9, ఆగస్టు 2020, ఆదివారం

ఒకే పాట పలుకుతోంది వేరు వేరు గొంతుల్లో...

ఓ ఆషాఢ మాసపు మధ్యాహ్నం.

గుంటూరు బ్రాడీపేట రెండోలైనులో బండ్లమూడి హనుమాయమ్మ హిందూ గర్ల్స్ జూనియర్ కాలేజ్‌లో ప్రిన్సిపాల్ కాకాని లీలా సీతారాం గారి ఆఫీస్ ముందు - గుళ్ళో పూజారి శఠగోపం పెట్టడానికి వచ్చే ముందు అటూ ఇంటూ నించుంటామే - అలా నుంచున్నాం అమ్మ, నేను, లక్ష్మి దొడ్డ, ప్రశాంతి. 

లేతగులాబీరంగు పరికిణీ - అంచు దగ్గర వెడల్పాటి తెల్లపూలు, వాటిని కింద నుంచి పైకి లాక్కెళ్తున్నట్టుగా - ముదురాకుపచ్చ ఆకుల సాయంతో పైకి సాగిన లేత ఆకుపచ్చ రంగు తీగలు - ఆ పరికిణీ మీద అరండల్ పేట సికేరా టైలర్స్ దగ్గర కుట్టించిన అంతే లేతగులాబీ రంగులో కాలర్ ఉన్న బ్లౌజ్ వేసుకుని - చేతిలో పదోతరగతి మార్కుల లిస్టు పట్టుకుని - ముక్కు చిట్లించుకుని - చుట్టూ చూస్తున్నాను.

అప్పటికి ఓ రోజు ముందు వర్షం పడిందేమో - కాలేజ్‌లో పరిచిన నాపరాళ్ళ మీద పల్లంగా ఉన్న చోట అక్కడక్కడా నీళ్ళు నిలిచి ఉన్నాయి. చుట్టూ ఎత్తుగా కాంపౌండ్ వాల్. దాని పక్కనే వరసగా నుంచుని గోడవతలకి తొంగి చూస్తున్న అశోకా చెట్లు. ఆ చెట్ల నుంచి రాలి కిందపడి - అటూ ఇటూ నడుస్తున్న వాళ్ళ పాదాల కింద పడి నలిగి పగిలిన చిన్నచిన్న కాయలు - వాటి చుట్టూ ఆషాఢ మాసపు అనాహ్వానిత అతిథులు - ఈగలు.

ఓ పక్క వెళ్ళొద్దే అన్నా వినకుండా ప్రశాంతి (దానికప్పుడు నాలుగేళ్లు) పరిగెత్తుకుంటూ వెళ్ళి మడుగులుగా ఉన్న నీళ్ళల్లో తపతపా అడుగులేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళ మీద పడేలా తకిట తధిమి తకిట తధిమి తందానా ఆడేస్తోంది. దాన్ని ఇవతలికి లాక్కొస్తుంటే రానంటూ సాగుతూ ఏడుస్తోంది. వాతావరణం చెమ్మగా, ఉక్కగా, చిరాగ్గా ఉంది.

నేనప్పుడే - నెమ్మదిగా అమ్మకి మాత్రమే వినిపించేలా - ఏడుపు గొంతుతో గొణుగుతున్నాను "నాకీ కాలేజ్ అస్సలు నచ్చలేదమ్మా! ఇక్కడ అమ్మాయిలు ఒక్కళ్ళే ఉంటారు. నేనెప్పుడూ గర్ల్స్ స్కూల్లో చదవనేలేదు. అందరూ అమ్మాయిలే అయితే ఇక competition ఏముంటుంది? నువ్వే అంటావుగా 'స్పర్థయా వర్ధతే విద్యా' అని - కాంపిటిషనే లేకపోతే ఇంకేం విద్య? పైగా ఇక్కడ అన్నీ ఈగలే. నాకు వాటిని చూస్తేనే దురదొచ్చేస్తోంది. ఇంతకు ముందు మనమున్న SVN కాలనీ ఇంటి దగ్గరున్న JKC లో చేరతాను నేను. కావాలంటే రోజూ బస్సులో వెళ్ళొస్తా." అంటూ చుట్టూ ఉన్న ఈగల రొద కన్నా ఎక్కువగా మా అమ్మ చెవిలో సొద పెడుతూ.

అమ్మ - మరి నాకు అమ్మ కదా!

నేను మాట్లాడేది వింటూనే -"అలాక్కాదు లల్లీ! ఇది చాలా మంచి కాలేజ్. మంచి మార్కులొచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తారు. పైగా పప్పి, కుట్టి కూడా ఇక్కడే హైస్కూల్లో చేరారు. ఆ జేకేసీ చాలా దూరం. నిన్నక్కడ చేరిస్తే సాయంత్రం నువ్వు ఇంటికొచ్చే దాకా నాకు బెంగగా ఉంటుంది. ముందిక్కడ చేరు. ఓ ఏడాది చూద్దాం. నీకు నచ్చకపోతే అప్పుడే జేకేసీకి వెళ్దూగానివి, సరేనా?!" అంటూ నేను మాట్లాడిన దానికి దీటుగా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది.

ఇంకేం చేస్తాను? మొహం చిట్లించుకుంటూనే - నా ఎదురుగా - నాలాగే ఓ ఫైల్ పట్టుకుని వాళ్ళమ్మగారితో నించున్న ఓ అమ్మాయిని చూశాను.

Off White రంగు మీద ఆకుపచ్చ అల్లిబిల్లి పూలు-లతల డిజైన్ ఉన్న కాటన్ చుడీదార్, దాని మీద అదే రంగూ-డిజైన్లతో ఉన్న చున్నీ వేసుకుని, కాళ్ళకి హవాయి చెప్పులు వేసుకుని ఉంది తను.

అప్పుడు నేనూ హవాయి చెప్పులే వేసుకుని ఉన్నాను. కానీ నేను వేసుకుంది పరికిణీ కదా - ఏ చెప్పులేసుకున్నా  ఫర్లేదు. ఆ అమ్మాయి చుడీదార్ మీద హవాయి చెప్పులు వేసుకుంది. అదీ నాకు నచ్చనిది.

"హుఁ ! ఇదిగో ఇల్లాంటి ఫేషన్ తెలీనివాళ్ళతో చదవాలి ఈ బండ్లమూడి హనుమాయమ్మలో చేరితే. అసలెవరైనా చుడీదార్ మీద హవాయి చెప్పులు వేసుకుంటారా? అసలీ కాలేజ్ పేరే బాలేదు - బండ్లమూడి హనుమాయమ్మట - బండ్లమూడి హనుమాయమ్మ." - నాకేం చెయ్యాలో తోచని చిరాకుతో - ఏవేవో రకరకాల అసహనాలతో - అర్థమే లేని ఆలోచనలతో - నాలో నేనే పళ్ళు కొరికేసుకున్నాను. ఇహ ఆ చుడీదార్ అమ్మాయి కేసే చూడకుండా ఇంకెటో చూస్తూ నించున్నాను.

సరే! నా పళ్ళు కొరుక్కున్నా, నా కాళ్ళు నేనే తొక్కుకున్నా - BH ఆఫీస్ వాళ్ళు నా మార్కులు చూసి నాక్కావాల్సిన MPC లో సీటు ఇచ్చేసి, ఫీజు కూడా కట్టించేసుకున్నారు. రోజూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదింటిదాకా ఇంటర్మీడియట్ క్లాసులు జరుగుతాయి - ఆగస్టు ఆరు నుంచి కాలేజ్ కొచ్చెయ్యి అని చెప్పారు.

ఆఫీస్ రూం దాటగానే కుడివైపున్న వరండాలో మొట్టమొదటి గదే మా క్లాస్. అందులో MPC, BiPC గ్రూపులు రెండిటి నుంచి అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-డీటెయిల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి కామన్ సబ్జక్ట్స్ క్లాసెస్ మాత్రం ఆ గదిలో జరిగేవి. 

మొదటి రోజు కాలేజ్ కెళ్ళిన నాకు - మొదటి బెంచులో సీట్ దొరకలేదు. ఎక్కడో నాలుగో బెంచ్ మధ్యలో - ఇటు లక్ష్మీ ప్రసన్న అనే MPC అమ్మాయికీ, అటు బీనా అనే BiPC అమ్మాయికి మధ్యలో - కూర్చున్నాను.

నా ముందు రెండు బెంచీలకి అవతల ఆ చుడీదార్-హవాయి చెప్పుల అమ్మాయి కనిపించింది.  క్లాసులో చాలా మంది అమ్మాయిలు - తనని చూడగానే - "హాయ్ K. R. అపర్ణా!" అని పలకరిస్తూ మాట్లాడుతున్నారు. నా పక్కనున్న బీనా కూడా ఆ అపర్ణతో మాట్లాడి, నాకేసి తిరిగి "Aparna studied in Brodiepet Bal Kuteer. I went to Syamala Nagar branch" అంది. నాకేమో అసలు ఆ బాలకుటీర్ అంటే ఏంటో అర్థం కాలేదు. కాకపోతే అమ్మాయిలతో అంత కిక్కిరిసి ఉన్న క్లాస్ వాతావరణం నాకు కొత్త కావడంతో అసలు నాతో ఎవరేమంటున్నారో, నేనేం వింటున్నానో అంతా చాలా గజిబిజిగా అనిపించి నిశ్శబ్దంగా చుట్టూ చూస్తూ కూర్చున్నాను.

BH లో చేరిన మొదటి రెండ్రోజులు చాలా uneventful గా గడిచిపోయాయి.

మూడో రోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు.

ఆ రోజు ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాల్సిన యశోధరా మేడంసెలవు పెట్టారు. వరండాలో తిరుగుతుండే అమ్మాయిలని అదిలిస్తూ తిరిగే వరండా-ప్రిన్సిపాల్ వీరాస్వామి మా క్లాసులోకొచ్చి "అమ్మాయిలూ... మీకివ్వాళ క్లాస్ లేదు. గొడవ చెయ్యకుండా గ్రౌండుకెళ్లి ఆడుకోండి. స్పోర్ట్స్ రూంకి వెళ్ళి మీక్కావల్సిన బేట్లూ, బంతులూ పట్టుకెళ్ళండి. క్లాసురూంలో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు" అని గట్టిగా చెప్పాడు.

క్లాసులో ఉన్న అమ్మాయిలందరూ - అప్పటి వరకు కుదురుగా కట్టి ఉంచిన దారం ముడి సడలగానే నేలకి జారి ఘల్లుఘల్లుమనే మువ్వల్లాగా - గలగలా మాట్లాడుకుంటూ జట్లుజట్లుగా ప్లే గ్రౌండ్ వైపు వెళ్ళిపోయారు.

వాళ్ళల్లో వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు బాగానే తెలుసు గుంటూరు లోనే ఏదో ఒక స్కూల్లో చదివి ఉండడం వల్ల. అప్పటి వరకు టంగుటూరులో చదువుకుని ఆ ఏడాదే గుంటూరు వచ్చిన నాకేమో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలీదు.

 నిజానికి చిన్నప్పట్నుంచి నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం వల్ల నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే - నాకు ఎక్కడికక్కడ మాట కలుపుకోవడం, నాతో కలిసి చదువుతున్న అందరితో ఒకే లాగా మాట్లాడుతూ - ఎవరెలా ఏం మాట్లాడినా - ఎవరి ప్రభావం నా మీద పడకుండా నేను నేనుగా ఉంటూ - ఎవరితో నేను మాట్లాడితే వాళ్ళకే నేను ఫ్రెండేమో అనిపించేలా ఉండడం - అలవాటు అయింది. దాంతో ఏ కొత్త వాతావరణం లోకి వెళ్ళినా తొందరగానే కలిసిపోయేదాన్ని.

కాకపోతే ఈ కొత్తగా చేరిన అమ్మాయిల కాలేజులో మిగిలిన అమ్మాయిలందరూ - ఎవరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో వాళ్ళలో వాళ్ళు తప్ప - కొత్తగా వచ్చిన నాతో మాట్లాడడానికి అంతగా ఉత్సాహ పడలేదు.

నా అంతట నేను పలకరించినా, నేనడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు తిరిగి మాట్లాడేసుకుంటూ ఉండేవాళ్ళు.

ఇంతలో కొంతమంది అమ్మాయిలు స్పోర్ట్స్ రూం వైపు వెళ్దామనుకోవడం విని, ఏం చేయాలో తోచని నేను వాళ్ళతో వెళ్ళాలని అనుకోకపోయినా - వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాను. తీరా స్పోర్ట్స్ రూంకి వెళ్ళాక వాళ్ళందరూ కావాల్సిన షటిల్ రేకెట్స్, షటిల్ కాక్స్ పట్టుకుని వెళ్ళిపోయారు.

నాకైతే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ స్పోర్ట్స్ రూమ్ పక్కనే అటూఇటూ హడావిడిగా తిరుగుతున్న వేరే క్లాసుల అమ్మాయిలని చూస్తూ నించున్నాను.

ఇంతలో 'KR అపర్ణ' అని అందరూ పలకరిస్తున్న అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు తను ఒక తెల్ల frock వేసుకుని, రెండు జళ్ళు వేసుకుని ఉంది.

వస్తూనే నాకేసి భలే friendly గా చూసి నవ్వి "Hi! My name is Aparna Raghunath. What's yours?" అంది.

నేను మొహమాటంగా నవ్వుతూ "లలిత" అన్నాను.

"లలితా! రింగ్ బాల్ ఆడదామా?" అంది.

నా కళ్ళు ఒకసారి వెలిగాయి - భలే భలే - నన్ను పలకరించడమే కాకుండా - నన్ను తనతో ఆడడానికి రమ్మంటోంది.

నోరంతా తెరిచి నవ్వుతూ - ఓ! - అన్నాను.

ఇద్దరం కలిసి ఓ రింగ్ తీసుకుని గ్రౌండు లోకి వెళ్ళాము.

ఓ చోట నించుని ఒకరికొకరం రింగ్ విసురుకుంటూ ఆడుకుంటూ - ఒకరి గురించి ఒకరం బోల్డన్ని ప్రశ్నలేసుకుంటూ - సమాధానాలు చెప్పుకుంటూ - ఆ మాటల్లోనే - మేమిద్దరం ఒకే నెలలో - తను నాకన్నా మూడ్రోజుల ముందు - పుట్టామని తెలుసుకున్నాక - మేమిద్దరమూ Virgos అని తెలిశాక - మా మధ్య affinity - మాట మాటకీ పెరుగుతున్నట్టు మా ఇద్దరికీ తెలుస్తోంది.

"నీ పేర్లో KR అంటే ఏంటి? మరి నీ పేరు చివర రఘునాథ్ అంటే ఏంటి?" కొంచెం different గా అనిపిస్తున్న తన పేరు గురించి నాకున్న సందేహాలు.

"KR అంటే కొడిగెనహళ్ళి రఘునాథ్ అపర్ణ. కొడిగెనహళ్ళి మా ఇంటి పేరు, రఘునాథ్ మా డేడీ పేరు. నేను నా పేరు అపర్ణా రఘునాథ్ అని రాసుకుంటాను. మరి నీ పూర్తి పేరు ఏంటి? Just లలితేనా?"

"నా పేరు లలితాత్రిపురసుందరి. మా ఇంటిపేరు వడ్లమాని. నా పేరు కొంచెం పొడుగు కదా - అందుకని నాకు లలితా TS వడ్లమాని అని రాసుకోవడం ఇష్టం - అచ్చు మా సుబ్బారావు పెదనాన్న రాసుకుంటారే SR అయసోల అనీ ?! -  అలాగ!" అంటూనే "అవునూ! నీ White Frock చాలా బావుంది. ఎక్కడ కొనుక్కున్నావ్?" నాకు చాలా నచ్చిన తన గౌను గురించి అడిగాను.

"ఇది మా రత్నాంటీ జెర్మనీ నుంచి తెచ్చారు. నాకో కజిన్ కూడా ఉంది. హేమ - రత్నాంటీ'స్ డాటర్." తన సమాధానం.

ఇలా మా పేర్ల గురించి, పేర్ల వెనకాల పెద్దల గురించి, siblings, cousins గురించి, మా ఇష్టాలు, hobbies - ఇలా అవీ-ఇవీ అని లేకుండా అన్నీ మాట్లాడేసుకుంటూ ఉన్నాం.

అప్పుడే చెప్పింది - శ్రీశ్రీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయికవితల పోటీలో తనకి మొదటి బహుమతి వచ్చిందని, అది తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళొచ్చానని. నాకు అంత గొప్ప ప్రైజ్ వచ్చిన అమ్మాయి తెలియడం భలే గొప్పగా అనిపించింది.

(ఆ తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆ బహుమతితో భాగంగా తనకి ఇచ్చిన శ్రీరంగం రాజేశ్వర రావు గారి ఎఱ్ఱచీర కథా సంకలనం నాకు చదవమని ఇచ్చింది.)

అంతలో - ఇద్దరం ఒక్కసారిగా - ఒకళ్ళనొకళ్ళం - "నీ best friend ఎవరు?" అని అడుగుకున్నాం.


అప్పుడే ఇద్దరం - "ఇవాళ్టి నుంచి మనిద్దరం Best Friends. ఇవాళ ఆగస్టు ఎయిత్. ఇప్పట్నించీ ఇది మన ఫ్రెండ్షిప్ డే. "అనుకున్నాం.

అలా అనుకుంటూ ఉండగానే - అపర్ణకి చెప్పాను - ఫ్రెండ్షిప్ మీద నాకొక మంచి పాట వచ్చని - అది తన కోసం పాడతానని... అంటూనే పాడేశా "స్నేహబంధమూ...ఎంత మధురమూ... చెరిగిపోదు... తరిగిపోదు.... జీవితాంతము...ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో - ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో " - అంటూ.

అది పాడాక, ఆ పాట తనకి నచ్చాక - నేను తనని మొదట చూసినప్పుడు తన డ్రెస్సు, హవాయి స్లిప్పర్స్ చూసి ఏమనుకున్నానో కూడా చెప్పేశాను - మరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య రహస్యాలు ఉండకూడదు కదా!

అలా మొదలు.... "Two is a company - Company is important for each other !" అన్న motto తో మా స్నేహం!



ఆ రోజు నుంచి అంతకు ముందు నాకు అస్సలు నచ్చని బండ్లమూడి హనుమాయమ్మ పేరు కూడా నచ్చేసింది.

అప్పుడే ఇంకోటి కూడా అనుకున్నాము - ఆ తర్వాతి రోజు నుంచి First bench - first two seats మావి మాత్రమే అని. దాని కోసం పన్నెండున్నరకి మొదలయ్యే కాలేజ్‌కి పొద్దున్నే పదిన్నరకల్లా వెళ్ళిపోయేదాన్ని. Morning shift లో జరుగుతూ పన్నెండు గంటలకి పూర్తవ్వాల్సిన డిగ్రీ క్లాసులు ఒక్కోసారి పదకొండూ-పదకొండున్నరకల్లా అయిపోయేవి మరి!

ఇంట్లో అమ్మ కూడా నా కోసం గబగబా వంట చేసేసి నన్ను పంపించేసేది. ఆవిడకి బాగా తెలుసు - నాకు కావాలీ అని పట్టించుకున్నది ఏదైనా నన్ను చెయ్యనిస్తేనే - నేను ఆలపించే అమృతవర్షిణి రాగం బారిన పడకుండా వుండే సౌలభ్యమూ, సుఖమూ కూడానని.

