27, మే 2017, శనివారం

ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!


చిన్నప్పుటినుంచి నా పెళ్లయ్యే దాకా - ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం - తలదువ్వి జడ వేయడం పూర్తయిన ప్రతిసారి ముందుకి తిరగమని - దువ్వెనతో ముంగురులు దువ్వుతూ మా అమ్మ తరచుగా అనే మాట - నుదురు చిన్నదైతే కుదురు తక్కువంటారు. నీకు నుదురు పెద్దదే కానీ ...- అని ఆపేసేది - ఆ తదుపరి నన్ను పూరించుకోమన్నట్టు. 

కుదురుండేది కుండలకి, బిందెలకి కానీ నాక్కాదు - అనేసి మాట మార్చేసి నుదుటికి విలోమ నిష్పత్తిలో వున్న నా కుదురుని సమర్థించుకునేదాన్ని. 

ఇంత హఠాత్తుగా నా కుదురు ప్రసక్తి, దాని గురించి మా అమ్మ ఉక్తి ఎందుకు గుర్తొచ్చాయంటే - ఈ మధ్య కాలంలో - అంటే గత నాలుగైదేళ్ళుగా నా ఫ్రెండ్స్ కొందరు ఆర్ట్ ఆఫ్ లివింగ్, యోగా, బిక్రం యోగా, మెడిటేషన్‌ల గురించి మాట్లాడుతూ - వాళ్ళు వెళ్ళే తరగతుల గురించి చెప్తుంటే విని - అమ్మో! అంతసేపు కదలకుండా మాట్లాడకుండా ఒకచోట కూర్చోవడమే?! నాకింకా యోగా చేసే టైం రాలేదు - అని నవ్వేసేదాన్ని. 

ఆకుపచ్చచెట్లు - అవెక్కే ఉడతలు, రోడ్డు పక్కనే నించుని పెద్దకళ్ళతో చూసే జింకలు, ఇళ్ల కిటికీల్లోంచో-ఇంటి చుట్టూ వున్న కంచెల్లోంచో చూసే బుజ్జి-బుజ్జి కుక్కపిల్లలు - వాటి తల్లులూ,  మెళ్ళో కట్టిన గంటలు మోగిస్తూ తిరిగే పెంపుడు పిల్లులు - వీటినన్నిటిని చూస్తూ - ఒంటిగా సరి-సరి పద-పద అని పాడుకుంటూనో -  జంటగా కబుర్లు చెప్పుకుంటూనో నడవడం ఎంతో బావుంటుంది నాకు. ఆ గమనంలోనే నా ధ్యానం వుంది అని సరిపెట్టేసుకునేదాన్ని. 

మా వూళ్ళో లైబ్రరీలో ఉచితమైన ఉచిత-మెడిటేషన్-తరగతులు ప్రతివారం జరుగుతాయి అని తెలిసినా, అవి నడిపేది మా బుజ్జిజింక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారైన సాయిరాంగారని తెలిసినా, కలిసినప్పుడల్లా ఉత్సాహంగా సాయిరాం గారు చెప్పే ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి ఎన్నిసార్లు విన్నా, తరచుగా ఆ మెడిటేషన్ సెషన్స్ గురుంచి వివరాలతో ఎన్ని email రిమైండర్స్ వచ్చినా - ఇది మాత్రం నావల్ల కాదు - అనుకునేదాన్ని. 

నా బెంగల్లా - ఇరవయ్యో, ముప్పయ్యో - నిముషాలు మాట-పాట లేకుండా కూర్చోవాల్సి రావడమే. 

మెడిటేషన్ అంటే హెజిటేషన్ లేకుండా దూరంగా జరిగే నాకు సాయిరాంగారు Guided Meditation అనే యూ-ట్యూబ్ లింక్  ఒకటి పంపించారు - ఇది ఒక ఇరవై నిముషాలు వుంటుంది, బిజీగా వుంటూ తీరిక సమయం ఎక్కువ లేని వాళ్ళ కోసం తయారు చేశానిది, చూడండి - అంటూ. 

సరే - అరచేతిలో వాట్సాప్ ధ్యానం - ఓ ఇరవై నిముషాలే కదా - అని కళ్ళు మూసుకుని వినడం మొదలుపెట్టాను. 

వేణునాదంతో పాటు మంద్రంగా వినిపిస్తున్న సాయిరాంగారు శ్వాస తీసుకోవడానికి, మనసు లగ్నం చేయడానికి ఇస్తున్న సూచనలు వింటూ - ఆచరిస్తూ - ఇరవై నిముషాలు ఎలా గడిచిందో తెలీదు. 

నాకు మాత్రం చాలా నచ్చేసింది సాయిరాం గారి ఈ Guided Meditation. 

అందుకే చెప్తున్నాను - ధ్యానంలో హాయి - తెలిసిందండి, సాయి!



ఇదే కాకుండా ప్రతి శుక్రవారం Global Meditation సెషన్స్ నడుపుతారు సాయిరాం గారు.

ఆ సెషన్ వివరాలు ఇవి:

Global Meditation sessions can be attended via free conference call or web.

Global meditation is conducted on every Friday and session starts @ 9pm CST and lines are opened at 8:45pm CST. It is a one hour session. There will not be any session on holiday weekends.

You can ask questions before or after the meditation session.

Call details:

Join online meeting:

Or by phone:

United States: (218) 339-7800 

Participant Access Code: 507 7577
మరిన్ని వివరాలకై సాయిరాం గారి Website

ఇంతకీ - తను నమ్మిన ధ్యానం గురించి ఇంత చేస్తున్న
సాయిరాంగారు తీసుకునేదెంత?
ఒక చిరునవ్వంత - అది కంటిని మెరిపించే మెరుపంత
వారి మంచితనమెంత? - కొండంత
వారికి బలమెంత? - వారి శ్రీమతి మాధవి తోడంత

ఏమీ ఆశించక -  అందరికీ మంచి జరగాలనే బహు-మంచి ఉద్దేశ్యంతో ధ్యానం వలన కలిగే లాభాలను తెలియజేయాలి అనుకుని - నిబద్ధతతో తన వారాంతపు తీరిక సమయాన్ని Global Meditation సెషన్స్ కోసం వెచ్చిస్తున్న సాయిరాంగారూ...

ఉరుకుల-పరుగుల అమెరికా జీవితంలో వారానికి ఒకేసారి అపురూపంగా దొరికే family-time ని ఆ ధ్యానం తరగతులకి ధారపోస్తున్న సాయికి నిశ్శబ్దంగా ఊతమిస్తున్న సహచరి - మాధవి...

ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించే రాశారేమో - కృష్ణపక్షం లోని ఈ భావ కవిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు...

మావిగున్న కొమ్మను మధుమాసవేళ 
పల్లవము మెక్కి కోయిల పాడు టేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ

కలిసినప్పుడల్లా మనసారా నవ్వుతూ - నోరారా పలకరించే సాయి, మాధవి దంపతులకి శుభాభినందనలు - శుభకామనలు. 

19, మే 2017, శుక్రవారం

త్వామనురజామి - 13 - మా కోసం కొండలు అన్నీ మారాయి ఫ్రెండులుగా ...

కిందటి 19 చెప్పిన కబుర్లు 

ఫిబ్రవరి మొదటివారానికే  కొత్త హాస్టల్ రూముల్లోకి వెళ్లిపోయాము మా క్లాస్‌మేట్స్ అందరం. 
నేనూ కళ్యాణిబ్లాక్‌లో రెండో అంతస్తులో వున్న 603 వింగ్‌లోని రూమ్-A లో చేరిపోయాను - సట్రంకుసమేతంగా. 

పద్మావతి యూనివర్సిటీ హాస్టల్స్ చాలా బావుండేవి. 

హా"స్టల" పురాణం: 
కల్యాణి, కిన్నెర - లేత ఆకుపచ్చరంగులో వుండే hexagonal  భవనాలు. 

కల్యాణిబ్లాక్‌లో ముఖద్వారంగా గ్లాస్ స్లైడింగ్‌డోర్ ఉండేది. అందులోంచి లోపలకి అడుగు పెట్టగానే ఎదురుగా విజిటర్స్ రూం - మూడు మేజాలు, ఆరు కుర్చీలుగా . 

ఏ కుదిరిన సాయంత్రమో, కుదుర్చుకున్న వారాంతమో - చుట్టుపక్కల వున్న కళాశాలల, విశ్వవిద్యాలయాల నుంచి మా హాస్టల్-వాసినుల సందర్శనానికి వచ్చే నూనూగు-మీసాల-రాయళ్ల గలగల-కబుర్లతోనూ , ఎవరి కోసం ఎవరొచ్చారా అని కుతూహల పడుతూ పదేపదే ఆ రూములోకి పరిగెత్తే చూపుల్ని బయటికి లాక్కుంటూ హడావిడిగా అటూ ఇటూ తిరిగే లేడి-కన్నుల-లేడీలతోనూ మా some-దర్శకులగది భలే సందడిగా ఉండేది. 

విజిటర్స్ రూంకి కుడిగా వుండే ఆఫీసు రూముని దాటుకునో, ఎడమగానో వెళ్తే లోపల - మధ్యలో పచ్చికతో నిండి వున్న గ్రౌండ్ చుట్టూ ఆరు వింగులుగా (401-406), ఆ పైన మెట్ల మీదుగా పైకి వెళ్తే ఇంకో ఆరు వింగులు (501-506), ఇంకా ఆ పై...న ఇంకొన్ని మెట్లు దాటితే మరింకో ఆరు వింగులు (601-606) - వాటికి అటూ ఇటూ పై డాబా మీదకి వెళ్లడానికి రెండు వరసల మెట్లు వుండేవి. 

కిన్నెర కూడా ఇదే వరస 101-106, 201-206, 301-306 - కాకపొతే కార్యాలయాల, సందర్శకాలయాల గదులు తీసేసి.

గ్రౌండ్ , ఫస్ట్, సెకండ్ - మూడు ఫ్లోరుల్లో ఆరేసి వింగ్స్ - ఒక్కో వింగులో మూడేసి రూములు, ఒక్కో రూములో మూడేసి అరలు, మూడేసి పడక-స్థలాలు - మొత్తానికి ఒక్కో హాస్టల్ బ్లాక్ బిల్డింగ్ మూడోఎక్కానికి బ్రాండ్ ఎంబాసడర్‌లా వుండేది. 

నా రూము కల్యాణిలో రెండవ అంతస్తులో 603-A. 

మా 603 వింగులోంచి బయటికి రాగానే terrace మీదకి వెళ్లడానికేమో అన్నట్టు మెట్లుండేవి - కానీ అవెక్కడికీ వెళ్లేవి - వెళ్లనిచ్చేవి కావు. పగలు రంగురంగుల వస్త్రధారులై ప్రతి గాలి తాకిడికి రెపరెపలాడేవి - రాత్రి వేళల అప్పుడప్పుడు ఏ పరీక్షలైపోయిన వేసవి వెన్నెల రాత్రిపూటో మల్లెలు దండలుగా కూర్చుతూ కూనిరాగాలు తీసే కన్నెల గొంతులకి నిశ్శబ్ద శ్రోతలయ్యేవి. 

ఇంక 603 వింగులోని అమ్మాయీ-మణి-సాంద్రత ఎలాంటిదంటే ... 

A లో శ్రీలత, పద్మజవల్లి - నాకు MCAలో సీనియర్స్, నేను. 
B లో సంగీత, గుత్తి పద్మజ - నాకు MCAలో  సీనియర్స్, శాంతిరోహిణి, నిర్మలాషర్మిలి - ఇద్దరూ M.Sc Maths. 
C లో ముగ్గురే - వీణావాణి నాకు సీనియర్, ఇంకో ఇద్దరు హోంసైన్స్ అమ్మాయిలు. 


ప్రతీ రూము మళ్లీ మూడు వింగులుగా ఉండేది. మా A లో ఎడమ పక్క వింగ్ శ్రీలత, కుడి పక్క పద్మజవల్లి, మధ్య వింగ్ నాది. కిటికీ పక్కనే నా మంచం - మంచం కింద నా ట్రంకు, మంచం మీద షిప్లీ. 

నా మంచానికి perpendicular గా ఇంకో ఖాళీ మంచం ఉండేది - మధ్య వింగ్ కొంచెం  విశాలంగా ఉండేది - అందుకని రెండు మంచాలు వేసి ఉండేవి. నేను రూంలోకి వెళ్లిన కొన్ని నెలల దాకా ఆ రెండోమంచం ఖాళీగా ఉండేది. 

సాయంత్రం కాగానే నా కిటికీలోంచి తిరుమలకి నడిచి వెళ్లేదారి దీపాలవెలుగులో సత్యభామజడలా మిడిసిపడుతూ కనిపించేది -  ఆచివరగా వేంకటేశ్వరనామం, శంఖు-చక్రాలు - రోజూ కన్నుల కెదురుగా దీపావళే! 

వర్షాలెక్కువ పడ్డప్పుడు ఆ కొండల్లోంచి స్ప్రింగయ్యే ad hoc ముస్తాబులాంటి పిల్ల-జలపాతాల వల్ల మనసుకి తెలియని హాయి - పాదాలలో స్ప్రింగులు మొలిచాయా అనిపించేలా అలుపులేని నిలకడ-లేమి. 


నా కొత్త రూమ్ నాకు చాలా నచ్చేసింది. దానికితోడు నాకెంతో ఇష్టమయిన సీనియర్స్ శ్రీలత, సంగీత, గుత్తి పద్మజల కంపెనీ. 


సన్నటి గొంతుతో తన ఇంజినీరింగ్ కాలేజ్ విశేషాలు, వాళ్ల అక్కకి పుట్టిన పాప గురించి బోల్డన్ని కబుర్లు చెప్పే శ్రీలత -  ఏదైనా సరే బోల్డంత లాజికల్‌గా ఎనలైజ్ చేస్తున్నట్లు మాట్లాడే సంగీత - పాటలతో, నవ్వులతో సందడంటే తనేనేమో అనిపించే మా వింగ్-అలీషా చినాయి గుత్తిపద్మజ - వీళ్లతో పాటే నేను. 


ఒక్క క్లాసులకి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన టైమంతా ఆ ముగ్గురితోనే గడిపేదాన్ని. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ - అన్నిటికీ A, C - రూముల్లో వున్న MCA వాళ్లం ఐదుగురం కలిసి వెళ్లేవాళ్లం. సీనియర్స్ - శ్రీలత, సంగీత ఒక జతగా - వాళ్లతో నేనూ ఒక వంతగా - గుత్తిపద్మజ, పద్మజవల్లి ఒక జతగా వుండేవాళ్లు. 


కొత్త హాస్టల్‌కి - నాకు నచ్చిన రూంలోకి వెళ్లినా నాకు కొంచెం ఇంటి మీద బెంగగానే వుండేది. వూర్కూరికే కళ్లలో నీళ్లొచ్చేస్తూ ఉండేవి. 

అలాంటి రోజుల్లో - ఒకరోజు డిన్నర్ చేసేటప్పుడు దిగులుగా వుండి అన్నం తిననన్నానని - సంగీత - తన ప్లేట్లో అన్నం కలిపి నాకు నోట్లో పెట్టింది. అది మొదలు దాదాపు చాలా రోజుల (నెలలేమో కూడా) పాటు నాకు సంగీతే అన్నం కలిపి పెట్టేది. ఇంట్లోనే కాదు హాస్టల్లో కూడా నా గారం సాగడం - అది నా గొప్పదనం కాదు, నా చుట్టూ వున్న వాళ్ల మంచితనం. 


కళ్యాణి బ్లాక్‌కి అలవాటు పడుతున్నాను అనుకునేలోగా మొదటి సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ వచ్చింది - ఫిబ్రవరి మూడోవారంలో మొదలని. అటో రోజు ఇటో రోజు తీసేస్తే గట్టిగా వారం రోజుల్లేవు పరీక్షలు మొదలవడానికి. 

హాస్టల్ ఆఫీస్‌లో వున్న ఫోన్ రాత్రిపూట ఆఫీస్ రూముకి వున్న గ్రిల్‌లోంచి అందుకొని - అమ్మాయిలకి ఇంటినుంచి ఫోన్ వస్తే మాట్లాడడానికి వీలుగా వుండేది. 

నాకు సాధారణంగా నాన్న శనివారం తొమ్మిదింటి తర్వాతో, ఆదివారం పొద్దున్న పదింటికో ఫోన్ చేసేవారు. అప్పుడే అందరూ మాట్లాడేవారు. అలా ఫోన్ చేసినప్పుడు చెప్పాను - ఇంకో వారంలో సెమిస్టర్ ఎగ్జామ్స్ అని. నా గొంతులో బెంగ వినిపించిందో ఏమో అప్పటికి ఏమీ మాట్లాడలేదు కానీ మళ్లీ రెండో రోజు పొద్దున్నే ఫోన్ చేశారు నాన్న - అమ్మ వస్తోంది తిరుపతికి - ఓ వారం నాతో హాస్టల్లో ఉంటుందని - వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోమని. 

ఆరోజు నాకింక కాళ్లు భూమ్మీద ఆనలేదు - పరుగు తప్ప నడవలేదు. 

అమ్మ వచ్చేరోజు శ్రీలత, సంగీత నాతో రైల్వేస్టేషన్‌కి వచ్చారు - అమ్మని రిసీవ్ చేసుకోవడానికి. 

అమ్మొచ్చింది. నాతోపాటే డైనింగ్‌హాల్‌కి వచ్చే అమ్మని చూసి అందరూ అడిగేవారు - ఏంటాంటీ, లలిత చేత ఎగ్జామ్స్ రాయించడానికొచ్చారా? - అని. 

