బుజ్జిజింకతో తెలుగు రాయించి చా...లా రోజులా - ...కాదు కాదు - నెలలు అయింది.
ఆ మధ్య అన్నజింకతో ఇంటికి వచ్చిన కెవినుడికి - వాడడిగాడని అత్యుత్సాహంతో తెలుగులో బోల్డన్ని పదాలు చెప్పేస్తూ - ఓ నెల నా దగ్గరుంటే నీకు బోల్డు తెలుగు నేర్పేస్తానని అనగానే - అన్నజింక "వాడికి కాదు ముందు - తమ్ముడికి మొదలుపెట్టింది పూర్తి చెయ్యి" అని గుర్తు చేశాడు.
అప్పుడు "నిజమే ...ప్చ్ ప్చ్ " అని కొరుక్కున్ననాలుక ఇప్పటికీ చురచురమంటూనే వుంది - పాఠం మళ్ళీ ఎప్పుడెప్పుడని అడుగుతూనే వుంది.
నాకూ బుజ్జిజింకకీ ఇప్పటికి కుదిరింది.
అప్పుడెప్పుడో బోల్డంత తెలుగు నేర్పేసుకున్నానని నేనూ - నేర్చేసుకున్నానని వాడూ - మురిసి మురిసి పరస్పరం మెచ్చుకోళ్ళు ఇచ్చేసుకుని - మేకతోళ్ళు కప్పుకున్నంత హడావిడి చేసేసి - ఆ మురిపెంలో తెలుగు రాసుకున్న పుస్తకాన్ని కూడా ఎక్కడో భద్రంగా దాచేసుకున్నాం.
ఆ దాచుకున్న నిధిని ఇవ్వాళే - ఇప్పుడే - అంటే ఒక గంట క్రితం బయటికి పురా-పుస్తక తవ్వకాల్లోంచి బయటికి తీసి - "తెలుగు రాద్దాం రారా" అంటే - "ఆమ్ తిన్నాక" - అన్నాడు బుజ్జిజింక.
కంచమేసి - పప్పేసి, టొమాటో పచ్చడేసి, పెరుగేసి - ఆమ్ తినేసి - అనిపించాక - పదంటే పది నిముషాల్లో
"తల్లీ! నిన్ను దలంచి పుస్తకమున్ చేతం బూని నే తెలుగు revise చేసితి" అన్నాడు వాడు.
ఐదంటే ఐదు వాక్యాలు చాలు అని చెప్పి - వాడికింకా ఒత్తులు రావని - ఆట్టే నొక్కి-వక్కాణించకుండా ఓ ఐదు తేలికైన నిత్యసత్యాల్లాంటి వాక్యాలు చెప్పగా ... ఈ రోజుకి ఫలించిన వినివ్రాత:
ఇప్పటినుంచి వారానికి రెండు రోజులైనా తెలుగుని వెలిగిద్దామని - ఆ వెలుగులో బుజ్జిజింకని నడిపిద్దామని... అంతే అంతే !
అమ్మ తినిపించే వేడివేడి-ఆమ్ తెలుగు
అమ్మ వినిపించే జోలపాట తెలుగు
అమ్మని విసిగిస్తే వచ్చే కోపం తెలుగు
అమ్మని మురిపిస్తే పెట్టే ముద్దు తెలుగు
తెలుగు నేరిస్తే జ్ఞానదీపం మరింత వెలుగు
ఆ వెలుగులోన తెలుగు ఎలుగు మరింత పెరుగు
అప్పుడప్పుడు పగళ్ళు మరీ పొడుగ్గా ఉంటాయి
సాయంత్రాలు కొంచెం దిగులుగా అనిపిస్తాయి
నడకలో అడుగులు కదలనని మొరాయిస్తాయి
గొంతులో పాటలు శృతి తప్పి విసిగిస్తాయి
అలాంటప్పుడు - కప్పుడు కాఫీ ఒక చేత - ప్లెయిన్ ఓల్డ్ POTS లైనో, సెల్లుయుగపు స్మార్టు ఫోనో ఇంకో చేత బట్టి - మీటలు నొక్కగా - 'హలో' అంటూ కలిసే చెలిమి-తీగ కలిమి కాక మరేంటి?
ఆ చెలిమి-కలిమితో
కలిమి-చెలిమితో -
చేతిలోని కాఫీ కప్పుతో -
సిప్పు మీద సిప్పుతో -
కలిసిన మాట మీద మాట పెంచి -
ఎన్ని కబుర్లో!
ఎంత సేపని కాదు - ఎలాంటి కబుర్లనీ చెప్పడానికి లేదు - చెప్పుకున్నామా లేదా - అదీ లెక్క - అదే లెక్క!
"హమ్మయ్య - ఐతే నీకు టైముంది - ఇప్పుడు చెప్పు - బావున్నావా?"
" బావున్నాను గాని - నువ్వెలా వున్నావ్? నాకు టైముందని చెప్తే కానీ కుశలమడగాలనిపించదా?"
"అవును మరి - నాతో నువ్వు మాట్లాడే sound నాకు వినిపించే టైం వున్నప్పుడే నీకు sound mind in a sound body వుందో-లేదో నాక్కావాలి గానీ - ఉట్టప్పుడెల్లా ఉంటే నాకెందుకు?"
"మంచి దానివే! ఏం చేస్తున్నావింతకీ?"
"వంట చేస్తూ - నువ్వు గుర్తొచ్చావ్ - అంతే! కాఫీ కలుపుకుని నీకు ఫోన్ చేశా!"
"అయితే లైన్లో వుండు - నేనూ నా టీ కప్పు తెచ్చుకుంటా"
"నీ నోటాడేపాటా నా చెవులారా విన్నాను కానీ ... ఇంతకీ నీ కాఫీ తాగడం అయ్యిందా? స్టవ్ మీదేంటి? పోపేస్తున్నావా?"
"అర్రే! నీకెలా తెల్సింది?"
"స్మార్ట్ ఫోనమ్మా!"
"హహ హహ - బావుంది - వాసన పట్టేస్తుందన్నమాట"
"అదే గదా! దానికీ app ఉందమ్మా! రకరకాల apps - అవెలా పని చేస్తాయో గుర్తుంచుకోడానికో app - ఆ app ఉందని గుర్తు చేయడానికో app - మొత్తానికి ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి - మనం అ-స్మార్ట్ అవుతున్నాము."
"కదా! - మొన్నెప్పుడో office లో ఏదో document చదువుతుంటే ఎవరికో ఫోన్ చేయాల్సి వచ్చింది - అప్పుడు నేనేం చేశానో తెల్సా - laptop keyboard మీద అంకెలు నొక్కి ఫోన్ పని చేయట్లేదేంటా అనేసుకున్నాను."
"అనుకున్నావూ! నువ్వలా అనుకోకపోతే అనుకోవాలి - అనుకుంటే అనుకోవడానికేమీ లేదు - సరే మరి - ఇంకేంటి విశేషాలు?"
"ఏం లేదూ... మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావూ అని నువ్వడిగినప్పుడు - కాఫీ తాగుతూ నీతో కబుర్లు చెప్తున్నాను అంటే "ఓహ్ అయితే కాఫీ విత్ మి అన్నమాట" అన్నావు కదా? ఆ మాట పట్టుకుని నేనొక కొత్త సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నానని చెప్పాను కదా! దానికో పేరు కూడా పెట్టానని చెప్పాను కదా - కాఫీ విత్ కలిమి అని. ప్రస్తుతానికి అదే విశేషం."
"ఓ అదా ! హహ్హహ్హ"
"ఎందుకా నవ్వు?"
"ఏం లేదు - మొన్న దీనిమీదే జరిగిన నన్ను అవాక్కు చేసిన ఓ walk లో-వాక్కు గుర్తుకొచ్చి"
"ఎక్కడికా walk - ఏంటా వాక్కు - నువ్వెందుకయ్యావ్ అవాక్కు???"
"చెప్తాగా! నీ ఈ పోస్టుకి అనుబంధంగా రాసుకో - నీకు copyrights ఇచ్చేశాను"
"భలే! నా Coffee-write కి నీ copyright! నచ్చేసిందమ్మాయ్!"
"ఇంకో పది నిముషాల్లో ఆఫీస్‌కి బయల్దేరాలి - మళ్ళీ మాట్లాడదాం!"
"బానే వుంది - భూమికవతలెక్కడో వున్నావు - పట్టుమని పది నిముషాలు కూడా మాట్లాడవ్ - ఈసారి నేను కూడా ఒక meeting request పంపిస్తా - అలా అయితేనే కుదిరేలా వుంది నీతో - bye మరి"
"Bye!"
Walk లో అవాక్కు చేసిన వాక్కు (Coffee-Write with Copyright ):
"లలిత కొత్త సిరీస్ మొదలు పెడుతోందట - కాఫీ విత్ కలిమి అని"
"ఆహా!"
"దానికి నేనే ఇన్స్పిరేషనట - అయినా ఫోన్ కబుర్లు అని రాయడానికి ఏముంటాయి కదా?"
"కబుర్లేముంటాయో తర్వాత సంగతి కానీ - నువ్వు ఇన్స్పిరేషన్ అవడం ఏంటి?"
"అంటే మేమిద్దరం కుదిరితే రోజూనో, కుదరకపోతే కుదిరిన రోజునో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటాం కదా! అప్పుడు అటు పక్క తాను కాఫీ, ఇటు పక్క నేను టీ తాగుతూ చెప్పుకుంటామన్నమాట. అందుకని ఈ సిరీస్ అంతా ఫోన్ కాన్వర్సేషన్ లా నడుస్తుందన్నమాట - రకరకాల టాపిక్కులతో"
"ఐడియా బానే వుంది కానీ - నీకేమీ బాధగా అనిపించలేదా - ఆ సిరీస్‌కి పేరలా పెడితే?"
"పేరుకేమయింది - బానే ఉందిగా - కాఫీ విత్ కలిమి?"
" అదే - ఆ కలిమి అంటే నీకు ఏమీ అనిపించలేదా?"
"ఏమనిపించాలి?"
"అదంత మంచి మాట కాదు కదా ?"
"ఎందుకు కాదు?"
"కలిమి అంటే కష్టం కదా! కలిమిలేములు అంటే కష్టనష్టాలు కదా! నిన్ను అంత మాటనేసిందేంటి? నీకేం అనిపించలేదా? పైగా ఆనందంగా చెప్తున్నావ్... కలిమి అని నా పేరే పెట్టింది అనీ..."
"అబ్బా! అసలు నిన్ను తెలుగులో పాస్ చేసిందెవరు? కలిమిలేములు అంటే okey-dokeyలాంటి usage కాదు. తెలుగులో ద్వంద్వసమాసం అది - కలిమి అంటే wealth, లేమి అంటే poverty."
"ఓ హో "
"లలిత వాడే అర్థంలో కాఫీ విత్ కలిమి అంటే talking to a friend over a cup of coffee"
నేను తెచ్చిన లగేజ్ అంతా నాన్న డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఫియట్ డిక్కీలో పెట్టేసుకుని - చలికాలపు పొద్దుటివెలుగులో - ఒకరి తర్వాత ఒకరుగా మూడు ప్రశ్నలూ - ఆరు ఆన్సర్లుగా అసలేంటో - కొసరేంటో, మొదలేంటో - చివరేంటో అంతుబట్టని కబుర్లాడుకుంటూ, నవ్వులేరుకుంటూ ఇంటికి చేరాం.
అప్పటికే - అమ్మ, లక్ష్మిదొడ్డ - ఇద్దరూ కాఫీలు, టిఫిన్లూ - చేయాలి అనుకుంటూ - స్నానాలకి బాయిలర్లో నీళ్ళు కాగాయా లేదా చూసుకుంటూ తెగ హడావిడి పడుతున్నారు.
ట్రెయిన్ దిగి ఇంటికి చేరిన నన్ను చూసి - "వచ్చింది త్రిపురసుందరి. ఇంక కూర్చోనీయదు, నించోనీయదు...ఒకటే హడావిడి" - నన్ను చూసిన ఆనందం లోనే కుసింత విసుగుని కూడా కలిపి అంటూ ఎదురొచ్చింది అమ్మ.
కుశలప్రశ్నలు - కులాసా సమాధానాలు అన్నీ అయ్యాక - కడుపునిండా వేడివేడి ఉప్మా తిని, కప్పు నిండా పాలు తాగి - తెచ్చిన పెట్టెలు తెరిచి - పప్పీ, కుట్టీలకి, ప్రశాంతికి శిల్పంలో కొని తెచ్చినవి ఇచ్చి - మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయవాడ- వివిధభారతిలో జనరంజనిలో బోల్డన్ని పాటలు విని ఓ బద్ధకపు-చలికాలపు-రోజుని తెగ ఎంజాయ్ చేశాను.
నాకంటే సెలవులు. పప్పి, కుట్టీలకి ఇంకా కాలేజులు జరుగుతున్నాయి. నేను ఇంటికి వచ్చింది శనివారం - తర్వాతి రోజు ఆదివారం ఇంట్లోనే వున్నారు. సోమవారం ఇద్దరూ కాలేజ్‌కి వెళ్ళారు.
సోమవారం పొద్దున్న గుర్తొచ్చింది - నేను మా క్లాస్‌మేట్స్‌కి పంపిద్దామని కొన్న న్యూఇయర్ గ్రీటింగ్స్. ఆ రోజు అప్పుడే డిసెంబర్ 24. అప్పుడు పోస్ట్ చేయకపోతే టైంకి అందవు.
వెంటనే అమ్మకి పోస్ట్ఆఫీస్‌కి వెళ్ళి స్టాంపులు కొని అక్కడే పోస్ట్ చేసి వస్తానని చెప్పి ప్రశాంతిని నాతో తీసుకుని బ్రాడీపేట 2/11 లో వున్న పోస్ట్ఆఫీస్‌కి బయల్దేరాను.