సరే! అలా పదిన్నరకల్లా కాలేజ్ చేరే నేను - వెళ్ళి మా క్లాసుకి ఎదురుగుండా ఉన్న చిన్న తోటలో - బండ్లమూడి హనుమాయమ్మగారి విగ్రహం కింద మెట్టు మీద కూర్చుని - డిగ్రీ క్లాస్ ఎప్పుడు అయిపోతుందా? ఆ అమ్మాయిలు ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళ క్లాస్ అయిపోయి బయటికి రాగానే - గబగబా లోపలికి వెళ్ళి - మొదటి బెంచులో - మొదటి రెండు స్థానాల్లో డెస్క్ మీద రెండు పుస్తకాలు పెట్టి - అప్పుడు BH కాలేజ్ వెనక సందులో వేంకటేశ్వర బాలకుటీర్ పక్కనే ఉన్న అపర్ణ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని.

అక్కడ ఆంటీ "నువ్వు ఇంట్లో ఎంత తినొచ్చుంటావో నాకు తెలుసు - మళ్ళీ నేను పెట్టింది తినాల్సిందే" అని అపర్ణతో పాటు నాకు అన్నం కలిపి ఇచ్చేవారు. అది తిని మేమిద్దరం క్లాసుకి వెళ్ళేవాళ్ళం.

మొదటి సీటులో అపర్ణ, తన పక్కనే నేను - కూర్చుని - మేము రాసే నోట్స్ కూడా - రాసే లైనులో ఏ మాటతో మొదలు పెడతామో, ఏ మాటతో ముగిస్తామో - ఇద్దరివి అచ్చంగా ఒకేలా ఉండేవి.

అప్పట్నుంచి - మా రాతలో పదాలు, బాటలో పాదాలు - ఒకే రీతి, ఒకే లయ.
అప్పట్నుంచి - మేమిద్దరం గుంటూరులో కలిసి (BH లో ఇంటర్ + ఏసీ కాలేజ్‌లో డిగ్రీ) చదువుకున్న ఐదేళ్ళూ  - ప్రతిరోజూ, ప్రతి నిముషం మాతో మేమిద్దరమే ఉన్నాం. నాకు అపర్ణ తప్ప వేరే ఫ్రెండ్ ఎవరూ లేరు.

యశోధరా మేడం చెప్పిన O. Henry రాసిన After 20 years కథ పాఠం విన్నాక బండ్లమూడి హనుమాయమ్మ గారి విగ్రహం దగ్గర మట్టి తవ్వి రూపాయి నాణేలు పాతిపెట్టి  -  ఓ ఇరవై ఏళ్ళ తర్వాత వెళ్ళి అవి ఉన్నాయో లేదో చూద్దామని అనుకున్నది మేమిద్దరమే!

యశోధరా మేడం డైరెక్ట్ చేసిన A Pound of Flesh (based on Shakespeare's drama TheMerchant of Venice) లో అపర్ణ పోర్షియా, నేను నెరిస్సాగా act చేశాం.

గాయత్రీ మేడం Guy De Maupassant రాసిన The Chair Mender కథ పాఠం చెప్తూ చెప్తూ - ఆవిడ ఫేవరెట్ హీరో శోభన్ బాబు సినిమాల ఉదాహరణాల్లోకి వెళ్ళిపోయినప్పుడు - ఆవిడ చూడకుండా రహస్యంగా మాలో మేమే కిసుక్కుమన్న girly girly giggles మా ఇద్దరివే!

అపర్ణ వాళ్ళింట్లో తనకో రూం ఉండేది. ఒక చిన్నమంచం మాత్రం పట్టి - బయటి వైపుకి ఉన్న ఒకే ఒక కిటికీ మీదుగా సన్నజాజి తీగ పాకి ఉండే ఆ చిన్నగది అంటే నాకు బోల్డంత ఇష్టం. ఆ గది లోనే ఫైనల్ ఎగ్జామ్స్ కోసమని కంబైన్డ్ స్టడీ చేద్దామని కూర్చుని, చేస్తున్న ఫిజిక్స్ థీరమ్స్ తో పాటు - ఇంకో పక్క  దేవులపల్లి కవితలు, Anne of Green Gables కథలూ - చదువుకున్నది మేమే!

నవోదయాలో కొనుక్కున్న తెల్ల కాయితాలు పుస్తకంలో - మాథ్స్ చేస్తూ పక్కన మార్జిన్లో హిందీ పాటలు రాసుకున్నది మేమే!

వేసవిలో పవర్-కట్ రోజుల్లో - వాళ్ళింటి ముందున్న బాలకుటీర్ గోడ మీంచి ఇవతలకి వాలి ఉన్న గోరింటాకు పూల వాసన పీలుస్తూ మౌసమ్ హై ఆషికానా ... ఆజావో మై బనాదూ పలకోం కా శామియానా అని పాడుకుంటూ - మెరిసిన starry-eyes మావే!

సంక్రాంతి నెల పట్టగానే నేర్చుకున్న కొత్త ముగ్గులు వాకిళ్ళలో వేసుకుని - అవి చూడడానికి రాత్రి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి వచ్చిందీ మేమే!

నవోదయాలో తెలుగు పుస్తకాలు కొనుక్కోవాలన్నా - ఏసీ కాలేజ్ సెంటెనరీ జరుగుతున్నప్పుడు మా కలెక్షన్ కోసం స్టాంపులు కొనుక్కోవాలన్నా - మా పప్పి పుట్టినరోజుకి దానికిష్టమైన గులాబీ మొక్క surprise gift కొనడానికి ఏసీ కాలేజ్ ముందున్న నర్సరీకి వెళ్ళాలన్నా - ఏసీ కాలేజులో లంచ్ చెయ్యగానే నాజ్ సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళి  అక్కడున్న Florist షాపులో బొకేలు window-shopping చేసి రావాలన్నా - ట్యూషన్లకి వెళ్తున్నా - రిక్షాపై టాప్ తీసేసి ఏసీ కాలేజ్‌కి వెళ్ళే దారిలో వచ్చే ఓవర్ బ్రిడ్జ్ వాలులో జోరుగా జారుతున్న రిక్షాలో - మొహానికి తగులుతున్న గాలికి ఇంకొంచెం పెరిగిన హుషారులో పకపకలాడాలన్నా - పుట్టిన రోజులకి ముందే అనుకుని ఎవరికి నచ్చినవి వాళ్ళు ముందే చెప్పుకుని  ఒకళ్ళకొకళ్ళం gifts కొనుక్కున్నా - Royal Ice Creams కి వెళ్ళి బాదంఖీర్ తాగాలన్నా - డిగ్రీ అయిపోయాక PG చేయడానికి యూనివర్సిటీలకి అప్లికేషన్లు పెట్టాలన్నా - ఏం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా - మేమిద్దరమే! నాకు గుర్తుండి డిగ్రీ మొదటి ఏడాదిలో ఒకసారి మాత్రం అపర్ణ లేకుండా నేను, ఇంకోరోజు నేను లేకుండా అపర్ణ  ఏసీ కాలేజ్‌కి వెళ్ళాం అంతే!

డిగ్రీ అయ్యాక - కొండల కోనల తిరుపతిలో నేనూ, కోటల తోటల మైసూరులో తనూ చదువుకున్నా - పెళ్ళిళ్ళయ్యాక - మళ్ళీ ఇద్దరం బెంగుళూరు చేరాం.

ఆ తర్వాత అనుకోకుండా- చెరో చోటయ్యాము కానీ - ఈ దూరాలు మా మధ్య పేరుకే కానీ మా మాటల-పేరుకి అడ్డమే కాలేదు.

ఇప్పటికీ ఓ రెండు సార్లైనా పలకరించుకుని - ఒకప్పుడు తిరిగిన దారులని గుర్తు చేసుకోందే వారం గడవదు మాకు.

ఇప్పటికీ ఇండియా వెళ్తే - ఒక వేళ నేను బెంగుళూరు వెళ్తే సరే సరి - లేకపోతే నేనెక్కడ ఉంటే అక్కడికి వచ్చి నాతో ఓ రెండ్రోజులు గడిపివెళ్తుంది అపర్ణ.

ఇప్పటికీ - నాకిష్టమని - ఎఱ్ఱెఱ్ఱని పూల కాశీరత్నాలని, లేతగులాబీరంగు బఠాణీ పూలని బెంగుళూరులో తనింట్లోని తోటలో పెంచుతోంది అపర్ణ.

ఎన్ని చెప్పుకున్నా - చెప్పుకున్న కొద్దీ ఊరే కబుర్లు
ఎంత నవ్వుకున్నా - నవ్వుకున్న కొద్దీ మీఱే నవ్వులు
రాశి పోసుకున్న ఆ కబుర్లు - పూలు పూసినట్లాయే నవ్వులు
చెప్పుకుంటూ - నవ్వుకుంటూ -
ఒకరికొకరం - ఎప్పటినుంచో - ఇంకుతో రాసుకోకపోయినా - synch లో ఉంచుకున్న Walking డైరీలం!

అందుకే...
అప్పడూ... ఒకే పాట పలికింది వేరువేరు గొంతుల్లో...
అప్పటినుంచి ఇప్పటిదాకా... ఒకే పాట పలుకుతోంది వేరు వేరు గొంతుల్లో...
ఇప్పటి నుంచి ఎప్పటికైనా... ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గొంతుల్లో...

26, జులై 2020, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 5 - ఈ తీయని రేయి... రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...

ఆటలాడే చిన్నతనాన - కాలాన్ని బట్టి - తాటాకుబొమ్మలకు బొమ్మగుడ్డలు చుడుతూనో, లక్కపిడతల్లో అన్నాలు వండి వారుస్తూనో, కాయితప్పడవలు మండువా నీళ్ళలో ఒదులుతూనో - ఆడుకుంటూ వున్నా - ఒక చెవి ఎప్పుడూ రేడియోలో వచ్చే పాటల మీద ఉండేది.

ఆ పాటలేంటో, వాటి అర్థాలేంటో అస్సలు తెలీకపోయినా - ఇంట్లో ఎవరో ఒకరు ఆ రేడియోతో గొంతు కలిపి పాడడం, అవి వింటూ ఆడుకోవడం బావుండేది.

అలా విన్న కొన్నికొన్ని పాటలు - ఆ విన్ననాడు అవేంటో తెలీకపోయినా - లీలగా గుర్తుండిపోయాయి.

అలా అలా గాలిఅలల్లా గుర్తున్న ఆ పాటలు - ఒకటి రెండు పదాలు గానో, తీయలేని కూనిరాగాలు గానో మాత్రమే గుర్తుండి తెగ సతాయిస్తాయి ఇప్పటికీ నన్ను.

అవే పాటలు - అనుకోకుండా కనపడి తారసపడి పలకరించే నేస్తాల్లా - ఆదమరపు వేళల్లో వినిపిస్తాయి.

అలాంటి ఒక పాట - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ...  

దాదాపు ఏడేళ్ళ క్రితం - అమ్మా-నాన్నా, అత్తయ్య ఉన్నారని - వాళ్ళకి కాలక్షేపంగా ఉంటుందని - ఏడాది చందా కట్టి తీసుకుని - వాళ్ళు ఇండియాకి తిరిగి వెళ్ళిపోయాక, తగులూ-మిగులుగా మిగిలున్న Yupp TV Subscription లో - ఆ టీవీవాళ్ళు చూపెట్టిన సినిమాలు చూడలేక - మేము చూద్దామనుకున్న సినిమాలు వాళ్ళు సరిగ్గా చూపెట్టలేక - ఇక చూడడానికి ఏమీ లేక - అప్పుడప్పుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కనిపించకుండా, వినిపించే ఆడియో ఛానెల్ ఒకటి వినేదాన్ని. అందులో ఎప్పుడు విన్నా - ఏదో కేసెట్ లోంచి వస్తున్నట్టుగా - ఒకే వరసలో వచ్చిన పాటలే మళ్ళీ వస్తూ ఉండేవి.

అందులో మొట్టమొదటి పాటే - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... అన్న యుగళగీతం. అందులో male-గళం మహా-మేలు-గళమైన ఎస్పీబీది అని తెలుస్తూనే ఉంది కానీ రికార్డింగ్ స్పష్టంగా లేని ఆ ఆడియోలో కొంచెం feeble గా వినిపిస్తున్న female-గళం ఎవరిదో అర్థం కాలేదు.

కానీ ఆ పాట వినీవినగానే భలే సంతోషమేసింది.

అప్పటిదాకా ఈ ఆహహ  ఆహ  అహఆహహ  ఆహ్హా... అంటూ నేను చేసే అఅహా-కారాలు భరిస్తున్న ఇంట్లోని వాళ్ళందరూ "హమ్మయ్య - పాటేదో దొరికిందిగా - ఈ ఆహా-కారాలు వినే పాట్లు తప్పుతాయి మనకి - ఉష్షూ..." అని ఊపిరి పీల్చుకున్నారు.

ఆ పాటేదో రాసుకోవాలీ, ఆ తర్వాత పాడుకోవాలీ అనుకుంటూనే ఉన్నాను - ఈలోగా Yupp TV చందా ముగిసిపోయింది. ఆచూకీ చిక్కిందనుకున్న పాట ఓ నాలుగైదు మాటలుగా మాత్రం మిగిలిపోయింది. అప్పుడే నేనడిగానని "ఆపాత మధురాలు" బ్లాగర్ రాజ్యలక్ష్మి గారు తన బ్లాగులో పూర్తి పాటని పోస్ట్ చేశారు కూడా.
కాకపోతే ఆ పాట సినిమాలో ఎలా ఉంటుందో చూడాలనిపించేది.

అప్పట్నుంచీ వెతుకుతూ, వెతుకుతూ ఉంటే - ఇప్పటికి దొరికింది యూట్యూబ్లో - ఈ పాట చిట్టితల్లి అనే సినిమా లోది. పాటే కాకుండా ఆ సినిమా కూడా యూట్యూబ్లో ఉంది. నేను పాట చూసి ఊరుకోవచ్చు కదా! అబ్బే! ఆలా ఊరుకుంటే నేనెందుకవుతాను? ముందు పాట గురించి చెప్పడం పూర్తయ్యాక - అసలా సినిమా ఎందుకు చూశానో చెప్తాను. అది చెప్పాలంటే ఇంకో హిందీ పాట గురించి కూడా చెప్పాలి.

అదీ ... చెప్తా...చెప్తా... ఉండి రాగమవ్వుడి!

ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... పాటని SPB తో పాటు పాడిన వారు జిక్కి. నాకు తెలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - జిక్కి కలిసి హీరో-హీరోయిన్లకి పాడిన పాట ఇదొక్కటే. అలా ఇదొక అపురూప యుగళగీతం. సంగీతం విజయా కృష్ణమూర్తి. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు పాటలు రాసిన వారు ఇద్దరు - సి. నారాయణరెడ్డి, జి. కె. మూర్తి. వీళ్ళిద్దరిలో ఈ పాట ఎవరు రాశారో నాకు తెలీలేదు.  

ఈ పాటలో నటించిన వారు - హరనాథ్, భారతి. సినిమాలో మాత్రం ఈ పాట వచ్చే సందర్భం మహా అసందర్భం.

ఆ అసందర్భ-సందర్భం ఎలాంటిదో చెప్పాలంటే టూకీగా సినిమా కథ కనీసం పాట వరకైనా చెప్పాలి... వినుకోండి మరి... 
అనగనగా ఒక భార్య ఫోటోకి దండేసిన హీరో - అందం కొంచెం మందమైన హరనాథ్. హీరోకి ఓ ఐదేళ్ళ పాప, కూతురు పోయిందని పిచ్చివాడైన మామగారు. ఆ హీరో గారి పాపకో టీచర్ హీరోయిన్ - చిన్నద కన్నడ (ಚಿನ್ನದ ಕನ್ನಡ) చిన్నది భారతి.


ఓ రోజు భారతి ఎక్కడో నడిచి వెళ్తుంటే త్యాగరాజు వస్తాడు. తనని పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తాడు.

ఇంతలో అదే చోటుకి bat ఊపుకుంటూ వచ్చిన హీరో-హరనాథ్ హీరోయిన్-భారతిని బలవంతం చేస్తున్నవిలన్-త్యాగరాజుని bat పెట్టి బాదేస్తాడు.

ఈలోగా హీరో-హీరోయిన్లని చూడడానికి అన్నట్టు ఆకాశంలో మబ్బులన్నీ ఓ చోటికి పరిగెట్టుకొచ్చి. పెద్దపెద్ద ఉరుములొచ్చి వర్షం కురిసేస్తుంది.

ఇంతలో సీను మారి - ఓ చిన్న ఇల్లు, దానికో కిటికీ, కిటికీ కవతల కురుస్తున్న వర్షం, ఆ కిటికీని మూస్తూ ఉన్న పిచ్చివాడైన హీరో మామగారు.

కిటికీని మూస్తున్న ఆయన ఎందుకో వెనక్కి తిరిగి "అయ్యో! వర్షంలో తడిసి పోయారా ఇద్దరూ?" అంటూ ఉంటాడు కానీ అక్కడ ఏ ఇద్దరున్నారో ఆయనకే ఎరుక. మనకి మాత్రం ఎవ్వరూ కనిపించరు.

అంతలోనే ఆ మామగారు "అమ్మా! బాగా తడిసిపోయావు. ఆ గదిలో నా కూతురు జానకికి ఎంతో ఇష్టమైన చీర ఉంది. కట్టుకో" అంటాడు.

ఆ తర్వాత సీనులో - ఓ టిక్లీల చీర కట్టుకుని ముసుగేసుక్కూర్చున్న భారతి, పక్కనే మెరుపంచుల చొక్కా వేసుకుని ఇంకో కిటికీ మూస్తున్న హరనాథ్ - ఈ తీయని రేయి తెలవారుటె మానీ ... అంటూ కళాత్మకంగా పేనిన సాలెగూళ్ళ మధ్య పాట పాడేసుకుంటారు. పాట చివర్లో హరనాథ్‌ని త్యాగరాజు వెనక నుంచి వచ్చి కత్తితో పొడుస్తాడు. భారతి కెవ్వుమంటుంది.

కానీ ఆ కెవ్వుమన్న భారతి హరనాథ్ ఇంట్లో పాపకి పాఠం చెప్తూ ఉంటూ - ఆ పాఠం మధ్యలో ఈ పాటని కలలా కని - ఆ కలలో కత్తిపోటు నిజమనుకుని - ఆ కాలనీ తల్చుకుని - ఈ ఇలలో కెవ్వుమంటుంది. కానీ అలా కల కనడం అసలు అతికినట్టే లేదు అక్కడ.

అసలా కలేంటో - ఆ కలలో ఆ కురవని వర్షం ఏంటో - వాళ్ళు ఓ ఇంటికెళ్లడమేంటో - ఆ ఇంట్లో ఆ పిచ్చి మామగారుండమేంటో - ఆయన తన అల్లుడితో వచ్చిన అమ్మాయిని తన కూతురి చీర కట్టుకోమని వాళ్ళిద్దరినీ తన ఇంట్లో పాట పాడుకోనివ్వడమేంటో - అక్కడికి దుష్ట-త్యాగరాజు రావడమేంటో - ఆ కత్తి పోటేంటో - కల లోని కత్తిపోటుకి ఇలలోని కెవ్వుమని కేకేంటో ....

అసలు నేనేంటో - ఒక్క పాట నచ్చిందని ఆ పాట పట్టుకుని సినిమా చూడకూడదని ఇప్పటికి ఎన్నోసార్లు సినిమా-దెబ్బలు తగిలినా - అది గుర్తు లేనట్లు మళ్ళీ ఈ సినిమా చూడడమేంటో... ఇది కలయో, నిజమో, అస్తవ్యస్తపు-అతికింపుల సినీ-మాయో!