నా భాగంలో వున్న ఖాళీ మంచం మీద అమ్మ పడక. నేను  పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు - అమ్మ ఒక్కతే వుండేది కదా రూమ్ లో - అప్పుడు కిందకి వెళ్లి - హాస్టల్ ఆఫీసులో అన్నీ తుడుస్తూ శుభ్రం చేస్తూ వుండే ఆయాల దగ్గరికి వెళ్లి - మా అమ్మాయి బట్టలుతకడానికి ఎవరైనా దొరుకుతారా - అని వాకబు చేస్తూ వుండేది. మా హాస్టల్ బయట చెట్టుకింద ఇస్త్రీ చేసే అతన్ని కూడా అడిగింది. చివరికి రూములు శుభ్రం చేసే ఒక ఆయాని కుదిర్చింది. 

ఇంకా తోచనివేళ - జుట్టు విప్పుకుని బుల్లి రాక్షసిలా వున్న షిప్లీ జుట్టు చిక్కు తీసి జడ వేసింది అమ్మ. 

అలా - పాపం - నాకోసం మా అమ్మ ఒక వారం రోజులు హాస్టల్లో కాలక్షేపం చేసి నా పరీక్షలు అయ్యాక గుంటూరు వెళ్లింది. 

ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అవ్వగానే మా క్లాసుమేట్స్ అందరం తిరుమల నడిచి వెళ్ళాం. ఒక రోజు పొద్దున్నే ఐదు గంటలకి బస్సులో అలిపిరిదాకా వెళ్లి - అక్కడినుంచి ఓ మూడున్నర గంటలు నడిచి తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ సాయంత్రం బస్సులో కిందకి వచ్చేశాం. 

కొండ ఎక్కేటప్పుడు బోల్డన్ని కబుర్లు, పాటలు. 

అచ్చతెలుగులో స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ, పాడుకుంటూ వెళ్తున్న తెలుగమ్మాయిలమైన మమ్మల్ని చూసి - మాకు రాని తమిళంలో జోకులేస్తూ తెగ గందరగోళం చేస్తున్న తమిళ-పైయ్యన్లను చూసి - అప్పటికప్పుడు మా కాట్పాడి-ఉష, అరక్కోణం-ఇందుల దగ్గర ఒక పాట నేర్చేసుకుని - మేము 'అరవం' కానీ పాడుతాం అని  గా... ట్టిగా అరిచి మరీ పాడేశా - తమిళ-పైయ్యన్ల నోళ్లు మూతపడి చెవులు మాత్రమే పనిచేసేలా ... 


సురాంగనీ సురాంగనీ సురాంగనీకమాలు కనవా 
మాలు మాలు మాలు సురాంగనీకమాలు - సురాంగనీకమాలు కనవా
అడుపిరుక్కు - నెరపిరుక్కు ఆకముడిల్లై
పక్కద్ వీట్ల పయ్యన్ను పాకముడిల్లై
సురాంగనీ సురాంగనీ సురాంగనీకమాలు కనవా 
మాలు మాలు మాలు సురాంగనీకమాలు - సురాంగనీకమాలు కనవా 

-అంటూ. (ఇప్పటికీ ఈ పాటలో ఆ మొదటి రెండు లైన్ల అర్థం తెలీదు.)

ఏడుకొండలు నడిచి ఎక్కడం మొదటి సారి కాకపోయినా క్లాస్‌మేట్స్‌తో వెళ్లడం చాలా సరదాగా అనిపించింది. మా మాటలు, పాటలు వింటున్నట్టున్న కొండలు మహా-ప్రియంగా కనిపించాయి. 

మా ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు కొంచెం ఆలస్యం అవడంతో వెంటనే సెకండ్ సెమిస్టర్ మొదలయింది - మధ్యలో ఒకటి రెండు రోజుల సెలవు తర్వాత. 

హాస్టల్లో ప్రతి రోజూ వచ్చే పోస్ట్ అంతా మా విజిటర్స్ రూము ముందు పెట్టి వెళ్ళేవాళ్ళు పోస్టుమేన్. పొద్దున్న పూట క్లాసులయి లంచ్‌కి వచ్చినప్పుడు మాకొచ్చిన లెటర్స్ వెతుక్కుని తీసుకునేవాళ్ళం. 

ఒకరోజు ముందుగా వచ్చేసిన శ్రీలత నాచేతికి ఒక ఎన్వలప్ ఇచ్చారు. దానిమీద ఎడ్రెస్ ఇలా వుంది:

V. లలితా త్రిపుర సుందరి 
పద్మావతి యూనివర్సిటీ హాస్టల్ 
తిరుపతి - 517.502 
నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది - నాకు ఉత్తరాలు రాసేవాళ్ళెవ్వరూ ఎడ్రెస్ అలా రాయరు. నా పూర్తి పేరు రాయరు , పైగా నా రూమ్ నంబరూ, కళ్యాణి బ్లాక్ పేరు రాస్తారు. 

ఎవరై వుంటారా అని తెరిచి చూస్తే అందులో ఇలా వుంది:

లలితా త్రిపుర సుందరి గారికి,

నా పేరు ప్రసాద్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నా సొంతంగా బిజినెస్ చేస్తున్నాను. 
నేను గుంటూరు నుంచి మీరు వచ్చిన ట్రైన్ లోనే తిరుపతికి వచ్చాను. నాకు మీ నవ్వు, మీ ఫామిలీ మెంబర్స్ మధ్య affection చాలా నచ్చాయి. మీకీ లెటర్ అందగానే నాకు రిప్లై రాస్తారు కదూ !

Yours Sincerely, 
ప్రసాద్ 

అది చదువుతూనే శ్రీలత చేతికి అందించాను - తననీ చదవమని. 

శ్రీలత ఇంక ఒకటే నవ్వు - ఎవరు లల్లీ, ఈ అభిమాని, నీ పూర్తి పేరు కూడా తెలిసిపోయిందే.  ఏంటి సంగతి? - అంటూ.

అప్పుడు తట్టింది - గుంటూరులో రైలు ఎక్కేముందు రిజర్వేషన్ చార్టులో నేను చూసిన V . లలితా త్రిపుర సుందరి  హైఫెను పదిహేనూ  ఇంత పని చేసిందీ అని. 

అదే చెప్పాను శ్రీలతకి. 

రిప్లై రాస్తావా - అనడిగిన తనకి చెప్పాను - ఎవరో ముక్కూ మొహం తెలియనివాడు కాలక్షేపానికి రాసిన ఉత్తరం అది - అదంత పట్టించుకోవక్కర్లేదు - అని అప్పుడే చింపేశాను. 

కాలేజ్, హాస్టల్ బాగానే అలవాటయ్యాయి. 

రోజూ సాయంత్రం క్లాసులు అయిపోగానే శ్రీలత, సంగీత, నేను - టీ గ్లాసులు పట్టుకుని బయట చెట్ల కింద గడ్డిలో కూర్చుని వచ్చేపోయే విజిటర్సుని చూస్తూ - మేము చూస్తున్నామని తెలియగానే తడబడే అడుగులతో గబగబా వెళ్లిపోయే అబ్బాయిలని చూసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్ళం. 

అప్పుడే - ఆ కబుర్లలోనే - అమ్మాయిలని కలవడానికి వచ్చి మా జంట-మేట్రన్లు కణ్ణగి-కొదై ప్రశ్నలకి జవాబు చెప్పడానికి తికమకపడి సతమతమయ్యే అబ్బాయిలని లా-జవాబ్ అనిన్నీ, వెన్నెల కన్నెల మనసులని దోచడానికా అన్నట్లు  మీసాలు కూడా తీసేసి వచ్చే మచ్చలేని చంద్రుళ్లని బే-మిసాల్  అనిన్నీ ప్రశంసించే నాకు - శ్రీలత చేసిన బిరుదు ప్రదానం LGP - అంటే లల్లి గోల పిల్ల :)

ఇదిగో - ఇక్కడ ఆగి - నా ఫ్రెండులైన కొండల ఎక్కిన రోజులు తలుచుకుంటూ వుంటా... 

మీరేమో నా పోస్టు టైటిలు, కిందిచ్చిన సరదా-క్లూ ఏ పాటలో చెప్పుకోమంటా...

లైఫంటే పాటేనంట - నోటికొచ్చినట్టు పాడేస్తూ వుంటా 
ట్యూనంటూ కుదిరిందంటే పేరడేదో కూర్చేస్తూ వుంటా
పాటే నా తోడు ఉంటే మాటింక ఎందుకంటా 
క్లూ ఇస్తా మీకంట ఇది కూడా పేరడంట 
మీకంటూ తెలిసిందంటే క్లూ ఏదో టైటిలేదో చెప్పమంటా ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

13, మే 2017, శనివారం

మనసే జతగా పాడిందిలే - 3 - కవలపాటలు - Pouring rain in గలగల పారుతున్న గోదారి

ఎర్రటి సూర్యుణ్ణి చిక్కటి మబ్బు పరదాల చాటున దాచేసి
నీలిరంగు నింగి మేడకి కృష్ణవర్ణపు పూతపూసి
ఆ మేడ మీద ఆడే మబ్బుకన్నెల గిరజాల కొప్పులో
మెరిసే సౌదామినీ-మాలికల తళుక్కన జేసి
ఆ నెలతల నెలవంకల-నడుమొంకల మోసే
శ్రావణ-ఘటాల తాకే కరకంకణాల ధ్వనుల ప్రతిధ్వనుల సందడితో
అణకువ లేని ఆ అల్లరికన్నెల - కుదురు లేని కుండల నుండి
తొణకిసలాడిన నీటితుంపరలుగా మొదలైన వాన
మబ్బుకన్నెల ఆడుతున్న ఆట లయ హెచ్చి -పాడుతున్న పాట  శృతి మించి
చిక్కుపడని జలధారల-జలతారై
నింగి-మేడకి నేల-ఒడ్డుని కలిపే చినుకుల-వంతెనయ్యింది
ఆ నిలకడ-నీటి-వాన...
చిట్టిపాపల, బుజ్జిబాబుల కాగితపు పడవల ఊయలలూపింది
దొరనవ్వు-బాబుల, చిరు-సిగ్గు-కన్నియల కనుల ఊసుల బాసటయ్యింది
అలసిన-అమ్మల, సొలసిన-నాన్నల అలరించగ చిరుజల్లుల అనులేపనమయ్యింది 

ఉరుములతో, మెరుపులతో కూడిన అలాంటి వాన కురిస్తే - ఇంటి కిటికీల కీవల కూర్చుని ఉరుములు వింటూ, మెరుపులు చూస్తూ, ఇంటి అరుగుమీద పడే చినుకుల చిందులకి మురుస్తూ, ఆ వర్షపు స్పర్శకి హర్ష-పులకితలైన పుడమి స్వచ్ఛతని, ఆ పుడమిపుట్టువులైన చెట్ల హరితాన్ని కంటినిండా నింపుకుంటూ - ఆ కిటికీ దగ్గరే మా పుస్తకాల-దర్బారు కావించి ఏ Wodehouse గారి Psmithనో, ముళ్లపూడివారి ఓ కొమ్మచ్చినో తోడు తీసుకుని - కబుర్ల-నవ్వుల-సందడితో మావంతు నేపథ్య సంగీతం వాన-పాట కందిస్తూ వుంటాం.

ఐదారేళ్ల క్రితం ఓ వాన కురిసిన సాయంకాలం బుజ్జిజింకలిద్దరూ గదిలో చేరి జంటగా పాటలు వింటూ - వంతగా గొంతు కలుపుతూ ఇల్లంతా పాటల-పందిరి వేసేస్తుంటే అప్పుడు విన్నానొక వాన పాట - José Feliciano పాడింది. వినగానే - 'అరె - ఇది మన గలగల పారుతున్నగోదారి పాటలా వుందే!' అనేసుకున్నాం బదరి, నేను.

అప్పట్నుంచి ఈ Rain పాట మా ప్లే-లిస్టాగ్ర అయ్యింది.

కిందున్న José Feliciano పాడిన పాట ఎప్పట్లాగే యూ-ట్యూబ్ పుణ్యం.
ఆ కిందనున్నవి పాట-పదాలు  José Feliciano తో గొంతు కలపడానికి వీలుగా - Happy Singing!






Listen to the pouring rain
Listen to it pour
And with every drop of rain
You know I love you more

Let it rain all night long
Let my love for you go strong
As long as we're together
Who cares about the weather?

Listen to the falling rain
Listen to it fall
And with every drop of rain
I can hear you call
Call my name right out loud
I can hear above the clouds
And I'm here among the puddles
You and I together huddle
 
Listen to the falling rain
Listen to the rain

It's raining
It's pouring
The old man is snoring
Went to bed and he bumped his head
Couldn't get up in the morning

Listen to the falling rain
Listen to the rain

గోదావరిలో వాన భలే వుంటుంది - చిన్న చినుకులైతే సంపెంగ మొగ్గల్లా, పెద్దచినుకులు పడితే గంధపుగిన్నెల్లా - చిందులేసి గోదారంతా సింగారించుకుంటుంది.

Rain పాటతో మన అచ్చతెలుగు సినిమా గౌరి లోని గోదారి పాట కూడా sin-గారించుకుంది.

హీరో కృష్ణ పాట అనగానే వీడియో దొరుకుతుందేమోనని ఆశ పడ్డాను కానీ - ఎక్కడా వున్నట్టులేదు. అసలు హీరో కృష్ణ డాన్స్ చూడకపోతే మజా ఏముంది?

తెలుగు పాటకి సంగీత దర్శకత్వం - డోలక్ సత్యం గారు.  ఈయన పాటలు కొన్ని ఇలా వేరే భాషల్లో పాటలకి కవలలనిపించినా - అవేవో  ఏ దర్శకుడి వ్యక్తిగత ఇష్టం వల్లో ఎంపిక చేసిన పాటలకి వేరే దారి లేక చేసినట్లనిపిస్తాయి నాకు. ఇలాంటి కవల-పాటలకన్నా సత్యంగారు చేసిన ఆయన సొంత పాటలు ఇంకా బావుంటాయి.

ఇంక - ఈ పాటలో SPB గొంతు వింటుంటే ఆయనకి José Feliciano పాట పదేపదే వినిపించి అలాగే పాడమని కూడా చెప్పి వుంటారేమో అననిపించింది. ఎందుకంటే సుతిమెత్తగా వుండే బాలు-స్వరం ఈ పాటలో కొంచెం శృతి-మొత్తగా అనిపిస్తుంది. అది కొంచెం ష్రుతి మించి రెండో చరణంలో మొదటి లైను "దేషానికాయువు పోసే ఈ పల్లెలు" అని వినిపించింది - నా చెవులకి. 

మొత్తం మీద ఇదో మంచి కవల-పాట - చూడడానికేమీ లేదు - విని ఆనందించడమే!



లా లా లా లా హే హే హే
గలగల పారుతున్న గోదారిలా 
రెపరెపలాడుతున్న తెరచాపలా 
ఈ చల్లని గాలిలా - ఆ పచ్చని పైరులా 
ఈ జీవితం సాగనీ హాయిగా - హే...

గలగల పారుతున్న గోదారిలా 

అందాల పందిరి వేసే ఈ తోటలు 
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలు 
నాగలి పట్టే రైతులు - కడవలు మోసే కన్నెలు 
బంగరు పంటల సీమలు చూడరా - హే...

గలగల పారుతున్న గోదారిలా 
రెపరెపలాడుతున్న తెరచాపలా 
ఈ చల్లని గాలిలా - ఆ పచ్చని పైరులా 
ఈ జీవితం సాగనీ హాయిగా - హే...

గలగల పారుతున్న గోదారిలా 
<whistle... ... ... >

దేశానికాయువు పోసే ఈ పల్లెలు 
చల్లంగ వుండిననాడే సౌభాగ్యము 
సత్యం ధర్మం నిలుపుటే  - న్యాయం కోసం పోరుటే 
పేదల సేవలు చేయుటే జీవితం - హే...

గలగల పారుతున్న గోదారిలా

ఆ English వాన - ఈ తెలుగు గోదారిలో కలిసిన పాటలు వినండి - 'వి'న్నరవ్వండి!

~పాటల భైరవి

6, మే 2017, శనివారం

వూ-రీ డైరీ - ప్రమాణశ్రీకారం

నమస్తే! నమస్కార! నమష్కార్! వణక్కం! 

మా పేర్లు :
సీలా సుబ్బారావు (వురఫ్) ఎసెస్. వూ (వురఫ్) వూ 
సీలా సుందరి (వురఫ్) ఎసెస్. రీ (వురఫ్) రీ



మాకు పెట్టిన, మేము పెట్టేసుకున్న ఈ పేర్లే కాక మాకు మరింత పేరు తెచ్చిన ఓ రెండు కథలు మామీదున్నాయి. 

ఆ కథలూ - కమామీషులూ  మా డైరీ మొదటి పుటలో పటం కట్టి మరీ పెట్టుకోవాలనుకున్నాం కానీ పునరుక్తి-దోషం అంటుతుందని లింకులు మాత్రం అంటించుకున్నామిక్కడ: 


ఆ కథలు చదివాక మాకనిపించిందేంటంటే - ఎవరో మా కబుర్లని వాళ్ల కబుర్లుగా రాసేస్కోవడమేంటి - వాటిని మేమేదో చాటుమాటుగా చదివేస్కోవడమేంటి - మన రాతేదో మనమే రాసేసుకుంటే పోలా - అని. 