వెళ్తున్నప్పుడు నా కనిపించింది - ఎప్పుడూ కాలేజ్ కబుర్లన్నీ అమ్మ, పప్పీ, కుట్టీలతో షేర్ చేసుకునే నేను మొదటిసారిగా మూగబ్బాయితో నా పరిచయం గురించి అస్సలేమీ చెప్పలేదని. ఆ రాత్రి పేపర్ మీద మాట్లాడుకోవడం, ఆ తర్వాత మాటలొచ్చని తెల్సిన తర్వాత భయంతో ఏడవడం తల్చుకుని నాలో నేనే నవ్వుకున్నాను.
ఇంతలో పోస్టాఫీస్ దగ్గరికి వచ్చేశాం - అక్కడే కూర్చుని అందరి అడ్రెస్సులు రాసి స్టాంపులు కొని అంటిద్దామని చూస్తే అక్కడ ఎప్పుడూ వుండే గమ్ బాటిల్ కనిపించలేదు.
ఏదో ఒకటో రెండో అయితే నా నాలుక - ఐదో ఆరో అయితే నాదీ, ప్రశాంతిదీ కలిపి రెండు నాలుకలూ వాడి అంటించేసేదాన్ని. కానీ మొత్తం 26 కవర్లు, వాటి మీద స్టాంపులు - అబ్బే! వద్దు అనిపించింది.
అప్పుడు మూగబ్బాయి రాత-మాటలో ఇంక్-రంగు బదులు ఇష్టం-హంగు కనపడేలా - "మా ఇల్లు బ్రాడీపేట 2/11 లో పోస్టాఫీస్ ముందు. మా అమ్మ, ఒక మంచి తమ్ముడు, ఇంకా మంచి చెల్లెలు - మొత్తం నలుగురం. మేం నలుగురం ఏం చేసినా, ఎక్కడికెళ్ళినా నలుగురం కలిసే వెళ్తాం. మా అమ్మకి నా ఫ్రెండ్స్ - అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరూ తెలుసు - నా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ ఫ్రెండ్స్ కూడా!" - అంటూ రాసిన పేపరిచయం గుర్తొచ్చింది.
వెంటనే వాళ్ళిల్లు, ఇంట్లో వాళ్ళు ఎలా వుంటారో చూడాలని చిన్న కుతూహలం - అందులోనూ నన్ను చాలా పకడ్బందీగా తనకి మాటలొచ్చని తెలియనీకుండా అంతసేపు నమ్మించడం కూడా తెగ ఇంప్రెస్ చేసేసిందేమో - ఒక్కసారి మళ్ళీ పలకరిద్దామా అనిపించింది.
పోస్టాఫీస్ లోంచి బయటికి వచ్చి - ప్రశాంతితో కలిసి ఎదురుగుండా వున్న ఇంటికి వెళ్ళి లోపల్నుంచి గడియ వేసి వున్న చెక్కగేటు మీద రెండుసార్లు తట్టాను.
వెంటనే లోపల్నుంచి "ఎవరూ" అంటూ ఒకావిడ గేటు గడియ తీశారు.
"నా పేరు లలితండి" - అబ్బాయి వచ్చి తలుపు తీస్తాడనుకుంటే వాళ్ళమ్మగారు వచ్చి తలుపు తీయడం అసలు ఊహించలేదేమో ఒక్క నిముషం ఏమని చెప్పాలో తెలియక గబగబా నా పేరు చెప్పాను - అదేదో నేనూ, నా పేరూ universally recognized అన్నట్లు.
"రా రా లోపలి రా - ఈ అమ్మాయి ఎవరూ? మీ చెల్లెలా?" - నేనేదో బాగా తెలిసినట్లు - నా సంగతి ఎరిగినట్లు - నేనొస్తానని ముందే ఊహించినట్లు - రాబోతున్న నవ్వు దాచుకుంటున్నట్లు - స్నేహంగా లోపలికి ఆహ్వానించారు ఆవిడ.
నేను, ప్రశాంతి గేటు దాటి లోపలికి వెళ్ళి ఇంటికి ముందున్న కటకటాల కివతల నించున్నాము. ఈలోగా ఆవిడ గేటు వేసి గడియ పెట్టి మా వైపు తిరిగేలోగా చుట్టూ చూసిన నాకు కనిపించిందేంటంటే -
చలికాలపు బంగారపుటెండ
తెలి సింగారపు ముగ్గు
చల్లిన బియ్యపు గింజలు
వాలిన పిచుకల భోజనాల సందడి
గేటు పై నుంచి వాలిన బోగన్‌విలియా పూలు
వాటి గుబుర్ల మధ్య నుంచి ఎలాగోలా కింద వాలి
వెన్నముద్దలయిన ఎండ జాడలు
పక్కనే అరుగు
అరుగు పక్కనే చిన్న గులాబీల తోట
పిచుకల్ని చూస్తూ నించుండిపోయిన నన్ను చూసి - "అవి మా చుట్టాలు - రోజూ వచ్చి పలకరించి వెళ్తాయి" అని చెప్తూ లోపలికి నడిచారు ఆవిడ.
నేనూ, ప్రశాంతి కూడా ఆవిడ వెనకాలే లోపలికి - ముందరున్న కటకటాలు, ఆ తర్వాత టీవీ వున్న గది దాటి - డైనింగ్ టేబుల్ దగ్గర ఆగి ఆవిడ కూర్చోమన్న కుర్చీల్లో కూర్చున్నాము.
నాకెలా అడగాలో తెలియలేదు - ఆవిణ్ణి చూస్తే ట్రెయిన్లో బోల్తా పడ్డ అమ్మాయిని నేనే అని తెలిసి పోయింది అనిపిస్తోంది. ఇంట్లో ఆవిడ తప్ప ఇంకెవరూ లేనట్లుంది. నా అంతట నేను - "మీ అబ్బాయి నాకు తెలుసు" - అని చెప్పడం మించి ఇంకెలా పరిచయం చేసుకోవాలో తెలీలేదు - అలా చెప్పడానికి కూడా మొహమాటం వేసింది.
నా మొహం చూసి - చుట్టూ వెతుకుతున్న నా చూపులు చూసి - నేను పడుతున్న ఇబ్బంది కనిపెట్టి - ఇంకాసేపుంటే ఏడ్చేస్తానేమోనని పసిగట్టి - నన్ను రక్షించడానికన్నట్టు - "బాబు ఇంట్లో లేడు - చెల్లాయితో కలిసి బజారెళ్ళాడు - వచ్చేస్తాడు ఇంకో గంటలో" అన్నారు నవ్వుతూ.
"అహహ - అది కాదండి - అంతసేపుండను - నేను గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయడానికి వచ్చాను - తీరా చూస్తే పోస్టాఫీస్ లో గమ్ లేదు - అయిపోయినట్లుంది - మీ ఇల్లు ఇక్కడే అని మీ ఇంట్లో గమ్ ఉంటుందేమోనని అడగడానికి వచ్చాను" - అన్నాను మాటలని నాలుక మీద పరిగెట్టిస్తూ.
ఆవిడ మనసులో "కొయ్ కొయ్ - నీ సంగతి నాకు తెలుసులే" అనుకుంటున్నట్టు నవ్వి "ఉండు - తెస్తాను" అని చిన్న నీలం రంగు బాటిల్ తెచ్చిచ్చారు.
గబగబా నా దగ్గరున్న కవర్లకి అది రాసేసి అంటించేసి ఒక పది నిముషాల్లో ఆవిడకి "థాంక్స్ " చెప్పి బయటికి వచ్చి - పోస్టాఫీస్ ముందున్న పోస్టుబాక్స్ లో కవర్లు వేసేసి ఇంటికెళ్ళిపోయాను. అంతసేపూ ప్రశాంతి ఏమీ మాట్లాడకుండా - అసలే పెద్దకళ్ళు ఇంకా పెద్దవి చేసుకుని నన్నూ, ఆవిణ్ణీ చూస్తూ - మా కబుర్లు వింది.
ఇంటికి వెళ్ళే దారిలో అడిగింది - "ఎవరు లల్లీ వాళ్ళు?" - అంటూ.
"అది నా ఫ్రెండ్ ఇల్లులే" - ఏదో పెద్ద అడ్వెంచర్ చేసిన ఉత్సాహంతో నే చెప్పిన సమాధానం.
.........................................................................................................................................
డిసెంబర్ 31కి వరంగల్ నుంచి బాబొచ్చాడు - శ్రీను ఇంట్లోనే వున్నాడు. ఆడపిల్లలం నలుగురం, బాబు, శ్రీను - మొత్తం ఆరుగురం కలిసి 31 సాయంత్రం శంకర్‌విలాస్‌కి వెళ్ళాం - న్యూఇయర్ ఈవ్ సెలబ్రేషన్ అంటూ.
అక్కడ వాళ్ళందరూ ఎవరిక్కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేశాక - నేను కూడా ఒక ప్లేట్ సమోసా చెప్పాను. దాంతోపాటే ఒక ఫ్రూట్ సలాడ్.
అందరి ఆర్డర్లూ వచ్చేశాయి కానీ ఎంత సేపటికీ నేనడిగిన సమోసా రాలేదు. అప్పటికీ అటూఇటూ తిరుగుతున్న సర్వర్ ఎవరెవరికో ప్లేట్లు అందిస్తూ ఉంటే నా పక్క నుంచి వెళ్ళిన ప్రతీసారి నాకు తెలియకుండానే - అది నాకేనేమో అన్నట్టు చెయ్యి చాస్తున్న నన్ను చూసి "దీనికి బాగా ఆకలేస్తున్నట్టుంది - ఏమే లల్లెమ్మా! ఇంకాసేపుంటే నువ్వే హోటల్ లోపలికి వెళ్ళి తెచ్చేసుకునేలా వున్నావ్" అంటూ ఆట పట్టిస్తున్న కుట్టి మాటలకి నవ్వుతూ శుభ్రంగా అన్నీ ఖాళీ చేసేస్తున్న వాళ్ళందర్నీ చూస్తే భలే ఉక్రోషంగా అనిపించింది. నిజంగానే ఆకలి కూడా వేసేస్తోంది.
ఒక పది నిముషాల తర్వాత ఒక స్పూను-ఫోర్కు-సహిత-సమోసా ప్లేటు వచ్చి నిలిచింది నా ముందు. తిన్నగా అది చేత్తో తీసుకుని తినొచ్చు కదా నేను?! - అబ్బే - అలా చేస్తే అంతా సవ్యంగా జరిగిపోదూ? చెప్పుకోవడానికి విశేషాలు ఏముంటాయ్?
ఫోర్కుతో సమోసాని కట్ చేయడానికి ప్రయత్నించాను. మొదటిసారి కొంచెం జారింది. అది చూస్తూనే నా ఎదురు సీట్లో కూర్చున్న బాబు అననే అన్నాడు - "అది నా ప్లేట్లో పడితే మాత్రం నేను తినేస్తాను" అని.
బాబు కేసి ఒకసారి గీరగా చూసి - అంతకన్నా గీరగా ఫోర్కు పెట్టి సమోసాని గట్టిగా అడ్డంగా కట్ చేయబోయాను.
అంత పెద్ద సమోసా కూడా ఎగిరి బాబు అన్నట్లే తన ప్లేట్లోనే పడింది. తాను కూడా అన్నట్లే తీసుకుని చేత్తో పట్టుకుని శుభ్రంగా తినేశాడు.
ఇంతలో సర్వరు బాగా మాగిపోయిన పళ్ళతో - కరిగిపోయి కారిపోవడానికి సిద్ధంగా వున్నపేస్టుకి ఫ్రూట్ సలాడ్ అని పేరు పెట్టి తీసుకొచ్చాడు.
అంతే ! నాకు - అసలే ఆకలి మీద వున్నానేమో -కోపమొచ్చేసింది - "నాకొద్దు ఈ పేస్టు -వెనక్కి తీసుకుపో" అనరిచి వెనకనుంచి కుట్టి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి కిందకి వచ్చి పేవ్‌మెంట్ మీద నించున్నాను - మళ్ళీ ఒక్కదాన్నీ వెళ్ళడానికి ఇష్టం లేదు మరి - నా కోసం వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి - నేను వాళ్ళని ఏడ్చి సాధించాలి కదా!
కింద నించుని వున్న నన్ను చూడగానే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ నా పక్కనే వచ్చి నించున్నారు అందరూ వరసగా.
వాళ్ళని చూడగానే - నేను పట్టించుకోనట్టు నడవడం మొదలు పెట్టాను.
వెనకాల ఇంక కథా-కాలక్షేపం మొదలయింది - బాబు మొదలు పెడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఆశువుగా పూరించుకుంటూ ...
అనగనగా ఒకూళ్ళో బాబిగారున్నారట
ఆ బాబిగారికి ముగ్గురమ్మాయిలట
ఆ ముగ్గురూ కలిసి ఓ రోజు హోటల్ కెళ్ళారట
మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చారట
అందులో ఇద్దరి పొట్టలే నిండాయట
మూడో పొట్ట నిండలేదట
పొట్టా పొట్టా ఎందుకు నిండలేదూ అంటే
నా ఫోర్కుకి సమోసా అందకుండా ఎగిరిపోయిందీ అందట
సమోసా సమోసా ఎక్కడకు ఎగిరావూ అంటే
ఎదురుగా వున్న బాబు ప్లేటులోకీ అందట
బాబూ బాబూ నీ ప్లేట్లో పడ్డ సమోసా ఏదీ అంటే
నా ప్లేట్లో పడితే నే మింగేయనా అన్నాట్ట
- నా ఉక్రోషం మీద, నే పోగొట్టుకున్న సమోసా మీద కథ చెప్పేసుకున్నారు.
వాళ్ళ మాటలు వినబడుతున్నా - నాకూ నవ్వొస్తున్నా పట్టించుకోకుండా చేతులు కట్టుకుని నడుస్తున్న నా వెనకనుంచి - పప్పి, కుట్టి - కోరస్‌గా పాడడంమొదలు పెట్టారు:
ఆ నడక చూడు - హైస్సా
ఆ నవ్వు చూడు - హైస్సా
(అది మేమెప్పుడూ మా ఇంటి మేడ మీద కూర్చుని ఎవరైనా మాకు తెలిసిన అమ్మాయిలు రోడ్డు మీద బుద్ధిగా తలొంచుకుని వెళ్తుంటే - ఏడిపిస్తూ పాడే పాట.)