(అన్నట్టు ఈ తీయని రేయి... పాటలో భారతి హెయిర్ స్టైల్ చూస్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్లకి అలాంటి హెయిర్-స్టైల్ ఉండేది. ఇలా ఏవో సినిమాలు చూసొచ్చాక మా నాన్నమ్మని నాకూ అలాంటి జడ వెయ్యమని తెగ విసిగించేదాన్ని. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి పడుకున్నప్పడు - నాన్నమ్మ కటకటాల్లో ఉయ్యాల బల్ల పక్కనే స్తంభం దగ్గర కూర్చుని - కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. నేనప్పుడు ఓ దువ్వెన పట్టుకెళ్ళి ఆ హీరోయిన్ లాంటి హెయిర్-స్టైల్ కావాలని పేచీ పెట్టేదాన్ని. దాంతో ఆవిడ నాకు ఓ పది జడలు అల్లి ఓ పురికొసతో పైకి కట్టేవాళ్ళు. పురికొస ఎందుకంటే మరి హీరోయిన్ జడలో రిబ్బన్లు ఏమీ కనపడవు కదా! అందుకని నేను రిబ్బన్ పెట్టి కట్టడానికి ఒప్పుకునేదాన్ని కాను. రిబ్బన్ పెడితే అది నచ్చక వేసిన పది జడలూ విప్పేశానని - నా బాధ పడలేక పురికొసతో - జడ చివర్లు అన్నీ కలిపి - అది కనిపించకుండా పైకి దోపి - ఓపిగ్గా నా ముచ్చట తీర్చారు మా నాన్నమ్మ.)

ఏమాటకామాట చెప్పుకోవాలి - రెండో సారి నీ లేడి కన్నుల లోనా... నీ లేత వన్నెల లోనా..., నీ నడక సొంపుల లోనా... లేనడుము ఒంపుల లోనా...అన్న లైన్లు పాడేటప్పుడు వంపులు తిరిగి, వన్నెలీనిన SPB గొంతు వినాల్సిందే. జిక్కి గొంతు కూడా చాలా మెత్తగా వినిపిస్తుంది ఈ పాటలో. 

ఈ కిందున్న పాటని చూస్తూ పాడేసుకోండి... మరి!  


 ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ

ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ


నీ లేడి కన్నుల లోనా - నీ లేత వన్నెల లోనా...
నీ లేడి కన్నుల లోనా... నీ లేత వన్నెల లోనా...
తీరైన లోకాలన్నీ - తిలకించనీ... తిలకించనీ...


మరుమల్లె మాలికనోయీ  ...మరులున్న బాలికనోయీ
మురిపించు మురళిని నేనై - వినిపించనీ... వినిపించనీ...


ఊ!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ

నీ నడక సొంపుల లోనా - లేనడుము ఒంపుల లోనా...
నీ నడక సొంపుల లోనా... లేనడుము ఒంపుల లోనా...
ఎనలేని వయ్యారాలు - కనిపించనీ... కనిపించనీ...


నీ హృదయ సీమను చేరీ... నీ పెదవి నవ్వుగ మారీ
అందాల ఆనందాలు అందించనీ... అందించనీ...


అహా!
ఈ తీయని రేయి తెలవారుటె మానీ - ఇలా నిలిచి కవ్వించనీ

****************
****************

ఇందాక చిట్టితల్లి సిన్మాలో "ఈ తీయని రేయి తెల్లవారుటె మానీ ..." పాట గురించి చెప్తూ - ఆ పాటున్న సినిమా చూసే పాట్లు ఎందుకు పడ్డానో ఆనక చెప్తానూ అన్నాను కదా! 

అదెందుకంటే - దానికో చిన్న కథుంది.

మా ఇంట్లో వారానికో రెండు సార్లైనా బదరి, నేనూ వినే పాట ఒకటుంది. అది ఏంటంటే... రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...

పాట అద్భుతంగా పాడింది ఎవరంటే రవంలో రాగాలు రసరమ్యంగా రవళించు రఫీ - లతా. 
పాటకి ఆడింది - రాజేంద్ర కుమార్ - బబిత.
పాట రాసింది - ఆనంద్ బక్షీ.
పాట కట్టింది - లక్ష్మీకాంత్-ప్యారేలాల్. 

ఒక fun trivia ఇక్కడ - తెలుగులో మన ఏఎన్నార్ లాగా హిందీలో ట్రాజెడీ కింగ్ రాజేంద్ర కుమార్. 

ఈయన కుమారరత్నం కుమార్ గౌరవ్ అనే ఇంకో హీరో. 

కుమార్ గౌరవ్ మొదటి సినిమా లవ్ స్టోరీ - విజేతా పండిట్ హీరోయిన్ను.

దాన్నే తెలుగులో పెద్ద నరేష్ మొదటి సినిమా ప్రేమ సంకెళ్ళుగా తీశారు. తెలుగులో హీరోయిన్ను హిందీ-వెర్షన్ హీరోయిన్నుకి సరి"తూగే" శ్యామల గౌరి.  

(ప్రేమ సంకెళ్ళు సినిమాలో లో వేటూరి రాసిన మెరుపులా మెరిశావు - వలపులా కలిశావు - కన్ను తెరచి చూసేలోగా నిన్నలలో నిలిచావు పాటలో  నిన్నలలో నిలిచావు అన్న మాటలు నాకు భలే ఇష్టం. ఆ పాటకి హిందీ సందర్భ-కవల యాద్ ఆ రహీ హై - తేరీ యాద్ ఆ రహీ హై పాట కన్నా మన వేటూరి వారి తెలుగు పాట బాగు, బహు-బాగు!)

ఇహ పోతే  - అంజానా సినిమా హీరోయిన్ బబితేమో - రాజ్ కపూర్ కోడలు, రణధీర్ కపూర్ భార్య, కరిష్మా-కరీనా కపూర్ల తల్లి.
సరే! ఈ పాట ప్రతీవారం వింటాము - చూస్తాము కూడానూ. 

చిట్టితల్లి సినిమాలో - ఆ వర్షం, చిన్న ఇల్లు, కిటికీ, లోపల హీరో-హీరోయిన్ల పాట - అవన్నీ చూశాక - "అరె ... ఇదేదో హిందీ రాజేంద్ర కుమార్ రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...పాట సందర్భంలా వుందే!" అనిపించింది. తీరా చూస్తే ఈ రెండు పాటలకి ఉన్న పోలిక - వర్షం, కిటికీ తప్ప ఇంకేమీ కాదు. 

పైగా హిందీ పాటలో బబిత ఒక బాంబే డైయింగ్ దుప్పటో, కర్టెనో కట్టుకుని ఉంటుంది. జుట్టేమో వర్షంలో తడిసి వచ్చినట్టే ఉంటుంది. మన తెలుగు భారతేమో అప్పుడే బ్యూటీ పార్లరుకి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. 

ఈ హిందీ పాటలో చరణాల్లో వాక్యాలు - పొడుగ్గా ఉండి - అక్కడక్కడా తమాషాగా ముక్కలుముక్కలుగా విరుస్తూ పాడతారు రఫీ-లతా. 

ఇది కూడా చూస్తూ, వింటూ - ఆనక చదువుకుంటూ పాడేసుకుంటారని....
ఈ కింద వీడియో, ఆడియో, నా రాతయో ...అవీ-ఇవీ-అన్నీ!






 రిమ్‌ఝిమ్ కే గీత్ - సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
రిమ్‌ఝిమ్ కే గీత్ - సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!

హోఠోం పే - బాత్ దిల్ కీ ఆయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!
ఓ  .... ....  ఓ ... ... 

తేరా మేరా - పూఛే నాతా - బడీ వో - యే ఘటా ఘన్‌ఘోర్ హై...
చుప్ హూ ఐసే - మై  కహ్ దూ  కైసే - మేరా సాజన్ నహీ తూ కోయీ ఔర్ హై?!

కె  - తేరా నామ్  - హోఠోం పే మేరే - తేరే సప్‌నే మేరీ ఆంఖోం మే

కె - రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే... హాయే - భీగీ భీగీ రాతోం మే!

మేరా దిల్ భీ - హై దివానా - తేరే నైనా భీ  హై నాదాన్ సే
కుఛ్ న సోచా - కుఛ్ న దేఖా - కుఛ్ భీ పూఛా న ఇక్ అంజాన్ సే
చల్ పడే - సాథ్ హమ్ కైసే ఐసే - బన్‌కే సాథీ - రాహోం మే!


కె -  రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...  హాయే - భీగీ భీగీ రాతోం మే!

బడీ లంబీ - జీ కీ బాతే - బడీ ఛోటీ యే బర్‌ఖా కీ రాత్ జీ!
కహ్‌నా క్యా హై?  సున్‌నా క్యా హై? కహ్‌నే సున్‌నే కీ అబ్ క్యా హై బాత్ జీ?!
బిన్ కహే - బిన్ సునే - దిల్ నే - దిల్‌సే - కర్ లీ బాతే - బాతోం మే

కె -  రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...  హాయే - భీగీ భీగీ రాతోం మే
రిమ్‌ఝిమ్ కే గీత్ సావన్ గాయే...  హాయే - భీగీ భీగీ రాతోం మే

**************
**************

ఓ పాట పట్టుకుని 
ఆ పాటని తలమీదెట్టుకుని
ఆ పాటనే తలచి తలచి మురిసిపోవడం 
అదే పాటని అందరితో పంచుకోవడం
నాకు  ప్రీతి! నాకు పరిపాటి! 

~ పాటల భైరవి. 

19, జులై 2020, ఆదివారం

త్వామనురజామి - 49 - నన్నూ, తననూ కన్నవాళ్ళకు... కోటి దండాలు... శతకోటి దండాలు...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 48 - నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!

అదేంటో - కదలదేంటో అనుకున్నప్పుడు కాలినడకలా గడిచే కాలం, కాసేపిలా ఉండనీలే అనిపించినప్పుడు వరదగోదారిలా వడివడిగా పరిగెడుతుంది.


నిజ్జంగా... అప్పటిదాకా బదరితో పెళ్ళవ్వాలని ఎంత అనుకున్నానో, తీరా పెళ్ళి ఇంకొన్ని రోజుల్లో అనగా ఆ కొన్ని రోజులూ సాగి - ఒక్కోరోజు ఇరవై నాలుగుగంటల కన్నా - పొడుగ్గా ఉంటే బావుండుననీ అనుకున్నాను.

నేననుకున్నానని ఆగి, ఉన్నచోట నిలిచి నాతో ఉండిపోవడానికి టైము నా చేతికి కట్టుకున్న వాచీ కాదుగా!

పగలూ-రాత్రీ చెట్టపట్టాలు వేసుకుని పట్టపగ్గాల్లేకుండా పరిగెట్టేశాయి.

ఊపిరోసుకున్న తావనీ ... ఉసురందుకున్న వీడనీ 
ఈ తావు ... ఈ వీడు ... వీడలేనని 
వీలుకాని దిగులు మదిని కమ్మె నాకని
బేలనని, బెంగటిల్లినానని
జాలి చూపక - ఎందుకింత పరుగనీ
అడుగుదామని ఆగమన్నా... కాలాన్ని...

సాగుతున్న కాలమాగక... 
ఆగక సాగుటే - తన ఉనికనీ
తను ఆగడమంటే ఆగడమేనని
ఏదేమైనా, తప్పని తన కదలిక కలకాలమని 
తప్పేదే కాదని - కదిలింది కాలం
నా బెంగకు నన్నొదిలి ... తన మానాన్ని... 

ఇంట్లో - ఎంతెంతో కావాల్సినవాళ్ళూ, ఎక్కడెక్కడినించో రావాల్సినవాళ్ళూ - ఒక్కొక్కరుగా బస్సులు, రైళ్ళూ దిగి వస్తూ ఉంటే - పలకరింపులతో, పకపక నవ్వులతో - సందడి ఇంతింతై... అంతంతై ... నవ్వులతో నాలుగింతలై ... పలుకులతో పదింతలైంది. 

అనాతవరం నుంచి అప్ప, లలిత దొడ్డ, కొత్త జంట ప్రసాద్-అరుణ వచ్చారు. అప్ప-దొడ్డ వాళ్ళు వచ్చేటప్పుడు మధుపర్కాలు, అమలాపురం భేరు దగ్గర చేయించిన మంగళసూత్రాలు, వెండి చుట్లు, పెళ్ళికొడుక్కి వెండి ఉత్తర జంధ్యాలు పట్టుకొచ్చారట - "అట" అని అనడమెందుకంటే అవేవీ నేను చూడకూడదని నాకు చూపెట్టలేదు మరి! అప్ప వాళ్ళతో పాటే సోమేశ్వరరావు తాతగారు (విస్సు బాబాయి వాళ్ళ నాన్నగారు) కూడా వచ్చారు. చిలకలూరిపేట నుంచి రవి-శారద, బెంగుళూరు నుంచి శ్రీను-శ్యామల, వరంగల్ నుంచి బాబు వచ్చారు. వైజాగ్ నుంచి లలితత్తయ్య వచ్చారు.

శివకోడు నుంచి చెల్లాయత్త ఒక్కరే వచ్చారు. శివకోడులో వాళ్ళ దగ్గర చదువుకుంటున్న తంబి మామయ్య పిల్లలు కృష్ణ, చైతన్యలకి పరీక్షలని చెప్పి ప్రసాద్ మామయ్య రానేలేదు. చెల్లాయత్త వస్తూ గంధం చెక్క, గుమ్మడిపండు, ముచిక ఉన్న కొబ్బరిబొండం, పీచు తీయించిన కొబ్బరికాయలు, ఆడించిన అటుకులు, కూర అరటికాయలు, మామిడికాయలు - ఇలా బోల్డన్ని పట్టుకొచ్చారు.

హైదరాబాదు నుంచి సాంబశివరావు పెదనాన్న, ప్రభావతి దొడ్డ - చిన్నపాప్పిన్ని - ప్రసాద్ బాబయ్య-జ్యోతి పిన్ని, వాళ్ళ పిల్లలు పండు, పవన్ - పాపాయత్తయ్య గారి రామం, జయాంటీ - కాకినాడ నుంచి సాయక్క-వరదరాజు బావగారు, వాళ్ళ పాప హర్షద -  వచ్చారు. హర్షద, ప్రశాంతి ఇద్దరికీ అమ్మ - గులాబీ రంగు, నీలం రంగుల్లో - ఒకే లాంటి గౌన్లు కొంది.

అన్నట్టు - ఇలా అందరూ వచ్చి ఇంట్లో ఉన్న సమయంలో నాకు మా ఇంటి పక్కనున్న రమణకుమారి ఫోన్ చేసింది. తనతో మాట్లాడుతుంటే - ఆక్కడే ఉన్న మా అమ్మని మా చెల్లాయత్త నెమ్మదిగా అడుగుతున్నారు "అబ్బాయి నుంచా ఫోనూ?" అంటూ. ఆవిడకి మా అమ్మ "పెళ్ళి కుదిరిన దగ్గర్నుంచి వాళ్ళిద్దరూ అసలు మాట్లాడుకోలేదు. ఇక పెళ్ళయ్యాకే ఏ మాటలైనా" అని భలే గొప్పగా చెప్పింది. నాకు మా అమ్మని చూస్తే - ఆవిడకి కష్టంగా అనిపిస్తున్నా - నా ఇష్టం తీరుస్తూనే అందులోనే ఆవిడ ఇష్టాన్ని వెతుక్కుంటోంది అనిపించింది.

ఆ రోజు మార్చ్ 10. పొద్దున్న ఏడింటిలోగా నాకు తలకు నూనె పెట్టి, పసుపు రాసి నన్ను పెళ్ళికూతుర్ని చేస్తామని చెప్పారు. అంతకు ముందు రోజు రాత్రే అపర్ణ నా దగ్గరికి వచ్చింది -  పెళ్ళికూతుర్ని కాబోతున్న నా పక్కనే తను కూడా ఉండాలని.

లలిత దొడ్డ, లలితత్తయ్య, అమ్మ, చెల్లాయత్త, ప్రభావతి దొడ్డ ఒకరొకరుగా వచ్చి నాకు తలకు నూనె పెట్టి, చెంపలకి, చేతులకి పసుపు రాశారు. ఆ తర్వాత మామిడాకులు, పసుపుకొమ్ములు దారంలో వేసి కట్టిన చిన్న రోట్లో పసుపుకొమ్ములు వేసి రెండు రోకళ్ళు పట్టుకుని అందరూ ఇద్దరిద్దరుగా వచ్చి పసుపు దంచారు. ఆ తర్వాత నాకు హారతి ఇస్తున్నప్పుడు - మా ఇంటి కోకిల కుట్టి "క్షీరాబ్ధి కన్యకకు ... శ్రీ మహాలక్ష్మికిని... నీరజాలయకును ... నీరాజనం" అంటూ రాగాలు తీసింది.

నలుగు స్నానం కాగానే అమ్మ ముందే తీసుంచిన పాలపిట్టరంగుకి ముదురునీలం రంగంచు ఉండి, సన్న గీతల - పెద్దగళ్ళ పట్టుచీర కట్టుకుని, జడ వేసుకుని వచ్చాను. పప్పిని తోడపెళ్ళికూతురుగా కూర్చోబెట్టారు.


అప్పుడు చెల్లాయత్త నా నుదుటన కుంకంతో నామం పెట్టి, పాదాలకి  పసుపు రాసి, దానిమీద పసుపులో సున్నం కలిపి ఎఱ్ఱబరచిన పారాణి పెట్టారు. ఆ పారాణి మీదుగా తెల్లగా మెరుస్తున్న కొత్త వెండి పట్టీలు పెట్టారు. పప్పీకి కూడా నామం, పారాణి పెట్టారు అత్త. ఇది జరుగుతున్నంతసేపూ అపర్ణ నాతోనే ఉండి, అంతా అయ్యాక తాంబూలం తీసుకుని ఇంటికి వెళ్ళింది.



పప్పిని తోడపెళ్ళికూతురుగా కూర్చోపెట్టినప్పుడు కట్టుకోవడానికి - దానికి ఆకుపచ్చ మీద తెల్లపూలు ఉన్న షిఫాన్ చీర కొంది అమ్మ. ఆ చీర కట్టుకుందని ఆ రోజంతా కుట్టి, నేను పప్పిని పూలచెట్టులా ఉందని ఆట పట్టించాము. పప్పీ ఏమో దాని చీర మీదున్న పూల కన్నా తెల్లగా - దాని మార్కు నవ్వోటి నవ్వి ఊర్కుంది.

పెళ్ళి ఫోటోలు తియ్యడం కోసం కుదుర్చుకున్న ఫోటోగ్రాఫర్ అక్కడే ఉండి అందరిలో ఉన్న నాకు, పప్పికి - మాతో ఉన్న వాళ్ళందరితో కలిపి బోల్డు ఫోటోలు తీశాడు. అవన్నీ అయ్యాక మళ్ళీ నన్ను విడిగా ఒక్కదాన్నే నించోమని, కూర్చోమని, పక్కకి చూడమని, పైకి చూడమని అంటూ మళ్ళీ బోల్డు ఫోటోలు తీశాడు. నాకెందుకో భలే మొహమాటంగా అనిపించి వద్దని విసుక్కున్నా ఎవరూ వినలేదు. ఇంకేం చేస్తాను? ఈ ఒక్కసారికే అనుకుంటూ అన్ని ఫొటోలూ కుయ్-కయ్ అనకుండా తీయించుకున్నాను.

(అన్నట్టు ... నన్ను పెళ్ళికూతుర్ని చేసిన మా ఇంటి మధ్య గదిలో - నేను కూర్చున్న పీటకి  - వెనకాల గోడ మీద నేనెంతో ఇష్టంగా వినే La-La-Rasputin పాటల Boney M గ్రూప్ వాళ్ళ పోస్టర్ ఉంది. ముందు అమ్మ ఆ పోస్టర్ తీసెయ్యమని చెప్పింది నాకు. 

అదెప్పుడో డిగ్రీ చదివేటప్పుడు ఏదో magazine లో సెంటర్ స్ప్రెడ్ లా వేస్తే దాన్ని చింపి ఆక్కడ అతికించుకున్నా. దాన్ని అమ్మ పెళ్ళి ఫొటోల్లో బావుండదు తీసెయ్యమంటే - నోటితో కాదనలేక, కళ్ళనీళ్ళు నింపుకోబొయ్యానని - మళ్ళీ అమ్మే ఏమనుకుందో - పాపం... ఆ పోస్టర్ని అలాగే ఉండనిచ్చింది.

