసి నా చేత పాడించేంతగా" - అని.

దాంతో మొదలు - నా స్వరరాగ-పరిశోధన.

అసలు పాట: రాదా ....మళ్ళీ వసంతకాలం?!

స్వరాలు కూర్చిన వారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
పదాలు పేర్చిన వారు: వేటూరి సుందరరామమూర్తి
గళాన్ని చేర్చినవారు: రమేష్ నాయుడు

యూట్యూబ్ నంతా వెదికా స్రవంతి సినిమా పాటల్లో ఉందేమో అని  - పాట ఆచూకీయే లేదు.

గూగుల్ చేసి చూశా - అబ్బే! నాక్కావల్సింది తప్ప ఎక్కడెక్కడి పేజీలో పట్టుకొచ్చింది.

అప్పుడు గుర్తుకొచ్చింది - పాటల పెన్నిధి - http://www.allbestsongs.com/ 

గబగబా అక్కడికి వెళ్ళి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటల్లో స్రవంతి సినిమా దగ్గర వెతికితే అసలా పాటే కనపడలేదు. ఉసూరుమనిపించింది. ఎన్నో పాటలున్న ఈ సైట్లోనే నాకు కావల్సిన పాట దొరకలేదంటే ఇంకెన్ని పాట్లు పడ్డా పాట దొరకదనిపించింది.

అయినా ఇంకొక్కసారి చూద్దామని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీబీ లిస్ట్‌లో R తో మొదలయ్యే అన్ని పాటలూ చదువుతూ వెతుకుతూ ఉండగా... డగా ...గా .... దొరికేసిందీ !

వెంటనే ఆ allbestsongs సైట్ ఓనరైన శ్రీనివాసరావుగారికి ఈ-మెయిల్ ఇచ్చాను - "రాదా...  వసంతకాలం" అనే పాటని నా బ్లాగ్‌లో వాడుకోవడానికి అనుమతినివ్వమని. వెంటనే బదులిచ్చారు - "Sure లలిత గారు" - అంటూ.

ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే ఈ పాట ఎస్పీబీ చెప్పినట్లు స్రవంతి సినిమాలోది కాదు. శోభన్ బాబు, సుహాసిని నటించిన కొంగుముడి సినిమాలోది - అని శ్రీనివాస్ గారి లిస్ట్ చెప్పింది.




ఆ లిస్ట్ చెప్పిన లింక్ పట్టుకుని ఒక సోమవారం రాత్రి మొదలుపెట్టి రోజుకో నలభై నిముషాల చొప్పున మూడు రోజులు అంటే బుధవారం వరకు యూట్యూబ్‌లో కొంగుముడి సినిమా చూశాను -"రాదా ... వసంతకాలం?!" అని ఆ అపురూపమైన పాటను హమ్ చేసుకుంటూ.

"రాదా?!"... "రాదా?!" అని పదే పదే నేను పాడుకోవడమే కానీ ఎప్పటికీ కొంగుముడిలో ఆ పాట రాదే! చివరి వరకూ చూసినా రానే లేదు.

యూట్యూబ్‌లో కొంగుముడి సినిమా వీడియోలో సరిగ్గా 1:24:31 దగ్గర ఆ పాట మొదలవుతున్న సూచనగా మ్యూజిక్ వినిపించింది కానీ - అసలు సినిమాలోనే తీసేశారో - లేకపోతే యూట్యూబ్‌లో మాత్రమే లేదో - మొత్తానికి ఆ వసంతపు పాట రాక ఆచూకీనే లేదు.

అందుకని allbestsongs సైట్లో వున్న పాటనే ఇక్కడ పోస్ట్ చేశాను.

ఈ పాట వింటూ వుంటే - చాలా రోజుల తర్వాత ఏంటో దిగులు - ఏదో కావాల్సింది చేజారిందన్న బెంగ - వెనక్కి తీసుకు రాలేని రోజుల్ని తల్చుకుని ఇదీ అని చెప్పలేని అశక్తత.

రమేష్ నాయుడుగారి గొంతులో ఈ పాట వింటే - ఆ పాటలో వున్న మాటల్లోని వెత నిలువెల్లా కమ్మినట్లనిపించింది.

అలా అని పాట నచ్చలేదని కాదు - వినగానే నచ్చేసింది.

వేటూరి సుందర రామమూర్తి గారి పదేంద్రజాలంతో నిండి వున్న ఈ పాట - పదం, స్వరం, గళం - రామసుందరం...

నాకు నచ్చిన కొన్ని మాటలు - వాటిని నాక్కావలసినట్టు చేసుకున్న అర్థాలు
  • నిరాశలే విరాళిగా - తన జీవితంలో వసంతం ఇంక వస్తుందన్న ఆశ లేని వేళ మిగిలిన నిరాశతో తప్పని వలపేమో ఈ విరాళి 
  • జాలి కన్నీళ్ళు  - తన మీద తనే పడ్డ జాలితో కారుతున్న కన్నీళ్ళేమో ఇవి
  • గాలి కౌగిళ్ళు - రాదనుకున్న వసంతంలో దొరికేవి ఊహకి మాత్రమే అందే, ఊహించుకోగలిగినవి మాత్రమే అయిన గాలి కౌగిళ్ళు 

ఈ పాటలో ఇంకో విశేషం - మొదటి చరణానికి, రెండో చరణానికి మధ్యలో పల్లవి రాదు.

ఈ పాటలో అర్థం కాని మాటలో రెండు - అడగడానికి వేటూరి గారిప్పుడు లేరు - ఎవరికైనా తెలుసేమో అడగాలి:

  • వలపు నీరాలు 
  • వయసు హారాలు

ప్రస్తుతానికి ఆపాట ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి వినొచ్చు - ఆ కింద రాసిన పాట చూసి పాడుకుంటూ....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2122


రాదా...  మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో... 

రాదా...  మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో...

నిదుర పోదాయె నా కంటిపాప - చెదిరే స్వప్నాలతో...
ఎదలో నిట్టూర్పుతో - హో ...
భుజము దిగదాయె ఈ చంటిపాప - దిగులు వెక్కిళ్ళతో...
తడిచే చెక్కిళ్ళతో...
మరలా రానే రాదా ఆ చైత్రమాసం - ఊగాడు ప్రాణాలలో
రాలే వెన్నెల్లతో - కరిగే రాత్రిళ్ళతో

పగటి కలలాయె మా జీవితాలు - వెగటు పంతాలతో...
తగని పట్టింపుతో...  హో...
కలసి రాదాయె ఆ మంచిరోజు - వలపు నీరాలతో...
వయసు హారాలతో...
బిగువు బింకాలింకా ఎన్నాళ్ళదాకా - అల్లాడు బంధాలలో
వగచే కోయిల్లతో... ఎగసే గీతాలలో  

రాదా...  మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో...

సిసలు పాట:  ఏసో! ఎంత వరాల మనసో నీది ... 

ఎస్పీబీ ప్రస్తావించిన అసలు పాటకి కవలైన సిసలు పాట ఏసో ఎంత వరాల మనసో నీది! అన్న క్రైస్తవ భక్తిగీతం వెతకడం అంత కష్టం కాలేదు.

ఇలా వెతగ్గానే అలా దొరికేసింది - యూట్యూబ్‌లో - ఎవరో పుణ్యాత్ములు పోస్ట్ చేశారు.

అసలు పాట బరువుగా అనిపించినట్లనిపిస్తే - బాలు నవ్వు గొంతుతో పాడిన ఈ పాట తేలికగా అలల మీద పడవలా కదుల్తున్నట్లనిపించింది.

ఈ పాటకి...
స్వరాలు కూర్చిన వారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
పదాలు పేర్చిన వారు: వేటూరి సుందరరామమూర్తి
గళాన్ని చేర్చినవారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

అసలు పాటతో సమానంగా నచ్చేసిన ఈ సిసలు పాటలో నాకు బాగా నచ్చిన రెండు వాక్యాలు:  
  • నీవే రేవంట ఏ నావకైనా 
  • నీవే కడలంట ఏ వాగుకైనా
ఆ రెండు చిన్ని వాక్యాల్లో ఇమిడ్చినంతగా భక్తిని, నమ్మకాన్ని అతి సూక్ష్మంగా వివరించడం వేటూరి కలం-కళే!

యూట్యూబ్‌లో పాట వింటూ - ఆ కింద రాసిన పాట పాడేసుకోవచ్చు ...




ఏసో! ఎంత వరాల మనసో-  నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!

గాలి వానొచ్చి నడి ఏటిలోనా - నావ అల్లాడగా
నీవే కాపాడినావే...  హా
కంట జూడంగ గాలాగిపోయే - అలలే సల్లారెనే
మహిమ సూపించినావే... 
నిన్ను పొగడంగ నేనెంత వాడా - నీటి మడుగుల్లో సేపంటి వాడా
నా దారి గోదారిలో
బ్రతుకే హైలెస్సో ఏసో - పలికే నీ దాసో

ఏసో! ఎంత వరాల మనసో-  నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!

దిక్కు లేనట్టి దీనార్తులంటే - నీవు కురిసే దయా
నాడే తెలిసిందయా - హో... 
జంతు బలులిచ్చే మూఢాత్ములంటే
నీలో కరిగే సొదా... 
కరుణే ఎదజల్లగా
నీవే రేవంట ఏ నావకైనా - నీవే కడలంట ఏ వాగుకైనా
ఉప్పొంగు నీ ప్రేమలో
నడిసే హైలెస్సో - మడిసే నీ దాసో

ఏసో! ఎంత వరాల మనసో-  నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!

ఎప్పటినుంచో వేటూరి గారి కలం నుంచి వచ్చిన ఈ కవల-పాటలని పోస్ట్ చేయాలని అనుకుంటున్నా - ఈ రోజుకి కుదిరింది. అందులోనూ ఈ రోజు ఈస్టర్ సండే అవడం భలేగా కలిసొచ్చింది.

అసలు పాట నా బ్లాగ్‌పోస్ట్‌లో వాడుకోవడానికి అనుమతినిచ్చిన చిమటా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో ...
సిసలు పాట నచ్చి పాడుకునే అందరికీ ఈస్టర్ శుభకామనలతో ...

~ పాటల భైరవి

25, మార్చి 2018, ఆదివారం

నా నేస్తు పుస్తకమస్తు - ఆమని, వేసవి, వానకారు-1


పుస్తకం హస్తభూషణం అని అమ్మ నేర్పిన మాట 
పుస్తకం చిత్తాహ్లాదనం అంటూ నేను పాడిన పాట
ఆ మాట -  మోసుకుంటూ...  వుంటూ...
ఆ పాట - మోగుకుంటూ... అంటూ...
శ్రీరామ తో మొదలుపెట్టి చిత్తగించవలెను అన్నదాకా
తిన్నగా బొత్తి పెట్టి తిరగేసిన పేజీలెన్నో
ఉన్న మతి పోకుండా చదవేసిన పొస్కాలెన్నో
కొద్దికొద్దిగా...  చదివిన కొద్దీ...
పొత్తంతో పొత్తు పెరిగిన కొద్దీ...
ఒద్దిక మీరి తెలుసుకున్నదేంటీ అంటే...
As I learn more
I learn more
That there is more to learn
అనగా...
తెలియనిది తెలియగా
తెలిసిందేంటంటే
అప్పటికే తెలిసినది కొంతేననీ 
ఇప్పటికి తెలుసుకున్నది సుంతేననీ 
తెలుసుకోవాల్సింది ఇంకా ఉందనీ
తెలియనిది ఇంకెంతెంతోనని...

అందుకే పుస్తకం కంట్లో పడ్డా, పుస్తకం గురించిన మాట చెవిలో పడ్డా - అనుకోకుండానే కళ్ళు మెరుస్తాయి - చెవుల మధ్యనున్న తలలో బుద్ధి మురుస్తుంది.

కిందటి ఏడాది తానా కబుర్లో రాసుకున్నా కదా డాక్టర్లు రామరాజభూషణుడు, బాబ్జీ గార్ల గురించి!

(తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు)

వాళ్ళిద్దరికీ మధ్యలో కూర్చుని వుండగా - బోల్డన్ని డిగ్రీలున్న డాక్టర్ బాబ్జీగారు రామరాజభూషణుడి గారితో చెప్పిన ఒక పుస్తకం విశేషాలు చాలా ఆసక్తిగా అనిపించాయి.

ఆ మాటలు నాగ్గుర్తున్నంతవరకు "ఆయన ఒక ఇజ్రాయెలీ. రాజమండ్రి గురించి ఆయన పుస్తకంలో ఎంత బాగా రాశాడో - రాజమండ్రిలో పుట్టి పెరిగినవాళ్ళు కూడా అంత బాగా రాయలేరేమో.. నీకా పుస్తకం మెయిల్లో పంపిస్తాను - తప్పకుండా చదువు"

అది వింటూనే - వినీవినగానే ప్రశ్నలడగడం అలవాటున్న నాకు - నోట్లోనుంచి వచ్చిన మొదటి ప్రశ్న "అదేం పుస్తకమండి? ఎవర్రాశారు?" అంటూ.

"డేవిడ్ షుల్‌మన్ రాసిన Spring Heat Rains" జవాబిచ్చారు బాబ్జీగారు.

అంటూనే ఆ పుస్తకం పేర్రాసుకోవడానికి వీలుగా తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.

అప్పుడే అనేసుకున్నాను - మా గోదారొడ్డున బ్రిడ్జొడ్డాణం పెట్టుకున్న మా రాణకెక్కిన రాణ్మహేంద్రి గురించి రాసిన పుస్తకం కొనుక్కుని - కొనుక్కున్న తర్వాత మాత్రమే చదవాలని.