అసలే అనిపిస్తే ఆగకు - కనిపిస్తే వదలకు అనేది మా జంట జంట-మోటో కాబట్టి -

అలా అనిపించిన వెంటనే - పూనుకుని - జంటగా రాసుకుని - వూ-రీ వూ-రీ రాసుకుంటే డైరీ రాలింది అనే సామెత మా పేరు మీదుగా పుట్టించేయాలనుకుని ఇదిగో - ఇలా - మొదలెట్టేశాం. 

కాకపొతే మా డైరీలో దినచర్య రాయము - రాయదగ్గ చర్య వున్న దినమే డైరీ రాస్తాము. 

మేమిద్దరం చేసేది IT  - పగలూ రాత్రీ ఒకటే OT 
మా ఆఫీసులు - వూరికి అటోటీ ఇటోటీ
రోజూ లంచుకి కూరా రోటీ 
ఇంటికి రాగానే ఏదో భేటీ 
వున్నారు మాకు బేటా - బేటీ 
పెంచుతున్నాం పోటా-పోటీ 

వూ (రీ గురించి రాసిన పరిచయం)

ఇహ పోతే - మా రీకి నేనిచ్చే రిక్వైర్మెంటోటి 
ఆవిడిచ్చే ఇంప్లిమెంటేషనోటి
పెళ్లికి ముందు మా మామ చెప్పె - SME మా సుందరని 
SME కర్థం తెలియలేదప్పుడు - Subject Matter Extinguisher అని. 
ఏం చేశావే ఇవాళ పని అంటే - BAU అంటుంది 
BAU కి తన అర్థం వేరే వుంది - Business-As-Usual కాదది
Business-Again-Undetermined మాత్రమే అది 
వరించి పెళ్లాడిన తనకి నేను మేన-హబ్బీ (మేనరికపు మొగుణ్ణి) 
వ్రతాలు చేస్తూ నన్ను "వాలం"టీరు చేయడం తన హాబీ 
(చూడుడు: లక్ష లైకుల నోము ఎసెస్. రీ - ఎసెస్. వూ మరియు వినండి ఇంకోసారి - కబుర్లు ఆఫ్ వూ-రీ  )
ఈ మొదటి పూటకి - మా డైరీ మొదటిపుటకి - ఇది మా రీ పరిచయం 
ముందున్న పూటల - మరిన్ని పుటల్లో - పునరపి చెప్పడం - పునరపి రాయడం.

రీ (వూ గురించి రాసిన పరిచయం

అసలు - ఉన్నదున్నట్టు చెప్పాలంటే 
మా వూ అనుకునేదొకటి -
అదే అంటున్నాను అనుకుని పైకనేదొకటి 
పైగా నేను తననుకున్నట్టు చేయలేదని అనడమొకటి 
సాఫ్ట్‌వేర్‌లో మౌసెక్కువసార్లు క్లిక్కిన వీరుడనిపించుకోవాలని ఆశ 
దానికి తగ్గ "హార్డ్‌"వేర్ తలలో వుందో లేదో తనకైనా తెలుసా ?!
ఎప్పటికైనా ట్విట్టరుకి పోటీగా తిట్టరూ.com , eBay.comకి దీటుగా దొబ్బేయ్.com  సృష్టించాలని కల 
చెప్పాలనున్నా తన ప్రవర ఎంతో ఎంతెంతో ఇలా -
ఆపేస్తా ఇక్కడ - అన్నప్రాసన్నాడే ఆవకాయంటే ఎలా?


వూ-రీ (ఇద్దరూ కలిసి డైరీ గురించి రాసుకున్నది):

అందరూ డైరీల్లో ఎవరి గురించి వాళ్లే రాసుకుంటారు. 
మేం మాత్రం ఒకళ్ల గురించి ఒకళ్లు పంచులేసుకుంటూ రాసుకుంటామనిన్నీ -
రాసిందంతా వాసెన కట్టి దాచుకోకుండా అందరికీ పంచిపెట్టుకుంటామనిన్నీ-  
వూ-రీ లనబడే మేము -
డైరీ రాయడానికి శ్రీకారం చుడుతున్నాము - 
మా రాయబోయే డైరీ మీద ప్రమాణం చేసి మరీ!



29, ఏప్రిల్ 2017, శనివారం

ఎక్కడికో చెప్పుకో - సర్‌ప్రైజెస్కో...

దాదాపు మూడు నెలల కిందట - శీతాకాలపు సెలవులకి అన్నజింక ఇంటికి రావడం - తిరిగి వెళ్లడం మధ్య కాలం ఏ కబుర్లలో జారిపోయిందో.

అన్నగాణ్ణి ఫ్లయిట్ ఎక్కించిన తర్వాత ఇంట్లో ముగ్గురమున్నా - మా ఒకరొకరికీ దగ్గరలేని వాడొక్కడి ధ్యాసే.

చుట్టూ పేరుకున్న- నిశ్శబ్దపు శీతాకాలపు  చిక్కటి నల్లటి సాయంత్రాలు - దిగులుగా గుబులుగా,  మామూలుకన్నా పొడుగ్గా -  అసలు గడుస్తాయా, సూరీడుకి దారిస్తాయా, వెచ్చబడనిస్తాయా అనిపిస్తూ - చలి ఇంకా తగ్గని జనవరి-సంజలు.

అప్పుడోరోజు - అనుకోకుండా వెచ్చబడిన రోజది. బదరి, నేను వాకింగ్‌కి వెళ్లాం కొంచెం ఒంటికి ఎండ పూసుకుని వద్దామని.

"అన్నగాడు వెళ్లాడు కదా - మళ్లీ స్ప్రింగ్‌బ్రేక్‌కే కదా రావడం?" - అనుకుంటున్నానో, పైకే అంటున్నానో.

"ఇంకెంత రెణ్ణెళ్లు - అంతే!" - తనకి తానే అనుకుంటూనే  నాకిచ్చిన బదులు.

"రెణ్ణెల్లే - కానీ - వుండేది వారమే కదా - మళ్లీ వెళ్లిపోతాడు కదా" - పైకనకపోయినా మనసులో పెట్టేసుకున్నా రోజుల్లెక్క.

పక్కనుంచి సన్నగా వినీ వినిపించకుండా అన్నది సరిగానే విన్నానా అన్ననుమానం వచ్చి - ఒక్కసారి దారిపక్క ఆగి " ఏంటన్నారు ? మళ్లీ చెప్పండి" అనగానే - ఈసారి ఇంతకుముందుకన్నా కొంచెం గట్టిగా "మనమే వెళ్తే బావుంటుందా పోనీ ?!" - చిరునవ్వు చాటునుంచి మురిపించే మాటలు ముత్యాల్లా రాలాయి.

"అదెలా - ఎలా వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం ?" - హడావిడిగా దొర్లాయి నా నోటి పలుకులు.

"అన్నగాడి పుట్టినరోజుకి - ఫ్లయిట్లు, హోటళ్లు అన్నీ బుక్‌డ్. ఏప్రిల్‌లో ఓ నాల్గు రోజులు సెలవు పెట్టేయ్" - ఇంక పట్టలేని సందడి మనసులో, మాటలో.

ఇంకా తర్వాత నడక ఎలా సాగిందో చెప్పాలంటే  - పాదాలక్కూడా చెవులొచ్చి మా మాటలు వింటూ మేఘాలలో తేల్తున్నాయో అన్నట్టు అడుగులేశాయా అనిపించేట్టు.

"కానీ... ఈ విషయం అన్నగాడికి చెప్పొద్దు - వాడికి సర్‌ప్రైజ్ - ఈ ట్రిప్పు, దాంతోపాటు వాడు కావాలనుకుంటున్న కొత్త సోనీ కామెరా కూడా. అలాగే తమ్ముడికీ చెప్పొద్దు - మనం ఫ్లైట్ ఎక్కేదాకా" - చెప్పిన మాటకి బుద్ధిగా తలూపేశాను.

ఇంటికొచ్చేవరకూ ఆ మాటలే మాట్లాడుకుంటూ - ఆ తర్వాత ఇద్దరం గప్‌చుప్.

మార్చొచ్చింది - వాతావరణంలో మార్పొచ్చింది.
స్ప్రింగ్‌బ్రేకొచ్చింది - అన్ననొక వారం ఇంటికి తెచ్చింది.
మళ్లీ ఇల్లంతటా ఎలుగు - కళ్లంతటా వెలుగు

అన్నగాడు వున్న వారంలో ఒకరోజు "కొత్త కెమెరాలేమోచ్చాయో చూసొద్దాం రా " అంటూ బెస్ట్‌బై-కి కిటికీ-బేరానికి వెళ్లొచ్చాము - మరి వాడికే మోడలిష్టమో కనిపెట్టాలికదా!

వారం గిర్రున తిరిగింది - spring-break has sprung away.

ఏప్రిల్ మొదటివారం తమ్ముడి MAP schedule తెలిసింది - మూడోవారంలో లెక్కల పరీక్ష అని. మరి మా ప్రయాణం అప్పుడే.

వెంటనే లెక్కల-టీచర్ మిస్. ఫ్రామ్ కి ఈ-మెయిల్ ఇచ్చాను - ఒకసారి మీతో మాట్లాడాలని.

సోమవారం పొద్దున్నే తొమ్మిదింటికి టీచర్ నుంచి ఫోను - ఏంటీ సంగతీ - అని.

"మా ఇంట అన్నగాడి పుట్టినరోజు - కానీ వాడి కాలేజ్ జరుగుతూ వుండడం వల్ల - వాడికి ఇంట్లో వుండడం కుదరదు కాబట్టి - మేమే వాడి దగ్గరికి - వాడి పుట్టినరోజుని దగ్గరుండి జరిపిద్దామని వెళ్తున్నాము - మీరేమనుకోకుండా మా బుజ్జిజింకకి వచ్చాక వాడు మిస్ అవబోయే MAP లెక్కల పరీక్ష మళ్లీ పెడతారు కదూ - అన్నట్టు మీతో ఇలా మాట్లాడానని మా బుజ్జిజింకకి చెప్పకండి - మేము ఊరెళ్తున్నటు వాడికి కూడా తెలియదు -తెలియకూడదు" అని చెప్తూ - చివర్లో "సర్‌ప్రైజ్!!" అని గుసగుసలాడా.

చివరి గుసగుసల-గసగసకి మురిసిపోయి మిస్. ఫ్రామ్ కూడా మా సర్‌ప్రైజ్‌ని praiseworthy అని తెగ praise చేసేసింది. ఆవిడకి చెప్పాను - వాడిని ఎప్పట్లాగే ఏప్రిల్ 21న స్కూలుకి పంపించినా పదకొండింటికల్లా ఇంటికి తీసుకొచ్చేస్తామని - మధ్యాహ్నపు ప్రయాణానికి తయారవ్వాలి కదా మరి!

ఆరోజు సాయంత్రం - ఎందుకైనా మంచిదని - బుజ్జిజింకకి చెప్పాను "నాన్నగాడు! నిన్ను 21న పదకొండింటికి స్కూల్ నుంచి బయటికి తేవాలి - నాన్నగారు, నువ్వు, నేను వెళ్లి అన్నకేమన్నా గిఫ్ట్ కొని పంపిద్దామని అనుకుంటున్నాము" అని - మరి మళ్లీ వాడు ముందు చెప్పకుండా అప్పటికప్పుడు స్కూల్లో మీ అమ్మా-నాన్న నిన్ను తీసుకెళ్లడానికొచ్చారు అని చెప్తే - పాపం - కంగారు పడకూడదు కదా!

వెంటనే వాడు - కుదరదంటే కుదరదన్నాడు - కావాలంటే మీరిద్దరు వెళ్లండి - నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చి మీరొచ్చేదాకా హోంవర్క్ చేసుకుంటానన్నాడు.

వాడికొక హింట్ ఇచ్చాను కదా అని ఇంకెక్కువ వాదించలేదు - మళ్లీ ఆ మాటల్లో ప్రయాణం గురించి పొరపాట్న చెప్పేస్తానేమోనని.

ఏప్రిల్ 21 వ తారీఖున ప్రయాణం - బుజ్జిజింకకి తెలియకూడదని ఆరోజు పొద్దున్న వాడు స్కూలుకి వెళ్లేదాకా సూట్‌కేస్ సర్దలేదు.

తీరా వాడు స్కూల్‌కి వెళ్లాక - ఏడింటి నుంచి ఓ నాలుగు గంటలు నా ఆఫీస్ వర్క్ వుండి - పదకొండింటికి లాగ్ఆఫ్ చేశాక - గబగబా చేతికి అందిన బట్టలు సర్దేశాను.

ఈలోగా బదరి వెళ్లి బుజ్జిజింకని స్కూల్ నుంచి తీసుకొచ్చారు - రావడం బోల్డంత కోపంగా వచ్చాడు - కానీ సర్దివున్న సూట్‌కేస్ చూడగానే - ఒక చిన్ననవ్వు మొహంలో - వాడికి తెలిసిపోయింది ఎక్కడికో వెళ్తున్నామని - అదింకెక్కడికో కాదు అన్న దగ్గరికి అని.

హమ్మయ్య! మా పాపడి కోపాలయ్యె మురిపాలు - అమ్మకవె సమ్మతాలు. 

Alaska Airlines లో పోర్ట్‌లాండ్ దాకా ఒక ఫ్లైట్ - అక్కడినుంచి ఇంకోదాంట్లో - ఇంకో గంటలో శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగి - ఎయిర్‌పోర్ట్‌లోనుంచి బయటికి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది.

రెంటల్ కార్ తీసుకుని - హోటల్‌కి వెళ్లేముందు అన్నని కలిసి - కనిపించి - సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నాము.

అప్పటికే ఫోన్లో వాడివి మిస్డ్‌కాల్స్, మెసేజెస్ వున్నాయి - "అమ్మా! మీరందరూ ఇంట్లో లేరా? ఎక్కడున్నారు?" అంటూ.

చెప్పకుండా వెళ్తే -
అసలే శుక్రవారపు-సాయంత్రం -
ఆ రోజు ఎక్కడున్నా మేమందరం పఠించేది - ఆటవిడుపు మంత్రం -
వాడెక్కడికైనా వెళ్తే మాకే సర్‌ప్రైజ్ అవుతుందని ఫోన్ చేశాను.

"హలో నాన్నా ! ఎక్కడున్నావ్?"

"ఇంట్లోనే అమ్మా - కానీ ఇంకో గంటలో బయటికి వెళ్తాను ఫ్రెండ్స్‌తో"

"అయితే - ఇంట్లోనే వుండు - ఓ నలభై నిముషాల్లో కాల్ చేస్తాను"

"ఇంట్లో వుండడం ఎందుకమ్మా - నువ్వు ఫోన్ చేయడానికి?" - గొంతులో చిన్న కంగారు.

"నీతో మాట్లాడాలి - ఇంట్లోనే వుండు" - వాడి దగ్గరికి వెళ్లేదాకా మేము శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చాము అన్నది దాచాలని - ఎక్కువ మాట్లాడితే బయట పడిపోతానని - సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి వాడు మేము వెళ్లే దాకా రూమ్ లో ఉండేలా చేయాలని నా ఆరాటం. ఫోన్లో మాట్లాడడం ఆపేశాను.

వెంటనే టెక్స్ట్ చేశాడు - ఆదిలా సాగింది:


 
మా కార్ వాడి ఎపార్ట్‌మెంట్ దగ్గర ఆపేటప్పటికి - అన్న, వాడి ఫ్రెండ్ కెవిన్ - వాళ్ల ఐదో అంతస్తు నుంచి కిందకి దిగి రోడ్ పక్కనే వున్న ఫుట్‌పాత్ మీద కొంచెం ఆందోళనగా చూస్తూ నించుని వున్నారు.

ముందుగా కార్ దిగి వచ్చిన నన్ను, తమ్ముణ్ణి -  చూసి గబగబా దగ్గరికి వచ్చి అన్నగాడు మెరిసే కళ్లతో - ఇద్దరినీ పట్టుకుని - ఒక హగ్గిచ్చేశాడు. వాడి పక్కనే వున్న కెవిన్ - "ఎంత కంగారు పడ్డాడో సుహాస్" - అంటూ వాడూ ఒక హగ్గిచ్చాడు.

ఇంతలో కార్ దిగి వచ్చిన నాన్నగారికి ఒక పే...ద్ద హగ్గూ - వెంటనే - "This is the best birthday surprise I ever got" అంటూ గంతులూ -
"ఇంతే ఈ ఏడాదికి సర్‌ప్రైజ్ - నీక్కావల్సిన కామెరా నాకు నచ్చిన ప్రైస్ లో దొరకలేదుగా" - సన్నగా ఉడికిస్తూ నాన్నగారు - 
"That's okay, నాన్నగారు! You gave me the best surprise gift by coming over here" - అని మిడిసిపడుతూ అన్నగాడు -
వాళ్లిద్దరినీ మెరిసే కళ్లతో చూస్తూ - మురిసిపోతూ కెవిన్, నేను, తమ్ముడు.

అన్నగాడిని కలిసిన సంతోషంలో మా అలసటంతా మరిచి - కాసేపు కబుర్లు చెప్పి- వాడికి, కెవిన్‌కి బై చెప్పేసి ఆ రాత్రికి శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో వున్న మా హోటల్‌కివెళ్లిపోయాం - రూంలోకి చేరిపోయాం - ఒళ్లు మరచి నిద్రపోయాం.


మరుసటిరోజు - శనివారం - అన్నకి ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సిన రోజు - కలవడం కుదరదని ముందే చెప్పాడు. ఆదివారం సాయంత్రం మా దగ్గరికి వస్తానని చెప్పాడు.