బెంగుళూరుకి ఫిబ్రవరి 16న ఫోన్ చేసి నాన్న 'లల్లీ! నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించాను' అని చెప్పిన తర్వాత నేనసలు నోరు విప్పి 'నాకిది బావుంది, ఇది బాలేదు' అని దేని గురించీ చెప్పలేదు. నా కోసం వాళ్ళు తరతరాలుగా నమ్మిన దారిని పక్కకి పెట్టి, అగ్రహారపు కట్టుబాటుకి ఎదురెళ్ళి - నేను నోరు తెరిచి 'నా పెళ్ళి ఎప్పటికైనా బదరితో మీరే చెయ్యాలి'  - అనడిగానని - నా పెళ్ళిని నేను ఊహించలేనంత గొప్పగా చేస్తున్న అమ్మా-నాన్నలని ఇంకేమీ అడక్కూడదని, ఇంకే విషయంలోనూ ఇబ్బంది ఎప్పటికీ ఇబ్బంది పెట్టకూడదని అప్పుడే అనేసుకున్నాను. 

ఇప్పుడు Boney M పోస్టర్ ఉంచడం, తీసేయడం చాలాచాలా చిన్న విషయం అయుండొచ్చు - కానీ మా అమ్మ అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుంది - నన్నూ, నా ఇష్టాన్ని మన్నించింది.)


ఇంతలో ఇంట్లో  పెద్దవాళ్ళందరూ - అప్ప, దొడ్డ, అమ్మ, నాన్న, లలితత్తయ్య, చెల్లాయత్త, రవి, శారద, శ్రీను, శ్యామల, ప్రసాద్, అరుణ - అందరూ బదరి వాళ్ళింటికి వెళ్ళారు. ఎందుకంటే తననీ ఆ తెల్లవారుఝామునే పెళ్ళికొడుకుని చేశారు. పైగా తనకి ఉపనయనం, స్నాతకం కూడా అప్పుడే. అందరూ అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుని భోజనాలు కాగానే ఇంటికొచ్చారు. 

ఇక్కడ మా ఇంట్లో ఆ రోజు సాయంత్రం అంకురార్పణ. నేను ఉపవాసం ఉండాలని చెప్పి - మరీ ఏమీ తినకుండా ఉండలేనని - తినమని పూరీ పెట్టారు. కానీ నాకు ఏంటో తెలీని గాబరా. అస్సలేమీ తినాలనిపించలేదు. నేనేమీ తిననన్నానని అమ్మ నాకు హార్లిక్స్ పాలల్లో కలిపిచ్చింది.

మధ్యాహ్నం నేను, పప్పి, కుట్టి, ప్రశాంతి, తంబి మామయ్య అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వున్నాము. రెండున్నర అయిందేమో అప్పుడు - బదరి ఫ్రెండ్ CK (చెన్నకేశవరెడ్డిని CK అని పిలిచేవాళ్ళం) మరుసటి రోజు పొద్దున్నే బదరి వాళ్ళ ఇంటి దగ్గరికి సన్నాయి మేళం పంపించమని చెప్పడానికి వచ్చారు.

వచ్చిన పని పూర్తయి వెళ్తున్న CK ని గేటు దాకా సాగనంపడానికి వెళ్ళిన తంబి మామయ్య చేతికి నాకు బదరి ఇమ్మని చెప్పారని చెప్పి ఒక చిన్న కాయితం ఇచ్చి వెళ్ళారు. మా తంబి మామయ్య అది తెచ్చి నా చేతికి ఇచ్చాడు. అది చూడగానే మా కుట్టెమ్మ "బావగారు ఏదో పేపర్-సందేశం పంపించారు. గట్టిగా చదవ్వే లల్లెమ్మా!" అంది. అదలా అంటూ ఉండగానే ఆ పేపర్ మడతలు విప్పాను. అందులో ఉన్నదేంటీ అంటే ... "యే జిందగీ ఉసీ కీ హై ... జో ఉసీ కా హో గయా..." అన్న ఒక్క లైను. అది మేము పరిచయమైన కొత్తలో - తనని విసిగించడానికి నేనెప్పుడూ పాడుతూ ఉండిన అనార్కలి సినిమా పాట - కొంచెం మార్పుతో (యే జిందగీ ఉసీ కీ హై ... జో కిసీ కా హో గయా....).

అది చదవగానే మళ్ళీ ఆ రోజులన్నీ - తనని మూగబ్బాయి అనుకుని కూడా ఇష్టపడడం, తను మాట్లాడగానే అదేదో మాయేమో అని భయపడిన క్షణం, ఆ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అలిపిరి దాకా రోజూ నడిచిన నడకలు, మా ఇంటి దగ్గర కిరాణా షాప్ సుబ్బారావు మా గురించి అమ్మకు చెప్పి మాకు చేసి పెట్టిన "మాటసాయం", ఆ తర్వాత జరిగినవి అన్నీ - ఒక్కసారి గుర్తొచ్చాయి. నవ్వు కూడా వచ్చింది.

అలా ఆ పేపర్ చూసి నవ్వుకుంటూనే - అందులో ఏముందా అనేసుకుంటున్న కుట్టి చేతిలో పెట్టాను. అది కూడా అది చదివి - "బానే ఉంది... ఇక మీ ఇద్దరూ మాటలు మానేసి పాటలతో మాట్లాడుకుంటారా ఏంటి?" అని అది కూడా నవ్వేసింది.

ఇంతలో మెల్లిగా సాయంత్రం అయ్యింది. మా ఇంటి పెద్ద గురువుగారు మరువాడ మహదేవుడుగారి అబ్బాయి మరువాడ వెంకన్న గారు నా పెళ్ళికి పౌరోహిత్యం చేయడానికి అమలాపురం నుంచి వచ్చారు. పొద్దున్న బదరి ఒడుగు, స్నాతకం ఆయనే చేయించారు.

ఇంతలో -  ఇంత పెద్దపెద్ద లైట్లు, వీడియో కెమెరా పుచ్చుకుని, పొద్దున్నొచ్చిన ఫోటో / వీడియో-గ్రాఫర్ కూడా వచ్చాడు.

అంకురార్పణ కోసమని చెల్లాయత్త పొద్దున్న పెళ్ళికూతుర్ని చేసినప్పటి పాలపిట్టరంగు చీరనే నాకు గోచీ పోసి చీర కట్టి, కుడి పక్క పమిట వేశారు.

అమ్మ, నాన్నల పక్కన నేను కూర్చుని  ఉండగా - ఇంటికి పెద్దైన సోమేశ్వరరావు తాతగారు, అప్ప, లలిత దొడ్డ, లలితత్తయ్య, చెల్లాయత్త, లక్ష్మి దొడ్డ, ప్రభావతి దొడ్డ, సాంబశివరావు పెదనాన్న, చిన్నపాప్పిన్ని, జ్యోతి పిన్ని, ప్రసాద్ బాబయ్య, తంబి మామయ్య "మా లల్లెమ్మ పెళ్ళికూతురయ్యింది: అంటూ కళ్ళ నిండుగా నన్ను చూసుకుంటూ, నోటి నిండుగా ఆశీర్వదిస్తుండగా, మా ఇంటి గురువుగారైన మరువాడ వెంకన్న గారు పుట్టమన్ను పోసిన పాలికల్లో నవధాన్యాలు వేసి నా పెళ్ళికి అంకురార్పణ చేశారు.

ఆ రోజు రాత్రి ఇంట్లో అందరి భోజనాలు, ఫలహారాలు, హడావిడి తగ్గింతర్వాత నాకు మళ్ళీ ఒక గ్లాసుడు పాలు కలిపిచ్చింది అమ్మ. పొద్దుట్నించీ జరుగుతున్న కార్యక్రమాలతో సందడిగా ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్న అయినవాళ్ళతో ఎంతో సంతోషంగా అనిపిస్తున్నా -  రేపొక్కరోజులోనే నా జీవితంలో - అదేంటో ఇదీ అని ఇంకా తెలీకపోయినా - ఏదో పెద్ద మార్పు రాబోతోందీ అన్న కలవరం కూడా వుంది నాలో.

అందులోనూ పొద్దున్నించీ ఉపవాసమేమో, కొంచెం నీరసంగా అనిపించి - నేను వెళ్ళి చివరగా ఉన్న బెడ్‌రూంలో పడుకున్నాను. ఇంతలో అక్కడ ఏదో సర్దడానికి వచ్చిన అమ్మ మంచం మీద పడుకుని ఉన్న నన్ను చూసి "పాపం! నలిగిపోయింది పొద్దున్నించీ... లలితాత్రిపురసుందరి అసలే ఏడు మల్లెలెత్తు" అని ఆవిడలో ఆవిడే అనుకుంటున్నట్టుగానో, మరి పక్కనెవరన్నా ఉన్నారేమో తెలీదు కానీ - నా పక్కనే కూర్చుని నా తల మీద నెమ్మదిగా జోకొడుతోంది. నాకు మెలకువ వచ్చింది కానీ కళ్ళు తెరిస్తే అమ్మ జోకొట్టటం మానేస్తుందని - ఆ క్షణాలు మళ్ళీమళ్ళీ నా జీవితంలో ఇంక రావేమో అన్నట్టుగా - ఆవిడ మాటలు వినిపిస్తున్నా కదలకుండా అలాగే పడుకుని ఉన్నాను.

అప్పుడే నాన్న కూడా వచ్చారు బెడ్‌రూం లోపలికి. వచ్చి మంచం మీద నా పక్కనే వాలారు. అప్పుడు వీలు కుదిరినట్టు ఉంది అమ్మా-నాన్నలిద్దరికీ పెళ్ళిపనులెలా జరుగుతున్నాయో తరచి చూసుకోవడానికి.

నాన్న చెప్తున్నారు అమ్మతో...

"అనుకున్నట్టుగా అన్నీ సమయానికి కుదిరిపోయాయి. సన్నాయి మేళానికి మన విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో వాయించే  టీమొకటి ఉంది - వాళ్ళని కుదర్చమని పురమాయించాను. 

బ్యాండుమేళం గురించి వాకబు చేస్తుంటే అరండల్ పేట CI - నా ఫ్రెండే 'కామేశ్వర్రావు గారూ... మా డిపార్టుమెంట్ బ్యాండ్ ఉంది' అన్నాడు. 

నేనాయన్ని 'అదేంటండి? మీ డిపార్టుమెంటు బ్యాండు ఏదో దేశభక్తి కార్యక్రమాలకి కదా వాడేది?" అనడిగితే ఆయన 'లేదండి... మేము మామూలు ఫంక్షన్లకి కూడా పంపిస్తాము. కాకపోతే డబ్బులు ఛార్జ్ చేస్తాం' అని  చెప్పాడు. 

So, రేపు కళ్యాణమంటపానికి పోలీస్ బ్యాండ్ వస్తుంది.  

నీగ్గుర్తుంది కదా ... మా లక్ష్మయ్యగారు చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ old students meet విజయకృష్ణా ఇంటర్నేషనల్‌లో జరిగినప్పుడు - అప్పుడు సినిమా యాక్టర్ బాలయ్య మా లక్ష్మయ్యగారి క్లాస్మేట్ -మనింటికి కూడా వచ్చాడు - గుర్తుందా? -అక్కడ డెకరేషన్ అంతా సాంబశివరావు అనే అతను చేశాడు. 

అతనికి మన లల్లి పెళ్ళని తెలిసి 'సార్! పాప పెళ్ళికి నేనే చెయ్యాలండి డెకరేషన్ - చిలకలు, పావురాళ్ళు, కుందేళ్ళు అన్నీ పట్టుకొస్తాను - మీరస్సలు ఆలోచించకండి' అన్నాడు. అదంతా అతనే చూసుకుంటాడిక. అందులో మనమింకేమీ చూసుకోక్కర్లేదు.

ఇక పెళ్ళికి వచ్చే వాళ్ళ కోసం విజయకృష్ణా ఇంటర్నేషనల్‌లో రూములు బుక్ చేశాను. 

వంటకి ఎలాగూ మన మూల శర్మ వాళ్ళు అమలాపురం నుంచి వచ్చారు. 

అన్నట్టు మూల శర్మకి ' మా ఆఫీసు స్టాఫు, ముఠావాళ్ళు చాల మంది పెళ్ళికి వస్తారు. వాళ్ళకి మన కోనసీమ స్పెషల్స్ అన్నీ రుచి చూపించాలి. ఏం వండాలో నీకు నేను మెనూ కూడా ఇవ్వను. ఏం వండుతావో నీ ఇష్టం. ఎవ్వరైనా బాలేదు అంటే నీకిచ్చిన అడ్వాన్సుతో మాత్రం అమలాపురం వెళ్ళిపోతావు. భోజనం బావుంది అని అందరూ మెచ్చుకున్నారా - నీకు ఇస్తానన్న దానికి అంతకంతా ఇస్తాను' అని చెప్పాను. 

అనాతవరం నుంచి ఊళ్ళో వాళ్ళు నేనీ వర్ణాంతరం పెళ్ళి ఎలా చేస్తానా అని చూడడానికి వస్తున్నారు. రానీ! వాళ్ళే చూస్తారు".

ఇలా అమ్మతో మాట్లాడుతూనే నాన్న నెమ్మదిగా గురక పెట్టడం మొదలు పెట్టారు - బాగా అలిసిపోయి వున్నారు. అమ్మ కూడా ఆయన చెప్పినవన్నీ వింటూ నా పక్కనే మంచం కింద తరగడ వేసుకుని పడుకుండి పోయింది.

నాకూ నిద్ర వస్తోంది... రేప్పొద్దున్నే నాలుగింటికి మంగళస్నానాలు అని చెప్పింది అమ్మ.

అప్పటి వరకు నాన్న మాట్లాడినవన్నీ కళ్ళు మూసుకుని వింటూ ఉన్న నాకు - నేనెంత అదృష్టవంతురాలినో - అని అప్పటికి లక్షోసారి అనిపించింది.

తమ మాట విన్న పిల్లలని అపురూపంగా ఎవరైనా చూస్తారు - వాళ్ళడిగినవన్నీ ఎలాగైనా తెచ్చివ్వాలని చూస్తారు.

కానీ - నా లాంటి అస్సలు మాట వినని పిల్ల కోసం - నేనేమీ అడక్కుండానే అన్నీ ఘనంగా అమర్చాలని మా అమ్మా-నాన్న పడుతున్న తాపత్రయం చూస్తుంటే - ఇటు వీళ్ళే కాదు - అటు బదరి ఇష్టాన్ని మన్నిస్తున్న నాక్కాబోయే అత్తగార్ని తలుచుకుంటూ ...

మాకై ... మారిన - పెద్దవాళ్ళకూ
మాకే ... ఇచ్చిన - ఆలంబనకు
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
నన్నూ... తననూ ... కన్న వాళ్ళకూ
మాకై వేచే... ముందునాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు.. 


అని పాడుకుంటూ నేనిక్కడ... 
నే పాడుకుంటున్న పాటకు అసలు పాటేదో పట్టుకుని పాడుకుంటూ మీరూ ఇక్కడే...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

12, జులై 2020, ఆదివారం

అలమరలో అంచెలంచెల అమరిక - పాతబంగారాలకే కొత్తపేర్లిక... (H. L. P.)

గత ఇరవై ఏళ్ళుగా - ఇక్కణ్ణించి పెట్టట్టుకెళ్ళి అక్కడికెళ్ళి - అక్కణ్ణించి అదే పెట్టట్టుకుని తిరిగొచ్చే ప్రతీసారీ పట్టుకొచ్చేవి - పుట్టింటి పెట్టుపోతలతో పాటు పుస్తకాల దొంతర్లు.

అలా మోసుకొచ్చిన పుస్తకాలన్నీ మొన్నమొన్నటిదాకా ఇంట్లో ఉన్న గదులన్నిటిలో - లివింగ్ రూమ్ సోఫాల మీద, సైడ్ టేబుళ్ల మీద, డైనింగ్ టేబుల్ కుర్చీల మీద, బెడ్‌రూమ్‌లో నైట్ స్టాండ్ మీద, మంచం మీద, బేస్మెంట్లో అలమారుల్లో - ఇందుగలదందు లేదని లేక - అందందు, ఇందిందు అని లేక - ఎందెందూ ఉందుము మేమని - అరమూత పేజీలవి కొన్నీ, బుక్‌మార్కులు పెట్టి మూసినవి ఇంకొన్నీ- పెట్టిన చోట పెట్టినట్లు ఉండేవి. ఎటు చెయ్యి చాపినా అందుతుండేవి.

అందులోనూ - నాకు ఒకేసారి మూణ్ణాలుగు పుస్తకాలు చదవడం అలవాటు.

పొద్దున్న ఫెళ్ళున ఎండ కాసి,  మధ్యాహ్నానికి ముసురేసి మబ్బేసి - సాయంత్రానికి చలిపులి జతగా చీకటి పూసుకునే, మా ఊరి predictably unpredictable వాతావరణానికి తగ్గట్టే నా పుస్తకాల చదువు.

ఓ పొద్దు కృష్ణశాస్త్రి,
ఇంకో జాము ముళ్ళపూడి,
మరు సంజె శ్రీపాద,
నిద్రకొరిగే వేళ నవ్వులతో తోడొచ్చే వోడ్‌హౌస్, Dr. Seuss, లారా ఇంగాల్స్ ,
- ఇలా పూటపూటా మారునట - నా చదువుటలు, చదువు పుటలు, పుటల పుస్తకాలు.

అలా ఇల్లంతా పుస్తకాలు పరుచుకుని, చేతికందింది చదువుతూ ఉండడం బాగానే ఉందనిపించినా - ఒక్కోసారి చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి ఇంకోటి చదువుదామా అనుకుని - అదెక్కడుందో చూడబోతే - ఆ సమయానికి అవసరమనుకున్న పుస్తకం ఎక్కడో ఆదమరచి ఒదిగి ఉండి - ఆఖరికి అంజనం వేసినా దొరకనంతగా దాక్కుని ఉండేది. ఇహ దాన్ని వెతుక్కుని వచ్చేలోగా అందులో అంతకు ముందు ఎంత దాకా చదివానో మర్చిపోయేదాన్ని. మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి వచ్చేది.

ఇంకిలా కాదనుకుని - ఇల్లంతా రెపరెపలాడుతున్న కాయితాల-రెక్కలవే కాక - ఎప్పటెప్పటివో, ఎక్కడెక్కడివో పోగేసుకున్న పుస్తకాలు అన్నీ కిందటి సంవత్సరం ఒక అలమారాలో అమరుద్దామని - అప్పటికి అందులో ఉన్న లెగో అచ్చుల బొమ్మల్నన్నిటినీ వేరే బీరువా లోకి మార్చి - నాలుగు అరలుగా, నాలుగు రెళ్ళు ఎనిమిది గూళ్ళుగా ఉన్న ఆ తలుపుల్లేని చెక్క అలమారాలో - కంటికి కనిపించి, చేతికి అందిన పుస్తకాలన్నింటినీ ఎలా పడితే అలా పెట్టేశా.

సరే!  ఇప్పటికైనా కావల్సిన పుస్తకం చటుక్కున దొరుకుంటుందా అంటే....ఉహూ! ఎదురుగానే ఉంటుంది కానీ ఎంత వెతికినా ఎప్పటికో గానీ కనబడదు. ఆ కనబడిన సమయానికి అదే నేను వెతుకుతున్నది అని గుర్తుండదు.