ఈలోగా రాయల్ ఐస్‌క్రీంస్ దగ్గర వాళ్ళు ఊహించలేనంత స్పీడుగా లోపలికెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాను. వెంటనే వాళ్ళూ బిలబిల్లాడుతూ లోపలికి వచ్చేశారు.
ఒక్కసారిగాఅందరం అప్పటివరకూ చేసిన అల్లరికి నవ్వేసుకుని - నాకిష్టమైన ఫ్రూట్ సలాడ్ తినేసి నడుచుకుంటూ ఇంటికెళ్ళి - రాత్రి పన్నెండింటి దాకా దూర్‌దర్శన్‌లో చూపించిన కార్యక్రమాలు అన్నీ చూసేసి - చివర్లో ఆశా భోంస్లే పాడిన "నయా సాల్ హో - ఆప్ సబ్ కో ముబారక్" పాట వింటూ ఆవిణ్ణి ఆనందంగా చూసేస్తూ (అప్పుడు ఎప్పుడో కానీ కనిపించేవారు కాదేమో - రెప్ప వేయకుండా చూసేవాళ్ళం సినిమా వాళ్ళని) - హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని - మా దొడ్డ కలిపిచ్చిన టీ తాగేసి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం.
(రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకునే ముందు మా అమ్మనో, దొడ్డనో లేపి టీ అడిగి - వాళ్ళు టీ పెట్టిస్తూనే - దాంతో పాటుగా పెట్టే చీవాట్లు నంచుకుంటూ టీ తాగడం - పసందైన అనుభవం.)
ఏదో నాలుగు రకాల గాలివాటు కబుర్లాడే నేను - ఓనాడు - ఆ కబుర్లే - అనగనగా ... అంటూ - కథలా చెబ్దామని మొదలెట్టి - మొదలూ-తుదీ లేని కబురులాగే సాగించాను.
"నీలాంటి వాడే ఒకడు వెనకటికి - చిన్నప్పుడు కాకరకాయ - పెద్దయ్యాక కీకారకాయ - అన్నాడట" - అనేది మా అమ్మ చిన్నప్పుడు నేను మాట విననప్పుడో - విన్నమాటని నాక్కావాల్సినట్టు తిప్పి అన్నప్పుడో.
మరిన్నాళ్ళకి - నా బ్లాగ్ ముంగిట - అచ్చూ, హల్లూ పోగుచేసుకుని - రెమ్మరెమ్మన చిగురేసి, ఆకేసి - కొమ్మ కొమ్మన మొగ్గేసి, పూతపూసి - అంటుకట్టిన కబురుకొమ్మ - ఇంతై అంతై - డ్రాఫ్టులో ఇమడనంతై - వాకిలి సంపాదకులకు ఒప్పై - వెబ్ వాకిట అందరాని కొమ్మ అయిన నా కథ చదివిందంటే - కబుర్లప్పుడు కాకరకాయ - కథయ్యాక కీకారకాయ అంటుందేమో!
మొత్తానికి నా కథ బ్లాగు గడప దాటింది - అందరాని కొమ్మై వాకిలి మొగసాల నిలిచింది.
ఒక్కోసారి ఆవుపేడ కోసం మిట్టమధ్యాహ్నం వెళ్ళాల్సి వచ్చేది.
అప్పుడైతే ఆవులు కొట్టాల్లో కాకుండా - ఏ ఆరుబయటో గడ్డి మేస్తూ ఉంటాయి - తాజా పేడ దొరుకుతుంది.
ఇలాంటి లాజిక్కులతో నేను, పప్పి, కుట్టి - ఒక ప్లాస్టిక్ బేసిన్ పట్టుకుని - మధ్యాహ్నం భోంచేసి అమ్మ ఏ పుస్తకమో చదువుకుంటూనో, లేకపోతే లక్ష్మి దొడ్డతో కలిసి పండక్కి పిండివంటలు చేయడానికి పిళ్ళూ అవీ కొట్టించే హడావిడిలో ఉండగానో - ఎర్రటి ఎండలో - ప్రపంచంలోకెల్లా అన్యోన్యమైన అక్కచెల్లెళ్ళకి నమూనాల్లా - మా గొబ్బి-పేడ-సేకరణకి బయలుదేరేవాళ్ళం.
అప్పటికి మేమున్న ఊరుని బట్టి ఏ రాధాయో (గణపవరం), హోటల్ వారి అమ్మాయి పద్మో (జంగారెడ్డిగూడెం), ఏడుకొండలో (టంగుటూరు) - మాతో పాటు - మేమందరం కలిసి ఊరేగింపు.
ఆ ఆవులేమో ఊరి చివర - వాగు పక్క సరివితోటల దగ్గరో, చింతచెట్ల కిందో గడ్డి మేస్తూ ఉండేవి.
వాటి దగ్గరికి వెళ్ళే దారి పొడుగునా - వెళ్ళేటప్పుడు మా ధ్యాసంతా పేడ మీదే ఉండేదేమో - మా కబుర్లన్నీ - అది కింద పడిన ఎంత సేపటి వరకు ఫ్రెష్షుగా ఉంటుంది? ఎక్కువ మట్టి అంటుకోకుండా పేడ ఎలా తియ్యాలి? - ఆవుల దగ్గర కాసేవాళ్ళతో ఎలా మాట్లాడితే ఎక్కువ పేడ ఇస్తారూ? - మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం అని చెప్పకుండా - విడివిడిగా తెచ్చుకుంటే బోల్డు పేడ తెచ్చుకుని పే...... ద్ద గొబ్బెమ్మలు ఎలా చేసుకోవచ్చో? - ఇల్లాంటి strategic planning - మీదే ఉండేవి.
తీరా అక్కడికి వెళ్ళాక - మా నక్షత్రాలు బావున్న రోజు - ఆ ఆవులు కాసేవాళ్ళ కడుపులు నిండి, అరమూత కళ్ళవాళ్ళై - ఏ చెట్టు కిందో కాలు మీద కాలేసుకుని పడుకుని - కాసేపు మా కాలక్షేపపు కబుర్లు విని - ఆ కబుర్లకి అక్షర-ముద్దలుగా ఆవుపేడని అనుగ్రహించేవారు.
ఇంక ఇంటికి తిరిగి వచ్చే దారిలో - ఎలా వచ్చేవో తెలీదు - చందమామ, బొమ్మరిల్లు కథలేవో చెప్పుకుంటూ వెళ్తుంటే - మాలో ఎవరో ఒకరు కచ్చితంగా - ఆ కథల్లోని తెల్లతోక దయ్యాల కబుర్లు మొదలుపెట్టేవారు. ఇంకంతే - సినిమాల్లో రాత్రి పూట తెల్ల చీర కట్టుకుని వచ్చే దెయ్యాల దగ్గర్నుంచి మిట్టమధ్యాహ్నపు కొరివిదయ్యాల దాకా - దెయ్యాలు, వాటిల్లో రకాలు, కాళ్ళ కేసి చూసి వాటిని గుర్తు పట్టటం ఎలా (వాటికాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి మరి!) - లాంటి విషయాలన్నీ తెగ ధైర్యంగా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. పగలే కదా అన్న ధైర్యం.
ఆ మాటలకి ఎవరికి వాళ్ళకి మనసులో ఏదో భయముంన్నా బయటపడేవాళ్ళం కాదు.
ఒకసారలాగే - ఎండలో వస్తూ ఉంటే దూరంగా ఒక ముసలావిడ ఎండకి చీర ముసుగేసుకుని వస్తూ కనిపించింది.
అంతే - మాలో మేము అనేసుకున్నాం - ఆవిడ దగ్గరికి రాగానే పాదాలు ఎటు తిరిగున్నాయో తప్పకుండా చూడాలని. తీరా ఆవిడ మాకు ఒక అడుగు దూరంలో వుండగా - ఆ రోజు - దెబ్బకి ఠా-దెయ్యం కబుర్లటా - అన్నట్లు కబుర్లన్నీ ఆపేసి - అప్పటికే నేర్చుకుని వున్న మంత్రం లంబాడి దెయ్యం - నాకేం భయ్యం పాడుకుంటూ - పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాం. అలా పరిగెట్టిన మమ్మల్ని చూసి విషయం అర్థం కాక ఆ ముసలావిడ హడిలిపోయింది - అది వేరే సంగతి.
ఎంత పరిగెత్తినా పేడ మాత్రం పదిలం పదిలం :))
సరి - గొబ్బెమ్మ తయారు.
మరి అలంకారం మాటేంటి? రోజూ పెట్టే గొబ్బెమ్మకి బంతిపూలు బానే ఉంటాయి.
కానీ ఏదో ఒక రోజు మనింట్లో గొబ్బెమ్మలు పెట్టామని అందర్నీ పిలుస్తాం కదా!
గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడి - ఆ ఆ తర్వాత అమ్మ చేసిచ్చిన పాఠోళీ ప్రసాదం పెడతాం కదా!
మరప్పుడు కూడా బంతిపూలే అంటే గొబ్బెమ్మ చిన్నబుచ్చుకుంటుంది కదా!
మధ్యలో పిల్లను మోసే తల్లిగొబ్బెమ్మకి, చుట్టూ పెట్టే నాలుగు గొబ్బెమ్మలకి కలిపి కనీసం ఐదు గుమ్మడిపూలు కావాలి కదా!
మరెవక్కడుంటాయి?
ఎత్తుగోడల కవతల పశువుల కొట్టాలుండి - వాటిమీదకి పాకించిన గుమ్మడిపాదులున్న మోతుబరి రైతులిళ్ళలో ఉంటాయి.
ఎలాగోలా ఆ రైతుల పెరళ్ళలో చేరి గుమ్మడిపూలు కోసుకొచ్చేవాళ్ళం.
పొరపాటున ఆ ఇంటివారో, వారి పాలేరో చూసి పూలు కోసినందుకు ఎందుకు కసిరేవారో అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాతెప్పుడో ఇంకొంచెం హెడ్డు పైకొచ్చాక ఆ పూలే కాయలవుతాయని అర్ధమయ్యే టైంకి గొబ్బెమ్మలు పెట్టడం మానేశాం :)
ఇంక గొబ్బెమ్మలు పెట్టే రోజు - అప్పటికి రెండో, మూడో ఫిల్టులు వేసి కుట్టించి ఆరేళ్ళయ్యి - ఒక్కో ఫిల్టు విప్పుకుని ఇప్పటికి సరిపోయిన, ఇంకా కొత్తవాటిల్లా ఫెళఫెళలాడుతున్న నెమలికంఠపు రంగుకి గులాబీ రంగు అంచున్న పట్టు పరికిణి, నెమలికంఠం రంగు జాకెట్టు వేసుకుని, లక్ష్మిదొడ్డ వేసిన ఈతపాయల-రెండు-జడలకీ జడగంటలు వేసుకుని - గొబ్బీయళ్ళో... గొబ్బీయళ్ళో... దుక్కూ దుక్కూ దున్నారంట - ఏమీ దుక్కూ దున్నారంట - రాజావారి తోటలో జామ దుక్కూ దున్నారంట - అంటూ మొదలు పెట్టి
అటవీ స్థలముల కరుగుదమా అన్న పాటలో చల్లని గంధం తీయుదమా - సఖియా మెళ్ళో పూయుదమా - అని ఒకరి మెళ్ళో ఒకరు పూస్తున్నట్లు నటిస్తూ ఆ గిలిగింతకి నవ్వుకుంటూ
సుబ్బీ గొబ్బీమ్మా సుబ్బణ్ణీయవే అనడుగుతూ మొగలీ పువ్వంటి మొగుణ్ణీయవే అని సిగ్గులొలకబోస్తూ (అప్పటికి మొగుడంటే అస్సలేం తెలీకపోయినా...) - మా గొబ్బెమ్మ పెట్టడం అయ్యేది.
వారానికి ఒకరింట్లో - అందరం కలిసి - మళ్ళీ - అదే డ్రెస్సు - అదే ఆట - అదే పాట. ఏం వేసుకున్నామా అన్నది ఎప్పుడూ పట్టింపు లేదు - ఇస్త్రీ మడత వుండి, కలరాఉండల వాసనొస్తే - అవి కొత్త బట్టలే :)
ఈలోగా సంక్రాతిసెలవులొచ్చేవి.
ఎప్పుడైనా సంక్రాంతికి శివకోడులో ఉండడం కుదిరితే - మా భోగిదండలు మేమే చేసుకునేవాళ్ళం - మా చెల్లాయత్త ఆధ్వర్యంలో. గొబ్బెమ్మలు పెట్టడం - గొబ్బెమ్మలని రెండో రోజు వాటికి కేటాయించిన గోడకి కొట్డడం - సరిగ్గా చూసి మధ్యలో చిల్లు పెట్డడం- అవి ఎండేదాకా ఆగడం - ఎండిపోయాక గొబ్బిపిడక విరక్కుండా ఒలవడం - పురికొసకి గుచ్చి దండలు కట్టడం - ఇదీ వరస.
అదే అనాతవరపు సంక్రాంతి అయితే - అద్దెకున్న ఇంటివారికి మా అమ్మ-నాన్న "ఇంటికి వెళ్ళొస్తామండీ " అని చెప్పి - అందరం కలిసి బస్సెక్కి - మేం ముగ్గురం ఒక సీట్లో - వంతులు వేసుకుని - కిటికీ పక్కన కూర్చుని పాటలు పాడుకుంటూ - ఆగిన ప్రతి బస్టాండులో - ఈ బొమ్మ-మాట ఎక్కడుందో కనుక్కో చూద్దాం - అంటూ బస్టాండు గోడలమీద వున్నవన్నీ చదువుకుంటూ - సాయంత్రానికి అనాతవరం చేరేవాళ్ళం - భోగి ముందు రోజుకి.
అప్పటికే ఇంట్లో భోగిదండలు తయారుగా ఉండేవి.