పొద్దున్న లేవగానే - కిటికీలోంచి బయటికి చూస్తే ఎదురుగా బోల్డన్ని కిటికీలతో ఒక బిల్డింగ్ - ఒక్కో కిటికీది ఒక్కో character  & characteristic అనిపించింది.

ఒక కిటికీలో తెల్ల పూల కుండీ
ఒక కిటికీలో నీలి గళ్ళ దిండు
ఒక కిటికీలో నల్ల గొడుగు మొన
ఇంకో కిటికీలో తెల్ల తెరల కొన
అన్ని కిటికీల్లో కామన్  characteristic - ఒక టేబుల్
అన్ని టేబుళ్ల మీద ఒక కంప్యూటర్

నాకూ - బుజ్జిజింకకీ - అసలా కిటికీలేంటా అని ఒకటే ఆపలేని ఆసక్తి ఓపలేనంతగా పెరిగిపోయింది. కిటికీల పైన కానీ-కనిపించని అక్షరాలతో Goodby Silverstein & Partners అనే పేరుని కూడబలుక్కుని చదివి - గూగుల్లో వెతికితే అదొక advertising agency అని తెలిసేదాకా మా చూపులన్నీ ఆ కిటికీలమీదనే.





శనివారం, ఆదివారం రెండు రోజులూ - శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో  - హోటల్ పక్కనే వున్న - చైనాటౌన్, యూనియన్ స్క్వేర్, బ్రాడ్‌వే - వగైరాలన్నీ - మహా ఆనందంగా తిరిగాం.

బ్రాడ్‌వేలో మ్యూరల్స్ వేసిన బిల్డింగొకటి నచ్చేసి - క్లిక్కేసుకున్నామిలా:




ఆదివారం సాయంత్రం - అన్నని తీసుకుని శాన్‌హోజెలో వుండే ఆప్తులు- ఆతిధ్యహృదయులు - రమేష్, ప్రసాదుల ఇంటికి వెళ్లాము. రమేష్-ప్రసాదులు నా ఆతిధ్య హృదయం పోస్టులో మనసెరిగినవారు.

ఆదివారపు సాయంత్రం - 
మా మనసెరిగిన మిత్రులతో ఇండో-చైనీస్ భోజనం -
తినేచోట బోల్డంతమంది జనం -
ఒకరిమాట ఒకరికి వినిపించనంత కోలాహాలం -
అరిచి మాట్లాడి పోగొట్టుకున్న నా గళం.

ఆదివారం రాత్రి - మా దగ్గరకొచ్చిన అన్నగాడికి దొరికిన గిఫ్ట్ - ఇటీవల కాలంలో చదువుతో - ఎడతెగని హోంవర్క్‌తో కుదరని, దొరకని  - ఎనిమిదిగంటల అవిచ్ఛిన్న-నిద్ర.

సోమవారం పొద్దున్న - అన్నగాడికి దొరికిన ఇంకో సర్‌ప్రైజ్ - నాన్నగారి నుంచి - ఆన్‌లైన్‌లో కొన్న - వాడు కోరుకున్న సోనీ కెమెరా, దానికి కావాల్సిన లెన్స్.

సోమవారం సాయంత్రం - నాకు దొరికిన బహుమానం - నాకిష్టమైన శరవణ్‌భవన-భోజనం.

సోమవారం రాత్రికి అన్న వాడి ఇంటికి వెళ్ళిపోయాడు - మరుసటి రోజు పరీక్షకి చదువుకోవడానికి.

మంగళవారం - అన్న పుట్టినరోజు - పరీక్ష రోజు.

పగలు - మేం ముగ్గురం యూనియన్ స్క్వేర్ దగ్గర కేబుల్‌కార్ ఎక్కి - Pier39 దగ్గర Ghirardelli చాకొలెట్స్ కొనుక్కుని వచ్చాము.



మంగళవారం సాయంత్రం వాడి కాలేజ్ క్యాంపస్ లో వాడి ఫ్రెండ్ కెవిన్ తో కలిసి - వాళ్ళిద్దరికీ నచ్చిన ఒక restaurantలో భోజనం చేసి బయటికి రాగానే కనిపించిన ఒక నీలి రంగు ఆటో - దాన్ని చూసి సంబరపడుతూ - నేనూ, కెవినూ తీసుకున్న ఫోటో:



 చిత్రాన్న-భోజనాలు, ఆటోల-చిత్రాలు - అన్నీఅయిన తర్వాత - UCof B కాంపస్‌లో నడుచుకుంటూ వెళ్లి అన్ననీ, కెవిన్‌నీ వాళ్ల ఎపార్ట్‌మెంట్ దగ్గర దింపేసి - జాగ్రత్తలు చెప్పి హోటల్‌కి తిరిగివచ్చాము.

తెల్లవారితే బుధవారం - మా తిరుగు ప్రయాణం.

ఎక్కాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ గంట ఆలస్యం - దానివల్ల LA లో ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ దొరకదని - నేను, బుజ్జిజింక కష్టపడతామని బదరికి బెంగొచ్చింది.

అనుకోకుండా - మాకు ఆపత్కాల-బాంధవిలా AA లో పనిచేసే ఆవిడ ముందు వెళ్లే ఇంకో ఫ్లైట్ లో సీట్లు ఇవ్వడం వల్ల - అనుకున్నట్టుగా రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరగలిగాము.

అలా ... అన్న పుట్టినరోజుని వాడికే కాక నాక్కూడా మరపురాని రోజుగా మారుస్తూ -
ఎందాకో ఎందాకో
ఎక్కడికో చెప్పుకో
తెలియలేదా - నా చేయి పట్టుకో
వెలిగే దీపాలవిగో
ఎత్తు ఎత్తు భవనాలవిగో
నగరం ఇది శాన్‌ఫ్రాన్సిస్కో
...అంటూ
నా కళ్ల నిండా బదరి నింపిన మెరుపు - సర్‌ప్రైజెస్కో...


19, ఏప్రిల్ 2017, బుధవారం

త్వామనురజామి - 12 - కల్యాణి కిన్నెరల్లో ఏది బెస్టొ చెప్పమంట...

కిందటి 19 చెప్పిన కబుర్లు 

కటకటాల అవతల కంగారుగా చూస్తూ పోస్ట్‌మేన్ - ఇవతల కళ్లు మూసుకుని ఏడుస్తూ నేను  - ఈలోగా ఝాన్సీ కటకటాల సందులోంచి టెలెగ్రాంని అందుకుని చదివి "ఓసి పిల్లా - కళ్లు తెరింక - ఇది మీ ఇంటి నుంచి కాదు" అంది.

ఆ మాట వినగానే కళ్లు తెరిచి ఏడుపాపకుండానే - టెలెగ్రాం చదివితే అందులో వున్నది ఇదీ "You got first in B.Sc. Mathematics - Come for award ceremony on Jan 26th".

అది చదవగానే - 'ఫిజిక్స్ ఎవరికొచ్చిందో' అనాలోచిస్తూనే  - కళ్ళు తుడుచుకుని బుద్ధిగా సంతకం పెట్టాను - నా ఏడుపు తల్చుకుని అంతా సుఖాంతమయినందుకు నవ్వుకుంటూ పోస్ట్‌మేన్ - "భలే అమ్మాయివమ్మా - చూడకుండానే ఎంతేడ్చావు?!" అనేసి వెళ్లిపోయాడు.

రెండో రోజు పొద్దున్నే పదింటికల్లా అసిస్టెంట్ వార్డెన్ అరుణాచంచల దగ్గరికి వెళ్లాను. మామూలుగా అయితే ఇంటికి వెళ్లడానికి ఒప్పుకోరు - ఎందుకంటే  అప్పుడే సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళ్లి వచ్చి రెండు రోజులయిందంతే - అదీ కాక ఫిబ్రవరిలో సెమిస్టర్ ఎగ్జామ్స్.  కానీ నా చేతిలో టెలిగ్రాం చూపించాక ఆవిడ ఇంకేమీ అడక్కుండా పర్మిషన్ స్లిప్ మీద సంతకం చేశారు.

వెంటనే సీనియర్ శ్రీలత దగ్గరికి వెళ్లి తిరుపతి రైల్వే స్టేషన్‌కి వెళ్లడానికి తోడు రమ్మని అడిగి  మరుసటి రోజుకి నారాయణాద్రికి టికెట్ రిజర్వ్ చేసుకుని - అక్కడే ఒక STD బూత్ నుంచి ఇంటికి ఫోన్ చేసి చెప్పాను - ఇంటికి వస్తున్న విషయం, కారణం అన్నీ - గబగబా. అంతకుముందే ఏసీ కాలేజ్ వాళ్లు నాకోసం ఇంటికి కార్డు పంపితే - నా హాస్టల్ అడ్రెస్ ఇవ్వడానికి అప్పటికే వాళ్లతో మాట్లాడి వుండడంతో ఇంట్లో అందరూ నేను వస్తానని అనుకుంటూనే వున్నారు కాబట్టి - ఫోన్ తీసిన అమ్మ అంతగా ఆశ్చర్యపోలేదు.

శ్రీలత, సంగీత వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించారు. పొద్దున్నే గుంటూర్‌లో దిగగానే నాన్న ఒక్కరే వచ్చారు స్టేషన్‌కి - పప్పి, కుట్టి, శ్రీనులకి కాలేజ్‌లు వున్నాయని.

ఆ పక్కరోజే శుక్రవారం - జనవరి 26 - రిపబ్లిక్ డే. ఆరోజు నేను, శ్రీను వెళ్ళాము ఏ సీ కాలేజ్‌కి - పొద్దున్నేతొమ్మిదింటికి.

నాకెంతో ఇష్టమయిన మాథ్స్ లెక్చరర్ KRCP (K. రమేష్ చంద్ర ప్రసాద్) గారి నుంచి ఒక సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాను. ఫిజిక్స్‌లో ఫస్ట్ వచ్చిన శ్రీకాంత్‌కి కంగ్రాట్స్ చెప్పేసి ఇంటికొచ్చేసరికి పప్పి, కుట్టి సాయంత్రం గీతాకేఫ్‌కి వెళ్దామని ప్లాన్ చేశారు.

వచ్చిన రోజు, వెళ్లే రోజు కలిపి ఇంట్లో వున్నది నాలుగు పగళ్లు, మూడు రాత్రులు. పగలంతా పప్పి, కుట్టి,  శ్రీను, నేను కలిసి - ఎన్ని చెప్పుకున్నా- తనివి తీరని, చెప్పినవే చెప్పుకున్నా- బోర్ కొట్టని కబుర్లు చెప్పేసుకునేవాళ్లం.

ఆ కబుర్ల-వేళ కుట్టెమ్మ అంది - "ఇలా కబుర్లు చెప్పుకుని ఎన్ని రోజులయిందో కదే పప్పీ! - ఈమధ్య ఇంట్లో బొత్తిగా సందడే లేదు" అని - నాకేసి తిరిగి  - "నువ్వొస్తున్నావని నాకు ముందే తెలుసే" అంది.

"ముందే ఫోన్ చేశాను కదా - అమ్మ చెప్పే ఉంటుంది కదా?!" అని నేనంటే -

"నీ కాల్ కాదే - దానికన్నా ముందు నాకు కాకి చెప్పింది"  అంటూ  "కాకరిస్తే ఇంటికి ఎవరో వస్తారంటారు కదా - అది నీరసంగా అరిచినప్పుడే అర్థమయిపోయింది - నువ్వు మొన్నే వెళ్లావు కదా - ఇదేంటీ ఈ కాకిలా అరుస్తోంది - లల్లెమ్మేమయినా బెంగెట్టేసుకుని పరిగెట్టేసుకొస్తోందా అని - నా కాకి-శకునం తప్పలేదు చూశావా?!" అని నవ్వడం మొదలుపెట్టింది.

అదలా అంటుండగానే మా కెదురుగా వున్న నూతి గిలక మీద కాకి వాలింది.

"చూడు - ఇదరుస్తుందా ఇప్పుడు - మనింటికి ఇంకెవరో వస్తారు ఎంత పందెం  " అనింకా ఏదో సవాళ్లు విసరబోతుంటే -  అప్పుడే వంటింట్లోంచి బయటికి వచ్చిన అమ్మ "ష్ ఫో " అని ఆ కాకిని తరిమేసి "ఇక్కడ తీసినది అక్కడ పెట్టరు - పైగా కాకుల్ని పిలిచి మరీ అరిపిస్తారా - ఇంకా నయం" అని విసుక్కుంది. పాపం - ఆవిడ బాధ ఆవిడది - మా ఇంటి-వారం కాక వారం-వారం ఎవరో-ఒకరు-వుండే-వారం మా ఇంటి వ్యవహారం.

"అవునే లల్లీ - మొన్నే కదా వచ్చి వెళ్లావు - అసలు రావడానికి పర్మిషన్ ఇచ్చిందెవరసలు - మళ్లీ ఏం కథ చెప్పావేంటి?" - ఒక కన్ను మూసి తెరుస్తూ ఏవో పాత కబుర్లు తోడబోయింది కుట్టి.

"కథేంటి? కారణం ఉందిగా? అయినా కథలెక్కడ చెప్పాను నేను?" - నా దబాయింపు.

"కొయ్ -కొయ్. దసరా, సంక్రాంతి సెలవుల మధ్య సెలవులే లేవు కదా - మరి నవంబర్‌లో ఎందుకో హాస్టల్ మూసేశారని - మీ సీనియర్ సుమలత ఆధ్వర్యంలో బస్సేసేసుకుని మీరందరూ ఇంటికొచ్చేయలేదూ- పైగా తుఫానులో?"

దొరికిపోయాన్నేను :) ఒక రెండు రోజులు ఖాళీ దొరికినా ఇంటికొచ్చేయడం అలవాటయిపోయింది - అది గుర్తు పెట్టుకుని కుట్టెమ్మ మోసేస్తోంది.

అలా పగలంతా ఎడతెగని Someవాదాలు, Funవాదాలు  - రాత్రి పూట ఛాయాగీత్ వింటూ - నేనూ, పప్పీ - తొందరగా నిద్రపోయే అలవాటున్న కుట్టి  మధ్యలో పడుకునివుండగా  - దానికి అటూ ఇటూ మంచాల మీద పడుకుని - గుర్తొచ్చినవీ, గుర్తు చేసుకున్నవీ, గుర్తు రాకపోయినా గుర్తున్నాయేమో అనుకున్నవీ - అవీ ఇవీ అని లేకుండా - ఏంటేంటో  మాట్లాడుకుంటూనే వుండేవాళ్లం - నిద్రొచ్చేదాక. 

టైం ఇట్టే గడిచిపోయింది.

ఆదివారం సాయంత్రం ప్రయాణం.  మా అమ్మ - మళ్లీ హాస్టల్‌కి వెళ్లిపోతాననే బెంగతో - సంక్రాంతికి వచ్చినప్పుడు లగేజ్ ఎక్కువ ఉందని పట్టుకెళ్లలేని పచ్చళ్లు, నెయ్యి - అన్నీ బోల్డంత హడావిడి పడుతూ సర్దేసింది.

ఆరోజు సాయంత్రం అమ్మ, నాన్న, పప్పి, కుట్టి, శ్రీను - అందరూ స్టేషన్‌కి వచ్చారు - నాకు సెండాఫ్ ఇవ్వడానికి.

నాన్న "S-7 నీ కంపార్ట్‌మెంట్ - సైడ్-లోయర్- బెర్త్  15 - నేను నీతో రాలేదనుకుని ఎక్కడుందో చూసొచ్చి నాకు చెప్పు " అన్నారు.

"మీరో, శ్రీనో చూడొచ్చు కద నాన్నా ?' అంటే

"ఇక్కడ మేము చూస్తాం సరే - మరక్కణ్ణుంచి వచ్చేటప్పుడో ? - నీకూ అలవాటవాలి - వెళ్లు వెళ్లు " అన్నారు.

సంక్రాంతి సెలవుల తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ వుండడంతో అమ్మావాళ్లని వదిలి వెళ్లడం అంత బెంగగా అనిపించలేదు. కానీ ఈసారి - మొట్టమొదటగా - నేనొక్కదాన్నే రైలెక్కి ప్రయాణం - కొంచెం భయంగానే వుంది.

నాన్నకి అది తెలిసిపోయినట్టుంది - అందుకే ఇలా నాకే అప్పగిస్తే అటూఇటూ తిరిగి ఆ బెంగ మర్చిపోతానని  కంపార్ట్‌మెంట్- సీటు వెతుక్కుని రమ్మన్నారు.

వెళ్లి వెతికితే - V . లలితా త్రిపుర సుందరి  హైఫెను పదిహేనూ - అని నా ప్రవర రాసున్న ఎస్సెవెనూ, దాంట్లో వున్న సైడుబెర్తు పదిహేనూ కనిపించాయి.

మొత్తానికి నా గజ-లగేజు (అంటే మామూలుగా అయితే ఏనుగులు మాత్రమే మోయగలిగిన లగేజన్నమాట) - దాంతోపాటు నన్నూ ఎక్కించారు.

కంపార్ట్‌మెంట్ అంతా ఇంకా దీక్షావస్త్రాలు మార్చుకోని అయ్యప్ప భక్తులు - మకరజ్యోతి దర్శనం తర్వాత తిరుపతి వెళ్లి దీక్ష విరమిస్తారట.

అసలే - అమ్మావాళ్లందరూ  కిటికీకి అటు - నేనొక్కదాన్నే కిటికీకి ఇటు - చాలా గ్లూమీగా అనిపించింది - ఒక్కసారిగా.