ఈ రకంగా అనుకున్నది దొరకక, దొరికినది చదవాలనిపించక, ఒకవేళ రెండూ కుదిరి ఓ పుస్తకమేదో తీసి చదివింతర్వాత మళ్ళీ అదెక్కణ్ణుంచి తీశానో అక్కడే పెడదామనుకుంటే - అసలదెక్కణ్ణుంచి తీశానో గుర్తు లేక - తీసినది తీసిన చోట పెట్టే తీరుబడి లేక - మొత్తానికి నా పుస్తకాల పోగు ఓ తీరూ-తెన్నూ లేకుండా అయిపోయింది.

ఇంతలో ఏప్రిల్ నెలలో ఓ రోజు అపర్ణ వాట్సాప్ సందేశం పంపించింది - ఓ అలమార నిండుగా వరసలు, వరసులుగా సర్దిన బోల్డన్ని పుస్తకాల ఫోటోలు, దాని కిందనే దాదాపు 300 పైగా ఉన్న పుస్తకాలని కేటలాగ్ చేశానూ అని కొన్ని మాటలు.

దాంతో పాటే ఆ పుస్తకాల జాబితా కూడా ఒక excel లో జూన్ 19న పంపించింది.

అది చూడగానే నేను చేసిన మొట్టమొదటి పని - మా ఇంటి చెక్క అలమారలో భాషాభేదాలు, పరిమాణప్రమాణాలు పట్టించుకోకుండా, ఏ అరమరికలూ లేక అమరిపోయిన తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలని - అన్నింటినీ బయటికి తీసి - తెలుగు, ఇంగ్లీష్ - అని రెండు గుట్టలుగా పేర్చి - అందులో ఇంగ్లీష్ పుస్తకాలన్నిటినీ వేరే గది లోకి తరలించడం.

ఆ తర్వాత మిగిలినవి - ఖాళీ అయిన ఓ ఎనిమిదరల చెక్క అలమార, రాశిగా పోసిన ఓ ఎనిమిది పాతికల తెలుగు పుస్తకాలు.




అప్పుడు మొదలు నా గృహ గ్రంథాలయ పరికల్పన  అనగా Home Library Project - HLP.

నా  Home Library Project - HLP అంటూ - నేను కన్న పుస్తకాల అమరికల-కలను సాకారం చేసుకోవడానికి  నేనెంచుకున్నవి నాలుగు స-కారాలు: సరదా, సరంజామా, సమయమూ, సందర్భమూ...

చేయాలన్న సరదా,
ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకోవల్సిన సరంజామా,
ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకున్న సరంజామా వాడడానికి తీరుబాటు సమయమూ,
 ఆ చేయాలన్న సరదా తీర్చుకోవడానికి కూర్చుకున్న సరంజామా వాడగలిగిన తీరుబాటు సమయానికి తగిన సందర్భమూ. 


HLP మొదలు పెట్టడానికి కావలసిన - సరదాలూ, సరంజామాల జాబితా ఇదిగో...
  1. రోజుకో గంటో, రెండు గంటలో టైమూ
  2. కాయితాలు కత్తిరించే సరదా 
  3. కాయితాలు పుస్తకాలకి అంటించే ఓపిక 
  4. ఓ లాప్టాప్ - అందులో ఓ excel సృష్టించే వీలు 
  5. తెల్లరంగు స్టికర్ లేబుల్స్ - అవి లేకపోతే కావలసిన ప్రమాణంలో కత్తిరించుకోవడానికి తెల్ల కాయితాలు 
  6. ఓ కత్తెర 
  7. కత్తరించిన కాయితాలు అతికించడానికి గ్లూ స్టిక్ అని నాజూగ్గా పిలుచుకునే జిగురు-కడ్డీ. నేను pre-cut Avery lebels వాడినా కూడా వాటికి ఉన్న gum ఆరిపోయి ఉన్నాయేమో... మళ్ళీ glue stick వాడాల్సి వచ్చింది. 
  8. చెత్తబుట్టలో పడేసే వంకతో పదేపదే లేచెళ్ళకుండా - కుదురుగా కూర్చుని కనీసం ఒక పది పుస్తకాలైనా లేబుల్ చెయ్యాలంటే - కత్తిరించిన కాయితం ముక్కలు - అవతల పారవేయాల్సినవి - వేసుకోవడానికి ఓ చిన్న ప్లాస్టిక్కుదో, ఇంకెక్కడా అక్కర్లేనిదో ఒక గిన్నె 
  9. ఒక పెర్మనెంట్ మార్కర్ - లేకపోతే ఏదో ఒక బాల్ పెన్ను 
HLP కి సమయమూ, సందర్భమూ కుదుర్చుకోవడం ఎలా అంటే... 

ఉద్యోగపు పని రోజుల్లో అయితే ఆఫీస్ అయిపోయి, సాయంత్రపు భోజనాలు అయిపోవాలి.

శని, ఆదివారాల్లో అయితే అందరి ఆకళ్ళూ తీరిన మధ్యాహ్న వేళ అయినా ఫర్వాలేదు.

ఎప్పుడైనా సరే ముందు ఇంట్లో పెద్దల, పిల్లల భోజనాలు అయ్యి, ఎవరి పుస్తకాలు వాళ్ళు చదువుకుంటూ, ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటూ - ఏటవాలుగా పడే ఎండౘాలునో, చల్లగా కురిసే రేయెండ ౙాలునో - హుషారుగా ఉస్సురుస్సురనకుండా ఉండడం - ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి మహా ముఖ్యమైన ముడిసరుకు. 

ఇవన్నీ కుదుర్చుకున్నాక, కుదురుగా పుస్తకాల గుట్ట మధ్య కూర్చుని - చేతికందిన పుస్తకాన్ని చేతికందినట్టు - దాని వివరాల్ని ఒక excel లో ఎక్కించాలి. 

ఆలా ఎక్సెల్ డాక్యుమెంటులో ప్రతి పుస్తకానికి నేను ఎక్కించుకున్న వివరాలు (columns):
  1. క్రమ సంఖ్య (Serial Number) 
  2. పుస్తకం పేరు
  3. రచయిత పేరు
  4. విభాగం (genre) 
  5. సంకేతనామం (code for the book)
నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలన్నిటినీ ముందుగా కొన్ని ప్రధాన విభాగాల కింద జాబితాగా రాసుకున్నాను, అవేంటంటే ...

శ్రీపాద, మల్లాది, మధురాంతకం, కొడవటిగంటి, వంగూరి వంటి ప్రముఖుల కథలు, ఇతర కథా సంకలనాలు అన్నిటినీ కథలు (Short Stories) కింద చేర్చాను.

దేవులపల్లి, శ్రీశ్రీ, తిలక్, తదితర కవిప్రముఖుల కవితా సంకలనాలు కవితలు (Poetry) అన్న మకుటం కింద కుదురుకున్నాయి.

మిగిలిన పుస్తకాలన్నీ కూడా వాటికి వాటికి చెందిన - నవలలు (Fiction), వ్యాసాలు  (Essays), ఆత్మకథలు (Non-fiction), సినిమా (Movies) - విభాగాల్లో చేరాయి.

పుస్తకాలన్నిటినీ ఒక list గా రాసుకున్న తర్వాత - ప్రతి పుస్తకానికి ఒక code రాసుకున్నాను. ఆ కోడ్ ఎలా ఉంటుందంటే Genre code-Author Initials-ఆ unique number.

 ఒకే రచయిత కథలూ, కవితలూ కూడా రాసి ఉండొచ్చు కదా! ఉదాహరణకి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పుస్తకాలు రెండు నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఆయన రాసిన కవితలు అమృతం కురిసిన రాత్రి, ఇంకోటి కథల సంకలనం తిలక్ కథలు.

  • అమృతం కురిసిన రాత్రి పుస్తకానికి నేనిచ్చిన code: PO-TLK-01
  • తిలక్ కథలు పుస్తకానికి నేనిచ్చిన code: SS-TLK-01
పుస్తకాలకి నేను రాసుకున్న code ఇంకొక కొత్త పుస్తకం కొనుక్కున్నప్పుడు ఆయా రచయితల పుస్తకాల జాబితాలో ఎంచగ్గా ఇమిడిపోయేలా, చటుక్కున చేరిపోయేలా ఉంటుంది.

అన్నట్టు - అపురూప స్నేహితులు - బాపు-రమణలు వేసిన కార్టూన్లని, రాసిన రాతల్ని విడివిడిగా ఇతర విభాగాల్లో పెట్టి విడదీయటం ఇష్టం లేక వాళ్ళిద్దరి పుస్తకాల కోసమే ఒక ప్రత్యేక విభాగం బాపు-రమణీయం (Code: BPRN ) సృష్టించుకున్నాను.

అందులో బాపు వేసిన కళకళలాడే బొమ్మల పుస్తకాలకి BPRN-BP-nn** అనిన్నీ, ముళ్ళపూడి వారి కిలకిలలాడించే హాస్యానికి BPRN-RN-nn** అనిన్నిన్నీ పుస్తక సంకేతాలని (Book Codes) రాసుకున్నాను.

ఇదిగో - ఈ కిందే ఉంది - నా దగ్గరున్న బాపు-రమణీయమైన పుస్తక-జాబితాయణం:

Book Title Book Code
హరివిల్లు - బాపుబొమ్మలు BPRN-BP-00
లీలాజనార్థనం - బాపు బొమ్మలు వ్యాసాలు BPRN-BP-01
బాపు కార్టూన్లు - 1  BPRN-BP-03
బాపు కార్టూన్లు - 2 BPRN-BP-04
సాహితీసర్వస్వం - 1  BPRN-RN-01
కథా రమణీయం (2)  BPRN-RN-02
బుడుగు  BPRN-RN-03
కదంబరమణీయం - 1 BPRN-RN-04
కదంబరమణీయం - 2 BPRN-RN-05
సినీరమణీయం - 2 BPRN-RN-07
కోతికొమ్మచ్చి  BPRN-RN-10
ఇంకోతి కొమ్మచ్చి  BPRN-RN-11
ముక్కోతి కొమ్మచ్చి  BPRN-RN-12


అలాగే నా దగ్గర అనుకోకుండా చేరిన చలం-సాహిత్యం చాలానే ఉంది. అదెలా అంటే ఓ ఐదారేళ్ళ క్రితం మా కుటుంబమిత్రులు రఘు ఇండియా వెళ్ళిపోయేముందు తన ఫ్రెండ్స్ ఎవరో తన దగ్గర ఓ పెట్టెడు తెలుగు పుస్తకాలు వదిలి వెళ్ళారంటూ - అవన్నీ భద్రంగా తెచ్చి నాకిచ్చారు.

ఏం పుస్తకాలున్నాయా అని ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో బోల్డన్ని చలం రచనలు, దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల కనిపించాయి. అప్పటి వరకు చలం పుస్తకాల గురించి వినడమే తప్ప నేనెప్పుడూ చదవలేదు.

చదివిన ఒకటి రెండు చలం గారి పుస్తకాలు నాకప్పుడు అంతగా నచ్చకపోయినా - చదవగా చదవగా -  నాకు చలం రచనల్లో చాలా నిజాయితీ కనిపించింది. తను చెప్పాలనుకున్న విషయం ఎలాంటిదైనా, దానిని ఎంతో సూటిగా తన అభిప్రాయంగానే, తన రాతల్లో తనే పాత్రగా మారి ప్రకటించిన - చలం ధోరణి నాకు చాలా నచ్చింది.

ఆ రచనల్లో నిజాయితీ, దేనినీ ప్రశ్నించకుండా ఉండలేనితనం, హేతువుకి అందని విషయాలని ఒప్పలేని తనం - చలం రాసిన అన్ని రాతల మీద కాకపోయినా, చాలా రాతల వెనకాల భావాలతో ఒప్పుదల కుదిరింది. చాలా చోట్ల చలమూ, శ్రీపాదల ఆలోచన ఒకటే అయినా చెప్పడానికి ఎంచుకున్న పంథాలు వేరువేరు అనిపిస్తుంది నాకు.

చలం రచనలని - ఇది కథ, ఇది వ్యాసం, ఇది ఆత్మకథ, ఇది కవిత - అని విడదీయాలనిపించక - అన్నిటికీ ఒకటే పేరు చలం సాహిత్యం అని పెట్టేసుకున్నా. ఆ పుస్తకాలకి LT-CHLM-nn** అన్న ప్రత్యేకమైన సంకేతం నప్పింది.

ఇంకో ప్రత్యేక విభాగం - దాశరథి రంగాచార్యుల వారు రాసిన నాలుగు వేదాల అనువాదాల వేద సంహితలు. వాటికి నేనిచ్చుకున్న కోడ్: VD-DR-nn**

**(nn అంటే 01, 02, 03, 04  ...ఒక వరస సంఖ్య ).

మొత్తానికి నా దగ్గరున్న తెలుగు పుస్తకాలన్నీ ఓ పధ్నాలుగు విభాగాలయ్యాయి.

అవన్నీ - ఇక్కడే - ఈ కిందనే రాసి పెట్టుకున్నా:

Sl, No. విభాగం  Genre Genre Code
1 బాపు-రమణీయం  Bapu-Ramaneeyam BPRN
2 బాలల సాహిత్యం  Children's CH
3 ప్రబంధాలు  Classic Poetry CP
4 వ్యాసాలు  Essays ES
5 నవలలు  Fiction FC
6 చలం సాహిత్యం  Literature LT
7 ఇతరాలు  Miscellaneous MISC
8 పురాణాలు  Mythology MT
9 సినిమా  Movies MV
10 ఆత్మకథలు  Non-fiction NF
11 కవితలు  Poetry PO
12 కథల సంకలనాలు  Short Stories SS
13 వేద సంహితలు  Vedas VD
14 జ్ఞాపికలు  N/A (Souvenirs) ZZ


హమ్మయ్య! దాదాపు ఒక వారం రోజుల్లో - పుస్తకాల జాబితా రాసి, వాటిని విభాగాలుగా విడగొట్టి, వాటికి సంకేత నామాలు సృష్టించి - మొత్తానికి నా దగ్గరున్న నాలుగైదొందల తెలుగు పుస్తకాల్లో ఒక 222 మాత్రం మా లివింగ్ రూంలో ఉన్న చెక్క అలమారలో సర్దుదామని ఎంచుకున్నాను. మిగిలిన వాటిని బేస్మెంటుకి రవాణా చేసేశాను.

ఇహ ఇప్పుడు ... అసలు పని మొదలు.

ప్రతి పుస్తకానికి ఒక ప్రత్యేకమైన సంకేత నామం (code) పెట్టాను కదా!

దాన్ని రాయడం కోసం - పుస్తకం సైజుకి తగ్గట్టు చిన్నచిన్న లేబుల్స్ కత్తిరించుకుని - రంగురంగుల అట్టలతో ముస్తాబై నించున్న పుస్తకాల వెన్నుల మీద నేను పెట్టిన కొత్త పేర్లు రాసిన చిన్నిచిన్ని కాగితపు-తునకలు అతికించాను.

ఈ కిందున్న బొమ్మలో నేను గీసిన పచ్చ-పెట్టె మధ్యలో బాపు-రమణల పుస్తకాల మీద అంటించిన కాగితపు-తునకలు చూడొచ్చు.



అలా జూన్ 21 వ తారీఖున పుస్తకాలఆ జాబితా రాయడంతో మొదలుపెట్టి, పుస్తకాలన్నిటికీ లేబుల్స్ అతికించి అరల్లో సర్దేటప్పటికి జులై 8వ తారీఖు అయింది.

ఆ పద్ధెనిమిది రోజులూ office hours, ఇంటి పని వేళలు, రెండుపూటలా నడకకి వెళ్ళిన సమయాలూ తప్ప మిగిలిన టైమంతా నా HLP కాయితాల-అంటింపుకే అంకితం.

అంతా అయిన తర్వాత - పాతబంగారాల్లాంటి పుస్తకాలకి కొత్తకొత్త పేర్లెట్టుకుని - అలమారాలో అమర్చుకుని - ఆ మధ్యలో నా బొమ్మలను కూర్చోబెట్టుకుని - అదంతా నేనే చేసింది అని నాతో నేనే అనిఅని ఆశ్చర్యపోయా - వాటిని చూసి బదరి, బుజ్జిజింకలు "ఎంత బావుందో!" అంటే వినివిని మురిసిపోయా.




అలమరలో అమరిన 
అంచెలంచెల అమరిక
అచ్చరపు బారులది... 
అచ్చెరువుల ఊహలది...










5, జులై 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 20 - తలపులమ్మ పంపిన ఊరు... టంగుటూరు!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!


నేను 79-80ల్లో కాకినాడ వెళ్ళేటప్పటికి - కాకినాడలో అప్పటికి నా పాత స్నేహితులు, క్లాస్‌మేట్స్ కొందరుండేవారు.

మొదటగా - పోతుల ఆనందరావని చెప్పేసి నా హైస్కూల్‌మేటు. మేమిద్దరం స్కూల్లో బేస్‌బాల్ ఆడుతుండేవాళ్ళం అప్పుడు. మా స్కూల్ బేస్‌బాల్ టీము చాలా మంచి టీం. అందులో నేను, ఈ పోతుల ఆనందరావు, రాగిడి నాగేశ్వరరావు, కొల్లు వాడు మేమందరం ఆడేవాళ్ళం. మాకు అమలాపురం కాలేజీ, ముమ్మిడివరం కాలేజీల మీద పోటీ ఉండేది. ఎప్పుడూ వాళ్ళ మీద గెలుస్తూనే ఉండేవాళ్ళం మేము. ఆ పోతుల ఆనందరావు ఎస్సెల్సీతో ఆపేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) లో చేరాడు. వాడు కాకినాడలోనే ఉండేవాడు.

అలాగే సరస్వతుల నర్సింహారావు అనేవాడు నాకు కాలేజ్ మేటు. వాడేంటంటే సేల్స్ టాక్స్ దాంట్లో పని చేసేవాడు. వాడు జగన్నాథ పురం చెక్ పోస్టులో ఉండేవాడు. వాడో ఫ్రెండు.

తర్వాత మూడోవాడు కూచిమంచి రమణ అని చెప్పి నాకు సీనియర్. వీడిదో ఎపిసోడు.

ఈ కూచిమంచి రమణ ఏంటంటే వాడు మంచి సింగర్. నాకు తెలీదా విషయం. కాలేజీ పోటీల్లో వార్షికోత్సవాలు జరిగినప్పుడు నేను పాటల పోటీల్లో పాడుతూ ఉండేవాణ్ణి. సాధారణంగా గుండమ్మ కథలో "లేచింది మహిళాలోకం" ఇలాంటి పాటలు పాడుతూ ఉండేవాణ్ణి.

ఆరోజు ఏం చేశానంటే - మా ఫ్రెండ్స్ అందరూ "ఒరే! అమరశిల్పి జక్కనలో "ఈ నల్లని రాలలో" పాట పాడమన్నారని  ఆ పాట పాడా. విన్నవాళ్ళందరూ "బావుంది, బావుంది" అని బానే చప్పట్లు కొట్టారు. మరుసటి రోజు ఈ కూచిమంచి రమణ అదే పాట పాడాడు. అద్భుతం! అసలు ఘంటసాలని దించేశాడు. నేను ప్రేక్షకుల్లో కూర్చున్నవాణ్ణి లేచెళ్లి వాడికి దండం పెట్టి "నేనీ పాటని పాడనింక స్టేజ్ మీద" అని చెప్పాను వాడికి. వాడు కూడా నాతో "నువ్వు కూడా ఎంచగ్గా పాడావు" అన్నాడు. అప్పుడు నేను "నీలా పాడలేకపోయాన్నేను. అసలు నువ్విలా పాడతావు అని తెలిస్తే నేనసలు పాడేవాణ్ణి కాదు." అన్నాను. నాకు ప్రైజ్ రాదని నాకు తెలిసిపోయింది. నేను దాన్ని స్పోర్టివ్ గానే తీసుకున్నాను.