తెల్లవారుఝామున నాలుగు గంటలకు నలుగుస్నానాలు - ఒకరి తర్వాత ఒకరు తయారయి, కొత్తబట్టలు వేసుకుని - భోగిదండలు పట్టుకుని భంగిమలు పెట్టుకుని - శ్రీనన్న ఫోటోలు తీస్తూ ఉంటే - పోటీలు పడి భోగిమంటల్లో దండలేసి - అక్కడే కాసేపు చలికాగి ఇంట్లోకి వచ్చేవాళ్ళం.
ఆ రోజు సాయంత్రం ఇంట్లో చిన్నపిల్లలని కుర్చీలో కూర్చోబెట్టి పోసిన భోగిపళ్లు - పేరంటం.
ఆ కుర్చీ దగ్గరగా కూర్చుని ఏరుకున్న రేగుపళ్ళు, అక్కడక్కడా దొరికిన ఐదు-పది పైసల బిళ్ళలు.
భోగి తర్వాత - పెద్ద పండగ - దండాల పండగ.
ఇంట్లో పెద్దలకి దండం పెడితే దీవెనలతో పాటు డబ్బులిచ్చే పండగ.
నాన్నమ్మ తప్పకుండా మున్సబుగారింట్లో వున్న ఇండియన్ ఓవర్సేస్ బ్యాంకునుంచి కొత్త రూపాయి బిళ్ళలు తెప్పించి మా అందరికీ పదేసి ఇచ్చేవాళ్ళు.
రవన్నకాళ్ళకి దండం పెడితే - జేబులో చెయ్యి పెట్టి చేతికి ఎంతొస్తే అంత ఇచ్చేవాడు. ముందుగా దండమెట్టిన వారికి దండిగా దొరికేది.
అప్ప, నాన్న, సోమేశ్వర్రావు తాతగారు (విస్సుబాబాయి వాళ్ళ నాన్నగారు) - వీళ్ళందరి దగ్గరా దండాలు పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత - పప్పి, కుట్టి, స్వాతి - రెడీగా వుండేవాళ్ళు - నువ్వు మాకన్నా పెద్దదానివి - నీ కాళ్ళకి మేం దండం పెడతాం అంటూ :)
దండాలపండగ అయ్యాక కనుమ రోజుకి శివకోడు ప్రయాణం - పుంతలో ముసలమ్మ తీర్థానికి.
అక్కడ కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు, చేత్తో తిప్పితే గుయ్-గుయ్ మంటూ తిరిగే గిలక్కాయలు.
చెల్లాయత్త చేసిన గారెలు, ఆవళ్ళు.
ఒంటెద్దు బండిలో రాజోలు విహారాలు - పండగ సరదా అయినవారితో అలా తీరేది.
ఇన్నేళ్ళ తర్వాత - సంక్రాంతి వస్తోంది అంటే -
ఇన్ని వేలమైళ్ళ దూరంలో కూర్చుని
ఒకప్పటి ఉన్న ఊరుని తలుచుకుని
వీలైతే ఇంటి ముందో ముగ్గు వేసుకుని
వీల్లేని చలైతే కంటి ముందు గత-జ్ఞాపకాల-రంగవల్లులల్లుకుని
సంక్రాంతికి ఏమేం కావాలి ... అనుకుంటే - అని తలుచుకుంటే
తట్టినవి - పూలో, పళ్ళో, పాలో, ఇండియన్ స్టోర్లో దొరికే మామిడాకులో, వాట్సాపుల్లో forward-మెసేజులో కాదు -
నెమరేసుకున్న చిన్నప్పటి సరదా-ఆటల జ్ఞాపకాలు - మళ్ళీ పాడుకున్న గొబ్బిపాటలు.
ఆ జ్ఞాపకాలకు ఊతగా - గతించిన సంక్రాంతిని స్వాగతిస్తూ ...
మా చిన్నపాప్పిన్ని, జ్యోతి పిన్ని, చెల్లాయత్త ఆడి-పాడిన గొబ్బిపాట -
దానికి మా నాన్న వేసిన దరువు -
మా అమ్మ గొంతు-కలుపు -
చివర్లో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ చిన్నపాప్పిన్ని శుభోజ్జయం అంటూ మా తంబి మామయ్య పలుకు ...
గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 7 - బీటీలో గట్టెక్కిన ఎస్సెసెల్సీ ఒకే వరసలో కబుర్లు చెప్పేయకుండా - కొంచెం ముందుకీ వెనక్కీ వెళ్తూ అప్పుడోటీ అప్పుడోటీ జరిగినవి చెప్తాను - మా అమ్మ( మీ నాన్నమ్మ) కాశీమజిలీకథలు చెప్తూ మధ్యలో పిట్టకథలు చెప్పేది కదా - అలాగన్నమాట!
(ఈ ఉపోద్ఘాతానికి కారణమేంటంటే కొన్ని చెణుకులు మర్చిపోయానూ - అవిప్పుడు చెప్తానూ అని అర్థం.)
అరటికాయ బజ్జీ న-ఖాదనం:
చిన్నప్పుడు మా వీధిలో అనిపిండి సన్యాసిరావు మాష్టారని ఒకాయనుండేవారు.
మనిల్లు - పక్కనే చిన్నరాజుగారి ఖాళీ స్థలం - దాని పక్కిల్లు అనిపిండి వారిది.
సన్యాసిరావు మాష్టారని - ఎలిమెంటరీ స్కూల్ ఆయన. కొంచెం అమాయకత్వంతో కూడిన టీచర్ ఆయన. చాలా మంచాయన పాపం!
చిన్నరాజుగారి పేరు నరసింహరాజుగారు. సత్తికొండకి, సూరికి తాతగారు ఆయన.
ఆయన ఇంటి ఎదుగుండా స్థలంలో అరటితోట వేసుకున్నారాయన. ఆ తోటకి ముందు పక్క దడి కట్టేసి ఉండేది.
ఒకసారి ఆ తోట మంచి కాపొచ్చింది - బోల్డు గెలలూ అవీ వేసి - మంచి అరటికాయలు బాగా వచ్చాయి.
ఓ రోజు సాయంత్రం - సత్తికొండ, సూరి, నేను వీధిలో అరుగు మీద కూర్చున్నాము. సన్యాసిరావు మాష్టారు కూడా వచ్చి మా పక్కనే కూర్చున్నారు.
రాజుగారి తోటలో అరటికాయలు చూస్తూనే నాకు అరటికాయ బజ్జీలు తినాలనిపించింది.
అనిపించిందే తడవు - నేను సత్తికొండతో - " ఒరే! అరటికాయ బజ్జీలు తినాలని వుంది. మన చిన్నరాజుగారి తోటలో అరటికాయలు బావున్నాయి. అరటికాయలు లోపలున్నాయి - మరి అవి కోసి తెచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే నూనె అదీ నేను పట్టుకొస్తాను. బజ్జీలు వేసుకు తింటే బావుంటుంది కదా" - అన్నాను.
అది వింటూనే సన్యాసిరావు మాష్టారు కూడా - "అవున్రా! - బావుంటుంది - అరటికాయ బజ్జీలు తిందాం - సరదాగా వేడి వేడిగా" - అన్నారు.
"సరదాగా తిందాం అంటే ఎవరన్నా వెళ్ళి వాటిని కోసుకు రావాలి కదా - మేమెళ్ళ లేము - మీరెళ్ళండి - అరటి కాయలు తీసుకురావడం ఒంతు మీది - నూనె, సెనగపిండి తీసుకురావడం ఒంతు మాది" అన్నాన్నేను.
సన్యాసిరావు మాష్టారి ఇంటి దగ్గర ఒక చిన్న సిమ్మెంటు కుర్చీలా కట్టారొకటి.
ఆ కుర్చీ దాటితే తోటలోకి వెళ్ళిపోవచ్చు. దూకెళ్ళాలి.
నేనలా అరటికాయలు మీరు తెండి అన్నానో లేదో ఆయన - "సరే! నేనెళ్ళి పట్టుకొస్తాను ఆగరా" అనే చెప్పి - ఆ సిమ్మెంటుకుర్చీ దూకి అరటితోటలో దిగారు.
అది సాయంత్రం మునిమాపువేళ. ఆరూ ఆరున్నర అవుతోంది - చిరుచీకటి పడుతోంది.
అప్పుడే చిన్నరాజుగారు బయటికొచ్చి పడక్కుర్చీ వేసుక్కూర్చున్నారు.
సన్యాసిరావు మాష్టారిని తోటలోకి వెళ్ళనిచ్చి - ఆయనో నాలుగు కాయలు కోసింతర్వాత - "ఏమండోయ్! చిన్నరాజుగారు! మీ తోటలో ఎవరో దొంగ దిగి అరటికాయలు కోసుకు పోతున్నాడు - దొంగ! దొంగ!"- అని అరిచాను.
ఆయన వెంటనే లేచి - "ఎవడాడు?! తోట్లో ఎవుడ్రా వాడు - అర్టికాయలు కోసేవాడు?" - అంటూ కర్రట్టుకుని ఒచ్చారు.
ఈ లోపులో సన్యాసిరావు మాష్టారు - చిన్నరాజుగారి కేకలకు భయపడి - ఆ తోటలోంచి కుర్చీ మీదుగా ఇంటిలోపలికి దూకేసి - "అమ్మ వెధవల్లారా! నన్నాటాడించేసి తోటలో దింపి నన్ను దొంగంటారా? నన్ను పట్టుకుంటే కొట్టేసేవాడిప్పుడాయన" - అని గోలగోల చేశారు.
ఆ రోజలా ...
అరటికాయ బజ్జీ ఖాదనం
మేమెప్పుడూ కాదనం అనుకున్నాం
కానీ అయింది మాత్రం
అరటికాయ బజ్జీ న-ఖాదనం! కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం
శ్రావణమాసంలో శ్రావణీకులు వచ్చేవారు మనింటికి - ఉర్లాం బ్రాహ్మలు అనేవాళ్ళం వాళ్ళని - ఒక శ్రావణ-భాద్రపద మాసాల్లోనే వస్తారు.
వాళ్ళు కృష్ణా జిల్లా - తెనాలి అటువైపు నుంచి వచ్చేవారు. మనవేపు నుంచీ వచ్చేవారు కానీ - ఎక్కువగా అటువైపు నుంచి వచ్చేవారు.
వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే - మన ఇంట్లో వండిన వంట వాళ్ళు తినరు.
వాళ్ళకి స్వయంపాకం ఇచ్చేసి ఓ పొయ్యా అదీ చూపెడితే - మనింట్లోనే ఒండేసుకుని ఆ రాత్రి అక్కడ పడుకుని మరసటి రోజు పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు.
ఒక రోజు సాయంత్రం మనింటికి దాదాపు ఓ పది మందొచ్చారు. ఏవో పన్నాలు అవీ చెప్పారు. మా నాన్నగారు వాళ్ళకి ఏదో సంభావన ఇచ్చారు.
ఆ తర్వాత వాళ్ళు - "అమ్మా! మేం రాత్రికి ఇక్కడే భోంచేస్తాం" అన్నారు మా అమ్మతో.
మన ఇంటి వెనకాల సందులో ఓ రెండు పొయ్యిలుండేవి.
మామూలు పొయ్యొకటి, పెడా పొయ్యొకటి - మట్టితో చేసినవి ఉండేవి.
అక్కడో రుబ్బుగుంటుండేది.
వాళ్ళక్కావాల్సిన సరుకులు అన్నీ ఇచ్చి మా అమ్మగారు - "సరే! మీరు ఒండుకు తిని అరుగుమీద పడుకోండి" - అని చెప్తే వాళ్ళు వంట ఒండుకున్నారు - తిన్నారు.
మన నట్టింట్లోనే - ఈ పదిమంది ఆకులు గట్రా వేసుకుని కూర్చుని ప్రశాంతంగా భోజనాలు అవీ కానిచ్చారు.
భోజనాలు అయిపోగానే వచ్చి అరుగుమీద వేసుంచిన ౘాపల మీద అంగోస్త్రాలు పరుచుకుని పడుకున్నారు.
ఈలోపు నేనేం చేశానంటే - మా వదినగారు వయొలిన్ వాయించేవారు - ఆ వయొలినేమో వీధిగదిలో అలమారులో పెట్టేవారు.
నేను సరదాగా ఆ వయొలిన్ - తీసి తీగలు బిగించి - దాన్ని కుయ్-కుయ్ అని అటూ ఇటూ ఆడిస్తున్నాను.
ఆడిస్తుంటే - ఈ బ్రాహ్మల్లో ఒకాయన - "ఏం నాయనా! నువ్వు వయొలిన్ కూడా వాయిస్తావా?" - అనడిగాడు నన్ను.
"అబ్బే - నేం దీని మీద చాలా సాధన చేస్తున్నానండి. ఏ పాట కావాలంటే అది వాయిస్తాను - సంగీతం కూడా నేర్చేసుకుంటున్నాను నేను" - అని చెప్పాను.
"అయ్యో - అంతకన్నానా - తప్పకుండానండి" - అని నేననగానే - భుక్తాయాసంతో ౘాపల మీద వాలిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారు.
నేను కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో - శుభ్రంగా మఠం వేసుకుని కూర్చుని - ఈ వయొలిన్ దగ్గర పెట్టుకుని - ముందేమో శృతి చేస్తున్నట్టుగా కుయ్-కుయ్ -కుయ్ మనిపించి - అటుతిప్పి ఇటుతిప్పి పదినిముషాలు ఆటాడాను అల్లాగా - ఇల్లాగా తిప్పుతూ. .
"అబ్బెబ్బే - ఇదిగో వాయిస్తున్నాను - ఆగండి" - అంజెప్పేసి ఆ వయొలిన్ కమాను పట్టుకుని ఆపకుండా "కుయ్-కుయ్-కుయ్" అని వాయించేస్తున్నాను.
వెంటనే వాళ్ళు - నా వాయులీన-వాదనా-బాధ భరించలేక - చెవులు మూసేసుకుని - "బాబూ! వద్దులేమ్మా! నీ సంగీతం వద్దు, వయొలిన్నూ వద్దు. నువ్వది లోపల పెట్టేయమ్మా - మాకూ నిద్రొస్తోంది - పడుకుంటున్నాము" - అని బ్రతిమలాడి నాచేత వాదన ఆపించి అలసి-సొలసి పడుకుండిపోయారు.