మొహం పక్కకి తిప్పుకున్నాను - నా కళ్లలో నీళ్లు కనిపించకుండా.

కుట్టి అది చూసి  "నీకు బెంగెందుకే బాబూ - ఇంతమంది అయ్యప్పస్వాములు - భజన చేస్తే నీకు నిద్రట్టదనా? వాళ్ల కన్నా ముందు నువ్వు పాడేయ్ - అందం హిందోళమో, లేపోతే నిన్ను కోరీ వర్ణమో  - నీ త్యాగరాణికీర్తన ట్యూన్లో పాడేయ్. దెబ్బకి ఆ చిరతలు అవీ దాచేసి పడుక్కుంటారు - నువ్వెంచక్కా బజ్జోచ్చు- సరేనా?" అని నా కళ్లనీళ్లు నవ్వు-కళ్లనీళ్లు అయేలా లొడలొడలాడేసింది.

ఈలోగా ట్రైన్ కదిలింది. వాళ్లందరూ వీలైనంతవరకూ ట్రైన్‌తో పాటు నడిచి తర్వాత చేతులూపుతూ ఆగిపోయారు.

నేను ఒక గంటసేపు కూర్చుని - నేను తెచ్చుకున్న PGW పుస్తకం - అటూ ఇటూ తలతిప్పకుండా చదువుకుని - పడుకుండిపోయాను.

పొద్దున్నే తిరుపతి స్టేషన్లో ట్రైన్ దిగి  రిక్షాలో హాస్టల్‌కి వెళ్లగానే తెలిసిందేంటంటే - నేను లేని ఆ నాలుగు రోజుల్లో - మా ఫ్రెషర్స్ అందర్నీ కొత్త హాస్టల్ రూముల్లోకి మూవ్ చేశారని - ఇంకో పది రోజుల్లోఅందరం కొత్త హాస్టల్ రూముల్లోకి వెళ్లాలని.

నేనసలే ఒక నెల ఆలస్యంగా చేరానా - పైగా కొత్త రూములుఎలాట్ చేసినపుడు లేనా -నాకు మాక్లాస్‌మేట్స్‌తో కలిసి వుండేలా ఎక్కడా అవకాశం లేకపోయింది - ఎవరికి వాళ్లు ఆల్రెడీ చేసుకున్న స్నేహితులతో కలిసి జట్లు జట్లుగా రూముల్లో చేరిపోయారు.

కొత్త హాస్టల్ - రెండు బ్లాకులుగా ఉంటుంది - కిన్నెర, కల్యాణి.

మా కొత్త హాస్టల్ మెస్‌లో ప్రతి రోజూ సాయంత్రం నాలుగింటికి టీ ఇచ్చేవారు. అమ్మాయిలందరూ క్లాసెస్ అయిపోయి హాస్టల్‌కి తిరిగిరాగానే  -  టీ  గ్లాసులు (గ్లాసులే కప్పులు కానే కాదు) పట్టుకుని - హాస్టల్ బయట కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్లు.

ఒకేరోజు - ఆ టీ-వేళ వెళ్లి కిన్నెర బ్లాక్‌లో రూమ్స్ ఖాళీ ఉన్నాయని చెప్తే చూద్దామని వెళ్లాను - గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక ఖాళీ వుంది కానీ - చాలా డాంప్‌గా, చీకటిగా అనిపించి - "ఇక్కడ వుండాలా?!" - అని భలే దిగులొచ్చేసింది.

ఆ గదిలో ఒకపక్క - లా చదువుతున్న లలితా కుమారి అనే అమ్మాయి వుంటుంది. తనకి చేతులు చూడడం ఒక హాబీ. చూడడం అంటే వూరికే చూడడం కాదు - చిన్నసైజు  జ్యోతిష్యి అన్నమాట. నేను రూమ్ చూడడానికి వెళ్లిన ఆ పది  నిముషాల్లోనే నా జాతకం చెప్పేసింది - "నీకు కజిన్స్ బాగా ఎక్కువ - నీ సంపాదన నువ్వు తినలేవు" - అని.

నేనింత గొంతేసుకుని - ఇంట్లో అందరితో ఎలా ఎంజాయ్ చేస్తానో -బుర్ర - మరియు-హరి-కథలుగా - (అనగా బుర్ర-తిరిగే-హరీ(మనిపించే)-కథలుగా) - చెప్పగా విన్న ఎవరికైనా - నాకు ఎంతమంది చెల్లెళ్లో, ఆపైన ఇంకెంతమంది కజిన్సో- తెలియాలంటే నా చేయి చూడక్కర్లేదు - చెవులుంటే చాలు - పైగా "సంపాదన అంటే డబ్బులు కదా - డబ్బులు నేనెలాగూ తినలేను - భలే చెప్పిందిలే!" - అని నాలో నేనే నవ్వుకుని బయటికి వచ్చేశాను.

బయట అప్పటికే  - శ్రీలత, సంగీత, శ్రీలత రూంమేట్ రెమాచేచి (రెమా మలయాళీ అమ్మాయి - M.Ed చేసేదనుకుంటాను - తనని 'చేచి' అని పిలిచేవారు) - కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మాటల్లో నాకు రూం ఎలాట్ కాలేదని విని సీనియర్ శ్రీలత చెప్పింది - "మా 603-A లో ఖాళీ వుంటుంది లల్లీ - రెమాచేచి కోర్స్ అయిపోయింది - తన ప్లేస్ ఖాళీ. నువ్వొచ్చేయ్" అని.

వారేవా- కల్యాణి బ్లాక్ చాలా బ్రైట్‌గా , సన్నీగా అనిపిస్తుంది. పైగా శ్రీలత వాళ్ల  రూమ్ లోంచి - తిరుమలకి నడిచి వెళ్ళేదారి కనిపిస్తుంది. సాయంత్రం కాగానే ఆ దారిలో లైట్లు - సత్యభామ జడలా, ఆ పైన మెరుస్తూ శంఖుచక్రాలు - ఓహ్! నాకు ఆ కిటికీ చాలా ఇష్టం. రెమాచేచి మంచం ఆ కిటికీ పక్కనే - అదిప్పుడు నాకు సొంతం కాబోతోంది.

ఆ ఎక్సైట్‌మెంట్‌లో - శ్రీలతని, సంగీతని హడావిడి పెట్టి గబగబా టీ తాగేసి - వాళ్లతో ఒక రౌండ్ వాకింగ్‌కి వెళ్లి - వస్తూ వస్తూ - దారికి అటూ ఇటూ వుండే పేరు కూడా తెలియకపోయినా గుత్తులుగుత్తులుగా రంగురంగుల పూలు పూసే మొక్కల్లోంచి  - ఎప్పట్లాగే కొన్ని పూలగుత్తులు నా మంచం పక్కన టేబుల్ మీద పెట్టుకోవడానికి కోసుకుని ... నా పాత హాస్టల్ రూంకి ... కల్యాణి కిన్నెరల్లో ఏది బెస్టొ చెప్పమంట... అని పాడుకుంటూ... కుంటూ ... కొత్తరూం గురించి కలలు కంటూ... కంటూ.. మళ్లీ వచ్చే నెలదాకా ఇక్కడ ఆపుకుంటూ ... కుంటూ  :)


ఓ బుల్లి క్విజ్జంటకల్యాణి కిన్నెరల్లో ఏది బెస్టొ చెప్పమంటా...ఈ లైను ఏ పాటలో లైనుకి పేరడంట - చెప్పమంట!

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16, ఏప్రిల్ 2017, ఆదివారం

మీరంత మంచోళ్లు కాకపోతే బావుండేదండి - ఆయ్!

అన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని  - కానీ ఎప్పుడూ - ఏవో - కుదురుగా ఒదిగి పడుకున్న ఆకులని నిద్ర లేపి మరీ - హడావిడిగా గోల చేసి వెళ్లే గాలిలాగా - గలగలలాడడం తప్ప - ఈ ఒక్క మాట మీకు చెప్పుంటే ఎంత బావుండేదో అనుకునే బోల్డు మాటలుండిపోయాయి - ఇపుడనుకుని ఏం లాభం ?

ఆలస్యమయిపోయింది - ఇప్పుడెలా మీకివన్నీ వినిపించడం?

శ్రీనివాస్ సిస్టర్‌గా మీకు పరిచయమయిన నన్ను మీయింటి అమ్మాయిగా మీలో కలిపేసుకోవడానికి మీకు, సాగీకి ఒక్క పూటకన్నా ఎక్కువ టైం పట్టలేదు.

ప్రతీ సాయంత్రం NAL నుంచి బోల్డన్ని కబుర్లు మోసుకొచ్చే నాకబుర్లని వింటూ - ఇంటికి వచ్చిన ప్రతీ వాళ్లకి మళ్లీ మళ్లీ ఆ కబుర్లు తిరిగి చెప్తూ - లలిత ఒక అల్లరి prankster - అని మురిసిపోతూ వెలిగే కళ్లతో మెరిసిన మీ నవ్వులు - ఇదిగో  - ఈరోజుకీ నా చెవుల్లో మువ్వల్లా మోగుతున్నాయి.

రాత్రి మీ పనంతా అయ్యాక - సాగి తన లోకంలో తాను పుస్తకం చదువుకుంటూ వుండేవేళ - మీరు నాకంటూ మీ అందమైన ఇంట్లో పంచిచ్చిన నా బెడ్‌రూం లో మంచం మీద కూర్చుని - మనిద్దరం కిటికీ అవతల పాకే తీగల్ని - వాటి మీద మెరుపురంగు పూసే వెన్నెల్నీ చూస్తూ - సాగితో మీ పెళ్లి చూపుల కథతో మొదలుపెట్టి  - అక్కడినుంచి Jane Austen నవలల్లో హీరోయిన్ల కబుర్లు చెప్పుకుని - చివరికి మీకిష్టమైన గంజి-పెట్టిన-చుట్టూ-చెంగావి నూలు చీరలదాకా - ఎన్ని సల్లాపాలు, ఎన్నెన్ని హాసాలు , ఇంకెన్ని చిరు-చిరు-పరిహాసాలు!!!

అదేదో పరుగు పందెంలో ముందుండకపోతే అందుకోవాల్సినదాన్నేదో అందుకోలేమేమో అన్నట్టు - అటూ-ఇటూ చేతులు విసురుతూ హడావిడిగా తిరిగే వాళ్లతో కిక్కిరిసిన రోడ్ల మీద - నా అంతట నేను నడిస్తే ఎక్కడ అలసి వడిలిపోతానోనని - జాగ్రత్తగా నా చేయి మీ చేత గట్టిగా పట్టుకున్న - మీతోపాటు - మీ వెంట - నే తిరిగిన విజయనగర్ సాయంత్రాలంత రంగు-రంగుల-సందెలు మళ్లీ నాకింకెక్కడా దొరకలేదు. అయితేనేం కట్టుకున్న చీరకి మ్యాచ్ అయేలా వేసుకునే రంగురంగుల అద్దాల గాజుల్లో ఆ జ్ఞాపకాలని మీ పుణ్యమా అని దాచుకోగలిగాను - ఇది కూడా మీకు చెబ్దామని దాచుకున్న కబుర్లలో ఒకటి - ఇంకిప్పుడు తెలుపుదామని తలపున్నా తెలిపే వీలేది?

మీతో - మీ ఇంట్లో - నేనున్నది మహా అయితే ఒక నెల. కానీ ఆ కొద్దికాలంలోనే నన్ను - మీరు,సాగీ - own చేసేసుకున్నారు. నేను మాట్లాడిన మాట, పాడిన పాట - ఏదైనా సరే - మీ ఇంటి పసిపాప మొదటి మాట, మొదటి పాట - అన్నంతలా  విని, ఇంటికొచ్చినవాళ్లకి వినిపించి మరీ మురిసిపోయేవారు.

పెళ్లయి, పిల్లలకు  తల్లినయిన తర్వాత కూడా - ఆ పెద్దరికపు ఛాయలు నాకు ఆపాదించక - నన్ను మీకు మొదట తెలిసిన నేనుగానే వుండనిచ్చారు.

నేను, బదరి మిమ్మల్ని కలిసిన ప్రతిసారి - మీ ఇంటికి తొలిపండక్కి అల్లుడొచ్చినంత సంబరమే.  తనకిష్టమని హడావిడి పడుతూ మీరు చేసి పెట్టిన "స్పెషల్స్", సాగి చేత వలిపించి కొసరి కొసరి తినిపించిన పళ్లు - ఇంకెక్కడ దొరుకుతుంది మాకింత unconditional-love ?

ఇది నేను మీరు నాకు తెలిసినంతలో - మీనుంచి నాకు దొరికినంతలో - దాచుకున్న జ్ఞాపకాల మెరుపులు.

నాలా మీకెందరో - వారికి మీరు పంచిన స్నేహం, ఆత్మీయత ఇంకెన్ని రెట్లో.

నేను చెప్పాలనుకున్నవి ఎన్నో - ఎప్పటికప్పుడు మీతో చెప్పేస్తున్నా - ఇంకా ఎన్నో మిగిలిపోయాయి అనిపించి ఆ బెంగతో ఇలా రాసేసుకుంటున్నాను కానీ - గోదావరి సంగీతపు యాసతో - స్వచ్ఛమైన తెల్లని మనసు పెదవుల మీద పలికితే ఆ వెండి-వాక్కు శబ్దం ఇలాగే వుంటుందేమో అనిపించే -  nasal voice తో - వినిపించే మీ గొంతు ఇంక వినలేనేమోనన్న బెంగ నాకు లేదు లెండి - నా గుర్తులో గుర్తుండిపోయింది - నేను నవ్విన ప్రతీసారీ నాతో కలిసిమోగే మీ నవ్వు-మువ్వల్లాగా . 




ఇంతకుముందు - మంచివాళ్లని దేవుడుతొందరగా తీసుకెళ్తాడని - అందరూ అంటుంటే వింటున్నా నేనెప్పుడూ నమ్మలేదు.

'ఆ...!ఆ దేవుడికి ఇంకేం పనిలేదా? -ఇక్కడ మంచి వాళ్లెవరో చూసి ఎంచుకుని మరీ పట్టికెళ్లిపోవడానికి' -  అని.

ఎన్నో తెలిసిన పెద్దలు, అన్నీ చూడగల కవులు - పోయినోళ్లు అందరూ మంచోళ్లు - అంటూ పాటలు కట్టి చెవి దగ్గర పాడి చెప్పినా పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడెందుకో మీకిలా చెప్పాలనిపిస్తోంది - ఇందిరా!

మీరంత మంచోళ్లు కాకపోతే బావుండేదండి - ఆయ్!

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 2 - కవలపాటలు - కలలు కన్న కన్నడ ప్రణయగీతం


శనివారపుదయపు  సరదా వ్యాసంగం - YJ  అనగా నా యూట్యూబ్-జాకీ అవతారం.

దాదాపు రెండు వారాల క్రితం ఒకరోజు ...

అల్పాహారవేళ మొదలుపెట్టి అసలాహారం వండి వడ్డించేలోగా - కుక్కర్ ఈలలకి పోటీగా, పోపు-మోతలకి దీటుగా  - వంటింటి కౌంటర్‌టాప్ మీద పాడే ఐపాడ్‌తో పాటు గొంతు కలిపే నా ఐ-పద్మినీ-గానమేళాలో ఆరోజుకి సమర్పిస్తున్నవి కన్నడ భాషలో రాజన్-నాగేంద్ర-వారి నొప్పి పుట్టించని సుతిమెత్తని దెబ్బ-పాటలు (hit-songs).

యూట్యూబ్‌లో  - పీ బీ శ్రీనివాస్ గొంతులో మంద్రంగా - తం నం తం నం... - అంటూ పాట మొదలవగానే - ఎప్పుడు విన్నానో తెలీలేదు కానీ - అదే పాట తెలుగులో నేనెక్కడో, ఎప్పుడో విన్న జ్ఞాపకంలా గుర్తొచ్చి నాకు తెలియకుండానే - పలికెనులే నా ప్రణయగీతం ...నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా.... అంటూ నేనూ గొంతు కలిపి పాడడం మొదలుపెట్టాను.

అనుకోకుండా గుర్తొచ్చిన ఆ నాలుగు ముక్కలూ తప్ప ముందూ-వెనకా ఇంకేమీ గుర్తు రావట్లేదు.

ఒక వారం రోజులు  మా ఇంట హాంటింగ్-ఛాంట్  "తం నం తం నం తం నం తం నం పలికెనులే నా ప్రణయగీతం ...నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా..." తప్ప ఇంకో మాట లేదు - పాట  లేదు.

ఇంతలో పని-వారం అయిపోయి మేము ఫన్-వారం అయ్యే ట్రాన్సిషనల్ శుక్రవారపు సాయంత్రం - తనువూ-మనసూ ముందున్న శనివారాన్ని తలచుకుని మహ-హుషారుగా వుండే సమయం.

అప్పుడు తట్టింది నాకు ఒకసారి చిమటావారి పాటల వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెతుకుదామని.

ఇంకేముంది వెంటనేఅక్కడికి వెళ్లి  సెర్చ్ బై మ్యూజిక్ డైరెక్టర్ అంటే వచ్చే పాటల లిస్ట్‌లో రాజన్-నాగేంద్ర పేరుకింద వున్నపాటల్లో వెతికితే - ఇదిగో - ఒక పాట ఇలా కనిపించింది.

praNaya geetaM1981rimjim rimjim..palikenulE


అది చూడగానే - వారెవా - అనొక్కసారి నా భుజం నేనే తట్టేసుకుని  - గబగబా యూట్యూబ్‌లో 'ప్రణయగీతం సాంగ్స్' అని వెతకగానే - దొరికేసింది తెలుగు-కవల పాట.