అప్పుడు సుబ్బరాజుగారని మా ప్రిన్సిపాల్ గారు నాకన్నా ఎక్కువ బాధ పడిపోయారు నాకు ప్రైజ్ రాలేదని. అంతకు ముందు రెండేళ్ళూ మొదటి బహుమతి నాదే. ఈ మాటు అయన నా దగ్గరికొచ్చి "నీకింకో అవకాశం ఇస్తున్నాను, ఇంకో పాట పాడు" అనంటే అప్పడు నేను "నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో" అని పాడేశాను. దాంతో కూచిమంచి రమణతో పాటు నాకూ ఓ ప్రైజ్ ఇచ్చేశారు మా ప్రిన్సిపాలు గారు.

ఆ కూచిమంచి రమణ - కాకినాడ పోర్టులో క్లర్కుగా పని చేసేవాడు.

తర్వాత నా క్లాసుమేటు ఆర్వీ రావు అని ఇంకొకడు. ఈ ఆర్వీ రావు వాళ్ళ నాన్నగారు ఇంజినీర్. వీడు పీయూసీ ఒకటే చదివాడు అమలాపురంలో. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ లో సెక్రటరీ పోస్టుకి ఎలక్షన్ వస్తే వాడిని సపోర్ట్  చేసి గెలిపించాం. వాడు పీయూసీ అయ్యాక రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిపోయాడు. వాడేమో ఒక  మార్వాడీ వాళ్ళ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పని చేస్తుండేవాడు. వాళ్ళు రైస్ బ్రాన్ ఎగుమతి చెయ్యడం, ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకోవడం చేస్తుండేవాళ్లు. అందులో వాడు మేనేజర్.

వీళ్ళు నలుగురూ నాకు కాకినాడలో ఫ్రెండ్స్. వీళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉండేవాణ్ణి.

నిజానికి నాకు కాకినాడలో డిసెంబర్ దాకా పని లేదు. ఎందుకంటే shipments డిసెంబరు దాకా గానీ రావు. నన్ను పంపించింది ఎందుకంటే అక్కడ గోడౌన్లు మాట్లాడుకోవడం, ఆ కస్టమ్స్ వ్యవహారాలు తెలుసుకోవడం కోసం నన్ను ముందుగా పంపించారు మా హెడ్డాఫీసు వాళ్ళు.

డిసెంబర్లో కానీ మనకి ఎక్సపోర్ట్స్ రావు అని చెప్పాను కదా!  అప్పటిదాకా ఖాళీ. ఈలోపులో జంగారెడ్డిగూడెం నుంచి మూర్తి,  ఏలేశ్వరం స్టాఫ్  మొత్తం మూడు జీపులేసుకుని భద్రాచలం బయల్దేరారు.

అలా బయల్దేరిన వాళ్ళలో - అచ్యుతరామయ్య అని చెప్పేసి ఓ బయ్యరు, నా ఫ్రెండు కూడా - రవి శంకర్ అని నా శిష్యుడు - వీళ్ళు కూడా వున్నారు. వాళ్ళు బయల్దేరే ముందు నాకు ఫోన్ చేసి నన్ను కూడా రమ్మంటే నేను నాతో పాటు మా లల్లీ, కుట్టీలని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళిద్దరినీ తీసుకుని ఏలేశ్వరం వెళ్లి, ఏలేశ్వరం నుంచి మూర్తి వాళ్ళతో జాయిన్ అయ్యా.

మూడు జీపులు వేసుకుని - వయా అడ్డతీగల, మారేడుమల్లి - అట్నుంచి అలా భద్రాచలం వెళ్దామని మా ప్లాను. రాత్రి పూట బయల్దేరాం. తెల్లవారేటప్పటికి కిన్నెరసాని వాగు దగ్గర ఆగాం. అక్కడే దంతధావనాలు అవీ చేసుకున్న తర్వాత రెండు జీపులు వాగు దాటి వెళ్లిపోయాయి.  మా లల్లీ, కుట్టి ఆ ముందు జీపుల్లో వున్నారు.

ఆఖరి జీపులో  నేను, అచ్యుతరామయ్య, మూర్తి వెడుతూ ఉంటే వాగు ఉధృతంగా వచ్చేసింది. జీపు మొత్తం ఇంజిన్ దాకా మునిగిపోయింది. మేమప్పటికి లుంగీలతో వున్నాం. ఆ లుంగీలు పైకి కట్టేసుకుని ఈ జీపుని తోసుకుంటూ ఒడ్డెక్కాం.

ఒడ్డెక్కాక ఇహ అక్కడ మా జీపు నడవదు కదా - మిగతా రెండు జీపుల్లో ఓ జీపుకి తాడేసి కట్టి దీన్ని కొత్తగూడెం దాకా తీసుకెళ్ళాం. కొత్తగూడెంలో రిపేరు చేయించుకుని సాయంత్రానికి భద్రాచలం చేరాం. ఆ రాత్రి భద్రాచలంలో వున్నాం. తర్వాతి రోజు దర్శనాలు చేసుకుని, పంచవటి అదీ చూసుకుని ఆ రోజు సాయంత్రానికి బయల్దేరి ఒరిసా బోర్డర్లో వున్న సీలేరు థర్మల్ స్టేషన్ పిల్లలకి చూపించిన తర్వాత వెనక్కి బయల్దేరేశాం.

అలా వస్తూ దారిలో మారేడుమల్లి వచ్చేటప్పటికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ కోయవాళ్ళు వాళ్ళేదో వేటకొచ్చారు బాణాలు పట్టుకుని. మా జీవుల్ని చూసి ఆపేశారు. ఆపేస్తే అందరూ భయపడుతున్నారు. నేనూ, అచ్యుతరామయ్య దిగి "ఏం ఫర్వాలేదు భయపడకండి. మేము మాటాడతాం" అని వెళ్లి వాళ్ళతో "ఒరే బాబూ...మేమేదో భద్రాచలం చూద్దామని సరదాగా వచ్చాము. మీరేంటీ ...? సిగరెట్లు తాగుతారా?" అనడిగి వాళ్లందరికీ తలకో సిగరెట్టు ఇచ్చాము. అందరూ సిగరెట్లు తీసుకుని "జాగ్రత్తగా వెళ్లి రండి" అని మమ్మల్ని వెళ్లనిచ్చారు.

మొత్తానికి అందర్నీ ఏలేశ్వరంలో డ్రాప్ చేసి లల్లీ, కుట్టీలతో కలిసి నేను కాకినాడ వచ్చేశాను.

డిసెంబర్ దాకా నాకు ఏ పనీ లేదని చెప్పాను కదా! నాకు వూరికే ఆఫిసుకి వెళ్లడం, అక్కడ సాయంత్రం దాకా కబుర్లతో కాలక్షేపం చేయడం కొంచెం చికాగ్గానే ఉండేది.

ఆ పరిస్థితిలో - ఒకప్పుడు కృష్ణస్వామిగారు నేను కంపెనీలో జాయిన్ అయినపుడు అయన "మూడంకెల మించి నీకు ఈ కంపెనీలో జీతం రాద"నేవాడు కదా! ఆయనతో ఛాలెంజ్ గా తీసుకున్నాను "ఇదే కంపెనీలో ఐదంకెల జీతం తీసుకుంటా"నని. అదీ మనసులో కదులుతూనే వుంది.

పైగా రెండోది ఏంటంటే "ఇక్కడ పని లేదు. ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తే బావుంటుంది, ఇక్కడ ఉండడం చాల కష్టంగా వుంది" అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపు అనుకోకుండా మా ముఠామేస్త్రీ విష్ణు వచ్చి "అయ్యగారూ! ఇక్కడ తుని దగ్గర తలుపులమ్మ లోవ అనుంది. అక్కడికెళ్లి మనం ఏం కోరుకుంటే అదవుతుంది.  మేమందరం అక్కడికి వెళ్దామనుకుంటున్నాము. మీరు కూడా రండి అక్కడికి" అనడిగాడు.

నిజానికి ఆ అమ్మవారి పేరు తలుపులమ్మ కాదు తలపులమ్మ. తలచుకుంటే కరుణిస్తుందన్నమాట.

అక్కడ పరిస్థితి ఏంటంటే...ఇప్పుడంటే బ్రాహ్మలు వాళ్ళూ చేరి ఎండోమెంటుకొచ్చి వాళ్లు అర్చనలూ అవీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ నేనక్కడున్న రోజుల్లో ఆసాదులు ఉండేవారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఓ కోడిని తీసుకెళ్లాలి. ఆ కోడిని అక్కడే బలిచ్చి, అక్కడే వండుకుని, ఆ దేవతకి నైవేద్యం పెట్టి, అది ప్రసాదంగా తిని రావాలి. అదీ పధ్ధతి ఆ రోజుల్లో.

మా ముఠావాళ్ళతో పాటు - నేను, శాస్త్రిగారు, శ్రీనివాసరావుగారు, వెంకటరావు అని చెప్పేసి శాస్త్రిగారి శిష్యుడు - మేము కూడా బయల్దేరి కారేసుకుని వెళ్ళాం. వెళ్ళాక అక్కడ " ఒరే! మేము కోడిని కొయ్యం కానీ మీరు కొయ్యండి. ఓ ముక్క ప్రసాదం తింటాలెండి" అన్నా. నేనక్కడ ఆ అమ్మవారిని "ఎంతకాలం ఈ గుమాస్తా వుద్యోగం నాకు?! ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ కావాలి నాకు తల్లీ! పైగా ఇక్కడ పనే లేదు. నాకు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతాన్నేను." అని కోరుకుంటూ దండం పెట్టుకున్నాను. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక మళ్ళీ కాకినాడ వచ్చేశాం.

నిజంగా చెప్తే నమ్మరు ఎవరూ... మరుసటి రోజు పొద్దున్న నేను ఆఫీసుకి వెళ్ళలేదు పనెలాగూ ఉండట్లేదని. భోంచేసి, పడుక్కుని లేచి మధ్యాహ్నం వెళ్ళాను. వెళ్ళగానే నా టేబుల్ మీద ఓ టెలిగ్రాం .

మా జనరల్ మేనేజర్ HR రామచంద్ర అని - కన్నడ ఆయన. ఆయన "Report immediately at Head office with bag అండ్ baggage " అంజెప్పి ఓ టెలిగ్రామ్ ఇచ్చారు నాకు. .

నాకైతే కొంచెం చెమటలు పట్టాయి. "ఏంట్రా బాబూ...మనమేమన్నా తప్పు చేశామా ఏంటి? ఈ టెలిగ్రామేంటి? ఎందుకు రమ్మన్నారు నన్ను?" అని వెంబడే ఇంటికెళ్ళిపోయి రాత్రి పది గంటలకి బస్సెక్కి చిలకలూరి పేట వెళ్ళిపోయాను.

మరుసటి రోజు పొద్దున్నే వెళ్లి కలిశాను రామచంద్ర గారిని. కలిస్తే... ఆయన చెప్పింది ఏంటంటే "నిన్ను ప్రమోట్ చేసి టంగుటూరు బ్రాంచ్ మేనేజర్ గా వేశారు. నువ్వర్జంటుగా వెళ్ళి ఛార్జ్ తీసుకో అక్కడ" అని.

నాకైతే ఒక విధంగా ఎంత సంతోషమేసిందో! "ఒరే బాబూ నిజంగా ఆ తల్లి - తలపులమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. దానివల్లనే మనకిది వచ్చింది" అనుకుని ఆ అమ్మవారికి మనసులో ఓ వెయ్యిదండాలు పెట్టుకుని "సరే సార్! నేను కాకినాడెళ్ళి వెళతాను" అంటే ఆయన "లేదు. నీకు కాకినాడకి వెళ్ళడానికి కూడా టైం లేదు. ముందు టంగుటూరు వెళ్లి ఛార్జ్ తీసేసుకో. తీసుకుని అక్కడ ఓ రెండ్రోజులుండి చూసుకుని ఆ ఆతర్వాత కాకినాడ వెళ్ళు" అన్నారు.

మరి నాకక్కడ టంగుటూరులో ఉండడానికి వసతిగా ఏమన్నా ఉన్నాయా అనడిగితే  "అక్కడ పత్తిపాటి సుబ్బారావు ఒకాయన వున్నాడు. ఎర్రబ్బాయ్ అంటారు ఆయన్ని. ఆయనకి ఓ నాలుగు గోడౌన్స్, గ్రేడింగ్ హాలు, ఓ చిన్న గెస్ట్ హౌస్ అన్నీ వున్నాయి అక్కడ ఆయన గెస్ట్ హౌస్లో వుండు. అక్కడుండి ముందు ఛార్జ్ తీసుకుని తరవాత కాకినాడెళ్ళి నీ ఫ్యామిలీని షిఫ్ట్ చెయ్యి" అని చెప్పారాయన.

ఇదెప్పుడూ అంటే 1980 ఏప్రిల్-మే ప్రాంతాల్లో. పిల్లలేమో MSN ఛారిటీస్‌లో చదువుతున్నారు. వీళ్ళకి మళ్లీ టంగుటూరు స్కూల్లో సీట్లు అవీ కావాలి అంటే ఏప్రిల్-మే నెలల్లో స్కూళ్ళలో సీట్లూ అవీ ఎవరిస్తారు? అసలే అకడెమిక్ ఇయర్ అయిపోవస్తూ ఉంటుంది.

ఇలాక్కాదని చెప్పి సుబ్బన్న గారి దగ్గరికి వెళ్ళాను. నాకు గురువుగారు, నా వెల్-విషర్ కదా!

ఆయన "ఒరే! వెళ్ళి అక్కడ బీనీడి వెంకట నరసయ్య అని చెప్పేసి వున్నాడు. ఆంజనేయ టొబాకో కంపెనీ వాళ్ళదే టంగుటూర్లో. నేను వాడికి చెప్తాను. నువ్వు వెళ్ళు. నీ పిల్లలకి స్కూల్లో సీట్లు అవన్నీ ఎరేంజ్ చేస్తాడు. అని చెప్పారు.

నేవెళ్ళి ఆ బీనీడి వెంకట నరసయ్యని కలిశాను. ఆయన "కామేశ్వరరావు! మీరు ఎప్పుడొచ్చినా సరే మీ పిల్లలకి హైస్కూల్లో సీట్లు ఉంటాయి. ఏం ప్రాబ్లెమ్ లేదు. నువ్వు బయల్దేరొచ్చేయ్. నీకు ఇల్లు కూడా నేనే చూస్తాను" అని చెప్పి కొండలరావు గారని చెప్పేసి ఆయన ILTD లో పని చేసి రిటైర్ అయ్యాడాయన. ఆయన ఇల్లు కూడా అద్దెకుందని చెప్పాడు నాకు. ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అలా ఓ నాలుగు రోజులు టంగుటూరు లోనే ఉండి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కాకినాడకి తిరిగి వచ్చేశాను. వచ్చేసి కాకినాడలో అందరికీ "నాకు టంగుటూరు ట్రాన్స్ఫర్ అయింది" అని చెప్పాను. నెలకి నాలుగంకెల జీతం కావాలనుకున్న నాకు టంగుటూరు కూడా మూడంకెల్లోనే మొదలయింది. సరే! ముందు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చింది కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుని టంగుటూరు వెళ్ళిపోయాను.

ఇక్కడ ఇంతకు ముందు మరిచిపోయిన కొన్ని సంగతులు చెప్పాలి. నేను కాకినాడలో ఉన్నప్పుడు లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎలాగంటే నాకు చిన్నప్పణ్ణించి కూడా అనాతవరంలో వనసర్ల సాయిబ్బు అని చెప్పేసి అతనికి ఒంటెద్దు బండి ఉండేది. నేను, మా నాన్న, మా అమ్మ అమలాపురంలో వున్న మా అక్కగారు పాపాయమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బండేసుకెళ్ళేవాళ్ళం. ఆ ఒంటెద్దు బండి తోలేవాణ్ణి నేను సరదాగా. తర్వాత మన పొలంలో అల్లుడు-మావల జత అంజెప్పేసి ఓ ఎడ్ల జత ఉండేది. ఆ ఎడ్ల జతకి రెండెడ్ల బండి నేనే నేర్పి ఆ బండేసుకుని ముమ్మిడివరం సినిమాలకి వెళ్ళేవాణ్ణి. దాంతర్వాత ఏంటంటే ఊళ్లోకి కొత్తగా రిక్షాలొచ్చాయి. ఓ సాయెబుండేవాడు. మా అమ్మగారికో అలవాటుండేది కదా! అమలాపురం వెళ్ళడానికి బండి వాళ్ళో, రిక్షావాళ్ళో వస్తే వాళ్ళని లోపలికి రమ్మని వాళ్లకేదో టిఫినో, పలహారమో పెట్టేది వెనకాల పెరట్లో. వాళ్ళలా లోపలికి తినడానికి వెళ్ళినప్పుడు ఆ రిక్షా వేసుకుని వెళ్లిపోయేవాణ్ణి. రిక్షా కూడా తొక్కేసేవాణ్ణి. వీటన్నిటితో పాటు గుఱ్ఱపు స్వారీ, గుఱ్రబ్బళ్ళు తోలడం సరే సరి!

ఇవన్నీ అయ్యాక తర్వాత్తర్వాత మోటర్ సైకిళ్ళు  - ఎస్సెల్సీలో ఉండగానే మొదట నేను నేర్చుకున్నదే బులెట్ మోటార్ సైకిలు - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ది. తరవాత కంపెనీకి వచ్చింతర్వాత కార్లు, జీపులు - ఇవి కంపెనీలో నేర్చుకున్నాను.

లారీ ఎలా నేర్వనేర్చుకున్నానంటే కాకినాడలో చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చినప్పుడు మాది పదివేల టన్నుల ఆర్డర్.

మా జనరల్ మేనేజర్ రామచంద్రకి ఓ విచిత్రమైన రూలు ఉండేది - లారీలు అన్నీ ఒకసారే వెళ్ళాలి, ఒకసారే రావాలి. ఓ లారీలో స్టెప్నీ, ఓ లారీలో జాకీ, ఓ లారీలో వీల్ రెంచు - ఇలా పెట్టి పంపించేవాడు. పన్నెండు లారీలు ఉండేవి మాకు. ఆయనే ఆటోమొబైల్ ఇన్‌చార్జ్ కూడా. ఈ లారీలు మొత్తం ఒకేసారి అక్కడ లోడ్ చేసుకుని కాకినాడ వచ్చి పోర్టుకి రాగానే మొదటి లారీ అన్లోడ్ కాంగానే ఆ లారీ తీసుకుని మిగతా లారీలు అన్లోడ్ అయ్యేవరకు ఆపోర్టులో ఈ లారీ వేసుకుని తిరుగుతూ వుండేవాణ్ణన్నమాట. అలా నేల మీద నడిచే ప్రతి వాహనం - ఒక్క ట్రెయిన్ తప్ప అన్నీ నేను డ్రైవ్ చేసేవాణ్ణి.

సరే! 1980 జూన్ నెలకి టంగుటూరు వచ్చేశాను.

టంగుటూరులో పత్తిపాటి సుబ్బారావుగారి గ్రేడింగ్ పాయింట్స్ ఉండేవి. ఆరొందల మంది గ్రేడర్స్ అక్కడ.

బయ్యింగ్ పాయింట్స్ ఓ పద్ధెనిమిది ఉండేవి. నెల్లూరు నుంచి కావలి, సింగరాయకొండ, జమ్ములపాలెం, టంగుటూరు, ఇలా చాలా పాయింట్స్ వుండేవి. వీటన్నిటిలో కూడా పొగాకు కొనుగోలు చేసే కంట్రోల్ మొత్తం నాదే. పద్ధెనిమిది కార్లుండేవి అక్కడ కూడా.