అద్దీ - అత్యుత్సాహం కొద్దీ ...
నువ్వెంత వాయించినా వద్దనం అన్నవారి చేతే
వద్దు-బాబోయ్! నీకు వందనం అనిపించిన
నే వినిపించిన కుయ్‌కుయ్ వాయులీన-వాదనం!
రెండువేలపద్ధెనిమిది
పరుగెత్తుకుంటూ వచ్చేసిందిది
కొత్త ఆశలకి నాందిది
ఒక ఏడాది కాలం - ఎప్పట్లాగే - కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు, ఇంకొన్ని అనుకోకపోయినా ఆగలేనట్లు - కొన్ని ప్రైజులు, ఇంకొన్ని సర్‌ప్రైజులు - నచ్చినా నచ్చకపోయినా - అది నాకు ఇవ్వాలనుకున్నవీ, నాకే చెందాలనుకున్నవీ - నాకిచ్చి - క్యాలెండర్లో తన అంకె మార్చుకుని గతమైపోయింది.
2017 ఆఖరి క్షణపు అంచున నిలబడి - వెనక్కి చూసుకుంటే...ఎన్నో జ్ఞాపకాలు ...
అందులో నవ్వులున్నాయి
నవ్వుల పక్కనే నొవ్వులూ వున్నాయి
ఎప్పటికన్నా ఈ ఏడాది కొంచెం ఎక్కువగానే ఎదకు కలిగిన నొప్పిని నవ్వుల మాటున కప్పి-
ఇంకేం మిగిలాయా అని లెక్కేస్తే -
అనుకోకుండా దొరికిన పరిచయాలు
అనుకుని పెంచుకున్న నెయ్యాలు
చెలిమిలో చిక్కిన పట్టు
కొలువులో ఎక్కిన మెట్టు
చదివేసిన పుస్తకాలు - చదవేస్తే పోని మతి
చదవగా చదవగా ఎంతుందో తెలిసిన బుద్ధి-మితి
రాసేసిన బ్లాగ్-పోస్టులు - రాశి పోసిన కబుర్లు
రాయగా రాయగా వాడుకైన వారం-వారం కబుర్లు
అర్థభాగంతో - సంపూర్ణమైన - కొన్నిఏకాభిప్రాయాలు, ఇంకొన్ని భేదాభిప్రాయాలు - వెరసి ఎడతెగని సంభాషణలు
ఆప్తులతో అపురూపంగానైనా కుదిరిన ఫోను-వేళలు
బుజ్జిజింకలతో కలిసి పేర్చుకున్న లెగో-బ్లాకులు
ఆర్రోజుల అతిథిగా అరుదెంచిన అన్నజింక నేస్తం - కెవిన్ అందించిన అరుదైన పొగడిక: "I wish I were like your mom - who could laugh at random things and be happy!".
చాలు - ఒక ఏడాది బాగా గడిచింది అని చెప్పుకోవడానికి ఈ లెక్క.
ఇంక పుట తిప్పుకోబోతున్న కొత్తసంవత్సరం గురించి నేనేమనుకుంటున్నానో చెప్పాలంటే ...
వచ్చినదాన్ని వదులుకోను
రానిదాన్ని తలుచుకోను
నాకు పంచిన నవ్వును పెంచుతాను
నాపై విసిరిన రాయిని దాచుతాను
ఎప్పటి సమస్య కప్పుడే వెతుక్కునే solution
ఎప్పట్లాగే నా మారని new year resolution.
2018కి చిగుళ్ళతో, ఆకులతో, పూవులతో, కొమ్మలతో, రెమ్మలతో ఎదుర్కోలు పలుకుతూ -
నేను పంచుకుంటున్న నా New Year Terzanelle / తరంగమాల (అలలదండ): Here is a new page to turn.../ రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...
Here is a new page to turn...
A laugh to share, a tear to wipe
Old endings to new beginnings
Here is a new page to turn...
Gather the memories together
Let's bind the book of life
Old endings to new beginnings
A dash of smile, a pinch of sorrow
Jingling together the bells of joy
Let's bind the book of life
Tap your foot to the rhythm of delight
Sing away the blues outright
Jingling together the bells of joy
A dream to carry, a hurt to drop
Pitching a new note here and there -
Sing away the blues outright
Now is the time for us to bring
A laugh to share, a tear to wipe
Pitching a new note here and there -
Here is a new page to turn...
రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...
పంచుకోవడానికో నగవు, దాచిపెట్టిన వగపు
ముగిసిన పాత కథలో విరిసిన ఆశల కలలో
రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో
నిట్టూర్పులో ఓదార్పులో జ్ఞాపకాలు పోగు చేద్దాం
నూతన జీవితపు సంపుటి అచ్చు వేద్దాం
ముగిసిన పాత కథలో విరిసిన ఆశల కలలో
2010 నుంచి ప్రతి ఏడాది నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఒక terzanelle రాయడం - దాన్ని ఆత్మీయులకి నూతన సంవత్సర శుభకామనలతో పాటు పంపించడం ఒక ఇష్టమైన వ్యాపకంగా మారింది.
ఈసారి ఎప్పట్లాగే terzanelle రాసిన తర్వాత దాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించాను.
తెలుగులో రాసిన terzanelle పద్య-రూపానికి ఒక పేరు పెట్టాలనుకున్నాను.
ఒక స్టాంజా / చరణంలోంచి తర్వాతి దానికి అలలలాగా ప్రయాణించే పద్యపాదాలు వున్న terzanelle కి మొదటగా తట్టినపేరు - నేను పెట్టుకున్న పేరు తరంగమాల - అచ్చతెలుగులో అలలదండ.
కుదిరే వీకెండ్‌లోనో - సరదాగా సెలవుల్లోనో
పాటలు వింటూ చూడడానికో - చూస్తూ వినడానికో
యూట్యూబ్-జాకీ నేనై - ఐ-ప్యాడ్ మీటలు కదపగా
భూకైలాస్ నుంచి బాహుబలి దాకా
Leonard Cohen - First We Take Manhattan నుంచి దేవిశ్రీప్రసాద్ - అ అంటే అమలాపురం దాకా
అదీ-ఇదీ అని లేక - అన్ని కాలాల - నానా రకాల - సినిమాల - న-సినిమాల
పాటలు వింటూ - ఆ పాటలపై పాటలు గొంతు కలిపి పాడుతూ
నా పాట ఆపితే - నా రస-సిద్ధికి ఆటంకం కలిగి
నే వండే ఏ రసమైనా నీరసమవుతుందన్న ఎఱుకతో
నన్నాపక - నా పాటలతో పాటు ఇంట్లోవాళ్ళు గొంతులు కలుపుతూ
బృందగానాసక్తులై - నా పాటానురక్తులై
నా వంటిల్లు శ్రీరామనవమి పందిరై
చుట్టూ వున్న మొక్కలూ-బొమ్మలూ ఆ పందిరి రాటలై
అలరారే నా వంటింటి-గానలహరి కార్యక్రమంలో
నేను తప్పకుండా వింటూ - వినిపించే పాటలు రెండు
కవల పాటల విభాగానికి చెందు
అందులో మొదటిది - హిందీ సినిమా దో కలియా (1968) లో రవి సంగీత దర్శకత్వంలో వెన్న తిని పాడుతున్నారేమో అనిపించేంత మెత్తగా వినిపించే మహమ్మద్ రఫీ, పాటల-జలపాతం లతా మంగేష్కర్ పాడితే - తెలుగు కవలపాట - మూగనోము (1969)లో గోవర్ధనం సంగీత దర్శకత్వంలో ఖంగుమనే ఘంటసాల, తెలుగు-కోయిల్సుశీల వినిపించారు.
అసలుపాట:
దో కలియా సినిమా ముందొచ్చింది కాబట్టి హిందీలో వచ్చిన తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ అన్న పాటకి అసలు పాట స్టేటస్ ఇచ్చేశాను.
ఈ పాటలో ఆడినవారు - బిస్కెట్ హీరో బిశ్వజిత్, నేపాలీబాల మాలాసిన్హా.
బిశ్వజిత్‌కి, బిస్కెట్‌కి ఏమీ సంబంధం లేదు - మొదటి అక్షరం బి కావడం తప్ప .
నేను మొదటగా చూసిన బిశ్వజిత్ సినిమా - మా అమ్మ, పప్పి, కుట్టీలతో కలిసి - గుంటూరు మంగాథియేటర్లో మార్నింగ్‌షో - బీస్ సాల్ బాద్. అది చూసేటప్పుడే అనుకున్నాం మేం ముగ్గురు సిస్టర్లం - ఈ హీరో మొహం పాలలో ముంచిన Marie బిస్కెట్‌లా ఉందని. అదీ బిస్కెట్ హీరో వెనక బిట్టు-కథ.
దో కలియా - ఎక్కడో జర్మన్ నవలకి - బ్రిటిష్ వాళ్ళూ - ఆ తర్వాత అమెరికా వాళ్ళు - సినిమా తీస్తే దాన్ని పట్టుకొచ్చి ముందు తమిళంలో, తర్వాత తెలుగులో, ఆ తర్వాత హిందీలో తీసిన కవలల కథ.
సరదాకి - ఒక సినిమా జన్మరహస్యం: >Erich Kästner's German novel Lottie and Lisa (1949)
>>బ్రిటిష్ సినిమా - Twice upon a time (1953) >>>అమెరికన్ సినిమా - The Parent Trap (1961) >>>> తమిళ్ సినిమా - కుళందయ్యుం దైవమమ్ (1965) >>>>> తెలుగు సినిమా - లేతమనసులు (1966) >>>>>> హిందీ సినిమా - దో కలియా (1968)
తెలుగులో - లేతమనసులు - అంటూ జమున, హరనాథ్ నటించిన సినిమానే హిందీలో వచ్చిన దో కలియా.
ఈ తెలుగు లేతమనసులు సినిమాకి - నాకూ చెందిన ఇంకో బుల్లి కథ వుంది. లేతమనసులు సినిమాలో ఏకరూప-కవలల పేర్లు లల్లి-పప్పి. ఆ సినిమా చూశాక మా లక్ష్మిదొడ్డ లలితనైన నాకూ, నా తర్వాత పుట్టిన అరుణకు - లల్లి-పప్పి అని ముద్దుపేర్లు పెట్టింది. మా తర్వాత పుట్టిన కిరణ్మయి కుట్టి అయింది. సరే - నా పేరు-కబుర్లు పక్కన పెడితే - తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీఅంటూ గడ్డిమేట్ల మీద పాకుతూ, చెట్టు-ఊడలు పట్టుకు ఊగుతున్న పాటని చూస్తే - గుర్తుకొచ్చింది - ఇది లేతమనసులు సినిమాలో అందాల ఓ చిలకా - అందుకో నా లేఖ పాటకి సమాంతర-హిందీ-పాట అని. దో కలియా - లేతమనసులు ఒకటే కథ ఆధారంగా వచ్చిన కవల-సినిమాలు - కానీ వాటిల్లో కవల-పాటల్లేవు. దో కలియా - మూగనోము సినిమాల్లో కవల-పాటలు వున్నాయి కానీ - సినిమా కథలు వేరువేరు. అదొక ఆసక్తికరమైన త్రికోణ-సినిమా-సంబంధం.
{ఇల్లాంటి త్రికోణ-సినిమా-సంబంధం ఇంతకు ముందు మనసే జతగా పాడిందిలే - 2 - కవలపాటలు - కలలు కన్న కన్నడ ప్రణయగీతం లో కూడా చెప్పాను. ఎరడు కనసు (తం నం తం నం పాట) - పూజ (నింగీ నేలా ఒకటాయెనే పాట) ఒకటే కథ ఆధారంగా వచ్చిన కవల-సినిమాలు - కానీ వాటిల్లో కవల-పాటల్లేవు. ఎరడు కనసు (తం నం తం నం పాట)- ప్రణయగీతం (రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం పాట) సినిమాల్లో కవల-పాటలు వున్నాయి కానీ - సినిమా కథలు వేరువేరు.} ఇంక అసలుపాటకొస్తే -... నేనేం తప్పు చేశాను - అంత కోపంగా వున్నావు - నా వల్ల తప్పేమన్నా జరిగితే మన్నించేయ్ అంటున్న అబ్బాయితో నీ తప్పే నీకు శిక్ష అవుతుంది - అని చిలిపి కయ్యాలాడుతున్న అమ్మాయి పాడుకుంటున్న ఆ హిందీ పాటని - వింటూ, చూస్తూ, చదువుతూ, పాడేసుకోవడానికి వీలుగా ... యూట్యూబ్ వీడియో, ఆడియో, తెలుగులో టైప్ చేసిన హిందీ పాట - పేష్ కర్ రహీ, పాటల భైరవి!
హమారా ఇరాదా తో - కుఛ్ భీ న థా తుమ్హారీ ఖతా ... ఖుద్ సజా హో గయీ
లాలాలలా లాలలా లాలలా ఉహుహూహుహూ ఊహుహూ ఊహుహు
కవలపాట:
పూల చీర కట్టుకున్న కమలాక్షి జమున
నల్ల టై కట్టుకున్న విశాలాక్షుడు అక్కినేని
ఒక ఈతచెట్టు, ఒక కొబ్బరిచెట్టు
కొన్ని మావిడి(?) చెట్లు - వాటికి వేసిన రెండు ఉయ్యాళ్ళు
పరుగులెడుతూ - ఉయ్యాలలూగుతూ -
పాడుకున్న పాట - ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.
ఈ పాట మొదటి సారి వాడు విన్నప్పుడు - ఉయ్యాల జంపాల ఊగేములే అన్న వాక్యం దగ్గరికి రాగానేబుజ్జిజింక కొక సందేహం వచ్చింది - Why do they swing to die? అంటూ - జంపాల అన్న మాటని చంపాల అన్నట్లు అర్థం చేసుకుని.
బుజ్జిజింక కప్పుడు - అదొక okey-dokey లాంటి వాడుక మాట - ఉయ్యాలూగడాన్ని తెలుగులో వివరించడానికి - అని చెప్పి ఒప్పించుకున్నాను.