వెంటనే ప్లే చేసి వినడం మొదలుపెట్టాను.

ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులో - రిం ఝిం రిం ఝిం... -  అంటూ మొదలయి -  తర్వాత అందుకున్న పీ సుశీల గొంతులో తియ్యగా సాగిన ఆ పాట వినగానే - డైనింగ్‌టేబుల్ దగ్గర కూర్చుని ఇంకా పూర్తి కాని ఆఫీస్‌వర్క్‌లో వున్న బదరి కళ్లు ఒక్కసారిగా వెలిగాయి - 'ఎంత బావుంది ఈ పాట వీళ్లిద్దరి గొంతులో!' -అన్నట్టు.

కన్నడ పాట ఎరడు కనసు సినిమాలోదైతే, తెలుగు పాట ప్రణయగీతంలోది.

ట్యూన్ తప్ప ఇంకే విషయంలోనూ పోలిక లేని పాటలు.

ఎరడు కనసు సినిమాని రామకృష్ణ-వాణిశ్రీలతో పూజ గా తీశారు తెలుగులో. ఏదో ఒకటి రెండు పాటలు తప్ప ఈ  సినిమా అంతా ఒక ఇంట్లోనే సాగుతుంది అన్నట్టు గుర్తు నాకు. అందులో కన్నడ-తెలుగు కవల పాటలు చాలా వున్నాయి - ఆ కబుర్లింకోసారి.

ప్రస్తుతానికి ఈ తం నం - రిం ఝిం పాటలు - కవల పాటల్లో - ఒకే మ్యూజిక్ డైరెక్టర్ - వేరే సినిమాలు - వేరే భాషలు - వేరే కథలు - ఒకటే ట్యూన్-కి మంచి ఉదాహరణలు.

ఇంక పాటల్లోకి వెళ్తే ....

మొదటగా కన్నడ -  ఎరడు కనసు పాట

ఇందులో కన్నడకంఠీరవ రాజ్‌కుమార్ - కల్పన నటించారు.
(రామకృష్ణ-వాణిశ్రీల తెలుగు సినిమా పూజ లో ఇదే సందర్భంలో వచ్చే పాట -   - నింగీ నేలా ఒకటాయెనే...)

సిరి-కన్నడ-రాజ్య రాజకుమారుడి పాదాల దగ్గర మొదలవుతుంది పాట. 

ఇందులో కల్పన నృత్యం, అభినయం  చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.
 ముఖ్యంగా పల్లవిలో "ఘల్ ఘల్ ..." అనే లైను దగ్గర -
పల్లవి తర్వాత వంటింటి సీనులో ఆ కళ్లూ - పోకళ్లూ
ఎవరికివారు చూసి నివ్వెరపోవాల్సిందే తప్ప
నేను వివరింప దగన్ సిన్మతీ!

అన్నట్టు నా  సిన్మతీ!-పద్యాలు గుర్తొచ్చాయి అనుకోకుండా - వెళ్లి గబగబా మళ్లీ చదువుకునొచ్చా - నా సిన్మావలోకనం పోస్టులో.
 
పాట మ్యూట్‌లో పెట్టి ఆవిడ ఆట చూస్తే మహ-తమాషాగా వుంటుంది.

ఇంక - కన్నడకంఠీరవుని నటన, నటనం - మనోహరం.
పి బి శ్రీనివాస్వరం కర్ణపేయం.
ఒకదానికొకటి కూడుకొని
నికరమాయెనవి - సరిజోడు

పాటలోకి వెళ్తే - హొన్నబళె - అన్న మెరిసే గాజుల మాట బోల్డంత నచ్చేసింది.
ణ-కార  ... హ-కార ... ళ-కార ... సహిత కస్తూరి-భాష-కన్నడ...  ఎప్పట్లాగే తెగ మురిపించింది.

పాట వింటూ, ఆట చూస్తూ ...
మీరు కూడా పాడుకోవడానికి వీలుగా ఇచ్చిన పాట పదాలు చదువుతూ -
 మీ పెదవులు కదుపుతూ -
ఎంజాయ్-మాడి !




తం నం - తం నం - తం నం... మనసు మిడియుతిదె - హో...  సోతిదె
కైయల్లి కుణివ - ఈ హొన్న బళెయ - ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణ  - తన్నంతె తానే -  తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె ... తం నం తం నం ఎందిదె

తం నం - తం నం - నన్నీ ...  మనసు మిడియుతిదె - హో... సోతిదె
కైయల్లి కుణివ - ఈ హొన్న బళెయ - ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణె తన్నంతె తానే తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె...  తం నం తం నం ఎందిదె

నీ సనిహకె - బందరె - తనువిదు...  నడుగుతిదె - ఏతకె - ఎదె - ఝల్ ఎందిదె
హ ...   నీ సనిహకె - బందరె - తనువిదు...  నడుగుతిదె - ఏతకె - ఎదె ఝల్ ఎందిదె
అహహా...ఒలిదిహ -  జీవవు - బెరెయలు ...  మన హూవాగి తను కెంపాగి నిన్న కాదిదె

తం నం తం నం తం నం మనసు మిడియుతిదె
హా  ... హాహహా  ... 


నీ నడెయువ - హాదిగె - హూవిన...  హాసిగెయ - హాసువె - కై హిడిదు నడెసువె 
అహ ...  నీ నడెయువ - హాదిగె - హూవిన...  హాసిగెయ - హాసువె - కై హిడిదు నడెసువె
అహహా... మెల్లగె - నల్లనె -  నడెసు బా ... ఎందూ హీగె - ఇరువ ఆసె - నన్నీ మనసిగె

తం నం తం నం నన్నీ మనసు మిడియుతిదె ... హో... సోతిదె
కైయల్లి కుణివ ఈ హొన్న బళెయ ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె
నన్నెదెయ వీణె తన్నంతె తానే తం నం తం నం ఎందిదె
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె...  తం నం తం నం ఎందిదె (ఆ ఆ .....)
ఘల్ ఘల్ ఘల్ ఘల్ తాళకె...  తం నం తం నం ఎందిదె  (ఊఁ ... ఊఁ ...)


ఇప్పుడిక మన తెలుగు ప్రణయగీతం

కులాసాగా ఆడినవారు  తెల్ల చీరలో సుజాత - పసుపుడుపుల్లో చంద్రమోహన్.
ధిలాసాతో పాడినవారు కోయిలమ్మ సుశీల - గండుకోయిల బాలసుబ్రహ్మణ్యం.

పాట మొదలైన మొదటి పన్నెండో సెకండు నుంచి పదిహేనో సెకండు దాకా వచ్చే ఒక చిన్న మ్యూజిక్ బిట్ ...  డోలక్-సత్యంగారిని తలుచుకునేలా చేసింది (కన్నెవయసు లో బాలుని-గళమున జలజలా జాలువారిన  ఏ దివిలో విరిసిన పారిజాతమో ... జ్ఞాపకాల్లోంచి  భలె-భలే హాయిలూరింది).

ఎత్తుగడే - ఎస్పీబీ గొంతులో - వహ్వా - అనేలా వుంటుంది.
ఎన్నో మన్ననలందిన ఆ స్వరం ...
ఎన్ని ఎదల రేపెనో కలవరం
ఎన్ని కన్నెల కన్నులకిచ్చెనో  - కలల వరం.

తర్వాత అందుకున్న కోయిల్సుశీల
బాలుకి సవాలుగా
వీణ తీగలతో స్వరాన్ని పేనినట్టు
తేనె ధారతో గళాన్ని నింపినట్టు
సంగీత ఝరి - స్వర మాధురి 

దానికి తోడు - మొదటి చరణంలో లక్ష్మీనారాయణ-లాంచీ మీద - చంద్రమోహనుడి నటనవిలాసం -  "కాలమే లీలగా ఆగెనా" అన్నచోట తలెగరేసిన వైనం - ఓహ్ !

పక్కనే మా గోదారి అందాలు - లాంచీ కదులుతుంటే పక్కనే కనిపిస్తున్న ఇనప కమ్మీల్లాంటివి చూసి మా గన్నవరం ఎక్విడెక్టేమో అనిపించింది.

సుజాత - ఈవిణ్ణి ఎక్కడ చూసినా - "గోరింటాకు" సినిమాలో తొణక్కుండా హుందాగా కనిపించిన డాక్టర్‌గా తప్ప ఇంకోలా ఊహించడానికే అవదు నాకు - అందుకని ఈ పాటలో కూడా సెలెక్టివ్-ఇగ్నోరెన్సు నా బ్లిస్సు.

పై కన్నడపాటది  సున్నితపు-బాటైతే
ఈ తెలుగు పాటది సరిగమల-దూకుడు

పైగా మాటలు తెగ పేర్చేశారు - ముందే వున్న ట్యూనుకి. 

భావనలు రేకులై వేచడ (వేచివుండడ)మేంటి?!
(చార్మినార్రేకులు ఎండలో బానే వేయిస్తాయి - అదొప్పుకుంటాను)
"నాలోని వాణి - నీలాల  వేణి " ఏంటబ్బా?!
రసధునులు రవళులవడం -
లయగతులు హొయలులై ఒదగడం -

ఏదో రాజన్-నాగేంద్ర స్వర-మంద్ర పుణ్యమా అని ఈ పాట నా బ్లాగుకెక్కించి -
ఇలా పాటలు - మాటలు ఎక్కించి మరీ పొక్కించేశాను -

చూసి, విని -
మరి - సరిగమల-లల లల ల -సహితంగా పాడుకుని -
ఆనందించండి మరి!







పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస  రిస రిస రిస రిస రిస రిస
రిం ఝిం -  రిం ఝిం -  రిం ఝిం - రిం ఝిం -  పలికేనులే... 
సరిదనిగపమపమ 
నా...  ప్రణయగీతం...
లలలలలలలల
నాలోని వాణి  - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లలల
నేలా నింగీ ఆడగా  
లలల
 పూలే తాళం వేయగా

రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం - పలికేనులే...
సరిదనిగమపమ
నా...  ప్రణయగీతం... 

సరి గమ గమ గరి 
సరి గప గప దని 
మద నిస నిస నిద 
పద సరి సరి గప  
 
రూ...  రూ...  రూ ...రూ ... 
ఆ హా హా హా 
ఆహా 
లలలల

నీ వదనమే - కమలమై - పూచెనా ...  భావనలే రేకులై నాకై వేచెనా
నీ హృదయమే -  భ్రమరమై -  దాగెనా ...  కోరికలే రెక్కలై నాపై మూగెనా
అహహా ... కాలమే - లీలగా - ఆగెనా ... నీలో వున్ననాదాలన్ని నాలో పొంగెనా

పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస  రిస రిస రిస రిస రిస రిస

రిం ఝిం -  రిం ఝిం -  రిం ఝిం - రిం ఝిం -  పలికేనులే...  
సరిదనిగపమపమ
నా ... ప్రణయగీతం...
లలలలలలలల 
నాలోని వాణి  - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లలల
నేలా నింగీ ఆడగా
లలల
పూలే తాళం వేయగా

రిం ఝిం -  రిం ఝిం -  రిం ఝిం - రిం ఝిం -  పలికేనులే... 
సరిదనిగపమపమ 
నా...  ప్రణయగీతం...
నీ పెదవియే - మురళియై -  పిలిచెనా ...  రసధునులే రవళులై నాలో నిలిచెనా
నీ పదములే - హంసలై - కదలెనా ... లయగతులే హొయలులై నాలో ఒదిగెనా
అహహా ...నందనం - చేతికే - అందెనా ...  నాలో వున్న అందాలన్నీ నీలో పండెనా 

పాసరి పగారి గాసరి దనీస పసరిస గసరిస రిస రిస రిస రిస  రిస రిస రిస రిస రిస రిస

రిం ఝిం -  రిం ఝిం -  రిం ఝిం - రిం ఝిం -  పలికేనులే...  
సరిదనిగపమపమ 
నా...  ప్రణయగీతం...
లలలలలలలల
నాలోని వాణి  - నీలాల వేణి - తానే నేనై పాడగా
నా మేనిలోన - మాణిక్యవీణ - నేనే తానై మ్రోగగా
లల
నేలా నింగీ ఆడగా
లల
 పూలే తాళం వేయగా
.......

ఇప్పటికి ఈ పాటల ప్రసారం- మాటల ప్రహారం సశేషం ...
ఉండి రాగమాలపించుడి ... (అనగా అనగనగా ...  Stay tuned!)

~పాటల భైరవి


7, ఏప్రిల్ 2017, శుక్రవారం

నా సంగీత పరస్థానం - చరణం

చరణం వినే ముందు పల్లవి, అనుపల్లవి వినాలి కదా మరి!

నా సంగీత పరస్థానం - పల్లవి
నా సంగీత పరస్థానం - అనుపల్లవి

 ఒంగోలు నుంచి వచ్చే సంగీతంమాస్టారు శ్రీనివాసరావుగారి దగ్గర సంగీత పాఠాలు మొదలయాయి - కుట్టీకి, నాకు. మాతోపాటు బ్రహ్మయ్యగారి పద్మజ, భారతి కూడా నేర్చుకునేవారు.

శ్రీనివాసరావుగారు కొంచెం మొహమాటంగా వుండేవారు - అందరం ఆడపిల్లలం - మాకన్నా ఓ పదిహేనేళ్లు  పెద్దవారైనా నన్ను, కుట్టీని కూడా 'మీరు' అనే సంబోధించేవారు. ప్రతిరోజూ కనీసం గంటసేపన్నా సాధన చేస్తే కానీ సంగీతంలో ప్రావీణ్యత సాధించలేమని చెప్పేవారు.

అసలే - అప్పటికి తెలుగులో నానార్ధాలు నేర్చుకుంటున్న రోజులేమో - మాస్టారన్న సాధించటానికి  - మాకర్థమయిన ఇంకో సాధించటం కూడా కలిపి మా అమ్మని, చుట్టుపక్కలవాళ్లని - రోజూ ఓ గంట మా సంగీతసాధనతో సాధించి - చివర్లో - మరది మేము పాట ఆపేసిన ముదమో , లేకపోతే గ్యాపిస్తే మళ్లీ మొదలుపెడతామన్న బెదురో - మా ఇంటినానుకుని పక్కింట్లో వుండే  - సోడాలమ్ముకునే సత్యం భార్య సుజాత - గబగబా తెచ్చిచ్చే నిమ్మకాయ సోడాలు కూడా సాధించేవాళ్ళం.

ఆవిధంగా త్రివిధ-సాధనతో మా సంగీత సాధన ఏడు స్వరాలు - ఆరున్నొక్కరాగాలుగా - ఎదురులేకుండా - ఎవరూ మా ఎదుట బడ సాహసించకుండా - మా ఇంటిచుట్టుపక్కల - సాయంత్రం ఐదున్నరనుంచి ఆరున్నర దాకా - నిర్బంధకర్ఫ్యూతో నిరాటంకంగా సాగిపోయేది.

మా పాటకి కాపలాగా - రోజూ మధ్యాహ్నం,  రాత్రి పళ్లెం కొట్టి మరీ పిలిచి మేం పెట్టే అన్నం తినే కృతజ్ఞతతో - చెవులు కాళ్లతో కప్పుకుని మరీ సాగిలపడి పాట వినే -  మా జాగిలం 'రాము' - మేము పాట ఆపగానే - ఉలిక్కిపడి లేచి చెవులు రెండూ దులుపుకుని - శాలువా కప్పుకుని అస్తమిస్తున్న సూర్యుడివైపు నడిచివెళ్లే హీరోలా - అదేదో ట్రాన్స్‌లో ఉన్నట్లు తిరిగేది - ప్రతీ సాయంత్రం పూట.

ఇంక సంగీతం క్లాసులో - స్వరం ఎన్నో కాలంలో పాడుతున్నా - ఏకకాలంలో నాకు నోరో , చెయ్యో - ఏదో ఒకటే పని చేసేది. స్వరమూ, తాళమూ చాలా స్వతంత్ర ప్రతిపత్తితో సాగేవి. కుట్టీకి రెండూ బాగానే కుదిరేవి.

ఒకసారి స్వరానికి ముందే వేళ్లు కదిపేసి తాళం మేనేజ్ చేసేస్తున్న నాతో విసిగి - మా సంగీతం మాస్టారు -కుడిచేయి ఎత్తి నాకు బాగా కనిపించేలా ఒక్కో వేలు విడివిడిగా కదుపుతూ - చేతిని కొంచెం ఝాడించి ముందుకీ వెనక్కీ గాల్లో ఊపుతూ  -అలంకారాల్లో ఒకటైన ఝంపెతాళం ఎలా వేయాలో చూపిస్తూ ఉంటే - అప్పటిదాకా తదేకజ్ఞానంతో మనసులో 'దెబ్బ - ఉసి' అనుకుంటూ చేతిని అటుతిప్పీ, ఇటుతిప్పీ అంకతాడనం చేస్తున్న నేను - హఠాత్తుగా అదాపి - 'ఓహో - గాల్లో వేస్తే తాళం బాగా వస్తుంది కాబోలు' ననుకొన్నదాన్నై - యథాశక్తి నా చేయెత్తి - మాస్టారి చేతిననుసరించి, ఆయనవేసే తాళాన్నానుకరించబోయేసరికి - అసంకల్పితప్రతీకారచర్యగా - మాస్టారి కుడి చెయ్యి గాల్లోనే ఆగిపోవడం, ఎడం చెయ్యి నుదుటికాదేశమవడం - మాష్టారేమో 'చేతులలా ఊపవాకండి - తాళం ఎప్పుడూ వేసేలాగే వెయ్యండి' అనడం జరిగాయి.