అలా అనుకున్నదే తడవు - మా ఇంటి దగ్గర వెస్ట్‌కౌంటీమాల్‌లో వున్న Barnes & Noble కి వెళ్ళాం ఇంటిల్లిపాదీ. తీరా వెళ్తే వాళ్ళ దగ్గర నేనడిగిన పుస్తకం ఉందని చెప్పారు - కానీ ఒకే ఒక కాపీ అది కూడా ఎక్కడో వేర్‌హౌస్‌లో ఉందని చెప్పారు. అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే - అదే సమయానికి ఇంకెవరూ అడగకుండా ఉంటే - ఒక మాటలో చెప్పాలంటే నా నక్షత్రాలు బావుంటే ఆ పుస్తకం నా చేతికి ఒక వారంలో అందుతుందని చెప్పింది పుస్తకాలమ్మిణి.

సరే - ఇంకేం చేస్తాం. పుస్తకం తెప్పించమని చెప్పి ఇంటికి వచ్చేశాం. ఒక వారం రోజుల్లో ఈమెయిల్ వచ్చింది - పుస్తకం  వేర్‌హౌస్‌ నుంచి షాపుకి పంపబడిందని -నేను వెళ్ళి తెచ్చుకోవచ్చని.

ఆ వీకెండ్ వెళ్ళి - ఆ పుస్తకం కొనుక్కుని తెచ్చేసుకున్నాను - SPRING, HEAT, RAINS - A South Indian Diary by David Shulman.




---------------------------------------------------------------------------------------------------------------

పుస్తకం మొదటి పేజీలో రాసుకున్న - పతంజలి శాస్త్రి మరియు స్మైల్ గార్లకి - అభినందన పద్యంతో మొదలు షుల్‌మన్‌గారి డైరీ.

ఒక్క తల్లి కొప్పన్ ఉదయంబు బొందిన
బాంధవంబు కంటె బహుగుణముల
వసుధన్ ఎన్ని చూడ వాగ్జాత బాంధవంబ్
అధికమ్ అండ్రు కావే ఆర్యులెల్ల

ఆమని
(మొదటి 66 పేజీలు)

రాళ్ళు
మేకలు
ఎండిన పొదలు
గేదెలు
ముళ్ళు
కూలిపోయిన చింతచెట్టు
గుడారాలు
ఎఱ్ఱ ఇటుకల గుట్టలు
ఆవపిండి రంగులో ఉన్న పరిసరాల్లో అక్కడక్కడ తళుక్కుమనే తెల్ల రంగు సమాధులు
మట్టి దారిలో ఒక మోటరుసైకిలు
పసుపు-నలుపు రంగుల ఆటో రిక్షా
తాటిచెట్లు
సైకిళ్ళు
నారింజరంగు చీరలు
ఆమె తల్లో ఒక తెల్లపువ్వు
కళ్ళు

ఫిబ్రవరినెల - ఒకానొక ఉదయం - తెలంగాణ ప్రాంతంలో మహబూబాబాద్ మీదుగా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ గుండా షుల్‌మన్‌ చూసిన చలానాచలన-విచిత్ర-దృశ్యాల సమాహారం.

కొద్దిసేపటి తర్వాత దిగవలసి వచ్చిన హైదరాబాదు - నాంపల్లి స్టేషన్‌లో అంతా గందరగోళం. తనెక్కాల్సిన రైలు ఏ ప్లాట్‌ఫాం మీదకొస్తుందో చెప్పేవారు, చెప్పగలిగేవారు, చెప్పబోయేవారు లేనే లేరు.

ఎలాగోలా నడిచి - బరువుగా వున్న  బాగ్గులు, మోయక తప్పని మినరల్ వాటర్ సీసా పట్టుకుని - మెట్లెక్కి వంతెన మీదుగా నడిచి - మళ్ళీ అవతల పక్క మెట్లు దిగుతున్న ప్రయాణీకుల మధ్య తన దారిని చూసుకుంటూ, చేసుకుంటూ వెళ్తే - కనిపిస్తుందని అనుకోనే అనుకోని - కనిపించిన అద్భుతం - ఒక రైలుపెట్టె మీద - David Dean Sul., Age -57, Berth - 38 అన్న తన ప్రవర.

అలా జరిగింది - షుల్‌మన్‌ భారతదేశపు పునఃప్రవేశం.
తెలిసిన భాష అంతంతమాత్రం.
ఎక్కడో మనోలోయల్లో ఇరుక్కుపోయిన మాటలు - అందరానివి.
మరపులో గడ్డకట్టినవి.
జ్ఞప్తి ప్రయత్నాలని ప్రతిఘటిస్తున్నవి.

ఆ క్కికిరిసిన రైల్లో - తన సీట్లో కూర్చుని - చుట్టూ గలగలలాడుతున్న మాటల జలపాతానికి తన వంతు చిరు-పదాల జల్లుని చేర్చలేని అసహాయతతో కిటికీలోంచి బయటికి చూస్తే - నెమ్మదిగా పరిసరాల వర్ణచిత్రం మారుతోంది.

ధాన్యపు కంకులు
పచ్చని మొలకలు
నల్లని రాళ్ళు
అవధిలేని నీలాకాశం
ఒక్కో కాలు ఎత్తి వేస్తూ - బహు జాగ్రత్తగా - కొలనుల్లో నడుస్తున్న బక-విన్యాసాలు
తామర ఆకులు
ముళ్ళు
బండరాళ్ళు
పొలాల్లో అక్కడక్కడ ఉంచబడ్డ కుప్పనూర్చు సాధనాలు - తూర్పార బట్టే చేటలు
గడ్డి మేటులు
ఎండిపోబోతూ కూడా ఉనికిని చాటుతున్న నది
ఒక వంతెన
ఒక గుట్ట
ధాన్యం చెరుగుతున్న ఇద్దరు పడుచులు
పెద్ద పసుపుపచ్చ బోర్డు మీద మెరుస్తున్న నల్ల అక్షరాలు - పాపటపల్లి
చొక్కా మాత్రమే వేసుకున్న ఒక చిన్నపిల్లాడు
గడ్డిని చెదరగొడుతున్న గాలి
మరి ఐదు గేదెలు
గుండ్రంగా ఉన్న తాటాకు గుడిసెలు
దూరం నుంచి ఱంపపుపళ్ళలా కనిపిస్తున్న కొండలు
దూరంగా వున్నకొండలు దగ్గరయ్యే కొద్దీ ఆనే ఎరుపు-నారింజ రంగు
అనీ అనిపించకుండానే ఉబుకుతున్న సంతోషం
దాన్ని అనుభవించడానికన్నట్టు ఆరంభంగా షుల్‌మన్ తన సంచిలోచి బయటికి తీసిందేంటో తెలుసా? - శ్రీహర్షుడు రాసిన సంస్కృత కావ్యం - నలదమయంతుల ప్రణయకావ్యం - నైషధీయం.

ఈ ప్రయాణానికి మొదటి మజిలీ - రాజమండ్రి - ఆనంద్ రీజెన్సీ హోటల్.

గోదావరి వంతెన మీదుగా - రాజమండ్రి పట్టణంలో ప్రవేశిస్తుంటే - కనిపించిన దృశ్యం ఎలాంటిదంటే - మిట్టపల్లాలుగా, గజిబిజిగా వున్న ఇళ్ళు. ఆ ఇళ్ళకున్న వెలిసిపోతున్న లేత రంగులు - పాచి అంచు కట్టిన ముఖద్వారాలు. సందులు. ఇవన్నీ గోదావరి ఒడ్డున చింది వస్తున్నట్టుగా కనిపించాయట - ఇవన్నీ అదనపు అమరికగానే కనిపిస్తూ - గోదావరినదే అసలు-సిసలైన రాజండ్రిలా అనిపిస్తుంది షుల్‌మన్‌గారికి.

ట్రెయిన్ దిగి బయటికి రాగానే - మళ్ళీ అదే గందరగోళం. ఇక్కడికి ఎందుకు వచ్చారు - అందులోనూ రాజమండ్రికి అనే అవే ప్రశ్నలు.

విదేశీయులు, ప్రాంతానికి కొత్తవారు అని తెలిసీ తెలియగానే - వీలైనంత రాబట్టాలనుకునే రిక్షావాళ్ళు అడిగిన ఏభై రూపాయలు ఇచ్చి - రాజమండ్రి వీధుల్లో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనంద్ రీజెన్సీ హోటల్‌కి చేరుతారు షుల్‌మన్‌.

[లలిత ఉవాచ: రాజమండ్రి, గోదావరి, ఆనంద్ రీజెన్సీ - స్వర్గాదపి గరీయసి]

ఆరేళ్ళ క్రితం చూసిన - రాజమండ్రి పట్టణపు - ఏకైక - నక్షత్రపుహోటల్ - తన పూర్వపు తళుకు ప్రస్తుతానికి బెళుకు కాగా - గతకాలపు వైభవంలా నించుని వుంది.

గదిలో చేరి - కిటికీ తెరిచిన షుల్‌మన్‌కి - ఎఱ్ఱటి దుమ్ము వలయంలో వున్న తెల్లటి దానవాయిపేట ఇళ్ళు - అందులో ఒకానొక ఇంటి డాబా పైన ఆరబోసిన ఎఱ్ఱమిరపకాయలు.

[లలిత ఉవాచ: పుస్తకమంతా ఇలాంటి రంగుల ప్రసక్తులెన్నో. షుల్‌మన్‌గారు మన దేవులపల్లివారి బోలు భావకవేమో వారి భాషలో-పరిభాషలో అనిపించేసింది నాకైతే!]

ఆ రోజు రాత్రికి షుల్‌మన్‌గారు తిన్నది - ఎంతో ఇష్టమైన కాకరకాయ కూర భోజనం; విన్నది - షరీఫ్ అనే ఒక వెయిటర్ కాకరకాయ కూర వడ్డిస్తూ - తాను గౌతమీ గ్రంధాలయంలో చదివిన పుస్తకాల నుంచి - పంచుకున్న తాత్వికత నిండిన ఆలోచనలు.

ఏడు నెలలు ఉండబోతున్న కాలంలో - రాజమండ్రిలో ఏం చేయబోతున్నావ్? అని అడిగిన స్నేహితులు Yair కి షుల్‌మన్‌ చెప్పిన సమాధానం ఆయన మాటల్లోనే - One should never go to India with a plan.

[లలిత ఉవాచ: ఇంతకు మునుపు వచ్చినప్పుడు షుల్‌మన్‌గారికి - తానొకటి తలచిన ప్లానొకటి అగునని - బాగా అనుభవమైనట్టు అర్థమయింది ఈ మాటలు చదివినప్పుడు.]

రాజమండ్రిలో మొట్టమొదటగా షుల్‌మన్‌ చూడాలనుకున్నది - గోదావరి నది, ఆ నది ఒడ్డునున్న రేవులు (revus అని పుస్తకంలో రాసుకున్నారు).

ఒక ఆటోరిక్షాలో పుష్కరరేవుకి వెళ్తారు.

ఆ పుష్కరరేవులో షుల్‌మన్‌ చూసిన దృశ్యం: పరచివున్న రాళ్ళ మెట్లు దిగి నదిలో స్నానమాడబోతున్న యాత్రికులు - వారిని తన అలల చేతులతో ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, తడుపుతున్న గోదావరి నదీమతల్లి.

అక్కడినుంచి - తనంతకు ముందుసారి వచ్చినప్పుడు బస చేసిన - మహాలక్ష్మి హోటల్‌కి వెళ్ళి - అక్కడి మేనేజర్ రవిసుందర్‌ని కలుస్తారు షుల్‌మన్.

రవిసుందర్ షుల్‌మన్‌ని మహాలక్ష్మిలో బస చేయమని ఆహ్వానిస్తూ - ఉచితమైన రేటు పొందేలా చేస్తానని హామీ ఇస్తారు. ఇక్కడ ఉచితం అంటే వీలైనంత సరసమైన ధరే కానీ - ఫ్రీ కాదన్నమాట.

[లలిత ఉవాచ: ఎక్కడైనా స్నేహం కానీ వ్యాపార సంబంధాల్లో కాదని నిరూపితం.]

మహాలక్ష్మి హోటల్ కిటికీల్లోంచి కనిపించే - ఉరుకుల పరుగుల గోదావరి తన మనసును దోచినా - ఎక్కువ రోజులు ఉండాలి కదా, అందుకని ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నానని చెప్తారు షుల్‌మన్.

మహాలక్ష్మి నుంచి బయల్దేరి కోటగుమ్మం వెళ్ళిన షుల్‌మన్ - అక్కడ శివ-దక్షిణామూర్తి విగ్రహం పక్కగా వున్న సందుల్లో వున్న ఒక పాత పుస్తకాల అంగడికి వెళ్ళి - అక్కడున్న పాత కాశీమజిలీకథల పుస్తకాలు కాసేపు తిరగేసి చూసి - flat దొరికిన వెంటనే వెనక్కు వచ్చి కొనుక్కోవాలనుకుంటారు.

తెలుగు పుస్తకాలు చదివే - తెలుగు మాట్లాడే ఈ తెల్లమనిషిని చూసి ఆశ్చర్యపోతూ ఆ తెలుగు పాతపుస్తకాలఅంగడి యజమాని - మీ ఊరేది? - అని తెలుగులో అడిగితే - తడుముకోకుండా షుల్‌మన్ ఇచ్చిన సమాధానం - "రాజమండ్రి".

---------------------------------------------------------------------------------------------------------------


ఇవాళ్టికి ఈ రాజమండ్రి కోటగుమ్మం రోడ్డులో ఆపుతానే - మళ్ళీ వచ్చే నెల దాకా.....