మరి - ఈ కవలపాట కూడా - చూస్తూ, వింటూ, చదువుతూ, పాడుకోవడానికి వీలుగా - సమర్పిస్తున్నది, పాటల భైరవి!
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు
నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే - నీ మాటలో మధువులే పొంగిపోయే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే - నీ మాటలో మధువులే పొంగిపోయే నాలోని అణువణువూ నీదాయెలే - బ్రతుకంతా నీకే అంకితం చేయనా నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే
లా లలాల లలాల లలలలలా లలాల లలాల లలలలలా ఉహుహుహుహూ
నీ రూపమే గుండెలో నిండిపోయే - నా స్వప్నమే నేటితో పండిపోయే నీ రూపమే గుండెలో నిండిపోయే - నా స్వప్నమే నేటితో పండిపోయే ఉయ్యాల జంపాల ఊగేములే - కలకాలం మనకు ప్రేమయే ప్రాణము ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు
లాలాలలా లాలలా లాలలా ఉహుహూహుహూ ఊహుహూ ఊహుహు
దేవులపల్లివారు ఆశించినట్లు -ఆశీర్వదించినట్లు
నాదైనా, మీదైనా - ఎవరిదైనా బ్రతుకంతా - ప్రతి నిముషం - పాట లాగా సాగాలి
అని కోరుకుంటూ ...
అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం దొరికేదట - లెగో తాజ్‌మహల్ (Lego 10189).
ఎప్పుడు గూగుల్లో వెతికినా - Discontinued by manufacturer అనే కనిపించేది.
లెగో-అభిమానుల నలరించి వారితో హార్దిక్య-వృద్ధికో, లేకపోతే ఈ హాలిడే సీజన్లో తన ఆర్థికలబ్ధికో - నవంబర్ నెల 27న మళ్ళీ కొత్త తాజ్‌మహల్ విడుదల చేస్తున్నాం - కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్ముతాం - అంటూ ప్రకటించింది లెగో.
ఆ వార్త చదివిన దగ్గర్నుంచీ నవంబర్ 27 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు.
ఈలోగా నేను చేసిన ఇంకొక పని ఏంటంటే బదరికి చెప్పి - తాజ్‌మహల్ - కొనుక్కోవడానికి కావల్సిన ఫండ్స్ శాంక్షన్ చేయించుకోవడం.
ఇంట్లో వున్నప్పుడు బుజ్జిజింక ఎదురుగుండా అడిగితే - తను "హన్నా! ఇప్పుడొద్దు" అంటే - ఎంత పెద్ద disappointment కదా! అందుకని - ఒక సాయంత్రం వాకింగ్ కని వెళ్ళినప్పుడు - ఇల్లు దాటి రెండడుగులు వేశామో లేదో - మళ్ళీ చెప్పడానికి అవకాశం వస్తుందో రాదో అన్నట్లు - "బావా! నవంబర్ 27 న లెగో తాజ్‌మహల్ రిలీజ్ చేస్తున్నారు - దాదాపు పదేళ్ళ తర్వాత. ఇప్పుడే చెప్తున్నాను - నేనది ఆర్డర్ చేయబోతున్నాను - మీరు నాకు అవునని చెప్పాల్సిందే!" అని గబగబా చెప్పేశాను.
ఎప్పట్లాగే - ఒక చిరువ్వుతో - "నీకు, బుజ్జిగాడికి కాదని చెప్పే అవకాశం నాకెప్పుడిచ్చారు మీరు. కానీయండి" అన్నారు.
ఆ తర్వాత నా నడక నేలకు అరంగుళం పైన అని వేరే చెప్పక్కర్లేదు :)
ఆ ఇరవైఏడు రానే వచ్చింది.
పొద్దున్నే ఏడున్నర గంటలకు లెగోడాట్కాంలో తాజ్‌మహల్ (Lego 10256) కొనబోతే అప్పటికే Backorder (temporarily out of stock) చూపిస్తోంది.
అది చూడగానే ఒక్క నిముషం - "అయ్యో! ఎవరో లెగో-భిమానులు రాత్రి డేట్ 26 నుంచి 27కి మారగానే కొనేసుకుని వుంటారు. నేను కూడా పన్నెండింటి దాకా ఉండి ఆర్డర్ చేసి పడుకోవాల్సింది. ఇప్పుడింక కొందామన్నా దొరుకుతుందో లేదో" అనుకుంటూనే backorder చేశాను.
వెంటనే - మా దగ్గర తాజ్‌మహల్ కొన్నందుకు ధన్యవాదాలు అంటూ ఒక ఈ-మెయిలు, దాని వెనకాలే ఇంకో ఐదు నిముషాల్లో - మీరు కొన్నది temporarily out of stock కాబట్టి పంపించడం ఆలస్యం అవుతుంది, ఈ అసౌకర్యానికి మన్నించండి అంటూ ఇంకో ఈ-మెయిలు - లెగోవారినుంచి.
మొత్తానికి డిసెంబర్ ఆరు నాటికి అంకెలారా 5, 923 బ్లాకులున్న లెగో తాజ్‌మహల్ మా ఇంటికి చేరింది. దాంతో పాటు రెండు ఉచిత బహుమతులు - ఒకటి Nutcracker, ఇంకోటి బోల్డన్ని లెగో డబ్బాలు పట్టే లెగో-పాలియెస్టర్ సంచీ.
బుజ్జిజింక, నేను - శీతాకాలపు సెలవుల్లో build చేద్దాం అని ఓ పక్కన పెట్టాం - మా కొత్త లెగో-తాజ్‌మహల్‌ని.
అప్పుడే బదరి చెప్పారు - అన్నజింక సెలవులకి ఇంటికి వచ్చాక అందరూ కలిసి చెయ్యండి అని.
అన్నజింక వచ్చాడు.
21 నుంచీ బుజ్జిజింకకూ, నాకు సెలవులు కూడా వచ్చాయి.
డిసెంబర్ 22 న మొదలుపెట్టి - ముగ్గురం కలిసి - ముక్కా ముక్కా చేర్చి - రెక్కా రెక్కా (wing of the build) పేర్చి - మూడు మూళ్ళ-తొమ్మిది గంటల పైన ఇంకో మూడిరవైలు - అరవై నిముషాలు - అంటే మొత్తం మీద నాలుగు రోజుల్లో పదిగంటలు వెచ్చించి - ఈరోజుకి అంటే డిసెంబర్ 25కి మా లెగో-తాజ్‌మహల్ కట్టడం పూర్తి చేశాం.
మొదటి రోజుకి బేస్ మాత్రం పూర్తి చేయగలిగాం.
దీనికి ముందు ఎన్నో లెగో సెట్లు పూర్తి చేసినా, దీంతర్వాత ఇంకొన్ని చేయబోతాం అనుకున్నా - ఈ తాజా తాజ్ సెట్టుకి ఒక ప్రత్యేకత వుంది.
గత తొమ్మిదేళ్ళుగా బుజ్జిజింక, నేను బోల్డన్ని లెగో సెట్లు build చేసినా ఎప్పుడూ మాతో చేరే వీలు కుదరని అన్నజింక ఈసారి మా ఇద్దరితో కలిసి ఈ తాజ్‌మహల్ build చేశాడు. చేస్తున్నంతసేపూ దాన్ని డిజైనర్లని (లెగో) మెచ్చుకుంటూనే వున్నాడు.
పూర్తయిన తర్వాత కూడా పదేపదే - దాని ముందు నించుని - "ఎంత బావుంది కదా!" - అని తెగ ముచ్చట పడుతున్నాడు.
నాకెప్పుడూ రాత్రి - అందులోనూ సెలవు రోజుల్లో రాత్రి - పుస్తకంలో మునిగో, మాటల్లో తేలో, పాటల్లో సోలో - కనురెప్ప తానంతట అదే మూత పడేదాకా - పగటికి సాగనంపుగా కాక - కొనసాగింపుగా గడపడం - నాకు చాలా ప్రియం.
అలాంటి ప్రియమైన రాత్రి - నిన్నటిరాత్రి.
రాగాల సరాగాల పాటలతో మొదలుపెట్టి రాజకీయాల-కబుర్ల దాకా రాత్రిని సాగదీసి - అప్పటికే రేపటిలోకి జారుతున్న రాత్రికి వీడ్కోలు పలుకుతూ - Good Night చెప్పుకుంటున్న మా నలుగురికి అప్పటివరకూ మా కబుర్ల జోరులో వినిపించలేదు - కిటికీ అద్దాల మీద "చిటుకు చిటుకు" అంటున్న చిట్టి-చిట్టి ఐసు-ముక్కల శబ్దాలు.
అది వినగానే - మళ్ళీ ఇంకొన్ని కబుర్లు - "మంచు కురుస్తుంది కానీ - ఇల చేరగానే నిలవద"ని ఒకళ్ళు, "లేదు - precipitation ఉందని నా ఫోన్ చెప్తోంది, కురిసినది నిలిచి మురిపిస్తుంద"ని ఒకళ్ళూ - అంటూ, అనుకుంటూ - కిటికీల మీద తాకుతున్న చినుకుల-చిటుకు-శబ్దాలు లెక్కెట్టుకుంటూ బజ్జున్నాం.
అందరికన్నా ముందు లేచిన నాకు - కిటికీలోంచి చూడగానే కనిపించింది ఏంటంటే ...
అప్పుడెప్పుడో - డిసెంబర్ 19.
అచ్చొచ్చిన రోజు.
నచ్చొచ్చిన రోజు.
అనుకోకుండా "కలిసొ"చ్చిన రోజు.
అన్నీ కుదిరి నాకు కుదురిచ్చిన రోజు.
మరి ఇవాళ - సరిగ్గా - అదే రోజు అంటే డిసెంబర్ 19.
ఇక్కడొక్కసారి ఆగి -
మరపురాని ఆ మైమరపు
మైమరపు మాటున తళుక్కుమనే జ్ఞాపకాల మెరుపు
మెరుపులా మెరిసే ఆనాటి తలపు
ఆ తలపు వలన - తలచినకొద్దీ కలిగే - మురుపు
ఇక్కడికిక్కడ ఇక్కడే ఇలాగే ఆగి -
ఆ రోజుని తల్చుకుంటూ -
ఆ పంథొమ్మిదికి baseఏదమ్మా ౘందమామా?
అరెరే - ఎన్నో పోస్టుల్లో ఉన్నాదమ్మా ౘందమామా
ఏ పోస్టులో వుందో ఇప్పుడు చెప్పాలమ్మా - హేయ్ ఎన్నో పోస్ట్లో ? - ఎన్నో పోస్ట్లో ? - ౘందమామా !- హేయ్ ఏంటో ఆ కథ చెప్పేసెయ్యి ౘందమామా!
- అని పాడుకుంటూ జరిగిందంతా ఒకసారి సింహావలోకనం చేసుకుంటే - బోల్డన్ని ప్రశ్నలు, వాటికి జవాబులు - వెరసి ఒక నా బ్లాగుతో నా బ్లాగే చేసుకునే - కొంటెర్వ్యూ - తుంటర్వ్యూ.
ఒకటవప్రశ్న:
అసలు అబ్బాయి మూగ అని అమ్మాయికి ఎవరు చెప్పారు?
ఒకటవజవాబు:
ఎవరూ చెప్పలేదు. అమ్మాయికి - మామూలు గంతులతో పాటు - conclusion కి కూడా గంతేయటం అలవాటు కదా - అలవాటు ప్రకారం వేసేసింది. "He doesn't say anything - except smiling" - అని అన్నది అమ్మాయి వినిపించుకొన్నప్పుడు చెప్పినవాళ్ళు - చెప్పించినవాళ్ళు చాలా జాగ్రత్తగా - He He doesn't say anything అన్నారు - అనిపించారు కానీ - He cannot say anything అనలేదు. అసత్యదోషం వాళ్ళది కాదు - అపార్థ-దోషం అమ్మాయిది. ( త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!)
రెండవప్రశ్న:
అసలలా చెప్పే అవసరం ఎందుకొచ్చింది? ఏంటి సంగతి?
రెండవజవాబు:
దీనికి జవాబు చెప్పే ముందు ఓ రెండు పోస్టులిక్కడ ప్రస్తావించాలి.
అందుకే చెప్పాడు అబ్బాయికి - "ఆ అమ్మాయికి కోపమెక్కువ. నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. నేను రాను" అంటూ.
"ఈ ఒక్కసారికి రా - షేకీ!" అంటూ అబ్బాయి
"లేదు బాబూ - నీకూ కోపమెక్కువ - నిన్నక్కడికి తీసుకెళ్తే కచ్చితంగా మీ ఇద్దరూ మాట్లాడుకోరు - పోట్లాడుకుంటారు - నేను రాను" అంటూ RS.
ఇలా ఓ పదినిముషాలు వాదం-సంవాదం నడిచాక - అమ్మాయి దగ్గరికి వెళ్ళి, కలిసి మాట్లాడి వెళ్ళేవరకూ అబ్బాయి మాట్లాడకూడదు అనే షరతుతో - RS అబ్బాయిని అమ్మాయి హాస్టల్‌కి - కలవడానికి తీసుకొచ్చాడు.
అదీ అబ్బాయి మాట్లాడకపోవడానికి కారణం.
మూడవ ప్రశ్న:
ఇంతకు ముందు రెండవజవాబులో అబ్బాయికి కదిలిన "పూర్వజ్ఞాపకం" ఏంటి? ఏమా కథ?
ఆ రోజేం చేసిందంటే - రిక్షాలో వెళ్తున్నప్పుడు "ఎవర్రా అనిల్ - ఈ అమ్మాయి" అన్న మాట వినగానే అన్నదెవరో చూడకుండానే - ఎవరో అప్పుడే కమెంట్ చేసేస్తున్నారు - ఎలాగైనా ధైర్యంగా ఉన్నట్టు కనిపించాలి , వినిపించాలి అనుకుని - మొహం అద్దంలో చూసుకోమని చెప్పేసింది కదా.