అన్నాబత్తుల వెంకట సుబ్బయ్య అని ఒకతను ఉండేవాడు. అతనిది జమ్ములపాలెం. అతను కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. కందుకూరులో కూడా ఒక బ్రాంచ్ ఉండేది. అది కూడా ఒక గ్రేడింగ్ పాయింట్. ఆదిపూడి వెంకట్రావు గారని చెప్పేసి ఆయన అక్కడ మేనేజర్. ఆయనకిద్దరు భార్యలు. ఆయన్ని సరదా చేస్తూ "ఒక పక్కన గంగమ్మ, ఒక పక్కన గౌరమ్మ,,, ఇద్దరు భార్యల ముద్దుల మగడా విభూతి మల్లన్నా... మెడలో నాగుల మల్లన్నా!"  పాట పాడేవాణ్ణి.

కొండలరావుగారింట్లో అద్దెకు దిగాం కదా! అక్కడ ఎదురుగుండా ఇంట్లో సుబ్బారావు అని ఒకాయన కఱ్ఱసాము నేర్పుతూ ఉండేవాడు. ఆయనకి ఇద్దరాడ పిల్లలు - అమృతరాణి, విషారాణి - భలే వింతైన పేర్లు. ఆ పెద్దపిల్లకి అప్పటికి ఓ పదిహేనేళ్ళు వుంటాయేమో కఱ్ఱసాము భలేగా చేసేది. వాళ్ళింటికి ఎదురుగుండా కరణంగారి ఇల్లు పిల్లలతో సందడిగా ఉండేది.

కొండలరావు గారింట్లో ఓ ఏడాది పాటు ఉన్నాక పిల్లలకి హైస్కూల్ దగ్గరగా ఉండాలని చెఱువు గట్టు మీద చింతచెట్లతోపు దగ్గరగా - కొణికి వెంకట శేషయ్యగారని - ఆయన ఇంట్లోకి మారాము. ఆ ఇంటికి ఏంటంటే ముందో వరండా, తర్వాత రెండు గదులు ఉండేవి అంతే! బాత్రూములు అవీ కూడా లేవు. నేను ఆ వరండాకి ఇనప గ్రిల్ పెట్టించి మూడో గదిలా వాడుకున్నాను. బాత్రూములూ అవీ కూడా నేనే కట్టించుకున్నాను.

(ఇక్కడో మాట చెప్పాలి. 2018లో మా అమ్మాయి లల్లి పదో తరగతి వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుకున్నప్పుడు మేమందరం టంగుటూరు వెళ్ళాము. అప్పుడు కొణికి వెంకట శేషయ్యగారు మంచం మీద వున్నవాడు కూడా నన్ను చూడ్డానికని లేచి వచ్చాడు. నా రెండు చేతులూ పట్టుకుని "నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కామేశ్వరరావుగారూ!" అని ఒకటే ఏడ్చేశాడు.  పెద్దాయన పాపం! నన్ను చూసి ఎంతో ఆనందించాడు.

వాళ్ళ ఇల్లు అద్దెకు అడగడానికి వచ్చినవాళ్లు ఆ ముందు గ్రిల్ తీయించేస్తేనే అద్దెకు వస్తామని అంటే - ఆ గ్రిల్ కామేశ్వరరావుగారు కట్టించారూ,  అదలా ఉండాల్సిందే, మీరు అద్దెకి రాకపోయినా ఫర్వాలేదు అని చెప్పి - ఆ రెండు వాటాలు ఈ రోజుకీ అలాగే ఖాళీగా ఉంచేసుకున్నాడు. నేనంటే ఎంత అభిమానమో!)

<వచ్చేమాటు తరువాయి కథ>

29, జూన్ 2020, సోమవారం

వూ-రీ డైరీ - 1 - ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!


ఇంతకు ముందు డైరీ విశేషాలు: వూ-రీ డైరీ - ప్రమాణశ్రీకారం



"మిస్టర్ వూ" అనబడు సుబ్బారావు డైరీ నుంచి ఒక రోజు పేజీ:



హేవిటో! నాకంతా కలలా వుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడంలో ఇంత ఆనందముందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

ఏడాదంతా కోడు రాసి, బగ్గు లేరి కష్ట పడితే ఆఫీసు వాడిచ్చే Meets expectations - Exceeds sometimes రేటింగూ ఓ రేటింగేనా?

అదసలు ...  ఎప్పటికప్పుడు మా సుందరి బొటనవేలెత్తి, కనుబొమలు లేపి ఇచ్చే 'బా చేశావోయ్, బావా!" అనేలాంటి expression ముందు ఏపాటిది?

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంతకు ముందులా కాదు - ఇల్లంతా నా అధీనంలోకి వచ్చేసింది.

మా పిల్లలిద్దరూ కూడా ఏమన్నా ప్లేటో, గ్లాసో కావాలంటే "డేడీ!" అంటూ నన్నే పిలుస్తున్నారు. సింకులో గిన్నె పడడం ఆలస్యం ... తక్షణం తోమడం తథ్యం అన్నదే నా మంత్రం.

అసలు నేను మొదటి గిన్నె తోమినప్పుడు మా సుందరి గోముగా చూసిన చూపు వెలుగులలో నేను తోమిన గిన్నె తళతళలే వెలవెలలాడాయి. అదే మొదటిసారి మా సుందరి నన్నలాంటి చూపు చూడడం.

అప్పుడే నేను పడిపోయా - తోము-ప్రేమలో.

ఇహ అందులోంచి బయటికి రాలేకపోతున్నాను. ఆ చూపులోని గోము అలాగే ఉండాలని సింకులో గిన్నెలు ఎన్నున్నా లెక్కచెయ్యకుండా, ఎన్నున్నాయో అని లెక్కెయ్యకుండా మళ్ళీ మళ్ళీ తోముతూనే ఉన్నా... ఉంటా కూడా!

Raising the bar in dishwashing!

"మిసెస్ రీ" అని పిలిస్తేనే పలికే సుందరి డైరీ నుంచి అదే రోజు పేజీ: 



అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కానీ నాకు నచ్చిన ఓ మాట " పండు పంచివ్వరాదు".

నాక్కావాల్సినట్టు అనుకున్న ఇంకో మాట "పని పంచకుండా ఉంచరాదు".  అసలే మనది మేడె-మోక్రసీ. అందుకే  మా బావ "వూ" కి కూడా పని పంచా.

మొదట్లో ఓ చెంచా కడగడానికే ఇబ్బంది పడిపోయేవాడు. మా అత్తయ్య బొత్తిగా ఏ పనీ నేర్పలేదు మా బావకి. అలా అయితే ఎలా? ఆడుతూ, పాడుతూ పనిపాటలు చేసుకోవాల్సింది మేమే కదా!

నిజం చెప్పకపోవడమేం! మొదట్లో నాకు మా వూ బావ చేత చెప్పీచెప్పకుండా, అడిగీ అడగకుండా ఎలా పని చేయించాలో తెలిసేది కాదు.

ఈలోగా ఓ రోజు మా పక్కింటి క్యాథీ వాళ్ళ కుక్కపిల్లకి బంతి విసిరితే పరుగెత్తుకుంటూ వెళ్ళి తీసుకు రావడం నేర్పుతోంది. ఆవిడ బంతి విసరడం, ఆ కుక్కపిల్ల గెంతుకుంటూ వెళ్ళి ఆ బంతిని పట్టుకురావడం. చూడగా చూడగా ఆ శిక్ష(ణ?) కిటుకు తెలిసిపోయింది నాకు.

అలా ఒక చిన్న గరిటె సింకులో వేసి, తోమమని గోముగా చూసి, అది తోమగానే ఇంకో గంటకి ఓ చిన్న పాల గ్లాసో, కాఫీ కప్పో సింకు లోకి తోసి - తోమిన ప్రతిసారీ బొటన వేలెత్తి, బోల్డు పొగిడి, అలాఅలా ఒక అంతం లేని for(ever) loop లా మొదలు పెట్టి, ఇప్పటికి కదా ... బుట్టెడు గిన్నెలు కడగడం, ఇంటెడు బట్టలు ఉతకడం దాకా తీసుకు రాగలిగాను!

అన్నట్టు ఈ నెల మా ఫేసుబుక్కు వాలు పైన సవాల్ ఏంటీ అంటే...ఎవరి ఇంటాయన తోమిన గిన్నెలు ఎక్కువ తళతళలాడుతున్నాయీ అని.

మా శ్రీవారు వూ-గారి పుణ్యమా అని అది నేనే నెగ్గా...

ముద్దుముద్దుగా చెప్పి ... ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

కడుగుల్, తోముడు, దులుపుల్, సినిమా వీక్షణంబులున్
వినుట యందనురక్తి, ఎఫ్బీ ఇన్స్టా, వాట్సాప్ సారథ్యముల్
నోరూరించెడి పాకశాస్త్ర విదితం, బేబీల సిట్టింగులున్
ముదితల్ నేర్పగరాని విద్యగలదే, భర్తల నేడ్పించకన్?!

19, జూన్ 2020, శుక్రవారం

త్వామనురజామి - 48 - నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 47 - హాయి హాయిగా మురిసేనే...

గుంటూరు స్టేషన్లో ట్రెయిన్ దిగగానే ఎప్పట్లాగే - నాన్న, నాన్నతో పాటు పప్పీ, కుట్టీ, ప్రశాంతి, వీళ్ళతో పాటు తంబి మామయ్య కొడుకు వాసు - బిలబిల్లాడుతూ వచ్చేశారు. దిగిన నన్నూ, దింపుకున్న నా సామానునీ తీసుకుని హడావిడిగా మాట్లాడుతూ  గలగల్లాడుతూ కారెక్కేశాము అందరమూ.

ఇంటికెళ్ళగానే అమ్మ ఎఱ్ఱనీళ్ళు దిష్టి తీసి పారబోసింది. అప్పటికే లక్ష్మిదొడ్డ ప్రశాంతితో పాటు నేను రావడానికి రెండ్రోజుల ముందే వచ్చేసి వుంది. ఇల్లంతా కడుగుళ్ళూ, సామాను జరుపుళ్ళూ వగైరాలతో పీకి-వెయ్యని పందిరిలా వుంది.

లక్ష్మి దొడ్డ కలిపిచ్చిన పాలు తాగి, నాకిష్టమైన గోధుమరవ్వ ఉప్మా తిని, పప్పీ-కుట్టీలతో బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. అమ్మ, దొడ్డ ఏవేవో లిస్టులు రాసుకుంటూ - ఎవర్ని పిలవాలి, పెళ్ళిబట్టలు ఎక్కడ కొనాలి, ఎన్ని కొనాలి, సరుకులు ఏం తెప్పించాలి - ఇలాంటివేవో మాట్లాడుకుంటూ ఊపిరి సలపనంత హడావిడిగా వున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం అందరం భోంచేసి - మధ్యగదిలో తరగడాలేసుకుని పడుక్కుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ నా పెళ్ళిచీరలు కొనడానికి రాజమండ్రి వెళ్దామనుకుంటున్నామని, నన్ను కూడా వాళ్ళతో తీసుకెళ్దామనుకుంటున్నామని చెప్పింది.

అది వినగానే "నేను రాలేనమ్మా! ఆ షాపింగ్ అదీ నాకు బోర్. నేనింట్లోనే వుంటాను. నువ్వేం కొన్నా నాకు బానే ఉంటుంది " అనగానే అమ్మ కళ్ళలో ఓ మెరుపులాంటి మురిపెంపు నవ్వు - ఎప్పట్లాగే నేను తను కొనబోయే ఏదైనా సరే కాదనకుండా కట్టుకుంటానని చెప్పానని.

నా పెళ్ళి మాత్రం నాకిష్టమైనట్లు అయితే చాలు - నాకింకేమీ పట్టవు అని అమ్మకి నేనప్పుడు నోరు తెరిచి చెప్పకపోయినా, నా పెళ్ళిబట్టలు కొనడం దగ్గర్నుంచి, నా పెళ్ళికి నా  ఫ్రెండ్స్ ఎవర్ని పిలవాలీ అనే దాకా కూడా నేను అంతగా పట్టించుకోలేదు, అమ్మతో వాదించలేదు. అమ్మ ఎవర్ని పిలవాలనుకుంటే అంటే వాళ్ళనే పిలవమని చెప్పాను. అప్పటికి రెండున్నర ఏళ్ళుగా నా మాట చెల్లించుకోవడానికి ఆవిణ్ణి విసిగించింది చాలు అనిపించింది నాకు. ఇప్పటికైనా ఆవిడ చెప్పే మాట విందామని అనిపించింది.

నేను గుంటూరు వచ్సిన మరుసటిరోజు ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు వచ్చాడు. వస్తూ బోల్డంత గోరింటాకు తెచ్చాడు. వెన్న కూడా తెచ్చాడు. పెళ్ళికి ఇంకా దాదాపు పదిరోజుల టైం ఉంది, అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చులే అనుకుని నా కుడి చేతికి, పాదాలకి గోరింటాకు పెట్టుకున్నాను.

అమ్మ చాలా రోజుల తర్వాత నాతో మళ్ళీ సరదాగా మాట్లాడుతోంది. చాలా సంబరంగా, హుషారుగా వుంది.

నేనోరోజు పొద్దున్నే అటూఇటూ తిరుగుతూ - ఎప్పుడూ ఏదో ఒకటి పాడుకోవడం అలవాటు కదా - రేడియోలో అంతకుముందే వినున్నానేమో - రాజమకుటం సినిమా పాట "ఏడనున్నాడో ఎక్కడున్నాడో ... నా చుక్కలరేడు" అని పాడుతుంటే అప్పుడే లోపల్నుంచి ఎందుకో బయటకొచ్చిన అమ్మ "ఇంకెక్కడుంటాడు? బ్రాడీపేట 2/11 లో వున్నాడు" అంది నవ్వతూ. నాకప్పుడు బోల్డంత సిగ్గు, దాంతో పాటే ఇంకా బోల్డంత ఆనందం, దాంతోపాటు ఇంకాఇంకా బోల్డంత ఆశ్చర్యం - ఒక్కసారి పెళ్ళి చేసేద్దాం అనుకున్న తర్వాత అమ్మ నాతో ఎప్పట్లాగే సరదాగా మాట్లాడుతోందని.

అనుకున్నట్టుగానే అమ్మ, ప్రభావతి దొడ్డ వాళ్ళ సాయితో కలిసి నా పెళ్ళిచీరలు రాజమండ్రి బొమ్మన రాజ్‌కుమార్ షాపులో కొనుక్కొచ్చింది. బుట్టలోకి బంగారం రంగుకి గులాబీ అంచు చీర, పెళ్ళయ్యాక సత్యనారాయణ వ్రతానికి వంగపండు రంగుకి ముదురు నీలం అంచు చీర, ఇంకా ముదురాకుపచ్చకి గులాబీ రంగు అంచు చీర - మొత్తం మూడు పట్టుచీరలు, ఇంకా చాలా ప్రింటెడ్ సిల్కులు, షిఫాన్లు, కాటన్లు పట్టుకొచ్చింది. పెళ్ళైన పదహార్రోజుల వరకు పాతచీర కట్టకూడదు అని చెప్పింది.

చీరల సందడి సద్దుమణిగింది. ఇప్పుడింక వెండి పట్టీలు, చెవులకి రెండో కుట్టు కుట్టించడానికి చిన్నచిన్న ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు రెండు - కాడతో చెవులు కుట్టడానికి ఉన్నవి - కొందామని శంకర్ విలాస్ దగ్గరున్న కిషోర్ జ్యుయలర్స్‌కి వెళ్ళాము నేను, అమ్మ, లక్ష్మి దొడ్డ.

మేము వెళ్ళినప్పుడే అక్కడికి మా శ్యామసుందరి మేడం వచ్చారు. ఆవిడ BH లో మాకు కెమిస్ట్రీ లెక్చరర్. ఆవిడే నా కెమిస్ట్రీ రికార్డు మీద నా పేరు లలితా టి ఎస్ వడ్లమాని అని రాసుకుంటే "పేరు ఇలా కూడా రాసుకుంటారా?" అని నవ్వారు.

నాకు, అపర్ణకి BH లోచదివేటప్పుడు అందరి కన్నా శ్యామసుందరి మేడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడావిణ్ణి దాదాపు ఆరేళ్ళ తర్వాత చూశాను. ఆవిడకి నా పెళ్ళి అని తెలిసి బోల్డు సంతోషించారు. ఆవిడ ఏదో నెక్లెస్ కొనడానికి వచ్చారు. నేను వద్దంటున్నా వినకుండా ఆవిడ కొన్నదాన్ని ఓ సారి నా మెళ్ళో పెట్టి "నీ మెడకి ఇదెంత బావుందో!" అని చూసుకుని తెగ మురిసిపోయారు. అదే ఆవిణ్ణి చూడడం. మళ్ళీ ఇంకెప్పుడూ కలవలేకపోయాను.

సరే! చెవులు కుట్టించుకోవడానికి ఎఱ్ఱముక్కుపుడక కాడలు తెచ్చుకున్నాను కదా! ఐదో లైనులో ఎవరో కంసాలాయన వున్నారు, ఆయన ఇంటికి వెళ్తే చెవులు కుడతారు అని చెప్పారు అమ్మాజీ ఆంటీ. ఓ రోజు మధ్యాహ్నం మూడింటికి అమ్మ, లక్ష్మి దొడ్డ, పప్పీ, కుట్టీ, ప్రశాంతి, నేను, అమ్మాజీ ఆంటీ - ఏడుగురం కలిసి నా రెండు చెవులు కుట్టించుకోవడానికి వెళ్ళాము.

ఆ కంసాలాయన భలే మంచాయన. నొప్పి వస్తుందేమో అని భయపడుతూ చెవిని అందించడానికి ఆలస్యం చేస్తున్న నాతో ఎంతో ఓర్పుగా కబుర్లు చెప్తూ చెప్తూ, ఒడుపుగా ఒక చెవిలో బంగారం కాడ నాకు తెలీకుండా కసుక్కుమని దించేశారు. అబ్బా! ఎంత నొప్పొచ్చిందో!

ఆ దింపిన కాడని చెవి వెనక పక్క పొడుగ్గా ఉన్న బంగారం కాడను చుట్టి, రెండో చెవి కుడదామని ఆయన నా చెవి పట్టుకున్నారో లేదో నేను నోరంతా తెరిచి "ఆఁ ఆఁ ఆఁ" అని గా...ఠిగా ఏడవడం మొదలుపెట్టాను. ఆయన ఒక్క నిముషం నా ఏడుపుకి బిత్తరపోయి "ఇంత మాత్రానికే అలా ఎవరన్నా ఏడుస్తారా? ఆయ్!" అని గద్దిస్తూ రెండో చెవి కూడా కుట్టేశారు. నా ఏడుపు విని నాతో ఉన్న అమ్మావాళ్లు కూడా ఒక క్షణం బిత్తరపోయారు.

రెండు చెవులకి ఎఱ్ఱరాళ్ళ ముక్కుపుడకలు కుట్టేశాక - ఇంటికి వచ్చేస్తూ ఉంటే పప్పీ, కుట్టి, ప్రశాంతి అయితే ఒకటే నవ్వు. కుట్టెమ్మ "అదేంటే లల్లెమ్మా... అలా ఏడ్చావు? నయం ... ఆ కంసాలాయన ఇంటికి చుట్టూ గోడ, పెద్ద చెక్క గేటు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేవాళ్ళు, ఏం జరిగిపోతోందా అని, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తొక్కేసుకుంటూ విరగ్గొట్టేసుకునేవాళ్ళు." అంటూ ఇంటికి వెళ్తున్నంతసేపూ నా భుజం మీద చెయ్యేసి ఊపేస్తూ లాక్కెళ్ళిపోతూ.

ఆ రోజుకి నాకు చెవులు రెండూ చాలా నొప్పి చేశాయి.

ఆ రోజు రాత్రి అమ్మ పడుక్కునేముందు కుంకుమ, వెల్లుల్లి వేసి కాచిన గోరువెచ్చటి నూనె నా రెండు చెవులకి ఆ బంగారం కాడలు కుట్టినచోట రాసింది.