అమెరికాలో పుట్టి, జెరుసలేమ్ హిబ్రు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఒకటికి రెండు సార్లు  మా రాజమండ్రికి వచ్చి - గోదావరిని దేవతామూర్తిగా ఎంచి - తెలుగు నేర్చుకుని తను రాసిన ఇంగ్లీష్ పుస్తకంలో బోల్డన్ని తెలుగు మాటలు వాడుతూ డేవిడ్ షుల్‌మన్‌గారు రాసిన SPRING, HEAT, RAINS పుస్తకం గురించి ఏవో నాలుగు ముక్కలు ముక్కున పట్టి రాసేసి - 'చాలా బావుంది' - అనేసి ఊరుకోవడానికి మనసొప్పక - ఆ పుస్తకంలో ప్రతీ పేజీని - చదివినదే మళ్ళీ చదువుతూ - నా పఠన-ప్రయాణాన్ని గురించి రాసుకోవాలనిపించింది.

అనిపిస్తే రాసేయాలి కదా మరి!

అసలు ముందు నేననుకున్నదేంటంటే - ఈ పుస్తకం గురించి  రాసి ఏదైనా వెబ్-పత్రికకి పంపిద్దామా అనుకున్నాను - ముఖ్యంగా "ఈమాట" కి. ఎందుకంటే అక్కడ డేవిడ్ షుల్‌మన్‌గారి ఇంగ్లీష్ రచనలు ఉంటాయి. నేను ఆయన పుస్తకం గురించి రాసినది - ఈమాటలో ప్రచురిస్తే ఎప్పటికైనా ఆయన చదవగలిగే అవకాశం ఎక్కువ.

కానీ మళ్ళీ నాకే అనిపించిందేంటంటే - నా బ్లాగ్ లో అయితే పుస్తకం చదువుతూ నాకు తోచిన నోట్స్ లలిత ఉవాచ అని పెట్టి రాసేసుకోవచ్చు. అదే వెబ్-పత్రికలైతే వారివారి నిబంధనలకి కట్టుబడి రాయాలి. నేను రాసింది రాసినట్లుగా ప్రచురించడానికి వారు ఒప్పుకోకపోవచ్చు. అదీ కాక - ఇది మామూలుగా ఒక పేజీలోనో, పోస్టులోనో కుదించేసి "హమ్మయ్య - అయిపోయింది" అనేసుకోవాలనిపించలేదు. అందుకే దీన్ని ఒక సిరీస్‌లా మొదలు పెట్టాను.

అందులోనూ మాకు మొన్ననే మార్చ్ 21 న ఆమని ఆగమించింది.

ఏమో ఏమగునో గానీ ఆమని ఈ వని అన్న దేవులపల్లి వారిని - ఆమనీ పాడవే హాయిగా అంటూ రాగాలల్లిన వేటూరివారినీ - స్మరించుకుని ఆమని ఆగమించిన ఈ మార్చ్ నెలలో నే మొదలెట్టిన ఈ కొత్త సిరీస్ - నా నేస్తు పుస్తకమస్తు -  శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు అగుగాక!

అసలు కబురు పుస్తకం గురించైనా - రేపటి శ్రీరామనవమి గురించి ఒక చిన్న సిసలు కబురు రాయకుండా ఉండడానికి మనసొప్పట్లేదు.

మా కరణం గారింటి ముందు ఆడుతూ పాడుతూ సీతారాముల కల్యాణాన్ని చూసిన చిన్ననాటి శ్రీరామనవమి చలువ పందిరిని తలుచుకుంటూ... ఒక చిన్న పెళ్ళి కబురు

ఆమని పువ్వుల వేళ
నవమి వెన్నెల నాడు  
ఆకాశమే పందిరి 
నేలేమో పెళ్ళికి విడిది 

మనసు దోచినవాడు 
మనువాడ వచ్చినవాడు 
వానకారు మోసుకొచ్చిన మబ్బు రంగు మేని తండ్రి - 
రామచంద్రుడు...

మనసు విచ్చి మెరిసినది
మనువాడి మురిసినది
మబ్బు అంచున మెరిసిన తటిల్లతేమో! - వెన్నెలంటి తల్లి - 
రామచక్కని సీత...
 

19, మార్చి 2018, సోమవారం

త్వామనురజామి - 23 - నీకై వచ్చితినోయీ...ఎండల్లో తిప్పితినోయీ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 22 - అదే ట్రెయినూ, అదే బోగీ, అదే అబ్బాయి

ఎప్పట్లాగా ఈసారి సైడ్ బెర్త్ దొరకలేదు.

వున్న ఆరు సీట్లలో నేను, నాతోపాటు శ్రీలత కాక ఆ అబ్బాయిది కూడా ఒక సీటు.

లోపలికి వచ్చిన నన్ను చూసి చిన్నగా తన మార్కు నవ్వు నవ్వుతూ - "హలో" - అన్నాడా అబ్బాయి.

నా పక్కనే వున్న శ్రీలత కొంచెం ఆశ్చర్యంగా చూడబోయి -అంతలోనే ఏం జరిగి వుంటుందో దాదాపుగా అర్థమైపోయి - మళ్ళీ నేనెక్కడ ఉడుక్కుని లల్లి-శోక-పిల్ల అవతారం ఎత్తుతానో అని పసిగట్టేసి -అసలు అంతకు ముందు ప్రయాణంలో జరిగినదేదీ గుర్తు లేనట్లు - తనూ ఫ్రెండ్లీ గా నవ్వుతూ ఆ అబ్బాయిని పలకరించారు.

కాసేపు సెలవుల్లో ఏం చేశామో ఆ కబుర్లూ, కాలేజ్ కబుర్లు అవీ చెప్పుకుని - పదింటికల్లా ఎవరి బెర్తుల్లో వాళ్ళు చేరిపోయి పడుకుండి పోయాము.

తెల్లవారుఝామున రేణిగుంటకి ఇవతల ట్రెయిన్ ఎందుకో చాలాసేపు ఆగిపోయింది. అక్కణ్ణించి బయల్దేరిన తర్వాత కూడా - నాలుగు చక్రాల దూరం కదలడం, ఆగిపోవడం.

బయటికి చూస్తున్న నాకు వర్షం పడి అక్కడక్కడా మడుగులు కట్టిన నీళ్ళు కనిపించాయి.

నేను అవి చూస్తూ - "శ్రీలతా! ఈ ట్రెయిన్ పూర్వజన్మలో పడవేమో! నీళ్ళు కనిపించిన ప్రతి చోటా ఆగిపోతోంది" - అనగానే ఆ అబ్బాయి నా మాటలు విని - ఓ కనుబొమ్మ మాత్రం పైకి లేపి - నవ్వుతో కళ్ళను వెలిగించుకోవడం కనిపించింది.

మొత్తానికి ఆగీ, కదిలీ అసలు టైముకి గంట ఆలస్యంగా వూరు, హాస్టల్ గూడు చేరాం.

హాస్టల్లో అమ్మాయిలు ఊరెళ్ళొచ్చిన ఆనందంలో - పండక్కి కొనుక్కున్న కొత్త బట్టల్లో సీతాకోకచిలుకలకి రెక్క-విడిచిన చుట్టాల్లా వున్నారు.

పండక్కి ఇంటికి వెళ్ళేముందు నా జూనియర్స్ శుభ, రజని, అరుణలతో స్నేహం SPIC-MACAY ప్లానింగ్ దాటి ఈవెనింగ్ వాక్ దాకా పెరిగింది.

సెలవుల తర్వాత మొదటిసారి నన్ను డైనింగ్ హాల్లో చూడగానే ముగ్గురూ నా దగ్గరికి వచ్చారు - "హాయ్ లల్లీ! హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు?" అంటూ.

వాళ్ళని చూడగానే నా ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక ట్రెయిన్ ఎపిసోడ్ మొత్తం చెప్పాను.

వాళ్ళు ముగ్గురూ కూడా నా కన్నా ఎక్సైట్‌ అయ్యారు - నేను చెప్పింది విని.  అంతటితో ఆగక - మాకూ చూపించు ఆ అబ్బాయిని - అని అడిగారు.

వాళ్ళడిగారని కాదు కానీ నాకూ మళ్ళీ ఆ అబ్బాయిని ఒకసారి కలవాలనిపించింది.

అప్పటికి ఇంటి నుంచి వచ్చి రెండు రోజులే అయింది.

మరుసటి రోజు గురువారం. మధ్యాహ్నం క్లాసులు లేవు. ఒకే ఒక్క క్లాస్ - రెండింటికి వుంది - సత్యం సర్ OB క్లాస్. బుధవారం రాత్రి డైనింగ్ హాల్లో కలిసినప్పుడు శుభ, రజని, అరుణలకి చెప్పాను - "మీకు కుదిరితే రేపు తీసుకెళ్తాను SVU - SBM (School of Business Management) కి - ఆ అబ్బాయిని చూపించడానికి" అని.

వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సరే అంటే సరే అనుకుని  - నాతోనూ అదే అనేశారు.

గురువారం పొద్దున్న పదకొండున్నరకి రాఘవేంద్ర సర్ క్లాసులోంచి ఓ అరగంట ముందు పర్మిషన్ అడిగి బయటికి వచ్చేశాను. ఆ రోజు శుభా వాళ్ళకి క్లాసుల్లేవు - అందుకని హాస్టల్ దగ్గరే వెయిట్ చేస్తామని చెప్పారని నేను కూడా మా కళ్యాణి బ్లాక్ దగ్గర కెళ్ళి కింద నుంచే పిలిస్తే ముగ్గురూ గబగబా వాళ్ళ రూంలోంచి దిగి కిందకొచ్చారు.

వారెవా ! ముగ్గురూ తీన్ దేవియా అన్నట్లు తయారైవచ్చారు.

శుభా రామస్వామి సిల్క్ చుడిదార్, కళ్ళకి ఐ-లైనర్, లైట్‌గా లిప్‌గ్లాస్ - తళతళలాడే కళ్ళతో కళకళలాడిపోతోంది.

అరుణ మంచి మల్టీ-కలర్డ్ ఘాగ్రాలో మెరిసిపోతోంది.

రజని లక్నోకుర్తాలో సింపుల్ ఎండ్ ఎలిగెంట్‌గా తళుక్కుమంటోంది.

నేనేమో అమ్మ పండక్కి కుట్టించిన మిలిటరీ గ్రీన్ కలర్ చుడీదార్లో, నూనె రాసి బిగించి వేసి ఊలు తాడుతో పైకి కట్టిన ఒంటి జడతో తిలతిలలాడుతున్నాను :))

నలుగురం నడుచుకుంటూ మా హాస్టల్ చిన్న గేటు, ముందున్న పాలిటెక్నిక్ హాస్టల్ పెద్దగేటు దాటి రైల్వే బ్రిడ్జ్ కిందున్న సన్న దార్లో నడుచుకుంటూ వెళ్ళి, మెయిన్ రోడ్ దాటి SBM చేరాం.

MBA-Finance సెకండ్ సెమిస్టర్ క్లాస్ ఎక్కడా అని అడిగితే ఎవరో ఫస్ట్‌ఫ్లోర్‌లో అని చెప్పారు. 

వెంటనే అదే ఫ్లో లో గబగబా మెట్లెక్కి ఫస్ట్‌ఫ్లోర్‌లో క్లాస్‌రూం దగ్గరికి వెళ్ళి - తలుపు దగ్గర ఆగాను.

లోపల క్లాస్ జరుగుతోంది.

పాఠం చెప్తున్న ప్రొఫెసర్ - తలుపు దగ్గర వచ్చి నిలుచున్న నన్ను చూసి ఆయన చెప్తున్నదేదో ఆపి "Yes !" అన్నారు.

వెంటనే నేను "I want to talk to Badari" అన్నాను.

అంతే! ఆయనింకేం మాట్లాడలేదు. క్లాస్ అంతా పిన్-డ్రాప్-సైలెన్స్.

నెమ్మదిగా అబ్బాయి లేచి బయటికి వచ్చాడు.

తనూ, మేం నలుగురం అమ్మాయిలూ మెట్లు దిగేవరకూ ఆ క్లాస్‌లో మళ్ళీ అలికిడి మొదలయినట్లు గుర్తు లేదు.

కిందకి రాగానే అడిగాను అబ్బాయిని - "భీమాస్‌లో లంచ్‌కివెళ్దామా?" -అని.

తొణకని చిరునవ్వే సమాధానం.

ఐదుగురం కలిసి భీమాస్‌కి వెళ్ళాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాం. శుభ, రజని, అరుణలకి కూడా అబ్బాయి నవ్వు, మాటలు తెగ నచ్చేశాయి. 

భోజనం కాగానే నా ముగ్గురు జూనియర్స్ శిల్పంలో గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవాలి అంటూ అటెళ్ళిపోయారు.

నేనూ, అబ్బాయీ కలిసి టౌన్‌బస్ ఎక్కాము.

జనవరి ఎండ. వెచ్చగా వుంది.

తిరుపతి కొండగాలి చల్లగా వుంది.

మొట్టమొదటిసారి మాటలురాని అబ్బాయిగా చూసినప్పుడే వెంటబడి వెళ్దామా అనిపించిన నాకు - పక్కనే కూర్చుని నవ్వుతూ నా మాటలు వింటున్న అబ్బాయితో - ఎందుకు చెప్పాలనిపించిందో ఇప్పటికీ తెలీదు కానీ - అసలలా చెప్పడం ఎంత సాహసమో అప్పుడు తట్టలేదు కానీ - హఠాత్తుగా - తగిన సందర్భమే లేకుండా తనకేసి తిరిగి అనుకోకుండా నేననేసిన మాట "You know one thing ?! We will make a nice pair!"

తను మాత్రం అదే చిరునవ్వు - "అవునా?" అంటూ. అంతే!

ఆ మాటకి ముందూ - ఆ మాటకి తర్వాతా - మిగిలిన మాటలన్నీ మామూలువే.

ఓ అరగంటలో మేమిద్దరం రెడ్ బిల్డింగ్స్ స్టాప్ దగ్గర బస్ దిగాము.