అంతకుముందెప్పుడూ ఏ అమ్మాయీ అలా అనడం - తను పడడం అలవాటులేని అబ్బాయి - పక్కనున్న అనిల్ కేసి తిరిగి "ఎవర్రా? నన్నే ఇలా అంటోంది?" అనడిగితే "వీళ్ళు ముగ్గురాడపిల్లలు - పద్ధెనిమిదో అడ్డరోడ్డులో వుంటారు" అన్న అనిల్ సమాధానం విని - అప్పుడు అంతగా పట్టించుకోని అబ్బాయికి - అదే అమ్మాయిని తిరుపతిలో చూడగానే - ఆ పూర్వ జ్ఞాపకంతో ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి - తన మొహం ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలనిపించింది.
నాల్గవప్రశ్న:
అబ్బాయి RS కిచ్చిన మాట ప్రకారం - సైలెంటుగా వుండి బాగానే అమలుపర్చాడు 19న - సరే! మరి 21 రైలు-ప్రయాణం రోజు కూడా ఎలా మేనేజ్ చేశాడు?
డిసెంబర్ పంథొమ్మిదవ తారీఖున మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు - ఎప్పుడైతే అమ్మాయి 21న గుంటూరు వెళ్తున్నాను సంక్రాంతి సెలవులకి అని చెప్పిందో - హాస్టల్‌కి వెళ్ళి అబ్బాయి చేసిన మొదటి పని ఏంటంటే - ఆ రోజు రైల్లో అమ్మాయి పక్కన సీటు ఎలా సంపాదించాలా అని ఆలోచించడం.
అబ్బాయికున్న బోల్డంత మంది మంచి ఫ్రెండుల్లో - తర్వాత్తర్వాత SPMVV అమ్మాయిల్లో చిరు-భాయ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌కి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒక ఫ్రెండు ఉండడం -
అబ్బాయి, ఫ్రెండు-మోహన్ వెళ్ళి ఆ ఫ్రెండు ద్వారా అమ్మాయి పేరు మీద డిసెంబర్-21న గుంటూరుకి ఏ బెర్త్ రిజర్వ్ అయిందో కనుక్కుని దాని పక్క బెర్త్ రిజర్వ్ చేసుకోవడం -
21న రైల్వే స్టేషన్‌కి వచ్చే ముందే - అబ్బాయి - తన ఫ్రెండ్స్ అందరికీ - తనెలా మూగబ్బాయిలా నటించబోతున్నాడో చెప్పడం -
వాళ్ళందరినీ కూడా పాత్రోచితంగా సాయం పట్టమని అడగడం -
వాళ్ళందరూ కలిసి ఆస్కార్ లెవెల్లో నటించడం -
అదంతా చూసి - అమ్మాయి - అబ్బాయి बोल-లేడు అనుకుని బోల్తా పడడం -
ఇన్ని డం-డం-డం-ల తర్వాత - ఇంకేముంది?
ఇక్కణ్ణుంచీ అసలు కథ మొదలవడం ... ఆ అసలు కథలోకి వెళ్ళేముందు - ఆ పైనున్న టైటిల్ పాట - ఈ కిందున్న కొసరు పాట ఏంటో కనిపెట్టి పాడేసుకుంటూ మీరుండడం ... నేనిలా వెళ్ళి మళ్ళీ నెలకి ఇంకొన్ని కబుర్లతో రావడం ...
నా బ్లాగులో కబుర్లు రాయకపోతే సరదా ఏదమ్మా? నే బోలెడు కబుర్లు నింపకపోతే కథలే ఏవమ్మా? చెప్తే ... నువ్వు...నే వింటానమ్మా! వింటూ ...నేనూ... వుంటా!
అందులో ఒకటి - ఎప్పటినుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటూనే ఉంటూ - రేపు రేపని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న ప్రీ-తానా పోస్ట్ ఇది.
అప్పుడెప్పుడో సంక్రాంతి పండక్కి - చిర్రావారి ఇంట జరిగిన సరదా-విందులో - చాలా రోజుల తర్వాత బోల్డంత మంది తెలుగువారిని కలిశాను.
భోజనానికి ముందు, భోంచేస్తూ, ఆ తర్వాత - ఎన్నో కబుర్లు, ఎంతో కాలక్షేపం.
అప్పుడే మొదటిసారిగా - సెయింట్‌లూయిస్‌లో జరగబోతున్న తానా-2017 కమిటీ ఎంపికల విశేషాలు విన్నాను.
ఆ కబుర్లలోనే నా బ్లాగ్ ప్రసక్తీ వచ్చింది. తెలుగులో రాస్తాననేసరికి ముచ్చట పడి బ్లాగ్ వివరాలు తీసుకున్నారు తెలుగు చదవగలిగిన కొందరు.
ఆ కొందరిలో ఒకరు ప్రసన్న.
ఆరోజు తర్వాత - ప్రసన్న ఒకసారి ఫోన్ చేసి తను lead చేయబోతున్న Arts & Crafts Committee లో చేరమని ఆహ్వానించారు.
ఆట్టే కనిపించకుండా - ఎప్పుడో ఒకప్పుడు మాత్రం వినిపిస్తూ - అప్పుడప్పుడూ నా బ్లాగ్ ద్వారా మాత్రం చదివించడమే నాకు సౌకర్యం - అని చెప్పి - సుమతీశతకకారుని స్ఫూర్తితో - తనని నొప్పించక - నే నొవ్వక తప్పించుకు ధన్యురాలిని అనిపించుకున్నాను.
ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి ప్రసన్న మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కమిటీ గురించి చెప్పి, తానాలో ఆ కమిటీకి సంబంధించిన - తెలుగువారి పండగలూ, కళలూ, ఆచారవ్యవహారాలూ, ఆహారవిహారాలూ - ప్రదర్శనల గురించి చెప్పి - కొన్ని వాక్యాలు నేనేమైనా రాసివ్వగలనా మరుసటి రోజుకల్లా - అనడిగారు .
ఈ మధ్య వరసపెట్టి తెలుగు సినిమాలు తెగ చూసేస్తున్నాం.
మా బుజ్జిజింకకీ అర్థం అయిపోయింది - Saturday అంటే శనివారమే కాదు తెలుగు-సినిమావారం అని.
నవంబర్ 17 శుక్రవారం బోల్డన్ని తెలుగు-హిందీ సినిమాలు విడుదల అవుతున్నాయని చెప్తూ - "సిద్ధార్థ సినిమా: గృహం, కార్తి సినిమా : ఖాకీ - బావున్నాయట - ఉంటే వెళ్దామా?" అనడిగారు బదరి.
గృహం - హారర్ - అంటే నాకు టెర్రర్
ఖాకీ - సీరియస్ - అంటే నాకు బోర్
అందుకని వెతికి వెతికి -
మన తెలుగమ్మాయి స్వాతి వుంది -
ఆ అమ్మాయికి పన్ను మీద పన్నుంటుంది -
ఆ అమ్మాయి మాటల్లో ఫన్నుంటుంది -
ఆ అమ్మాయున్న తెర కలర్-ఫుల్గా ఉంటుంది -
పైగా సినిమా బావుంది అన్న రివ్యూ ఉండనే వుంది -
ఈ మధ్య రివ్యూల మీద పెరిగిన మన నమ్మకమూ మన్నికగా వుంది -
అని ఉన్నవీ లేనివీ చెప్పేసి -
ఉన్నపళంగా ఆకేసి-పప్పేసి-కూరేసి అంటూ అన్నం కూరేసి -
ఇరవైఏడు మైళ్ళు కార్లో ఊరేగేసి -
మిడ్-రివర్స్ మాలుకి రివర్స్-గేర్ లేకుండా వెళ్ళేసి -
హడావిడిగా టిక్కెట్లు కోయించేసుకుని -
వున్న 14 సినిమా-తెరల్లో పన్నెండో-తెరలో తొమ్మిదింటికి మొదలవబోతున్న రెండోఆట సైన్మ - లండన్ బాబులు సినిమా - చూసేద్దామని వెళ్ళిన మొట్టమొదటివారం మేమే అయి -
అన్నిటికన్నా పై..... వరసలో కూర్చున్నామో లేదో -
ఇంతలో శోధనీ-శూర్ప-హస్తులై ఇద్దరు లోపలికి వస్తూ కనిపించారు.
అప్పటికి అర్థమయ్యింది - మాకు - చలనచిత్ర-ప్రదర్శనశాల-ప్రక్షాళనా-కార్యక్రమాసక్తులై వారొచ్చారని.
మా సిని-మా-ఆత్రానికి మాలో మేమే నవ్వేసుకుని బయటికి వెళ్ళి నించుని - అక్కడున్న వాల్-పోస్టర్లన్నీ కంబైన్డ్ స్టడీ చేసేసి - ఓ పది నిముషాల తర్వాత థియేటర్‌లోకి వెళ్తే - తొమ్మిదయినా హాలంతా నిశ్శబ్దం.
కనీసం రాబోయే-సినిమాలు అనో, వచ్చి-పోయిన సినిమాల్లో ట్రివియా అనో ఏదో ఒక సందడి వుండే తెర కూడా కిమ్మనకుండా ఉండడం చూసి - అందులోనూ మేం ముగ్గురం నింపిన సీట్లు తప్ప - మిగిలిన చోట అంతా నిండుకొన్న హాలు-వాలకం చూసి - ఇంతకీ సినిమా వేస్తారో వెయ్యరో అని బెంగెట్టేసుకుని - నే గోళ్ళు కొరికేసుకునే లోపు మొదలయింది తెర మీద "లండన్ బాబుల" సందడి.
చెప్పుకోదగ్గ విశేషాలు:
1. ఆ రోజు సినిమా-హాలులో మేం ముగ్గురమే - నిజ్జం-ఒట్టు!
2. తినడానికి చిప్స్ కూడా దొరకలేదు
3. దాహం వేసి కొన్న నీళ్ళు - బయట అర్థ-డాలర్ కూడా ఉండనివి ఇక్కడ ఐదు-డాలర్లు
4. సినిమాలో కలర్స్-స్వాతి వేసుకున్న కలర్ఫుల్ డ్రెస్సులు - అక్కడక్కడా మెరిసిన ఆ అమ్మాయి నటన
5. రెండు గంటల ఐదు నిముషాల సినిమాలో గుర్తున్న మాట-పాట-ఆట ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం
6. హాస్యం అంటే మనిషి రూపునో, రంగునో హేళన చేయడం అనే అపహాస్యపు-తరహా భరిస్తూ - లేచొచ్చేసే వీలున్నా, నేనూ "ఇంటికెళ్ళిపోదామా?' అడిగితే - ఔననడానికి సిద్ధంగా వున్నానని ఆచూకీ అందినా కూడా - ఎలాంటి సినిమా అయినా కూడా "ఆరంభించరు నీచమానవులు" అన్న భర్తృహరి-సుభాషిత-స్ఫూర్తితో అంతు-చూసేదాకా (మాదో, సినిమాదో) - చూడాలనే నా కోసం కూర్చుని - పూర్తిగా చూసిన నా పతీ-పుత్రుల అపరిమిత-సహనం
7. మరుసటిరోజు ఇండియా ఫోన్ చేసినప్పుడు ఆ సినిమా పేరే వినలేదని బాలాజీ చెప్పారని బదరి ఒకటే నవ్వటం
.... వెరసి తెలుగమ్మాయి స్వాతి కోసం ఒక శనివారం ఇచ్చుకోలు!
ఊగిసలాడిన మదికో మెచ్చుకోలు:
Once bitten twice shy - అని ఎవరన్నా అంటే - అదెక్కడైనా కానీ సినిమా దగ్గర మాత్రం "వినపళ్ళా" అనే రకం నేను.
అందుకని యధావిధిగా అదేపనిగా - మధ్యలో అన్నజింక ఇంటికొచ్చిన థాంక్స్-గివింగ్ సెలవు రోజుల శనివారాన్నొదిలి - మళ్ళీ ఈ శనివారం అంటే డిసెంబర్ 2న - మళ్ళీ అనుకోకుండా అప్పటికప్పుడు బదరిని బతిమిలాడి ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేయించి - పేరలా వుంది కానీ సినిమా మంచిదే అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్న నన్ను - అనుమానంగా చూస్తూ "అమ్మా! You're not experienced in understanding reviews. You need to learn it from Anna" అనంటున్న బుజ్జిజింకని ఏమార్చడానికేవో కబుర్లు చెప్తూ - మళ్ళీ అదే ఇరవైఏడుమైళ్ళ దూరం కారేగి - ఆరుగంటల-తొలాటకి మళ్ళీ - పై... వరసలో మేం ముగ్గురం - కాకపోతే ఈసారి మాకన్నా ముందు ఇంకొక్కరంటే ఒక్కరు.
సినిమా మొదలైన పదిహేను నిముషాల్లో అప్పటికి వున్న నలుగురం - ఇంకో ఐద్నాలుగులూ - పైన ఇంకో నాలుగు మమ్మల్ని - వేసుకుని ఇరవై-నలుగురమయ్యాం.
అదేదో మేము తీసిన సినిమానే చూడడానికి ఇంతమంది వచ్చారు అన్నట్టు మురిసిపోయాం ముగ్గురం.
చెప్పుకోకుండా ఉండలేని విశేషాలు:
1. కరకరా తినడానికి చిప్సూ-చీజూ దొరికాయి
2. హీరో, ఇద్దరు హీరోయిన్లూ - ఎవరి రోలు వాళ్ళు ఎంచక్కా రీళ్ళ కొద్దీ మెప్పించేశారు
3. సినిమాలో - అమ్మాయిలు మధ్యే-మధ్యే మద్యపానం చేసినా - ఈ మధ్య మనవాళ్ళ మధ్య కూడా ఇలాగే ఉందట - అని సర్ది చెప్పేసుకున్నాం
4. ఒక హీరోయిను ముంబై, హైదరాబాదు - అకేలాగా - అలా చలాకీగా - ఓ బేగ్గేసేసుకుని చులాగ్గా - అబ్బాయిల గదుల్లోకి అలవోకగా, అలవాటుగా - వెళ్లిపోతున్నట్లు చూపిస్తే - "ఫర్వాలేదు - మందికి మది-వైశాల్యం పెరుగుతోందేమో ఈ మధ్య - మనమొదిలొచ్చిన దేశంలో" అనేసుకుని ముచ్చటపడిపోయాం
5. "పెళ్ళికి ముందు ఎక్కువగా కలుసుకోకూడదు తెలుసుకోకూడదు - ఒకసారి పెళ్ళైపోతే సర్దుకుపోవాలి" - అని సినిమామ్మతో చెప్పిస్తే - ఔనా? ఇదే తరం చెప్పిన మాట? - అని చెరో ముక్కు మీదా వేలేసుసుకున్నాం
6. అదే సినిమామ్మ "నీకన్నా మాకేమీ ముఖ్యం కాదు" అని కూతురికిచ్చిన భరోసాని చెరో తలా ఊపి మెచ్చేసుకున్నాం
7. "ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏది పొందుతున్నామో కాక ఏది పోగొట్టుకుంటున్నామో తెలిసుండాలి" అన్న సినీ-నాన్న మాటలూ బహు-నచ్చాయి
8. ఇంకా ఇంకా నచ్చినవి - ఏంటంటే....