తర్వాత నుంచీ కొంచెం శ్రధ్ధ పెట్టి స్వరానికీ - తాళానికి సమన్వయం వుండేలా చూసుకునేదాన్ని - మాస్టారి కష్టాలు గట్టెక్కాయి.

ఈలోగా నాన్నకి గుంటూరు ట్రాన్స్‌ఫర్.

బండ్లమూడి హనుమాయమ్మ( BH) జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ గ్రూపు - ప్రాక్టికల్స్. దాంతో పాటు సంగీతం క్లాసులంటే అలిసిపోతానని అమ్మ అంతగా ఆసక్తి చూపించలేదు నా సంగీతపు-కొన'సాగిం'పుపై.

కుట్టి, పప్పి - నాగార్జున సంగీత కళాశాలలో - సంగీతం, వీణ తరగతుల్లో చేరారు.

నేనింక అనిబద్ధ పాటకి' నయ్యానన్నమాట (అర్థం నిఘంటువులో కూడా వుండదు - కావాల్సినవారు నన్ను నేరుగా- వేరుగా సంప్రదించగలరు).

కాలేజ్ లో చేరిన ఒక వారం-పది రోజులవరకూ ఒకరినొకరు చూసుకున్నా నవ్వులకే పరిమితమయిన - అపర్ణతో నా పరిచయం - పాటతోనే స్నేహంగా మారింది.

ఆగస్టు ఎనిమిదో తారీఖున ఇంగ్లీష్ బోధించే యశోధర మేడం సెలవు పెట్టారని ఒక రింగ్ తీసుకుని కాలేజ్ వెనకాల వున్న గ్రౌండ్ లో ఆడుకోవడానికి - అనుకోకుండా కలిసి వెళ్లిన మేమిద్దరం - మాటలు కలుపుకున్న మొదటి పది నిముషాల్లోనే మా ఇద్దరి పుట్టినరోజులు ఒకే నెలలో మూడు రోజుల తేడాతో అని తెలుసుకుని ఒకళ్లమీద ఒకళ్లు అభిమానం పెంచేసుకున్నాం.

పదిహేనో నిముషంలో నా నోట విన్న పదిమాటల్లో ఎనిమిది మాటలు పాటల గురించి విని - ఒక పాట పాడమన్న అపర్ణ కోసం నేను పాడిన - 'స్నేహబంధము ఎంత మధురము' పాట - లోలా  రెండు శరీరాలలో ఒకే ఆత్మ కలిగివుండేవాళ్లమయాం.

ఇలా ఉండగా BH లో ఒకసారి ఏవో పాటల పోటీలు జరిగాయి. అపర్ణా, నేనూ పేర్లిచ్చాము. రెండో అంతస్తులో విశాలంగా వుండే ఒక చిన్న సైజు ఆడిటోరియంలో మైకులు అవీ పెట్టి పాటలు పాడించారు.

ఆరోజు - కరుణశ్రీ-జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రచించగా ఘంటసాల వారు పాడిన - పుష్పవిలాపం - నేను పాడాను అనేకన్నా సంలాపం చేశాను అంటేనే బావుంటుంది.

నా పుష్ప వి(సం)లాపం విన్న ఆ పాటలపోటీ నిర్వాహకుల గద్గదస్వరభరిత-ఏకగ్రీవ-విలాపం ఏంటంటే - 'ఈసారి ఎక్కడైనా పాడినప్పుడు కొంచెం మాడ్యులేషన్ చూసుకుని పాడమ్మా' - అని.

ఆ తర్వాత ఇంక ఎప్పుడూ సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నించడానికి కూడా అవకాశం రాలేదు - చదువయ్యి, పెళ్లయ్యి, బుజ్జిజింక పుట్టి - వాడికి నాలుగేళ్లొచ్చేదాకా.

బుజ్జిజింకకి నాలుగేళ్ల వయసులో - కాకినాడ వలసపాకలలో వున్న రోజుల్లో - ఒక నెల రోజులు భానుగుడి దగ్గర ఎవరో ఒకావిడ దగ్గర మొదటి రెండు సరళీస్వరాలు - వాడికి నేర్పించినట్టు గుర్తు.

తర్వాత వలసపాకల వదిలి వలస రావడం - వచ్చిన మొదటి ఏడులో తెలుగుసంఘంలో చేరడం - అక్కడ బుజ్జిజింక పాడిన 'నాయనమ్మ - నాయనమ్మ - మాయని ప్రేమే నీదమ్మా' అనే ఎస్. జానకి పాడిన 'పచ్చని పల్లెటూరు' ప్రైవేట్ ఆల్బం పాట విని అందరూ బావుందనడంతో - వాడికీ సంగీతం నేర్పిద్దామా అని సంగీతం నేర్పేవారెవరైనా వున్నారా అని వాకబు చేస్తే  విద్యా ఆనంద్ అనే ఒక అద్భుతమైన టాలెంటెడ్ టీచర్ దొరకడం జరిగింది.

ఒకానొక విజయదశమి రోజు - బుజ్జిజింక (అన్న)ని - తీసుకుని విద్య ఇంటికి వెళ్లాం.

సా... పా ... సా ... అని ఆ రోజు మొదలుపెట్టిన సంగీతం ఆరేళ్ల పాటు నేర్చుకున్నాడు. మరీ సరళీ స్వరాలనుంచి ఎందుకులే అని దాటు-స్వరాల దగ్గర నేనూ వాడితో పాటు విద్య దగ్గర సంగీతం నేర్చోవడానికి చేరాను.

అలా ప్రతి శనివారం 45 నిముషాలు - ఎండనక, వాననక, మంచనక - డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి దాదాపు ఒక 300 వారాల పాటు - ఒక పది కృతుల దాకా  నేర్చుకున్నాక - రెండు ఇబ్బందులొచ్చాయి.

అన్నకి - కోయిలస్వరం అక్షరాలా 'గండు'కోయిల పరమయింది; అమ్మకి నెలలు నిండి పాడడానికి స్వరం నిండుకుంది.

రెండో బుజ్జిజింక పుట్టే హడావిడిలో అన్నగాడిని - 'గొంతు మారితే పర్వాలేదమ్మా - ప్రాక్టీస్ చేస్తే బానే వచ్చేస్తుంది' - అని సముదాయించే ఓపిక, తీరిక లేక ఇద్దరం సంగీతం మానేశాం.


అలా - సరసిజనాభ సోదరి - దగ్గర ఆపిన సంగీతాన్ని విద్య దగ్గర పరస్థానం పెట్టి వచ్చాను -  అన్నీ కుదిరినప్పుడు, ఎన్నో కుదురుకున్నప్పుడు - మళ్లీ సంగీతయాత్ర కొనసాగిద్దామనే ఆశతో.

ఈరోజుకీ అన్నగాడు నాతో అంటాడు - 'ఏదైనా మొదలుపెడితే ఆపకూడదని చెప్పి నాచేత మనబడిలో తెలుగు నాలుగేళ్లు చదివించావు - ఈగిల్ స్కౌట్ నయ్యేదాకా వదల్లేదు - మరి సంగీతం దగ్గర ఎందుకమ్మా నన్ను పుష్ చేయలేదు? - చేసుంటే ఎంత బావుండేది కదా!' - అంటూ :(

సాంత్వన ఏంటంటే - మంచి సంగీతపు-చెవి వుంది వాడికి - భాషాభేదంలేకుండా అన్ని దేశాల సంగీతం వింటాడు - వినిపిస్తాడు.

ముక్తాయింపు:

బుజ్జిజింకలిద్దరికీ చెరో-ఏడో ఏటి దాకా పడుకునేటప్పుడు పాటలు పాడి నిద్రపుచ్చడం నాకు దొరికిన ఒక సంగీతావకాశం.

అలిసిపోయి వుంటారు - నిద్రొస్తూ ఉంటుంది - మరంతకన్నా నిర్బంధ-శ్రోతలెక్కడ దొరుకుతారు కదా!

బుజ్జిజింకలకి తోడు - వాళ్లకన్నా ముందు నుంచీ వింటూవున్న - నిర్బంధ-మహా-శ్రోత అనదగిన నాన్నగారు ఉండనే వున్నారు - అమ్మేం పాడినా చప్పట్లు కొట్టి 'నువ్వు పాటల-భైరవివే'  అనేసుకుని మురిసిపోవడానికి.

అంతే ... ఆ ప్రోత్సాహోత్సాహంతో ...

రామా-లాలీ తో మొదలుపెట్టి - రంగా-లాలీ తో కొనసాగించి -
ఆ రోజు మొదటగా గుర్తొచ్చిన పాట - ...
అది  లింగాష్టకం కావొచ్చు -  
కొండవీటి సింహంలోని ఈ మధుమాసంలో  కావొచ్చు -
కన్నడ కంఠీరవ పాడిన ఎందెందు నిన్నను మరెతు బదుకిరలారె అయుండొచ్చు
చిటపట చినుకులు పడుతూ వుంటే అవొచ్చు -
ఇవేవీ కాక ...
సుందరాంగా అందుకోరా అనే భూకైలాస్ లో రంభ-డాన్స్ పాట అయుండొచ్చు -
ముఖేష్ ఆజా సనమ్ మధుర చాందినీ మే హమ్ అన్న హమ్మూ కావొచ్చు -
లేకపోతే ...
Brown girl in the ring Tra-la-la-la-laa అనే బోనీయమ్మో (Boney M) అవొచ్చు.

 ఇదీ-అదీ అని లేక ఏదో ఒకటి - ఒకదాని వెనకొకటి ఒక అరగంట పాడేదాన్ని.

కొన్ని కొన్ని పాటలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నవి - అప్పుడు నా చెవులకి వినపడినట్టు నేర్చుకున్నవి - ఇంకా అదే ట్యూన్లో పాడుతున్నవి కూడా ఉండేవి - అంటే మాటలు మారి పోయి, రాగం ఏమారిపోయి వున్నవన్నమాట.

అవి వినీ వినీ - నా పాటకి చెవులు ట్యూన్ అయిపోయివున్న బుజ్జిజింకలు ఎప్పుడైనా యూట్యూబులోనో, ఇంకెక్కడో ఆ పాతపాట  దొరికి నేను వింటుంటే - వాళ్లు ఎక్కడో పక్కరూంలో వున్నా - పరిగెత్తుకుంటూ వచ్చి "అమ్మా! ఇలా ఉంటుందా ఈ పాట ?" అని ఆశ్చర్యంగా అడిగి  "Oh well! We like your version better - because we are used to it" అని నా భుజం తట్టి వెళ్ళిపోతారు.

అమ్మ-పాటా - మరోటా !!!

ఇంతటితో పరస్థానం పెట్టిన నా సంగీత ప్రస్థానపు విశేషాలు సమాప్తం.


31, మార్చి 2017, శుక్రవారం

వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - ముక్తాయింపు


అమ్మతో, పప్పితో రోజూ ఫోన్లో మాట్లాడుతూ - ఎప్పటికప్పుడు నాన్న ఆరోగ్యం గురించి, డాక్టర్లు చెప్తున్న ఆపరేషన్ వివరాల గురించి వింటూ - వాటిని బట్టి రాసినవి ఇంతకు ముందు కబుర్లు:  వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - నాంది

నాన్నకి డాక్టర్ గూడపాటి రమేషు అంతకుముందు ఆంజియోగ్రామ్ చేశారు. స్టార్  హాస్పిటల్లో ఒకరోజు ICU లో వున్నారు.


నాన్న ICU లో వున్నప్పుడు మలయాళీ నర్సులు పక్కనే వుండి మలయాళం లో మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.

నాన్న వాళ్ళని పిలిచి చెప్పారు  - "మీరు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడకపోతే నామీద మీరేదో చెప్పేసుకుంటున్నారని  గోపీచందుకి చెప్తాను" - అని.

వాళ్ళు వెంటనే నవ్వి - "తాతగారు - మీ మీద ఏమీ చెప్పుకోవట్లేదండి" - అని నవ్వేసేవాళ్లు.

డిసెంబర్ లో హైదరాబాదు వెళ్లిన అమ్మ, నాన్న చివరివారంలో ప్రతీ ఏడాది లాగే నాన్న SKBR క్లాసుమేట్స్ సరదాగా కలిసే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ కి వెళ్లి వచ్చారు.


ఆ  ఓల్డ్ స్టూడెంట్స్ మీటు కెళ్లే ముందు రోజే నాన్న డాక్టర్ గోపీచంద్ తో ఆపరేషన్ వద్దు అని చెప్పి - ఆయన అమ్మతో మాట్లాడతానంటే వద్దొద్దని చెప్పి - ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నది.

అప్పుడే డాక్టర్ని " ఈలోపు నాకొక ఓల్డ్ స్టూడెంట్ మీటొకటుంది తెలంగాణ లో - దానికి వెళ్లొచ్చా? " అడిగారు నాన్న.

"ఆ.. వెళ్ళచ్చు - దాందేవుంది వెళ్ళిరండి ఇబ్బందేం లేదు . ఎన్ని రోజులుంటుంది?" - డాక్టరుగారి ప్రశ్న.

"జస్ట్ టూ  డేస్ "- అన్న నాన్నతో  - " ఏం  చేస్తారు  మీ ఓల్డ్ స్టూడేంట్సూ" - అంటూ డాక్టర్.

"ఏం చేస్తారు?  - వెళ్తామక్కడికి - ఏదో అంతా సీనియర్  సిటిజెన్స్ కదా - ఏదో గుళ్ళూ గోపురాలు చూస్తారు పొద్దున్న. - మధ్యాహ్నం  మీటింగ్ పెట్టుకుని చిన్నప్పటి కాలేజ్ కబుర్లు అవీ చెప్పుకుంటారు - సాయంత్రం మా కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తాం " అన్నారు నాన్న.

డాక్టర్ కళ్లింతవి చేసి - "ఏంటి మీరు కుర్రాళ్ళా?"  అని నవ్వు.

"ఏవయ్యా - అరవై ఏళ్ళు దాటింతర్వాత సెకండ్ లైఫే కదా - ఆ లెక్కన ఇప్పుడు నాకు పదేళ్లే కదా - సాయంత్రం ఆరు తర్వాత నేను కుర్రాణ్ణై పోతా " అంతకన్నా నవ్వుతూ నాన్న.

"సరే వెళ్లి  రండి" అని నవ్వుతూ సాగనంపారు డాక్టర్.

2015 సంవత్సరం: 


జనవరి మొదటి వారంలో మాట్లాడినప్పుడు పప్పి చెప్పింది - నాన్నని 26వ తారీఖునొచ్చి హాస్పిటల్లో చేరమని డాక్టర్లు  చెప్పారని. పైగా పెద్ద వయసు మూలంగా రిస్క్ ఎక్కువ అని, ఆపరేషన్ సక్సెస్ కి 50:50 ఛాన్స్ అని చెప్పారనీ చెప్పింది.

అది తెలిసినప్పటినుంచీ ఎంతొద్దనుకున్నా కొంచెం బెంగగానే అనిపించింది.

ఈలోగా బదరి ఒకరోజు బాలాజీతో ఎప్పట్లాగే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు - మాటల సందర్భంలో "బాలాజీ! అంకుల్ కి హార్ట్ సర్జరీ - హైదరాబాదులోనే వున్నారు ఇప్పుడు " అని చెప్పారు.

అంతే - ఆ తర్వాత బాలాజీ నాన్నకి ఫోన్ చేసి విషయాలు కనుక్కుని - మా కన్నా ఎక్కువగా ఆదుర్దా పడుతూ - నాన్న ఆపరేషన్ విషయాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ బదరికి చెప్తూ వుండేవారు.

నేను దాదాపు రోజూ ఫోన్ చేసి పప్పితో మాట్లాడుతూ వుండేదాన్ని.

ఓరోజు చెప్పింది - ఆపరేషన్ కి ఎనిమిది మంది  బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పారని. దానికి నాన్న - "నాకు యంగ్ బ్లడ్ కావాలి, ఆపరేషన్ తర్వాత నాది కొత్త లైఫ్ , యువక రక్తం ఉండాలీ" అని - అన్నారన్నది తలుచుకుని నవ్వుకున్నాము - ఈయనకి ఇక్కడ కూడా సెలక్షనే అని.

జనవరి 17 - శనివారం ఫోన్ చేసినపుడు నాన్న ఏం చేస్తున్నారు అనడిగితే - "అనాతవరంలో ప్రసాదు వాళ్లు భజన చేస్తున్నారు - బయట కుర్చీలో కూర్చుని స్పీకర్ ఫోన్లో  ఆ భజన వింటున్నారు" - అని చెప్పింది పప్పి. దాని గొంతు అంత హుషారుగా లేదు. నేనంటే దూరంగా వున్నాను నాకంతగా తెలియట్లేదు - కానీ పప్పి పక్కనే వుండి నాన్నతో పాటు హాస్పిటల్సుకి, టెస్టులకి వెళ్తూ చాలా స్ట్రెస్ తీసుకుంది.

 సరే - ఇంకో వారంలో సర్జరీ అనుకున్నాము.

జనవరి 24 శనివారం మామూలుగా ప్రతీ రోజులాగే పొద్దున్నే ఎనిమిదింటికి ఫోన్ చేశాను. పప్పి ఫోన్ తీసింది - 26 పొద్దున్న హాస్పిటల్ కి వెళ్తున్నాము అంది. ఇంకా తర్వాత ఏమీ మాట్లాడలేకపోతోంది - ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నాకూ కంగారుగా అనిపించి గబగబా మాట్లాడి ఫోన్ పెట్టేశాను.