దిగుతూనే అడిగాను - "నాకు ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఒక్కదాన్నీ వెళ్ళడం నాకు భయం. మా ఓల్డ్ హాస్టల్ గేట్ దాకా వస్తారా?" అని.

"సరే పద" అని మెత్తగా అంటూ మళ్ళీ అదే చిరునవ్వు.

తనొస్తానని చెప్పగానే "హమ్మయ్య" అనేసి పక్కనే నడుస్తూ "You know one thing ? మా సీనియర్ గుత్తి పద్మజ ఇటు వచ్చేటప్పుడు ఎప్పుడూ తన బ్యాగ్లో ఒక చిన్న నైఫ్ పెట్టుకుని వస్తుంది - self-defense కోసం - తెలుసా?" అని బోల్డు గొప్పగా చెప్పాను.

మళ్ళీ ఓ కనుబొమ్మ పైకి లేపి అదే మూకీ-రియాక్షన్ నా టాకీ-ఏక్షన్‌కి. నాకింత కన్నా ఇంకేం కావాలి - బోల్డు మాట్లాడుదామనే నాకు మాట్లాడుకున్నంత :)

నన్ను మా హాస్టల్ గేట్ దగ్గర వదిలేసి అబ్బాయి వెనక్కి వెళ్ళిపోయాడు.

-----------------------------------------------------------------------------------------------------------

తర్వాత వారం ఒక రోజు చేతిలో ఓ పదిహేను, ఇరవై SPIC-MACAY కార్డులు పట్టుకుని ఒక్కదాన్నీ SBM కి వెళ్ళాను. అబ్బాయి ఫ్రెండ్స్ బోల్డు మంది వుంటారు కదా! మేము ఫిబ్రవరిలో హోస్ట్ చేయబోతున్న స్మితారాజన్ మోహినీ-ఆట్టం ప్రోగ్రాంకి వాళ్ళందరినీ మెంబర్స్‌గా చేర్చడానికి ఇదొక మంచి అవకాశం. అలాగే కల్చరల్ సెక్రెటరీగా నేను అంత మందిని చేర్పిస్తే నాకే గొప్ప కదా!

ఇలా తెగ ఆలోచించేసి ఓ పెద్ద స్కీమే వేసి వెళ్ళానా - నేననుకున్నట్టే అబ్బాయి క్లాస్స్మేట్స్ (శ్రీనివాస్, గిరిరాజ్, ఫ్రెడరిక్, సాయి ప్రసాద్, సాయి సురేష్, చిరుభాయ్ అని పేరెన్నిక గన్న మోహన్, రామన్, రాజశేఖర్ రెడ్డి), సీనియర్స్ (రాజశేఖర్, చక్రపాణి, ట్రిచీ మోహన్) - ఇంకా చాలా మంది తలో పదిహేను రూపాయిలిచ్చి SPIC-MACAY కార్డులు తీసుకెళ్ళారు.

నేనేమో - నేను అబ్బాయి ఫ్రెండునేమో అనేసుకుని మెంబర్స్ అయ్యారు అనుకున్నాను. కానీ వాళ్ళ స్కీం ఏంటంటే SPIC-MACAY కార్డుని మా క్యాంపస్‌లోకి రావడానికి తిరుగులేని ఎంట్రీ కార్డుగా వాడుకోవడమని నాకప్పుడు తట్టనే లేదు.

మొత్తానికి మా SPIC-MACAY ప్రోగ్రాం సూపర్-హిట్టు!

ఇంతలో మార్చ్ వచ్చింది - థర్డ్ సెమిస్టర్ పరీక్షలు. బుద్ధిగా రాసేశాను.

పరీక్షల తర్వాత కొత్తగా అయిన ఒక అలవాటు - అబ్బాయితో మా హాస్టల్ నుంచి నడుచుకుంటూ అలిపిరి దాకా వెళ్ళి రావడం - రెండు గంటల ఈవెనింగ్ వాక్ ఎండలో. దారంతా బోల్డంత కబుర్లు - అమ్మ, నాన్న, పప్పి, కుట్టి - ఇంకా శ్రీనన్న, బాబు, ప్రశాంతి - మేము చెప్పుకునే కబుర్లు, పాటలు, సరదాలు - మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టే ఉండేదాన్ని.

అందులో నేను చదివే పుస్తకాల గురించి కూడా బోల్డు కబుర్లు. అప్పుడే నా దగ్గర తిలక్ రాసిన "అమృతం కురిసిన రాత్రి" పుస్తకం ఉందని తెలిసి అడిగి చదివిస్తానని తీసుకుని వెళ్ళారు.

అలాగే తను కూడా - వాళ్ళమ్మగారు, తమ్ముడు, చెల్లెలు గురించి బోల్డంత ఇష్టంగా చెప్తూ - వాళ్ళు నలుగురూ ఫ్రెండ్స్‌లా ఎలా కబుర్లు చెప్పుకుంటారో, కలిసి పుస్తకాలు చదివి ఎలా వాదించుకుంటూ వుంటారో -  ఇంకా తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అనిల్, ప్రభాకర్, మదన్, జార్,  తను డిగ్రీ చదివిన APRDC  ఫ్రెండ్స్ సీకే, సాయి, బాలాజీ - ఇలా అందర్నీ ఎంతో ఇష్టంగా మాటల్లోనే - నేను వాళ్ళని చూడకపోయినా - నాకు వాళ్ళందరూ ఎప్పటినుంచో తెలుసేమో అనిపించేలా భలే చక్కగా పరిచయం చేశారు. 

ఇంతలో ఏప్రిల్ వచ్చింది. తన సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా అయిపోయాయి.

తన ఆఖరి పరీక్ష అయిన రోజు అలిపిరి వైపుగా నడుస్తున్నప్పుడు చెప్పారు - "వచ్చే వారం మద్రాసు వెళ్తున్నాను - ప్రాజెక్ట్ వర్క్ కోసం" అని.

అప్పుడే మాటల్లో చెప్పారు "మా ఇంట్లో మేము నలుగురం తప్ప మాకింక చుట్టాలు ఎవరూ లేరు. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో అందరూ సమ్మర్ హాలిడేస్ వస్తే తాతగారి ఊరు, అమ్మమ్మగారి వూరు అంటూ ఊళ్ళకి వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి రాగానే వాళ్ళ అత్తయ్య కూతురో, మామయ్య కూతురో - మరదలుతో ఆడుకున్నాం అని చెప్పేవాళ్ళు. ఆ మరదలు "బావ" అని పిలుస్తుంది అని వాళ్ళు చెప్పినప్పుడల్లా నాక్కుడా అలా ఒక మరదలు వుంటే బాగుండును అనిపించేది" - అంటూ.

అది వినగానే - నాకెందుకో తెలీదు కొంచెం బాధగా అనిపించింది. అందులోనూ నేను పుట్టినప్పటినుంచీ మామ్మ-నాన్నమ్మ-అమ్మమ్మ, మామయ్యలు-అత్తయ్యలు, దొడ్డలు-పెదనాన్నలు, పిన్నులు-బాబయ్యలు - వాళ్ళందరి పిల్లలూ మధ్య పెరిగానేమో - అస్సలు ఎవరూ లేకుండా అందులోనూ వేసవి సెలవులకి కూడా ఏ ఊరికే వెళ్లకుండా ఉండడం అసలెలా కుదురుతుందో నా ఊహకే అందలేదు.

ఇంకో ఆలోచనే లేకుండా "అయితే నేను పిలుస్తాను బావ అని" అనేశాను.

ఒక్క నిముషం రోడ్డు మీదే ఆగి - కొంచెం ఒత్తి పలుకుతూ "నువ్వెలా పిలుస్తావ్? ఆ పిలుపు నన్ను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి మాత్రమే సొంతం" - అని సీరియస్‌గానే చెప్పేశారు.

నాకు నిజ్జంగానే ఉక్రోషంగా అనిపించింది.

అలిపిరి దాకా వెళ్ళి తిరిగి వచ్చే వరకు కొంచెం తక్కువే మాట్లాడాను.

తను మా హాస్టల్ గేట్ దగ్గర ఆగి - "వచ్చే వారమే నా ప్రయాణం. మళ్ళీ మద్రాస్ నుంచి వచ్చాక కలుస్తాను" అనగానే 'కుదరదు వెళ్ళే ముందు రోజు కలిసి వెళ్ళాల్సిందే" అని గాఠిగా అన్నాను.

అప్పటికే మా హాస్టల్ వాచ్‌మన్ అటెటో చూస్తున్నా చెవులు మాత్రం సద్దు-తిరుగుడు-చెవ్వుల్లా మాకేసే తిరిగున్నాయని నాకు మాకు తెలుస్తూనే వుంది.

అందుకని తను నాతో ఎక్కువ వాదించకుండా "సరే" అన్నట్లు తలూపి "గుడ్‌నైట్ - ఇంక జాగ్రత్తగా లోపలికి వెళ్ళు" అని చెప్పి వాళ్ళ హాస్టల్‌కి వెళ్ళడానికి వెనక్కి తిరిగారు.

తనని మా హాస్టల్ గేట్ దగ్గర  నుంచి కొంచెం గట్టిగా అరిస్తే కానీ వినిపించనంత దూరం వెళ్ళనిచ్చి "బా...వా! గూ...డ్... నై ...ట్ " అని అరిచాను.

తను ఉలిక్కిపడి - ఒకసారి వెనక్కి తిరిగి - ఖోపంగా చూసేసి తలతిప్పుకుని వెళ్ళిపోయారు.

చెవిలో వేలు పెట్టుకుని అప్పటిదాకా మా మాటలు వింటూనే విననట్టు ఆపసోపాలు పడుతున్న వాచ్‌మన్ నా అరుపుకి ఒక అడుగు ఎగిరి పడి - దడుచుకుని - "థూ ..థూ"  - అని తన చెయ్యి వెనక్కి వంచి తన వీపు మీద తనే కొట్టుకుని, "ఏందమ్మా ! అంత గట్టిగా అరిచావ్ - ఇక్కడుండగా చెప్పలేకపోయావా ఆ గుడ్‌నైట్" - అంటూ విసుక్కున్నాడు.

నేను మాత్రం అదేం పట్టించుకోకుండా బోల్డంత హాప్పీగా గంతులేసుకుంటూ - రెండేసి మెట్లు ఎక్కుతూ నా 603-A కి చేరాను - పాడుకుంటూ :)

వ వ వ వద్దంటే ... చాలా ?!
నీకా పిలుపిష్టం లేదా?
నన్నొద్దన్నావంటే చిన్నవాడా !
నేనట్లానే పిలుస్తాను ఎల్లవేళా !  

(టైటిల్  ఏ పాట ? ఈ కొసరు ఇంకే పాట?)
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

18, మార్చి 2018, ఆదివారం

విరోధాభాస విళంబి

ఎప్పుడూ మా వూళ్ళో పుల్ల మావిడికాయలు  ఏడాది పొడుగునా దొరుకుతాయి - ప్రపంచంలో ఏదో మూల వేసవి ఉంటూనే ఉంటుందేమో!

ఈసారి మాత్రం తియ్యమావిడికాయ మాత్రమే దొరికింది.

మర్చిపోయిన కొబ్బరికాయ తెచ్చుకుందామని హర్ష ఇండియన్ గ్రోసరీ అంగడికి వెళ్ళి - కొనుక్కుని డబ్బులిచ్చి రాబోతుంటే - "అయ్యో - మరిచాను మీకిమ్మన్నారు ఇది" అంటూ సొరుగు లోపల్నుంచి - వడిలి బంగారపు రంగులో వున్న చిటికెడు వేపపూత తీసి బంగారంలా నాకందించాడు - ఆ కొట్టులోని బంగారుకొండ.

మురిసిపోతూ కార్లో ఎక్కిన నన్నూ, నాచేత భద్రంగా పట్టుకున్నఆ బుజ్జి పొట్లం చూడగానే బదరి  - "ఒక  ఫ్రెండ్ చెప్పాడు - ఆంధ్రాలో ఇంకా వేపపూత రానేలేదట - పల్లెటూళ్ళో కూడా కొనుక్కోవాల్సిన రోజులొచ్చాయి అని" అన్నారు.

అది వినగానే - ఔరా! విరోధాభాస విళంబీ - అనిపించింది.

మావి చిగురులు వేయనేలేదట
వేప ఇంకా పూయనే లేదట
పేరు లోనేనేమో విలంబం?!
ఊసుపోని కోయిల పాట విన్న సంబరమేమో?!
తొందరపడి ఒక పండగ ముందే వచ్చింది
సంబరపడి మనందరికీ విందులు మప్పింది
విరోధాభాస అయితేనేం విళంబి!
కొత్త సంవత్సరాన్ని కానుకగా ఇచ్చింది
నవజీవనపు భరోసా తెచ్చింది.

11, మార్చి 2018, ఆదివారం

మా బావ నా కోసం రాసిన గాలికబుర్లు - ఆ పై కొన్ని పేర్ల కబుర్లు



"గాలిలోనే... మాటిమాటికీ... వేలితో నీ పేరు రాయడం - ఏమయిందో ... ఏమిటో ..."  - రాంగోపాల్ వర్మ తన  కోసమే రాయించాడేమో ఈ పాట అన్నంతగా ఇష్టం పెంచేసుకుని - అదే లైన్‌ని పదేపదే  హమ్ చేస్తుండే మా బావ, తన ప్రాజెక్ట్ పని మీద ఫ్లైట్‌లో వెళ్తూ, వస్తూ నాకు రాసిన ప్రేమలేఖలు  - గాలి (బావ) కబుర్లు. 