మా ఇంటి మధ్యగదిలో లక్ష్మి దొడ్డ, ప్రశాంతి, నేను, పప్పి, కుట్టి ఓ జంబుఖానా, దాని మీద బొంతలు వేసుకుని పక్కపక్కనే వరసగా పడుక్కున్నాం. మార్చ్ నెల మొదటి వారం అయినా ఇంకా చిరు చలిగా అనిపిస్తూ ఉండడంతో రాత్రి పూట అందరం మా మా చిన్నరగ్గులు కప్పుకుని పడుక్కున్నాం.

ఒక రాత్రి వేళ నా కుడిచెయ్యి చూపుడు వేలు దగ్గర ఏదో మెత్తగా కదిలినట్టయ్యి, దాంతో పాటే వేలు కూడా కొంచెం చురుక్-చురుక్కుమనడంతో మెలకువ వచ్చింది నాకు. ఏంటా నొప్పిగా ఉంది అనుకుని లేచి, అక్కడే లైట్ వేస్తే నా పక్కనే పడుకున్న వాళ్ళందరూ లేస్తారని మండుతున్న వేలుని ఊదుకుంటూ, నెమ్మదిగా నిద్రకళ్ళ తోనే లేచి వెళ్ళి వంటిట్లో లైట్ వేశాను.

ఇంతలో నా వెనకాలే లేచొచ్చిన పప్పీ నా వేలు కేసి చూసి "లల్లీ! నీ వేల్లోంచి రక్తం వస్తోంది." అంది.

అప్పటిదాకా ఏదో మంటగా ఉంది, ఎందుకబ్బా అనుకుంటున్న నేను రక్తం అన్న మాట వినగానే మళ్ళీ గా...ఠిగా గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాను. వెంటనే మా పక్కనే పడుకున్న లక్ష్మి దొడ్డ, ఆ చివర బెడ్‌రూంలో పడుకున్న అమ్మా-నాన్నా "ఏమైంది, ఏమైంది? అర్థరాత్రి పూట ఈ ఏడుపేంటి?" అనుకుంటూ కంగారుగా లేచి వచ్చారు.

నా వేలు చూస్తే - దానిమీద ఉడత వీపు మీద ఉండే మూడు చారల్లా - ఎవరో కొరికినట్టు మూడు గీతలు, వాటిలోంచి కారుతున్న రక్తం కనిపించింది. అది చూడగానే లక్ష్మిదొడ్డ "చుంచో, ఎలకో కొరికినట్టుంది" అంది.

అది విని అసలే ఆరున్నొక్కరాగం పాడుతున్న నేను ఇంకొంచెం శృతి పెంచాను.

నాన్నకి ఓ పక్కన విసుగొస్తున్నా - కాబోయే పెళ్ళికూతుర్ని విసుక్కోకూడదనుకున్నారేమో మరి - తమాయించుకుని - "ఏదీ నన్ను చూడనీ" - అని నా వేలు పట్టుకుని చూసి "ఏదో కొంచెమే కొరికింది. రేప్పొద్దున్నే మన కామేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళొద్దామో సారి" అన్నారు.

ఇంతలో అమ్మ "చెవికి వెల్లుల్లి నూనె రాశాను కదా! ఆ వాసనకి వచ్చుంటుంది ఎలక. నయం.. చెవి కొరికెయ్యలేదు." అంటూనే నాన్న కేసి తిరిగి "రేపోసారి ఆ వెంకటేశ్వర్లని ఇంటికి రమ్మనండి. వంటింట్లో అటక మీద బోల్డు ఎలకలున్నట్టున్నాయి. వాటిని శుభ్రం చేస్తాడు" అంది.

ఈలోగా నా చెయ్యి కడుక్కుని వచ్చాను. లక్ష్మిదొడ్డ దానికి ఓ చిన్నగుడ్డముక్కతో కట్టు కట్టింది. అప్పటికే తెల్లవారుఝామున నాలుగయ్యింది. నాన్న మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకుండిపోయారు. అమ్మ లక్ష్మి దొడ్డ పక్కనే వాలింది - ఇంకో గంటలో ఎలాగూ లేద్దామని.

నాకింక ఎలక భయంతో నిద్రపట్టట్లేదు. నేను, పప్పి, కుట్టి, మాతోపాటు ప్రశాంతి - మేం నలుగురం బయటికెళ్ళి కుర్చీల్లో కూర్చుని ఆరంభమే తప్ప అంతమే లేని కబుర్లు, కలకలలూ మొదలెట్టేశాం.

నాన్న పొద్దున్నే నిద్ర లేస్తూనే నాకు గుర్తు చేశారు డాక్టర్ గారి దగ్గరికెళ్ళాలని. ఎనిమిదిన్నరకల్లా తయారయి ఎజ్డి మీద ఎక్కించుకుని నాన్న నన్ను బ్రాడీపేట రెండో లైనులో వున్న డాక్టర్ కామేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడే క్లినిక్ తాళాలు తీస్తున్నారు డాక్టర్ గారు. నన్ను ఎలుక కరిచిందని చెప్పగానే ఎప్పట్లాగే తెల్లగా, చల్లగా నవ్వేసి "అబ్బే! నీకేమీ కాదు" అని ఓ TT ఇంజక్షన్ చేసేసి నన్నింటికి పంపేశారు డాక్టర్ గారు.

ఆ రోజు నాన్న ఆఫీసుకి వెళ్లిన తర్వాత పొద్దున్న పదీ-పదిన్నర టైంలో ఆఫీసులో పని చేసే వెంకటేశ్వర్లు, తనతో పాటు ఇంకో ఇద్దర్ని మా ఇంటికి పంపించారు. వచ్చిన ముగ్గురూ వస్తూనే వంటింట్లో అటక ఎక్కి ఓ గంట సేపు వెతికి వెతికి ఉన్న ఎలుకల నన్నింటినీ పట్టి, ఓ గోనె సంచిలో వేసుకుని, వెంకటేశ్వర్లుతో పాటొచ్చిన వాళ్ళిద్దరూ  పట్టుకెళ్ళిపోయారు.

వాళ్ళటు వెళ్ళగానే కుట్టి "లల్లెమ్మా! నీ పెళ్ళి కాదు గానీ మనింట్లో ఎలుకల పెళ్ళైపోయింది." అని నాతో అంటూనే, అప్పుడే అటక దిగుతున్న వెంకటేశ్వర్లుతో " మొత్తానికి, వెంకటేశ్వర్లు! మా అటక పీకి పందిరేశావ్!" అనగానే వెంకటేశ్వర్లు "చిన్నపాపగారు తమాషాగా మాట్లాడతారు" అనుకుంటూ మళ్ళీ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో పెళ్ళికి వినాయకుణ్ణి పెట్టటం, వెళ్ళగలిగిన చోటికి పెళ్ళిపిలుపులకి వెళ్ళడం, వెళ్ళలేని దూరంలో ఉన్నవాళ్ళకి శుభలేఖలు పోస్ట్ చెయ్యటం, ఫోన్లు చెయ్యటం, పెళ్ళికి వచ్చేవాళ్ళకి పెట్టడానికి బట్టలు, పెళ్ళికి ఏం సామానులు కొనాలో లిస్టులు రాసుకోవడం, ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్లు తెచ్చి పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఇంట్లోంచి బయటికి, బయటి నుంచి ఇంట్లోకి - ఇంట్లో ఉన్న పెద్దా-చిన్నా అందరూ హడావిడిగా తిరగడం...అబ్బ! పెళ్ళంటే ఎంత సందడి కదా! ఎంత బావుందో అనిపించేలా ఉంది.

హైద్రబాదు నుంచి వచ్చే దొడ్డలు, పిన్నులు, వైజాగ్ నుంచి వచ్చే లలితత్తయ్య, అనాతవరం నుంచి అప్ప-దొడ్డ - అందరూ పెళ్ళికూతుర్ని చేసే ముందు రోజు బయల్దేరి వస్తున్నారని తెల్సింది. అందులోనూ మార్చ్ మధ్యలో పెళ్ళి కదా... స్కూళ్ళు, పరీక్షల హడావిడి వల్ల పిల్లలు ఎవ్వరూ రాకపోవచ్చు అనుకుంటున్నారు అమ్మా-నాన్న.

ఈలోగా అమ్మ నాకు పెళ్ళి కోసం చేయిస్తున్న గొలుసు, బుట్టలు, ఇంకా ఏవేవో వస్తువులు పట్టుకుని విష్ణువర్ధనరావుగారు ఇంటికి వచ్చారో సాయంత్రం. ఆయన రాగానే అమ్మ నా ఎడం చేతి చూపుడు వేలు కొలత తీసుకుని ఒక పగడపు ఉంగరం, ఒక కళ్యాణపుటుంగరం కూడా చేయించమని చెప్పింది. ఓ నాలుగు రోజుల్లో చేసిస్తానని చెప్పి వెళ్లిపోయారు ఆయన.

అమ్మ నాకోసం తెచ్చిన చీరలకి బ్లౌజులు కుట్టిద్దామని నన్ను బ్రాడీపేట 5/21 లో ఉండే రాణి అనే ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు ఎప్పుడూ స్కర్ల్టు, వాటి మీద కాలర్ ఉండే ఫుల్ స్లీవ్స్ షర్ట్లు అలవాటు. అందుకే నా చీరల మీద బ్లౌజులు కూడా ఎప్పట్లాగే మెడ కనిపించకుండా హై-నెక్ కుట్టమని గొడవచేశాను.

వెంటనే ఆ రాణిగారు "పెళ్ళి చీరల మీద ఏం బావుంటాయో నాకు తెలుసు. ఈ సారి నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వింక మాట్లాడబోకమ్మాయ్" అని నన్ను విసుక్కుంది.

పక్కనుంచి అమ్మ కూడా "ఈసారి ఆవిడ చెప్పినట్టు విను" అంటోంది. అసలే అమ్మని విసిగించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టనుకుని వున్నాను కదా! ఇహ మరి మాట్లాడలేదు. నాకెలాగూ తెలుసు - రాణిగారు బాగా కుడతారని.

నేనేమీ మాట్లాడకపోవడం చూసి - ఇక మా అమ్మ, రాణి కలిసి ఆ తర్వాత ఓ గంటసేపు - ఇది పొడుగు చెయ్యి, అది పొట్టి చెయ్యి, దీనికి రౌండ్ నెక్కు, దానికి వీ-నెక్కు అంటూ - నా చీరల మీదకి బ్లౌజులన్నిటినీ వాళ్ళిష్టమొచ్చినట్టు - కుట్టెయ్యమని ఈవిడ ఆవిడకి బట్టలు, కుట్టేస్తానని ఈవిడకి ఆవిడ మాటలు - ఇచ్చిపుచ్చుకున్నారు.

అక్కణ్ణించి ఇంటికి వస్తుంటే అమ్మ చెప్పింది - మా ఇంటి మధ్య గదిలో నాలుగు పక్కలా పూలగుత్తుల్లాంటివి వేసి, వాటి మీద ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో పెయింట్ చేస్తే బావుంటుంది, పెళ్ళికూతుర్ని చేసేది అక్కడే కదా బాగా కనిపిస్తుంది అని.

నాకెలాగూ ముగ్గులెయ్యడం సరదా. పైగా ఇంకెవరు వేసినా నాకంతగా నచ్చేది కాదు. అందుకే ఆ పూలగుత్తులు, వాటికి రంగులూ నేనే వేస్తానని చెప్పాను. చెప్పినట్లే వేశాను.

మళ్ళీ మా అమ్మకి బోల్డు ఆనందం. ఆవిడ నాకు వెయ్యమని చెప్పకుండానే పువ్వులూ, రంగులూ చేసేశానని. నేనడిగిన ఒక్కటీ నాకు దొరికిందన్న ఆనందంలో నేనావిడ ఏదడిగినా చేసేస్తున్నానని నాకు మాత్రమే తెలుసు.

ఆ పక్క రోజే ఫాల్గుణ పౌర్ణమి. చిన్నప్పట్నుంచి హోలీ చేసుకోవడం అలవాటు లేదు కానీ ఆ రోజున రంగురంగుల పట్టు పరికిణీలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఈసారి కూడా ఏదో కొత్తచీర ఎఱ్ఱటి పూలది కట్టుకుని, ఇంటి ముందున్న చిన్న ఖాళీలో నేను పెంచుకుంటున్న తులశమ్మ ముందు పద్మాల ముగ్గు వేశాను. ఆ రోజు సాయంత్రం తెల్లగా కాసిన వెన్నెల్లో పసుపుపచ్చ, కెంపు వెన్నెల్లో విరబూసిన చంద్రకాంత పూలు కోసుకుని దండ కట్టుకున్నాను.

ఆ ఫాల్గుణ పౌర్ణమి రోజు మొదటిసారిగా దిగులుగా అనిపించింది.

జరగబోయేది నా పెళ్ళి. నే కోరుకున్నట్టుగానే నా కిష్టమైన అబ్బాయితోనే. అది కూడా మా అమ్మానాన్నలు ఒప్పుకుని నా ఇష్టాన్ని మన్నిస్తూ చేస్తున్నదే!

అయినా ఇంకో మూడు రోజుల్లో అమ్మనీ, నాన్ననీ, పప్పీని. కుట్టీని, ఈ ఇంటినీ, తులశమ్మనీ, ఆ తులశమ్మ ముందు ముగ్గు వేసే మురిపాన్నీ, ఆ ముగ్గులో రాలే విరిసిన చంద్రకాంతల్నీ ఒదిలి వెళ్తాననే బెంగ.


ఆ రోజు రాత్రి అందరం భోజనాలు చేసిన తర్వాత - ఎప్పటి మా అలవాటు ప్రకారం ఇంటి ముందున్న కుర్చీల్లో కూర్చుని పప్పి, కుట్టీలతో కలిసి ఛాయాగీత్ వింటున్నాను. చలో దిల్‌దార్ చలో ...చాంద్ కే పార్ చలో...అని రఫీ రాగాలు తీస్తుంటే , హమ్ హై తైయార్ చలో అని లతా మంగేష్కర్ ఆనందంగా పాడేస్తోంది. అదేంటో ఎప్పుడు ఛాయాగీత్ పెట్టినా వారానికి నాలుగు రోజులు ఆ పాట తప్పకుండా వచ్చేది.

ఆ పాట వింటుంటే కుట్టి అందుకుని "లల్లి తైయార్ చలో" అని పాడుతూ నాకేసి చూసి "ఇంకో మూడు రోజులే లల్లెమ్మా! నిన్నిహ పద పద పమ్మక్కా అని పంపించేసి నేను, పప్పి హాయిగా ఉంటాం. కదే పప్పీ!" అని పప్పితో అని - మళ్ళీ నాకేసి తిరిగి - " అప్పుడు నీ స్టాంపులు, బొమ్మలు అన్నీ నావే!" అని నవ్వింది. పప్పి కూడా సవ్వడి లేని నవ్వు ముత్యాలు రాల్చింది. 

నేను వెంటనే లేచి వంటింట్లో గిన్నెలేవో సర్దుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వంటింట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు.

"అమ్మా!" అని వంటింటి తలుపు దగ్గర ఆగి మెల్లిగా పిలిచాను.

అమ్మ గ్యాస్ గట్టు తుడుస్తూ "వచ్చావా? అదుగో ఆ వాటర్ ఫిల్టర్ మీద గ్లాసులో పాలు పోసిపెట్టాను. తాగు." అంది తల తిప్పకుండానే.

ఒకడుగు ముందుకేసి ఆ గ్లాసు తీసుకుని రెండు అరచేతుల మధ్యా ఆ గ్లాసునలముకుని  ఉన్న వెచ్చదనాన్ని పట్టుకుని, పాలు ఓ గుక్క తాగి "అమ్మా! నేనిన్ని రోజులు హాస్టల్లోనూ, ప్రాజెక్టు కోసమని బెంగుళూర్లోనూ ఉన్నాను. అసలు ఇంట్లోనే ఉన్నట్టు లేదు. అందుకే నా పెళ్ళయ్యాక ఓ మూణ్ణెల్లు మనింట్లోనే నీ దగ్గరే ఉంటానూ... సరేనా?!" అని నెమ్మదిగా అడిగాను. ఎందుకో తెలీని దుఃఖమొస్తోంది. ముక్కు పీలుస్తున్నాను.

అమ్మ తల తిప్పి చూసి నవ్వబోయి, నన్ను చూసి ఏమనుకుందో ఏమో, దగ్గరగా వచ్చి "నీకిష్టమైనట్టుగానే అన్నీ చేస్తున్నాంగా. ఆ తర్వాత చూద్దాంలే... " అని ఆగి ... మళ్ళీ ఏదో ఆలోచించుకున్నట్టు "నీక్కావల్సినన్ని రోజులు మనింట్లో ఉందువుగానిలే. వెళ్ళు - ముందు ఆ పాలు తాగేసి ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుక్కో. " అని చెప్పింది.

ఇంతలో - ఎప్పట్నుంచి మా మాటలు వింటోందో - కుట్టి నా పక్కనే వచ్చి నించుని ఓ చేత్తో నా షిప్లీ బొమ్మని పట్టుకుని "చంటిపిల్లలా అమ్మని వదిలి వెళ్ళనని ఏడుస్తావేంటే, లల్లీ ? ఇదిగో ---దీన్ని కూడా పట్టుకుపోవే బాబూ! దీన్ని పట్టుకుని జుజుజుజుజూ అని ఎంచగ్గా పాడుకోవచ్చు నువ్వు." అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అంటుంటే నాకు అంత దుఃఖం లోనూ బోల్డు నవ్వొచ్చేసింది.

కానీ ఆ రోజు రాత్రి కలత నిదురే! ఆ నిద్రలో అంతూదరీ, అర్థంపర్థం లేని ఆలోచనలే!

నాకు ఆ క్షణంలో నిజంగా ముందుముందు ఇలా జరగబోతోంది అన్న అంచనా కానీ, ఇలా జరగాలీ అన్న అనుకోవడాలు కానీ లేనేలేవు.

కానీ ఇప్పుడున్నట్లు ఇక ముందు ఉండదూ, ఉండబోదు అన్న ఒక ఎఱుక.

అది నచ్చుతోంది. అది నచ్చట్లేదు కూడా.

అమ్మనొదిలి, నాన్ననొదిలి
పారాడి, పెరిగి, తిరుగాడిన వీడునొదిలి
నేర్చిన ముగ్గుల తీర్చిన వాకిలొదిలి 
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి

చెల్లి నొదిలి, చెలిమి నొదిలి
సరదాల పాడుతున్న పాట నాపి 
నవ్వులాటల చెలగాటలాపి
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి 

తెలియరాని దిగులు తోటి 
అలివిమాలిన బెంగ తోటి 
అయినవారి అబ్బరాల హద్దు దాటి 
ఈడ పుట్టిన ఆడపిల్లని 
ఆడ-పిల్లనవ్వబోతున్నా... మెట్టినింట చేరి


నా ఆలోచనల్లో నేనుంటూ - ఓ కొసరు పాటేదో పాడుకుంటూ నేనిక్కడ... ఆ కొసరు పాటకి అసలు పాటేదో పట్టుకుంటూ మీరు కూడా ఇక్కడే!

లల్లీ అని పిలిచే - ఆ పిలుపులు జ్ఞాపకమే!
ఓ తల్లీ అని అరిచే - ఆ అరుపులు జ్ఞాపకమే!
అన్ని పిలుపుల్లో - దాగి వున్న ఆ ప్రేమలు జ్ఞాపకమే! 
నాకు దక్కినట్టి - నవ్వులన్ని జ్ఞాపకం!
నాకే చిక్కినట్టి - పువ్వులన్ని జ్ఞాపకం!




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>