పక్కనే వుండి నన్ను చూస్తున్న బదరి "బెంగగా ఉందా బంగారం? పోనీ నేను వెళ్లిరానా?" అన్నారు.

అంతలోనే నా మొహం చూసి - అసలే - మనసు-చదివే-విద్య తెలుసు కదా "వద్దులే అందరం వెళ్దాం - ఫ్లైట్ టిక్కెట్లు చూడనీ" అని వెంటనే లాప్టాప్ ఆన్ చేశారు.

ఒక అరగంటలో - జనవరి 25కి షికాగో నుంచి హైదరాబాదుకి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశారు - మా నలుగురికీ - అంటే -  బదరి, నేను, బుజ్జిజింక-కిరణ్, అప్పటికి ఇక్కడేవున్న మా అత్తగారు.

ఇంక వీకెండ్ కావడంతో ఇద్దరం ఆఫీసులకి, బుజ్జిజింక స్కూలుకి అర్జెంటుగా ఇండియా వెళ్తున్నామని - రెండు వారాల్లో తిరిగి వస్తామని ఈ-మెయిళ్లు ఇచ్చి గబగబా ప్రయాణానికి కావలసినవి సర్దుకున్నాము.

పప్పికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను - బయల్దేరి వస్తున్నామని. అమ్మతో కూడా మాట్లాడాను - కానీ నాన్నకి చెప్పొద్దని చెప్పాను - ఆయన్ని సర్ప్రైజ్ చేద్దామని.

ఎయిర్-ఇండియా ఫ్లైట్లో పదిహేను గంటల పాటు రకరకాల భాషల్లో సినిమాలు చూసుకుంటూ - చూడనప్పుడు నిద్రలో తూగుకుంటూ మొత్తానికి జనవరి 26 సాయంత్రానికి హైదరాబాదులో దిగాము.

ఎయిర్ పోర్ట్ కి బాలాజీ వచ్చారు. వస్తూనే - "బదరి! నిన్ను, కిరణ్ ని ఇంటికి తీసుకెళ్తాను - మనం ఇంటికి వెళ్లేదారిలోనే స్టార్ హాస్పిటల్ - లలితనక్కడ అంకుల్ దగ్గర దింపేసి వెళ్దాం" అని చెప్పారు - మనసు చదవడం బాలాజీకి తెలుసు మరి.

హాస్పిటల్ దగ్గర దిగగానే - అమ్మకి ఆల్రెడీ ఫోన్ చేశారెమో - అమ్మ బయటకొచ్చి నించుని వుంది. అమ్మని పలకరించి ఆవిడ దగ్గర సెక్యూరిటీ పాస్ తీసుకుని సెకండ్ ఫ్లోర్ లో వున్న నాన్న రూమ్ కి వెళ్లాను. నీలం రంగు హాస్పిటల్ గౌన్లో మంచం మీద పడుకుని టీవీ చూస్తున్న నాన్న నన్ను చూసి సంబరాశ్చర్యపోయారు. అందరం వచ్చామని తెలిసి బోల్డంత సంతోషపడ్డారు. నాన్నతో కాసేపు, కింద అమ్మ, లక్ష్మి దొడ్డతో కాసేపు మాట్లాడేసి ఈలోగా బాలాజీ వస్తే తనతో ఇంటికి వెళ్లాను. ప్రియని, పిల్లలని పలకరించి - ప్రియ పెట్టిన వేడివేడి భోజనం తిని కాసేపు కబుర్లు చెప్పి పడుకున్నాము.

మామూలుగా నాన్న దగ్గర ఒకళ్లనే వుండనిచ్చేవారు.

జనవరి 27 సాయంత్రం మాత్రం ఫామిలీ మొత్తాన్ని రావొచ్చు అని చెప్పారు. డాక్టర్లు వచ్చి - మరుసటి రోజు ఆపరేషన్ ముందు ప్రొసీజర్లు అవీ మాట్లాడతారని చెప్పారు.

27 పొద్దున్నించీ - పప్పి, నేను - స్టార్ హాస్పిటల్ బయటే వుండి నాన్నని చూడడానికి వచ్చేవాళ్లని పలకరిస్తూ వున్నాము.

అప్పుడే నాన్న చిన్ననాటి  స్నేహితులు భూషి బాబుగారు, వాళ్లబ్బాయి శంభన్నశాస్త్రి, అమ్మాయి పద్మ హాస్పిటల్ దగ్గర కలిశారు. భూషిబాబుగారు నాన్నని పలకరించి వచ్చి నాతో  "మీ నాన్నది గట్టి గుండె. మొండివాడు - నవ్వుకుంటూ తిరిగొస్తాడు - బెంగ లేదు" అని చెప్పి వెళ్లారు. ఆ మాటలు వినగానే బోల్డంత ధైర్యంగా అనిపించింది - మా నాన్న మొండితనం గురించి ఆయనకన్నా ఇంకెవరు అంత గట్టిగా ఎండార్స్ చేయగలరు గనక!

ఆ రోజే హాస్పిటల్ దగ్గర అనుకోకుండా బదరి తిరుపతిలో MBA ఫ్రెండ్ సాయి ప్రసాద్ కలిశారు. ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చెప్పమని పదేపదే చెప్పారు.

ఆ రోజు సాయంత్రం - ఎప్పుడూ హాస్పిటల్ దగ్గరే ఉంటున్న నన్ను - అక్కడ తప్ప ఇంకెక్కడా కలవలేమని - నన్ను చూడడానికి - ప్రసాద్ రెడ్డి, అనిత వచ్చి - ఎంతో ఇష్టంగా బెంగళూరులోని పాతరోజులు గుర్తు చేసి మాట్లాడి వెళ్లారు.

వీళ్లు కాక బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన మా నాన్న యువ-బంధువులు వచ్చి పలకరించేవారు.

ఎంత బయటికి ధైర్యంగా కనిపిస్తూ వచ్చే వాళ్లందరితో సరదాగా మాట్లాడుతున్నా - నాన్న ఆపరేషన్ టెన్షన్లో వున్న నాకు - మధ్యమధ్యలో వచ్చి పలకరించి - "మేమంతా మీ వెనక వున్నాం"  - అని చెప్పీ చెప్పకుండానే చెప్తున్న వీళ్లందరూ ఆపద్బంధువుల్లా, మనస్స్నేహితుల్లా (ఈ మాటలు - intended-టైపోలు) - మా ఆత్మీయ-సంపదలా  అనిపించారు. 

సాయంత్రమయింది. నేను, బదరి, బాలాజీ, అమ్మ, పప్పి, కిరణ్, లక్ష్మి దొడ్డ, రవి, బాబు - అందరం నాన్న రూంలో వున్నాం. డాక్టర్ గోపీచంద్, డాక్టర్ గూడపాటి రమేష్, ఇంకొకరెవరో అనెస్తెటిస్టు, నర్సులు వచ్చారు.

నాన్న మా అందరినీ వాళ్లందరికీ పరిచయం చేశారు.

ఇంతలో డాక్టర్ గోపీచంద్ నాన్నని అడిగారు - "సిగరెట్లు మానేయమన్నాను - మానేశారా ?" అని.

నాన్న " అప్పుడే మానేశాగా! " అన్నారు.

"అదే ఎప్పుడు?" అనడిగారు డాక్టర్.

"ఎప్పుడంటే - మొన్న గురువారం నుంచి" - నాన్న తడుముకోకుండా ఇచ్చిన జవాబు (అంటే జనవరి 22 నుంచి).

డాక్టర్ మాట్లాడుతూ ఉండగానే - బదరి, బాలాజీ - హాస్పిటల్ ఆడ్మిన్ తో ఏదో మాట్లాడాలని బయటికి వెళ్లారు.

నాన్న సమాధానం విన్న అనెస్తెటిస్టు - నన్ను, బాబుని, రవిని - బయటికి పిలిచి "ఈయనేంటండీ బాబూ - సిగరెట్లు మానేయమని నెలనుంచి చెప్తుంటే మొన్న గురువారం మానేశానని చెప్తున్నారు. ఆయనది ఎంత క్రిటికల్ ఆపరేషనో తెలుసాండీ? ఇప్పుడింక అసలు 50:50 కాదు ఇంకా ఎక్కువ రిస్క్ ఉండేలా వుంది" అని తెగ బాధపడి - ఆయన కంగారు పడి - మమ్మల్ని కంగారుపెట్టి వెళ్లిపోయాడు.

అతను మాట్లాడుతున్నంత సేపు కొంచెం బెంగగా విన్న మేము - అతనటు వెళ్లగానే - కాసేపు ఏమీ మాట్లాడకుండా కుర్చీల్లో పక్కపక్కన కూర్చుండిపోయాం.

ఒక రెండు నిముషాల్లో ఒకళ్ల మొహం ఒకళ్ళు చూసుకుని తెగ నవ్వుకున్నాము - పొద్దున్నించీ నాన్న హాస్పిటల్ వాళ్లతో వేస్తున్న జోకులు తలచుకుని.  ఒక్కోసారి ఏమీ చేయలేనప్పుడు అయినవాళ్లతో కలిసి నచ్చిన మాటలు మాట్లాడుకుని నవ్వుకుంటే మనసులో గుచ్చుతున్న బాధ అంతగా నొప్పనిపించదు మరి.




28 పొద్దున్న పదింటికి అనస్తేషియా ఇస్తామని చెప్పారు. కానీ పన్నెండున్నర  అయింది. 

మొదటి ఆపరేషన్ డాక్టర్ గోపీచందు చేసారు.

29న  కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ PCగుప్తా వచ్చి స్టెంట్స్ వేసారు.

ఆపరేషన్ అయ్యాక తెలివి రావడానికి నాన్నబాగా ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ జనవరి 28 అయితే, ఫిబ్రవరి 2 కి పూర్తిగా తెలివొచ్చింది.

ICU లో వుండే నర్సులు, అక్కడ టెక్నిషియన్స్  - "మీకు తెలివొస్తోంది - కళ్లు  తెరుస్తారు - మీకు అంతా  తెలుస్తోంది" అని హిప్నొటైజ్ చేస్తున్నట్టు అంటూ తట్టి తట్టి లేపారట.

ఒక టెక్నిషియన్ వచ్చి గొంతులోంచి ట్యూబ్ లాగబోతే రాలేదు - నాన్నకి నొప్పి తెలుస్తోంది. కళ్ళెర్ర జేసారట. ఎలాగోలా ట్యూబ్ తీశాడు అతను.



ఈ లోపులో ఏమైందంటే నాన్న బెడ్డు తలకింద స్క్రూ  లూజయి కిందకెళ్ళిపోతోందట.
  ... ... ... ...
.... ... ....

నాన్న మాటల్లో

" అసలు పెయిన్ ఒచ్చేస్తోంది - తట్టుకోలేకపోతున్నాను - సిస్టర్ని పిలిచాను - నేను మాట్లాడుతున్నాను  అనుకుంటున్నాను - మాట బయటికి రావట్లా . నేను తిట్టేస్తున్నానని నాకనిపిస్తోంది - తిట్టేస్తున్నాను కూడా - ఇంతలో ఇంకోసిస్టర్ వచ్చి బెడ్డు రిపేర్ చేసేవాణ్ణి పిలుచుకొచ్చింది . వేరే రెండు మూడు దిళ్లు పట్టుకొచ్చి నా తలకింద పెట్టి తన చెయ్యి పెట్టి  నా తల  పైకెత్తిందన్నమాట. ఈలోగా బెడ్డు రిపేర్ అయ్యింది. మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉంచారు అందులో - సాయంత్రం రూంకి షిఫ్ట్ చేశారు".
 ... ... ...
... ... ...


ఆపరేషన్ అయ్యాక నాన్నకి మాట రాలేదు. మాకందరికీ కంగారుగా అనిపించింది.

రెండో రోజు - పక్కనే కొంచెం దూరంలో ఇంకో హాస్పిటల్ బిల్డింగ్ లో వున్న స్పీచ్ థెరపిస్టు దగ్గరికి అంబులెన్సు లో నాన్నని తీసుకెళ్లాను.

స్పీచ్ థెరపిస్ట్ నాన్నని పరీక్ష చేసి "ఈ ఆపరేషన్ కి ఇదొక సైడ్ ఎఫెక్ట్ - వోకల్ కార్డు పారలైజ్ అయింది. కొంచెం ప్రయతంమీద మళ్లీ మాటొస్తుంది - కనీసం ఒక మూడు నెలలు పడుతుంది" అని చెప్పి నాన్నకి స్పీచ్ ఎక్సర్సైజులు చేయమని చెప్పారు.

నాన్న మాటల్లో ఇంకొన్ని కబుర్లు: 

ఆపరేషన్ అయ్యాక - తెలివొచ్చాక డాక్టర్ గోపిచంద్ వచ్చాడు.

వచ్చి "ఎలా వుంది" అన్నాడు.

నేను "పాతిక లక్షలు - బానే అయింది" అన్నాను.

"ఎన్నిసిగరెట్లు తాగుంటారు?"  అన్నాడు

"చిన్నప్పట్నుంచీ కదా - అవీ పాతిక లక్షలయుంటాయి"  అన్నాన్నేను.

"అయితే బాలన్స్ అయిపోయాయిలే" -  అన్నాడు.

అసలాపేరేషనుకి ముందు టెస్టులూ  అవీ చేసే టైములో - నాకు అనూరాధ , చందనారెడ్డి అని పల్మనాలజిస్టులు టెస్టులవీ చేసేవారు.

ఒకరోజు టెస్టుకు సిగరెట్టు తాగేసి వెళ్లాను

డాక్టర్ అనూరాధ "ఏవండీ హాస్పటల్ కి వస్తున్నారు కదా ఇప్పుడైనా సిగరెట్టు మానొచ్చు కదా?!"  అంది

"నేను సిగరెట్టు మానేశాను - పొద్దున్నే కాఫీ ఇచ్చారు - సిగరెట్ తాగాలనిపించింది - ఒకటి కాల్చాను - ఈలోగా మా అమ్మాయి - పదండి - డాక్టర్ దగ్గరికెళదామని మీ దగ్గరికి తీసుకొచ్చింది"  అని చెప్పాను.

అది విని ఆవిడ "మళ్ళీ మీరు నేను ఎందుకు సిగరెట్టు కాల్చానా అని బాధ పడే రోజొస్తుంది" అంది.

అందుకే  ఆపరేషన్ అయాక వెళ్లి అనూరాధకి థాంక్స్ చెప్పి వచ్చాను - నువ్వు చాలా కరెక్టుగా చెప్పావమ్మా అని.

విచిత్రం ఏంటంటే - హాస్పిటల్లో నర్సులు, ఫ్లోర్ లీడర్ యుగంధర్, పరశురామ్ - నాకు ఫ్రెండ్స్ అయిపోయారు.

వచ్చేసేముందు డాక్టర్ గోపీచంద్ "మీకు మందులేమీ అక్కర్లేదు - ప్రతి మూడు నెలలకి ఒకసారి PC గుప్తా రాజమండ్రి వస్తాడు - ఆయన దగ్గర చెకప్ కి వెళ్తే చాలు " అని చెప్పాడు.


PC గుప్తాగారు ఏప్రిల్ లో రాజమండ్రి వచ్చినప్పుడు మొదటి అపాయింట్మెంట్ కి వెళ్ళాను. అప్పటికి మాట కొంచెం బాగానే వచ్చేసింది.

"కామేశ్వరావుగారు ఏంటిసంగతి - ఎలా వున్నారు" అనడిగాడు

"నేను కార్  డ్రైవ్ చెయ్యాలి"  అన్నాను

A. V. సుబ్బారావుగారని డాక్టరే - ఆయన కారుంది అక్కడ - ఆ కారెక్కమని నాకు చెప్పి "పదండి"  అని PC  గుప్తా నాపక్కనే కార్లో కూర్చున్నాడు.

తీసుకెళ్లి చుట్టుపక్కల రోడ్లన్నీ తిప్పుకొచ్చాను.

PC  గుప్తా నా డ్రైవింగ్ చూసి - "సరే డ్రైవ్ చేయండి -ఎక్కువ  దూరం వెళ్లొద్దు" అని చెప్పారు.

ఆ తర్వాత - హైదరాబాదు - గోపీచందు దగ్గరికి వెళ్లి బెల్లం పూతరేకులు, పాలకోవా పట్టుకెళ్ళాను.


గోపీచందు నన్ను చూసి "ఏంటి మీరొచ్చారు?" అనడిగాడు.

"మిమ్మల్ని చూద్దామని వచ్చాను" అని "పాలకోవా, పూతరేకులు మీకోసమే తెచ్చాను" అని అవన్నీ ఇచ్చాను. .

"ఏంటి డాక్టర్ చేతే  షుగర్ తినిపిస్తారా ?" అనడిగాడు

"ఇవి బెల్లం పూతరేకులు - బెల్లం ఐరను - పాలకోవా లో పాలు కాల్షియమ్ - తినొచ్చు" అనగానే నవ్వి తీసుకున్నాడు.


... ... ... ...
... ... ... ...

అలా - బంజారా హిల్సులో (వనచర కొండల్లో) - ఖర్చు విషయంలో చుక్కలు చూపించే సార్ధక-నామధేయ అయిన స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి అప్పుడే రెండేళ్లు - పోయిన గొంతూ వచ్చేసింది - హాయిగా పాడుకుంటున్నారు నాన్న.