పెళ్ళికి ముందు, పెళ్ళైన కొత్తలో ప్రేమలేఖలు రాయడం, చదువుకోవడం మామూలే. కానీ పెళ్ళైన ఇన్నేళ్ళకి కూడా ప్రేమలేఖలు, వాటి తో పాటు నాకిష్టమైన ఫోటోలు, ఓ అందమైన పుస్తక రూపంలో అందుకోగలగడం నా అదృష్టం.

ఇంట్లో ఉన్నంత సేపు కబుర్లు చెప్తూ, వింటూ వున్నా కూడా తనకి తనివి తీరలేదట. అందుకే ప్రతీ వారం చేసే విమానప్రయాణం ఎలాగూ తప్పదు. ఆ ప్రయాణ సమయంలో ఏదో పుస్తకం చదువుకోవటమో, పక్కన కూర్చున్న వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండటమో, లేకపోతే పడుకోవటమో చెయ్యటం కాకుండా, నాకు ప్రేమలేఖలు రాయాలనిపించిందట.  తన లాప్‌టాప్ మీద నాకు చెప్పాలనుకున్న కబుర్లు రాయడం కోసం ఎప్పడెప్పుడు విమానం ఎక్కుతానా అని ఆరాటపడేవారట.

అలా జూన్‌లో రాయడం మొదలు పెట్టిన గాలి(లో)కబుర్లు డిసెంబర్‌కి పూర్తయ్యాయి. అంతలోనే వచ్చిన ఒక ఆలోచన ఈ కబుర్లన్నిటినీ ఒక పుస్తకంగా మార్చి నాకు ఇస్తే నేను చదివితే ఎలా వుంటుందా అని.

అది మొదలు తన కొలీగ్స్ అనిల్, కుమార్ గార్లతో కలిసి సాయంత్రం ఆఫీస్ పని అయిపోగానే వాళ్ళ ఆఫీస్ చుట్టుపక్కల వున్న OfficeMax, Kinko's ఇవన్నీ తిరగడం - అవే కాకుండా గూగుల్‌లో వెతికి ఎక్కడెక్కడో వున్న ప్రింటింగ్ స్టోర్స్‌కి వెళ్ళడం - అక్కడ వాళ్ళకి తెలుగులో టైప్ చేసిన కాంటెంట్ చూపించడం - వాళ్ళేమో ఈ ఇంటర్నేషనల్ ఫాంట్ ఇప్పటిదాకా ఎప్పుడూ ప్రింట్ చేయలేదు, ప్రయత్నిస్తాం కానీ ఎలా వస్తుందో చెప్పలేం అనడం. తనేమో తన ఫ్రెండ్స్ కి వీకెండ్ లో ఎక్కడెక్కడికి వెళ్ళాలో లిస్ట్ రాసి ఇవ్వటం, వాళ్ళు అక్కడకి వెళ్లి కనుక్కుని రావటం. కానీ అంతా సీక్రెట్, surprise గా ఉంచాలని చెప్పటంతో, వాళ్ళు కూడా బోల్డంత థ్రిల్డ్ గా ఫీల్ అవ్వటం! ఎక్కడా తనకి నచ్చిన పబ్లిషర్ దొరక్క పోవటంతో, తనే రాత్రుళ్ళు కూర్చుని, ఆ పేజీలన్నింటినీ ఫొటోస్ తీసి, ప్రతీ  పేజీ కి contextual గా సరిపోయేలా మా పాత ఫొటోస్ లోంచి కొన్నింటిని తీసి, వాటికి attach చేసి, ఆ compilation ని షట్టర్ ఫ్లై వాడికి పంపించి - ఓ మాంచి ఫోటో బుక్ తయారు చేయించారట.

ఇదో దాని కవర్ పేజీ, ఇంకా దాన్లోని ఓ కొన్ని కబుర్లు ...




ఫ్లైట్ వెళ్తుంటే చాలా బావుంటుంది బుజ్జాయ్. ప్రతి వారం విమానం జర్నీ చేస్తూ వుంటే రొటీన్ గానే వుంటుందేమో అందరికీ. కాని నాకెందుకో చాలా ఇంటరెస్టింగ్ గానే వుంది ఇంకా. మబ్బుల కన్నా పైన వెళ్తూ వాటిని పైనుంచి చూస్తూ వుంటే, భలే సరదాగా, విచిత్రంగా వుంటుంది.
---- ---- ---- ----

వర్షం వచ్చేలా వున్నప్పుడు దూరంగా మబ్బుల మధ్యలో మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మబ్బులు తెల్లగా కొన్ని నల్లగా కొన్ని ఎర్రగా కొన్ని దోరగా కొన్ని కోరగా వుంటాయి. అలానే, ఇంత ఎత్తులో వెళ్తున్నా కింద వూళ్ళల్లో వెలిగే లైట్లు అక్కడక్కడా కనిపిస్తూ వుంటాయి మసక మసకగా ఏ మబ్బూ లేనప్పుడు. విమానం ఫిలడెల్ఫియా, మన సెయింట్ లూయిస్ లకి దగ్గరగా వచ్చినప్పుడు చాలా బావుంటుంది. నేను మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అవుతున్నప్పుడు సాయంత్రం ఐదో ఆరో ఏడో అయ్యుంటుంది - అప్పుడు బయటికి చూస్తూ ఎలా ఫీల్ అయ్యానో ఇప్పటికీ విమానం లోంచి సిటీ లైట్లు ఎప్పుడు చూసినా అలానే అనిపిస్తుంది - నువ్వు కొత్త బంగారం పెట్టుకుని నాకు చూపిస్తూ మురిసిపోతావే ..అలా - ఊరంతా బంగారం అలంకారంగా పెట్టుకుని ఆకాశంలో ఎవరికో బోల్డంత ఆనందంగా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. బోల్డన్ని ఎల్లో లైట్లు మధ్యలో అక్కడక్కడా తెల్ల లైట్లు - నీ బంగారం గొలుసుల్లో ముత్యాల్లాగా, వజ్రాల్లాగా. 

 ---- ---- ---- ----

మొన్న గురువారం వచ్చేటప్పుడు నా పక్కనున్న వాడు, నన్ను బోల్డంత ఆశ్చర్యంగా అడిగాడు - అదేంటీ అలా ఎలా టైపు (తెలుగు లో) చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒకసారి కళ్ళు మూసి కొంచెం నెమ్మదిగా తెరిచి, చేతిని నెమ్మదిగా వూపుతూ 'జస్ట్ మేజిక్' అన్నా. వాడు కొంచెం కోపంగా చూసేలోపు నవ్వుతూ ఇక్కడ స్టాండర్డ్ డయలాగ్ just kidding అని - వాడికి ఈ టూల్ గురించి చెప్పా. వాడు కూడా నాలానే కళ్ళు తిప్పుకుంటూ ఓహో అదా సంగతి అని తెగ ఆనంద పడి, వాడు మొన్నీ మధ్య Japan వెళ్ళినప్పుడు google translate తో ఎలా మేనేజ్ చేసింది నాకు చెప్పాడు.  
 ---- ---- ---- ----

 ఒక్కసారి, జస్ట్ మళ్ళీ ఒక్కసారి టైం వెనక్కి వెళ్ళగలిగి, మనం మన స్నేహం ఇంకొంచెం ముందుగా మొదలు పెట్టగలిగితే  ... 
టైం లో వెనక్కి వెళ్ళగలగాలి, కానీ ఇప్పటివరకు జరిగినవన్నీ జరుగుతాయి అని తెలిసి వుండాలి. అంటే, ఎప్పుడైతే నిన్ను విసుక్కున్నానో, నీ మీద కోపం తెచ్చుకున్నానో ఆ సందర్భాలన్నీ మళ్ళీ అలాగే రిపీట్ అవ్వాలి. అలా జరుగుతున్నప్పుడు కూడా నేను నిన్ను మంచిగా బోల్డంత ఇష్టంగా చూసుకోవాలి.
 ---- ---- ---- ----

ఇల్లంతా హడావిడిగా తిరుగుతూ ఏంటో పాటలు పాడుకుంటూ, నవ్వుకుంటూ , పిల్లల్ని నన్ను సమానంగా విసుక్కుంటూ, కోపం తెచ్చుకుంటూ, వేటికోసమో వెతుక్కుంటూ, మధ్యలో అప్పుడప్పుడూ 'దొరికిందిరోయ్' అనుకుంటూ - ఇలా రకరకాలుగా కనిపించే, వినిపించే నిన్ను తలచుకున్న ప్రతిసారీ ఎక్కడ వున్నా, ఎంతమందిలోనైనా - నాకు తెలియకుండానే నా మొహంలో నవ్వు వచ్చేస్తూ ఉంటుంది.

 ---- ---- ---- ----


... నువ్వు శ్రద్ధగా చీర కట్టుకునే విధానం, కట్టుకుని ఓ అని మురిసిపోతూ నవ్వుకుంటూ, ''బావా సీ" అంటూ వయ్యారాలు పోవటం, ఇల్లంతా బొమ్మరిల్లులా సర్దటం, నువ్వూ ఓ బొమ్మలా పండగలకి దేవుడి ముందు కూర్చుని దండాలు  పెట్టటం, పెళ్ళైనప్పటినుంచి ఇప్పటివరకూ కొత్త చీర కట్టుకున్న ప్రతిసారీ నా కాళ్ళకి నమస్కారం చెయ్యటం (నీ భుజాలు పట్టుకుని పైకి లేపి దగ్గరికి తీసుకుంటే నీ మొహం మీద కనిపించే చిరునవ్వు), సినిమాలు చూసేటప్పుడు ఏదో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా కార్టూన్స్ చూస్తారే అలా చూడటం, బాంక్ కి వెళ్ళినప్పుడల్లా ఏ నగలు తెచ్చుకోవాలా అనే డైలమా చూపులు, కార్ డ్రైవ్ చేసేటప్పటి స్నూపీ చూపులు - ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలైనా ఎప్పుడూ అన్నీ గుర్తు వస్తాయి. వెంటనే నాకు తెలియకుండానే మొహం మీదకి నవ్వు  వచ్చేస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది.  ఓ ... మేరే ... దిల్ కే చైన్ ...చైన్ ఆయే మేరె దిల్ కో దువా కీజియే... !

 ---- ---- ---- ----

డబ్బు కావాల్సిందే. దాని విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వుండాల్సిందే . కానీ వెధవ డబ్బులు వుంటే ఎంత, పోతే ఎంత - అందరు మంచిగా వుంటే చాలు అని నేనెప్పుడూ అనుకుంటాను. అదే చెప్తూ వుంటాను కదా. నువ్వు కూడా అలానే మాట్లాడితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా మొహం మీదకి నా సిగ్నేచర్ నవ్వు వచ్చేసింది నువ్వు అలా అనగానే. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ, నువ్వు మాత్రం నిజంగా బోల్డంత మంచిదానివే బంగారం !

---- ---- ---- ----
 
ఈ మధ్య కొంచెం అబద్ధాలు చెప్పటం నేర్చుకున్నానోయ్ బంగారం.! మొన్న Monday రాత్రి 'ఇవాళ తొందరగా బజ్జుంటా బుజ్జాయ్' అని నీతో (అబద్ధం) చెప్పానా? కానీ ఫోన్ పెట్టేసి, ఓ రెండు గంటలు కూర్చుని ఈ stationery ని వెతికి డిజైన్ చేశా. బావుందా? నీకు నచ్చిందా?! ఇంకా కొంచెం మార్చాలి., కుదిరితే వచ్చే వారం చేస్తా.

---- ---- ---- ----

(నువ్వెంత ఖోపంగా చూసినా సరే, ఏ కారణం లేకుండా నాతో ఉత్తుత్తి గొడవలు పెట్టుకుని ఏడిచేటప్పుడూ, ఇంకా నన్ను సిగరెట్ తాగటానిక్కూడా వెళ్ళనివ్వకుండా సినిమాని, వాటి పేర్లు పడేటప్పటినుంచీ మొత్తం చూడాలని గొడవ చేసేటప్పుడు మాత్రం ఓ చిన్న బుజ్జి రాక్షసిలా ఉంటావ్. అందులో సందేహం లేదు.)

 ---- ---- ---- ----

ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం కోపంలో వున్నప్పుడు నిన్నేమైనా అని బాధ పెట్టి వుంటానేమో కానీ, నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. ఎంతిష్టం అనడిగావనుకో ..... బుజ్జిగాడికి చెప్తానే... అలా రెండు చేతులూ ఇలా దూరంగా పెట్టి.... అంతిష్టం అంటాను. అంతకన్నా ఏం చెప్పలేను.

---- ---- ---- ----

అవీ ... పొగడికల మాలలల్లి ఈ లల్లీకో పొగడ-మాలే వేసేశారు - తన గాలికబుర్లలో.

ఇవొక ఎత్తైతే - నాకు తను పెట్టిన పేర్లు బోల్డున్నాయి.

(ఇంకో తమాషా విషయం - పెళ్ళైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా మేమిద్దరం ఎవరికైనా చెప్పేటప్పుడు తప్ప ఒకరినొకరం పేరు పెట్టి పిలుచుకోలేదు.)

నచ్చినవేళల్లో నన్ను మెచ్చుకుంటూ పెట్టిన పేర్లు కొన్ని.

నేను తనని ఇబ్బంది పెట్టిన సమయాల్లో కూడా తాను నొచ్చినా నేను నొచ్చుకోకుండా ఆ విషయాన్ని నవ్వుతూ నాకర్థమయ్యేలా - ఒక వేళ పదిమందిలో వున్నప్పుడు చెప్పాల్సి వచ్చినా నాకు మాత్రమే అర్థమయ్యేలా సందర్భానికి తగిన హిట్ (హింట్) పేర్లు ఇంకొన్ని.

నన్ను మొట్టమొదటగా పిలిచిన పేరు బుజ్జాయ్. 