... ఏడ్చి సాధించని అమ్మా-నాన్నలు
... ఏదీ సాగతీయని హీరోయిన్లు
.... ఏం చేస్తాడో ఈ అబ్బాయి అనేలా ఊగిసలాడిన హీరో
.... ఒకరి-వైపు నుంచి ఒక పరి, ఇంకొకరి-వంక నుంచి ఇంకొకసారి - ముందూ వెనకలకి వెళ్తూ కథని కథకళి ఆడించిన కథనం, దర్శకత్వం - ముఖ్యంగా ఇంటర్వల్ ముందూ-వెనకా
.... అలలు అలలుగా అలరించిన సంగీతం
.... అస్సలు కనిపించని అక్కర-అనిపించని నృత్యం
.... కళ్ళ నిండుగా రంగుల-కలలు-కళలు చిలికించిన ఫోటోగ్రఫీ
9. ఒకే ఒక్కటి - ఇలా కాకుండా అలా ఉంటే బావుండేదేమో అనిపించింది ఏంటంటే..... ఈ సినిమా పేరు - మెంటల్ మదిలో అని కాకుండా నా మది ఊగిసలాడే... అనో ఊగిసలాడకె మనసా ... అనో పెడితే ఇంకా బావుండేది
(ఈ మెంటల్ మదిలో అనే పేరు ఓకేబంగారం పాట మన మన మన మెంటల్ మదిలో --- గణ గణ గణ గంటల సడితో - విని నచ్చేసి పెట్టేసుంటారనిపించింది.)
ఏదేమైతేనేం - మది ఊగిసలాడిన సినిమా నచ్చింది
ఆ నచ్చిన మాట వచ్చి ఇలా చెప్పాలా వద్దా అని ఊగిసలాట లేని ఆలోచనొచ్చింది
ఆ ఆలోచన బ్లాగున ఇలా సినీ-మా-లక్ష్మి పోస్టయ్యింది ...
Post పోస్ట్ (Postscript - PS కి కవల నా ఈ postpost - PP ):
అ. రె. జ. ని. నచ్చుకోలు
లండన్‌బాబుల దెబ్బకి బెదిరిన మా మదులు మళ్ళీ శుక్రవారం సినిమాల-మెయిలు చూడ్డానికి మొరాయించాయి.
ఈ వారానికి మన ఇంటrtainment మనమే చూసుకుందాం అనేసుకుని థాంక్స్-గివింగ్ సెలవుల్లో సినిమాలు ఏమున్నాయా అని వెతుక్కుంటూ ఉంటే "జయమ్ము నిశ్చయమ్మురా" అనే సినిమా పేరు యూట్యూబులో కనిపించగానే - బదరికి గుర్తొచ్చింది - ఎక్కడో చదివిన రివ్యూ చాలా బావుందని. అందులోనూ "కింగ్" సినిమాలో బ్రహ్మానందం పక్కన అసిస్టెంటుగా చేసిన శ్రీనివాసరెడ్డి క్లీన్-కామెడీ అంటే మా ఇద్దరికీ ఇష్టం. మనిషి చక్కగా ఉంటాడు - చాలా subtle గా హాస్యాన్ని - తను తొణక్కుండా నటిస్తూ నవ్విస్తాడు.
ఒకసారి పెట్టి చూద్దాం - అంతగా బావుండకపోతే ఆపేద్దాం అనుకున్నవాళ్ళం - సినిమా నచ్చి - ఆపేద్దామన్న ఆలోచనే లేక పూర్తిగా చూశాం.
ఈ పాట బావుంది, ఈ మాట బావుంది అని విడివిడిగా గుర్తు లేకపోయినా మొత్తానికి ఒక మంచి సినిమా చూశాం అనిపించింది.
కొత్త కథ - ప్రతీ దానికి ఎవరో చెప్పిన మాటల మీదో, నమ్మకాలమీదో ఆధారపడి తన మీద తనకే నమ్మకం లేని ఒక అబ్బాయి చివరికి ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకున్నాడో అనేదే ఈ సినిమా కథ.
సాధారణంగా మేం సినిమా చూసే టైం - రాత్రి పది గంటల తర్వాత. అప్పటికి భోజనాలు అయి - పిల్లలతో కబుర్లు చెప్పుకుని - మరుసటి రోజు ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి - వాళ్ళో పుస్తకం చదవడమో, మ్యూజిక్ వీడియోలు చూడ్డమో చేసే టైంలో - పదింటికి పెట్టి సినిమా చూడడం అయేటప్పటికి రాత్రి ఒంటిగంట.
చూసింతర్వాత - అంత రాత్రి పూటా ఇంకో పదినిముషాలు ఆ చూసిన సినిమా గురించి మాట్లాడుకున్నామూ అంటే - అది నచ్చిందని మాకు మాకే అర్థమయి నవ్వుకుంటాము.
"హీరోకో ఇమేజ్ వుంది" అనుకుంటూ - దాన్ని ఈజ్ చేసి కొత్త కథలు ప్రయత్నించకుండా - ఇంకా హీరోయిన్ల నడుముల మీద కన్నులో, హాస్యనటులు వీపుల మీద తన్నులో, పంచుల పేరుతో ఫన్ను లేని పన్నులో - ఇంతే...సినిమా - అన్నట్లు బోల్డన్ని డబ్బులు పెట్టి తీసి ప్రపంచం మీద పారేస్తున్న - వారసత్వాల హీరో-త్వాల నుంచి ఊరడింపుగా - ఈ జయమ్ము నిశ్చయమ్మురా - కొత్త దర్శకులు, కొత్త హీరోలు - మంచి కథలు, కథనాలూ - ఉంటే ఇలాంటి సినిమాలకి ప్రేక్షకుల ఆదరమ్ము నిశ్చయమ్మురా అనిపించే సినిమా.
యూట్యూబ్‌లో సినిమా - అందులోనూ మంచి కొత్త సినిమా ఊరికే చూసినప్పుడల్లా - అనుకుంటాం - కనీసం ఆ దర్శకుడో, నిర్మాతో కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుని - advertise చేసుకుని - "మా సినిమా బావుంది - రెండో, నాలుగో డాలర్లు పెట్టి చూడండి" - అని డబ్బులు చేసుకోగలిగితే బావుండును అని.
ఇలాంటి సినిమాలు దిగ్విజయంగా థియేటర్లలో ఆడి - అందరూ చూసి మెచ్చుకునే రోజు నిశ్చయంగా రావాలని కోరుకుంటున్నాను.
చివరిగా - ఈవారం - అంటే నిన్న రాత్రి చూసిన ఇంకో సినిమా గురించి.
అర్జున్ రెడ్డి - నాలుగు డాలర్లకి యూట్యూబ్లోనే చూశాం.
కచ్చితంగా ఇది నంబర్-వన్ R-rated సినిమా.
పెద్దవాళ్ళు మాత్రమే చూడాల్సిన సినిమా.
పెద్దవాళ్ళు - చూడకూడని సినిమా అన్నారు కాబట్టి - తప్పకుండా చిన్నపిల్లలు చూసే - చూడాలనుకునే సినిమా.
ఈ సినిమా చూసినంత సేపు - చాలా రోజుల తర్వాత - ఒక సినిమాని సినిమాలాగా - సినిమా అనే కళని ఇష్టపడే ప్రేక్షకుల్లా చూస్తూ - సినిమా కథని అంత శ్రద్ధగా, ఇష్టంగా రాసుకుని, దాన్ని అంతే committedగా తెర మీద అంత ధైర్యంగా చూపించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని పగళ్ళు-రాత్రులు ఆ కథని ఎలా ప్రెజెంట్ చేయాలో అని ఎంత ఆలోచించి ఉంటాడో - మాలో మేమే మాట్లాడేసుకుని తెగ మెచ్చేసుకున్నాము.
కథ ఎలా వుంది - కరెక్టా, కాదా - అసలిలా జరుగుతుందా - జరిగినా ఇలా చూపించొచ్చా - అన్న ప్రశ్నలూ-ఆలోచనలూ పక్కన పెడితే - ఈ సినిమా సందీప్ రెడ్డి లాంటి అచ్చ తెలుగు దర్శకుడు కాకుండా - ఏ తమిళంలోనో, మళయాళంలోనో తీశారని చెప్పి డబ్ చేసి ఉంటే - ఇంకా ఇంకా పేరొచ్చేదేమో.
ఈ సినిమా పూర్తిగా దర్శకుడి సినిమా.
విజయ్ సాయి దేవరకొండ - అద్భుతమైన నటుడు. హీరోలా కాదు కథకి-నాయకుడై - కథానాయకుడై సినిమాని నడిపించినవాడు. ఆ అబ్బాయి కళ్ళలో వున్న ఇంటెన్సిటీ లాజవాబ్! ఈ సినిమా చూశాక ఇంకోసారిఈ అబ్బాయే act చేసిన పెళ్లిచూపులు - ఇంకోసారి చూద్దామనుకున్నాం - ఆల్రెడీ చూశామన్నట్టు గుర్తుంది కానీ ఏం చూశామో గుర్తు లేదు మరి :)
హీరోయిన్ - సాదా-సీదాగా - ఒక తుళు అమ్మాయిలా చాలా చక్కగా సరిపోయింది. ఒక అమాయకమైన కాలేజ్ ఫ్రెషర్‌గా మొదలయి ఒక self-reliant వుమన్ గా - ఆ అమ్మాయిని portray చేసిన విధానం చాలా బావుంది.
హీరో అన్న గౌతమ్ (కమల్ కామరాజు) తమ్ముడి పట్ల చూపించిన ఇష్టం, concern, స్నేహమంటే ఇదే అన్నట్లున్న ఫ్రెండ్ శివ (రాహుల్ రామకృష్ణ) , నాన్నమ్మ(కాంచన) - వీళ్ళే కాదు - ప్రతి ఒక్కరూ బాగా act చేసిన సినిమా ఇది.
ప్రత్యేకంగా చాలా ఏళ్ళ తర్వాత కనిపించిన కాంచన - ఆవిడ నటన - majestic!
ఆవిడతో చెప్పించిన - Suffering is personal. Let him suffer - అన్న మాటలూ, అవి అనేటప్పుడు చూపించిన simple expressions, ఆవిడ ఇంగ్లీష్ ఉచ్చారణ (ఆవిడ ఒకప్పుడు air-hostess మరి!) - చాలా చాలా నచ్చేశాయి నాకు.
హీరోయిన్‌కి కాల్లో గాజుపెంకు గుచ్చుకుంటే - హీరో ఎమోషనల్‌గా స్ట్రెచర్తోసుకుంటూ ఆపరేషన్ థియేటర్లో ముక్కుకి మాస్క్ కట్టుకుని ఎర్ర-బల్బ్ ఆరుతూ వెలుగుతూ ఉండగా చెమట తుడుచుకుంటూ ఆరుగంటలు ఆపరేషన్ చేసి - తర్వాత పొద్దున్నే ఇద్దరు హాస్యనటులతో - పూలూ పళ్ళూ గంపల్లో తీసుకెళ్ళి - హీరోయిన్ మీద పోసి - ఏ స్విజ్జర్లాండులోనో - దెబ్బ తగిలిన కాలుకి మాత్రం రంగురంగుల పీలికలు కట్టి - కట్టేసుకోబోయి నెట్టేసుకున్నాను - హరీ హరీ - అని పాడకుండా - అది పంథొమ్మిదేళ్ళ అమ్మాయికి ఎలా సెల్ఫ్-హీల్ అవుతుందో మెడికో-నాయకుడు సింపుల్గా తేల్చేస్తే - ఒక్క నిముషం తెలుగు సినిమానే చూస్తున్నామా - అని అనుమానం వచ్చిందండోయ్ - నిజం!
ఉదాహరణకి - అర్జున్ నాన్నమ్మ పోయినప్పుడు ఆవిడకిష్టమైన పాట వినిపించడం, ఆ మరణాన్ని వాళ్ళ నాన్న జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో వివరించడం - అది కూడా loud గా లేని చిన్న-చిన్న మాటలు, gestures తో చూపించడం నచ్చింది.
ముఖ్యంగా విషాదాంతపు బారిన పడకపోవడం ఇంకా నచ్చింది. A good story with a happy ending always plants a smile on my lips!
ఈ సినిమాలో ఒక చోట వినిపించిన బాంబే -జయశ్రీ గారి సుమనస వందిత సుందరి మాధవి వెతుక్కుని బ్లాగ్లో అట్టేపెట్టేసుకోవాలనిపించేంతగా నచ్చేసింది.
అ. రె. జ. ని - అంటే ఆమ్లజని, ఉదజనిలాగా రసాయనికవాయువు కాదు.
అ. రె. = అర్జున్ రెడ్డి
జ. ని = జయమ్ము నిశ్చయమ్మురా
నచ్చుకోలు = మాకు నచ్చిన ఆ రెండు సినిమాల గురించి కొన్ని కబుర్లు
వెరసి అ. రె. జ. ని. నచ్చుకోలు!
స్వాతి కోసం ఒక శనివారం ఇచ్చుకోలు -
ఊగిసలాడిన మదికో మెచ్చుకోలు -
అ. రె. జ. ని. నచ్చుకోలు -
ఈ వారపు నా పోస్ట్-కోలు!