దానికి బంగారం ఎప్పుడొచ్చి జత కలిసిందో సరిగ్గా గుర్తు లేదు కానీ దాని గురించి తాను ముచ్చటగా చెప్పిన ముచ్చట ఒకటి - "అన్నట్లు చెప్పానా? నేనొక్కడినే ఇండియా వెళ్ళినప్పుడు - అంకుల్, బాబు, నేను డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. "చెప్పు బంగారం!"అంటూ నీతో మాట్లాడుతూ ఉంటే అది నీతోనని తెలిసి వాళ్ళిద్దరూ ఎంత మురిసిపోయారో తెలుసా?! మరి పెళ్ళప్పుడే చెప్పాను కదా అంకుల్ కి - నాకు కాలం గడిచే కొద్దీ పెరిగే బంగారాన్ని ఇస్తున్నారు మీరు అంటూ ;) "

ప్రశ్నకి ప్రశ్న అడగడం తప్ప ప్రతి ప్రశ్నకీ ఒక జవాబు మాత్రమే ఉంటుందన్న రూళ్ళు-రుమాళ్ళు అస్సలు పట్టించుకోని, పాటించని నేను తనడిగిన ఏ ప్రశ్నకైనా ఇచ్చే బదులు ప్రశ్నే!

ఉదాహరణకి -  ఫోన్ చేసి "బయటికి వచ్చాను. దగ్గర్లో ఇండియన్ స్టోర్ వుంది ఇంట్లోకేమైనా కావాలా?" అంటే "ఆ స్టోర్ చిన్నదా, పెద్దదా?" అంటూనో, "ఫలానా వాళ్ళు పార్టీకి పిలిచారు కాలెండర్లో నోట్ చేశావా?" అనడిగితే "ఏ కాలెండర్లో? అసలు నోట్ చేయకపోతే గుర్తుండదా?" అనో - ఒక్క మాటలో అవును, కాదు అని చెప్పగలిగే ప్రశ్నలకి కూడా ఏదో ఒక ఎదురు ప్రశ్న వేసే నాకు దొరికిన బిరుదు ప్రశ్నావళి.

ఎప్పుడైనా, ఏదైనా అనుమాన పడుతూ ఏమైనా అడిగితే, నాకొచ్చే ధర్మాధర్మ విచక్షణ లేక  (అ) ధర్మసందేహాలకి, నేను పాడే శంకవరాళి రాగానికనుగుణంగా నా కనువైన పేరు శంకరి కాక మరేంటి?


ఇంక తను సరదాగా చెప్పే విషయాలని కూడా అంతగా లోతుగా, చురుగ్గా ఆలోచించకుండా నిజమని నమ్మేసే నా ఇంకో పేరు మందా-రం. ఒకసారి ఎలెక్ట్రానిక్స్ ఎక్కువగా కొనేసి ఇల్లంతా వైర్ల మయం చేసేస్తున్నారని నేను గొడవ పెట్టాను చాలా - ఇంకేమైనా కొంటే అస్సలు కుదరదు అని చెప్పేశాను.  అప్పుడే సామ్స్ లో కొత్త డాన్-అండ్-డస్క్ లైట్స్ చూశారు తను. మా ఇంటికి బావుంటాయని కొనేశారు. (ఆ రోజు తనతో నేను షాపింగ్ కి వెళ్ళలేదు).   ఇంటికి రాగానే చేతిలో ఆ లైట్లు పట్టుకుని కిచెన్ లో ఏదో హడావిడిగా వున్న నాకు వాటిని చూపిస్తూ "చూశావా, మన మెయిల్ బాక్స్ లో ఎవరో పెట్టి వెళ్ళారు. ఏదో కొత్త ప్రాడక్ట్ అనుకుంటా ఫ్రీ శాంపుల్ లా వుంది" అనగానే నా కళ్ళు ఒకసారి వెలిగాయి - "అబ్బో ఎంత మంచి లైట్లో - ఎవరో గాని మంచి పేరున్న కంపెనీ అయుంటుంది" అని తెగ మురిసిపోయాను. తను కూడా ముసిముసిగా నవ్వుతూ "అవునే మందారం" అన్నారు. అసలు విషయం తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత కానీ "మందా-రం" సంగతి అర్ధం కాలేదు. 

తను Fridays ఇంట్లోంచి పని చేసేటప్పుడు, నేను నా ఆఫీస్ కాల్స్ లో మాట్లాడేవి విని, "ఆహా..యామిని అమెరికా వచ్చిన దగ్గర్నుంచీ నువ్వు కూడా yeah-హాకారాలు చేసేస్తున్నావు" అన్నారు.

పుట్టింది కోనసీమలో అయినా గుంటూరు, ప్రకాశం, రాయలసీమల్లో చదివి, పెళ్ళయ్యాక బెంగళూరు చేరి, ఆ తర్వాత అమెరికా వలస వచ్చి స్థిరపడిన తర్వాత ఎవరికీ పట్టియ్యని యాసతో తెలుగు మాట్లాడుతున్నానూ అనుకునే నేను - ఎక్కడో ఒకచోట తనకి దొరికిపోతాను గోదావరి యాసలో మాట కూడా పాటలా సా...గా.. దీ ...సే ... దీర్ఘసుమంగళి గా

పాపం - తనేదో వీకెండు - కొంచెం తీరిగ్గా లేచి సావకాశంగా రోజుని సాగిద్దాం అనుకునే లోపు వంటింట్లోంచి స్వగతంగా, పోట్లాటకి స్వాగతంగా - ఈ ఏడాది కూడా landscaping చేయించడానికి కుదరట్లేదు స్ప్రింగ్ దాటి సమ్మర్ కూడా వచ్చేస్తోంది అనో, ఆ బేస్మెంట్ గోడ దగ్గర  లీక్ ఇంకా పెద్దదవుతోంది షానన్ ని పిలుస్తారా లేదా ఈ వారమైనా అనో - నాలో నేనే మాట్లాడుకునే సమయంలో లివింగ్ రూంలోంచి ఒక పాట వినిపిస్తుంది ...మా-నస-వీణా ... మధు గీతం... మన సంసారం సంగీతం అంటూ :)) .

అప్పుడీ మా-నస-వీణ మానసంలో మెదులుతుంది  ఓ పాట. అది మల్లెపందిరి సినిమాలో ఎస్ జానకి పాడిన తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే కి బదులుగా ఎస్పీబీ విరిచి తొలిచూపు తో-రణమాయే అంటూ పాడిన పాట.

ఇంకో పేరు గూగ్లీ. అబ్బే! ఈ పేరుకీ క్రికెట్ ఆటకి ఏం సంబంధం లేనే లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులైనా మంత్రదండంతో మాయం చేసినట్లు, అంజనానిక్కూడా అందనట్లు ఎక్కడో చిలక-ప్రాణంలా భద్రంగా దాచేసినా అవసరమైనప్పుడు ఇట్టే సెర్చ్ చేసుకొచ్చి చేతికిస్తానని అపర-గూగుల్ అవతారాన్నే నేనని మెచ్చి నాకిచ్చిన పేరు గూగ్లీ. 


ఇంకేంటబ్బా...మర్చిపోయాను ... ఆ ... అదే! తనెన్నో సార్లు ఫోన్ లో చెప్పినా  వాటన్నిటికీ - అంటే ఎలాంటివంటే - కార్లో కొత్త ఇన్సూరెన్స్ కార్డ్ పెట్టు, రోజూ  గుర్తు పెట్టుకుని బోల్డన్ని మంచినీళ్ళు తాగు, బుజ్జిగాడి చేత కూడా తాగించు - అంటూ తను చెప్పేవాటిని ఫోన్ పెట్టేయగానే మర్చిపోయి మళ్ళీ తనొచ్చి గుర్తు చేశాక కూడా అదసలు ఇంతకు ముందు మీరు చెప్పారా, నేను విన్నానా అన్నట్లు వుంటానని పెట్టారబ్బా ఆ పేరు - ఏంటది? గజని కాక ఇంకేంటది?

మా అమ్మే ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది - నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోశానేమో - అంటూ. అది ఓ సారి తను విని, దాన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తూ, మా అమ్మతో ఒప్పేసుకుంటూ - ఆంటీ సరిగ్గా చెప్పారు అంటూ వాగే నా దేవీ!  - నా వాగ్దేవి! అంటూ నా వాగ్ధారకి గుర్తింపునిచ్చారు.

పుట్టినరోజులకో, సెలవు రోజుల్లోనో - పిల్లల కన్నా ఎక్కువగా సరదా పడి వాళ్ళు మనసు పడ్డారనో - వాళ్ళ వంకతో నేనాడేసుకుందామనో లెగోలో, ఇంకోటో కొనేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తానని శాంటాకి పోటీగా శాంటీని చేశారు నన్ను.

ఎక్కడికి వెళ్లినా ఏం కొనాలన్నా డెబిట్టో, క్రెడిట్టో - ఏదో ఒక కార్డు వాడితే సరిపోతుంది. ఒక్కోసారి కొన్ని చోట్ల డబ్బులే కావాలంటారు - ఏ చారిటీ కోసం పెట్టిన ఏ చిన్న స్టాల్ లోనో,స్కూల్ స్టోర్ లోనో. అలాంటప్పుడు లేదనకుండా వాలెట్ అరల-అలలు మధించి చిల్లరభాండం తెచ్చి అందించే నా పేరు ధనలక్ష్మి.

iPad లో తెగ బ్లాగులు చదివేసి, పాటలు విని-వినిపించే నేను ఐ-పద్మిని.

ఎక్కువుగా సాధిస్తున్నట్లు తనకి అనిపించినప్పుడు నాకు ఇచ్చిన ఇంకో నామధేయం సాధ్వి
 
బుజ్జాయ్, బంగారం, ప్రశ్నావళి, శంకరి, మందారం, యామిని,  దీర్ఘసుమంగళి, మానసవీణ, గూగ్లి, గజని, వాగ్దేవి, శాంటీ,  ధనలక్ష్మి, ఐ-పద్మిని,  సాధ్వి  ....ఎన్ని పేర్లో కదా!

ఇవన్నీ....... ఒకెత్తు.

వీటన్నిటినీ మించి విమల అన్నటికన్నా ఇంకో ఎత్తు.

మా ఆడపడుచు పెళ్ళిలో షాపింగ్‌కి నన్ను తోడు రమ్మంటూ - ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ - అని పాడుతూ ఉంటే  "అబ్బా - ఇంక పదే పదే అడగొద్దు నన్ను - నేను రాను అక్కడికి - ఇప్పుడొస్తే నాకు వంట చేయటం కుదరదు - మళ్ళీ మీకే ఆకలేస్తుంది పన్నెండింటికల్లా - అప్పటికప్పుడు నేను పరిగెత్తలేను - మీరే వెళ్ళి రండి " అంటూ పేచీ నాది.

దానికి బదులుగా "ఈ ఒక్కసారీ వెళ్ళొచ్చేద్దాం - తొందరగానే ఒక గంటలో - రా విమలాదేవీ!" అంటూ సముదాయింపు.

అప్పటికే పక్కనుండి మా ప్రళయకలహాన్ని వింటున్న మా అమ్మ "విసుగు ముందు పుట్టి తర్వాత పుట్టింది లలితా పరమేశ్వరి" అంటూ "ఇంతకీ విమల ఎవరండీ" అని తీసింది ఆరా.

కంట్లోంచి పెదవుల మీదికి జారిందో - లేక పెదవుల మీంచి కంట్లోకి ఎగిసిందో కనిపెట్టలేని చిరునవ్వు మెరుపు మొహమంతా వెలిగిస్తుంటే - చిలిపితనపు చిలకరింతతో ఆ ఆరాకి అందిన మాఱుమాట "మీరన్నదే ఆంటీ! విసుగుతో పుట్టి మా ఇంటిని మెట్టి వెలిగిస్తున్న మీ-మా విసుగు మహా లక్ష్మి - విమల - విమలాదేవి  :) "

మా అమ్మెప్పుడూ అంటుంది - మాట చూస్తే మామిడల్లం, మనసు చూస్తే పటికబెల్లం - మా లల్లీకి అని. ఆ విషయాన్ని అంత మంచిగా అర్థం చేసుకుని - తను నాకు పెట్టిన విమల అనే పేరుని వినగానే మా అమ్మ మొహమంతా కమ్మిన నవ్వుని, ఆవిడ పొందిన సంతోషాన్ని పోల్చాలంటే ఏ దివిటీ వెలుగులూ సరిపోవు.

తనకి ఆ పేరంటే ఎంత ఇష్టమంటే - నాకో బుల్లి కారు కొని, దానికి personalized license plate గా ఆ పేరుని అలకరించేంత :)

4, మార్చి 2018, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 10 - చదువయ్యింది - మనువయ్యింది!

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 9 - ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా - ఎదురెళ్ళిన గోదావరి వరద

సెప్టెంబర్లో ఇంగ్లీషు పరీక్ష రాశాను - పాసయ్యాను. నాకు మళ్ళీ వచ్చే జూన్ దాకా టైముంది.

1965 జూన్‌లో కానీ కాలేజ్‌లో జేరడానికి లేదు నాకు.

ఈలోగా రోజూ పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాణ్ణన్నమాట.

మా అన్నగారు కటక్‌లో - విజయా మెడికల్ సిండికేట్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తూ ఉండేవారు.

మా నాన్నగారు పోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి డిసెంబర్ ప్రాంతంలో అనాతవరం వచ్చేశారు వ్యవసాయం చేయడానికి. ఆయనకి ముగ్గురు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల.

మా బావగారిక్కూడా వ్యవసాయం ఉండేది - ఓ తొమ్మిదెకరాలు. విశాఖపట్నం నుంచి చేలో నాట్లు వేసేటప్పడు, కోతలు కోసి మాసూళ్ళు చేసేటప్పుడు ఆయన, మా అక్కగారు వస్తూ ఉండేవారు. వచ్చి ఓ పది రోజులుండి పనులూ అవీ చూసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. జూన్-జులై నెలల్లో నాట్లు వేస్తామన్నమాట. ఆ నాట్లేసే రోజుల్లో ఎప్పట్లాగే వాళ్ళొచ్చారు. వ్యవసాయప్పనుల్లో బిజీగా వున్నాం.

ఓ రోజలాగే బోయనాలు చేస్తున్నాం కూర్చుని.

మా బావగారు - "ఏమయ్యా బాబీ! వ్యవసాయంలో ఏమన్నా మెళకువలు తెలుసుకున్నావా?" అనడిగారు నన్ను.

"తెలియకపోవడమేంటయ్యా బాబూ - ఇంతకాలం తిరుగుతున్నాను కదా! ఫుల్లు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది వ్యవసాయంలో. మహామహా వనచర్ల సుబ్బన్న లాంటి వాడికే నేర్పుతున్నానిప్పుడు -ఆయనకే చెప్తున్నాను " అన్నాన్నేను.

వనచర్ల సుబ్బన్న ఎవరంటే చిన్నప్పణ్ణుంచి మా పొలం పనుల మీద ఉండేవాడు. ఆయనకి అప్పటికి డెబ్భై ఐదేళ్ళు . మా నాన్నగారి కాలం నుంచి ఉండేవాడు. వాళ్ళావిడ వనచర్ల మంగమ్మ అని ఉండేది. సుబ్బన్నని ఇంటినుంచి పొలానికి తీసుకువచ్చేది.

నారు తీసే కాలమది.

" ఏంటి సుబ్బన్నక్కూడా చెప్తున్నావా నువ్వు? అంత అనుభవం వచ్చేసిందా నీకు - ఏం చెప్పి చేయించుకున్నావేం సుబ్బన్న చేత?" అంటూ మా బావగారు ఆశ్చర్య పోయారు.

"ఏముంది? కర్ర పట్టుకుని గట్టుమీద నిలబడి వున్నాడు - దగ్గరికెళ్ళి 'ఏం సుబ్బన్నా - ఇలా నిలబడి వున్నావు - నారు లాగుదువుగాని రా ' అన్నాను. నడండి  బాబయ్య అన్నాడు. ఆ చెయ్ పట్టుకు తీసుకెళ్ళి నారుమళ్ళో ఒంగోబెట్టి - ఇదిగో ఈ నారు పీకిస్తే వాళ్ళు కట్టలు కట్టి పట్టికెళ్తారు అని అక్కడ కూర్చోబెట్టాను" అని చెప్పాను.

అది వినగానే మా బావగారు ఫక్కున నవ్వాడు - ఎందుకంటే సుబ్బన్న కళ్ళు కనబడనంత పెద్దవాడయ్యాడు అప్పటికే - అతని చేత నువ్వు చెప్పి చేయించే వ్యవసాయం ఇదా అంటూ.

అలా నవ్వుతుండగా నోట్లో ముద్ద ముందున్న కంచంలో పడింది. మా బావగారికి పొరబోయింది. దగ్గొచ్చింది. గబగబా మంచినీళ్ళు తాగి నెట్టి మీద కొట్టుకున్నాడాయన. ఇదంతా అక్కడే నించుని వడ్డిస్తున్న మా అమ్మ చూసి "భోజనాల దగ్గర అవేం కబుర్లు - నవ్వించకూడదలా - పొరబోతుంది" అని నన్ను చీవాట్లేసింది.

1965 జూన్లో బీకామ్ లో చేరాను. మా క్లాసులో ఎనభై మంది ఉండేవారు.

తరగతి గదులేమో పాకలు - కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల. ఎస్కెబీఆర్ కాలేజ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఒకటే పెద్ద భవనం. మిగతావన్నీ పాకలు - కింద బండలు. చగ్గా ఆ పాకలకింద చల్లగా ఉండేది. అందులో కూర్చుని చదువుతుండేవాళ్ళం.

సాయంత్రం అయ్యేటప్పటికి ఎన్సీసీ. వారానికి నాలుగురోజులు ఎన్సీసీకి వెళ్ళాల్సిందే - యుద్ధకాలం కదా - అందరికీ ట్రైనింగు. రైఫిల్ షూటింగులూ అవీ ఉండేవి మాకు.

హైస్కూల్లో మాతో పాటు చదివినవాడు - సాయిబాబా అని ఒకడుండేవాడు. సిరంగు సత్తిరాజుగారి మనవడు. రైఫిల్ షూటింగులో నేనూ వాడూ బెస్టు అన్నమాట. వస్తే వాడికి, లేకపోతే నాకు రావాలి మొదటి స్థానం. అంతబాగా చేసేవాళ్ళం.

ఆ రకంగా ఆడుతూ పాడుతూ డిగ్రీ మొదటి ఏడాది నడిపించేశాం. జువాలజీ క్లాసుకి మాత్రం ప్రయోగాలు అవీ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ గుఱ్ఱం ప్రకాశరావుగారే మళ్ళీ మాకు పాఠాలు చెప్పేవారు. ఇంతకు ముందులాగే మా ఎన్సీసీ కమాండర్ ఆయన - డిగ్రీలో కూడా.

డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి - అన్నీ పాసయ్యాను.

1966 జూన్-జులై లో రెండవ సంవత్సరం మొదలయింది.

మా మేనమామగారు పప్పు రామకృష్ణారావుగారి మూడో అమ్మాయిని చిన్నప్పణ్ణుంచీ మా అమ్మమ్మగారు వాళ్ళూ అంటుండేవారు - ఇది బాబీ పెళ్ళాం - అని.

1965లోనే  మా అన్నయ్యగారికి చెప్పాను - "అర్జెంటుగా నాకు పెళ్ళి చేసెయ్యాలి , మళ్ళీ ఏదో పుష్కరాలు వస్తున్నాయట పన్నెండు నెలల దాకా పెళ్ళిళ్ళు ఉండవని గురువుగారు చెప్పారు. అందుచేత పెళ్ళి చేసేసుకుంటాను"  - అన్జెప్పి.

అప్పటికింకా ఒడుగు కాలేదు. పెళ్ళి కావాలంటున్నాను. సరే అని హడావిడిగా ముహూర్తాలు పెట్టించేశారు .

1966 మే 30 వ తారీఖు ఒడుగు. జూన్ రెండో తారీఖేమో పెళ్ళి.

మా అమ్మగారేమో మా పెళ్ళి తిరుపతిలో చేయిస్తానని మొక్కుకుందట. కానీ అంత తక్కువ వ్యవధిలో తిరుపతి  వెళ్ళడం అంటే కష్టం ఆ రోజుల్లో.

అంచేత రాజోలు వేంకటేశ్వరస్వామి గుళ్ళో చేసేద్దాం పెళ్ళి అని అందరూ అనేసుకున్నారు.

మే 24. ఆర్రోజుల్లో ఒడుగు, ఆ తర్వాత మూడు రోజుల్లో పెళ్ళి. బట్టలూ అవీ కొనాలి. మా బావగారు అనాతవరం - రెండో పంట మాసూళ్ళకి  వచ్చున్నాడు.

"బాబీని తీసుకుని నేను వైజాగ్ వెళ్తాను. బట్టలవన్నీ అక్కడే కొనేస్తాం." అన్నాడు మా బావగారు.

అది విని మా అన్నగారు - నానిగారు "సరే! మీరలా వెళ్ళి బట్టలవీ కొనుక్కురండి - ఇక్కడ మిగిలిన పనులూ - పందిళ్ళు అవీ వేయించడం మేం చేస్తాం" అని మమ్మల్నిద్దర్నీ పంపించారు.

మేమిద్దరం మే 26 బయల్దేరి విశాఖపట్నం వెళ్ళాం.

కోటిపల్లి రేవు దాటేశాం. SRMT వాళ్ళ బస్సు వైజాగ్ వెళ్ళేది ఎక్కాం.

మా బావగారు మధ్య సీట్లో కూర్చున్నాడు - నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. ఆ రోజు తెల్ల ప్యాంటు - తెల్ల చొక్కా వేసుకున్నాను.

బానే సాగుతోంది ప్రయాణం.

తుని దాటింతర్వాత నక్కపల్లి అడ్డరోడ్డు వస్తుంది. అక్కడొక చిన్న మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర ఓ లారీ వాడొచ్చి మేమెక్కిన బస్సుని గుద్దేశాడు.

ఈలోగా ఏమైందంటే అనుకోకుండా - నేను కుడి పక్క కిటికీ దగ్గర కూర్చున్నాను కదా! మా బావగారికి అటు పక్కన ఓ ఇంజినీరు కూర్చుని వున్నాడు. ఆయన - "బాబూ! నాక్కొంచెం కడుపులో తిప్పుతోంది.  ఆ కిటికీ సీటు నాకిచ్చి ఈ పక్కన కూర్చుంటావా?" అనడిగాడు.

"సరే! మీరిలా కూర్చోండి" - అని చెప్పేసి మా బావగార్ని చివరికి జరగమని నేను మధ్యలో కూర్చున్నాను.

ఆ ఇంజినీరు చెయ్యి బయట పెట్టుకుని కిటికీ దగ్గర కూర్చున్నాడు.

ఇదంతా తునిలో జరిగింది.

తుని దాటాక నక్కపల్లి అడ్డరోడ్డు దగ్గరికి పావుగంట-ఇరవై నిముషాల ప్రయాణం. అక్కడికి రాగానే లారీ వచ్చి కొట్టేసింది. కుడి పక్కనుంచి బస్సుని రాసుకుంటూ వెళ్ళిపోయింది.

నా పక్కనున్న ఇంజినీరుకి చెయ్యి తెగిపోయింది. నా ఒళ్ళంతా ఆయన రక్తం  మా బస్సులో కండక్టరుతో సహా ముగ్గురు చచ్చిపోయారు. ఈ బస్సుకి కుడిపక్కకి రాసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి ఎడం పక్కగా కూడా తగిలేసింది లారీ. పాపం - ఆ కండక్టరుకి పెళ్ళయ్యి మూణ్నెల్లు అయిందట. బస్సు తలుపు దగ్గర నిలబడి వున్నాడు - ఆ విసురుకి కింద పడి  చనిపోయాడు. ఇంకొకాయన పెద్దాయన కూడా పోయాడు. 

ఆ బస్సులో నేను, మా బావగారు, ఇంకో తల్లి ఆవిడ నలుగురు పిల్లలూ తప్ప దెబ్బలు తగలని వాళ్ళు లేరు.

ఇంక నేనూ,  మా బావగారు దిగి - నేనేమో బస్సు పైకెక్కి సామాన్లు దించడం మా బావగారేమో వాటిని అందుకొని కింద పెట్టడం - మొత్తం సామాన్లన్నీ నడిరోడ్డు మీదకి దించేశాం.

ఇంక రోడ్డు మీద నిలబడి అటు అనకాపల్లి వైపు - ఇటు తుని వైపు కార్లు, బస్సులు, వ్యాన్లు - ఏవి వెళ్తుంటే వాటిని ఆపి - ఈ దెబ్బలు తగిలినవాళ్ళని, వాళ్ళ సామాన్లని ఎక్కించడం - ఈ రకంగా అందర్నీ పంపించాం.

అందర్నీ పంపించాక నేను, మా బావగారు, ఆ తల్లి - నలుగురు పిల్లలూ - ఈలోగా వేరే బస్సొస్తే అదెక్కి వైజాగ్ వెళ్ళాం.

మాకు బట్టలు మార్చుకుందుకు కూడా లేదు. గుమ్మంలో దిగేటప్పటికీ మా పెద్ద మామయ్యగారు - ఇంతింత కళ్ళు చేసుకుని "ఏంటి ఒళ్ళంతా ఆ రక్తమేంటి ? ఏమయింది ? ఏంటి? ముందా బట్టలు విప్పు " అంటూ తెగ కంగారు పడిపోయారు.

అప్పుడు నేను - "నాకేం కాలేదు. పక్కనున్నాయనకి దెబ్బ తగిలితే ఆయన రక్తం నా మీద పడింది" - అని చెప్పి లోపలికెళ్ళి స్నానం అదీ చేసొచ్చాను.

ఈ లోపులేంటంటే ఈ వార్త అనాతవరంలో తెలిసిపోయింది.

రేడియోలో సాయంత్రం ఆరుగంటల ప్రాంతీయ వార్తల్లో కోటిపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సుకి ప్రమాదం జరిగింది - ముగ్గురు చనిపోయారు - చాలా మందికి తీవ్రంగా గాయాలు తగిలాయి అని చెప్పారట.

"ఏ బస్సు, ఏ బస్సు?" అని అందరూ అనుకుంటుంటే కోటిపల్లి నుంచి ఒకటే బస్సు - పైగా ఎప్పట్లాగే పళ్ళయ్య మాతోటి  కోటిపల్లి దాకా బస్సెక్కించడానికి వచ్చి వెనక్కెళ్ళిపోయాడు.

ఆ పళ్ళయ్య " అది మన బాబీగారు, లాయరు గారు ఎక్కిన బస్సేనండోయ్" అనగానే ఇంట్లో గొడవ.

పెళ్లి పనులన్నీ మానేసి - ఆ రోజుల్లో ఫోన్లు కూడా అందరిళ్ళలో ఉండేవి కావు. ఒక వేళ ఫోనున్నా లైట్నింగ్ కాల్ పెట్టి మాట్లాడాలి. అప్పుడు మా పెద్దక్కయ్య పాపాయి మావగారు - ఆయన్ని మావతాత అనేవాళ్ళం - కర్రా సూర్యనారాయణగారు - వరహాభట్ల గురుమూర్తిగారని మా అమ్మకి కజినవుతుంది ఆయన భార్య - వాళ్ళింటికెళ్లి - వాళ్ళింట్లో కూర్చుని - అక్కణ్ణించి మావతాత వైజాగ్ మా పెద్దమామయ్య గారింటికి ఫోన్ చేశారు.

ఈ లోపులేమయ్యిందంటే నేనూ, మా బావగారు - స్నానం-గీనం చేసేసి - మరీ మనసుకి ఇబ్బందిగా వుంది అని చెప్పేసి సినిమా కెళ్ళిపోయాం. కృష్ణప్రేమ సినిమా.

ఈ లోగా అమలాపురం నుంచి మావతాత ఫోను చేశారు. మా మామయ్యగారు ఫోన్ తీసి "ప్రమాదం జరిగిన మాట వాస్తవమే! కానీ మనవాళ్ళకేమీ కాలేదు. వాళ్ళొచ్చేస్తారు - మీరేమీ కంగారు పడకండి" అని చెప్పారు.

అయినా కూడా మావతాత ఊరుకోకుండా "లేదు - నేను వాళ్ళతో మాట్లాడాలి - ఏరీ వాళ్ళు? ఎక్కడ? బస్సులో అందరికీ గాయాలయ్యాయట. ముగ్గురు పోయారట. వీళ్ళెక్కడ? బానే ఉంటే ఫోన్ దగ్గరికి రారెందుకు? హాస్పిటల్లో ఉన్నారా? వాళ్ళు బానే ఉంటే వాళ్ళకివ్వండి ఫోను. నేను వాళ్ళతో మాట్లాడితే కానీ ఇక్కడ పనులన్నీ బంద్" అన్నాడాయన.

"లేరయ్యా బాబూ - వాళ్ళేదో సినిమాకెళ్ళారు - వాళ్ళొచ్చాక ఫోన్లో మాట్లాడిస్తాను - ఈలోగా మీరు పనులు చేసుకోండి " అని మా పెద్దమామయ్య అంటున్నా కూడా వినకుండా "లేదు - వాళ్ళతో మాట్లాడాకే ఏ పనైనా" అంటూ మావతాత ఫోన్ దగ్గరే కూర్చున్నారు.

మేం సినిమా నుంచి వచ్చిన తరువాత మా బావగారు మాట్లాడి - "మేము క్షేమం గానే వున్నాము, 29 కల్లా వచ్చేస్తాం. మీరు ఏర్పాట్లవీ చేసుకోండి" - అన్నాక మావతాత కుదుట పడ్డారు.

29 సాయంత్రానికి అనాతవరం చేరాం. వెంటవెంటనే పెళ్ళికొడుకుని చేయడం జరిగిపోయింది.

ఈ లోపు శివకోడులో కూడా ప్రమాదం వార్త తెలుసుకుని మా బావమరిది ప్రసాదు కూడా పందిళ్ళు అవీ వేయించడం ఆపు చేసేశాడు. అసలు బాజాలు, భజంత్రీలు ఏవీ లేవు. 

సరే - మా మటుకు మేము ఒక బస్సు అనాతవరం నుంచి పురమాయించుకుని - ఒడుగు కూడా రాజోల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే అనేసుకుని శివకోడుకి బయల్దేరాం.

పుంతలో ముసలమ్మ గుడి దగ్గరికి చేరేటప్పటికి సన్నాయి వాయిద్యం ఏమీ వినపళ్ళేదు.

అప్పుడు బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను - ఆ రోజుల్లో - వందరూపాయలు అతని చేతుల్లో పెట్టి "ఓ పంజేయవయ్యా  నువ్వూ! బాజాలెలాగూ లేవు - పుంతలో ముసలమ్మ గుడి దగ్గర్నుంచి పెళ్ళి వారింటికి వెళ్ళే వరకు ఆ హారన్ మీద చెయ్యి తియ్యకు. అదే మనకి ఊరేగింపు" అన్నాను.

ఆ పళాన ఆ డ్రైవర్ హారన్ మోగిస్తూ బస్సు నడుపుతుంటే - ఊళ్ళోవాళ్ళందరూ "ఏంటీ బస్సు ఇలా హారన్ మోగించుకుంటూ వెళ్తోంది" అనుకుంటూ చూడడానికి ఇళ్లలోంచి బయటికి వచ్చేశారు.

వస్తోంది ఎవరో తెలీగానే ఇంకేముంది! - "పెళ్ళివారొచ్చేశారు, పెళ్ళివారొచ్చేశారు" - అంటూ ఒకటే హడావిడి, సందడి.

అసలే చీకటి పడింది - ఇంటి ముందు పందిరి, దీపాలు ఏమీ లేవేమో - బస్సు డ్రైవర్ ఇంకా ముందుకెళ్ళాలేమో అనుకుని పెళ్ళివారిల్లు కూడా దాటి ముందుకెళ్ళిపోయాడు.

మళ్ళీ నేనతని దగ్గరికి వెళ్ళి - "బాబూ  ఇల్లు దాటొచ్చేశావ్ వెనక్కి తిప్పు" అని చెప్పి మొత్తానికి ఎలా అయితేనేం మగ పెళ్ళివారం ఆడపెళ్ళివారిల్లు చేరాం రాత్రికి.

అప్పటికప్పుడు వంటలు వండించుకుని బోయనాలు చేసి - రెండో రోజు పొద్దున్న రెండెడ్ల బళ్ళు కట్టించుకుని - ఊళ్ళో అంతా స్నేహితులే కదా - మన బాబీ పెళ్ళి అని అందరూ తలకో బండి ఇచ్చారు - ఆ బళ్ళెక్కి పెళ్ళివారం రాజోలు వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాం.

ఆ గుడికి అప్పటికి కాంపౌండ్ వాలూ అది కూడా లేదు. గుడి, ఒక పుట్టు వెంట్రుకలు తీసే చిన్న మండపం - అంతే!

గుళ్ళో 30న ఒడుగు చేసేశారు. రెండో తారీఖు రాత్రి పెళ్ళి.

పుట్టెంట్రుకలు తీసే కల్యాణకట్ట మండపం మా కళ్యాణమండపం. అక్కడ చుట్టూ వున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేశారు, అలా అందరి సమక్షంలో మా పెళ్లయిపోయింది.

మూడు రోజుల పెళ్ళి మాది - పెళ్ళయింతర్వాత నాగవల్లి అదీ అయ్యాక అనాతవరం  వచ్చేసి గ్రామసంతర్పణ చెయ్యాలి.

కానీ మా అమ్మ తిరుపతి మొక్కుకుంది కదా - పసుపు బట్టలతోనే తిరుపతి వెళ్ళాలి అని ఆవిడ ప్లాను.

అప్పుడు సోమన్నగారని చెప్పేసి ఉండేవాడు అమలాపురంలో టాక్సీ అయన. ఆ సోమన్నగారి టాక్సీ బుక్ చేసుకుని మా బావగారు కర్రా భాస్కరంగారు, మా అక్కగారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు, నేనూ-కొత్త పెళ్ళికూతురూ - తిరుపతి వెళ్ళాం - మా పసుబ్బట్టలతోనే.

అంబాసడర్ కారు - గంటకి అరవై కిలోమీటర్లు వెళ్ళేది. దార్లో గుంటూర్లో వడ్లమాని ఉమామహేశ్వర్రావుగారి ఇంట్లో ఓ రాత్రి వున్నాం. రెండో రోజు పొద్దున్నే బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకి తిరుపతి చేరాం. స్నానాలు చేసి దర్శనాలు అవీ చేసుకుని ఓ రోజుండి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ వస్తూ నెల్లూరులో ఆ రాత్రికి ఆగి మరసటి రోజుకి అనాతవరం వచ్చేశాం.

వచ్చిన మర్నాడు ఊళ్ళో సంతర్పణ.

అలా డిగ్రీ మొదటి సంవత్సరం అయ్యాక పెళ్ళయ్యింది. నా పెళ్ళికి మా కాలేజ్ వాళ్ళందరూ కూడా వచ్చారు.

బీకామ్ లో హిందీ క్లాసు ఉండేది. మాకు హిందీ లెక్చరర్ ఒకాయన ఉండేవారు - భూపయ్యఅగ్రహారంలో. సాయంత్రం ఆఖరి పీరియడ్ కనక ఆయనది ఉంటే నన్ను పిలిచి "నాయనా వెళ్ళు - కొత్తగా పెళ్లయినవాడివి కదా - ఫో!" అని నన్ను పంపించేసేవారు.

అలా డిగ్రీ రెండవ సంవత్సరం, మూడో ఏడాది - నాటకాలు, నాటికలు వేసుకుంటూ, ఎన్సీసీతో ఆడుతూ పాడుతూ అయిపోయింది.

కాకపోతే నాకు భయమేంటంటే - అమలాపురం ఊళ్ళో మా బావగారు కర్రా భాస్కరంగారుండేవారు కదా - భాస్కర  మెడికల్ స్టోర్స్ ఆయనదే.  మా ప్రిన్సిపాల్ సుబ్బరాజుగారని ఉండేవారు. సుబ్బరాజుగారు తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా చేశారు. మా అమ్మాయి లల్లి (అంటే ఈ బ్లాగ్ రాసే నేనే) తిరుపతిలో MCA ఎంట్రెన్స్ రాసినప్పుడు అక్కడ వైస్-ఛాన్సలర్‌ ఆయనే.

వైస్-ప్రిన్సిపాల్ జి. పి. రమేశం గారని ఉండేవారు. మాథ్స్ చెప్పడానికి చిదంబరం గారని జల్లిపల్లినుంచి వచ్చేవారు. ఆయన జి. పి. రమేశంగారికి మంచి స్నేహితులు. జల్లిపల్లి చిదంబరంగారు, జి. పి. రమేశం గారు మా బావగారికి మంచి ఫ్రెండ్సు. వీళ్ళు అప్పుడప్పుడు మా బావగారి మెడికల్ షాపుకి వచ్చి కబుర్లు చెప్తూ, ఏవో అవసరమైన మందులు కొనుక్కెళ్తూ ఉండేవారు. అంచేత జాగ్రత్తగా ఉండేవాణ్ణి - కాలేజ్ విషయాలేమైనా మా బావగారికి వాళ్ళు చెప్తారేమోనని.

మా బావగారంటే నాక్కొంచెం అభిమానంతో కూడిన గౌరవంతో కూడిన భయం ఉండేదన్నమాట. రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వస్తూ ఆయన సైకిలు బెల్లు వినగానే పుస్తకాలు తీసి చదువుతూ ఉండేవాణ్ణి. అంతవరకూ మా అక్కగారి దగ్గర పాటలు పాడుతూ కూర్చునేవాణ్ణి.

డిగ్రీలో పరీక్షలకి ఎలా చదివే వాణ్ణంటే - సాధారణంగా B.com వాళ్లంటే they can never be calm - ఎప్పుడూ ఎదో సరదా, అల్లరి. కాకపోతే అకౌంట్స్ నేను బాగా చేసేవాణ్ణి. పరీక్షలప్పుడు సాయంత్రం మొదలుపెట్టి రాత్రి తొమ్మిదిన్నర దాకా చదివేవాణ్ణి. అప్పుడు బయటికెళ్ళి టీ తాగి సెకండ్ షో సినిమాకెళ్లిపోయేవాణ్ణి. మళ్ళీ ఒంటిగంటకి ఇంటికొచ్చి అప్పట్నుంచి తెల్లారేదాకా చదివేసేవాణ్ణి. పొద్దున్నే వెళ్ళి పరీక్ష రాయడం - మధ్యాహ్నం నిద్రపోవడం. సంవత్సరమంతా చదవడం ఎప్పుడూ అలవాటు లేదు. మా వాళ్ళందరూ - ఒరే! ఏకసంథాగ్రాహివిరా నువ్వు అనేవారు. ఏకసంథాగ్రాహినో ఏమో కానీ - ఏదో అలా చదివేసి మొత్తానికి బీకామ్ పాసయిపోయాను.

కాకపోతే - జయంతి సత్యనారాయణ గారని మాకు మర్కంటైల్ లా చెప్పేవారు. ఆయన క్లాసులో మాత్రం వెనక బెంచీలో కూర్చుని నేను మంగినపూడి సీతారాం చుక్కలాట ఆడుకునేవాళ్ళం. ఆయనకి మెల్లకన్ను. ఎటు చూస్తున్నారో తెలిసేది కాదు. అటు పక్క చూస్తూ ఇటు పట్టుకునేవారు. కాలేజీలో అందరూ గౌరవంగానే పిలిచేవారు. ఆయన మాత్రం "ఒరేయ్! వడ్లమాని గాడిదా! నువ్వు మాత్రం లా పాసవ్వవురా " అనేవారు. ఆయనలా అనగానే "నాకెందుకు సార్ లా ? పాసవ్వకపోతే నేను వ్యవసాయం చేసుకుంటాను" అనేవాణ్ణి. పైగా ఆయన లాగే మెల్లకన్ను పెట్టి చూసేవాణ్ణి. నిజంగానే ఆయన చెప్పినట్లే మర్కంటైల్ లా ఫైనల్ ఇయర్లో తన్నేసింది. 1968 సెప్టెంబర్లో వైజాగ్ వెళ్ళి రాశాను మర్కంటైల్ లా.

1968లో చదువై పోగానే నేనూ, మా ఆవిడా అరకు, వైజాగ్ అంతా తిరిగి వచ్చాము. అదీ సంగతి! 

సరదాగా ఆడుతూ పాడుతూ చదువయ్యింది
చదువు ముందు బ్రతుకుకి మదుపయ్యింది
మరదలిపై ప్రేమతో ప్రీతితో మనువయ్యింది
మనువు జరిగి చెలువ చనువయ్యింది

<వచ్చేనెల తరువాయి కథ>